Showing posts with label SAHAJMARG MESSAGE. Show all posts
Showing posts with label SAHAJMARG MESSAGE. Show all posts

Thursday, 12 November 2020

బాబూజీ మహరాజ్ గారు వ్రాసిన లేఖల ముఖ్యాంశములు (Babuji Letters)

 

శ్రీ రాఘవేంద్రరావు గారికి
శ్రీ బాబూజీ మహరాజ్ గారు
వ్రాసిన లేఖల ముఖ్యాంశములు

  


సంకలనం:

శ్రీ పి. సుబ్బరాయుడు
మరియు
శ్రీ భవనాశి రమేష్ బాబు

 

అనువాదం:

శ్రీ పి. సుబ్బరాయుడు, కడప

  

శ్రీ రాంచంద్రజీ మహరాజ్ సేవా ట్రస్ట్ (రి)

3/1289-1; కో-ఆపరేటివ్ కాలనీ

కడప-516001

***



తొలిపలుకులు

          శ్రీ రాఘవేంద్రరావ్ గారికి గురువర్యులైన శ్రీ రాంచంద్రజీ మహరాజ్ వారు వ్రాసిన ప్రత్యుత్తరములలోని అతి ముఖ్యమైన భాగములను యథాతదముగా యెంపిక చేసుకొని వాటిని తెనుగునకనువదించడమైనది.  శ్రీ పి. సుబ్బరాయుడు మరియు శ్రీ భవనాశి రమేష్ బాబు గార్లు ఎంపిక చేయగా శ్రీ పి.సుబ్బరాయుడు గారు తెనుగున కనువదించిరి.

          తొలుత వీరిద్దరూ చేసిన ప్రయత్నమును ప్రోత్సహిస్తూనే, యింత మాత్రమే చాలదు మరిన్ని ముఖ్య భాగములున్నవి.  చక్కగా చదివి అర్థముచేసికొని వాటిని గూడా చేర్చి పుస్తకమొక నిండురూపము సంతరించుకొనునట్లు చేయుడని శ్రీ టి.వి.శ్రీనివాసరావు, ఛేర్‌మన్ గారు సలహానిచ్చి పుస్తక మీ నిండురూపమునకు వచ్చుటకు కారణమైరి.

          శ్రీ రామచంద్రజీ మహరాజ్ వారు స్వయంగా చెప్పినట్లు వారి వ్రాతలలో వారి హృదయ మావిష్కరింపబడి యున్నది.  ఇది నిజమైన సహజమార్గ సాధకులకు అత్యంత ప్రయోజనకారి, మార్గదర్శని.

          ఇవి కేవలం గురుశిష్యుల మధ్య జరిగిన చర్చలు మాత్రమే కావు. సహజమార్గ ఆధ్యాత్మిక సాధనా విధానము ననుసరించు వారి కెల్లరకు సందేహ నివృత్తి చేయు అంశములిందు యెన్నియో యున్నవి.  అభ్యాసులకు మరిన్ని నూతన విషయములు కూడా తెలియజేయ బడుచున్నవి.

          మరింత వివరమవసరమనుకుంటే సేకరించిన విషయం వెనువెంటనే పుట సంఖ్య చేర్చడం జరిగినది.  ఆ పుట సంఖ్య "శ్రీ రామచంద్రజీ వారి లేఖలు" అను ఆంగ్ల గ్రంథములోనిది.  కనుక అసలు విషయం పరిశీలించడం ద్వారా అభ్యాసులు సంపూర్ణ ప్రయోజనం పొందవచ్చును.

          తెలుగు మాత్రమే తెలిసిన అభ్యాసుల ప్రయోజనార్థం చేసిన ప్రయత్నమిది.  ఏ ఒక అభ్యాసికి దీని మూలంగా మేలు గలిగినా మా ప్రయత్నం సఫలీకృతమైనట్లే.

శుభం భూయాత్!

శ్రీ రాంచంద్రజీ మహరాజ్ సేవాట్రస్ట్
17 ఆగష్టు 2004 
కడప.

        

శ్రీ బాబూజీ మహరాజ్ గారి

ఉత్తరముల ముఖ్యాంశముల యొక్క ప్రయోజనము

           చాలా ఉత్తరప్రత్యుత్తరాలు మన మధ్య జరిగాయి.  వాటి నకళ్ళన్నీ దగ్గరుంచుకోవలసిన అవసరం లేదు, కానీ ఒకటి రెండు వాక్యములలో ముఖ్యమైన విషయములు సూచికలుగా వ్రాసిపెట్టుకుంటే సరిపోతుంది.  దీనివల్ల మన సంస్థశాఖ సక్రమంగా పనిచేస్తున్నదన్న విశ్వాసము జనములోనికి వెళుతుంది.

   ---శ్రీ బాబూజీ మహరాజ్ ఉత్తరములు (ఆంగ్లప్రతి)

       పుట 68 పేరా 4.

          ప్రియ సోదరా! నా వ్రాతలలో నా హృదయం నిక్షిప్తమై యున్నది.  కనుక జనులు వీటివల్ల ప్రభావితులౌతారు.  ఇదంతా భగవంతుని దయ మరియు కృపా విశేషము.

   ---శ్రీ బాబూజీ మహరాజ్ ఉత్తరములు (ఆంగ్లప్రతి)    

       పుట 78 పేరా 2.

  

 భాగము - 1

జనులు నన్ను అంచనావేయు స్థాయికి రాకుండానే అంచనా వేయడం మొదలు పెట్టారు.  అటువంటప్పుడు వారు నన్ను అంచనా వేయడం అసాధ్యం.  పై విషయాన్ని జాగ్రత్తగా గమనించి, నీ హృదయ త్రాసులో నన్ను తూచి గమనించు, నీవు వాస్తవాన్ని గ్రహించగలవని నమ్ముచున్నాను. (పుట 9)

         అది శారీరక చర్యయైనా, మానసిక చర్యయైన, యేదైనా సరే మంచో, చెడ్డో యేదో ఒక ఫలితమిచ్చి తీరుతుంl”.  అది ఒక సూత్రం, తప్పదు.  అంటే చర్య యొక్క ప్రభావం తప్పక పంచేంద్రియాల మీద పడితీరుతుంది.  కనుక మానసికానందం యెంత తేలికగా వుంటే అంత తక్కువుగా దాని ప్రభావముంటుంది. దాని బంధనం కూడా తదనుగుణంగానే వుంటుంది. (దీనిపై అంతగా యోచించ వద్దని నా విన్నపము పుట 23)

         మార్పు లేనట్టి స్థితిని ఉత్పన్నంచేసికొనుటే సాక్షాత్కారము.  సాక్షాత్కారానికిదే నిజమైన నిర్వచనము. (పుట 23)

         ఆతిద్యమిచ్చిన గృహస్తుని సైతం నీవెంటగొంపోయిన అతిధివి నీవు.  నీవు తక్కువ వాడివి కావు.   (పుట 27)

          నీ మిత్రులకు నీవు సజీవ సందేశమైయున్నావు.  భగవంతునకు ధన్యవాదములు. (పుట 29)

          నీవు నిజంగా (ఆధ్యాత్మికతను) వ్యాపింపజేయు వాడవయ్యావు.  స్పర్శద్వారా అంటుకొను వ్యాధివ్యాపకుని వలె ఆధ్యాత్మిక వ్యాపకత్వము నెఱుపుచున్నావు.  నీ ద్వారా ఆధ్యాత్మికత తప్పక వ్యాప్తిచెంద గలదు.  మా గురువర్యులు కూడా తరచుగా "అంటురోగివలె వ్యాపింపజేయువానిగా మారు" అంటుండే వాడు. (పుట 34)

         నీకైనీవు ప్రశిక్షకుని అర్హత సాధించాలని అనుకోవలసిన అవసరం లేదు.  విషయమదే అయితే దాని కొఱకు యెంతో కాలం వేచియుండ నవసరం లేదు.  భగవంతుని కృపతో అది ఒక క్షణంలో జరిగిపోతుంది.  అది అతడు భగవత్‌సేవ చేయడానికి లభించిన ఒక గొప్ప ఆశీర్వాదము.  ఆ విషయము నాకు వదిలి వేయుము.  నీ ప్రేమ నాపై అంత మిక్కుటంగా వుంటే, నేను నిన్ను ఆకర్షించకుండా, (ఆ ఆకర్షణ నిన్ను తాకి నావైపు నిన్ను త్రిప్పకుండా) యెలా ఉండగలను. (పుట 38)

         ఒక కష్టతరమైన పనిని నాకప్పజెప్పమని నన్నడుగుతున్నావు.  కానీ యేమని చెప్పను? కష్టమన్నది లేకపోవడమే నిజానికొక కష్టమైంది.  నేను నిన్ను పరిపూర్ణుని జేయుటకు అతి సహజముగా పురోగమింపజేయ నెంచితిని.  అందులకు భగవంతుడు నాకు సహాయపడును గాక. (పుట 38)

          నా వాస్తవ చిరునామా యెలా తెలుసుకోగల నని నీవడిగితివి.  "నిన్ను నీవు తెలుసుకొన్నప్పుడు" అని సాధారణ జనులు ఆధ్యాత్మిక పరిభాషలో జవాబు చెబుతారు.  కానీ నా జవాబు అదికాదు. "నీవు నేనే అయిపొయినప్పుడని" నేను చెబుతున్నాను.  అప్పుడు నీవు స్పష్టంగా నా చిరునామాను గ్రహిస్తావు. (పుట 34)

          ప్రార్థన, సదాలోచన, ప్రేమతో మాత్రమే నీ మిత్రులను సక్రమ మార్గములోనికి తేగలవు.  భగవదీయ జ్ఞానమార్గమునకు మరలించడము ద్వారా సంస్థకు మంచి సేవ చేయుచున్నావు.  తత్ఫలితముగా భగవంతుడు నీకు తగిన కానుక ప్రసాదించును గాక. (పుట 37)

         నా దృక్పదములో ఆధ్యాత్మికతత్త్వము ఆశ్చర్యముతో మొదలై తీరాలి.  ఇది ప్లాటో మహాశయుని ఆలోచన.  దీనితో నేనేకభవిస్తున్నాను.  మన సంస్థలో సాధనచేయు అభ్యాసిలో యీ ఆశ్చర్యకరమైన స్థితి ఒక దశలో ఉత్పన్నమౌతుంది.  నేనట్టి స్థితిలో సంవత్సరాల తరబడి యుంటిని. (పుట 38)

         నేను నీకు యీ విషయం కుడా వ్రాసియుంటిని.  అదే "నీ హృదయాన్ని వేరొకరికిచ్చేయి" అని.  నీవు పరిశీలించి "ప్రేమ" అంటే యిదీ అని దేనిని నిర్ధారించితివో అది సరిగ్గా సరిపోయింది.  కానీ సత్యతత్త్వాన్ని మాత్రం యిటువంటి సాధారణ పదజాలంతో వ్యక్తపరచడం సాధ్యంకాని పని.  అయితే అదేమిటో మనస్సు మాత్రం గ్రహించగల్గుతుంది.  వాస్తవ విషయమేమంటే మన చింతన ప్రాపంచిక విషయాలతో సతమతమౌతూ వుంది.  అంటే స్వల్పమైన ప్రాపంచిక విషయాల వైపు వాలియున్న హృదయాన్ని పూర్తిగా అవతలి వైపుకు మరల్చి వేయాలి.  ఈ జన్మకు నీవు యిదిమాత్రమే చేయాలి.  హృదయమును మరల్చు పనిని చేయవలసినది నీవు మాత్రమే సుమా! (పుట 39)

         ఏ పరిస్థితులలోనైనా ప్రేమ అదుపుతప్పి భరింపరానిదిగా మారితే, ఒక మారు మనస్సును గురువుగారి వైపు మరలిస్తే చాలు అది అదుపులోనికి వస్తుంది.  ఎప్పుడైనా యేదేని చిక్కు కలిగితే అది మా గురువుగారికి విన్నవించు.  అంటే విషయం గురువర్యుల ముందు ప్రార్థనా రూపంలో నివేదించుకో.  అది వెంటనే నివారింపబడుతుంది.  ఇందులో నీకు యేమైనా కష్టమనిపిస్తే పైవిధంగానే నాకు అక్కడ నుండే తెలియజెయ్యి.  అది నా యెరుకకు వచ్చినా రాకపోయినా మించి పోయిందేమీ లేదు.  గురువర్యుల కృపావిశేషము చేత మేలు మాత్రం సిద్ధించి తీరుతుంది.  (ప్రతి చిన్నచిన్న యిబ్బందుల విషయంలోనూ యిలా చేయమని దీనర్థం కాదు) (పుట 43)

         ఒక మహాత్ముడు నివాసమున్నచోట దూర్తమైన కోరికలుత్పన్నము కావు. (పుట 55)

          బిబిందువుపై ధ్యానం: ఉదయం ఓ ఐదు నిముషములు ఈ బిందువు నుండి జడత్వము మరియు యితరములన్నియు, ముందు వెనకల నుండి బయటికి వెళ్ళుచున్నవని భావించుము.  అణుశక్తి వెలుగు రూపమున యిచ్చట నిక్షిప్తమై యున్నది. (పుట 50)

          బిందువుపై ధ్యానము: రాత్రి వేళలలో ఓ ఐదు నిముషములు విశ్వములోని స్త్రీ, పురుషులందరూ స్వంత సోదరీ, సోదరులుగా భావించి ధ్యానించ వలెను. (పుట51)

         (బిందువుల స్థానములకు సంబంధించిన కొలతలు "రాజయోగ ప్రభావము"న యివ్వబడినవి)

          బిందువుపై ధ్యానము ఐదు నుండి ఏడు నిముషములకు మించి చేయరాదు.  ఎందుకంటే దానిపై కొంత ఒత్తిడి (శ్రమ) కలుగ వచ్చును.  బిందువుపై ధ్యానము చేయ దలచినపుడు ఓ ఐదు నిముషములు చేయుము.  ఎప్పుడైనా మరో రెండు, మూడు నిముషములు ఎక్కువైనా పరవాలేదు.  దాని నంతగా పట్టించు కొనకుము.  నీవు దీనిలో మునిగి పోవలసిన అవసరం లేదు.  దీనివలన లెక్కలేనన్ని ప్రయోజనములు గలవు.  నీవు తల్లుల యెడల, సోదరీమణుల యెడల సక్రమమైన నడవడి గలిగి యుండవలెను.  అందువల్ల విశ్వప్రేమ కూడా క్రమంగా వృద్ధి చెంద నారంభిస్తుంది. (పుట 52, 53)

          ముల్లు యెక్కువ గట్టిగా పెరిగిందంటే దాన్ని కత్తిరించేయాల్సిందే.  ఈ విషయం గుర్తుంచుకో.  స్వార్థం యింతో, అంతో అందరిలోనూ వుంటుంది కానీ అది హద్దు మీరితేనే దోషమౌతుంది.  బాగా గుర్తుంచుకో స్వార్థం కాసింత హద్దు మీరినా ఆధ్యాత్మికమున దోషం జనిస్తుంది. (పుట 54)

          నేను "దశాదేశముల వ్యాఖ్యానమున" వ్రాసినదంతయు బ్రహ్మచర్యమే.  బ్రహ్మచర్యము నకు అర్థము బ్రహ్మము నందు చరించడమే.  ఆ గ్రంథమున గల విషయమంతయు దీనికి సంబంధించినదే.(పుట 57)

          "ఓ రహూగణా! నీవు దానిని తపస్సుచేత సాధించ జాలవు, చదివి తెలుసుకోలేవు, సంసారమును త్యజించిననూ లభించదు, మంత్ర జపము వల్లనూ అందునది కాదు.  సూర్యునకు అర్ఘ్యమిచ్చినను లభ్యము కాదు.  అది మహాత్ముని పాదధూళిలో స్నానమాచరించిననే గానీ లభించదు."  ఇది మహాభాగవతమున జ్అడభరతుడు రహూగణుడను రాజునకు చేసిన బోధ. (పుట 58)

          నీవు పాటిస్తున్న నిరంతరస్మరణ బాగానే వుంది.  కానీ నేను పాటించిన విధానము చాలా మాంధ్యముగ (చురుకుదనము లేనిదిగా) నుండెను.  కానీ నేను దానితోనే అమితానందమును పొందితిని.  అసలు దానివల్లే నే నీనాడు మీ యెదుట ఉండవలసిన రీతిలో నున్నాను.  నా దృక్పదంలో గురువర్యుల సంపూర్ణరూపము నుంచుకొనే వాడిని.  ధ్యాన సమయమున ఆయన రూపమును హృదయమున నిలుపుకొని ధ్యానించే వాడిని.  ఈ ప్రక్రియ పూర్తయిన వెంటనే తదుపరి విధానము దానికై అదే మొదలౌతుంది.  అంటే నేనా విధంగా ఒక కరిగిపోయిన, లయమై పొయిన స్థితిని దాటితిని.

          బంగారముతో తూచదగిన ఒక మంచి మాట నీవు వ్రాసితివి.  "నేను నీ కొఱకే జీవించ దలచుచున్నాను" అన్నదే ఆ మాట.  ప్రియ సోదరా! వాస్తవానికి నేను జీవిస్తున్నది కూడా మీవంటి వారి కొఱకే.  కాకపోతే నా పని పూర్తి చేసుకొని నే నిప్పటికే వెళ్ళిపోయి వుండే వాడిని.  కానీ మీరు సంస్థను వెలిగిస్తూ (ఉద్దరిస్తూ) వున్నంత కాలం నేను వెళ్ళిపోయే యోచనే చేయను.  ప్రియ సోదరా! పరిధులన్నీ పూర్తిగా దాటి యేకత్వ స్థితి ఉనికిలోనికి వస్తే (అది ఒక విధంగా తురీయస్థితి లేక బాకా) అప్పుడు ప్రతి యోచనా నా హృదయం నుండే వెలువడి తదనుగుణంగా జరిగిపోతూ వుంటుంది.  అంటే అప్పుడు మండలం మొత్తం ఒకే ఒక హృదయమై వుంటుంది.  అందుకేనేమో బాబూ ఈశ్వర్‌సహాయ్‌గారు "బాబూజీ కసలు హృదయమంటూ ఉన్నదా?" అని వ్రాశారు.  కానీ నీవు "కృపతో నా హృదయం నీవద్ద వుంచుకో" అని యిప్పుడు వ్రాస్తున్నావు.  నిజానికి నీ హృదయం నా వద్ద లేని పక్షంలో కనీసం నిన్ను నేను జ్ఞాపకముంచుకొని వుండే వాడినే కాదు. (పుట 62 & 63)

          ఈ బాధ శారీరకమైనది కాదు, ప్రియుని యెడబాటు వల్ల కలిగినది.  ప్రియుని చేరుకొనుటకు పడు ఆవేదనాభరితమైన బాధ యిది. (పుట 64)

 ప్రియుణ్ణి చేరాలంటే వ్యక్తి ప్రేమస్వరూపుడై పోవాలి. (పుట 64)

          మర్యాద మరియు ఉత్తమ అభిరుచులను కాపాడుకోవడమే మా పూజ్య గురువర్యుల ప్రకారం ఈ సంస్థ యొక్క ముఖ్య సారాంశము. (పుట 73)

          నే నీమధ్య ఒక ధ్యాన విధానమున సత్సంగమున ప్రవేశపెట్టితిని.  అది శుద్ధీకరణకు మిగుల ఉపయోగకరమైనదని తేలినది.  దీనిని నీవు దయచేసి ప్రయత్నించుము, ఆ తర్వాత అభ్యాసులందరకు తెలియజేయుము.  ఉదయం హృదయంపై ధ్యానం చేయడానికి ముందు ౧౦ నుండి ౧౫ నిముషాలు చేయాలి.  మామూలుగా హృదయంపై ధ్యానం చేయడానికి ముందే యీ ధ్యానప్రక్రియ పూర్తిచేసి మామూలు ధ్యానం కొనసాగించేయవచ్చు.  ఆ ధ్యాన ప్రక్రియ యిలా చేయాలి.  నీవు ఆనంద సాగరంలో మునిగి వున్నట్లు భావించుకో.  ఆ సాగరపుటలలు  నీ ముందువైపు నుండి ప్రవేశించి వెనుక వైపునుండి వెళుతున్నట్లు భావించుకో.  ఆ వెళ్ళే అలలు తమతోపాటుగా శరీరంలోని చీకటిని, జ్అడత్వమును, భారమును మొదలైన వాటినన్నిటినీ తీసుకొని వెనుక నుండి వెళ్ళిపోతున్నట్లు తలంచుము.  ఆ సమయంలో నీ శరీరము పారదర్శకమై (పదార్థరహితమై) యున్నట్లూ,  అలలు యీవైపు నుండి ఆ వైపుకు యేమాత్రం అడ్డులేకుండా వెళుతున్నట్లూహింపుము. (యీ విధానము ద్వారా శారీరక వ్యాధి మాలిన్యములు సైతం నెట్టి వేయవచ్చును) (పుట 81 & 82)

         వాంఛ అనగా, అది తీరినపుడు హృదయానందము, తీరనపుడు దుఃఖము, వ్యధ, బాధ కలిగించునదే.  యీ విషయములో అనుభవించు వాడవూ (కర్మవూ) నీవే, కర్తవూ నీవే.  కానీ కర్తవ్యమనగా యే విధమైన బంధనమునకూ లోనుగాకుండా, యే ఆశయసాధనకు కట్టుబడకుండా కేవలం ఆజ్ఞాపాలనమే ....... కనుక కర్తవ్యమెప్పుడూ వాంఛ కానేరదు. (పుట 83)

          వ్యక్తిగత మానసము నుండి వ్యక్తిగతం నిర్మూలింపబడితే, యిక మిగిలేది మనస్సే.  అది ఒక్కటి మాత్రమే అయివుంటుంది.  దాన్నే దైవమానస మంటున్నాము.  అదే, అది మాత్రమే ఆత్మ నిజస్వరూపాన్ని దృష్టిపథంలోనికి తేగలుగుతుంది.  హేతువాదము నీ అవగాహన మేరకు నీవు చూడగల్గిన దానినే చూపగల్గును. (పుట 84)

         ఒక గీతమున్నది.  దాని ప్రకారం చూస్తే, ప్రేమ మొదట ప్రియుని హృదయమందే ఉత్పన్నమౌతుంది.  దీపము దానికై అదే ముందు వెలుగుతుంది.  అందులో దుమికి శలభం ఆత్మాహుతి చేసుకొంటుంది. (పుట 88)

 
తే||    ప్రియుని హృదయాన తొలుత నెగయును ప్రేమ
       ప్రకృతి సిద్ధముగన్‌జ్యోతి ప్రజ్వరిల్ల
       శలభమాజ్వాల గనుగొని వలచి వచ్చి
       అగ్నిలోబడి తనకు దా నాహుతియగు.

         సోదరా! నీ దుఃఖమునకు, రోదనమునకు యేమని సమాధానమిత్తును.  నీవు నాకు వ్రాయక మునుపే యెప్పుడో కబీరు మహాశయుడు సమాధాన మిచ్చియే యున్నాడు, గమనింపుము.

 "హసీ ఖేల్ నహీ పాయియా జిన్ పాయాతీ రోయా

హసీ ఖేల్ మే పియూ మిలే తొ కౌన్ పుహారీ హోయ్"

          ఆయనను పొందడమంటే నవ్వులాట నుకున్నావా? పొందిన ప్రతి వాడు రోదించియే యున్నాడు.  ప్రియుడు అంత సులువుగా లభించే పక్షంలో యింత ప్రయాసకోర్చి ఎవరారాధిస్తారు?”

          నిరీక్షణ ఒక విధమైన తీవ్ర స్మరణ.  అది ఆధ్యాత్మికమున బహు ప్రయోజనకారి. (పుట 90)

          నే నేదైనా ఒక మంచి విషయం చెబితే, వ్రాసుకొనే వారు కూడా సహృదయంతో (మంచిగా) వుండాలి.  నేను వ్రాయడంలో అసహాయుడను.  ఎందుకంటే నా హృదయం, నా వేళ్ళ వరకు రావడం లేదు.  ఇది నా బలహీనత. (పుట 90)

         సోదరా! నన్ను విస్మరించే యత్నం చేయకు.  ఎందుకో తెలుసా, నిన్ను నీవు మరచి పోవడానికి పనికి వచ్చే సాధనం నేనే సుమా! అన్ని విధాల యీ పని (నిన్ను నీవు మరచిపోయే పని) సంపూర్ణమైతే అప్పుడు నన్ను మరచిపోయే సాధనం నీవౌతావు. (పుట 92)

         సృష్టి కాలమునకు ముందున్న అసలు స్థితే వేదము. (పుట 94)

          మధించు కార్యము యొక్క ఫలితమే అణువు యొక్క ఆవిర్భావము.  మరో మాటలో చెప్పాలంటే ఈ మధనం యొక్క ఫలితమేదై యున్నదో దానితో అణువు అనుసంధించబడి యున్నది. (పుట 94)

         ఎవరు యెప్పుడు ప్రయోగం చేసినా ఒకే ఫలితానిచ్చే దానినే నేను శాస్త్రమంటాను.(పుట 98)

          ఆత్మ పరిశీలన మనునది మానవ సహజ లక్షణమని నేను లోతుగా పరిశీలనము చేసి గ్రహించితిని.  దీన్ని మనం సంపూర్ణంగా అవగాహన చేసుకొన్నట్లయితే మనలో నిక్షిప్తమై యున్న సత్యతత్త్వమునకు మన సహజగుణము మరియు యోచనా అనుసంధానమగును. (పుట 95)

          తాను ప్రేమించి యిష్టపడుతున్న వారి విషయంలో వారి ప్రేమను పరీక్షించ వచ్చును.  అవును, యితరులకు తెలిసినంతగా సున్నకు అర్థం నాకు తెలియక పోవచ్చును.  ఎందుకంటే సున్నస్థితిని సున్నాయే తెలిసికోలేదు.  అలాగే శవాన్ని గురించి చనిపోయిన వానికి తెలియదు.  ఒక రకంగా చెప్పాలంటే దాన్ని మన యొక్క స్థితి అనవచ్చును.  ఆ స్థితిలో యింద్రియ వాంఛలన్నీ విడిచిపోయి మనం జీవించియున్న శవమైపోతాము.  మరో విధంగా చూస్తే అలా మనం సత్యతత్త్వంలో లీనమైపోతే మనకు విచక్షణాజ్ఞానం కూడా వుండదు.  వాస్తవానికి, అనుకరణకు కూడా తేడా మనకు తెలియదు. (పుట 101 & 102)

          హేతువాదదృక్పథము, మనస్సులోనిభావన రెండూ యెప్పుడేక మౌతాయి?  అని నన్నొక చిక్కు ప్రశ్న నడిగితివి.  దీనికి సంక్షిప్త సమాధానం, లైలా, మజ్నూ లిద్దరూ కలిసి ఒక చోటుండటమే.  వాటి కలయిక మనో ఆత్మలు లేక మనస్సు బుద్ధి కలయికగా భావించ వచ్చును.  రెండూ కలిసి వుండటం అత్యంతావశ్యకం.  ఒకటి చూపేదైతే రెండవది వివరించేది.  ఏదీ వదలి వెళ్ళదు కాని వాటి సద్వినియోగం మొదలు కావాలి.  నీ నిరంతరస్మరణ హేతువాద సంబంధిత తెలివి తేటలు కాదు.  అది హృదయమునకు సంబంధించిన విషయము.  నిరంతరస్మరణ చేయవలసిన పని, అంతేగాని అనుభవమునకు వచ్చు అంశము కాదు. (పుట 109)

          నీవు విశ్వాస మెలా పెంపొందించు కోవాలి? అని అడిగావు.  ఒక బోధకుని యందు నమ్మకముంచి, అతని వల్ల కొంత మేలు పొందినట్లు గమనించి నట్లయిన అది నిజమైన అన్వేషకుని హృదయమున విశ్వాసము పెంపొందించ మొదలిడును.  ప్రియ సోదరా! నీవు నీ హృదయమున సజీవ విశ్వాసము సదా కలిగి యుండవలెనని ఆకాంక్షిస్తున్నావు.  అందులకు నీకు నేను హామీ యిస్తున్నాను.  ఇందు యేవిధమైన లోటు కలిగించు చెడు దృష్టి నీపై బడకుండు గాక!.  ఆధ్యాత్మికమైన ఒకానొక స్థితి నీకు తప్పక ప్రాప్తిస్తుంది.  దాని నుండి వేరగుటన్నది యెన్నడూ కలుగదు.  అట్టి స్థితిని కూడా భగవంతుడు నీ కనుగ్రహించు గాక! (పుట109)

          అన్నింటికిని కర్త భగవంతుడే.  మనిషి భగవంతుని చేతి పనిముట్టు మాత్రమే. (పుట 113)

          కబీరు మహాశయుడిలా వ్రాశారు

"జబ్ హమ్ థే గురూ నహీ, జబ్ గురూహై తబ్ హమ్ నహీ,

ప్రేమ్ గలీ అతి సంకరీ, ఉస్మే దోన సమాయె"

 

నేనెప్పుడున్నానో గురు వప్పుడు లేడు.  గురువెప్పుడున్నాడో అప్పుడు నేను లేను.  ప్రేమ మార్గము చాలా యిరుకైనది, అందులో ఒకేసారి యిద్దరు యిమడ లేరు. (పుట 117)

          అంతరంగమున నీవు దినదినానికి తేలికౌతూ వెళుతున్నట్లు భావిస్తున్నాను.  ఇటువంటివి నీ దినసరి జీవితాన్ని ప్రభావితం చేయకపోతే ఆధ్యాత్మికతకు ప్రమాదమేర్పడుతుంది.  ఇందు కొఱకు తగినంత శ్రమ, సహనము, భక్తి అత్యావశ్యకములు.  వీటికి హద్దులంటూ యేమీలేవు.  తుదకు యెవని సమాధి గుంతను వాడే త్రవ్వుకుంటాడో అతడే కడకు మహాత్ముడుగా గుర్తింప బడతాడు. (పుట 118 & 119)

          ఇప్పుడు నీవు "సంపూర్ణ అజ్ఞానము" అను పదంపై ఆలోచింపుము.  ఈ పదము కబీరు మహాశయుని ప్రకారము "అవును" "కాదు" అన్న పదములకు మధ్య నున్నది.  ఇక నేను నిజమైన ఆనంద మను విషయమునకొత్తును.  ఎక్కడ ఆనందమే లేదో అదే నిజమైన ఆనందము. (పుట 133)

          బిందువు పై రాత్రి పూట బిబిందువుపై మామూలుగా ఉదయం ధ్యానానికి ముందు ఓ ఐదు నిముషములు అభ్యాసీ సోదరీ సోదరులు ధ్యానము చేయుట మంచిది. (దీన్ని గురించి ముందు పుటలలో వివరించడం జరిగినది) (పుట 149)

          ఒక ఆధ్యాత్మిక వేత్త అతని యోచనా లక్షణమునకు తగినట్లు వాతావరణము నేర్పరచును.  మనమంతా  మానవ మాత్రులము.  కనుక మానవ మనో వాంఛిత పరిధిలోనే మన విధాన ముండవలెను.  అదే మన కర్తవ్యము కూడా.  ఎగసి పడేట్లు చేయబడిన కెరటాన్ని శాంతింప జేయలేము.  దాన్ని మనం ఎగయనీయాలి.  ఏదైనా సేవాభావంగా తలచి చేయకుంటే ప్రతీదీ ప్రచారమే అయితీరుతుంది.  పూర్తిగా ప్రచార దృక్పదంతో పని చేయడం నాకు యిష్టముండదు.  కనుక ఆ మలుపును గమనించండి.  మనమదే అనుసరిస్తున్నాం. (పుట 155)

          సర్నాడ్‌జీ ఉత్తరం వ్రాస్తూ తనలోని కోపం గురించి నాకు ఫిర్యాదు చేసినారు.  దానికి పరిష్కారము, కన్నీరు ఉబికివచ్చేట్లు యేడ్చి దాని నివారణకు భగవంతుని ప్రార్థించడమే. (పుట 156)

          ప్రియసోదరా! సత్పదార్థాన్ని అర్థం చేసుకోలేకపోతున్నానని నిజమే వ్రాశావు.  ఒక చెక్కెర బొమ్మకు ప్రాణంపోస్తే, అది దాని నిజతత్త్వాన్ని అర్థం చేసుకోలేదు.  దీనర్థమేమంటే పదార్థంలో నిరంతరంగా జీవించడం ద్వారా మన నిజ పదార్థం (సత్యతత్త్వం) కోల్పోయాము.  ఇదే ఉన్న ఆటంకమంతా.  భక్తునికి తెలియకుండా ప్రకృతి దేనిని రహస్యంగా వుంచనెంచదు.  ఎందుకంటే రహస్యమంటేనే చిక్కు ముడి.  ఎక్కడ చిక్కున్నా అది మాయయేగాని వేరొకటి కాదు. (పుట 162)

          భౌతిక పదార్థంపై అదుపు సాధించాలంటే ఆధ్యాత్మికత (ఎఱుక) పై అదుపు ఉండటం అవసరం.  దీన్ని గమనించవచ్చు.  మనందరం కూడా చేస్తున్నదీ అదే.  ఆధ్యాత్మికతపై అదుపు సాధించు పద్ధతులు నీ కిప్పటికే తెలుసు.  అందుకోసం సాధన, సత్సంగాలు యెంతో అవసరం.  అయినప్పటికీ ఆధ్యాత్మికతపై అదుపు సాధించటం కోసం నేనొక విషయం చెబుతాను: నీవు ఆధ్యాత్మికతకు కారణభూతమైన దానిలోనికి (ఎఱుకలోనికి) ప్రవేశించ వలసి వుంది.  అదెలా సాధ్యం? అది మన అదుపులోనికెలా వస్తుంది? ఎప్పుడు మనం దాని అదుపులోనికి వెళతామో అప్పుడది మన అధీనంలోని కొస్తుంది.  అందులోని స్వచ్ఛత, తాజాతనంతో మనం ప్రభావితమై పోవునట్లు మనమిప్పుడు దాని వైపునకు మరలాలి.  అప్పుడు మన చుట్టూగల వాతావరణం మార్పు జెందడం మొదలై స్వచ్ఛమైన ప్రాకృతిక స్థితి ఉత్పన్నమౌతుంది.  మరియు నీ వనుకొన్నదంతా జరిగి పోవడం మొదలౌతుంది. (పుట 164 &165)

          మెదడు అన్నిటిని ఆలోచిస్తూ వుంది గదా? మరి మన మెందుకు హృదయంపై ధ్యానం చేయాలి? అని ప్రశ్నించినపుడు, నీ వెఱిగిన దురద ఉదాహరణ నిచ్చి అడిగినతనిని సమాధాన పరచితిని (దురదకు సంకేతం మెదడు నుండి గదా వస్తుంది, మరి చర్మం రుద్దుకొనడం లేదా మనం.  ఇదీ అలాగే నన్నది సమాధానం) కానీ అసలు సమాధాన మేమంటే మనస్సు యొక్క కార్యరంగము హృదయము.  శరీరము, మెదడుకు సంబంధించిన బిందువులన్నీ హృదయము లోనే మొత్తం నిక్షిప్తమై ఉన్నాయి.  హృదయంపై ధ్యానం వలన అన్ని బిందువులు మొత్తంగా శుద్ధీకరింపబడే సౌలభ్యమున్నది. (పుట 164)

         నీ సంస్కారాలు నశించి పోతున్నాయని అంటున్నావు.  నిజానికి అది వాటి అంతం కాదు. "బ్రతికుండగనే మరణ క్రీడను ప్రదర్శించడము" అన్న స్థితిని నేను మా గురువు గారికి వ్రాసికొని యుంటిని.  అట్టి స్థితికిది మొదలు.  నేను వ్రాసిన దానికి మా గురువు గారు బదులిస్తూ "యీ స్థితి అనంతరం బానిసత్వం నుండి విముక్తి ప్రారంభమౌతుంది" అన్నారు.  ఈ స్థితి మరింత వృద్ధి యౌతుంది.  సంస్కారముల పైపొర విడదీయబడి దాని మూలంతో అనుబంధం తెగిపోతుంది.  లోలోపల సంస్కారాలు ఉండనే వుంటాయి.  కాని వాటి తీవ్రత చాలా వరకు తగ్గింపబడి వుంటుంది.  కనుకనే నేనిదంతా చెప్పవలసి వచ్చింది.  నీవు భావించిందేమిటో కూడా నీకు వివరించితిని.  భగవదనుగ్రహం వలన క్రమంగా వాటినన్నిటిని కూడా నేను తొలగించి వేస్తాను.  నీ ప్రేమానురాగమే వాటిని దగ్ధమొనరించేస్తుంది కూడా. (పుట 187)

          మనల్ని మనమే జాగ్రత్తగా చూచుకొంటూ (గురువు అవసరం లేదన్నట్లు) వుండగా, గురువు కృప యీ వైపునకు మరలనే మరలదు.  అంటే మనవైపు ప్రసరించదు. "వారి జాగ్రత్తలో వారున్నారులే" అని ఆయననుకుంటారు. (పుట 191)

          విద్యావేత్తలను అందరూ శ్లాఘిస్తారు, నేనూ అదే చేస్తుంటాను.  బలహీనులను భగవంతుడు కూడా ఆదుకొనలేడని యెక్కడో నేను తమాషాగా వ్రాసియుంటిని.  అసలు బలహీనుడంటే యెవరో కాదు, ఆత్మస్థైర్యం లేనివాడే సుమా! ఇప్పుడొక మాట చెబుతాను విను.  భగవంతుడు బుద్ధిహీనులకు స్వర్గం కేటాయిస్తాడు.  పాపులకు నరకం కేటాయిస్తాడు.  యేమీ తెలియని అజ్ఞాని స్వర్గమే పోతాడు.  బాగా చదువుకున్న నేర్పరి "షద్ధాద్" అనే స్వకల్పిత స్వర్గం వెళతాడు.  అమాయకుడు మాత్రం బ్రహ్మలోకం వెళతాడు.  నేను భావించిన ఈ పద్ధతి సరిగ్గానే ఉందనుకుంటాను. (పుట 207, 208)

          అభ్యాసి, లోపలి జడత్వాన్ని, చీకటిని సాయంత్రం శుద్ధీకరణ సమయంలో యెక్కువ యిచ్ఛాబలం ప్రయోగించి శరీరం వెనుకభాగం నుండి త్రోసివేయరాదు.  అందువల్ల వారు పూర్తి ప్రయోజనాన్ని పొందలేరు ....... శుద్ధీకరణ తర్వాత వారినుండి చెడుపదార్థం బయటికి వెళ్ళిపోయిందన్న ఆత్మవిశ్వాసంతో వారుండాలి. (పుట 220)

          వర్ణరహితం, గంధరహితం, రుచిరహితం కావడంలోనే నిజమైన ఆధ్యాత్మికత యున్నది.  ఎందుకంటే భగవంతున కివేవీ లేవు.  మన సంస్థలో అభ్యాసీని సత్యతత్త్వము వైపునకు గొంపోవు ప్రయత్నము జరుగుతున్నది.  ఇంకా రంగు ఉన్నది అంటే స్వచ్ఛత అసలు లేదనే దానర్థము.  స్వచ్ఛతయే గమ్యమైతే అతడు తప్పక వర్ణరహితత్వం వైపుకు వెళ్ళవలసిందే. (పుట 221)

          చిక్కు ప్రశ్నల సమాధానాలు వ్రాయలనుకున్నాను.  అందులో ఓ ప్రశ్న, యెవరిని భగవంతుడు ఎక్కువగా ప్రేమిస్తాడు? దానికి జవాబు, తన్నొక సారి చూచినప్పటికీ తనకు దూరంగా వుండేవాడినే భగవంతుడు ఎక్కువగా ప్రేమిస్తాడు.  దీనిపై నేను ఒకటి, రెండు పంక్తులు వ్రాయాలను కుంటున్నాను.  ఎప్పుడు మనం భగవంతుని నుండి వేరు పడ్డాము?  మూలాన్ని విడిచి యిప్పటి యీ మానవశరీరం దాల్చినప్పటి నుండి.  మనం అంత పెద్ద మూలాన్ని వదిలి సుదూరంలో నున్న ఆకాశస్థలానికి దిగివచ్చి ఒక చతుర్భూత (గాలి, నీరు, అగ్ని, భూమి) నిర్మిత గూటిని ఆశ్రయించితిమి.  ఐనా భక్తికి సంబంధించిన పరిధిలో ఉండాలంటే మూలాన్ని మరచి పోకుండా జ్ఞప్తిలోనే వుంచుకోవాలి.   అదే సమయంలో మన భౌతిక స్థాయిని కూడా అర్థం చేసుకోవాలి.  దైవీయ గుణాల దృష్ట్యా మనం దైవమునకు అనేక మైళ్ళ దూరంలో వున్నాం.  అంటే భగవత్‌సాక్షాత్కారమైన తర్వాత గూడా భగవంతుని గూర్చిన, మనిషికి సంబంధించిన భావనలను సంరక్షించు కుంటూనే వుండాలి.  సంక్షిప్తంగా చెప్పాలంటే సాక్షాత్కారానంతరం కూడా మానవ మర్యాదను త్రోసిపుచ్చ రాదు. (పుట 221 & 222)

          మే ౨న నీకు చేరిన నా ఉత్తరం చూచిన తక్షణమే నీలో యెక్కువైయున్న ఉష్ణము చల్లబడినట్లు వ్రాశావు.  దీన్ని బట్టి చూస్తే నాఉత్తరాలు భూమధ్య రేఖపైనున్న ప్రదేశాలకు యిప్పుడు పంపడం మంచిదేమో ననిపిస్తున్నది.  నీకు అసలు విషయం చెబుతాను.  నా ఉత్తరం చూస్తూనే నీకు సంతోషమై ఆ సంతోష ప్రవాహంతో నీలో సమత్వం ఉత్పన్నమైంది.  ఇందులో నీ సామర్థ్యమే కనబడుతున్నది.  ఇప్పుడు నేను జరిగినదానికి కారణం వ్రాస్తాను.  నీవు కేంద్ర మండలం ప్రవేశించిన తర్వాత అక్కడి అణువులలో కొద్ది మార్పులు చేసి అవి శక్తిగా మారడం మొదలయ్యేట్లు చేశాను.  ఇదే ఐయిన్‌స్టిన్ సిద్ధాంతము.   ఇతడు శాస్త్రజ్ఞులలో ముఖ్యుడు.  కానీ యిది భారతదేశములో చాలా పురాతన పద్దతి.  మహాభారత యుద్ధంలో కూడా ఈ విధానం ఉపయోగించుకొన్నట్లు తెలుస్తున్నది.  ఆధ్యాత్మిక శిక్షణా విధానంలో యిది బహుపురాతన విద్య.  ప్రియసోదరా! ఇంతకు మించిన యెన్నో గొప్ప విషయాలున్నాయి.  వాటికి సంబంధించిన జాడకూడా శాస్త్రజ్ఞులకు యేమాత్రం తెలియదు.  అదంతా శక్తి కడపటి దశకు (అనంతమునకు) మార్పుచేయు విధానమునకు సంబంధించినది.  భగవంతు డనుగ్రహిస్తే అంతటి వ్యక్తులు జన్మించి నా యీ వినయపూర్వక సేవలు నా జీవిత కాలంలోనే అందించే అవకాశం కలుగవచ్చును.  నీ విషయంలో నేను పని మొదలు పెట్టాను.  అంటే నీలోని అణువులను శక్తిగా మార్చే పని ప్రారంభించాను, కానీ ప్రస్తుతానికి అణువులలోని పదార్త గుణాన్ని యింకా తీసివేయలేక పోయాను.  కనుకనే నీవు వేడి ననుభవిస్తున్నావు.  మిగిలిన పనికి గూడా యిక పూనుకొన బోవుచున్నాను. (పుట 221 & 222)

          నీవు అణువులు శక్తిగా మార్పుచెందడాన్ని పూర్తిగా అర్థము చేసుకున్నావు.  ఆ విషయం నీవు అంగీకరించావు కూడా.  కానీ శక్తి అంతిమ దశకు మారే విధానం నీకింకా అర్థం కాలేదు.  నీవు రాజయోగ ప్రభావంను లోతుగా అధ్యయనం చేస్తే ఈ విషయం అర్థం కావడానికి దోహదపడుతుంది.  శక్తి యొక్క అంతిమ స్థితి అదే అనగా దైవమే.  ఆ స్థితి తన వాస్తవ స్థితికి తీసుక వస్తుంది.  అంటే అది తన వాస్తవస్థితికి చేరినప్పుటి శక్తి, ఆ శక్తి రెండూ ఒకటై పోయినట్లు తెలుస్తుంది.  ఇది మెలకువలో కన్న కల వలె నుండును.  చేయునదేమున్నది?  ఈ స్థితి వరకు గొనివచ్చి సంసిద్ధుని చేయుటకు నాకు మనిషి దొరకలేదు.  లేకున్న మా గురువర్యుల దయచేత అతడికి ప్రతి అణువు యొక్క కేంద్రపు రుచిని చూపించి యుందును.  నేను జీవన్‌మృతుడనై యున్నాను.  అందుచేత నన్ను నేను ఉదాహరణగా చూపకున్నాను.  అయినా అలా చూపినా శ్లాఘించ వలసింది మా గురుమహరాజ్‌ను మాత్రమే.  ఒకటి రెండు సార్లు ఒక అణువు యొక్క శక్తిని ఒక ప్రత్యేకమైన చోట కేంద్రీకరించాలని ఆలోచించాను.  కానీ యీ ప్రయోగం చేయడానికి భయపడ్డాను.  అణువుకు వినాశకర శక్తేగాదు, జనుల ఆరోగ్యం మెఱుగు పరచడానికి దీని శక్తిని ఉపయోగ పెట్టుకొన వచ్చును కూడా.  ఒక బీడు భూమిని సారవంతం చేయవచ్చును.  పంటలు సమృద్ధిగా పండించ వచ్చును.  ఈ శక్తితో యే విధమైన విస్ఫోటనం లేకుండానే  జీవరాసుల నన్నిటిని నాశనం చేయవచ్చును.  ఇదే శక్తి దేహంలో విపరీతమైన శక్తిని పుట్టించి మహా బలవంతుడిని చేసి యిచ్ఛవచ్చిన కార్యము నెరవేర్చగల శక్తిమంతునిగా మార్చగలదు.  యిప్పటి వరకు శాస్త్రజ్ఞులు కనుగొన్నది బహుస్వల్పము.  ఇప్పటికీ సూర్యరశ్మి యొక్క శక్తినే సరిగా ఉపయోగించుకొని లాభపడలేక పోతున్నారు.  దాని ఆకర్షక శక్తి యొక్క ప్రయోజనాన్నే యింకా అర్థం చేసుకోలేదు. (పుట 224 & 225)

          తిరిగి ఆరోగ్యం పుంజుకోవడానికి నేను చేసినట్లే చేసి అతన్ని (మహాదేవ్‌రావును) రక్షింప బూనుకొనుము.  అభ్యాసులను శుద్ధిచేసేటప్పుడు చేసినట్లే అతని వెనుక నుండి చీకటి, పొగ రూపంలో వెళ్ళిపోతున్నట్లు భావింపుము.  నేను యింతకు మునుపే అభ్యాసులకు తెలిపిన విధంగా నీవు యిచ్ఛాశక్తి నుపయోగించి అతని వెనుక భాగం నుండి పొగరూపంలో వ్యాధిని లాగివేయుము.  సాధారణంగా నిద్రపట్టక మెదడులో తడిలేని స్థితితో బాధపడుతూ వుంటే యిదో, యీవిధమైన ప్రక్రియ చేపట్టుము.  చల్లటి బిందువులు పైనుండి వర్షిస్తూ చల్లబరుస్తున్నట్లు భావన చేయుము.  దీనితోపాటే సున్నితమైన యోచనతో అతని జబ్బు నయమగుచున్నట్లను కొనుము. (పుట 230)

            ముందుకు పురోగమించాలని అనుకుంటావు, కానీ నావల్ల కాదేమోననే భయం, అసహనం నీలో వున్నాయి.  బోధకునిలో యిది వుండాల్సిందే, అందుకే అవసరమయ్యే అది వున్నది.  పైస్థితులలో ఈ లక్షణం అనగా భయము, ఆతురత మరీ మిక్కుటంగా వుండి పైకెదిగి పోలేక పోతున్నాయేమో అని అనిపిస్తుంది.  పైకెగబ్రాకడానికి యెంతగానో శ్రమించినా, తనకంటే శక్తిమంతుడై ఆ పైస్థితులపై అధికారము గల వారు లభించి సాయపడే వరకు సాధ్యపడదు.  శిష్యుడు పూర్తిగా గురువులో లీనమైపోతే యిక గురువు విశ్రాంతి రహితుడై శిష్యుని ముందుకు తీసుకుపోయే పనిలో వ్యగ్రుడై ఉంటాడు.  ముఖ్యంగా శిష్యుడు తనకైతాను ముందుకెళ్ళలేని పరిస్థితులలో యీప్రక్రియ జరుగుతూ వుంటుంది.  ప్రతి ఒక్కరి మనస్సులోను సాధారణంగా ఉత్పన్నమయ్యే ఒకప్రశ్నకు జవాబు చెబుతాను.  గురువు అమరలోక ప్రయాణికుడైనపుడు, శిష్యుడు అవసరానికి తగినట్లు యెలా ముందుకు పురోగమిస్తాడు?

          గురువు విముక్తుడై వుండి, శిష్యుడు తగిన ఆధ్యాత్మికస్థితిని బొంది తన స్వరం గురువుకు వినిపించగల సమర్థుడైతే, గురువునుండి సహాయం తప్పక పొందగలడు.  ఆయనచే దీక్షగైకొన్న వారి స్వరం ఆయనను త్వరగా చేరగలదు.  అంతేగాక ఆయన అనునాయులు, బోధకులు, శిక్షకులు కూడా అవసరానికి తగిన రీతిన అభ్యాసులకు సహాయపడు చుందురు.

          శ్రీ వాల్వేకర్‌గారు మరి యింకొందరు నీతోపాటు వస్తే సంతోషమే.  నీవు యిక్కడ ఉండగల్గినంత కాలం హాయిగా వుండవచ్చును.  యిక ప్రయోజన మంటావా? అది నీవు నీవెంట తెచ్చుకోవచ్చు.

          తాను పూర్వమొనర్చిన తప్పిదములకు పశ్చాత్తాపము చెంది ఆధ్యాత్మికత వైపు మొగ్గుజూపిస్తూ వుంటే అట్టి వ్యక్తిని మనం చేర్చుకోవచ్చు.  కానీ అతడు పూర్వపు తప్పిదాలను తిరిగి చేయకూడదు.  తన తప్పిదములకు పశ్చాతాపపడి ధ్యాస భగవంతునిపై మరలిస్తే అతడు సత్వరమే పరిశుద్ధుడౌతాడు.  క్షమార్హత పొంది పాపవిముక్తుడగుటకు ప్రార్థన, పరితాపము మొదలైనవి ఉండనేవున్నవి.  ఒక భక్తుడు (బందా) దీనత్వముతో క్షమింపమని వేడుకొని దుఃఖితుడైన యెడల నేను సిగ్గుపడి వానిని నావానినిగా అంగీకరింతునని పవిత్ర ఖొరాన్ (హదీస్) లో వ్రాయబడి యున్నది. (పుట 258 & 259)

          మనకు భగవంతుని యేకత్వం మీద నమ్మకం లేదు.  వాతావరణ దోషంవల్ల కొంత, సహవాస దోషం వల్ల కొంత చెడిపోతిమి.  కొంతవరకు పాశ్చాత్య సంస్కృతి మనపై ప్రభావము చూపినది.  కొంతలో కొంతైనా మనం వీటిని అధిగమించే సమయానికి తప్పుడు ఆధ్యాత్మిక శిక్షణా విధానము మన పతనాన్ని పూర్తి చేసివైచినది.  అంతటితో మనం ఆధ్యాత్మికతకు వేల మైళ్ళు వెనక బడిపోయాము.

          ఒక్క పాపమునకు నాలుగు శిక్షలెందుకని నన్ను నీ వడిగిన ప్రశ్న అలాగే వుండిపోయింది.  తాత్త్విక దృక్పదముతో యీ ప్రశ్నకు జవాబిద్దా మనుకున్నాను.  కాని సమయానికి లేఖకుడు దొరకలేదు.  సరే యిక నేను నేరుగా సులభరీతిలో జవాబిస్తున్నాను.  మానవుడు సంక్లిష్టమైన వాడు.  మంచో, చెడో చేయాలంటే మనస్సు ఆలోచించాలి, హృదయం నిర్ణయించాలి, ఆ తర్వాత ఆయా అవయవములు ఆ పనిని చేయాలి.  ఈ కార్యక్రమములో మనస్సుకు, హృదయము యొక్క సహాయ మందుతున్నది.  కార్య నిర్వహణమున పాలుపంచుకొన్న బాహ్యేంద్రియము సైతము తప్పుచేసితినన్న భావనకు లోనైయున్నది.  ఇది కూడా శరీరాంగమే గనుక దీనికీ బాధ్యతున్నది.  మనం దుష్టమైన ఆలోచనలు చేసినప్పుడల్లా వాతావరణంలో ఆ దుష్టపు ముద్రలను వదలుతున్నాము.  అందులకై ప్రకృతి వేరుగా శిక్షిస్తుంది.  చెడు జీవనమో లేక నరకమో, చేసిన పాపమునకు తగినట్లు పొందక తప్పదు.  వీలైనంత వరకు పాపాన్ని నరకంలో అనుభవించి మిగిలిన దాన్ని అనుభవించడానికి మళ్ళీ యీ లోకంలో జన్మించాలి.  మనస్సు, చెడ్డపని చేసితిని గదా! యని చింతించింది.  అది దానికి పడిన శిక్ష.  దీని పర్యవసానమూ చెడ్డదే, దాన్ని హృదయం తన వంతుగా శిక్షననుభవిస్తుంది.  ఇక సంఘమూ అతన్ని నిందించి అవమానించింది.  అతడు నరకాన్ని పొందాడు, అనగా అతడు ప్రకృతిని చెడగొట్టి, ప్రకృతిచే శిక్షింపబడ్డాడు.  మూడవ శిక్షగా అతని అవయవాలు తత్సంబంధితములు పొందినవి.  ఈ విధంగా అందరూ, అంటే పాపము చేయుటకు సహకరించిన ఇంద్రియములు శిక్షననుభవించినవి.  ఈ ఉత్తరం స్వయంగా వ్రాస్తున్నాను, అందుకే యెక్కువ వివరణలివ్వలేకపోతున్నాను.  తర్వాత వ్రాసివ్వడానికి లేఖకుడు దొరికితే మళ్ళీ వివరంగా వ్రాయించి పంపుతాను. (పుట ౨౬౦)

          నా ప్రియుని అందం చూడగానే నా మనసు కలవరపడింది.  తప్పు కళ్ళదే.  అయినా హృదయం బాకుతో కుమ్మబడింది.

 దిలకా జమాలే యార్ తబీయత్ మచల్ గయీ

ఆంఖోంకా థా కసూర్ చురీ దిల్ పె చల్ గయీ’.        (పుట 261)

          నాలోనికి నేను తొంగిచూచుకోగా అనేకత్వ స్థితి అంతమైనట్లు కనుగొన్నాను.  సరే వెనక్కి మరలి చూస్తే బయట కూడ అదే స్థితే (లోపలి స్థితే) ఆవరించి వుంది.  నేను ఉద్వేగమునకు గురైనప్పుడు భగవంతుడు అన్నిటిలో అంతటా వ్యాపించి వున్నట్లు కనుగొన్నాను.  కానీ సోదరా! నేను కుడి యెడమల గమనిస్తే ఈ సర్వసృష్టి పూర్తిగా తన వైభవంతోను కార్యకలాపములతోను దర్శనమిచ్చింది.  ఈ పతనానికి హేతువేమని నేను కొన్నిసార్లు లోతుగా పరిశీలించాను.  ఈ వైభవానికి యే రంగు ఈ రంగుతో కలిసి కారణమయిందో కదా!  మానవ మనస్సులో ఈ ఉద్వేగముత్పన్నం కావడానికి కారణ మేమోగదా? ఎందుకు మన కళ్ళు యిటూ అటూ తిరుగుతూ దారులు, జాడలూ యేర్పడుతున్నాయి.  ఏమిటిదంతా, యెవరు దీనికంతటికినీ కారణం? ఈ వాతావరణం యెవరు సృష్టించారు? దేవుడా లేక మనిషే తనకైతానే సృష్టించుకున్నాడా? ఎవరు ఒకదాని కొకటిగా పొరల నేర్పరచారు? వీటన్నింటికి నాకు దొరికిన సమాధానం యేమంటే, అసలు తొలుదొల్త భగవంతుడే సర్వస్వతంత్రత మన లక్షణంగా వుంచి మనలను సృష్టించినాడు.  తద్వారా మనం అన్ని పదార్థముల నుండి స్వేచ్ఛను పొంది మన వాస్తవ స్వతంత్రత వైపు పయనించే సౌలభ్యమిచ్చినాడు.  కానీ కాలగమనంలో సంభవించిన సంఘటనలు మన దారినే సమూలంగా మార్చి వేరు దారికి మరల్చినవి.  మన మనస్సు అసలు స్వేచ్ఛ నుండి మనలను ప్రక్కకు త్రిప్పి యింద్రియముల వెంట పరుగిడజేసెను.  మనకు లభించిన పోషణ సైతం అదే వైపునకు పరుగిడుటకు సహాయపడినది.  ఇంద్రియముల వైపు మొగ్గుజూపిన వారు అదే యింద్రియములలో కలసి పోయిరి.  ఒకవేళ వారు అందుండి బయట పడినా వారు కూడా యింద్రియములను సంతృప్తి పరచలేక వాటికి ఊతమిచ్చు వాటినే సృష్టించుకొనిరే గాని వాటిని అధిగమించి బయట పడలేక పోయిరి.  వారు అటువంటి వాటిని గూర్చి మాట్లాడు వారితోనే గడిపిరి.  అదే వారికి యిష్టమై యుండెను.  వారికై వారు యేర్పరచుకొన్న కేంద్రముల వైపుకే వారు సాగిపోయిరి.  ఇదెలా జరిగినది? ఇంద్రియ సుఖములను మరిగిన వారి సాంగత్యముతోనే యిదంతా సంప్రాప్తమైనది కానీ అట్టి ఆ సహచరులు గొప్పవారుగా కనబడుటకు నటించుచున్నారు.  వారే మనకు లభించిన మహాత్ములు.  అట్టివారు నెలకొల్పిన కేంద్రములను ప్రజలు నిషేదించ వలెనని నీవు, నేను కోరుకొనవచ్చును.  అందుకు జనులూ సిద్ధపడవచ్చు కానీ ఆ స్థాపించిన కేంద్రము దైవీయ కేంద్రములోనూ వారు చూడగలగాలి మరి.  మాటలు కఠినంగా వుండవచ్చు కాని వ్రాయక తప్పదను కుంటున్నాను.  పొట్టేళ్ళ వృషణములు తోడేలు చేతికి చిక్కియున్నవి.  మొత్తము సిరాజ్ పట్టణమంతా ఈ దురవస్తే వ్యాపించి యున్నది.  సోదరా! దీనికంతటికి కారణభూతమైన పెద్ద మనుష్యుల మధ్యలో మనమున్నాము.  వారిలో కొందరిని మనం గురువులంటున్నాం. (పుట 292 & 293)

          మనిషి యిచ్ఛాశక్తి నుత్పన్నము చేసికొని భగవంతుని వైపునకు వాస్తవముగా పురోగమించునట్లు తన్నుతాను భగవదర్పణము జేసుకొన వలెనని వివరించి చెప్పుచున్నాను. (పుట 296)

          ఇచ్ఛ మరియు వాంఛను వివరించుటకు శ్రీఅరబిందో వారి వలె విభాగించ వలసి యున్నది.  ఆ విభాగముల నిలా చేస్తున్నాను. (1) పశుస్థాయి (2) మానసికస్థాయి (3) ఆధ్యాత్మికస్థాయి.  ఇవి వాంఛలోని విభాగములు.  వాంఛలు యెంత మంచివో అంత చెడ్డవి కూడా.  చెడు వాంఛలు అరిషడ్వర్గాలు అనగా కామము మొదలైన వాటితో అనుబంధించబడి వుంటాయి.  దురాశ మొదలైనవి సైతం వీటి వర్గంలోనికే చేరుతాయి.  వాంఛలు మనో పరిధిలో స్వంతఘనత, స్వంతఅభివృద్ధి, స్వశక్తి మొదలైన రూపంలో కూడా వుంటాయి.  ఇవి ఆధ్యాత్మిక స్థాయికి మార్పు చేయబడితే, అతనికి బాధ్యత గుర్తు చేయబడుతుంది.  అతడు బంధ విముక్తి కోసం ఆవేదన చెందుతాడు.  అతని వాలకం ఆలోచన భగవత్‌సాక్షాత్కారం వైపు మరల్చబడుతుంది.  ఇదే వాలకం, ఆలోచన పశుస్థాయికి మొదట అనుబంధించబడి వుండినదే మరి.  కానీ యిందులో బాధ్యత (విధి) అను భావం యిమిడి యుండగా దాన్ని వాంఛ అనడం తప్పవుతుంది.  ఇచ్ఛ మనోపరిధికి అతుకబడి వుంటుంది.  కారణం నీవు గమ్యాన్ని దృష్టిలో వుంచుకొని మనస్సుతో పని చేయవలసి వుంటుంది.  ఈ ప్రక్రియ కడవరకు కొనసాగుతుంది.  ఇది ప్రతి స్థాయిలోను నూతన జీవం పొందుతూ వుంటుంది.  త్వరగా స్పందించడం మొదలు పెడుతుంది.  అంటే దాని సామర్థ్యం పెరుగుతూ పోతుంది.  మహామాయగా పిలువబడు ప్రాపంచిక వ్యవహారము లన్నింటిలోనూ యిప్పుడు దీని చర్యలు ప్రతిభావంతమై వుంటాయి.  ఇది సంపూర్ణంగా అసలైన స్వచ్ఛస్థితికి మారిన తర్వాత యిక ఇది వజ్రమే.  ఈ స్థితికి చేరిన వారు మనిషిని ఒక ఆధ్యాత్మిక స్థితి నుండి మరో ఆధ్యాత్మిక స్థితికి అతి తక్కువ సమయంలో అత్యంత సులువుగా మార్చగలుగుతారు.  మనిషి బ్రహ్మనిష్టాపరుడై లోతుగా బ్రహ్మములో లీనమైన తర్వాత అతనికిక పరాజయమే వుండదు.  కానీ సోదరా! యింతవరకు వృద్ధియైన యీ యిచ్ఛామెఱుపు కేవలం భగవదీయ కార్యములకే ఉపయోగ పడుతుంది.  మనిషి సంశయ మూలాన్ని ఛేదించేస్తే అతని యిచ్ఛ మహాశక్తివంత మౌతుంది (అనంతంవైపులో యీ విషయం నీవు చదివి వుంటావు).  పాశ్చాత్య తాత్త్వికత సంశయం మీదనే ఆధారపడి వుంది.  తూర్పుదేశాల తాత్త్వికతలో సంశయానికి తావే లేదు.  సంశయానికి తావివ్వడమంటే దొంగకు యింట్లో చోటివ్వడమే.  సోదరా! ఈ విషయాలన్నీ అభ్యాసం ద్వారా దానికై అవే వాస్తవంగా తెలిసివస్తాయి.  పద్ధతి సరియైనదై వుండాలి.  మార్గదర్శి నిష్ణాతుడై వుండి తీరాలి.  వ్యక్తి జడత్వాన్ని తొలగించుకొని సూక్ష్మాతి సూక్ష్మమైన స్థితులలో జీవిస్తూ పోవాలి. (పుట 302 & 303)

          జనులకు భగవంతునిపై విశ్వాసము లేదు.  నాకు నా ఆరోగ్యముపై నమ్మకము లేదు.  వ్యక్తికి తన ఆరోగ్యంపై నమ్మకం లేకపోవడం నీరసానికి సంకేతం, మరి భగవంతునిపై నమ్మకం లేకపోవడమంటే ఆధ్యాత్మికంగా అది ఆత్మకు సంకేతం.  ప్రజలు యిప్పటి యీ కాలంలో పంటలు బాగా పండడం లేదంటున్నారు.  దానర్థం భగవంతుడు ముసలివాడై పోయి తన పనులు తనకు జ్ఞాపకం లేకుండా పోయాయన్న మాట.  కానీ భగవంతుడిచ్చిన శక్తితో, భగవంతుని కార్యంలోనే యెంత గందరగోళం సృష్టిస్తున్నారో జనులు అర్థం చేసుకోలేక పోతున్నారు.  చర్యలు తగురీతిలో కొనసాగుతున్నాయి.  ప్రస్తుతం మన చర్యలు ప్రకృతి విరుద్ధముగా నున్నవి.  అవి వాతావరణంలో గందరగోళం సృష్టించినవి.  అందుకే మన గొంతు మనమే కోసుకొంటున్నాం.  ఈ పరిస్థితులు శుద్ధిచేయబడవలసి యున్నది.  కొంత వరకు ఆ పని జరుగుతున్నది.  యింకా కొనసాగుతుంది కూడా.  దీని కంతటికినీ నీవంటి వారే యేదో కొంత చేయవలసి ఉన్నది.  తెలిసిగాని, తెలియకనేగాని ప్రతి యోగీ యెంతో కొంత చేస్తూనే వున్నారు.  నాకు ధైర్యమున్నది.  మా గురుదేవుల దయవలన ఈ పనిలో లోపమేమీ జరుగదు.  ఈ పని చేయడానికి మరొక లిప్తకాలం చాలు పనిపూర్తయి పోతుంది.  మీలో ధైర్యాన్ని పెంపొందించడానికే నేనీ విషయాలన్నీ వ్రాస్తున్నాను.  తమ శక్తులను దుర్వినియోగ పరచి యింత గందరగోళము కలుగ జేసిన వారు తమ ద్రోహ చర్యల ఫలిత మనుభవించి తీరాలి.  ప్రకృతి సైతం యిదే వాంఛిస్తున్నది.  అందుకే నేను యీ మరమత్తు పనులను చేపట్టలేదు.  ద్రోహపూరిత జనుల చర్యల ఫలితమే యిది.  వినాశనము కలుగక తప్పినది కాదు.  అది కూడా యిప్పటికే మొదలైంది కూడా. (పుట 306 & 307)

          సర్నాడ్‌జీ చైనా ఉధృతిని గూర్చి వ్యధ జెందుతున్నట్లు తెలిపారు.  ఒక నానుడి దీనికి సంబంధించి నాకు జ్ఞాపక మొస్తున్నది.

                 "ఖాజీగారూ పట్టణ బాగోగుల గురించి చింతిస్తూ మీరెందుకు చిక్కి శల్యమై పోతున్నారు"

          దానికంటే తనను కబళిస్తున్న అరిషడ్వర్గాల గురించి, వాటి నుండి రక్షణపొందే మార్గాల గురించి చింతించిన బాగుండును కదా! (పుట 313)

          ఆశీర్వదింపబడిన నీ ఆత్మ పాపియై యుండుట అసంభవము.  నీ గత జన్మలో నుండిన పొర కూడా తొలగించ బడినది.  ఇంక యిక పాపమన్న ప్రశ్నే ఉత్పన్నం కాదు.  నీవు ఒకవేళ అలా అనుకున్నా ప్రభువు దయ నీపై యున్నది.  ఓ కవి యీ విషయంపై యెంత అందమైన కవిత చెప్పాడో చూడు-

 "గునహే గారో సే పూఛా జొ ఉసకీ రెహమత్ నే

బహూత్ ఖాఫీఫ్ హుయి జొ గునహేగార్ నధే".

ఆయన దయతో పాపులను గూర్చి విచారింపగా, పాపమెరుగని పుణ్యాత్ములు సిగ్గు జెందారు"

          తన్ను తాను పాపిగా తలచడం వినయానికి గుర్తు.  ఇది ముసల్మానుల భావన.   బహుఃశా మన మతమున యిట్లు చెప్పియుండక పోవచ్చును.  ఇందులో ఒక సౌమ్యత, మర్యాద కనబడుతున్నది.  మనం పాపులమని తలంచినపుడు ప్రభువు దయను మనవైపునకు లాగుకుంటాము.  తద్వారా ఆ స్థితిలో మనం ఆయన దయపై పూర్తిగా ఆధారపడి యెంతో మేలు పొందెదము.  ఇది శరణాగతిలో ఒక భాగము.  మనం మహత్తు వైపుకు పురోగమిస్తున్నప్పుడు మన స్థితి సహజంగానే ఆ సమయంలో వినమ్రమై పోతుంది.  మన ఉనికిని మనం కోల్పోయి ఆయన దయయే మన దృక్పదంలో నిలిచి వుంటుంది.  అంటే ఆయన దయ వచ్చి నిండుకొనుటకు మన హృదయం శూన్యమై యుంటుంది.  ఒక అన్వేషకునికి మాత్రమే తెలిసిన సత్యతత్త్వ విషయమిది.  ఇప్పుడు నీ ప్రశ్నకు వస్తున్నాను.  ఉత్తరం చేరగానే మనం కలువబోతున్న సంఘటనలు మనసున మెదలి మనల్ని సన్నిహితులను చేస్తాయి.  ఈ విధమైన సాన్నిహిత్యం దానికైఅదే ఒక పులకింతను కలిగిస్తుంది.  అదే ప్రేమ యొక్క శక్తి.  శరీరములోని ప్రతి సంధిలో యీ స్పందన ప్రతిధ్వనిస్తుంది.  మనసున ఒక గొప్ప భావన కలిగి తీరుతుంది.  కారణం ఒక గొప్ప విషయం దృక్పదంలో మెదలజొచ్చింది.  మనసులో ఒక గొప్ప భావన మెదలినపుడు ఆ గొప్పకు విఘాత మెప్పుడూ యేర్పడదు.  విఘాత మేర్పడాలంటే అట్టి గొప్ప భావనకు విరుద్ధమైన భావన మనసున పొడసూపాలి.  అప్పుడే అది సాధ్యం.  మన హృదయంలో గొప్పభావన యిప్పుడు కలిగివుంది గనుక దాని ప్రభావం స్వల్ప విషయములపై కూడా పడి తీరుతుంది.  యిట్టి స్వల్ప విషయాలు యేస్థితిలోనైనా కొంతకు కొంత మనిషిలో వుండి తీరుతాయి.  ఇవి ఆ స్పందనలను గ్రహించి కొంత సమయం వరకు మిక్కుటమై కనిపిస్తాయి. నీవు ఉత్తరంలో వ్రాసిన విషయాలు యదార్థం కావు.  ప్రేమ అంతటా శ్లాఘింపబడుతుంది.  మహాభారతంలో ఒక కథ వుంది.  విదురిని యింటికి శ్రీకృష్ణపరమాత్మ వెళ్ళు సమయానికి విదురుని భార్య వివస్త్రగా స్నానాలగదిలో స్నానమాచరిస్తూ వుండినది.  శ్రీకృష్ణుని స్వరం వినగానే తానున్న స్థితిని మరచిపోయి అట్లే వివస్త్రగా తలుపులు తెరచుకొని బయటికొచ్చేసింది.  కృష్ణపరమాత్మ తన పైపంచెను వెంటనే ఆమెపైకి విసిరివైచి ఆమె వస్త్రహీన గాకుండా కాపాడెను.  ఆమె అరటిపండ్లను కృష్ణునకు నివేదిస్తూ లోపలి పండ్లు పారవేసి అరటి తొక్కలను మాత్రము ఆయన కందించు చుండెను.  ఆ సమయంలో విదురుడక్కడకు వచ్చి పొరబాటు చేయుచున్నావని ఆమెను హెచ్చరించెను.  అప్పుడామె ఆ తప్పు దిద్దుకొని, మెలకువలోనికి వచ్చి స్వామికి పండ్లనందించెను.  అప్పుడు కృష్ణపరమాత్మ ఆ తొక్కలో వున్న రుచి ఈ పండులో లేదనెను.  కనుక భక్తి ప్రేమలు, విదురుని భార్యకున్న స్థాయిలో వున్నా సరే అది కాస్తా తక్కువ స్థాయిలో వున్న వారికి కూడా అనుభవానికొస్తుంది. (పుట 329)

          నేను చిక్‌మగళూరు తప్పక వెళ్ళవలసినదిగా శ్రీ మంజునాద్ వ్రాశారు.  అప్రయోజనకరమైన ఆ ప్రయాణము చేసి నేను అలసి పోవలసి వస్తుంది.  నేనక్కడికి వెళ్ళడం ఆయనకు శ్రేయోదాయకంగా (మంచి జరుగుతుందని) భావిస్తున్నారు.  నిజానికా శ్రేయస్సు రికత్’ (ప్రేమపూరితమైన భక్తి) ద్వారా ప్రాప్తిసుంది.  దీని అర్థం నీకూ తెలుసు.  ఒక్క ముక్కలో చెప్పాలంటే శ్రేయస్సు భక్తిప్రేమల ద్వారా లభిస్తుంది. (పుట 330, 331)

          నేను దక్షిణ భారత సందర్శనలో వున్నప్పుడు, నా తీరిక సమయాలలో ఆలోచిస్తూ, మనిషి తన పశులక్షణాలను వీడి నిజమైన మానవీయ లక్షణాలు యెలాగైనా నెలకొనేట్లు చేయగల ఒక పద్ధతి ఉంటే యెంత బాగుండేది, అని అనుకొనే వాడిని.  అప్పుడు నేను నాలోను, బయటి సృష్టిలోను తేరిపారచూచాను.  నాకు రెండు శక్తి ఉత్పాదక యంత్రాలు కనిపించాయి.  అందులో ఒకటి వ్యక్తిసృష్టి, రెండవది విశ్వసృష్టి.  నేను దీన్ని గురించి లోతుగా అధ్యయనం చేశాను.  ఈ విశ్వము సృష్టించి పెట్టిన శక్తి ఉత్పాదక యంత్రాన్ని గురించి, లోకంలో మార్పు తేవడానికి యత్నించిన శ్రీఅరవిందుల వారికి అస్సలు తెలియక పోవడం నాకు బాధ కలిగించింది.  ఒకవేళ ఆయనకు తెలిసి వుంటే, దీన్ని గురించి తెలియ జేయడమే గాక తన శక్తి నుపయోగించి దానిని ఉపయోగపెట్టి విశ్వమునకు కొంత మేలుచేసి యుండును.  ప్రస్తుతానికి నేనా యంత్రాన్ని తగలకుండా వదలి వేశాను.  నాకు తెలిసినంత వరకు, ఒక ప్రత్యేక అవతారమూర్తికి మాత్రమే దాని నుపయోగించు సామర్థ్యము గలదు.  ఏ మూర్ఖమహాత్ముని ఆలోచనైనా దాని వైపు మరలదా అని మొదట నేను భయపడ్డాను.  దీని నుపయోగించ గల శక్తి గలవారు మన సంస్థలో ఇద్దరు, ముగ్గురు మాత్రమున్నారు.  ఈ విషయమై నేనే విధమైన మర్మమూ విప్పదలచుకోలేదు.  దీని నుపయోగించుటకు మొదట వారికి నేను ప్రత్యేకశక్తి నివ్వవలసి యున్నది.  అప్పుడుగాని వారక్కడ నిలువలేరు.  లేకపోతే వారి ప్రాణం దానిలోనే లీనమై పోతుంది.

         ఇప్పుడు నేను వ్యక్తినిర్మిత శక్తిఉత్పాదక యంత్రాన్ని గురించి చెబుతాను.  మా గురువర్యుల కృపచేత దీన్ని పరిష్కరించ గలిగాను.  ఆయనిచ్చిన వివరణ బహు చక్కనైనది.  దాన్ని గురించి నేను ఆలోచించినది సైతం సరియైనదే.  దాన్ని మా గురువుగారు కూడా అంగీకరించారు.  దీనిని పనిచేయించుటలో యే ప్రమాదము లేదు.  ఇది మంచి ప్రతిభావంతమైన పనిముట్టు.  దీనిని ఉపయోగపెట్టు వారు బహు జాగురూకతతో మెలగాలి.  నేను రెండు నమూనా పరీక్షలు చేశాను.  కానీ మొత్తం ఒక జీవిత కాలానికి ఒకటైతే సరిపోతుందేమో ననిపిస్తున్నది.  లేకపోతే అవే మళ్ళీమళ్ళీ చాలా సార్లు కొంత వ్యవధినిచ్చి చేయవలసి రావచ్చును.  నేను దీని సహాయమున యెవరిపై ప్రసారము చేసితినో వారిలో మార్పులకు సంబంధించిన లక్షణములు కనబడు చున్నవి.  అవి యే విధమైన మార్పులో ప్రస్ఫుటమయ్యే వరకు వేచి చూడాలి.  ఒక నిర్ధారణకు వచ్చిన తర్వాత ప్రశిక్షకులందరికి తెలియజేస్తాను.  ఈ ప్రక్రియను న్యూక్లియర్ ప్రక్రియ అంటారు. (పుట 344 &343)

         సోదరుడు రామకృష్ణరావు తగినన్ని రోజులు నావద్ద వుండటంవల్ల నే నాయనకు సేవచేసే భాగ్యం కలిగినది.  ఆయన స్థితిని గురించి నీకు వ్రాస్తున్నాను.  చాలా జ్అడత్వమే ఉండినది.  అది నేను తొలగించి వేశాను.  అతని విషయమై నే నొకటి గమనించాను.  ఇప్పటికి దాని విషయం నా కవగతమైనది.  చాలా రోజులకు ఆ స్థితిని తెలుపుటకు సరియైన పదము దొరికినది.  అదేమంటే భూ ప్రభావము హృదయముపై కనిపించినది.  అతని హృదయము బురద రంగులో అగుపడినది.  అంటే వ్యవసాయ భూమి రంగన్న మాట.  కారణమేమంటే సహజ సిద్ధంగా ధ్యాన సమయంలో అతని ఆలోచన పొలము పైకే వెళ్ళెడిది.  అందుకే అక్కడ హృదయ వర్ణము మరియు మట్టి వర్ణము, పాలు చక్కెర కలసిపోయినట్లుండెను.  ధ్యానం వల్ల శక్తి పెరుగుతుంది.  దీక్షనిచ్చు సమయమున అది మరింత ఉధృతంగా వుంటుంది.  అతని శక్తి నతడు పంటపొలములపై అమితముగా పట్టించుకొని వాడుకొనెను.  నేను అతని నెట్లు సరిదిద్ద వలెనా? యన్న యోచనతో సమయము వృధాయయ్యెను.

         సత్సంగులలో చైతన్యము, వుండ వలసినంతగా లేదని నీవు తెలిపిన నీ దృక్పదము సరియైనదే.  దానికి వాస్తవ కారణము సహకార లోపమే.  ఈ సహకారం కొందరిలో మాత్రమే సమృద్ధిగా నున్నది.  ఇక రెండవ కారణము వారు ధ్యానమున ఎక్కువ సమయము గడపడము లేదు.  ఇది సర్వత్రా సాధారణముగా ఉన్న లోపము.  ఇక మూడవది ధ్యానానంతరం వారు ధ్యానం విషయాన్ని వదిలేసి అసలు పట్టించుకొనక పోవడము.  వారు నిర్ద్వందంగా మేము భక్తి గలిగే ఉన్నామని నొక్కి చెప్పుదురు కానీ అది కేవలము పేరుకు మాత్రమే భక్తి.  వారి హృదయాలలో వారు మంచివారము, భక్తి పరులము అని ముద్రించుకొని యున్నారంతే గానీ వేరు కాదు.  నిజమైన ప్రేమలో ఆతురత, బాధ యిమిడి యున్నవి. (పుట 361 & 362)

         మనము వెలుగును అవసరంగా భావించడం లేదు.  జనులు అనవసరంగా వెలుగును పట్టుకొని వేసారుతున్నారు.  ఒక సమయం వస్తుంది అప్పుడు వారు ఆ వెలుగును యిష్టపడనే యిష్టపడరు.  అసలక్కడ వెలుగులేదు, చీకటిలేదు.  సత్యము అక్కడ పూర్తిగా వేరొక రూపం ధరిస్తుంది.  మనం అంధులమై ఉన్నప్పుడే వెలుగును అభిలషిస్తాము.  మనకు చూపు తిరిగి వచ్చి స్వస్థత చెందగానే వెలుగుతో మనకు అవసరమే ఉండదు. (పుట 363 &364)

         షడ్‌దర్శనాలలో వైరాగ్యాన్ని గురించి చదివే వుంటావు.  అది యెన్ని రకాలో కూడా తెలిసుకొని ఉంటావు.  అవి దృఢవైరాగ్యము, అపరిపక్వవైరాగ్యము, స్మశాన వైరాగ్యము.  ఇప్పుడు నేను ప్రతిమనిషిని సరిద్దిటకు క్రొత్త వైరాగ్యాలను తెలుపుతున్నాను.  వినండి, కొందరు తమ తెలివిని త్యజిస్తారు.  భగవంతుని త్యజించిన వారు తెలివైన వారు.  ప్రపంచాన్ని త్యజించిన వారు బుద్ధిమంతులు.  మరి తమ మెదడును (తెలివిని) త్యజించిన వారు మూర్ఖులు.  ఇక వాటి పర్యవసానాలు విను.  భగవంతుని త్యజించిన సంక్షోభాన్ని, ప్రపంచాన్ని త్యజించి ప్రశాంతతను పొందుతారు.  ఇక మెదడును త్యజించిన వారు అపాయకరమైన వ్యాధులను పొందుతారు.  ఉదాహరణకు మెదడులో కణితి, పక్షవాతము మొదలైనవన్న మాట.

         ఇది ఒక విధం.  ఇంకోటి చెబుతాను విను.  చాలా మంది సన్యాసులు యెలా వున్నారో వివరిస్తాను విను.  షడ్‌దర్శనాలలో యీ రకాలు కూడా చదివే వుంటావు.  నా నిర్వచనాలు నేనిస్తాను.  నేను మూడు రకాల వాళ్ళుగా వారిని గుర్తిస్తున్నాను.  వారు, సంత్, పరమసంత్ మరియు సద్గురువు.

         1. సంత్ - తన నిజస్థానానికి చేరిన వాడు.

         2. పరమసంత్ - తన ఉనికికి సంబంధించిన

          యెఱుకే లేనివాడై స్వస్థానంలో వుంటాడు.

         3. సద్గురువు - సద్గురువు మనలను మేల్గొల్పి

          భగవంతుడిచ్చిన తెలివి తేటలను

          సక్రమముగా వినియోగించుకొని భగవత్-

          కార్యమున వాటిని సద్వినియోగ పరచునట్లు

          చేయువాడు. (పుట366 & 367)

          భార్యాభర్తల మధ్య సామరస్యము సాధించు విషయమై నీవు వ్రాసితివి.  ఈ విషయమై సోక్రటీసు వంటి మహామహులు కూడా యీ సమస్యకు పరిష్కారము చూపలేక పోయిరి.  సోక్రటీసు భార్య చాలా కోపిష్టి.  అటువంటి స్త్రీయే కావాలని ఆయన యిష్టపూర్వకముగా ఆమెను పెండ్లాడెను.  ఎందుకలా చేసుకొన్నారని శిష్యులు అడిగితే, సహనం వృద్ధి చేసుకోవడానికి అలవాటు పడాలని ఆమెను వివాహమాడితినని ఆయన బదులు చెప్పెను.  అనేకసార్లు నేనెక్కడో చదివినట్లు, గమనించినట్లు జ్ఞాపకం.  ఎంత ఉన్నతస్థాయి మహర్షి అయితే అంత కోపిష్టి భార్య ఆయనకుండేదట.  ఇది తప్పనిసరి నిబంధనేమీ కాదు గానీ, సర్వసామాన్యంగా యిట్లే కనబడుతుంది.  దీనికి నేను గూడా ఒక ఉదాహరణే.  మా గురువు శ్రీలాలాజీ వారి పరిస్థితీ అదే.  మా గురువుగారి శిష్యులైన కొందరు సోదర అభ్యాసుల నుండి కూడా యిదే ఫిర్యాదు వస్తూండేది.  ఇదంతా ఓదార్పు కోసమే చెప్పితిని.  ఇక అసలు విషయానికొస్తాను.  నీవు చాలా మంచివాడివి, నేను కూడా నీ వద్ద నుండి అతి త్వరగా మంచితనాన్నే కోరుకొన్నాను.  అయినా నీలో మార్పుగలగడానికి యెంత సమయం పట్టిందో ముందు చెప్పు. నీ కొక చెడ్డవాడు అవసరమైతే, వెళ్ళి మంచి వాళ్ళలో వెతుకు.  నీకు ఒక వేళ మూర్ఖుల జాబితా కావలసి వస్తే వెళ్ళి తెలివైనవాళ్ళలో వెతుకు.  పురుషుడున్న స్థాయిలోనే పురుషుడుంటే స్త్రీ కూడా ఆమె ఉన్న స్థాయిలో ఆమె వుండి తీరుతుంది.  ఇక్కడ పురుషుడన్న పదం మగవాడన్న అర్థంలో మాత్రమే వాడబడింది.  అంతేగాని ఆధ్యాత్మిక పరంగా వాడబడలేదు.  కానీ యిక్కడ పురుషుడు ప్రకృతి స్థానాన్ని గ్రహించాడు.  సమతుల్యతను నిలుపుట కొఱకు తప్పని సరియై ప్రకృతి, పురుషుని స్థానాన్ని పూరించ వలసి వచ్చింది.  అటువంటప్పుడు ఆమె స్థానం పురుషునిది, కనుక ఆమె పురుషుని పాత్ర పోషించాలన్నది నీకు తెలుసు గదా!  అంటే ప్రకృతిపై అధికారం ఎలాగైనా చెలాయించడానికి పరుషవాక్కులతో గానీ లేక మరో విధంగా గాని దబాయింపు చూపక తప్పదు.  నీకిప్పుడు వాస్తవం చెప్పబడింది.  కానీ పూజ్యులు మరియు సాధువులు ఈ విషయమంతగా పట్టించుకొనరు.  వారు బోళ్ళించిన కుండవలె అవమానరహిత జీవితం గడపడానికే యిష్టపడతారు.  ఈ విషయమై నీకింతకు ముందు తెల్పినది సామాన్య ప్రాపంచిక జీవనం గడుపు వారి గురించి.  కానీ పైన చెప్పిన వాక్యము మహనీయుల స్థాయిని దెలుపుతున్నది.  నీకొఱకొక మాట చెబుతాను విను. "కోడలిలో (నీభార్యలో) ఎందుకు క్రమేణా మార్పును తేలేవు? తద్వారా ఆమె తన స్థాయిని పెంపొందించు కొంటుంది గదా!" (పుట 371 &372)

          నేను ప్రాణంతో వచ్చాను.  ప్రాణంతోనే వెళతాను.  మరణమన్న ప్రశ్నే ఉత్పన్నం కాదు.  నేను ఈ జీవిత కాలాన్ని మరొకరు ప్రసాదించి ప్రసారం చేయడం వల్ల కొనసాగిస్తున్నానని నీకూ తెలుసు.  అందువల్ల నేనెంత కాలం జీవిస్తానో తెలియదు.  నీకు అలహాబాద్ సంఘటన గుర్తుండే వుంటుంది.  నేను నా జీవితంలో ఓ ఆరునెలలు తప్ప మిగిలిందంతా ధారాదత్తం చేసేశాను. (పుట 375)

          మనిషి ఒక జీవిత కాలమంతా చదివినా పూర్తి చేయలేనంతగా మన సంస్థ గ్రంథాలను విస్తరింపజేసి, సమృద్ధి పరచాలని నేను కోరుకొంటున్నాను.  కానీ అందులోని విషయాలన్నీ సహజమార్గం గురించి మాత్రమే వుండడమే గాక, మహత్తరంగా కూడా వుండాలి. (పుట 378)

          ఈ ప్రపంచాన్ని వదలి వెళ్ళిపోవాలనే ఆలోచన ఉత్పన్నం కావడమనేది ఒక రకమైన బలహీనత.  ఇది ఒకరకంగా స్త్రీతత్త్వపు ఆలోచన.  స్త్రీ చాలా సంతోషంతో తన భర్తతో గడుపునపుడు తరచూ తన హృదయంతోను మరియు నోటితోనూ గూడా నా జీవితానికిక యెటువంటి ప్రాధాన్యతా లేదు యిక చాలంటుంది.  ఇక నీ రెండవ ఉత్తరానికొస్తాను.  నిన్ను సంతోషపెట్టడానికి యిందులో ఒక కవితను పొందుపరుస్తున్నాను.

 "జల్ కే అపనే ఆగ్ మే ఖుద్ సురటే పరవానా హమ్,

బన్‌గయ్ హమ్ రిస్తా -ఎ- కక్‌దార్ జనా నా హమ్"

 "నా అగ్నిలో నేను మిడత వలె మాడిపోయిన తర్వాత నే నెప్పుడు ప్రియుని వాకిట ధూళినై పడియున్నానో నాకే తెలియదు."

          దీక్షనివ్వడ మొక్కటే భగవంతునితో వెంటనే బంధ మేర్పరచు యేకైక మార్గము.  అలా కాకపోతే చాలా సమయం పడుతుంది.  దీని ప్రాధాన్యతను ప్రజలు గుర్తించకపోతే నేనేం మాట్లాడగలను.  దీక్ష తర్వాత గూడా వారు యీ విషయాన్ని గూర్చి ఆలోచించడం లేదు.  వారిని వదిలి వేయడానికి వీలులేని బాధ్యత నాపైయున్నది.  వారు వారి స్థాయిని పాడుచేసుకుంటే, నా పరిస్థితి నీరువదలి గట్టున పడిన చేపగా మారుతున్నది.  ఒకరి విషయంలోనైతే ఒక సంవత్సరం బాధపడిన తర్వాత అతడిని దీక్షనుండి తప్పించడనికి అనుమతి లభించింది.  దానికితోడు మా గురువుగారు నుండి నాకు చీవాట్లు లభించాయి.  ఈ మేలు నాకు జరగడం సబబే ననిపిస్తున్నది.  వాస్తవానికి నేను దీక్షనీయడానికి సుముఖుడనే ఐనా పై కారణాల వల్ల నేను నిస్సహాయ స్థితిలో వుండి పోతున్నాను.  కనీసం ప్రతి శిక్షకునికి దీక్షనివ్వాలి.  అందువల్ల శక్తి ద్విగుణీకృతమౌతుంది.  వ్యక్తిని బాగా పరీక్షించి సంస్థకు సమర్పించాలి.  నీవు మాత్రమే దీన్ని నిర్ధారించ సమర్థుడవు. (పుట 383)

          నీకైనీవు కొన్నిసార్లు 10 - 20 నిమిషాలు శుద్ధీకరించుకోవాలి.  ఎందుకంటే నీవు స్థౌల్యంలో పని చేస్తున్నప్పుడు, అది నీకు కూడా అంటుకొనవచ్చును.  ఇది ప్రతి ప్రశిక్షకునికి అవసరం. (పుట 387)

          నా వద్దకొచ్చే సత్సంగులలో అత్యధిక స్థౌల్యమున్నది.  అది వాళ్ళ దోషమే అన్నది వాస్తవమే కావచ్చు.  కానీ యిందులో ప్రశిక్షకులు దోషరహితులని తప్పించుకొన లేరు.  చాలా మంది సత్సంగులకు క్షాళనా విధానము తెలియనే తెలియదు.  వారు తప్పుగా చేసుకపోతున్నారు.  అన్ని కేంద్రాలలో నేను క్షాళనా విధానాన్ని తెలియ జేసియే యున్నాను.  నీవు కూడా వీలు దొరికినప్పుడల్లా అవసరమైన చోట్ల వివరిస్తూ వుండు.  ఈ విషయంలో వారి ప్రయత్నమే యేమీ కనబడటం లేదు.  ఇంత సులువైన విధానాన్ని చదువుకొన్న వాళ్ళు సైతం అర్థం చేసుకోలేక పోవటం దయనీయ మనిపిస్తున్నది. (పుట 388)

          సత్పదార్థమునకై మండుచున్న కోరికతో తపిస్తున్న అభ్యాసులు అరుదుగా కనిపిస్తారు.  ఎలాగైనా ప్రశిక్షకులు వారిలో దైవసాక్షాత్కారము కొఱకు కోరిక రేకెత్తించునట్లు ప్రయత్నం చేస్తూ వుండాలి.  ఇది చాలు.  వారు దీన్ని రుచి చూస్తే యిక దీన్ని విడిచి వుండటాని కిష్టపడరు.  ఇది భగవంతుని దయ.  వ్యక్తులను గురించి తెలుసుకొని వీలైనంత యెక్కువ మందిని యిందులోనికి చేర్చుకొనండి. (పుట 393)

          తన చర్యవల్ల యితరులు బాధపడుతున్నారన్న విషయం గమనించగల్గి, తదనంతరం వెంటనే దానికి సమాధానంగా తనను తాను సరిదిద్దుకొని ప్రవర్తిస్తే అన్నీ వాటికై అవే సరిచేయబడతాయి. (పుట 394)

          లండను నుండి ఒకరిద్దరు నన్ను ప్రశ్నలడుగుతూ ఉత్తరాలు వ్రాశారు.  ఇది ఒక మంచి వార్తే.  అక్కడ కూడా వారు నాకోసం కొన్ని ప్రశ్నలు కేటాయించి ఉంచారు.  వారి ప్రశ్నలన్నింటికి జవాబు లివ్వబడినవి.  వారు జవాబులు శాస్త్రసమ్మతంగా ఉండాలని ఆశించారు.  నేనేమో శాస్త్రాలు చదువు కోలేదు.  మరో చిక్కేమంటే నేను తత్త్వశాస్త్రానికి ఆత్మార్పణ చేసుకోలేదు.  ఒకవేళ ఆత్మార్పణే చేసుకొని వుంటే నేను ఆయనకే (భగవంతునికే) ఆత్మార్పణ చేసుకొని వుంటాను.  అసలు శాస్త్రం ఆ తర్వాతే మొదలౌతుంది.  భగవంతున కెరుక, వారు కనుగొన్న శాస్త్ర విషయాల వల్ల ఒక వ్రేలైనా వారి అవగాహనకంది వుంటే, పూర్తి హస్తం కాకపోయినా కనీసము ఆ వ్రేలైనా తప్పక కత్తిరించేద్దురు.  మరి జనులు నన్ను వారి ప్రశ్నలకు శాస్త్రసమ్మతమైన జవాబు లిమ్మందురు. (శాస్త్రము వారికే యింకా తెలియదన్నది గమనార్హము) కొన్ని ప్రదేశాలలో వారు నా ఆలోచనను వ్యతిరేకించారు కూడా.  కానీ యిప్పుడు గురుమహరాజ్ కృపవల్ల నేను సరిగ్గా సరిపోయే సమాధానా లిచ్చాను.  వారు కూడా యిక సంతృప్తి జెందక తప్పినది గాదు.  నేను గమనించిన మరో విషయమేమంటే వారు సామాన్యమైన ఉత్తరాలపై కూడా "వ్యక్తిగతమైనది" "గోపనీయము" అని వ్రాస్తారు.  అందుచేత వాటిని నేను బహిర్గతము చేయలేదు.  కానీ నా సమాధానము మాత్రము రహస్యము కాదు.  అందునా అది అందరికీ ఉపయోగకరము, అయితే పేర్లు తొలగించి ఆ ఉత్తరాలు పత్రికలో ప్రచురించాలంటే ఒక దొరటోపి (హ్యాట్) ధరించిన వ్యక్తితో సంప్రదించ వలసి వస్తున్నది. (పుట 395 & 396)

***

 భాగము -2    

         మనమే సాధన చేయాలి, పద్ధతిననుసరించాలి.  తప్పదు, కానీ పుస్తకములలో చెప్పిన విధానముల ననుసరించి సాధన చేయడం మళ్ళీ అదో కష్టం. అంతే కాదు, అది అపాయకారి కూడా.  నిజానికి ఒక తెలిసిన మహాత్ముని సహాయ సహకారములు, మార్గదర్శకత్వమే గణనలోనికి వచ్చును.  కనుకనే మనము విజయమును కాంక్షింతుమేని అట్టి మహాత్ముని వెతికికొని ఆశ్రయించక తప్పదు. (పుట 1)

         మానసికఅనిశ్చితి మన జీవితములో ఒక భాగమై పోయినది.  కారణం మన వ్యక్తిగతమనస్సును ఆవిధముగా పోనిచ్చితిమి.  మొదటిసారి మనమీ లోకమున ప్రభవించినపుడు యింత అధ్వాన్నస్థితిలో లేము.  పరిసరపరిస్థితులు, మన అలవాట్లు మనపై తమ ప్రభావమును చూపినవి.  ఇంతకీ పరిస్థితిని చెడగొట్టినది యెవరోకాదు.  మనకైమనమే చెడగొట్టుకొంటిమి. కనుక మరలా వెనుదిరిగి సరియైన మార్గమునకు తెచ్చుకోవలసినదీ మనమే.  ఈ కారణముననే మనం ధ్యానం చేసి దారీ తెన్ను లేకుండా తిరుగాడుటకు అలవాటుపడిపోయిన మనస్సును నిలకడస్థితికి దెచ్చి సక్రమ మార్గమున పయనించునట్లు చేయవలెను. (పుట 4)

          నిజమైన జీవితలక్ష్యమేదో మన అవగాహనకొచ్చిందీ అంటే, యిక గతాన్ని గూర్చి చింతించాల్సిన అవసరమేలేదు.  ఇక మనధ్యాస సంపూర్ణంగా లక్ష్యసాధనపైనే ఉండాలి.  భగవంతుని దయవలన మనధ్యాస ఆవైపే ఉన్నది.  ఇది బాగా బలపడవలసి వుంది.  మన గత చర్యల పర్యవసానంగా ప్రాప్తించిన కష్టముల నిప్పుడు మనం మనలను చక్కదిద్దుటకై ఉపాధ్యాయుడు బెత్తముతో వేసిన వాతలుగా భావించ వలసి యున్నది.  మీదుమిక్కిలి ఆయన శిక్షలకు మనం కృతజ్ఞులమై వుండాలి మరి. (పుట 6,7)

         లక్ష్యము నీ దృష్టిపథములో నున్నది.  ఇక విల్లు నెక్కుపెట్టి బాణం లక్ష్యంపై సంధించవలసి వుంది.  ఈ విషయంలో నీ యోచనే బాణం, హృదయం విల్లు.  యిక నీకు అండగా నున్న శక్తిని కూడదీసుకోవడమే మిగిలింది.  ఆ అండ యేమిటో తెలుసా? అదే, అతడే నీ మార్గదర్శి, గురువు. (పుట 7)

          ఇక నీకు నా సహాయాన్ని గురించిన ప్రశ్నకు జవాబివ్వవలసి యున్నది.  నేను నా చేతనైనంత సహాయమందించడానికి సంసిద్ధంగా వున్నాను.  నా సేవలు అందుకోవలసినదిగా నిన్ను నేను కోరుకొనుచున్నాను.  యింకా చెప్పాలంటే యిటువంటి సేవకై నన్ను బలవంతపెట్టమని కూడా అడుగుతున్నాను.  మరో మాటలో చెప్పాలంటే నా ఆశలన్నీ మీదనే వున్నాయి.  కనుక నా నుండి మీవస్తువు మీరు గైకొనడం సులభమే కదా! మా గురువుగారు మీకు పంచి పెట్టుట కొఱకే ఈ నిధిని నా వద్ద నిక్షిప్తము చేసినారు. (పుట 8)

          బిడ్డలను వదిలేసి అరణ్యవాసం చేయడం కాదు వైరాగ్యం.  హృదయమునకు యే విధమైన బాధ (అలసట) కలుగకుండా నీ కర్తవ్యమును నీవు జాగ్రత్తగా నిర్వర్తించడమే సరియైన వైరాగ్యము. (పుట 13)

          హృదయాన్ని అమ్మివేస్తేనే నిజానికి ప్రేమ కలుగుతుంది.  ఇది హృదయ వ్యాపారము. (పుట 14)

          మనకై మనమే తోలుబొమ్మలుగ మారిపోయి నాట్యశాలలో నాట్యమాడుతూ మనకై మనమే సంతృప్తి జెందుతున్నాము.  ఈ ఆటలోని ఆనందంలో మునిగి కాస్త గట్టిగానే ఆటకు కట్టుబడి పోయాము.  ఒక వేళ యిందుండి బయట పడదామనుకున్నా, దానితో వున్న బంధం మనల్ని వదిలించుకోలేనంతగా మరింత బలవంతపెట్టుచున్నది.  ఇప్పుడు మనం దాన్నుండి బయట పడాలనుకుంటున్నాం.  కానీ బంధనాలు గాట్టిగా బిగుసుకపోయాయి.  బయట పడాలనే మన ప్రయత్నం విఫలమై పోతున్నది.  అందులోని ఆకర్షణ, మజా, సంతోషం మనకెంత యిష్టమైనవిగా మారిపోయాయంటే, మనమిక వీటి పట్టునుండి తప్పించుకోవాలంటే వీటి నిజస్థితి సత్యతత్త్వముయొక్క ఛాయయై యున్నదని గ్రహించి మన మనస్సును వాటి కారణం లేక మూలం వైపుకు మళ్ళించాలి.  అంటే మన యోచన వాటి మూలం వైపుకు వెళ్ళాలి.  దీన్నే నిరంతరస్మరణ అంటారు.  ఇది ఉత్పన్నం కావాలంటే ధ్యానప్రక్రియయే శరణ్యము.  ఈ ప్రక్రియ మొదలు పెట్టినంతనే సహజసిద్ధంగా మూలం నుండి అందుకు కావలసిన సహాయమందుతుంది.  మూలంతో మన అనుబంధమేర్పడగానే, యిట్టి ఆకర్షకాలన్నీ పటాపంచలైపోతాయి. (పుట 14,15)

          నీవు నన్ను సహాయం చేయమని అడుగుతున్నావు, నా ప్రార్థనలన్నీ మీ మేలు కోసమేనన్న నిర్ధారణకు నమ్మకానికి నీవింకా రాలేదా?  ప్రతి ఒక్కరు తమ వ్యక్తిత్వాన్ని కోల్పోయి నా వారైపోవాలని నేను నిరంతరం ఆశిస్తున్నాను.  నిజానికిదే నా ఆశయము. (పుట 20)

          ప్రాణాహుతి ప్రసారం ద్వారా రోగములు సాధకునిలో ప్రవేశింపవని నిర్ధారణగా చెబుతున్నాను.  ఇది నా అనుభవము మాత్రమే కాదు, మా గురుదేవుల అనుభవము కూడా.  అంతేగాదు మన నిర్మాణమును శుద్ధీకరించడం ద్వారా రోగ నివారణ సైతం జరిగినట్లు గమనించడం జరిగింది. (పుట 22)

          "ఇది నా ఖర్మ" అన్నప్పుడల్లా మన యెఱుకలో ఒక నిలకడలేనిస్థితి తనంతటదే నెలకొంటున్నది.  సమతాస్థితి ఉన్నప్పుడు మనకంటూ ఒక రూపము లేనేలేదు. మనల్ని మనం సహజంగా వెనక్కు చుట్టేసుకోవలసి (వెనక్కు మరలవలసి) యున్నది.  తద్వారా మనం పోగొట్టుకున్న మన సమతాస్థితిని (స్థిరత్వాన్ని) తిరిగి నెలకొల్పజేసికొనవలెను. (పుట 25)

          ప్రియ సోదరా! నీఒక మహత్తర విషయం వ్రాశావు.  నీవు విద్యార్థులకు హైడ్రాలిక్స్ బోధించడం మొదలుపెట్టగానే విద్యార్థుల కళ్ళలో వెలుగు కనిపించిందన్నావు.  నీవు వస్తువుల గట్టితనాన్ని గానీ  మరే విషయంగానీ బోధిస్తుంటే విద్యార్థులు చాలా బాగా అర్థంచేసుకొంటారు.  సోదరా! నాకీ విషయాలేవి అస్సలు తెలియవు.  నీ విజ్ఞానపు వెలుగు విద్యార్థుల కళ్ళలో కనిపించిందని నేననుకుంటున్నాను.  కాకపోతే నాకీ విషయాలెలా తెలుస్తాయి చెప్పూ?  కానీ నేనీ ఒక్క విషయం మాత్రం చెప్పగలను.  అదేమంటే సరకులు నీవు బాగానే అమ్మగలవు సుమా! (పుట 31)

          భగవంతుడనుకుంటే నీ సంశయాలు తప్పకుండా నివృత్తమౌతాయి.  కానీ యింతవరకూ ఎందుకూ?’ అన్న ప్రశలన్నింటికి ఎవరూ జవాబివ్వలేక పోయారు.  యిక భవిష్యత్తులోనైనా జవాబిస్తారనే నమ్మికా లేదు. (పుట 41)

          ఒక్క నిరంతరస్మరణను సాధన చేయడం ద్వారానే అన్ని స్థితులను దాటేయవచ్చును.  అన్ని స్థితులను దీని వల్లనే విచ్చుకొనజేయ వచ్చును.  అన్ని అతీంద్రియస్థితులను తెరచుకొనేట్లు చేయడం దీని వల్లనే సాధ్యము.  ఇదొక్కటే సత్యతత్త్వము (భగవంతుని) తో లీనమొనర్చును. (పుట 41)

          భగవత్ సాక్షాత్కారము వల్ల ప్రతి విజ్ఞానశాస్త్ర విషయమూ నీ కవగతమౌతుంది.  ఈ నా మాట మీద విశ్వాసముంచుము. (పుట 41)

          నీ ఎఱుకను సైతం నీవు విస్మరించాలని నేను నీ నుండి కోరుకొంటున్నాను.  అయితే అది తగినంత దూరం ప్రయాణించిన తర్వాతనే సాధ్యపడుతుంది.  అప్పుడు నీవు సర్వస్వాన్ని విస్మరించావని నేను నీకు చెప్పడానికి సంసిద్ధపడతాను.  సంబంధిత పొగడ్తలన్నీ (గుణగణాలన్నీ) అంతరించిన తర్వాత యీ స్థితి సిద్ధిస్తుంది.  ఎఱుక యొక్క యెఱుక కూడ లేనట్టి ఆ స్థితిని మీరందరు పొందాలని నా ఆకాంక్ష. (పుట 66)

         ప్రాణాహుతి ప్రసారం ద్వారా రోగములు సాధకునిలో ప్రవేశింపవని నిర్ధారణగా చెబుతున్నాను.  ఇది నా అనుభవము మాత్రమే కాదు, మా గురుదేవుల అనుభవము కూడా.  అంతే కాదు మన నిర్మాణమును శుద్ధీకరించడం ద్వారా రోగనివారణసైతం జరిగినట్లు గమనించడం జరిగింది. (పుట 72)

          ప్రియ సోదరా! ప్రత్యేకావతార పురుషుడు (స్పెషల్ పర్సనాలటి) అన్నీ చేసేస్తాడని, అంటే అందరిని సరియైన మార్గంలోనికి తీసుక వస్తాడని నేను భావించడం లేదు.  శ్రీకృష్ణపరమాత్మ కూడా దుర్యోధనాది దూర్తుల నెందరినో సరిచేయలేక పోయారు.  తుదకు ఆయన మహాభారత యుద్ధాన్నే తేవలసి వచ్చింది.  ఇప్పుడు కూడా అట్టి పరిస్థితులే కలిగి రక్తప్రవాహాలేర్పడి ప్రపంచంలోని చాలా ప్రదేశాలు నిర్మానుష్యమై పోవచ్చును ....... మనం స్వీయ శుద్ధీకరణలో యెక్కువగా నిమగ్నమై ఆ ప్రత్యేకావతారమూర్తి నుండి మేలు పొందెదము గాక! (పుట 77)

          నీవు అభ్యాసులకు ధ్యానం చేయిస్తుండగా నీ స్థానమున నేనున్నట్లుగా గమనిస్తున్నావని వ్రాశావు.  ఇది చాలా మంచి స్థితి.  ఇతరుల స్థానంలో కూడా నేనున్నట్లే కనుగొనడం కూడా మంచి స్థితే.  ఇలా అనిపించడం యింకా చాలా మంచి స్థితి.  ఇందులకు నిన్ను ద్విగుణీకృతముగా అభినందించ వలసి యున్నది.  ఉన్న ఆ శక్తి నీ ద్వారా పనిచేయిస్తున్నది, నీవు మాత్రం ఒక పనిముట్టుగా నిన్ను నీవు భావిస్తున్నావు. (పుట77)

          ధ్యాన సమయంలో నీకై నీవు బలవంతంగా ఊపిరి నిలిపి బిగబట్టవద్దు.  దానికై అదే నిలబడిపోతే అది మంచిదే.  నీ ఆధ్యాత్మికయానం చాలా ఉన్నత స్థితులలో సాగుతున్నప్పుడు గంటలు గడిచినా ఊపిరి ఆడటం నిలిచిపోయే వుంటుంది.  ఆలోచనా రాహిత్య స్థితి ఉత్పన్నమైనపుడు ఊపిరి ఆడటం తగ్గుతూ తగ్గుతూ నిదానంగా సాగుతుంది. (పుట 81)

          మీరు వ్రాసిన లేఖ సంఖ్య ౩౮ బిజి ఎస్.ఆర్.సి.ఎమ్. తేది 10 అక్టోబర్, 1956 అందింది.  చదివి సంతోషించాను.  నేను వెంటనే బదులు వ్రాయలేక పోయాను. నీవు నాజవాబుకోసం ఆతృతగా ఎదురు చూస్తూ వుంటావని నాకు తెలుసు.  శ్రీఈశ్వర్‌సహాయ్ గారిని దీపావళి సెలవులకు పిలిపించుకొని, నేను చెబుతూ ఆయనచేత జవాబు వ్రాయిద్దామనుకున్నాను.  నీవుత్తరం అందిందనైనా ఒక మూడుపైసల కార్డుముక్క వేసివుండవలసింది.  కానీ నేనాపని చేయలేదు.  ఆ విధంగా సంస్థకు ఆదాచేద్దామనుకున్నాను.  మూడుపైసలకు విలువిచ్చి నీకు అసౌకర్యము కలిగించానని నీవనుకోవచ్చు.  వేచియుండటం కూడా ఒక విధంగా తీవ్రస్మరణే.  అది ఆధ్యాత్మికతకు మేలుచేస్తుందన్న వాస్తవం తెలిసి ఊరటపొంది వుంటావు.  ఓకవి ఇలా అంటాడు - "ప్రేయసి కోసం ఎదురు చూడాటంలో వున్న ఆనందం ఆమెను కలుసుకోవడంలో లేదు".  కనుక ఈ అసౌకర్యం మరో విధంగా ఊహిస్తే వసంతఋతువునాహ్వానించి నట్లుంటుంది.  నాబలహీనత నీకు తెలుసు.  నేనేదైనా మంచి విషయం చెప్పి వ్రాయిద్దామనుకుంటే అందుకు తగ్గట్టు లేఖకుడు కూడా సమర్థుడై ఉండాలి.  వ్రాసే విషయంలో నేను నిస్సహాయుణ్ణి.  ఏంచేద్దాం, నాహృదయం నాచేతివ్రేళ్ళను చేరలేకపోతున్నది.

          డా. కె.సి.వరదాచారిపై మీ అభిప్రాయం సరియైనది.  ఆయన సమస్యలన్నీ పరిష్కారమై అంతర్గతంగా ఆయన చక్కని ముందడుగు వేయాలని నేను ప్రార్థిస్తున్నాను.  నేను కూడా ఆయన్ను ప్రేమిస్తున్నాను.  ఈమధ్య ఆయనకు కొన్ని ఉత్తరాలు వ్రాశాను.  అందులో వ్రాస్తూ సాధనా పద్దతిపై కొంత వెలుగును ప్రసరింపజేశాను.  అది ప్రశిక్షకులందరకు తెలియాల్సివుంది.  ఆయన వ్రాసిన కొన్ని ఉత్తరాలు వ్యక్తిగతమైనవి కనుక వాటి ప్రతులు పంపలేను.  అయితే నాప్రత్యుత్తరాలలో అటువంటి వ్యక్తిగత విషయాలేమీలేవు.  మతాచారాలు మనముందు మనమే నిర్మించుకున్న గోడలని నేను భావిస్తున్నాను.  వీటివలన మన ముందున్నదారి మూసుకుపోతుంది.  ఏదో ఒక రకంగా ఇవి జొరబడుతూనే వున్నాయి, ఈ దుర్గుణం వరుసగా ముస్లింలను గమనిస్తూ మనం తగిలించుకున్నాము.  లేకపోయుంటే మనకున్న ధారాళమైన ప్రవాహంలో ఒక్క అణువంత కూడా పేరుకపోకుండా కొట్టుకుపోయుండేది.

          దక్షిణ భారతదేశంలో ఆధ్యాత్మిక వ్యాసాలు చదివి మేలుపొందేవారు చాలా తక్కువని సోదరుడు గణేష్ సరిగ్గా వ్రాశాడు.  ఇది అన్ని చోట్లా ఇంతే.  ఉత్తర భారతదేశంలో కూడా ఎవరూ వీటివలన మేలుపొందలేదు.  ఇక్కడ మీ విషయానికొస్తే మీరు వ్రాయడం కొనసాగించండి, ఎక్కువమందిని చదవనివ్వండి.  ఈ విషయాలు ఎప్పుడుకూడా జనుల మెదళ్ళలో వాటి ముద్ర వేయగల్గడం అసాధ్యమే.  ఉప్పుగనిలో ఏదిపడినా ఉప్పే అయిపోతుంది.  నీవు దక్షిణాది మేధావి వర్గంతో ఎక్కువగా కలుస్తూ ఉంటావు.  వారి విషయం ఒకసారి ఢిల్లీలో వుండే శ్రీరాజగోపాలన్‌తో నేనభిప్రాయపడినట్లు వారు వారివారి మతవిశ్వాసాలను మాత్రమే అమితంగా అభిమానిస్తారు.  నేను నిన్ను శ్రీదత్తాత్రేయరావ్ దినచర్య పుస్తకాన్ని చూడమని వ్రాశాను.  నీవు ప్రతి యొక్కరికి శిక్షణనిచ్చుటకు తగినవాడివి.  అది అన్నివిధాల సరియైనది, సంపూర్ణ శక్తివంతమైనది.  నీ సోదరునిలో కూడా శ్రద్ధ పెరుగుతున్నది.  భగవంతునికి కృతజ్ఞతలు.  భగవదిచ్చ.  ఆయన కూడా ఈ పద్దతి చేపట్టి తన జీవిత సమస్య పరిష్కరించుకొనుగాక.  నావద్ద కూడా "నారద భక్తిసూత్రములు" వుంది.  అది బాగానే వుంది.  నీ అనుభవంలోనికి వచ్చి వివరించిన "ఆకాశపు పైఅర్థభాగము" మొదలైనవి విరాట్‌స్వరూప స్థితికి చెందినవి.  ఎందుకంటే నీవు తాత్కాలికంగా ఇప్పుడున్న స్థితి ఆకాశమండలము లేక బ్రహ్మాండ మండలము.  ఈ ప్రక్రియనంతా అర్జునుడు దర్శించియుండెను.  నీవు వ్యక్తపరచిన దాన్ని బట్టి నీ ఆలోచన సరిఅయినదే.  "ఎక్కడో బంధము విడిపోయినట్లుంది" ఈ మాటను బట్టి చూస్తే నీవు ఈ ప్రపంచానికి బదులు సత్యమూలమునకు అతుకబడినట్లు నిర్ధారించు- కొనవచ్చును.  నీకు పరలోకమునుండి వార్తలందుతున్నవి.  ప్రియ సోదరా! నీవెలాగైనా మనల్ని గురించి మరచిపోవాలి.  అది నిన్నుగురించైనా, నన్నుగురించైనా సరే.  ఏదిఏమైనా యిది ఒక అభివృద్ధిచెందిన దశ.  కానీ సోదరా! నన్ను మరిచిపోవద్దు.  ఎందుకంటే నిన్ను నీవు మరచిపోయేట్లు చేసే పరికరము నేనే.  ఇది గనుక సంపూర్ణమైతే అప్పుడు నీకైనీవే నన్ను మరిచిపోయేట్లు చేసే పరికరమౌతావు.  అప్పుడు మాత్రమే ఏకత్వం సాక్షాత్కరిస్తుంది.  నేనుగనుక అంతిమ సత్యస్థితిని గురించి వ్రాస్తే శాస్త్రజ్ఞులు బహుశా నాపై విరుచుక బడవచ్చు.  అంతిమ హద్దును గురించి వివరించడం చాలాకష్టం.  అయినా ఇంతమాత్రం వ్రాస్తున్నాను.  ఎప్పుడైతే అభ్యాసి తన్నుతాను మరియు భగవంతుణ్ణి కూడా మరిచిపోతాడో అప్పుడతడు ఈ లోకంలోనికి ఏరూపంలోనూ ఇక రాడని నిర్ధారించవచ్చు.  ఆస్థితిలో అతని కన్నివైపులా అదేయై ఆ సముద్రంలో మునిగిపోయుంటాడు.  అంతకుముందు, అతడు తన ఈ ప్రపంచాన్ని ఆవలి ప్రపంచంకోసం అమ్మేసి వుంటాడు.  ప్రస్తుతమతడు ఆ ప్రపంచాన్ని కూడా అమ్మేయగలిగితే ఇకమిగిలేది సత్యతత్త్వమే.

          ప్రియ సోదరా! నీవెందుకు డా. వరదాచారి వల్ల ప్రేరేపితుడవై నన్ను శాస్త్రీయ వివరణలడుగుతున్నావు?  నేనెంత, నా సామర్థ్యమెంత? నేను సామాన్యమైన అవిద్యాపరుణ్ణి.  అటువంటి వాడినైన నన్ను పట్టుకొని భగవంతునికి అర్థమడుగుతున్నావ్.  అతడు కుక్కకైనా కనీసం అర్థం చెప్పగలడు.  మరి నేనో! ఏవిధమైన జ్ఞానము లేనివాణ్ణి.

          కానీ సోదరా! ప్రియుడు తనకు నచ్చిన రీతిలో ప్రేయసిని తనవైపుకు ప్రాకేట్లు చేయగలడు.  అసలు ఆ ప్రాకడం కూడా ప్రియుడే నేర్పుతాడు.  ప్రాకడంలోని సారాన్ని కూడా ప్రేయసి తన ప్రియుని నుండే గ్రహిస్తుంది.  కనుక నేను ఒక ఒరవడిలో నడుపుతున్నాను.  అది గనుక సరైనదైతే నీ బహుమతి నీకందుతుంది, కాక తప్పుడుదైతే అందులోనూ నీతప్పిదమే వుంటుంది.

          ఈ విషయమై నీవు లోతుగా అర్థవంతంగా ఆలోచిస్తే ఎవరి స్మరణలోనైతే భక్తుడు ఉత్తేజితుడై ఆత్రుతకు లోనయ్యాడో అతని నుండే ఈ ప్రాకేవిద్య సంప్రాప్తమయిందని నీకు విశదమౌతుంది.  ఏమైతే అవతరించి వ్యాప్తమయిందో, ఏదైతే దృగ్గోచరమై అనుభవంలోనికొచ్చిందో అదంతా నా అవగాహనతో గమనిస్తే ఒక నీటి బిందువు, పొంగివచ్చిన స్పందనతో తన పరిధిని పెంచుకుంటూ పురోభివృధ్ది చెందుతున్నది.  ఈ వృద్ది పురోగమనాన్ని మన ఋషులు అందుకున్నారు.  వారి ధ్యాసకూడా దీనిపైననే వుండింది.  ఎందుకంటే అది కాలంయొక్క ప్రారంభం (జమానా).  ఇంకా వారిలోకి ఎట్టిసంస్కారాలు ప్రవేశించలేదు.  అది ఉబికి వచ్చిన తక్షణమే వారి ఎఱుకలోనికొచ్చింది.  కానీ తర్వాత చాలా విశాలత్వాన్ని సంతరించుకొన్న ఒక స్థూల పదార్థంపై కొందరి దృష్టి పడింది.  కొందరి దృష్టి పెద్దగా ఉబకని ఆ సన్నని దారం (ధార, ప్రవాహం, సెలయేరు) మీద పడింది.  ఆస్థూల పదార్థం ఏమై వుంటుంది?  అది మనందరి అవసరాలకు కావలసినదే.  కనుక అందులోకి వారు వెళ్ళి, సూక్ష్మమైన వాటిని సున్నిత ద్రష్టలకు వదిలేశారు.  నిజానికా అవసరాలు అగ్ని, జలము, వాయువు.  అవి కాలానుగుణంగా వాటి తీవ్రతకు తగ్గట్టు పనిచేయ నారంభించాయి.  వారు వీటిని గ్రహించి వాటి అంతర్గత స్థితిలో చైతన్యం కలిగించి ఆ స్థూలశక్తి యొక్క ప్రభావం గల చోటునుండి కదిలించగలిగారు.  అలా అగ్ని, వాయువు మొదలైన వాటికి స్పందన కల్గించారు.  వారు దానితో (మూలంతో) సంబంధమేర్పరచుకొని ఆ స్పందనను కలిగించ గలిగారు.  తద్వారా రావలసిన ఫలితం వచ్చింది.  నా (వినయపూర్వకమైన) ఉద్దేశ్యంలో వారికి శక్తి వుండింది.  అందుకే వారి దృక్కులు పంచభూతాలను వెంటనే తాకాయి.  కనుకనే అట్టి మంత్రాలు మొదట వ్రాయబడ్డాయి.  వాటిద్వారా మన కత్యంతావశ్యకమైన, అవసరమైన, మనల్ని మనం సంరక్షించుకొనుటకు తగియున్నవన్నీ పొందాగలిగాము.  ఇవన్నీ మనకు ముఖ్యంగా కావలసినవే.  కాలం గడచిన తర్వాత ఆ పంచభూతాలతో కలిసి స్థూలత్వం చెంది ఆతర్వాత వాటితోనే కాలం గడుపుతూ వుండిపోయాము.  యోచన వాటిపైనే కేంద్రీకృతమై యున్నదన్న సంగతి క్రమేణా ఎఱుకలోనికి వచ్చింది.  తర్వాత వారు ఆధ్యాత్మికమనబడు మూలప్రవాహము (శక్తి)పై లోతుగా యోచించారు.  దాని ఫలితమే ఉపనిషత్తులు.  ఇదే వారి నిజయోచనల ఫలితము.  పరిణామ ప్రక్రియ ఇలా సంరక్షింపబడి కొనసాగిందని, ఇది నిరంతర మానసిక పరిశ్రమ చరిత్రయని నీవు నిర్ధారించకుండా వుండవు.

          పైనతెలిపినదంతా ఒక అవిద్యావంతుని ఉపోధ్ఘాతము మరియు కొమ్మలు, రెమ్మలు వేసిన అతని ఆలోచన.  ఇప్పుడు నేను ప్రధాన విషయమైన "వేదము" నకు వస్తున్నాను.  ఇది విశ్వసృష్టికి పూర్వమున్న స్థితి.  దాని ఆనందమే ఏ దేవుడైన మన కనుగ్రహించేది.  నీవు అది పొందవచ్చు.  కనుక సృష్ట్యాదిన వేదములుద్భవించెననుట పరమ సత్యము.  వాటిని పుస్తక రూపమునకు మార్చివేశారు.  ఇది స్థితులకు దుస్తులు తొడిగినట్లయింది.  అప్పుడేమున్నది? అదే మధనావస్థ.  అణుసృష్టి.  అణు నిర్మాణము మధన ప్రక్రియ ప్రతిఫలమే.  మరో మాటలో చెప్పాలంటే, మధన ప్రక్రియ ప్రతిఫలమైన దానితో ఈ అణువుకు సంబంధమేర్పడి వుంది.  ఇప్పుడు ఫలితమేమైనా ఇది అనేక రూపాలను సంతరించుకొంది. వాని మానసిక స్థిరత్వం మాత్రము వాటి మూలంలోనే వుంది.  అది ఏ స్థితియైననేమి,దాన్ని శాస్త్రీయమే అని తీరాలి.  ప్రాణవాయువు, ఉదజనివాయువు కలిస్తే నీరు ఏర్పడ్డం ఎంత శాస్త్రీయమో ఇది అంతే.  ఎవరు ప్రయోగం చేసినా ఎప్పుడూ ఒకే ఫలితమిస్తే దానినే నేను శాస్త్రమంటాను.  ఫలితమేదైతేనేం, దృష్టి దాని మూలంపైబడితే అది ములంయొక్క జ్ఞానాన్ని వెలువరిస్తుంది.  వేదర్షులు, ఈ ప్రవాహశక్తులను మధించినపుడు వెలువడిన మందస్వరాన్ని గమనించి, ఇది ఎవరి స్వరం? అన్న విషయంపై అన్వేషణ సాగించారు.  నేను ఋగ్వేదపు తొలిపాఠాలలో చదివిన మరియు విన్న దాన్ని బట్టి వారు ఈ శబ్దాన్నే సద్వినియోగపరిచినట్లు తెలుసుకున్నాను.  మరో మాటలో చెప్పాలంటే ఇదే అసలు సత్తాను తెలియచేసే సాధనము.  ఎప్పుడైతే తెలుసుకునే సాధనం లభించిందో అప్పుడే అసలు విషయం బల్పడడం మొదలైంది.  ఇక రెండవ దశ ప్రారంభమైంది.  ఆధ్యాత్మిక నూతనాధ్యాయము తెరువబడింది.  ఆలోచనా గగన విహారం మరింత తీవ్రతరమై మున్ముందుకు సాగింది.  ఎప్పుడైతే సత్యతత్త్వం జాడ శబ్దంద్వారా దొరికిందో ఋషులు మరింత లోతుకు మునిగి అన్వేషణ సాగించడానికి నిర్ణయించారు.  అలా మునిగి వారు ఉద్వేగపు ఆవలి కొసను చేజిక్కించుకొన్నారు.  అంటే "నేను వివిధములుగా వుంటేనేం నేను ఒక్కడినే" (ఏకోహం బహుష్యం) అన్న భావమది.  కానీ యిది సత్యతత్త్వపు కార్యకలాపంలోని నిమ్న (తగ్గు) యోచన.  ఇక యోచన మరింత పైకి లంఘించి వారు పై సూత్ర (దారం) మందుకున్నారు.  వారు ప్రవాహశక్తుల కదలికల వలన ఈ ప్రతిధ్వని ఏర్పడిందని గ్రహించారు.  దీనికావల మరేదో వున్నదనీ గ్రహించారు.  అన్వేషణ ఇంకా కొనసాగించారు.  ఈ "ఏకోహం బహుష్యం" అన్న యోచన చుట్టూగాలించారు.  మరోమాటలో చెప్పాలంటే, మన దృక్పదంలో వున్న సత్యతత్త్వపు స్థూలరూపం మాయమై మరింత అవతలికి దూకి వెళ్ళడం మొదలైంది.  అప్పుడక్కడేముంది.  సందేహాస్పదమైయున్న వివిధత్వపు ఆలోచన ఎంత మాత్రముందో అదంతా ఉబికి వచ్చింది.  తననుతాను అంచనా వేసుకోవడం జరిగింది.  లోతుగా దానిపై యోచన కొనసాగింది.  లోతుగా సాగిన యోచన వలన ఇదంతా కేవలం మనకైమనం గమనిస్తూ వస్తున్న మానవస్వభావం నుండి కలిగిందేనన్న ఆలోచన తట్టింది.  ఎప్పుడైతే అది పూర్తిగా అర్థం చేసుకున్నామో అప్పుడే మన స్వభావం మరియు ఆలోచన ఆ శక్తి ప్రవాహంలో ఈదుతున్నట్లయింది.  అది మరింత ముందుకు వెళ్ళి ఇదంతా మధన ప్రక్రియలో వెలువడిన వెన్నయని అదే సత్యతత్త్వం కాదని తెలిసిపోయింది. ఇప్పుడడుగులు ఇంకా ముందుకు పడ్డాయి.  ఇది పైన తెలిపినట్లు సాధింపబడిన మధ్యస్థానము.  ఇంకా ముందుకు పురోగమిస్తే ఆనందపు సుగంధం అనుభూతమౌతుంది.  ఆలోచన అందులోనే ఐక్యమైవుంటే అనుభూతులెలా కలుగుతాయన్న ప్రశ్న ఇక్కడుత్పన్నమౌతుంది.  అదే వెన్న మన ఆలోచనతో గ్రహించిన పరమాణువుల ఘనస్వరూపమని తెలుసుకోవడమే దీనికి ఏకైక సాధనము.  ఆనందమయ స్థితి తప్పక సిద్ధిస్తుంది.  మనం కూడా అక్కడున్నాం.  అనుభూతి చెందాం.  దీని కోసమే మనం ప్రయత్నిస్తూ వచ్చాం అన్న విషయాన్ని కూడా నిర్ధారించాం.  కొందరు అక్కడే నిలిచిపోయారు.   మిగిలినవారు ఈ సచ్చిదానంద స్థితిని కూడా దాటుకొని మున్ముందుకెళ్ళారు.  అలా పురోగమిస్తూ వారు భిన్నత్వరహిత స్థితిలో మునిగిపోయి అక్కడే వుండిపోయారు.   వేదములు దీని తర్వాత ఇక పలుక మాటలు లేక దీన్ని వివరించ శక్యముగాని (అనిర్వచనీయము) దని తెలిపి "నేతి" "నేతి" (ఇంతేకాదు ఇంతేకాదు) అని ప్రకటించాయి.  ఇప్పుడు తిరిగి అదే శాస్త్రీయమైన ప్రశ్న ఉత్పన్నమౌతుంది.  కొంతవరకు నేను సమాధానమిచ్చినానే అనుకుంటున్నాను.  నీవు కనుక ఇంకా అవసరమనుకుంటే, మనం దారిలో వున్నాం, సత్యతత్త్వంతో స్థిర సంబంధ మేర్పరచుకునే యత్నం చేశాం.  ఇప్పుడు నిర్ధారణగా మన దృష్టిపథంలో సత్యతత్త్వమే వుందని చెప్పగలం.  ఇంకా చెప్పాలంటే మనం అదే అయిపోయాం.  మనం సత్యతత్త్వపు జ్ఞానానికి ఆధారభూతంగా వున్నాం, అంతేకాదు జ్ఞానమే మనమైపోయాం.  ఇప్పుడిది శాస్త్రీయమో కాదో నీకైనీవే నిర్ధారించు.  సోదరా! ఇంతకు మించి వ్రాయగలిగే పటుత్వం (సత్తువ, శక్తి) నాకు లేవనుకుంటున్నాను.  ఇప్పుడు నేను వేదం సంపూర్తిగా వ్రాసినా మంత్రాలలో నిండియున్న శబ్ధములను సహితం లిఖించినా డా. వరదాచారిగారు సూచించినట్లు మనం అందులో లీనమైతే అవి గణిత సూత్రములకన్నా సత్యతములై అదే సత్యము మనముందు దృగ్గోచరమౌతుంది.  ఎవరు ఆదారిన వెళ్ళినా అదే వారికి దర్శనమిస్తుంది.  ఇప్పుడు నీకు అందులో అతిశయోక్తులకు సహితం ఆస్కారముండి అందులో కవిత్వాంశమున్నట్లు అనిపించవచ్చు.  నిజమే సోదరా! ఇది సత్యతత్త్వాన్ని చూపించడానికి దాని పరిసరాలను నిర్మింపజేయడానికి వలసిన యోచనా శక్తికి తోడ్పడుతుంది.  నేను కూడా తరచూ ఈ విధానంలో పనిని సాధించటానికి ఒప్పుదల కనబరుస్తాను.  ఉదాహరణకొక ద్విపద వ్రాస్తాను.  "ప్రియుడు బలహీనుడు, ప్రేయసి సున్నితమైనది.  ఆ తెరను మరెవరైనా పైకి లాగివేతురుగాక".  దీని అర్థంపై లోతుగా ఆలోచిస్తే ప్రేయసి ప్రియులిరువురూ చేతలుడిగి- యున్నారని నిరూపణయ్యింది.  అదే సత్యస్థితి.  సత్యమంటే అట్టిస్థితే.  అది అలా వ్యక్తీకరింపబడింది.  పిల్లలకు ఆశీస్సులు. (పుట 90)

          మనమెప్పుడు ప్రస్తుతమున్న సూక్ష్మస్థాయిని వీడి ముందుకు కదిలి అవతలి బిందువునకు ప్రయాణిస్తామో అప్పుడు భారంగా ఉన్నట్లనిపిస్తుంది.  పూర్వపు స్థాయి యొక్క ప్రభావం తొలగిపోయి ప్రస్తుత సూక్ష్మస్థితిలో కుదురుకునేంత వరకు ఈ భారం అలానే వుంటుంది.  బిందువు నుండి బిందువుకు దాటుకుంటూ ముందుకూ వెళుతున్నప్పుడల్లా యీ విధంగానే వుంటుంది.  మనమిక చేరవలసిన బిందువులన్నీ ముగిసిపోయి ఇక ముందేమీ లేనట్టి స్థితిలో యిక భారమన్న మాటే వుండదు.  ఇదంతా నీ పురోగతిని సూచిస్తున్నదని యిప్పటికి నీకు అర్థమై ఉంటుంది. (పుట 100)

          దీక్ష గైకొన్న సభ్యుల అసభ్య ప్రవర్తన వల్ల నాకు కోపమొస్తుంది.  నేను సహించలేక పోతున్నాను.  కారణం వారు ముఖ్యంగా నా ఆధ్యాత్మిక సంతానము.  వారు గురువు యొక్క సంపాదనకు వారసులు.  ముఖ్యంగా యితరుల నడవడిని తీర్చిదిద్దే పనికి నియమింపబడిన సాధకుల ప్రవర్తన సరిలేకపోవడం నాకు ఆగ్రహం కలిగిస్తుంది.  ఒక నానుడి యున్నది అదేమంటే! "కాబాలోనే సుఖసిద్ధాంతం (దైవం కాక ఆనందమే పరమావధిగా గల ఒక సిద్ధాంతం - కుఫ్రు) pరుడు పోసుకుంటే యింక ఇస్లాంయెలా మనగలుగుతుంది?" (పుట 116)

         "ప్రేమ ఉన్నప్పుడు చీవాట్లు సహితం సమ్మతమే".  ప్రియసోదరా! ఆ చీవాట్లలో కూడా ఒక చిత్రమైన తియ్యదనమున్నది.  ఆ చీవాట్లు ప్రేమ మత్తులో నుండి వెలువడుతాయి.  అట్టివి యెప్పుడూ చులకన లేక నీతిలేని చవకబారువిగా మాత్రం వుండవు.  శ్రీ కృష్ణ ప్రేమలో సూరదాసు చెప్పిన ఒక కవితను మీకు వ్రాస్తున్నాను గమనించండి.

 "బాహన్ చుడాయే జాత్ హో నిర్బల్ జాన్ మోహే

హృదయ్ సే జబ్ జావోగే మర్ద్ జానేయో తోహి"

          "నేను బలహీనుడిని గదా! నా చెయ్యి విడిపించుకొని పోతున్నావు. నీవు నిజంగా మగవాడివే అయితే నా హృదయం నుండి తప్పించుకుపో చూద్దాం!"

          సూరదాసు గుడ్డివాడు కావడం వల్ల బావిలోకి జారి పడిపోయాడు.  అప్పుడు శ్రీకృష్ణపరమాత్మ ఆయన్ను తన చేతితో పట్టి బయటికి తీశాడు. సూరదాసు కృష్ణుని పట్టుకొనబోయాడు.  కానీ స్వామి తప్పించుకొన్నాడు.  అప్పుడు సూరదాసు అన్న మాటలివి. (పుట 121)

         ఈసారి నేను అధిక ప్రయోజనం పొందలేక పోయానని నీ వనుకోవడం చూస్తే నీలో ఆధ్యాత్మికతపై మిక్కుటమైన తృష్ణ ఉత్పన్నమైనదని తెలియుచున్నది.  నీవు యేవిధంగాను రూపంపై ధ్యానంచేయడం కుదరడం లేదంటే, ఒక పని చేయి, రూపం నీ యెదురుగా నున్నదని సాధారణమైన భావన చేయి.  అది కూడా వీలుపడటం లేదంటే యిక ధ్యాన విధానం దానికై అదే నీకు తెలియజేయబడుతుంది. (పుట 129)

          సోదరా! నీవు వ్రాసిన ఒక వాక్యముతో నాకు చాలా సంతోషమైనది అది.  "ఒక్కోసారి యీ ప్రశాంతత చాలాకాలం కొనసాగి తర్వాత అప్రియమైనదిగాను విసుగు జనింపజేయునది మరియు బద్ధకంగాను మారిపోతున్నది.  అప్పుడు నేను దాన్ని నా కిష్టంలేకపోయినా వదిలించుకొంటున్నాను."  ఈ వాక్యాన్నిబట్టి చూస్తే ప్రశాంతత వేరొక మలుపు తిరిగినదని అర్థమైనది. అదే సత్యతత్త్వము యొక్క ఒక వైపు స్వరూపము. (పుట 131)

          నీకు సూక్ష్మస్థితి అనుభవానికి వచ్చినందుకు చాలా సంతోషము.  ఇది పరబ్రహ్మాండమండల స్థాయి యొక్క లక్షణము.  ఇది చాలాకాల ముండునది కాదని నీవు తలంచిన విషయము వాస్తవము.  ఎప్పుడూ సన్యాసి (దర్వేష్) తిరుగుతూ ఉండడమే మంచిది.  నీవెక్కడా నిలబడటానికి వీలులేదు.  నీవు కడకు స్థిరపడే స్థితికి రావడానికి ముందుగానే ఆనందం నిన్ను వదలి వెళ్ళిపోతుంది.  ఆ స్థితినియేమని పిలవాలి?  అజ్ఞానమన్నామా అంటే అదీ వదలిపోయింది.  ఒక్క పదం మాత్రం ఆస్థితిని తేటతెల్లం జేస్తుందనుకుంటాను.  ఆ పదమే "పరిపూర్ణమైనఅజ్ఞానం". (పుట 132,133)

          నీవు నన్ను జబ్బులు నయంచేసే విధానం గురించి అడిగావు.  ఆధ్యాత్మిక ప్రయోజనం జేకూర్చే విధానం వంటిదే యిది.  అంటే రోగాన్ని తొలగించడం కూడా స్థౌల్యము, జడత్వము తొలగించినట్లే తొలగించాలి.  ప్రాణాహుతీ ప్రసారం కూడ మామూలుగానే చేయాలి.  లేదంటే ఫలానా జబ్బు వదలిపోతున్నదన్న భావన మాత్రం కలిగి వుండాలి.  నేను నీకు పద్ధతి తెలియజేశాను.  ఏదో ప్రత్యేకమైన అరుదైన సందర్భములలో తప్ప మిగతా సమయములలో ఆ పని చేయుటకు యెంతోమంది వైద్యులున్నారు.  కనుక దీనితో నీకు అట్టే పనిలేదు.  ఇప్పుడు నీకున్న పని తక్కువేమీ కాదు.  ఇంకా నీకు పని భారము పెరిగే అవకాశమున్నది.  నీవు క్రీస్తు (మసీహా) కావాలని కోరుకోవడం నిజంగా సంతోషించదగ్గదే.  కానీ అలా కావడానికి ముందు, నీలోనీవు బాధ నుత్పన్నం చేసుకొనవలసి వుంది. (పుట 134)

          ఇవి శ్రీకృష్ణపరమాత్మ మాటలు - "నా వారసత్వం సహజమార్గంతో కొనసాగుచున్నది.  అందరికి యిక్కడనుండే వెలుగు అందుతుంది."  నీ దగ్గర యేదీ రహస్యంగా దాచలేదు.  కార్యక్రమమునకు సంబంధించిన సూచనలన్నీ శ్రీకృష్ణపరమాత్మ నుండే అందుతున్నాయి.  వాటిని రోజువారీగా నా దినచర్య పుస్తకంలో యితర విషయాలతో పాటు వ్రాసుకొంటున్నాను.  ఆ దినచర్యపుస్తకం ౧౪౦౦ పుటలకు చేరింది, "నా దివ్యదృష్టి" అను పాఠమున రచించినదంతా యీ పుస్తకంలోనిదే. ఆయన మూలపురుషుడు గనుక ఆయన జయంతినాడు ఉపవాసం ఉండటం జరుగుతున్నది.  దీనిలో యేవిధమైన మతపర విషయములు చొప్పింపబడలేదు.  శ్రీకృష్ణపరమాత్మ జన్మదినం, లాలాజీగారి జన్మదినం నిరంతరంగా జరుపుకోవాలన్నది మనకు పైనుండి వచ్చిన ఆదేశము. ( ఈ విషయమునకు ముందు ముసల్మానుల బంధం మహమ్మదు వారితో తొలగించబడినట్లు, మరియు అనేక హిందూ సంస్థలలో కూడా జీవంలేనట్లు, అట్లే కబీరు, రామకృష్ణపరమహంస, చైతన్యమహాప్రభు, గురునానాక్ మరియు దావు గారు, వారివారి సొంత సంస్థల అనుబంధాలను త్రెంచేసుకున్నట్లు ఉత్తరంలో వ్రాయబడి యున్నది). (పుట 137,138)

          మనసంస్థలోని ప్రతి ప్రశిక్షకుడు ఒక విధమగు నేర్పును వృద్ధిచేసుకొంటాడు.  అదెలా వుంటుందంటే ఒక అభ్యాసి నీనుండి ప్రాణాహుతి పొందాలని కోరుకుంటాడు, కానీ నీవప్పుడు నిద్రపోతూ వుండొచ్చు.  అయినప్పటికి నీవు నీకు తెలియకుండానే సహజమార్గంగా ప్రాణాహుతి ప్రసారం చేస్తావు. అట్టి నైపుణ్యము మీలో వున్నది. (పుట 141)

          ఒకసారి పండిట్ రామ్‌ప్రసాద్‌చౌబేగారు తాను విజ్ఞానవంతుడను, జ్ఞానినని విర్రవీగి అ రంగములలో నన్ను ఓడించానని అహంకరించి మాట్లాడుతూ వచ్చాడు.  ఈ విధమైన గర్వం అతనిలో పెరగడం అతనికే మంచిది కాదని నాకనిపించింది.  కనుక నేను వెనక్కు మరలి నా పూర్వస్థితిలోనికి వెళ్ళి అతనికి జవాబు వ్రాశాను.  నేను వ్రాసిన విషయం వింటే నీవు నవ్వుకోవచ్చును.  నేనాతనికి వ్రాసిన జవాబులోని విషయమేమంటే "నేనే శ్రీరాముని, శ్రీకృష్ణుని యీలోకానికి పంపించాను.  ఋషులకు శ్రుతులను నేనే అందించాను. వగైరా, వగైరా ..... యిప్పుడు నీకర్థమైనదా! నీవెందుకు తరచూ తమస్సులో మునిగి యున్నావో? అర్థమైందనుకుంటాను."  ఇదీ నేను వ్రాసిన జవాబులోని   విషయం. (పుట 161)

          నీవు ప్రాణాహుతి నిస్తున్నప్పుడు నేనిస్తున్నానని భావించడం మరిచిపోయానంటున్నావు.  అది చింతించాల్సిన విషయమే కాదు.  ప్రాణాహుతిని నేనుగాని, నీవుగాని ప్రసారం చేయటం లేదు.  అది చేసేవాడు మరొకడున్నాడు.  ధ్యానం చేయిస్తున్నానన్న యెఱుకలో వుంటే ప్రాణాహుతి ప్రసారం చేయి.  అందువల్ల ప్రాణాహుతి ఉదృతంగా ప్రవహిస్తుంది.  ప్రతి ఒక్కరూ ఒకరకమైన మత్తులో ప్రసారం సాగినంతకాలం ఉంటారు.  కారణం దైవకృప పైనుండి జాలువారుతుంది.  నాపై ప్రసరిస్తున్న కృపను నేను బలవంతంగా నిలుపుదల చేసి, అది భరింపరానిదిగ కాకుండా ధ్యానంచేయించే సమయంలో జాగ్రత్త వహిస్తూంటాను. (పుట 165)

          మీరు నన్ను సర్వశక్తిమంతుడంటున్నారు. కానీ నేనేమో కాళ్ళుచేతులు గూడా కదిలించడానికి యిచ్చగించని శక్తిహీనునిగా తయారయ్యాను.  కనుక మీరు నన్ను సర్వవ్యాపినన్నారు.  కారణం శక్తికి సంబంధించిన భావనే లేనప్పుడు యిక వున్నది శక్తిరహితస్థితే.  అయితే అదే శక్తికి (బలానికి) ఆధారశిల. (పుట 179)

          నేను కూడా కృష్ణమూర్తిగారి పుస్తకాల ప్రశస్తిని గూర్చి విన్నాను.  ఇదంతా చాలా కాలం నిలిచేది కాదు.  అతని జీవితకాలానంతరం అది అంతమౌతుంది.  ఇదంతా పిశాచాల నుండి మార్గదర్శకత్వం పొందడమే.  అతని వల్లనయ్యే పని వాస్తవానికిదే.  ప్రామాణిక సూత్రములకు విరుద్ధమైనవిగా ఉన్న ఆలోచనలనాయన యేవిధంగా ప్రతిపాదిస్తున్నారోమరి.  అతని ఆలోచననే (ప్రామాణికంగా) అంగీకరించిన పక్షంలో అతడు చెప్పినట్లే యితరుల బలహీనతలను తమ ప్రయోజనానికి వాడుకొనే విధానం ప్రవేశిస్తుందని నేను భీతిల్లుతున్నాను. (పుట 189)

          నీవు ప్రాపంచిక వ్యధలు హృదయాన్ని బరువెక్కిస్తున్నాయని వ్రాశావు.  ఇది, హృదయం సున్నితపుష్పసుగంధాన్ని కూడా భరింపలేనంతటి శుద్ధస్థితికి చేరుకున్నదనడానికి నిదర్శనం.  అయినప్పటికి వ్యధలు గాలికి కొట్టుకొని పోవుచున్నట్లుండి హృదయానుభవమునకు రాకుండా  వుండవలెను. (పుట 204)

          ప్రియ సోదరా! నేను నిరంతరం మిమ్ము ఆధ్యాత్మికస్థితులను దాటించు పనిలో ఆతృతతో ఉన్నాను.  ఇది మీ శ్రద్ధాఫలితమేయైయున్నది.  ఆత్మార్పణవల్ల యిది సంప్రాప్తమైనది.  ఈ ఆతృత దారిని సుగమము చేయడానికి కూడా ఉపకరిస్తుంది.  ఇచ్చేవాడు మరొకరున్నారు.  ఈ దాసుడు మాత్రము సేవయందే నియమితుడై యున్నాడు. (పుట 205)

          బాబూ శివమోహన్‌లాల్ నా పేరున ఒక తంతివార్త (టెలిగ్రాం) తిరుపతికి పంపారు. అది నాకు అలహాబాద్‌లో వుండగా అందినది.  అందులో తనలో పరిణామాన్ని వాంఛించారు.  క్షమించాలి నేను తంతి ద్వారా పరిణామాన్ని తీసుకరాలేను.  కానీ అతడు ఆధ్యాత్మిక మార్గంలో భగవంతుని పొందాలనే ఆతృత దీని ద్వారా నిశ్చయంగా తెలుస్తున్నది.  ఇది మంచిదే. (పుట 205)

         ప్రియసోదరా! నేనేం చేయగలను? ఈ దీనుని శల్యమూలంలో సారము లేదు.  అందుకేనేమో నేను జనులకు నచ్చడం లేదు.  నా ముఖ ప్రతిబింబాన్ని దర్పణములో చూచుకొనైనా నేను సంతృప్తి పడాలనుకొన్నాను.  కానీ నా రూపం అద్దంలో కనిపించదేమోనని నాకు భయంగా వుంది.   అయినప్పటికి నాకు నిశ్చయంగా తెలుసు, నా రూపం కనిపించకపోయినా అక్కడేదో వుండనే వుంది.  నిజమే అక్కడేదో నిశ్చయంగా వుండాల్సిందే, అయితే లీనమైన తర్వాత మాత్రమే దాన్ని పొందడం సాధ్యపడుతుంది. (పుట 205)

          ఇక్కడ నుండి నేను నీకు ప్రాణాహుతి నిచ్చుచున్నప్పుడు నీవు కేంద్రమండలం ప్రవేశించావని చూచాయగా తెలియవచ్చింది.  1960 ఫిబ్రవరి 5 రాత్రి అన్ని స్థాయిలను పటాపంచలు గావించి వాస్తవంగా నీవు అందులో ప్రవేశించితివి.  ఇది నిజంగా నీ సామర్థ్యమే.  అందుకు నిన్ను అభినందిస్తున్నాను.  అయితే యిప్పుడు నీ బాధ్యత పెరిగింది.  దాన్ని నిర్వర్తించడమెలాగో నీకిప్పటికే బాగా తెలుసు. (పుట 207)

          మన మహాత్ములు, సన్యాసులు భారతదేశ ఆర్థిక పరిస్థితినేమాత్రం ఖాతరు చేయకుండా పీపాలకొద్ది నెయ్యిని యజ్ఞపు మంటల్లో దహించేశారు.  రెండు, మూడు నెలలపాటు రోజులోని 24 గంటలూ యజ్ఞం నిరంతరాయంగా మండుతూనే వుంటుంది.  ఏ మాహాత్ముడు తన ఘనతను పెంచుకోదలుస్తాడో, ఆయన యిలా దేశసంపదను యజ్ఞంలో కాల్చేస్తూ వుంటాడు.  ప్రతి సంవత్సరం యిట్టి వార్తలు వస్తూనే వుంటాయి.  మరి దక్షిణభారత పరిస్థితేమో నాకు తెలియదు.  ఈ యజ్ఞాలు చేయని వారు కుండలినీ మాయలో పడేస్తుంటారు.  ఇన్ని చేసినా మన మహాత్ములలో యే ఒక్కరు కూడా వ్యక్తి హృదయాన్ని వెలిగించలేకపోయారు.  కానీ వారి పిల్లలకుపయోగపడే ద్రవ్యాలు మాత్రం విపరీతంగా కాల్చిపారేశారు.  ఆ ద్రవ్యాలు నిజంగా పిల్లలకు సరైన గుండె మరియు మెదడు యేర్పడటానికి ఉపయోగపడి వుండేవి.  అసలు ప్రాణాన్ని ఆహుతి యివ్వడం ద్వారా మన సంస్థ కనీసం ఒక్కరి హృదయంలోనైనా అగ్ని (వెలుగు) రగిలించగలిగితే అది వెయ్యి యజ్ఞాల ఫలితం కంటే యెక్కువే.  దీనిపై నీవు లోతుగా ఆలోచించి చూడు.  నీవే యెందరి హృదయాలలోనో ఈ అగ్నిని ప్రజ్వరిల్లజేసినట్లు కనుగొందువు.  అంతేగాక యింకా యెందరి హృదయాలనో ప్రభావితం చేయనున్నావు. (పుట 209)

          పిచ్చిపట్టిన లేక అవధూతగా మారిన స్వామి చెంతకు వెళితే అతడు తన దరిచేరిన వారిని తనలాగా మార్చేస్తాడు.  అతడు ఒక్క సంఘవ్యతిరేకమైన లేక కౄరకృత్యము చేసి ఉండకపోవచ్చు కానీ అతని వలె కావడం సరికాదు కనుక ఆధ్యాత్మిక సాధన మొదలుపెట్టిన క్రొత్త సాధకులు అట్టి అవధూతల నుండి తమ్ముతాము రక్షించుకొన వలసి యున్నది.  (పుట 213)

          దక్షిణ భారతములోని అభ్యాసులకు ౨౪ గంటలు నాకు తెలియకుండా కూడా ప్రాణాహుతి ప్రసారం జరిగేటట్లు నాస్థితి రూపుదిద్దుకొన్నది.  కనుక దాదాపు అందరూ నానుండి దివ్యకృపాధారను పొందుతున్నారనవచ్చును.  అయినప్పటికిని, నా వైపునకు వాని దృష్టి మరల్చని వాడు ఫలితాన్ని అంతగా పొందలేడు. (పుట 223)

          ద్వైత, అద్వైత విషయములపైన, వాటిపై ఉత్పన్నమైన ప్రశ్నల మీద చర్చలు జరిగి జరిగి జనుల మనస్సులలో గందరగోళము రేపినవి.  జనులు రొట్టె యొక్క రుచిని, తినడం ద్వారా తెలుసుకోగలరు గానీ, రొట్టెను గురించి అనుకూల, ప్రతికూల వాదనల వల్ల దాని రుచి తెలియదు.  ఆలోచించి నేనూ ఒకటి, రెండు మాటలు యీ విషయమై వ్రాయాలనుకొన్నాను.  వాస్తవం చెప్పాలంటే ప్రియసోదరా! అది ద్వైతమూ కాదు, అద్వైతమూ కాదు.  అది యేదైయున్నదో అదే. (పుట 228,229)

          ఒకటి మాత్రం సంపూర్ణంగా ఒప్పుకోవలసిందే.  అదేమంటే మనిషి యెప్పుడూ దేవుడు కాలేడు.  కానీ మనిషి దైవ వ్యతిరేకస్థితిని మాత్రం తొలగించుకోవలసిందే కదా!  ఈ విధమైన దైవవ్యతిరేకస్థితిని నిర్మూలించుకోవడమంటే అద్వైతమే ననుకోవచ్చు గదా!  మనం యీ ద్వైతాద్వైత భావాలు రెండూ వదిలేస్తే, కనీసం యీ వైరుద్య భావనలు, నిర్వచనముల చిక్కులలో పడిపోకుండా ఉంటాము. (పుట 228,229)

          నీవొక అద్భుతమైన వాక్యము వ్రాశావు.  నా సమక్షంలో వుంటూనే నా దర్శనం కోసం పరితపిస్తున్నావని.  కస్తూరి కూడా యిలానే వ్రాసింది.  సత్యతత్త్వ సామ్రాజ్యమున మీరు మహోన్నతముగా ముందుకు సాగుటను సూచిస్తున్నది.  ఒక ఉర్దూ ద్విపద యీ విధంగా సాగింది.

 "రహే తాలాబ్ మే ఐసే ఖుద్ రఫతా హో రహే హై

మంజిల్‌కో హమ్ పహుంచాకర్ మంజిల్‌కొ డూండ్‌తే హై"

          "వెతికే దారిలో నేను పూర్తిగా మునిగిపోయి, మరపులో బడిపోయి, గమ్యం చేరిపోయి అక్కడే వుంటూ కూడా గమ్యాన్వేషణ కొనసాగిస్తూనే వున్నా".

          ఇతరుల కష్టాల బాధ నేనే సహించడానికి సంసిద్ధుడనౌతూ వున్నట్లు ఒక భావన కలిగింది.  కానీ ఇది వాస్తవానికి సరికాదు, యెందుకంటే యే ఒక్కరూ నేను ప్రస్తుతమున్న స్థితి ననుభవించటానికి సిద్ధంగా లేరు (వారి కష్టాలు బాబూజీ తీసుకొంటే వారు బాబూజీ స్థితికొస్తారు.  అది భరించడం వాళ్ళవల్ల కాదని దీనర్థమై వుండొచ్చును). (పుట 243)

          సాక్షాత్కారం పొందటం మొదలుకావడానికి శ్రద్ధయే మూలాధారము.  మతపరమైన యోచన, శ్రద్ధ కూడా జీవితానికి అవసరమని వేదాంతం కూడా చెబుతున్నదని భారతీయ తత్త్వశాస్త్ర పరిచయం పుట ౪౧౯లో ఉటంకించబడినది.  నేను శ్రద్ధను గూర్చి "సత్యోదయం"లో కూడా వివరించి యున్నాను.  ఒకసారి యేర్పడితే యిక విడిపోయే ప్రసక్తేలేని బంధం శ్రద్ధ.  శ్రద్ధను వృద్ధిజేసుకొనని అభ్యాసి యెన్నటికీ పురోగమించ లేడు. (పుట 253)

          భూతపూర్‌కు చెందిన రామచంద్రారావు సాయిబాబా వద్దకు వెళ్ళారని విన్నాను.  అందులో తప్పుగానీ, నాకెటువంటి అభ్యంతరంగానీ లేవు.  దృఢమనుస్కులుగానట్టి సంశయాత్ములు తొందరగా ప్రాపంచికవస్తువిషయాల వైపుకు జారుకుంటారు.  బహుఃశా ఆయన అక్కడికి వెళ్ళడానికి కారణం ఆయనకు సంతానం లేదు.  ఈ విషయం ఒకసారి నాతో కూడా ఆయన చెప్పారు.  ఆయన కోరిక తీరాలంటే ఆయన భార్య ఆమె గర్భంపై ధ్యానం చేస్తే తీరుతుంది.  సాయం సమయాలలో ఆమె తన గర్భంలోని దోషాలు పొగరూపంలో బయటకి వెళ్ళిపోతున్నట్లు భావించి ధ్యానం చేసుకోవాలి. ఇది చేసేటప్పుడు ఆమె గమ్యం సంతానం కలగాలన్న అంశంపై నిలపాలి.  ఈ విషయం నీవు నీ తరపున నీకిష్టమైతే ఆయనకు సూచించవచ్చు.  కానీ ఆధ్యాత్మికతకిది యేమాత్రం సంబంధం లేనిది.  వారి కోరిక నెరవేరిన తర్వాత యిట్టి వారిని ఆధ్యాత్మికపథమునందుంచుట నాకు చాలా కష్టమైన పని.  నేను చెబుతున్న యీ విషయము చాలాసార్లు పరీక్షించి నిగ్గుదేల్చితిని.  కోరిక నెరవేరిన తర్వాత వారు కనీసము ధన్యవాదములు చెప్పుటకు కూడా మనవైపు తిరిగి చూడరు.  నేను గౌరవము కొఱకు ప్రాకులాడను.  కానీ మర్యాదపూర్వకమైన వ్యవహారమును మెచ్చుకొందును. (పుట 255)

          నీవు కాంతి వలయాలలోని మొదటి వలయం దాటడానికి ప్రయత్నిస్తున్నావు.  కానీ నీ వల్ల కావడం లేదు.  అక్కడ నిన్ను నీవెందుకు పైకి తీసుకరాలేక పోతున్నానో తెలియడం లేదు.  విషయంపై లోతుగా అధ్యయనం చేసిన తర్వాత నాకర్థమైనదేమంటే అక్కడ యిప్పుడు నీకున్న శక్తితో నీకైనీవే పైకి రావాలి, లేకపోతే తగిన శక్తి సామర్థ్యాన్ని పెంచుకోవాలి.  చాలా శ్రద్ధ చూపించాల్సిన విషయాలు మధ్యలో అనేకం ఉత్పన్నమతూ వుంటాయి.  ఆ తర్వాతే నీవు పురోగమిస్తావు. (పుట 256)

          ప్రభువు కృపావిశేషము వల్ల కాంతి వలయాలలోని మొదటి వలయానికి 1961 ఆగష్టు రాత్రి ౧౧.౩౦కు చేర్చాను. (పుట 258)

          మీరొక ప్రశ్న అడిగారు.  ప్రాణాహుతి ప్రసారం చేసేటప్పుడు ప్రశిక్షకుడు గురువు పాత్ర పోషిస్తే అది యెంత వరకు ప్రతిభావంతంగా వుంటుంది అన్నారు?  చాలా ప్రతిభావంతంగా వుంటుందని నిశ్చయంగా చెబుతున్నాను.  గురువు గారి పాత్ర పోషించడమంటే రాఘవేంద్రరావు కాదు, గురువుగారే పనిచేస్తున్నారని దానర్థం.  విలోమ సూత్రాన్నిబట్టి గమనిస్తే యిది నిజమని తేలుతుంది.  ప్రభువు దాసుడుగా, దాసుడు ప్రభువుగా మారిపోతారు.  అంటే యిద్దరూ తమతమ స్థానాలను కోల్పోతారు.  ఆతర్వాతేమౌతుందో తెలియదు.  ప్రార్థన ద్వారా కూడా ఈ ఫలితాన్ని పొందవచ్చు.  ప్రార్థనా విధానం సులభం, యెందుకంటే ప్రాణాహుతి ప్రసారాన్ని మీరు నియంత్రించలేరు.  ఫలితమొకటే కాబట్టి సోదరా! నిన్ను నీవు కార్యోన్ముఖుని గావించుకో.  ఆలోచనల ఒత్తిడికి నీ మనస్సును గురిచేయకు.  అలాచేస్తే కలతకు లోనౌతావు.  తేలికైన జ్ఆగరుకతే అమిత ప్రతిభావంతమైనది.  శ్రామికుల వలె ఉపయోగించదగిన గుండె, మెదడు మనకు భగవంతుడియ్యలేదు.   ఒక రాజరిక వ్యవస్థను కూకటి వేళ్ళతో పెగలించవలసి వచ్చినప్పుడో లేక ఒక ఖండాన్ని విధ్వంసం చేయవలసి వచ్చినప్పుడో, అది కూడా భాగవదాజ్ఞానుసారం తీవ్రమైన ప్రయత్నం హృదయం ద్వారా చేయవలసిన అవసరమేర్పడ వచ్చును. (పుట 262,263)

          నేను నా ఆరోగ్యమును అనారోగ్యమునకు కానుకగా యిచ్చేశాను.  ఇప్పుడు నేను నా బిడ్డలు (ఆధ్యాత్మిక సంతానం) ఆరోగ్యంగా వుండాలని కోరుకుంటున్నాను.  తద్వారా నా మనస్సు ఉల్లాసంగా వుండాలనుకుంటున్నాను. (పుట 267)

          సోదరా! అద్భుతములను నేనెక్కడ నుండి తేగలను.  నా మనస్సు వాటిపై ఎప్పుడూ కేంద్రీకరించలేదు.  మా గురువుగారు నేను అద్భుతాలు చేయగలనని చెప్పారు.  కనుక ప్రజలు వాంఛించినపుడు కొన్ని అద్భుతాలు జరుగుతాయి.  మా గురువాక్యము మీద నాకు ప్రగాఢ విశ్వాసమున్నది.  అయినా నా ఆలోచన వాటి వైపు మరలలేదు.  ఇక రెండవ విషయమేమంటే, బోధ వల్లనే ప్రజలు యెప్పుడూ ఆకర్షితులౌతారు.  జీసస్‌క్రీస్తు తన జీవితమంతా అద్భుతాలు ప్రదర్శించారు, కానీ ఒక డజను మంది శిష్యులనే కూర్చుకోగలిగారు.  అందులోను ఒకడు ఆయన శిలువ వేయబడటానికి కారకుడై అవిశ్వాసి అయ్యాడు.  ఆయన మరణానంతరం ఆయన బోధలు ప్రపంచాన్నంతటిని ఆకర్షించాయి.  హిందువులు సముద్రాన్ని దాటివెళ్ళడం మతపరమైన దోషముగా ఆ రోజుల్లో తలచేవారు.  ఇది కూడా క్రీస్తుకు సహాయపడింది.

          మీకు చెప్పాలనుకున్న మరోవిషయ మేమంటే, మా గురుదేవుల కృపతో నేను చేయగలుగుతున్న అద్భుతములు మరెవ్వరూ చేయ్యలేరు.  చూడగలిగిన వారికి అవి అర్థమౌతాయి.  సోదరా! నేను ప్రకృతి కార్యనిర్వహణమునకే నిబంధించ బడ్డాను.  ఒకవేళ సత్యసాయిబాబా బోధలు ప్రకృతి కార్యమునకు ఆటంకము లైనట్లయిన అతని అద్భుత ప్రదర్శనాశక్తి మూడు నిముషములలో నిలిచిపోక తప్పదని నమ్ముము. ఇది చాలా సులభమైన పని. నీవైనా ఒక లిప్త కాలములో దీన్ని చేయవచ్చును.  నేను ఆయన్ను చూడాలన్న కుతూహలంతో ఉన్నాను.  నేను ప్రయాణించే దారిలోని యే స్టేషనుకు పుట్టపర్తి దగ్గరో కనుక్కోవాలి.  సరే యేదైనా యీ విషయం కాలానికే వదిలేద్దాం. (పుట 276)

          ఇక్కడ మహాత్ములని చెప్పబడే వారు గ్రహశాంతి కొఱకు యజ్ఞయాగాదులు చేస్తున్నారు.  వారు గ్రహాలను శాంతింపజేయడం కంటే వాటి దుష్ప్రభావాలను మన వైపుకు మరలిస్తున్నారని నా భావన ........ ఇక్కడి మాహాత్ములు ఉన్నతులు కావాలంటే మొదట చేసేపని 24 గంటలూ యజ్ఞం.  ఇది కేవలం విద్యాగంధం లేకపోవడం వల్లనే జరుగుచున్నది. (పుట 283)

          గీతలోని 7వ అధ్యాయం 11వ శ్లోకంలో కృష్ణభగవానుడు ధర్మవిరుద్ధము కాని కామవాంఛ, మోహాన్ని నేనే అని బోధించారు కదా! మోహమెలా ధర్మమౌతుంది? ఇది ధర్మ విరుద్ధమెలా కాకుండా పోతుంది? అని నన్ను ప్రశ్నించారు. దీన్ని వివరిస్తూ వ్యాఖ్యాతలు, కామవాంఛ, మోహము లేక ఆకర్షణ యివన్నీ తమ భార్యల విషయంలో, అందులోను సంతాన ప్రాప్తిని దృష్టిలో వుంచుకొని చేస్తేనే ధర్మాలు.  అలాకాక, అంటే వారి దృష్టిలో సంతానప్రాప్తి కొఱకన్న భావం లేకుండా చేసిన సంభోగము పాపకార్యమే అవుతుంది.  నేనీ పాపకార్యం చేసినానని ఒపుకొనుటకు సిగ్గుపడుతున్నాను.  అది నా మనస్సులో యెక్కువగా గ్రుచ్చుకొంటూనే యున్నది. (పుట 287)

          ఇప్పుడు నేను శిష్యులలోని రకములను గూర్చి చెబుతాను.  వారిలో

(1) మతలబి (స్వార్థపరులు)
(2 ఫాస్‌లీ (అప్పుడప్పుడు కనబడేవారు)
(3) అహ్లీ (తగిన వారు)
(4) మురీద్ (భక్తులు)
(5) మురాద్ (ప్రేమపూరితులు) అనువారలున్నారు.

          మతలబీలు (స్వార్థపరులు) తమ వాంఛలను నెరవేర్చుకోవాలనుకుంటారు.  ఒకవేళ రాఘవేంద్రరావు మహాత్ముడు, భగవత్‌భక్తుడు అని తెలిసిందంటే చాలు, అటువంటివారు దూసుకవచ్చి నీ సాంగత్యంతో ప్రాపంచిక లాభాలు పొందాలని ఆశపడతారు.  ఇట్టి ప్రాపంచిక లాభాపేక్షగల భక్తులు యే పనీ చేయరు.  వారు వారి స్వలాభం కొఱకే సత్సంగంలో చేరతారు.  వారు పొగడ్తలతో వారి పనులు సరిచేసుకోజూస్తారు. ఆ తర్వాత వారు మెల్లగా జారుకుంటారు.  ఒకవేళ వారి పని జరగకపోయినా వారు ముఖం చాటేస్తారు.  వారి దృష్టిలో అభ్యాసము, అనుబంధమునకు అర్థమే లేదు.

          ఫాస్‌లీ (అప్పుడప్పుడూ కనబడేవారు) రకం వ్యక్తులు యెప్పుడో ఒకసారి ధ్యానానికి కూర్చొంటారు.  అది కూడా వారు పరిసరవాతావరణం ఉత్సాహభరితంగా ఉన్నప్పుడు కూర్చొంటారంతే.  వారి హృదయంలో యే విధమైన అనురక్తి వుండదు.

          అహ్లీలు (తగినవారు) - వీరిలో ఉన్నతారాధన సంస్కారం వుంటుంది.  వీరు వారి ఆరాధనా విధానాన్ని అలానే కొనసాగించదలుస్తారు.  వీరిలో కొందరు పురోగతి జెంది భక్తుని స్థాయికి చేరుకుంటారు.  వీరిలో మరికొందరు మొదటి నుంచి మురీద్ (భక్తుని) స్థాయి నుండే ప్రారంభిస్తారు.  మురీద్ భక్తుడు తన గురువును విశేషంగా ప్రేమిస్తాడు.  ఎప్పుడూ అంతర్గతంగా గురువుతో తాను అనుబంధమేర్పరచుకొని ఉంటాడు.  ఇటువంటి వారు శిష్యుల కుండవలసిన లక్షణాలన్నీ కలిగి ఉంటారు.  వీరిలో యే ఒక్కరో, అరో అరుదుగా మురాద్ స్థాయికి చేరుకుంటారు.  "మురాద్" తన గురువు యొక్క ప్రేమకాస్పదుడై వుంటాడు.  మరో మాటలో చెప్పాలంటే గురువు యొక్క ధ్యాస సదా యీతని చుట్టే కేంద్రీకరింపబడి వుంటుంది.  ఇతన్ని ప్రేమికుడు (లేక కావలసినవాడు) అనవచ్చును.  ఇటువంటి వారు దొరకడం చాలా అరుదు.  ఈ కాలంలో మురీద్ లే కనబడడం కష్టం.  అదేవిధంగా గురువులు కూడా అరుదుగానే కనబడతారు.  పూజ్య లాలాజీ వారు నాకొక ఉత్తరంలో వ్రాస్తూ మురీద్ లే కనబడని యీ రోజుల్లో యిక మురాద్‌లు కనబడడం గగనమే నన్నారు. (పుట 297,298)

          రాతిపొర వలె కొంత స్థౌల్యం వుంటుందనీ, అది మనకు బాగా తెలుస్తూ వుంటుందే గాని దాన్ని నాశనం చేయడం కష్టమని నా అనుభవం తెలుపుతున్నది.  అటువంటి వారిని తీసుకొని యెందుకు యెవరైనా అధికంగా శ్రమించాలి? ఒక వేళ వారిని నీవు తీసుకొన్నా వారు నిన్ను వదిలి వెళ్ళడం ఖాయం.  ఎలాగైనా భక్తి అనే అగ్నిని రగుల్చగలిగి, అది అదృష్టవశాత్తు మధింపబడితే మాత్రం యేదైనా సాధ్యమే అవుతుంది. (పుట 301)

          తిరుచునాపల్లిలో ఓ అరగంట చిన్మయానంద స్వామి గీతపై మాట్లాడుచుండగా విన్నాను.  అతనిలో యేమైనా ఆధ్యాత్మిక లేక వశీకరణ శక్తులున్నాయా? అని అతన్ని చూడగానే తెలుసుకోవాలనుకున్నాను.  కానీ జనులు ఉద్ధరింపబడాలనే ఉద్ధేశం అతనిలో ఉన్నది.  అందులకు నేనాయన్ను అభినందిస్తున్నాను. (పుట 310)

          1963 సెప్టెంబర్ 13వ తేది సా|| 4-58 గం||లకు నీవు కేంద్ర మండలంలోని 4వ వలయంలో అడుగు పెట్టావు.  అందుకు నిన్ను నే నభినందిస్తున్నాను.  ఇక నీకు యే ధ్యానాలు, పూజలు అవసరం లేదు.  నేను ఓ గంట ఉదయం, ఓ అరగంట సాయంత్రం ధ్యానం చేయమని నియమించి యుంటిని.  నీ మెదడు నీకు సహకరించినంతసేపు ఆ సమయాన్నిక నీవు యితరుల ఆధ్యాత్మికోన్నతి కొఱకు వినియోగించు.  కనీసం వారానికొక్కసారైనా కేంద్రంలోని అభ్యాసులందరికి ప్రాణాహుతి ప్రసారం చేయి.  వారికి ఒక్కొక్కసారిగా ప్రాణాహుతి నిమ్మని కాదు దీనర్థం.  అందరికి కలిపి ప్రాణాహుతి నియ్యి.  వాళ్ళలో అవసరమని పించిన వారికి వ్యక్తిగతంగా ప్రాణాహుతి నివ్వవచ్చును. (పుట 315)

          సాయం సమయాలలో చేయమన్న అంతఃశుద్ధీకరణ విధానము వలన జనులు ప్రయోజనం పొందడం లేదేమో ననిపిస్తున్నది.  కారణం వారు తప్పుగా యీ ప్రక్రియ చేస్తున్నారు.  నీకు తారసపడిన మీ కేంద్ర శిక్షకులకందరికి ముఖతః చెప్పి వివరించు.  వాస్తవానికి జనులు మొదట జ్అడత్వం మీద ధ్యానం చేయడం ప్రారంభించి ఆ తర్వాత అది వెనుక నుండి పొగరూపంలో బయటకు వెళుతున్నదని భావిస్తున్నారు.  నిజం చెప్పాలంటే వారు వాటిని పొగగా మారేటట్లు ఒక దృఢసంకల్పం (ఆలోచన) చేసి వెనక నుండి బయటకు త్రోసివేయాలి. (పుట 316)

          దీక్ష గైకొన్న వారు సంతృప్తి జెంది యిక తాము చేయవలసిందేమీ లేదని తలంచడం సామాన్యంగా గమనిస్తున్నాను.  గోవు మిమ్ములను వైతరణిని దాటేట్టు చేస్తుంది.  గురువు మిమ్ములను యీ భావసాగరాన్ని దాటేట్లు చేస్తాడు - రామచంద్ర పూజార్ కూడా యీ విధమైన సంతృప్తితో వుండిపోయాడు.  ఈ దోషం అతనిలో కూడా జొరబడేట్లున్నది. (పుట 336)

          ప్రతి సత్సంగి సంస్థ నాదీ అని భావిస్తే, సంస్థ కిపుడేర్పడిన యిబ్బందులన్నీ తొలగి పోతాయని ఓ వారం నుండి నా మనస్సుకనిపిస్తున్నది.  బిడ్డలు నా వారు, అని భావించినపుడు వారి సౌకర్యం కోసం యెంత కష్టమైనా భరించడానికి సిద్ధపడతాము.  కనుక ప్రశిక్షకుల కందరికి వ్రాసి మాటిమాటికి యీ భావం అభ్యాసులలోనికి చొప్పించేట్లు చర్య తీసుకోమనండి.  ఈ దృక్పదంతో యీ దిశలో కాస్తా ఆలోచించు, దీని ప్రయోజనం నీ కర్థమౌతుంది.  ఇది చాలా చిన్న పని. (పుట 346,347)

          జనులు పాదములు స్పృశించి నప్పుడు నాకు సిగ్గుగా వుంది అని వ్రాశావు.  ఇదే విషయాన్ని ఒకసారి నేను పూజ్య లాలాజీ వద్ద ప్రస్తావించాను.  ఆయన సరిగ్గా తగిన జవాబు చెప్పారు.  బహుఃశా ఆయన నాతో నీవేమనుకుంటున్నావు, యెలా భావిస్తున్నావు? ఆనందమౌతున్నదా లేక తద్భిన్నంగా భావిస్తున్నావా? అలాకాక నా సామర్థ్యం గుర్తింపబడిందని అనుకుంటున్నావా? లేక గొప్పవాడిని గదా అన్నభావనతో నున్నావా? అని అడిగినట్లున్నాడు.  నేను జవాబిస్తూ నాకెటువంటి భావము కలగలేదు, నేను కేవలం ఒక విగ్రహం లాగా నిలబడ్డానంతే నన్నాను.  అప్పుడాయన స్పందిస్తూ, జనులు యెవరి పాదాలకు మ్రొక్కాలో సరిగ్గా వారి పాదాలకే మ్రొక్కారులే అన్నారు.  మహాత్ములకు గానీ, వయసులో పెద్దవారికి గానీ పాదాభివందనం చేయడం మన పూర్వ సంప్రదాయము. (పుట 350)

          1969 ఫిబ్రవరి ఉ|| 8-25 గం|| కు నీవు బ్రహ్మము నందు లయం కావడం ప్రారంభమైనది.  తొలుత నిన్నిందులకు అభినందిస్తున్నాను.  పూజ్య లాలాజీ కృప వల్లనే యిది సంభవమైనది.  కాకున్న యిటువంటి మహనీయులు వందల సంవత్సరాల కొకరుగాని ఉద్భవించరు.  ఒకానొక యెన్నుకొన్న సమయంలో యిటువంటి వారు పెక్కుమంది ఉండటమనేది ఆయన శిక్షణలోని ప్రత్యేకత.  ఇటువంటివారు ఓ రెండు డజండ్లుండి భారతదేశంలోని వివిధ భాగాలలో బోధ చేస్తే ఇరవై యేండ్లలో ఆధ్యాత్మికత అన్ని చోట్లా వృద్ధిచెందుతుంది.  కానీ సోదరా! మా గురుదేవుల శక్తి మరియు కృపా విశేషం వల్ల నేను అటువంటి వారిని లక్షలమందిని తయారు చేయగలనని నాకు ధైర్యమున్నది.  అందుకు సందేహమే లేదు, అయితే నాకు తగిన మనుషులే దొరకడం లేదు.  ఒకరు రామ నామం జపిస్తూ తీరిక లేకుండా వున్నారు, మరొకరు మంత్రజపంలో తనమునకలై యున్నారు.  ఇంకో అతను మాలలోని పూసలు తిరిగేస్తూ పచార్లు చేస్తూ ఆలోచిస్తున్నాడు.  నేనొక గొప్ప పనిని చేపట్టాను.  వారు మాత్రం వారు చేస్తున్న లోపభూయిష్ట విధానముల వలన దారి తప్పుతున్నారని వారికి తెలియడం లేదు. ఆలయాలకు వెళ్ళడాన్ని నేను ఆక్షేపించడం లేదు.  కానీ వారు తిరిగి వెళ్ళేటప్పుడు భగవంతుని అక్కడే వదిలేసి వెళుతున్నారు.  ఇంటికి వచ్చేసరికి యెక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నతీరులో వుండిపోతున్నారు.  మనం యెంతగా పతనమై పోయామంటే ఒక వ్యక్తి మురికి కాలువను పూజిస్తున్నాడు.  ఇది నా కళ్ళతో నేను చూచిన సత్యము.  రెండు గంటల సేపు యిటువంటి పూజచేసి వ్యక్తి తన్ను తాను గొప్ప భక్తునిగా భావిస్తున్నాడు.  వారు వారివలెనే వున్న వారి దైవాన్ని పూజిస్తున్నారు.  ఒక రైతు రాజప్రాసాదానికి వెళ్ళినా అక్కడున్న వజ్రవైఢూర్యాల నతడు ప్రశంసించడు.  అక్కడొక నాగలి నుంచితే చాలు, అతడు దాన్ని చూచి పొగుడుతాడు. ఇక్కడ నీకొక మంచి విషయం చెబుతాను.  నీకు గూడా యీ విషయం తెలిసి ఉండవచ్చు.  నేనూ యీ విషయం చాలాసార్లు చెప్పి ఉండొచ్చు.  ఎవరైతే యీ బాహ్య పూజలు, విధానాలు పాటిస్తుంటారో వారు వాటిని అహంకారంతో ప్రారంభిస్తారు.  వాటి ఆధారం అహంకారమే అయివున్నది.  వారికై వారు యీ దినం గొప్ప పూజచేసితిమని భావిస్తారు.  ఒక్క మాటలో చెప్పాలంటే వారు అహంకారంతో కొనసాగుతున్నారు. (పుట 373,374)

          పనిని మనందరం కలిసి పంచుకొని కలిసికట్టుగా నెరవేర్చ వలసి యున్నది.  అది అలానే జరుగుతుంది.  నాతో కలిసి వుండే ఉత్తమోత్తమమైన ఐదుగురభ్యాసులను నేను యెంపిక చేసినాను.  వారి పేర్లు ఈ క్రింద వ్రాస్తున్నాను. 

 1 శ్రీ రాఘవేంద్రరావ్, గుల్బర్గా

2) శ్రీ పి. రాజగోపాలాచారి, మద్రాసు

3) శ్రీ ఎస్.ఎ.సర్నాడ్, గుల్బర్గా

4) శ్రీ దేవరామ్ చావడా, నవసారి

5) శ్రీ ఎస్.పి.శ్రీవాత్సవ, లఖింపూర్.

          వీరికి పనిచేసే శక్తిసామర్థ్యములున్నవి.  అవసరానికి తగినట్లు వారికి శక్తి అందుతూ వుంటే చాలు.  వారిపనికి అవసరమైన సహాయం ఈ యోచన మాత్రం చేతనే లభిస్తుంది.  అందరూ పనిచేయాలనే ఉత్సాహాన్ని పెంపొందించుకోవాలి.  ఈ ఉత్సాహం పనిచేస్తూ, పనితో అనుబంధం పెంచుకొనే కొద్దీ పెరుగుతుంది.  అందరికీ మార్గదర్శకత్వం లభిస్తూనే వుంటుంది.  సమన్వయంతో అందరూ కలసి మెలసి పనిచేయవలసిన అవసరం వుంది. (ఉత్తరం తేదీ 17-12-1977) (పుట 404)

          సంపూర్ణమైన యిచ్ఛతో హృదయ పూర్వకంగా పనిచేస్తే కఠినమైన పాషాణం సైతం మైనం వలె మెత్తనౌతుంది. (ఉత్తరం తేది 13-09-1980) (పుట48).

 డా||శ్రీవాత్సవ గారు అద్యక్షుల సమాలోచన సభకు యిచ్చిన చిరులేఖ (నోట్)

          బాబూజీ గారిచే నియమింపబడిన అద్యక్షుల సమాలోచన సభ (కౌన్సిల్) సహజమార్గము యొక్క సంపూర్ణ స్ఫూర్తితో, సేవా దృక్పదముతో పనిచేయుటకుగాను ఒక నిర్దిష్ట సభ్యసమూహమును నియమించినది.  దీని కార్యకలాపములు, అద్యక్షుల వారికి పరిపాలనా మరియు ఆధ్యాత్మిక పని భారమును తగ్గించి కొంత తేలిక పరచుటకై ఉద్దేశింపబడినవి.  ఇది సాధ్యము కావలెనన్న దీనిలోని సభ్యులు పూజ్య బాబూజీ వలెనే యెలాంటి విశేషాధికారమును ఆశించక సజీవ జ్వాలలై సేవాత్యాగములకు మారురూపములుగా స్ఫూర్తితో ఆ మహాప్రభువు కృపావిశేషమును పొంది పని చేయవలసి యున్నది.  ఇది సహజసమర్పణము ద్వారానే సంప్రాప్తమగు విషయము.  ఇందుకు శ్రీబాబూజీ తన సర్వసాధారణ జీవితము గడుపుతూ సంపూర్ణముగా ఆదర్శప్రాయులై మన యెదుటనున్నారు.

          సభ్యులందరూ శరీరములోని వివిధ అవయవములుగా భాసిల్లుదురే గానీ ఒకరినుండి మరొకరు యెప్పుడూ విడివడి యుండరు.  వీరందరూ అతి సహజ సిద్ధముగా సమన్వయంతో మెలగి ఒకడు అందరిలో’ ‘అందరూ ఒకరిలోనన్న చందమున నుండవలయును.  అవయవములు శరీరమునకు చెందినవి, శరీరము ఆత్మకొఱకున్నది, మరి ఆత్మ ఆ మహాప్రభువునందున్నది.  తిరగత్రిప్పి చూస్తే అవయవముల కలయికే శరీరము, ఆత్మ శరీరములో భాగమై లేక శరీరమునకు వేరుగాక యున్నది, మరి పరమగురువులు యిందులో ప్రతిఫలిస్తున్నారు.  ఏ ఒక్క వ్యక్తిగతఆత్మా, తన ఆత్మతత్త్వాన్ని వీడినా అందులో తరుగురాదు, ఆ మహాప్రభువు నుండి వేరు చేయలేదు.  ఇదీ సంక్షిప్తంగా అద్యక్షుల సమాలోచన సభయొక్క బాహ్య స్వరూపము, స్థాయి మరియు స్వభావము.  --- ఎస్.పి.శ్రీవాత్సవ. (పుట 405,406)

***

పూజ్యలాలాజీ మరియు మన ఆధ్యాత్మికప్రగతి

  పూజ్యలాలాజీ మరియు మన ఆధ్యాత్మికప్రగతి సోదరీసోదరులమైన మనమంతా యిక్కడ యీదినం (ఫిబ్రరవరి 14/ బుధవారం 2024) మన ఆదిగురువులైన పూజ్యలాలాజీవారి 1...