దివ్యసందేశములు
అనువాదం - శ్రీ పి. సుబ్బరాయుడు, కడప
హృదయధ్యానం మాత్రమే చేయాలి. అవిశ్వాసులవల్ల, దూర్తుల వల్ల, మలినమనస్కులవల్ల హృదయం కల్మషంగాని రీతిలో స్వచ్ఛంగా వుంచుకోవాలి. పరమాత్మవైపుతప్ప మ రిదేనివైపూ మనస్సును మరలనివ్వరాదు. మనస్సంతా ఒకే బిందువువద్ద యేకీకృతమై యుండునట్లు దృఢనిశ్చయుడవై యుండాలి. సత్య తత్త్వము మరియు గురువునందు భక్తి, ప్రేమలు వృద్ధిచేసుకోవాలి. తనలోని అహాన్ని పూర్తిగా తొలగించుకొని ప్రభువులో లయమై పోవాలి. ఈ విధానంలో మనిషి తన ఉనికిని కోల్పోవడం జరుగు తుంది. ఇది చాలాదగ్గరిదారి, మరియు తిరుగు లేని విధానము.
( లాలాజీవారి "కమాల్ ఇన్సాని" పుస్తకమునుండి గ్రహింపపడినది)
మార్గదర్శకములు
శ్రీరామచంద్రజీ మహరాజ్, షాజహాన్పూర్.
* మనిషి తన ఆత్మనావరించుకొనియున్న పొరలను నిర్మూలించు కోవాలన్న దృఢనిశ్చయానికొచ్చినట్లైతే, అతన్ని యీ భూమిపైనున్న యే శక్తీ ఆపలేదు. ఆధ్యాత్మికపురోభివృద్ధికి మనిషి కవసరమైంది ఒక ఉక్కు(దృఢ)సంకల్పమే. ఇదుంటే గమ్యం కనుచూపుమేరలో వున్నట్లే.
* సత్యతత్త్వం సాధించాలంటే ఒక బలమైన ఇచ్ఛాశక్తి అవసరం. దృఢసంకల్పంతో రంగప్రవేశం చేస్తేచాలు, సగందూరం దాటినట్లే. అతనినింకేశక్తి అడ్డగించలేదు. కనుక నావల్లకాదన్న నిరాశలో జీవించడం వదిలేయండి.
* కఠినశిల వలె దృఢంగానిలవండి. విజయం దానంతటదే మీ యెదుట సాక్షాత్కరిస్తుంది. విశ్వాసమే నీ మార్గదర్శి. ఇది ముఖ్యం గా గుర్తుంచుకోవాలి. తననావరించిన పొరలను విచ్ఛిన్న మొనర్చు కొని, ప్రాణాహుతిశక్తి గలిగి, తద్వారా దారిలోని వారినందరిని ఆదుకొని సహాయమొనర్చగల శక్తిమంతుడు మాత్రమే మార్గదర్శకత్వము నెఱపగలడని గ్రహించండి.
* నీలో యెదైనా బలహీనతవున్నట్లు గమనించినట్లైతే, దయచేసి అవి నావిగా భావించండి. మీరుమాత్రం ధైర్యంగా మీ ప్రక్రియను కొనసాగించండి. మీ బాధ్యత నాపైకి బదిలీయైపోతుంది. మీరు బలహీనతాప్రభావంనుండి విడుదల కాబడతారు. ఇది చేయడం చాలా సులభం. చేయండి ఫలితం గమనించండి.
* సాక్షాత్కారము అత్యంతసరళమైనది. దాన్ని పొందడానికి అంతే సరళమైన విధానం అవసరం. ఇక్కడ ఒక్కవిషయం అత్యంత ప్రాధాన్యత వహిస్తుంది. అదే అభ్యాసి సదా అశాంతి, ఆతురతతో లక్ష్యసాధనకు పరితపించాలి. ఇదే విజయసాధనోపాయం. ఇది సరాసరి మూలాన్ని కదలించివేస్తుంది.
* విజయము కలుగదేమోనన్న సందేహవైఖరి యిసుమంతైననూ మనసునందుంచుకొనకుము. నిన్ను నిరుత్సాహపరచుటన్నది జరగనే జరగదు.
* నిస్సంకోచ వైఖరియే విజయరహస్యము.
* వాస్తవంచెప్పాలంటే దైవీయమార్గంలో మోక్షంపొందడం మేమంత గొప్పవిషయం కాదు. అది పసిపిల్లవాడు ఆడుకొనే ఆటబొమ్మ వంటిది. అనంతసాగరం యింకనూ ముందున్నది. అది హద్దులే లేనంతగా వ్యాపించియున్నది. నీ దృష్టి దానిపై మాత్రమే కేంద్రీకరించి, ముందుకు పురోగమించి, దానిని కనుగొనాలి.
* అవసరమైన వారికందరికి సహయమందించే నిమిత్తం, నాహృదయం సర్వదా సంసిద్ధమైయున్నది. నేనీపని ఒక అధిపతి గాకాక మనవజాతికంతటికి ఒకసేవకునిగా వినయముతో చేపట్టియున్నాను. చాలామంది పూర్వము మరియు యిప్పుడు కూడా అధికారికగురువులుగా తమపనిని వారివారి కాలంలో నెరవేర్చి యున్నారు, మరియు నెరవేర్చుచున్నారు గూడా. కానీ నేనుమాత్రం సేవకునిగావుండటానికే ఇష్టపడుతాను. సేవకునిగా సామాన్యులమేలుకోసం పనిచేస్తాను.
* మీరు నిరంతరస్మరణతో పట్టుదలగా పురోగమిస్తే గమ్యం సులువుగా చేరుకుంటారు.
* మీరునన్ను చూచినారంటే, అది సంతోషించదగ్గ సమయమే. ఐతే నేనే మిమ్ములను చూసే అవకాశం కలిగితే, అది మరింత సంతోషించదగ్గ సమయము. ఈ వాక్యానికి లోతైన అర్థమున్నది. ఆ దిశలో ఆలోచించండి.
* సంసారంలోని ఒడిదుడుకులను పరిష్కరించడానికి మీరు శాంతంగాను, నెమ్మది, సహనంతో మెలిగితే అవి ఓకొలిక్కి వస్తాయి. పరిష్కారం భగవదిచ్ఛకు వదిలి, మీపనిని మీరు కర్తవ్య పరంగా నిర్వహిస్తూ, భగవదర్పితంగా ముందుకు కదలండి. ఇది దివ్యజీవనసుధామాధుర్యమును మీకందిస్తుంది.
* కోరికల నెలాఅధిగమిస్తాం? అని మీరు నన్నడుగుతారు. నాదగ్గరున్న
ఒకేఒక్కసమాధానం యిదే, " నిన్నునీవు పరమాత్మకప్పజెప్పుకొనే ప్రయత్నంచెయ్యి, అదెలాగుండాలంటే, శవాలంకరణ చేసేవాని చేతిలో శవంవలెవుండు". ఐనా నన్నొకమార్గం చూపమని అడిగితే, మీరు మీకోరికలు మీవికావు నావని తలంచండి. అదే నేనుచూపే సరళాతిసరళమైన ఉపాయము.
*వీలైనంత మిక్కుటముగా భక్తినిపాటించండి. అదిప్పుడు చాలా అవసరమైయున్నది. అది నిరంతరస్మరణద్వారా వ్యక్తిహృదయంలో ఉత్పన్నమౌతుంది.
(ఆధ్యాత్మ విద్య మార్చి2013)
***
లాలాజీ శతవార్షికోత్సవ సందేశము
శ్రీ రామచంద్రజీ మహరాజ్, షాజహాన్పూర్.
మనమిక్కడ లాలాజీ వారి శతసంవత్సరోత్సవ వేడుక జరుపు కొనుటకు విచ్చేసియున్నాము. ఈ సందర్భమును మనము గురుదేవుని యందే లీనమగుటకు సద్వినియోగపరచు కొన వలయును. అది మన ఆధ్యాత్మి కోన్నతికి ఉపయోగపడు ఆహారముగాను, రసాయనముగానూ పని చేయును. సర్వత్రా సమస్తవస్తుజాలమునుండి ఆయన స్మరణ జాలు వారుతున్న రీతిలో యీ కార్యక్రమము జరుగవలయును. మర్థ్యులెల్లరు కలిగి యుండ వలసిన స్మరణ యిది. ఇది మనమేలుకొఱకేర్పడిన క్రీడ.
జీవితపుఅల్లికలో ఒక నూతనాధ్యాయం తెరువబడినది. మనగాఢమైన భక్తిప్రకంపనలు ప్రతిధ్వనించి మనమనుభూతి చెందనారంభించితిమి. పరబ్రహ్మమిప్పుడు మనలను జ్ఞప్తికి తెచ్చుకొంటున్నది. అది భగవత్తత్వము యొక్క ధర్మము. నీ పాత్రను నీవు పరిపూర్ణముగా నిర్వహించిన యెడల పరమాత్మ తనవిధినిర్వహణలో వెనుకబడుటన్నది జరుగనేజరుగదు. ఇది కేవలము ఉత్తమాధ్యాత్మికప్రారంభదశ. దీని ప్రభావమున ఇంద్రియములు సంగ్రహించబడి తమ ఉనికియొక్క సమగ్రతను గ్రహిస్తాయి. ఇది నా అనుభవము.
అవి సంగ్రహింపబడుటవల్ల తిరిగీ మనము ఉత్తమస్థితి నందు కొనుటకవి నూతన శక్తిదాయకములౌతాయి. ఇప్పుడవి మన సహాయార్థమేర్పడిన నూతనోపకరణములు. ఇది సాధ్యమైన దంటే మనమొక ఆధారాన్ని మన సహయార్థ మేర్పరచు కున్నా మన్నమాట. ఇదీ మనకు సాధ్యమైందంటే, యింకనూ ముందున్న స్థానములను చేరుటకింకొక ఆధారం మన మేర్పరచుకొన్నట్లే. దైవత్వం ప్రవేశించడం మొదలవ్వగానే యిది తన్నుతాను సవరించు కోవడంకూడా ప్రారంభిస్తుంది. మనలో యీ అధారం స్థాపితం కాగానే అదిఒక శక్తిగామారి మనఉన్నతికి కావలసిన పదార్థాన్ని దృఢతరం చేయడం మొదలౌతుంది. ఈ ఆధారం మనలో నెలకొంటే మనవాస్తవ జీవితంలోని ప్రతిఅంశమూ ప్రభావితమై నిస్సంశయముగా అది "జీవితంలో జీవిత" మనబడు తుంది. మన స్వంతఆలోచనలన్నీ అవివేకము లైయుండుటే మన కేర్పడిన ముఖ్య కష్టము. మన ఆలోచనల ఫలితంగానే చర్య లుంటాయి. చర్యలు తిరిగీ మన ఆలోచనలే. నిజంచెప్పాలంటే మనమనస్సుకు మనం తప్పుడు సూచనలిస్తున్నాం. జనులీ మాట నంగీకరించక పోవచ్చును. పరిస్థితులు, మనమున్న వాతా వరణ మే మనలనా పనికి పురమాయిస్తున్నది. లేకుంటే మనస్సు కెందు కట్టి తప్పుడు సూచనలిస్తాము? మనమటువంటి వాతా వరణంలో జీవిస్తున్నా మన్నమాట.
ప్రకృతిసిద్ధమైన వాతావరణమున్న అడవులకో లేక కొండలకో వెళ్ళమని మన పుర్వపు ఋషులు సలహాలనిచ్చేవారు అవి మానవ నివాసాలకు దూరంగా వుంటాయి. కొండశిఖరంపైకెళ్ళిన వ్యక్తికి ఒకవిధమైన ప్రతిధ్వని మాత్రమే వినబడుతుంది. అంతేగాని యేవిధమైన ఆలోచనా కలుగదు. స్వచ్ఛత మనఉనికినుండే ఉత్పన్నమౌ తుంది. మాలిన్యములు, తప్పుడుసూచనలవల్లనూ, అంతర్గత వాతవరణ మును సక్రమముగా ఉపయోగించు కోకపోవడము వల్లనూ యేర్పడుతాయి. ఇవన్నీకలసి మన సంకుచిత దృక్పదానికి తోడ్పడి మనలో గందరగోళం యేర్పడ టానికి ఒక కారణమౌతాయి. ఇదంతా మామూలుగా, యధావిధి గా గానీ లేక ఒక్కొక్కప్పుడు, పరిసరాల ప్రభావంవల్లగానీ జరుగు తుంది. ఇటువంటివన్నీ ఒక చోట పేరుకపోయి వివిధ వర్ణములను సంతరించుకొంటాయి. ఇవి మనస్సులోని దిగువభాగాన్ని ప్రభా వితంచేస్తాయి. వీటి ప్రభావానికి లోనైన దిగువభాగం ఎగువ భాగానికి మార్గదర్శక మౌతుంది. ఇటు వంటప్పుడు నీమార్గం సరియైనది కాకుండా పోతుంది. అప్పుడు మనస్సు దానికైఅదే కంటకావృత మై పోతుంది. మనం అనుకూల తరంగాలను ఉత్పత్తిచేయలేని వారమౌతాము. అందుకు కారణం, మనం సత్యతత్వానికి వ్యతిరేకదిశలో వెళుతుండుటమే. ఈ నీచోత్పత్తికిముందు ఒక సమత్వస్థితి నెలకొనియుండినది
సమత్వముచెదిరిపోగా మనము ఉనికిలోనికి వచ్చితిమి. వేదంతరీత్యా నేనీవిషయమును విశేషముగా వివరించి చెప్ప దలచుకోలేదు. సృష్టిజరగవలెనను ఆలోచన కేంద్రము, మరియు దానిపరిసరములను కుదిపివేసి, శక్తి బయటకు చొచ్చు కొని వచ్చెను. అదేమిటి? అదే తొలిమనస్సు. అది స్వచ్ఛమూ, సరళము. అది మన బాహ్యరూపమునూ, నిర్మాణమునూ అల్లికచేసినది. అది దానితోపాటే స్వచ్ఛతను వెంటగొనివచ్చినది. స్వచ్ఛతయింక నూ పరిరక్షింపబడుతూనే వున్నది. కనుక మనం తప్పుడుసూచన లివ్వడం ప్రారంభించగానే అది తనవెంట తెచ్చుకొన్న దివ్య సంపూర్ణస్వచ్ఛతను పరిరక్షించుకొనే ప్రయత్నంలో తప్పుడు సూచనలను బయటకు త్రోసివేస్తుంది. అదే మరిన్ని ఆలోచనలకు కారణభూతము. వాస్తవానికది ఒక ప్రదేశము నావరించియున్న పొగలాంటి దానిని బయటకు నెట్టివేస్తుంది. దానినే మనం ఆలోచనలంటున్నాం. ఆ ఆలోచనలను మనం పట్టించుకొంటే వాటికి బలంచేకూరుతుంది. మీరెవరైనా దివ్యమైన ఆలోచనలను వృద్ధిచేస్తే మనస్సువాటిని గ్రహిస్తుందేగానీ తిరస్క రించదు. కారణం అది వాస్తవమనస్సు లక్షణం. ఎందుకంటే అది సత్య తత్వంనుండి బయల్వెడలి వచ్చినది. అది నిర్మలప్రవాహ జనితము.
ఒకమనిషి సులభముగా తన జీవితసమస్యలనుండి విడివడదలిస్తే అతడు తనమనస్సుకు సరియైనసూచనలనివ్వాలి. ఈస్థితి (సరి యైన సూచనల నివ్వ గలిగే స్థితి) సాధనద్వారా మరియు తన్ను తాను తగురీతిన మలచుకొనుట ద్వార సిద్ధిస్తుంది. తనదైయున్న దివ్యస్థితిలో నుండుటన్నది చాలా సులభము. ఉన్నతస్థితికి చేరుట కిది తిరుగులేని విధానము. సత్యతత్వము నందుకొన వలెనను ఒక చిన్నప్రయత్నము చాలును. తరువాతిదంతయూ తనంతటదే సమకూరిపోవును.
భారతదేశములో అనేకపద్దతులు వెలసియున్నవి. అవి సరియైనవే యై యుండవచ్చును. అయితే సరైనదంటే యేమిటి? అంటే అది నిన్ను కలత లేని స్థితియందుంచగలిగిన విధానమై యుండాలి. స్పందనలన్నీ దివ్యమైనవిగా పరిణమించాలి. యిదెలా సమకూరు తుంది? ఇది భారము తొలగినప్పుడు వీలౌతుంది. అప్పుడే దృశ్యమువెనుకనున్న విషయం మనోగోచరమౌతుంది. అవసర మైన ఫలితమునిచ్చేదే సరైనమార్గము. అదే అసలైనది, సక్రమ మైనది, ప్రకృతిసిద్ధమైనది. ఉన్న అనేక పద్ధతులలో యీ స్థితిని కలిగించగలిగిన ఒక దానిని నీవెన్నుకొనవలసియున్నది. నీవు నిజంగా అందుకొఱకు ప్రయత్నిస్తూ వుంటే, ఒక సద్గురువుకూడా లభ్యమైతే నీపని చాలసులువై, చాలావరకు నీ సమయము, శ్రమ కలసివస్తుంది. అటువంటి గురువు యెలా దొరుకుతాడు? అని ప్రజలునన్ను ప్రశ్నించవచ్చు? దీనికి జవాబుగా నేనొకమాట సూటిగా చెప్ప గలను. విశాలసాగరం లోనికి ప్రవేశించాలంటే, ఈత, ఈతగాళ్ళు రెండూ అవసరమే. ఇందులో ఈత అనేది ఈత గానిలో భాగమే. ఈ ఈతనేర్పేపని గురువుది. శ్రద్ధతో గురువును అనుసరిస్తే ఆయన చేతనయినంతవరకు దారి చూపిస్తారు. వాస్తవం చెప్పాలంటే తనలోని దివ్యశక్తిచే మనలను కదిలించ గల శక్తిమంతుడైన గురువు మనకు కావలెను. మనము దాటు కుంటూవెళ్ళవలసిన మహరోదశినందు సాధుపుంగవు లున్నారు . కొంతదూరము మనమూ వెళ్ళగలము. కానీ ఆతర్వాతి సూక్ష్మ స్థితులను సమీపించుటకు సాధకునిగా మన శక్తిచాలదు. అటు వంటప్పుడు అవతలిస్థాయిచేరుటకు ఒక త్రోపు అవసరమై వుంటుంది. లేకుంటే ముందుకుసాగుట సాధకునికి కష్ట మౌ తుంది. అప్పుడు అవతలికిత్రోసే పని గురువు చేస్తాడు.
నేను చాలామందిని చూశాను. వారు తమపరిథినుండి తా మెరుగని తమలోనిసత్తాను గురించి వాదిస్తారు. మరికొందరు తమఅంతరాత్మను గురువుగాగైకొన్నామని చెబుతారు. కానీ వారు వారిఅంతరాత్మనుకాక అహంకారన్ని గురువుగా స్వీక రించారని ఖచ్చితంగాచెప్పగలను. శాస్త్రములో చెప్పినట్లు అంతరాత్మ (లోని యెఱుక) మనస్సు, చిత్తము, బుద్ధి మరియు అహంకారమనెడి యీ నాలుగుటివల్ల యేర్పడుతుంది. ఈ నాలుగూ పరిపూర్ణంగా శుద్ధి గావింపబడితే, అప్పుడు అంతరాత్మ సరియైనసూచనల నిస్తుంది. దాని పరిమితి అంతవరకే.
ఈ శుద్ధీకరణ జరిగిన తర్వాత ఉన్నతశక్తులు ఉత్పన్నమౌతాయి. అప్పుడే సర్వత్రా స్వచ్ఛత వ్యాపింపనారంభిస్తుంది. తగని పూజలు వ్యర్థఫలితాల నిస్తాయి. ఈమాటనేను మితిమీరి మాట్లాడినానను కుంటే క్షమింతురుగాక!
మనందరమూ ఆత్మసాక్షాత్కారాన్ని ఆశిస్తున్నాము. కానీ దానికై ప్రయత్నమైతే యేమీ చేయడములేదు. మనందరమూ మన అస లైనస్వచ్ఛస్థితికి మరలివెళ్ళాలనీ, ప్రాపంచిక మరియు పారమార్థిక జీవితముయొక్క తేడాను గమనించాలనీ వేడు కుంటున్నాను.
(ఆధ్యాత్మజ్ఞాన్ జూలై 2017 )
***
మూఢనమ్మకము - ఆధ్యాత్మికము
శ్రీ రామచంద్రజీ మహరాజ్, షాజహాన్పూర్.
ప్రపంచములోని మతములన్నియు మన అవసరార్థమే యేర్పడి నవి. కొన్ని ఉనికియొక్క అంతర్భాగంనుండి, మరికొన్ని బయటి పొరలనుండి వచ్చినవి. అయితే సర్వమతములు తమ పరిధి కావల నున్న దివ్యత్వమును స్పృశించుటకే ప్రయత్నము సాగించి నవి. అవి జనసామాన్యాన్ని సత్యతత్వంలో లోతుగా మునుగు నట్లు చేయుటకై వారిని సమాయత్తపరచినవి. ఆ ప్రయత్నంలో అవి చాలావరకు సఫలీకృతములైనవి. మరికొన్ని మార్గములలో అవి విఫలమైనవి కూడా. కారణం మతం జనబాహుళ్యంకోసం, ఆధ్యత్మికత యెన్ను కొనబడిన కొందరికొఱకు మత్రమే. కోట్లాది జనం వారి వివేక స్థాయికి తగినట్లు, మతాన్ని అనుసరిస్తున్నారు. వారివారి మానసిక స్థితికి తగినట్లు మతాన్ని అర్థంచేసు కోవడం వల్ల, మతాలు అనేక శాఖోపశాఖలుగా చీలిపోయినవి. ఒకవైపు గొప్పవివేకవంతమైన ఆలోచనగలిగినవారుండగా, మరోవైపు జడత్వం తోగూడిన వ్యవహారమైపోయినది. ఇవి వారు యేర్ప రచుకొన్న పరిధిలో వాటి పాత్రనవి పోషిస్తున్నవి. ఇప్పుడు జడ త్వము, సూక్ష్మత్వము రెండూ వుండనేవున్నవి. సూక్ష్మమనస్సు లకు మహోన్నతభావమూ, స్థూల మనస్సులకు జడత్వమూ అందినది. ప్రస్తుతము ఆలోచనా సరళి స్థూలమైపోయినది. తత్కారణమున మనుషులు స్థూల విషయము లను మతమున కాపాదించు చున్నారు. ఒకఅబద్ధము వందసార్లు చెబితే అది నిజమైనరీతిలో వారి వ్యతిరిక్త విశ్వాసాలు మతములో అంతర్భాగములై పోయినవి.
వెలుతురు లేకపోతే మనం చీకటిలోవుండిపోతాము. తెలివి లేక పోతే మనం మూర్ఖులమైపోతాము. సత్యతత్త్వానికి దూరమై పోతే మనం సైతానులమై పోతాము. వారిప్పుడు సత్యస్థితికి వ్యతి రిక్త స్థితికి జారిపోయారు. వారు సత్యతత్వానికి సంబంధంలేని దానిని లోనికి గ్రహిస్తున్నారు. మరోమాటలో చెప్పాలంటే వారిలో పశుత్వం వృద్ధిజెందింది. వారు పశువులున్నటువంటి స్థితిలోనికి ప్రవేశిస్తున్నారు. ఒక్కోసారి వారి ఆలోచన యెలాగుందంటే, నేనీ ఆవును పెంచుకుంటున్నందువల్ల నాకు కావలసినంత ధన మొచ్చింది అంటారు. నేనొక గుఱ్ఱాన్ని పోషించడంవల్ల నాకు మనవడు పుట్టా డంటారు. ఇటువంటి వెన్నోవారు నమ్ముతూ పోతున్నారు. వీటిని పాటిస్తూ వారు యిటువంటి మరిన్ని ఊహ లను వృద్ధిచేసు కొంటున్నారు. వీటిని మనం మూఢనమ్మకా లంటున్నాం. వాటికి అర్థమేలేదు. ఇవన్నీ స్థూలమైనఆలోచనల ఫలితమే. స్థూలమైన విషయముల లోని కొంతసున్నితత్వము గ్రహించి వారు ఆధ్యా త్మిక వాదులమనుకుంటున్నారు. ఇదీ మూఢనమ్మకమే ఔతుంది. సరికానిస్థితిలో వుండి వారు సరిపోయినదనుకుంటున్నారు. పాలు సారాయితో కల్తీచేస్తే ఆ పాలు పాలేకానేరవు.
ఏమతమైనా పాతబడిపోతే దానిలోనికిటువంటివి చొరబడి పోతాయి. ఇటువంటివాటిని సరిచేయడానికే మహాత్ము లుద్భ విస్తారు. కానీ మన దురదృష్టమువలన అన్నికాలాలలో వారు మనకు లభించరు. అసలు ఆపనిచేయడానికి వారిని పిలవము కూడా. మనమెందుకు పిలవము? అందుకు కారణం, మనుషుల మనసుల్లో మూఢనమ్మకాలే మతములై కూర్చున్నాయి. వారు వాటి లో లోతుగాకూరుకపోయి, అంతకుమించి యేమైనా ఉన్నదా? అన్న ఆలోచనకూడా వారికిలేదు. ఈ మూఢనమ్మకాల కావల నిజానికొక శక్తియున్నది. అది మహాత్ములను రమ్మని పిలువ గలదు. ఈ సమస్తవిశ్వజీవరాశిని మార్పుచేయుటకు అటువంటి శక్తిస్వరూపమవసరమై యున్నది. వ్యాధిని వైద్యుడు నయము చేయగలడుగానీ గొర్రెలకాపరి కాదు.
ఈనాటి అవసరమేమైయున్నది? ఏమున్నదీ, కేంద్రమునుండి వెలువడినశక్తి అవసరమైయున్నది. అది మనలను దగ్ధముచేయ వచ్చును, లేదా కౌగిలించు కోనూ వచ్చును. మనలోమార్పు కలగా లని కోరుకొనేవారమే అయితే, మన అలోచనాతీరు యిదిగో యీ విధంగావుండాలి. ఈ సమస్యాపరిష్కారానికి మనం యుద్ధవీరుని వలె ముందుకుసాగి రణరంగమున ధైర్యసాహ సాలను నిరూపించు కోవాలి.
(ఆధ్యాత్మ విద్య జనవరి 2015 )
***
లాలాజీ వారి సదేశం
మన భ్రమలు, అపార్థములే మన బాధలకు కారణము. వీటివల్లనే మరలా మరలా మరిన్ని క్రొత్త వ్యధలను మనము సృష్ఠించు కొను చున్నాము. పూర్వాపరాలను గణించక పర్యవసానమును లెక్క చేయక గుడ్డిగా విచక్షణాజ్ఞానరహితంగా యొనర్చిన కార్యములకు సహితం ఫలిత ముండునా? అంటే ఉండవచ్చును. ఉండు ననుట కూ అవకాశమున్నది. ఏ వేయికొకడో అట్టి కార్యములవల్ల విజయము సాధించి యుండవచ్చును. అదిఅరుదు. తానొనర్చు కార్యములగురించి సరియగు అవగాహనలేక అట్టి కార్య గుణ లక్షణముల నెరుంగక గుడ్డిగా ఆచరించుటవల్ల సామాన్యముగా విజయము సిద్ధింపదు.
ఆరోగ్యస్థితిని కాపాడు కొనుటకు వాడుకున్న, మందుల చెడు ప్రభావము మనిషికి తప్పినది కాదు. అట్లే అసలు కార్యసాధనమున కనుబంధితములైయున్న కొన్నితర విషయములను పట్టించుకొనక తప్పినదికాదు.
ప్రపంచములో చాలామందికి వారి అంతిమ లక్ష్యమేమిటో దాని నిజతత్త్వమేమిటో తెలియదు. అసలు వారు తెలుసుకొను యత్నము కూడా చేయరు. ఇదియే వారు నిష్ప్రయోజకులగుటకు కారణమని ఒక్క మాటలో చెప్పవచ్చును.
అంతిమ గమ్యమును చేర్చు మార్గమున్నది. ఆదారిలో పయనిస్తే గమ్యంచేరుట తథ్యం. కానీ యాత్రికులు తమ తప్పుడు ఆలోచనల వల్ల, ఉత్తరద్రువము చేరుటకు దక్షిణాభిముఖులై పయనింతురు. అందువల్ల పెద్దచిక్కులో తగుల్కొని భ్రష్టులైపోదురు.
ఆధ్యాత్మిక మార్గగామికి అద్భుతశక్తులు సిద్ధించుననుటకు సందేహము లేదు. కానీ అవి వారి ప్రాపంచిక లాభమునకు సుఖ ప్రాప్తికి ఉపయోగించుకొని ఆశయము నెరవేరినట్లు తలంతురు. కానీ వీటిని లెక్కచేయక నేరుగా గమ్యంవైపుకు సాగితే, ఆత్మ సాక్షాత్కారమునకు అనుకూలమేర్పడి, తద్వారా శాశ్వతానందా నుభవమును పొందుదురు.
కానీ యీ అద్భుతశక్తుల సాధనే పరమలక్ష్యమని తలచి, వాటి యందే తనమునకలై పోయినట్లైన, ఆయోగశక్తులే మనలను తిరో గమనమునకు మరల్చి, అనతికాలములోనే పతనస్థితికిదెచ్చి, నిజ మైన యోగమార్గమునకు దివ్యశక్తులకు దూరమొనర్చును. అప్పు డాతడు కేవలమూ సామాన్యజనుడై తన పతనమునకు తానే దారి యేర్పరచుకొనును. "యద్భావం తద్భవతి". తనభావానుకూల స్థితినే తాను పొందును.
మనము పర్వత శిఖరాగ్రమునకు పయనమైతిమి. కానీ మన వ్యర్థవాంఛల బరువు తలకెత్తుకొంటిమి. ఈ యనవసరపు బరువెందుకని యోచింపనైతిమి. కడకీభారము కడుప్రయాస మిగిల్చినది. శక్తి నశించినది. ఇక ప్రయాణము ఆగిపోయినది. పట్టుసడలి వాటముతప్పి యే లోయలోనో తలక్రిందులుగాపడి యెముకలు విరుచుకొను ప్రమాదమేర్పడినది. ఇట్లు మన ప్రయత్న మంతయూ వృధాయై పోవుచున్నది.
ఎచటనుండి యికనీవు వెనుదిరుగుటన్నది యుండదో, యెచట అసత్యానుభవములుండవో, అట్టిదగునీ గమ్యము ఆరోహణ మార్గ మున నున్నది. కాన నిరంతర జాగరూకుడవై యుండవలెను. నీ తలపై గల బరువు నవతల బారవైచి తేలికదనముతో చురుకుగా గమ్యమువైపు సాగిపోవలయును.
మన మార్గమేమిటి? గమ్యముజేరుటకుపయుక్తములగు సాధన లెవ్వి? ఈసాధనలకూ, గమ్యము(లక్ష్యము) నకుగల భేదమేమి? అను విషయములను గమనించవలసి యుండును. మన అంతిమ లక్ష్యమును సరిగ్గా గుర్తించితిమా? లేక సాధనా లక్ష్యములందు, ఒకటి మరొకటిగా పొరబడితిమా? అన్న విషయమును యోచించి సరియగు అవగాహనకు రావలెను.
నీ వనుసరించు మార్గము వైరాగ్యదాయకము తదనుగుణము గా గాక, వాంఛా ప్రవృద్ధిత మనస్సుతో (ఇహపరములకు సంబం ధించి న వేవైనను) నీవిచ్చటి కరుదెంచి యుండిన యెడల, నీవు ఋజుమార్గమును వీడి చనుచున్నావని యెరుంగుము. తన కోరికల సాధనకై అభ్యాసులై సత్సంగమున కొనసాగువారు నిజ మైన భగవదన్వేషకులు కానేరరు. అట్టివారు భగవంతుని పొంద లేరు. అసలా ఉద్దేశముతో వారిక్కడకురాలేదు. కనుక ప్రయోజన ముండదు. మన మార్గము ననుసరిస్తూ సిద్ధులనూ, అద్భుత శక్తులను గడించి, భవిష్యత్వర్తమానముల నెఱిగి మహిమలజూపి సంఘమున తన హోదాను పెంపొందింపజేసుకొని, జన బాహుళ్యముచే కీర్తింపబడవలెనను ఆశతో నుండువారు యీ సాధనకు పనికిరారు.
పాపవిముక్తిని ప్రసాదింతుమనిగానీ దుర్నడతల ఫలితమగు శిక్షలనుండి తప్పింతుమనికానీ మనమెవరికీ వాగ్దానముచేసి, అందుకు కట్టుబడిలేము. జనులు అట్టి ఆశలను విడనాడ వలసియున్నది.
నేటినుండి సర్వజనులూ నీతో చెలిమితో మెలగుదురనియూ, అన్నివిధముల ఒత్తిడులనుండి నిన్ను కాపాడుదు మనికూడా మాటయివ్వలేదు. నీవు పూజలొనర్చిననూ, ఒనర్చకపోయిననూ సంస్కార ఫలితములను నుభవించవలసియే యుండును. మంత్రతంత్రాది ప్రక్రియలచేత జనులకు ప్రాపంచికలాభ మొనగూర్చుటన్నది యీ మార్గమున జరుగదు.
తన కోర్టుకేసులు గెలుచుటకో, పరీక్షలలో నెగ్గుటకో ఒక కార్యము నెరవేర్చుటకో, ఉద్యోగము సంపాదించుటకో, సంతానప్రాప్తికో, తనబాధల నుండి మన వద్దకు రాదలచువారు మన పద్ధతి కనర్హులు. భగవత్‍సాక్షాత్కారానికి అట్టి యూహలు విడనాడవలసి యున్నది. వారి వర్తమాన, భవిష్యదాశల కిక్కడ ప్రోత్సాహ మివ్వబడదు. అవే అవసరమైతే అట్టి వాటిని సమకూర్చెదమను వారికీ ప్రపంచమున కొదువలేదు. తత్కార్యసాధనకై అట్టి వారి కడకేగవచ్చును.
మనమేమియూ శ్రమపడనవసరములేదనియూ, గురుదేవులే వారి ఆధ్యాత్మికశక్తుల నుపయోగించి తనంతటదే మనలో భక్తిభావ ముత్పన్నమై ఉన్నతోన్నతస్థితులను అధిగమింప జేయవలయు ననియూ, కోరుకొందుము. వారి మనస్సులు చెడువైపునకు మొగ్గకుండానూ, చెడుఆలోచనలు వారి మనస్సున మొలకెత్త కుండాజేసి మతరహస్యములన్నీకూడా వారి మెదడుకేశ్రమా లేకుండా బోధపడునట్లనుగ్రహింపవలె నని తలంతురు. ఇది కేవలమూ నిరర్థకమైన కోరిక. కేవలము అదృష్టముచేత, భగవద్కృపవల్ల అట్టి మహోన్నత స్థితినొందిన వారరుదుగా వుండవచ్చునేగానీ, యీ సూత్రమందరికీ వర్తించదు.
అంతర్గతస్థితి విషయమై ఒకసాధకునికి, మరియొక సాధకునికి వ్యత్యాసముండవచ్చును. ఒకరి పురోగతి త్వరితముగను వేరొకరి యందది మందగొడిగనూ వుండవచ్చును. ఒకడు తక్షణమే ఆనం దాబ్దిలో పూర్తిగా మునిగి తన మేదాధిక్యతను వీడి లయమై పోవును. కానీ మరియొకడు యేండ్లతరబడి సాధన మొనర్చియూ అభివృద్ధిపథమున ఒక్క డుగైనా ముందుకేయక యెక్కడివాడక్కడే యుండును. ఇదంతయూ వారి శ్రద్ధ అభిరుచి సంస్కారములపై ఆధారపడి యుండును.
తమ అభ్యాసకాలమున కొందరు అద్భుత వెలుగును గాంచెదరు. వారు క్రొత్త నాదములను అంతర్ముఖముగావిందురు. కొందరు సాధకులు అట్టి అనుభవములేముయూ పొందరు. కొందరు నేత్రములను ముకుళించి ముందుకు సాగిపోవుచుందురు. కొందరు యేవేవో క్రొత్త క్రొత్త విషయములను కలలయందునూ ధ్యానమునందునూ కాంచుచుందురు. కానీ కొందరు యే యనుభూతిని పొందరు. నిజమున కివంత ముఖ్యముకాదు. ఇవన్నీ వారివారి స్థితికి సంబంధించినవి. అవి యెట్లైననూ వుండనిమ్ము. మనము వాటిని లెక్కసేయక, కేవల లక్ష్యమునకు మాత్రము పాటుపడవలెను.
గమ్యమేమి? ప్రామాణికమైనదేది? వినుము. భగవదాజ్ఞలను నిర్మోహభావమున కర్తవ్యపరముగా స్వీకరించి భగవదేచ్ఛగా గుర్తించి నిశ్చింతగా యుండుటే మతము.
మతమన్న కర్తవ్యమే. గ్రంథములు దీనిని రెండు భాగములుగా చేసినవి. ఒకటి మానసికము రెండు సాంఘికము. మానసికము సైతమూ మరల రెండుభాగములుగా చేయబడినవి. పూజ, ప్రార్థన, తపము, భక్తి, ఉపవాసము, యజ్ఞనిర్వహణ, క్షేత్రదర్శనము, దానము మొదలైన బాహ్యకార్యక్రమములొకభాగము. ఇందు మనస్సు ఇంద్రియముల సహాయమున పనిచేయును. దీనిని కర్మకాండయందురు. మనస్సునకు మాత్రమే సంబంధించిన రెండవదానిని జ్ఞానకాండమందురు. ప్రేమతో ప్రభుని సతతస్మరణ, సడలని విశ్వాసము, భగవంతునియెడ భయభక్తులూ, ప్రాపంచిక వస్తువులపై విముఖత, వైరాగ్యము, కలిగిన దానితో సంతృప్తి, ఆశా, అహంకారములు వదలి భగవత్భావన నుండి మనస్సు విడివదకుండుట, పవిత్రకార్యనురక్తి, ఇతరులయెడ నీచభావన లేకుండుట, కోపము లేకుండుట, తన కలిమికి గర్వింపకుండుట మొదలైనవాటినలవరచుకొను ప్రయత్నమే మార్గ మగును.
బాహ్యకార్యముల నిర్వహణము వలెనే, అంతర్గత కార్య నిర్వహణమూ చేయవలెను. మనస్సు యొక్క పనితీరు చక్క బడనంతవరకూ బాహ్యకార్యకలాపములను చక్కగా నిర్వర్తింప లేము. ఉదాహరణకు భగవంతుని పై నమ్మకములేక ఆప్రభుని శంకించిన యెడల, మాంధ్యము(సోమరితనము)నీ ధ్యానమున జొరబడును. లేదా క్రమముతప్పి చరింతువు. మనస్సు ధ్యానమునకుపక్రమింపదు. అది నచ్చనిపని చేయుటయైపోవును.
మనస్సధీనమునకు వచ్చునంతవరకూ మనిషిని జాగరూకునిగా వుంచుటన్నది బాహ్యవిధుల(కర్మకాండ)యందున్నది. దీనికంత దీర్ఘకాలము పట్టదు. ఉన్నతస్థితి కెదుగుట కవసరమగు బాహ్య విధుల సక్రమాచరణము అత్యంతావశ్యకము. కానీ వాటితోనే ఆగిపోరాదు.
ఇవన్నీ అర్థమైనప్పటికీ మనలోని బలహీనతలను మనము గుర్తించుటొకింత కష్టము. అంతర్గత కలతలమూలమున మానవుడు వాటి నధిగమించి పురోగమించుటెరుగడు. కనుక ఆవశ్యగతను(అవసరమును)గుర్తించి యీ బలహీనతలను జయించుటకు సద్గురువును జేరి అతని బోధనలనూ, చూపిన మార్గమునూ, అనుసరించుటత్యంతావశ్యకము.
నిస్వార్థబుద్ధితో యెప్పటికప్పుడు శిశ్యుని హెచ్చరించి, అతనిలోని బలహీనతలను తొలగించి చక్కనిమార్గము తెలిపి, ఉపదేశ మొనర్చుట గురువు కర్తవ్యము. సక్రమపద్దతీ మరియు ఆచరణము ను విస్మరించి మనోనిగ్రహము సాధించుటసాధ్యము. కనుక శిష్యుని ఒకానొక మానసికసాధనమున నుంచుట గురువు చేయుచుండు కార్యము. అయితే యీ సాధన, శిశ్యుడు పురోగ మించుచున్న స్థాయి కణుగుణముగా నుండి కాలావసరమునకు సైతమూ సరిపడి శిష్యుడనుసరించుటకు అనుకూలమైనదై సహజముగ నుండవలెను. ఇదే మనమనుసరించు చున్న మార్గము.
ఓం తత్ సత్.
***
హజమార్గ సారాంశము
మనిషికన్నియెడలా అవసరమే సుమా!
మర్యాదాత్మకమైన నడవడెపుడూ
భగవదర్పితమైన జీవనమే జీవనము
మర్యాదన్న మానవుని కదియె సుమ్ము
భక్తికియ్యదే కదా! అధారభూతమ్ము.
నినునీవు భక్తునిగ భావించి జీవించు
నిన్నావరించిన కీడు ప్రభువు తొలగించు
స్వంతసోదరుడే సుమా! నీసాటి అభ్యాసి
ఆదరమునచూడు మతని నెల్లపుడు
అతని కష్టముగూడ నీ కష్టమనుకొనుము
చేతనైనంతగా చేయూత నిమ్ము.
(ఆధ్యాత్మజ్ఞాన్ జూలై 2017 )
***
శ్రీ రామచంద్రజీ మహరాజ్, షాజహాన్పూర్.
దేవుడు లేడని మనిషి అనలేడు. కానీ దేవుడంటే యేమిటి? ఎవరు? అనేవిషయమై అభిప్రాయభేదములు మాత్రమున్నవి. ఇవికూడా మనిషికి ప్రసాదింపబడిన జ్ఞానమువలన కలుగుచున్నవి. ఈ జ్ఞానము మనిషిసృష్టి కాదు. కనుక దాన్నీ సక్రమముగా ఉపయోగించుకోవాలి. అంతేగాని జ్ఞాన మూలాన్నే తిరస్కరించేవిధంగా జ్ఞానాన్ని దుర్వినియోగపరచ రాదు. ఈమాట దైవం ఉనికిని మనిషి నిర్ద్వందంగా ఒప్పుకొనేట్లు చేసి, మొత్తనికి మనిషి దైవమంటే యేమిటనే అన్వేషణలో పడేట్లు చేస్తుంది.
వాస్తవానికి దైవం మనిషికి జ్ఞానాన్ని ప్రసాదించాడు. ఆ జ్ఞానమే అసలు జ్ఞానమూలాన్ని శంకించే అయుధంగా మనిషి ఉపయోగిస్తున్నాడు. దీన్నిబట్టి ఆలోచిస్తే, దైవం మనిషిఅపనమ్మకాన్ని, యెన్నడూ గణనలోనికి తీసుకోలేదు. అంతేగాకుండా దైవం, మనిషికి పూర్తిస్వేచ్ఛ నిచ్చాడు. హేతువాదమునకు నిలువకున్నచో దైవముయొక్క ఉనికిని సైతం ప్రశ్నించే స్వాతంత్ర్యమిచ్చాడు. అంటే జ్ఞానధిక్కారమన్నమాట. ఏదియేమైనా మనిషి జ్ఞానముద్వారానే దైవంఉనికిని ఒప్పుకోవలి, అంధవిశ్వాసంతో ఒప్పుకోవడం సరికాదు. దేవుడున్నాడన్న నమ్మకంతో ముందుకుసాగాలంటే తెలివినుపయోగించవద్దని చెప్పడం తప్పు. ఈ తప్పును దాదాపు అన్నిమతాలూ యేదో ఒకదశలో చేస్తూనేపోయాయి. ఇది ఆత్మవంచన. దైవం స్వేచ్ఛాయుతజ్ఞానప్రదాత. ఆ జ్ఞానం దైవంఉనికిని శంకించేదిగా వుండకూడదనటం కూడా సరికాదు.
దేవుడులేడనే నిర్ణయానికి మనిషి రావడం అసాధ్యంమౌతున్నది. ఎందుకంటే, తనఉనికిని తాను యెప్పుడూ లేదనలేడు. అలా అనడానికైనా తానంటూ ఒకడుండితీరాలి. కనుక తన ఉనికిని తాను శంకించడం కుదరదు. ఆ ఉనికి నిజానికి స్థూలశరీరాన్ని సూచించదు. తన్నుతాను లేదనుకోలేడు గనుక, తన ఉనికిని అన్వేషిస్తూ తుదకు దేహానికి, మనస్సుకు, తెలివికి ఆవలనున్న ఆత్మసాక్షత్కారానికి చేరువౌతాడు. ఈవిధంగా లేదనలేని తన సూక్ష్మఉనికిని ఉన్నదని ఒప్పుకోవడంద్వారా దారి తెరువబడి, స్వానుభవము, తర్కమువలననే, దైవం అవగతమవ్వవలసినదేకానీ. మతగ్రంథములను గ్రుడ్డిగానమ్మి వాటికి కట్టుబడియుండుటవల్ల ప్రయోజనములేదు.
ఆత్మసాక్షాత్కారానంతరము స్వానుభవము. మరియు జ్ఞానముద్వారా భగవంతుని కనుగొనుటకు మరొక్కడుగు ముందుకేయవలసియుండును. ఈ దేహము, మనస్సు, తెలివియనెడి పొరలను ఒక్కొక్కటిగా ఛేదించుకుంటూ, ముందుకు పయనించి, తన అంతిమస్థాయి ఉనికిని మనిషి తెలుసుకోగలుగుతాడు. అదే ఆత్మ పరమాత్మ ఒక్కటేనన్న సత్యము. ఈ యేకత్వానుభవం కలగాలంటే, మనిషి తనజ్ఞానంతో తనపై చుట్టుకొనియున్న అసంఖ్యకములైన ఉల్లిపొరలవంటి తొడుగులను తొలచివేసుకుంటూ, ఛేదించుకొంటూ ముందుకువెళ్ళి స్వచ్ఛమైన మనిసిగా తన్నుతాను మార్చుకున్నప్పుడే యిది సాధ్యమౌతుంది.
ఒకకవి, యిలా చక్కగా గానంచేశాడు. ఓ హృదయమా! ఆయనద్వారమునకు యే తెర అడ్డముగలేదు. అయన దివ్యమంగళముఖారవిందమునకు యే ముసుగూలేదు. నీవే అహంకారమనే ముసుగుధరించి తెరలకావల నిలుచున్నావు సుమా!.
నీరుల్లిపొరలనన్నింటినీ తొలగించిన తర్వాత మనకగుపడున దేమియు వుండదు. శూన్యం. నాస్తికుడు కూడా దైవమనేదేదీ లేదనేకదా! వాదించడం మొదలుపెడతాడు. కనుక తుదకు నిరామయమని తేలినప్పుడతడు ఆశ్చర్యపోనక్కరలేదు. దేహము, మనస్సు, తెలివిఅనే తొడుగులన్నీ ఛేదించుకొని వెళ్ళినతర్వాత, నీరుల్లిపొరలంతమెలా శూన్యమో, తనవిషయములోకూడా దేహము, మనస్సు, తెలివిఅనే తొడుగు లన్నీ తొలుచుకొని లోనికి వెళ్ళినతర్వాత వున్నది శూన్యమేనని అర్థమౌతుంది. మనిషి చేరుకోవాలనుకొనే యీ శూన్యముయొక్క సకారాత్మకపార్శ్వము నిజానికి అత్యంతసన్మోహనమైనది. అది తను ప్రియునికౌగిటిలో పూర్తిగా మైమరచి కరగిపోవుటవంటిది. అదే బుద్దుడు, తన్నుతాను పూర్తిగా మైమరచి (నిర్వాణదశ నందుకొని) ప్రభువుగా, భగవంతునిగా ఆరాధింపబడ్డాడు. భగవంతుడున్నాడు. ఎప్పుడూ? ఎప్పుడక్కడ నీవులెవో అప్పుడు. తాను తనప్రియునివలన కలిగిన దివ్యానందమును తన సస్వభావముతో గ్రోలడమా? లేక వాస్తవనిరామయతను (శూన్యమును) కనుగొనుటకై తననుతాను సైతం కోల్పొవలసియుండునా? అన్నదికూడా అతని యెఱుకలో వుండదు. పొరలన్నీతొలగి రుచిరహితమైన తర్వతగూడా రుచి, అరుచులకు భిన్నమైన రుచేదో ఒకటి వుంటున్నది. ఒకటి (మనిషి) కి సున్న (దేవుడు) ఎడమవైపు (నాస్తికత్వం) ఒకదశాంశబిందువు (స్వసంకల్పం) తో ఇచ్ఛారహితంగా (సహజమార్గంలో నిర్దేశించినట్లు యోగసాధన) చేరుస్తూపోతే సున్నాకు దగ్గరగా, మరింత మరింత దగ్గరౌతూపోతాము. దేవుడు తనరూపముననే మనిషిని సృష్టించెనంటారుకదా! అట్టి మనిషి తనకు ప్రసాదింపబడిన జ్ఞానముతో, తుదకు మిగిలివున్నదేదో తెలుసుకుంటాడు. ఇది గ్రుడ్డినమ్మకంతోగాక, తొలుత తెలుసుకోవాలన్న జిజ్ఞాసతో లేదు కాదని వాదించినా, తర్వాత జ్ఞానోదయమై అసలువిషయం తెలుసుకుంటాడు.
మతం అంతమైనప్పుడే, ఆధ్యత్మికత మొదలౌతుంది.
ఆధ్యాత్మికత అంతమైనప్పుడు, సత్యతత్త్వం మొదలౌతుంది.
సత్యతత్త్వం తుదకు చేరగానే ఆనందపరిధిలోనికి ప్రవేశిస్తాము.
ఎప్పుడు దాన్నికూడా అధిగమిస్తామో అప్పుడే మనం గమ్యందరిచేరుతాము.
(ఇది ఏప్రిల్-జూన్ త్రైమసిక "ఆధ్యాత్మిక జ్ఞాన్" పత్రికలో ఆంగ్లంలో ప్రచురితం)
***
మొక్కకు ముల్లు గట్టిగా పొడవుగా పెరిగిందంటే, దాన్ని కత్తిరించి వేయాల్సిందే, తప్పదు. అసలు గుర్తుంచుకోవలసిన విషయమేమిటంటే, స్వార్థం యింతోఅంతో అందరిలోనూ వుంటుంది. కానీ అది హద్దుమీరితేనే దోషమౌతుంది. జాగ్రత్తా! స్వార్థం కాసింత హద్దుమీరినా ఆధ్యాత్మిక జీవనం దోషభూయిష్టమౌతుంది. ఇది బాగా గుర్తుంచుకోవలసిన ముఖ్యవిషయం.
( బాబూజి రాఘవేంద్రరావ్ గారికి వ్రాసిన లేఖల సంపుటి- పుట.54))
***
ససజమార్గ ఆధ్యాత్మికశిక్షణావిధానమున మనస్సును అతి సహజముగా క్రమబద్ధమొనర్చి, దానిని తన నిజస్థితికి గొని రావడం జరుగుతుంది. అంటే మనస్సు తొలుత మానవునియందు ప్రవే శింపకముందున్నట్టి స్థితికి తీసుకరావడమన్నమాట. అంతేగాక అధమవృత్తులతో స్వేచ్ఛగా వ్యవహరిస్తున్న మనస్సు మహోన్నత చైతన్యాధీనమునకు వచ్చును. తద్వారా అది తన వక్రప్రవర్తనను మానుకొనును. తనలోని ఉన్నతకేంద్రములు దైవీయకేంద్రముల అధీనమునకు వచ్చును. ఈవిధంగా మొత్తమంతయూ దివ్యత్వ మొందుటకారంభించును.
ఈ ప్రపంచములోని ప్రతియొక్కరూ శాంతినే వాంఛింతురు. అంటే వారిధ్యేయం భగవత్సాక్షాత్కారం కాదన్నమాటే కదా? అట్లయితే వారికి శాంతిమాత్రమే లభిస్తుంది. భగవత్సాక్షాత్కారం కాదు. ఒక వేళ వారి ధ్యేయం భగవత్సాక్షాత్కారమే అయితే, ఆందుకొఱకై జాగృతమైన స్థితి, శాంతినికూడా సమకూరుస్తుంది. మనం కేవలం భగవత్సాక్షాత్కారమంటే యేమిటో తెలుసుకోవడానికేకాదు, దానిని పొందడానికి కూడా ప్రయత్నించాలి.
జ్ఞానము -- దానితీరుతెన్నులు
నేను (అహం) అన్నదానికావలగల ఎఱుకకు సంబంధించినదే జ్ఞానం. ఇక సాక్షాత్కారమంటే అనంతంలో కలిసిపోవడం, లేక లీనమైపోవడమే. ఈ లీనమైపోయిన స్థితిలో జ్ఞానానికి సంబం ధించిన ప్రశ్నే ఉత్పన్నంకాదు.
విధానము – అనుభవము
మార్పులేనట్టి మహోన్నతస్థితిని గురించి తెలుపునదే నిజ మైన విద్య. అయితే అట్టిది చదవడం, నమ్మడం, విశ్లే షించడం వంటి వాటివల్ల సాధ్యపడదు. అది భావతీత మహోన్నతయెఱుక వల్లనే సాధ్యం.
పుస్తకపఠనమే మార్గంగా సాక్షాత్కారంవైపుకు నేను పయనించి వుంటే, దివ్యత్వపు అతిముఖ్యలక్షణమైన జ్ఞానరహితస్థాయి వరకు వచ్చియుండెడి వాడనుకాను. ప్రత్యక్షానుభవసహిత జీవితమే విలువైనది. సాక్షత్కారమననేమో తెలుసుకొనుటేకాదు, దానిని సాధించు యత్నముకూడా చేయవలసి యున్నది.
మానవుడు - అతని స్థానము, మరియు గమ్యము
మనము మనవ్యక్తిగత, వస్తుప్రాధాన్యతను సంతరించుకొనియున్న చిన్న ప్రపంచమునేర్పరచుకొని, పొరలపై పొరల చుట్టివైచుకొని జడత్వమును పెంపొందించుకొనుచూ, అంతరంగమున వెలుగు చొరబడవీలులేకుడా చేసుకొంటిమి. ఇప్పుడు మనమ మలినపు పొరలను ఒక్కటొక్కటిగా విధ్వంసమొనర్చుకొని, సృష్టికిపూర్వ మున్న తొల్లింటి స్వచ్ఛస్థితిని పొందవలసి యున్నది.
ఏదోఒక విధమున, వ్యకిగతమనస్సును ఆ మహత్తరదివ్య మానసము వైపునకు మరల్చినట్లైన, అది తన అసలు వర్ణమునకు మారును. సృష్టి ప్రారంభించుతకై ప్రకృతిలో చలనము కలిగించిన క్షోభ యొక్క ప్రతిబింబమే వాస్తవమునకు మనవ మనస్సు. దీనిని పతనావస్థ నుండి మరల్చి మూలమువైపునకు త్రిప్పితిమేని, అప్పు డది నిశ్చల, నిరామయ, ప్రాశాంతస్థితికి వచ్చును. ఒక చైతన్య శక్తిపూరితుడైన మహాత్ముని సహాయముచేతనే మనస్సు మూలము వైపునకు మరలగలదని, నేను నా స్వానుభవమున తెలియజేయు చున్నాను.
మనిషి ప్రకృతిచేతి పనిముట్టు. అతనికి గొప్పశక్తులున్నాయి. వాటిని సద్వినియోగపరచుకొనే సాధనమూ సమకూరియున్నది. ఆ అద్భుత సాధనమే మనస్సు. ఈ మనస్సుకూడా ఒక్క మనవుడే కలిగియున్నాడు...నిజానికి యీసాధనము (మనస్సు) దేనినైనా చైతన్యపరచగల సామర్ధ్యము గలిగియున్నది.
అసమానత్వాన్ని నిర్మూలించలనే ధ్యేయంతో సామాన్యంగా ధ్యానంచేస్తాము. అందువల్ల మన యిచ్చాశక్తి మనల్ని సమత్వానికి తీసుకవస్తుంది. ఆవిధంగా మనలోని మానవత్వం దివ్యత్వంగా మార్పుజెందడం మొదలౌతుంది. మనిషి దివ్యుడవ్వడమంటే అర్థ మిదన్నమాట. కనుక సహజమార్గవిధానంలో చేసే ధ్యానప్రభావం వల్ల మనం మన మానవమాత్రపు తీరున పనిచేస్తున్న శక్తిని క్షీణింప జేసుకొంటూ దైవత్వంతో ముందుకు సాగిపోవుదుము. తన అల్పత్వపు స్థితిని గుర్తించగలిగినవాడే, ఉన్నతస్థితి నందు కోగలడు.
విముక్తుడైనతర్వాత, యింకనూ సాధించవలసినదెంతయో గలదు. అనంతసాగరమే ముందున్నది. అది అపార పరివ్యాప్తమైయున్నది. నీదృష్టి దానిపై, దానిపైమాత్రమే లగ్నముచేసి, దానిని కనుగొనుట కై ముందుకు సాగిపొమ్ము.
ప్రాపంచికకార్యకలాపములతోనూ, బాధ్యతలతోనూ యెంతగా తీరికలేని జీవితము గడుపుతున్నప్పటికిని అనునిత్యము స్వచ్ఛము, సరళమునైన సత్యతత్త్వముతో అనుసంధింపబడియుండుటే సమాధిస్థితి. దీనినే సహజసమాధి అనికూడా అంటారు. ఇదే సాధించనగు మహోన్నతస్థితి. నిర్వాణమునకు మూలమైన దిదియే.
రాజయోగంలో వ్యక్తి సూక్ష్మమైన విధానమున సాగుతూ క్షణ మైనతీరికలేని వ్యగ్రతతో నుండు మనసిక ప్రవృత్తులను శాంత పరచును. ఇంతే గాకుండా యీ విధానాన్ని అవలంభిస్తున్న సాధకుడు తన ధ్యాసను అత్యంతసూక్ష్మమైన దానిపై వుంచడంవల్ల అతడు దేహభ్రాంతినుండి విదివడి వుంటాడు.
భగవంతుడు సులభుడు. సులభుడైన భగవంతుని పొందుటకు అంతే సులభమైన విధానమునే అవలంభించవలెను. కనుక భగవత్‍సాక్షాత్కారానికి మన ఇచ్ఛ, చర్యలు, పరిసరాలు సృష్టిం చినవాటినుండి విడుదల గలిగించగల విధానములనే అనుసరించ వలసి యున్నది. మన ఆలోచనలన్నీ క్రమబద్దం కావాలి. మన వ్యక్తిగత మానసముమీదున్న బరువు దించివేయబడాలి. మనం దూదిపింజవలె తేలికైపోవాలి. అప్పుడు సమర్థుడైన గురువర్యుల ఒక్కత్రోపుతో మనం భగ వంతునివైపు యెగిరిపోవాలి. మనసంస్థలో సత్యతత్త్వం తొలి దశలోనే ఇచ్చాశక్తి ద్వారా ప్రవేశపెట్టబడుతుంది. అదే రానురానూ ఆధ్యాత్మికబీజంగా పరిణమిస్తుంది. ఈ ప్రక్రియ సాధారణంగా సద్గురువుద్వారా ప్రవేశపెట్టబడుతుంది. అందువల్ల మొలకెత్తిన బీజం వడగాడ్పులకు వాడిపోకుండా సజావుగా పెరుగుతుంది. అభ్యాసి తన నిరంతరస్మరణతో నీటినందించి పెరుగుదలకు దోహద పడతాడు. ఇదే సాక్షాత్కారమార్గమున సరైన విధి.
***
సాక్షాత్కర మార్గము
శ్రీరామచంద్రజీ మహరాజ్
వైరాగ్యమును పెంపొందించుకొనకపోతే, మాయనుండి బయట పడలేమనుట సత్యము. అయినప్పటికీ ఇల్లు, కుటుంబము మరియు ప్రాపంచిక భాధ్యతలనుండి తప్పించుకొని మతనిబంధ నాయుత సన్యాసము స్వీకరించమని దీనర్థము కాదు.
మనతోపాటున్న ప్రాపంచిక విషయములపై తగనివ్యామోహము గలిగియుండుటే నిజమైన దోషము. ఇదే దుఖఃముల కన్నింటికీ మూలకారణము. కానీ మనజీవితమిలోని ప్రతిదీ మన కర్తవ్యము గా భావించి, యే విధమైన ఆకర్షణ వికర్షణలకు లోనుగాకుండా కార్యనిర్వహణ గవించినచో, ఒకవిధంగా మనం ప్రాపంచిక బంధనముల నుండి విడుదలపొంది సన్యసించినట్లే యగును. మనం అనేక వస్తువులు కలిగియుండి, వాటిని వినియో గించు కొంటున్నప్పటికిని వైరాగ్యస్థితిలో నున్నట్లేయగును. నిజానికిదియే వైరాగ్యము. మనకు కలిగినదంతయూ ఆ భగవంతుని పవిత్రనిధి యనీ, దానిని సద్వినియోగపరచుటకై తనకప్పజెప్పబడిన బాధ్యత గా తలచి పనులజేసుకొనుచూ పోవలెను. వైరాగ్యమనగా ప్రాపంచికవిషయములపై ఆసక్తిలేకుండుటేగానీ వస్తువులు కలిగియుండకపోవుట కాదు. ఇదే వైరాగ్యమునకు సరుయైన నిర్వచనము. వైరాగ్యము వాస్తవానికి ఒకస్థితి, లేదా అంతర్గత మానసిక స్థాయి. ఇది వస్తువుల అశాశ్వత మరియు మారు చుండెడు గుణమును మన దృక్పదమునకు దెచ్చి, వాటియెడల మనలో విరక్తిని గలిగించును. అతనిచూపు అనునిత్యము మార్పు లేనట్టి శాశ్వత సత్యతత్త్వముపైనే వుండి, అకర్షణ వికర్షణలకు లోనుగాకుండును. ఇదే వైరాగ్యమను పదమునకు సరైన అర్థము. ఇట్టి మానసికస్థితిని పొందినతోడనే మనము కోరికలనుండి విదివడుదుము. ఉన్నదానితో సంతృప్తి పొందుదుము.
ఆకర్షణలవల్ల ఉత్పన్నమైనదంతయు దుఃఖమయమే. సంతోషము బాధ రెండూకూడా దుఃఖమునకు దోహద మొసగునవే. అత్యంత స్వచ్ఛమైన భగవత్‍చింతన వైపు మనల్ని మనం మరల్చుకొనుట తప్ప, యీ దుఃఖమునుండి స్వస్థత జేకూరుటకు వేరొకమార్గము లేదు. హృదయముపై ధ్యానముచేయు ప్రక్రియ యనగా, హృదయ మున ఈశ్వరీయప్రకాశము గలదని భావించి దానిపై ధ్యానము చేయుటే. ఈ విధమైన ధ్యానముచేయునపుడు హృదయాంతర్గత ఈశ్వరీయప్రకాశమే నిన్నాకర్షిస్తున్నదనుకొనుము. ధ్యానము చేయునపుడు ప్రాపంచికబాహ్యవ్యవహారములు నిన్ను కలత పెట్టుచున్నట్లనిపించిన, వాటిని లెక్కచేయకుము. ధ్యానము యొక్క ఫలితముగా మనలో యేకాగ్రత దానికైఅదే సహజముగా నెలకొనును.
ఉదయము ధ్యానమునకు ముందు ఓ ఐదునిముషములు నిర్మలీ కరణగావించుకొనుచుండుట మంచిది.
అభ్యాసి తాను తేలికగా మరింతతేలికగా ఔతున్నట్లనిపించడం మొదలైందంటే అతడు పురోగమిస్తున్నట్లు గుర్తు. అతడు యీవిధం గా దైవీయస్థితిలోనికి ప్రవేసిస్తున్నాడని అర్థం. తేలికదనమంటే వ్యక్తి తన ఆలోచనల బరువునుండి విడుదల పొందటం. కనుక నిజమైన తేలికదనం సద్వస్తువును సూచించును. ఇంకా చెప్పాలంటె అది పదార్తరహిత పదార్తం.
వ్యక్తి ఆకర్షణకు లోనైనాడంటే, ఆ ఆకర్షించునది అంతిమగమ్యం, అంటే భగవత్సాక్షాత్కారమే అయివుండాలి. తుదివరకు యిదే దృక్పదంతో సాగాలి. ఇది అనేకవిధముల మనల తప్పుదారికి మరలించు అసందర్భవిషయములనుండి రక్షణకల్పించి, నమ్మ కంగా, ఖచ్చితంగా గమ్యంచేరుస్తుంది.
చైతన్యవంతము చైతన్యరహితములైన వాటిని జోడించు స్థానము హృదయబిందువు మత్రమే. అక్కడే యీ కలయికను సుస్పష్టముగా గుర్తించనగును. అందుకే హృదయముపై ధ్యానము అత్యంత ఫల దాయకము. అంతేగాక హృదయము మనస్సుయొక్క కార్య స్థానము. మనస్సు యధాతదముగానుండును. మనస్సుయొక్క కార్యక్షేత్రమైన హృదయమునే చక్కదిద్దవలసి యుండును.
ప్రార్థన
ఒక దీనాతిదీనావస్థయందున్నవాడు హృదయవేదనతో కన్నీటి పర్యంతమై ప్రభువు దయ, కరుణ కొఱకు ప్రాధేయ పడు చున్నట్లు గా మన ప్రార్థన వుండవలెను. అప్పుడు మాత్రమే అతడు దైవ కరుణ కు పాత్రుడగును. భక్తునికి భగవంతునికి మధ్యగల సంబంధము, ప్రియుడుప్రేయసి సంబంధమై యుండును. ఇదే అత్యుత్తమ మైన దని నే నభిప్రాయపడుతున్నాను. అభ్యాసి తనను తాను పియునిగా దైవాన్ని ప్రేయసిగా తలంచుకొని, యీ అనుబంధముతో మున్ముం దుకు సాగితే తుదకు దైవమే ప్రియుడై భక్తుడు ప్రేయసిగా మారి పోతారు.
ప్రార్థన అత్యంతప్రాముఖ్యత గలిగిన, ఓటమినెఱుగని విజయము నందుకొనుటకు సరియైన మార్గము. పవిత్రభగవత్‍తత్త్వముతో యిది మనలను అనుసంధించి, ఆ అనుబంధమును దృఢతర మొనర్చును.
ప్రార్థన హృదయపూర్వకమైన ప్రేమ భక్తి భావముతో చేసినయెడల మనలో ఒకవిధమైన శున్యస్థితి యేర్పడి, అందులోనికి దైవీయ కృపాధార ప్రవేశించును. విశ్వమీదశకు యెదిగివచ్చుసరికి కేంద్ర బిందువు అప్పటికే జీవులలో లోతుగా పాదుకొనిపోయి యుండును. మనలో పాదుకొనిపోయిన కేంద్రబిందువు మహోన్నత దైవాంశమేగనుక, అది మన ధ్యాసను మూలము వైపు నకు మరల్చును. మనం ప్రార్థనద్వారా అదే కేంద్రబిందువును చేర యత్నింతుము. మనం మనలో ఆ శూన్యస్థితిని ఉత్పన్నం చేసు కున్నపుడే యిది సాధ్యపడుతుంది. దీనికి ప్రయత్నపూర్వక సాధన అవసరము. దైవేచ్ఛకు మనం సర్వం సమర్పించుకున్నప్పుడు యిది సుసాధ్యం. సరళము ప్రశాంతమునైనదీ విధానము. ఇది చాలాకష్ట మనిపించును గానీ, వాస్తవానికిదానికై పరితపించువానికిది సులభము. మహోన్నత దైవంకోసం తనలో తీవ్రపరితాపం వృద్ధి చేసుకొన్న వారు యీ ప్రార్థనామయస్థితిలో వుంటారు. దీని కోసమే అందరూ పరితపించవలసి యున్నది. ఈ స్థితిలోనికి వ్యక్తి ఓ లిప్తకాలమైన ప్రవేశిస్తేచాలు, అతని ప్రార్థన ఫలించినట్లే. ఇందు కోసం నిరంతర సాధన అవసరం. ఈవిధమైన ప్రార్థనకుపక్ర మించుటకు జనులలో ప్రేరణకల్పించవలెను. ఈ ప్రార్థనామయస్థితి పొందిన తర్వాత స్మరణ తప్ప యింకేమీ మిగిలియుండదు. ఆ స్మరణ సహితం అతని యెఱుకకు కూడా అందనిదై యుండును.
నిరంతర స్మరణ
నిరంతరస్మరణ అలవడుటకు ధృఢనిశ్చయము గలిగి తీరిక సమయములలో అంటే ఇంట్లోగానీ, కార్యాలయంలోగానీ, వీధి లోగానీ, బజారులోగానీ యెక్కడున్నాసరే దైవము సర్వ వ్యాపియై సర్వకాల సర్వావస్థలలో నిండి నిబిడీకృతమై యున్నదన్న తలంపు తో నుండుము. ఈ విధమైన ధ్యాసతో నీకు వీలైనంత సమయము గడుపుము.
మన శారీరక మానసిక కార్యకలాపములన్నింటిలో ఆ దైవమునకు అనుసంధింపబడి నిర్వర్తించుట నిరంతస్మరణకు సంకేతము. మన సమస్తకార్యకలాపములలోనూ విడివడని చింతనతో ఆ మహత్తర శక్తికి అనుసంధింపబడి యున్నట్లు అనుభవపూర్వక ధ్యాసతో జీవనము సాగవలెను. మన కార్యకలాపములు, చేష్టలన్నీ కూడా దైవాజ్ఞానుసార కర్తవ్యముగా తలచి, ఆ దైవమే యివన్నీ మనకప్ప జెప్పబడిన కార్యములని, యిది ప్రభుసేవయని, ప్రభుసేవ తన కర్తవ్యమని భావింతుమేని, యీ నిరంతరస్మరణ సులభముగా మనకలవడును.
భక్తి
నిరంతరస్మరణ వాస్తవానికి ధ్యానసాధనవల్ల సహజముగా ఊత్పన్నమై వికసించునదే. అభ్యాసి తను ధ్యానమునకు లేక నిరంతరస్మరణకు ఆధారముగాగైకొన్న దానియందు గనబరచు మిక్కుటమగు శ్రద్ధ వలన ప్రతిభాశక్తిసంపన్నతను సంతరించు కొనును. అప్పుడా అభ్యాసము శుష్కము (నిస్సరము) గా నుండ జాలదు. అది ప్రకాశవంతమై సర్వమును తనలో లీనమొనర్చుకొను ప్రయత్నమున నుండును. భక్తిశ్రద్ధలనెడి అగ్ని మత్రమే నిరుప యోగ మైన చెత్తాచెదారమును కాల్చివైచి, చిట్లెమునుండి బంగరమును వెలికితీయగల్గును. అయితే యీ ప్రేమాగ్ని మూడుదశలుగా నుండును. మొదటిదశలో అణగారియుండి, లోలోపలనే రగులు తూ పైకి దట్టమైన పొగలు వెలువడజేయును. రెండవ దశ లో అందుండి అప్పుడప్పుడు నిప్పురవ్వలు వచ్చుచుండును. ఇక ఆఖరు దశలో ప్రజ్వలితకాంతితో మండుచూ సర్వాన్నీ క్షణంలో భస్మ పటలంగావించు శక్తివంతమై యుండును. మొదటి రెండు దశలు గాలిలోని దహనశక్తికి తోడ్పడు పదార్తమునకు అను గుణముగా నుండును. లోలోపల రగిలిన అగ్ని విజృంభించి, దహన క్రియకు అడ్డుపడు జడత్వమును దహించివైచిన తర్వాత, మూడవ దశ సంపూర్ణప్రజ్వలితశక్తిని సంతరించుకొని ప్రారాంభ మగును. ఇలా కాకుండా విద్యుత్‍శక్తితో రగులుకొను అగ్నియూ కలదు. ఇది మొదటి రెండుదశలను తప్పించి, నేరుగా ఆఖరుదైన మూడవదశ తోనే దర్శనమిచ్చును. ఈదశలో పొగ, ఆవిరి వంటి వేమియూ వుండవు. ఇటువంటి అగ్నిని రగిలించగలిగితే, యిక నీ పురోగతి అత్యంతవేగవంతమై యుండును.
భక్తిప్రేమలు నిజానికి సులువైనవే అయినప్పటికిని, వెనువెంటనే అవి కలుగుట కష్టమగుచున్నది. నిజానికి భక్తిలో యేవిధమైన కష్టమూలేదు. అది చేతికి గ్లౌస్ (చేతి మేజోళ్ళు) వేసుకున్నంత సులభంగా వివరింపబడియున్నది. తొలిదశలో భక్తుడు తను ప్రేమిస్తున్న వస్తువుయొక్క యెఱుక కలిగివుంటాడు. అదే ఉన్నత స్థాయిలో అయితే యీ రూప ఆవరణల ప్రభావంతగ్గిపోతూ, ఆఖరు స్థాయికి చేరుసరికి వాటి యెఱుక అసలే లేకుండాపోవును. అత్యంత సూక్ష్మస్థాయిలో భక్తి ఆత్మసమర్పణగామారి, అసలు అ సమర్పణాభావముకూడా లేకుండా తీసివేయబడుతుంది. ఇదంతా మహోన్నత ప్రభువుయొక్క దయచేతనే సంభవమౌతుంది.
సహజసిద్ధంగానే యీ భక్తి, ఆత్మార్పణ మొదలైనవి, వుండనే ఉన్నవి. వీటికోసం వ్యక్తి తనవెంట నిన్ను గొనిపోగల సహచరుని మిక్కుటముగా ప్రేమించవలసియున్నది. కనుకనే భగవంతుడు గురువురూపమున నీకు తరసపడెనని స్వీకరించవలెను. నా విషయంలోనికి వస్తే, నేను ప్రేమించునది నా గురువును మాత్రమే. నేను స్వేచ్ఛనుగానీ ప్రశాంతతనుగానీ నిష్టనుగానీ మరిదేనినిగానీ ప్రేమించుటలేదు. కేవలం మాగురువును మాత్రమే ప్రేమిస్తున్నాను. నిస్సందేహముగా ఆయన అందుకు తగినవాడు. నేను ధ్యానించుట కు భక్తిప్రపత్తులు జూపుటకు ఆయనే సరియైనవాడు. ఆయన అహం కారము వాంచ్ఛా లేనివాడు. ప్రాపంచిక విషయలోలత ఆయనలో లేదు. పూర్తిగా తన ఆత్మలోతాను భక్తిమై మునిగియున్నాడు. ఇట్టి సద్గుణములు మహోన్నత ఆధ్యత్మికపురుషుని లక్షణములు. సామాన్యుల కిటువంటి గుణములు లభ్యముకావు. అందుకే నే నాయనను అంతగా ప్రేమిస్తున్నాను. నేను అత్మసాక్షిగా, హృదయపూర్వకంగా సంపుర్ణంగా ఆయనలో లీనమైపోవుటకు శయశక్తులా ప్రయత్నించాను. అదే నాజీవితాశయము. దానికి కారణం సాటిలేని అనుపమ గురువు నాకు లభించడమే. అందువల్ల నేను పొందిన ఫలితము మాటలలో చెప్పలేనిది. ఒక్కమాటలో చెప్పాలంటే ఆయన దయాసముద్రుడు. మనమందరము అందులో మునగవలసి యున్నది. శ్రద్ధాసక్తులుగల సాధకులందరికీ యిది అందుబాటులో నుండుగాక.
ఆత్మార్పణము
నిన్నునీవు ఆ మహాప్రభువునకు ఆత్మార్పణగావించుకొని జీవన్మృతుడవుగమ్ము లక్ష్యము సాధించుటకిదే సులభాతి సులభ మైన మార్గము... నీ హృదయాన్ని అయనకు అప్పజెప్పితే, అదే, అయనకు కానుకగా యివ్వగలిగితే యిక నీవు చెయ్య వలసిన దింకేమి మిగిలి యుండదు. అదే నిన్ను అ అంతిమసత్యంలో సహ జంగా లీనమైన స్థితిని కలుగజేస్తుంది. ఇట్టి సరళము, సులభము నైనట్టి ఉపాయాన్ని గ్రహించి అనుసరించగలిగితే తొలి అడుగుతోనే గమ్యం చేరువౌతుంది. జీవితములో పొందనగు అత్యంతప్రియ మైన వస్తువును పొందుటకు నీ చిన్నిహృదయమును తప్ప యింకే మియ్యగలవు. చిన్నిహృదయమే సమర్పించదగిన కానుక.
ఆత్మార్పణమంటే తన ఇచ్ఛను పుర్తిగా త్యజించి, సంపూర్ణముగా ప్రభువు ఇచ్ఛకు తననుతాను సమర్పించుకొనుటే. ఈ స్థితి శాశ్వత ముగా నెలకొనెనేని, అది శున్యస్థితి ప్రారంభమునకు దారి తీయును . ..ఈ స్థితిలో వ్యక్తి ప్రభువుయొక్క ఆజ్ఞానుసారమే ఆలో చించును లేక పనిచేయును.
గురువు--ఆయన విధులు
భగవంతునికి భక్తునికి అనుసధానకర్త గురువే. గురువు మాధ్య మముననే మనము భగవంతుని చేరుదుము. దారిలోని అటంకములనన్నిటిని తొలగించగలశక్తి ఆయన మత్రమే.
శిష్యులకు దీక్షనిచ్చు ప్రక్రియను నేటివృత్తిగురువులు, ఆ ప్రక్రియను అసలర్థము చేసుకొనక తప్పుదారి పట్టిస్తున్నారు... వాస్తవానికి అన్వేషకునిలో నిజమైన విశ్వాసము నెలకొని దైవమునెడ ప్రేమ అతని హృదయములో వేరుదన్నిన తర్వాతనే పద్ధతిప్రకారము దీక్షనియ్యవలెను. అది సాధకుడు అనంతదివ్యశక్తితో అనుసంధింప బడెననుటకు సూచన. ఇది గురువుయొక్క గొప్పశక్తిసామర్థ్యముల పై ఆధారపడి చక్కని అనుసంధాన మేర్పడును. ఈ కార్యమునకు గురువు మహోన్నతస్థాయికి జెందినవాడై వుండవలెను.
సర్వసాధారణంగా మహాత్ముదంటే గొప్పవ్యక్తి అనెడి అర్థము నాకు నచ్చదు. అసలేప్రత్యేకతాలేక నిరాదరణకు గురై యేవిధమైన గొప్ప దనము, గర్వము, అహంకారమూలేనివాడై శాశ్వతముగా తన్ను తాను శున్యముగావించుకున్నవాడే మహాత్ముడని నేను నిర్వ చించెదను.
ప్రాణాహుతి
ప్రాణాహుతి స్వచ్ఛమైన మానసమునుండి ప్రవహించి పనిజేయు ఒక శక్తిధార. ప్రాణాహుతి ప్రభువు ఇచ్ఛానుసారము నిరంతరము పనిజేయు శక్తి. సాధకుడు తొలుత యేవిధమైన (ప్రాణాహుతీ ప్రసార) అనుభూతినీ పొందడు. కారణం అతడు ఇంద్రియములద్వరా మాత్రమే అను భూతులను పొందుటకు అలవాటు పడియున్నాడు. కొంతకాలము గడచిన తర్వాత ప్రాణాహుతి ప్రసార ఫలితాన్ని అనుభూతిచెంద నారంభిస్తాడు. అదికూడా అతని సున్నిత జీవావయవముల పని తీరులోని సూక్ష్మ మార్పులద్వారానూ, మానసికప్రవృత్తులలో మార్పు ద్వారాను గుర్తించగలుగును.
ప్రాణాహుతిశక్తి ఒక మహాయోగి సాధించిన మహత్తర యోగశక్తి. ఆ యోగశక్తిని లేదా దైవీయధారను అతడు తన ఇచ్ఛాశక్తితో సాధకునిలో ప్రవేశపెట్టి, సాధకునిలోని అవాంఛనీయము, మరియు ఆధ్యాత్మికపురోగతికి ఆటంకములైయున్నట్టి వాటి నన్నింటినీ నిర్మూలించును. ఈ శక్తినాయన తనచుట్టూచేరియున్న వారిపైననేగాక దూరమందున్నవారిపైకూడా ప్రయోగింపగలడు. ఈ శక్తినాయన యేవిధంగానైనా యెక్కడైనా ప్రయోగింపగలిగి యుండును. ఈ ప్రాణాహుతిశక్తిపై పట్టుగల్గిన మహనీయుడు ఒకచూపు మాత్రముననే వ్యక్తిలో తాత్కాలికంగాకానీ శాశ్వతం గాకానీ మహోన్నతస్థితిని కలుగజేయగలడు. ఆస్థితి ప్రస్తుత మత డున్నస్థితి కంటే చాలా ఉన్నతంగావుంటుంది. అది సాధకుడు తన జీవితకాలం మొత్తం తపించినా సాధ్యముకానంత మహో న్నతం గా వుంటుంది.
***