Showing posts with label దైవసాక్షాత్కారానికి మార్గములు పద్దతులు. Show all posts
Showing posts with label దైవసాక్షాత్కారానికి మార్గములు పద్దతులు. Show all posts

Tuesday, 19 November 2024

దైవసాక్షాత్కారానికి మార్గములు పద్దతులు

 

దైవసాక్షాత్కారానికి మార్గములు పద్దతులు

                                                                  --- మహాత్మా రామచంద్రాజీ

 ఉన్నదున్నట్లుగా చూడగల్గు వ్యక్తికొఱకు నేనెంతగానో యెదురుచూస్తున్నాను. మానవదేహమున తగినరీతిలో యిమిడియుండు ప్రకృతి నతడు వ్యక్తపరచగలగాలి. ప్రకాశవంతముగా వెలుగుతున్న రవినతడు తెలుసుకొని వుండాలి. మనంచూస్తున్న సూర్యప్రకాశముయొక్క నిజతత్వమెప్పుడుత్పన్నమై వెలువడినదో అతడు గుర్తించివుండాలి.

 దేవుడు, దేవతలు అని మనంమాట్లాడుతున్నప్పుడే, ఆరెండిటిమధ్య వ్యత్యాస మగపడుచున్నది. సత్యమును నిర్ధారించుటకు తగినసాధనములుగా పోలికలు, భేదములనునవి (ఇట్లున్నది, ఇట్లుకాదని సరిచూచుట) ఆవస్యకములగుచున్నవి. ఇవే దేవుడు, దేవతలు అను మాటల విశ్లేషణకు ఒకదారి నేర్పరచుచున్నవి. ఇప్పుడు దేవుడిని, దేవతలతో పోల్చిచూచి, మీకైమీరే దేవుణ్ణి నిర్వచించండి. మీరు దేవతల విశ్వనిర్మాణసామర్థ్యమును గమనించినట్లైన ఒకవిధమగు తేడా కనబడితీరుతుంది. మీరు దేవతలలో యీఅంశమును ప్రతికూలదృక్పథముతోగమనించిన, దేవుని (దైవ) నిర్వచనమునకు దేవతలు సరిరారన్న నాదృక్పదముతో మీరేకీభవిస్తారు. ఒకవ్యక్తి తనప్రభువును (గురువును) అమితంగా పేమించి తన్నుతాను సంపూర్ణముగా ఆయనకంకితం చేసుకొని ఆయనతో లీనమైనపుడు, అదేభావన నతడు సర్వత్రా దర్శిస్తాడు. అట్లే ఒకవ్యక్తి, ఒక్కటైన సత్యతత్వమునందు లీనమై గమనించినట్లైన, ఆసత్యతత్త్వ రూపాంతరములనే అంతటా గమనిస్తాడు. ఆసత్యతత్త్వ శక్తిప్రవాహముతో అతని ప్రతియోచనాంశము కలసిపోయి యుండుటచేత మీరు సత్యతత్త్వమే అన్నిటినుండి వెలువడుతున్నట్లనుభూతి చెందుదురు.

 సత్యతత్త్వముతో లీనమవ్వడమంటే, వ్యక్తి తనలో భావరాహిత్యత ననుభూతిచెందుతాడు. అతడు తన దేహ, మనో, ఆత్మభావనలన్నీ కోల్పోతాడు. ఇదే నిజమైన దైవస్థితి. అయినప్పటికీ మనిషిగా కొన్నిహద్దులకు లోబడి ఆస్థితివుంటుంది. వస్తుసముదాయమంతయు దాని సస్వరూపములో వుండుటన్నది, ఇచ్ఛాశక్తిచే యేర్పడిన గ్రంథి (ముడి) వలన జరుగుచున్నది. ఒకవేళ యిదికూడా నిర్మూలింపబడినట్లైన యిక విశ్వమే ఉనికిలో వుండదు. కనుక ఉన్నది బంధనరహిత ఇచ్ఛయే. అది తనతుది గమనదశలో శూన్యమై, శక్తిని కోల్పోయినట్లనుభూతికిలోనై, రూపాంతరము జెందితి ననుకుంటున్నది. అందువలన అంతటా అది పరివర్తిత రూపమునే చూస్తుంది. అది ముఖ్యగ్రంథిచే యేర్పడిన హద్దులకులోబడే, అనుభూతి చెందుతుంది. వ్యక్తి సశరీరుడై యీస్థితిని సాధిస్తే, అతడిదేదృశ్యమునకు సాక్షీభూతుడగును. ఈస్థితి మహోన్నతస్థాయికి చెందిన యోగికే సాధ్యమగును. అతడు ఆచ్చాదనరహిత అర్హమగు స్థాయికిచేరి, యిదంతయు దర్శింపగలడు. స్వనేత్రములతో చూడకనే చూచితిననుట అత్యంత హేయము. మొదటినుండి అద్వైతసిద్ధాంతమునకు కట్టుబడినవారు, వివిధములందు యేకత్వమునే, దాని ముతకస్థితిలో దర్శింతురు. మీలో యెవరైనను సరే, యిస్థితిలో వుండివున్నట్లైన యీవిధమగు భినాభిన్నస్థితులన్న ప్రశ్నలే ఉత్పన్నమై యుండవు. ఇది అనేక సంపుటములుగా నున్న విషయము. నేను సంక్షిప్తముగా చర్చించితిని. ఒకవ్యక్తి భారతప్రధానమంత్రి కాకుండానే, ఆస్థాయిలో తన్నుతా నూహించుకొని, యేదేదో వ్రాస్తే, అతనినిమీరు న్యాయధికారిగా, యేశిక్షాస్మృతిక్రిందికి వస్తాడో నిర్ణయించుకోండి.     

 

మనిషి యీరోజు జన్మిస్తాడు. దినదినాభివృద్ధి జెందుతాడు. అతని జ్ఞానేంద్రియాలు క్రమేణ వృద్ధిజెంది కొంతకాలానికి జ్ఞానాజ్ఞానములతేడా గ్రహించి పరిపక్వదశకు జేరుకుంటాడు. ఒకవేళ అతడొకస్థాయికిజేరుకొని యేమార్గ మవలంభించాలో నిర్ణయించుకోవలసివస్తే, భారతీయ ఆధ్యాత్మికదర్శనములలో నిష్ణాతుడై, ద్వైతాద్వైత, విశిష్ఠాద్వైతముల నెఱిగిన యతని దరికేగి అతనితో మాట్లాడి, అతనిబోధనల వినుటవలన అతడీవిశ్వమంతయు భగవత్స్వరూపమేనని నమ్మించి మనసుపై ఒకఘాడమైన ముద్రవేయును. ఆముద్రప్రభావమున, ఆమాటను అర్థముచేసుకొనును. విశ్వసించును. ఆవాక్యముయొక్క సత్యస్థితియేదో ఆస్థితికిజేరుకొనును. ఆతర్వాత అతడు యేబోధవలన తనకు నమ్మికగలిగెనో దానినే యితరులకు దెలిపి, వారిని నమ్మింపయత్నించును. ఆవిషయమై అధ్యయనము చేయును. ధారళముగా ఉపన్యసించును. తను యేతపన శ్రమ పడకుండా గడించిన ఆవిషయములతో ప్రజాబాహుళ్యమును నమ్మించి వారిమనస్సులపై తానునేర్చిన విషయముద్రల నేర్పరచును. దాని పర్యవసాన మేమగును? ఆచరణాత్మకముగా శూన్యము. ఒకవ్యక్తి మొదటిసారిగా గోదుమలనుచూచి, అవి గోదుమలని చెప్పగావిని తనూ వాటిని గోదుమలనును. వాటిరుచిని గురించి యడిగిన అతడేమియు చెప్పజాలడు. ఇటువంటివే మనమన్నిచోట్ల చూచుచుందుము.

 విషయిక స్వరూపము: బహ్యముగా మనము వేదములలో విభేదములున్నట్లు గమనింతుము. దాని పర్యవసానమే షడ్దర్శనములు (సాంఖ్యము). ప్రతిఒక్కరూ తమకుతోచినట్లు యేదోఒకటి చెప్పుచుందురు. హేతువాదానుకూలముగా నున్నదే నిజమైన వేదమని మనువు తెలిపెను. చాలామంది వేదాంతులు యీ వాదము నంగీకరించిరి. ప్రపంచములోని పవిత్రగ్రంథములన్నింటిలో వేదములుమాత్రమే వేదాధ్యయనమును ద్వితీయమైనవిగా ప్రకటించెను. మర్పులేనట్టి దానిని సాక్షాత్కరింపజేసుకొనుటే నిజమైన అధ్యయనము. దానిని చదువుటవల్లగానీ, నమ్ముటవల్లగానీ, హేతువాదమునగానీ సాక్షాత్కరింపజేసుకొనలేము. అది అతీంద్రియ ప్రత్యక్షాన్భవముననే సాధ్యమగును. ఒకవేళ దానిని సమగ్రముగా సాధించినప్పతికినీ, అతడింకనూ మున్ముందుకు సాగిపోయి కడలితీరమును చేరవలసి యున్నది. అక్కడగల చలువదనమును చవిచూచి, తనకైతాను సువిశాల సముద్రమున దుమికి సత్యస్థితికిజెందిన అనంతమగు ఆనందమును, ప్రశాంతతను అనుభవించును. భాధ లేదన్నను, తద్విరుద్ధమైన బాధ స్ఫురిస్తూనే వుంటుంది. నీవు బాధపడుటను విశ్లేషించిన యెడల అందులో ముతకరూప ఆనందమున్నట్లుకనుగొందువు. బాధ ఆనందములలో నీవు దేనిని తలచినా ఒకటే కనుక, నేను యీరెండింటిని ప్రస్తావించినపుడు నీలో కలిగిన ఆలోచన యేవిధంగా వుంటుంది? అదినీ ఆలోచనతో రంగులువేయబడిన ఒకరూపముయొక్క ఛాయగా కనబడుతుంది. ఆనందము దుఃఖము ఒకే విషయిక ఊహా స్వరూపములు. నీవు వర్ణరహితుడవైతే, పరిసరములకు రంగులుపులమలేవు. అందులకొక ఉదాహరణ చూద్దాం. నీవు దయ్యాలకథలు వినేవుంటావు. అవి కేవలం ఊహమత్రమే. అయినా కొందరు వాటి కథలకు భయపడతారు. కొందరు భయపడరు. ఎందుకలా ఔతున్నది? హృదయంలో ఆదయ్యాలు తనకు హానిచేస్తాయనుకున్నవాడు, తనకుతానే హానిచేసుకుంటున్నాడు. అదే విధంగా మాయను మనం దయ్యమనుకుంటే, మనం భయపడినంతకాలం మనకైమనం హాని కలిగించుకుంటూవుంటాం. ఎంత ఆశ్చర్యకరం. మనపడవను మనం మాయాగాజుపలకపై నడుపుకుంటున్నాం. ఆమాయ తనరెండుచేతులను చాచి తనకౌగిలిలోనికి గుంజుకొని పట్టేసి, ప్రభువు సమక్షమున పడేస్తున్నది. నిజానికి మాయకు సంబంధించిన కార్యక్రమమే లేకుంటే, మనమీప్రపంచమున ఉండే వారమేకాము. మనల నీరూపమున యిక్కడకు దెచ్చిన దానిని దూషించడం సరిగాదు. కానీ దానిని సక్రమముగా సద్వినియోగ పరచుకోవాలి. మనమొక అసహ్యమైన ప్రదేశమును చూస్తే, మనంకూడా వికారులమైపోతాము. అదే ఆప్రదేశముయొక్క దివ్యప్రకాశమువైపు చూసినట్లైన మనంకూడా కాంతివంతమైపోతాము.

 సత్యస్వరూపం: రాజయోగం మనకు మన నిజజీవిత ప్రభువు (గురువు) స్థితికి సమమైనస్థాయిలో  బోధిస్తుంది. వ్యక్తి తన మనస్సున నిజజీవితామృతమును గ్రోలుటకు ధృడనిశ్చయుడైతే యేశక్తికూడా (మయగానీ మరేదైననుగానీ) అతని నిర్ణయమును వమ్ముగావింపజాలదు. మనం మాయకు దూరంగా వుండమనడంలేదు. కాని ప్రభువుతో కలిసియుండు ప్రయత్నముచేయుము, నీజీవితసమస్య సులువుగా పరిష్కరమగును, అని తెలుపుచుంతిమి. సర్వసామాన్యముగ జనులు యెదోఒక రుచికొఱకు ప్రాకలాడుచూ, దానికే తగులుకొనియుందురు. విద్యావంతులు మానసికానందమునకు చిక్కువడియుందురు. ఇటువంటివన్నీ ఆధ్యాత్మిక ప్రయాణసమయమున వదలిపోయి, కడకు నిజస్వరూపముతో ప్రభువునెదుట నిలచును. ఇది ప్రారంభకులలో జరుగువిధానము. ఈవిధానములో ఆత్మనావరించియున్న పొరలు రాలిపోయి, చేరువైనవాడు తొలిదశలోనే అనుభూతిచెందునని నేను హామీనిస్తున్నాను. అభ్యాసి గైకొన్న యీ స్థితిలో మార్పులు జరిగి అతితొందరలో శున్యస్థితికి చేరును. ఇదే తొలుత అభ్యాసి అవసరముగా చేపట్టవలసిన విధానము. నేనుతొలుత మాగురువర్యుల (లాలాజీవారి) దరికి చేరినపుడు నేను వీటివిషయమై గ్రుడ్డివాడనై యుంటిని. గ్రంథములను ఉపయోగములేనివిగా ప్రక్కనబడవైచితిని. నాకయనే అన్నిటికంటే యిష్టమైనవాడుగా నుండెను. ఈవిధమైన జీవనవిధానమున ప్రవేశించినపుడు మనిషికుండవలసిన లక్షణముగా, నాకాయనకంటే యిష్టమైనదేదియు కానరాక ప్రపంచమునాకు చీకటయ్యెను. 

              

కోరి నీవాహ్వానిస్తున్నంతకాలం మళ్ళీమళీ యీ లోకంలో జన్మిస్తూవుండటం, లోకంలోని సుఖాల ననిభవిస్తూవుండటమన్న యీప్రక్రియ నిలిచిపోవటం జరుగదు. ఎవరినైనా నేను యీవిధమైన జీవితాన్ని కోరుకుంటున్నారా? అని అడిగితే, నీవలెనే వారు యీ జేవన్నాటకమ్నుండి తొలగించివేయవలసిన దిదొక్కటే కాదుగదా? అని ప్రశ్నిస్తారు. పొందవలసిందికూడా యిదొక్కటే కాదని నేను చెబుతాను. ప్రాపంచిక ఆధ్యాత్మికజీవనములు రెండూ సమానతేజముతో కొనసాగవలసి యున్నది. విజయము నభిలషించినయెడల మనం రెండురెక్కలతో యెగురవలసి యున్నది. భగవంతుని అడవులమధ్య వెదుకవలె ననుట అసంబద్ధ జనసామాన్యము యొక్క ఆలోచన. నా ఆలోచన ప్రకారము భగవంతుని వ్యక్తియొక్క హృదయమధ్యమున అన్వేషించవలెను. సాహసవీరుడు డాలు లేదా కవచంధరించి రణరంగ ప్రవేశంచేయాలనుకుంటాడు. అతనికి ధైర్యముండాలి. అటువంటివాడే యీశాస్త్రమునకూ అవసరం. అతడే యిశాస్త్రమును తెలుసుకోగలడు. ఈగుణమే మానవజీవితమున కుండవలసిన అత్యావశ్యకమైన అంశము.

 ఆనందసాగరము: ఆధ్యాత్మికజీవనమున నాకు ప్రాప్తమై, లభించినదే అనుభవమున, పరిపక్వతకు తోడ్పడినది. నీవు దానిని నాదురదృష్టమనవచ్చును. ఎందుకంటే, ప్రపంచములోని చాలావస్తువుల నిజరుచిని నేననుభవించనేలేదు. అలా నేనడానికి నిదర్శనం, నేను నాగురుదేవుల పాదకమలములకడ సమర్పించుకొని మౌనశీలుడనై పోయాను. ఆయనచూపుమాత్రముచేతనే, నావ్యధలన్నీ దూరమైపోయాయి. ప్రాపంచిక జీవితము లేశమైనా మిగలకుండా నామనస్సునుండి తొలగిపోయింది. నేనన్నివైపులా ఆనందసారమే చూస్తూ వుండిపోయాను. అదంతా నేనాయనపై నుంచిన విశ్వాసమూ, భక్తివల్లనే సంభవమైనది. ఆయన సామర్థ్యముకూడా అందుకు తోద్పడిన దనవచ్చును. నాగొప్పమార్గదర్శకుని (మహనీయ గురుని) హృదయమునుండి నాలోనికి ప్రవహించుచున్న దివ్యధారయొక్క ప్రభావముననే, నాలోనేను పూర్తిగా కోల్పోయితిని.

 

   నేను పైన తెలిపినదంతయూ ఆయనను, ఆయననే (గురువును) తెలుసుకోవడంవల్లనే మహనీయముగా సంప్రాప్తమైనది. భదవద్సాన్నిధ్యమున నీవులేవా? అని నన్ను ప్రశ్నించవచ్చును? నాకూ ఆయనకూ మధ్యగలసంబంధము మాత్రమే ఖచ్చితముగ వుండినదని మీకు జవాబుగా చెప్పెదను. ఇది అభ్యాసి విషయమున సహజము. "నీగురువును బ్రహ్మముగా తెలియుము" అని శాస్త్రములు చెప్పుచున్నవి. ఆవిధంగానే భావించాలి. ఎందుకంటే, స్వామీవివేకానంద యిలా చెప్పారు. మనం భగవంతుని గురించి ఆలోచిస్తాము. కానీ భగవంతుడు విశ్వవ్యాపకుడు. మనమేమో పరిమితులకు లోబడినవారము. మన యీస్థూలశరీరముతో మనవులను చుచినట్లు భగవంతుని చుడజాలము. మనిషిని దైవముగా భావించుట పిల్లాటకాదు. అది దైవదూషణకు దారితీయవచ్చును. మహత్తరమైయున్న అద్దానిలో మనమెప్పుడు కోల్పోతామో అప్పుడు సత్యోదయమౌతుంది.

          

ఇది నాఅనుభవము. మున్ముందుకు సాగిపొమ్ము. మనకిదే తగిన, ఉండదగిన జీవిత విధానము. చవడము, వ్రాయడము అన్నీ నిరుపయోగములు. ప్రేమ, భక్తి, ఆత్మవిశ్వాసము, విజయము లభింపజేయును. నీఒక స్తంభమునకు నీశిష్యుడు మరొకస్తంభమునకు కట్టివేయబడి వుంటే నీవెట్లు నీశిష్యుని విడిపింపగలవు? నీవు నిజంగా భగవంతునికొఱకు ఆత్రుతతోవుంటే, దయచేసి ఆశాస్త్రమున నిష్ణాతుడైన మహనియునికై వెదుకుము. తెలిసీతెలియని నూతనమతావలంభకులు హానికారకులు. పైదెలిపిన సూచనలకంటే, ఇప్పుడొక సరళమైనవిధానమును నీకు విషయవివరణకొఱకు సూచిస్తున్నాను. దయచేసి కొంతకాలం వచ్చి నాదగ్గరుండండి. నేనునీకు వివరింపబూనిన దంతయూ నీయెఱుకకందుతుందని నేను హామీయిస్తున్నాను. ఈవిధంగా ప్రశ్నలడగడం నాకు సంతోషకరమే, అయితే యిలా నన్నడిగే వాటికిచ్చె సమాధానములన్నీ చెత్తకాగితాల బుట్టలో వేయదగినవని నాస్వానుభవమున తెలుపుచున్నాను. ఇట్టి సందర్భములలో నాకాలము శ్రమ వృధాయై నానిరుత్సాహమునకు కారణమౌతున్నది.

 (విచారణనిమిత్తము వ్రాసిన‍ఉత్తరమునకు ప్రత్యుత్తరముగా వ్రాసిన ఉత్తరము యొక్క సారాంశము) 

(ఆధ్యాత్మజ్ఞాన్ జూలై-సెప్టెంబర్ 2024 పత్రికలో ప్రచురించిన వ్యాసమునకు పి.సుబ్బరాయుడు, ప్రశిక్షకుల అనువాదము)

 

పూజ్యలాలాజీ మరియు మన ఆధ్యాత్మికప్రగతి

  పూజ్యలాలాజీ మరియు మన ఆధ్యాత్మికప్రగతి సోదరీసోదరులమైన మనమంతా యిక్కడ యీదినం (ఫిబ్రరవరి 14/ బుధవారం 2024) మన ఆదిగురువులైన పూజ్యలాలాజీవారి 1...