Saturday, 18 May 2024

దైవేచ్ఛ - మానవేచ్ఛ

 

దైవేచ్ఛ   – మానవేచ్ఛ

                                   రచన : శ్రీ ప్రశాంత్ శౌరే  పూణే .   
అనువాదం :శ్రీ పి. సుబ్బారారుడు కడప .

దైవేచ్ఛ మానవేచ్ఛ మధ్య విభేదమేర్పడినప్పుడే మానసిక శారీరకవ్యధలేర్పడు చున్నవి----బాబూజీ మహరాజ్.

మానవుడు  తన‍ఇష్టమొచ్చినరీతిలో  ప్రవర్తించుస్వేచ్ఛ భగవంతుడనుగ్రహించినాడు. అయినప్పటికిని జీవితములో మన పూర్వసంస్కారములే మన యిచ్ఛనుపయోగించుటను నిర్ధారించుచున్నవి. దురదృష్టవశాత్తు మానవ జీవితలక్ష్యమును సాధించుదిశగాకాక సహజమార్గప్రార్థనలో తెలిపినట్లు ప్రాపంచిక స్వల్పవాంచ్ఛా పరితృప్తికై మన‍ఇచ్ఛ, కోరికలదాసునిగా మనలను మార్చుచున్నది. మన స్వతంత్రే చ్ఛను మనమెంత తెలివిగా ఉపయోగించినను, ఆశించినఫలితము దక్కనపుడు నిరాశకులోనై  నకారాత్మక ప్రవృత్తిని రేకెత్తించుచున్నది.

ఫలితము, ఆశించినరీతిలో వున్నట్లైన, అత్యుత్సాహపడుదుము. ఆశించినదానికి అనుకూలమైనా ప్రతికూలమైనా, యెట్లైనను, మనస్సుపై వాటిముద్రలు పడితీరును. వాటిని అదేపనిగా మాటిమాటికి తలచుకొనుటవలన, అవి గట్టిపడి (ఘనీభవించి) పోవును. ఈవిధముగా జన్మజన్మలనుండి పేరుకపోయి, సంచితములైవచ్చి తిరిగి మరల మరల పుట్టుచు మరణించుట కాస్పదమైనవి. ఈసంస్కారములలో (ముద్రలలో) కొన్ని పరిపక్వతజెంది, మన అనుభవమునకు (భోగమునకు) వచ్చును. అవి మనమాశించినట్లుండక పోవచ్చును.

మనిషి మామూలుగా స్వార్థజీవి. తనభవిష్యత్తుతానెఱుగడు. తనకు ప్రతికూలముగా, తన‍ఇచ్ఛకు వ్యతిరేకముగా జరిగిన సంఘటనలు, నిజానికవి అతని మేలుకు,క్షేమున కేర్పడినప్పటికి, అవి తన‍ఇచ్ఛకు, భగవదిచ్ఛకు మధ్యగల విభేదముగా తలచును. ప్రస్తుతానికి జరిగినవన్ని మనకు ప్రతికూలములు, అయిష్టములైన వైనను, అవన్ని మనమేలుకే జరిగినవి. మనం బాహ్యదృష్టి కగుపించినవే నిజమనినమ్మే నైజంగలవార మగుటవలన, మన అంతర్వాణి తరచు మనలను తప్పుచేయనివ్వకుండా హెచ్చరిస్తున్నప్పటికిని, మనమాఅంతర్వాణిని ఖాతరు చేయుటలేదు. అందువల్ల మనం క్రబద్ధముగాని మలినమనస్సు నిర్దేశించినట్లు చేస్తూ, దుర్బలులము వశముతప్పిన వారమై పోవుచున్నాము. ఇట్టి అంతర్గతవిభేదస్థితినుండి బయటపడవలెనన్న, మనల్నిమనం ఆమహాప్రభుని (గురువర్యుని) ఇచ్ఛకు సమర్పితులం కావడమే పరిష్కారమార్గము. ఆయన ఈచ్ఛకు సంపూర్ణముగా లోబడి, మనల్నిమనం సమర్పించుకోవడంవల్ల సమస్యలనెదుర్కొనుటకు, పరిష్కరించుకొనుటకు వలయు సహాయము లభించడమేగాకుండా, మన నెరవేరనిఆశలు, కోరికలఫలితముగా గలిగిన వేదనలు నిరాశానిస్పృహల భారము నుండి ఉపశమనము పొందుదుము.       

 ప్రతిది ఆమహాప్రభువు (గురువు) నుండే లభించుచున్నదన్న  సత్యమునంగీకరించినప్పుడు మాత్రమే, మనమాయన వైపునకు మొగ్గుచూపి, ఆయన ఇచ్ఛకు మనల్నిమనం సమర్పించుకొనుటకు సమ్మతించి కడకు శరణాగతి పొందుదుము. తత్ఫలితముగా  సహజమార్గ దశాదేశములలో మనకివ్వబడిన ఐదవ‍ఆదేశము ప్రకారము మనమేలుకై భగవద్‍వరముగా యివ్వబడిన వ్యధలు బాధాలనుండి మనము విడుదల పొందగోరము. శరణాగతిలో, వ్యక్తిత్వము అణగారి, ద్యైతభావముపోయి, ఆమహాప్రభువు (గురువు) ఒక్కడే నిలచియుండును. ఆయనున్నాడు అంటే అక్కడ మనంలేము. మరోవిధంగా చెప్పాలంటే, ప్రభువుయిచ్ఛ , మనయిచ్ఛమధ్య సామరస్యముంటే, ఆయన సర్వకాల సర్వావస్థలలో యెప్పుడూ వున్నాడు. విభేదమున కాస్కారమే వుండదు. "బాధలు వ్యధలు వేదనలు మానవులకే  కేటాయింపబడినవి" అని బాబూజీమహరాజ్ తన ఒకానొక సందేశములో వెలిబుచ్చిరి. పూజ్యగురువర్యుల రచనలలో, అందునా ముఖ్యంగా ఋతవాణి, దివ్యసందేశములలో తెలిపినట్లు, మానవజాతి, వ్యధలు బాధలనుండి తప్పించుకొనుట జరుగదు. అవి మానసికమైనవి కావచ్చును లేదా శారీరకమైనవికావచ్చును, అవి మన పూర్వచర్యలఫలితముగా పేరుకపోయిన ముద్రలు లేక సంస్కారములు. అవి మనం భోగించుటకై వ్యక్తమైనవి. లేదా  దైవాదేశమున మనము భరించుటకై వచ్చియున్నవి.

 

మనము కష్టాలలో వున్నప్పుడు, నిస్సహాయస్థితిలో వ్యధల నెదుర్కొనలేనప్పుడు, బాధలు మిక్కుటముగా వ్యక్తమౌతాయి. అవి మానవజీవితములో విడదీయలేని భాగములు. వాటినుండి యెవ్వరూ తప్పించుకొనజాలరు. ఎవ్వరూ యేవిధంగానూ మనకు సహాయపడి, కష్టములనుండి గట్టెక్కించలేనప్పుడు, మనం, మన ప్రభువును (గురువును) ప్రార్థిస్తాము. సర్వసామాన్యంగా జనులు భగవంతుని సంతోషపెట్టడానికి, ఆయన ప్రసాదించినవి మరలా ఆయనకే సమర్పించి, తమ బాధలు వ్యధలనుండి ఆయన గట్టెక్కించాలంటారు.

ఈవిధమగు సర్వసామాన్యసిద్ధాంతమునకు సహజమార్గ అభ్యాసులుకూడా అతీతులుకారు. పూర్తిగా దిక్కుతోచని నిస్సహాయస్థితిలో మనం పూజ్యగురువర్యులను ప్రార్థించమని సలహానిస్తాము.

బాధలు వ్యధలనుండి విముక్తిపొందుటకు నిస్సహాయులమై, వాటిని గురువర్యుల పవిత్రపాదములకడ నుంచుటే మనకున్న మార్గము. గమ్యమును దృష్టిలో నుంచుకొని, మన మెపుడు, ఆయనను ప్రార్థిస్తామో, అప్పుడాయన చాలావరకు వాటిని అంతఃశుద్ధీకరణ, ధ్యానము మరియు నిరంతరస్మరణ ద్వారా తొలగిస్తారు. మిగిలినవి వాటిని అనుభవించుట (భోగించుట) ద్వారా  నిర్మూలనమగును. మనకున్నది ఒకేఒకజీవితము ( యీజీవితము) మాత్రమే. కనుక తుదిగమ్యము వైపునకుసాగు ప్రయాణమును,  బాధలు, వ్యధలనుండి  తాత్కాలిక ఉపశమనము పొందుటకొఱకు ఆలస్యముచేసుకొనరాదు. మరోవిధంగాచూస్తే, ఎంతయెక్కువగా వాటిని అనుభవిస్తే, అంతత్వతగా సహజమార్గమున మన పురోగతి సాగును. అంతఃశుద్ధీకరణతో సమర్థవంతముగాను వేగముగాను  ప్రయాణముసాగును. మనజీవితలక్ష్యమైన, ఉత్తమోత్తమ వెలుగులలోకము చేరుటకు, సులభముగా జనన మరణచక్రభ్రమణమును దాటుకొందుము. కష్టములనెదుర్కొనునప్పుడు, మనకు వాటిననుభవించి, ముందుకుసాగి బంధనముల నుండి విముక్తిపొందు శక్తిని ప్రసాదించమని  పరమపూజ్య గురుదేవులను ప్రార్థించవలెను. మనం గురుదేవులపై సంపూర్ణముగా ఆధారపడి, ఆయన ఇచ్ఛకు సర్వము సమర్పించి, జీవితములో  లభించినదంతయు ఆయన కృపతో అనుగ్రహించినదేయని, నమ్మికతో అంగీకరించి న

యెడల, కష్టములనెదుర్కొను శక్తి మనకు సమకూరును.

 అనునిత్యము ఆయనతోనే ఐక్యమై యుండునట్లు, మనలనా  మహాప్రభువు (గురుదేవులు) దయతో అనుగ్రహించుగాక.

(ఇది ఆధ్యత్మజ్ఞాన్ - 2019 అక్టోబర్-డిశంబర్ పత్రికలో   ప్రచురించిన ,Worries, sufferings due to ‘conflict’  between  God’s Will and Man’s will  అను వ్యాసమునకు  తెలుగుఅనువాదము)

1 comment:

పూజ్యలాలాజీ మరియు మన ఆధ్యాత్మికప్రగతి

  పూజ్యలాలాజీ మరియు మన ఆధ్యాత్మికప్రగతి సోదరీసోదరులమైన మనమంతా యిక్కడ యీదినం (ఫిబ్రరవరి 14/ బుధవారం 2024) మన ఆదిగురువులైన పూజ్యలాలాజీవారి 1...