Showing posts with label మార్గదర్శకుని ఆవశ్యకత. Show all posts
Showing posts with label మార్గదర్శకుని ఆవశ్యకత. Show all posts

Thursday, 1 June 2023

మార్గదర్శకుని ఆవశ్యకత

 

మార్గదర్శకుని ఆవశ్యక   

శ్రీ రామచంద్ర షాజహాన్ పూర్  

భగవంతుడు  గణింపశక్యముకానన్ని విశ్వముల సృష్టించెను. గురుత్వాకర్షణశక్తితో వాటన్నిటిని ఒకదానితో మరొకటి అనుబంధము కలిగియుండునట్లమర్చెను.  అట్లనుబంధము కలిగియున్నవన్నీ  మూలకారణమై యున్న  మరోమహావిశ్వముతో అనుబంధించబడియున్నవి. ఈమహావిశ్వముకూడా దాని ఉపాదాన కారణమునుండి అవతరించినది. ఆదిమ మూలకారణముతో అనుబంధమేరరచుకొని గగనతలమున అశరీరములతో సమస్తమునూ ఉనికిలోనికి తెచ్చుకొనియున్న ఆమహావిశ్వమునుగూర్చియే నేను తెలియజేస్తున్నాను. మనిషియొక్క మూలముగూడా అదే ఆదిమమూలమే. అంటే ఉనికిలోనికి వచ్చియున్న శక్తులు, మరియితరములన్నియు  మానవునియందున్నవి.

ఆదిమ మూలాధారము

ఉనికిలోనున్న సమస్తముయొక్క కలగలుపే మనిషి. అందుచేతనే అతడు మహాశక్తిసంపన్నుడు. అతనియందున్న,  ఆమహాశక్తితో ఉనికిలోనున్న  యేవిశ్వమునైనను, తునాతునకలు చేయగలడు. అతనిలోని అణువులు ఒక్కో ప్రత్యేకవిశ్వముతో అనుసంధింపబడియున్నవి. మనిషి, తాను ఆదిమమూలముతో  సంబంధమేర్పరచుకున్నంతనే శక్తులన్నింటిపై  ఆధిపత్యం  వహిస్తాడు. మనిషిలోని చక్రములకు సంబంధించిన బిందువులుగాని, ఉపబిందువులుగానీ తమ అధీనములోని ప్రత్యేకవిశ్వములపై ఆధిపత్యము కలిగియుండుటేగాక  వాటినికూడా శక్తివంతము గావింపగలవు. చక్రములయొక్క  వివిధ ఉపబిందువులతో అనుసంధింపబడియున్న చిన్నవిశ్వము సహితము మనపురోగమనమును అడ్డగించి అవరోధమై నిలచును. మనము ఒకబిందువునుండి మరోబిందువుదశకు పయనింతుము. మనము ఆవలి బిందువు చేరవలెనన్నచో  బిందువులమధ్యనున్న దూరమును (విశ్వమని కూడా అనవచ్చును) అధిగమించవలెను. అలావెళ్ళునపుడు ఆప్రాంతములోని భోగమును (అనుభవించవలసిన వాటిని) పూర్తిచేయక తప్పదు. ప్రతిబిందువువద్ద యీపరిస్థితి తప్పనిసరి. ఈవిధంగా మొత్తంప్రయాణం పూర్తిచేయవలెనన్న చాలా సమయమే పట్టును. ఈసమయం తగ్గవలెనన్న, ఒకమహోన్నతశక్తి గురుత్వాకర్షశక్తిని తగురీతిన మరల్చి మన ప్రయాణమునకు సహకరించవలెను. సామాన్య ప్రయాణములకు సహకరించుశక్తి భౌతిక(స్థూల)మైనది. కాని మనిషిలోని శక్తి భౌతికతలేని ఆధ్యాత్మిక(సూక్ష్మ)మైనది. భౌతికత(స్థూలత)ఎంతతగ్గితే శక్తి అంతగా పెరిగి మరింత ప్రతిభావంతమౌతుంది.

భగవదనుగ్రహము

ఇప్పుడు మనకోసం దీనినెలా ఉపయోగించుకోవడమన్నది తర్వాత గ్రహించవలసిన విషయం. ఒక మహోన్నతశక్తితో దగ్గరి సంబంధమేర్పరచుకుంటే, యీపని మొదలుపెట్టబడుతుంది. దీన్నే మరోమాటలో అనుబంధం లేదా ప్రేమయనవచ్చును. ఇప్పుడు విషయం తేటతెల్లమైపోయింది. అడ్డముగానున్న పరదాల నన్నిటిని చీల్చి తొలగించగల మహోన్నతశక్తితో అనుబంధమేర్పరచుకుంటే, మన దారిలోని అవరోధాలు తొలగిపోగలవన్న నిర్ణయమునకు వచ్చితిమి. అయితే తర్వాతి బిందువును చేరుకొనుటకు ముందు, మధ్యస్థప్రదేశమును క్షుణ్ణముగా అనుభవమునకు తెచ్చుకొని, చుట్టివచ్చి, భోగము పూర్తిగాబడిన గాని, పురోగమించుట సాధ్యపడదు. స్వశక్తిచే యీపనికి పూనుకున్నట్లైన మధ్యలో చిక్కుబడిపోయి అక్కడే నిలచిపోవును.  అయినప్పటికీ  కొందరివిషయములో మినహాయింపు వుండనే వుంటుంది. కానీ అట్టివారు చాలా అరుదు.  అసాధారణ శక్తిసామర్ధ్యములు  వరముగాపొంది, భగవదనుగ్రహము మెండుగాగలవారికి మాత్రమే యిది సాధ్యము. ఇప్పుడెవరి శక్తి యీచిక్కులన్నిటిని అధిగమింపజేసి ప్రయాణపము సజావుగా సాగునట్లు  జేయగలదు? ఆదిమమూలముతో విడివడని సంబంధమేర్పరచుకున్న, మహనీయునిశక్తి వలననే యిది తప్పక సాధ్యపడగలదు. అందుకొఱకు  అటువంటి మహనీయుని చెంతచేరవలెనుగదా! తప్పక చేరవలెను. ఇప్పుడతనిని నీప్రభువనిగానీ, సేవకుడనిగానీ యెట్లైననూ పిలవవచ్చును. ఆయన మాత్రము, నీబోధకుడు,మార్గదర్శి లేక సాధారణముగా లోకము పిలచునట్లు గురువు కావచ్చును. కానిమ్ము, నీవాయనకు యేస్థాయినిచ్చి, యేదృక్పదమున గైకొన్నను సరియే, అదేమంత ముఖ్యముగాదు

 బిందువుల లేక ఉపబిందువుల మధ్యనున్న అడ్డంకులు అనగా అవరోధములు నిజమునకు లెక్కకుమిక్కుటముగా నున్నవి. వాటన్నిటిని సంపూర్ణముగా అనుభవమునకు దెచ్చుకొని(భోగించి) ముందుకు సాగవలసియున్నది.  సమర్థుడు శక్తివంతుడునైన గురువు సహాయమున యీ అనుభవించుట (భోగించుట) చాలావరకు తగ్గించబడి ఆ ప్రదేశములందు అభ్యాసి స్వల్పకాలము మాత్రము నిలచి ముందుకుసాగుటవల్ల అతని సమయము శ్రమ కలసివస్తాయి. గురువుసహాయమువల్ల భోగము (అనుభవించవలసినవి) ఎలా నిస్సారములగుచున్నవి? ఇది చూచుటకు చిత్రముగను అసంబద్ధముగను గానవచ్చును.  అభ్యాసి చేరియున్న ప్రదేశముయొక్క  ప్రభావమువలన అతనిచుట్టూ బంధనములేర్పడి పూర్తిగా చిక్కువడిపోవును. ఈబంధనములు త్రెంచబడక పురోగమనము అసంభవము. ఒకవేళ తన స్వప్రయత్నమువలన కొంత ముందుకుపోయినను, మరలా అతడు క్రిందికి జారిపోవును.

సమర్థ గురువు

ప్రత్యక్షానుభవమున గ్రహించిన విషయమేమంటే,  చాలామంది సాధువులీ ఆవరోధములను దాటలేదు. ఒకవేళ ఎవరైనా దాటినారన్నా, వారు కేవలం తొలిమలి ఆవరోధములను మాత్రమే దాటియుండవచ్చును. తర్వాతవారు అక్కడే చిక్కుకొని బయటపడుదారి కనరాక అవస్తలు బడుచుందురు. అందుకుకారణం వారి గురువులో శక్తిసామర్థములు కొరవడియుండుటే. వారిగురువు తన అసాధారణ శక్తిచే వారిని విడిపించి బయటపడవేయలేని వాడైయున్నాడు. ఇక తమ స్వశక్తిపై ఆధారపడినవారు, తొలిమలిస్థానములలోనే చిక్కులలోబడిపోతున్నారు.  కనుక మనమున్న స్థానముల అనుభవమును (భోగమును) పొంది అవతలికి దాటుకొనుటకు సమర్థగురువర్యులు మనకు వెన్నుదన్నుగాలేకున్న  సాధ్యపడదుగదా? నిజానికి భోగము(అనుభవించుట) అనగా కేవలము మనచెడుకార్యములవల్ల గలిగిన  ఫలితముల నుభవించుటే గాదు, తనను చుట్టుకొని విడివడలేని స్థితికిదెచ్చిన  బంధనములు గూడా  విప్పుబడవలెను. అట్లు జరగ వలెనన్న  తాను బంధనప్రభావమునకు లోనుగాని స్వేఛ్చననుభవించుచుండవలెను. అప్పుడు మాత్రమే తను అవతలిబిందువునకు చేరుకోగలడు. అది సాధ్యపడవలెనన్న సమర్థగురువర్యుల సహాయమత్యావశ్యకము.

 

కొందరు తమకైతామే ఆధ్యాత్మికశిక్షణాయత్నము చేసుకోవచ్చునన్న తప్పుడుఆభిప్రాయముతో నున్నారు. కనుకనే, నేనీవిషయమై వివరణ యియ్యవలసి వచ్చినది. ఆవిధంగా తమకైతామే యత్నించువారు కేవలం కొద్దిదూరమునకే పరిమితమైపోదురు. అదికూడా వారు ప్రత్యేక దివ్యశక్తులు వరముగాపొంది, ఆశక్తితో అవరోధములను స్వతహాగా అధిగమించగలరు. కానీ నిజమునకట్టివారు అరుదు. చాలా అరుదు. ఇందుకు పరిష్కారము, తనసహచరులలో తగిన శక్తిసామర్థ్యములుగల మహనీయుని సహాయము పొందితీరవలెను. అటువంటప్పుడు ఆమహనీయుని (గురును) దృష్టిని తనవైపునకు ఆకర్షించుకొని  ఆధ్యాత్మికోన్నతికి తోడ్పడునట్లు,  తనలో తగినసామర్థ్యమును ఉత్పన్నముచేసుకొనితీరవలెను. అది భక్తి ప్రేమలద్వారా మాత్రమే సాధ్యము. అందరు భక్తి ప్రేమలు పాటించుటన్నది ముఖ్యాంశము. కనుక మనగమ్యమేమిటో మనకె ఱు క పరచి,  దానిని  మనకందుబాటులోనికి తేగాలిగిన  శక్తిమంతుడగు మహనీయుని (గురుని) యెడ భక్తి ప్రేమలు కలిగియుండుట అత్యంతావశ్యకము.  

(Adhyatm  gyan  - April June 2023 . Necessity of Guide)

పూజ్యలాలాజీ మరియు మన ఆధ్యాత్మికప్రగతి

  పూజ్యలాలాజీ మరియు మన ఆధ్యాత్మికప్రగతి సోదరీసోదరులమైన మనమంతా యిక్కడ యీదినం (ఫిబ్రరవరి 14/ బుధవారం 2024) మన ఆదిగురువులైన పూజ్యలాలాజీవారి 1...