Monday, 14 March 2022

శూన్య శూన్యాతీత స్ఠితులు

 

శూన్య శూన్యాతీత స్ఠితులు

                                                                        మహాత్మరామచంద్రజీ
        రచన - మహాత్మా శ్రీరామచంద్రజీ.                               తెనుగుసేత – శ్రీ పి.సుబ్బరాయుడు.

 మనిషి తన అభావస్థితిలో శూన్యుడైపోతాడు. సంపూర్ణశూన్యత తేగల పరికరమింతవరకూ కనుగొనబడలేదు. ఒక పరికరమునుపయోగించి గాలిమొత్తము తీసివేసే ప్రయత్నముచేసినా, యింకనూ కొంతగాలి మిగిలేవుంటుంది. ఒకపరికరము కనుగొనబడి, గది లేక బంతినుండి నేను చెప్పినట్లు గాలి పూర్తిగా తీసివేయగలిగితే అప్పుడక్కడ జీవంమాత్రం వుండి, మునుపెన్నడూ యెఱుగనంతటి గొప్ప వినాశకరశక్తిగా మారుతుంది.

 మనం మనిషిని అంతటి శూన్యునిగా మార్చాలి. నిజమైన సంపూర్ణశూన్యత యేర్పడాలంటే, ఆసంపూర్ణతనుకూడా అతడు విస్మరించివుండాలి. ఇట్టిస్ఠితి నెవడైనా సాధించాడంటే అతడు అవతారమూర్తులకుసైతం లేనట్టి అసాధ్యగొప్ప శక్తినిక్షేపమై వుంటాడు. అతడాశక్తిని నిర్మాణాత్మక లేక వినాశకరరకార్యములకు తన ఇచ్ఛాశక్తితో యెట్లైనా వినియోగించగలడు. కానీ సోదరా! భగవంతుడు చాలాతెలివైనవాడు. అటువంటివాని ఇచ్ఛాశక్తి ఆస్థాయికి రాకుండా నిలువరించి వుంచాడు. ఒకవేళ అలానిలువరించకుండా వుంటే, ఒక్కనిముషంలో అతడు వేయి భువనభాండాలను సైతం తునాతునకలు చేయగలడు. అతని ఆజ్ఞలను బ్రహ్మ విష్ణు మహేశ్వరులు సైతం తిరస్కరింపజాలరు. కనుక భగవంతుని నిర్ణయంమేరకే యీస్థాయికి చెందిన వ్యక్తి యెన్నికకాబడతాడు. కేవలం భగవదాజ్ఞలనుమాత్రమే అతడు అమలుజరిపే వాడై వుంటాడు. నేను మనఃపూర్వకంగా జెప్పుచున్నాను. భగవంతుడట్టి వ్యక్తిని అతనిగురువుకప్పజెప్పుతాడు. ఆవ్యక్తి కూడా తననుతాను సంపూర్ణముగా గురువుకు సమర్పించుకొని వుంటాడు.

 ఈఅభావ శూన్యత్వమెంత అద్భుతమో శ్లాఘనీయమో చెప్పజాలను. కానీ నిజానికిది అనంతయాత్రకు ప్రారంభము మాత్రమే. ఇంకెంతదూరము వెళ్ళవలెనో అంతుచిక్కకున్నది. ఆధ్యాత్మికతకు మైళ్ళదూరములోవుండికూడా వేదికలెక్కి ఆధ్యాత్మికోపన్యాసములిచ్చు వ్యక్తులనుజూస్తే నాకు జాలికలుగుచున్నది.

 ఈదినం నేను నిర్దుష్టము సంపూర్ణపరిశుద్ధము అననేమియో వివరింతును. భగవంతుడొక్కడే పరిపూర్ణపరిశుద్ధుడు. మరొకమాటలో చెప్పాలంటే దైవమే అంతిమ ఊనికి (ౙాట్) పరమాత్మ అన్న భావముతోనే నేనీమాట వాడటం జరిగింది. ఏదియేమైనా భక్తుని పతిపూర్ణతను నిర్వచించాలంటే అతడు జ్ఞానరహితుడు అని అనాలి. ప్రకృతి ఉత్పన్నముచేసిన లేక ప్రకృతిలో వున్నవన్నీ అతనికి తెలుస్తాయి. విజ్ఞానము మరియు శాస్త్రజ్ఞానమంతయు అతనికి తెలియకుండావుండే అవకాశమే లేదు. కసింతవెచ్చదనం కలిగిస్తేచాలు తెలియవలసినవన్నీ అతనినుండి ధారాపాతంగా వెలువడతాయి. ఈలక్షణము ద్వారానే పరిపూర్ణుడైన వ్యక్తిని మనము గుర్తించగలము.

 తీవ్రమైన ఆకాంక్ష మరియు ఆతృత

ప్రారంభం నుండే వ్యక్తి శూన్యుడుకావడం మొదలవ్వాలన్నది నావిధానము. వాస్తవానికి మాగురువర్యులు (ఆయనకు ధన్యవాదములు లెంతచెప్పినా తక్కువే) నన్నాలాగే తీర్చిదిద్దారు. ఇట్టిబీజములే యితరులలోనూ మొలకెత్తునట్లు చేయవలసియున్నది. ఎప్పుడు అబ్యాసి శూన్యము మరియు తదనంతరస్థితులను పొందుటకు అర్హుడైవుంటాడు? అతడెలా ఆస్థితులనందుకుంటాడు? ఇప్పటికే ఆస్థితులను దాటుకొనియున్న గురువునాశ్రయించి అట్టిగురువు దయకు పాత్రుడైనప్పుడుమాత్రమే అభ్యాసి ఆస్థాయికి చేరగలడు. అభ్యాసి గురువును ఆస్థితులకై బలవంతపెట్టవలెను. అదెలాగంటే, ఏమున్నది కాస్తాతెలివిగలవాని కెవనికైనా యిది తెలిసినవిషయమే. ఒకపెద్దాయనను యీస్థితులనందుకొనునట్లు చేయుటకు నేననేకవిధముల ప్రయత్నించితిని. అతడు నన్ను కసరుకొని చీవాట్లుపెట్టినా వయసులో పెద్దవాడుగనుక సహించి అతన్ని సంతోషపెట్టడానికే ప్రయత్నించి సహాయపడితిని. అతనికినేను అ,ఆలు నేర్పితినోలేదో అప్పుడే అతను రంగులు మార్చ (అహంకరించ) నారంభించి ఆదఃపాతాళానికి పడిపోయి, యెందుకూ పనికిరానివాడైపోయెను. అయినప్పటికినీ నేను మనిషినిమనిషి గౌరవించు మర్యాదాప్రదమైన ప్రేమతో అతన్ని వయసులో పెద్దవాడుగా నేటికినీ గౌరవిస్తున్నాను.

 అభ్యాసిపురోగతి యెప్పుడూ నిలిచిపోకుండావుండాలనే తత్త్వంనాది. అది నాలోని బలహీనతమరి. దీన్ని కొంతమంది అలుసుగా తేసుకొంటున్నారు. తొందరపడుటన్నది నామనస్తత్వం. ప్రేమ భక్తిభావంతోపాటు తీవ్రమైనఆకాంక్ష ఆతృత, శూన్యత్వం మరియు అంతకంటే ముందుకు పురోగమించుటకు సహాయపడు మరోఅంశము. ప్రేమభావమున్నదంటే ఆతృత దానంతటదే కలుగుతుంది.

 

ఆధ్యాత్మికస్థితులనన్నింటినీ అనుగ్రహించువాడు భగవంతుడు మాత్రమే. అందులోనూ అతిముఖ్యమైనది, అందరూ అంగీకరించునదీ శూన్యత్వము. కానీ నాకివన్నీ గురుదేవునివల్లనే సంప్రాప్తమైనవి. నేను యీవిధంగా ఒకమహనీయుని అదుపాజ్ఞలో నుండునట్లనుగ్రహించిన భగవంతునకు బహుదా కృతజ్ఞుడను.

 భగవదనుగ్రహము పొందుటకేర్పరచిన విధానము, గురువనుగ్రహము పొందుటకనుసరించు విధానము వంటిదే. భగవంతుని నేరుగాకూడా ప్రేమించవచ్చును. అది మంచిదే, కనీ అలాచేయగల్గినవారు చాలా అరుదు. ఇది అత్యుత్తమ విధానము. అభ్యాసి భగవంతునితో అనుబంధాన్ని పెంచుకొంటూ వెళ్ళాలి. అలా పెంపొందించుకోలేని పక్షంలో ఒక మార్గదర్శకుని ఎన్నుకొని విద్యార్థులు ఉపాధ్యాయునికి విధేయులైయున్నట్లయినా కనిసముండాలి. సోదరా! ఇది అతని కర్తవ్యము. దీనివల్ల మార్గదర్శకుని కెటువంటి లాభమూలేదు. కానీ అభ్యాసిమాత్రము ఆయననుండి అనుగ్రహమును పొందగల్గు సమర్థుదౌతాడు. సద్గురువు పేరుప్రతిష్టలు గౌరవమునాశింపడు. అంతేగాక కొందరు మహనీయులు గౌరవమందలేనిరీతిగా బాహ్యముగా ప్రవర్తించి అనర్హులైన శిష్యులను వదలించుకొని ఎన్నుకొన్న కొద్దిమంది అర్హులయిన శిష్యులను తనవద్ద వుంచుకొనెడివారు. ఇటువంటి ఉదాహరణలెన్నో వున్నాయి. కబీరుమహనీయుడుకూడా ఒకసారి యిలానే ప్రవర్తించారు.

 సత్పదార్థం

నేను శూన్యత్వం గురించి ముందే చెప్పియున్నాను. ఈశూన్యత్వం పొందిన అభ్యాసి శూన్యత్వమన్న విషయాన్ని మరచిపోయివుంటాడు. అంటే అతనికి శూన్యత్వానికి సంబంధించిన ఎఱుకే వుండదు. నేను చెప్పునదేమంటే ఆదశలో అతడు తలచిన తక్షణమే ఒకగొప్ప ఆధ్యాత్మికవేత్తను అందించగల శక్తిగలవాడై యుంటాడు. నేనుఆశించినట్లే అట్టిమహనీయుని, ఇంకాచెప్పలంటే అంతకంటే మరింత ఉన్నతస్థితినందిన మహనీయుని పొందగలిగాను. ఈవిషయాలను ఎవరితో పంచుకోగలను? నన్ను ఉత్సాహపరచువారెవ్వరునూ కనబడుటలేదు. ఇందుకునేను చింతిస్తున్నాను. ఎవరైనా మరీయెక్కువగాకపోయినా కనీసమింతమాత్రమైనా గ్రహించి నాగురువర్యుల ఋణం కొంతవరకైనా తీర్చుకొను అవకాశము నాకు కలిగింతురని ఆశిస్తున్నను. ఇది నాతోనే అంతమౌతుందేమోనని చింతిస్తున్నాను. ఈవిషయమై నేను నిస్సహయుడనైపోయాననిపిస్తున్నది. మరీయెక్కువగాకపోయినా కనీసమింతమాత్రమైనా సంపాదించుకొని యితరులను సైతం యీస్థితికి తీసుకరావాలని నాఆశ. గృహమందలి సేవకవృత్తిని చేపట్టి అన్నిపనులుచేయుచున్న నానుండి యీపనిని స్వీకరించి నానుండి ఆధ్యాత్మికోన్నతిని సేవకుబదులుగా గైకొనువారికోసం నేను ఆతృతతో ఆశగా యెదురుచూస్తున్నాను. కానీ సోదరా! నేనుదీన్ని అతిసులువుగా విషదపరుస్తున్నందున కాబోలు, ఎవరిపైనా ప్రభావము చూపలేకపోతున్నానేమో ననినిపిస్తున్నది.

 ఒకవేళ భగవంతుడు నేను పైనచెప్పిన దానికంటేకూడా మించినస్థితులను అందుకొను వానిని పంపగలిగితే, నేను నాఅదృష్టానికి ఆనందపడి అతన్ని ఉన్మత్త (ౙునూన్) స్థితులకు సైతం అందని మహోన్నతదైవికస్థితికి తీసుకవెళ్ళగలను. కానీ సోదరా! నాకైతే అంతుచిక్కడంలేదు. ఇంతకుమించి యెవరైనా నానుండి గ్రహిస్తూవుండి నేనునేర్పుతూపోతే శూన్యత్వంమే ధ్యేయంకానవసరంలేదు. ధ్యేయం విషయనికొస్తే భూమమండలమే మనధ్యేయమనవచ్చును. అచ్చట తుదిఉనికి తప్ప మరేమీవుండదు. జనులు మోక్షముకొఱకు ప్రాకులాడుతూవుంటారు. అదిమంచిదే. ఎందుకంటే దానివల్ల మాటిమాటికి చచ్చిపుట్టుటనుండి విడుదల పొందవచ్చును. కనుక దీన్నిగురించే బోధిస్తుంటారు. ఒకవేళ దీన్ని అధిగమించి వెళితే, ఆప్పుడు వారికీమోక్షము అసలు సత్పదార్థ్యముయొక్క గసి మాత్రమేనని అర్థమౌతుంది. క్రితమొకసారి యీవిషయమై ఒక డాంబికఆధ్యాతిమికగురువు యెదుట నోరుజారితిని. అతడునన్ను అజ్ఞానిగా తలచాడు. అందువల్లనే యిటువంటి రహస్యాలు వెల్లడిచేయరాదంటారు. కానీ సోదరా! నేనుమాత్రం వెల్లడిచేస్తూనే వున్నాను. వాస్తవానికి నాయెడల వారుకున్న అభిప్రాయం చాలావరకూ సరియైనదే. ఒకవేళ నేను జ్ఞానినే అయివుంటే యీస్థాయికి చేరుకొనేవాణ్నే కాదు. ఎందుకంటే యీస్థానం అజ్ఞానులకు చెందినది. దీన్నిగురించి కాస్తా ఆలోచించవలసి యున్నది. వాస్తవానికి అపనమ్మకం (కుఫ్రా) వారినీ దశకు తెచ్చియుండవచ్చును. ఈపదం దైవంస్థాయిని నిర్వచించడంలేదా? అయితే యెందుకీవిధంగా జనులాలోచిస్తున్నారోమరి. క్షీరసాగరమూ, విష్ణుదేవుడు, లక్ష్మీదేవిని గురించిన మర్మమెమిటో తెలియకుండా ఆలోచిస్తున్నారు. సోదరా! యివన్నీ హృదయమండలస్థితులు. ఇక్కడ విష్ణువునుండవలసినదిగా నిర్బంధించి వుంచారు. ఆయననీ నిర్బంధంనుంచి తప్పించగలవారెవరూలేక అక్కడేవున్నాడు. బంధనమన్న అలోచనే బంధించుగొలుసునకు మరొక ఊంగరమును చేర్చినట్లగుచున్నది.

 హృదయమే పాలసముద్రము. ఇందులో తీవ్రమైన కామమనే సర్పం తనపడగలనువిప్పి ఆత్మను చుట్టుకొనియున్నది. లక్ష్మికూడ యిందున్నది. అంటే యిది మరొక బంధము. కామినీకనకముల ఆకర్షణకు లోబడితిమన్నమాట. విష్ణువు పాదములొత్తుటనగా పాముపడగలనీడన (మోహప్రభావమున) కామినీకనకములకులొంగి బానిసలమైన స్థితినిది తెలియజేయుచున్నది. ఇప్పుడేదోఒకరీతిన సముద్రపుటలల ఉదృతిని అదుపుచేసినయెడల ప్రశాంత సమతలమేర్పడును. అప్పుడక్కడొకశక్తి ఉద్భవమై బంధనములత్రెంచుకొను అవకాశమేర్పడును. పౌరాణికదృక్పదంతో గమనిస్తే హృదయాంతరంగముననున్న సత్ తత్త్వమే విష్ణువుగా చెప్పబడుచున్నది. తీవ్రమైన కామసర్పమును తొలగించినట్లైన విష్ణుదర్శన మౌతుంది. అంటే అప్పుడు ఇతరులలో ఆధ్యాత్మికోన్నతి కలగజేయుశక్తి ఉత్పన్నమౌతుంది. విష్ణుదేవుడే సంరక్షించు బాధ్యత వహిస్తున్నందున యిది సంభవమౌతున్నది. ఇందుకొఱకు లక్ష్మి అనగా ధనముకూడా అవసరమే. ఈదశలో విష్ణుదేవునిశక్తి కూడా తెలిసి, ఆయన సంరక్షణాభారముతో సతమతమౌతున్నట్లు  గమనించగలము. ఈవిషయాలను నేను నామెదడుకు అధికశ్రమ కలగకుండుటకై సంక్షిప్తముగా తెలిపితిని.  ఇంకా వివరంగా తెలుసుకోవాలనే కుతూహలం మీకుంటే నేరుగా నన్నుగలసి తెలుసుకొనవచ్చును. శ్రీమహావిష్ణువును ఆరాధించదలచినవారు, హృదయముపై మనసు నిలపవలసియుండును. ఇదిమాత్రమే వారు అనుసరించవలసిన పూజావిధానము. ఇంతవరకు ప్రయాణించి వచ్చినవారికి తదనంతర విషయములు దృక్పదమునకు వచ్చును.

 (బాబూజీవారి "హకీకత్ బేనక్వాబ్" లోని "శూన్యతా ఔర్ ఉస్సేఆగే" అను వ్యాసము. ఆధ్యాత్మజ్ఞాన్ ఏప్రెల్ – జూన్  2021  లో ఆంగ్లములో ముద్రితము)   

 

 

 

 

No comments:

Post a Comment

పూజ్యలాలాజీ మరియు మన ఆధ్యాత్మికప్రగతి

  పూజ్యలాలాజీ మరియు మన ఆధ్యాత్మికప్రగతి సోదరీసోదరులమైన మనమంతా యిక్కడ యీదినం (ఫిబ్రరవరి 14/ బుధవారం 2024) మన ఆదిగురువులైన పూజ్యలాలాజీవారి 1...