Showing posts with label Real goal of life. Show all posts
Showing posts with label Real goal of life. Show all posts

Sunday, 10 July 2022

వాస్తవ జీవిత లక్ష్యము


 

వాస్తవ జీవిత లక్ష్యము

                                                                                                   రచన: పి. సుబ్బరాయుడు. 

తొలిపలుకులు

సంప్రదాయాన్ని కొనసాగించటము, సంస్కృతిని కాపాడుకోవ టము వాంఛితములే అయినా, వాటిని పరిరక్షించుకుంటున్నామనే నేప థ్యంలో మూఢత్వానికి, మూర్ఖత్వానికి తావిచ్చే అనుచిత పద్ధతులు ఏ మతానికైనా, ఏ జాతికైనా, ఏ దేశానికైనా అనుసరణీయములు కావు. కొన్నిమార్లు అవి అభివృద్ధి (ఆధ్యాత్మికంగాను, భౌతికంగాను కూడ) నిరోధకాలుగా ఉంటాయి.

శ్రద్ధ, శరణాగతి, ప్రాయశ్చిత్తము, ప్రార్థన వీటిని నిరంతర సాధనగా మలచుకోవటం ద్వారా మానవజీవిత లక్ష్యాన్ని సాధించు కోవటం సులభం.

లౌకికవాంఛల సాధనలో నిరంతరం కొట్టుమిట్టాడుతూ, వాటిని నెరవేర్చుకోలేక సహజమైన ఆనందాన్ని కోల్పోతూ, దుఃఖానికి దగ్గర వుతున్న ఈ మానవరూపాలకు వారి యొక్క విద్యుక్త ధర్మాన్ని గుర్తు చేస్తూ, వారిని తరింపచేసే గురువులకు పుట్టినిల్లు భారతదేశం. గురువు ద్వారా బుద్ధిని వివేకవంతం చేసుకొని మనిషి యొక్క లక్ష్యం ఏదైతే ఉందో దాన్ని అందుకోవటమే మోక్షం.

అవాంఛితమైన కోరికలు వాంఛితమైన ఏకైక సత్యలక్ష్యానికి ప్రతి బంధకాలుగా తయారవుతాయి. కోరికల సుడిగుండం నుండి మానవుని రక్షింపగల ఏకైక నావ గురుసహాయం మాత్రమే. గురునిర్దేశిత మార్గము మాత్రమే.

ఈ చిన్నపుస్తకాన్ని శ్రీ సంపత్ కుమార్ గారు (రాజా అని నేను సన్నిహితంగా పిలుస్తూ ఉంటాను) నా చేతికిచ్చి, నా అభిప్రాయాన్ని నాలుగువరుసలలో వ్రాయమన్నారు. పుస్తకము పూర్తిగా చదివిన తరువాత నాకు సరళంగా, సంపూర్ణంగా, సవివరంగా ఉన్న భాగవద్గీతా సారం గుర్తుకు వచ్చింది. గీతాసారాన్నంతా ఇంత చిన్ని పొత్తంలో ఇమడ్చిన శ్రీనుబ్బరాయకవిగారు, శ్రీ సంపత్ కుమార్‌గారు బహుదా అభి నందనీయులు.

వారు తెలుసుకొన్న సత్యాన్ని, ఇతరులకు కూడ సులభంగా, సరళంగా అందించి వారిని తరింపచేయవలెనన్న వారి తపన, తాప త్రయములు అద్వితీయములు. శ్రీసుబ్బరాయకవిగారు, శ్రీసంపత్  కుమార్ గారు బాల్యమిత్రులు. పాఠశాల దగ్గర నుండి సహ విద్యా రులు. చిన్ననాటి నుండి వారి యొక్క ఆశయాలు, నడవడులు అభిన్న ములు. ఉత్తమాశయములు, అభిరుచులతో కలసి మెలసి జీవన యానం సాగిస్తూ పదవీ విరమణానంతరం కూడ వారు తమ స్నేహ బంధాన్ని కొనసాగిస్తూ, అధ్యాత్మిక జీవితం గడుపుతూ ఆధ్యాత్మి కానందాన్ని ఇతరులకు పంచిస్తున్నారు. మైత్రీబంధానికింతకంటే సార్థకత ఉంటుందా? 'సహజమార్గ' లక్ష్యాన్ని చూస్తే శ్రీమన్నా రాయణ మంత్రాన్ని జాతి, మత, కుల భేదములు లేకుండా సర్వమానవాళిని ఉద్దరించే ఆశయంతో ఎలుగెత్తి చాటిన శ్రీరామానుజుల వారు గుర్తుకొస్తున్నారు.

శ్రీ లాలాజీగారి ద్వారా ప్రేరితులై శ్రీరామచంద్రజీ మహరాజ్ గారు విస్తృతపరచిన, సులభ, సరళ ముక్తిదాయకమైన సహజమార్గ లక్ష్యాన్ని ఈ పుస్తకంద్వారా సుసంపన్నం గావిస్తున్న శ్రీ పి. సుబ్బ రాయుడుగారు, శ్రీ బి. సంపత్ కుమార్ గారు అభినందనీయులు.

నా కీ అవకాశమిచ్చినందుకు వారికి కృతజ్ఞతలు

                                                                                     డా|| కె. గోపీనాథ్, శంకరాపురం, కడప.


సూనృతము

శ్రీరామచంద్రజీ మహరాజ్ సేవా ట్రస్టు, కడప వారు ప్రచురించినసహజమార్గసాధన - వాస్తవ జీవిత లక్ష్యముఅనబడే ఈ చిన్నపుస్తకము పేరుకే చిన్నపుస్తకము అయినా పెద్ద విషయాలను లోతైన జీవిత విషయాలను ప్రస్తావించినది.

 1. మనకు వరంగా లభించిన మానవజీవితాన్ని ఒక లక్ష్యం, గమ్యం లేకుండ ఎలా వ్యర్థం చేసుకుంటూ పతనావస్థకు చేరుకుంటున్నామో బాగా తెలియజేశారు. ఈ పతనావస్థ నుండి ఎలా బయటపడాలో సూక్ష్మంలో మోక్షంలాగా ఇందులో తెలియజేయబడినది.

2. గురువు యొక్క ప్రాముఖ్యతను, విలువను ఇందులో బాగా తెలియజేయబడినది.

 3 మానవుడు ప్రాపంచిక వస్తువుల ఆకర్షణలో పడి జీవిత లక్ష్యాన్ని అర్థం చేసుకోలేక సంఘర్షణకు లోనై అనేక సమస్యలను తెచ్చి పెట్టుకొంటున్న ప్రస్తుత తరుణములో ఎలాంటి మార్గములో పయనించాలో బాగా అర్థము అయ్యేలా తెలియజేయబడింది.

 4. ధ్యానము యొక్క ప్రాధాన్యత ప్రస్తుత దినములలో అది ఎంత అవసరమో అట్లాగే భగవంతునిపై ధ్యాస వుంచడం ద్వారా అజ్ఞానమనే అంధకారం నుంచి ఎట్లా జ్ఞానమనే ప్రకాశంలోకి వెలుతురు మాదిరిగా రాగల్గుతామో చక్కగా తెలియజేయబడినది.

5. ముఖ్యంగా శ్రీరామచంద్రజీ వారిచే తెలియజేయబడిన దశనియమాలు అందరము ఆచరించినట్లయితే మానవ జీవితం ఎంత ఆనందంగా ఉంటుందో తద్వారా మానవుని లోని పాశవిక లక్షణాలు నశింపజేసి మానవునిలో దైవ లక్షణాలు పెంపొందింప జేసే విధంగా అందరిలోనూ ఆధ్యాత్మిక జీవన విధానాన్ని పెంచే విధంగా వున్న ఈ చిన్న పుస్తకమును ప్రతి ఒక్కరు చదవాలని, చదివినది ఆచరించాలని తద్వారా మానవజీవిత గమ్యాన్ని నిర్దేశించే అంత విలువైన ఈ చిన్నిపుస్తకం ప్రతి ఒక్కరి దగ్గర వుండుట శ్రేయోదాయకము.

                                                                                           డా॥ ఆర్. వరదరాజన్ బెల్లంమండివీధి, కడప.

 

వాస్తవ జీవిత లక్ష్యము

 మన పుట్టుక ఆకస్మికము, అకారణము మరియు అర్థరహితము కాదు. కార్యాకారణ సూత్రము ననుసరించియే కలిగినది. ఈ జన్మకు ఈ జీవనమునకు ఒక కారణము ఒక ప్రయోజనము ఉన్నది. హైందవమతము పునర్జన్మ సిద్ధాం తమును నమ్ముచున్నది. మన పుట్టుకకు కారణము మన పూర్వ జన్మ సంస్కారములు. వాటిని అనుభవించుట ద్వారా మాత్రమే అవి తొలగిపోవును. వేరొక మార్గము లేనే లేదు.

అట్లు మన పూర్వ సంస్కార పొరలను తొలగించుకొని, ఆత్మను శుద్ధము మరియు బంధరహితము గావించుకొనుటకే భగవంతుడు మనకీ జన్మనిచ్చి ఒక సదవకాశమును కల్పిం చెను.

భగవంతుడు ప్రసాదించిన ఈ అవకాశమును సద్వి నియోగ పరచుకొని తిరిగి భగవంతునిలో ఐక్యము పొందుటే మన జీవిత లక్ష్య ము అయి వుండవలెను. దీనిని మన మహర్షులు కైవల్యమనిరి. ఈ కైవల్యము నందుకొను నంతవరకు మానవ జీవనమునకు విశ్రాంతి ఉండరాదనిరి. అత్యంత ముఖ్యము జీవిత పరమగమ్యము అయిన ఈ స్థితి కొరకు వారు తపించిరి. ప్రపంచములోని దుఃఖములను కష్టములను వారు తమకు కేటాయించమని భగవంతుని ప్రార్థించిరి. పుట్టుక (భవము) అనెడిది రోగమైతే (భవ రోగము) దానికి సేవించవలసిన చేదు మాత్రలే ఈ కష్టములు, వ్యధలని వారు తలచిరి. ఎప్పటికైనను మనము ఈ మార్గమునే అసురించక తప్పదు.

అయితే మన జీవితమున జరుగుతున్న అనేక విష యములు వ్యతిరేక దిశన సాగుచున్నవి. ఉన్నత పదవులు, గొప్ప ఉద్యోగములు, రాజనీతిజ్ఞత గడించి ధనము, కీర్తి సంపాదించుటే జీవిత లక్ష్యముగా భావిస్తున్నాము. అందుకు అరిషడ్వర్గము (కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్స ర్యము) లకు లోనై జనన మరణ చక్రములో చిక్కుబడి పతన మగుచున్నాము. బంధరహితులం కావడానికి ప్రసాదింప బడిన ఈ జీవితాన్ని మరిన్ని బంధనలలో చిక్కుకొనే విధంగా నడచు కుంటున్నాము. ఈ భూమండలం ఒక కొలను లాంటిది. అడుగున బురద వుంది. కాని మనకు స్వచ్ఛమైన జలాశయంగా భాసిస్తున్నది. మనము అందులో దిగి స్నానము చేసి పరిశుద్ధులము కావడానికి వచ్చితిమన్న విషయం మరచి పోరాదు. అలాకాక లోతుకు వెళ్ళి బురద తెచ్చుకొని దాన్ని తలకు పులుముకోవడము అవివేకము అవుతుంది. ఇక మరి కొందరున్నారు. వారు ఏనుగుల్లా ప్రవర్తిస్తారు. కొలనులో దిగి శుభ్రముగా స్నానము చేస్తారు. కాని గట్టుకు వచ్చి మరల దుమ్ము తలపై చల్లుకుంటారు. అనగా వారు మంచిదారి ఎన్నుకుంటారు. కాని ప్రయత్నం కొనసాగించరు.

ఉదాహరణకు పురాణాలు పారాయణ (కథలు చదవడం, స్తోత్రాలు వల్లించడం, పాటలు పాడటం, భజనలు మొదలగు నవి) చేస్తారు. అందులోని మహనీయులను పూజిస్తారు. నైవేద్యాలు సమర్పించి ప్రసాద వితరణ గావిస్తారు. మరి కొందరైతే దీక్షలు బూని నియమ నిబంధనలతో దీక్షాకాలము పూర్తి చేస్తారు. ఆ తరువాత నియమ నిబంధనలను పూర్తిగా వదలి వేస్తారు. మహనీయులు ఆచరించి చూపిన ఆదర్శము, ప్రేమ, భక్తి, త్యాగము, నీతిని గురించి చాలామంది అసలుపట్టించుకోరు. జీవితంలో వాటిని ఆచరించరు. తమ తప్పులను (అధికార దుర్వినియోగం, ఆశ్రిత పక్షపాతం, అవి నీతితో సంపాదించడం, పరుల సొమ్మును ఆశించడం, అక్ర మాలు చేయటం మొదలగునవి) సవరించుకోరు. సవరించు కొనక పోగా తిరిగి వారి తప్పులను సమర్థించుకుంటారు. దీనివలన ఆశించిన ఫలితం అంతంత మాత్రమే 

ఈ విధంగా మనకు వరంలా లభించిన మానవ జన్మ వ్యర్థం చేసుకుంటున్నాము. ఇందుకు కారణం మన లక్ష్యం గమ్యం గురించిన అవగాహన పూర్తిగా లేకపోవటమే. ఈ అవగాహనా లోపం వల్ల మన ఆత్మ నావరించియున్న పూర్వ సంస్కారపు పొరలను తొలగించుకొనుటకు బదులు మరిన్ని కొత్త సంస్కారములను ఏర్పరచుకొని మరుజన్మకు కావలసిన ఏర్పాట్లను మరల మరల ఏర్పరచుకుంటున్నాము.

ఇట్లు జనన మరణ చక్రంలో చిక్కుకొని పోయి బయట పడే అవకాశమే లేకుండా పతనమవుచున్నాము. ఇది స్వయం కృతాపరాధ మనక తప్పినది కాదు. ఇప్పుడు మనము ఈ దురవస్థ నుండి బయట పడవలసిన సమయము ఆసన్న మయినది. పతనావస్థలో పడి చాలాదూరమే కొట్టుకొని వచ్చేశాం. ఇక చాలు. ఇక మనం వెనుతిరగవలసి వుంది. అందుకు కార్యోన్ముఖులము గావలసి ఉంది. ఈ మహ త్కార్యాన్ని మనం రెండు విధాలుగా చేపట్టాలి

అందులో మొదటిది. పూర్వ సంస్కారఫలాలను ఇష్ట పూర్వకంగా అనుభవించాలి. అవి కష్టములు, రోగములు, చిక్కులు మరియు బాధల రూపంలో కూడా వుండవచ్చును. అవన్నీ నేను పరిశుభ్రుడను కావడానికే, నా మేలు కొరకే కలుగుచున్నవన్న భావనతో ప్రశాంత చిత్తముతో, ఓర్పుతో భరించాలి. సుఖములు కూడా సంస్కార ఫలితములే గనుక కలిమిలో సమన్వయం తప్పి గర్వాతిశయం మరియు అహంకార భావములకు లోనుకాక భగవత్ ప్రసాదముగా భావించి, మానవతా దృక్పథము వీడక అనుభవిస్తూ వాటిని కూడా సక్రమంగా వ్యయపరచాలి. ఈ విధంగా ఇవి అవి అనక సమస్త సంస్కారములను తుడిచి వేయాలి.

ఇక రెండవ కార్యము కొత్త సంస్కారములను ప్రోగు చేసుకొనక పోవుట, అంటే పాతవి పోవలె, కొత్తవి చేరకుండా జాగ్రత్తపడవలె. ఇందుకు పెద్దలు చెప్పిన సులువైన మార్గము భగవదర్పణ భావముతో జీవితము గడుపుట. వచ్చినవిభగవత్ప్రసాదములుగానూ  తాను యిచ్చినవి భగవదర్పణములు గానూ భావించి

సమస్త కార్యములు కర్తవ్యపరంగా భగవంతుని కొరకు చేస్తున్నానని, తాను దేనికి కర్తనుకానని, కేవలం నిమిత మాత్రుడనేనని, తనను తాను నియంత్రించుకుంటూ జీవనయాత్ర  సాగించడం ద్వారా మాత్రమే సంస్కారము లంటకుండా కాలం గడచిపోగలదు.

ఈ విషయమై మహాత్మా రామచంద్రజీ (సహజమార వ్యవస్థాపకులు) వారు సూచించిన కొన్ని ఉదాహరణములను గమనింతము.

ఒక పని చేయుచున్నపుడు నీవు నీ కొరకు ఆ పని చేయుచున్నావని అనకొనకుము. నీ గురువుకై చేయుచున్నానని అనుకొనుము. భోజన సమయమున నీ గురువే  భోజనము చేయుచున్నాడని, నీవు కార్యాలయమునకు పోతివేని, నీ గురువే నీ పని అంతయు చేయుచున్నాడని భావింపుము. నీవు కార్యాలయము నుండి వచ్చునపుడు దారిలో ఒక ఆకర్ష ణీయమైన నాట్య ప్రదర్శన చూచినచో, నీ కనులా నర్తకి ముగ్ధమోహన రూపముచే నాకర్షితమగును. నీ ఆలోచనలు కొంత సేపు తప్పుదారి పట్టినట్లుండును. అప్పుడు కూడా నీ గురువే కాని, నీవు నాట్య ప్రదర్శన చూచుట లేదని తలంపుము. తక్షణమే నీకు దానిపై మోజు పోవును. ఏలయన గురుని శక్తి ప్రవహింప మొదలిడి నిన్నా ఆకర్షణ నుండి తొలగించును. నీవు కార్యాలయము నుండి తిరిగి ఇంటికి వచ్చినప్పుడు, చాలా గంటల తరువాత నీ పిల్లలు నిన్ను చూసి ఆనందముతో తృళ్ళింతలాడుదురు. నీవు కూడా వారి వినోదములకు సంతోషింతువు. అది సహజమే. నీవు దైవ చింతనకు కాస్తంత దూరమయినట్లు అనుభూతి చెండెదవు. నీవప్పుడు చేయవలసినదేమనగా నీలోని నీ గురువే వారితో వినోదించున్నాడని భావింపుము. అట్లయిన నీవు మరల నదే పవిత్ర చింతనతో సంపర్కము కలిగి వుందువు. నీవు వారిని దేవుని పిల్లలుగా పరిగణించి వారు పోషణకై నీ కొసగ బడినారని, వారికి నీవు అన్నియు సమకూర్చ వలసి ఉన్నదనియు కర్తవ్య బద్దుడవై వారిని చూచుకొనవలెనని బావింతువేని, నీవు దేవుని పిల్లలను సేవించినట్లు, తద్వారా దేవుడినే సేవించినట్లు అగును. దీనివలన నీవు అనవసరపు వ్యామోహము నుండి ముక్తుడవగుదువు.  

ఈ విధముగా మన ఆధ్యాత్మిక మార్గము నుండి గొప్ప ప్రతిబంధకము తొలగించుకొందువు. ఇదే విధముగా అని పనులందును నిన్ను నీవు సరిచేసుకొనవచ్చును. ఈ భావము పెంపొందించుకొని, నీ స్థానములో నీ గురువే సమస్తము చేయుచున్నాడన్న దృష్టి నెలకొల్పు కొన్నచో నీవు సదా ఎడతెగని భగవత్ స్మరణ కలిగి యుండుటేగాక, నీ కర్మల వలన ఎట్టి సంస్కారములు పుట్టవు. ఈ పద్ధతి చాలా తేలికయు సూక్ష్మ మును అయినప్పటికినీ, అన్ని పనులలోను ఆ మహాప్రభుని గూర్చి నిరంతర స్మరణ అలవడునట్లు చేయును. ఈ భావము హృదయములో లోతుగా పాతుకొని పోయినచో ప్రతి ఒక్క చర్యయు కర్తవ్యముగానే తోచును. అందులో స్వార్థచింతన మరియు వ్యామోహములకు తావు లేదు.ఈ విధముగా జీవనము గడుపువాడు ప్రపంచమున ఎవ్వరికి ఆటంకముగా నుండడు. అట్టివాని జీవితము తనకే గాక లోకమునకు కూడా మేలు చేకూర్చును.

ఇంతకూ మనిషి పై తెలిపిన విధంగా జీవించడము సాధ్యమేనా?  అన్నప్రశ్న, సాధారణంగా ఉత్పన్నమవుతుంది. ప్రాపంచిక వస్తువుల, ఢాంబిక పదవుల, పొగడ్తల ఆకర్షణలకు లోనై, ధనోత్పాదనకు పోటీపడి పరుగులు తీస్తున్న ప్రస్తుత పరిస్థితులను అధిగమించడం వీలు కాదేమోనని కూడా అని పిస్తుంది. నెలకొనివున్న తీవ్ర పోటీ నుండి మనం విరమించు కొని జీవించగలమా అన్న అధైర్యము కూడా కలుగుతుంది. నిజమే! అయితే మానవ జీవిత లక్ష్యాన్ని అర్థం చేసుకొన్నవాడు మార్పు వైపునకు మొగ్గు చూపుతాడు. ధైర్యంగా ఎదురీదటా నికి పూనుకుంటాడు.

దృఢ సంకల్పముంటే సాధించలేనిది, ఏదీ లేదు. ఇక్కడే గురువు సహాయము అవసరమౌతుంది. మరొక మాటలో చెప్పాలంటే గురువు సహాయమే భగవత్ సహాయము. గురువు మానవ రూపంలో మనకు సహాయము చేయటానికి వచ్చిన పరమాత్మ స్వరూపమే. ఆయన చూపిన మార్గములో పయనించడము ద్వారా, ఆయన మార్గదర్శకత్వంలో నడవడం ద్వారా మన ప్రయాణం సులువౌతుంది. మన శ్రద్ధాసక్తులు మనల్ని గమ్యం చేర్చడంలో సహకరిస్తాయి. ఈ కాలానికి తగటుగా భగవత్ సాక్షాత్కారానికి అనగా మన జీవిత లక్ష్యం చేరడానికి ఏర్పడిన ఒక సులువైన మార్గం శ్రీ రామచంద్రజీ వారు నిర్దేశించిన సహజ మార్గ విధానము.

భగవంతుడు సులభుడు. అట్టి భగవంతుని పొందటానికి అంతే సులభము, సూక్ష్మమయిన మార్గమును అవలంబించ వలసి వుంటుంది. కనుక అట్టి సులభతరమైన మార్గమును వారి గురువైన లాలాజీగారి నుండి గ్రహించి శ్రీరామచంద్రజీ వారు ప్రపంచమునకు తెలియజేసిరి. వీరు పతంజలి యోగ శాస్త్రములోని అష్టాంగయోగమునే ప్రాథమికముగా గ్రహించి నప్పటికినీ, అందుకు కాలానుగుణముగా మార్పులను చేయుట ద్వారా సులభ తరము గావించి సహజమార్గమను పేరిడిరి. పతంజలి యోగ శాస్త్రములోని అష్టాంగ యోగమునందలి, యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ అను మొదటి ఆరు అంగములను వదలి వేసి ఏడవది అగు ధ్యానముతో మొదలు పెట్టి సమాధిలోనికి ప్రవేశించునట్లీ  పద్ధతిని ఏర్పరచిరి. ఈ సహజ మార్గ పద్ధతికి ఒక ప్రత్యేకత కలదు. అది మూలము నుండి భగవదీయ శక్తిని గ్రహించి దానిని సాధకుని హృదయమున ప్రవేశ పెట్టుట. దీనినే శ్రీరామచంద్రజీవారు ప్రాణాహుతియనిరి. ఈ ప్రాణాహుతి విద్య భారతీయులకు కొత్త కాదు. శ్రీకృష్ణ పరమాత్మకూడా యీ ప్రాణాహుతి విద్య ద్వారా అర్జునునికి గీతాబోధ చేసి అతి తక్కువ సమయములో అర్జునుని ఉన్నత ఆధ్యాత్మిక స్థితియందు ఉంచగలిగెను. తద్వారా అతని మోహము నశించెను. గృహస్థ జీవితము ఆత్మోన్నతికి ఏ విధంగాను ఆటంకము కాదనియు, పూర్వపు మునులు పొందిన మహోన్నత స్థాయిని సైతం నేటి సామాన్య సంసారి, ఈ ప్రాణాహుతి ప్రసారము ద్వారా పొందగలడని శ్రీరామచంద్రజీ వారు తెలియజేసిరి

ఈ ప్రాణాహుతి శక్తి ప్రసారము జరుగుట వల్ల అష్టాంగ యోగ మందలి మొదటి ఆరు అంగముల ఫలితము దానంతట అదియే సమకూరి ఏడవది యగు ధ్యానమున సాధకుడు ప్రవేశించ వీలు కలుగుచున్నది. అంతేకాదు. భగవంతుని వైపు మన తిరుగు ప్రయాణము మొదలైన నాటి నుండి మార్గమధ్యములో సాధకునికి తన స్వశక్తితో పొందలేని అనేకశక్తులను ఈ ప్రాణాహుతి శక్తి ద్వారా గురువు ప్రసాదించి గమ్యము చేరుటలోని ఆటంకములను తొలగించును. సాధకుడు తన స్వశక్తికి వీలుకాని అనేక దివ్యానుభూతులను పొందుతూ ఆధ్యాత్మిక మార్గములోని ఆటంకములను అధిగమిస్తూ తుదకు గమ్యం చేరడము ఈ పద్ధతి ద్వారా సుసాధ్యమగును. ఈ మార్గమును అవలంభించిన వారికి శాంతి, నెమ్మదితనము, సంస్కార ఫలితములను అనుభవించగల ఓర్పు తమంతట అవే కోరకనే ప్రాప్తిస్తాయనటము  యేమాత్రం అతిశయోక్తి కాదు.

సాధకుని పురోగతి అతని శ్రద్ధ, భక్తి, గురువుపై గల ప్రేమ, తాను గురువు కొనర్చిన శరణాగతికి అనుగుణంగా వుంటుంది. శరణాగతి అనగా తనను తాను సంపూర్ణముగా గురువు కర్పించుకొని యీ సంసార బంధనముల నుండి విడివడుటయే. గురువుగారితో ఎంతగా బంధము ఏర్పడు తుందో అంతగా ప్రాపంచిక బంధాలు తమంతట తాము విడిపోతాయి.

సహజమార్గ సాధన మూడు విధములుగా విభజింపబడి ఉన్నది. అందులో మొదటిది ధ్యానము. సర్వత్రా నిండియున్న భగవంతుడు వెలుగై నా హృదయమున ఉన్నాడను తలంపుతో మనస్సును హృదయ స్థానమునకు (గుండె కొట్టుకొను ప్రదేశము) అంతర్గతముగా మరల్చి అక్కడే గమనిస్తూ ఉదయం ఒక గంట ధ్యానము చేయవలయును. హృదయ స్థానమున ఈశ్వరీయ ప్రకాశముపై చేయు ఈ ధ్యానము వలన హృదయమందలి రక్తము పవిత్రమై, ఆ పవిత్రత శరీరములోని అణువణువునకు వ్యాపించి మనలోని పాశవిక లక్షణములు నశించి, మానవీయ, దైవీయ గుణములు మేల్కోల్పబడుతాయి. తద్వారా మనము భగవంతుని యెడ జాగృతుల మౌదుము.

ఈ ధ్యానమున మనము ఈశ్వరీయ ప్రకాశమునకు యేవిధమైన రూపమును కల్పించరాదు. అది ఏదై యున్నదో అదే ఉన్నదను భావముతో చాలా సహజముగా ఏమాత్రము ఒత్తిడి లేకుండా సుఖాసనమున కూర్చొని ధ్యానించవలెను. ఎట్టి ప్రకాశము కనబడక పోయినను చింతించపనిలేదు. కేవలము ఉన్నదను నమ్మకమే చాలును. 

 ఇక రెండవది నిరంతర స్మరణ. ధ్యానసమయమున మనమనుభవించిన స్థితిని, ఆ తర్వాత వీలైనంత కాలము ఆ దినమున, మన పనులను మనము చేసు కుంటూకూడా అంతర్గతముగా కొనసాగించవలయును. దీనివల్ల భగ వంతునితో ఏర్పడిన పవిత్ర బంధము సడలి పోకుండా ఒక విధమైన పట్టును కల్గించును. ఈ స్థితి యందు ఉండు వాని వల్ల తప్పులు జరుగుటయన్నది ఉండదు. తద్వారా సంస్కా రములు ఏర్పడుట నిలచిపోవును.

ఇక మూడవది నిర్మలీకరణ. సాయంత్రము ఒక అరగంట ఈ నిర్మలీకరణ కార్యక్రమమును చేసుకోవలయును. ఒకే భంగిమలో కూర్చొని నీలోని ప్రతి అణువు నుండి నీ ఆత్మో న్నతికి ప్రతిబంధకములు అయిన మాలిన్యములు, జడత్వము, అంధకారము, తామసము, సంస్కారములు మొదలగునవి ఆవిరి రూపమున నీ శరీరము వెనుక భాగము నుండి బయటికి పోవచున్నవను సంకల్పముతో వుండవలయును. ఈ ప్రక్రియ మొదట కొంత కష్టముగా తోచినను కాలము గడిచిన కొలది యీ ప్రక్రియ మన కలవాటగును. ఇందుమూలముగా మన ' ఆధ్యాత్మికతకు ఆటంకములైన చిక్కులన్నీ తొలగిపోయి ఆధ్యాత్మిక ప్రయాణము సులభము మరియు వేగవంతము అగును.

ఈ సాధనకు తోడు రాత్రి పరుండబోవుటకు ముందు ప్రార్థన చేసి దైవ సాన్నిధ్య భావనతో నిదురించ వలయును. ఈ పద్ధతిలో చేయు ప్రార్ధన కేవలము మన వాస్తవ స్థితిని భగవంతునికి నివేదించుకొనుట తప్ప మరే కోరిక కోరటము లేదు.  ఆ ప్రార్థన ఇట్లున్నది.

                              ఓ ప్రభూ! నీవే మానవ జీవనమునకు లక్ష్యము.

                             మా కోరికలు మా ఆత్మోన్నతికి ప్రతిబంధకములై ఉన్నవి.

                           నీవే మా ఏకైక స్వామివి. ఇష్టదైవము.

                          నీ సహాయము లేనిదే నిన్ను పొందుట అసంభవము.

 

దీనముగా మన వాస్తవ స్థితిని భగవంతునికి నివేదించు కొను యీ ప్రార్థన ఎన్నటికినీ వృధా కాదు. ఇందులో ఎటువంటి కోరికలు, ఇచ్చ లేవు. కనుక భగవంతుని సంకల్పం ఏదై వుందో అదే జరుగుతుంది. దానితో మనం సంతృప్తి చెందటానికి సమ్మతితో ఉన్నాము. ఇంతకంటే ప్రశస్తమైన ప్రార్థన మరొకటి వుండబోదు.

ఈ సహజమార్గ పద్ధతిని అనుసరించు వారికి శ్రీ రామ చంద్రజీవారు దశ నియమములను ఏర్పరచిరి. ఈ దశ నియ మములు మనకు అలవడవలెనను భావముతో నుండవలెను. అవి ఎంతగా మన వశమైనచో మనమంత పురోభివృద్ధి చెంది నట్లు తెలుసుకోగలము. ఈ దశనియమములు  క్రింది విధముగా ఉన్నవి:

 1. ప్రొద్దు పొడవక ముందే నిద్ర లెమ్ము. సూర్యోదయమునకు ముందైనచో మంచిది. నిర్ణీత సమయమున ఒకే ఆస నమున కూర్చొని, ప్రార్ధన, పూజ (ధ్యానము) కావింపుము. మానసిక, శారీరక శుద్ధత (పవిత్రత) ప్రత్యేకముగా పాటింపుము.

2. ప్రేమ, భక్తి పూర్వక హృదయముతో నీ ఆధ్యాత్మికోన్నతి కొరకు ప్రార్థన చేసి పూజను (ధ్యానము) ప్రారంభింపుము.

3. భగవంతునితో సంపూర్ణ ఐక్వము పొందుటే నీ లక్ష్యముగా నిర్ణయించుకొనుము. దానిని సాధించునంతవరకు విశ్రమింపకుము.

4.  ప్రకృతితో సారూప్యము పొందుటకు నిష్కపటముగాను, నిరాడంబరముగాను వుండుము.

5. సత్యసంధత కలిగి యుండుము. దుఃఖములను దివ్యమైన దీవెనలుగా భావించి, అవి నీ మేలు కొరకే కలుగు చున్నవని కృతజ్ఞతా భావముతో నుండుము.

6. అందరిని సోదరులుగా భావించి అట్లే వారిని ఆదరింపుము.

7. ఇతరులు కీడు చేసినచో ప్రతీకార బుద్ధి పూనకుము. దానిని దివ్య బహూకృతిగా భావించి కృతజ్ఞతతో స్వీకరింపుము.

8. మంచి ప్రవర్తనతో, నిజాయతీతో ఆర్జించిన దానితో తృప్తి చెంది నిరంతర దివ్యభావములతో దానిని ఆరగింపుము.

 9. ఇతరులలోభక్తి ప్రేమ భావములు మొలకెత్తించునట్లుగా నీ జీవనమును మలచుకొనుము.

10.  వరుండబోవు సమయమున, దైవ సానిధ్య భావనతో, నీవొనర్చిన తప్పులను గూర్చి పరితప్తుడవు కమ్ము, వాటిని మరి చేయనని వినమ్ర భావముతో భగవంతుని క్షమాపణ కోరుము.

ఇక ఆఖరుగా ఇంకొక మాట. ఈ సహజ మార్గ పద్ధతిలోనికి ప్రవేశించుటకు కావలసిన అర్హతలంటూ ఏమీ లేవు. జాతి, మత, కుల, వివక్షలు యీమార్గమున లేవు. విద్యార్హతలంటూ, యేనిబంధనలు కూడా లేవు. ఉన్న ఒకే ఒక్క అర్హత అంగీకారమే. ఈ పద్ధతిలో భగవత్ సాక్షాత్కారము పొందవలెనను సంపూర్ణ ఇచ్ఛను ప్రకటించుటే అర్హత. ఈ పద్ధతిలో ముందుకు సాగుచున్న కొలది ఆధ్యాత్మిక జీవనమునకు అవసరమైన యోగ్యతలన్నీ వాటికై అవే మనిషిలో ఉత్పన్నమౌతాయి. పాశవిక లక్షణములు నశించి మానవీయ, దైవీయ లక్షణములు సహజసిద్ధంగా అలవడుతాయి. అయితే ఈ పద్దతితోపాటు ఇతర పద్ధతులను సైతం పాటించుట అంత ప్రయోజనకారి కాదు. అనేక పద్ధతులు ఒకేసారి పాటించుటనునది విశ్వాసలేమికి మరియు అపజయమునకు కారణములు. కనుకనే ఈ మాటయైనను చెప్పవలసి వచ్చినది. అంతియే కాని ఇతర పద్ధతులను ఏ మాత్రము కించపరచుటకు కాదు.

జిజ్ఞాసులు ఆలోచింతురుగాక!

v  

 

 మహాత్మా శ్రీరామచంద్ర వారి సూక్తులు

అనంతంతో అనుసంధానమే భక్తి.  

భగవంతుడనగా భగవంతుడే అది అదియే మైయున్నది, నిర్వచనమునకు అతీతుడు భగవంతుడు, నిర్వచనము నకు లోబడిన దేదియు భగవంతుడు కాదు,

హృదయ స్పందనయే (Feeling) భగవంతుని భాష.

స్వచ్ఛమైన యోచనే నిజమైన త్యాగం, అందుండే సేవాభావం ఉత్పన్నమౌతుంది.

నేను గురువునన్న భావం మనసులో చొరబడిన మరు క్షణం అతడు గురువుగా వుండే అర్హత కోల్పోతారు.

భగవంతుడు నీ హృదయంలోనే వున్నాడు. కానీ ఎప్పుడు? ఎప్పుడు నీవు అక్కడ లేవో అప్పుడే.  తత్త్వవేత్తలకు మేధస్సు జన్మస్థలం. కానీ యోగులకు పుట్టినిల్లు హృదయ కుహరం.

ప్రార్థనతో యాచిస్తాం. ధ్యానంతో పొందుతాం.

 

శ్రీ రామచంద్రజీ మహరాజ్ సేవాట్రస్ట్, కడప

 

పూజ్యలాలాజీ మరియు మన ఆధ్యాత్మికప్రగతి

  పూజ్యలాలాజీ మరియు మన ఆధ్యాత్మికప్రగతి సోదరీసోదరులమైన మనమంతా యిక్కడ యీదినం (ఫిబ్రరవరి 14/ బుధవారం 2024) మన ఆదిగురువులైన పూజ్యలాలాజీవారి 1...