Sunday, 15 November 2020

దివ్యజీవనము

 

దివ్యజీవనము

రచన: శ్రీ డి.బాలాజీ, బెంగుళూరు.                 అనువాదం: శ్రీ పి.సుబ్బరాయడు, కడప

    


 మన జీవన విధానము సహజమార్గ పద్దతితో అనుసంధించబడి కొనసాగించుటచేత, పూజ్యశ్రీ గురుదేవుల కృపా విశేషమున, మన జీవనము ప్రాపంచిక విషయవాసనల నుండి దివ్యజీవనమునకు నాటకీయముగా మార్పుజెందు విషయ వివరణమే, ప్రధానాంశముగా ఇదంతయు మీముందుంచుచున్నాను.

       ఇది మన జీవితకాలమున సంభవించిన మహదావకాశము.  ఇట్టి అవకాశము దొరుకుట అరుదు.  ఎందుకంటే, మానవజాతి నుద్దరించి ఆధ్యాత్మికతను అంతరాంతరాళములలోనికి చొప్పించగల పూజ్య బాబూజీ వంటి ప్రత్యేకావతారమూర్తి ప్రభవించుట నిజంగా ఒక అరుదైన ప్రక్రియ. 

       నేను జీవించుచున్నది గురువర్యులను పొందియుండుటకేనని, సహజమార్గ విధానమును సంపూర్ణముగా అనుసరిస్తూ అందులోనూ దశాదేశములు దిశానిర్దేశక శక్తిగా పనిచేస్తుండగా, నిరంతరస్మరణలో కొనసాగుచుండుటకేనని తెలియజేస్తూ, అలా జీవించుటవల్ల, మనజీవితములో ఎటువంటి పరిణామములు సంభవిస్తాయో ప్రస్ఫుటంగా వెలువరిస్తుందీ చర్చ.

       గురువుగారితో ఎలా అనుసంధానమేర్పరచుకోవాలి, ఎలా ఆ సంబంధాన్ని కొనసాగించి జీవిత గమ్యాన్ని సాధించాలి, అందుకవసరమైన సాధనా క్రమమేమిటన్న విషయాన్నందిస్తుందీ చర్చ.

       మన మాతృభూమిని మనకెఱుక పరచి, గమ్యమును చేరుటలో మన పాత్ర ఏమిటో తెలియజేయుచున్న మన పూజ్య గురుదేవుల బోధనలు, శిక్షణ మనం క్షుణ్ణంగా ఎఱిగినవేనని మన యోచనే మనకు నిర్ధారించి చూపుచున్నది. 

       ఇతర విధానములతో పోలిక లేకుండా, యిప్పటి ఆధ్యాత్మిక పద్ధతులవలెగాక, సహజమార్గ సాధన ప్రాణాహుతి శక్తి యొక్క ప్రత్యేకతను సంతరించుకొని సాటిలేనిదై విరాజిల్లుతున్నది.  అంతేగాక యుగయుగాలకు ముందు ఈ సృష్టి ఏర్పడక పూర్వమున్న మన నిజస్థితిని సాక్షాత్కరింపజేయు అద్భుత ప్రక్రియయై యున్నది.

       దీనిని దివ్యక్రీడయని లేక ఫిలిక్స్‌కుల్ఫ (వర్షించిన అదృష్టం) అని అనవచ్చు.  సహజమార్గ సాధనలో ప్రభోదించినట్లు, నాస్తికత్వపు రొంపినుండి మత మార్పిడి ఉచ్చునుండి, మానవ మనుగడకు - జీవిత లక్ష్యానికి ఏమాత్రం సంబంధంలేని మూఢనమ్మకాలు, సిద్ధాంతాలతో కొట్టుమిట్టాడుతున్న మానవజాతి సముద్ధరణకు అంతిమ సత్యమే (భగవంతుడే) స్వతహాగా బాధ్యతగైకొన్నట్టి విధివిధానమిది యనవచ్చును.

       సూక్ష్మాతిసూక్ష్మమైన స్థితులనధిగమింపజేసి అర్థవంతమైన నిశ్చయ దివ్యజీవనము గడుపుటకు ఒక సంచలనాత్మక పద్దతి ననుగ్రహించిన శ్రీరామచంద్రజీ మహరాజ్ వారికి మానవజాతి నిత్య కృతజ్ఞతాభావనను ప్రకటించుచున్నది.

        సృష్టి జరిగి, ప్రకృతి రూపుదాల్చినప్పటి నుండి గమనిస్తే నిష్టాగరిష్ఠులైన వివేక సంపన్నులు మాత్రమే తమను తాము ఉద్ధరింపజేసుకొను సామర్థ్యము గలిగి సూక్ష్మాతిసూక్ష్మము మరియు సున్నితమునైన స్థితులను పొందగలిగిరి.  వారైనను ఆతృతతో దానికై ఆరాటము చెందిననే కాని సాధ్యపడలేదు.

       ఒకసారి దాన్ని మనమవగాహన జేసుకొంటే చాలు.  మనం గడుపుతున్న జీవితం అర్థరహితమని, ఏ లక్ష్యసాధనకై మనము మానవజన్మ గైకొంటిమో ఆ జన్మము, జీవనము అసంపూర్ణమైయున్నదని, దైవీయ పిలుపును విని సమ్మతితో మనల్ని మనం సంపూర్ణముగా ప్రభువునకర్పించుకొను యోగ్యతను సముపార్జించుకొనవలెనని బోధపడుతుంది.

       మన జీవనోపాధి యేదైనా, మనమే మతస్తులమైనా, మనమే వారసత్వానికి సంబంధించినవారమైన పరవాలేదు.  మన శ్రద్ధాపూర్వకమైన సహజమార్గ సాధనే మనలో సహజసిద్ధమైన సరళతతో కూడిన వినయమును పొటమరింపజేసి అది మన దివ్యజీవనసంజ్ఞగా భాసిల్లుతుంది.

       మనం ప్రార్థనతోను, ధ్యానం ద్వారాను గురువర్యులతో సంబంధం ఆలోచనా పరంగాను, భావనాపరంగాను ఏర్పరచుకుంటే ఆయనలో లీనమై ఆయన స్మరణతోనే కొనసాగి సూక్ష్మాతిసూక్ష స్థితులను సంతరించుకుంటాము.

       ఇలా కొనసాగితే మనం కాలక్రమేణ ఉత్తమలోకంలో ఎక్కువ సమయం గడపగలుగుతాము.  తద్వారా ఈ అల్లకల్లోలము మరియు అశాశ్వతమైన బాహ్యప్రపంచం నుండి బయటపడగలుగుతాము.  అలా భగవదత్తమై, క్రమబద్ధీకరింపబడిన మనస్సు నుండి డోలాయమానమైన డాంబిక ప్రవృత్తులు వదలిపోయి, ఆలోచనా తీరులోను, ప్రవర్తనలోను, దృక్పదంలోను, స్వభావంలోను గణనీయమైన మార్పులు సంభవిస్తాయి.

       అధిక సమయమీ సహజమార్గవిధానములో జీవనము సాగించిన యెడల మనకిపుడు మార్గదర్శకునికంటే, బోధకునికంటే ఎక్కువై ప్రభవించిన దివ్యపురుషుడూ మన జీవితమునకొక అర్థము, పరమార్థమునైన గురుదేవుల యెడ భక్తి,ప్రేమలను బీజములు నాటబడతాయి.

       మనము మన దైనందిన ప్రాపంచిక విధులు, బాధ్యతలు నిర్వర్తిస్తున్నప్పటికి సహజమార్గము, మన ప్రశస్తజీవనమునకు ఆధ్యాత్మిక పరిణామాన్ని జోడిస్తుంది.  తద్వారా ఒక నూతన అర్థాన్ని ప్రతిపాదిస్తూ ఈ నశ్వరచట్రము నుండి బయటికి తీసుకొనివచ్చి ప్రయోజనాత్మక దిశానిర్దేశముల నిచ్చుచున్నది.

       మరోమాటలో చెప్పాలంటే గురుదేవుల యోచన, యోగశక్తి (ప్రాణాహుతి) మనల్ని సూక్ష్మాతిసూక్ష్మమైన శరీరరహిత స్థితికి చేర్చి జీవన్ముక్తదశను జీవముతో నుండగనే ప్రసాదిస్తుంది.  ఐతే నిరంతరం ఆయనలో లీనమైపోవడానికి తపనజెందుతూ వుండాలి.

       మనమాయన ఆధ్యాత్మిక వారసులంగా శక్తిమంతులమై, ప్రతిభాశాలురమై మనయత్నం లేకుండగనే మన సామాన్య కార్యక్రమంలో మనముండడంతోనే ఎంతో ప్రయోజనాత్మక పనులు నిర్వర్తింపబడుతుంటాయి.

       గురువర్యుల స్మరణలో జరిగే మన ప్రత్యేక సమావేశములలో వ్యక్తిగతంగాను, సామూహికంగాను ఆయన పనితనం మన విశ్వాస పరిధిలో మనం వివరణాత్మకంగా గ్రహించవచ్చు.  మనం నిశితంగా పరిశీలించి చూస్తే ఇదే ప్రక్రియ మనరోజువారీ  కార్యక్రమంలో కూడా కొనసాగి, మనజీవనోపాధిపైన, ఇతర వ్యవహారములపైన పనిచేసి కర్మకారక సంబంధమైన ముద్రల భారం మనపై ఏమాత్రం పడకుండా సాఫీగా సాగిపోతుంది.

       కనుక ఎలా మనం నిరంతరం గురుదేవులతో అనుబంధం కలిగివుండాలి? దీక్ష గైకొననివారు, ప్రారంభకులు దీన్ని మూడవ ఆదేశంలో చెప్పినట్లు మహోన్నతమైన దానికై తపన, ఆరాటము పడుట ద్వారా పొందెదరు.

       "భగవంతునితో ఐక్యము పొందుటే నీ గమ్యముగా నిర్ణయించుకొనుము.  అది సాధించునంత వరకు విశ్రమింపకుము."

       ఉన్నతమైన అనుభవము మరియు పరిశీలన ద్వారా గమనించిన విషయమేమంటే, రాత్రి పడుకొనబోవుటకు ముందు చేయు ప్రార్థనాసమయము అతి ప్రశస్తమైనది.  అప్పుడు మనల్ని మనం ఆయత్త పరచుకొని ప్రభు సన్నిధానమును భావించి (పదవ ఆదేశం) ఆయనపైనే మన చింతన, యోచన నిలిపి నిద్రలోనికి జారుకోవడం వల్ల ఆయనతో మనం చక్కగా అనుసంధింపబడతాము.

       పర్యవసానంగా శరీరస్పృహగల స్థూల నిద్ర ప్రార్థన ప్రభావం వల్ల రాత్రంతా అతీంద్రియ స్థితిలో నిరీక్షణగా మారుతుంది.  మనం సూర్యోదయాత్పూర్వమే నిద్ర లేచేటప్పటికి ప్రార్థనామయ స్థితిలోనే వుండి అప్రయత్నంగానే మన ధ్యానము, ఏ యితర ఆలోచనలు, ఒడుదుడుకులు లేకుండా సాగుతుంది.

       క్రమబద్ధీకరింపబడిన మనస్సుతో జాగరూకతను వృద్ధిచేసుకొని సహజమార్గ ధ్యానము సూక్ష్మాతిసూక్ష్మ స్థితిలో ఆలోచనలకు దూరమై, స్థానమేర్పరచుకొనజాలని, తేలికగా తుడిచిపెట్టుకొని పోవు ముద్రలతో, ఆ మహా ప్రభువుతో లీనమయ్యెడి అనుబంధముగా మారిపోతుంది.

       కనుక రాత్రి ప్రార్థన, ఉదయపు ధ్యానము గురుదేవులతో విడదీయరాని బంధమేర్పరచి, ధ్యాన సమయమున ఏర్పడిన శూన్యస్థితి మనలను అతీంద్రియ స్థితిలో నివసింపజేసి జాగృత దశలో నిరంతరం ఆయన చింతనలో వుండేట్లు జేస్తుంది.

       గురువుగారు చెప్పినట్లు ధ్యానము, నిరంతర స్మరణకు దారినేర్పరుస్తుంది.  స్వచ్ఛతనొందిన హృదయము తన మూలమును జ్ఞాపకమునకు తెచ్చుకొంటుంది.  సమ్మతితో మన మాతృభూమికి తిరుగు ప్రయాణాన్ని త్వరిత పరుస్తుంది.

       మనిషి తన్నుతాను మరచిపోవడమనే ఉత్తమ నిరూపణతో ఈ పరిశీలన నిరంతర స్మరణ యొక్క ప్రాధాన్యత నెఱుక పరచింది.

       ఎచ్చోట ఆలోచన, భావనలు వ్యక్తీకరించుటకు, వర్ణించుటకు మాటలకలవికాదో అట్టి తాత్విక సూక్ష్మ ప్రపంచపు పరిధిలోనిదీ విషయమని మనకు నిశ్చయముగా తేటతెల్లమైనది.

       గమ్యంతోనే కలసియుండి, ఎఱుకలేని స్థితి నుండి ఎఱుక గల్గిన స్థితివరకు బాహ్యాభ్యంతములందు అన్ని చోట్ల, అన్ని వేళాలా గూడా మనస్సు గురువర్యుల చింతనతోనే మెలగుతూ వుండుటయనునది లక్ష్య సాధనకున్న ఒకానొక మార్గము.

       అట్టిస్థితిలో చర్య కొనసాగుచుండుటను నిర్ధారిస్తూ ఉత్తమ శక్తులు మానవుని కార్యకలాపములన్నిటిలోనికి విస్తరించును.  సంక్షిప్తంగా చెప్పాలంటే సహజమార్గము అభ్యాసిని అశాశ్వత ప్రపంచమునుండి విముక్తిని కలిగించి ఆధ్యాత్మిక స్థితులలోనికి ప్రవేశింపజేసి తనను తాను అవినాశినిగా మార్చేస్తుంది.

       "ఆయన స్మరణ మనల్ని మనం మరచిపోయేట్టు చేస్తే ...... ఆయన సన్నిధానం మన వాస్తవ స్థితియైన సూక్ష్మత్వాన్ని మనకు జ్ఞాపకం చేస్తుంది".

 

--o0o--

 

 

No comments:

Post a Comment

పూజ్యలాలాజీ మరియు మన ఆధ్యాత్మికప్రగతి

  పూజ్యలాలాజీ మరియు మన ఆధ్యాత్మికప్రగతి సోదరీసోదరులమైన మనమంతా యిక్కడ యీదినం (ఫిబ్రరవరి 14/ బుధవారం 2024) మన ఆదిగురువులైన పూజ్యలాలాజీవారి 1...