Thursday, 14 March 2024

వినమ్ర సేవ

 

వినమ్ర సేవ

                                       రచన:-పూజ్యశ్రీ రామచంద్రజీ మహరాజ్ , షాహజాన్ పూర్.   

 గమ్యముచేరే యాత్రలో నీవునాకు సహచరునివైనందుము నేనమితానందభరితుడ నయ్యాను. త్రోవలో నన్ను తోడుగాగైకొని నాసేవలు గైకొన్నావు. కానీ మధ్యలో యేమైనదో యేమోగాని నాసేవలుగైకొనడాన్ని నీవు నిర్లక్షంచేసినావు. నేనునీకు సహాయం చేయలేనని అనుకొని వుండవచ్చు. నేనునా విద్యుక్తధర్మంగా చెబుతున్నాను. ఉనికిలోనికొచ్చిన ప్రతిఆత్మయొక్క ముఖ్యకర్తవ్యమైన సత్యమార్గమును మాత్రము నీవు విడువవద్దు. నీవునీ ప్రాపంచికవిధులను చక్కగా నిర్వర్తిస్తూ అత్యిముఖ్యమైన భగవత్సాక్షాత్కారమార్గాన్ని నిర్లక్ష్యంచేయడం సరికాదు. ప్రియతమా! నీవు చేస్తున్నపని యెట్లున్నదంటే గవ్వలుయేరుకుంటూ, రాజ్యాధికారాన్ని వదులుకున్నట్లున్నది.

 ఆధ్యాత్మికత సులువుగా అందరికి అందుబాటులోనున్నది. శిరస్సునావైపునకు త్రిప్పితేచాలు అర్థమైపోతుంది. సంపూర్ణముగా నీకైనీవు లీనమైనంతనే నీవు వెదుకుయున్నదేదో అది నీచెంతనే వుంటుంది. పదివేలగొంతులు యెలుగెత్తి స్తుతించవచ్చు గాని, వారిస్వరం భగవంతునకు వినిపించదు. ఎందుకంటే ఆయనతో వారి హృదయాలు అనుబంధింపబడిలేవు. కాలం మనకెంతో అనుకూలమైయున్నది. ప్రకృతి ఔదార్యముగలదై దైవస్పందనలు యిక్కడ అక్కడ ప్రతిచోట అంతట వ్యాపింపజేసి మన అనుభవమునకు దెచ్చుచున్నది. నీకు అనువైన విధానములో జీవించయత్నించి, నిన్నునీవు మరచిపో. మన విధానాన్ని అనుసరిస్తున్నారా లేదా అనినేను పరిగణన లోనికితీసుకోను. ప్రతిఒక్కరు రవికాంతిలోనికి వచ్చి వారి గమ్యమునువారు చేరవలెనని, అందరికొఱకు నేను ప్రార్థిస్తాను.

 యోగమార్గము నిశ్చితమైనది. అది యితర విధానములకు భిన్నమైనది. అది నిలో స్వచ్ఛమైన దివ్యత్వమును పెంపొందించును. భగవంతుడు సూక్ష్మమైనవాడు. మనంకూడా భగవంతుని వలె సూక్ష్మతజెందాలి. అదే కలయిక లేక యోగం. స్ఠూలపద్దతిలో సాగు ఆరాధనలు, మానుకుంటే యోగం సిద్ధిస్తుంది. ఎందుకంటే నీవు చేరవలసినస్థలంలో ఏది గొప్పకాదు. దివ్యస్థాయికి చేరవలెనన్న, ప్రతీది నీవు వదులుకోవలసిందే. భగవంతుడు సరళుడు. అత్యంతసరళమైన విధానముననే భగవత్సాక్షాత్కారము సాధ్యము. ఈమాట మనము మరింతగా సూక్ష్మత జెందుటకు ప్రేరణ నిచ్చుచున్నది. స్థూలత జెందితే మనం వెనుకబడి పోదుము. నేను వస్తువుల నిజస్వరూపమును మీదృష్టియందుంచుచున్నాను. నిజమైన మార్గదర్శి (గురువు ) లభించి, ఆయనను సమ్మతితో అనుసరించినటైన భగవత్సాక్షాత్కారము ఒకజీవితకాలములోనే సాధ్యమగును. భగవంతుడే మనకు సరియైన మార్గదర్శి లభించునట్లు సహాయపడగలడు. అదికూడ మనలో సాక్షాత్కారము కొఱకు తపన తీవ్రతరం దాల్చినపుడు మాత్రమే సాధ్యపడును. సద్గురువు లభించెనన్న అనతికాలంలోనే విజయం లభించినట్లే. అన్వేషకునికి సరియైన మార్గదర్శి లభించినట్లైన అతడు సహజంగానే మార్గదర్శికి (గురువుకు) తన్నుతాను తనవిధిగా  సమర్పించుకుంటాడు. సమర్పణమన్న ఎఱుకకూడాలేకుండా పోతేనే సమర్పణ (శరణాగతి) పరిపూర్ణమౌతుంది. ఈతుదిదశను పొందాలంటే, మనం హృదయాంతరాళమున భక్తిని పెంపొందించుకోవాలి.

 యోగమున కవసరమైన సూత్రములు, విధానములనేర్పరచి యిచ్చుట, ఒక యోగసాధనోపదేశికునిగా అది నాబాధ్యత. ప్రత్యేకయోచనా విధానమును యోగము అనుమతించుచున్నది. ఒక పద్ధతిన జనులు యోగము నభివృద్ధిపరచుకున్నారు. అది మహోన్నతులైన వ్యక్తులనుత్పాదించినది. కనుక దీనికి వ్యతిరిక్తముగా యేఒక్కరు కూడా మాట్లాడ సాహసింపరు. నేనొకవిధానమున యోగాన్ని అనుసరిస్తున్నాను. నాకు సాధ్యమైనంత ఉత్తమసేవలందించడానికి, నాసహచరులను యీయోగాన్ని అనుసరించమని చెబుతున్నాను. ఈయోగ విధానము మాత్రమే బంధనములను ధ్వంసముజేయగలదు. ఎందుకంటే, ముఖ్యమైన ఆలోచనాశక్తి యీవిధానమున శుద్ధజీవవాహినిగా పనిజేయుచున్నది. అభ్యాసులు వారి బంధనములను విడిపించుకొనుటలో నేను సహాయపడతాను . మీరు యీజన్మలోనే మోక్షముపొందు స్థాయికి ఎదిగి రావాలన్నదే నా ఆశయము.

 నేనేమిటో నాకుతెలియదు. అయితే నాకైనేను మానవజాతికొక సేవకుడననుకొని, ఆవిధంగానే సేవచేస్తున్నాను. రెండుసంవత్సరాల సాధనానంతరం నాసహచరుడైన ఒక సమర్ధుడు, యితరులను తనసోదరులుగా భావించడం నేర్చుకున్నానన్నాడు. అతనికి జవాబిస్తూ, నేను సామాన్యులకు సేవచేయడం ఇరువదిరెండు సంవత్సరాల శ్రద్ధాపూర్వక సాధనానంతరం నేర్చుకున్నానన్నాను. మరోమాటలో చెప్పాలంటే, నాకు సేవా అన్న తలంపురాగానే నేనుమాత్రమే సేవకుడను, మీరందరు ప్రభువువులు అనుకున్నాను. ఇదే మనస్సును క్రమపరచు ఉత్తమమార్గము. నా సహచరులందరి లోనూ యిదేయోచన వుండాలనుకుంటున్నాను. అందులోనూ ప్రశిక్షకులలో యీభావన ముఖ్యంగా వుండితీరాలి. ప్రశిక్షకులలో యీభావనలోపించి, క్రమశిక్షణలేనివారైతే సంస్థ ప్రాణమే నశిస్తుంది. మనం యెలాప్రేమించాలో  నేర్చుకోవాలి. భక్తి హృదయానికి సంబంధించినది. పొగడ్తలు మేధస్సుకు సంబంధించినవి. ప్రశిక్షకుని క్రమశిక్షణారాహిత్యాన్ని యేవిధంగానూ నేను సహించజాలను. సందేహమేలేదు, నేను ఆధ్యాత్మికతను ప్రపంచవ్యాప్తం చేయాలనుకుంటున్నాను. అయితే నేను మాగురువర్యుల ఆదర్శమును యేవిధంగానూ వదులుకోవడానికి సిద్ధంగాలేను. అందుకే సంస్థ ఆదర్శమును భవిష్యత్తులో భంగపరచి, యితరుల యెదుట కించపరచుటను, నేను సహించజాలను. మానవప్రాతినిధ్య మార్పులెక్కడైనజరిగేవే. కానీ నిజసిద్ధాంతములు మాత్రం కాలగమనంలో మారిపోవడానికి వీలులేదు.  

  పరిపూర్ణమనుజుడు అందరి క్షేమాన్ని ఆకాంక్షిస్తాడు. ఎవరిపైనా అతనికి ఈర్ష ద్వేషముండదు. జనులు పుడతారు చనిపోతారు. అదే జననమరణ చక్రము. ఎవరు వినమ్రులై సమర్పణ భావముతో స్వార్థము విడనాడి, భగవంతునకు అనుసంధింపబడి వుంటారో వారిని తరతరాలుగా జనులు జ్ఞాపకముంచుకుంటారు. ప్రభువునెడ దాసుడెలా ప్రవర్తిస్తాడో, అలా అందరియెడల మన ప్రవర్తన వుండాలి. మనతీరు, నడవడి యితరులకు ఆదర్శప్రాయమై ఆందరియెడ అణకువతో మెలగి, వారు మనలను అహంకారరహితులుగా తలంచవలెను. నీవు గురువును హృదయపూర్వకముగా ప్రేమించినట్లైన, తత్‍ప్రభావము యితరుల మనస్సులలో ప్రబలముగా కనిపించి, ఇనుమయస్కాంతమునకు ఆకర్షింపడినట్లు మనవైపునకు వత్తురు. జనులందరి క్షేమమునకుగాక తనస్వార్థమునకు మాత్రమే ప్రాధాన్యతనిచ్చువాడు సంఘసేవకు తగడు. 

 సుదీర్ఘములైన ఉత్తరములు చదువుటవలన నేనలసిపోవుదు ననుకొనవద్దు. నాసహచరుల ఆధ్యాత్మికస్థితుల విషదీకరణలను ఆహ్వానిస్తాను. వారు వాటిని వ్రాసేక్రమంలో ఆ ఆద్యాత్మికస్థితులలో మునిగిపోయి వుండుటవలన వారికది ఉపయోగకారియే యగును. ఈవిధంగా వారు సాధనలో వారున్న ఆధ్యత్మికస్థితులను అర్థముచేసుకోగలరు. అందువల్ల వారిలో గ్రాహకశక్తి లేక అనుభవశక్తి పెంపొందుతుంది. నీవు నారూపమును ధానించాలా? లేక మాగురురూపమును ధ్యానించాలా? అని అడిగావు. ఈవిషయమై నాదృక్పదమును తెలియజేస్తాను. గురువు పరిపూర్ణుడైతే, అతనిరూపంపై ధ్యానించడంవల్ల హృదయం అమృతంతో నింపబడుతుంది. గురువు అయోగ్యుడైతే శిష్యునిపురోగతి ఆగురువు స్థాయిని మించిపోజాలదు. గురువు జడుడైతే, శిష్యుడు పాషాణమౌతాడు. అంతేగాకుండా గురువు శిష్యుల జడత్వాన్ని తొలంగించువిధానాన్ని తెలియనివాడైతే, అతనిపై శిష్యులు ధ్యానం చేయడంద్వార ఆ అసమర్థగురువు చెడిపోగలడు. శిష్యులజడత్వం ఆ అసమర్థుని గురువులో ప్రవేశిస్తుంది. కనుక దయచేసి యిట్టి విధానము నవలభించుటకు ముందే నేను తెలిపిన విషయములను పరిగణనలోనికి తీసుకోగలరు.

 నేను గురువునుకాను, గానీ మానవాళికి సేవకుడను. మాగురుదేవుల సూచనమేరకు, నేను నాసహచరులను సేవించుచున్నాను. ఎవరికంటెను నేను అధికుడనుగానని తలంచెదను. ఏమహోన్నతశక్తి కొఱకు వెదుకుచున్నారో అది వారిలోనేయున్నది. ఈస్వభావమే నీవు సహజమార్గసంస్థయందు  కనుగొందువు. నీవు హృదయపూర్వకముగా, మనఃపూర్వకముగా ప్రభువుకు శరణుజొచ్చిన  ఆమహాప్రభువుయొక్క సామ్రాజ్య మంతయూ నీదైపోవుట నిశ్చయము.

( శ్రీ S.P శ్రీవాత్సవగారి డివైన్ మెసేజెస్ అను పుస్తకమునుండి గ్రహించి, ఆంగ్లమునుండి తెలుగునకు అనువదించడమైనది )


No comments:

Post a Comment

పూజ్యలాలాజీ మరియు మన ఆధ్యాత్మికప్రగతి

  పూజ్యలాలాజీ మరియు మన ఆధ్యాత్మికప్రగతి సోదరీసోదరులమైన మనమంతా యిక్కడ యీదినం (ఫిబ్రరవరి 14/ బుధవారం 2024) మన ఆదిగురువులైన పూజ్యలాలాజీవారి 1...