సద్గురు శ్రీరాంచంద్రజీ మహరాజ్ వారి దివ్యజ్ఞాన ప్రసారము
శ్రీరాంచంద్రజీ
ఉపోద్ఘాతము
శ్రీ
రాంచంద్రజీమహారాజ్, షాజహాన్- పూర్ వారు 3౦.4.1899 లో ఈప్రపంచమున
ప్రభవించిరి. వారు సంపన్న కుటుంబమున జన్మించినప్పటికీ నియమబద్దమైన ఆధ్యాత్మిక జీవనము
గడుపుచూ, సామాన్యమైన రికార్డు కీపరు ఉద్యోగమును న్యాయస్థానమున
నిర్వర్తించి సాంసారిక జీవనము గడుపు వారికి ఆదర్శముగా నిలిచిరి.
తమగురుదేవులు శ్రీ రామచంద్రజీ (లాలాజీ) ఫతేగడ్ వారి వద్ద ఆధ్యాత్మిక శిక్షణ
పొంది పరమోన్నత స్థితినొంది, దేశికోత్తములై, వారి అనంతరము సహజమార్గమనుపేర ఆధ్యాత్మిక విద్యను వ్యాప్తిజేసిరి. వారు భగవదీయ శక్తిని ప్రాణాహుతి యను పేర అభ్యాసులలో ప్రవేశపెట్టి త్వరితగతిని
అభ్యాసులు పురోగమించుటకు తోడ్పడిరి. ఇట్టి అనితరసాధ్యమైన ప్రాణాహుతి
ప్రసార ప్రక్రియ ద్వారా వీరి "సహజమార్గ" విధానము ప్రత్యేకతను
సంతరించుకొన్నది.
వీరు 19.4.1983 న దేహ త్యాగము గావించినప్పటికీ వీరి "సహజమార్గ"
శిక్షణ మాత్రము ప్రాణాహుతి శక్తియుతమై వారి అంతేవాసుల ద్వారా ప్రతిభావంతముగా
సాగుచునే యున్నది.
ఇందు పొందుపరచిన 5౦ అంశములు వారి దివ్య భోధామృతమే.
శ్రీ రాంచంద్రజీ మహరాజ్ సేవాట్రస్ట్, కడప
30-4-2010
***
1. తన అలవాట్లకు దాసుడైనవాడు కూడా విగ్రహారాధకుడే అవుతాడు. ఇది ఇలా జరగాలి
అనుకుంటాం. కానీ అది అలా జరగదు. అంటే మనఇష్టప్రకారం జరగాలి అనుకోవడం కూడా విగ్రహారాధనే. ప్రాపంచిక వస్తువులపై మమకారం కలిగి వుండటమంతా విగ్రహారాధనే. దీన్నుండి విడుదల పొందాలంటే మన మనస్సుపై ప్రాపంచిక విషయ వాసనలు అంటుకొనరాదు.
(ఋతవాణి-2)
2. సృష్ట్యాదిలో మానవత్వము, దివ్యత్వము దగ్గరి
సంబంధము కలిగియుండినవి. పరిణామక్రమములో ఏర్పడిన చర్య, ప్రతిచర్యల కారణమున
అదిస్థూలమై పొయినది. తొలుత వుండిన ఆ బంధము తిరిగి ఏర్పడవలెనన్న మానవాకృతిలోవున్న
సమస్తమును తన నిజస్థితియైన సమత్వము మరియు ప్రశాంతతకు తిరిగిరావలెను. అందులకై సమతను లోనికి ప్రవేశపెట్టవలెను. అదే సహజమార్గములో జరుగుతున్నది.
మన అనుదిన ధ్యానము ద్వారా చెదిరిన సమతాభావనను సరిదిద్దుకొను ప్రయత్నము
చేయుచున్నాము. తద్వారా మన ఇచ్ఛాశక్తి పనిచేసి సమతను సుస్థిరపరచుచున్నది. మనలోని
మానవత్వము దివ్యత్వముగా మార్పుచెందడం మొదలౌతుంది. నిజానికి దైవత్వము సిద్దించడమంటే
ఇదే. (సహజమార్గ దర్శనము)
3. ఏ సత్యతత్త్వము నుండి మనం వెలువడ్డామో అందులోనే లీనమవ్వడానికి
సహాయమందివ్వబడుతున్నది. విడివడి- నప్పుడు ఆ అనంతత్త్వపుసత్తా మనవెంట
తెచ్చుకున్నాం. దాన్ని మనం అంటిపెట్టుకుని వుండటం ద్వారా మన యోచనలకు స్వేచ్ఛను గలిగించి
తిరిగి ఆ అనంతత్త్వములో కలిసి పోవాలి. దీన్ని మనం నిర్లక్ష్యం చేస్తే
మన ఆలోచనా కార్యక్రమములోనే యిరుక్కు పోతాం. అనంతమైన మూలసత్యపు పరిధి లోనికి
ప్రవేశించలేక దూరమైపోతాం. (సందేశమాలిక)
4. మనం మన గమ్యానికి దగ్గరౌతున్నాము. దానికి మూడు గుర్తులున్నాయి.
అవి అ)దివ్యమైన నడవడి. ఆ)దివ్యజ్ఞానము ఇ)దివ్యమైన ఆలొచన. (ఋతవాణి-2).
5. మనం మన ప్రత్యేక వ్యక్తిత్వాన్ని ఏర్పరచు
కొని స్థూలము మరియు చీకటిపొరలను ఒకదానిపై ఒకటి చుట్టబెట్టుకుంటూ మనదైన ఒక
స్వల్ప సృష్టిని ఏర్పరచుకున్నాం. ఇప్పుడు మనం ఆపొరలనన్నింటిని ఒకదాని వెనుక ఒకటిగా
విచ్ఛిన్నం చేసి సృష్ఠ్యాదిలొ వున్నటువంటి స్వచ్ఛమైనస్థితికి తిరిగి చేరుకో
వలసివుంది. ఇదే సంక్షిప్తంగా మన సహజ మార్గ ఆధ్యాత్మిక విధానము. మనకై మనం సృష్టించుకొన్న మన స్వల్ప సృష్టిని క్రమేణ కడిగి తుడిచేయాలి. లేక మనం
వెనక్కి మరలాలి.(సం.మా)
6. సహజమార్గ సాధన ద్వారా మన ఇంద్రియ ప్రవృత్తులన్నీ సహజమార్గ
పద్దతిలో క్రమ బద్దము చేయబడి, తొలుదొల్త
మానవాకృతి ఏర్పడినప్పుడు వున్న స్వచ్ఛస్థితికి తేబడ- తాయి. అంతేకాదు, వాటి ఇచ్ఛానుసారం ప్రవర్తిస్తున్న అధమ మానసిక వృత్తులు అతీంద్రియ స్థితికి
లోబడి వుండునట్లు మలచబడతాయి. అందువల్ల వాటి వికృత చేష్టలు
నిలిచిపోతాయి. ఉచ్ఛకేంద్రములు దివ్యకేంద్రముల అధీనములోనికి తేబడతాయి. సమూలాగ్రం ఈవిధంగా దివ్యత్వం గావింప బడుతుంది(స.మా.ద.).
7. ఓర్పు, నమ్రతకు పాఠశాల గృహమే. ఒకరకంగా యోచిస్తే కొన్నిసమయాల్లో ఓర్పు కలిగియుండడమే ఒక తపస్సు. అది యితర
తపములన్నిటికంటే కూడా గొప్పది. దుఃఖముతోనో, ఆగ్రహముతోనో మెలగక
గైరాత్‌స్థితిని (సిగ్గుతో తలవంచుకపోవడం) అలవరచు కోవాలి. ఇతరులు తిట్లు, చీవాట్లు పెట్టినపుడు, తప్పు నాలోనే వున్నందుననే అలా జరిగిందని భావించడమే పశ్చాత్తాపబుద్ది.అలావుంటూ
ఓర్పువహించాలి. ఓర్పు సహనం కావాలని, ప్రాపంచిక ఒడుదుడుకులనుండి విముక్తి పొందాలని, తపస్సుకు అరణ్యవాసం
సన్యాసం ఒంటరితనం అవసర మని ఇతరులంటారు. కానీ మనకు మన కుటుంబ సభ్యుల, మిత్రుల మరియు ఇతరజనుల తిట్లు, చీవాట్లు, నిందలు, బెదిరింపులను సంయమనంతో భరించడమే నిజమైన
తపస్సు--(స్వీయ చరిత్ర-1).
8. నా అర్థంలో దేనిపై ఏర్పడ్డ ప్రతిబింబ ప్రతిరూపాలు ఇక్కడ ప్రతిఫలిస్తాయో అదే
బ్రహ్మాండము లేక గగన మండలము. ప్రతీదీ మొదట అక్కడ
సూక్ష్మరూపంలో వ్యక్తమై తర్వాత ఈవిశ్వంలో అది రూపుదాలుస్తుంది. (దశాదేశముల
వ్యాఖ్యానము)
9. అతిత్వరితముగా గమ్యము చేరవలె ననెడు ఆతురత లేక నిరంతర ఆవేదనయే మనకు త్వరగా
విజయమును చేకూర్చు అత్యంత ముఖ్యాంశము. అనంతశాంతి, ప్రశాంతతయైన ఆ సత్యతత్త్వమును పొందు నంత వరకు రవ్వంత సమయమైనను విశ్రమించుటకు
వీలులేదు. ఒక వస్తువును పొందవలెనను తీవ్రఆకాంక్ష దానిని పొందునంతదనుక ఆతురతగలిగించును. కోరిన వస్తువు లభించునంతవరకు శాంతించుట జరుగదు (సత్యోదయము).
1౦. మనస్సులో ఆలోచనలు వరుసగా ఉత్పన్న మౌతున్నా, హృదయబిందువులో లీనమైన స్థితిలో తన్నుతాను కోల్పోయి వుండగలడు. అక్కడ ఆలోచనల
చొరబాటుకు అయిష్టత ఏర్పడుతుంది. లీనమైపోవడము లేక తన్ను తాను
కోల్పోవడమన్నది అనేక రూపాల్లో వుంటుంది. ఇది ప్రతి స్థాయిలోను కలుగు
తుంది. కానీ ఒకసారి కలిగినదానికి మరొక సారి కలిగిన దానికి తేడా వుండనే వుంటుంది మొదట ఎఱుక గోల్పోయిన(తన్ను తాను గోల్పోయిన)స్థితిని హృదయస్థాన స్థిరత్వము
అనబడును. ఇక్కడ మనలోని కోరికలు పైకుబికి అలజడి కలిగించుట శాంతించి వుండును. సాంసారిక జీవనములోని అధమ స్థాయిలలో ఉబికి వచ్చిన యోచనా వివాదముల అలజడికి
సంబంధించిన స్థౌల్యము నుండి యిక్కడ స్వేచ్చను పొందియుందుము.(స్వీ.చ.-1)
11. వాంఛలు అంతమగుట అనగా సంస్కారము లేర్పడుట నిలచిపోవుటే. ఇక మిగిలి యున్నది పూర్వసంస్కారములఫలము -లనుభవించుటే. అది జీవితము కొనసాగు తున్న సమయంలో పూర్తి చేసుకుంటాము. (సత్యో)
12. నాగురుదేవులు ప్రాణాహుతి శక్తి ప్రసారముగావించిన మొదటి రోజుననే నాలో
గురుదేవుల స్మరణ ఉత్పన్నమైనది. దానిని నేను మూడు విషయములతో
కొనసా- గిస్తున్నాను. అవి (అ)గురువుగారి సతత స్మరణ.(ఆ)నా గురుదేవులు కలిగియుండిన లయావస్థ స్థితిని
పొందుటకు నన్ను నేను సరిచేసుకొనుచుండుట.(ఇ)ఏసమయంలో నేను ఏస్థితిలో వున్నానో దానికి
సంబంధించిన విషయాలను గుర్తించుట మరియు అనుభ- వము లోనికి తెచ్చుకొనుట.(స్వీ.చ.-1)
13. ధ్యాన సమయంలో నీవు ఒకదానికోసం నిరీక్షిస్తావు. అదే భగవంతుడు. నిరంతర ప్రయత్నము వలన నిరీక్షణ సహజంగా ఒక విధమైన ఆకర్షణను కలిగిస్తుంది. అది ఒక ఆత్మను నీవు పిలవగలిగిన స్థాయికి ఎదుగు తుంది. ఆ ఆకర్షణ తన అత్యున్నత స్థాయికి చేరిందంటే గొప్ప గొప్ప ఆత్మలు సైతం రానని
తిరస్కరించలేవు. భగవత్తత్వము లోపిం- చడము వలన మానవుని శక్తి తెలియ- రాకున్నది. (స్వీ.చ.-1)
14. ధ్యాన సమయంలో నీవుకాదు నీగురువే తన రూపంపై తానే ధ్యానం చేయుచున్నట్లు
భావించినట్లయితే అది అద్భుత ఫలితాన్ని స్తుంది. (సత్యో)
15. మనస్సు సాక్షాత్కారమువైపుకు మరలిస్తే అది చాలా సులభము. అంటే దాని లోతైన ముద్ర హృదయంపై ఏర్పడాలి. ముద్ర ఎంత లోతైనదైతే విజయం అంత త్వరగాను సులభంగాను లభిస్తుంది. అంత చేసిన తర్వాత ఇకచేయవలసిందట్టే మిగిలి వుండదు. ఆ భగవంతుని ముద్ర హృద- యంపై పడటమంటే తను ఆశించినదంతా గ్రహించినట్లే. ఇట్టి స్థితిలో భగవదీయ ఆలోచన హృదయంలో కొనసాగుతూ వుంటుంది. ఈ సమయమంతా హృదయం భగవంతుని ఆకర్షణకులోనై వుంటుంది. "నిరంతరస్మరణ" అంటే ఖచ్చితంగాయిదే (ఋతవాణి-2).
16. ఈవిశ్వము వునికిలోనికి రావడానికి కారణభూతమైన ప్రకంపన సృష్ట్యాదిలో
కలిగింది. వాస్తవానికి స్మరణ ఆ తొలి ప్రకంపనతో దగ్గరిసంబంధం కలిగి వుంది. (ఋతవాణి-2)
17. ప్రతిదీ భగవంతుని నుండే వచ్చిందన్న విషయం గుర్తుంచుకోవాలి. సాటి జీవులు కూడా ఆయన సృష్టే. ఆయన సర్వాధినేత. మనలో కొందర్ని ఆయన మనకోసం ప్రత్యేకంగా నియమించవచ్చు కానీ మనందరం ఆయన బిడ్డలం.
(ఋ.వా.2)
18. మనప్రతి కార్యంలోను ఆదివ్యశక్తితో అనుక్షణం విడదీయరాని మానసికసంబంధం
కలిగియున్నామన్న భావనతో వుండాలి. మన చేతలు పనులు అన్నీ మనము
మనశక్తి మేరకు సేవించవలసిన ఆ మహాప్రభువు మనకు కేటాయించిన దివ్య కర్తవ్యములుగా
భావించి నెరవేర్చుకుంటూ పొతే ఇది సుసాధ్యమౌతుంది. (సత్యో)
19. మన మనస్సును భగవంతుని వైపు మరల్చినంతనే మన చేతలు పనులన్నింటిలో మనమా
దివ్యశక్తితో సంబంధమున్నట్లు అనుభూతి చెందుతాము. అంతర్గతంగా ఈస్థితి శాశ్వతంగా నెలకొంటే చేసే ప్రతి పని భగవత్ భక్తిలో భాగము
లేక దైవ కైంకర్యముగా భాసిల్లుతుంది. అప్పుడు మనం సర్వవేళలా ఆ భగవంతుని సతత స్మరణలో
వుండిపోతాము(సత్యో).
2౦. రోజులో చాలాభాగం మాటిమాటికి భగవంతుని జ్ఞాపకం చేసుకుంటూపోతే, భగవంతునిపై ప్రేమ దానంతటదే ఉత్పన్న మౌతుంది. దీన్ని అక్కరతో కొనసాగిస్తే వీలైనంత త్వరగా భగవంతునిలో లీనమై పోదామనే తీవ్ర
ఆతృత హృదయంలో రేకెత్తుతుంది. (సత్యో)
21. మనం కర్తవ్యపరంగా మేల్కొల్పబడి మన హృదయాలలో భగవత్‌భావన శాశ్వతంగా
నెలకొనగానే ప్రపంచంలోని విషయము లన్నింటికంటే భగవత్ సాక్షాత్కారమే జీవితంలో అత్యంత
ప్రాధాన్యత గల విషయంగా గోచరిస్తుంది. సహజంగానే మనలోని ఆ తీవ్రఆకాంక్ష
వృద్దిచెంది మనం రోజువారి పనులతో, చింతలతో ఎంత సతమత
మౌతూవున్నా పలుమారు భగవంతుని స్మరణలోనికి కొంపోబడతాము. (సత్యో)
22. భగవంతునికి మనిషికి అనుసంధాన కర్త గురువు. అతని ద్వారా మాత్రమే మనము భగవంతుని చేరగలము. ఆయన మాత్రమే మన మార్గములోని చిక్కుల నుండి గట్టెక్కించగల ఏకైక శక్తి.(స.మా.ద)
23. జ్యోతి యిప్పటికే వెలిగింపబడియున్నది. భక్తి నిండిన హృదయములు మాత్రమే ఆ వెలుగునాస్వాదించి మేలు పొందగలవు. ఈ సదవకాశము
మళ్ళీ భవిష్యత్తులో వస్తుందను కుంటున్నావా? అటువంటి దివ్య
పురుషుడు మళ్ళీమళ్ళీ అవతరిస్తాడనుకుంటున్నావా? ఇటువంటి కార్యములకై మున్నవతరించిన మహనీయులతో ఈయనను పోల్చిచూడ గలమా? అవతారమూర్తులనెడి వారిలో యింతటి వారుండిరా? ఖచ్చితంగా లేరు. ఇది ఆ సర్వేశ్వరుని నిర్ణయానుసారమేర్పడిన ఒక అరుదైన అవకాశము. ప్రకృతి కార్య
మునకై అవతరించిన ఈ మహనీయుడు శక్తిలోను, ప్రకృతి
కార్యనిర్వహణమందును మునుపటి అవతారములకన్న మిన్న. (ఋతవాణి-1)
24. భగవదీయ మార్గములో పయనిస్తున్న వ్యక్తికి తన స్వంత ప్రళయమే ఏకైక పరి-
ష్కారము. దానికై పట్టుదలతో ప్రయత్నించ వలసి వున్నది. అందుకు ప్రేమ భక్తిభావములే
ముఖ్యాంశములు. అందులో మునిగిన వాడు నిజజీవితములో ముఖ్యముగా పొందవలసినది మరియు పరమ
గమ్యము అయిన దివ్య శాశ్వత ఉనికిలోనే గట్టెక్కుతాడు. (ఋతవాణి-1)
25. ఆధ్యాత్మికత తత్సంబంధిత దుస్తులలో లేదు. కానీ ఆదుస్తులు ధరించే వ్యక్తిలో
వుంది ఈసూత్రము విస్మరించబడింది. మానవ మేధస్సు గ్రహించ వీలుకానంత వేగంగా కాలము
మారిపోనున్నది. కలలో కూడా ఊహించలేనంతగా మార్పు సంభవించి యిప్పుడున్నదంతా త్వరితగతిని మారిపో
నున్నది. మార్పు, మార్పు మాత్రమే బలంగా నెట్టుకొనివచ్చుచున్నది - ఇది
నీపై (రామచంద్ర) మాత్రమే ఆధారపడనున్నది. (స్వీ.చ.2-వాల్యూము-2)
26. ఎవరైనా తమ హృదయంలో నా యెడల ప్రేమ గలిగి యున్నట్లు నేను గమనిస్తే నేను
మహదానందంతోను ఉత్సాహంతోను నిండి పోతాను. ఈప్రపంచంలో ప్రేమించడానికి ఇష్టపడటానికీ
ఎంతో వుంది. ఐనా నన్నే వారు ఎందుకెంచుకున్నారు?(అ)తన్ను
తానే కోల్పోయిన వాడు కానీ (ఆ) కనీసం కోల్పో దలచుకున్న వాడు కానీ (ఇ) సర్వస్వం వదలు
-కోదలచిన వాడు కానీ .... బహుఃశా నా వైపుకు మొగ్గు చూపుతారు. (ఋతవాణి-1)
27. మన ఈ బయటి ప్రపంచ జీవితానికి ఆవల నున్న నూతన జీవితంలోనికిప్పుడు
ప్రవేశించవలసి వుంది. కనబడే ఈమనిషి వెనుక అసలు మనిషి వున్నాడని మనం చెప్పవచ్చు. ఇప్పుడు నీవు నిజమైన జీవితంలోకి ప్రవేశించాలంటే నీవు అసలు మనిషిని లేక
మనిషిలోపలి మనిషిని లేక మనిషికావలనున్న మనిషిని వెతకాలి. అది హృదయ నేత్రంతోనే కనుగొన వీలౌతుంది. శరీరంలోని అణువు, పరమాణువుల్లో ఆఅనుభూతి కలుగుతుంది.
దేహధారియైయున్నప్పటికి అతడు దేహానికేవిధంగానూ సంబంధము కలిగి వుండడు. అతడు
శూన్యమునకు అతి చేరువలో వుంటాడు. అతని ఆచ్ఛాదన ఈసమస్త
విశ్వమయమైయుంటుంది. అందులో అతని పని అతనిదైవుంటుంది. అతన్ని గుర్తించడం నిజమైన
సమస్య. గురుదేవుని కృపవలన సమస్తమూ నాపై గ్రుమ్మరింపబడుతూవుంది. అదంతా ప్రాణాహుతి
ప్రసారంద్వారా అభ్యాసులకు అందచేస్తున్నాను. వారినుండి తిరిగి యేమీ ఆశించకుండా
కేవలం ఇదినాకర్తవ్యంగా భావి స్తున్నాను. అయినా అభ్యాసులకు తనంతట అదే వారికి
చెందినదై, అప్పుచెల్లించిన రీతిలో వారికి అందచేయబడుతున్నది.
(ఋతవాణి1)
28. ఆయన ఎవర్ని ఆకర్షిస్తాడో వారు మాత్రమే విజయం సాధిస్తారన్నది అసలు విషయం. నీవు నేను కాళ్ళూ చేతులతో తాళం వేయడం వృధా.
సమయమాసన్నమైనప్పుడు అందరూ ఒకరి వెనుక ఒకరు సరియైన మార్గానికి వచ్చిచేరుతారు.
ఉద్వేగాలు, సంస్కారాలు మనిషి మనిషికి వేరువేరుగా వుంటాయి. తదనుగుణంగానే
ఎవరి సమయం వారికి వేరువేరుగా వస్తుంది. (స్వీ.చ.-1)
29. ప్రభుసదనము మనతో నేరుగా సంబంధము గలిగి యుండి మనమున్న ఈప్రపంచాన్ని
నియంత్రిస్తున్నది. కనుకనే ఏలోకములోను లేని రీతిన ఈలోకములోనే అవతార పురుషులు
ఉద్భవిస్తున్నారు. ఈరీతిన మనం (మనలోకం) ఆ ప్రభు సదనంతో సంబంధమేర్పరచుకొని వున్నాం. కనుకనే ఆ
దివ్యసదనంలోని శక్తి మనలోనూ వుంది. ఆశక్తి మొదటి కదలిక ద్వారా వెలువడింది. అది
సర్వశక్తులు ఏకీకృతమైన మహాశక్తి. కనుకనే అది మిగిలిన శక్తుల- న్నింటి కంటే గొప్పది
మరియు కాంతి వంతమైనది. (రాజయోగ ప్రభావం)
3౦. సాంసారిక ఒడుదుడుకులను, ఇబ్బందు లను
గురించి చర్చిస్తూ మాగురుదేవులు, ఓర్పు సహనమునకు మన
గృహమే మనకు శిక్షణాలయము అనెడివారు. సాంసారిక జీవనంలోని కష్టములను
ఓర్పుతో సహించు కొని పోవడమే మనకొక గొప్ప తపస్సు. ఇదే మిగిలిన తపస్సులకన్నా శ్రేష్ఠమైనది. కనుక ఇట్టి పరిస్థితులలో మనము కోపతాపము లకు తావీయక ఎదురు ప్రశ్నింపక తప్పు మనయందుండుట వలననే
యిట్లయినదని తలచి ప్రశాంతచిత్తముతో భరించుటే చేయ వలసినది. మన స్నేహితుల, బంధువుల తిట్లు తిరస్కారములే మనకు గొప్ప తపస్సు. అదే విజయమునకు తిరుగులేని
మార్గము.(సత్యో)
31. నామటుకు నాకు కష్టములకు దుఃఖము లకు సంబంధించిన అనుభవములున్నవి. వాటిని
గురించి నేను లోతుగా ఆలోచించి ఒక నిర్ణయానికొచ్చాను. ఈ కష్టాలు జబ్బులు ప్రకృతి
మనకొసగిన అదృశ్య వరములు. అవి మన సంస్కారముల ప్రభావం నుండి బయట పడుటకు సహాయపడును. అవి నిశ్శేషమై- పోతే ఆధ్యాత్మిక ప్రగతికిక అడ్డేవుండదు.కాని మనస్సు మాత్రం
అంతర్గతంగా గమ్యంవైపే వుండాలి. (ఋతవాణి)
32. నేను పేదరికాన్ని ఎన్నుకుంటాను. కాస్త ఉప్పువేసిన రొట్టె తప్ప ఇంకేమి లేని
స్థితి నాకు చాలా ప్రియమైనది. ఇప్పటివరకు ఒక్కరు కూడా ఆస్థితిని పొందటానికి
ముందుకు రాకపోవడం నిజంగా దయ నీయమైన పరిస్థితి. (ఋతవాణి-1)
33. ధ్యాన సమయంలో అనేకమైనఆలోచనలు మనస్సులోనికి చొరబడుతున్నాయని సామాన్యంగా
ఫిర్యాదు చేస్తుంటారు. మనసు నిశ్చల స్థితికి రాలేదుగనుక తమ సాధనలో తాము విఫలమైనామని వాపోతారు. కానీ
అది సరి కాదు. మనం ఏకాగ్రతను కాదు, ధ్యాన సాధన
చేస్తున్నాం. ఆ సమయంలో వచ్చిన ఇతర యోచనలను ఖాతరు చేయకుండా ధ్యానం కొనసాగించాలి.
విశ్రాంతిలేని మన ఎఱుకగల మనస్సు యొక్క కార్యకలాపమే ఈఎడతెఱపిలేని యోచనా ప్రవాహము.
మన ఎఱుకగల మనస్సు ఎనలేని యోచనలతో అటూ ఇటూ సంచరిస్తున్నా మన అంతర్గత మనస్సులో తీరికలేని
ధ్యానస్థితిలో కొనసాగు తూనే వుంటాం. కనుక మనం ఏవిధంగానూ నష్టపోవడంలేదు. కాలము
గడచేకొద్దీ తగు సాధనయొక్క ఫలితంగా ఆ ఎఱుకగల మనస్సు సైతం సరిదిద్దబడి అంతర్గత
మనస్సుకు అనుగుణంగా మార్పుచెంది సానుకూలంగా పనిచేస్తుంది. (సత్యో)
34. ప్రభువును నిజంగా తన ప్రభువే అని అంగీకరించి నమ్మి భక్తుడై అతని సేవలోనే
పూర్తిగా నిమగ్నమవ్వడముతోనే మానవుడు పరిపూర్ణుడౌతాడు. అలా చేయడం ద్వారా నీలో ఒక
శూన్యస్థితి ఏర్పడుతుంది. అప్పుడు ప్రభువు యొక్క దృష్టి నేరుగా నీపై పడుతుంది.
(ద.దే.వ్యా.)
35. ప్రభువు యొక్క సాన్నిహిత్యాన్ని కొన సాగిస్తూ ఆయనయందే మనస్సును ఏదో విధంగా
నిలిపి ఆయన వాడుగానే జీవనం సాగించాలి. అప్పుడు మర్యాదకరమైన జీవన విధానము మరో మలుపు
తిరుగుతుంది. మనము తెలియక చేసిన తప్పులను నియమ విరుద్దములైన పనులను మన ప్రభువుగా
అంగీకరించిన ఆయన ఎదుట బహిరంగ -ముగా ఒప్పుకొని నివేదించుకొనవలెను. ఈవిధంగా చేయడం
వల్ల మన అశక్యతను నిరూపించుకొంటాము. మన అశక్యతను హృదయపూర్వకంగా తెలియజేస్తూ తప్పు-
లను నిర్మొహమాటంగా ఒప్పుకొనడం వలన ప్రభువు మనతప్పులు క్షమించ దగినవేనని
భావిస్తాడు. (ద.దే.వ్యా.)
36. హృదయస్థానంలో "దివ్య ప్రకాశము" యున్నది అన్న భావనతో ధ్యానం
చేస్తూపోతే మనం క్రమేణా పైకెదగడం మొదలౌతుంది. మరింత స్పష్టంగా చెప్పాలంటే ఇది
మొదటి దశ, గనుక అభ్యాసి అక్కడ అంతర్గత ఎఱుకలో మరింత లోతుకు
మునగడానికి విశాలత్వాన్ని గమనిస్తాడు. అంటే మనం అనంతత్త్వపు బీజాన్ని నాటామన్నమాట.
మరో మాటలో చెప్పాలంటే మన దృక్పథం నుండి తప్పించుకొన్నదానిని తిరిగి దృష్టి- పథం లోనికి తెచ్చామన్న
మాట. ఇక రెండవ దశ మన దృక్పథంలోనికొస్తుంది. మనిషి ప్రతి జీవపదార్థంలోనూ
భగవంతుడున్నట్లు అను- భూతి చెందుతాడు. మూడవదిగా మనిషి ప్రతీదీ
మార్పుకుగురౌతున్నట్లు గమనిస్తాడు. ఇది కూడా మారి మనిషి pతీది కూడా భగవంతుని
నుండి వచ్చిందే, అన్నీ ఆయన స్వరూపాలే అన్న అనుభూతిని పొందుతాడు. ఇక
నాల్గవది శూన్యస్థితిలో మొదలౌతుంది. అదే తుదకు మనమంతా పొందవలసింది. (ఋతవాణి-2)
37.మనోవికారములు(కామ,క్రోధ,మోహాదులు) అంతమైతే తెలివి పూర్తిగా నశిస్తుంది. కారణ మేమంటే మనోవికారములు
స్పందనలను కలుగచేస్తాయి. ఆస్పందనలే తెలివినుత్పాది- స్తాయి. కనుకనే వాటిని
క్రమబద్దీకరించాలి. మరో రీతిగా చెప్పాలంటే పాశవిక మనోవికార ములను మానవీయ
మనోభావాలుగా మార్పు చేయాలి. (ఋతవాణి-1)
38. ఆధ్యాత్మికత నిజానికి అత్యంత సూక్ష్మ మైన మానసిక స్థితి. దానితో పోల్చినపుడు మిగిలినవన్నీ బరువుగాను స్థూలంగాను అని- పిస్తాయి.
గులాబిపువ్వు యొక్క సువాసన హృదయముపై కలిగించు సున్నితమైన అను -భూతి సైతం దానితో
పోలిస్తే బరువైనదే. ఆ స్థితిని నేను ప్రకృతితో అనువైన పొందిక గలిగిన సంపూర్ణ ప్రశాంతత సమతాస్థితి
అని వ్యక్తీకరించదలతును. ఇట్టి మానసిక స్థితిలో మన ఇంద్రియ సంబంధమైన ప్రజ్ఞా- పాటవములు నిద్రాణావస్థలో
వుండును. వాటి పని దానంతటదే జరుగుతూ మనస్సు పై ఏ విధమైన ప్రభావము పడని రీతిలో
నుండును. (సత్యో)
39. సృష్టికి పూర్వము కేవలము ఆకాశము (భూమా) మాత్రమే ఆవరించియుండెను. కనుక
భగవంతుడుండుటయన్నది తర్వాత పరిణామమే. అది వ్యక్తమగుటకు కొంత సమయము పట్టెను. ఆకాశము
అనంతము గాను శాశ్వతముగాను దృగ్గోచరమగు చున్నది. కనుక భగవంతుడు కూడా శాశ్వతుడని
నిర్ధారించనగును. కాలము భగవంతుని వెనువెంట ఉనికిలోనికి వచ్చినది. కనుక భూమాయే
భగవంతునికి తల్లిగా భాసిల్లినది. కాలము (అవకాశము) దీనికి వ్యతిరేకస్థితి. ప్రతీదీ
అనంతంలో అంతం కావలసిందే. ఎవరైనా అంతర్గతంగా ఆ ఆకాశస్థితిని తమలో ఉత్పన్నంచేసుకుంటే
అతడు అత్యంతోన్నత స్థాయిని చేరినట్లే. అది సమస్త వ్యావహారములు కుదుటబడిన స్థితిలో
సమమైవుంటుంది. ప్రతి ఒక్కరు దీనినే ఆశించవలసి వుంది. ఆకాశము లేక భూమాయే
పరమోత్కృష్ట స్థితి. (స.మా.ద)
4౦. సృష్టి మొదలు కావడానికి ముందు వున్నదంతా అసలైన దివ్యత్వమే. అన్నీ వాటి
సత్వరూపములో అందులో యిమిడివున్నాయి. మూలంలో కలిగిన క్షోభతో ఒక్కొక్కొటి రూపు దాల్చే
ప్రక్రియ మొదలయింది. క్షోభవల్ల అంతర్గత చైతన్యంలో ఒక సంచలనం కలిగింది. (స.మా.ద)
41. ఆత్మార్పణమంటే తన ప్రాధాన్యతను పూర్తిగా వదిలి సంపూర్ణంగా గురువుగారి
యిచ్చకు అనుగుణంగా వర్తించడం తప్ప యితరంకాదు. ఈస్థితిలో శాశ్వతత్వం సాధిస్తే అది
శూన్యత్వంలోకి దారి తీయడం మొద- లౌతుంది. ఈ ఆత్మార్పణ స్థితిలో ఏమి ఆలోచించినా, ఏమి చేసినా అది గురువుగారి యిచ్చకు అనుగుణంగానే వుంటుంది. ప్రపంచంలో ఏదీ తనది
కాదని అంతా గురువుగారి అజ్ఞానుసారమే లభిస్తున్నదని భావిస్తాడు. (సత్యో)
42. సహజమార్గ సాధనలోని రహస్య మేమిటంటే అది ఒక శక్తి. అది మనిషిలోని మొత్తం
జీవితాన్నే మార్పుచేసి అతన్ని ఉన్నతోన్నత స్థితులకు ఎదిగేట్లు చేస్తుంది. దీన్నే
ప్రాణహుతి శక్తి ప్రసారమంటారు. ఈశక్తి స్వచ్చమైన మనోమార్గముల ద్వారా పనిచేస్తుంది.
ప్రాణాహుతి ఇచ్ఛాశక్తి ద్వారా ప్రసారమై ఫలితములనిస్తుంది. అది ఎప్పుడూ
ప్రతిభావంతమై వుంటుంది. (స.మా.ద)
43.మొదలు పెట్టిన తక్షణమే ప్రాణాహుతి ప్రసారము వలన శాంతి, నెమ్మది ప్రసారింప బడుతుంది. ఆ అనుభవాన్ని మాటల్లొ వ్యక్తీకరించలేము. ధ్యానంలో
కలిగే ఈ అనుభవం మనం తిరిగి వెళ్ళి చేరవలసిన మూలాన్ని గుర్తుచేస్తుంది. ఈ అనుభవం
మళ్ళీ మళ్ళీ కలగడం వల్ల మన అసలు స్వస్థలమైన మూలానికి సంబంధించిన జ్ఞాపకాన్ని దృఢపరుస్తుంది. ఈ జీవితానికి సంబంధించిన
బంధనాలను సడలిస్తుంది. ప్రాణాహుతి శక్తి మనల్ని ఆంతరంగిక ఎఱుక లోతుల్లోకి
తీసుకుపోతూ మూలానికి వెళు తున్న మన ప్రయాణం నిర్దిష్టం చేస్తుంది. (దివ్య
సందేశములు)
44. పదార్థ కణాలను శక్తిగా మార్చవచ్చును. మరో మాటలో చెప్పాలంటే పదార్థము
స్థూలరూపంలో వున్న శక్తే. ఇది ఒక శాస్త్ర సూత్రము. దీన్ని నవీన శాస్త్రము సైతము
అంగీకరించింది. ప్రాణాహుతి పదార్థాన్ని శక్తిగాను, శక్తిని మూలసత్తాగాను మారుస్తుంది. (ఋ.వా.-2)
45. ఈగుర్తింపు మహాప్రళయమాసన్నమై సర్వము తమ వ్యక్తిత్వగుర్తింపుఅంతా
సమైక్యగుర్తింపులో లీనమయ్యే వరకు వుంటుంది. తిరిగి అదే తర్వాతి సృష్టికి
కారణభూతమౌతున్నది. కనుక ఈ వ్యక్తిత్వమే అంతమౌతున్నది కానీ గుర్తింపు (ఉనికి) మాత్రం కాదు. ఉండుట లేకుండుట అన్నది కేవలం నామమాత్రమే. ఆ మూలము, ఆకేంద్రంలో నిద్రాణమై వున్న చైతన్యం వల్లనే యిదంతా సంభవమౌతున్నది. (ఋ.వా.-1)
46. మరణస్థితి అన్ని గ్రంథుల్లో మొదలౌతుంది. అది అనుభవానికి మించిన దృఢత్వంతో
వుంటుంది. అంటే అభ్యాసి ఆస్థితిలో పూర్తిగా కేంద్రస్థానంలో లీనమై పూర్తిగా తన
ఉనికినే కోల్పోతాడు. (స్వీ.చ-1)
47. మనందరం సోదరులం. బుద్దిపరంగా, నీతిపరంగా మరియు
జీవితపరమార్థమైన ఆధ్యాత్మిక పరంగా మనం ఒకరికొకరం సంబంధం కలిగి వున్నాము. ఇది అది
అన్న అడ్డంకులన్నీ యిప్పుడు తొలగిపోయాయి. ఆయనపనిలోను, వాతావరణంలోను పవిత్రతే మిగిలింది. అది అనంతత్వానికి దారి నేర్పరచి మూలంతో
కలుపుతున్నది. (దివ్యసందే.)
48. ప్రకృతి సంతరించుకున్నదంతా అత్యంత స్వచ్ఛంగా వుంటుంది. కారణం దాని
ఉత్పత్తి స్థానం పవిత్రం. స్వచ్ఛము మరియు ధర్మ- బద్ధమైన పద్దతిలో గడించిన సంపాదన
కూడా ఈవిధంగానే స్వచ్ఛమై వుంటుంది. (ద.దే.వ్యా)
49. భగవంతుని ఇచ్ఛానుసారమే జగమంతా నడుస్తున్నది. ఆయనే అన్నిటికి కర్త. కానీ
అదంతా మన ఇచ్ఛ మన శక్తికి జోడించి మన కృషి ఫలితంగానే జరిగిందనుకోవడమే వచ్చిన
చిక్కు. ఈకారణం చేతనే మనం విజయాలకు ఉప్పొంగిపోవడం, అపజయాలకు కృంగి- పోవడం జరుగుతున్నది. ఇదే మనల్ని బంధనమునకు గురిచేస్తున్నది.
(ఋ.వా-1)
5౦. లక్ష్యమును సాధించుటకు అత్యంత ఖచ్ఛితమైనట్టిదియు, సులభమైనదియునగు ఉపాయము--నీకు నీవే సమర్థగురువునకు సమర్పించుకొని జీవన్మృతుడవు
అగుట. ఈ సమర్పణ (ఆత్మార్పణ) భావము యాంత్రికము, కృత్రిమము, బలవంతము అయివుండరాదు. శ్రమ ఒత్తిడి లేకుండా సహజముగా
మనయందది కలుగవలసి యున్నది. నేను, నాది యను
"అహం" భావము (ఎఱుక) వున్నంతవరకు అది నిజమగు ఆత్మార్పణ కాజాలదు. వాస్తవ
సంపూర్ణ ఆత్మార్పణము జరిగిన మీదట ఇక చేయవలసినదేమియు వుండదు.
(స.మా.ద.)
---౦౦౦---
శ్రీ రాంచంద్రజీ మహరాజ్ గారి దశాదేశములు
1. ప్రొద్దు పొడవకముందే నిద్రలెమ్ము. నిర్ణీత సమయమున, సూర్యోదయమునకు ముంద- యినచో మంచిది, ఒకే ఆసనమున
కూర్చొని ప్రార్థన, పూజాదికములను కావింపుము. మానసిక శారీరక పారి-
శుద్ద్యమును ప్రత్యేకముగా పాటింపుము.
2. ప్రేమ, భక్తి పూర్వకమైన హృదయముతో ఆధ్యాత్మికోన్నతి కొరకు
ప్రార్థన జరిపి, పూజ నారంభింపుము.
3. భగవంతునితో సంపూర్ణఐక్యము పొందుట యే నీ గమ్యముగా నిర్ణయించుకొనుము. దానిని సాధించునంతవరకు విశ్రమింపకుము.
4. ప్రకృతితో సారూప్యము పొందుటకు నిష్కపటముగాను, నిరాడంబరముగాను వుండుము.
5. సత్యసంధత కలిగి యుండుము. దుఃఖములను దివ్యమైన దీవెనలుగా
భావించి, అవి నీ మేలు కొరకే కలుగుచున్నవని కృతజ్ఞతా భావముతో
నుండుము.
6. అందరిని సోదరులుగా భావించి, అట్లే వారినాదరింపుము.
7. ఇతరులు కీడు చేసినచో ప్రతీకారబుద్ది పూనకుము. దానిని దివ్యబహూకృతిగా కృతజ్ఞతతో స్వీకరింపుము.
8.ఋజువర్తనతోడను, భక్తిభావముతోడను
ఆర్జించిన దానితో తృప్తిచెంది, నిరంతర
దివ్యభావములతో దానిని ఆరగింపుము.
9. ఇతరులలో భక్తి, ప్రేమ భావముల
మొలకెత్తించునట్లుగా నీ జీవనమును మలచుకొనుము.
1౦.పడుకొనబోవు సమయమున దైవ సాన్నిధ్యభావనతో నీవొనర్చిన తప్పులగూర్చి
పరితప్తుడవుకమ్ము. వాటిని మరిచేయనని వినమ్రభావముతో భగవంతుని క్షమాపణ కోరుము.
***
No comments:
Post a Comment