Showing posts with label అహంకారపు వివిధస్థితులు. Show all posts
Showing posts with label అహంకారపు వివిధస్థితులు. Show all posts

Saturday, 14 October 2023

అహంకారపు వివిధస్థితులు

అహంకారపు వివిధస్థితులు 
రచన - శ్రీరామచంద్రాజీషాజహాన్‍పూర్.  
తెలుగుసేత - పి. సుబ్బరాయుడు, ప్రశిక్షకులు

 

         వివిధపరిధులలో  మనిషిలోని అహంకారమేయే స్థితులలో వుండునో పాఠకులు నిర్ణయించుకొనుటకీ విషయముపై కొంతచర్చించుట అనవసరము కాదనుకొందును. అహంభావము మనిషిశరీరము నుండే ఉద్భవించును. ఇట్టిభావనతో పనిచేయుచున్నప్పుడు నేనే (ఈశరీరమే) యీకార్యము నెరవేర్చుచున్నానన్న స్థూలమైన యోచనతో నుండెదరు. ఇది అధమాధమమైన మోటుస్థాయులోనున్న అహము. ఈస్థాయిలోని వ్యక్తిచూపు (దృక్పదము) శరీరముపైనే వుండును. అతని ఆలోచన, భావనలో దేహమేకర్త. అంతకుమించి అతడాలోచించడు. భౌతికదేహముతప్ప, అంతకుమించిన అవగాహన అతనికుండదు. ప్రపంచములోని సామాన్యజనులస్థితి యింతమాత్రమేయై యుండును.

              ఇప్పుడు నీవు సరైన అవగాహనకు వత్తువు. కార్యములన్నియూ వాటికవేజరిగిపోతూ, వాటిని చేయుచున్నదెవరోకూడా నీ ఊహకురాదు. కార్యములు నిర్వహించుచున్నది నీశరీరముగానీ, మనస్సుగానీ, లేక మరోవిధానములో గానీ జరుగుచున్న విషయమేమీ నీ ఊహకురావుగానీ, ఏదోవిధంగా కార్యములు, నిర్వహింపబడుతున్నట్లు మాత్రము గమనింతువు. ఈస్థితిలో ఏలా? ఎవరివలన? లేక ఏవిధానమున కార్యములు నిర్వహింపబడుతున్నవన్న ఆలోచన నీ మనస్సున అసలే అంకురించదు.

 నీవు మరింత పురోగమించినట్లైన అస్సలు వీటికిసంబంధించిన ఎరుకే నీకుండదు. ఈకారార్యములేవైనను ఎలా జరుగుచున్నవోనన్న విషయము, పని మొదలగుటకు ముందుగానీ, పనిజరుగుచున్నప్పుడుగానీ, పూర్తైన తర్వాతగానీ, నీఎరుక లేకనే అవసరమునకు తగినట్లు వాటికైఅవే జరిగిపోవుచుండును. ఈవిషయము బాగా అర్థమగుటకు ఒక ఉదాహరణనిత్తును.

 ఒకమనిషి నిద్రించుచుండును. అతనిని దోమలుగానీ చీమలుగానీ కుట్టును. అతనికి కండూతి (జిల) కలిగినట్లై తనచేతితో అవసరానికి తగినట్లు కుట్టినచోట రుద్దుకొనును. గానీ యిదేమిమే తెలియకయే నిద్రావస్థలో మునిగియుండును.

 నిద్రావస్థ

 ఇప్పుడతనికి నిద్రలోజరిగిన విషయమేమీ తెలియదు. అతడుచేసినపనికి ముందుగానీ, చేయుచున్నప్పుడు గానీ, పనిపూర్తైనతర్వాతగాని, ఏమిజరిగినదో మేల్కొనినతర్వాత అసలే ఎరుగడు. ఇట్టిస్థితిని పొందినట్లైన, అనగా మేల్కొనివుండగనే నిద్రావస్థ పొంది, ముందుకు పురోగమించి, అన్ని పరిస్థితులలో అవసరానికి తగినట్లు కార్యకలాపాలు నెరవేరుస్తూ, కార్యము దానికర్తకు సంబంధించిన ఎలాంటి ఎరుకలేక జీవిస్తుంటాడు. అటువంటప్పుడతడు చేసినపనులకు సంబంధించిన సంస్కారములు, అవి ఏవైనప్పటికినీ అతనికంటుకొనవు. తదనంతరము అతడొక ఉనికిగామాత్రముగా మిగిలియుండును.

 ఇవే అహముయొక్క వివిధస్థితులు. ఇవన్నీ కేంద్రస్థానములోనికి ప్రవేసిస్తుండగనే, దాదాపు అంతమై పోవును. నేను దేనినైతే ఉనికి లేక స్వేచ్చపొందిన (విడుదలపొందిన) ఆత్మయొక్క ఉనికిఅంటున్నానో అదిమాత్రము అక్కడకూడా ఉండనేవుంటుంది. సర్వముఅంతమొందు మహాప్రళయమున మాత్రమే అది పూర్తిగా అంతర్ధానమైపోతుంది.

 అయినప్పటికినీ సున్న (పూజ్యము) అనునదిమాత్రము అప్పటికినీ మిగిలే వుంటుంది. అంటే విడుదలపొందిన ఆత్మల‍ఉనికితోపాటూ మిలిన వాటి‍ఉనికి మరియు అస్తిత్వములోవున్న ప్రతీదీ ఆకొక్కటిలో (దైవంలో లేక పూజ్యంలో) లీనమై వాటి వ్యక్తిత్వఉనికిని కోల్పోయినప్పటికినీ, ఇదొక్కటి (పూజ్యం లేక సున్న) దానికైఅదే ఒక ఉనికి లేక అస్తిత్వమైయుండి సమయమాసన్నమైనప్పుడు నూతనసృష్టిగావిస్తుంది.

 ("రాజయోగ ప్రభావము" అను పుస్తకముయొక్క మూడవ ముద్రణ-1968లో 42-44 పుటలలోవున్న యీ విషయము "ఆధ్యాత్మ జ్ఞాన్" జూలై-సెప్టంబర్ 2023 లో ప్రచురించబడినది) 


   


 

 

 

 

పూజ్యలాలాజీ మరియు మన ఆధ్యాత్మికప్రగతి

  పూజ్యలాలాజీ మరియు మన ఆధ్యాత్మికప్రగతి సోదరీసోదరులమైన మనమంతా యిక్కడ యీదినం (ఫిబ్రరవరి 14/ బుధవారం 2024) మన ఆదిగురువులైన పూజ్యలాలాజీవారి 1...