ఆండ్రూ పొరే(ఫ్రాన్స్) గారికి బాబూజీ
వ్రాసిన లేఖలలోని కొన్ని భాగాలు
తెలుగు అనువాదం: పి.సుబ్బరాయుడు, కడప.
మనపై ఆధ్యాత్మిక
సత్త్వాన్ని వాస్తవంగా ప్రయోగిస్తూ మనల్ని పోషిస్తున్న పూజ్యశ్రీ బాబూజీ గారిని
గురించి చదివి తెలుసుకోవడం మనకెంతో ఉత్తెజాన్ని కలుగచేస్తుంది. బాధాతప్త హృదయులైన సాధకులు తమ సాధనా మార్గములో ఆ దివ్య శక్తి ధారలో లీనమై
ఓదార్పును పొందారు. ఆయన కృపామయ మార్గదర్శకత్వంలో సాధకుల పురోభివృద్ధికి సంబంధించిన అన్ని
జాగ్రత్తలు వహించారనడం వేరుగా చెప్పనవసరం లేదు. ఎట్టి భేద భావము లేకుండా అభ్యాసులతో ఆయనేర్పరుచుకొన్న ప్రేమానుబంధం
ఆదర్శప్రాయమైనది. ఆయన ప్రసరింప చేస్తున్న ప్రాణాహుతి ప్రసార నైపుణీ విద్య తన ఎదురుగా ప్రత్యక్షముగా
సమీపమున నున్నవారినీ, తనతో విడదీయరాని పవిత్ర బంధము కొనసాగిస్తున్న అప్రత్యక్ష దూరస్తులను సైతం
ప్రభావితము చేసి వారి అంతరాంతరాళాలను పవిత్రీకరించి వారిలో వ్యక్తిగత మార్పును
తీసుకొనిరాగల సమర్థవంతమై యున్నది. ఆధ్యాత్మిక రంగమున ఆయన విప్లవాత్మక మార్పులను ప్రవేశపెట్టుటద్వారా
మహత్తరమైన ఆధ్యాత్మిక ప్రయోజనమును జనులందుకొనుచున్నారు. అయాచితముగా లభించిన ఈ మహాఫలము దేశకాల పరిస్తితులకతీతముగా సంప్రాప్తమగుచున్నది . ఈ కారణముననే సహజమార్గ సాధనా ఫలితము ఊహింప శక్యము
గాకున్నది. మన గురువర్యులు ఆధికారికంగా ఒక విషయం ప్రకటించారు. అదేమిటంటే యిక్కడ ఒక అద్భుతం
కావింపబడింది. కానీ దాన్ని ఎవరూ గమనించ లేకున్నారు. ఇదే ఒక రకమైన వాస్తవ
సత్యాద్భుతం.
ఏ స్థితిని ఇతర సంస్థలు ఆఖరుది, అంతము అంటున్నాయో ఆ స్థితిని ప్రారంభంగా చేసుకొని సహజమార్గ పద్దతి కొనసాగుచున్నదని మన
గురువర్యులు సాధికారికముగా తెలియచేసి యున్నారు. ఇది చాలాకాలంగా సాధన చేస్తూ, పట్టు సాధించిన
అభ్యాసులే కాక నూతనంగా సహజమర్గాన్నవలంభించిన ప్రారంభకులకు సైతం అనుభవైకవేద్యమైన
పరమ సత్యం.
***
సహజమార్గము సంతరించుకొన్న కొన్ని ప్రత్యేకతలు ఈ క్రింద తెలియచేయడమైనది.
* తమేర్పరచిన ఆటంకములు తొలగించి వేయబడినవి.
* ఆధ్యాత్మిక పరిధి సువిశాలమొనర్పబడినది.
* అగాధము, అగమ్యగోచరము, అసాధ్యము
అనబడుచున్న దైవ సాన్నిధ్యము, సుసాధ్యము
చేయబడినది.
* సత్యతత్వావరణము మృదుల దివ్యత్వముతో నింపబడి మరల విశ్వమున విడుదల చేయబడినది.
* భావప్రాధాన్యమైన అధ్యాత్మిక రంగము సముచిత రీతి విస్తృతము గావింపబడినది.
* పరివ్యాప్తమైన సువిశాల అధ్యాత్మిక పరిధి అంతయు తేటతెల్లము చేయబడి వెలుగులోనికి
తేబడినది.
* సమగ్రముగా చెప్పవలెనన్న అత్యంత సరళమైన భగవత్తత్వమును పొందుటకు, అంతే సరళమైన మార్గమున బహు స్వల్ప కాలమున, అదియూ ఈ
జీవితకాలములోని స్వల్ప సమయముననే సుసాధ్యము చేయబడినది.
1. ధ్యాన సమయమున వెలుగును గమనించినట్లయిన యోగము ప్రారంభమైనదని పతంజలి
యోగశాస్త్రము ప్రకారము నిర్ధారించవచ్చును. కొంతకాలము తర్వాత వెలుగు తగ్గి
అంతకంటే ప్రశస్తమైన స్థితికి తావొసగును. వాస్తవ సత్యస్థితి యందు వెలుగు
చీకటులు రెండూ లేవని ఋగ్వేదములోని నారదీయ సూక్తములో చెప్పబడినది. అక్కడ సూర్యుడెప్పుడూ ప్రకాశింపడు. అక్కడ ఉనికి ఒక చిత్రమైనది. ఆ
ఉనికిని అనుభవము పొంది మాత్రమే ఆనందించనగును.
2. అనుభవము రెండు విధములు. ఒకటి ఊహాజనితము, రెండు దైవికము. అభ్యాసి సక్రమ మార్గము ననుసరిస్తూ వుంటే ఊహాజనితానుభవము కూడా దివ్యత్వముతో
సంబంధమేర్పరచుకొనే వుంటుంది. ఊహ సహితం దాని స్వచ్చస్థితిలో లీనమై మన స్థితి
దివ్యత్వం చెందే సమయమాసన్నమౌతుంది. చక్రములనధిగమిస్తూ ప్రయాణం సాగినపుడు వాటికి
సంబంధించిన అనుభూతులు, అనుభవాలు కలుగుతూ
వుంటాయి. చక్రాల వద్ద గలిగే అనుభూతులు మనం ముందుకు వెళ్ళే కొద్ది అంతరించిపోతూ చివరకు మనిషి మానసికంగా నగ్నంగా మారిపొతాడు.
8. నీవు ఉత్తరం వ్రాస్తూ సంస్థ పనంతా ఏటికి నీరు వెళ్ళి చేరినట్లుందని తెలిపావు. ఏ విధమైన ఆలోచనాపరమైన లేక చేతలవల్ల కలిగే సంస్కారములంటని స్థితి యిది. సహజమార్గ విధానములో సంస్కారములేర్పడుట నిలిచిపోతుంది. హైందవశాస్త్రానుసారం, ఏర్పడ్డ పూర్వ సంస్కారాలు కూడా బలహీనపడి దగ్ధము చేయబడతాయి. ఈ విధంగా మనం పునర్జన్మవృత్తాన్ని సమాప్తం చేసేసు కుంటాము.
9. నీవు నన్ను కొన్ని ప్రశ్నలడిగావు. కానీ వాటికి నీవే సరియైన
జవాబులు కూడా చెప్పావు. శూన్యస్థితియే అన్నింటికన్నా గొప్ప స్థితి. వాస్తవమునకు తరుగుదలే సంపూర్ణత. ప్రాణాహుతి ప్రసారం వల్ల శూన్యత
పెరుగుతూ మనిషి పరిశుభ్రపడతాడు. శూన్యత నిజానికి సత్యతత్త్వంలో
ఒక భాగమే. నీవు వ్రాసేది, నేననుకొనేది అంతా సమమై శూన్యము, సంపూర్ణము అనే పదాలకు అర్థమేలేని దశకు చేరుకుంటాము.
1౦. నా ఆలోచన ప్రకారం మనలో శాంత స్వభావం కొనసాగాలంటే తెలిసిగానీ తెలియక గానీ
ఆధ్యాత్మికత వైపుకు వచ్చి తీరాల్సిందే. ప్రపంచం కలతలతో అస్తవ్యస్తంగా
వుందని అందరికీ తెలుసు. మనం సృష్టిని విచ్చేదం చేయడానికి రాలేదు. దాన్ని సక్రమంగా వుంచడానికి వచ్చాము. ఒక వ్యక్తి సక్రమంగా వున్నాడంటే అతని
రెండువైపులు సక్రమంగానే వుండాలి. దానర్థమేమంటే ఇప్పుడు మనం
జీవిస్తున్న ఈ ప్రపంచమూ మరణానంతరం మనం వెళ్ళే అవతలి ప్రపంచము రెండూ సక్రమంగా
వుండాలన్నమాట.
12. ఇక్కడ భారతదేశంలో కూడా నిశ్శబ్దం పాటించే ప్రత్యేక తెగ ఒకటుంది. కానీ వారు పాటించే నిశ్శబ్దం కేవలం బాహ్యమే. అంతరంగంలో మాత్రం దానికేమాత్రం సంబంధం లేకుండా వుంటారు. నీవన్నది పరమ సత్యం. నిశ్శబ్దంలో కూడా అనేక దశలున్నాయి. కేవలం బాహ్యమైన నిశ్శబ్దం
అంతర్దశకు సంబంధించిన అనుభూతులనివ్వలేదు. అంతర్గత నిశ్శబ్దం ఒక
ఆధ్యాత్మిక స్థితే. అదే నిశ్శబ్దంలో నిశ్శబ్దం. అంతర్గత నిశ్శబ్దం రానురాను, మనం పురోగమించే కొద్దీ మరీ మరీ తేలికౌతూ పోతుంది. అలా తేలికౌతూ తేలికౌతూ, మన అంతర్గత నిశ్శబ్దం ఒకానొక దశలో నిశ్శబ్దమన్న భావనకూడా లేకుండా పొతుంది. ఆ దశ వస్తే మన లోపల బయట అంటే సర్వంసహా అంతా నిశ్శబ్దమే అయిపోతుంది.
13. నా భావనలో ఈ ధ్యానం సృష్ట్యాది నుండి కొనసాగుతూ కొనసాగుతూ ఎన్నో యుగాలు
ముందుకు సాగాయి. మధ్యయుగంలో మానవులు దీనినుండి ప్రక్కకు వైదొలగారు. దానిఫలితంగా మానవత్వపు అధమ స్థితికి పతనమయ్యారు. ఈ పతనావస్థే ధ్యానము యొక్క అత్యావశ్యకతను ప్రత్యక్షంగానో, పరోక్షంగానో సూచిస్తూవుంది. అలజడికి గురైన ఆత్మకు ప్రశాంతత
దీనివల్లే కలుగుతుందని అంగీకరిస్తున్నాం. నేడు మన పాశవికత, మనం ముందు పోగొట్టుకున్న దాన్ని గుర్తు చేస్తొంది. కారణం, ప్రవేశించిన ధూర్తత్వంతో తద్భిన్నమైనదానిని మనం
పోల్చి చూచుకుంటాం.
16. దేవుడు క్రీస్తుకు వెలుగునిచ్చాడు. దానితో ఆయన తన కర్తవ్య నిర్వహణ
గావించాడు. దైవం క్రీస్తుకు ప్రాసాదించిన వెలుగుపైనే మనం ధ్యానం చేస్తున్నాం.
ప్రతిఒక్కరూ అనందంగా జీవితాన్ని గడపాలనుకుంటారు. కానీ ఒక్క సాధువు తప్ప ఎవ్వరూ ఆనందంగా లేరు. "జీవితానికి" సాధువు చెప్పే నిర్వచనం, సామాన్యుడు చెప్పే నిర్వచనం వేరు వేరుగా వున్నాయి. మానవ హద్దులు విచ్ఛిన్నము గావింపబడిననే తప్ప ఏర్పడని ఉన్నత జీవితమును సాధువు
ఆనందించుచున్నాడు. అట్టి పరిస్థితులలోనే అవిచ్ఛినమైన ప్రశాంతత లోనికి ప్రవేశించి సమత్వ జీవితము
గడప వీలవుతుంది.
18. నీవు ఇతరులకు ప్రాణహుతి ప్రసారం చేస్తున్నప్పుడు ఏదో పొందుతున్నట్లు
అనుభూతి చెందుతున్నావన్నది సరియైన అనుభూతియే. ఇతరులకు ప్రాణాహుతి ప్రసారం చేస్తున్నానన్న భావన రాగానే శక్తి నీలోనికి
ప్రవేశిస్తుంది. ఇది అభ్యాసుల ప్రయోజనార్థం జరుగుతుంది. ఇందులోని అధికభాగం ప్రబోధకుని
వంతుగా లభించి అతడు రెండింతల ఫలాన్ని పొందుతాడు. నీవేదైనా మాట్లాడినా, నాలుగు మాటలు అన్నా
వెంటనే ఒక శూన్యమేర్పడి, ఆ ఖాళీలో
ఆధ్యాత్మిక శక్తి నిండిపోతుంది. అది అంతరాంతరాళాలోనుండి
వస్తుంది. మాటలకు మూలము యోచన. యోచనలు పవిత్రమైతే మాటలు కూడా పవిత్రము, ప్రతిభావంతము అయి
వుంటాయి.
సంస్కృతములో చెప్పబడిన "సుషుప్తి" అనబడే గాఢ నిద్రలో మనిషి
స్తబ్దతనొంది గాఢ నిద్రకు అవసరమైన శక్తిని అన్ని వైపుల నుండి గ్రహిస్తాడు. శక్తి ఎప్పుడు మందగిస్తుందో అప్పుడు జ్ఞాపక శక్తిని కోల్పోతాడు. జ్ఞాపకశక్తి
అట్లేవుంటే మనిషి సుషుప్తి దశను చేరుకోలేడు. కారణం రెండవది అతన్ని గాఢ
నిద్రకు పొనీకుండా నిరంతరం అలజడి కలిగిస్తూనే వుంటుంది.
19. మా గురుదేవుల విషయం ఒకటి నాకు బాగా జ్ఞాపకముంది. ఆయన ఎప్పుడు మాట్లాడినా కొంతమంది పారవశ్య స్థితిలోనికి వెళ్ళిపోయి వుండేవారు. నేను, నువ్వు మాట్లాడేటప్పుడు అలా జరగడం లేదు. కానీ, నేను ఖచ్చితముగా చెప్పేదేమంటే, ఇది ఒక సూది మందు పనిచేసినట్లు పనిచేసి అద్భుత ఫలితాన్నందజేస్తుంది. మొదట మాట బయల్వెడలి తర్వాత వ్రాతగా మారుతుందనుకుంటాను. ఇది వాస్తవమని నాభావన. అందుకే మాటలో కొంత స్థౌల్యత
వుంటుంది.
ప్రతి ఒక్కటి కొంతకాలానికి పాతదైపొతుంది. క్రొత్తమోతాదు యివ్వకపోతే తేడా తెలిసే అవకాశం లేదు. భారతదేశంలో యోగవిద్య బహుపురాతనమైనది. కానీ అభివృద్ది నిలిచిపోయింది. కారణం ఎముకల నుండి భాస్వరం బయటికి తీసినట్లు యోగసారాన్ని గ్రహించటం మరచిపోయారు. విషయాలు యావత్ ప్రపంచానికి తెలియవస్తాయి. అంటే ఈ మార్గాన్నే అవలంభిస్తారు. మనం శ్రమించి ఆ తరుణం తొందరగా
వచ్చేట్టు చేయగలం. నేను వ్రాసినవన్నీ యిప్పుడో అప్పుడో జరిగి తీరుతాయి. నీవు గమనిస్తావని నీకు వ్రాస్తున్నాను. ఆధ్యాత్మికంగా ప్రపంచమంతా
జాగురూకత చెందింది. సుదూర భవిష్యత్తులో కమ్మ్యూనిష్టులు కూడా ఈమార్గాన్నే అవలంభించడం నీవు
గమనిస్తావు. ఆధ్యాత్మికతకు ఆధారభూతమైన ప్రశాంతతకు దాదాపు మనందరము చేరుకున్నాము. కదలిక మొదలైంది. అది యిక ప్రశాంతతకావలి దశకు చేరుస్తుంది. ఇంతవరకు మనకు ప్రశాంతతకు ముందుటి దశ మాత్రమే తెలుసు. ఆవలి దశ చాలా కొద్ది మంది మాత్రమే ఎరుగుదురు.
21. నీప్రశ్నకు జవాబిచ్చే ముందు నేను ధ్యానాన్ని నిర్వచించాలనుకుంటున్నాను.
ధ్యానమంటే వెన్న తీయడానికి పాలను మధించటం వంటిది. నది ప్రవహిస్తూ వుంది. అలలకడ్డంగా ఒక దుంగ అడ్డమొస్తే నీరు నిలబడుతుంది. అదేవిధంగా ధ్యానసమయంలో మన పూర్వ మరియు ఈనాటి జీవితంలోని సంస్కారాలు
హృదయానికెగబ్రాకుతాయి. కారణమేమంటే ధ్యానంవల్ల ఒక విధమైన శూన్యత ఏర్పడుతుంది. ఆశూన్యంలోనికి సంస్కారాలు చొచ్చుకొని ప్రవేశిస్తాయి. అప్పుడు మనం అభివృద్ది కుంటుపడినట్లు భావిస్తాము ఈ విధంగా దాదాపు అందరిలోను
జరుగుతూవుంటుంది. కనుక ఈనిలుపుదలే ఒక రకంగా మన పురోభివృద్దిగా భావించ వచ్చు.
కారణమేమంటే తదనంతర స్థితి తెరువబడుతుంది. పూర్వ స్థితికి సంబంధించిన ఎరుక
లేకపోతే ఆ మరుగుపరచబడిన ఎరుకే తెరవెనుకనుండి పనిచేస్తూవుంటుంది. అయితే అది నీకు
తెలియకపోవచ్చు.
22. భారతదేశంలోని పూర్వకాలపు ఋషులు శాస్త్రవిద్యను కూడా పరిగణలోనికి
తీసుకొనేవారు. అది వారు తమ అతీంద్రియస్థితిని పనిచేస్తున్న స్థితిలో వుంచుకొని వారి
మనశ్శక్తిని సర్దుబాటు చేసుకొనుటకు వినియోగించుకొనేవారు. అంటే వారు ప్రతి విషయాన్ని భగవత్ సాక్షాత్కారానికి అనువగునట్లు గ్రహించే వారు.
ప్రతి విషయము చక్కదిద్దబడి సత్పలితాన్నిచ్చేదిగా సరిచేయబడేది. కేవలం మరీ మరీ
ఆలోచించినంతమాత్రాన పనిజరుగదు. నీకు కొన్ని సందర్భాలు
తెలియచేస్తాను. భరద్వాజుడనే ఒక ఋషి వుండే వాడు. ఆయన భౌతిక శాస్త్రములో నిపుణుడు. ఆయన అతి ముఖ్యమైన నక్షత్రముల బరువులను నిర్ధారించి వ్రాసిపెట్టాడు. విమానాలకు
పాదరసం ఇంధనంగా వాడవచ్చని కూడా లిఖించాడు. ఇంకో మధ్యయుగపు ఋషి చాణక్యుడు శాస్త్రీయమైన మరియు వైద్యగ్రంధాలు రచించాడు. అవి లభ్యమౌతున్నా వాటి సంస్కృత భాష జఠిలమై వున్నది.--- ఆత్మసాక్షాత్కారానికి
శాస్త్రవిద్య అంత ప్రాధాన్యత వహించదని తేల్చి చెప్పడానికివి ఉదాహరణలు. నా ఎదుట ఒక వైపు వజ్రము మరో వైపు రవ్వంత ఆధ్యాత్మికత వుంచితే నేను ఆ రవ్వంత ఆధ్యాత్మికతనే కోరుకుంటాను. ఇది యుగయుగాలనుండి భారతీయుల సహజసిద్దమైన ఆలోచనా సరళి.
మనమనుసరించు పద్దతి శాస్త్రీయమే. అది పదార్థపు హద్దులనధిగమించి
ఆవలికి గొంపోతుంది. నీవొకసారి షాజహాన్‌పూర్ లో వున్నప్పుడు ఈ ప్రాంతపు
కలెక్టరువారిని నీకు పరిచయం చేసివుంటిని. అపుడు ఆధ్యాత్మిక చర్చ
జరుగుతుండగా "మేము భౌతికత్వంతో విసిగి పోయి, ఆధ్యాత్మికత వైపుకు మళ్ళాము. ఐతే భారతదేశం భౌతికత్వం వైపు
వెళుతున్నది" అని అన్నావు.
పురోభివృద్దిలో కొంతవరకు శాస్త్రవిద్య అనేకవిషయాలను వివరిస్తుంది. ఎప్పుడైతే మనం వస్తుపరిధిని దాటి వెళతామో ఆ దశలో శాస్త్రవిద్య వూరకుండి
పోతుంది. మన పద్దతి శాస్త్రీయమే. శాస్త్రము, మనం దివ్యత్వపు
గడపదాటగనే అంతమౌతుంది. అంటే మనం వెనక్కు తొంగి చూచి ముందుకు వెళ్ళి ఫలితాన్ని పొందుతున్నాము. మన దేహమంతా శూన్యం గావింపబడుతుంది.(రాజయోగ ప్రభావం అను నా పుస్తకమున ఈ విషయం
విశదీకరించబడింది). మనం ధ్యానం చేస్తూ పొతే ఒక విధమైన శూన్యత్వం ఏర్పడుతూబోతుంది. ఆ శూన్యంలో దివ్యత్వం వచ్చి చేరుతుంది. అది నీ ఆహ్వానాన్ని ఆశించకనే
ప్రవేశిస్తుంది. నీవు అనిర్వచనీయమైనదేదో పొందుతావు. అదే నీవు పొందదగిన విలువైన
కానుక. ఒక వ్యక్తి చనిపోయే వరకు అధ్యాత్మికాభివృద్ది నాశించక పోవచ్చు, కానీ అతని మనస్సులో పసిబిడ్డ తన తల్లితండ్రులపై చూపే ప్రేమ భావమైనను వుండాలి. అప్పుడతడు తల్లి నుండి ప్రేమను పొందుతాడు. దాన్ని తండ్రి వ్యక్తిత్వాన్ని పొందడానికి వెచ్చిస్తాడు.
24. మనం "అవును" "కాదు" అనే వాటికి బందీలమై వున్నాము. కానీ మనకు "అవును"
అని ఎక్కడ వాడాలో "కాదు" అని ఎక్కడ వాడాలో తెలియడం లేదు. ఇదంతా మనకు అనుభవం ద్వారా తెలియాలి. అనుభవం ప్రయోగం వల్ల
కలుగుతుంది. ఏ విషయాన్నైనా సానుకూలంగా యోచిస్తే అది వివరింపబడుతుంది. అలాగే మనం ఒక విషయంలో "కాదు" "పోదు" "లేదు" అనే
వైఖరి వహిస్తే ఆ "కాదు" "లేద"న్న విషయమే తెలుపబడుతుంది. ఎప్పుడు ఒత్తిడి కలుగచేసుకుంటామో అప్పుడే ప్రశాంతత వెళ్ళిపోతుంది. అలాగే ఎప్పుడు ఒత్తిడి తొలగుతుందో అప్పుడు ప్రశాంతత మిగులుతుంది. అది అంత బరువైనది కానప్పటికి ఎంతో కొంత వున్నట్లే లెఖ్ఖ. రెండూ పోతే దాన్ని నిశ్శబ్దస్థితి లేక అసంపూర్ణశూన్యత అంటారు. సంపూర్ణశూన్యత అనునది అసాధ్యమే అయినా దాన్ని వీలైనంత పొందగలగాలి.
సంపూర్ణశూన్యం భగవంతుడే. దివ్యత్వంలో లీనమైతే ఈ శూన్యస్థితి కరగి కరగి అతి సామీప్య స్థితికి
చేరుకుంటాము. ఈ విషయం బహుశాః నీ ఉత్తరానికి సంబందించని విషయమే. అయినా ఆ అనంత తత్త్వానికి సంబంధించిన జ్ఞానాన్నిస్తుంది.
నిశ్శబ్దత ఆధ్యాత్మికపు ఒక భాగములో రవ్వంత మాత్రమే. అదే మహత్తత్త్వము గాదు. దీన్ని వివరించాలంటే అది నిశ్శబ్దం
లో నిశ్శబ్దం అని అనవచ్చు. క్రితంలో నీకు వ్రాసినట్లు అది
భగవంతునికి అతి సామీప్యస్థితి. అంటే నిశ్శబ్దం నిలవడానికి
నిశ్శబ్దమే ఆధారము. దీన్ని ప్రత్యక్షంగా చూపవచ్చు. నీవు కూడా దీన్ని చక్కగా
చేయగలవు. దానికి సంబంధించిన భావన చేయ్యి చాలు అదే మొదలవుతుంది. సహజమార్గము భగవత్ సాక్షాత్కారాన్ని అనుభవంలోకి తెచ్చే పద్ధతి. సాధన ద్వారా మాత్రమే నిశ్శబ్దతను విశ్లేషించగలము. మన బాహ్య నేత్రములు చూడలేని సూక్ష్మక్రిములు ఎన్నో వున్నాయి. మనం దర్శించలేక పోయినా అవి మాత్రం వుండనే వున్నాయి. అట్లే నిశ్శబ్దం వ్యక్తీకరించలేని స్థితిలో ఉంది. దానిని మనం గమనించ లేక పోవచ్చు. అయినా అది వుంది. దీన్ని నిరంతర సాధన ద్వారా దర్శించవచ్చు. అదే విషయాన్ని మరోలా యీవిధంగా వివరించడం జరిగింది.
కనుక ప్రార్థన ద్వారా మనం బాహ్య శబ్దాలనుండి బాహ్య నిశ్శబ్దతతకు వెళతాం. అంతఃశుద్ధీకరణ ద్వారా బాహ్య నిశ్శబ్దం నుండి అంతర్నిశ్శబ్దతకు చేరుతాం. అంతర్గత తమస్సే లోపలి శబ్దం. అది శారీరక మానసిక ఒత్తిడులవల్ల
జనిస్తుంది. ఒత్తిడిని నివారించడం వల్ల శూన్యత కలుగుతుంది. ఇది అంత రొద కలిగించదు. ప్రార్థన వల్ల మనం గమ్యం
దరిదాపులకు చేరుతాం. కారణం మనం ఉనికిలోనున్న దివ్యత్వంతో సంబంధమేర్పరచుకున్నాం. నీవు, నీ గమ్యం అన్నవి రెండు ఉన్నాయి. యిప్పుడు నీవే అసలు సత్తాతో కలసిపోవాలనుకుంటున్నావు. కనుక ఆశించిన ఫలితాన్నందుకున్నాం. ఇవేవి ఖాతరుచేయకుండా
వచ్చినట్లయితే నీలో అద్భుతశక్తులు మాత్రం ఉత్పన్నమౌతాయి. ఇవి సక్రమ పద్దతిలో ఉపయోగిస్తే అమృతమే ఇస్తాయి. వక్ర మార్గంలో ప్రయోగిస్తే దారుణమైన హాని కలుగచేస్తాయి. పద్దతి గురించి నీకు ముందే తెలుసు.
ఒత్తిడి నిర్మూలించడమంటే వెలితి లేకుండా తేలికగా ఎదగడం అని అర్థం. అది ఒక రకంగా సన్మార్గం వైపుకు మారడమన్నమాట. పారదర్శకస్థితి సంపూర్ణంగా హద్దులు లేని స్థితి కాదు. కారణం అక్కడ ఇంకా ఏదో వుంది. అందులోంచి నిన్ను ఇంకా తొంగి
చూడనిస్తోంది.
ధ్యాన సమయంలో వచ్చే ఆలోచనలు కేవలం బాటపై ఆడుకుంటున్న పిల్లలవంటివి. నీ మనస్సు వాటిపై మరల్చకుంటే చాలు. అవి నిర్వీర్యములై పోతాయి. వాటికి విలువే వుండదు. ఆలోచనలు నిన్ను అసలు ఇబ్బంది
పెట్టడం లేదు. కానీ నీవే అనవసరంగా ఇబ్బంది పడుతున్నావు. వాటిని తొలగించుకునే పద్దతి నీవే చెప్పివుంటివి. అవి పడిపోవడానికే వుత్పన్నమౌతున్నాయి. అవి వాటి స్థానాన్ని విడిచి
వెళ్ళిపోతున్నాయి. మన పద్దతి ప్రకారం అనవసరమైన విషయాలకు దూరంగావుండి లోనికి ప్రవేశించనున్న
దివ్యత్వం కొరకు ఎదురు చూస్తూ వుండాలి. "రాజయోగ ప్రభావము"
అను నా పుస్తకంలో తెలిపినట్లు "బి" స్థానము సంస్కారముల స్వస్థలము. హృదయంలో కొద్దిగా శూన్యత వుంది. ధ్యానం యొక్క శక్తి హృదయంపైని
తెర చీల్చివేసినంతనే ఆలొచనలు హృదయ శూన్యతలోనికి లాగబడతాయి. ఎప్పుడు ఆలోచనలు ఎగసిపడతాయో అప్పుడు నీవు అలజడికి గురౌతావు. కనుక ఆలోచనలు నీజోలికి రావడము లేదు. నీవే వాటితో జోక్యము
కలిగించుకుంటున్నావు.
26. నేను భగవంతునికి మారుగా శూన్యత్వము (ఏమీలేని భావన) అనే పదాన్ని వాడుతూ వుంటాను. కానీ నేను కేవలం "శూన్యము" అనిగాక దానికి "త్వము" కూడా చేర్చి వాడాను. ఎప్పుడైతే మనం సూక్ష్మాతి సూక్ష్మ వస్తువును గురించి యోచిస్తామో అప్పుడు మన భావం వెనక్కి మరలి నిజంగా ఆ వస్తువుయొక్క అన్వేషణలో పడుతుంది. నీవు "అవును" అన్నంతనే "కాదు" అన్న భావన కూడా స్థానమేర్పరచుకుంటుంది. కనుక భగవంతుడు "అవును" కాదు, "కాదు" కూడా కాదు. నేను "కాదు" అంటే అది ఉనికి లేనిదౌతుంది. ఒక వేళ "అవును" అంటే వునికిలో నున్నదన్న భావన కలుగుతుంది. భగవంతుడు రెండింటికి అతీతుడు. దయచేసి ఇంకే పదం వాడాలో ఆలోచించు. అదే ఆ శూన్యత్వం ఆ "కానీ-అవును". ఒక్క మాటలో చెప్పాలంటే మన అంతిమ గమ్యం ఆ అనంతుడే అయి వుండాలి. అతడు ఏ స్థితిలో వుంటేనేం? దానికి సంబంధించిన చింత మనకవసరం లేదు.
***
ఒక అభ్యాసికి గురువర్యులు వ్రాసిన లేఖ
నా రచనలన్నింటిలో నేను నేరుగా భగవంతునితో సంబంధమేర్పరచుకొనుటకే
ప్రాధాన్యతనిచ్చినాను. కానీ జనులు సామాన్యముగా యిది కష్టమైనదిగా గమనించారు. కనుక
వారికై వారే గురువును వారు మాధ్యమంగా గైకొన్నారు. దాదాపు అన్ని మతాలు నేరుగా
భగవంతునితో ప్రేమనే ప్రభోధించాయి. నా ఉద్దేశ్యములో ఆధారపడడము
మరియు ప్రేమ ద్వారా భగవంతునే శరణు వేడవలెను. నీవు కానీ మరెవరైనాగానీ ఆత్మ
సమర్పణకు ప్రయత్నిస్తే అక్కడ "నేను" అనునది ఉంది. "చేస్తున్నాను" అన్నవాడున్నాడు. కనుక వాస్తవమైన శరణాగతి
స్వతఃసిద్దంగా ఏర్పడాలి.
నా విషయము మరోవిధమైనది. నేను నా ఇరవై ఒకటో సంవత్సరంలో సాధన ప్రారంభించాను. అప్పుడు నాకు శరణాగతిని గురించి తెలియదు. కనుక నేనందుకొరకు ప్రయత్నించ లేదు. నాకు నా గురుదేవులే సర్వస్వము. కారణం, నాకట్టి గురుదేవులు లభించారు. ఒక వేళ నాపరంగా శరణాగతి అంతర్గతంగా వుండి వుంటే అది నా గురువుకు మాత్రమే
అయివుంటుంది. వాస్తవానికి గురువు శరీరాకృతి భగవంతుడు కాదు. కానీ దానికావల దైవత్వమే వున్నది. కనుక నన్ను నేను ఆ దైవత్వానికే సమర్పించుకొంటిని గానీ మానవాకృతికి కాదు. కానీ గురుదేవుని పరిపూర్ణాకృతిని దృష్టి పదంలోనికి తెచ్చుకుంటే ఆ వెనుకే
దైవత్వము విరాజిల్లుతూ వుంటుంది (ఇది నాకు మాత్రమే. ఇతరులనిట్లా చేయమని నేను
చెప్పలేదు) కనుక ఇది గురువుకు శరణాగతి కాదు కేవలం సత్యతత్త్వానికే. కానీ ఇప్పుడు
నా స్వానుభవము నా సహచరులకవసరమైతే, నా స్వానుభవ
ప్రయోజనమును పొందవచ్చును.
మనము "ఈశ్వరీయ ప్రకాశము హృదయమున వున్నది"యన్న ఊహతో హృదయముపై ధ్యానము
చెయుదుము. ధ్యానం చేయుచున్నప్పుడు మన యోచన ఈశ్వరీయ ప్రకాశముపై వుండును. అంటే నీవు నీ హృదయముతో ఆట్లాడుకుంటున్నావు. అంటే అదియొక క్రీడ, ఒక కార్యము. నీవు ధ్యానిస్తున్నావని నీవెరుగుదువు. అంటే నీవు ఏదో
చేస్తున్నావన్నమాట. ఆచేసేది కూడా ఏదో ఒకచోట మొదలైందన్నమాట. అంతే కాదు నిమగ్నమై దేనికోసమో
ఎదురు చూస్తున్నావు కూడా. అంటే నీవుస్తబ్దత జెందలేదు. చాలా వ్యగ్రత, తీరుబడిలేని స్థితిలో మూడు పనులు ఒకే సమయంలో నిర్వర్తిస్తున్నావు. అంటే నీ స్తబ్దత జాగ్రదావస్తలో కోల్పోయింది.
అవును, మన పద్దతి నిజంగా సులువైనది. ఎందుకంటే సూక్ష్మమైనదాన్ని పొందటానికి సులువైన మార్గమే సరియైనది. ఉన్నదేదో వున్నది. అది ఏమిగా రూపాంతరం చెందాలో అదేపనిలో పనిగా జరిగిపొతూ
వుంది. సంశయాలన్నీ మటుమాయమై ధృడసంకల్పం ఆస్థానాన్ని భర్తీచేస్తున్నది.
నా దృక్పదంలో ప్రపంచంలోని సమస్యలన్నిటికి ఆధ్యాత్మికతే పరిష్కారము. అది మానసిక అసమానత్వమును రూపుమాపి సహజంగా ప్రేమానందమయమగు ఆధ్యాత్మిక స్థితి
నెలకొన్న అనువైన జీవితాన్ని ప్రసాదిస్తుంది. అది సరియైన నీతి, జ్ఞానమును ఉత్పాదించి రోజువారి జీవనమునకు ప్రయోజనకారిగా మారుతుంది. మామిడిపండును రుచిచూడు. అప్పుడే నీవు దాని తియ్యదనాన్ని
ఆస్వాదించ గలుగుతావు.
సామాన్యముగా
ఆధ్యాత్మిక విషయాలను ఆధ్యాత్మిక పరంగాను, సాంసారిక విషయాలను
సాంసారిక స్థాయిలోను నిర్వర్తిస్తూవుంటారు. కానీ ఆధ్యాత్మిక మరియు సాంసారిక
విషయాలనన్నింటిని సమన్వయపరచి సమతుల్యమొనర్చగల అసలు సిసలైన ఆధ్యాత్మికస్థితి
నందుకొన్న వాడు రెండిటిని వేరువేరుగా చూడడు. అతనికి
అంతా ఆధ్యాత్మికతలో భాగంగానే గోచరిస్తుంది.
సృష్టికి పూర్వం
కేవలం ’భూమా’ మాత్రమే ఎల్లెడలా పరివ్యాప్తమై వుండెనని నేను వ్రాసితిని. నీవు
ఉత్తరం వ్రాస్తూ భగవంతుడు సర్వశక్తిమంతుడని నేను వ్రాయడం ద్వారా ముందుచెప్పిన నా
దృక్పదాన్ని నేనే ఖండించుకొంటినంటివి. భగవంతుడు తన చుట్టూ సృష్టించుకొన్న విశ్వపరిధులకు
మాత్రమే సర్వ శక్తిమంతుడు. కానీ తన ఉనికికే కారణము, ఆధారమైయున్న
స్థితికి సంబంధించిన విషయమున మాత్రము కాదు. సర్వ శక్తిమంతుడు, సర్వ వ్యాపి, సర్వజ్ఞుడు అన్న గుణాలు సాధారణముగా నిరామయ భగవంతుణ్ణి అలంకరించి అందలి సత్వం
నుండి విషయాన్ని గ్రహించటానికి ఉపయోగపడతాయి కానీ గుణగణాలకన్నిటికీ అతీతమైనది
ఆనిరామయ తత్త్వము. అదే మనమాశిస్తున్న శూన్యత్వము.
మానవుని ఘనత వాని నడత(శీలం)పై ఆధారపడి యున్నది. అతడు ఆధ్యాత్మిక మార్గమున ప్రవేశించినపుడు జీవనము మహోన్నత దశకు వృద్దిపొందును. పై తెలిపినట్లు తత్త్వశాస్త్ర రీత్యా మన ఆలొచన మహోన్నతమైనప్పుడు
భౌతికశాస్త్రరీత్యా కూడా మానవుడు తన సంకుచిత పరిధిలో అత్యంతల్పుడనే విషయం నిజమని
తేలిపోయింది. అతడేమైనా మిగిలి వున్నాడంటే అది కేవలం వాని మాద్యమ పరిధిలో మాత్రమేనని
గ్రహించాలి.
మనం పైపైకెదుగుతున్నామన్న యోచనలో మనకాధారమైన వ్యక్తిత్వాన్ని మరచిపోతాము. మనమున్న స్థితిని దాటి మనం కదలక పోతే అవతలి స్థితి మనకు అగమ్యగోచరంగానే
వుంటుంది. మన వ్యక్తిగత ఉనికిని మనం పోగొట్టుకోకపోతే మనమిప్పుడున్న పైస్థితిని
సంపూర్ణముగా అనుభవించడం లేదన్న మాట. మనం ఎక్కడ వేసిన గొంగడి అక్కడే
వున్నది అన్నట్లు లెఖ్ఖ. మన ఉనికియొక్క అంతరాంతరాళలోనికి వెళ్ళినంతనే మనం సహజంగా మన వ్యక్తిత్వాన్ని
దాని సహజ గుణాన్ని పోగొట్టుకుంటాము. ఇదే మన పురోగతియొక్క ఫలితము. పోగొట్టుకొని తదనంతరం పొందాలి. ఇంకోవిధంగా చెప్పాలంటే
పోగొట్టుకోవడమే పొందడము. శూన్యత్వం స్థితి లోనికి మనం ప్రవేశించి అక్కడ స్థిరత్వమేర్పరచుకున్నంతనే మన
వ్యక్తిత్వం మన మేలుకొరకై మనల్ని వీడివెళ్ళిపోతుంది. మేధస్సు ఒకసారి ఒక విషయాన్నే ఆలోచిస్తుంది. నీవు నీ వ్యక్తిత్వంతోనే వుంటే ముందుకు వెళ్ళలేవు. వాస్తవానికి మనం మనవ్యక్తిత్వపు పట్టు సడలించుకొని నిజమైన శూన్యత్వపు
ఉనికిలోనికి చేరిపోవాలి.
సంపూర్ణ ప్రళయ సమయంలో ప్రతి ఆత్మా మూలాన్ని చేరుకుంటుంది. కానీ మనం ఈజన్మలోనే గమ్యం చేరాలనుకుంటున్నాం. కనుక మనం కాలవ్యవధిని తగ్గించటానికి యిప్పుడే మన పనిని త్వరితపరచి తొందరగా
మూలానికి చేరుకోవాలి.
మన ఉన్నతిని మనం కోరుకున్నట్లయితే మన మహోన్నతగమ్యం నిర్ధారించుకోవడం మన
భాద్యతౌతుంది. తద్వారా మన అల్పత్వం నశించి గొప్పతనం విశాలత్వం
నెలకొంటుంది. ఇదే నిజంగా మన కర్తవ్యము యొక్క కర్తవ్యము, కర్తవ్యము వెంట కర్తవ్యము. ఇలా ఎంత వరకు? ఎంతవరకో కూడా జ్ఞాపకం లేనంత వరకు. ఆ విషయమే మరచి పోయేంతవరకు.
ప్రతి ఆత్మకు, తనకు సంబంధించిన ఒక గుర్తింపు వుంటుంది. అది ముక్తినందుకొనేవరకు వరుసగా ఒక దేహంనుండి మరొక దేహానికి మారుతూ కొనసాగుతూనే
వుంటుంది. మెలుకువలోనే నిద్రావస్థలో వుండటం మానవుల్లోని సర్వ సామన్యమైన జబ్బు. ఒక వేళ క్రొత్త ఆత్మలు వస్తున్నాయనుకుంటే, దేహంలోనికి ప్రవేశించగానే ఆలొచనలు తప్పు, ఒప్పు రెండు వైపులా
ప్రజ్వరిల్లుతాయి. ఆవిధంగా తప్పుడు యోచనలు, భావనలు ఆత్మను
అస్థిరపరుస్తాయి. అందుచేత పరిశుద్దీకరణ అవసరమైయున్నది. తప్పుడు యోచనల ద్వారా మనల్ని
మనమే పాడు చేసుకున్నాము. కనుకనే అంతఃశుద్దీకరణ అత్యావశ్యకమైనది.
కొంతమంది మనుషులున్నారు. నేను వారికి నా సేవలందించటం
మొదలు పెట్టకముందే వారు నాతో తెగదెంపులు చేసుకుంటున్నారు. ఇటువంటి కాలంలో నీవు నీ ఆలోచనలను నా విశ్లేషణ కోసం పంపించావు. అందుకు నీకు మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.
|| ఓం తత్ సత్ ||
No comments:
Post a Comment