Saturday, 18 May 2024

అంతఃశుద్ధీకరణ ప్రాముఖ్యము

 

అంతఃశుద్ధీకరణ ప్రాముఖ్యము

              రచన : శ్రీ ప్రశాంత్ శౌరే  పూణే .                                                         అనువాదం :శ్రీ పి. సుబ్బారారుడు కడప .

అంతఃశుద్ధీకరణ సహజమార్గసాధనావిధానముననున్న నాలుగువిధులలో ఒకటి. అంతర్గత శుద్ధీకరణకీ విధి ఉపయోగపడుచున్నది. ఇందులో అభ్యాసి తన ఇచ్ఛాశక్తి నుపయోగించి తనలోనిచిక్కులు మలినములేగాకుండా తమస్సు కూడా, బహుకాలమునుండి ఆత్మచుట్టూ ముద్రలు లేక సంస్కారములై పొరలుపొరలుగా చుట్టుకొనియున్నవాటినెల్లా తొలగించివేయుటకు, గట్టిసంకల్పము చేయును. ఈ మలినములు, చెడుఆలోచనలతో బంధనముల నేర్పరచి  ప్రాపంచికఆకర్షణలకు లోనగునట్లు చేయుట వలన యేర్పడినవి. ఇవి కేవలం యీజన్మకు సంబంధించినవిమాత్రమే కాదు. మనమెఱుగని గతజన్మలలోనివి కూడా విక్షేపరూపమున వచ్చిచేరినవి.

 సహజమార్గసాధనలో భాగముగా యీఅంతఃశుద్ధీకరణను ప్రతిరోజు, తనపనులను ముగించుకొనిన తర్వాత సాయంత్రం నిర్వహించవలసిన విధి. ఇది సహజమార్గులకే ప్రత్యేకం. ఈవిధి మరెక్కడాలేదు. మతపరమైన ఆచారవ్యవహారములలోగాని, ఇతర ఆధ్యాత్మికపద్ధతులలోగాని యెక్కడా యిటువంటిది మనకగుపించదు. బాహ్యశుభ్రతగా, శరీరమునుగాని, యితర వస్తుసముదాయమునుగాని, శుభ్రపరచుకొను విధానమునకు ముఖ్యముగా ప్రాధాన్యమిచ్చుట, మతాచారములలో కలదు గాని, అంతఃశుద్ధీకరణ విషయమై యేవిధమైన ఆలోచనగాని లేక శ్రద్ధగాని చూపించి యెఱుగరు.

 మనపూజ్యగురువర్యులైన శ్రీరామచంద్రజీ మహరాజ్ (బాబూజీ) యీవిధానమును ప్రవేశపెట్టిరి. యీవిధానములో అభ్యాసి తనలోని మాలిన్యములన్ని, ఆవిరి లేక పొగరూపమున తనవీపునుండి బయటకు వెళ్ళిపోవుచున్నవని సంకల్పముచేయును . మనలోని ఆమలినములే మన ఆధ్యాత్మికప్రగతికి అడ్డంకిగామారి, మన స్వస్థానమునకు  తిరిగివెళ్ళు మార్గమున ప్రతిబంధకములగుచున్నవి. మన స్వస్థానమైన గమ్యమునుచేరి అక్కడ సంపూర్ణముగా ఆమహాప్రభువు (గురువు) తో ఐక్యమైపోదుము. ఆమహాప్రభువైన గురువర్యులు సంపూర్ణముగా అంతిమసత్యముతో లయమైయున్నారు. అభ్యాసి తను వదలుకొననెంచిన వాటిపై ధ్యానము చేయకుండా, వాటిని మామూలుగా   సులభంగాతుడిచివేయవలెను.

 ఒకానొక సందేశములో బాబూజీ, యెందుకీ అంతఃశుద్ధీకరణద్వారా గతాన్నంతా శుద్ధిచేసి తొలగిం చుకోవాలో వివరించారు. "మన పాతముద్రలు మనల్ని వెనక్కులాగుతాయి. మననడవడిని చెడుఆకృతికిమార్చి వాటిని సరిదిద్దుకొనలేని స్థితికి తెస్తాయి. మనపాత దురలవాట్ల సంస్కారములకు బానిసలమై పోదుము. అదే మన బంధానమై పోతుంది”.  ఆయన యింకా చెబుతూ, మనస్సు పూర్వసంస్కారముల ప్రభావములకులోనై వాటిని శుభ్రపరిస్తేనేగాని, అభ్యాసిలో మార్పుతీ సుకరావడానికి, వీలులేకుండాపోతుంది"అన్నారు . అవి (సంస్కారములు)  మనలో ఒకవైఖరిని యేర్పరచి, వాటిని మనం మార్చుకోవడం కష్టతరంచేస్తాయి, శుద్ధిచేయబడినట్లైన, చాలామంది విషయంలో వారి వైఖరినిమార్చి సహజంగా సులభంగా సరిచేయవచ్చును. అప్పుడు ఆలోచనాతీరు, నడవడి సహజంగా సరియైన పద్దతికి మారును.

 ప్రభువు (గురువు) కార్యము

కనుక ప్రతిదినం, సాయంత్రం ఒక‍అరగంట శుద్ధీకరణవిధిని నిర్వహించడం అతిముఖ్యము. లేకపోతే అభ్యాసి పురోగమించినప్పటికి అతని పాతసంస్కారములు వెనక్కులాగుతాయి. ఆద్యాత్మికప్రగతి సక్రమంగా సాగాలంటే మనదేహాంతర శుద్ధీకరణ తప్పనిసరి. ఆధ్యాత్మికప్రగతి నాశించదలిస్తే, అభ్యాసి గురువుగారికి సహకరించితీరాలి. మనం శ్రద్ధగా సాధనలోని, ధ్యానము, శుద్ధీకరణ, ప్రార్థన, నిరంతరస్మరణ పాటిస్తూ గురువుగారికి సహకర్తించాల్సిన  అవసరమున్నది. తద్వారా మనమాయనతో  సంబంధమేర్పరచుకొనుట జరుగును. అప్పుడాయన కృపాధార నిరంతరంగా మనలోనికి ప్రవహించి తిరిగి సంస్కారములేర్పడుటను నిరోధించును.

బాబూజీ వ్రాసినట్లు, అభ్యాసి పూర్వసంస్కారముల  నిర్మూలన, గురువుల కర్తవ్యమే. అయినప్పటికీ  అభ్యాసి తన దురాలోచనలతోను, చెడునడత ద్వారాను తిరిగి జడత్వములోనికి జారిపోకుండా జాగరూకుడైయుండుట అత్యంతావస్యకము. కనుక జాగ్రత్త చాలాముఖ్యము. అంతఃశుద్ధీకరణ ప్రతిదినము చేసుకొనుచుండినచో, యేవిధమైన ముద్రలు పడకుండా, సంస్కారములేర్పడుట జరుగనిస్థితికి అభ్యాసిచేరుకొనును. 

ఆత్మవిశ్వాసంతో, నిశ్చయంతో శుద్ధిప్రక్రియ జరగాలి. శుద్ధిప్రక్రియ పూర్తికాగానే  వ్యక్తి తేలికదనాన్ని అనుభవములో పొందాలి. అనుదినధ్యానం, అంతఃశుద్ధీకరణ వలన మనలోని అస్థిరత, చపలచిత్తాన్ని పోగొట్టుకోగలము. ్రశాంతత  శాంతి మనయందంతటా నెలకొనాలి. మనలోని ముద్రలన్ని కడిగివేయబడగానే హృదయభారం తొలగిపోతుంది. సమర్థవంతమైన శుద్ధీకరణ, రాత్రి నిద్రించుటకుముందు చేయుప్రార్థన వల్ల ఉదయధ్యానం యేవిధమైన ఆలోచనల తీవ్రతలేకుండా సజావుగా సాగును.

ఒకసారి కర్నాటకరాష్ట్రంలోని గుల్బర్గకేంద్ర ప్రశిక్షకసోదరునికి చెబుతూ బాబూజీ శుద్ధీకరణప్రక్రియ జరుగునపుడు మరియు పూర్తవ్వగానే యేమౌతుందో యిలా తెలియజేశారు. "హృదయంలో శూన్యమేర్పడి, ఆశూన్యప్రదేసమంతా భగవత్‍కృపతో నింపబడుతుంది"

 ప్రయోజన ద్వయం  

అంతఃశుద్ధీకరణప్రక్రియలో చేసే సంకల్పం  లేక ప్రయోగించే ఇచ్ఛాశక్తి ధ్యానప్రక్రియలోకూడా అభివృద్దికితోడ్పడి నిరంతరస్మ రణతో శక్తివంతమౌతుంది. ఈరెండు సూత్రములతో  గురువుగారి కృపాప్రవాహం  నిరంతరంగా కొనసాగుతుంది. గురువుగారు చెప్పినట్లు "పాతవాటిని విఛిన్నంచేయడం ఆధ్యాత్మికశాస్త్రంలో ఒక‍అధ్యాయం" అది గురువుగారి బాధ్యత. సత్యతత్త్వమార్గంలో, పూర్వసంస్కారముల  విఛిన్నావసరమున అభ్యాసి సహకారమందించడం అవసరం.

మానవజాతికి బాబూజీ యిచ్చిన మొదటిసందేశంలో యిలా సెలవిచ్చారు. వ్యక్తి తనకుతాను యెలా మేలుచేసుకుంటాడో పరిశీలిద్దాం. ప్రపంచం సూక్ష్మపరమాణువుల కలయికవల్ల యేర్పడింది. అవి (పరమాణువులు) చాలాదట్టంగా మరియు చీకటిగానున్నవి. అయితే వాటిమధ్య మిణుకు మిణుకు మంటున్న కాంతికూడా యున్నది. అది పురుషుడు ప్రకృతి ప్రక్కప్రక్కనే యుండునన్న  సిద్ధాంతమును నిర్ధారించుచున్నది. తెలివి, వివేకముగలవారు దివ్యత్వమువైపునకు మరలి, కాంతిదిశకు దృష్టిసారించి ప్రయోజనము పొందగలిగారు. మిగిలినవారు ప్రాపంచికవస్తు ఆకర్షణకు లోనై చీకటిపరమాణువులతో సంబంధమేర్పరచుకొని దృడమౌతూ ఆత్మచుట్టూ పొరలపైపొరలలను చుట్టుకొనుచూ పోయిరి. వారు మాయప్రభావము స్థిరపడుటకు తగు సారవంతమైన భూమిని కల్పించిరి. అందువల్ల ఆప్రభావము శరీర‍అణువులపైబడి , అది పొరలపై కేంద్రీకృతమై,  అందుండి మెదడుమధ్యభాగమున ప్రతిఫలించినది. ఇదే సంస్కారములేపడుటకు కారణమైనది. ఆసంస్కరములే లోనికిచిచ్చుకొనిపోయి పరిసరములకు, మనస్సు తగులుకొని వ్యక్తిప్రవృత్తులకు ఊతమిచ్చినది. తద్వారా అతడు చెడునుండి మరింతచెడుకు లోనైపోయెను. ఈస్థితిలో గురువర్యుల శక్తిమాత్రమే అతని అంతర్గత తమస్సును  తొలగించి రక్షించ సమర్థము.  

 గురువు లీనమగుట

కేవలమొక కనుచూపుమాత్రమున సాధకునిలో తేలికదనాన్నుత్పన్నంచేయగల అద్భుతశక్తిమంతుడు మాత్రమే  నిజమైనగురువు. తొలుత నేరుగా చీకటివైపునకు సాగు, సాధకుని ఆలోచన, వెలుగును  అంతరంగమున గ్రహించునట్లు జేసి, కాంతివైపునకు ఆమహనీయుడు మరల్చును. తద్వారా అతనిని వెలుగులకుగొంపోవుదారి సుగమమై అతనిలోని అంతర్గతశక్తితో, ఆదారిన ప్రయాణముసాగించుటకు తోడ్పడును.అందువల్ల అతని సమస్య పరిష్కారమై అతనికి వ్యతిరేకముగా పనిచేయు శక్తులనుండి రక్షింపబడి అతనిమేలుకై వున్నవాటిని గ్రహించమొదలిడును. 

 "ఇంకొక విశేష విషయమొకటున్నది. అది గురువు లీనమగువిధమును గ్రహించి తనూ అదేవిధముగా గురువులో లీనమగుటను సాధించినయెడల, యిక అతడధిగమించలేని ఆధ్యాత్మికస్థితియే వుండదు. నేను దీనిననుసరించితిని. అది యిప్పుడు నేనున్న స్థాయికి చేరుటలో సహాయపడినది.భగవంతుడు మీకాశక్తి సామర్థ్యముల ననుగ్రహించుకాక--శ్రీరామచంద్రజీ షాజహాన్‍పూర్. (Messages Eternal)

(ఇది ఆధ్యత్మజ్ఞాన్ 2024 జనవరి మార్చి పత్రికలో   ప్రచురించిన, Importance  of  Cleaning  in Sahaj  Marg  Sadhana అను వ్యాసమునకు  తెలుగుఅనువాదము)

No comments:

Post a Comment

పూజ్యలాలాజీ మరియు మన ఆధ్యాత్మికప్రగతి

  పూజ్యలాలాజీ మరియు మన ఆధ్యాత్మికప్రగతి సోదరీసోదరులమైన మనమంతా యిక్కడ యీదినం (ఫిబ్రరవరి 14/ బుధవారం 2024) మన ఆదిగురువులైన పూజ్యలాలాజీవారి 1...