సహజమార్గ
స్ఫూర్తి చంద్రిక
శ్రీ రాంచంద్రజీ మహరాజ్ సేవా ట్రస్టు,
3/1289-1; ఆర్.కె.నగర్, కో-ఆపరేటివ్ కాలనీ,
కడప-516001
విషయ సూచిక
1. ఉపోద్ఘాతము
2. 80వ వార్షిక జన్మ దినోత్సవ సందర్భమున బాబూజీగారి
సందేశము
3. ఆధ్యాత్మిక ప్రగతి
4. శ్రీ బాబూజీగారు రాఘవేంద్రరావ్ గారికి వ్రాసిన లేఖ
5. సహజమార్గము-అభ్యాసీ కర్తవ్యము
6. ఆత్మయొక్క ఆరాటము
7. వ్యక్తిగత ప్రవర్తనకు సంబంధించి శ్రీ బాబూజీకి శ్రీ
లాలాజీ యిచ్చిన ఆదేశాలు
8. శ్రీ బి.జి.జనార్ధన్, బెంగుళూరు
వారి భావనలు మరియు సంకలనములు
9. శ్రీ బాబూజీ 05.09.1959 లో శ్రీరాఘవేంద్రరావ్ గారికి
వ్రాసిన లేఖ
10. అభ్యాసులు మరియు ప్రశిక్షకులకు సాధారణసూచనలు
11. సహజమార్గము-రాజయోగసాధన
12. మన ప్రియమైన లక్ష్యానికి మార్గము
13. శ్రీ బాబూజీగారు సర్నాడ్ (గుల్బర్గ) గారికి వ్రాసిన
లేఖ
14. ఆలోచన-సంస్కారము-భోగము
15. ఆండ్రూపోరే (ఫ్రాన్స్) గారికి బాబూజీ వ్రాసిన లేఖలలోని
కొన్ని భాగాలు
16. భగవంతుడు
17. ధ్యానంలో సాధారణంగా జరిగే పొరబాట్లు
18. పూజ్య సద్గురు శ్రీ రామచంద్రజీ మహరాజ్ వారి దివ్య
జ్ఞానప్రసారము
19. ఆప్‌తాబే మారఫత్
20. లాలాజీవారి స్తుతి
21. బాబూజీవారి స్తుతి
22. అభ్యాసి ధ్యానము చేయు విధానము
23. దశనియమములు
శ్రీ రామచంద్రజీ మహరాజ్, షాజహాన్‌పూర్ వారు 30.04.1899 లో ఈ ప్రపంచమున ప్రభవించిరి. వారు సంపన్న కుటుంబమున జన్మించినప్పటికి నియమబద్దమైన ఆధ్యాత్మిక జీవనము గడుపుతూ సామాన్యమైన రికార్డుకీపరు ఉద్యోగమును న్యాయస్థానమున నిర్వర్తించి సాంసారిక జీవనము గడుపువారికి ఆదర్శముగా నిలచిరి.
వారు తమ గురుదేవులు శ్రీ రామచంద్రజీ (లాలాజీ) ఫతేగఢ్ వారి వద్ద ఆధ్యాత్మిక శిక్షణను పొంది పరమోన్నత స్థితుల నధిగమించి పరిపూర్ణులై దేశికోత్తములుగా వెలుగొంది "సహజమార్గ" మను నూతనాధ్యాత్మిక విధానమును ప్రపంచమున ప్రవేశపెట్టిరి. ఈ విధానమున ప్రాణాహుతిగా చెప్పబడు భగవదీయ దివ్యశక్తిని సాధకుల హృదయములలో ప్రవేశపెట్టి, వారు త్వరితగతిన ఆధ్యాత్మిక స్థితులను సాధించి ఒక జీవిత కాలములోని కొద్ది సమయములోనే మానవసాధ్యమగు మహోన్నత స్థితులను దాటి మానవ జీవితలక్ష్యమగు భగవదైక్యతకు అర్హులగునట్లు జేసిరి. ఇట్టి అనితరసాధ్యమైన ప్రాణాహుతి ప్రసార విద్య ద్వారా వీరి సహజమార్గ విధానము ఆధ్యాత్మిక చరిత్రలో ఒక నూతనాధ్యాయమును లిఖింపజేసినది.
వీరు 19.4.1983 లో దేహత్యాగము గావించినప్పటికి, వీరి ఉనికి నిత్యమై సత్యమై ప్రాణాహుతి ప్రసారము గావించుచు వీరి అంతేవాసుల త్యాగదీక్షల ఫలితముగా సహజమార్గము ప్రతిభావంతముగా కొనసాగుచున్నది.
ఇందు పొందుపొరచిన షయములు కొన్ని సాక్షాత్తు గురువర్యుల నుడువులకు అనువాదములే. మరికొన్ని వారి శిష్యులైన అభ్యాసులు వారి రచనలకు ప్రభావితులై వ్రాసిన వ్యాసములు. ఒకరికొకరు తెలియజేసుకొను సత్సాంప్రదాయ ఫలితముగా కడప కేంద్రమునకు యివన్నీ అందినవి.
వీటిని ఏ కొందరికోగాక
అందరికి అందుబాటులోనికి దెచ్చి పదిమందికి ఉపయోగపడవలెనను సత్సంకల్పముతో
పుస్తకరూపమున ముద్రించితిమి.
వ్యాసములు పంపిన శ్రీ
పి.డి.గైక్వాడ్, పుణె గారు, శ్రీ
ఎల్.ఎస్.ఆర్.కె. ప్రసాద్, విశాఖపట్టణం గారు, శ్రీ బి.జి. జనార్ధన్, బెంగుళూరు గారు, శ్రీ ఎమ్.గిరిధర్ రెడ్డి, కడప గారు, శ్రీ పి.సుబ్బరాయుడు, కడప గారు ఈ అక్షర సేవద్వారా
గురుకృపకు పాత్రులైరనుట నిక్కము.
ఈ పుస్తకము ఒక రూపముసంతరించుకొనుటకు సహకరించిన శ్రీ బి.రమేష్ బాబు గారికి, శ్రీ ఎస్.మునిసుబ్బరాయుడు గారికి ధన్యవాదములు తెలుపుటకంటే, తమ ప్రభువైన శ్రీ రామచంద్రజీ మహరాజ్ గారి సేవలో పునీతులైనారనుట సమంజసము.
యోగాశ్రం, టి.వి.శ్రీనివాసరావు,
కడప. ఛేర్మెన్, శ్రీ రాంచంద్రజీ మహరాజ్ సేవాట్రస్టు,
20-11-2011. కడప.
80వ
వార్షిక జన్మదినోత్సవ సందర్భమున బాబూజీగారి సందేశము
సోదర
సోదరీమణులారా!
సర్వ శక్తిమంతుడగు
ప్రభువును సమీపించు మార్గములో మనయొక్క కృషిని సమీక్షించుకొనుటకై మనమందరము మరలా
యిచ్చట చేరియున్నాము. దీనివలన అన్ని
యుగములందలి భగవత్సంతానము మేలు పొందగలదు. ఈ
విశ్వమందలి సమస్త సోదర సోదరీమణులు లయావస్త (లీనమగుస్థితి) యొక్క రుచిలేని రుచిని
చవిచూచెదరని నేను అతి ఆతృతతో ఆకాంక్షించుచున్నాను. అప్పుడు మాత్రమే సహజమార్గ పద్ధతి యొక్క
ప్రభావమును బాగుగా అవగాహన చేసుకొనగలరు.
మనము జీవించుచున్న జీవితము జీవితముకాదు.
దీనికావల మరియు ఇంకా ఆవల మరికొంతయున్నది.
మన మా భగవంతునియందు మాత్రమే ఎనలేని భక్తి కలిగియుండిన యెడల మనమందరము
సుదినములను తప్పక దర్శించెదమని నేను విశ్వసించుచున్నాను.
భగవంతుడు లేడను సంకల్పము మనకెట్టి పరిస్థితులలోను యుండరాదు. మన నివాసయోగ్యమగు స్థలము భగవంతుడే. మనజీవితము యొక్క ప్రముఖ లక్ష్యము భగవంతుడే. మనమందరము దైవత్వము లేదా జీవితలక్ష్యము వైపునకే పురోగమించుచున్నాము. అయితే కొందరు ఎఱుక కలిగియున్నారు, కొందరికి ఆ ఎఱుక లేదు. ఎఱుక కలిగి పురోగమించువారు ప్రశాంత జలములో ఈదులాడువారివలె ముందుకు సాగెదరు. ఎఱుకలేక పురోగమించువారి స్థితి ఎడారియందలి ఇసుకలో కాళ్ళు చేతులు కొట్టుకొనువారి స్థితిని బోలియుండును. గురువర్యులు వీరిరువురికి మధ్యవర్తిగా నుండి అభ్యాసికి భగవంతునితో సన్నిహిత సంబంధ మేర్పరచుటకు ప్రయత్నింతురు. అట్టి సంబంధ మేర్పరచబడినపుడు ఆయన కర్తవ్యములో కొంత భాగము నిర్వహింపబడినది.
జీవిత పరమార్థమేమని జనులు ప్రశ్నింతురు. కొందరి మనస్సులలో జీవితము అర్థరహితమైనది. ఇదే ఆత్మహత్యాభావము. జీవితమెంతో అర్థవంతమైనది. ఏలననగా దానివెంట ఒక శక్తి వచ్చుచున్నది. మరియు ఆశక్తిని తమలో నిలుపుకొనదలచిన వారికది చాలా ప్రశస్థమైనదేనను విషయమును అది మనకు జ్ఞాపకము జేయు చున్నాను. ఆధ్యాత్మిక జీవితము నంగీకరించి దానివైపు మరలుటయే జీవితము యొక్క ప్రారంభము. దీనియొక్క అత్యున్నత స్థితియే "జీవితములో జీవితము". అది జీవితమునందే దాచబడియున్నది. మనము ఎటువంటి జీవితములో ప్రవేశింపవలయునో ఆ జీవితమునే ప్రారంభించ వలయును. మన అభ్యాసమంతయూ మనలను అట్టి జీవిత లక్ష్యమునకే గొనిపోవును.
మానవునియొక్క నిద్రాణస్థితికి ప్రాణాహుతి శక్తి ఒక నూతన జీవితమును ప్రసాదించి మానవులకై ప్రత్యేకింపబడిన అత్యున్నత స్థానమును పొందునర్హతను కల్గించును. ఇంత మాత్రమేగాక ప్రాణాహుతి శక్తి మానవుని పురోగమనములోగల ఆటంకములను తొలగించి ఆతనియందు పరిపూర్ణముగా పరివర్తన గొనివచ్చును. వాస్తవమునకు సాక్షాత్కారము యొక్క అర్థము "మరణము యొక్క మరణము" లేక ‘అంత్యము యొక్క అంత్యము’. ఈస్థితిలో మానవుడు లీనమైనయెడల, ఇప్పుడు మార్గము సుగమమైనట్లని యర్థము. కాలమెంతవరకు మారినదనగా భారతదేశములోని ప్రజలనేకులకు ప్రాణాహుతి శక్తియనగా నేమియోకూడా తెలియదు. దాదాపు ఆరిపోయినటువంటి అసలైన మూలతత్త్వమునకు మా గురువర్యులు "శ్రీలాలాజీగారు" మాత్రమే వెలుగునిచ్చిరి. మానవజాతికి వారొసంగిన సందేశము నీవిధముగా పొందుపరచవచ్చును. "ఓ నిర్బంధితులారా! స్వతంత్రులగుటకై మార్గాన్వేషణకిప్పుడే ప్రారంభించండి."
ప్రతియొక్కరు స్వాతంత్ర్యమునే ఆకాంక్షింతురు. అయితే కొందరు మాత్రమే "స్వేచ్ఛనుండి స్వేచ్ఛ"ను బడయుటకై జాగరూకత వహించెదరు. అతి శ్రేష్టుడగు ప్రభువునకు సంపూర్ణముగా అర్పించబడినప్పుడే ఈ ఉన్నత స్థానమును పొందగలము. ఇది అంతయూ కేవలము సత్యస్వరూపములో లీనమొనరించు బంధము మాత్రమే. ఈ బంధము సమస్త ఇతర బంధములనుండి అభ్యాసిని విడుదల గావించును.
మోక్షము (Liberation) అభ్యాసిని సమస్త ప్రాపంచిక బంధములనుండి విడుదల గావించును. మానవుడు తన పరిణామమును కాంక్షించినపుడు ప్రకృతి అతనికెంతో సహాయ సహకారముల నందించును. వైద్యుడు రోగినెంత ప్రియముగా ప్రేమించుచున్ననూ ఆ వైద్యుడు రోగికి చేదుమాత్రలొసంగును. భగవంతుడు తనయొక్క సృష్టిని తగినంత ప్రయోజనకరముగనూ, పవిత్రముగనూ మరియూ పరిశుద్ధముగా జూడగోరును. కనుక పరిణామద్వారములు తెరుచుటకై భగవంతుడు అవసరమగు ప్రతి యొక్కదానిని నిర్వహించును. ఇది ప్రకృతిధర్మము. ‘ఆడుటకు చేతగానివాడు మద్దెలమీద పడు’నను నానుడి గలదు. అనగా నైపుణ్యములేని కార్మికుడు తన అశక్తతను పరికరములపైన ఆపాదించును. మనము దేనినైతే చెడ్డదిగ, బాధకల్గించునదిగా భావించుచున్నామో అదే స్వేచ్ఛయొక్క సాధనకు మార్గమగును. లివరు (కాలేయము) లోని నెత్తురు గడ్డతో తీవ్రమగు బాధ ననుభవించుచున్ననూ మా గురువర్యులు లాలాజీగారు వారి శిష్యుల అశ్రుపూరిత నయనములను గాంచి ఇట్లుచెప్పిరి. "నేను నాజబ్బును క్షణ కాలములో నయము జేసుకొనగలను. అయితే దేవుని నిర్ణయమునకు అడ్డుతగుల దలచుకొనలేదు".
నిజమునకు మనమే ఈ ప్రపంచమును కల్మష భూయిష్టముచేసి మనమే ఇందు నివసించుచున్నాము. ఈ ప్రపంచమునే జైలు అనికూడా పిలువవచ్చును. మనస్సులో మనము కలుషితములతో నిండిన చెడ్డ సంకల్పములనే సంకల్పించుచున్నాము. ఈ చెడు సంకల్పముల ఫలితము ఈ ప్రపంచము మీదనేయుండును. అయితే నిజముగా మనమీ జైలులో నున్నప్పటికీ, ఈ భావము నేమాత్రమూ మనము కలిగియుండరాదు. అదియెట్లనగా నేరస్థులు జైలులోనే యున్నారు. మరియు ఆ జైలు నిర్వహణాధికారులగు ప్రభుత్వోద్యోగులు కూడా ఆ జైలులోనే యున్నారు. కాని ఖైదీలు మాత్రము తాము జైలులో బంధింపబడినట్లు తలంచెదరు. ఉద్యోగులు మాత్రమట్లు భావింపరు. బాధలెచ్చటయున్నవో అచ్చటనే అమృతము కూడా యున్నది.
శిక్షణారహితమగు మనస్సు అనేక విధములగు తీవ్రమగు బాధలను, కష్టములను సృష్టించును. మనస్సునకు తగిన శిక్షణ నొసంగుటవలన మాత్రమే ఈ బాధలనుండి నివారణ పొందగలము. సహజమార్గ సూత్రములకు కట్టుబడియుండిన ఇది తప్పక సాధ్యపడగలదు. ఏదో ఒక విధముగ కుటుంబ సభ్యులలో ఆధ్యాత్మికతను అనుసరింపజేసిన ఆ గృహ వాతావరణము పూర్తిగ మారిపోవును. ప్రాపంచిక సంపదల కన్నిటికంటెనూ ఆంతరంగిక శాంతి చాలా ముఖ్యము. ఆంతరంగికముగ నభివృద్ధిజెందినపుడు బాహ్యాంతరములు ఒకటియే యగును. ఈ ప్రకారము పవిత్రత సర్వత్ర పరిపాలింపనారంభించును. ఇట్లు ప్రకృతికి కూడా మనము సహాయపడెదము.
ప్రతియొక్కచోట ప్రజలు
ఆధ్యాత్మికముగ చాలా వెనుకబడియున్నట్లు నేను కనుగొంటిని. ఈ లోపమును పూర్తిచేయుటకై మనమందరము గట్టి
ప్రయత్నము చేయవలయును. మనము కృషి చేయుచున్నప్పటికి
మానసిక పుష్పము వికసింపక మొగ్గగనే యున్నది.
కారణము మన ప్రయత్నములో లోపమున్నదనికాదు.
ప్రజలు సహకరించవలసిన రీతిలో సహకరించుటలేదు. మనకు శక్తియున్నది. ఆ శక్తిని స్వీకరించు దృక్పథము జనులలో
లోపించినది. కాలక్రమమున ఇది కూడా
వృద్ధిచెందగలదు. ఎప్పుడైతే సంస్థ (Mission) యొక్క
ధ్వని ప్రతిధ్వనించునో అపుడది సర్వత్రా వ్యాపించి దాని ఫలితములను త్వరితముగనో లేక
నిదానముగనో వ్యాపింపజేయును. మన కృషి
ఎన్నటికీ విఫలముగాదు. ఏకధాటిగా బొట్లు
బొట్లు వర్షించిన ఫలితమే ఒక నదిగా రూపొందును.
తోటి మానవులందరియెడల మనము
సహృదయత గలిగియుండవలయును. అపుడు ఈశ్వరీయ
శక్తి సహజముగనే ప్రసరించును. ఆధ్యాత్మిక
పునరుజ్జీవనమున కిదియే ప్రథమ సోపానమని నేనుతలంతును. ఈ పునాదిపైననే ఆధ్యాత్మిక సౌధము
నిర్మించబడవలెను. మానవజాతి శ్రేయస్సునకై
కృషిచేయు మనస్సు నీకుండినప్పుడు ఆ అవకాశము సహజముగనే నీవు పొందగలవు. అయితే జనులు సరియగు మార్గమునందు పురోగమించునట్లు
చేయుటకై వారికి బోధించుట మన కర్తవ్యము.
నీవు మానవజాతికి కొంత మేలుజేసిన అది నీ ఘనత కాదు. అది నీ విద్యుక్త ధర్మమే. మానవజాతినంతయూ ఇముడ్చుకోగల విశాలహృదయమును నా
ప్రభువగు "శ్రీ లాలాజీ మహరాజ్" గారు నా కొసంగిరి. నా ప్రభువు యొక్క అభయ హస్తము నావెనుకనే
యున్నది.
మా గురువర్యుల ఆశీర్వాదములు భువిపై వర్షించునుగాక! మరియు సహజమార్గము నిరాశ, నిస్పృహ, బంధములనుండి అందరిని విముక్తులుగాజేసి సత్య, శాంతి, స్వేచ్ఛా ధామములకు గొనిపోవుగాక.
తదాస్తు.
అహమ్మదాబాదు, ఇట్లు,
ఏప్రెల్30,1979. రామచంద్ర.
#@#@#@#
స్వేచ్ఛనుండి
స్వేచ్ఛయే బంధ విముక్తి.
మరణము
నుండి మరణమే సాక్షాత్కారం.
భగవంతుని
యొక్క చేతనా స్థితియే జీవితము.
ఆధ్యాత్మిక
ప్రగతి
రచన:
పి.డి.గైక్వాడ్, పూణె. తెలుగు
అనువాదం: పి.సుబ్బరాయుడు, కడప.
ప్రతి సహజమార్గ అభ్యాసి తను
సంస్థలో చేరిన కొన్నాళ్ళకు తానెంతవరకు ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందానో
తెలుసుకోవాలనే ఉత్సుకత, ఆతృత కనబరుస్తాడు. ఈ పురోగతిని కొలవడానికి ఒక లక్ష్యము, అంటే సాధించవలసిందేదో ఒకటి వుండాలి.
ఆ లక్ష్యాన్ని చేరడానికి తను ప్రయాణించిన దూరాన్ని కొలవడానికి ఒక కొలబద్ద
వుండాలి. దానిద్వారా తాను ఏ ఏ స్థితులను
చేరుకున్నాడో తెలుసుకోగలగాలి.
గురుదేవులు సహజమార్గ సాధకులకు వారి ఆధ్యాత్మిక ప్రగతి బాటలో అనేక ఆధ్యాత్మికోన్నత స్థితులను రెండు వేర్వేరు పద్దతులలో తెలియజేశారు. మొదటిది "అనంతయాత్ర" అను గ్రంధమున తెలియజేసినట్లు క్రమంగా ఒక్కొక్క గ్రంధి లేక స్థానములలో అభ్యాసి పొందిన అనుభవములను సరిచూచుకొనుటద్వారా తెలిసికొనుట. రెండవది "సత్యోదయములో" తెలిపినట్లు ఏకకేంద్ర వృత్తములు వాటి ప్రదేశములను దాటుచూ కేంద్రస్థానము గమ్యముగా పయనించుటను సరిచూచుకొనుటద్వారా తెలిసికొనుట.
ఈ రెండు పద్దతులను సమన్వయపరుస్తూ పూజ్యశ్రీ డా//ఎస్.పీ.శ్రీవాత్సవ గారు ఏప్రిల్, 1989 "సహజమార్గ పత్రిక"లో చక్కటివ్యాసం వ్రాశారు. నాదృక్పథంలో అదిఒక పరిశోధనా వ్యాసము. అభిరుచిగల అభ్యాసులు ఆ వ్యాసాన్ని పరిశీలించవచ్చును.
గురుదేవులు శ్రీరామచంద్రజీ (బాబూజీ మహరాజ్) గారు పైపద్దతులలో ఆధ్యాత్మిక స్థితులను తెలియజేయడం జరిగింది. అభ్యాసి తాను ఏ ఏ స్థితులను దాటుకున్నాడో, ప్రస్తుతము ఏ స్థితిలో తానున్నాడో లేక ఏ ఏ స్థానములపై పట్టుసాధించుకున్నాడో గురుదేవులే అభ్యాసులకు వాస్తవం తెలియజేసేవారు. అది ఆయన జీవించివున్న కాలం గనుక సులభంగా వుండేది. ఈ విషయం అంతర్‌పరిశీలనాశక్తితో కూడా గుర్తించవచ్చు. అయితే యిక్కడ ఒక సమస్యకూడా ఉత్పన్నమౌతున్నది. అంతర్‌పరిశీలనం కేవలం అత్యంత స్వచ్ఛతాస్థితిలోఉన్న అభ్యాసికో లేక ప్రశిక్షకునికో మాత్రమే సాధ్యమౌతుంది. నేనొకసారి అనగా 70వ శతకంలో బాబూజీకి నా ఆధ్యాత్మికస్థితిని వివరించిచెప్పి, ఇది విరాట్‌స్థితే కదా! అని అడిగాను. దానికాయన నీవుచూచిన ఆ మసకతనం ఆ స్థితిలో వుండవలసింది కాదు. నీకు శుద్ధీకరణ పద్దతి తెలుసుకదా? అన్నారు. మనసాధనలో నిజంగా రావలసిన ఆధ్యాత్మికస్థితులు సూచనమాత్రంగాను, ఛాయామాత్రంగాను కొంత ముందుగానే కల్గుతాయి. ఈ స్థితిలో అభ్యాసి ప్రశిక్షకుడు ఇదే అసలైన స్థితిగా భ్రమించే అవకాశం వుంది. గురుదేవులు తెలియజేస్తేనేగాని ఈ విషయం విశదపడదు. కనుక ఉన్నత ఆధ్యాత్మికస్థితులను స్పష్టంగా తెలుసుకొనుటకు అత్యంత స్వచ్ఛస్థితి సున్నిత గ్రాహకశక్తి అవసరమైయున్నవి. ఇట్టివారు దొరుకుట సామాన్యవిషయంకాదు.
కనుక తన ఆధ్యాత్మిక పురోగతిని అభ్యాసి తానే తన అనుదిన నడతను గమనించి అర్థముచేసుకొనుటే శ్రేయస్కరము. అయితే అందుకు కావలసిన కొలబద్ద లేక తూచు సాధనములు ఏవీ అన్నది ప్రశ్న.
అంతకంటే ముందు ఆధ్యాత్మికత అంటే ఏమిటో ఆధ్యాత్మిక పురోగతి అంటే ఏమిటో తెలియవలసి ఉన్నది. ఆధ్యాత్మికత అనేది జ్ఞానవిజ్ఞానములతో కూడిన ఒక విద్య. ప్రకృతి నియమానుగుణంగా సమన్వయముతో అనుదిన జీవనమును గడుపుటను తెలుపు విద్య ఇది. తొలిసారి మన ఉనికి ఎర్పడిన స్థితి తిరిగి మనకు కలగాలని మనం ఆకాంక్షిస్తున్నాము. కనుక మనకు ప్రకృతితో సమన్వయము అవసరము. బాబూజీ మహరాజ్ తెలియజేసిన సృష్టి సిద్ధాంతములో ఈ సృష్టికి పూర్వం ఉన్నదేమిటో, ఈ సృష్టి ఎలా ఏర్పడిందో వివరించారు. మహాప్రళయమంటే ఏమిటో, మనవ్యక్తిగత ప్రళయమంటే ఏమిటో కూడా విద్యలో భాగమైన ఈ అంకము క్షుణ్ణంగా అర్థము చెబుతున్నది. ఇది అర్థమైనప్పుడే మన సాధన లక్ష్యము అంటే మన సాధనద్వారా పొందే అంతిమ గమ్యము విశదమౌతుంది. అప్పుడే మనం మన ప్రళయాన్ని అక్కరతో కోరుకుంటాం. అసలు మన వుద్దేశ్యం, గమ్యమేమిటని మనల్ని మనం ప్రశ్నించుకుంటాం. అలాకాక మనకు నచ్చిన ఏవేవో ఆశిస్తూ సాధన కొనసాగించడంలో అర్థమేలేదు.
మన గమ్యం వుద్దేశ్యం
సక్రమమైనవే అయితే అందులో మూడు ప్రాధామికాంశాలు వుంటాయి. అవి
1) సాధకుడు 2) పరమ గురువు
3) పద్దతి.
సహజమార్గ సాధకునికి
రెండంశాలు ముందేసమకూరి పోయాయి.
కోరినవారికి ఎల్లవేళల, ఎల్ల ప్రదేశములలో
సహాయమందిస్తున్న సమర్థ గురువును వారు శ్రీ రామచంద్రజీ మహరాజ్ వారిలో
కనుగొన్నారు. ఆయన జీవించినకాలంలోనే ఆయన తన
భౌతికదేహానికి అతీతంగా వుండేవారు. ఈ విషయం
నిజమైన శ్రద్ధగల సాధకులు గమనించే వున్నారు.
ఆయన రూపుదాల్చిన దైవత్వము. ఆయనలోని
అణువణువు దైవీయశక్తిని ప్రసరింపజేస్తూ వుండింది.
ఇక రెండవ అనుకూలమేమంటే గురువుచే నిర్దేశించబడిన సాధనా ప్రక్రియ నిశితంగ పరిశీలింపబడి నిర్మింపబడింది. అందులో ధ్యానపద్దతి, శుద్ధీకరణక్రియ మరియు నిరంతరస్మరణ వున్నాయి. కనుక ఇంతకుమించి సాధనా పద్దతిలో మర్పులు చేయడంవల్ల అనవసర సంశయాలు ఉత్పన్నమై సరియైన ఫలితాలను యివ్వడములో విఫలమౌతాయి. గురువు మరియు పద్దతి మార్చలేనివి. "ఒక్కదాన్నే పట్టుకో - అదీ గట్టిగా పట్టుకో" అని గురుదేవులు తరచూ అంటూవుండేవారు.
సమర్థ గురువు మరియు సరియగు పద్దతితో అలరారుతున్న వారికి మిగిలింది ఇంకొకటే. అది సాధకుడు తన్నుతాను చక్కదిద్దుకొని ఆధ్యాత్మికోన్నతిని బడయుటే.
ముందు వివరించినట్లు ఆధ్యాత్మికత ఒక జీవనవిధానము. ప్రకృతితో సారూప్యత సాధించి జీవించు విధానమును నేర్పు విద్య అది. ఎంతగా ప్రకృతితో మనము సమన్వయమైతిమో అంత ఆధ్యాత్మికంగా ఎదిగితిమనుకోవచ్చును. పూజ్య బాబూజీ చెప్పినట్లు ప్రగతి మార్గము పశులక్షణములుగల మానవుని నుండి మనిషిగానూ అటనుండి పరిపూర్ణమనిషిగానూ మారుటే. మరి మనిషంటే ఎవరు? ఎవరు మానవత్వంతో అలరారుతుంటారో వారే మనిషి. మరి పరిపూర్ణమనిషంటే ఎవరు? మనిషి ఎలావుండాలో తెలిసి అలా మనిషిని మార్చగలవాడే సంపూర్ణమనిషి. నిజమైన పరిపూర్ణ మహామనిషి బాబూజీయే. ఇక ఈస్థితి ఎలా కొలవబడుతుందో దీనికి కొలబద్ధ ఏదో సులువుగా తెలిసిపోయింది.
1.
మొదటిది తను మొదట ఎలా వుంటిని, యిప్పుడెలా వున్నాను
అన్న విషయం ఇతరులతో కాకుండా తన ప్రవర్తనలోని మార్పును తానేపోల్చి చూచుకోవాలి.
2.
గురువుగారు దశనియమాలనిచ్చారు. వాటిని
పాటించాలి. పాటించడానికి నిరంతరం
ప్రయత్నించాలి. తద్వారా మనం మనకోసం ఎంత
నిజాయితీగ వున్నామో తెలుసుకోవాలి. అదే
ఆధ్యాత్మిక పురోగతిని తెలియజేస్తుంది.
3. ఈ విషయంలో పూజ్యశ్రీ రాఘవేంద్రరావ్ గారు ఇలా అనేవారు. ఆధ్యాత్మిక పరిధిలోనికి ప్రవేశింపదలచిన వాని ప్రాధమిక లక్షణము నమ్రత, వినయము. ఆధ్యాత్మికంగా ఎదిగేకొద్దీ ఈ నమ్రత అభివృద్ధి చెందుతూపోతుంది. తుదకు శూన్యస్థితికి చేరుకొని అత్యంత అప్రధాన్యతగల వానిగా మారిపోతాడు. కారణం అప్పుడతడు అనంతాన్ని దర్శిస్తున్నాడు. దీనికి వ్యతిరేకభావం (అహం బ్రహ్మస్మి) కూడా సరియైనదే కావచ్చు. కానీ నమ్రతలేనిదే అతనిలో అణువంతైనా ఆధ్యాత్మిక వెలుగు గోచరించదు. వినమ్రుడు స్వతహాగా కానీ లేక అతని అనుచరులుగానీ తమ గురుత్వాన్ని సాధుత్వాన్ని లేక దైవత్వాన్ని ప్రచారం చేసుకొనవచ్చును.
4. గడచిన మరియు గడుస్తున్న కాలంలో మన అలవాట్లను మనలో మనం కాస్త యోచించి చూచుకుంటే చాలు. మన ఆధ్యాత్మిక పురోగతి ఇట్టే అర్థమైపోతుంది. అవి ఏవంటే
అ) నేను ఎంతవరకు నా
అభ్యాసాన్ని అనగా ధ్యానం, శుద్ధీకరణ మరియు ప్రార్థన సక్రమంగ
చేస్తున్నాను?
ఆ) ఎంతమటుకు నేను నా
గురుదేవులను అంటే నాజీవిత లక్ష్యాన్ని జ్ఞప్తిలో వుంచుకున్నాను? "ప్రభువు యొక్క ధ్యాస అంతరంగంలోకి ప్రవేశించిందంటే ఇక స్వార్థచింతన
నిలువదు" అని బాబూజీ నాకు ఒకసారి తెలియజేశారు.
ఇ) ఎంతవరకు నాకు కలిగే
వ్యతిరేకభావాలు తగ్గాయి?
ఈ) ప్రతీకార బుద్ధి
తగ్గినదా లేదా?
ఉ) ఎంతవరకు నాకు రుచికరమైన
ఆహారం కావాలనే ఆరాటం తగ్గింది?
ఊ) ప్రాపంచిక విషయములపై
ఇంద్రియాల ఆకర్షణాతీవ్రత ఎంతమాత్రం తగ్గింది? ముందుటికి ఇప్పటికి తేడా ఏమైనా
వుందా?
ఎ) జీవితంలో ఇతరవిషయములు
వస్తువులు ఉత్తమముగా భావిస్తున్నారా?
వాటికై ఇంకా మానసికంగా ప్రాకులాడుచున్నారా?
ఏ) ఎంతమాత్రం నా ప్రవర్తన
సభ్యతను సంతరించుకున్నది?
ఇంకా ఎన్నో మన ఆధ్యాత్మిక
పురోగతిపై ఉత్పన్నమైన ప్రశ్నలకు జవాబు దొరికితే ఆ జవాబులను విశ్లేషించుకుంటే
అర్థమైపోతుంది. ముందుగా మనం అవసరాలకు,
ఆడంబరాలకు తేడా అర్థం చేసుకోవాలి.
నేను ఉత్తమ ఆధ్యాత్మిక
స్థితులను పొందానని నీకైనీవు అనుకున్నా, లేక నీ ప్రశిక్షకుడు
తెలిపినా నీప్రవర్తన నియమనిబంధనలకు అనుకూలంగా లేకుంటే అది నిజమని నమ్మగలమా?
మన ఆధ్యాత్మికస్థితిని
మనకైమనం నిర్ణయించుకొనుటలో జాగ్రత్తగా వుండాలి.
కేవల అసాధారణ అనుభవాలు ధ్యాన సమయంలో కలిగితే వాటిని ఏదేదోగా ఊహించుకొని
మనల్నిమనం అవివేకుల మాయాస్వర్గంలోనికి నెట్టుకోరాదు. గురువుగారి ఆదేశానుసారం ఎప్పటికప్పుడు మనసాధనలో
మనం నియుక్తులం కావాలి. ఇతర పూజలు భజనలతో
గురువుగారిని పోగుడుతూ పాటలు పాడితే లాభంలేదు.
ఆయన్ను పొగడడంకంటే ఆయన్ను అనుసరించడం మేలు. గురువుగారిపై ధ్యాస అనే ఒకేఒక కార్యక్రమంలో
మనల్ని మనం నియమించుకొని క్రమబద్ధమైన ప్రశాంతజీవనం గడుపుతూ సాగిపోవాలి.
ప్రియ సోదరీ సోదరులారా!
సందేహంలేదు. మనం ఆధ్యాత్మికంగా
పురోగమించాం కానీ మనం ప్రయాణించినదానికంటే ఇంకా చాలా చాలా దూరం ప్రయాణించవలసి
వుంది. కనుక పురోగతి విషయంలో నిరుత్సాహ నిస్పృహలకు
తావివ్వక సంతోషంగా చురుకుగా గురువుగారు చూపిన మార్గంలో ముందుకు సాగుదాం. మన తప్పిదాన్ని సమర్థించుకోకుండా
కర్తవ్యపరాయణతతో మనం నడిస్తే వచ్చే ఫలితంకంటే ఆయన కృపపై మనకు అపారవిశ్వాసమున్నది. ఇక మనకు కొదువేమున్నది?
!--!--!--!--!
శిష్యునికి
గురువు యొక్క తలంపు
అత్యంతావశ్యకమైన
విషయము.
ఆయన
తప్ప ఇతర ఏ ఆలోచన కూడా సబబుకాదు.
శిష్యునికి
తన గురువును మించిన సంపద లేదు.
---బాబూజీ.
శ్రీబాబూజీ
గారు
రాఘవేంద్రరావు
గారికి వ్రాసిన లేఖ
(ఆధ్యాత్మ విద్య అక్టోబర్, 2007 త్రైమాస పత్రిక నుండి
సేకరింపబడినది)
తెలుగు
అనువాదం:శ్రీ పి.సుబ్బరాయుడు, కడప.
ప్రియ
రాఘవేంద్రరావ్,
భగవంతుడు నీకు దీర్ఘాయువు
ప్రసాదించుగాక!
మీరు వ్రాసిన లేఖ సంఖ్య 21
బిజి, తేది 10 అక్టోబర్, 1956
అందింది. చదివి సంతోషించాను. నేను వెంటనే బదులు వ్రాయలేక పోయాను. నీవు
నాజవాబుకోసం ఆతృతగా ఎదురు చూస్తూ వుంటావని నాకు తెలుసు. శ్రీఈశ్వర్‌సహాయ్ గారిని దీపావళి సెలవులకు
పిలిపించుకొని, నేను చెబుతూ ఆయనచేత జవాబు
వ్రాయిద్దామనుకున్నాను. నీవుత్తరం
అందిందనైనా ఒక మూడుపైసల కార్డుముక్క వేసివుండవలసింది. కానీ నేనాపని చేయలేదు. ఆ విధంగా సంస్థకు ఆదాచేద్దామనుకున్నాను. మూడుపైసలకు విలువిచ్చి నీకు అసౌకర్యము
కలిగించానని నీవనుకోవచ్చు. వేచియుండటం
కూడా ఒక విధంగా తీవ్రస్మరణే. అది
ఆధ్యాత్మికతకు మేలుచేస్తుందన్న వాస్తవం తెలిసి ఊరటపొంది వుంటావు. ఓకవి ఇలా అంటాడు - "ప్రేయసి కోసం ఎదురు
చూడాటంలో వున్న ఆనందం ఆమెను కలుసుకోవడంలో లేదు". కనుక ఈ అసౌకర్యం మరో విధంగా ఊహిస్తే
వసంతఋతువునాహ్వానించి నట్లుంటుంది.
నాబలహీనత నీకు తెలుసు. నేనేదైనా
మంచి విషయం చెప్పి వ్రాయిద్దామనుకుంటే అందుకు తగ్గట్టు లేఖకుడు కూడా సమర్థుడై
ఉండాలి. వ్రాసే విషయంలో నేను
నిస్సహాయుణ్ణి. ఏంచేద్దాం, నాహృదయం నాచేతివ్రేళ్ళను చేరలేకపోతున్నది.
డా. కె.సి.వరదాచారిపై మీ అభిప్రాయం సరియైనది. ఆయన సమస్యలన్నీ పరిష్కారమై, అంతర్గతంగా ఆయన చక్కని ముందడుగు వేయాలని నేను ప్రార్థిస్తున్నాను. నేను కూడా ఆయన్ను ప్రేమిస్తున్నాను. ఈమధ్య ఆయనకు కొన్ని ఉత్తరాలు వ్రాశాను. అందులో వ్రాస్తూ సాధనా పద్దతిపై కొంత వెలుగును
ప్రసరింపజేశాను. అది ప్రశిక్షకులందరకు
తెలియాల్సివుంది. ఆయన వ్రాసిన కొన్ని
ఉత్తరాలు వ్యక్తిగతమైనవి కనుక వాటి ప్రతులు పంపలేను. అయితే నాప్రత్యుత్తరాలలో అటువంటి వ్యక్తిగత
విషయాలేమీలేవు. మతాచారాలు మనముందు మనమే
నిర్మించుకున్న గోడలని నేను భావిస్తున్నాను.
వీటివలన మన ముందున్నదారి మూసుకుపోతుంది.
ఏదో ఒక రకంగా ఇవి జొరబడుతూనే వున్నాయి, ఈ దుర్గుణం
వరుసగా ముస్లింలను గమనిస్తూ మనం తగిలించుకున్నాము. లేకపోయుంటే మనకున్న ధారాళమైన ప్రవాహంలో ఒక్క
అణువంత కూడా పేరుకపోకుండా కొట్టుకుపోయుండేది.
దక్షిణ భారతదేశంలో ఆధ్యాత్మిక
వ్యాసాలు చదివి మేలుపొందేవారు చాలా తక్కువని సోదరుడు గణేష్ సరిగ్గా వ్రాశాడు. ఇది అన్ని చోట్లా ఇంతే. ఉత్తర భారతదేశంలో కూడా ఎవరూ వీటివలన
మేలుపొందలేదు. ఇక్కడ మీ విషయానికొస్తే
మీరు వ్రాయడం కొనసాగించండి, ఎక్కువమందిని చదవనివ్వండి. ఈ విషయాలు ఎప్పుడుకూడా జనుల మెదళ్ళలో వాటి
ముద్ర వేయగల్గడం అసాధ్యమే. ఉప్పుగనిలో
ఏదిపడినా ఉప్పే అయిపోతుంది. నీవు
దక్షిణాది మేధావి వర్గంతో ఎక్కువగా కలుస్తూ ఉంటావు. వారి విషయం ఒకసారి ఢిల్లీలో వుండే
శ్రీరాజగోపాలన్‌తో నేనభిప్రాయపడినట్లు వారు వారివారి మతవిశ్వాసాలను మాత్రమే
అమితంగా అభిమానిస్తారు. నేను నిన్ను
శ్రీదత్తాత్రేయరావ్ దినచర్య పుస్తకాన్ని చూడమని వ్రాశాను. నీవు ప్రతి యొక్కరికి శిక్షణనిచ్చుటకు
తగినవాడివి. అది అన్నివిధాల సరియైనది,
సంపూర్ణ శక్తివంతమైనది. నీ
సోదరునిలో కూడా శ్రద్ధ పెరుగుతున్నది.
భగవంతునికి కృతజ్ఞతలు.
భగవదిచ్చ. ఆయన కూడా ఈ పద్దతి
చేపట్టి తన జీవిత సమస్య పరిష్కరించుకొనుగాక.
నావద్ద కూడా "నారద భక్తిసూత్రములు" వుంది. అది బాగానే వుంది. నీ అనుభవంలోనికి వచ్చి వివరించిన "ఆకాశపు
పైఅర్థభాగము" మొదలైనవి విరాట్‌స్వరూప స్థితికి చెందినవి. ఎందుకంటే నీవు తాత్కాలికంగా ఇప్పుడున్న స్థితి
ఆకాశమండలము లేక బ్రహ్మాండ మండలము. ఈ
ప్రక్రియనంతా అర్జునుడు దర్శించియుండెను.
నీవు వ్యక్తపరచిన దాన్ని బట్టి నీ ఆలోచన సరిఅయినదే. "ఎక్కడో బంధము విడిపోయినట్లుంది" ఈ మాటను
బట్టి చూస్తే నీవు ఈ ప్రపంచానికి బదులు సత్యమూలమునకు అతుకబడినట్లు
నిర్ధారించుకొనవచ్చును. నీకు పరలోకమునుండి
వార్తలందుతున్నవి. ప్రియ సోదరా!
నీవెలాగైనా మనల్ని గురించి మరచిపోవాలి.
అది నిన్నుగురించైనా, నన్నుగురించైనా సరే. ఏదిఏమైనా యిది ఒక అభివృద్ధిచెందిన దశ. కానీ సోదరా! నన్ను మరిచిపోవద్దు. ఎందుకంటే నిన్ను నీవు మరచిపోయేట్లు చేసే
పరికరము నేనే. ఇది గనుక సంపూర్ణమైతే
అప్పుడు నీకైనీవే నన్ను మరిచిపోయేట్లు చేసే పరికరమౌతావు. అప్పుడు మాత్రమే ఏకత్వం
సాక్షాత్కరిస్తుంది. నేనుగనుక అంతిమ
సత్యస్థితిని గురించి వ్రాస్తే శాస్త్రజ్ఞులు బహుశా నాపై విరుచుక బడవచ్చు. అంతిమ హద్దును గురించి వివరించడం చాలాకష్టం. అయినా ఇంతమాత్రం వ్రాస్తున్నాను. ఎప్పుడైతే అభ్యాసి తన్నుతాను మరియు భగవంతుణ్ణి
కూడా మరిచిపోతాడో అప్పుడతడు ఈ లోకంలోనికి ఏరూపంలోనూ ఇక రాడని నిర్ధారించవచ్చు. ఆస్థితిలో అతని కన్నివైపులా అదేయై ఆ సముద్రంలో
మునిగిపోయుంటాడు. అంతకుముందు, అతడు తన ఈ ప్రపంచాన్ని ఆవలి ప్రపంచంకోసం అమ్మేసి వుంటాడు. ప్రస్తుతమతడు ఆ ప్రపంచాన్ని కూడా అమ్మేయగలిగితే
ఇకమిగిలేది సత్యతత్త్వమే.
ప్రియ సోదరా! నీవెందుకు డా.
వరదాచారి వల్ల ప్రేరేపితుడవై నన్ను శాస్త్రీయ వివరణలడుగుతున్నావు? నేనెంత, నా
సామర్థ్యమెంత? నేను సామాన్యమైన అవిద్యాపరుణ్ణి. అటువంటి వాడినైన నన్ను పట్టుకొని భగవంతునికి
అర్థమడుగుతున్నావ్. అతడు కుక్కకైనా కనీసం
అర్థం చెప్పగలడు. మరి నేనో! ఏవిధమైన
జ్ఞానము లేనివాణ్ణి.
కానీ సోదరా! ప్రియుడు తనకు
నచ్చిన రీతిలో ప్రేయసిని తనవైపుకు ప్రాకేట్లు చేయగలడు. అసలు ఆ ప్రాకడం కూడా ప్రియుడే నేర్పుతాడు. ప్రాకడంలోని సారాన్ని కూడా ప్రేయసి తన ప్రియుని
నుండే గ్రహిస్తుంది. కనుక నేను ఒక ఒరవడిలో
నడుపుతున్నాను. అది గనుక సరైనదైతే నీ బహుమతి
నీకందుతుంది, కాక తప్పుడుదైతే అందులోనూ నీతప్పిదమే వుంటుంది.
ఈ విషయమై నీవు లోతుగా
అర్థవంతంగా ఆలోచిస్తే ఎవరి స్మరణలోనైతే భక్తుడు ఉత్తేజితుడై ఆత్రుతకు లోనయ్యాడో
అతని నుండే ఈ ప్రాకేవిద్య సంప్రాప్తమయిందని నీకు విశదమౌతుంది. ఏమైతే అవతరించి వ్యాప్తమయిందో, ఏదైతే దృగ్గోచరమై అనుభవంలోనికొచ్చిందో అదంతా నా అవగాహనతో గమనిస్తే ఒక నీటి
బిందువు, పొంగివచ్చిన స్పందనతో తన పరిధిని పెంచుకుంటూ
పురోభివృధ్ది చెందుతున్నది. ఈ వృద్ది
పురోగమనాన్ని మన ఋషులు అందుకున్నారు. వారి
ధ్యాసకూడా దీనిపైననే వుండింది. ఎందుకంటే
అది కాలంయొక్క ప్రారంభం (జమానా). ఇంకా
వారిలోకి ఎట్టిసంస్కారాలు ప్రవేశించలేదు.
అది ఉబికి వచ్చిన తక్షణమే వారి ఎఱుకలోనికొచ్చింది. కానీ తర్వాత చాలా విశాలత్వాన్ని సంతరించుకొన్న
ఒక స్థూల పదార్థంపై కొందరి దృష్టి పడింది.
కొందరి దృష్టి పెద్దగా ఉబకని ఆ సన్నని దారం (ధార, ప్రవాహం,
సెలయేరు) మీద పడింది. ఆస్థూల
పదార్థం ఏమై వుంటుంది? అది మనందరి అవసరాలకు కావలసినదే.
కనుక అందులోకి వారు వెళ్ళి, సూక్ష్మమైన వాటిని
సున్నిత ద్రష్టలకు వదిలేశారు. నిజానికా
అవసరాలు అగ్ని, జలము, వాయువు. అవి కాలానుగుణంగా వాటి తీవ్రతకు తగ్గట్టు
పనిచేయ నారంభించాయి. వారు వీటిని గ్రహించి
వాటి అంతర్గత స్థితిలో చైతన్యం కలిగించి ఆ స్థూలశక్తి యొక్క ప్రభావం గల చోటునుండి
కదిలించగలిగారు. అలా అగ్ని, వాయువు మొదలైన వాటికి స్పందన కల్గించారు.
వారు దానితో (మూలంతో) సంబంధమేర్పరచుకొని ఆ స్పందనను కలిగించ గలిగారు. తద్వారా రావలసిన ఫలితం వచ్చింది. నా (వినయపూర్వకమైన) ఉద్దేశ్యంలో వారికి శక్తి
వుండింది. అందుకే వారి దృక్కులు పంచభూతాలను
వెంటనే తాకాయి. కనుకనే అట్టి మంత్రాలు
మొదట వ్రాయబడ్డాయి. వాటిద్వారా మన
కత్యంతావశ్యకమైన, అవసరమైన, మనల్ని మనం
సంరక్షించుకొనుటకు తగియున్నవన్నీ పొందాగలిగాము.
ఇవన్నీ మనకు ముఖ్యంగా కావలసినవే.
కాలం గడచిన తర్వాత ఆ పంచభూతాలతో కలిసి స్థూలత్వం చెంది ఆతర్వాత వాటితోనే
కాలం గడుపుతూ వుండిపోయాము. యోచన వాటిపైనే
కేంద్రీకృతమై యున్నదన్న సంగతి క్రమేణా ఎఱుకలోనికి వచ్చింది. తర్వాత వారు ఆధ్యాత్మికమనబడు మూలప్రవాహము
(శక్తి)పై లోతుగా యోచించారు. దాని ఫలితమే
ఉపనిషత్తులు. ఇదే వారి నిజయోచనల
ఫలితము. పరిణామ ప్రక్రియ ఇలా సంరక్షింపబడి
కొనసాగిందని, ఇది నిరంతర మానసిక పరిశ్రమ చరిత్రయని నీవు
నిర్ధారించకుండా వుండవు.
పైనతెలిపినదంతా ఒక
అవిద్యావంతుని ఉపోధ్ఘాతము మరియు కొమ్మలు, రెమ్మలు వేసిన అతని
ఆలోచన. ఇప్పుడు నేను ప్రధాన విషయమైన
"వేదము" నకు వస్తున్నాను. ఇది
విశ్వసృష్టికి పూర్వమున్న స్థితి. దాని
ఆనందమే ఏ దేవుడైన మన కనుగ్రహించేది. నీవు
అది పొందవచ్చు. కనుక సృష్ట్యాదిన
వేదములుద్భవించెననుట పరమ సత్యము. వాటిని
పుస్తక రూపమునకు మార్చివేశారు. ఇది
స్థితులకు దుస్తులు తొడిగినట్లయింది.
అప్పుడేమున్నది? అదే మధనావస్థ. అణుసృష్టి.
అణు నిర్మాణము మధన ప్రక్రియ ప్రతిఫలమే.
మరో మాటలో చెప్పాలంటే, మధన ప్రక్రియ ప్రతిఫలమైన
దానితో ఈ అణువుకు సంబంధమేర్పడి వుంది.
ఇప్పుడు ఫలితమేమైనా ఇది అనేక రూపాలను సంతరించుకొంది. వాని మానసిక స్థిరత్వం
మాత్రము వాటి మూలంలోనే వుంది. అది ఏ
స్థితియైననేమి,దాన్ని శాస్త్రీయమే అని తీరాలి. ప్రాణవాయువు, ఉదజనివాయువు
కలిస్తే నీరు ఏర్పడ్డం ఎంత శాస్త్రీయమో ఇది అంతే.
ఎవరు ప్రయోగం చేసినా ఎప్పుడూ ఒకే ఫలితమిస్తే దానినే నేను
శాస్త్రమంటాను. ఫలితమేదైతేనేం, దృష్టి దాని మూలంపైబడితే అది ములంయొక్క జ్ఞానాన్ని వెలువరిస్తుంది. వేదర్షులు, ఈ ప్రవాహశక్తులను
మధించినపుడు వెలువడిన మందస్వరాన్ని గమనించి, ఇది ఎవరి స్వరం?
అన్న విషయంపై అన్వేషణ సాగించారు.
నేను ఋగ్వేదపు తొలిపాఠాలలో చదివిన మరియు విన్న దాన్ని బట్టి వారు ఈ
శబ్దాన్నే సద్వినియోగపరిచినట్లు తెలుసుకున్నాను.
మరో మాటలో చెప్పాలంటే ఇదే అసలు సత్తాను తెలియచేసే సాధనము. ఎప్పుడైతే తెలుసుకునే సాధనం లభించిందో అప్పుడే
అసలు విషయం బయల్పడడం మొదలైంది. ఇక రెండవ
దశ ప్రారంభమైంది. ఆధ్యాత్మిక నూతనాధ్యాయము
తెరువబడింది. ఆలోచనా గగన విహారం మరింత
తీవ్రతరమై మున్ముందుకు సాగింది. ఎప్పుడైతే
సత్యతత్త్వం జాడ శబ్దంద్వారా దొరికిందో ఋషులు మరింత లోతుకు మునిగి అన్వేషణ
సాగించడానికి నిర్ణయించారు. అలా మునిగి
వారు ఉద్వేగపు ఆవలి కొసను చేజిక్కించుకొన్నారు.
అంటే "నేను వివిధములుగా వుంటేనేం నేను ఒక్కడినే" (ఏకోహం బహుష్యం)
అన్న భావమది. కానీ యిది సత్యతత్త్వపు
కార్యకలాపంలోని నిమ్న (తగ్గు) యోచన. ఇక
యోచన మరింత పైకి లంఘించి వారు పై సూత్ర (దారం) మందుకున్నారు. వారు ప్రవాహశక్తుల కదలికల వలన ఈ ప్రతిధ్వని
ఏర్పడిందని గ్రహించారు. దీనికావల మరేదో
వున్నదనీ గ్రహించారు. అన్వేషణ ఇంకా కొనసాగించారు. ఈ "ఏకోహం బహుష్యం" అన్న యోచన
చుట్టూగాలించారు. మరోమాటలో చెప్పాలంటే,
మన దృక్పదంలో వున్న సత్యతత్త్వపు స్థూలరూపం మాయమై మరింత అవతలికి
దూకి వెళ్ళడం మొదలైంది.
అప్పుడక్కడేముంది.
సందేహాస్పదమైయున్న వివిధత్వపు ఆలోచన ఎంత మాత్రముందో అదంతా ఉబికి వచ్చింది. తననుతాను అంచనా వేసుకోవడం జరిగింది. లోతుగా దానిపై యోచన కొనసాగింది. లోతుగా సాగిన యోచన వలన ఇదంతా కేవలం మనకైమనం
గమనిస్తూ వస్తున్న మానవస్వభావం నుండి కలిగిందేనన్న ఆలోచన తట్టింది. ఎప్పుడైతే అది పూర్తిగా అర్థం చేసుకున్నామో
అప్పుడే మన స్వభావం మరియు ఆలోచన ఆ శక్తి ప్రవాహంలో ఈదుతున్నట్లయింది. అది మరింత ముందుకు వెళ్ళి ఇదంతా మధన ప్రక్రియలో
వెలువడిన వెన్నయని అదే సత్యతత్త్వం కాదని తెలిసిపోయింది. ఇప్పుడడుగులు ఇంకా
ముందుకు పడ్డాయి. ఇది పైన తెలిపినట్లు
సాధింపబడిన మధ్యస్థానము. ఇంకా ముందుకు
పురోగమిస్తే ఆనందపు సుగంధం అనుభూతమౌతుంది.
ఆలోచన అందులోనే ఐక్యమైవుంటే అనుభూతులెలా కలుగుతాయన్న ప్రశ్న
ఇక్కడుత్పన్నమౌతుంది. అదే వెన్న మన
ఆలోచనతో గ్రహించిన పరమాణువుల ఘనస్వరూపమని తెలుసుకోవడమే దీనికి ఏకైక సాధనము. ఆనందమయ స్థితి తప్పక సిద్ధిస్తుంది. మనం కూడా అక్కడున్నాం. అనుభూతి చెందాం. దీని కోసమే మనం ప్రయత్నిస్తూ వచ్చాం అన్న
విషయాన్ని కూడా నిర్ధారించాం. కొందరు
అక్కడే నిలిచిపోయారు. మిగిలినవారు ఈ
సచ్చిదానంద స్థితిని కూడా దాటుకొని మున్ముందుకెళ్ళారు. అలా పురోగమిస్తూ వారు భిన్నత్వరహిత స్థితిలో
మునిగిపోయి అక్కడే వుండిపోయారు. వేదములు
దీని తర్వాత ఇక పలుక మాటలు లేక దీన్ని వివరించ శక్యముగాని (అనిర్వచనీయము) దని
తెలిపి "నేతి" "నేతి" (ఇంతేకాదు ఇంతేకాదు) అని
ప్రకటించాయి. ఇప్పుడు తిరిగి అదే
శాస్త్రీయమైన ప్రశ్న ఉత్పన్నమౌతుంది.
కొంతవరకు నేను సమాధానమిచ్చినానే అనుకుంటున్నాను. నీవు కనుక ఇంకా అవసరమనుకుంటే, మనం దారిలో వున్నాం, సత్యతత్త్వంతో స్థిర సంబంధ
మేర్పరచుకునే యత్నం చేశాం. ఇప్పుడు
నిర్ధారణగా మన దృష్టిపథంలో సత్యతత్త్వమే వుందని చెప్పగలం. ఇంకా చెప్పాలంటే మనం అదే అయిపోయాం. మనం సత్యతత్త్వపు జ్ఞానానికి ఆధారభూతంగా
వున్నాం, అంతేకాదు జ్ఞానమే మనమైపోయాం. ఇప్పుడిది శాస్త్రీయమో కాదో నీకైనీవే
నిర్ధారించు. సోదరా! ఇంతకు మించి
వ్రాయగలిగే పటుత్వం (సత్తువ, శక్తి) నాకు
లేవనుకుంటున్నాను. ఇప్పుడు నేను వేదం
సంపూర్తిగా వ్రాసినా మంత్రాలతో నిండియున్న
శబ్దములను సహితం లిఖించినా డా. వరదాచారిగారు సూచించినట్లు మనం అందులో లీనమైతే అవి
గణిత సూత్రములకన్నా సత్యతములై అదే సత్యము మనముందు దృగ్గోచరమౌతుంది. ఎవరు ఆదారిన వెళ్ళినా అదే వారికి
దర్శనమిస్తుంది. ఇప్పుడు నీకు అందులో
అతిశయోక్తులకు సహితం ఆస్కారముండి అందులో కవిత్వాంశమున్నట్లు అనిపించవచ్చు. నిజమే సోదరా! ఇది సత్యతత్త్వాన్ని చూపించడానికి
దాని పరిసరాలను నిర్మింపజేయడానికి వలసిన యోచనా శక్తికి తోడ్పడుతుంది. నేను కూడా తరచూ ఈ విధానంలో పనిని సాధించటానికి
ఒప్పుదల కనబరుస్తాను. ఉదాహరణకొక ద్విపద
వ్రాస్తాను. "ప్రియుడు బలహీనుడు,
ప్రేయసి సున్నితమైనది. ఆ
తెరను మరెవరైనా పైకి లాగివేతురుగాక".
దీని అర్థంపై లోతుగా ఆలోచిస్తే ప్రేయసి ప్రియులిరువురూ చేతలుడిగియున్నారని
నిరూపణయ్యింది. అదే సత్యస్థితి. సత్యమంటే అట్టిస్థితే. అది అలా వ్యక్తీకరింపబడింది. పిల్లలకు ఆశీస్సులు.
శ్రేయోభిలాషి
రామచంద్ర.
సహజమార్గము
- అభ్యాసీ కర్తవ్యము
ఎల్.ఎస్.ఆర్.కె.ప్రసాద్, విశాఖపట్టణం.
లక్ష్యము
మానవుడు చేరవలసిన
మహోన్నతలక్ష్యాన్ని గురించి వివరిస్తూ "ఎచ్చటైతే అన్ని రకముల శక్తులు(forces), బలము(power), చేష్ట(activity), ఉత్తేజము(stimulus) కూడా అదృశ్యమై సంపూర్ణ శూన్యస్థితియందు మానవుడు ప్రవేశించునో అదియే
పురోగతియొక్క చరమాంకము లేక జీవిత పరమలక్ష్యము" అని బాబూజీ చెప్పారు.
(సత్యోదయం)
మార్గము
మరి ఈ లక్ష్యప్రాప్తికి
మార్గమేమిటి అని ఆలోచన వస్తుంది.
మార్గాన్ని బాబూజీయే నిర్ధారించారు.
ఈవిధంగా "దీనిని (జీవితపు పరమలక్ష్యాన్ని) సాధించేందుకు మహోన్నతుడైన
గురుదేవునికి నిన్నునీవు నిజస్ఫూర్తితో అర్పించుకొని శరణాగతిచెంది జీవన్మృతుడవు
కావడమే సులువైన, ఖచ్చితమైన మార్గము" అని గుల్బర్గా
సెంటరు భవన ప్రారంభోత్సవం సందర్భంగా ఇచ్చిన దివ్యసందేశములో బాబూజీ చెప్పారు
శరణగతిని గురించి ఇంకా
వివరిస్తూ శ్రీ బాబూజీ ఈ విధంగా అన్నారు "ఈ శరణగతి భావాన్ని బలవంతంగా,
యాంత్రికంగా ఏర్పరచుకుంటే ఎప్పటికీ అది యదార్థమైనది, పరిశుద్దమైనది కాలేదు. నీ
మనస్సుపై ఏమాత్రము శ్రమగానీ, ఒత్తిడిగానీ కల్గించకుండా
దానంతటఅదే ఈ స్థితి నీలో పెంపొందాలి.
శరణాగతుడవైనావనే భావం లేశమాత్రమైనా వుంటే అది సరియైన శరణగతి కాదు. నీవు నిజంగా శరణాగతుడవైతే ఇక నీవు
చేయవలసిందేమిలేదని నా అభిప్రాయము. ఈ
స్థితి నీలో వున్నప్పుడు నీవు ఆ సత్ తత్వముతో ఎల్లప్పుడు సన్నిహితుడవై
వుంటావు. ఆ దివ్యతేజో ప్రవాహం నీలోనికి
యెడతెగకుండా ప్రవహిస్తుంది."
శరణగతి స్థితిలోని మానవుని
వ్యవహారసరళి ఏవిధంగా వుంటుందో కూడా వివరించారు
శ్రీ బాబూజీ (సత్యోదయం - ఆత్మసమర్పణ) "ఈ స్థితియందు మానవుడు తన
ప్రభువుయొక్క ఇచ్ఛానుసారమే ఆలోచించును లేక నడచుకొనును. ఈ ప్రపంచములో ఏదియును తనది కాదని, ప్రతిదీ ప్రభువుయొక్క ఆజ్ఞానుసారమే చేయుచున్నట్లు తలచి చేయును. అతని ఇచ్ఛ సంపూర్ణముగా ప్రభువు ఇచ్ఛకు విధేయమైపోవును."
భగవద్గీతలో కూడా శరణాగతి
ప్రస్థావన ఉన్నది. గురువై గీతాబోధ చేసిన
కృష్ణుడు అర్జునునికి చిట్టచివరి ఉపాయంగా యిలా చెప్పారు
శ్లో|| సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం
శరణం వ్రజ
అహం త్వా సర్వ పాపేభ్యో మోక్షయిశ్యామి
మాశుచః
-- 18వ అధ్యాయం 62వ శ్లోకం
తా|| సర్వధర్మములను అనగా ఇహపర ప్రయోజన
కారకములైన సమస్థ కర్తవ్యకర్మలను నాకు సమర్పింపుము. నన్నే
శరణు పొందుము. అన్ని పాపములనుండి
నిన్ను నేను విముక్తుని గావించెదను. నీవు శోకింపకుము.
మహోన్నత
గురుదేవులు
లక్ష్యం నిర్ణయమై ఆ లక్ష్యప్రాప్తికి
ఎవరిని గురువుగా ఎన్నుకొని శరణు పొందాలి అనే ప్రశ్న వస్తుంది. ఆ ప్రశ్నకు జవాబు కొఱకు రెండు విషయాలు
గమనిద్దాం.
"జీవితము" ను
గురించి వివరంగా చెబుతూ శ్రీ బాబూజీ ఈ విధంగా అన్నారు (ఋతవాణి వివరణలు) "ఏ
మహత్ జీవత్వంతో ఈ జీవితం ముడిపడాలని ఆకాంక్షిస్తున్నదో అది అనంతము, అనశ్వరము, మనము మనజీవితమును ‘ఆ జీవితమునందు’ లయం
చేసినచో అదే యదార్థ జీవితము. అప్పుడు
ఆనందముకానీ, విచారముకానీ, ఆహ్లాదముకానీ,
ఆవేదనకానీ వుండదు. ఆ
జీవితము కడకు మిమ్ములనందరిని తీసుకొనిపోవలెనని నా ఆకాంక్ష. నేను చెప్పినట్లుగా ఆజీవితము మాత్రమే మన ఈ
జీవితమునకు గమ్యము."
ఇంకొక సందర్భములో శ్రీ
బాబూజీ ఈ విధంగా చెప్పినట్లు తెలుస్తున్నది "ఎప్పుడైతే నేను శ్రీ లాలాజీ
సాహెబ్ గారి దివ్య పాదపద్మముల వద్దకు చేరుకున్నానో అప్పటికే నాలో లయావస్థ
పూర్తిఅయినదని శ్రీలాలాజీ సాహెబ్ అన్నారు.
నా మరియు నీ అవతరణ సాక్షాత్తు ‘భూమా నుండి జరిగినది’ అని శ్రీ లాలాజీ
సాహెబ్‌గారు అన్నారు. (వారు ఎవరంటే - సోదరి కస్తూరిగారు)."
పై రెండు విషయాలు గమనించిన
తర్వాత మనకు తెలిసినదేమంటే మనలనందరనీ ‘ఆ జీవితము’నకు, అనంతము,
అనశ్వరము అయిన ఆ జీవితమునకు తీసుకొనిపోవాలి’ అనే ఆకాంక్షతో, సాక్షాత్తూ ’భూమ నుండి’ అనంత శక్తితో అవతరించిన ఆ ప్రత్యేకమూర్తి (స్పెషల్
పర్సొనాలిటి) శ్రీ బాబూజీ మహరాజ్‌ను మత్రమే శరణు పొందాలి అని. "ప్రత్యేక మూర్తి (స్పెషల్ పర్సొనాలిటి)
కంటే ఎక్కువ శక్తులతో అవతారాలు అవతరిస్తాయి.
కానీ ఆ అవతారాలు మానవుని లక్ష్యమైన అంతిమ గమ్యానికి చేర్చలేవు, కేవలము ప్రత్యేక మూర్తి (స్పెషల్ పర్సొనాలిటి) మాత్రమే ఆపని చేయగలదు"
అని శ్రీ బాబుజీ చెప్పారు.
మన
ప్రయత్నము
మన ఈ జీవితాన్ని అనంతము,
అనశ్వరము అయిన ఆ జీవితంతో లయం చేయడముఅంటే ఆ భగవంతునిలో సంపూర్ణ
లయావస్థను పొందుటే. ఇప్పుడు ఆ ప్రత్యేకమూర్తి
(స్పెషల్ పర్సొనాలిటి) ని శరణు పొంది లయవస్థను ఏవిధంగ సాధించాలి? అనే ప్రశ్న తలెత్తుతుంది. దీనికి
సమాధానంగా శ్రీ రాఘవేంద్రరావుగారు (సహచరునిపిలుపు - స్పెషల్ పర్సొనాలిటి) ఈ విధంగ
చెప్పారు. " మనము పూర్తి ఎఱుకతో మన
ఆలోచనను ప్రత్యేకమూర్తి (స్పెషల్ పర్సొనాలిటి)తో జోడించినపుడు ఈ సంపూర్ణ లయావస్థ
సహజంగానే ప్రాప్తిస్తుంది. ఆ
ప్రత్యేకమూర్తి (స్పెషల్ పర్సొనాలిటి) భాద్యత వహించి లయావస్థను మనయొక్క ఎఱుకయే
లేని స్థితిలో మరియూ ఎఱుక గల్గిన స్థితిలో కూడా శాశ్వతంగా వుండేటట్లు చేసి మనలో
పరివర్తన తీసుకొని వస్తారు. వారికి కేవలం
మనం సహకరిస్తే చాలు మనల్ని వారు లక్ష్యానికి చేరుస్తారు." మరి ఆ ప్రత్యేకమూర్తి (స్పెషల్ పర్సొనాలిటి)
భౌతిక శరీరంతో లేనప్పుడు వారితో ఏవిధంగా మన ఆలోచనను ఎఱుకతో జోడించుకొని సహకరించగలం? దీనికి సమాధానంగా శ్రీ
రాఘవేంద్రరావుగారు అదే వ్యాసంలో ఈ విధంగా వ్రాశారు. " ఆ ప్రత్యేకమూర్తి (స్పెషల్ పర్సొనాలిటి)
వ్యవహారసరళిని, వారి బోధనలను గుర్తుంచుకొనడం ద్వారా అతి
సులువుగా ప్రయోజనం పొందవచ్చు. వారి
బోధనలకు, వ్యవహార సరళికి అనుగుణంగా తన వ్యక్తిగతజీవితాన్ని
మార్చుకొనుటకు ప్రయత్నము చేసే అభ్యాసి హృదయంలోనికి ప్రవేశించడానికి మన గురుదేవులు
శ్రీ బాబూజీ ఎల్లప్పుడూ సంసిద్దంగ వుంటారు".
ఇదే మనం వారికి సహకరించే విధానం.
మన వ్యక్తిగతజీవితాన్ని పైవిధంగా మార్చుకోవడానికి ప్రయత్నించడం
మనవంతు. మనల్ని మనజీవిత లక్ష్యానికి
చేర్చడం శ్రీ బాబూజీ వంతు. ఈ విధంగా మన
జీవితాన్ని మార్చుకోవడానికి చేసే ప్రయత్నమే మన "సహజమార్గ సాధన".
"సహజమార్గ సాధన"
అంటే సహజమార్గ జీవన విధానం ప్రకారం జీవించడమే.
సహజమార్గ జీవన విధానం యొక్క సారమే శ్రీ బాబూజీ మనకు దయతో ప్రసాదించిన
దశాదేశములు. ఇవి అభ్యాసికి తన జీవితంపట్ల
వుండవలసిన దృష్టిని, జీవించవలసిన పద్దతిని వివరిస్తున్నాయి.
"మన జీవితలక్ష్యాన్ని చేరుకోవడానికి అవసరమైనవి ఈ నియమాలు" అని, ‘మన లక్ష్యాన్ని లేక అంతిమాన్ని చేరాలని మనఃపూర్వకంగా కోరుకుంటే ఈ
దశనియమాలను ఆచరించడం తేలికే’ అని డా|| కె.సి.వరదాచారిగారు
చెప్పారు. బెంగుళూరు ఆశ్రమ
ప్రారంభోత్సవంలో (12.9.1976) శ్రీ రాఘవేంద్రరావుగారు మాట్లాడుతూ "దశాదేశాలకు
అనుగుణంగానూ, వాటిని పాటిస్తూనూ జీవించాల్సిన కర్తవ్యం ప్రతి
సహజమార్గ అభ్యాసీకీ వుంది. ఆ విధంగా
జీవించడానికి అతను దృఢమైన సంకల్పం చేసుకోవాలి" అని అన్నారు.
ఈ ఆదేశాలలో మొదటి 5 ఆదేశాలు
అభ్యాసీ యొక్క అంతరంగ స్వభావాన్ని, చివరి 5 అదేశాలు అతని
బాహ్యవైఖరి మరియు ప్రవర్తనను తీర్చిదిద్దడానికి సహాయపడతాయి. అందుచేత ధ్యానము, నిర్మలీకరణ,
ప్రార్థన, నిరంతరస్మరణలతో పాటుగా దశాదేశాల
ఆచరణపై కూడా శ్రద్ధవహిస్తే అభ్యాసియొక్క ఆధ్యాత్మిక పురోగతి వేగవంతమౌతుంది.
2009వ సంవత్సరం కడపలో
జరిగిన బసంత్ ఉత్సవంలో పాల్గొన్న శ్రీ శరత్‌చంద్ర సక్సేనా (శ్రీ బాబూజీ మనుమడు) ఈ
విధంగా అన్నారు.
1. నీకు ఆధ్యాత్మికత కావాలనుకుంటే శ్రీ బాబూజీనే
ఆశ్రయించు.
2. నీవు ఇతర ప్రయోజనాలకొఱకు శ్రీ బాబూజీని ఆశ్రయించదగదు.
3. శ్రీ బాబూజీ నుంచి ప్రయోజనం పొందలనుకుంటే వారు
చెప్పిన విధంగానే నడచుకో.
ఈ
విషయాలు దృష్టిలో వుంచుకొని సాధన సాగిద్దాము.
ooOoo
నిజమైన
ప్రేమ అంటే,
తాను గురువు గారిని ప్రేమిస్తున్నాననిగాని, లేదా
గురువుగారు
తనను ప్రేమిస్తున్నాడనిగాని తెలియకుండా ఒకరితో ఒకరు మమేకమై వుండడమే.
---బాబూజీ.
ఆత్మయొక్క
ఆరాటము
82వ
జన్మదిన సందర్భముగా
బాబూజీగారు
మలేషియాలో యిచ్చిన సందేశము - ఏప్రెల్ 30,1981
తెలుగు
అనువాదం: పి.సుబ్బరాయుడు, కడప.
ఆదమరచి మనిషి తనకుతానే తన
పరిసరాల ఆకర్షణకులోనై అందుండి బయటపడలేనంతగా చిక్కుకొనిపోయాడు. ఇదంతా ఎలా జరిగింది? అని
లోతుగా ఆలోచిస్తే మనం మన ఆలోచనల పరంపరను చొప్పించి భావనా బలంతో పోషించి మెదడులో
వృద్ధిచెందనిచ్చాము. దానికితోడు
దశదిశలనుండి అదే దృక్పదమే వినబడి ఊతమియ్యడంద్వారా పరిసరాల ప్రభావం మరింత
ముదిరింది. ఈ పరిస్థితులలో మనిషి
తానశక్తుడనన్న సాకుతో తప్పించుకోవడం జరుగుతున్నది. కానీ నేనొక్కమాట చెబుతాను. ఎప్పుడైతే మన పతనానికి ఇవీ కారణమని గమనించామో
అప్పుడే మనయోచనలో మార్పు వచ్చిందన్నమాట.
ఇదే వైరాగ్యం వైపుకు మనం వేసిన మొదటి అడుగుగా పరిగణించవచ్చు. దానితో మనయోచన ఒకానొక ఉత్కృష్ట, పవిత్ర విషయంపై నిలిచినదన్నమాట.
ఇప్పుడు మన కర్తవ్యం ఆ విషయాన్ని సక్రమంగా అవగాహన చేసుకొని ఎలాగైనా దానిపై
సడలని పట్టు సాధించడమే. మన పద్దతిలో
వైరాగ్యం దానికైఅదే ఉత్పన్నమౌతుంది.
గురువర్యుల చింతన నిరంతరం
మనసులో నిండి గమ్యంపై సరియైన గురి వుంటే సులువుగానే గమ్యంచేరవచ్చు. ఆయన్ను నిరంతరం స్మరించే మార్గాలు అనేకం. పరాకాష్టకు చేరిన భక్తి ఆయనకు మనకు మధ్య ఒక
మాధ్యమంగా ఏర్పడుతుంది. అదే ఆయన్ను చేరే
మార్గమవుతుంది. దారిలోని కంప, కసువులన్నీ తొలగించి శుభ్రపరిస్తే ప్రయాణం కష్టంకానేరదు. మనలోని భక్తికి తగ్గట్టుగా దారి
శుభ్రపడుతుంది. ఆయన్ను ధ్యానిస్తూవుంటే
మనదారిలో మనల్ని పురోగమింపజేసే ఒక త్రోపు హృదయంనుండి లభిస్తుంది. దారిలోని కంప, కసువు
మనలోని ఘర్షణాభావములే. ధ్యానంలో వుండగా
కనీసం తాత్కాలికమైన ప్రశాంతత కలిగినా అది నీ ప్రయాణంలో ఒక అడుగు ముందుకు
పడినట్లే. మార్గంలో ముందుకెళ్ళేకొద్దీ
ఘర్షణాయుతమైన యోచనలు అంతరిస్తూ పోతాయి.
అంతరాంతరాళను సృజిస్తూ ధ్యానంలో స్థిరత్వాన్ని సాధించినట్లైన అంతిమ సత్యము
లేక భగవంతుడు నీకు సన్నిహితుడౌతాడు.
అంతిమసత్యం చేరే ఈ
మార్గాన్ని గురించి చెబుతూ సత్పురుషులు "ఇంకా ఆవల, ఇంకా
ఆవల" అన్నారు. చెప్పడానికి ఇది
బాగానే వుంటుంది. కానీ కార్యరంగంలోనికి
ప్రవేశింపగానే కాస్త కష్టమనిపిస్తుంది.
కారణం అసంసిద్ధత, ప్రయత్నలోపమే. అహంభావము చుట్టూ ఆవరించివుంది. శ్రద్ధగా సాధనచేస్తే అదికూడా తొలగిపోతుంది. "నేను" (అహం) అన్న యోచన మనకు
శత్రువుగా భావించటం సాధారణంగా అన్నిచోట్ల జరుగుతున్నది. అది సక్రమమైన భావన కాదు. అది విషయాన్ని జఠిలము, అసాధ్యము
చేస్తున్నది. "నేను" అన్న భావన
మన యోచన, ఏకాగ్రతతోనే బలపడుతున్నది. "నేను"ను మరచిపోవడానికి
ప్రయత్నించు. అదినీకెంతో
మేలుచేస్తుంది. దివ్యత్వము ఉదయించగానే
జీవితములోని క్రమవిరుద్దమైన తీరు తొలగిపోతుంది.
గతాన్ని నిర్మూలించడమనేది సహజమార్గములో ఒక అధ్యాయము.
గమ్యాన్ని గూర్చి ఆలోచిస్తూ
దానికై ఆరాటపడటం మొదలైతే దూరము కనుచూపు మేరలోనిదౌతుంది. కారణం మనమటువంటి ఆలోచనకు అలవాటు పడటమే. మొదలుపెట్టగానే పదార్థపు ఆవలివైపుకు
చొచ్చుకపోతాం. అలా మనం సత్యతత్త్వాన్ని
దాటి అడుగుభాగాన్ని స్పృజిస్తాం.
శబ్దముయొక్క ప్రతిధ్వని దూరం ప్రయాణించేకొద్దీ తగ్గుతూ, తగ్గుతూ కడకు నిశ్శబ్దం ఆవరిస్తుంది.
ఆ నిశ్శబ్దపు ప్రారంభపు దశనుండి
జీవితంలోనికి మనం అడుగిడితే మనం ఉన్నతిస్థితిని అందుకోగలమనడానికి అదొక
సంకేతమని నేను నమ్ముతున్నాను. లోతుకు
మునిగితేనే ముత్యాలు దొరుకుతాయి. అననుకూల
పరిస్థితులను అనుకూలముగా మలచుకోవడమే మానవుని ప్రజ్ఞ. మరోమాటలో చెప్పాలంటే మనం భౌతికశక్తినంతా
ఆధ్యాత్మికంగా మార్చడంలో కృతకృత్యులము కావాలి.
సహజమార్గ పద్ధతిలో సమర్థగురువు లభ్యమవ్వడంతో ఇది సాధ్యమైపోతుంది. మన నిర్మాణములోని ప్రతిపోగు ఆధ్యాత్మికతను
సంతరించుకొని సత్యతత్త్వాన్ని ప్రసరింపజేస్తున్నది. నా సేవలను సంపూర్ణముగా సద్వినియోగపరచుకోగల ఆత్మస్వరూపులను
నేను తయారు చేయుచున్నాను.
జీవించడంలో ఎంతో
ప్రాశస్త్యమున్నది. కేవలం జీవించడమేకాదు,
అత్యంతోన్నతమైనదానిని అందుకోవడమే జీవిత పరమార్థమై యున్నది. ఆత్మయొక్క ఆరాటాన్ని మనం సమర్థవంతంగా
శాంతింపజేయాలంటే మనం ఎఱుక (ఉనికి) కలిగి జీవించగలగాలి. ఎవరికీ ఆవలిగట్టు తెలియదు. మా గురువర్యుల శిక్షణావిధానము చిత్రమైనది. ఈ విధానంలో ఆధ్యాత్మికజీవనము ప్రాపంచిక జీవనము
రెండూ ఉన్నత ప్రమాణాలతో సమాంతరంగా నడుస్తాయి.
మనస్సును క్రమబద్దీకరించడం గురువుగారు బాధ్యతగా స్వీకరించినారు. ఈ విధానాన్ని అవలంభించిన తర్వాత కాస్త గమనించి
సరిచూసుకో, తర్వాత కొద్ది సమయానికే నీ
అనుభవంలోనికొస్తుంది. అనంతసత్యం కొఱకు
నీలో ఆకాంక్ష విశ్వాసము వుంటే ఆధ్యాత్మికతలో అంతరాయమేర్పడనే ఏర్పడదు. శారీరక మరియు మానసిక వ్యధలు ఆధ్యాత్మికతను
వ్యక్తీకరించవు. "సాధన ఎలా నీ బాధ్యత అవుతుందో అలానే ఆధ్యాత్మికత నా బాధ్యత
అవుతుంది" అని మా గురుదేవులు ఘంటాపథంగా నొక్కి వక్కాణించారు.
నిజమే! మతం భగవత్సాక్షత్కార
మార్గంలో ఒక మార్గదర్శక సూచీస్తంభమే, కానీ సరియైన దారిని
మాత్రం నీకైనీవే సిద్ధపరచుకోవాలి.
మానవులకు అనేకములైన కష్టాలున్నాయి.
ఎంతకాలం వాటిని పట్టించుకొని పెనుగులాడుతామో అంతకాలం అవి మనకు అడ్డంకులుగా
వుంటాయి. నిరుత్సాహం మనల్ని పిరికివాళ్ళను
చేస్తుంది. ఏదోవిధంగా "నిరు"
నిర్మూలిస్తే ఇక ఉత్సాహం మిగిలిపోతుంది.
అంటే మనం ఒకానొక కార్యనిర్వహణకై ప్రోత్సహించబడ్డాం (నియమింపబడ్డాం). అలాంటప్పుడు మనమాకార్యక్రమాన్ని నిర్వహించలేమని
ఎప్పుడూ అనము. అంటే ఒకానొకస్పందన
సున్నితంగా పనిచేస్తూ దానితోపాటు మనల్ని ముందుకు నడుపుతున్నదన్నమాట. అటువంటప్పుడు ఇక భూత భవిష్యత్తుకు సంబంధించిన
యోచనే పొడసూపదు. భగవదీయ మార్గంలో పులివలె
ప్రవర్తించు. నిస్సందేహంగా ప్రగతి
సాధిస్తావు.
గురువర్యుల సందేశాన్ని
ప్రకటిస్తూ, ప్రబలియున్న ప్రాపంచికత (అనాధ్యాత్మికత)
స్థానంలో ఆధ్యాత్మికతను సహజమార్గము ద్వారా నెలకొల్పడమే మనసంస్థ ప్రధానోద్దేశ్యము. ఓ నిద్రాసక్త మనుజులారా ఇది సూర్యోదయ సమయము. లేవండి, మేల్కొనండి. ఏమైనా పరివర్తన ఒక్కసారిగా అర్ధరాత్రి
ఊడిపడదు. సభ్యులు ప్రేమా, ఓర్పు, సహకారం కనబరుస్తూ పనిచేస్తే మనసంస్థ
వుద్దేశ్యం తప్పక సిద్ధిస్తుంది. సంస్థలో
సూర్యునివలె ప్రకాశించగల ధీరులు నాకవసరము.
మనవిధానం సరైందని తెలిస్తే ప్రజలు వారికైవారే ఆకర్షింపబడతారు. వంద గొర్రెలకంటే ఒక సింహం మేలు. అయినా మానవమాత్రులంగా మనం ఆధ్యాత్మిక ప్రయోజనం
జనులకందిచే ప్రయత్నం చేయాలి. గురువర్యుల
మార్గంలో మనఃపూర్వకంగా చేసిన పరిశ్రమ ఎన్నటికీ వృధాకాదు. తదాస్తు! @@@
వ్యక్తిగత
ప్రవర్తనకు సంబంధించి శ్రీబాబూజీకి శ్రీలాలాజీ యిచ్చిన ఆదేశాలు
(శ్రీబాబూజీగారి జీవితచరిత్ర 2వ భాగము 1వ సంపుటి)
సేకరణ: ఎల్.ఎస్.ఆర్.కె.ప్రసాద్, విశాఖపట్టణం.
11.05.44
: మంచి జరిగినప్పుడు ఆనందించడం, చెడు
జరిగినప్పుడు విచారించడం లేకుండునట్లు నీవు అలవాటు చేసుకొనుము.
18.05.44
: వినయము, నమ్రతాభావము నా అలవాటు. అది నీవు అలవరచుకొనుము. "ప్రభువు
ప్రాంగణమునందు నేను బిక్షకుడను" అను భావము నా లక్షణము. దానిని నీవు ఎన్నడూ విడువకుము. అయినప్పటికి ప్రవర్తన చక్రవర్తివలె
వుండవలెను. నీవు కఠినముగా వుండవలెను. మెత్తదనము అలవాటు చేసుకొనవద్దు. నీవు ఏవిధముగా ప్రవర్తించవలెనని నేననుకొందునో
ఆవిధముగా నీవు తు.చ.తప్పకుండా సరిగ్గా అలాగే చేయవలెను.
19.05.44:
నీవు సంపన్నుడవై వుండికూడా నన్ను ఒక్కక్షణం కూడా మరువలేదు. ఎవరైనా నమ్మకమనునది నేర్చుకొనగోరిన అది నీనుండి
నేర్చుకొనవలెను. ఆదేశములు:
1)
జలపక్షి నీటిలో మునిగి పైకివచ్చిన తర్వాతకూడా అది పొడిగానే వుంటుంది. దానికి ఏమాత్రము నీరు అంటదు. ఆమాదిరిగానే జీవితమును నీవు మలచుకొనవలెను.
2)
నీ సత్సంగములోని సోదరులను ప్రేమింపుము.
నీఅలవాటు ప్రకారము సంభాషణ మృదువుగను, మధురముగను
వుండు శైలినే ఉపయోగింపుము.
3)
మిత్రుని, శత్రువును సమానముగా చూచి ఇద్దరి శ్రేయస్సును
కోరవలెను.
4)
పొగడ్త, సంస్కృతికి (బుద్దివికాసమునకు) ఆటంకము. ఈ విషయమును గురించి నేను శరీరముతో ఉన్నపుడు
వ్యవహరించిన తీరునుండి నేర్చుకొనుము.
20.05.44:
ఇతరులు నిన్ను వెయ్యి విధములుగా నిందించవచ్చును.
నీవు దానిని భరించాలి. దీని అర్థము, నిన్నెవరైనా నిందించినా తిరిగి నీవు నిందించవచ్చు. వారిని కొట్టవచ్చుకూడా. కానీ ఆవ్యక్తికి ఎన్నడూ నీ హృదయమున చెడు
తలంపకుము.
25.05.44:
ప్రశ్న: గురువుగారికి ముందుండిన పెద్దలందరి బాంధవ్యాలు కూడా గమనించి పాటించవలెనా?
జవాబు:
అన్ని బాంధవ్యాలు గురువుగారిలోనే ఇమిడి వున్నవి.
26.05.44:
నీ నిరాడంబరతతో అందరిని జయించావు.
27.05.44:
హద్దుమీరిన అలవాట్లను త్యజింపుము.
మితత్త్వమును అలవరచుకొనుము.
05.06.44:
నీకు ఎక్కువ బాధ కల్గినప్పుడు నావలెనే పాడుకొనుట ప్రారంభింపుము. అప్పుడు దానిలోనికి ఆకర్షింపబడి బాధ తగ్గును.
03.07.44:
నేను కూర్చుండుటకు ఏర్పాటుచేసిన స్థలములో నా ఫోటోగ్రాఫ్‌ను వుంచకూడదు. నేను ఫోటో తీయించుకొనునట్లు నన్ను కొంతమంది
బలవంతము చేసిరి. యిప్పుడు ఫోటోగ్రాఫ్‌ను
పూజించడము మొదలైనది.
08.07.44:
ప్రజలు నన్ను చనిపోయినవాడిగా నిర్ణయించుకొన్నారు.
వాళ్ళు అట్లు నిర్ణయించుకొన్నప్పుడు ప్రాణాహుతి ప్రవాహములో కూడా అవరోధము
సృష్టించబడినది. ఎక్కువమంది ప్రజలు నాతో
సంబంధము కొనసాగించలేకపోయిరి.
10.07.44:
వ్యామోహము దేనియందైననూ, అది ఎటువంటిదైననూ సరే
ఆధ్యాత్మికతకు హానికరము.
13.07.44:
గురువుగారి ఆలోచన తప్ప వేరొక వ్యక్తియొక్క ఆలోచన వారికి రాకూడదని
హెచ్చరించాలి. దీనికి వ్యతిరేకమైన
వారినెవరినైనా మరొక చోటు చూసుకొమ్మని చెప్పవలెను.
ఈ స్థలము వారికి పనికిరాదని కూడా చెప్పవలెను. ఇది ఈ సంస్థకు పునాది.
వృధా సంభాషణలు కూడదు (అనగా
కాలక్షేపము కొఱకు చేసే సంభాషణలు).
అసందర్భపు సంభాషణలు (సంవాదములు) పనికి రావు. కల్పిత కథాసాహిత్యమును చదువుట
ఆపివేయవలెను. హృదయము గురువుగారియందు ప్రేమతో
తప్ప ఇతరులయందు ప్రేమతో మలినము కాకూడదు.
స్నేహమునందు వేలం-వెర్రి విడిచిపెట్టవలెను. భగవంతుని మాత్రమే స్నేహితునిగా
స్వీకరించవలెను. భక్తిపూరితమైన
(దివ్యప్రేమతో నిండిన) మత గ్రంధములను చదువవచ్చును. జఠిలమైన, గంభీరమైన
తత్త్వశాస్త్రాధ్యయనము అవసరములేదు. వ్యక్తుల మధ్య పరస్పర ప్రవర్తన సోదరభావముతో
వుండాలి (ఒకరియందు మరొకరికి సానుభూతి కలిగియుండడము, అవసరమైనప్పుడు
ఉపయోగపడడము). మంచి ప్రవర్తన కలిగి వుండడము
ఈ పద్దతియొక్క ముఖ్యాంశము. ప్రతి వ్యక్తి
ఈ సంస్థయొక్క మూల సూత్రములను అనుసరించవలెను.
ఉదయమే మేల్కొనడం, ధ్యానసాధన, ప్రార్థన
చేయుట, గృహకార్యములను సక్రమముగ నిర్వర్తించడము అను మంచి నడత
వంటి సూత్రములకు కట్టుబడి వుండుట ప్రతి ఒక్కరి బాధ్యత.
15.07.44:
నీ మనస్సులో వుంచుకోవలసిన విషయములు రెండు. 1) ఆరోగ్యము 2) ఆత్మగౌరవము. నేను ఈవిధముగా విన్నవించుకొంటిని: "ఇతరులు
తన యెడల ఏది చేయకూడదు అని భావింతునో, దానిని
నేనుఇతరులకు చేయకూడదు" అని ఆత్మగౌరవమును అర్థము చేసుకొంటిని. దీనికి
లాలాజీగారు ఈ విధముగా చెప్పిరి: "ఇదియంతయూ సత్యయుగమునాటిది. ఆత్మగౌరవమనగా ఇతరులతో ముభావముగా వుండుట,
ఇతరులు ఎక్కువగా మాట్లాడుటకు అవకాశము యివ్వకుండుట, అనగా వాదోపవాదములకు ఎక్కువ వ్యవధి యివ్వకపోవుట. అయినవారికి, కానివారికి
ఇంటిరహస్యములు చెప్పకుండుట. తాను
బలహీనుడనని అనుకోకుండుట. ఇతరులు నీయెడ
అమర్యాదగా ప్రవర్తించుటకు అవకాశమీయకుండుట. యివన్నీ ఆత్మగౌరవము అన్నపదమునకు
అర్థములు.
18.07.44:
నీకు దేనియందూ కొరికలేదు. ఇదియే నిజమైన త్యాగము.
21.07.44:
మొరటుగా మాట్లేడే అలవాటు విడిచిపెట్టమని ఎం1 తో చెప్పుము. ఎందుకనగా అది ప్రజలను బాధించుటేగాక వారు
ఎదురుతిరుగునట్లు చేయును. మన సంభాషణ
ప్రేమతోనిండి పొరలుచున్నట్లుండవలెను.
భగవంతుడొక్కడే ఏలోపము లేనివాడు.
తప్పులెన్నుటయే ఒకతప్పు. అది తప్పులెన్నువారికే
ప్రమాదము తెచ్చిపెట్టును. ఎం1 నాతో
కొన్నాళ్ళు నివసించి వుండినట్లైతే నాలో కూడా తప్పులు చూసేవాడు.
31.07.44:
మానవనైజ్అము వలన ఆలోచన చెడువైపునకు మరలినపుడు వెంటనే మంచి ఆలోచన
తీసుకురావలెను. అందువలన చెడుఆలోచన, మంచిఆలోచన వలన నిరర్థకమైపోయి సమత ఏర్పడును.
09.08.44:
ఆధ్యాత్మికతకు సత్ప్రవర్తన ముఖ్యము.
11.08.44:
సంశయించే అలవాటు మానుకొనుము. అది
హానికరము.
17.08.44:
కోపము చెడ్డదికాదు. కానీ దానిని ఉపయోగించుట తగినవిధముగా వుండవలెను. సంతోషకరమైన ప్రవర్తన అన్ని వైపులనుండి
కానవచ్చునట్లు, ఆనందమే
ధ్యేయముగా మనిషి తన జీవనవిలువలను మలచుకొనవలెను.
మితత్త్వము ఇంకనూ లాభదాయకము. అనగా
పంచేంద్రియ బలగమునంతనూ అదుపులోనుంచుట మితత్త్వమునకు అర్థము. కోపమును ఉన్నదివున్నట్లుగానే వుంచడము
జరిగినది. తరువాత పూజ్యగురుదేవులు మనము
పాటించవలసిన కొన్ని జీవనసూత్రములను సూచించిరి.
1)
హృదయము మలినము కాకుండా పిల్లలను జాగ్రత్తగా పోషించి పెంచవలెను. మనకు వారియందుకల అనురాగము మనకు బాధ
కలిగించకూడదు.
2)
సంసారమునకు భార్యా, భర్తలు రెండు చక్రములుగా భావించి, భర్త భార్యను తనకు సర్వవిషయములందు సహాయకారిగా చేసుకొనవలెను.
3)
ఇరుగుపొరుగు వారితో సత్సంబంధములను కొనసాగించుతూ, వారిని నీవారిగ భావించవలెను.
అందువలన వారు కూడా నిన్ను తమవారిగా భావించెదరు. ఇదేసూత్రము స్నేహితులయందు కూడా పాటించవలెను.
4)
బంధువులతో బాంధవ్య బంధము తెగిపోయినట్లుగనే ప్రవర్తించవలెను. కానీ వారి కష్టసుఖములలో వారిని
ఆదుకొనవలయును. అందరితోనూ ఇదేవిధముగా వుండవలెను. బంధువులతో ఆర్థికసంబంధమైన వ్యవహారములు లేకుండా
చూచుకొనవలయును. వారి అవసర సమయములలో
ధనసహాయము వారు తిరిగి యివ్వకపోయిననూ మనకు బాధకలిగించనంతగా ఉండవలెను.
5)
మనకంటే పైఅధికారులతో వారి అధికారమును ధిక్కరించే విధముగా మనప్రవర్తన
వుండకూడదు. దీనివలన కలిగే లాభము భగవంతునినుండి
వచ్చినదిగా భావించవలెను.
6)
మనసలహాలు గౌరవించనివారికి సలహాలు యివ్వరాదు.
ప్రమాదకరమైన అనారోగ్యములో అడగకుండా మందులు, సలహాలు యివ్వకూడదు. ఇక రోగి
చేయిదాటి పోవుచున్నాడు అని అనుకుంటే తప్పదు.
ఈ అలవాటు షాజహాన్‌పూర్ సాంఘికజీవనములో చాలా అధికముగా ఉన్నది.
7)
వ్యక్తిగతసేవలు, తిరిగి వాటిని వారికి అందించగల్గినపుడే
స్వీకరించవలెను. నిస్సహాయత వేరే విషయము.
8)
తన స్వంత రహస్యములను ఇతరులకు తెలియనీయరాదు.
ఇతరులనుండి ఏదో దాచుచున్నట్లు కూడా భావము ఎదుటివారికి కలుగనీయరాదు.
9)
లేనిపోని అనవసరమైన అనుబంధములు లేకుండా, అతి సామాన్యమైన
జీవితమును గడుపవలెను.
10)
సాధ్యమైనంత వరకు వ్యాకులతను దరికి రానీయకూడదు.
ఒకవేళ వచ్చినను అది భగవంతునినుండి వచ్చినదని తలంచి అందుకు ఆయనకు కృతజ్ఞత
తెలుపవలెను.
11)
ఆహార, పానీయ విషయములందు ఇష్టాయిష్టములకు లోనుకాకుండా
వాటియందు ఉత్సాహము లేకుండావుండు స్థితిని పెంపొందించుకొనవలెను. దానిని తీసుకొనుట తగినదా, కాదా అను విషయము కూడ దృష్టిలో వుంచుకొనవలెను.
12)
సర్వము గురువుగారికే అర్పించవలెను.
నేనుచెప్పేది డబ్బు విషయముకాదు.
సర్వము అతనిదే అను భావముతో జాగ్రత్తవహించి దానిని సద్వినియోగము చేయవలెను.
13)
గురువుగారి భార్యయందు, పవిత్రులైన పెద్దవారియందు
పూజ్యభావము కలిగియుండవలెను. గురువుగారి
కుటుంబసభ్యులందరిని తన స్వంత కుటుంబసభ్యులవలె భావించవలెను. గురువుగారి పిల్లలయందు కూడా అదే భావము
కలిగియుండవలెను. కుటుంబ సభ్యుల ముందు సంఘ
కట్టుబాట్లకు అణుగుణమైన సంబంధ బాంధవ్యములను అనుసరించవలెను.
14)
సత్సంగ సోదరులలో ఆనందము కలుగునట్లు వారితో ప్రవర్తించవలెను. అందువలన వారి ఆధ్యాత్మిక పురోగతి
వృద్ధిచెందును. ప్రత్యక్ష ప్రతిఘటన తప్పు
(సూటిగా వ్యతిరేకించడము హానికరము).
15)
విషయలోలత విషయములో కఠినముగానుండుట ఉచితము.
స్త్రీల శిక్షణ విషయములో నేను చెప్పిన పద్దతి ననుసరించుము. నేను ఎల్లప్పుడు ఈవిషయములో జాగ్రత్తగా
వుండేవాడిని. నేను చాలా అనుభవము మీద ఈ
సూత్రములను సమకూర్చడమైనది. కానీ ఎవరూ వీటిని
పాటించలేదు.
26.08.44:
ఒక సలహా: ఒకవ్యక్తి సర్వకార్యములను చక్కబెడుతూ వాటితో సంబంధములేకుండా
వుండగలిగినట్లైన అతడు చాలా ఉన్నతుడు.
02.09.44:
సరియైన మనోవికాసము చిన్నతనములోనే జ్అరుగును.
ఆ వయసులో చూపిన శ్రద్ధ, శ్రమ మాత్రమే
భవిష్యత్తులో పనిచేయును.
05.09.44:
మృదుత్వమును పెంచుకొను పద్దతి: మనలో అత్యంత వినయ స్వభావమును అలవరచుకొనవలెను. అందువలన తనలో ప్రేమ భావము నిండిపోయి ఇతరుల మనస్సును
ఏవిధముగనూ నొప్పింపజాలదు. అందువలన అతని
మాటలు ఇతరుల మనస్సును ఏవిధముగనూ నొప్పింపవు.
ఇది అందరి విధి. ఇదియే గురువు
అడుగుజాడలలో నడచుకొనుట. ఇది నా
ప్రత్యేకపద్దతి. ఎవరూ దీనిని
అనుకరించలేదు.
05.09.44:
ఉద్రేక స్వభావము, విసుగు విడిచిపెట్టి సహనమునలవరచుకొనుము. అప్పుడు వినయ, విధేయతలు,
ఆత్మార్పణ, దైవానుగ్రహము వాటి వెంబడే
సంభవించును.
2వ
సంపుటి.
19.10.44:
శ్రీకృష్ణభగవానునినుండి ఆదేశము. (నూతన ఆధ్యాత్మిక శిక్షణా పద్దతిలో జీవన విధానము
గురించి)
మానవ జీవనమునకు సంబంధించిన
నియమ సూత్రములు అతి సరళముగా వుండవలెను. సత్యమునే
పలుకు అలవాటును పెంపొందించుకొనవలెను.
అనవసరమైన శ్రవణ దృశ్య ఆకర్షణలనుండి దూరముగా వుండవలెను. పిల్లలయందు ప్రేమ, పెద్దయలయందు
గౌరవము, తల్లిదండ్రుల సేవ, నీతనియమబద్దమైన
జీవితము, సహృదయత కలిగియుండుట, అన్యుల
ఆస్తిపై ఆశలేకుండుట, ఇతరులను బెదిరించు మనస్తత్త్వము
విడనాడుట, నిర్మల ప్రశాంత చిత్తము కలిగియుండుటకు
ప్రయత్నించుట, ఇతరుల హృదయమును గాయపరచు మాటలు మాట్లాడకుండుట
అలవరచుకొనవలెను. అయినప్పటికి
ప్రాణాపాయమునందు శత్రువునెదుర్కొనుటకు కత్తిదూయుట నిషేధముకాదు. ఈ కత్తిదూయుట ఆత్మరక్షణకొఱకు, ఇతరులను రక్షించుటకు మాత్రమేనని గుర్తుంచుకొనవలెను.
24.10.44: పూజ్య గురువులు సహజమార్గ సాధకులకు ప్రాధమిక
సూత్రములను నిర్దేశించిరి:
1) మనసంస్థలో నమ్మకమునకు
(విశ్వాసమునకు) ఎక్కువ ప్రాముఖ్యమివ్వబడినది.
అది ప్రధమసోపానము. దానిని
పరిపక్వము గావించుట ప్రతి సాధకుని కర్తవ్యము.
ఇదిలేనిదే సత్ఫలితము చేకూరదు.
2) ప్రతి సాధకుడు ఈ సాధనము
వలన తనకు మేలు జరుగునా, లేదాయని ప్రధమముగా
నిర్ణయించుకొనవలెను. ఇది అనుభవము వలన నిరూపింపబడును. అపుడు తన నమ్మకము పరిపక్వమొందించువైపు మనస్సును
మరలించవలెను. గురువుగారి
ఆదేశములకనుగుణముగా ప్రవర్తించుట మన కర్తవ్యముగా భావించవలెను.
3) ఈ పద్దతిలో సాధకుడిని
పరమసత్తాతో (అనంత సత్యముతో) ప్రాణాహుతిద్వారా సంధించడము ఇంద్రజాలము కాదు. కృత్రిమ నిద్రాణస్థితి కూడా కాదని సాధకునికి
అర్థమగునట్లు తెలియజేయవలెను. ఈ సహజమార్గములో
ప్రాణాహుతి ముఖ్యమైనది. అతను తన
హృదయపూర్వకముగా నిర్ణయించుకొని గురువునందు నమ్మకముంచకపోయినట్లైన అతనిచే సాధన
ప్రారంభింపజేయడము అనవసరము.
4) శీలపరిశీలన
ముఖ్యము. బ్రహ్మచర్యము తప్పనిసరిగా
అవసరము.
29.10.44:
మానవుడు తన జీవితములో అసూయ, నాదియను భావనకు
పూర్తిగా దూరమైనపుడు అతడు మోక్షమును పొందును.
ప్రేమ అనగా, గురువుగారి ఆజ్ఞను శిరసావహించి ఏవిధమైన
సందేహములేకుండా నిర్వర్తించడమే. అనగా
గురువుగారి ఆజ్ఞ నిర్వహించుటయందు మనస్సు తనంత తాను నిమజ్ఞమై అందుకు ప్రయత్నించుట.
13.12.44:
అవసానదశలో ఆధ్యాత్మిక స్థితులకొఱకు ఏమీచేయలేవు.
మితత్త్వము అవసరము. సర్వత్రా అది
లోపించినది. ఆధ్యాత్మికత ఒకటే చాలదు. ఆధ్యాత్మికత, నైతిక విలువలతో జోడింపబడినప్పుడే దాని విలువ ఇనుమడించును.
16.12.44:
స్వామి వివేకానందుల నుండి ఆదేశము:
ఒక విషయము
గుర్తుంచుకొనవలెను. జీవితములో
అన్నిదశలలోను వ్యక్తి తన గురువుయొక్క నియమ నిబంధనలకు కఠినముగా
కట్టుబడియుండవలెను. అప్పుడు తప్పని సరిగా
విజయము లభించును. సూర్యోదయమునకు పూర్వమే
నిదురలెమ్ము.
22.12.44:
స్వామి వివేకానందుల నుండి ఆదేశము:
నీవు సజ్జనుల సాంగత్యములోనే
మెలగుము. నీవు చెప్పునదే చేయుము, చేయునదే చెప్పుము. ఆదిలోనే
విజయమునుగురించి ఆలోచింపకుము. లక్ష్యము
పూర్తిఅగువరకు నీకు నిర్దేశింపబడిన పనిని నీవు నిర్వర్తించుము.
23.02.45:
ప్రశిక్షకులు నా నైతిక స్వభావమునకు (సాధుత్వమునకు, సౌశీల్యమునకు) ప్రతీకలుగా (ఉదాహరణముగా) తయారు కావలెను. ఈ విషయమునకు ఎక్కువ ప్రాముఖ్యమునీయవలెను. దీనిని శక్తివంతముజేయుటకు ప్రార్థనా పద్దతులు
ఉపయోగించవలెను.
07.03.45:
మనము మాట్లాడునపుడు స్వరములో హెచ్చుతగ్గులు లేకుండునట్లు ప్రయత్నించవలెను.
***** ***** *****
ఇతరులయందు
దోషాలను చూచే స్వభావం ఉన్నదంటే,
అట్టి
దోషము
తనయందే బీజరూపంలో ఉన్నదనేది సూచిస్తుంది.
ఇతరులలోని దోషాలపై దృష్టి సారించి వాటిని పట్టించుకుంటే
అట్టి
దోషాలు మన మనస్సులోనికి చొరబడతాయి.
---బాబూజీ.
శ్రీ
బి.జి.జనార్ధన్, బెంగుళూరు వారి
భావనలు మరియు సంకలనములు
తెలుగు
అనువాదం: పి.సుబ్బరాయుడు, కడప.
సమర్థగురు శ్రీరామచంద్రజీ మహరాజ్, షాజహాన్‌పూర్ వారు ప్రత్యేకావతార పురుషునిగా అవతరించి మానవజాతికి సహజమార్గ
విధానమును కానుకగా యిచ్చి మన జీవితలక్ష్యమును మన అవగాహనలోనికి తెచ్చినారు. అందుకు
సాక్షము మన సులభ ప్రార్థనలోనే వున్నది గమనింపుడు -- "ఓ గురుదేవా నీవే మానవ
జీవనమునకు నిజమైన లక్ష్యము."
ఆయన భౌతిక శరీరమును
వీడి 27 సంవత్సరములైనప్పటికిని "ఋతవాణి" లో ఆయనే వివరించినట్లు
"బహిరంగముగా నేను వుండనే వున్నాను" "నాజీవితము మాటలకందెడి అర్థముగల
జీవితము కాదు." ఇది ఒక "ఉనికి స్థితి అంటే అది నిత్యసత్యమై
వుంటుంది" (ఋతవాణి పూర్తి గ్రంధము.19 వపుట)
ఈసందర్భములో
గమనించవలసిన విషయమేమంటే మన లెక్క ప్రకారం మనమెంత వరకు ఆయన పద్దతులు శిక్షణా
విధానము మరియు వాస్తవ జీవితలక్ష్యమును ఎంత ప్రతిభావంతముగా అంచనా వేయగలిగితిమి?
"అన్వేషకుడు
ప్రాపంచిక ఆకర్షణల విషయములో అంధుడై వుండవలెను. అతడు ఒకే ఒక్క విషయము, ఒకే ఒక్క ప్రయోజనము మరియు ఎల్లవేళల అదే ధ్యాసలోనే ప్రభావితుడై యుండవలెను.
అటువంటి అన్వేషకుడు కార్యసాధనకు తగిన గురువును ఎన్నుకొనుటలో పొరపాటు పడడు. సంక్షిప్తంగా చెప్పాలంటే తీవ్రమైన ఆకాంక్షే
తప్పనిసరి విజయమునకు అత్యావశ్యకమైనది. శూన్యత్వము ఇంకను దానికతీతమైన స్థితి వరకు
పురోగమించాలంటే అభ్యాసి తప్పనిసరిగా ప్రగాఢమైన ప్రేమ భక్తి గలిగి, దానితో గురువు కృపను తనపై ప్రసరింపజేయగల పరిస్థితిని కల్పించవలెను."
(ఋ.వా.21-22)
మనలో చాలా మందిమి
సహజసిద్దమైన భగవత్ సాక్షాత్కార పద్దతిని అవలంభిస్తూ వుండవచ్చును. మనలో కొందరం పూజ్య శ్రీరామచంద్రజీ మహరాజ్ వారి
జీవితకాలములో ఆ ప్రత్యేక మహత్తర తరుణంలో ఆయనతో కలసిమెలసి సన్నిహితంగా కూడా మెలగి
వుండవచ్చును. ఇప్పుడు మాత్రం మనలో ప్రతి
ఒక్కరము ఆయనలోనే, ఆయనయందే స్థిరంగా వుండటానికి ధృఢనిశ్చయులమై
యుండాలి. ఆయనపైనే మన ధ్యాస ప్రగాఢమై యుండుట బాద్యతయై వేరుగత్యంతరము
లేదనునట్లుండాలి. ఎందుకంటే ఆయనే మన అంతరంగమున ఉండి మనకు మార్గదర్శకత్వము వహించుచున్నారు".
"అంతటి మహోన్నతస్థాయికి తెచ్చుటకు నీవే మా ఏకైక స్వామివి, శక్తివి".
మనము మన దివ్య
గురువర్యులతోనే వుండగలిగి ఆయన సహజమార్గ పద్దతిని ఒక ముఖ్య సిద్దాంతముగా పాటించి
ఆయన మనలో మార్పును పరిణామమును కలిగింపనిస్తే అది ఆయన ప్రేరణే. ఆయన ప్రేమ దయ మన మీద వున్నద్నటానికి సంకేతమే.
"నేను గట్టిగా
నొక్కి వక్కాణిస్తున్నాను. ఇటువంటి మహత్తర ఆధ్యాత్మిక శిక్షణ మన సంస్థలో తప్ప
మరెక్కడా పొందలేరు. ఇదియంతయు మహనీయుడైన మాగురుదేవులు లాలాజీమహరాజ్ వారి
కృపావిశేషమున జరుగుచున్నది". (ఋ.వా.25)
మన గురువుగారు ఒక
వాస్తవాన్ని ఎలుగెత్తి చెప్పటం జరిగింది. అది ఏమంటే -- "ఖచ్చితంగా ఇంతటి
రాజయోగమార్గ ప్రయాణీకులు అన్ని సమయాలలోను, యుగాలలోను తక్కువ
సంఖ్యలోనే వుంటారు. సంపూర్ణ స్వేచ్ఛను బడయనున్నవారు మాత్రమే ఈవైపునకు కుతూహలముతోను,
ఉత్సాహముతోను ఆకర్షింపబడతారు". (ఋ.వా.25)
ఈ సందర్భమునకు ఇది
చక్కగా సరిపోతున్నది. ఈ విషయములపై లోతుగా
ఆలోచించుట ప్రయోజనకరము. ఆయన వివరించినట్లు అవి, గురువుగారి
నిజమైన ఉద్దేశ్యము, ఆయన పద్దతి మరియు ఆయన సంస్థ. "భగవదీయ వెలుగు ప్రపంచాన్నంతా ఒకేసారి
ప్రజ్వలింపచేయడమనేది చాలా అరుదైన సమయాల్లో మాత్రమే జరుగుతుంది. అదీ భగవంతుడు అలా,
నిర్దేశించినప్పుడు మాత్రమే జరుగుతుంది". (ఋ.వా.29)
మన గురుదేవులు
మానవాళి కొఱకై ఎలుగెత్తి చాటిన ఈ సంఘటన ఆవిష్కరింపబడటానికి ఇంతకంటే మించిన సమయము
ఇంకొకటి లేదు. ఆయనే వ్యక్తము చేసిన విషయమిలా వుంది -- "మీరందరూ ఒక్కటై ఈ
సదవకాశమును సద్వినియోగపరచుకోండి. ప్రకృతి తన కరములను సాచి తన ఒడిలోనికి
తీసుకొనుటకు నేడు ఉత్సుకతతో వున్నది. భగవత్‌కృప సంపూర్ణశక్తివంతమై
ప్రవహిస్తున్నది. ఇటువంటి సమయము వేల సంవత్సరముల తర్వాతగానీ తిరిగి రాదు. ఇప్పుడు
చేజార్చుకొన్నవారు యుగాల తర్వాతకూడా దీన్ని మరలా పొందలేరు. తిరిగి అంతటి మహనీయుడు
ఈ ప్రపంచమున ప్రభవించు వరకు సాధ్యము కాదు.
అప్పుడు కూడా సంపూర్ణ స్వేచ్ఛ లేక సాక్షాత్కారము ఇప్పటివలే సులభము
కాకపోవచ్చును. అప్పుడు ఈస్థాయిలో ప్రయోజన
ముండకపోవచ్చును. కారణం అప్పుడు వినాశన మొనర్చు కార్యము చేపట్టబడక, నిర్మాణ కార్యక్రమమే చేపట్టబడవచ్చు. ఒక చిన్న త్యాగము చాలు, నేడు మహోన్నత ఫలితమును ప్రసాదిస్తుంది. భగవదీయమైన శక్తి ఇప్పటికే ఉధృత
ప్రవాహమైయున్నది. (ఋ.వా.31)
మనమెప్పుడు ఆయన్ను
అనుసరించి ఆయన బోధనలను తీవ్రమైన ఆకాంక్షతోను ఆతురతతోను ఆచరిస్తామో అప్పుడు మన
నిజమైన స్వస్థలము వైపునకు మరలుటకు ఉత్సహింతుము. ఆ స్వస్థలమే మనం తిరిగి చేరవలసిన
గమ్యము. దాని నుండి ఏనాడో యుగాల క్రితం ప్రక్కకు నెట్టబడి చూపుకందనంత దూరం
వచ్చేశాము.
"మనమందరం చేయి చేయి కలిపి ఈనాడు మన అదృష్టవశాత్తు లభించిన అవకాశాన్ని
సద్వినియోగం చేసుకోవాలి. సంపూర్ణ విజయం భగవంతుడాదేశించిన వానికే లభిస్తుందన్నది
సత్యం. కానీ చేసిన పరిశ్రమ ఎప్పుడూ వృధాకాదు. దాని ఫలితం దానికుండనే వుంటుంది. అది
దైవీయ శక్తి ప్రసారాలను కొనసాగజేస్తుంది". (ఋ.వా.33)
మన గురువుగారి
నిత్యసత్య బోధనలు మనకు ఆయన కృపారస ధారలు గ్రోలగల సమర్థతను ప్రసాదిస్తాయి. మనం మన
కర్తవ్యమును నిర్వహిస్తే మనం తొలుత వసించిన ఆ పరమాత్ముని సన్నిధానమునకు తిరిగి
ఆయనే మనకు దారి చూపినడిపిస్తాడన్న సత్యమును ఆయన బోధలు మనకు మరల మరల జ్ఞాపకం
చేస్తున్నాయి.
"ప్రతి ఒక్కరు
తమ అంతమును చేరుటకు సంసిద్దులై యుండవలెను. అనగా మనం అత్యంతోన్నత ఆధ్యాత్మిక
స్థితులను వీలైనంత తొందరగా పొంది అంత్య కాలము సమీపించినపుడు చింతించ నవసరంలేకుండా
చేసుకోవాలి. అందుకు భక్తి, నిరంతర స్మరణ సరియైన మార్గములు.
సర్వము ఆయన ఇచ్ఛకే వదలి వేసి భక్తి విశ్వాసములతో ధ్యాస ఆయన వైపునకు మరల్చినట్లయిన
సాక్షాత్కారము ఏమంత కష్టతరం కాదు. తన ప్రాపంచిక కార్య కలాపములన్నీ ఆయన ఆజ్ఞమేరకే
నిర్వర్తింపబడుతున్నవను ధ్యాసతో చేసుకుంటూ పోతే సాక్షాత్కారము అతి సులభముగా
పొందవచ్చును". (ఋ.వా.34)
తరచు గురువుగారు తమ
ఉత్తరాలద్వారాను, ప్రవచనముల ద్వారాను ప్రకటించినట్లు
"సహజమార్గము ఆత్మోద్దరణకై పుట్టుకొచ్చిన ఒక విప్లవము". మనము ఈ అరుదైన భగవదీయ అవకాశమును ఆయన
పవిత్రోద్దేశ్యము విజయవంతమగుటకు వీలైనంత మేరకు సద్వినియోగము చేసుకొనవలెను.
30.04.2010.
***** ****** ******
మాట్లాడేప్పుడు, చదివేప్పుడు చాలా ‘ఎఱుక’ గలిగి
ఉండాలి. పైనుండివచ్చు శ్రుతిని
అందుకోవాలంటే ఈ ‘ఎఱుక’అవసరము.
ఐనా
ఐదువేల మందిలో ఒక్కడుకూడా అట్టిఎఱుకతో వుండడు. దాన్ని అలవాటు చేసుకొని, దానిపై ధ్యానంచేసి,
దానిలో
ఏమున్నదో తెలుసుకోవాలి.
---బాబూజీ.
పూజ్యశ్రీబాబూజీ
05.9.1959 లో
శ్రీరాఘవేంద్రరావు గారికి వ్రాసిన లేఖ
(శ్రీపి.డి.గైక్వాడ్,పూణెగారు హైదరాబాద్‌లో09.07.2011
న చదివి వినిపించారు) తెలుగు
అనువాదం: పి.సుబ్బరాయుడు, కడప.
మన శరీరానికి రెండే
చేతులున్నాయి. అవి శరీరానికి అవసరమైనవన్నీ
చేసిపెడుతున్నాయి. తన పనులకోసం శరీరానికి
ఇంతకు మించి మరిన్ని చేతులు అవసరములేదు.
ఉన్నవే తనకు ఇతరులకు కూడా అన్నిపనులు చేసిపెడుతున్నాయి. ఇంతవరకెవ్వరూ మరిన్ని చేతులకోసం దేవుణ్ణి
ప్రార్థించలేదు. సాధారణంగా ఈ శరీరానికి
అవసరమైన పనులకు రెండుచేతులు చాలనుకుంటారు.
అంతేగానీ మరిన్ని చేతులుకావాలన్న ఊహే ఉత్పన్నంకాదు. అదేవిధంగా నీకోసం నీవోపనిని నిర్వహించాలని
నిర్ధారించుకోగానే చేతులు ఆపనికి పూనుకుంటాయి.
"నాకు నేనే దిక్కు" అన్న విషయం గ్రహించగానే మనిషి చాలా ధైర్యంగా
ముందడుగేయాలి. నీవు సంకల్పించిన పనికి మరో
మనిషి దొరక్కపోతే భగవంతుణ్ణి నమ్ముకొని ఆపనిని నీకైనీవే చేసుకోవాలి. అలాంటప్పుడు మొదటి ప్రయత్నంలోనే నీవు
సఫలీకృతుడవు కాకపోయినా మించిపోయిందిలేదు.
అంతలోనే నిరాశచెందాల్సిన పనిలేదు.
సత్కార్యాన్ని చేస్తూపోవడమే మనదీక్షయైపోవాలి. ఫలితం నీచేతికంది తీరుతుంది.
తన ఆరోగ్యం
సహకరించినంతమేరకైనా శ్రీ ఎక్స్ పనిచేయకపోవడం శోచనీయం. నిజానికి అతడీపనిచేస్తానని నాకు
మాటిచ్చాడుకూడా. జనులు నన్ను
మాటనిలుపుకోమని నిర్భందిస్తారు కానీ వాళ్ళుమాత్రం జ్ఞాపకంచేసినా వాళ్ళిచ్చిన మాటను
నిలుపుకొనే ప్రయత్నమస్సలు చేయరు. అంటే
వారికి నేనందించే సేవ యెడల గౌరవంలేదు.
నిజానికి నాసేవలు ఎంతధనం
వ్యయంచేసినా లభించడం దుర్లభం. నీవు,
నేను వారి ఉన్నతి, ప్రగతి కొఱకు రక్తాన్ని ధారపోస్తున్నాము.
ఇదంతా కేవలం పరహితార్థం. అంటే
తుదకు వారిమేలుకేనైనప్పటికిని వారినుండి ఏసహకారం ఆశించలేకపోతున్నాము.
మంచి వ్యాసం వ్రాయడం
అభ్యాసంపై ఆధారపడి ఉంటుంది. నీవు
ప్రయత్నించు, తప్పక వ్రాయగలవు. నీలో తెలివితేటలకు కొదువలేదు. నీకున్నది అభ్యాసలోపమేగానీ శక్తిలేకగాదు.
నేనీపనిని నిర్వహించలేనేమోనని
వెనుకాడుతుంటే ఆపనిని నీవిక ఎన్నటికీ పూర్తిచేయలేవు. ఆత్మవిశ్వాసము, ధృఢనిశ్చయముపైనే
మన విజయమాధారపడియున్నది. ఈ పని
నిర్వర్తించుటకు ఇదినీకొక మంచి అవకాశము.
ముందు నేనిచ్చిన ఉదాహరణలు నీకు సంతృప్తికరంగా లేవనిపిస్తే ఇప్పుడొకమాట
చెబుతాను విను. "నేనెప్పుడూ నిరాశా
నిస్పృహను నాలోనికి ప్రవేశింపనీయలేదు."
ఈ ఒక్క చిన్న విషయం నీవు నానుండి గ్రహించు. ఇప్పుడిక నీప్రశ్నల గురించి
విచారిద్దాం.
1.
ఒక వ్యక్తి అతీంద్రియస్థితిలో ఉండగా ఇంద్రియాలు పనిచేస్తాయా?
బాబూజీ:
ఉన్నత ఆధ్యాత్మికస్థితులన్నింటిలోనూ ఇంద్రియాలు నిరంతరం పనిచేస్తూనే వుంటాయి. ఇంద్రియ కార్యకలాపాలను నిలుపుదలచేయడమంటే
సృష్ట్యాదికి పూర్వమున్న సమత్వస్థితికి వాటిని తీసుకురావడమని అర్థం. అంతర్గత చలనమెప్పుడూ ఉండనేవుంటుంది. అలా వుండకపోతే ప్రాణం నిలువదు. మన ఇంద్రియాలు సద్వినియోగపడేటట్లు చూడాలి. తద్వారా వాటిపరిధిలోనే అవి
సమత్వస్థితినుత్పన్నం చేసుకోగలగాలి.
2. జడసమాధిస్థితిలో వలె మన పురోగమనమార్గంలో
శరీరాన్ని మరియు శరీరమున్నదన్న భావాన్ని (అంటే శరీరానికైన గాయాలను) కూడా మరచిపోయి
వుండగల్గుస్థితి ఒకటేదైనా సంభవిస్తుందా?
బాబూజీ: సుధీర్ఘ ఆధ్యాత్మిక పురోగమనస్థితులలో మనం
శరీరపుటునికిని ఆత్మ ఉనికిని కూడా మరచిపోతాం.
ఉదాహరణకు ఒక వ్యక్తి ఇతరులు చేయమని చెప్పిన పని మరచిపోవడం తరచూ జరుగుతూ
ఉంటుంది. కానీ ఆ విషయం జ్ఞాపకం చేస్తే
మళ్ళీ అతని జ్ఞప్తిలోనికొస్తుంది. ఎందుకలా
అవుతుంది? ఆ విషయానికి
సంబంధించిన గురుతులక్కడ మసక మసకగా ముద్రింపబడి వుంటాయి. జడసమాధిస్థితి ఒకానొక ప్రత్యేక పద్దతి ద్వారా
ఏదో ఒక నిర్ణీత సమయానికి ఉపయోగపడేలా అరువుతెచ్చుకోబడుతుంది. వ్యక్తి ఆసమయంలో శరీరానికి తగిలిన
గాయలనొప్పికూడా అనుభవించడు. అతడు తిరిగి
జాగ్రదావస్థకు వస్తేనేగానీ ఆబాధ అనుభవంలోనికిరాదు. మనం సహజసమాధి స్థితికోసం
ప్రయత్నిస్తున్నాం. ఈస్థితిలో అన్నీ
వుండికూడా నిరామయస్థితిలో వుండిపోతాం.
3. పురోగమనమార్గంలో ప్రశాంతత తప్ప మరేయితర అనుభవము
లేకుండాఅత్యంతోన్నోతస్థితినందుకొన్న సంఘటనలున్నాయా?
బాబూజీ: నా అభిప్రాయానికి అనుకూలంగా మాగురుదేవులు
చెప్పిన మాటలనుదహరిస్తాను. "వారి
ఆధ్యాత్మిక జీవితకాలమంతటిలోనూ ఏవిధమైన అనుభవమూ లేకుండానే ఉన్నతోన్నతస్థితుల
నందుకున్న వారెందరో ఉన్నారు."
ఎవరైననూ మహోన్నతస్థితి నందుకొని మహాత్ముడౌతాడుకానీ కేవలం భావనామాత్రమున
కాదు.
నేను నాగురుదేవుల
సత్సంగమునుండి ఒక ఉదాహరణ మాత్రమిచ్చున్నాను.
ఆయన నాదినచర్య పుస్తకములను నాసహచరుల ముందుంచి అందులో వ్రాసియున్న స్థితులను
విశ్లేషించమనే వారు. అంతేగాక నా
విషయవ్యక్తీకరణ కూడా గమనించమనేవారు. అది
గమనించి విషయ వ్యక్తీకరణ ఎలావుండాలో వారుకూడా నేర్చుకుంటారని ఆయన ఉద్దేశ్యం. ప్రతీ చిన్నవిషయాన్ని కూడా నిశితంగా
గమనించగల్గిన వ్యక్తిని నేనొక్కడినేనని మాగురుదేవులు తరచూ నన్నుదహరించేవారు. ఇది వాస్తవం.
ఈ గుణాన్ని నేను నాగతజన్మనుండి గ్రహించి వృద్ధిచేసుకొన్నాను. గాలికెరటాల కదలికను సైతం గమనించగల్గేటంతటి
సున్నితత్వం నాచిన్నతనములోనే నాకుండింది.
కేవలం చెమట వాసనతోనే నేను ఒకవ్యక్తియొక్క స్వభావాన్ని
గుర్తించగలిగేవాణ్ణి. నేనిలాంటి
సూక్ష్మగ్రాహకతనెలా గడించాననేది ఇప్పుడు ప్రశ్న.
నేను నాపరిసరముల స్థితిగతులను గమనిస్తూనే నాగురుదేవుల స్మరణలో నిరంతరం
నిమగ్నమై వుండేవాడిని. అదేసమయంలో
ఈపనితోపాటు నేను నాగురుదేవుల లయావస్థకు సన్నిహితమైన లయావస్థ స్థితిని నాలో
ఉత్పన్నం చేసుకొనేవాడిని. అదృష్టవశాత్తు
నేను దాని లవలేశాంశమును కల్గియుంటిని.
నీవుగానీ లేక మరెవరైనాగానీ ఇదేపనిచేస్తే ఇక అనుభవాల దిశలో పురోగమించటంలేదన్న
వాదనే ఉత్పన్నంకాదు.
4. అతీంద్రియస్థితిని ఎలా గుర్తించగలం?
బబూజీ: అతీంద్రియస్థితికి సామాన్యస్థితికి గల తేడా
గుర్తించడమెలా అంటూ నాకు ఒక చిత్రమైన ప్రశ్నవేశావు. నీ ఆకలి శాంతించిందని ఎలా తెలుసుకుంటావో
చెప్పుచూద్దాం! నీ ఆకలి శాంతించిందని నీకు
అనిపించేటట్లుచేసే ఒకానొక ఏర్పాటు నీలోనే వుంది.
అతీంద్రియమంటే నిన్నునీవుదాటి పైకెళ్ళడమే. నీకు శుభ్రతకు అశుభ్రతకు
తేడాతెలుసు. మొదటిది ఆహ్లాదకరమైనది
తర్వాతది అనాహ్లాదమైనది.
నీవేర్పరచుకొన్న నీజీవిత
బాహ్యాంతరస్థితులే కలలు. ఇందులో గత
సంస్కారముల ముద్రలు నిద్రాణస్థితిని సంతరించుకొని యుండును. మన సంస్కారముల ముద్రలను కలలో కూడా కడిగేసుకోవడం
జరుగుతుంది.
5. ఉత్సవములనుండి, ఫౌండర్స్‌డే కార్యక్రమములనుండి వీలైనంత ఎక్కువ ఆధ్యాత్మిక ప్రయోజనం ఎలా
పొందగలం?
పూజ్యశ్రీబాబూజీ మహరాజ్
గారు శ్రీ రాఘవేంద్రరావు గారికి 05.02.1956లో వ్రాసిన లేఖలో ఈవిధంగా
తెలియజేశారు.
నీకు ఉత్సవఆహ్వాన పత్రిక,
కార్యక్రమాల వివరాలు అందేవుంటాయి.
మంచిది. అయినానేను మరోసారి వ్రాస్తున్నాను. 15,16 తేదీలలో ఉదయం
సాయంత్రాలు 6-30 నుండి 7-30 వరకు, 17న ఉదయం అదేసమయానికి
తప్పకుండా ధ్యానంలోకూర్చో.
అంతేగాకుండా ఈమూడు దినాల్లో
స్మరణ, ప్రార్థన, ధ్యానంలో నీవు
నిరంతరాయంగా నిమగ్నమై వుండటానికి ప్రయత్నించు.
సమయం దొరికినప్పుడల్లా రాత్రింబవళ్ళు వీలునుబట్టి ధ్యానంలోకూర్చో. ఇతరులుకూడా ఇదే విధానాన్ని పాటించాలి. విషయం
అందరికీ తెలియజేయి. సంక్షిప్తంగా
చెప్పాలంటె మీరు ఈసమయమంతా ఆధ్యాత్మిక సాగరంలో మునిగివుండండి.
--00o00-
అభ్యాసులు
మరియు ప్రశిక్షకులకు సాధారణ సూచనలు
తెలుగు
అనువాదం: పి.సుబ్బరాయుడు, కడప.
I. సాధనకు సంబంధించినవి
1.
ఎవరైనను మహోన్నతమైన దానినే ఆశించవలెను. శాంతి మరియు ఇతరములు తర్వాతి ప్రాధాన్యతలో
నుండవలెను. మహోన్నతమైన దానిని ఆశించు అభ్యాసి నిజమైన సహజమార్గ సభ్యునిగా గుర్తింపబడును.
2.
అభ్యాసము పద్దతి ప్రకారము సక్రమముగా చేసుకొనవలెను. ధ్యానమున శ్రద్దకలిగిందంటే
సగంపని పూర్తియైనట్లే.
3.
ధ్యానము పూర్తికాగానే తన అంతర్గత స్థితిపై అట్టే మనసు పెట్టాలి. అది అతడు సూక్ష్మత
(చురుకుదనం) పెంపొందించు కొనుటకు సహాయపడుతుంది.
4.
ధ్యాన సమయమున గాని ఇతర సమయములలో గానీ ఉత్పన్నమగు ఆలోచనలకు చింతించరాదు. అవి
నశించుటకే ఉత్పన్నమౌతున్నాయి. సంపూర్ణముగా ఆలోచనలే లేకపోవుటన్నది అసాధ్యము.
5.
నేను అభ్యాసులను శుద్ది చేస్తూ పోతుండటం సామాన్యంగా గమనిస్తుంటారు. కానీ వారు
మాత్రం తమ స్థితిని పాడు చేసుకుంటూనే పోతున్నారు. ఇలాగైతే మరి ఎలా? వారు పురోగమించగలరా? వారు నాతో సహకరిస్తే వీలైనంత
ఎక్కువ ప్రయోజనం పొందుతారు.
6.
భగవత్ సాక్షాత్కారానికి తపనను పెంపొందించుకోవాలి.
7. అభ్యాసులు బుద్దినుపయోగిస్తూ గురువును
అనుసరించాలి.
8.
కోపాన్ని పూర్తిగా నిర్మూలించడం సాధ్యంకాదు. కారణం అది భగవంతునిచే
ప్రసాదింపబడినది. దానిని సద్వినియోగ పరచుకోవాలి. కానీ దురాశ మాత్రం మన స్వంత
సృష్టి. దీనిని పూర్తిగా నిర్మూలించివేయాలి. ఆధ్యాత్మికత కొఱకు సైతం దురాశ
పనికిరాదు. కొంతమంది అభ్యాసులు ప్రశిక్షకుల వద్ద మాటి మాటికి ధ్యానానికి
కూర్చోవడానికి దురాశ కనబర్చడం గమనిస్తున్నాను.
9.
మార్పును రెండువిధాలుగా తీసుకొని రావచ్చును. మొదటది దాన్ని ఆశించడం ద్వారా, మరి రెండవది బలవంతం ద్వారా. రెండవదానిలో తరగులేకుండా కొనసాగే ప్రభావం
లేదు. కనుక ప్రతి అభ్యాసి మార్పును తీవ్రంగా ఆశించాలి.
10.
వ్యక్తి తన స్వేచ్ఛా ప్రవృత్తిని అదుపుచేసుకోవాలి. దశనియమములు ఆ ప్రయోజనం కోసమే
ఉన్నాయి.
11.
అభ్యాసి తన అనుదిన సాధారణమైన చిన్న చిన్న విషయాలలో సైతం అదుపులో ఉండాలి. లేకపోతే
వారినుండి పెద్ద విషయాలపై అదుపు/అధికారం ఎలా ఆశించగలము?
12.
పవిత్ర జీవనం ఎట్లయినను మనం ముఖ్యంగా కోరుకోవాలి. అన్ని విషయాలలో మనం మితం
పాటించాలి. పవిత్రత మరియు మితం మనిషి శీలాన్ని వ్యక్తపరుస్తాయి.
13.
మంచి చెడుల మధ్యగల తేడాను మనిషి నిర్ధారించగలగాలి. అట్టి విచక్షణ లేకపోవడమనేది
అధమపురుష లక్షణము.
14. అభ్యాసి తాను ప్రశిక్షకుడను
కావలెనన్న యోచనతో ఉండరాదు. సంస్థకు సేవచేయవలెనను యోచన వుంటే అలా చేయడానికి సంస్థలో
ఇతరమార్గాలు చాలా వున్నాయి. వాటి ద్వారా సేవ చేయవచ్చును.
15.
సంపూర్ణ సమస్థితిని సాధించడము అసాధ్యము. ఎందుకంటే సంపూర్ణ సమత మరణాన్ని
ప్రాప్తింపజేస్తుంది. కానీ మనిషి దాని అత్యంత సమీపస్థితిని చేరవచ్చును. అక్కడ అతడు
దాదాపు సమస్థితిలో వుండును.
16.
ఒకదాన్ని ఇష్టపడడమంటే అది అహంకారమే. కనుక మనిషి ఇష్టాయిష్టాల కతీతంగా ఎదగాలి.
II. నీతి, క్రమశిక్షణకు సంబంధించినవి
1. మనిషి తన ప్రవర్తన వక్రత (చెడునడత)చెందకుండా
జాగ్రత్తపడాలి.
2. ప్రతి అభ్యాసి నీతి క్రమశిక్షణను
పెంపొందించుకోవాలి.
3. సోమరితనాన్ని మనిషి అధిగమించాలి. పరిపాలకుల
సోమరితనం వల్లనే గొప్ప గొప్ప సామ్రాజ్యాలు పతనమై పోయాయి.
4. ఆడ మగ అభ్యాసుల మధ్య కొంత మర్యాదపూర్వకమైన
దూరాన్ని పాటించాలి. ఆడవారు ఆడవారితోను, మగవారు మగవారితోను కలిసియున్నంత స్వేచ్ఛగా ఆడ మగ కలిసిపోరాదు.
5.
మత్తు పానీయాలు వదిలి వేయవలెను. మత్తులో
పదార్త ప్రభావమున్నది. అది మెదడును తమస్సున ముంచి ఆధ్యాత్మికతను అడ్డగించును.
6. అభ్యాసి అన్ని విషయములలోను పొదుపుగా నుండవలెను.
అతడు ఖర్చు చేయునది ఐదు రూపాయలా లేక ఐదువేల అన్నది కాదు ముఖ్యం. అది అనవసరమై
మాత్రం ఉండరాదు.
7. నిరాడంబరత ప్రకృతికి ప్రాణం. ప్రతి ఒక్కరూ
దానిని అనుకరించాలి. మన సంస్థలో వున్న ఆకర్షణ ఏ ఆకర్షణా లేకపోవడమే. ఇదే మన సంస్థ
యొక్క గొప్ప ప్రత్యేకత. అది స్వచ్ఛము మరియు సరళము.
8.
అభ్యాసి తను తప్పుడు ప్రచారములో పాల్గొనరాదు.
9.
గొప్పతనము, వినయము విధేయతలోనే ఇమిడియున్నవి. కనుక ప్రతి అభ్యాసి
ఈ గుణములను వృద్ది చేసుకొనవలెను.
10.
అభ్యాసులు తమ స్నేహితులు/బంధువులను మరియు ఇతరులను అనగా అభ్యాసులు కాని వారిని
ఉత్సవ సమయములలో వెంటబెట్టుకొని వచ్చుట మానుకొన వలెను.
రామచంద్ర
తేదీ: ఫిబ్రవరి, 1981. అద్యక్షులు.
$=$=$=$
సహజమార్గము
- రాజయోగసాధన
సేకరణ:
శ్రీ యం.గిరిధర రెడ్డి, కడప.
సాధనచతుష్టయము
: వివేకము, వైరాగ్యము, షట్సంపత్తి,
ముముక్షుత్వము
మానసిక
ప్రవృత్తులు: క్షిప్తము, మూఢము, విక్షిప్తము, ఏకగ్రత,
నిరోధము
అష్టాంగయోగము : యమ, నియమ,
ఆసన, ప్రాణాయామ,
ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి
షట్సంపత్తి : శమ, దమ, ఉపరతి, తితీక్ష, శ్రద్ధ, సమాధాన
సంపత్తులు
సాధన
విధానములు: కర్మ, ఉపాసన, జ్ఞానము
సమాధి : మూడురకములు
పదవులు : వసువు, ధ్రువుడు, ధ్రువాధిపతి, పారిషద,
మహాపారిషద పదవులు
సాధన
చతుష్టయము:
I.
వివేకము :-
భక్తి, ప్రేమ, నియమనిబద్ధమైన యోగసాధనలను విడువక చేయునపుడు
వివిధ దశలందు వృద్ధిచెందెడి మానసిక స్థితియే వివేకము. ఇంద్రియములన్నియు సమూలముగా
పరిశుద్దము గావింపబడిననేతప్ప వివేకము వృద్ధిపొందదు. మానసము చక్కగ క్రమబద్దము, సుశిక్షితము కావింపబడి అహంకారము పరిశుద్ధ స్థితిని గైకొన్న మీదటనే ఇది
సంభవించును. ఈ రీతిగ కోరిన ఫలితములను
సాధించుటకు అనుసరించిన సాధనల ఫలితమే వివేకము.
ఒక వ్యక్తి తన తప్పులు,
లోపములు గుర్తింపనారంభించి తన హృదయాంతరాళమున వాటికై పశ్చాత్తాపపడుటే
వివేకముయొక్క వాస్తవ రూపము.
II.వైరాగ్యము లేక అనాసక్తి:-
వేదాంతుల ద్వితీయ సాధనయగు
వైరాగ్యము వివేకముయొక్క ఫలితమే.
వైరాగ్యమనునది నిజముగా మనస్సుయొక్క అంతర్గతమగు స్థితి. అది వస్తువుల క్షణభంగురత, పరివర్తనాశీలతలను మన దృష్టికి తెచ్చి, వాటిపై
నిర్వ్యామోహ భావము కల్గించును. విరాగియగు
వాని దృష్టి పరివర్తనారహితమును శాశ్వతమునగు సత్యము మీదనే సదా లగ్నమైయుండును. అతడు ప్రీతి, ద్వేష
భావములు లేకుండును. వైరాగ్యమనగా యిదియే. వైరాగ్యమనగా ప్రాపంచిక వస్తువులపై వ్యామోహము
లేకుండుటేగానీ, వస్తువులను కల్గియుండకపోవడము కాదు. వైరాగ్యమలవరచుకొనకున్నచో మాయాజాలమునుండి
తప్పించుకొనజాలము. నిశ్చితాత్మక
దృక్పథముతో ఒకటేవిషయమును సత్యమని గ్రహించి హృదయపూర్వకముగా దానినంటిపెట్టుకొని
యున్నచో ఇతర విషయములు సహజముగనే అప్రధాన్యములైపోవుటతో క్రమేపి నీవు వాటిని గమనించనే
గమనించని స్థితికివత్తువు. ఇందుమూలమున
వాటితోడి నీసంబంధము క్రమముగా మాసిపోవుటకారంభమగును. దీనితో అతిసులభ మార్గమున వైరాగ్యసాధన సమకూరును.
III.
షట్సంపత్తి:-
1. శమము: మనస్సును క్రమబద్దముచేసి, చక్కగా రూపొందించుటపై మనదృష్టిని కేంద్రీకరించుట.
2. దమము: ఇది సమర్థుడైన గురువర్యుని నుండి
ప్రసారితమైన శక్తిమూలమున తేలికగా సమకూడును.
సత్యము, నిత్యమునైన ఒకేధ్యేయముపై మనస్సునునిల్పి
తదితరములన్నింటిని సరకుచేయక పోయినచో ఇంద్రియనిగ్రహము (దమము) తనంతకుతానుగానే సమకూడును.
3. ఉపరతి: అనగా ఆత్మ నిస్సంగత్వము. ఈస్థితియందు మానవుడు అన్నికోరికలకు, పరలోకమునకు సంబంధించిన కోరికలకుకూడా అతీతుడైయుండును. ఈ ప్రపంచముననేదియు అతనిని
ముగ్ధునిగావింపదు. ఆకర్షింపదు. అతని మనస్సు సర్వదాఒకేదానిపై కేంద్రీకృతమైయుండును. అదే సత్యము.
ఈ దశయందు మనస్సు, ఇంద్రియములు సమగ్రముగా పరిశుద్దమగును.
4. తితీక్ష: ఈ దశయందు మానవుడు తనకు
దేవుడిచ్చినదానితో సంపూర్ణతృప్తిని పొందియుండును.
బాధావమానములు, దూషణభూషణలు అతనినేమియూ
చేయజాలవు.
5. శ్రద్ధ:
శ్రద్ధ వాస్తవరూపమున మర్త్యుని అమరునితో కలిపెడి ఒక ఉల్లాసకరమగు
సంబంధము. శ్రద్ధ నిజముగా ఆధ్యాత్మిక
నిర్మాణమునకంతకు ఆధారపీఠము. నీవు
నిక్కముగా విజయము కోరినచో, సత్యమునందు శ్రద్ధ, సాక్షాత్కారమునకై నీవనుసరించు మార్గమున శ్రద్ధ, విధేయతతో
నీవుసేవించుచున్న యోగ్యగురువునందు శ్రద్ధ -
ఇవియే నీఆధ్యాత్మిక మహాసౌధమునకు పునాది.
ఈ శ్రద్ధ పాదుకొన్నచో
నీలోనొక అంతఃశక్తి నిన్నావరించిన దుష్టశక్తులనన్నింటిని విదలింపజాలినంత ధృఢముగా
ఉత్పన్నమగును. అది నీకవసరమైనపుడెల్ల
కొంగ్రొత్త దైవప్రేరణనాకర్షించుటకు సహాయపడును.
నిజమైన శ్రద్ధ చెప్పరాని
సద్గుణము. అది మతపరిధికి అతీతమైనది. సడలని ధైర్యమే మనకు విజయమును చేకూర్చును. ఆ సర్వవ్యాపకశక్తియే మనదారిని
స్నిగ్ధమొనర్చును. వాస్తవమున అదొక్కటే
మనజీవిత సమస్యను పరిష్కరించునది.
6.
సమాధానసంపత్తి: ఇది ప్రభుని ఇచ్ఛతో సమాధానపడి ఏఎఱుకయూ లేకుండుస్థితి. ఈ దశయందు మానవుడు ఆ సర్వొత్కృష్ట ప్రభువుకు
సంపూర్ణముగా దాసుడై ఇతరాలోచనలేమియు లేకుండును.
IV. ముముక్షుస్థితి :-
ఈ దశకు వచ్చిన పిమ్మట
మానవుడు సాధించవలసినది పరిపూర్ణ సత్యముతో సన్నిహిత సమ్మేళనము పెంపొందించుకొనుట లేక
రూపరహిత స్థితిలో ఐక్యము సాధించుట తప్ప ఇంకేమియూలేదు. ఇది సాక్షాత్కారమార్గమున అనుభవసాధ్యమగు దశ.
మానసిక
ప్రవృత్తులు :-
1.
క్షిప్తము: ఇది ఆకలి, దప్పిక,
కోపము, దుఃఖము వంటి భావములు, కీర్తి, సంపదలువంటి వాటి వలన కల్గిన విచలిత మానసిక
స్థితి.
2.
మూఢము : ఇందు సోమరితనము, మాంద్యమును పెంపొందించు ప్రవృత్తులు ఉన్నవి.
3.
విక్షిప్తము : మనస్సును పవిత్రభావములనుండి దూరముచేసి ధ్యానకాలమున ఆలోచనలను
పుట్టించును.
4. ఏకాగ్రము
: మనదృష్టిని ఏకైకవిషయముపై లగ్నము
చేయించును.
5.
నిరోధము : ఇది మనస్సునుండి చిక్కులను
తొలగించి పరిపూర్ణమగు అచంచలస్థితికి తీసుకొని వచ్చును.
అష్టాంగయోగము:-
1. యమ :
అహింస, సత్యం, అస్తేయం (Non-stealing),
బ్రహ్మచర్యం. అపరిగ్రహం.
2. నియమ : శౌచం, సంతోషం, తపస్సు, సాధ్యాయం,
ఈశ్వరప్రాణిదానం (surrender
to God).
3. ఆసన
: ధ్యానం చేసుకొన వీలైన సుఖాసనము.
4. ప్రాణాయామ
: శ్వాసను నియంత్రించడం (regulation
of vital force).
5. ప్రత్యాహార :
మనస్సును, ఇంద్రియాలను నిగ్రహించడం.
6. ధారణ
: సమ్మతితో భగవంతుణ్ణి హృదయకమలమున
దాల్చడం.
7. ధ్యానము
: ధ్యేయవస్తువుపై మరిమరి
మనస్సునుంచుట.
8. సమాధి
: అతీంద్రియస్థితిలో ఎఱుక
కలిగియుండుట (superconscious state or trance).
సమాధి
మూడురకములు: -
1. మొదట తన్నుతాను కోల్పోయినట్లుగానీ
మునిగిపోయినట్లుగానీ అనుభూతిచెందుట.
2. ఈ దశలో మానవుడు ఒకధ్యేయముమీద మనస్సు
నిలిపిన వాడైనప్పటికిని అందు
నిమగ్నమెనట్లు కానరాడు. తనకు తెలియకనే
సక్రమముగా ప్రవర్తించుచుండును.
3. ఇది సహజసమాధి స్థితి. ఇది మనస్సు కేంద్రీకరించుటయందు అత్యుత్తమస్థితి. ఈ స్థితియందు మానవుడు తనపనితాను చాకచక్యముగా
నిర్వర్తించుచుండును. అదే సమయంలో
మనస్సుకూడా ధ్యేయమందు లీనమైయుండును.
పదవులు:-
1. వసువు:- సమర్థవంతమైన శిక్షణావిధానమున అభ్యాసి బాహ్యమైన శక్తులగూర్చి ఎరుగనిస్థితిలోనుంచబడి, గురువునుండి ప్రసారితమైన శక్తి సహాయపడుచుండగా స్వచ్ఛమైన ఆధ్యాత్మికముతప్ప
తదితరములతనిని ఆకర్షించకుండునట్లు చేయబడును.
అప్పుడాతడు తనకప్పగించిన చిన్నచిన్న దైవకార్యములొనరించుటకు
తగియుండును. ఈదశయందాతని కార్యరంగము ఒక
చిన్న ప్రదేశము ఉదా: ఒక పట్టణముగాని, జిల్లాగాని, అటుగాక కొంత పెద్దవిభాగముగాని కావచ్చును.
అతనిపని ఎట్టిదనిన అతని యాజమాన్యము క్రిందనున్న ప్రదేశమందంతటనూ సంపూర్ణ
ప్రకృతిధర్మానుసారముగా ప్రతిదానిని చక్కదిద్దుటే.
అతని పరిధిలో లోపములున్నచో అతడు పూరించును. అవాంఛితములున్నచో వాటిని తొలగించును. అతడు ఋషియని పిలువబడును. అతని పదవి వసువు.
2. ధ్రువుడు: ధ్రువునిస్థానము వసువుకంటే ఉన్నతమైనది. అతడు బ్రహ్మాండమండలముపై యాజమాన్యము
వహించును. అతడు మునులవర్గమునకు చెందును. అతడు వసువులపై పూర్తి అధికారము వహించును. అతని కర్తవ్యమేమన అంతరంగముననున్న వాతావరణమున అవాంఛనీయ
భావములు మరియు ఆలోచనలను పరిశుద్ధముగావించుట.
దైనందిన కార్యక్రమముతోపాటు అతడు తాత్కాలికముగా తనకప్పగించబడిన పెక్కితర
కార్యములనుకూడా నిర్వహింపవలసియుండును.
శరీరనిర్మాణమునగల హృదయ నికటస్థానమును(hylam-shadow)సంపూర్ణముగా
ప్రకాశింప జేసుకొన్నవారికి ఈ కార్యమప్పజెప్పబడును.
3. ధ్రువాధిపుడు : ధ్రువుల కార్యకలాపములను
పర్యవేక్షించును. ఈ స్థితి నాభిస్థానముపై
యాజమాన్యము గడించినమీదట పొందనగును. ఇతని
కార్యరంగము ప్రపంచమునకంతకూ వ్యాపించును.
పనిమాత్రము ధ్రువునిపనిని పోలినది.
వాతావరణము పరిశుద్ధపరచుటకు సంబంధించిన దైనందిన కార్యమునకుతోడు ఇతడునూ
అప్పుడప్పుడు జరుగు హఠాత్సంఘటనలు, సంభవములను
గమనింపవలెను. ఈ దైవీయకార్యకర్తలు
మహశక్తిసంపన్నులైన గొప్ప పరిణతిచెందిన ఆత్మలు.
వారు తానను భావము అణుమాత్రమునులేకుండ ప్రకృతియొక్క ఇచ్ఛానుసారముగ పనిచేయుదురు. వారిపనులు యాంత్రికముగా జరిగిపోవును. ఏవిషయమునందు వారికి వ్యక్తిగత స్వేచ్ఛగాని,
నిర్ణయాధికారముగాని లేదు.
4. పారిషదపదవి :
ప్రకృతికి అత్యంతావశ్యకమైనట్టి ప్రత్యేక పరిస్థితులందే ధ్రువాధిపతికంటే
ఉన్నతమైన పారిషదపదవి యొసగబడును. ఇతడు పైన
పేర్కొనిన వివిధ కార్యకర్తల కార్యకలాపములన్నియూ క్రమబద్ధముజేయును, మార్గదర్శకత్వము నెఱపి ముఖ్యమైన పనులను తాను నిర్వహించుచు వివిధ
కార్యములను వారికి నిర్దేశించుచుండును.
గొప్ప వ్యాపారములు, యుద్ధములవంటి అనేక
ముఖ్యవిషయములందును విధివిధాయక ఫలితములను సమకూర్చుటకై అతని ఇచ్ఛాశక్తి
పనిచేయును. నిర్మాణాత్మక, వినాశాత్మక ప్రకృతి ప్రణాళికలన్నియూ అతడే నిర్వహించును. అతని కార్యరంగము ఈ ప్రపంచమునకు మాత్రమే
పరిమితమైనది. మానవుడు సహస్రదళకమలము యొక్క
కేంద్రబిందువుపై యాజమాన్యము గడించిన మీదట ఈస్థితి ప్రాప్తించును.
5. మహాపారిషదపదవి: మహాపారిషద పదవి పదవులలోకెల్ల ఉన్నతమైనది. అది చిట్టచివరి దైవీయ పదవి. చాలా అరుదుగా పొందదగినది. ప్రకృతి అత్యంతావశ్యకముగా పరిణామము
చెందవలసియున్నప్పుడుగాని, ప్రపంచము పరిశుద్ధి గావింప
వలసినపుడుగాని ఈ పదవి యొసగబడును. ఈ
పదవినందినయతడు అత్యంతోన్నత
శక్తిసంపన్నతననుభవించును.
రాజయోగమున పొందనగు
అద్భుతమైన సిద్ధులు యివి. శ్రద్ధగల
ప్రతియొక్కడును, సరియైనమార్గముననుసరించి, సరియైన గురువునాశ్రయించినచో వీటిని పొందనగును.
--o0o-
ప్రార్థన
అంటే యాచించడము. ధ్యానమంటే పొందడము.
---బాబూజీ.
మన
ప్రియమైన లక్ష్యానికి మార్గము
(పూజ్యశ్రీ బాబూజీ రచనల నుంచి సేకరణ - పి.డి.గైక్వాడ్, పూణె)
అనువాదం:
ఎల్.ఎస్.ఆర్.కె.ప్రసాద్, విశాఖపట్టణం.
1. మన సహజ స్థితిని - అంటే మనం ప్రప్రధమంగా ఈ
ప్రపంచంలోకి వచ్చినప్పుడు ఉన్న స్థితిని - పొందడమే మానవ జీవితపు లక్ష్యం. ‘దానితో’ (ఆ స్థితితో) ఏకం అయిపోయిన మన దివ్య
గురువుగారిలో లయావస్థను పొందుట ద్వారా ఆ స్థితిని తేలికగా పొందవచ్చు. ఇదే ‘సహజ మార్గము’.
2. ఆ పద్ధతి ధ్యానము (గురువుగారు నిర్దేశించిన
విధంగా), నిర్మలీకరణ, ప్రార్థన, మరియు నిరంతర స్మరణ. లయావస్థను
ప్రయత్నించి పెంపొందింప జేసుకొవడం పూర్తిగా అభ్యాసీ బాధ్యత. అది భక్తి మరియు నిరంతర స్మరణ ద్వారా సాధ్యము.
3. మితతత్త్వాన్ని మరియు సమతూకాన్ని యధాస్థితికి
తెచ్చినగానీ (లక్ష్యము యొక్క) సాక్షాత్కారము
సాధ్యం కాదు. మితతత్త్వమంటే
ఇంద్రియాలలోను, సహజశక్తులలోను సమతూకముండుటయే. ఈ సమతూకం, ఏదైనా పనికి
సహజంగా ఆ సమయంలో ఎంత అవసరమో అంతకు ఎకువగాని, తక్కువగాని
కాకుండా, మనస్సుపై ఏ మాత్రం దాని ముద్ర లేని విధంగా
వుండాలి. గురువుగారు ఈ స్థితిని
"ఇంద్రియ సమూహం సంగ్రహం చేయబడిన స్థితి" అని వర్ణించారు.
4. మితతత్త్వాన్ని అభివృద్ధి చేసుకోవడానికి మనం మన
బాహ్య జీవన విధానాలపై కూడా ప్రత్యేకమైన శ్రద్ధను పెట్టవలసి వుంటుంది.
ఉదాహరణకు:
1. మృదువైన మరియు సభ్యతతో కూడిన భాష.
2. మర్యాద గల వ్యవహారాలు.
3. తోటివారిపట్ల సానుభూతి
మరియు ప్రేమ.
4. పెద్దల యెడల గౌరవం.
5. ప్రతీకార బుద్ధి లేకుండుట.
6. ఇతరుల దోషములను
ఎంచకుండుట. ఇది మీ అంతరంగంలో
ముద్రలను ఏర్పరుస్తుంది మరియు ఆధ్యాత్మిక
పురోగతిని
మందగింపజేస్తుంది.
7. కాలమును వృధాచేయకు - దానిని
నిరంతర స్మరణకు
ఉపయోగించు.
8. యుక్తమైన ఆలోచనలను చేయుట,
యుక్తమైన పనులను
ఆచరించుట, దైవీ లక్షణములు కల్గియుండునట్లు నీ మనస్సును
తీర్చిదిద్దుకో.
9. వినయం, సరళత్వం మరియు సహనములను పెంపొందించుకో.
పక్షపాతం, కోపం, ద్వేషం మరియు అమర్యాదలను దగ్గరకు
చేరనీయవద్దు.
10. అన్ని పరిస్థితులలోను
పవిత్ర జీవనమునకే ప్రాముఖ్యతనిచ్చుట.
5. భక్తి మరియు సరియైన అభ్యాసం ద్వారా వ్యక్తిగత
వివేకాన్ని మరియు అనుభవాన్ని తనకు తానే పెంపొందించుకోవాలి.
6. గతాన్ని గురించి ఆలోచించకు. అది ముద్రలను ఏర్పరుస్తుంది మరియు తత్ఫలితంగా
మనం సమయాన్ని వృధాచేస్తాం. కాని మనం
భవిష్యత్తుని నిర్మించుకొనాలి. అదే
వివేకము.
7. ఒక క్రియను నాటు - నీవు ఒక అలవాటును
పొందుతావు. ఒక అలవాటును నాటు - నీవు ఒక
శీలమును పొందుతావు. ఒక శీలమును నాటు -
నీవు నీ గమ్యాన్ని పొందుతావు. అన్ని
సందర్భాలలో సచ్చీలత, వ్యక్తిగత శ్రమఫలమే. దానిని తల్లిదండ్రుల నుంచి వారసత్వంగా
పొందలేము. అది బాహ్య అనుకూలతలవల్ల సృష్టింపబడదు;
అది వ్యక్తి యొక్క స్వయం కృషి ఫలితమే - నైతిక మరియు గౌరవప్రదమైన
ప్రవర్తనలో ప్రకటితమయ్యే మంచి ఆచరణీయ సూత్రాల ఫలము మరియు బహుమతి - జె.హాలెస్.
ఒక మంచి హృదయం, దాతృత్వ భావనలు మరియు సమత్వంతో కూడిన మనస్సు - ఇవి శీలానికి పునాదిగా
వుంటాయి.
8. క్రమశిక్షణ ప్రాపంచిక వ్యామోహాల నీచత్వాన్ని
సరిదిద్దుతుంది. మంచి గుణాలతో హృదయాన్ని
దృఢతరం చేస్తుంది. ఉపయుక్తమైన జ్ఞానంతో
మనస్సును తేజోవంతం చేసి అంతరంగంలోనుంచి ఆనందాన్ని లభింపజేస్తుంది. అందుచేతనే శ్రీ లాలాజీగారు ప్రేమతో కూడిన
ఖచ్చితమైన క్రమశిక్షణను ఎప్పుడూ అమలు చేయకుండ వుండలేదు.
9. హృదయం నుంచి కోపం మరియు ప్రతీకార వాంఛలను
తొలగించి శత్రువును ప్రశాంతతో ఎదుర్కో.
రాముడు, కృష్ణుడు, మహమ్మదు మరియు క్రీస్తు ప్రపంచంలోని
కష్టములను, దారిద్ర్యమును మరియు అన్యాయమును
తొలగించలేకపోయారు. ప్రపంచం అసమానతల మరియు
పరస్పర విరుద్దాల గృహం. వీటిని గనుక
సమతూకంలోనికి తెచ్చినట్లయితే, అది సృష్టియే లేనప్పటి
మొట్టమొదటి సమతూక స్థితిని పోలివుంటుంది.
ఆ సమతూకానికి భంగం కల్గినప్పుడే ఈ ప్రపంచం అస్థిత్వంలోనికి వచ్చినది. ప్రపంచంలో సమతూకాన్ని తెచ్చుటలో ఎవరూ విజయం
పొందలేరు. పరస్పర విరుద్దాలను తీసివేసినట్లయితే
మనస్సు పనిచేయలేదు మరియు అప్పుడు మానవుని స్థితి ఏమిటి? అప్పుడతడు మానవ రూపంలోని పశువు
మాత్రమే.
10. దురాశ లేక ప్రలోభము వుండకూడదు కాని అవసరం వేరే
విషయం. వ్యక్తి దురాశ లేక ప్రలోభము యొక్క
మూలకారణాన్ని తొలగించి సాక్షాత్కారము కొఱకు తపనను పెంపొందించుకోవాలి.
***** ***** *****
గడ్డిమోపంత
తెలివికంటే గడ్డి పోచంత సాధన చాలా శ్రేష్టము.
నీకు ప్రపంచమంతా వ్యతిరేకమయినా,
నీవారు
నిన్ను విస్మరించినా, నీవు ఏమి
తీర్మానించుకున్నావో, దానిని కార్యరూపంలో అమలు చెయ్యి.
దృఢనిశ్చయంతో
ఉండు.
ఆకాశం
విరిగి నీ నెత్తిన పడినా, సూర్యుడు
విరుచుకుపడినా, నీవు చేపట్టిన మార్గమునకు భిన్నముగా పోవద్దు.
---బాబూజీ.
శ్రీబాబూజీగారు
సర్నాడ్ (గుల్బర్గా) గారికి వ్రాసిన లేఖ
తెలుగు
అనువాదం: పి.సుబ్బరాయుడు, కడప.
ఎఱుక కలిగిగానీ లేకుండాగాని
మానవ హృదయమందు రేగిన పరితాపమే సత్యతత్త్వ సముపార్జనము. విశిష్ట వస్తువు వైపుకు వ్యక్తి పురోగమిస్తూ అధిరోహించుట
కుపయోగపడు నిచ్చెన యిది. ఈ పరితాపము గనుక
తీరితే మనకు మనమే తెలియని వాళ్ళమైపోతాము.
అలా మనం మఱపు గల్గిన స్థితిలోనికి ప్రవేశిస్తాం. అక్కడ "నేను" అన్న భావం పూర్తిగా
నశించి ఈ శరీరము మరియు ఆత్మ యొక్క ఎఱుక పూర్తిగా లేకుండా పోతుంది. హృదయముపైబడిన ఉనికికి సంబంధింఛిన ముద్రలన్నీ
కడిగి వేయబడతాయి. వ్యక్తి తానెవరో
ఇతరులెవరో, ఏమో కూడా ఊహించలేడు. బాంధవ్య బంధం త్రెంచివేయబడి అతని కెవరితోనూ
బంధమున్నట్లు అనిపించనైనా అనిపించదు. ఒక్క
ముక్కలో చెప్పాలంటే అతడు తన ఉనికినే కోల్పోయాడు.
అతడు పనులు నిర్విర్తిస్తాడు కానీ వాటి గురుతులతినిపైబడవు. సంస్కారాలేర్పడడం నిలిచిపోయి అతడు వాటి
ప్రభావానికిలోను కాకుండా విముక్తుడౌతాడు.
భగవద్గీతలో శ్రీకృష్ణపరమాత్మ అద్భుతంగా వివరించిన నిష్కామ కర్మ స్థితిని పొందుతాడు. ఈ స్థాయిలో వ్యక్తి సృష్టికి పూర్వమున్న
స్థితితో సమానమైనటువంటి సమత్వస్థితిని దాదాపు అందుకుంటాడు. అతడు బ్రహ్మముతో విడిబడి వుండడం జరుగదు. కనుక ఇక ఆతడు భగవంతునిపైగానీ, తనపైగానీ ఏమాత్రం ధ్యానం చేసే స్థితిలో వుండడు. అతడు
సాంధ్రతారహిత మండలములో ఈదుచుండడం వలన ఒకవేళ కాసేపు ధ్యానం చేసే ప్రయత్నం
చేసినా ఊపిరాడని స్థితి ఏర్పడుతుంది. ఈ
స్థితిలో కొందరు ఆత్మ సాక్షాత్కారమయిందని చెబుతారు. కానీ అది తప్పుడు అభిప్రాయం. ఎందుకంటే ఆస్థితిలో తానేమిటో తనకు తెలుస్తూ
వుంది. అసలందు చేతనే వాళ్ళు దాన్నంతగా
నొక్కి వక్కాణిస్తారు. ఆస్థితిలో శరీర కణాలు
శక్తిగా మార్పుజెందుతాయి. తుదకు అవి తమ అంతిమ
దశకు జేరుకుంటాయి. అక్కడ వైభవం లేదు,
ఆకర్షణ లేదు, ఆనందమూ (సామాన్యార్థంలో)
లేదు. ఇది రుచి లేని రుచి, మార్పులేని స్థిర స్థితి. దీన్ని
మరింత స్పష్టంగా వివరించాలంటే సంగ్-ఎ-బేనమక్ (ఉప్పదనం తీసేసిన ఉప్పుగల్లు) అనవచ్చు. సాక్షాత్కార స్థితిని పొందిన వాడు ఆధ్యాత్మిక
రంగములో తిరుగులేని ఇచ్ఛాశక్తిని వృద్ధిచేసుకుంటాడు. అతడు ఎఱుకలేని స్థితిలో వుండి కూడా
ప్రపంచములోని శాస్త్రములన్నీ (ఒక పరిధికిలోబడి) తెలిసినవాడై వుంటాడు. అన్ని హద్దులు ప్రభువుచే తొలగింపబడినప్పటికి
అతనిలో మానవత్వపు గుణాలు మాత్రము పోవు.
ఇవి కడవరకు కొనసాగుతాయి. ఒకవేళ ఇవి
కూడా ఇంకిపోతే ఇక అతడు వెంటనే దేహాన్ని వదిలేస్తాడు. కనుక ఆస్థితిలో అతడు సమయానుకూలంగా పైకి
క్రిందికి కూడా చూపు సారిస్తాడు. కనుక వ్యక్తి
అపరిమితుణ్ణి పొందాలంటే అపరిమితమైన దృక్పదం కలిగి వుండటం అత్యావశ్యకం. అట్లే అది సాధించటానికి అవసరమైన విధానం కూడా
సరియైనదై వుండటం అంతే ఆవశ్యకం.
****** ****** ******
ఆలోచన
- సంస్కారము - భోగము
----యల్.యస్.ఆర్.కె.ప్రసాద్, విశాఖపట్టణం.
భగవంతుణ్ణి తెలుసుకోవడానికి,
పొందడానికి అత్యంత సహజమైనది మన సహజమార్గము. రోజంతా వివిధములైన పనులతో తీరికలేని మనుష్యులు
అభ్యాసం చేయడానికి వీలుగా కాలానుగుణమైన తగుమార్పులు చేయబడిన మన పురాతన
రాజయోగపద్దతే ఈ సహజమార్గము. దీని
మూలాధారము మన ఊహాశక్తి లేక ఆలోచనాశక్తి.
కావున ఆలోచనను గూర్చి తెలుసుకోవడం చాలా అవసరము.
శ్రీబాబూజీమహరాజ్ ఈవిధంగా
అన్నారు. (దేవవాణి-పుట 376)
"ఆలోచన అనేది మనలోవున్న
దివ్యమైన మహత్తరమైన విషయము. ఇది
వృద్ధిచెంది మనల్ని మన లక్ష్యంవైపుకు నడిపిస్తుంది. చివరికి ఆలోచన సత్యతత్త్వరూపంలో ఏవిధమైన ముసుగు
లేకుండా కనిపిస్తుంది. ఆలోచనాశక్తితోనే
మనం దైవంతో కలుపబడతాము". అంటే
ఆలోచనలో దివ్యత్వంవుంది మరియు ఆలోచన అత్యంత శక్తివంతమైనదని దీని అర్థము.
శ్రీరాఘవేంద్రరావుగారు ఒక
వ్యాసంలో ఇలావ్రాశారు. "దివ్యత్వం,
ఆలోచన, శక్తి, కారణము,
సూత్రము లేక మరేపేరుతోనైనా పిలవండి ‘అది’ అన్నింటిలో వుంది. మానవులలో ‘అది’ ఎక్కువ చురుకుగా వుంది"(స్పెషల్
పర్సనాలిటి-- కాల్ ఆఫ్ ఫెలోట్రావెలర్ పుట-122) అంటే ఆలోచనకూ దైవానికి తేడాలేదని
దీని అర్థము.
మానవుని వికాసయాత్రలో ఆలోచన ప్రముఖమైన పాత్ర వహిస్తున్నది. ఈ ఆలోచనయొక్క మూలమేమిటి? పనిచేసే విధానమేమిటి? అనే విషయాలగురించి పరిశీలిద్దాం.
శ్రీబాబూజీ
మహరాజ్
ఈవిధంగా అన్నారు "కేంద్రమునుండి
బయలుదేరిన ప్రకంపనలు మెదడును తాకినప్పుడు మనిషియొక్క ఇష్టాయిష్టములకు అనుగుణముగా
ఆలోచనలు వుత్పన్నమౌతాయి. ఆకర్షణలు
వికర్షణలు మనిషిని కొన్నివిషయాలకు కట్టిపడేస్తాయి. ఇష్టములు, అయిష్టములు
(ఆకర్షణలు మరియు వికర్షణలు) ఏర్పడడంలో పరిసర వాతావరణంకూడా ఒక కారణంగా
పనిచేస్తుంది".
"ఆత్మ శరీరంయొక్క
యజమాని. అది కేవలం సూచనలు మాత్రమే
చేస్తుంది. మనస్సులో ఒక కోరిక పుట్టినపుడు
వెంటనే అది ఆత్మకు తెలుస్తుంది. అప్పుడు
ఆత్మ దానిని గుర్తించి సూచన యిస్తుంది. నీవు మనస్సుయొక్క కోరిక ప్రకారం చేయవచ్చు,
లేకపోతే దానికి వ్యతిరేకంగానూ చేయవచ్చు. ఆత్మ మాత్రం ఎల్లప్పుడూ నిర్లిప్తంగానే
వుంటుంది. అది ఏపనికి బాధ్యత
వహించదు"-- (కాన్సెప్ట్ ఆఫ్ గాడ్ అండ్ సెల్ఫ్ రియలైజేషన్ - ఎస్.ఏ.సర్నాడ్
పుట-114-147).
శ్రీరాఘవేంద్రరావుగారిని ఒక
అభ్యాసి ఈవిధంగా అడిగారు:
అభ్యాసి:-
ఆలోచన అంతా నియంత్రించబడిన ఆలోచనే, మరి స్వేచ్ఛా
ఆలోచన అంటే ఏమిటి?
శ్రీరాఘవేంద్రరావుగారు:-
ఆలోచన అంతా నియంత్రించబడిన ఆలోచన మాత్రమే.
గడచినదానిని గురించి ఆలోచన, ప్రస్తుత
కాలానికి సంబంధించిన ఆలోచన మరియు భవిష్యత్తును గురించి ఆలోచన లేకపోతే
కుతూహలంకొద్ది చేసే ఆలోచన, ఈ విధంగా ఏదైనాసరే మన ప్రాచీన
విజ్ఞానంలో ఆలోచనా ప్రవాహాన్ని నాలుగు దశలుగా విభజించారు. అవి పర, పశ్యంతి, మాధ్యమ, వైఖరి. పర
(అంతిమసత్యం) నుంచి బయలుదేరిన ‘అది’ మన సాధారణ చైతన్యాన్ని తాకినప్పుడు పశ్యంతి
అంటారు. అంటే మనం దానిని చూశాము
(సంస్కృతంలో పశ్య అన్నదాని అర్థం చూచుట).
మన సంస్కారాలు ముద్రలు దానికి మాధ్యమంగా పనిచేస్తాయి. ఈ సంస్కారాల మాధ్యమం నుండే ప్రకటన
వెలువడుతుంది. ప్రకటించినపుడు దానిని
వైఖరి (ప్రకటనాశైలి) అని అంటారు.
అందుచేతనే కేంద్రం నుంచి వచ్చిన ఆ ఒక్క ఆలోచనకు వేరువేరు ప్రకటనలను మనం
చూస్తాం. శ్రీ లాలాజీ మహరాజ్ పర మరియు
వైఖరికి అత్యంత ప్రాముఖ్యాన్నిచ్చారు.
ఊదాహరణకు అంతిమసత్యం నుంచి వచ్చిన ఒకఆలోచనను ఒకరు "ఓ భగవాన్! ఇది అంతా
నీదయే" అని అంటే ఇంకొకరు "ఉల్లిపాయ, వెల్లుల్లి,
అల్లం మొదలైనవి" అని అనవచ్చు.
శ్రీరామకృష్ణపరమహంసగారు దీనిని ఈవిధంగా చెప్పారు - "వెల్లుల్లిపాయలు
తిన్న వ్యక్తి కడుపునుండి త్రేనుస్తే ఆ త్రేన్పు వెల్లుల్లి
వాసనేకొడుతుంది". అంటే నీవు నీ
సంస్కారాల మాధ్యమాన్ని శుభ్రంచేస్తే ఆలోచనను సరిగ్గా గ్రహించి ఋషులు
ప్రకటించినట్లే నీవుకూడా ప్రకటిస్తావు.... శ్రీబాబూజీ చెప్పిన దానిని శ్రీరాఘవేంద్రరావుగారు
వివరించి చెప్పినట్లైంది.
పెద్దలు చెప్పిన ఈ ఆలోచనా
ప్రవాహాన్ని రెండుదశలు గల వ్యవస్థగా చూడావచ్చు.
మొదటి దశలో ఆలోచన ఒక ప్రకంపన లేక దైవ సంకల్పంగా అంతిమ సత్యం లేక కేంద్రము
నుంచి బయలుదేరుతుంది. అది మన ఎఱుకను
తాకినప్పుడు మనం దానిని ఒక ఊహగా గమనిస్తాము (పశ్యంతి). ఆ సమయంలో మన మనస్సు గురువుగారి స్మరణతో నిశ్చలంగా
వున్నట్లైతే ఆఊహను గమనించి దానికి అనుగుణంగా అంటే దైవసంకల్పానికి అనుగుణంగా మనం
పనిచేస్తాం. లేని పక్షంలో ఆ ఊహ మన
సంస్కారాల మాధ్యమంలోనికి ప్రవేశిస్తుంది.
ఇది రెండవదశ. అప్పుడు అక్కడ అది మన
ఇష్టాయిష్టాల (సంస్కారాల) ను పూసుకొని దానికి అనుగుణమైన ఆలోచనగా
రూపుదిద్దుకుంటుంది (తీపి లేక చేదుపూతతో కూడిన మందుమాత్రలాగా). చివరకు దానిని ప్రకటించినప్పుడు మనం మన వైఖరిని
మాటల రూపంలోగాని చేతల రూపంలోగాని ప్రదర్శిస్తాం.
మందుమాత్ర ఉదాహరణలో పైనున్న పూత తీపిదైనా లేక చేదుదైనా పనిచేసి
ఫలితాన్నిచ్చేది లోపలవున్న మందు మాత్రమే.
అదేవిధంగా ఒక ఆలోచనకు సంబంధించి మనయిష్టము లేక అయిష్టము ఏదైనా మనం చేసే
పనియొక్క ఫలితం మాత్రం ఎప్పుడూ ఆ దైవసంకల్పమునకు అనుగుణంగానే వుంటుంది. అందుచేతనే శ్రీబాబూజీమహరాజ్ ఈ విధంగా అన్నారు
-- "ఒక పనియొక్క ఫలితం ఏదైనా అది ఎల్లప్పుడూ దైవ సంకల్పానికి అనుగుణంగానే
వుంటుంది. అసలు చేసేది ‘ఆయనే’ కాబట్టి మన
సంకల్పం లేక మన కార్యంతో ముడిపెట్టి ఆ వచ్చిన ఫలితం మన ప్రయత్నాలవలననే వచ్చింది
అని అనుకోవడంలోనే అసలు సమస్య తలెత్తుతున్నది.
కేవలం ఆ కారణంగానే మనం విజయం లభిస్తే ఆనందిస్తాం అపజయం కలిగితే
దుఃఖిస్తాం. ఇదే మనం బంధాలలో వుండటానికి
కారణమౌతున్నది". (ఋతవాణి -1)
ఇప్పుడు మనం మన సహజమార్గ
సాధనలోని అత్యంత ప్రముఖమైన అంశానికొద్దాం - అది ఈ సంస్కారాలే లేకుండా
చేసుకోవడం. దీనిని ఏవిధంగా సాధిస్తాం? మొదటగా మనం క్రొత్తగా సంస్కారాలు
ఏర్పడకుండా ఆపివేయాలి, అదే సమయంలో అప్పటికే ఏర్పడివున్న
సంస్కారాలను ఖాళీచేయాలి. అంటే సంస్కారాలను
అనుభవించడం. దీనివలన మనకు రెండు
ప్రయోజనాలున్నాయి. ఒకటి ఆలోచనను సరియైన
దశలో గ్రహించి దానికి అనుగుణంగా నడుచుకోవడం.
అంటే దైవ సంకల్పానికి అనుగుణంగా నడుచుకోవడం. రెండవది మోక్షాన్ని సాధించడం. కోరిక లేకుండా చేసుకుంటే సంస్కారాలు ఏర్పడకుండా
వుంటాయని పెద్దలు చెప్పారు. కాబట్టి
మొదటగా మనం కోరికలు లేకుండా చేసుకోవాలి.
ఇక అప్పుడు మిగిలింది ఇదివరకే ఏర్పడిన సంస్కారాలను అనుభవించడం. దీనినే భోగం అని అంటారు.
శ్రీబాబూజీమహరాజ్ ఈవిధంగా
అన్నారు " ఈ జీవితంలోనే మనం మోక్షాన్ని సాధించాలి కాబట్టి మనం అన్ని
సంస్కారాలను వదిలించుకోవాలి - కొన్నింటిని అనుభవించడంద్వారా, మిగిలిన వాటిని దగ్ధంచేయడంద్వారా.
గతంలో ఏర్పడి అనుభవంలోకి రావడానికి సిద్దంగావున్న సంస్కారాలను వదిలించడం
చాలా ప్రయాసతోకూడిన పని. రాజయోగంలో సాధన
వలన మరియు మంచిమార్గాన్ని అనుసరించడం వలన అవి దాదాపు దగ్ధమైన స్థితిలోనే
అనుభవానికి వస్తాయి. ఆధ్యాత్మికమార్గంలో
విస్మరించరాని గురువుగారు అత్యంత సమర్థులైతే సంస్కారాలను కలలోనే అనుభవింపజేసి
ఈభోగప్రక్రియను నిద్రలో కూడా పూర్తిచేయించవచ్చు. మనం చేయవలసిందల్లా గురువుగారి ముందు ఏమీదాచకుండా
కేవలం భక్తితో వారి దరిచేరాలి (రాత్రి పడుకొనే ముందు మనం చేసే ప్రార్థనలో భాగం
యిది). గురువుగారి సహాయం వున్నప్పుడు భోగం
తన ప్రభావాన్ని కోల్పోవడం అనేది చూడడానికి వింతగాను అసహజంగాను కనిపిస్తుంది. గురువుగారి సహాయం వున్నప్పుడు భోగంయొక్క అవసరం
ఏర్పడదు అనేది అర్థం చేసుకోవడం అంత కష్టమేమి కాదు".
సంస్కారాలు భోగంలోకి
రావడనికి అనుకూలమైన పరిస్థితులు ఏర్పడడమనేది ఒకవిధంగా మనకు సహాయం లభించడమే. ఎందుకంటే తద్వారా సంస్కారాల సంఖ్య తగ్గిపోతుంది
కాబట్టి. ఈ సహాయం రెండువిధాలుగా మనకు
లభిస్తుంది. 1) అంతర్గత సహాయం 2) బాహ్య సహాయం.
అంతర్గత సహాయం మనకు కలిగే అనారోగ్యాలు, ప్రీతికరమైనవి
పోగొట్టుకోవడం వలన కల్గే దుఃఖాలు మొదలైన వాటిద్వారా లభిస్తుంది. ఈ పరిస్థితులలో మనకు వుండవలసిన సరియైన మానసిక
స్థితిని శ్రీబాబూజీ అయిదవ ఆదేశంలో స్పష్టం చేశారు. "దుఃఖములను దివ్యమైన దీవెనలుగా భావించి అవి
నీ మేలుకొరకే కలుగుచున్నవని కృతజ్ఞతాభావముతో వుండుము."
ఇక బాహ్యసహాయం అనేది ఇతరులు
మనకు చేసే కీడువలన కలిగే బాధలరూపంలో వస్తుంది.
కానీ అజ్ఞానంతో మనుష్యులు తమ ఆలోచనను విషపూరితం చేసుకుంటారు. ఇటువంటి సందర్భాలలో మనకుండవలసిన సరియైన
మానసికస్థితిని శ్రీబాబూజీ ఏడవ ఆదేశంలో స్పష్టం చేశారు. " ఇతరులు కీడుచేసినచో ప్రతీకార
బుద్ధిపూనకుము. దానిని దివ్య బహూకృతిగా
కృతజ్ఞతతో స్వీకరింపుము".
కాబట్టి కోరికలు
తగ్గించుకుంటూ, సరియైన మానసిక స్థితులను అభ్యాసంద్వారా
పెంపొందించుకుంటూ మనం పురోగమించడానికి అవసరమైన సహాయం చేయమని శ్రీబాబూజీమహరాజ్‌ను
ప్రార్థిద్దాం.
# # # # #
ధ్యానమంటే
దైవమువైపు గమనికతో ఉండడమే.
----బాబూజీ
ఆండ్రూ
పొరే(ఫ్రాన్స్) గారికి బాబూజీ వ్రాసిన లేఖలలోని కొన్ని భాగాలు
తెలుగు
అనువాదం: పి.సుబ్బరాయుడు, కడప.
మనపై
ఆధ్యాత్మిక సత్త్వాన్ని వాస్తవంగా ప్రయోగిస్తూ మనల్ని పోషిస్తున్న పూజ్యశ్రీ
బాబూజీ గారిని గురించి చదివి తెలుసుకోవడం మనకెంతో ఉత్తేజాన్ని కలుగచేస్తుంది. బాధాతప్త హృదయులైన సాధకులు తమ సాధనా మార్గములో
ఆ దివ్య శక్తి ధారలో లీనమై ఓదార్పును పొందారు.
ఆయన కృపామయ మార్గదర్శకత్వంలో సాధకుల పురోభివృద్ధికి సంబంధించిన అన్ని జాగ్రత్తలు
వహించారనడం వేరుగా చెప్పనవసరం లేదు. ఎట్టి
భేద భావము లేకుండా అభ్యాసులతో ఆయనేర్పరుచుకొన్న ప్రేమానుబంధం
ఆదర్శప్రాయమైనది. ఆయన ప్రసరింప చేస్తున్న
ప్రాణాహుతి ప్రసార నైపుణీ విద్య తన ఎదురుగా ప్రత్యక్షముగా సమీపమున నున్నవారినీ, తనతో విడదీయరాని పవిత్ర బంధము కొనసాగిస్తున్న
అప్రత్యక్ష దూరస్తులను సైతం ప్రభావితము చేసి వారి అంతరాంతరాళాలను పవిత్రీకరించి
వారిలో వ్యక్తిగత మార్పును తీసుకొనిరాగల సమర్థవంతమై యున్నది. ఆధ్యాత్మిక రంగమున
ఆయన విప్లవాత్మక మార్పులను ప్రవేశపెట్టుటద్వారా మహత్తరమైన ఆధ్యాత్మిక ప్రయోజనమును
జనులందుకొనుచున్నారు. అయాచితముగా లభించిన
ఈ మహాఫలము దేశకాలపరిస్థితులకతీతముగా
సంప్రాప్తమగుచున్నది . ఈ కారణముననే సహజమార్గ సాధనా ఫలితము ఊహింప శక్యము
గాకున్నది. మన గురువర్యులు ఆధికారికంగా ఒక
విషయం ప్రకటించారు. అదేమిటంటే యిక్కడ ఒక అద్భుతం కావింపబడింది. కానీ దాన్ని ఎవరూ గమనించ లేకున్నారు. ఇదే ఒక రకమైన వాస్తవ సత్యాద్భుతం.
ఏ
స్థితిని ఇతర సంస్థలు ఆఖరుది, అంతము
అంటున్నాయో ఆ స్థితిని ప్రారంభంగా
చేసుకొని సహజమార్గ పద్దతి కొనసాగుచున్నదని మన గురువర్యులు సాధికారికముగా తెలియచేసి
యున్నారు. ఇది చాలాకాలంగా సాధన చేస్తూ,
పట్టు సాధించిన అభ్యాసులే కాక నూతనంగా సహజమర్గాన్నవలంభించిన
ప్రారంభకులకు సైతం అనుభవైకవేద్యమైన పరమ సత్యం.
సహజమార్గము
సంతరించుకొన్న కొన్ని ప్రత్యేకతలు ఈ క్రింద తెలియచేయడమైనది.
* మతమేర్పరచిన ఆటంకములు తొలగించి వేయబడినవి.
* ఆధ్యాత్మిక పరిధి
సువిశాలమొనర్పబడినది.
* అగాధము, అగమ్యగోచరము,
అసాధ్యము అనబడుచున్న దైవ సాన్నిధ్యము, సుసాధ్యము చేయబడినది.
* సత్యతత్వావరణము మృదుల
దివ్యత్వముతో నింపబడి మరల విశ్వమున విడుదల చేయబడినది.
* భావప్రాధాన్యమైన అధ్యాత్మిక
రంగము సముచిత రీతి విస్తృతము గావింపబడినది.
* పరివ్యాప్తమైన సువిశాల అధ్యాత్మిక
పరిధి అంతయు తేటతెల్లము చేయబడి వెలుగులోనికి తేబడినది.
* సమగ్రముగా చెప్పవలెనన్న అత్యంత
సరళమైన భగవత్తత్వమును పొందుటకు, అంతే సరళమైన మార్గమున,
బహు స్వల్ప కాలమున, అదియూ ఈ జీవితకాలములోని
స్వల్ప సమయముననే సుసాధ్యము చేయబడినది.
---------->>>
1. ధ్యాన సమయమున వెలుగును గమనించినట్లయిన యోగము
ప్రారంభమైనదని పతంజలి యోగశాస్త్రము ప్రకారము నిర్ధారించవచ్చును. కొంతకాలము తర్వాత వెలుగు తగ్గి అంతకంటే
ప్రశస్తమైన స్థితికి తావొసగును. వాస్తవ సత్యస్థితి
యందు వెలుగు చీకటులు రెండూ లేవని ఋగ్వేదములోని నారదీయ సూక్తములో చెప్పబడినది. అక్కడ సూర్యుడెప్పుడూ ప్రకాశింపడు. అక్కడ ఉనికి ఒక చిత్రమైనది. ఆ ఉనికిని అనుభవము
పొంది మాత్రమే ఆనందించనగును.
2. అనుభవము రెండు విధములు. ఒకటి ఊహాజనితము, రెండు దైవికము. అభ్యాసి సక్రమ
మార్గము ననుసరిస్తూ వుంటే ఊహాజనితానుభవము కూడా దివ్యత్వముతో సంబంధమేర్పరచుకొనే
వుంటుంది. ఊహ సహితం దాని స్వచ్చస్థితిలో లీనమై మన స్థితి దివ్యత్వం చెందే
సమయమాసన్నమౌతుంది. చక్రములనధిగమిస్తూ ప్రయాణం సాగినపుడు వాటికి సంబంధించిన
అనుభూతులు, అనుభవాలు కలుగుతూ వుంటాయి. చక్రాల వద్ద గలిగే అనుభూతులు మనం ముందుకు
వెళ్ళే కొద్ది అంతరించిపోతూ చివరకు మనిషి
మానసికంగా నగ్నంగా మారిపొతాడు.
3. నీవు ఉత్తరం
వ్రాస్తూ సంస్థ పనంతా ఏటికి నీరు వెళ్ళి చేరినట్లుందని తెలిపావు. ఏ విధమైన ఆలోచనాపరమైన లేక చేతలవల్ల కలిగే
సంస్కారములంటని స్థితి యిది. సహజమార్గ
విధానములో సంస్కారములేర్పడుట నిలిచిపోతుంది.
హైందవశాస్త్రానుసారం, ఏర్పడ్డ పూర్వ సంస్కారాలు కూడా
బలహీనపడి దగ్ధము చేయబడతాయి. ఈ విధంగా మనం
పునర్జన్మవృత్తాన్ని సమాప్తం చేసేసు కుంటాము.
4. నీవు నన్ను కొన్ని ప్రశ్నలడిగావు. కానీ వాటికి నీవే సరియైన జవాబులు కూడా
చెప్పావు. శూన్యస్థితియే అన్నింటికన్నా గొప్ప
స్థితి. వాస్తవమునకు తరుగుదలే
సంపూర్ణత. ప్రాణాహుతి ప్రసారం వల్ల శూన్యత
పెరుగుతూ మనిషి పరిశుభ్రపడతాడు. శూన్యత
నిజానికి సత్యతత్త్వంలో ఒక భాగమే. నీవు
వ్రాసేది, నేననుకొనేది అంతా సమమై శూన్యము, సంపూర్ణము అనే పదాలకు అర్థమేలేని దశకు చేరుకుంటాము.
5.
నా ఆలోచన ప్రకారం మనలో శాంత స్వభావం కొనసాగాలంటే తెలిసిగానీ తెలియక గానీ
ఆధ్యాత్మికత వైపుకు వచ్చి తీరాల్సిందే.
ప్రపంచం కలతలతో అస్తవ్యస్తంగా వుందని అందరికీ తెలుసు. మనం సృష్టిని విచ్చేదం చేయడానికి రాలేదు. దాన్ని సక్రమంగా వుంచడానికి వచ్చాము. ఒక
వ్యక్తి సక్రమంగా వున్నాడంటే అతని రెండువైపులు సక్రమంగానే వుండాలి. దానర్థమేమంటే ఇప్పుడు మనం జీవిస్తున్న ఈ
ప్రపంచమూ మరణానంతరం మనం వెళ్ళే అవతలి ప్రపంచము రెండూ సక్రమంగా వుండాలన్నమాట.
6.
ఇక్కడ భారతదేశంలో కూడా నిశ్శబ్దం పాటించే ప్రత్యేక తెగ ఒకటుంది. కానీ వారు పాటించే నిశ్శబ్దం కేవలం
బాహ్యమే. అంతరంగంలో మాత్రం దానికేమాత్రం
సంబంధం లేకుండా వుంటారు. నీవన్నది పరమ
సత్యం. నిశ్శబ్దంలో కూడా అనేక దశలున్నాయి. కేవలం బాహ్యమైన నిశ్శబ్దం అంతర్దశకు సంబంధించిన
అనుభూతులనివ్వలేదు. అంతర్గత నిశ్శబ్దం ఒక
ఆధ్యాత్మిక స్థితే. అదే నిశ్శబ్దంలో నిశ్శబ్దం. అంతర్గత నిశ్శబ్దం రానురాను, మనం పురోగమించే కొద్దీ మరీ మరీ తేలికౌతూ పోతుంది. అలా తేలికౌతూ తేలికౌతూ,
మన అంతర్గత నిశ్శబ్దం ఒకానొక దశలో నిశ్శబ్దమన్న భావనకూడా లేకుండా
పొతుంది.
ఆ దశ వస్తే మన లోపల బయట అంటే సర్వంసహా అంతా
నిశ్శబ్దమే అయిపోతుంది.
7.
నా భావనలో ఈ ధ్యానం సృష్ట్యాది నుండి కొనసాగుతూ కొనసాగుతూ ఎన్నో యుగాలు ముందుకు
సాగాయి. మధ్యయుగంలో మానవులు దీనినుండి
ప్రక్కకు వైదొలగారు. దానిఫలితంగా
మానవత్వపు అధమ స్థితికి పతనమయ్యారు. ఈ
పతనావస్థే ధ్యానము యొక్క అత్యావశ్యకతను ప్రత్యక్షంగానో, పరోక్షంగానో సూచిస్తూవుంది.
అలజడికి గురైన ఆత్మకు ప్రశాంతత దీనివల్లే కలుగుతుందని
అంగీకరిస్తున్నాం. నేడు మన పాశవికత,
మనం ముందు పోగొట్టుకున్న దాన్ని గుర్తు చేస్తొంది. కారణం, ప్రవేశించిన
ధూర్తత్వంతో తద్భిన్నమైనదానిని మనం పోల్చి చూచుకుంటాం.
8.
దేవుడు క్రీస్తుకు వెలుగునిచ్చాడు. దానితో
ఆయన తన కర్తవ్య నిర్వహణ గావించాడు. దైవం క్రీస్తుకు ప్రాసాదించిన వెలుగుపైనే మనం
ధ్యానం చేస్తున్నాం.
ప్రతిఒక్కరూ అనందంగా జీవితాన్ని
గడపాలనుకుంటారు. కానీ ఒక్క సాధువు తప్ప
ఎవ్వరూ ఆనందంగా లేరు.
"జీవితానికి" సాధువు చెప్పే నిర్వచనం, సామాన్యుడు చెప్పే నిర్వచనం వేరు వేరుగా వున్నాయి. మానవ హద్దులు విచ్ఛిన్నము గావింపబడిననే తప్ప
ఏర్పడని ఉన్నత జీవితమును సాధువు ఆనందించుచున్నాడు. అట్టి పరిస్థితులలోనే అవిచ్ఛినమైన ప్రశాంతత
లోనికి ప్రవేశించి సమత్వ జీవితము గడప వీలవుతుంది.
9.
నీవు ఇతరులకు ప్రాణహుతి ప్రసారం చేస్తున్నప్పుడు ఏదో పొందుతున్నట్లు అనుభూతి
చెందుతున్నావన్నది సరియైన అనుభూతియే.
ఇతరులకు ప్రాణాహుతి ప్రసారం చేస్తున్నానన్న భావన రాగానే శక్తి నీలోనికి
ప్రవేశిస్తుంది. ఇది అభ్యాసుల ప్రయోజనార్థం
జరుగుతుంది. ఇందులోని అధికభాగం ప్రబోధకుని
వంతుగా లభించి అతడు రెండింతల ఫలాన్ని పొందుతాడు.
నీవేదైనా మాట్లాడినా, నాలుగు మాటలు
అన్నా వెంటనే ఒక శూన్యమేర్పడి, ఆ ఖాళీలో ఆధ్యాత్మిక శక్తి
నిండిపోతుంది. అది అంతరాంతరాళాలోనుండి
వస్తుంది. మాటలకు మూలము యోచన. యోచనలు పవిత్రమైతే మాటలు కూడా పవిత్రము,
ప్రతిభావంతము అయి వుంటాయి.
10.
సంస్కృతములో చెప్పబడిన "సుషుప్తి" అనబడే గాఢ నిద్రలో మనిషి స్తబ్దతనొంది
గాఢ నిద్రకు అవసరమైన శక్తిని అన్ని వైపుల నుండి గ్రహిస్తాడు. శక్తి ఎప్పుడు మందగిస్తుందో అప్పుడు జ్ఞాపక
శక్తిని కోల్పోతాడు. జ్ఞాపకశక్తి అట్లేవుంటే మనిషి సుషుప్తి దశను చేరుకోలేడు. కారణం రెండవది అతన్ని గాఢ నిద్రకు పొనీకుండా
నిరంతరం అలజడి కలిగిస్తూనే వుంటుంది.
11.
మా గురుదేవుల విషయం ఒకటి నాకు బాగా జ్ఞాపకముంది.
ఆయన ఎప్పుడు మాట్లాడినా కొంతమంది పారవశ్య స్థితిలోనికి వెళ్ళిపోయి
వుండేవారు. నేను, నువ్వు మాట్లాడేటప్పుడు అలా జరగడం లేదు.
కానీ, నేను ఖచ్చితముగా చెప్పేదేమంటే, ఇది ఒక సూది మందు పనిచేసినట్లు పనిచేసి అద్భుత ఫలితాన్నందజేస్తుంది. మొదట మాట బయల్వెడలి తర్వాత వ్రాతగా
మారుతుందనుకుంటాను. ఇది వాస్తవమని
నాభావన. అందుకే మాటలో కొంత స్థౌల్యత
వుంటుంది.
12. ప్రతి ఒక్కటి కొంతకాలానికి
పాతదైపొతుంది. క్రొత్తమోతాదు యివ్వకపోతే
తేడా తెలిసే అవకాశం లేదు. భారతదేశంలో
యోగవిద్య బహుపురాతనమైనది. కానీ అభివృద్ది
నిలిచిపోయింది. కారణం ఎముకల నుండి భాస్వరం
బయటికి తీసినట్లు యోగసారాన్ని గ్రహించటం మరచిపోయారు. విషయాలు యావత్ ప్రపంచానికి తెలియవస్తాయి. అంటే ఈ మార్గాన్నే అవలంభిస్తారు. మనం శ్రమించి ఆ తరుణం తొందరగా వచ్చేట్టు
చేయగలం. నేను వ్రాసినవన్నీ యిప్పుడో
అప్పుడో జరిగి తీరుతాయి. నీవు గమనిస్తావని
నీకు వ్రాస్తున్నాను. ఆధ్యాత్మికంగా
ప్రపంచమంతా జాగురూకత చెందింది. సుదూర
భవిష్యత్తులో కమ్మ్యూనిష్టులు కూడా ఈమార్గాన్నే అవలంభించడం నీవు గమనిస్తావు.
ఆధ్యాత్మికతకు ఆధారభూతమైన ప్రశాంతతకు దాదాపు మనందరము చేరుకున్నాము. కదలిక మొదలైంది. అది యిక ప్రశాంతతకావలి దశకు చేరుస్తుంది. ఇంతవరకు మనకు ప్రశాంతతకు ముందుటి దశ మాత్రమే
తెలుసు. ఆవలి దశ చాలా కొద్ది మంది మాత్రమే
ఎరుగుదురు.
13.
నీప్రశ్నకు జవాబిచ్చే ముందు నేను ధ్యానాన్ని నిర్వచించాలనుకుంటున్నాను. ధ్యానమంటే
వెన్న తీయడానికి పాలను మధించటం వంటిది. నది ప్రవహిస్తూ వుంది. అలలకడ్డంగా ఒక దుంగ అడ్డమొస్తే నీరు
నిలబడుతుంది. అదేవిధంగా ధ్యానసమయంలో మన
పూర్వ మరియు ఈనాటి జీవితంలోని సంస్కారాలు హృదయానికెగబ్రాకుతాయి. కారణమేమంటే
ధ్యానంవల్ల ఒక విధమైన శూన్యత ఏర్పడుతుంది.
ఆశూన్యంలోనికి సంస్కారాలు చొచ్చుకొని ప్రవేశిస్తాయి. అప్పుడు మనం అభివృద్ది కుంటుపడినట్లు
భావిస్తాము ఈ విధంగా దాదాపు అందరిలోను జరుగుతూవుంటుంది. కనుక ఈనిలుపుదలే ఒక రకంగా
మన పురోభివృద్దిగా భావించ వచ్చు. కారణమేమంటే తదనంతర స్థితి తెరువబడుతుంది. పూర్వ స్థితికి సంబంధించిన ఎరుక లేకపోతే ఆ
మరుగుపరచబడిన ఎరుకే తెరవెనుకనుండి పనిచేస్తూవుంటుంది. అయితే అది నీకు
తెలియకపోవచ్చు.
14.
భారతదేశంలోని పూర్వకాలపు ఋషులు శాస్త్రవిద్యను కూడా పరిగణలోనికి తీసుకొనేవారు. అది వారు తమ అతీంద్రియస్థితిని పనిచేస్తున్న
స్థితిలో వుంచుకొని వారి మనశ్శక్తిని సర్దుబాటు చేసుకొనుటకు
వినియోగించుకొనేవారు. అంటే వారు ప్రతి
విషయాన్ని భగవత్ సాక్షాత్కారానికి అనువగునట్లు గ్రహించే వారు. ప్రతి విషయము
చక్కదిద్దబడి సత్పలితాన్నిచ్చేదిగా సరిచేయబడేది. కేవలం మరీ మరీ ఆలోచించినంతమాత్రాన
పనిజరుగదు. నీకు కొన్ని సందర్భాలు
తెలియచేస్తాను. భరద్వాజుడనే ఒక ఋషి వుండే
వాడు. ఆయన భౌతిక శాస్త్రములో నిపుణుడు.
ఆయన అతి ముఖ్యమైన నక్షత్రముల బరువులను నిర్ధారించి వ్రాసిపెట్టాడు.
విమానాలకు పాదరసం ఇంధనంగా వాడవచ్చని కూడా లిఖించాడు. ఇంకో మధ్యయుగపు ఋషి చాణక్యుడు శాస్త్రీయమైన మరియు వైద్యగ్రంధాలు
రచించాడు. అవి లభ్యమౌతున్నా వాటి సంస్కృత
భాష జఠిలమై వున్నది. --- ఆత్మసాక్షాత్కారానికి శాస్త్రవిద్య అంత ప్రాధాన్యత
వహించదని తేల్చి చెప్పడానికివి ఉదాహరణలు.
నా ఎదుట ఒక వైపు వజ్రము మరో వైపు రవ్వంత ఆధ్యాత్మికత వుంచితే నేను ఆ రవ్వంత ఆధ్యాత్మికతనే
కోరుకుంటాను. ఇది యుగయుగాలనుండి భారతీయుల
సహజసిద్దమైన ఆలోచనా సరళి.
15. మనమనుసరించు పద్దతి
శాస్త్రీయమే. అది పదార్థపు
హద్దులనధిగమించి ఆవలికి గొంపోతుంది. నీవొకసారి షాజహాన్‌పూర్ లో వున్నప్పుడు ఈ ప్రాంతపు
కలెక్టరువారిని నీకు పరిచయం చేసివుంటిని.
అపుడు ఆధ్యాత్మిక చర్చ జరుగుతుండగా "మేము భౌతికత్వంతో విసిగి పోయి,
ఆధ్యాత్మికత వైపుకు మళ్ళాము.
ఐతే భారతదేశం భౌతికత్వం వైపు వెళుతున్నది" అని అన్నావు.
16. పురోభివృద్దిలో కొంతవరకు
శాస్త్రవిద్య అనేకవిషయాలను వివరిస్తుంది.
ఎప్పుడైతే మనం వస్తుపరిధిని దాటి వెళతామో ఆ దశలో శాస్త్రవిద్య వూరకుండి
పోతుంది. మన పద్దతి శాస్త్రీయమే.
శాస్త్రము, మనం దివ్యత్వపు గడపదాటగనే అంతమౌతుంది. అంటే మనం వెనక్కు తొంగి చూచి ముందుకు వెళ్ళి
ఫలితాన్ని పొందుతున్నాము. మన దేహమంతా
శూన్యం గావింపబడుతుంది.(రాజయోగ ప్రభావం అను నా పుస్తకమున ఈ విషయం
విశదీకరించబడింది). మనం ధ్యానం చేస్తూ పొతే ఒక విధమైన శూన్యత్వం
ఏర్పడుతూబోతుంది. ఆ శూన్యంలో దివ్యత్వం
వచ్చి చేరుతుంది. అది నీ ఆహ్వానాన్ని
ఆశించకనే ప్రవేశిస్తుంది. నీవు
అనిర్వచనీయమైనదేదో పొందుతావు. అదే నీవు
పొందదగిన విలువైన కానుక. ఒక వ్యక్తి
చనిపోయే వరకు అధ్యాత్మికాభివృద్ది నాశించక పోవచ్చు, కానీ
అతని మనస్సులో పసిబిడ్డ తన తల్లితండ్రులపై చూపే ప్రేమ భావమైనను వుండాలి. అప్పుడతడు తల్లి నుండి ప్రేమను పొందుతాడు. దాన్ని తండ్రి వ్యక్తిత్వాన్ని పొందడానికి వెచ్చిస్తాడు.
17.
మనం "అవును"
"కాదు" అనే వాటికి
బందీలమై వున్నాము. కానీ మనకు
"అవును" అని ఎక్కడ వాడాలో "కాదు" అని ఎక్కడ వాడాలో తెలియడం
లేదు. ఇదంతా మనకు అనుభవం ద్వారా
తెలియాలి. అనుభవం ప్రయోగం వల్ల కలుగుతుంది. ఏ విషయాన్నైనా సానుకూలంగా యోచిస్తే అది వివరింపబడుతుంది. అలాగే మనం ఒక విషయంలో "కాదు"
"పోదు" "లేదు" అనే వైఖరి వహిస్తే ఆ "కాదు" "లేద"న్న విషయమే
తెలుపబడుతుంది. ఎప్పుడు ఒత్తిడి
కలుగచేసుకుంటామో అప్పుడే ప్రశాంతత వెళ్ళిపోతుంది.
అలాగే ఎప్పుడు ఒత్తిడి తొలగుతుందో అప్పుడు ప్రశాంతత మిగులుతుంది. అది అంత బరువైనది కానప్పటికి ఎంతో కొంత
వున్నట్లే లెఖ్ఖ. రెండూ పోతే దాన్ని
నిశ్శబ్దస్థితి లేక అసంపూర్ణశూన్యత అంటారు.
సంపూర్ణశూన్యత అనునది అసాధ్యమే అయినా దాన్ని వీలైనంత పొందగలగాలి.
సంపూర్ణశూన్యం భగవంతుడే. దివ్యత్వంలో లీనమైతే
ఈ శూన్యస్థితి కరగి కరగి అతి సామీప్య స్థితికి చేరుకుంటాము. ఈ విషయం బహుశాః నీ
ఉత్తరానికి సంబందించని విషయమే. అయినా ఆ
అనంత తత్త్వానికి సంబంధించిన జ్ఞానాన్నిస్తుంది.
18. నిశ్శబ్దత ఆధ్యాత్మికపు ఒక
భాగములో రవ్వంత మాత్రమే. అదే మహత్తత్త్వము
గాదు. దీన్ని వివరించాలంటే అది నిశ్శబ్దం
లో నిశ్శబ్దం అని అనవచ్చు. క్రితంలో నీకు
వ్రాసినట్లు అది భగవంతునికి అతి సామీప్యస్థితి.
అంటే నిశ్శబ్దం నిలవడానికి నిశ్శబ్దమే ఆధారము. దీన్ని ప్రత్యక్షంగా చూపవచ్చు. నీవు కూడా దీన్ని చక్కగా చేయగలవు. దానికి సంబంధించిన భావన చేయ్యి చాలు అదే
మొదలవుతుంది. సహజమార్గము భగవత్ సాక్షాత్కారాన్ని
అనుభవంలోకి తెచ్చే పద్ధతి. సాధన ద్వారా
మాత్రమే నిశ్శబ్దతను విశ్లేషించగలము. మన
బాహ్య నేత్రములు చూడలేని సూక్ష్మక్రిములు ఎన్నో వున్నాయి. మనం దర్శించలేక పోయినా అవి మాత్రం వుండనే
వున్నాయి. అట్లే నిశ్శబ్దం
వ్యక్తీకరించలేని స్థితిలో ఉంది. దానిని
మనం గమనించ లేక పోవచ్చు. అయినా అది
వుంది. దీన్ని నిరంతర సాధన ద్వారా
దర్శించవచ్చు. అదే విషయాన్ని మరోలా
యీవిధంగా వివరించడం జరిగింది.
కనుక ప్రార్థన ద్వారా మనం బాహ్య శబ్దాలనుండి
బాహ్య నిశ్శబ్దతతకు వెళతాం. అంతఃశుద్ధీకరణ
ద్వారా బాహ్య నిశ్శబ్దం నుండి అంతర్నిశ్శబ్దతకు చేరుతాం. అంతర్గత తమస్సే లోపలి శబ్దం. అది శారీరక మానసిక ఒత్తిడులవల్ల
జనిస్తుంది. ఒత్తిడిని నివారించడం వల్ల
శూన్యత కలుగుతుంది. ఇది అంత రొద
కలిగించదు. ప్రార్థన వల్ల మనం గమ్యం
దరిదాపులకు చేరుతాం. కారణం మనం
ఉనికిలోనున్న దివ్యత్వంతో సంబంధమేర్పరచుకున్నాం.
నీవు, నీ గమ్యం అన్నవి రెండు ఉన్నాయి. యిప్పుడు నీవే అసలు సత్తాతో
కలసిపోవాలనుకుంటున్నావు. కనుక ఆశించిన
ఫలితాన్నందుకున్నాం. ఇవేవి ఖాతరుచేయకుండా
వచ్చినట్లయితే నీలో అద్భుతశక్తులు మాత్రం ఉత్పన్నమౌతాయి. ఇవి సక్రమ పద్దతిలో ఉపయోగిస్తే అమృతమే ఇస్తాయి. వక్ర మార్గంలో ప్రయోగిస్తే దారుణమైన హాని
కలుగచేస్తాయి. పద్దతి గురించి నీకు ముందే
తెలుసు.
19. ఒత్తిడి నిర్మూలించడమంటే
వెలితి లేకుండా తేలికగా ఎదగడం అని అర్థం.
అది ఒక రకంగా సన్మార్గం వైపుకు మారడమన్నమాట. పారదర్శకస్థితి సంపూర్ణంగా హద్దులు లేని స్థితి
కాదు. కారణం అక్కడ ఇంకా ఏదో వుంది. అందులోంచి నిన్ను ఇంకా తొంగి చూడనిస్తోంది.
20. ధ్యాన సమయంలో వచ్చే ఆలోచనలు
కేవలం బాటపై ఆడుకుంటున్న పిల్లలవంటివి. నీ
మనస్సు వాటిపై మరల్చకుంటే చాలు. అవి
నిర్వీర్యములై పోతాయి. వాటికి విలువే
వుండదు. ఆలోచనలు నిన్ను అసలు ఇబ్బంది పెట్టడం
లేదు. కానీ నీవే అనవసరంగా ఇబ్బంది
పడుతున్నావు. వాటిని తొలగించుకునే పద్దతి
నీవే చెప్పివుంటివి. అవి పడిపోవడానికే
వుత్పన్నమౌతున్నాయి. అవి వాటి స్థానాన్ని విడిచి వెళ్ళిపోతున్నాయి. మన పద్దతి ప్రకారం అనవసరమైన విషయాలకు
దూరంగావుండి లోనికి ప్రవేశించనున్న దివ్యత్వం కొరకు ఎదురు చూస్తూ వుండాలి. "రాజయోగ ప్రభావము" అను నా పుస్తకంలో
తెలిపినట్లు "బి" స్థానము సంస్కారముల స్వస్థలము. హృదయంలో కొద్దిగా శూన్యత వుంది. ధ్యానం యొక్క శక్తి హృదయంపైని తెర చీల్చివేసినంతనే
ఆలోచనలు హృదయ శూన్యతలోనికి లాగబడతాయి.
ఎప్పుడు ఆలోచనలు ఎగసిపడతాయో అప్పుడు నీవు అలజడికి గురౌతావు. కనుక ఆలోచనలు నీజోలికి రావడము లేదు. నీవే వాటితో జోక్యము కలిగించుకుంటున్నావు.
21. నేను భగవంతునికి మారుగా
శూన్యత్వము (ఏమీలేని భావన) అనే పదాన్ని వాడుతూ వుంటాను. కానీ నేను కేవలం "శూన్యము" అనిగాక
దానికి "త్వము" కూడా చేర్చి వాడాను.
ఎప్పుడైతే మనం సూక్ష్మాతి సూక్ష్మ వస్తువును గురించి యోచిస్తామో అప్పుడు మన
భావం వెనక్కి మరలి నిజంగా ఆ వస్తువుయొక్క అన్వేషణలో పడుతుంది. నీవు "అవును" అన్నంతనే
"కాదు" అన్న భావన కూడా స్థానమేర్పరచుకుంటుంది. కనుక భగవంతుడు "అవును" కాదు,
"కాదు" కూడా కాదు.
నేను "కాదు" అంటే అది ఉనికి లేనిదౌతుంది. ఒక వేళ "అవును" అంటే వునికిలో
నున్నదన్న భావన కలుగుతుంది. భగవంతుడు రెండింటికి
అతీతుడు. దయచేసి ఇంకే పదం వాడాలో
ఆలోచించు. అదే ఆ శూన్యత్వం ఆ "కానీ-అవును". ఒక్క మాటలో చెప్పాలంటే మన అంతిమ గమ్యం ఆ అనంతుడే
అయి వుండాలి. అతడు ఏ స్థితిలో వుంటేనేం? దానికి సంబంధించిన చింత మనకవసరం
లేదు.
ఒక
అభ్యాసికి గురువర్యులు వ్రాసిన లేఖ
నా రచనలన్నింటిలో నేను నేరుగా భగవంతునితో
సంబంధమేర్పరచుకొనుటకే ప్రాధాన్యతనిచ్చినాను. కానీ జనులు సామాన్యముగా యిది
కష్టమైనదిగా గమనించారు. కనుక వారికై వారే గురువును వారు మాధ్యమంగా గైకొన్నారు.
దాదాపు అన్ని మతాలు నేరుగా భగవంతునితో ప్రేమనే ప్రభోధించాయి. నా ఉద్దేశ్యములో ఆధారపడడము మరియు ప్రేమ ద్వారా
భగవంతునే శరణు వేడవలెను. నీవు కానీ మరెవరైనాగానీ
ఆత్మ సమర్పణకు ప్రయత్నిస్తే అక్కడ "నేను" అనునది ఉంది. "చేస్తున్నాను" అన్నవాడున్నాడు. కనుక
వాస్తవమైన శరణాగతి స్వతఃసిద్దంగా ఏర్పడాలి.
నా విషయము మరోవిధమైనది. నేను నా ఇరవై ఒకటో
సంవత్సరంలో సాధన ప్రారంభించాను. అప్పుడు
నాకు శరణాగతిని గురించి తెలియదు. కనుక
నేనందుకొరకు ప్రయత్నించ లేదు. నాకు నా గురుదేవులే
సర్వస్వము. కారణం, నాకట్టి గురుదేవులు లభించారు. ఒక
వేళ నాపరంగా శరణాగతి అంతర్గతంగా వుండి వుంటే అది నా గురువుకు మాత్రమే
అయివుంటుంది. వాస్తవానికి గురువు
శరీరాకృతి భగవంతుడు కాదు. కానీ దానికావల దైవత్వమే వున్నది. కనుక నన్ను నేను ఆ దైవత్వానికే సమర్పించుకొంటిని
గానీ మానవాకృతికి కాదు. కానీ గురుదేవుని
పరిపూర్ణాకృతిని దృష్టి పదంలోనికి తెచ్చుకుంటే ఆ వెనుకే దైవత్వము విరాజిల్లుతూ
వుంటుంది (ఇది నాకు మాత్రమే. ఇతరులనిట్లా చేయమని నేను చెప్పలేదు) కనుక ఇది
గురువుకు శరణాగతి కాదు కేవలం సత్యతత్త్వానికే. కానీ ఇప్పుడు నా స్వానుభవము నా
సహచరులకవసరమైతే, నా స్వానుభవ ప్రయోజనమును పొందవచ్చును.
మనము "ఈశ్వరీయ ప్రకాశము హృదయమున
వున్నది"యన్న ఊహతో హృదయముపై ధ్యానము చెయుదుము. ధ్యానం చేయుచున్నప్పుడు మన యోచన ఈశ్వరీయ
ప్రకాశముపై వుండును. అంటే నీవు నీ
హృదయముతో ఆట్లాడుకుంటున్నావు. అంటే అదియొక
క్రీడ, ఒక కార్యము.
నీవు ధ్యానిస్తున్నావని నీవెరుగుదువు.
అంటే నీవు ఏదో చేస్తున్నావన్నమాట.
ఆచేసేది కూడా ఏదో ఒకచోట మొదలైందన్నమాట.
అంతే కాదు నిమగ్నమై దేనికోసమో ఎదురు చూస్తున్నావు కూడా. అంటే నీవుస్తబ్దత
జెందలేదు. చాలా వ్యగ్రత, తీరుబడిలేని స్థితిలో మూడు పనులు
ఒకే సమయంలో నిర్వర్తిస్తున్నావు. అంటే నీ
స్తబ్దత జాగ్రదావస్తలో కోల్పోయింది.
అవును, మన
పద్దతి నిజంగా సులువైనది. ఎందుకంటే
సూక్ష్మమైనదాన్ని పొందటానికి సులువైన మార్గమే సరియైనది. ఉన్నదేదో వున్నది. అది ఏమిగా రూపాంతరం చెందాలో
అదేపనిలో పనిగా జరిగిపొతూ వుంది. సంశయాలన్నీ మటుమాయమై ధృడసంకల్పం ఆస్థానాన్ని
భర్తీచేస్తున్నది.
నా దృక్పదంలో ప్రపంచంలోని సమస్యలన్నిటికి
ఆధ్యాత్మికతే పరిష్కారము. అది మానసిక
అసమానత్వమును రూపుమాపి సహజంగా ప్రేమానందమయమగు ఆధ్యాత్మిక స్థితి నెలకొన్న అనువైన
జీవితాన్ని ప్రసాదిస్తుంది. అది సరియైన
నీతి, జ్ఞానమును ఉత్పాదించి రోజువారి జీవనమునకు
ప్రయోజనకారిగా మారుతుంది. మామిడిపండును
రుచిచూడు. అప్పుడే నీవు దాని తియ్యదనాన్ని
ఆస్వాదించ గలుగుతావు.
సామాన్యముగా ఆధ్యాత్మిక విషయాలను ఆధ్యాత్మిక
పరంగాను, సాంసారిక విషయాలను సాంసారిక స్థాయిలోను
నిర్వర్తిస్తూవుంటారు. కానీ ఆధ్యాత్మిక
మరియు సాంసారిక విషయాలనన్నింటిని సమన్వయపరచి సమతుల్యమొనర్చగల అసలు సిసలైన
ఆధ్యాత్మికస్థితి నందుకొన్న వాడు రెండిటిని వేరువేరుగా చూడడు. అతనికి అంతా ఆధ్యాత్మికతలో భాగంగానే
గోచరిస్తుంది.
సృష్టికి పూర్వం కేవలం ’భూమా’ మాత్రమే
ఎల్లెడలా పరివ్యాప్తమై వుండెనని నేను వ్రాసితిని.
నీవు ఉత్తరం వ్రాస్తూ భగవంతుడు సర్వశక్తిమంతుడని నేను వ్రాయడం ద్వారా
ముందుచెప్పిన నా దృక్పదాన్ని నేనే ఖండించుకొంటినంటివి. భగవంతుడు తన చుట్టూ
సృష్టించుకొన్న విశ్వపరిధులకు మాత్రమే సర్వ శక్తిమంతుడు. కానీ తన ఉనికికే కారణము, ఆధారమైయున్న స్థితికి సంబంధించిన విషయమున మాత్రము కాదు. సర్వ శక్తిమంతుడు, సర్వ
వ్యాపి, సర్వజ్ఞుడు అన్న గుణాలు సాధారణముగా నిరామయ
భగవంతుణ్ణి అలంకరించి అందలి సత్వం నుండి విషయాన్ని గ్రహించటానికి ఉపయోగపడతాయి కానీ
గుణగణాలకన్నిటికీ అతీతమైనది ఆనిరామయ తత్త్వము.
అదే మనమాశిస్తున్న శూన్యత్వము.
మానవుని ఘనత వాని నడత(శీలం)పై ఆధారపడి
యున్నది. అతడు ఆధ్యాత్మిక మార్గమున
ప్రవేశించినపుడు జీవనము మహోన్నత దశకు వృద్దిపొందును. పై తెలిపినట్లు తత్త్వశాస్త్ర రీత్యా మన ఆలొచన
మహోన్నతమైనప్పుడు భౌతికశాస్త్రరీత్యా కూడా మానవుడు తన సంకుచిత పరిధిలో
అత్యంతల్పుడనే విషయం నిజమని తేలిపోయింది.
అతడేమైనా మిగిలి వున్నాడంటే అది కేవలం వాని మాద్యమ పరిధిలో మాత్రమేనని
గ్రహించాలి.
మనం పైపైకెదుగుతున్నామన్న యోచనలో మనకాధారమైన
వ్యక్తిత్వాన్ని మరచిపోతాము. మనమున్న స్థితిని
దాటి మనం కదలక పోతే అవతలి స్థితి మనకు అగమ్యగోచరంగానే వుంటుంది. మన వ్యక్తిగత ఉనికిని మనం పోగొట్టుకోకపోతే
మనమిప్పుడున్న పైస్థితిని సంపూర్ణముగా అనుభవించడం లేదన్న మాట. మనం ఎక్కడ వేసిన గొంగడి అక్కడే వున్నది
అన్నట్లు లెఖ్ఖ. మన ఉనికియొక్క అంతరాంతరాళలోనికి
వెళ్ళినంతనే మనం సహజంగా మన వ్యక్తిత్వాన్ని దాని సహజ గుణాన్ని
పోగొట్టుకుంటాము. ఇదే మన పురోగతియొక్క
ఫలితము. పోగొట్టుకొని తదనంతరం
పొందాలి. ఇంకోవిధంగా చెప్పాలంటే
పోగొట్టుకోవడమే పొందడము. శూన్యత్వం స్థితి
లోనికి మనం ప్రవేశించి అక్కడ స్థిరత్వమేర్పరచుకున్నంతనే మన వ్యక్తిత్వం మన
మేలుకొరకై మనల్ని వీడివెళ్ళిపోతుంది.
మేధస్సు ఒకసారి ఒక విషయాన్నే ఆలోచిస్తుంది. నీవు నీ వ్యక్తిత్వంతోనే వుంటే ముందుకు
వెళ్ళలేవు. వాస్తవానికి మనం
మనవ్యక్తిత్వపు పట్టు సడలించుకొని నిజమైన శూన్యత్వపు ఉనికిలోనికి చేరిపోవాలి.
సంపూర్ణ ప్రళయ సమయంలో ప్రతి ఆత్మా మూలాన్ని
చేరుకుంటుంది. కానీ మనం ఈజన్మలోనే గమ్యం
చేరాలనుకుంటున్నాం. కనుక మనం కాలవ్యవధిని
తగ్గించటానికి యిప్పుడే మన పనిని త్వరితపరచి తొందరగా మూలానికి చేరుకోవాలి.
మన ఉన్నతిని మనం కోరుకున్నట్లయితే మన
మహోన్నతగమ్యం నిర్ధారించుకోవడం మన భాద్యతౌతుంది. తద్వారా మన అల్పత్వం నశించి గొప్పతనం విశాలత్వం నెలకొంటుంది. ఇదే నిజంగా మన కర్తవ్యము యొక్క కర్తవ్యము, కర్తవ్యము వెంట కర్తవ్యము. ఇలా
ఎంత వరకు? ఎంతవరకో
కూడా జ్ఞాపకం లేనంత వరకు. ఆ విషయమే మరచి
పోయేంతవరకు.
ప్రతి ఆత్మకు, తనకు సంబంధించిన ఒక గుర్తింపు వుంటుంది.
అది ముక్తినందుకొనేవరకు వరుసగా ఒక దేహంనుండి మరొక దేహానికి మారుతూ
కొనసాగుతూనే వుంటుంది. మెలుకువలోనే
నిద్రావస్థలో వుండటం మానవుల్లోని సర్వ సామన్యమైన జబ్బు. ఒక వేళ క్రొత్త ఆత్మలు వస్తున్నాయనుకుంటే,
దేహంలోనికి ప్రవేశించగానే ఆలొచనలు తప్పు, ఒప్పు
రెండు వైపులా ప్రజ్వరిల్లుతాయి. ఆవిధంగా
తప్పుడు యోచనలు, భావనలు ఆత్మను అస్థిరపరుస్తాయి. అందుచేత పరిశుద్దీకరణ అవసరమైయున్నది. తప్పుడు యోచనల ద్వారా మనల్ని మనమే పాడు
చేసుకున్నాము. కనుకనే అంతఃశుద్దీకరణ
అత్యావశ్యకమైనది.
కొంతమంది మనుషులున్నారు. నేను వారికి నా సేవలందించటం మొదలు పెట్టకముందే
వారు నాతో తెగదెంపులు చేసుకుంటున్నారు.
ఇటువంటి కాలంలో నీవు నీ ఆలోచనలను నా విశ్లేషణ కోసం పంపించావు. అందుకు నీకు మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.
----oo0oo----
ఆలోచనకు
ధృడమైనశక్తి అపరిమితంగా ఉంది.
ఒక
చిన్న దురాలోచన ఏర్పడినప్పటికి,
విపత్కర
పరిస్థితులకు దారితీయవచ్చు.
మనస్సులో
ఒక చెడు ఆలోచన ఉన్నట్లుండి కలిగితే,
వెంటనే
ఒక మంచి ఆలోచనతో
మనస్సును
సమత్వానికి తీసుకొని రావచ్చును.
---బాబూజీ.
భగవంతుడు
మూలం:పూజ్యశ్రీ
రామచంద్రజీ
తెలుగు
అనువాదం:శ్రీ పి.సుబ్బరాయుడు, కడప.
బహుశా మానవునికి బుద్ధి
వికాసము కలిగిననాటి నుండి భగవంతుడున్నాడా? అన్న ప్రశ్నపై
వాదోపవాదనలు వుంటూనే వున్నాయనుకుంటున్నాను.
నిజానికి నా మనసులో మెదలుతున్న సమస్య బాహ్యముగా మనమనుకుంటున్న ఆ
అనంతతత్త్వము ఉన్నదా లేదా అని నిరూపించడం కాదు, కాని దాన్ని
తగురీతిలో సంతృప్తికరంగా నిర్వచించడం ఎలా అని.
తొలుత "దేవుడు
లేడు" అన్న నాస్తికుని దృక్పదంతో ప్రారంభిద్దాం. గణిత శాస్త్ర పదజాలంలో చెప్పాలంటే దానికి
"ధన" లేక "ఋణ" విలువలేవి ఆపాదించకూడదు. అయినా దాన్ని మనం ఏదో ఒక సంజ్ఞతో
వ్యక్తపరచాలి. అలా ధన, ఋణ విలువలు లేని ఆ గుర్తును గణితశాస్త్రంలో సున్న (0) లేక పూజ్యం అంటారు.
ఉన్నదేమిటి అన్న ప్రశ్నను
ఒక నాస్తికుడు ఎలా ఎదుర్కొంటాడో చూద్దాం.
ఒక పట్టుగల గట్టి నాస్తికుడు దేన్నయినా లేదనవచ్చును కాని తన ఉనికిని మాత్రం
కాదని, లేదని అనలేడు.
ఈ విషయంలో మాత్రం సందేహించడం లేక త్రోసిపుచ్చడం చేయలేడు. ఈ అహం లేక ‘నేను’ ఒక గుర్తింపు. తిరిగి దీన్ని గణితశాస్త్ర పదజాలంలో పరికిస్తే
దీన్ని ‘ఒకటి’ (1) అని వీలుగా పిలుచుకోవచ్చు.
ఈ "సున్న" యొక్క
చిత్రమైన పనితీరుని గమనిద్దాం. ఈ ఉన్నది
అనుకొన్న "ఒకటి"కి ధన లేక కుడి వైపున సున్నలు చేరుస్తూపోతే దాని విలువ
పెరుగుతూ హెచ్చించుకుంటూ పోతుంది [100000.]. ఈ పెరుగుదల మనమొక నిర్ధారణకు రాలేనంత దూరం
వెళుతుంది. ఇలా పెరుగుతూపోయిన అనంత వృద్ధిని "ఇంకా మరీ ఇంకా
ఎక్కువ" అని ఉపనిషత్తులు వక్కాణించాయి.
దీన్ని సాధించడానికి నీవు చేసిందల్లా కుడి వైపునకు భగవంతుడనబడు సున్న లేక
పూజ్యాన్ని చేర్చుకుంటూ పోవడమే. అంతకు
మించి మరేమీలేదు.
తర్వాత యిప్పుడు ఉన్నది
అనుకుంటున్న "ఒకటి" లేక అహం ఎడమవైపు అంటే ఋణం వైపు సున్నలు
పెట్టుకుంటూపోండి. విరుద్ధమానసపు చర్యవల్ల
అనగా దశాంశ బిందువు వల్ల జతచేసిన సున్నలు, విలువను రానురాను
తగ్గిస్తూ సున్న సమీపమునకు మరింత సమీపమునకు మనల్ని చేరుస్తాయి [.000001]. ఇలా తగ్గుతూ తగ్గుతూ పోయిన "ఒకటి"
(అహం) విలువకు కూడా ఇదీ హద్దు అన్నది లేకుండా పడిపోతుంది. దీన్నికూడా ఉపనిషత్తులు "తక్కువ, మరింత అంతుచిక్కనంత అనంతంగా తక్కువ" అని వివరించాయి. ఈ అంతులేని (అనంత) స్థితిలో నాస్తికుడు
ఉన్నదిఅన్న "ఒకటి" అదే అహం (నేను) మరియు లేదుఅన్న సున్న అంటే భగవంతుడు,
రెండూ కూడా బుద్ధికందవు.
అదంతా కేవలం నామమాత్రమే.
కనుక భగవంతుని ఉనికికి
సంబంధించిన వివాదమంతా నిరర్థకమని నా నమ్మిక. వివిధ సంస్కృతుల మానవసమూహచరిత్రల
అనేకఅపార్థములు ఈ దేవుడను పదములో, విపరీతముగా చొరబడినందుననే
ఈ పరిస్థితేర్పడినది. వ్యక్తిగత బాధలు
మరియు ప్రాకులాటలు, వివిధ సంఘిక పరిస్థితులలో గుడ్డినమ్మకము
మరియు అర్థరహిత ఉద్వేగములకు తావిచ్చి మరింత అపార్థమునకు, గందరగోళమునకు,
భ్రష్టతకు కారణమైనది.
అందుమూలముగా సక్రమమైన మరియు హేతుబద్ధ దృక్పదముతో యోచించు మనిషి
"భగవంతుడు" అన్నమాట వినినంతనే విసుగు జెందుచున్నాడు. ఈ విధమైన విసిగించుకొనుతీరు కూడా
గుడ్డినమ్మకమువలెనే మనిషిని పతనావస్థకుదెచ్చినది.
కానీ గుడ్డినమ్మకము ఎంత తప్పుదారి పట్టించునదైనా అది మనిషికి ఒక ధైర్యాన్ని,
బలాన్ని ప్రసాదిస్తున్నది.
సమస్యా పరిష్కారమునకు
ఉద్వేగపూరిత హఠాత్‌నిర్ణయ ధోరణి వదల వలసియున్నది.
అది చూపును మందగింపజేసి మనిషి ధ్యేయ సాధనకు ఆటంకమేర్పరచును. విచక్షణ తెలివిగల మానవుడు పరిస్థితులకనుగుణముగా
తన్నుతానుద్ధరించుకొని మూఢవిశ్వాసముల గందరగోళమును ఛేదించి సత్యార్థమును
గ్రహించుగాక.
@@@@@
ప్రార్థన
ఒకటి లేక రెండుసార్లు ఉచ్చరించు.
తర్వాత
జరగవలసిన పని భగవంతుడు చేయడానికి నిరీక్షిస్తూ ఉండు. భగవంతుని కొఱకు నిరీక్షించడం నీ కర్తవ్యం.
అది
ఆయన్ను నీకోసం నిరీక్షించేట్లు చేస్తుంది.
---బాబూజీ.
ధ్యానంలో
సాధారణంగా జరిగే పొరబాట్లు
(1972 లో సర్కులర్‌గా పంపబడిన బాబూజీ గారి ఒకానొక సందేశము)
తెలుగు
అనువాదం: పి. సుబ్బరాయుడు, కడప.
హృదయములో ఈశ్వరీయ
ప్రకాశమున్నదను భావనతో హృదయముపై ధ్యానము చేయుటయే సర్వసాధారణముగా సహజమార్గమున
అనుసరింపబడుతున్న విధానము. ఇది సరళమైన పద్ధతి. కానీ ఒక్కోసారి కొందరు తమ ఆలోచనలతో
జఠిలముచేసికొని చిక్కుల కలిగించుకొనుట ద్వారా సంపూర్ణ ఫలితములను
పొందలేకపోతున్నారు. కనుక సామాన్యముగా
సాధనలో పొరబాటు జరుగుటకు వీలున్న సాంకేతిక విషయములను గుర్తించి వాటిని వివరించి
నివారణోపాయములు సూచించు ప్రయత్నమే యిది.
మనము ధ్యానంతో
ప్రారంభిస్తాము. అందులో లీనమైనప్పుడు
సమాధి తొలిదశ లేక ఏకాగ్రతకు చేరుకుంటాము.
ఈ ఏకాగ్రత వేరు. సామాన్యార్థములో
చెప్పుకొనే ఏకాగ్రతకు ఇచ్ఛాశక్తిని ప్రయోగించవలసి వుంటుంది. కానీ ఈ ఏకాగ్రత కొఱకు అభ్యాసి తనలో తాను ఘర్షణ
పడవలసిన పనిలేదు. తన ఉనికి ఆ ఒక్క యోచన
లేక భావనలో లీనమై ధ్యానంలో వుంటే ఈ ఏకాగ్రత సహజసిద్ధంగా దానికై అదే
కలుగుతుంది. కనుక ఏకాగ్రతా భావనను వదిలేసి
సరళమైన సహజమైన పద్ధతిలో ధ్యానసాధన చేయవలెను.
ధ్యానంలో ఒకే ధ్యేయంపై మళ్ళీమళ్ళీ యోచించడం జరుగుతుంది. తొలుదొల్త అది కొన్ని వెలుతులతో, అంతరాయములతో సాగుచుండవచ్చును.
కానీ కొంత కాలం తర్వాత మనకు తెలియకుండానే అతీంద్రియ మనస్సులో యోచన
నిరంతరాయంగా కొనసాగుతూ వుంటుంది. అదే సరైన
ధ్యానము. ఇట్టి దృక్పదంతో మనం ధ్యానం
మాత్రమే చేస్తూ ఏకాగ్రతకేమాత్రం ప్రయత్నించక, మానసిక శారీరక
ఒత్తిడులకు తావియ్యక అతి సరళంగా సాగిపోవాలి.
అభ్యాసి ఇబ్బందికి లోనయ్యే
ఇంకో పొరబాటు, తనకు ప్రకాశం కనబడలేదని, అసలు తను ధ్యానం చేయవలసిన హృదయస్థానం తెలియడంలేదని వాపోవడం. ఇది కేవలం అవగాహనా లోపమే. మన ప్రయత్నం నిజానికి వెలుగును చూచుట కొఱకు
కాదు, అది ఒక సూచనప్రాయమైన ఊహ. ప్రకాశమున్నదన్న భావనయే చాలును. వెలుగు చూడవలెనని ప్రాకులాడటమంటే మనస్సును
స్థూలమైన పొరక్రిందికి చేర్చడమవుతుంది.
ఇదంతా కేవలం వారి భ్రమ ఫలితమే.
కనుక వారికి దృగ్గోచరమైనది కల్పితమేగాని వాస్తవం కాదు. నిజానికి వెలుగు మనధ్యేయంకాదు. దీన్ని మన ఆలోచన నిలుపడానికొక ఆధారంగా మాత్రమే
గ్రహిస్తున్నాము. అందుండి మనం అసలు సిసలైన
ఆ వెలుగుల వైభవాంచితుని వైపుకు పయనిస్తాం.
ఈ విధంగా మనం గుణం నుండి గుణధాముని వరకు, కనబడేదాని
నుండి అతీతసత్యం వరకు సాగిపోతాం. కనుక
వెలుగును చూడుట లేక చూడకపోవుటన్నది అప్రస్తుతాంశము. మనస్సును హృదయం వైపుకు మరల్చి అచట ఈశ్వరీయ ప్రకాశమున్నదన్న
భావనామాత్రపు ఊహయే చాలును. ఇదియే సరియైన
విధానము. హృదయస్థానము ఇదేయని గుర్తించు
యత్నము, వెలుగును చూచు ప్రయత్నమును మానుకొనవలెను. ధ్యానసమయంలో ఎఱుక, నీ
యోచన జడమానసముతో సంబంధమేర్పడియున్నంత వరకు వుండును. అది లోతుగా చైతన్యపు అంతరాంతరపొరల్లోకి చొచ్చుకొనిపోయేకొద్ది
బాహ్యమైన ఎఱుక లోపిస్తుంది. అయినా
నిశ్శబ్ద ధ్యానం ఎఱుకలేని స్థితిలోగూడా అతీంద్రియ మనస్సులో కొనసాగుతూ
వుంటుంది. ఈ పరిస్థితులలో
చేయవలసిందొక్కటే. అది నిన్ను నీవు
మరచిపోయావన్న సంగతి జ్ఞాపకానికి రాగానే తిరిగి నీ ధ్యేయంపైకి మనస్సును త్రిప్పి సౌమ్యంగా
ధ్యానంలోకి జారుకోవడమే. అంతేగాని
ముందుండిన మరపుస్థితిని గురించిన చింత పనికిరాదు.
ఇంకో పొరపాటు. బహుఃశా ఇది చాలా తీవ్రమైనదనవచ్చు. అదేమంటే ధ్యానంలో విపరీతమైన ఇతర ఆలోచనా
ప్రవాహము. ఇదే అభ్యాసిని చాలా బాధించే
విషయము. నిజానికి దీన్ని సరిగా అర్థంచేసుకోకపోవడంవల్లే
అలా వ్యధచెందడం జరుగుతున్నది. ఈ నిరంతర
ఆలోచనా ప్రవాహం ఒక్క ధ్యాన సమయానికే పరిమితమై లేదు. అది అన్ని సమయాల్లోను వుండనే వుంది. కాని
ధ్యానసమయంలో అది విపరీతంగా వున్నట్లు గమనిస్తాము. ఎందుకంటే ఆ సమయంలో మనలోని భావాలను ఆలోచనలను మనం
ఖాళీచేసుకోవాలనే యత్నం చేస్తాం. ఒక పెద్ద
యోచనా భాండాగారం మన చైతన్యపు లోతుపొరల క్రింద పూడ్చిపెట్టబడివుంది. ధ్యానం ద్వారా మన బాహ్యమానసంలో శూన్యం
ఏర్పడుతుంది. ఆ శూన్యంలోనికి లోతుపొరలలో
నిక్షిప్తమైయున్న యోచనలు బలంగా త్రోసుకొనివచ్చి బాహ్యమానసాన్ని కొంత యిబ్బంది పెడతాయి. క్రమబద్ధముగాని మనస్సు ఆ ఆలోచనల చొరబాటుకు
తల్లడిల్లి అనేకవిధములైన ఇబ్బందులకు అలజడులకు గురౌతున్నది. నిజానికి ఉత్పన్నమైన ఆలోచనలు అభ్యాసిని ఇబ్బంది
పెట్టడంలేదు కాని అతడు అనవసరంగా వాటికి లేనిప్రాధాన్యతనిచ్చి వాటిని పట్టించుకొని
వాటితో పోరాటానికి దిగి అలజడికి గురౌతున్నాడు.
ఆ ఆలోచనలతో ప్రతిచర్యకు దిగుటవల్లనే అవి మరింత శక్తివంతములై అలజడి
హెచ్చింపబడుతున్నది. వాస్తవానికి మనస్సును
అదుపుచేయటంకాదు కావలసినది. దాని
కార్యకలాపములను క్రమముగా మలచుకొని క్రమబద్ధీకరణ చేసుకొనుటే అవసరమైయున్నది. ఇది చెర్నాకోల ప్రయోగం వలన సరిదిద్దబడదు. అంతర్గత మాలిన్య నిర్మూలనా ప్రక్రియ ద్వారా
మలినములను బయటికి నెట్టివేయుట ద్వారానే సాధ్యము.
ఇదొక్కటే మనిషిని నిజమైన మనిషిగా మార్పుచేయగల ఏకైక మార్గము. ఆధ్యాత్మిక ప్రయోజనం కొఱకు సాధ్యమైనతవరకు
మనల్ని మనము అలోచనారహితంగా వుంచుకొనవలెను.
కానీ అది ఆలోచన నణచిపెట్టడం వల్ల సాధ్యపడదు. మనస్సులోని విషాన్ని బయటికి త్రోసివెయ్యడమే
దానికి పరిష్కారము. అదే ఆలోచనల ఉత్పత్తిని
అరికట్టగలదు. నిక్షిప్తమైయుండి, పైకెగదన్నుకొనివచ్చు ఆలోచనలు, వాటి భాండాగారము నుండి
అనుభవము (భోగ) రూపమున బయటపడి వాటి స్థావరము ఖాళీయైపోవుటకు సహాయపడుచున్నవి. ఈ విధంగా కొంతకాలమునకు అభ్యాసి ఆలోచనల భారము
నుండి విడుదలపొంది ప్రశాంతస్థితికి వచ్చును.
అతని మానసకాసారం అలల ఆటుపోట్లులేనిదై అంతరంగము పరిపూర్ణ
ప్రాశాంతమయమైయుండును.
--OO0OO--
దైవానుగ్రమును
గురించి మనమెప్పుడేగాని
నిరాశ, నిస్పృహ చెందకూడదు.
అంతా
గురువుగారికి వదిలెయ్యాలి.
నిజమైన
అన్వేషకునికి ఏది సంప్రాప్తమైనా,
అది
అతని మార్గమందు పురోభివృద్ధి కొఱకే జరుగుతుంది.
---బాబూజీ.
పూజ్య
సద్గురు శ్రీరామచంద్రజీ మహరాజ్ వారి దివ్యజ్ఞాన ప్రసారము
1. తన అలవాట్లకు దాసుడైనవాడు కూడా విగ్రహారాధకుడే
అవుతాడు. ఇది ఇలా జరగాలి అనుకుంటాం. కానీ
అది అలా జరగదు. అంటే మనఇష్టప్రకారం జరగాలి
అనుకోవడం కూడా విగ్రహారాధనే. ప్రాపంచిక
వస్తువులపై మమకారం కలిగి వుండటమంతా విగ్రహారాధనే.
దీన్నుండి విడుదల పొందాలంటే మన మనస్సుపై ప్రాపంచిక విషయ వాసనలు
అంటుకొనరాదు.(ఋతవాణి-2)
2. సృష్ట్యాదిలో మానవత్వము, దివ్యత్వము దగ్గరి సంబంధము కలిగియుండినవి. పరిణామక్రమములో ఏర్పడిన చర్య, ప్రతిచర్యల కారణమున అంతా స్థూలమై పొయినది. తొలుత వుండిన ఆ బంధము తిరిగి
ఏర్పడవలెనన్న మానవాకృతిలోవున్న సమస్తమును తన నిజస్థితియైన సమత్వము మరియు
ప్రశాంతతకు తిరిగిరావలెను. అందులకై సమతను
లోనికి ప్రవేశపెట్టవలెను. అదే సహజమార్గములో జరుగుతున్నది.
మన అనుదిన ధ్యానము ద్వారా చెదిరిన సమతాభావనను
సరిదిద్దుకొను ప్రయత్నము చేయుచున్నాము. తద్వారా మన ఇచ్ఛాశక్తి పనిచేసి సమతను సుస్థిరపరచుచున్నది.
మనలోని మానవత్వము దివ్యత్వముగా మార్పుచెందడం మొదలౌతుంది. నిజానికి దైవత్వము
సిద్దించడమంటే ఇదే.(సహజమార్గ దర్శనము)
3. ఏ సత్యతత్త్వము నుండి మనం వెలువడ్డామో అందులోనే
లీనమవ్వడానికి సహాయమందివ్వబడుతున్నది. విడివడినప్పుడు ఆ అనంతత్త్వపుసత్తా మనవెంట
తెచ్చుకున్నాం. దాన్ని మనం అంటిపెట్టుకుని
వుండటం ద్వారా మన యోచనలకు స్వేచ్ఛనుగలిగించి తిరిగి ఆ అనంతత్త్వములో కలిసి
పోవాలి. దీన్ని మనం నిర్లక్ష్యం చేస్తే మన
ఆలోచనా కార్యక్రమములోనే యిరుక్కుపోతాం. అనంతమైన మూలసత్యపు పరిధిలోనికి
ప్రవేశించలేక దూరమైపోతాం. (సందేశమాలిక)
4. మనం మన గమ్యానికి దగ్గరౌతున్నాము. దానికి మూడు గుర్తులున్నాయి. అవి అ)దివ్యమైన
నడవడి. ఆ)దివ్యజ్ఞానము ఇ)దివ్యమైన ఆలోచన. (ఋతవాణి-2).
5. మనం మన ప్రత్యేక వ్యక్తిత్వాన్ని ఏర్పరచుకొని
స్థూలము మరియు చీకటిపొరలను ఒకదానిపై ఒకటి చుట్టబెట్టుకుంటూ మనదైన ఒక స్వల్ప
సృష్టిని ఏర్పరచుకున్నాం. ఇప్పుడు మనం ఆపొరలనన్నింటిని ఒకదాని వెనుక ఒకటిగా
విచ్ఛిన్నం చేసి సృష్ట్యాదిలో వున్నటువంటి స్వచ్ఛమైనస్థితికి తిరిగి
చేరుకోవలసివుంది. ఇదే సంక్షిప్తంగా మన సహజమార్గ ఆధ్యాత్మిక విధానము. మనకై మనం సృష్టించుకొన్న మన స్వల్ప సృష్టిని
క్రమేణ కడిగి తుడిచేయాలి. లేక మనం వెనక్కి మరలాలి.(సం.మా)
6. సహజమార్గ సాధన ద్వారా మన ఇంద్రియ
ప్రవృత్తులన్నీ సహజమార్గ పద్దతిలో క్రమబద్దము చేయబడి, తొలుదొల్త మానవాకృతి ఏర్పడినప్పుడు వున్న స్వచ్ఛస్థితికి తేబడతాయి.
అంతేకాదు, వాటి ఇచ్ఛానుసారం ప్రవర్తిస్తున్న అధమ మానసిక
వృత్తులు అతీంద్రియ స్థితికి లోబడి వుండునట్లు మలచబడతాయి. అందువల్ల వాటి వికృతచేష్టలు నిలిచిపోతాయి. అధఃకేంద్రములు దివ్యకేంద్రముల అధీనములోనికి
తేబడతాయి. సమూలాగ్రం ఈవిధంగా దివ్యత్వం
గావింప బడుతుంది(స.మా.ద.).
7. ఓర్పు, నమ్రతకు
పాఠశాల గృహమే. ఒకరకంగా యోచిస్తే
కొన్నిసమయాల్లో ఓర్పు కలిగియుండడమే ఒక తపస్సు.
అది యితర తపములన్నిటికంటే కూడా గొప్పది. దుఃఖముతోనో, ఆగ్రహముతోనో
మెలగక గైరాత్‌స్థితిని(సిగ్గుతో తలవంచుకపోవడం) అలవరచుకోవాలి. ఇతరులు తిట్లు, చీవాట్లు
పెట్టినపుడు, తప్పు నాలోనే వున్నందుననే అలా జరిగిందని
భావించడమే పశ్చాత్తాపబుద్ది. అలావుంటూ
ఓర్పువహించాలి. ఓర్పు సహనం కావాలని, ప్రాపంచిక
ఒడుదుడుకులనుండి విముక్తి పొందాలని,
తపస్సుకు అరణ్యవాసం సన్యాసం ఒంటరితనం అవసరమని ఇతరులంటారు. కానీ మనకు మనకుటుంబ సభ్యుల, మిత్రుల మరియు ఇతరజనుల తిట్లు, చీవాట్లు, నిందలు, బెదిరింపులను సంయమనంతో భరించడమే నిజమైన
తపస్సు--(స్వీయ చరిత్ర-1).
8. నా అర్థంలో దేనిపై ఏర్పడ్డ ప్రతిబింబ
ప్రతిరూపాలు ఇక్కడ ప్రతిఫలిస్తాయి అదే
బ్రహ్మాండము లేక గగన మండలము. ప్రతీదీ మొదట
అక్కడ సూక్ష్మరూపంలో వ్యక్తమై తర్వాత ఈవిశ్వంలో అది రూపుదాలుస్తుంది. (దశాదేశముల
వ్యాఖ్యానము)
9. అతిత్వరితముగా గమ్యము చేరవలెననెడు ఆతురత లేక
నిరంతర ఆవేదనయే మనకు త్వరగా విజయమును చేకూర్చు అత్యంత ముఖ్యాంశము. అనంతశాంతి, ప్రశాంతతయైన ఆ సత్యతత్త్వమును పొందునంత వరకు రవ్వంత సమయమైనను
విశ్రమించుటకు వీలులేదు. ఒక వస్తువును
పొందవలెనను తీవ్రఆకాంక్ష దానిని పొందునంతదనుక ఆతురతగలిగించును. కోరిన వస్తువు లభించినంతవరకు శాంతించుట జరుగదు
(సత్యోదయము).
10.
మనస్సులో ఆలోచనలు వరుసగా ఉత్పన్నమౌతున్నా, హృదయబిందువులో
లీనమైన స్థితిలో తన్నుతాను కోల్పోయి వుండగలడు. అక్కడ ఆలోచనల చొరబాటుకు అయిష్టత
ఏర్పడుతుంది. లీనమైపోవడము లేక తన్నుతాను
కోల్పోవడమన్నది అనేక రూపాల్లో వుంటుంది.
ఇది ప్రతి స్థాయిలోను కలుగుతుంది.
కానీ ఒకసారి కలిగినదానికి మరొకసారి కలిగిన దానికి తేడా వుండనే
వుంటుంది. మొదట ఎఱుక గోల్పోయిన(తన్ను తాను
గోల్పోయిన)స్థితిని హృదయస్థాన స్థిరత్వము అనబడును. ఇక్కడ మనలోని కోరికలు పైకుబికి అలజడి కలిగించుట
శాంతించి వుండును. సాంసారిక జీవనములోని
అధమ స్థాయిలలో ఉబికి వచ్చిన యోచనా వివాదముల అలజడికి సంబంధించిన స్థౌల్యము నుండి
యిక్కడ స్వేచ్చను పొందియుందుము.(స్వీ.చ.-1)
11.
వాంఛలు అంతమగుట అనగా సంస్కారములేర్పడుట నిలచిపోవుటే. ఇక మిగిలి యున్నది పూర్వసంస్కారముల
ఫలములననుభవించుటే. అది జీవితము
కొనసాగుతున్న సమయంలో పూర్తిచేసుకుంటాము. (సత్యో)
12.
నాగురుదేవులు ప్రాణాహుతి శక్తి ప్రసారముగావించిన మొదటి రోజుననే నాలో గురుదేవుల
స్మరణ ఉత్పన్నమైనది. దానిని నేను మూడు
విషయములతో కొనసాగిస్తున్నాను. అవి
(అ)గురువుగారి సతత స్మరణ.(ఆ)నా గురుదేవులు కలిగియుండిన లయావస్థ స్థితిని పొందుటకు
నన్ను నేను సరిచేసుకొనుచుండుట.(ఇ)ఏసమయంలో నేను ఏస్థితిలో వున్నానో దానికి
సంబంధించిన విషయాలను గుర్తించుట మరియు అనుభవములోనికి తెచ్చుకొనుట.(స్వీ.చ.-1)
13.
ధ్యాన సమయంలో నీవు ఒకదానికోసం నిరీక్షిస్తావు.
అదే భగవంతుడు. నిరంతర ప్రయత్నము
వలన నిరీక్షణ సహజంగా ఒక విధమైన ఆకర్షణను కలిగిస్తుంది. అది ఒక ఆత్మను నీవు పిలవగలిగిన స్థాయికి
ఎదుగుతుంది. ఆ ఆకర్షణ తన అత్యున్నత
స్థాయికి చేరిందంటే గొప్ప గొప్ప ఆత్మలు సైతం రానని తిరస్కరించలేవు. భగవత్తత్వము లోపించడమువలన మానవుని శక్తి తెలియ
రాకున్నది.(స్వీ.చ-1)
14.
ధ్యాన సమయంలో నీవుకాదు నీగురువే తన రూపంపై తానే ధ్యానం చేయుచున్నట్లు
భావించినట్లయితే అది అద్భుత ఫలితాన్నిస్తుంది. (సత్యో)
15.
మనస్సును గమ్యంవైపునకు మరలిస్తే సాక్షాత్కారము చాలా సులభము. అంటే దాని లోతైన ముద్ర హృదయంపై ఏర్పడాలి. ముద్ర ఎంత లోతైనదైతే విజయం అంత త్వరగాను, సులభంగాను లభిస్తుంది. అంత చేసిన
తర్వాత ఇకచేయవలసిందట్టే మిగిలి వుండదు. ఆ
భగవంతుని ముద్ర హృదయంపై పడటమంటే తను ఆశించినదంతా గ్రహించినట్లే. ఇట్టి స్థితిలో భగవదీయ ఆలోచన హృదయంలో కొనసాగుతూ
వుంటుంది. ఈ సమయమంతా హృదయం భగవంతుని ఆకర్షణకులోనై
వుంటుంది. "నిరంతరస్మరణ" అంటే
ఖచ్చితంగాయిదే (ఋవా-2).
16.
ఈవిశ్వము వునికిలోనికి రావడానికి కారణభూతమైన ప్రకంపన సృష్ట్యాదిలో కలిగింది. వాస్తవానికి స్మరణ ఆ తొలి ప్రకంపనతో
దగ్గరిసంబంధం కలిగి వుంది. (ఋ.వా-2)
17.
ప్రతిదీ భగవంతుని నుండే వచ్చిందన్న విషయం గుర్తుంచుకోవాలి. సాటి జీవులు కూడా ఆయన సృష్టే. ఆయన సర్వాధినేత. మనలో కొందర్ని ఆయన మనకోసం ప్రత్యేకంగా
నియమించవచ్చు కానీ మనందరం ఆయన బిడ్డలం. (ఋ.వా.2)
18.
మనం ప్రతిచర్యలోను ఆ దివ్యశక్తితో అనుక్షణం విడదీయరాని మానసికసంబంధం
కలిగియున్నామన్న భావనతో వుండాలి. మన చేతలు, పనులు అన్నీ మనము మనశక్తి మేరకు సేవించవలసిన ఆ మహాప్రభువు మనకు కేటాయించిన
దివ్య కర్తవ్యములుగా భావించి నెరవేర్చుకుంటూ పొతే ఇది సుసాధ్యమౌతుంది. (సత్యో)
19.
మన మనస్సును భగవంతుని వైపు మరల్చినంతనే మన చేతలు, పనులన్నింటిలో మనమా దివ్యశక్తితో సంబంధమున్నట్లు అనుభూతి చెందుతాము. అంతర్గతంగా ఈస్థితి శాశ్వతంగా నెలకొంటే,
చేసే ప్రతి పని భగవత్ భక్తిలో భాగము లేక దైవ కైంకర్యముగా
భాసిల్లుతుంది. అప్పుడు మనం సర్వవేళలా ఆ భగవంతుని సతత స్మరణలో వుండిపోతాము(సత్యో).
20.
రోజులో చాలాభాగం మాటిమాటికి భగవంతుని జ్ఞాపకం చేసుకుంటూపోతే, భగవంతునిపై ప్రేమ దానంతటదే ఉత్పన్నమౌతుంది. దీన్ని అక్కరతో కొనసాగిస్తే వీలైనంత త్వరగా
భగవంతునిలో లీనమైపోదామనే తీవ్ర ఆతృత హృదయంలో రేకెత్తుతుంది. (సత్యో)
21.
మనం కర్తవ్యపరంగా మేల్కొల్పబడి మన హృదయాలలో భగవత్‌భావన శాశ్వతంగా నెలకొనగానే
ప్రపంచంలోని విషయములన్నింటికంటే భగవత్ సాక్షాత్కారమే జీవితంలో అత్యంత ప్రాధాన్యత
గల విషయంగా గోచరిస్తుంది. సహజంగానే మనలోని
ఆ తీవ్రఆకాంక్ష వృద్దిచెంది మనం రోజువారి పనులతో, చింతలతో ఎంత సతమతమౌతూవున్నా పలుమారు భగవంతుని స్మరణలోనికి కొంపోబడతాము.
(సత్యో)
22.
భగవంతునికి మనిషికి అనుసంధాన కర్త గురువు.
అతని ద్వారా మాత్రమే మనము భగవంతుని చేరగలము. ఆయన మాత్రమే మన మార్గములోని చిక్కుల నుండి
గట్టెక్కించగల ఏకైక శక్తి.(స.మా.ద)
23.
జ్యోతి యిప్పటికే వెలిగింపబడియున్నది.
భక్తి నిండిన హృదయములు మాత్రమే ఆ వెలుగునాస్వాదించి మేలు పొందగలవు. ఈసదవకాశము
మళ్ళీ భవిష్యత్తులో వస్తుందనుకుంటున్నావా? అటువంటి
దివ్య పురుషుడు మళ్ళీమళ్ళీ అవతరిస్తాడనుకుంటున్నావా? ఇటువంటి
కార్యములకై మున్నవతరించిన మహనీయులతో ఈయనను పోల్చిచూడగలమా? అవతారమూర్తులనెడి
వారిలో యింతటి వారుండిరా? ఖచ్చితంగా లేరు. ఇది ఆ సర్వేశ్వరుని నిర్ణయానుసారమేర్పడిన ఒక
అరుదైన అవకాశము. ప్రకృతి కార్యమునకై అవతరించిన ఈ మహనీయుడు శక్తిలోను, ప్రకృతి కార్యనిర్వహణ- మందును మునుపటి అవతారములకన్న మిన్న.(ఋ.వా-1)
24.
భగవదీయ మార్గములో పయనిస్తున్న వ్యక్తికి తన స్వంత ప్రళయమే ఏకైక పరిష్కారము. దానికై
పట్టుదలతో ప్రయత్నించ వలసి వున్నది. అందుకు ప్రేమ, భక్తిభావములే ముఖ్యాంశములు. అందులో మునిగిన వాడు నిజజీవితములో ముఖ్యముగా
పొందవలసినది మరియు పరమ గమ్యము అయిన దివ్య శాశ్వత ఉనికిలోనే గట్టేక్కుతాడు.(ఋ.వా-1)
25.
ఆధ్యాత్మికత తత్సంబంధిత దుస్తులలో లేదు. కానీ ఆదుస్తులు ధరించే వ్యక్తిలో వుంది.
సూత్రము విస్మరించబడింది. మానవ మేధస్సు గ్రహించ వీలుకానంత వేగంగా కాలము
మారిపోనున్నది. కలలో కూడా ఊహించలేనంతగా
మార్పు సంభవించి యిప్పుడున్నదంతా త్వరితగతిని మారిపోనున్నది. మార్పు, మార్పు మాత్రమే బలంగా నెట్టుకొని వచ్చుచున్నది ఇది నీపై (రామచంద్ర)
మాత్రమే ఆధారపడనున్నది. (స్వీ.చ.2-వాల్యూము-2)
26.
ఎవరైనా తమ హృదయంలో నా యెడల ప్రేమ గలిగి యున్నట్లు నేను గమనిస్తే నేను మహదానందంతోను, ఉత్సాహంతోను నిండిపోతాను. ఈప్రపంచంలో ప్రేమించడానికి, ఇష్టపడటానికీ ఎంతో వుంది. ఐనా నన్నే
వారు ఎందుకెంచుకున్నారు?(అ)తన్ను తానే కోల్పోయిన వాడు కానీ (ఆ)
కనీసం కోల్పోదలచుకున్న వాడు కానీ (ఇ) సర్వస్వం వదలుకోదలచిన వాడు కానీ బహుఃశా నా వైపుకు మొగ్గు చూపుతారు. (ఋ.వా-1)
27.
మన ఈ బయటి ప్రపంచ జీవితానికి ఆవల నున్న నూతన జీవితంలోనికిప్పుడు ప్రవేశించవలసి
వుంది. కనబడే ఈమనిషి వెనుక అసలు మనిషి
వున్నాడని మనం చెప్పవచ్చు. ఇప్పుడు నీవు
నిజమైన జీవితంలోకి ప్రవేశించాలంటే నీవు అసలు మనిషిని లేక మనిషిలోపలి మనిషిని లేక
మనిషికావలనున్న మనిషిని వెతకాలి. అది హృదయ
నేత్రంతోనే కనుగొన వీలౌతుంది. శరీరంలోని అణువు, పరమాణువుల్లో ఆఅనుభూతి కలుగుతుంది.
దేహధారియైయున్నప్పటికి, అతడు దేహానికేవిధంగానూ సంబంధము కలిగి వుండడు. అతడు శూన్యమునకు అతి చేరువలో
వుంటాడు. అతని ఆచ్ఛాదన ఈసమస్త
విశ్వమయమైయుంటుంది. అందులో అతని పని అతనిదైవుంటుంది. అతన్ని గుర్తించడం నిజమైన
సమస్య. గురుదేవుని కృపవలన సమస్తమూ నాపై గ్రుమ్మరింపబడుతూవుంది. అదంతా ప్రాణాహుతి ప్రసారంద్వారా
అభ్యాసులకు అందచేస్తున్నాను. వారినుండి తిరిగి యేమీ ఆశించకుండా కేవలం
ఇదినాకర్తవ్యంగా భావిస్తున్నాను. అయినా అభ్యాసులకు తనంతట అదే వారికి చెందినదై,
అప్పుచెల్లించిన రీతిలో వారికి అందచేయబడుతున్నది. (ఋ.వా-1)
28.
ఆయన ఎవర్ని ఆకర్షిస్తాడో వారు మాత్రమే విజయం సాధిస్తారన్నది అసలు విషయం. నీవూ, నేను కాళ్ళూ, చేతులతో తాళం వేయడం వృధా.
సమయమాసన్నమైనప్పుడు అందరూ ఒకరి వెనుక ఒకరు సరియైన మార్గానికి వచ్చిచేరుతారు.
ఉద్వేగాలు, సంస్కారాలు మనిషి మనిషికి వేరువేరుగా వుంటాయి.
తదనుగుణంగానే ఎవరి సమయం వారికి వేరువేరుగా వస్తుంది. (స్వీ.చ.-1)
29.
ప్రభుసదనము మనతో నేరుగా సంబంధము గలిగి యుండి మనమున్న ఈప్రపంచాన్ని
నియంత్రిస్తున్నది. కనుకనే ఏలోకములోను లేని రీతిన ఈలోకములోనే అవతార పురుషులు
ఉద్భవిస్తున్నారు. ఈరీతిన మనం (మనలోకం) ఆ ప్రభుసదనంతో
సంబంధమేర్పరచుకొని వున్నాం. కనుకనే ఆ దివ్యసదనంలోని శక్తి మనలోనూ వుంది. ఆశక్తి
మొదటి కదలిక ద్వారా వెలువడింది. అది సర్వశక్తులు ఏకీకృతమైన మహాశక్తి. కనుకనే అది
మిగిలిన శక్తులన్నింటి కంటే గొప్పది మరియు కాంతివంతమైనది. (రాజయోగ ప్రభావం)
30.
సాంసారిక ఒడుదుడుకులను, ఇబ్బందులను గురించి
చర్చిస్తూ మాగురుదేవులు, ఓర్పు, సహనమునకు
మన గృహమే మనకు శిక్షణాలయము అనెడివారు.
సాంసారిక జీవనంలోని కష్టములను ఓర్పుతో సహించుకొని పోవడమే మనకొక గొప్ప
తపస్సు. ఇదే మిగిలిన తపస్సులకన్నా
శ్రేష్ఠమైనది. కనుక ఇట్టి పరిస్థితులలో
మనము కోపతాపములకు తావీయక, ఎదురు ప్రశ్నింపక, తప్పు మనయందుండుట వలననే యిట్లయినదని తలంచి ప్రశాంతచిత్తముతో భరించుటే మనం
చేయవలసినది. మన స్నేహితుల, బంధువుల తిట్లు తిరస్కారములే మన
గొప్ప తపస్సు. అదే విజయమునకు తిరుగులేని మార్గము. (సత్యో)
31.
నామటుకు నాకు కష్టములకు దుఃఖములకు సంబంధించిన అనుభవములున్నవి. వాటిని గురించి నేను
లోతుగా ఆలోచించి ఒక నిర్ణయానికొచ్చాను. ఈ కష్టాలు జబ్బులు ప్రకృతి మనకొసగిన అదృశ్య
వరములు. అవి మన సంస్కారముల ప్రభావం నుండి బయట పడుటకు సహాయపడును. అవి నిశ్శేషమైపోతే
ఆధ్యాత్మిక ప్రగతికిక అడ్డేవుండదు. కాని మనస్సు మాత్రం అంతర్గతంగా గమ్యంవైపే
వుండాలి. (ఋ.వా)
32.
నేను పేదరికాన్ని ఎన్నుకుంటాను. కాస్త ఉప్పువేసిన రొట్టె తప్ప ఇంకేమి లేని స్థితి
నాకు చాలా ప్రియమైనది. ఇప్పటివరకు ఒక్కరు కూడా ఆస్థితిని పొందటానికి ముందుకు
రాకపోవడం నిజంగా దయానీయమైన పరిస్థితి. (ఋ.వా-1)
33.
ధ్యాన సమయంలో అనేకమైన ఆలోచనలు మనస్సులోనికి చొరబడుతున్నాయని సామాన్యంగా ఫిర్యాదు
చేస్తుంటారు. మనస్సు నిశ్చల స్థితికి
రాలేదుగనుక తమ సాధనలో తాము విఫలమైనామని వాపోతారు. కానీ అది సరి కాదు. మనం
ఏకాగ్రతను కాదు, ధ్యాన సాధన చేస్తున్నాం. ఆ సమయంలో వచ్చిన ఇతర
యోచనలను ఖాతరు చేయకుండా ధ్యానం కొనసాగించాలి. విశ్రాంతిలేని మన ఎఱుకగల మనస్సు
యొక్క కార్యకలాపమే ఈ ఎడతెఱపిలేని యోచనా ప్రవాహము. మన ఎఱుకగల మనస్సు ఎనలేని యోచనలతో అటూ ఇటూ సంచరిస్తున్నా,
మన అంతర్గత మనస్సులో తీరికలేని ధ్యానస్థితిలో కొనసాగుతూనే వుంటాం.
కనుక మనం ఏవిధంగానూ నష్టపోవడంలేదు. కాలము గడచేకొద్దీ తగు సాధనయొక్క ఫలితంగా ఆ ఎఱుకగల
మనస్సు సైతం సరిదిద్దబడి అంతర్గత మనస్సుకు అనుగుణంగా మార్పుచెంది సానుకూలంగా
పనిచేస్తుంది. (సత్యో)
34.
ప్రభువును నిజంగా తన ప్రభువే అని అంగీకరించి నమ్మి భక్తుడై అతని సేవలోనే పూర్తిగా
నిమగ్నమవ్వడముతోనే మానవుడు పరిపూర్ణుడౌతాడు. అలా చేయడం ద్వారా నీలో ఒక శూన్యస్థితి
ఏర్పడుతుంది. అప్పుడు ప్రభువు యొక్క దృష్టి నేరుగా నీపైపడుతుంది. (ద.దే.వ్యా.)
35.
ప్రభువు యొక్క సాన్నిహిత్యాన్ని కొనసాగిస్తూ ఆయనయందే మనస్సును ఎదోవిధంగా నిలిపి, ఆయన వాడుగానే జీవనం సాగించాలి. అప్పుడు మర్యాదకరమైన జీవన విధానము మరో
మలుపు తిరుగుతుంది. మనము తెలియక చేసిన తప్పులను, నియమ
విరుద్దములైన పనులను మన ప్రభువుగా అంగీకరించిన ఆయన ఎదుట బహిరంగముగా ఒప్పుకొని
నివేదించుకొనవలెను. ఈవిధంగా చేయడం వల్ల మన అశక్తతను నిరూపించుకొంటాము. మన అశక్తతను
హృదయపూర్వకంగా తెలియజేస్తూ తప్పులను నిర్మొహమాటంగా ఒప్పుకొనడం వలన ప్రభువు మనతప్పులు
క్షమించ దగినవేనని భావిస్తాడు. (ద.దే.వ్యా.)
36.
హృదయస్థానంలో "దివ్య ప్రకాశము" వున్నది అన్న భావనతో ధ్యానం చేస్తూపోతే
మనం క్రమేణా పైకెదగడం మొదలౌతుంది. మరింత స్పష్టంగా చెప్పాలంటే ఇది మొదటి దశ, గనుక అభ్యాసి అక్కడ అంతర్గత ఎఱుకలో మరింత లోతుకు మునగడానికి విశాలత్వాన్ని
గమనిస్తాడు. అంటే మనం అనంతతత్త్వపు బీజాన్ని నాటామన్నమాట. మరో మాటలో చెప్పాలంటే మన
దృక్పథం నుండి తప్పించుకొన్నదానిని తిరిగి దృష్టిపథం లోనికి తెచ్చామన్న మాట. ఇక
రెండవ దశ మన దృక్పథంలోనికొస్తుంది. మనిషి ప్రతి జీవపదార్థంలోనూ భగవంతుడున్నట్లు అనుభూతి
చెందుతాడు. మూడవదిగా మనిషి ప్రతీదీ మార్పుకుగురౌతున్నట్లు గమనిస్తాడు. ఇది కూడా
మారి మనిషి ప్రతీది కూడా భగవంతుని నుండి వచ్చిందే, అన్నీ ఆయన
స్వరూపాలే అన్న అనుభూతిని పొందుతాడు. ఇక నాల్గవది శూన్యస్థితిలో మొదలౌతుంది. అదే
తుదకు మనమంతా పొందవలసింది. (ఋ.వా-2)
37.
మనోవికారములు(కామ,క్రోధ,మోహాదులు) అంతమైతే తెలివి
పూర్తిగా నశిస్తుంది. కారణమేమంటే మనోవికారములు స్పందనలను కలుగచేస్తాయి. ఆస్పందనలే
తెలివినుత్పాదిస్తాయి. కనుకనే వాటిని క్రమబద్దీకరించాలి. మరో రీతిగా చెప్పాలంటే
పాశవిక మనోవికారములను మానవీయ మనోభావాలుగా మార్పుచేయాలి. (ఋ.వా-1)
38.
ఆధ్యాత్మికత నిజానికి అత్యంత సూక్ష్మమైన మానసిక స్థితి. దానితో పోల్చినపుడు మిగిలినవన్నీ బరువుగాను
స్థూలంగాను అనిపిస్తాయి. గులాబిపువ్వు యొక్క సువాసన హృదయముపై కలిగించు సున్నితమైన
అనుభూతి సైతం దానితో పోలిస్తే బరువైనదే. ఆ
స్థితిని నేను ప్రకృతితో అనువైన పొందిక గలిగిన సంపూర్ణ ప్రశాంతత సమతాస్థితి అని
వ్యక్తీకరించదలతును. ఇట్టి మానసిక
స్థితిలో మన ఇంద్రియ సంబంధమైన ప్రజ్ఞాపాటవములు నిద్రాణావస్థలో వుండును. వాటి పని
దానంతటదే జరుగుతూ మనస్సుపై ఏ విధమైన ప్రభావము పడని రీతిలో నుండును. (సత్యో)
39.
సృష్టికి పూర్వము కేవలము ఆకాశము(భూమా) మాత్రమే ఆవరించియుండెను. కనుక
భగవంతుడుండుటయన్నది తర్వాత పరిణామమే. అది వ్యక్తమగుటకు కొంత సమయము పట్టెను. ఆకాశము
అనంతముగాను, శాశ్వతముగాను దృగ్గోచరమగుచున్నది. కనుక భగవంతుడు
కూడా శాశ్వతుడని నిర్ధారించనగును. కాలము భగవంతుని వెనువెంట ఉనికిలోనికి వచ్చినది.
కనుక భూమాయే భగవంతునికి తల్లిగా భాసిల్లినది. కాలము (అవకాశము) దీనికి
వ్యతిరేకస్థితి. ప్రతీదీ అనంతంలో అంతం కావలసిందే. ఎవరైనా అంతర్గతంగా ఆ
ఆకాశస్థితిని తమలో ఉత్పన్నంచేసుకుంటే అతడు అత్యంతోన్నత స్థాయిని చేరినట్లే. అది
సమస్త వ్యావహారములు కుదుటబడిన స్థితిలో సమమైవుంటుంది. ప్రతి ఒక్కరు దీనినే
ఆశించవలసి వుంది. ఆకాశము లేక భూమాయే పరమోత్కృష్ట స్థితి. (స.మా.ద)
40.
సృష్టి మొదలు కావడానికి ముందు వున్నదంతా అసలైన దివ్యత్వమే. అన్నీ వాటి సత్వరూపములో
అందులో యిమిడివున్నాయి. మూలంలో కలిగిన క్షోభతో ఒక్కొక్కొటి రూపుదాల్చే ప్రక్రియ
మొదలయింది. క్షోభవల్ల అంతర్గత చైతన్యంలో ఒక సంచలనం కలిగించింది. (స.మా.ద)
41.
ఆత్మార్పణమంటే తన ప్రాధాన్యతను పూర్తిగా వదిలి సంపూర్ణంగా గురువుగారి యిచ్చకు
అనుగుణంగా వర్తించడం తప్ప యితరంకాదు. ఈస్థితిలో శాశ్వతత్వం సాధిస్తే అది
శూన్యత్వంలోకి దారి తీయడం మొదలౌతుంది. ఈ ఆత్మార్పణ స్థితిలో ఏమి ఆలోచించినా, ఏమి చేసినా అది గురువుగారి యిచ్చకు అనుగుణంగానే వుంటుంది. ప్రపంచంలో ఏదీ
తనది కాదని, అంతా గురువుగారి ఆజ్ఞానుసారమే లభిస్తున్నదని
భావిస్తాడు. (సత్యో)
42.
సహజమార్గ సాధనలోని రహస్యమేమిటంటే అది ఒక శక్తి. అది మనిషిలోని మొత్తం జీవితాన్నే
మార్పుచేసి అతన్ని ఉన్నతోన్నత స్థితులకు ఎదిగేట్లు చేస్తుంది. దీన్నే ప్రాణహుతి
శక్తి ప్రసారమంటారు. ఈశక్తి స్వచ్చమైన మనోమార్గముల ద్వారా పనిచేస్తుంది.
ప్రాణాహుతి ఇచ్ఛాశక్తి ద్వారా ప్రసారమై ఫలితములనిస్తుంది. అది ఎప్పుడూ ప్రతిభావంతమై
వుంటుంది. (స.మా.ద)
43.మొదలు
పెట్టిన తక్షణమే ప్రాణాహుతి ప్రసారము వలన శాంతి, నెమ్మది ప్రసారింపబడుతుంది. ఆ అనుభవాన్ని మాటల్లో వ్యక్తీకరించలేము.
ధ్యానంలో కలిగే ఈ అనుభవం మనం తిరిగి వెళ్ళి చేరవలసిన మూలాన్ని గుర్తుచేస్తుంది. ఈ
అనుభవం మళ్ళీ మళ్ళీ కలగడం వల్ల మన అసలు స్వస్థలమైన మూలానికి సంబంధించిన జ్ఞాపకాన్ని దృఢపరుస్తుంది. ఈ జీవితానికి సంబంధించిన బంధనాలను సడలిస్తుంది.
ప్రాణాహుతి శక్తి మనల్ని ఆంతరంగిక ఎఱుక లోతుల్లోకి తీసుకుపోతూ మూలానికి వెళుతున్న
మన ప్రయాణం నిర్దిష్టం చేస్తుంది. (దివ్య సందేశములు)
44.
పదార్థ కణాలను శక్తిగా మార్చవచ్చును. మరో మాటలో చెప్పాలంటే పదార్థము స్థూలరూపంలో
వున్న శక్తే. ఇది ఒక శాస్త్ర సూత్రము. దీన్ని నవీన శాస్త్రము సైతము అంగీకరించింది.
ప్రాణాహుతి పదార్థాన్ని శక్తిగాను, శక్తిని మూలసత్తాగాను
మారుస్తుంది. (ఋ.వా.-2)
45.
ఈగుర్తింపు మహాప్రళయమాసన్నమై సర్వము తమ వ్యక్తిత్వగుర్తింపుఅంతా సమైక్యగుర్తింపులో
లీనమయ్యే వరకు వుంటుంది. తిరిగి అదే తర్వాతి సృష్టికి కారణభూతమౌతున్నది. కనుక ఈ వ్యక్తిత్వమే అంతమౌతున్నది కానీ
గుర్తింపు (ఉనికి) మాత్రం కాదు. ఉండుట
లేకుండుట అన్నది కేవలం నామమాత్రమే. ఆ మూలము, ఆకేంద్రంలో
నిద్రాణమై వున్న చైతన్యం వల్లనే యిదంతా సంభవమౌతున్నది. (ఋ.వా.-1)
46.
మరణస్థితి అన్ని గ్రంథుల్లో మొదలౌతుంది. అది అనుభవానికి మించిన దృఢత్వంతో
వుంటుంది. అంటే అభ్యాసి ఆస్థితిలో పూర్తిగా కేంద్రస్థానంలో లీనమై పూర్తిగా తన
ఉనికినే కోల్పోతాడు. (స్వీ.చ-1)
47.
మనందరం సోదరులం. బుద్దిపరంగా, నీతిపరంగా మరియు
జీవితపరమార్థమైన ఆధ్యాత్మిక పరంగా మనం ఒకరికొకరం సంబంధం కలిగి వున్నాము. ఇది అది
అన్న అడ్డంకులన్నీ యిప్పుడు తొలగిపోయాయి. ఆయనపనిలోను, వాతావరణంలోను
పవిత్రతే మిగిలింది. అది అనంతతత్వానికి దారి నేర్పరచి మూలంతో కలుపుతున్నది.
(దివ్యసందే.)
48.
ప్రకృతి సంతరించుకున్నదంతా అత్యంత స్వచ్ఛంగా వుంటుంది. కారణం దాని ఉత్పత్తిస్థానం
పవిత్రం. స్వచ్ఛము మరియు ధర్మబద్ధమైన పద్దతిలో గడించిన సంపాదన కూడా ఈవిధంగానే
స్వచ్ఛమై వుంటుంది. (ద.దే.వ్యా)
49.
భగవంతుని ఇచ్ఛానుసారమే జగమంతా నడుస్తున్నది. ఆయనే అన్నిటికి కర్త. కానీ అదంతా మన
ఇచ్ఛ మన శక్తికి జోడించి మన కృషి ఫలితంగానే జరిగిందనుకోవడమే వచ్చిన చిక్కు. ఈకారణం
చేతనే మనం విజయాలకు ఉప్పొంగిపోవడం, అపజయాలకు
కృంగిపోవడం జరుగుతున్నది. ఇదే మనల్ని బంధనమునకు గురిచేస్తున్నది. (ఋ.వా-1)
50.
లక్ష్యమును సాధించుటకు అత్యంత ఖచ్ఛితమైనట్టిదియు, సులభమైనదియునగు ఉపాయము--నీకు నీవే సమర్థగురువునకు సమర్పించుకొని
జీవన్మృతుడవు అగుట. ఈ సమర్పణ (ఆత్మార్పణ) భావము యాంత్రికము, కృత్రిమము,
బలవంతము అయివుండరాదు. శ్రమ, ఒత్తిడి లేకుండా
సహజముగా మనయందది కలుగవలసి యున్నది. నేను, నాది యను
"అహం"భావము (ఎఱుక) వున్నంతవరకు అది నిజమగు ఆత్మార్పణ కాజాలదు. వాస్తవ
సంపూర్ణ ఆత్మార్పణము జరిగిన మీదట ఇక
చేయవలసినదేమియు వుండదు. (స.మా.ద.)
--oo0oo--
ఆప్
తాబే మార్ ఫత్
శ్రీ
మదన్ మోహన్ లాల్, వకీల్, బాదౌన్ వారి విరచితము
1. ఆప్ తాబే మార్ ఫత్ ఏ నుక్తదానే మార్ ఫత్
రహనుమా
ఏ సాలికా ఏ జిస్మొ జానే మార్ ఫత్
2. తేరి హర్ తరజే రహా ఇష్ మే థి షా నే
మార్ ఫత్
హర్ అదా మే థా తెరీ నూరె జహానే మార్ ఫత్
3. హోచుకాగో వస్ల ఫిర్ భీ హై సమాధీ పర్ వహ్ నూర్
జర్రే
జర్రే మే హై అబ్ భీ ఆనొ బానే మార్ ఫత్
4. హర్ తరఫ్ దేఖా జొ తూనే మత్ లయే జుల్
మత్
ముఆబ్
తూనె
బదలీ సర్ జమీనో ఆస్ మానే మార్ ఫత్
5. బన్ కె మూజిద్ ఇక్ సహజ్ సే మార్గ్ కి డాలీ
బినా
ఇక్
నయీ బునియాద్ పర్ రఖ్ఖా మకానే మార్ ఫత్
6. జుంబి షే అబ్ రూ మెథీ క్యా జానె క్యా
క్యా ఆబొతాబ్
జగ్
మగా ఉఠాథ జిస్ సే ఆస్ మానే మార్ ఫత్
7. ఫూంక్ దీ వహ్ రూహ్ జిస్ కా ఫైజ్ హై అబ్ తక్
రవా
హర్
తరఫ్ ఫూలా ఫలా హై గులిస్తానే మార్ ఫత్
8. హర్ తకల్లుం మే థి తెరే ప్రేమ్ కీ మౌజే
రవా
హర్
ఇషారే మే రవాథీ దాస్ తానే మార్ ఫత్
9. దీద్ నీథా సబ్రొ ఇస్తక్ లాల్ కా హుస్ నే
కమాల్
తుజ్
పె థే సౌ జాసె కుర్ బా షాయ కానే మార్ ఫత్
10. సచ్ హువా జో కుచ్ కహాథా తూనె బర్ వక్తే
విసాల్
జాగ్
వుఠేగా ఖుద్ హీ వక్తే ఖుప్తగానే మార్ ఫత్
11. తేరె పరువానోంకి ఖాతిర్ షమ్మజల్ ఉఠేగి ఖూద్
ఖుద్
బ ఖుద్ దౌడేంగె ఉస్ పర్ తాలిబానే మార్ ఫత్
12. ఆజ్ హై ఫజ్ లో కరమ్ సే తేరె వహ్
రౌషన్ చిరాగ్
రోషనీ
పాతేహై జిస్ సే ఆషికానే మార్ ఫత్
13. చష్ మె హక్ బీ దేఖ్ లే ’బిస్మిల్’ నిగాహే షౌక్
సే
ఫూల్
తా ఫల్ తా హై కైసా బోస్ తానే మార్ ఫత్.
--oo0oo--
లాలాజీ
వారి స్తుతి
(ఆప్ తాబే మారఫత్‌కు తెలుగు అనువాదం)
శ్రీ
మదన్ మోహన్ లాల్, వకీల్, బాదౌన్ వారి విరచితము
1. నీవు దివ్య-జ్ఞాన రవివి -- మర్మ మెఱిగిన-ధీ
నిధివి
సత్పదంబున-మార్గదర్శివి --
జ్ఞానమునకు-జీవాత్మవు
2. మీదు
జీవిత-కాలమంతయు -- నిండెనాధ్యా-త్మికపు తేజము
దివ్య జ్ఞాన-జ్యోతి మీరై -- ప్రజ్వలిత కాం-తులను నింపిరి
3. నీవు లేవను-చింతబాపి -- నీ సమాధీ-వెలుగుచున్నది
అందులోని-అణువు అణువు -- ఆత్మ
తృప్తిని-యిచ్చుచున్నది
4. విశ్వమం-దజ్ఞాన
తిమిరము -- నిండి యుండుట-గాంచి మీరు
ఆత్మ జ్ఞాన-వ్యాప్తి కొరకై -- నిశిత పరిశీ-లనము జేసిరి
5. క్రొత్త పద్దతి-వెలికి దీసి -- సహజ ఆధ్యా-త్మిక
విధానపు
దిట్టమైన-పునాది వేసి -- దివ్య
భవనము-నిలిపినావు
6. దివ్య
కాంతుల-నెగయ జేసి -- దిశల నాధ్యా-త్మికత నింపిన
మీదు భ్రూవి-క్షేప మహితను -- పొగడగా నిల-నెవరి తరము
7. మీయనుగ్రహ-ప్రసారంబున -- నూతనోత్సా-హంబు నింపీ
ఆధ్యాత్మిక-విరి వనంబున -- నవ్య
కళలను-నింపినారు
8. నీవు
నుడివిన-పలుకులన్నీ -- ప్రేమ పూరిత-మై యలరును
నీవు చేసిన-సంజ్ఞలన్నీ -- మర్మ సత్యము-లెన్నొ విప్పెను
9. నీ సహనము-మరియు దీక్ష -- కనగ చాల వి-లక్షణంబు
సత్యతత్త్వా-న్వేషణంబున --
భక్తులెల్లరు-మీవిధేయులె
10.
జ్యోతి మరలా-వెలుగు ననియూ -- సుజనులను
దరి
-చేర్చుననియు
నాడు పలికిన-మీదు పలుకులు -- పరిణమింపవే-సత్యమై
11.
దీప కాంతికి-వివశమగుచు -- శలభములు దరి-చేరు విధమున
భక్తజన-ఆకర్షితంబై -- జ్యోతి వెలిగెను-స్వయం
ప్రభతో
12.
దయతొ నిలిపిన-ఆ జ్యోతి -- మాకు
వెలుగై-నిలిచె నేడు
దివ్య తత్త్వ-ప్రేమికులకు -- కాంతి దాయక-మైన దిపుడు
13.
ఆధ్యాత్మిక-నందనంబిది -- కనుల కింపుగ-వెలసి యున్నది
దేవ నీ కృప-తోడనేయది -- భక్తజన ప్రియ-మై
యున్నది
అనువాదం----పి.సుబ్బరాయుడు, కడప
--oo0oo--
బాబూజీవారి
స్తుతి
(ఈ పుస్తకంలోని 34 పుటలో బాధలో వున్నపుడు పాటపాడుకోమన్నారు శ్రీ
లాలాజీవారు.
జీవితంలో
బాధలే లేకుండుట అసహజంకదా! అందుకే ఈ పాటలు)
రచన
: పి.సుబ్బరాయుడు, కడప.
పాట
1
పల్లవి:-
ప్రభూ శ్రీరామచంద్ర-పరమ
ప్రేమాంతరంగా
అనుపల్లవి:- క్రమ్మిన చీకట్లు తొలగీ-వెలసెనుహృది
దివ్యకాంతి
చరణము
1:- మీ బోధామృతము గ్రోలి
సహజమార్గమనుసరించి
మీ స్మరణము
విడువకెపుడు
జీవింపగ మదిని తలుప ..... క్రమ్మిన||
చరణము
2:- గడచియుండు జన్మలెన్నొ
బిగిసియుండె కర్మలతలు
లతలద్రెంచి స్వేచ్ఛ బడయ
సమ్మతి మీ చెంతజేర .....క్రమ్మిన||
చరణము
3:- మాటలు వేయేల పలుక
తెలియము మాకేది హితమో
నీవె మాకు దిక్కనుచును
శరణుజొచ్చి ధ్యానింపగ .....క్రమ్మిన||
ప్రభూ శ్రీరామచంద్ర -పరమ
ప్రేమాంతరంగా
--oo0oo--
పాట
2
పల్లవి:- శ్రీ రామచంద్ర గురువర
నినువినా మము బ్రోచునెవరు
చరణము
1:- ఎన్ని జన్మలు గడిచెనో మరి
ఎంత స్థౌల్యత కూడుకొనెనో
కర్మ ఫలములు పొరలు
పొరలై
ఆత్మనెంతగా చుట్టుకొనెనో .....శ్రీ రామ||
చరణము
2:- వాంఛా పరితృప్తి కొఱకై
తిరిగితిరిగి పరుగులిడుచు
తగని చింతనముల మనసు
అదుపుతప్పి చరియించెను ......శ్రీ రామ||
చరణము
3:- గతజన్మము నందు ఎంతొ
కొంత తపము చేసియుందు
అందుకే ఈ జన్మమందు
మిమ్ము పొందు
భాగ్యమమరె ..... శ్రీ రామ||
చరణము
4:- ఆత్మ పరమాత్మ లోన
లీనమయ్యెడు త్రోవ నడిపి
ఉద్దరింతురు మీరె యనుచు
నమ్మి మీ దరి
చేరినాను ......శ్రీ రామ||
--oo0oo--
ప్రార్థన
అనేది మాలిన్యము లేని ఆలోచన.
అంతిమ
స్థాయికి తీసుకొని పొమ్మని చేసేదే ప్రార్థన.
అది భక్తికి సూచన.-----బాబూజీ.
అబసి
ధ్యానముచేయు విధానము
ప్రార్థన
ఓ
నాథా! నీవే మానవ జీవనమునకు లక్ష్యము
మా
కోరికలు ఆత్మోన్నతికి ప్రతిబంధకములై యున్నవి
నీవే
మా ఏకైక స్వామివి ఇష్టదైవమవు
నీ
సహాయము లేనిదే నిన్ను పొందుట అసంభవము.
ఉదయము
ధ్యానము
పూజకై ప్రత్యేకించబడిన స్థలములో ఒకే భంగిమలో
కూర్చొని, శారీరక, మానసిక శుభ్రతలను
కలిగి, నిత్యము నిర్ణీత సమయమందు సూర్యోదయమునకు ముందే ఒక గంట
కాలము ధ్యానము చేయుము.
హృదయములో దివ్య తేజస్సు కలదను భావము కలిగి,
మనస్సుపై ఒత్తిడి లేకుండా, సహజముగా ధ్యానము
చేయుము. అక్కడ తేజస్సు కనబడనిచో లెక్క
చేయకుము. అది ఒక ఊహ మాత్రముగా ధ్యానము ప్రారంభింపుము.
ఏకాగ్రతకై ప్రయత్నించక, సహజ
పద్ధతిలో ఒకే వైఖరిలో కూర్చొని మనస్సును హృదయమువైపు మరల్చుము. ఆ సమయమున వచ్చు ఆలోచనలను ఆహ్వానింపకనే వచ్చిన
అతిథులుగా భావించి వాటిని గమనించక దృష్టిని ఏకైక లక్ష్యముపై మరల్చుము.
సాయంకాలం
అంతః శుద్ధీకరణ క్రియ
నీలోని ప్రతి అణువునుండి, నీ
ఆధ్యాత్మిక ప్రగతికి ప్రతిబంధకములైన మాలిన్యములు, జడత్వము,
తామసము, సంస్కారములు మొదలుగునవి ఆవిరి రూపములో
నీ శరీరము వెనుక భాగము నుండి బయటికి పోవుచున్నవి అను సంకల్పముతో సాయంకాలము అరగంట
కూర్చొనుము. మనము విడువతలచిన
వాటినిగురించి తలచకుము, వాటిని తుడిచివేయుము.
రాత్రి
ప్రార్థన
రాత్రి నిదురించుటకుముందు నమ్రత, భక్తి భావముతో ప్రార్థన చేయవలెను.
ప్రార్థన ఒకటి రెండు సార్లు మనస్సులోనే ఉచ్ఛరించి దానియందుగల భావముపై
ధ్యానము చేయుచు దానియందే లీనమై నిదురించుము.
--oo0oo--
దశనియమములు
1.
ప్రొద్దు పొడవకముందే నిద్రలెమ్ము. నిర్ణీత
సమయమున, సూర్యోదయమునకు ముందయినచో మంచిది, ఒకే ఆసనమున కూర్చొని ప్రార్థన, పూజాదికములను కావింపుము. మానసిక శారీరక పారిశుద్ద్యమును
ప్రత్యేకముగా పాటింపుము.
2.
ప్రేమ, భక్తి పూర్వకమైన హృదయముతో ఆధ్యాత్మికోన్నతి కొరకు ప్రార్థన జరిపి, పూజ నారంభింపుము.
3.
భగవంతునితో సంపూర్ణఐక్యము పొందుటయే నీ గమ్యముగా నిర్ణయించుకొనుము. దానిని సాధించునంతవరకు విశ్రమింపకుము.
4.
ప్రకృతితో సారూప్యము పొందుటకు నిష్కపటముగాను, నిరాడంబరముగాను వుండుము.
5.
సత్యసంధత కలిగి యుండుము. దుఃఖములను
దివ్యమైన దీవెనలుగా భావించి, అవి నీ మేలు
కొరకే కలుగుచున్నవని కృతజ్ఞతా భావముతో నుండుము.
6.
అందరిని సోదరులుగా భావించి, అట్లే వారినాదరింపుము.
7.
ఇతరులు కీడు చేసినచో ప్రతీకారబుద్ది పూనకుము.
దానిని దివ్యబహూకృతిగా కృతజ్ఞతతో స్వీకరింపుము.
8.
ఋజువర్తనతోడను, భక్తిభావముతోడను ఆర్జించిన దానితో తృప్తిచెంది, నిరంతర
దివ్యభావములతో దానిని ఆరగింపుము.
9.
ఇతరులలో భక్తి, ప్రేమ భావముల మొలకెత్తించునట్లుగా నీ జీవనమును
మలచుకొనుము.
10.
పడుకొనబోవు సమయమున దైవసాన్నిధ్యభావనతో
నీవొనర్చిన తప్పులగూర్చి పరితప్తుడవుకమ్ము.
వాటిని మరిచేయనని వినమ్రభావముతో భగవంతుని క్షమాపణ కోరుము.
--oo0oo--