Showing posts with label Peep into Sahajmarg in Telugu. Show all posts
Showing posts with label Peep into Sahajmarg in Telugu. Show all posts

Sunday, 29 November 2020

సహజమార్గవీక్షణము

సహజమార్గవీక్షణము

ఈశ్వర్ సహాయ్                  బాబూజీ
 

ఆంగ్ల మూలం

శ్రీ ఈశ్వర్‌సహాయ్


తెలుగు అనువాదం

శ్రీ పి.సుబ్బరాయుడు

  

అందించిన వారు

శ్రీరాంచంద్రజీ మహరాజ్ సేవాట్రస్ట్

3/1289-1; కో-ఆపరేటివ్ కాలనీ,

కడప-516001.

2014

 


 

 

 

దివ్య ప్రభువు

 శ్రీ బాబూజీ వారి కంకితము


విషయసూచిక

 

          విషయము                     

 

 1. అనువాదకుని వినతి                                 

 

2. ప్రచురణకర్త అభిప్రాయము                                  

 

3. తొలిపలుకులు                                                            

 

4. ఉపోద్ఘాతము                                                            

 

4. I.ప్రపంచము- నేటియదాతథస్థితి          

 

     ప్రస్తుతదృశ్యము- ప్రపంచశాంతి- ఆధిపత్యపోరు, 

     సమస్య, శాంతికి సంబంధించిన తప్పుడు భావన-

     పవిత్రాదర్శం- వ్యక్తిగత బాధ్యత, మతము-

     వివిధములైన ఆటంకములు- విశ్వజనీన మతము.

 

   II.ఉనికి చిక్కుముడి                     

 

    (1) సంపూర్ణ సత్యము                   

        కేంద్రము-భగవంతుని ఉనికి, వివిధములైన

        అవగాహనలు

 

    (2) విశ్వము                           

        ఆవిర్భావము- సృష్టి- క్షోభ- లయము

    (3) మానవుడు                            

        బాహ్య రూపము, వాస్తవ రూపము

 

    (4) మానవ జీవితము                     

        లక్ష్యము- ప్రాపంచిక దృష్టి-

        మతదృక్పదము- భక్తి-వాస్తవప్రయోజనం-

        మోక్షము- ఆధ్యాత్మికదృక్పదము- పరిపూర్ణత-   

        పరిష్కారము- ఆధ్యాత్మికత-

        మొరటువిధానములు- జన్మస్థలం

 

   III.యోగవిద్యయొక్క శాస్త్రీయత            

 

    (1) యోగా                                

        వివిధ దృక్పదములు- వివిధములైన

        యోగములు- పతంజలి విధానము-

        రెండువిభాగములు- యోగము మరియు

        సామాన్య జీవనము- బ్రహ్మచర్యము.

 

    (2) యోగముపై అపోహ                    

        సాధనచతుష్టయము- అష్టాంగ యోగము-

        నిజమైన ప్రయోజనం

 

    (3) శరీరనాడులకు సంబంధించిన            

        యోగశాస్త్రము

        నాడీవ్యవస్థ- చక్రములు లేక పద్మములు-

        మార్పుచేయబడిన ప్రక్రియ- తంత్రము-

        సిద్ధులు- కుండలిని

   IV. మనస్సు మరియు ధ్యానము         121

 

    (1) మనస్సు                            121

        మానసిక నియంత్రణ- మనఃశుద్ధీకరణ-

        మనస్సుక్రమబద్ధీకరణ.

 

    (2) ధ్యానము                           

        ఏకాగ్రత- ధ్యానవస్తువు-

        రూపముపై ధ్యానము- సరియైన విధానము-

        ప్రాణాహుతి- గురువు కర్తవ్యము

 

    (3) శరణాగతి                           

 

    (4) ధ్యానమున జరుగు                  

        కొన్ని సామాన్యపొరబాట్లు             

                                          

   V.  సహజమార్గము                     

 

        శ్రీ రాంచంద్రామిషన్- యోగమునకు

        సంబంధించిన అపోహలు- వినూత్న

        దర్శనము- శాస్త్రీయమైన విధానము

        సహజమార్గము- లక్ష్యము- సహజమార్గపు

        పనితీరు-  పురాతనకాల

        యోగ విధానముతో పోలిక

 

 

 

   అ. సహజమార్గ బోధనలు                   

 

   ఆ. క్రమశిక్షణాయుతమైన శీలనిర్మాణమునకు

      సాధారణ నియమములు                 

 

  VI. ఏట్లుండవలెనో అట్లు                    

      రక్షకుడు- అవతారపురుషునిరాకలోని

      ఆంతర్యము- అవతరణసమయం- సూచనలు-

      అతని ఉనికికిపరీక్ష- ఒక హెచ్చరిక- ఆయన

      భౌతికరూపము- ఆయన నిజతత్త్వం- ఆయన

      కార్యము- ఆఖరుదశ.

 

 

**** 

అనువాదకుని వినతి

 

        పూజ్యశ్రీ ఈశ్వర్‌సహాయ్ గారు ఈ గ్రంథమును "ఎ పీప్ యింటు సహజ్‌మార్గ" మను పేరిడి ఆంగ్లమున రచించిరి.  ఇందులో ఆయన అనేక ఆధ్యాత్మిక, తాత్త్విక, తాంత్రిక విధానముల నెన్నింటినో వ్రాయుటయేకాక వాటిని హేతువాద దృక్పదములతో విశదీకరించి మన జ్ఞానమునకు పదును పెట్టిరి. అంతేగాక మన సహజమార్గ విధానమును వాటితో పోల్చిచూపి సహజమార్గ విశిష్టతను వివరించిరి.

 

        శ్రీఈశ్వర్‌సహాయ్ గారు అనేక సంవత్సరములు మన బాబూజీగారితో సన్నిహితముగా మెలగుచు, ఆయన వెంట దేశము తిరిగి ఆయన గొప్పతనమును ఆయన విధానమందలి మహాత్మ్యమును క్షుణ్ణముగానెఱిగి ఈ గ్రంథరూపమున మనతో పంచుకొనిరి.

 

        ఈ గ్రంథము తెనుగున లేకపోవుట వల్ల ఆంగ్లమురాని తెలుగు వారికి సహాయపడునను సదుద్దేశ్యముతో ఈ అనువాద కార్యమునకు పూనుకొని నాతోచినకొలది ప్రయత్నించితిని.  తప్పులున్న సహృదయతతో మన్నించ ప్రార్థన.  స్పష్టత కొఱకు ఆంగ్లప్రతిని చూడగలరు.

 

        ఈ అనువాదగ్రంథములోని తప్పొప్పులరసి సరిదిద్దవలసినచోట సరిదిద్ది, మార్గదర్శకత్వము వహించి, ముద్రణకు తోడ్పడిన శ్రీ టి.వి.శ్రీనివాసరావు, ఛేర్‌మన్, శ్రీరాంచంద్రజీ మహరాజ్ సేవా ట్రస్ట్, కడప వారికి నా హృదయపూర్వక నమఃసుమాంజలులు.

       

        ఈ గ్రంథమీరూపమున మీ కరకమలముల నుండుటకు అత్యంత ముఖ్యకారకుడు, సీనియర్ అభ్యాసి, శ్రీ భవనాశి రమేష్ బాబు గారు.  వాస్తవము చెప్పవలెనన్న బాబూజీయే ఆయన రూపమున అన్నివిధములా సంపూర్ణసహకారమందించి నాచేత ఈ పని చేయించెననుట సుస్పష్టము.

 

వసంతపంచమి,                       ఇట్లు

కడప, 516 001,             పోలిచెర్ల సుబ్బరాయుడు

04-2-2014.                      ప్రశిక్షకులు.

                          

 

 

 


ప్రచురణకర్త అభిప్రాయము

 

        సహజమార్గముపట్ల పెరుగుతున్న ఆసక్తి వలన దాని సిద్ధాంతములు మరియు సాంకేతిక పద్ధతులను ప్రజల ముందుంచవలసిన అవసరమునెరిగి, ఈ అవసరమును తీర్చుటకు చేసిన ప్రయత్నమే ఈ పుస్తకము.

 

        భారతీయ తత్త్వశాస్త్రము నందలి పురాతన షడ్దర్శనములకు ఈ సహజమార్గము క్రొత్తదనాన్ని చేకూరుస్తున్నది. ఇది ప్రత్యక్షానుభవపూర్వకమైన యోగమార్గము నందించుచున్నది.  ఈ విధానము నేటి ఆధునిక జీవనసరళిలో సులభముగా యిమిడిపోగలదు.  అగమ్యమైన, తొందరపాటు భ్రమలనే బురదలో చిక్కుకున్న మానవాళికిది ఒక వరప్రసాదము.

 

రెండవ ముద్రణ

 

ప్రచురణకర్త అభిప్రాయము

 

        "సహజమార్గవీక్షణము" అను ఈ పుస్తకమును పునర్విమర్శతో మార్పులు అభివృద్ధి చేసి ఆధ్యాత్మిక జిజ్ఞాసుల యెదుట నుంచబోతున్నందుకు మాకు సంతోషముగా నున్నది.

        ఒక ప్రేమపూర్వకమైన వాక్యము గ్రంధరచయిత కర్పింపవలసిన అవసరమున్నది.  దురదృష్టవశాత్తు ఆయన మనమధ్య లేరు.  1967వ సంవత్సరం జనవరి రెండున వారు దేహమును త్యజించిరి.  స్వర్గీయ శ్రీ ఈశ్వర్‌సహాయ్ గారు స్వతహాగా ఆయనే ఒక సంపత్తి.  ఆయన అలుపెరుగని, సమర్పణాభావముగల సహజమార్గ కృషీవలుడు మరియు సమర్థుడైన ప్రశిక్షకుడు.  అన్ని పరిస్థితులలో సంతృప్తి, సంతోషముతో జీవనయాత్ర సాగించిన మహామనీషి.

 

        ఇది సహజమార్గముపై వ్రాయబడిన ఒక అధికారిక గ్రంథము.  ఇది సహజమార్గములో యిమిడియున్న సూక్ష్మతను, మరియు లోతులను సమగ్రముగా చర్చించినది.  ఈయన గురువర్యులతో అనేక సంవత్సరములు సమీప, సాన్నిహిత్యముతో మెలిగియుండుటే గాక గురువర్యులు సమృద్ధిగా ప్రసాదించిన   ఆధ్యాత్మికానుభవముచేత     విరాజిల్లు-

చుండెను.  తత్కారణముననే సహజమార్గములోని లోతులను సరళ భాషలో సాధకున కందుబాటులోనికి తెచ్చెను.  ఆయన యెన్నుకొన్న విషయములు సామాన్య తాత్త్వికజనసమ్మతములే, కానీ ఆయన వివిధ తాత్విక సంస్థల ద్వారా చెప్పబడిన విషయములలోని చిక్కులను విశదపరచి తేటతెల్లము జేయు పద్దతిలో వాటిని నిర్వహించెను.

 

        ముద్రణాఖర్చులు, కాగితము ధర మొదలైన వాటి పెరుగుదలకు చింతిస్తున్నాము.  తత్కారణమున పుస్తకము ధర పెంచక తప్పలేదని విన్నవించుకొంటున్నాము.

 

                           జె.ఆర్.కె.రయిజాడ, ఎం.ఎ.

బసంత్ పంచమి,     సూపరింటెండెంట్,  పబ్లికేషన్ డిపార్ట్‌మెంట్ జనవరి 22, 1969                      శ్రీ రాంచంద్రమిషన్,

                                షాజహాన్‌పూర్(యు.పి),  ఇండియా.

 

       


తొలిపలుకులు

 

        సహజమార్గపు ప్రధానాంశముపై గొప్ప ప్రామాణికమైన ఒక గ్రంధప్రచురణపై నేను తొలిపలుకులు వ్రాయుటకు మహదానందపడుచున్నాను.  ఫతేఘర్ వాస్తవ్యులు శ్రీరామచంద్రజీగారిచే కనుగొనబడిన సహజమార్గమను ఒక నూతన యోగవిధానము భగవంతుడితో సహజరీతిన యధేచ్చగా అనుసంధానం గావిస్తుంది.  అయినప్పటికిని షజహాన్‌పూర్ వాస్తవ్యులైన శ్రీరామచంద్రజీ దీనికి పూర్ణత్వం చేకూర్చి అంతిమసత్యము మరియు మోక్షాపేక్షగల వారికొఱకు అందుబాటులోనికి తీసుకవచ్చిరి.  శ్రీఈశ్వర్‌సహాయ్ గారు శ్రీరామచంద్రజీ సంస్థలోని ఒక సమర్థుడైన ప్రశిక్షకుడు, మరియు శ్రీరామచంద్రజీతో సన్నిహిత సంబంధము గలిగిన వాడై మనకు సందేశమునిచ్చి యోగవిధానపు అంతర్‌దృష్టిని వివరించారు.

 

        చాలామందికి యోగమంటే భగవంతునితో ఐక్యము పొందడానికి సంబంధమేర్పరచుకొనడానికి ఒక మార్గపద్దతియని అభిప్రాయమేగాని వాస్తవములో ఈయోగము లేక ఐక్యము ఒకసారి పొందితే సిద్ధి యేర్పడినట్లేయనిగాని లేదా భగవంతునితో ఏర్పడిన శాశ్వతమైన అనుబంధమనిగాని పూర్తిగా యెరుగరు.  ఈ సందేహమెందుకేర్పడినదంటే సర్వసాధారణముగా "సంయోగ" మనునది తాత్కాలిక కలయికగాను "సమవాయ" మనునది శాశ్వత కలయికగాను భావిస్తారు.  ఏదియెట్లున్నను వ్యక్తిగతఆత్మ యొక్క లక్ష్యము భగవంతునితో శాశ్వతకలయికే కాని కేవలం తాత్కాలికమైన కలయిక లేక అనుబంధం కాదు.  దీనికి తోడు ఈ కలయికకు అనేక స్థాయిలున్నవి.  సామీప్యము అనగా దగ్గరగావుండటం, సారూప్యం అనగా ఒకే రూపంతో ప్రకాశిస్తూ వుండడము, సాలోక్యం అంటే ఒకే లోకం లేక స్థితి లేదా ఒకే దృక్పదము కలిగి వుండడము మరియు సాయుజ్యము అంటే పూర్తికలయిక.  అక్కడ భగవంతుడు, ఆత్మ రెండూ ఒకదానితో ఒకటి సన్నిహితంగా కలిసి వుండడం.  లక్ష్యము భగవంతునితో విడదీయలేని బంధము, ఒకదానితో మరొకటి సన్నిహిత సంబంధము సహజముగా వుండగలిగినస్థితిని పొందుటయే అంటారు.  లేక సాధన యొక్క సిద్ధి అంటే అంతిమ పూర్ణంలో ఒకదానిలో ఒకటి కరిగిపోని భగవదైక్యము.  కొందరు మరింత ముందుకెళ్ళి ఆత్మ పరమాత్మలో లీనము, లయమౌతుందని ఖచ్చితంగా చెప్పేస్థాయికి వెడుతున్నారు.

 

        ద్రష్టలైనకొందరు ఈ నాలుగు స్థాయిలే సర్వము కాదందురు.  కేవలం యిది భగవదైక్యమునకు తిరుగు ప్రయాణం మాత్రమే కాదు.  కాని తిరిగి మళ్ళీ భగవంతుని రూపాంతరమేయైన ప్రపంచమున భగవదైక్యస్థితిలోనే స్థిరముగానుండి, భగవంతుని లీలాకార్యక్రమములో వచ్చిపోవుచుండుట అందురు.  ఏదైనప్పటికి వెంటనే అందుకొనవలసినది భగవదైక్యమనే సుదూరగమ్యము.  ఈ సుదూరగమ్యమనేది ఆయన సహచర్యములో లేక కలయికలో అయనచే సృష్టింపబడిన శాశ్వతమైన లేక తాత్కాలికమైన భోగవిలాసాల ప్రపంచాలనానందించుట.  అది క్షణికము మరియు శాశ్వతము.  అది భగవంతుని నిలయము లేక స్వర్గము కావచ్చును.

        సహజమార్గ సాధన అంతిమ సత్యదర్శనముపై గురినిలుపుతుంది.  అది దానితో ఐక్యము సాధించుట.  గొప్ప ద్రష్టలు చెప్పినట్లు అంతిమ సత్యమును అనగా ఆత్మను (మనస్తత్త్వ రీత్యా లేక తత్త్వవిచారరీత్యా  అనంతబ్రహ్మమును) దర్శించుట అవసరము మరియు సాధ్యమే అయినప్పటికిని దానిని మూడుదశలలో* సాధించనగుననిరి.  అవి- శ్రోతవ్యః, మంత్రవ్యః, నిధిధ్యాసితవ్యః - వినుట, ఊహించుట మరియు దానిపై ధ్యానించుట.  ఇట్లు కడకు ఈవిధంగా దర్శించ (ద్రష్టవ్యః) వచ్చుననిరి._____________________

1. బ్రహ్మాండోపనిషత్. 11.4.5:  ఆత్మవరే ద్రష్టవ్యః శ్రోతవ్యో మంత్రవ్యో నిధిధ్యాసితవ్యః

   యాజ్ఞవల్క్యస్మృతి : అయంతు పరమోధర్మో యద్ యోగినాత్మదర్శనం (1:8)

ముండక. 11.2.8  బిద్యతే హృదయ గ్రంధిచ్ఛియతే సర్వసంశయః క్సియతే చాస్య కర్మణి తస్మిన్ ద్రష్టే పరవారే.

        కనుక మన నిజమైన జీవిత గమ్యము దైవమును, అనగా అంతిమ సత్యమును దర్శించుటయైయున్నది.  ఇదే మనల్ని గట్టిగా పెనవేసుకొనివున్న అజ్ఞానమునుండి విముక్తి లేదా విడుదల లేదా స్వేచ్ఛనుబట్టి వుంటుంది.  మన వ్యక్తిత్వమే ఆత్మగానో లేక శక్తిగానో మనకవగతమౌతుంది.  ఈ విధంగా అవగతమైనదాన్ని చూడడము మరియు అంతిమసత్యముతో మన సంబంధమును చూచినప్పుడు అదే మనలను మనబాధలనుండి, అజ్ఞానమునుండి మరియు నిర్వీర్యతనుండి, మరణమునుండి మరియు భయమునుండి విడుదలచేసి మనకు శాశ్వత బ్రహ్మానందమును ప్రసాదిస్తుంది.  ఇది ఒక వరప్రసాదముగా అనగా అజ్ఞానమునకు, బాధలకు, జననమరణ చక్రబంధముల కతీతముగా చేర్చునని అన్ని శాస్త్రగ్రంధములు ఒక విధంగా మాట యిస్తున్నాయి.  అదే మన ఉనికిలో ప్రశాంతతను నెలకొలుపుచున్నది మరియు సత్యతత్త్వము యొక్క అర్థమును తెలియజేయుచున్నది.

 

        శ్రీకృష్ణపరమాత్మ భగవద్గీతలో కేవలం సంపూర్ణభక్తితో మాత్రమే వ్యక్తి, భగవంతుని లేక అంతిమసత్యాన్ని తెలుసుకుంటాడు, దర్శిస్తాడు మరియు అందులో ప్రవేశిస్తాడని (జ్ఞాతుం, ద్రష్టంచ తత్త్వేన ప్రవేస్తుంచ) చెప్పారు.  కనుక తెలుసుకోవడమనేది దర్శించడం వెన్నంటి వస్తుంది, మరియు యోగము దానిననుసరిస్తుంది (సాయుజ్యము). వేదాంతమనేది తెలుసుకోవడమని, దర్శించడమే మతమని, లయించడమే ఆధ్యాత్మికమని మనంగ్రహించ గల్గుతాము. మన ధ్యేయం ఆధ్యాత్మికం లేక బహిరంతరాలలో అంతటా వ్యాపించియున్న భగవంతునిలో సంపూర్ణముగా ఐక్యమై మన తత్త్వము నంతటిని దివ్యత్వము గావించు కోవడం.

 

        ప్రస్తుతం భారతదేశంలో పెక్కు దర్శనములు లేక దర్శించు మార్గములున్నవి.  కానీ తత్త్వవేత్తలు చెప్పుచున్న విషయమేమంటే, ఈ దర్శనములన్నీ కేవలం తెలుసుకొనే మార్గములేకానీ దర్శించు మార్గములు కావు.  ఎందుచేతనంటే వీటిలో యేఒక్కటీ చూచే లేక దర్శించే యోచన వరకు యెదగనే లేదు.  కనుక తత్త్వవేత్తలు వీటిని సిద్ధాంతాలనీ, నిర్ణయాలనీ పిలిచారు.  ఈ తాత్త్విక విధానములన్నీ మన ఉనికికి సంబంధించిన సమస్యలన్నిటికి పరిష్కారమవ్వాలి అంటున్నప్పటికి అంతిమసత్యదర్శనాన్ని ప్రసాదిస్తాయి.  వాస్తవానికవి వాటిలోని విభాగాలనే విశదీకరించలేక పోవడమేగాక ప్రకృతి పురుషుల ద్వంద్వాన్ని వివరించలేకపోతున్నాయి.  అంతేకాదు కేవలము శాస్త్రవిజ్ఞానాన్ని విన్నంతనే దర్శనమెలా కలుగుతుందో చెప్పలేకపోతున్నాయి.  విరుద్ధవిధానాలు ముఖ్యంగా బుద్దుడు, మహావీరుడు బోధించిన విషయాలలో, శాస్త్రాలలో చెప్పబడిన ధ్యానాలు లేదా మనోగతులకు అతీతంగా వ్యక్తిగత అంతిమ దర్శనస్థితికి చేరుకోవలసిన అవసరం గుర్తించవలసి వుంది.  అయినప్పటికి అవిసైతం తర్వాత కేవలం మానసిక వ్యాయామాలు, మానసిక మార్పునకై కట్టుబాట్లు లేక నీతినియమముల క్రమశిక్షణ, మరియు భౌతిక శిక్షణలకు మాత్రమే పరిమితమైనాయి.  అందుచేత ఈ షడ్దర్శనములు వాటితోపాటు ఉండవలసిన ఆధ్యాత్మిక క్రమశిక్షణ లేకపోవడంతో అవి దర్శనములేకాకుండా పోయినవి.  వేదాంతములు ఈ బాహ్యదర్శనములను తమలో యిముడ్చుకొని అత్యవసరమైన సాధన లేక ప్రత్యక్షశిక్షణ నిచ్చుచున్నవి.  అందువల్ల వేదాంత మొక్కటే నేటి దర్శనమైపోయినది.  వైరుద్ద్యముతోకూడుకున్న దర్శనములు సైతం వేదాంతం (మూడు లేక నాలుగు విధములుగావుండే తాత్త్విక చింతనలు) లో కలసిపోయినవి.  అదియునుగాక ఈ వేదాంతం కూడా సాధనా విషయమై తన పట్టును కోల్పోవడం ప్రారంభమైంది.  కారణం అది పవిత్ర గ్రంథములందలి ప్రవచనము అనగా, అవి అద్వైత మహావాక్యాలు కావచ్చు, విశిష్టాద్వైత సమన్వయగ్రంధాలు (ఘటకశ్రుతులు) కావచ్చు లేక ద్వైత గ్రంథాలు కావచ్చు, వాటిని వినుటే చాలునన్న అభిప్రాయానికి ముందేవచ్చేశాయి.  వెనుకబడిపోవడానికి కారణమేదైన కావచ్చుగాని, శ్రవణము దర్శనానికి దారితీయు పరిస్థితిమాత్రం లేకుండా పోయినది.  యోగము ప్రాధమిక ప్రయత్నాంశము కాకపోవడము వల్లనే ఈ దుస్థితి యేర్పడినది.  ఇక ఆధ్యాత్మిక పునరుద్ధరణ ప్రారంభము కావలెనన్న దర్శనమునకు యోగసాధనమే ముఖ్యమని గ్రహించి యోగమును పునఃస్థాపించవలెను.  (యోగేనాత్మదర్శనం) అరబిందులవారు వారి రచనలన్నిటిలో ఈ వాస్తవమునే నొక్కి వక్కాణించెను - ఇదే ఆయన మంత్రము.

 

        మహాద్భుతమైన సంఘటనలు జరుగుతున్న ఈ ప్రపంచంలో సత్పదార్థదర్శనము వ్యక్తిగతంగా, నిదర్శనాపూర్వకంగా అనుభవించగలగాలనడంలో ఆశ్చర్యమేమీలేదు.  ఎందుకంటే స్వానుభవాలనేవి వారి యింద్రియములకందనివి, ఊహించినవి, కలలుగన్నవి, ఆశించినవి, కావలెనని కోరుకున్నవి అనేపరిధుల్లోనివేగాని అవి అంతిమసత్యమునకు ఎలాంటి సంబంధములేనివి.  సర్వము అనుభవసూచకంగా వస్తుంది.  దర్శనము అనే పదానికి ఏసంపూర్ణభావము కలదో, అట్టి భావముతో కూడుకున్న దర్శనము యదార్థదర్శనము లేక జ్ఞానదర్శనము.  అది ఇంద్రియజ్ఞానమునకతీత విషయము.  ఇంద్రియజ్ఞానము మరియు ఆలోచన లేక మానసిక జ్ఞానముల మధ్యనుండు వైరుద్ద్యముల వల్ల మనిషిని ఒక అనుభవమునకు వచ్చునట్లు ప్రోద్బలము చేయును.  అంతిమదర్శనము వైపుకు మళ్ళించు ఈ ప్రోద్బలమే మన దృష్టిని ఆధ్యాత్మికశాస్త్రాన్ని గుర్తించిన ఎఱుకను విశదపరుస్తుంది.  ఇదే మానసిక పరిపూర్ణత.  అంతిమసత్యదర్శనము, దానిలోనికి ప్రవేశము, దానిలోనే జీవించడము సహజమార్గ లక్షణము.  కనుక సామాన్యంగా దర్శించడమనేది తెలుసుకోవడానికి ముందుటిస్థితి. చూడడమనేదానితోపాటి తెలుసుకో- వలసిన అవసరాన్ని తెలియజేస్తారు.  ఒక అభిప్రాయము ప్రకారము నేటి విద్యావేత్తలు ప్రత్యక్షంగా చూపిస్తూ చెప్పేవిద్య పిల్లలకు మంచిదంటున్నారు.  కనబడే విషయములే గ్రహింపునకు యోగ్యస్థానములన్నిది నేటి నవీన విద్యావిధానము.  ఆధ్యాత్మిక సాక్షాత్కారమున వాస్తవ దర్శనీయస్థానము ధ్యానముచేయు స్థానమే లేక ఇంద్రియాతీతమైన ఎఱుక.  ఇది అందరికొఱకు తెరచియుంచబడిన స్థానముకాదు.  కేవలం ఆధ్యాత్మిక జీవనం మరియు సత్యతత్త్వముపై నిజమైన తపన గలవారి కొఱకే వున్నది.  ఆధ్యాత్మిక జీవనము మరియు అంతిమసత్యము యొక్క ఉనికిపై ధ్యాసలేని వారు ఈ మార్గమునకు అసలురారు.  దుష్టప్రవర్తనము విడచిపెట్టనివారు - నవిరాటో దుఃశ్చరితాత్ - అని ఉపనిషత్తులో చెప్పినట్లు వాస్తవార్థమును గ్రహించి ఈ మార్గములోనికి వత్తురనిగాని లేదా ఇందు ప్రవేశింతురనిగాని ఆశించలేము.  సహజమార్గము సాధకుని ఈ ఆధ్యాత్మిక దర్శనీయ స్థానమున నేరుగా ప్రవేశపెడుతుంది.  తర్వాత దర్శించగల మరియు తెలుసుకోగల శక్తినిచ్చి ఆతర్వాత ఉన్నతోన్నత అనంతాధ్యాత్మిక స్థితుల నధిగమింపజేస్తుంది.  మనస్సు, ఇంద్రియములకు సంబంధించిన ఇంద్రియవాంఛ, భ్రమల పరిధిని దాటుతారు.  అనంతత్త్వలక్షణమే ఆధ్యాత్మిక ఉనికి.  ఇది ఇంద్రియ సంబంధమైన ఊహాజనితమైన మానసికస్థితి కాదు.

 

        సహజమార్గపద్దతిలో ఆధ్యాత్మిక శక్తి ప్రసారము లేక అత్యున్నత ప్రామాణిక ఆధ్యాత్మిక అతీంద్రియశక్తి ధారను సాధకునకు వ్యక్తిగతంగా అతని వికసింపబడిన మానసిక, భౌతిక, చైతన్య జీవితములోనికి ప్రసరింపజేస్తుంది.  ఇది సాధకుని వ్యక్తిగత సహజ (జీవ) చైతన్య ఉనికి, కేంద్ర ఉనికితో అనుసంధించబడినప్పుడు జరుగుతుంది.  అందుచేత యెంత తీవ్రంగా వ్యక్తి అనుకొన్నప్పటికి ఎంత యిష్టపడినప్పటికి లేక కోరుకున్నప్పటికి లభ్యమగునది కాదు.  చదివినంత మాత్రాన, విన్నంత మాత్రాన, లేక దాన్ని గురించి తీవ్రంగా యోచించినంత మాత్రాన లేక మరేవిధమైన మేధోమధనం లేక సమన్వయం చేసుకొన్నంత మాత్రాన ఈ విషయమై యెట్టి సహాయమూ వుండదు.  అయితే ఒక మహాత్ముని శక్తి లేక కృప మాత్రము సహాయపడగలదు - ఇదీ గురువు పని.  కొందరు యోచనాపరుల అభిప్రాయము ప్రకారము గురువు ఆటంకమేగానీ, యేవిధంగాను మేలుచేసేది లేదందురు.  సహాయము చేయలేరనేది కూడా ఒక విధంగా వాస్తవమే.  కానీ ఇది సామాన్యముగా గురువులని చెప్పుకొంటూ ప్రాణాహుతిప్రసారం, లేక మహోన్నతమైన భగవంతునితో సంబంధమేర్పరచలేని వారితో గలిగిన అనుభవమును బట్టి అట్లు చెప్పబడినది.  అధమస్థాయి గురువులు కేవలం వారు తత్త్వవేత్తలుగా లేక విజ్ఞానవంతులుగా లేక ఆవేశపూరితమైన భక్తులుగా, తెలివితోనో లేక భావోద్రేకము రేకెత్తించడం ద్వారానో సంతృప్తి పరచుచుందురు.  ఇంకా మహాఅయితే మహిమలు చేయువారుగానో, ఇంద్రజాలము చేయువారో అయివుండి యితరులను మభ్యపెట్టి మరియు తమ్ముతాము గూడా వంచించుకొనుచుందురు.

 

        నేరుగా మూలసత్యతత్త్వముతో సంబంధము- గలిగితేనే దర్శనం ప్రాప్తమౌతుంది.  దీని దర్శనమే ఒక ప్రత్యేకముగా గుర్తింపబడాలి.  అంతిమ సత్యమును గుర్తించడానికిచ్చే శిక్షణకు, పరిశోధనచేయు శాస్త్రజ్ఞులకిచ్చే శిక్షణకు తేడా వుంది.  ఇక్కడ అనుభవమునకు వచ్చే పదార్తము సూక్ష్మము.  దానిని ఇంద్రియజ్ఞానపు స్థాయికి తగ్గించలేము.  సూక్ష్మదర్శినుల భూతద్దము, దుర్భిణుల సామర్థ్యము అనంతముగా పెంచినప్పటికిని అంతటి సూక్ష్మస్థాయిని దర్శించనలవిగాదు. దీని నర్థముచేసుకొనుటకు వ్యక్తి క్రొత్త సూక్ష్మగ్రాహతను లేక జ్ఆగృతినుత్పన్నము చేసుకొనవలెను, అది అతని భౌతిక లేక స్థూల శారీరక చైతన్యము నధిగమించిపోయి వుంటుంది.  మిడిమిడి జ్ఞానపద్ధతులలో అర్థముచేసుకోలేని విశాల మనసిక పరిధిని సహజమార్గము తెరచి వుంచుతుంది, కనుకనే యిది కేవలం ఆధ్యాత్మికజీవనం లేక దృక్పదం గలవారికి మాత్రమే తెరువబడుతుంది.  అది యింద్రియ మరియు మానసిక పరిధుల కందదు.  ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ఇచ్ఛాశక్తి మరియు బుద్ధి కూడా దాన్ని తెలుసుకోలేని తగ్గుశ్రేణికి చెందిన సాధనలే.  ఆత్మ నేరుగా సత్యతత్త్వ దర్శనం చేయగలుగుతుంది.  అంటే తన స్వంత ఆంతరంగిక విశ్వాన్ని మరియు బాహ్య ప్రాకృతిక విశ్వాన్నీ రెండింటిని దర్శిస్తుంది.  నేరుగా దర్శించిన సాక్షి నుండి గ్రహించిన సాక్షాత్కారమిదే.  సామాన్యంగా సాక్షి అన్న పదం కేవలం ఒక ఘటనను చూచినవాడు సత్యతత్త్వము లేక ప్రకృతిని ప్రత్యక్షంగా చూడనివాడని అర్థాన్నిస్తుంది.  కానీ ఒక శక్తివంతమైన దృక్పదంతో గమనిస్తే అక్కడ నిజమైన చైతన్యమున్నది.  అది స్వేచ్ఛతో, బంధనరహితమైయున్నది మరియు బంధించనిదై ప్రతిచర్యలేని ఆధ్యాత్మికమైన ఆత్మచైతన్యమది.  దీన్ని యేది సృజిస్తే అది స్వేచ్ఛను పొందుతుంది.  దీన్ని క్రియారహిత క్రియ అని తెలియ జేయబడింది.  దీన్నే శాంతి అంటారు.  ఇది ప్రశాంతమైన అనుభవమని చక్కగా తెలుస్తుంది (శాంతాకారం).  ఇదే సర్వస్వానికి పునాది కనుక దీనికి యెన్నటికినీ మార్పులేదు.  యోగమున యిది తొలియడుగు, ఆఖరుయడుగు కూడా యిదే.  ఇది భగవంతునితో తొలిఅనుభవము.  ఇది మొదటి దర్శనము లేక అనుభవము.  అందుచేత దర్శనము  శాంతి యొక్క అనుభవము అభివృద్ధి చేస్తూ మూలసత్యమునుగూర్చి లోతుగా తెలుసుకొనుట, విశ్లేషించుట వంటి చర్యలనధిగమించి పోతుంది.  ఎంత మహోన్నతమైనదైనా యెంత ప్రాధాన్యమైన సత్యతత్త్వపు యెఱుకనైనా సమగ్రంగా అది కలిగివుంటుంది.

 

        పరిమితులతోకూడిన చిన్న (పిండ) ప్రపంచమే మానవుడు.  ఇంద్రియముల అనుభవానికి పరిమితమైయున్న ఇట్టి చిన్న ప్రపంచమునకు అతీతముగానూ అనంతముగాను ఏదైతేయున్నదో దాన్ని గురించిన ఎఱుక కుడా వుండడముచేత దాన్ని కాంక్షిస్తూ వుంటాడు.  ఈ ఎఱుకయే అతనికి ఒక విధంగా చిరాకు, బంధముగా ఏర్పడడానికి కారణంగా వుంటుంది.  వీటినుండి తప్పించుకోవడం అవసరంగా భావిస్తాడు.  ఇందుకుగాను మానవునిలో ఈ మనస్సు ఉన్నత ఆశయమైన ప్రత్యేకగుర్తింపును, అహంకారమని పిలువబడే జ్ఞానమునూ మరియు సరియైన, వాస్తవమైన, మేలైన స్వచ్ఛ నిస్వార్థ జ్ఆగృత బుద్ధిని అధిగమించి ముందుకుపోతుంది.  దీనికావలనే మన ధ్యేయమున్నది.  అందుచేతనే మనము విశాలమగు బ్రహ్మాండమండలమును దాటి సత్యతత్త్వమగు కేంద్రమండలము ప్రవేశింతుము.  అక్కడమాత్రమే నిజమైన అర్థములో స్వేచ్ఛ లభించును.  అజ్ఞానమయమగు బాహ్యవస్తువిషయముల ప్రమేయము వుండదు.  వాస్తవములో వస్తువిషయాలకతీతంగా వాటి పరిధులను దాటి సాగివెళ్ళడము జరుగుతుంది.  ఇంతవరకు ఏ తత్త్వశాస్త్రము ఇట్టి దర్శనమును చేయించడములో దోహదపడలేదు.  కానీ వేదాంతము "అధిగమించి వెళ్ళు మార్గమును" చూపి, ఇది అపరిమితమై సంపూర్ణముగా తెలుసుకొనలేని, తెలియపరచలేని విషయమనీ, కేవలము అంతర్గతానుభవమున మాత్రము తెలిసికొనదగిన మార్గమని చూపించినది.  వాస్తవములో ఉన్నదున్నట్లుగా తెలుసుకోదగ్గదే తప్ప అనుభవమున తెలుసుకోదగ్గదేదీ లేదు.  "బ్రహ్మనెరిగిన వాడు బ్రహ్మమే అయిపోతాడు", అన్నది ఉపనిషద్వాక్యము.  అదే వాస్తవము.  కానీ యింతవరకు తీసుకరాగల్గిన దర్శనం కేవలం ఆలోచన మాత్రం కాదు; కానీ తనంతటతాను మూలమునకు వెనుదిరిగిన యోచనే (కరణంతు ధ్యేయః) సరియైనదని ఉపనిషద్భోదకులు వచించిరి.  సహజమార్గము కేవలము ఒక బుద్ధికౌశల్యత కాదు.  ఇది భావార్థకము కాదు. భగవంతుని మరియు ఆయన సత్యతత్త్వమును, అత్మార్పణము మరియు శరణాగతి ద్వారా భగవద్ధ్యాస తప్ప మరేయితర విధానము నాశ్రయింపక, యేదైతే అన్నింటి అర్థము, పరమార్థమును ప్రసాదిస్తుందో ఆ కేంద్ర సత్యతత్త్వమునకు దారి చూపు పని తప్ప యితరము నాశ్రయింపక సలుపు ప్రత్యక్ష అనుసంధాన కార్యమిది.  ఇది నేరుగా చేయవలసిన పని.  పవిత్రగ్రంథములు, ఆలోచన, భావనల వల్ల జరుగు పనికాదు.  ఈ సత్యతత్త్వ పవిత్ర ప్రపంచములోనికి గురువర్యులు అభ్యాసుల నంగీకరించిన తక్షణమే ప్రవేశింతురు.  దీక్ష గైకొన్నంతనే ప్రక్రియ మొదలై గురువర్యుల మార్గదర్శకత్వమున వరుస క్రమంలో పని కొనసాగుతుంది.  గురువర్యులు సాధకుని అనేక, పదార్త, జీవ, మానసిక, అహంకార బుద్ధి దశలను బహిరంతర ప్రాకృతిక స్థాయిలలో దాటించి అతడు ఈ విశాల ప్రకృతి మరియు వ్యక్తిగత ఆత్మలన్నీ యే కేంద్రము చేత సంరక్షింపబడుచున్నవో ఆ కేంద్ర సత్యతత్త్వములో యిమిడి వున్నవన్న సత్యమును గ్రహించునంత వరకు తీసుకెళ్ళును.  కేంద్రము, ఒక భావనతో చూస్తే శూన్యము (సున్న)గా కనబడుతుంది.  మరోభావనతో చూస్తే అది గర్భము (భూతయోని లేక భూమా).  అది భూతభవిష్యద్వర్థమానంలో జరిగే సృష్టిస్థితిలయాలకు భాండాగారము.

 

        సహజమార్గము, ఒక భావన ప్రకారము కేవలము ఒక దర్శనమేకాదు, అనగా ఒక ఆలోచనా విధానపు కూటమి కాదు, తత్త్వశాస్త్రము కాదు.  ఒక జ్ఞాన సముపార్జనా విధానము కాదు.  లేక సత్యతత్త్వమును చేర్చు భావోద్రేక విజ్ఞాన విద్యయూకాదు. సత్యతత్త్వము యొక్క వ్యాఖ్యానమూ కాదు.  కానీ ఇది అతీంద్రియత్వము ద్వారా పొందనగు అసలు సిద్ధి లేక సత్యతత్త్వమే అయివున్నది.  ఇందులో మానవునియొక్క అతిముఖ్య ఆశయమిమిడి యున్నది.   అది దివ్యమైన దైవత్వమును పొందుట, సంపూర్ణత్వమునందుట, నిజమైన స్వేచ్ఛ పొందుట, విడుదల పొందుట, ఆధ్యాత్మికమగుట, అంతేకాదు ఇది అమృతత్త్వపు రహస్యము గ్రహించుట.  ఈ అనుభవమున మరియు సిద్ధిపై ఒక మహోన్నత జీవితమాధారపడి యున్నది. దీన్ని దివ్య జీవనమని లేక మహోన్నత స్థితికి చేరుటయని లేక అంతములేని ఏవిధమైన మిశ్రమములేని ఆనందముతోనున్న అనంతము నందుకొనుట అని అనవచ్చును.  సహజమార్గము ఆనందముతో ప్రారంభించి ఆగకుండా యింకా యింకా గొప్ప అర్థవంతమైన ఆనందము వైపునకు (అనంతానందము) కొనసాగుతుంది.

 

        సహజమార్గము యొక్క గొప్ప విలువ మహోన్నత జ్ఆగృతి సమకూర్చిన చైతన్య సహాయములోనున్నది.  అది గురువుచేత హృదయమునకు ప్రసారము చేయబడి, ఆత్మ వరకు ప్రవహించును.  లేక దారిపొడవునా వ్యక్తి గమనమును శక్తివంతము చేసి అంతిమ గమ్యమును చేర్చువరకు కొనసాగును.  అందువల్ల అంతర్గత వాంఛ లేక యెదుగుదల కూడా మేల్కొల్పబడి, కేంద్రము యొక్క అతీంద్రియ శక్తి వల్లనే వెలిగించబడి నిండైన యెడతెగని కదలికను కలిగించును.  పైనుండి దిగివచ్చు కృప మరియు ఉన్నతంగా యెగబ్రాకు ఆశయము రెండు కూడా ఒకే దివ్యశక్తి యొక్క భాగములే.  ఆ దివ్యశక్తి యొక్క రెండు కొసలకు గురువే శక్తినిచ్చును.  దీనితో యోగము సులభము మరియు వేగవంతమై ఉన్నతోన్నత స్థితులకు పురోగమించుటకు, సిద్ధింపజేసుకొనుటకు సమయ వినిమయము తగ్గించబడును.  ఇది శ్రీరాంచంద్రజీ వారి ప్రత్యేక ఆవిష్కరణమైయున్నది.  కనుక సహజమార్గము, భగవంతునిలో, భగవంతుని కొఱకు, భగవంతుని వల్ల సహజజీవనము గడుపుటకు సులభము, త్వరిత ఫలప్రదమునైయున్నది.

 

కె.సి.వరదాచారి, ఎం.ఎ.,పి.హెచ్.డి.

శ్రీరాజగృహ 

తిరుపతి

(దక్షిణ భారతదేశము)

 




ఉపోద్ఘాతము

       

        వాస్తవ జీవిత విలువలను సక్రమముగా అర్థము జేసుకొనలేక పోవడం వల్ల నేడు మానవ జీవితము దాదాపు మొత్తము గందరగోళమైపోయినది.  ఇంచుమించూ అందరూ, శాంతి సంతోషము మరియు ఆనందమును యేదో ఒక రూపములో పొందుటకు అర్రులు చాచుచున్నారు.  కానీ అందుకొఱకు వారు గైకొన్న మార్గములు వారిని తద్వెతిరేక             దిశలో గొంపోవుచున్నవి.  భగవదారాధకుడు గావాలనుకుంటాడు, కాని తుదకాతడు కేవలమొక స్థౌల్య విగ్రహారాధకుడై పోతున్నాడు.  ఆధ్యాత్మిక మార్గంలో పురోగమించాలనుకుంటాడు కాని వస్తువిషయాదుల ప్రపంచంలో పడిపోతున్నాడు.  సూక్ష్మతను సంతరించుకోవాలనుకుంటూనే జడత్వంలో కూరుక పోతున్నాడు.

 

        ఎందుకిలా జరుగుతున్నది?  ఇంద్రియ సౌఖ్యనుభవముల వదలక పట్టుకొని వ్రేలాడుటవలననే బహుఃశా ఇలా జరుగుతున్నదని విశదమైనది.  మనిషి దృక్పదములో నిరంతరము మానవ భౌతిక స్వరూపమే నిలిచియున్నది.  ప్రతీ చర్యలోనూ దేహబ్రాంతియే ప్రాధాన్యత వహించుచున్నది.  చేసే ప్రతి పని నుండి మనిషి యేదో ఒక ఆనందము నాపేక్షించుచున్నాడు.  అతడాశించిన ఆనందమునివ్వలేదనుకొన్న దానినెపుడు ఒప్పుకొనడు, అట్టిదాని ననుసరించడు, అట్టి పనినసలే చేపట్టడు.  బహుఃశా అటువంటి యేదో ఒక ఆకర్షణ కొఱకే మనిషి పూజ, భక్తి లేక యేదో విధమైన సాధన చేబడతాడు.  అతనికి శాంతి అంటే ప్రాపంచిక వాంఛాపరితృప్తియే.  పూజ, భక్తి మరియు మతము యివన్నీ సర్వసాధారణంగా అందరూ అనుకొనే భౌతిక సుఖసంతోషాలు, ఆనందమును సమకూర్చు సాధనాలే. అందువలన ఇది ఆధ్యాత్మికతకు యేమాత్రము సంబంధములేని ప్రాపాంచిక వస్తువిషయసముపార్జనకైన ప్రాకులాటే.  అందుకే మనం తుదకు వ్యతిరేక ఫలాలను పొందుతున్నాము.  మాగురువర్యుల మాటల్లో చెప్పాలంటే, "జనులు సాక్షాత్కారాన్ని యింద్రియముల ద్వారా పొందాలనుకుంటారు. అది అసాధ్యము."

 

        కనుక మనల్ని మనం సంస్కరించుకొని ఉద్దరించుకొని నిజమైన శాంతి, ఆనందాన్ని పొందుటకు యింద్రియ తీవ్రవాంఛాస్థితిని దాటి పైకెదగక తప్పదు.  మొదటి నుంచి ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొనవలసి యున్నది.  కనుక తాననుసరిస్తున్న విధానము సంపూర్ణముగా తనను సక్రమ మార్గములో కొనిపోవుచున్నదన్న పూర్ణవిశ్వాసము సంతృప్తి కలిగియుండి తన మానసిక వృత్తులను క్రమేణా శాంతింపజేయవలెను.  ఈ గ్రంథము ఆధ్యాత్మిక లోతులను ‘సహజమార్గము’అను అతి సులభ విధానమున పాఠకుల కందుబాటులోనికి తీసుకరావడానికై ఉద్దేశింపబడినది.

 

             ---రచయిత.

 






I. ప్రపంచము - నేటియదాతథస్థితి         

 

ప్రస్తుత దృశ్యము

 

        నేటి ఈ ప్రపంచము పూర్వమున్న తీరునలేదు.  ఇప్పుడు మన మనుభవిస్తున్న సౌకర్యవంతమైన జీవితమునకు అభివృద్ధి చెందిన విజ్ఞానము, అనుభవము యెంతగానో తోడ్పడినవి.  మనిషి నేడు ప్రకృతిశక్తులపై అనగా నేల, నీరు, గాలిపై విజయము సాధించితినని చెప్పుకొనుచున్నాడు.  ఆకాశమును సహితము వదలక సాహసమున దానిపై కూడా అధికారము సంపాదించితినని మున్ముందుకు వెళుతూ కంటికి కనబడు నిదర్శనములు సైతము చూపుచున్నాడు.  అయినప్పటికిని మనిషి జైత్రయాత్రకింకను అంతము పలకలేదు.  ఎదురుచూస్తున్న ఈ ప్రపంచానికై యింకా యింకా తీవ్రంగా శాస్త్రజ్ఞుల కుశాగ్రబుద్ధి శ్రమిస్తూ మరిన్ని గొప్ప అద్భుతాలను ఆవిష్కరించడానికి ప్రయత్నిస్తూనే వున్నది.  ఈ విషయంలో మనం మన తాత ముత్తాతల కంటే మెరుగైన జీవితాన్ని గడుపుతున్నామని నిరాఘాటంగా చెప్పుకోవచ్చును.  ఉన్న వనరులన్నీ మనకు బాగా ఉపయోగపడేటట్లు వాటిపై సాధికారతను సాధించాము.

 

        ఇది చిత్రపటమునకు ఒకవైపు దృశ్యము.  కానీ అవతలి వైపును త్రిప్పిచూస్తే మనకేమి కనబడుతున్నదినిజమైన శాంతి మరియు సంతోషము ఎక్కడ చూచిన కనబడటం లేదు.  భయము ఆతృత ప్రతి మనస్సును కలవరపెడుతూ, అంతటా అలజడిమయమగు వాతావరణమేర్పడి యున్నది.  భయానక రణోద్వేగము, నెత్తురుచిందించు మరియు విధ్వంసకర సంఘటనలు మనస్సును క్షణం క్షణం వెంటాడుచున్నవి.  ఇలా ఎందుకు జరుగుతున్నది? దీనికంతటికి సమాధానమిచ్చే ఒకేఒక సాధారణ కారణం అదుపుతప్పిన స్థౌల్య ప్రాపంచిక వస్తువిషయాసక్తి.  అది మనిషిని ప్రకృతి నుండి బహుదూరం చేసింది.  మానవజీవితం చాలావరకు దాదాపు కృత్రిమమైపోయింది.  మతమునకు ఆధ్యాత్మికతకు యేమాత్రం నిజాయితిలేని నేటి నీతిబాహ్యమైన నవీన నాగరికతే (దీనికంతటికినీ) కారణము.  స్వార్థం అనేది, అది వ్యక్తిగతమైనది గాని, లేక ఒకసంస్థగానీ, ఒకదేశానికి సంబంధించిగాని మానవ జీవితములోని అన్ని దశలలో ప్రాధాన్యతను సంతరించుకొనియున్నది.  మానవ మనస్సులపై దైవీకము పట్టు సడలిపోయినది. కష్టకాలంలో మానసికముగా కృంగిపోయిన దశలో ఉపశమనంగా బలహీనుల నోదార్చువానిగా భగవంతుడు తలచబడుతున్నాడు.  మనిషి మానసికముగా చెడువైపునకే యెక్కువగా మరల్చబడుతున్నాడు. లౌకికము యోగ్యతగా, కుటిలత్వమే ఒక కళగా గుర్తింపబడుచున్నది.  స్వార్థం దేశభక్తిగా భావింపబడుతున్నది.  నేటి నవ్య జీవితానికి డాంబికము, పైపైమెఱుగులు అవశ్యకములైపోయినవి.  మానవ మనస్సులోని విధ్వంసకర ప్రవృత్తులను ఈ శాస్త్రవిజయములు, తప్పుడుభావనలతో ప్రలోభపరచి వాటినే ఘనత వహింపజేయుచున్నవి.  ఈ పరిస్థితులలో ప్రపంచము వినాశనము వైపునకు దూసుకుపోతున్నదని యనుటలో తప్పులేదని భావించవచ్చును.  ఇటువంటి విషమ పరిస్థితులలో ప్రకృతి* గైకొనుచర్య యిట్లేయుండును.

 

ప్రపంచశాంతి

 

        ఇప్పుడు చర్చించిన విషయముల నేపథ్యమున ప్రపంచ దృశ్యమును గమనిస్తే యింతకూ ఈ ప్రపంచం వెళుతున్నది అభివృద్ధి దిశలోనా? లేక దిగజారుడు దిశగానా? అన్న విషయము నిర్ధారించుట కష్టమే.  ప్రాపంచిక వస్తు దృష్టిగల వానికిది మంచిదిగానే అనిపించవచ్చు.  కానీ అవతలి వైపుకు దృష్టిసారిస్తే ఇదంతా అనివార్యమైన అత్యంత వ్యధా, నిరాశ, నిస్పృహలమయమన్న నిర్ణయమునకు రాక తప్పినది కాదు.  కనుక యిది అభివృద్ధి యనుటకు వీలుపడదు.  ప్రపంచము నేడు దారుణముగా శాంతికై విలపించుచున్నది.  ఈ పరిస్థితినుండి బయటపడవేయుటకొక   ఉపాయము     కనుగొనలేక

మేధావివర్గము   తనమునక లగుచున్నది. ప్రపంచశాంతి

కొఱకు నియమింపబడిన సంస్థలు తమ శాయశక్తులొడ్డి యుద్ధములనాపి శాశ్వత శాంతిస్థాపనకు

------------------------------------

        *మూలము నుండి (గ్రంధుల రూపమున) ప్రవహించు ప్రకృతికి సృష్టించు మరియు లయింపజేయు రెండు శక్తులూ వున్నవి.  భారతీయ యోగులు ఈ ప్రకృతిలోని నిర్మాణశక్తిని ఎప్పుడుకూడా మానవజాతి సముద్ధరణ కొఱకు సద్వినియోగపరచిరి.  విశేషంగా వున్న వినాశకర శక్తి కూడా చాలా బలమైనది.  దీనితో పోలిస్తే ఆటంబాంబు కూడా దీని ముందు ఆగలేదు.  ఇప్పుడున్న ఈ ప్రపంచానికి బదులు వినూత్న ప్రపంచ నిర్మాణమునకు ఈ వినాశకర ప్రకృతిశక్తి గూడా ఉపయోగ పెట్టుకొనబడుతున్నది.  ఆధ్యాత్మిక విప్లవము భారతావనిలో యిప్పటికే ప్రారంభమైనది.  ఇది ప్రపంచమునకంతకు మార్గదర్శకమవనున్నది.  ఇది ఎంతకాలము పట్టవచ్చనేది ముఖ్యముకాదు.  ఈ విశ్వములోని యేదేశము కూడా ఆధ్యాత్మికతనాధారము చేసికొనక మనజాలదని ప్రపంచము బహుతొందర్లోనే గుర్తిస్తుంది.  ఈ శతాబ్దాంతమునకు రాజకీయ కుతంత్రములు, ఎత్తుకు పైఎత్తులతోనే చక్రము త్రిప్పు కాలమంతరించ నున్నది.  గుర్తించదగ్గ మార్పులు తప్పక రానున్నవి.  ప్రతి ఒక్కరూ తప్పనిసరియైన ఈ మార్పునకు క్రమేణా సంతోషముతో ఆహ్వానము pలికి సమ్మతితో ఆధ్యాత్మిక మార్గమునకు మరలక తప్పినది కాదు.  అదొక్కటి మాత్రమే వ్యక్తిక్షేమమునకు నిశ్చయమైన మార్గము.

(గురుసందేశ్ నుండి అనువదింపబడినది)

శ్రమించుచున్నవి.  కాని వారి శ్రమ యెంతవరకు ఫలించిందో యిప్పటికీ తేలని విషయమే.  అయినా వారు యుద్ధాలను కొన్నిచోట్ల వాయిదా వేయించగలిగామని చెప్పుకొంటున్నారు.  అవికూడా కేవలం కొన్ని సందర్భములలోనే అన్నది స్పష్టం.  కానీ యింతవరకు శాంతిభద్రతలు గల వాతావరణాన్ని తేలేక పోయారన్నది మాత్రం నిర్వివాదాంశం.  ప్రతిచోటా యుద్ధసంబంధమైన ఉద్వేగం భయపెడుతూనే వున్నది.  ఈ పరిస్థితి కొనసాగినంతకాలం నిజమైన శాంతి ఒక వింతైన స్వప్నమే.  శాంతి అంటే యుద్ధం లేకుండడం అన్నఅర్థంలో నిర్వచించడం శుద్ధతప్పు.  ఇది సమస్యా పరిష్కారమునకు తోడ్పడనే తోడ్పడదు.  యుద్ధము జరుగనప్పటికినీ నిజమైన అర్థములో శాంతి నెలకొని యున్నట్లు కానేకాదు.  యుద్ధమనునది క్షేత్రస్థాయిలో గాని మానసికస్థాయిలోగానీ, యెక్కడున్నా అది మనుషులకు అశాంతిమయంగానే వుంటుంది.  కనుక వాస్తవ శాంతిస్థాపనకు మానవ మనస్సులనుండి యుద్ధమన్న మాటను తుడిచేయాలి.  సర్వత్రా వాతావరణమంతా సత్సంకల్పము, భద్రత మరియు సంతృప్తితో నిండి నిబిడీకృతమైపోవాలి.

 

        అయితే యిది సాధ్యమయేదెలా? వాస్తవానికి సర్దిచెప్పి సంతుష్టపరచి సంప్రదింపులతో రాజీ చేయడంవలననే శాంతిని సంస్థాపించడం సాధ్యమయ్యే పనికాదు.  ఈ దోషమునకు మూలకారణం మనం తగనిరీతిలో స్వార్థమునకు (నేను, నాది అంటూ) తగులుకొని యుండుటే.  అది వ్యక్తిగతంగా కానీ సామూహికంగాకానీ, దేశపరంగా కానీ ఒక జాతికి చెందినవారుగా కానీ అది యెట్లయిననూ వుండవచ్చును.  స్వార్థచింత జీవితపు అన్నిదశలలో మిక్కుటముగ వ్యాపించియున్నది.  మనిషి తన పొరుగువానిని మభ్యపరచి, స్నేహము, సానుభూతి పేరున మోసపూరిత చర్యలకు పాల్పడి ధగా చేయుటకు వెనకాడకున్నాడు.  ఉన్నతోన్నత ప్రపంచ వ్యవహారములు నడుపు ప్రపంచ నాయకుల వ్యవహారశైలి, ప్రాముఖ్యత వహించియున్న వారి పెద్దరికము, ప్రపంచ వాతావరణమున అపనమ్మకము, భయము, ఈర్ష, పగను రేకెత్తించు చున్నవి.

 

ఆధిపత్యపోరు

 

        ఆధిపత్యము జూపించుకొనుటకు విపరీతమైన పరుగుపందెము కొనసాగుతున్నది.  ప్రతిదేశము భయానక ఆయుధసంపత్తిని సమకూర్చుకొను ప్రయత్నములో నిమగ్నమైయున్నది.  ఈ విషయంలో శాస్త్ర ప్రరిజ్ఞానమును మెచ్చుకొంటూ యిప్పటికే చాలా దేశాలు భయంకర విధ్వంసక ఆయుధములను సంసిద్ధపరచుకొన్నవి.  మరిన్నిటిని ఆవిష్కరించుటకు సిద్ధపడుచున్నవి.  ప్రపంచపు గొప్పశక్తులుగా నిలిచిన దేశములు వాటివద్దగల గొప్పగొప్ప ఆయుధములతో బలహీన దేశములకు ప్రాణాంతకముగా నిలచినవి.  ఇక వాటికి పోటీగా నిలచిన దేశములకు ఈర్షాకారకములైనవి.  అట్టి దేశములు చిన్నచిన్న దేశములతో పొత్తు కుదుర్చుకొని ఒడంబడికలు చేసుకొని వాటివైపునకు త్రిప్పుకొని వారివారి దేశసంరక్షణ నెపముజూపి వాటికి ఆయుధములు సమకూర్చుచున్నవి.  ఇదంతా శాంతి కొరకా? లేక వారి రహస్య స్వార్థ వ్యూహములాప్రపంచము నిర్ణయించుగాక!  పెద్దపెద్ద ప్రపంచ శాంతి సంఘములు సైతము వాటి యిష్టము వచ్చిన ఆట అవి ఆడుచున్నవి.  వాటి కార్యకలాపములన్నీ వాటి రాజనీతి తంత్రజ్ఞతతో నడుస్తున్నవేగాని నిష్కపటరీతిలో సాగుటలేదు.

 

         ఒక్క ముక్కలో చెప్పాలంటే నేటి ప్రపంచము సమృద్ధిగా జమచేసుకొన్న ఆయుధములు ఆయుధసామగ్రితో సంసిద్ధముగానున్న శత్రుసమూహములతో గూడియున్నది.  ఏ సమయములోనైనా  ఇవి విరుచుకపడుటకు తయారుగా నున్నవి.  ఒకే ఒక అగ్నిపుల్ల చాలు ఏక్షణాన్నయినా ప్రపంచాన్నంతా అగ్నిగుండం చేయగలదనవచ్చును.  విశ్వశాంతి శాశ్వతప్రాతిపదికన నిలుపుటకు యిప్పుడత్యవసరమైనదేమంటే, అశాంతవాతావరణానికి కారణమైన అపనమ్మకము, భయమను భావములను మానవ మనస్సుల నుండి నిర్మూలించుటే.  కేవలము స్వార్థముతో పోటీపడుతున్న ఆధిపత్య పరుగును నిలువరింపగలిగితే ఈ అలజడిహేతువును చాలా వరకు తగ్గించవచ్చును.  అప్పుడు రాజకీయ కుతంత్రములు, విశ్వాధిపత్యకుటిలత స్థానమున విశ్వప్రేమ వచ్చి చేరుతుంది, మరియు విశ్వసౌభ్రాతృత్వము బహుదా గుర్తింపబడి, అది మన ప్రతి చర్యలోను, ప్రతి వ్యవహారములోను ప్రస్పుటముగా గోచరిస్తుంది.  అప్పుడు మాత్రమే శాంతి నెలకొనుటకు అనుకూల వాతావరణ మేర్పడుతుంది*.

 

సమస్య

 

        సమాజం అంటే మనుషుల కలయికే.  మనిషే సమాజాన్నేర్పరచాడు కానీ సమాజం మనిషిని నిర్మించలేదు.  కనుక మొత్తంమీద ప్రపంచ మెదుర్కొంటున్న సమస్య నిజానికది ప్రపంచపు

------------------------------------

        *విశ్వమానవ సౌభ్రాతృత్వ భావన నెలకొనడమంటే, ఒకరి నుండి మరొకరిని వేరుపరచే మన స్వంత అల్లికను విచ్ఛినము చేసి ఒక తండ్రి బిడ్డలమన్న అనుబంధమునకు చేరువకావలెను.  ఇది సహజసిద్ధముగా మన మనస్సుల కలయిక వైపునకు దారితీసి మనలను అనుబంధించును.  అదే గొప్ప శాంతి మరియు సంతృప్తిని ప్రతియొక్కరికి నిశ్చయముగా కలుగజేయును.

(దశాదేశముల వ్యాఖ్యానము నుండి గ్రహింపబడినది)

 

సమస్యకాదు, అది మనిషి సమస్య.  కనుక విశ్వశాంతి సామూహికమైనది, జాతికి సంబంధించినది, లేక దేశమునకు చెందినది మాత్రమేగాక అది నిజానికి ప్రతి ఒక్క మనిషికి సంబంధించిన వ్యక్తిగత సమస్య.  ఒకవేళ మనిషి తనలో తానే శాంతిని ఉత్పన్నం చేసుకుంటే, ఇక చుట్టూగల వాతావరణమంతా శాంతిమయమైపోతుంది.  ప్రతి మనిషిమనస్సులో శాంతి నెలకొనకుండా, విశ్వశాంతి అసాధ్యం.  కనుకనే ప్రతి మనిషి తనలో మనశ్శాంతి నెలకొనే మార్గమువైపుకు మరలడం అత్యావశ్యకం.  సర్వసాధారణంగా ఈ అంతర్గతశాంతి లోపించటానికి కారణం సాంఘిక, ఆర్థిక మరియు రాజకీయ స్థితిగతులే నంటున్నారు.  ఇది కొంత వరకు వాస్తవమే కావచ్చును, అయితే వీటికన్నింటికి మరి బాధ్యులెవరు? ఒకడు కాకుంటే మరొకడు, వ్యక్తేగదా కారణంప్రపంచంలోనికి వచ్చే ప్రతిదీ మానవుని వ్యక్తిగత చర్యల ఫలితమే.  కనుక మనిషే తన్నుతాను సరిదిద్దుకొని లొంగివచ్చి ప్రపంచములో శాంతి నెలకొనేట్లు చెయవలసియున్నది.

 

శాంతికి సంబంధించిన తప్పుడు భావన

 

        దురదృష్టవశాత్తు శాంతికి అర్థము చెప్పుటలో కొన్ని దురభిప్రాయములేర్పడియున్నవి.  సర్వ- సాధారణంగా మనుషులు అభిలషించే సంతోషము బయటి ప్రపంచంనుండి తమకు లభిస్తుందని ప్రాపంచిక వస్తువిషయాలతో ముడిపెట్టుకుంటూ వుంటారు.  ఒకవేళ మనిషి తను కోరినవన్నీ మిక్కుటంగా లభిస్తే లేక తన మనస్సుకు నచ్చిన, తను కావాలనుకున్న రీతిలో తనచుట్టూ సమకూరితే, కాలం మొత్తం తన కనుకూలంగా సహకరిస్తే అతడు సంతోషిస్తాడు.  తాను ప్రశాంతత ననుభవిస్తాననుకుంటాడు.  కారణం అతడు ఆ సమయంలో చీకుచింతా లేకుండా వుంటాడు.  కనుక తన మానసికప్రశాంతత భౌతిక సంతోషముపై ఆధారపడియున్నది.  ఆ సంతోషము తన యిచ్ఛా వాంఛలను సంతృప్తి పరచడంపై ఆధారపడియున్నది.  ఇది వాస్తవానికి ఒక మోటుదృక్పదము.  ఇది మనిషిని నిర్ద్వందముగా భ్రమలో నుంచివైచును.  వాస్తవాన్ని గమనించి చూస్తే చాలా మందికి కోరిన భౌతిక సౌకర్యములన్నీ మెండుగా కలిగియుండికూడా వారు మరేదో కొరతతో తీవ్ర మానసిక అశాంతికి లోనైయున్నారు.  సంతోషము ఆహ్లాదమనునవి అంతర్గత హృదయ భావనలు.  ఇంద్రియముల ద్వారా ప్రతిబింబించుచున్నవి.  కానీ జనులు వీటినే నిజమైన శాంతికి గుర్తులని పొరబడి ఇతరములన్నీ మరచిపోయే యత్నము చేస్తున్నారు.  ఈ భావన నిజమైన శాంతికి పూర్తిగా వ్యతిరిక్తమైనదిగా తోచుచున్నది.  శాంతి నిజమైన ఆత్మ స్వభావము.  కనుక భౌతికానంద భావనతో ఆత్మలక్షణమైన శాంతిని ముడిపెట్టుట అసంగతము.  అంతేకాదు యింద్రియ వాంఛలకు అంతేలేదు.  వాటిని సంతృప్తి పరచినకొద్దీ మరీమరీ పుట్టుకొస్తూనేవుంటాయి.  అంటే తుది వరకు గూడా అవి అసంపూర్ణముగానే వుండిపోతాయి.  కనుక తొలిదశలలో ఈ వాంఛలు (తీరినపుడు) సంతోషకారకములుగా కనబడినప్పటికి తుదకు నిరాశానిస్పృహలకు అవే హేతువులై శాంతికి భంగం కలిగిస్తాయి.  అంతేకాదు మన స్వార్థకోరికలు అనేక సందర్భములలో ఇతరుల ప్రయోజనాలకు ఆటంకములై అపార్థములకు, వివాదములకు దారితీసి తుదకు మానసిక అశాంతికి కారణమౌతాయి.

 

పవిత్రాదర్శం

 

        కనుక శాంతిని పొందడానికి యెడతెగకుండా వృద్ధియౌతున్న కోరికలను సంతృప్తి పరచడంవలన మనస్సును శాంతింపజేయడం సాధ్యంకాదు.  అందరి ఆశయాలనూ కలుపుకొని పవిత్రము ఆదర్శవంతమునై స్వార్థమును కేవలం అవసరాలకు మాత్రమే పరిమితం చేసుకుంటే సాధ్యపడుతుందని అర్థంచేసుకోవలసి వుంది.  కనుక న్యాయముగా యెవరికి చెందవలసినవి వారికి అందజేస్తూ అందరూ తనవారేనని వారిని సమాదరించడమే మనిషి యొక్క పవిత్రాదర్శం కావాలి.  ఇది విశ్వజనీనమైన సిద్ధాంతమై వాస్తవ రూపంలో అమలైతే, ఇదే ప్రపంచపు జఠిల సమస్యలన్నిటిని పరిష్కరించ గలుగుతుంది.  అంటే దీనర్థం స్వార్థపరత్వంతో రెచ్చిపోతున్న వ్యక్తుల లేక సమూహముల ఆక్రమణలను దుశ్చర్యలను చేతులు కట్టుకొని ఊరకే చూస్తూవుండమని కాదు.  న్యాయంగా  చెందవలసినవనేది అందరి విషయములోను సమానంగా వుండాలి.  అణగద్రొక్కబడిన దీనుని విషయంలో యిది ఒక ఊరటగను, విముక్తిదాయకంగాను, సక్రమరీతిగా ఉంటుంది.  అదే దౌర్జన్యపరుని విషయంలోనైతే ఇది అతడిని కట్టడి చేసేదిగాను ఒక శిక్షగాను వుంటుంది.  అవసరమైనచోట బలవంతంగా అడ్డుకోవడాన్ని నిషేధించనవసరంలేదు. ఏవిధంగానైనా ఒకని న్యాయమైన హక్కులను పరిరక్షించేతీరాలి.  దీని నాటంకపరచు దుశ్చర్యలను బలప్రయోగంచేత అడ్డుకోవలసిందే.  అయితే యిదంతా సహృదయంతోను ఆప్యాయత నిండిన మనస్సుతోను చేయాలి.  అంతేగాని శత్రుత్వభావనతోను అక్కసుతోను చేయకూడదు.  మనకు కావలసినవారి యెడ మనము జూపు ఆప్యాయతలు కోపతాపాలు యెట్లుండునో ఆవిధంగా ఉండవలెను.

 

వ్యక్తిగత బాధ్యత

 

         మరి దీనికొఱకై మనమేమి చేయాలిమొత్తంమీద శాంతి, గీతాలాపనలతోను బోధనలతోను రాదు.  అటుగాక దానికొఱకై సంఘములు స్థాపించుటతోను దిగిరాదు.  కానీ మన జీవితపు అన్నిదశలలోను వ్యాపించియున్న స్వార్థప్రాధాన్యత తగ్గించుకోవడం వల్ల వక్రతజెందిన వ్యక్తిగత మానసిక వృత్తులను బాగుచేయుట ద్వారా యిది సాధింపవీలగును.  ప్రతి ఒక్కడు ఇతరులను అణచివేసైనా సరే తనస్వార్థంకోసం సిద్దపడుతున్నాడు.  ఇట్టి సందర్భములలో వ్యక్తిగత స్వార్థప్రయోజనాలవల్ల వైరుధ్య భావనలేర్పడక తప్పడము లేదు.  దాని పర్యవసానంగా అలజడి కలుగకా తప్పడములేదు.  ఇదీ అసలు సమస్యాపరిష్కారమునకున్న మూల- ప్రతిబంధకము.  దీని కొఱకు మనం పైస్థాయిలోనున్న యేకొద్దిమందిపైనో ఆధారపడితే అపజయం పాలుగాక తప్పదు.  కనుక ప్రతిమనిషి తనకైతానే తన బాధ్యత గుర్తించి తానుగా రంగములోనికి దిగి ఈ విషయమై తను చేయవలసిన పనులను ధర్మసమ్మతముగా నుండునట్లు శ్రద్ధవహించవలెను.  నా విద్యుక్తధర్మముగా నేను చేయవలసినదేదో తెలుసుకోవడమేమంత కష్టము కాదు.  ఇది కేవలం తన వ్యక్తిగత మనస్సును మలచుకోవడమే.  ఎప్పుడూ మనం మన దోషములను లోపములను నిర్లక్ష్యంచేసి తప్పంతా యితరులపై నెట్టివేయజూస్తాము.  అప్పుడిక సామాన్య పరిస్థితులు యేవిధంగాను మెఱుగుపడవు.  కనుక మొట్టమొదటగా మనవ్యక్తిగత మనస్సునే మనం అదుపుచేసుకోవాలి మరియు సరిదిద్దుకోవాలి.  కానీ మన వ్యక్తిగత మనస్సులో యేవి సరిదిద్దుకోవాలిఅవి వాస్తవానికి సమత దప్పిన మన మానసిక ప్రవృత్తులే.  వాటిని మనం సర్దుబాటుచేసి చక్క దిద్దుకోవాలి.  అది మన మనస్సును క్రమబద్దీకరించుకొనుటతోనే మొదలు కావాలి.  ఇదే వాస్తవానికి సమస్త సమస్యలకు అతి ప్రాధమికాంశము మరియు ముఖ్యమైన పరిష్కారము.  క్రమబద్దీకరింపబడిన మనస్సు మన జీవితములో అన్ని దశలలోను సమత్వాన్ని నెలకొల్పి మనలో సంతృప్తి, త్యాగ భావాలను అభివృద్ధి చేస్తుంది.  తరచు ప్రజలు త్యాగ, వైరాగ్య భావాలను జీవనవ్యాపారానికి (విధానానికి) ముప్పు కలిగిస్తాయని మనిషిని నిర్వీర్యుణ్ణిచేసి విధివ్రాత యింతేలే అనుకొనే చచ్చుభావనలు కలిగిస్తాయని భావిస్తారు.  ఇది తప్పుడు దృక్పదం.  ఉత్సాహవంతమైన జీవనవ్యాపారం విజయవంతమైన ముందడుగు వేయడానికి అత్యంతావశ్యకం.  దాన్ని అన్ని సందర్భములలో మనం విడనాడక కొనసాగించాల్సిందే, అయితే అది ఒక కర్తవ్య భావనతో మనం గ్రహించాలి.  అప్పుడు వచ్చే ఫలితాలను మనం ఆత్మ సంతృప్తితో నిర్వ్యామోహభావంతో స్వీకరించాలి.  దీన్ని మనం నిజజీవితంలో సీదాసాదాగా పాటిస్తూ పోతే మనజీవితం ప్రశాంతంగా సాగిపోతుంది.  అప్పుడన్ని సందర్భాలలో, మనస్సులోను, బయటి వాతావరణంలోను శాంతి రాజ్యమేలుతుంది.  కనుక సంగ్రహంగా చెప్పాలంటే పూర్తిబాధ్యత, తనను తాను మార్పుచేసుకొని నిస్సందేహంగా తాను ప్రశాంతజీవనం గడుపుతున్న మానవుని మీదనే యున్నది.  అయితే యిది సర్వసామాన్యంగా మతం యొక్క ఆశయంగా నిర్ధారిస్తారు.  ఎందుకంటే కొందరు మనుష్యులు శాశ్వత ప్రపంచశాంతి మతం ద్వారానే ప్రాప్తిస్తుందను- కుంటున్నారు.  కాని అది వాస్తవానికి సత్యదూరమైన విషయము.

 

మతము

 

        తొలుదొల్త మనిషి యెఱుకలో, లేకపోయినప్పటికిని సర్వవ్యాపితమైయున్న శక్తి ప్రతి హృదయములో వున్నదన్న జ్ఞప్తి ఎక్కడో అంతరాంతరాలలో నిశ్శబ్దంగా దాగియున్నది.  అంతరాంతరాళాల్లో మరుగైయున్న ఈ భావనా ప్రభావముచేత ఆత్మ, అదేమిటో సరిగ్గా అర్థము చేసుకొనలేక దానిని గ్రహించు నిమిత్తమై తహతహలాడుచున్నది.  ఈ చింతన వృద్ధి చెందుతూ పోతున్నది.  తన జీవితములో అదుపుచేయలేని సంఘటనలను చూస్తున్నాడు.  మానవాతీత దివ్యకార్యములు జరుగుచుండుటను విని తెలుసుకొనుచున్నాడు.  తన చుట్టూ జరుగుచున్న మత సంబంధమైన వాలకములను, కార్యములను గమనిస్తున్నాడు.  భగవంతుడే సర్వశక్తిమంతుడన్న ఒక యోచన మనిషిలో నాటుకొని పోయినది.  అతడు వేల విధానములలో భగవంతుని ప్రజలు ఆరాధించుట చూస్తున్నాడు.  ఆ ఆరాధకులు వేరువేరు గుడారములలో వివిధ మతశాఖలకు తమను తాము అనుబంధించుకొని పూజలు చేసుకొంటున్నారు.  తనలోని ఆంతరంగిక స్పందనను సమాధాన పరచుకొనుటకు అతడుకూడా తన జీవితమున తారసపడిన ఒకానొక పద్దతి నవలంభిస్తాడు.  కాలం గడిచేకొద్ది ఈ సమూహములు తమ దారులను సంకుచిత (ఇరుకు) పరచుకుంటాయి.  అప్పుడు కేవలం బాహ్యడాంబికం చూపుకోవడం తప్ప అంతర్గత స్పందనలను విస్మరిస్తారు.  ఆవిధంగా జనం మతం, జాతి, తెగలనే పొరలలో కప్పివేయబడతారు.  ఎందుకు, దేనికోసం అలా ఔతున్నదో వారికర్థంగాదు.  వారు కేవలం భౌతికపరమైన ఆచారాలకు, అపార్థాలకు లోనైపోతారు.  ఒక అర్థము, ఆలోచనగూర్చి ధ్యేయము, ప్రయోజనము యేదిలేనివారై రంగులరాట్నమెక్కి తిరుగువారి వలె అదే స్థలంలో స్థౌల్య ప్రాపంచిక వస్తుప్రపంచంలో కొట్టుమిట్టాడుతుంటారు.

 

వివిధములైన ఆటంకములు

 

        మతమనునది భగవంతుని చేర్చు మార్గమని సర్వసామాన్యముగా అంగీకరింపబడిన విషయము.  కానీ ప్రపంచమున అనేక మతములున్నవి.  అంటే ఒకే ఒక గమ్యమును చేరుటకు అనేక మార్గములున్నవన్న మాట.  ఏమతమును అనుసరించువాడైన సరే అదే సరైన మార్గమని గట్టిగా వాదిస్తాడు.  కనుక వీటిలో అసలైనదేదో నిర్ణయించుట కష్టమే.  చాలావాటి విషయములలో అది దానినావిష్కరించిన మహనీయుని స్వానుభవము మీద ఆధారపడియున్నది.  కానీ స్వానుభవములు వారి వారి వ్యక్తిగత దృకపదములను బట్టి మారును.  కనుక వారు నేర్పిన మరియు బోధించిన సూత్రములు వారివారి స్వానుభవముల కనుగుణముగానుండి విభేదించుచున్నవి.  భగవంతునిపై వారికిగల దృక్పదవిషయముననే ముఖ్యముగా విభేదము లుత్పన్నమగుచున్నవి.  ఇవి వైరుధ్యములుగా నుండుటేగాక తరచూ ఒకదానితోనొకటి సరిపోలడము లేదు.  భగవంతుడనంతుడు.  ఈ విషయమును దాదాపు అందరొప్పుకొందురు.  కానీ మానవుని వివేచన పరిమిత మగుటచే దృక్పదములు విభేదించినవి.  కనుక వారివారి దృక్పదము నాధారము చేసుకొని యెవరి మతమునకు వారి కేంద్రమున్నది. కనుక ప్రతి మతము తన ఆరాధనా మూల సూత్రములను విధానములను వేరువేరుగా నిర్ధారించుకొని ఒకదానితో ఒకటి సంబంధము లేకుండా మరింత దూరమైపోయినవి. పరిస్థితి యిలావుంటే మతాల మూలసూత్రమొకటేయని యనుకొన వీలులేదు.  కనుక ప్రతి మతము ఒకే లక్ష్యము, ఒకే అంతిమము వైపునకు గొంపోవుననుట సరియైనది కాదు.  కానీ మనం దగ్గరగా పరిశీలిస్తే అన్నిటిలోనూ సమానంగా వున్న కొన్ని దివ్యసూత్రములపైనే ప్రతి మతము ఆధారపడియున్నది.  ఇంతవరకు విభేదరహితమే.  కానీ మతం తన ప్రత్యేకతను నిలుపుకొనుటకు కొన్ని పద్ధతులు, మూఢవిశ్వాసములు మరియు వైరుధ్యములను చొప్పించుట అవసరమైనది.  తద్వారా వారి మతమునకొక ప్రత్యేకత కొఱకు బాహ్యస్వరూపము నిచ్చిరి.  అలా ప్రతి మతము తనదైన స్వంత ప్రత్యేక లక్షణముల నేర్పరచుకొని ప్రపంచములో తన విశిష్టతను చాటుకొనుచున్నది.  కనుక మూలమునగల వాస్తవ సత్యతత్త్వమును పూర్తిగా నిర్లక్ష్యముచేసి కేవలము దురభిమాన మూఢనమ్మకములను కంచెగా యేర్పరచుకొని, వాటికి ఘనమైన మతమౌఢ్యముతో కట్టుబడియున్నవి.  ఈ కారణము చేతనే మతములు తరచు వైరభావములు గల సమూహములతో కలతలు రేకెత్తించుచున్నవి.  ఈ కలతలే కొన్ని సందర్భములలో పెద్దవై తీవ్రయుద్ధములుగానో, రక్తపుటేరులుగానో* మారుచున్నవి.

 

ఇట్టి పరిస్థితులలో, మనిషిని మనిషితో కలిపి సత్సంబంధమేర్పరచ వలసిన మతమే యిప్పుడు సంకుచిత మత దురభిమానములతో మనుషులను దూరమొనర్చినది.  ఇట్టి స్వభావము గల మతము మానవుని సమస్యలకు యెట్టి పరిష్కారమును చూపలేదనుట తథ్యము.

 

విశ్వజనీన మతము

 

        ఈ దృక్పదముతో ఆలోచించి మతములన్నిటిని యేకము చేయుటకు కొంత ప్రాముఖ్యము నివ్వబడినది.  ఆవిధంగా మత విద్వేషముల నివారించ వచ్చన్నది వారి ఆలోచన.  ఇట్టిదేమైనప్పటికిని యిదే మొదటి ప్రయత్నము కాదు.  పూర్వము కుడా యిట్టి ప్రయత్నములు చేసిరి కాని ఫలితము మాత్రము (శూన్యమే) కనబడలేదు.  అగ్బరుచక్రవర్తి యొక్క

------------------------------------ *మనము వాస్తవముగా నిజమైన మతమును గోతిలో పాతివైచితిమి.  కేవలము మతము పేరిట చప్పట్లు చరచుట తప్ప మనమేమియు చేయలేదు.  మతముయొక్క నిజతత్త్వము రూపుమాసిపోగా దాని స్థానమున సాంప్రదాయములు మాత్రము మిగిలియున్నవి.  బాహ్యస్వరూపమగు విధులు, విధివిధానములు మాత్రమే అగుపించుచున్నవి.  అవిమాత్రమత్యంత ఛాందసత్వముతోడను, పట్టుదలతోడను, సత్యస్వరూపస్పర్శ లేశమైననులేకుండా అనుసరింపబడుచున్నవి.  సత్యమునందు నమ్మిక, గుర్తించ వీలుగానట్టి అధఃస్థితికి పతనమైపోయినది.  అదియే వైదిక సాంప్రదాయ రూపమునకు వికృతి చెందినది.  అది క్రమముగా దిగజారి దురదృష్టవశమున ఈ కాలపు మతముయొక్క శాశ్వత లక్షణమయిన మూఢవిశ్వాసముగనో, దురభిప్రాయముగనో పరిణమించుచున్నది.  సాంప్రదాయములపై మనకుగల గ్రుడ్డినమ్మకము సత్యము విషయమున అంధకారమున నుంచును.  అందుచే మనము మనకు తెలియకయే యితర సాంప్రదాయములందు వైదికకర్మలందు నమ్మికగలవారి యెడల మనలో ద్వేషభావమును పెంపొందించుకొందుము.  దీని ఫలితముగా భిన్నమతానుయాయుల మధ్య అసూయా వైరములుపుట్టును.

(సత్యోదయము నుండి గ్రహింపబడినది)

"దీన్-ఎ-ఇలాహి" బహుఃశా మొదటి ప్రయత్నమై యుండవచ్చును.  ఆయన హిందూ ముస్లిములకు కలసి ఒకే మతముండునట్లు ఒక కూర్పునకు ప్రయత్నించెను.  కాని అది యెప్పుడూ వృద్ధిలోనికి రాలేదు.  అది అతనితోనే అంతరించినది.  ఈ నవీన కాలంలో గూడా అనేక సంస్థలు ఉదాహరణకు థీయోసఫి లేక ఫ్రీమాసోన్న్రి వంటివింకను యిదే సదుద్దేశముతో వృద్ధి చేసిరి.  ఈ సంస్థలు అంతర్జాతీయ స్థాయిలో నెలకొల్పబడి ప్రఖ్యాత మత సిద్ధంతముల నన్నిటినీ అందులో యిమిడ్చిరి.  కానీ ఫలితము మన యెదుటనే స్పష్టముగా నున్నది.  ఇది మరొక నూతన సంస్థగా యేర్పడి, ఇప్పుడున్న సుధీర్ఘ మతముల పట్టికకు మరొకటి జమైనది.  ప్రత్యక్ష స్వానుభవముతో గమనించి చూచినచో పూర్వమువలె నేడు మతమును ఆధారము చేసుకొని దేశముల మధ్య యుద్ధములు జరుగుటలేదు.  కానీ తరచు ఒకే మతమవలంబించుచున్న దేశములే ఒకరిపై మరొకరు యుద్దమునకు దిగుచున్నారు.  మొత్తముమీద నేటి అలజడులకు కారణము మతపరమైనదీ కాదు, సాంఘికపరమైనదీ కాదు.  కానీ స్వార్థపరత్వమే మూలాధారంగా ఆర్థికపరమైన అంశమే యుద్ధ కారణమౌతున్నది.  మొత్తము మీద మతములలోని కొన్ని ముఖ్య సిద్ధాంతములను కలిపి ఒకే మతంగా మార్పుచేయుట వలన మతముల మధ్య ఒక అవగాహన యేర్పడి మరొక సంస్థ పుట్టుకొనిరావచ్చు.  దీని వలన యేర్పడిన విశ్వజనీన మతమనునది కేవలం ఓవర్గంలో కొందరికి ఆమోదయోగ్యమైనదై, వున్న మతముల జాబితాకు మరొక బరువై కూర్చొన్నది.  కనుక విశ్వమతమనునది ఈ విధంగా ఒక భూటకమైపోయినది.  ఒక వేళ విశ్వమతములన్నిటిని కలుపవలెనన్న వాటి మధ్యనున్న అడ్డంకులను రద్దుచేయవలెను.  అట్లేర్పరచుకొన్న కంచెను పెరికివేయవలెను.  పేరుతో, పద్ధతితో, మూఢనమ్మకముతో యేర్పాటుచేసుకొన్న దురభిప్రాయములను తుడిచి వేయవలెను.  ప్రతి మతము విశ్వజనీనతను సంతరించుకొన్న ఒకేధ్యేయము, అంటే మనిషి సంపూర్ణతకు సంబంధించిన ఒకే అంశపు పరిధిలోనే వుండవలెను.  నిజమైన అర్థములో మతాల యేకీకరణమంటే సంకుచిత దురభిప్రాయపూరితమై మున్ముందుకు సాగే మతాలను రద్ధు చేయడమే.  విజయవంతమైన సమస్యా పరిష్కారానికి విశాల హృదయులై ప్రేమ సిద్ధాంతాన్ననుసరించ వలసి యున్నది.  విశ్వప్రేమ, సమస్త మానవ సౌభ్రాతృత్వము అను సిద్ధాంతములపై ఎక్కువగా మాట్లాడేవారున్నారు.  నిజానికి వేదికలెక్కి ఉపన్యాసము లిచ్చుటకు వారికా విషయము పనికివచ్చునేగాని నిజజీవితములో ఆమాటలకంత విలువలేదు.  కనుక మతము ప్రపంచపు సమస్యా పరిష్కారమునకు అసలే పనికిరాకపోగా నిజానికదే ఒక సమస్యయై కూర్చొన్నది.

 

        ఈ దృక్పదంతో చూస్తే మతం శాంతి సాధనకెంత మాత్రము సహాయకారి కాదు.  కాకపోతే అందుకొఱకది ఒక ప్రేరణ మాత్రంగా ఉపయోగపడుతుంది.  నిజమైన శాంతి మరియు స్వేచ్ఛా మార్గము ఈ మత పరిధికావల నున్నది.  కనుక మనము మత పరిధిని దాటి యెదగాలి.  మతాతీతమై సంఘికపరమైన, జాతిపరమైన దురభిప్రాయములను దాటుకెళ్ళి వాస్తవార్థంలో విశ్వజనీనమైనదైన ఆధ్యాత్మిక పరిధిలోనికి మనం ప్రవేశించాలి.

 

*****             *****


II.ఉనికి చిక్కుముడి

 

1. సంపూర్ణసత్యము:

 

కేంద్రము

 

        సువిశాలమైన ఈ విశ్వాన్ని దృష్టిలో పెట్టుకొని గమనిస్తే దీని భౌతిక స్వరూపాన్ని త్రోసిపుచ్చలేము.  ఈ నిర్మాణమున కంతటికినీ ఒక కారణము, ఒక మూలము వుండియే వుండునను తీర్మానమునకు సహజంగానే వత్తుము.  ఇప్పుడున్న ఈ విశ్వమంతయు ఒక పెద్దవృత్తమని మనం భావిస్తే దీనికొక కేంద్రముండుట హేతువాద దృష్ట్యా త్రోసిపుచ్చలేము.  అట్లయిన ఈ భౌతిక ప్రకటితమైన విశ్వమునకు కేంద్రమేదై- యుండునుతొలుత సూక్ష్మమైయుండిన పదార్తములో కొన్ని మార్పులు సంభవించి యిప్పటి ఈ స్థితిలోవున్న వస్తు సముదాయముగా కనిపించుచున్నదనుట నిర్వివాదాంశము.  కనుక మునుపటిదేదో ఒకటి నేటి ఈ స్థితికి కారణమై యుండుననుట మన ప్రస్తుత విజ్ఞానపరిధిలో మనమర్థము చేసుకొనుటకు అంగీకరించవలసి యుండును.  నేటి ఈ విశ్వముయొక్క ఈ స్థితికి కారణము మునుపటి సూక్ష్మమైన ఉనికియని మనము సహజముగానే నిర్ణయింతుము.  రేఖాగణిత శాస్త్రపు కొలతలకందని ఒక బిందువు కూడా మరో సూక్ష్మాతి సూక్ష్మమైన బిందువునాధారముగా చేసుకొని యేర్పడిన వృత్తమే.  కనుక స్థూలమైన ఉనికి, దానికంటే సూక్ష్మమైన ఉనికికి కారణమౌతున్నది.  ఆసూక్ష్మమైన దానికి మరింత సూక్ష్మమైన ఉనికి కారణం.  అంటే మన ముందున్న ఈ ప్రపంచపు ఉనికి వెనుక అనేక విధములైన స్థితులున్నవి, అయితే అవి రానురాను ఒకదానికంటే మరొకటి సూక్ష్మము, సూక్ష్మతరము.  ఇలా సూక్ష్మీకరణ జరుగుతూ జరుగుతూ కడకది సున్నా లేక ఉనికేలేనిస్థితి వరకు వస్తున్నది.  ఇప్పుడు ఈ ప్రపంచమునకు తుది కారణమేమో అర్థముచేసికొనుట సులభమైనది.  అది అత్యంత దూరముననున్న కేంద్రము, శూన్యస్థానము, అంతిమ ఆధారము.

 

భగవంతుని ఉనికి

 

        భగవంతుడున్నాడా లేదా అన్నఅంశముపై గల వాదములన్నిటికి ఇక స్వస్తి పలుకుటకు ఆ దూరమున నున్నదనుకొన్న అంతిమస్థితే సరియగు సమాధానము.  ఈ విషయమై నేనిక్కడ మా గురువర్యుల దృక్పదమును తెలియజేస్తాను:-

 

        "మానవ మేధస్సు అంకురించిన నాటినుండి బహుఃశా, దేవుడున్నాడా? అన్న ప్రశ్నపై వాదోపవాదములు జరుగుతునే వున్నవి.  కాని నాదృష్టిలో అసలు ప్రశ్న ఆ నిత్యసత్య అంతిమస్థితి ఉన్నదనియో లేక లేదనియో నిరూపించుటకాదు గాని దానిని తగినంత సంతృప్తికరమైన రీతిలో నిర్వచించుట మాత్రమే.

 

        ఒక నాస్తికుని నిర్ణయానుసారము "భగవంతుడు లేడు" అన్న నిర్ధారణతో ప్రారంభిద్దాం.  గణిత శాస్త్రానుసారం దీనికి ధనవిలువగాని, ఋణవిలువగాని లేనిదిగా గ్రహిద్దాం.  అయినప్పటికీ దానిని యేదో ఒక గుర్తుతో వ్యక్తపరుద్దాం.  గణితశాస్త్ర సంజ్ఞల్లో అట్టి ధన, ఋణ విలువలు లేనిది ‘సున్న’ లేక ‘శూన్యము’.

 

        ఇప్పుడు "ఉన్నదేమిటి" అన్న ప్రశ్న నాస్తికుడెదుర్కొన్నాడనుకుందాం.  ఒక స్థిరమైన అజ్ఞేయవాది ప్రతిదానిని సందేహించి లేదుపొమ్మనవచ్చు కానీ, సందేహిస్తూ, లేదంటున్న తనను మాత్రం లేననలేడు.  ఈ తన ‘నా’ ‘నేను’ అనుదానికొక గుర్తున్నది.  మళ్ళీ గణిత శాస్త్ర రీత్యా చెప్పాలంటే అనుకూలంగా వుండేందుకు దాన్ని ఒకటి (1) అనవచ్చు.

 

        ఇప్పుడు చిత్రమైన సున్నా విన్యాసాన్ని గమనించండి.  ఉన్నదిఅనుకున్న ఒకటి (1) లేక ‘నేను’ కు కుడివైపున ‘లేదు’ కు గురుతైన సున్నలు జమచేస్తూపొండి.  అది బలపడుతూ నేనును హెచ్చించుకొంటూ పోతుంది. ఈ హెచ్చింపుకు హద్దేలేకుండా వెళ్ళిపోతూ వుంటుంది.  ఇలా పెరిగిపోయిన దానినే ఉపనిషత్తులు అతిగొప్ప కంటే గొప్ప. (మహతో మహీయాం) అని విశ్లేషించాయి.  ఇది సాధించటానికి నీవు చేసింది కేవలం ‘నేను’ విలువను హెచ్చించుటకు భగవంతుడు, అదే శూన్యం లేక సున్నను కుడివైపు జమచేశావు.  అంటే ఉన్నదిఅన్న (ఆశావాదం) వైపు చేర్చావు.

 

        ఇప్పుడు ‘నేను’ లేక ఒకటి అనుదాని ఎడమ వైపు లేక నిరాశావాదం వైపు (ఋణం వైపు) జమ చేస్తూ వెళ్ళు, నీ నిరాశావాదపు పని అంటే దశాంశబిందువు పని చూడుము.  ఎడమ వైపున చేరిన సున్నల ఫలితంగా రానురాను అది శూన్యము (0) నకు మరింత మరింత దగ్గరౌతూ పోతుంది.  ఈ నేను తగ్గుదలకు కూడా ఒక అంతమంటూ లేకుండా పోతుంది.  దీన్ని కూడా ఉపనిషత్తులు సరిగ్గా విశదీకరిస్తూ సూక్ష్మాతి సూక్ష్మమునకంటే సూక్ష్మము (అనోరణీయాం) అన్నది.  అనంతస్థాయిలో నాస్తికుడు ఉన్నది అన్న ‘నేను’ లేక ఒకటినీ, లేదు అన్న భగవంతుణ్ణి లేక సున్నను, మన జ్ఞాన పరిధిలోనికి తెచ్చుకొనుట కష్టము.  అది సర్వసామాన్యమైనది.

 

        కనుక భగవంతుడున్నాడా? లేదా? అన్న వివాదాన్ని నేను అర్థరహితమైనదాన్నిగా భావిస్తున్నాను.  ఇట్టి వివాదములుత్పన్నమగుటకు కారణము, వివిధ మానవ సాంస్కృతిక సమూహములు చరిత్రగతిలో ఈ భగవంతుడు అన్న పదాన్ని వారివారి ఊహకు వచ్చినట్లు వివరిస్తూ అర్థాన్ని జఠిలంచేస్తూ పోయారు.  మనుషుల గుడ్డిగా మరియు ఆవేశపూరిత నమ్మకములు, వారి వారి వేదనలు మరియు ఆశలు అనేక సాంస్కృతిక నేపద్యములలో మరింత గందరగోళములు సృష్టించి రోగమును ముదరబెట్టినట్లయినది.  దీని పర్యవసానంగా కొంత హేతువాద దృక్పదము, ఆలోచన గల మనిషి భగవంతుడు అన్నమాట వినగానే వాస్తవంగా విసుగుజెందిపోతున్నాడు.  ఈ విధమైన ప్రవర్తన మనిషిని మరింత పతనావస్తకు చేర్చుటకు యెంతవరకు బాద్యత వహించాలో అంతవరకూ వహించింది.  దీనితో పోలిస్తే గుడ్డినమ్మకము అదెంత తప్పుద్రోవ పట్టించునదైనా మనిషికి బలాన్ని భరోసాను కలిగిస్తున్నది.

 

        కనుక మన మేలు కొఱకు ఈ సమస్యను పట్టించుకొనుటలో దూకుడు, ఉద్రేకస్వభావము నవలంభించరాదు.  ఎందుకంటే అది మన చూపును మసకబరచి మన గమ్యము వైపునకు సాగు మన ప్రయాణమునకు ఆటంకము లేర్పరచును.  హేతువాద దృక్పదులు మరియు మేధావులు సందర్భమునకు తగిన రీతిలో స్పందించి అసలు విషయమునకు అంటికొనియున్న పొట్టుయనెడి మూర్ఖవాదనల గందరగోళమును తొలగించి వాస్తవార్థమనెడి గట్టి గింజెను చేజిక్కించుకొందురు గాక".

 

వివిధములైన అవగాహనలు

 

        ఇప్పుడు భగవంతుడు సున్న లేక ఉనికిలేని స్థితి అన్న అంతిమ దృక్పదము సామాన్య మానవుని స్థౌల్య విచారమున కందని విషయమగుట చేత, అట్టి వారిని దృష్టిలో నుంచుకొని వారి అవగాహనకు అందునట్లు మహాత్ములు కొన్ని సులభగ్రాహ్యములను తెలిపిరి.  ఇవి అనేకములైన సులభగ్రాహ్యములగు దేవతలు మరియు వారి అనుయాయ దేవతలు, నైసర్గిక శక్తులకు మానవ రూపములనిచ్చుట వంటివి ప్రవేశపెట్టిరి.  ఇవి సామాన్య జనాలలో మిక్కుటముగా అమలులోనికి వచ్చినవి.  కానీ వాటిని వారు వ్యక్తిగత సమస్యా పరిష్కారముకే ఉపయోగించుకొనజూచిరి గానీ, వాస్తవ జీవితలక్ష్యమైన భగవత్‌సాక్షాత్కారమునకు వారు దానివైపు మరలలేదు.

 

        భగవంతుని గూర్చి యింతకంటే ఉన్నతమైన భావన భగవంతుని గూడా మనిషివలె శరీరధారుడై యున్నట్లు భావించుట, కాకపోతే ఆయన గొప్పదనమును జూపుటకు అనేక చేతులు, తలలు గల వానినిగా భావించిరి.  అందుచేత అతడు గొప్పమనిషిగా, మనిషిని శాసించగల అధికారము, శక్తి గల వానినిగా తలంచిరి.  దీనిని మరింత మెఱగుపరచి భగవంతుడు మహోన్నత శక్తిసంపన్నుడేగాక దివ్య శరీరధారుడై అవసరమొచ్చినప్పుడు తన భక్తులకు మాత్రము దర్శనమిచ్చువాడుగా తలంచిరి.  ఇంతకుమించిన భావనలో భగవంతుడు మహాశక్తియుతుడై గొప్ప మాంత్రికునివలె ప్రకృతిలోని సమస్త వస్తుజాలమును తన అసాధారణ మహత్తుచేత మన యెదట నుంచగల వాడుగా తలంచిరి.  ఈ భావనను రెండు విధములుగా అన్వయించిరి.  మొదటిది త్రిమూర్తుల భావము.  బ్రహ్మయై సృష్టిచేయుట, విష్ణువై రక్షించుట, మహేశ్వరుడై లయమొనర్చుట.  ఇక రెండవ భావము ఈశ్వరుడు.  ఈ ఈశ్వరుని కొన్ని సందర్భాలలో అంతకంటే ఉన్నతుడన్న భావము గలిగియుండిరి.  ఈ స్థితిలో భగవంతుడు మహత్తరగుణ సంపన్నుడేగాక సర్వశక్తిమంతుడుగాను, సర్వజ్ఞుడుగాను, సర్వవ్యాపిగాను విశ్వసించిరి.  ఇదే సామాన్యముగా మతములన్నిటి అంతిమభావన.  ఈ కారణముననే భగవంతుడు మతమునకు సంబంధించిన వాడుగా పిలువబడుతున్నాడు.  హిందూ తత్త్వశాస్త్రము యింతమాత్రపు అవగాహనతో సంతృప్తి జెందలేదు.  అది మరింత ఉన్నత మరియు సూక్ష్మదృష్టితో అవగాహన చేసుకొన్నది.  భగవంతుడు గుణసహితుడన్న భావననుండి మరింత సూక్ష్మభావనకు వచ్చి, అది మనమనుకొన్న ఈ గుణముల కన్నిటికీ అతీతుడని గ్రహించింది.  అది లక్షణరహిత నిర్గుణముగ తెలుపబడింది.  ఇది నిర్ద్వందముగా ముందు తెలిపిన పరిమితులు, గుణములకు లోనైన భావనకంటే సూక్ష్మమైనది.  కానీ ఈ స్థితిలో కూడా భగవత్‌భావనలో యెఱుక, చర్య మరియు ఆనందముతో సంబంధమున్నది.  వాస్తవంలో అది సృష్ట్యాదిలో వున్న స్థితి.  కానీ ఉన్న ఒకే ఒక ఉనికిలో పదార్తము, శక్తి లేక చైతన్యము, అనగా సర్వస్వము లీనమైయుండి, ఇంకా సృష్టికాలములో బయల్వెడలని సృష్టికి ముందుటి స్థితిలో కూడా భగవంతుడు, కేంద్రమై లేక ఆధారభూతమై యుండెననుట కాదనరాని సత్యము.  ఈ సూక్ష్మాతి సూక్ష్మమైన ఈ స్థితికి కేంద్రమైనది మరింత సూక్ష్మమై యుండి యుండవలెను.  అది ఆఖరుకు యెఱుక, బలము, ఆనందము వంటి వాటి వేమియులేని స్థితి.  అది ఇంతకూ యేమై యుండునో? అది మాటలకందని స్థితి.  అది సత్యమై, అనంతమై యున్న ఉనికిలేని స్థితి.  దీన్ని వేదభాషలో నేతి-నేతి (ఇంతేకాదు, ఇంతేకాదు) అని వివరించబడియున్నది.  మన సంస్థలో ఈ అంతిమ ఉనికిని (స్థితిని) "భూమా" అని వ్యవహరింతుము.  ఇది మానవుని అన్వేషణలో అంతిమ గమ్యము.

 

2. విశ్వము

ఆవిర్భావము

 

        వాటివాటి నమ్మకములు, అవగాహనల- కనుగుణముగా వివిధ ఆధ్యాత్మిక సంస్థలు ఈ సృష్టి సిద్ధాంతమును బహువిధములుగా వ్యక్తపరచినవి.  ఈ విశాల విశ్వము యెలా వ్యక్తమైనదో వివరించుటన్నది వివిధ సాంస్కృతిక సమూహముల మధ్య ఒక వివాదాస్పదమైన అంశమైనది.  ప్రధానముగా దీన్ని భగవంతుని మధురమైన యిచ్ఛగా చెప్పబడింది.  భగవంతుడు తన్నుతాను సృజింపజేసుకొనవలె ననుకున్నాడు.  కనుక సర్వస్వాన్ని తనలో యిముడ్చుకొని ప్రకటితమైనాడు.  ఇంతమాత్రానికి భగవంతుడెందుకు యిదంతా వాంఛించాడు? అన్న దానికి సమంజసమైన వివరణ దొరకడంలేదు.  ఏమైనా ఇట్లా ఆలోచిస్తూపోతే, ఇది దైవేచ్ఛ ననుసరించి సంభవించిన ఒకానొక యాదృచ్ఛిక ఘటన మాత్రమేనన్న  నిర్ణయానికొస్తాము.  కానీ అది విమర్శనాత్మకమైన మనస్సును సంతృప్తి పరచజాలని సమాధానము.

 

        ఈ విశ్వక్రమమంతయు కొన్ని సూత్రములు, సిద్ధాంతములపై ఆధారపడి నడుస్తున్నది.  ప్రతిదీ ఒక నిర్ణీత మార్గమున వెళ్ళుతున్నది.  అన్ని విషయములందును పుట్టుక, పెరుగుదల, తరుగుదల, లయము మరియు ప్రకృతిలో లీనమగుటయన్నది నిరాటంకంగా సాగుచున్నది.  ఒక జీవి జీవంపోసుకొంటుంది.  ఒక పరిణతి జెందిన స్థితి వరకు వృద్ధిజెందుతుంది.  ఆతర్వాత క్షీణించడం ప్రారంభమౌతుంది.  తుదకది భౌతిక రూపమును వీడి కనుమరుగౌతుంది.  అది పోయినట్లేనా, శాశ్వతంగా యిక అది నశించినట్లేనా? కాదు, కానే కాదు.  కొంతకాలము తర్వాత అది మళ్ళీ రూపుధరిస్తుంది.  అదేరూపు కాకపోయినా మరో రూపైనా ధరిస్తుంది.  మళ్ళీ యిదే రీతి.  పెరగడం, పెద్దవ్వడం, క్షీణించడం లేక లయించడం.  ఎడతెరిపి లేకుండా ఈ విధానం కొనసాగుతూనే వుంటుంది.  ఇదే విశ్వము యొక్క తీరు.  భగవదేచ్ఛ ఈ పుట్టుట, పెరుగుట, లయించుట దశలన్నిటిలో ఉంటుంది.  ఈ ప్రక్రియలో అవసరమైనప్పుడల్లా చైతన్యాన్ని నింపుతూ వుంటుంది.  కనుక ఈ పుట్టుట, పెరుగుట, లయించుట అను ప్రక్రియ స్థిరంగా అనివార్యమైన ప్రకృతి నియమంగా సర్వసాధారణమై కొనసాగుతూనే వుంటుంది.

 

సృష్టి

 

        యిప్పుడు మనకు కనిపిస్తున్న ఈ విశ్వము యొక్క భౌతిక రూపమునకు ముందున్న స్థితినుండి ప్రారంభిద్దాం.  మరప్పుడేముండినదిఏమీలేదు, ఇప్పుడు మనముందున్నదేమీ లేదు కాని సర్వము సంపూర్ణంగాను సూక్ష్మస్థితిలోను వుండినది.  పదార్తముండినది కాని అది సూక్ష్మమైన దాని సారముగ నుండినది.  శక్తీ ఉండినది, కాని అది శూన్యత్వము వరకు దాదాపుగా తగ్గించబడి యుండినది.  చైతన్యమూ వుండినది కాని అది పూర్ణ నిద్రాణములో నుండినది.  కేంద్రము చుట్టూ ప్రతి పదార్థము యొక్క సత్వమావరించబడని స్థితిలో వుండినది.  కనుక కేంద్రము లేక శూన్యము, ఈ సృష్టికి సంబంధించిన సమస్త వస్తుసారము, అంతా కలిపి మన అవగాహన నిమిత్తం ఒకటిగా, ఒకే ఉనికిగా గ్రహించి దానిని సంపూర్ణము, బ్రహ్మము - అనంతం* అందాం.  సృష్టి ప్రారంభకాల మాసన్నమైనపుడు, కేంద్ర పరిధికి క్రింది భాగమున ఒక స్వల్ప కుదుపు (క్షోభ) కలిగింది.  ఆ క్షోభయేమిటి? అది వివరింప శక్యము కానిది.  అందులకు తగిన మాటలు లేవు.  అయినా అది ఒక స్వల్పమైన ఆకస్మిక యిచ్ఛాస్పందన, ఒక చైతన్యపుకుదుపు లేక కదలిక ప్రారంభం.  కాని యేమన్నా అది అసలుదానికంటే చాల స్థౌల్యమైన మాటే.  సరే అది ఉన్నదున్నట్లుండనిండు.  అది కేంద్రము చుట్టూ ఆవరించియున్న నిద్రాణ కదలికను, కుదిపివైచినది.  ఈ కుదుపు గమనిస్తే అది మొదట ఆకస్మికముగా అనుకోకుండ కలిగిన ఒక సంఘటనే అనిపిస్తుంది.  కానీ అది అట్టిదికాదు.  అది దైవసిద్ధాంతము ననుసరించి యేర్పడిన వికాస, వినాశకర సహజ పరిణామక్రియయే.  ఈ విధంగా క్రమేణా పరిణామ ప్రక్రియ మొదలై విశ్వము రూపు దాల్చుట ప్రారంభించింది.

 ----------------------------------- *అంతర్గత చైతన్యము శక్తినుత్పాదనము చేయును.  అది బహిర్గతమైన ఒక పదార్థమును సృష్టించును.  అది అర్థమగుటకై చేపగుడ్లవలె నుండునని చెప్పవచ్చును.  అదృశ్యచలనము- లుత్పత్తిచేసిన సమీకృత శక్తిసంపత్తి ఆ గ్రుడ్లవంటి వానిలో వుండును.  ఇప్పుడీ మూడును (కేంద్రము, అంతర్గత చైతన్యము, గ్రుడ్లవంటివి) ఒకదానికొకటి విడిగా, గుర్తింపలేనంతగా సన్నిహిత సంబంధము కల్గియున్నవి. (రాజయోగ ప్రభావము)

క్షోభ

 

        సాధారణ పరిణామ ప్రక్రియకు కారణభూతమైన ఆ మొదటికుదుపు యొక్క కార్యక్రమమేమై- యుంటుందిఈ కదలిక కూడా అట్టి క్రమానుగుణంగా కలిగినదే.  ఇది మరింత విశదం కావాలంటే భూమిలో విత్తిన ఒక బీజమును చూచినపుడు, మన జ్ఞానమునకందని కొన్ని మార్పులు ఆ బీజంలో కలిగి తర్వాత కొంత సమయానికి బీజకవచమును ఛేదించుకొని ఒక చిన్న మొక్కగా బయల్వెడలుతుంది.  ఆటువంటిదే ఈ మొదటి కదలిక కూడా.  మనమర్థం చేసుకోవడానికిది ఒక చక్కని ఉదాహరణ.  ఉన్నట్టుండి బీజకవచాన్ని చేదించుకొని మొక్క వెలువడి వృద్ధిచెందడం చూస్తే, ఆ ఉన్నట్టుండి బీజకవచాన్ని మొక్క చేదించుకొని రావడమే ఈ క్షోభ(మొదటి కదలిక).

 

        ఈ మొదటి కుదుపువల్ల కలిగిన చైతన్య కదలిక కేంద్రముచుట్టూ తన గమన వేగాన్ని పెంచుకొంటూ తిరుగ నారంభించింది.  ఈ స్పందనల (అలల) బలం వృద్దియై శక్తిలో చురుకుదనం కలిగింది.  అలా శక్తివంతమైన కెరటములు బయటికి బలంగా త్రోసుకొనివచ్చి చుట్టూ వున్న పరిధిలో* పగుళ్ళేర్పరచినవి.

 

ఈ ప్రక్రియలో భాగంగా బయటి పరిధిలో చిన్న చిన్న కేంద్రములేర్పడ్డాయి.  ఈ కేంద్రాలు దరిదాపులలోనున్న సాంద్రపదార్తాన్ని తమవైపు కాకర్షించాయి.  ఈ విధంగా శక్తి, కదలిక, చైతన్యం మరియు పదార్తం అన్నీ కార్యోన్ముఖం గావింపబడి, ఇప్పటి ఈ విశ్వమేర్పడ జేసినది.

 

లయము

 

        ఈ విధానము ముందుకుసాగి ప్రతిది వెలుగుచూడ నారంభించింది.  తొలినాళ్ళలో అది

 

------------------------------------

        *సృష్టిని గురించిన నిజస్థితిని గూడా నేను తెలియజేతును.  సృష్టి రూపుదాల్చక పూర్వము కేంద్రము చుట్టును అంతర్గత చైతన్యము  కలదు. దానిలోనూ ఆసన్న పరిసరములందును సృష్టి సంకల్పము (క్షోభ) కల్గినది.  ఇది అర్థమగుటకు చైతన్యమనియో, కంపనమనియో, శక్తియనియో మరేమనియైనా పిలువ వచ్చును.  అది సృష్టికి దాని కవసరమైన ప్రతిదానికి ప్రధానకారణము.  సృష్టిసమయము రాగానే అంతర్గత చైతన్యమందణగియున్న లేక నిద్రాణదశలోనున్న భావము పరిపక్వమై సర్వ చైతన్యము మధింపబడి ఒకానొక శక్తి ఉద్భవించి ముందుకు దూసుకొనివచ్చెను. (రాజయోగ ప్రభావము)

 

సూక్ష్మంగా వున్నా తర్వాత రానురాను స్థౌల్యతను సంతరించుకొంటు భౌతికరూపంలోనికి మారింది.  ఈ పదార్తమంతా వస్తురూపంలోకి మారి మనకగుపించుచున్నది.  కాలక్రమంలో ఈ దృశ్యమాన విశ్వం సమస్తం యేర్పడింది.  ఈ సృష్టిప్రక్రియ మార్పుజెంది పెరుగుదల ప్రక్రియగా మారి ప్రతిది జడ, మహాజడమైపోతూ వచ్చింది.  ఇదంతా ఒక పరిపక్వదశ దాటిన తర్వాత యిక తిరోగమనదశ మొదలై, రానురాను క్షీణించి, ఆ తర్వాత ప్రకృతిలో లయించి తుదకు మూలము లేక శూన్యస్థితికి చేరి, తిరిగి నుతనంగా ఉద్భవించడానికి పరిణామక్రియలోని పెరుగుదల, వృద్ది చెందడానికి సిద్ధంగా వుంటుంది.

 

మానవుడు

 

బాహ్య రూపము, వాస్తవ రూపము

 

        భగవంతుడు నిత్యుడు అవినాశి అట్లే మనిషికూడాను.  కాని మనిషి అశాశ్వతుడని అంటారు.  ఈ విధమైన సందిగ్దదృక్పదము మనిషి అంటే నిజమైన అర్థమేమిటో తెలిసికొనుటలో ఉత్పన్నమైనది.  మన బాహ్యదృష్టికి మనిషంటే నశించి ప్రకృతిలో కలిసిపోయే పదార్తముతో నిర్మింపబడిన శరీరం.  ఈ అర్థంలో మనిషి అనిత్యుడు.  కాని వాస్తవానికి మనిషి ఈ శరీరంతోపాటే నశించేవాడు కాడు.  మానవ వునికి శరీరం పోయినతర్వాతగూడా యేదో ఇంకా కొనసాగుతూనే వుంటుంది. దీన్ని బహుశా మనం గమనించలేక, భౌతికంగా చూడలేకపోవచ్చు. దీనికి కారణం మనకు పైకి కనబడే మనిషికి భిన్నంగా వాస్తవమైన మనిషున్నాడు.  కనబడుతున్న మనిషి మరణింపవచ్చునుగాక కానీ నిజమైన మనిషి సూక్ష్మస్థితిలో కొనసాగుతునే వున్నాడు.  మరణించిన తర్వాతగూడా సూక్ష్మస్థితిలో ఉంటున్నాడంటున్న మనిషికూడా నిజానికి అసలు మనిషి కాడు.  అతి స్థూలమైన భౌతిక శరీర పొరల నుండి బయటపడినా ఇంకా లెక్కలేనన్ని కొంత తక్కువ స్థౌల్యతగల పొరలచే మనిషి చుట్టబడే వున్నాడు.  ఈ విధంగా అసలు మనిషిని కనుగొనాలంటే ఈ అతిస్థూలము నుండి సూక్ష్మాతి సూక్ష్మమై మనిషిని చుట్టుకొనియున్న పొరల నన్నిటిని దాటుకొని చాల లోతుకు వెళ్ళవలసి వుంటుంది.

 

        ఇప్పుడు కనిపిస్తున్న మనిషి రూపమును సంతరించుకొనుట కూడా అకస్మాత్తుగా గానీ లేక ప్రమాదవశాత్తుగా గానీ జరిగిన సంఘటనకాదు.  ఇది ఒక క్రమానుగత పరిణామ ప్రక్రియ ఫలితమే.  ఇది మొదటి క్షోభ గలిగినపుడు శక్తి బయటకు నెట్టుకొని వచ్చి చర్యలు మొదలగుటకు కొన్ని కేంద్రములేర్పడినవి.  అదే ఈ ప్రక్రియకు మొదలు.  ఏర్పడిన ఈ ప్రతి కేంద్రము (జీవకేంద్రము) యొక్క ప్రత్యేక చర్య కావలసిన పదార్తము నాకర్షించి వస్తువులను స్థూలరూపమునకు దెచ్చుటకుపయోగపడినది.  మనిషి యొక్క ఉనికి కూడా ఇట్లే సూక్ష్మ రూపంలో తన ప్రత్యేక వ్యక్తిత్వాన్నేర్పరచుకొన్నది.  సూక్ష్మాతిసూక్ష్మలోపంలో భగవంతునికి సామీప్యమున నుండి క్రమేణా దిగజారుతూ స్థూలత్వం పొరమీద పొరగా చుట్టుకొనుచు జడమౌతూ వచ్చినది.  ఈ పొరలనే ఆత్మను చుట్టుకొనియున్న కోశములని* అర్థవంతముగా సూచింపబడినది.

 

మొదటిపొర సూక్ష్మాతిసూక్ష్మమైన యెఱుక లేక నేననే భావము చేత యెర్పడి రాను రాను తన చర్యలవల్లనే స్థూలమౌతూ పోయింది. మనస్సు, చిత్తము,

------------------------------------

        *మానవ నిర్మాణము కుడా చక్కగా విశ్వ నిర్మాణమును పోలియున్నది.  ఈ విధముగా ఈ ఘనరూపమగు బాహ్యవిశ్వము వెనుక అసంఖ్యాకములగు యితర సూక్ష్మాతిసూక్ష్మములగు విశ్వములున్నవో అట్లే మానవుని యీస్థూల భౌతిక రూపమువెనుక అసంఖ్యాకములగు సూక్ష్మాతి సూక్ష్మములగు రూపములు కలవు.  అన్నింటికంటెను వెలుపలనున్న రూపమీస్థూలశరీరము.  దాని వెనుక సూక్ష్మ శరీరమును, కారణ శరీరములును ఉన్నవి.  ఈ మూడు బాహ్య రూపములకు తోడు లెక్కలేనన్ని యితర రూపములు కలవు.  అవి యెంత సూక్మరూపములైనవనగా వాటిని విజ్ఞులు శరీరములని అనకుండా ఆత్మను చుట్టియున్న సన్నని పొరలందురు. (సత్యోదయము నుండి గ్రహింపబడినది)

 

బుద్ధి యొక్క చర్య మరింత స్థౌల్యతను పెంచింది.  ఆ తర్వాత ఆలోచన తన అల్లికను అల్లనారంభించి తదుపరి అది కార్యరూపంగా మారి సంస్కారాలేర్పడటానికి కారణమైంది.  అలా ప్రతిదీ స్థౌల్యతకు తమ తమ వంతుగా చేయవలసిందంతా చేశాయి.  అలా స్థౌల్యత వృద్ధిజెందుతూ వెళ్ళి కడకు ఇప్పటి, పూర్తి స్థౌల్యమనిషి యేర్పడ్డాడు.  సమతదప్పిన ఇంద్రియముల చర్యలు తెలివితేటలు పెరిగి అనేక క్రమవిరుద్ధ విధానములకు* బలం చేకూర్చినాడు.

        తత్ఫలితముగా మానవుని ఉనికి పెరుగుతున్న స్థౌల్యతలతో కూడిన లెక్కలేనన్ని పొరలతో

------------------------------------

        *సృష్టికి ముందు చక్కని సమత్వస్థితి సర్వత్రా నెలకొనియుండెను.  సృష్టి సమయమాసన్నము కాగానే క్షోభ (మొదటి కుదుపు) యొక్క ప్రభావమునకు నిద్రాణస్థితిలోనున్న కేంద్ర పరిధిలోని అణగారియున్న స్పందనలు తీవ్రతరమై చైతన్యము మొదలైనది.  సమత విచ్ఛినమైనది.  ఈ చర్యలశక్తి వలన మరిన్ని కేంద్ర ఉపకేంద్రములేర్పడినవి.  ఒకొక్క కేంద్రము మరింత శక్తివంతముగా పెరిగి, చర్యలు ప్రతిచర్యలు హెచ్చింపౌతూ పోయినవి.  స్థౌల్యము వృద్ధియై పొరలు ఒకదానిపై ఒకటి యేర్పడుతూ భౌతిక రూపములకు దారి తీసినవి.  (గురువుగారి ఒక ఉత్తరం ఆధారంగా గ్రహింపబడినది)

 

పట్టుదారములతో చుట్టబడిన పట్టుపురుగువలె పూర్తిగా కప్పబడ్డాడు.  దీనికంతటికి కారణం వాస్తవానికి మన చర్యలు, ప్రతిచర్యలే.  ఇవే కొద్దికొద్దిగా మన ఉనికిని స్థౌల్యతరం చేశాయి.  మరోవిధంగా చెప్పాలంటే మనిషి అలా తన చిన్న సృష్టిని తాను యేర్పరుచుకున్నాడు.  నిజానికతడు ఉనికిలో వున్న అన్ని వస్తువుల సమ్మేళనంగా లేక ఈ విశ్వమునకు ఒక చిన్న *నమూనాగా(ప్రతిబింబముగా) మారిపోయాడు.

------------------------------------

        *మరణించినప్పుడు మనిషికేమౌతుంది? అందరూ వివరించినట్లు మనిషి చనిపోయిన తర్వాత ప్రకృతిలో కలిసిపోతాడు.  అదే అతనికంతం అంటే సామాన్యంగా మనం అంగీకరించం.  జీవితం చాల ప్రయోజనాత్మకం.  మనిషికో అర్థమున్నది.  అతనికో ఆత్మ వున్నది.  దానికి పూర్వాపరాలున్నాయి.  ఆత్మ ఉన్నతోన్నతమౌతూ యెదుగుతున్న ఉనికి.  అది క్షణక్షణం మెరుగౌతూ వుంటుంది.  దాని పురోభివృద్ధిలో పుట్టుక, చావులు కేవలం మజిలీలు.  చనిపోయిన వెంటనే భౌతిక శరీరం జీవం కోల్పోతుంది.  అనేక కోశములతో నిర్మితమైన సూక్ష్మ శరీరంలోని ఆత్మ స్థిరంగా వుంటుంది, జీవించే వుంటుంది.  ఈ స్థూలకోశాన్ని లేక భౌతికస్థాయిని విడిచి అది తన విశ్రాంత ప్రదేశానికి వెళ్ళేమార్గంలో యెన్నో ప్రదేశాలను విశ్వాలను దాటుకుంటూ వెళుతుంది.  వెళ్ళేప్పుడు అది కొన్ని స్థానములలో ఆగుతుంది లేక ఆపబడుతుంది.  అది ఆ స్థానము లేక స్థాయికి సంబంధించిన కోశము (పొర) ఊడిపోయే వరకు అక్కడ ఆగి స్వేచ్ఛనుపొంది తిరిగి తర్వాతి స్థానమునకు కదలుతుంది. (శ్రీ ఎం.పి. పండిట్‌గారి హైవేస్ ఆఫ్ గాడ్ నుండి గ్రహింపబడినది)

        చివరి బాహ్యమైన పొర మానవుని నిర్మాణంలో భౌతిక శరీరమయింది.  ఇదే మనిషి గుర్తింపుగా వ్యవహరింపబడుతూ లోకవ్యవహారమున అనిత్యమని చెప్పబడుతున్నది.  కానీ నిజమైన లోపలి మనిషి మాత్రము భగవంతునివలెనే అవినాశి, నిత్యసత్యము.  ఈ కారణమురీత్యా ఈ రెండూ అవివున్న లక్షణములను బట్టి ఒకే విధమైనవే.  కానీ పైకి మాత్రం వేరువేరనిపిస్తున్నవి. వాస్తవానికి మనిషి వ్యక్తిగతంగా కొన్ని హద్దులకు లోబడిన మరియు కట్టుబడియున్న ఆత్మ.  అయితే భగవంతుడు విశ్వాత్మ.  హద్దులు లేని అనంతము.  ఈ చిన్న వ్యత్యాసము మినహాయిస్తే రెండూ ఒక విధంగా ఒక్కటే.  ఈ భావనను గురువర్యులు ఈ క్రింది వాక్యములలో విశదీకరించెను.

 

        "ఒక దట్టమైన గాలిపొర ఈ భూగోళము నంతటిని సమంగా ఆవరించియున్నది.  కాని భూమికి దగ్గరగా నున్న గాలి, దూరంగానున్న గాలితో పోల్చిచూస్తే ఎక్కువ బరువుగాను, దట్టంగా ఉన్నది.  ఈ దిట్టతనం పైపైకి వెళ్ళేకొద్ది తగ్గిపోతూ, ఆఖరకు అది ఉన్నదని  మనిషి చెప్పలేనంతగా తగ్గిపోతుంది.  తన శక్తికి సాధ్యముగానంత వరకు వచ్చిన తర్వాత యిక గాలిలేదని నిర్ధారిస్తాడు.  మనిషికి భగవంతునికి మధ్య తేడా భూమికి దగ్గరగానున్న గాలి స్థితికి, భూమికి దూరంగానున్న గాలి లేదంటున్న స్థితికి వున్న తేడా వలెనే వుంటుంది.  మొదటిది మనిషితో, తర్వాతది భగవంతునితోను పోల్చవచ్చును.  కనుక మనిషి, దేవుడు ఒకే విధంగా వున్నా, ఒక్క సాంద్రత, స్థౌల్యత విషయంలోనే తేడా వున్నది.

 

4. మానవ జీవితము

 

లక్ష్యము

 

        ఇంతవరకు ఈ విశ్వం ఎలా రూపుదిద్దుకొన్నది, అన్న విషయం చర్చించాము.  మానవ జీవితము అనేక ఒడిదుడుకులను తట్టుకొని ఈ దశకొచ్చినది.  ఈ విశ్వమునకు కేంద్ర భూతమైన మనిషి జీవితంలో మార్గదర్శకసూత్రములుండుట తప్పనిసరి.  మనిషి చేరుకొనుటకొక లక్ష్యము, నెరవేర్చుటకొక పవిత్రోద్దేశ్యము వుండవలెను.  ఎలా ఈ జీవితలక్ష్యమును చక్కగా అర్థము చేసుకొని దాని ననుసరణీయము గావించుకొనువలెనో, అనునది తర్వాత నిర్ణయించుకొనవలసిన అంశము.  ప్రతి చర్యకు వెనుక ఒక  విషయము ఒక వుద్దేశ్యము వుంటుంది.  ఇది ప్రతి విషయంలోనూ వాస్తవం.  కాని దాన్ని మనం అర్థము చేసుకోగలుగు తున్నామా లేదా? అనునది మరో ప్రశ్న.  మనిషి జీవితం కూడా ఇంతే.  దాని వెనుక ఒక విషయం ఒక ప్రయోజనం వున్నాయి.  మనిషికి సమస్యా పరిష్కారమునెడ నిజంగా శ్రద్ధవుంటే అదేమిటో వెతికి వెలికితీస్తాడు.  జీవిత సమస్యా పరిష్కరానికి విజయవంతమైన సమాధానం దొరకాలంటే, మనం దేనికోసం తాపత్రయ పడుతున్నామో అది మనకు పూర్తిగా అర్థమై యుండటం అత్యావశ్యకం.  ఇది అత్యంత ముఖ్యాంశం.  ఇది లేకుండా విజయం యెన్నటికీ సాధించలేం. ఇది ఆధ్యాత్మిక విషయంలో మరీ ప్రత్యేకం.  ఇచ్చట అతడాశిస్తున్నదేదో అది యెప్పుడూ మనస్సులో వుండితీరాలి.  తాము దేనికోసం తపన పడుతున్నామో దానికి సంబంధించి సరియైన అవగాహన లేకుండానే తరచు జనులు దైవీయ ప్రయోజనమాశించి, ఇదో అదో యేదో ఒక మార్గమవలంభిస్తున్నారు.  దాని పర్యవసానంగా వారు జీవితాంతం సంశయాలకు, వంచనలకు తరచు తగుల్కొని కొట్టుమిట్టాడు- తుంటారు.  కనుక ఒక పద్ధతినెన్నుకొనే ముందు మనిషికి తానాశిస్తున్న లక్ష్యముయొక్క పూర్తి అవగాహన వుండటం అత్యంతముఖ్యం.  లక్ష్యంపై సరియైన, ఖచ్చితమైన దృక్పదం ఉంటేనే గానీ, తన ప్రయోజనార్థం సరైన మార్గాన్ని మనిషి యెన్నుకోలేడు.

 

        సర్వసాధారణంగా అందరి విషయంలోను జీవితగమ్యం ఒక్కటే అయివుండదు.  ప్రతి మనిషి తన స్వంత సమస్యతో చుట్టుముట్టబడి వుంటాడు.  వారి జీవిత లక్ష్యము ఆ సమస్యాపరిష్కారమును జూపునదేదో దానిపై ఆధారపడి వుంటుంది.  మనిషి సమస్యలన్నీ వస్తుసంబంధమైనవే.  వాటిపై మిక్కుటమగు ఆకర్షణ గలిగి యుండుటవల్లనే ఆ సమస్యలేర్పడినవి.  అతని భౌతిక కోరికలు తీవ్రవాంఛలు మరియు భౌతికమైన ఆనందానుభవములే వారి మనస్సునాకర్షించి, యిక వాటిలోనే జీవితాంతం తగుల్కొని పోతాడు.  వస్తుతత్త్వం మన భౌతిక ఉనికికి నిర్ద్వందంగా విస్మరింపరానిదే.  కానీ మనిషి జీవితాశయం కేవలం ప్రాపంచిక వస్తు సముపార్జన కోసం పాకులాటే కాదు, అన్న విషయం మరచిపోరానిది.  కనుక మనిషి అవతలివైపును గూడా పరిగణనలోనికి తీసుకోవాలి.  అది సామాన్యముగా మన దృష్టిపథములో నుండటం లేదు.

 

        మనిషి ఉనికి కేవలం ఈ జీవితానికే పరిమితం కాదు.  ఇప్పటికే అనేక స్థాయిలలో మన ఉనికి గడచి వచ్చింది.  అవి సూక్ష్మములో, స్థూలములో అయివుండవచ్చును.  ఇక భవిష్యత్తులో తుదకు యింకెన్ని గైకొనవలసియుండెనో యిదమిద్దముగా యెవ్వరూ చెప్పలేరు.  తను ఉత్తమ యెఱుకలోనికి మేల్కొల్పబడి, సమస్యా పరిష్కారదిశలో ముందుకు సాగనంతవరకు ఈ జనన మరణ చక్రభ్రమణం నిరంతరాయంగా కొనసాగుతూనే వుంటుంది.

 

ప్రాపంచిక దృష్టి

 

        పూర్తిగా ప్రాపంచిక వస్తుదృష్టితోనే చూచేవానికి జీవితమంటే కేవలం పుట్టుక నుండి చచ్చేదాక విస్తరించియున్న కొంత కాల వ్యవధి మాత్రమే.  కొందరి వ్యక్తుల విషయము వేరు.  ఇట్టివాడు తన భూత, భవిష్యత్ విషయములను పట్టించుకొనడు.  అంతేగాదు అతడు పదార్థవిషయమై తప్ప మరేదానిపై గురినిల్పడు.  అతడు తన స్వార్థ వస్తువిషయము లేక దానితో భౌతిక సంబంధముగల మరో విషయమో తప్ప యితరమును పట్టించుకొనడు.  అతనికి సర్వస్వమునైన భౌతికాకర్షణలకే అతడు సర్వదా కట్టుబడియుండును.  అతని జీవితధ్యేయం ఆహ్లాదకర సంతోష జీవనమును పొందగల్గడమే.

 

        ఇంకా కొందరున్నారు.  వారు అన్నివిధాల ప్రాపంచిక విషయములతో సంపూర్ణంగా నిండి వస్తు సముపార్జన కొఱకే కొంత వరకు ప్రోత్సహించబడి మత సంబంధమైన ధ్యాస కూడా కలిగి వుంటారు.  వారి ఆలోచనంతా వారి స్వార్థ భౌతిక వాంఛలపైననే కేంద్రీకృతమైయున్నా కొన్ని మానసిక ఆందోళనలో చింతలో భగవదాలోచనకు మొగ్గు చూపుతారు గానీ అది కూడా వారి చింతా నివృత్తికై మాత్రమే.  వారు దేవుళ్ళను మామూలుగా పూజిస్తారు.  కానీ సర్వదా వారి ప్రాపంచిక లాభములు అంటే ప్రాపంచిక సంతోషములు, వస్తులాభము లేక ఇంద్రియవాంఛల సంతృప్తి కొఱకు మాత్రమే వారిని పూజిస్తారు.  ఆ మాటకొస్తే వారు కూడా భౌతిక వస్తు రూప పదార్థమును తప్ప ఇతరములన్నింటిని త్రోసిపుచ్చు నిఖార్సయిన భౌతికవాదికంటే యేమాత్రము మేలుకాదు.

 మత దృక్పదము

 

        మతము యేదో ఒక ఆదర్శమును పొందుటకు మనిషిలోనికి దైవారాధనను జొప్పిస్తుంది.  ప్రజలు దానిని మత ఆచారవ్యవహారంగా, పూజను నిర్ణయించిన పద్దతిలో చేయమన్న విధానములో చేస్తారు.  కానీ చాలామంది విషయంలో అది యేవిధమైన ధ్యేయపుయోచన, గురి లేక యేప్రయోజనం కొఱకు? అన్న వూసే లేకుండ వరుసగా చేసుకుంటూ పోతుంటారు.  అట్టివారిని మీరు ఈ పూజలెందుకు చేస్తున్నారని ప్రశ్నిస్తే వారు జవాబు చెప్పలేక చాలా యిబ్బంది పడిపోతారు.  బాహ్యంగా మనకు కనబడే కారణం బహుఃశా వారికి ఒక ధ్యేయమన్న దానిపై సరియైన అవగాహన వుండదు.  ఏదో వారి పాత ఆచారాన్ని కొనసాగిస్తుంటారంతే.  లేకపోతే బహుఃశా యేదో ఒక ఊహాజనిత మనోహరత్వము అందులో వుండొచ్చు.  ఎవరైనా దీనికి జవాబు చెప్ప సాహసిస్తే, అతడు ఏమి? ఎందుకు పూజిస్తామంటే ఆయన మనల్ని సృష్టించాడు, మనకు బ్రతుకుదెరువు నిచ్చాడు.  అందుకోసం మనము ప్రతిగా ఆయన్ను పూజించాలి అంటారు.  అయితే అదే సందర్భంలో వారు ఈ ప్రపంచం ఒక కారాగారమని, మనిషి తను మున్నుచేసిన చేతలకు ఫలితమనుభవించడానికి (సంస్కార భోగమునకు) అందులోనికి వచ్చాడని అంగీకరిస్తారు.  కనుక మన పరిస్థితి ఈ ప్రపంచంలో ఒక ఖైదీ వంటిది.  శిక్షననుభవించడం కొఱకు మనమిందులో త్రోయబడ్డాం.  ఇప్పుడు చెప్పండి.  ఏ ఖైదీయైనా తనను కారాగారానికి పంపిన వానిపై కృతజ్ఞత చూపిస్తాడామనల్ని నిర్భందించదలచినవాడు, మనం కృతజ్ఞత చూపినా చూపకపోయినా  మన కనీస అవసరాలు సహజంగానే తీరుస్తాడు.  కనుక ఆ దృక్పదంతో భగవదారాధనను చూడడంలో అర్థమే లేదు.  కొందరు ఇదే విషయాన్ని మరోరకంగా విశ్లేషిస్తూ భగవంతుడు మనకు గలిగే బాధలు, క్లేశముల* నుండి కాపాడతాడని అందుకోసం ఆయన్ను సంతోషపెట్టడానికి పూజిస్తామని చెబుతారు.

 

------------------------------------

 

*జీవితములో బాధలు, కష్టములు బొత్తిగా లేకుండుటన్నది యసంభవము; అసహజము.  వాస్తవముగా అవి మనకు మేలు చేకూర్చుట కొఱకే ఉద్దేశింపబడినవి.  అవి రోగి నారోగ్యవంతునొనర్చుటకై యిచ్చు చేదుమాత్రలవంటివి.  అత్యుత్తమ వస్తువునైనను దుర్వినియోగపరచిన ముప్పుకల్గును.  కష్టముల విషయమునకూడా నంతే.  సకాలములో సక్రమముగా వినియోగపరచుకొన్నచో నేదియైనను దీర్ఘకాలమున సత్ఫలితములనిచ్చును.  కష్టములు వాస్తవముగా మనకు మార్గదర్శకములు.  అవి మనదారిని సుగమము చేయును. (సత్యోదయము నుండి గ్రహింపబడినది)

 

        ఈ విషయంలో చెప్పాలంటే ప్రతి జీవికి బాధలు కష్టములు అతి సహజం.  అవి తీరడం కూడా అంతే సహజం.  అయితే మనకు తెలుసు, ఎంతకాలం ఈ లోకంలో వుంటామో అంతకాలం ఈ బాధలు కష్టాలు తప్పవు.  అసలు వాటిని అనుభవించి సంస్కారముల నుండి విముక్తి పొందడానికే ప్రపంచంలోనికొచ్చాము.  అటువంటప్పుడు వాటి ననుభవించకుండా ఎలా మనం బంధవిముక్తి (లిబరేషన్) సాధిస్తాము.  వాటినడ్డు- కోవడమంటే మనం మోక్షాన్నడ్డుకొన్నట్లేగదావాస్తవానికి బాధలు, దుఃఖాలు జీవితంలో అనివార్యాలు.  వాటినుండి యెవ్వరు కూడా జీవితంలో వాటినుండి బయటపడలేరు.  మహోన్నతులైన మునులు సైతం ఈ బాధలు భరించాల్సిందే.  బాధ, సంతోషం ప్రక్క ప్రక్కనే కొనసాగుతుంటాయి.  ఒకటుండి మరొకటి లేకపోవడం అసంభవం.  కనుక పూజ బాధావిముక్తి కోసమనడం కేవలం హాస్యాస్పదం మరియు అది వాస్తవానికి ప్రేమ, భక్తికి సంబంధము లేనట్టిది.

 

భక్తి

 

        భక్తియనునది తప్పనిసరిగా ఆరాధనకు వుండవలసిన ముఖ్యలక్షణమని అందరికి తెలుసు.  కాని భక్తి అంటే అసలేమిటో అంతసులభంగా మనకవగాహనకొచ్చే విషయం కాదు.  సర్వసాధారణంగా ఇది ఒక మానసిక ఉద్వేగము యొక్క ఉద్రేకమని తప్పుగా అర్థము చేసుకొందురు.  ఇది నామోచ్ఛారణమో, సంగీతమో లేక మరటువంటిదేదో ఒకదాని ద్వారా ఉత్పన్నమౌతుంది.  ఈ అర్థంలో ఆలోచిస్తే అది ఒక ఇంద్రియ సంబంధమైన ఆహ్లాదము.  దీని ఆకర్షణే ధ్యేయంగా గల భక్తునకు ఇది చాల హాయిని కలిగిస్తుంది.  సర్వసాధారణంగా అర్థం చేసుకొంటే ఈ భక్తి రెండువిధములుగా నున్నది.  అవి ఒకటి అంతర్గతము రెండవది బాహ్యము.  చాలా మంది భక్తులు రెండవ విధమునే గ్రహిస్తారు.  వారు దేవాలయాలకు వెళతారు.  విగ్రహమునకు దగ్గరగా నిలబడతారు.  విగ్రహంపై నీళ్ళు పోస్తారు, పూలు జల్లుతారు, మిఠాయిలు ప్రసాదంగా పెడతారు.  కీర్తనలు పాడి స్తుతిస్తారు.  ఎందుకోసంబహుఃశా వారికదో భౌతికపరమైన ఉల్లాసం కాకపోతే యేదో ప్రాపంచిక వాంఛా పరితృప్తి నాశించి యాచించడం కోసం, సంక్షిప్తంగా చెప్పాలంటే ఇదంతా వారికోవినోదం.  ఇదంతా అసలు భావనకు సంబంధం లేనిది.  అయినా వారు భక్తులుగా పిలువబడుతూ అందరిచేత భక్తులుగా కూడా అంగీకరింపబడతారు.  మరి కొంతమందున్నారు.  వారు యాంత్రిక ప్రక్రియలైన జపాలు, కీర్తనలు మహోత్సాహంగా ఉద్వేగపూరితులై పాడతారు, కానీ దానిలోని హాయి, ఆహ్లాదంకోసమే వారలా చేస్తారు.  వారు కూడా భక్తులుగానే గుర్తింపబడతారు.  వాస్తవానికి ఈ ప్రక్రియలన్నిటిలోనూ వారు భౌతికపరమైన, బాహ్య పైపై ఉద్వేగపూరిత భావనలే కనబరుస్తున్నారు.  అదే భక్తిగా తప్పుడు భావనను కలిగిస్తూ అంతర్గతంగా మొక్కేమొలవని బీడువలె, భక్తికేమాత్రము సంబంధములేని వారివలె వుందురు.  బహుఃశా భక్తి అంటే వారి దృష్టిలో రెచ్చిపోయి, ఉద్వేగభరితమైన ప్రదర్శన ద్వారా వారి దేవుళ్ళ యెదుట వారు నిజమైన ప్రేమ స్వరూపులుగా కనిపించి దేవుళ్ళు నమ్మేట్లు చేయాలని వారి భావన.  నిజానికిదంతా కేవలం ఉత్తుత్తి పొగడ్త మరియు మోసపూరిత బాహ్య ప్రదర్శన.  పొగడ్త వాస్తవానికి హృదయాంతర్గత వాంఛాప్రాప్తికై నిజమని నమ్మించే నయగారపు భూటకపు ప్రేమప్రదర్శనమే.  ఇది ఒకవేళ మనుష్యులను మోసగించ వచ్చునేమోగాని భగవంతునిగాదు.  ఎందుకంటే వారి నమ్మిక ప్రకారం సహితం భగవంతుడు సర్వజ్ఞుడు.  ఇందుకు ఫలితంగా మహా అయితే ఈ ఆరాధకుడు తను పడిన శారీరక శ్రమకు తగిన ఫలితాన్ని కూలిరూపంలో పొందుతాడనుకోవచ్చు.  వాస్తవానికి అంతర్గత విధానమే సరియైన భక్తి.  ఆ విధానంలో ఈ బాహ్య భూటకపు ప్రదర్శనలేవి వుండవు.  ఉద్వేగముండదు, భావోద్రేకవిపరీతముండదు, అరుపులుండవు, దీనవేదనలు లేక రోదనలుండవు.  ఇది ఒకరకమైన ప్రశాంత నిశ్శబ్దమైన రగులుతున్న అగ్ని.  ఇది హృదయాంతరాళమున రగిలి అన్నిరకముల ఆలోచనల, ఉద్రేకముల భావనలను బాహ్యమైన యెఱుక లేకుండానే దగ్ధమొనర్చివేయును.

 

వాస్తవ ప్రయోజనం

 

        పూజయొక్క వుద్దేశ్యము ఏదైవుండవలెనుబాధలు, దుఃఖములనుండి విడుదల పొందుటకన్నది, బాధాతప్త ఆత్మయొక్క సమంజసమైన కొరికే, కానీ మనదృష్టి జీవితంలో అనివార్యముగా సాగిపోతున్న కర్మానుగత ఫలితమునడ్డుకొనువైపు మరల్చుట పెద్ద తప్పిదమౌతుంది.  అవి సంస్కారక్షయము (భోగము) కొఱకు అత్యావశ్యకములు.  ఇందుకొఱకు మనం వీటన్నిటికి మూలకారణమేదో దానిని గణనలోనికి తీసుకొనవలెను.  దానిని నిర్మూలిస్తే మన బాధా కష్టముల నుండి రక్షింపబడతాము.  మనందరికి ఆ కారణమేమిటో తెలుసు.  అది మన భౌతిక ఉనికి.  ఈ ప్రపంచంలో సంస్కారఫలాలను అనుభవించడానికే అది యేర్పడింది.  కనుక మన నిర్ణయమేమంటే యెలాగోలాగున మన మీ ప్రపంచంలోనికి మళ్ళీరావడాన్ని ఆపగలిగితే, రాబోయే వ్యధలనుండి విడుదల పొందుతాము.  మరణం తర్వాత మరలా ఈ ప్రపంచంలో భౌతిక రూపంతో పుట్టము అని నమ్మేవారి విషయంలో వారి ధ్యేయం స్వర్గాన్ని పొందడమై వుంటుంది.  అందుకొఱకు వారి నీతి నియమబద్దమైన మతసిద్ధాంతాలకు కట్టుబడివుంటారు.  కర్మ సిద్ధంతాన్ననుసరించి భూత, వర్తమాన మరియు భవిష్యత్‌లలో  మానవుని ఉనికిని విశ్వసించేవారిని పై మతవిధానం కూడా సమాధానపరచలేదు.  వారికి మామూలుగా ప్రకృతిలో మార్పులు స్థిరంగా కొనసాగుతూనే వుంటాయి.  దీనికి నిలుపుదల లేదు.  అంతములేదు.  ప్రతిదీ కూడా కార్యకారణ సిద్ధాంతం ప్రకారం నిరాటంకంగా సాగిపోతూనే వుంటుంది.  ఇదే విధంగా మనిషియొక్క ఉనికిగూడా నిర్ణీత సహజరీతిలో పుట్టుట గిట్టుటలు వరుస క్రమంగా ఒకటి తర్వాత ఒకటిగా సాగిపోతూనే వుంటాయి.  ఇతని ఉనికి సమస్య, ఈ ఒక్క జీవితానికే పరిమితం కాదు.  ఆఖరువరకు వచ్చేపోయే జన్మలన్నిటికి అది వ్యాపించి వుంది.  కనుక మనిషి ముఖ్యంగా సాధించవలసిందేమనగా మరుజన్మ ప్రక్రియ నుండి విడుదల పొందాలి.  దానివల్ల రాబోయే జన్మల వ్యధలనుండి రక్షింపబడతాడు.  అందుకు ఒకే ఒక పరిష్కారము మోక్షము.

 

మోక్షము

 

        మోక్షమన్న పదమునకు అసలు అర్థము జనన, మరణముల నుండి స్వేచ్ఛ.  దీన్ని రెండు విధములుగా అన్వయించవచ్చు.  అవి విముక్తి మరియు విడుదల.  ఈ రెండింటి మధ్య చాల వ్యత్యాసమున్నది.  మా గురువుగారి దృక్పదం ప్రకారం విముక్తి యన్నది చావు పుట్టుకల అనంత గమనంలో ఒక చిన్న విరామం మాత్రమే.  ఇదికూడా వ్యక్తినిబట్టి యెంతకాలమన్నది నిర్ణయింపబడుతుంది. ఆ కాలం, వారు గడించిన స్థాయినిబట్టి వుంటుంది.  ఆ కాలం పూర్తికాగానే వారు మరల భౌతిక రూపంలోనికి దిగివచ్చి మళ్ళీ సర్వసాధారణమైన జనన, మరణ భ్రమణంలో తిరుగాడవలసినదే.  ఈ పరిస్థితులలో విముక్తి అనేది మనిషి ఉనికి సమస్యకు పరిష్కారం కానేరదు.  ఒక్క విడుదల మాత్రమే సమస్యకు వాస్తవమైన పరిష్కారము.  ఈ భావనలో మళ్ళీ ఈ స్థౌల్య భౌతిక రూపంలోనికి రానేరాడు.  ఇది జనన మరణముల ప్రక్రియకు అంతము.  అది కూడా ఉనికికి సంపూర్ణాంతం కాదు.  స్థూలమైన కోశములనుండి విడివడి యున్నప్పటికి ఇంకా కొన్ని సూక్ష్మపొరలచే చుట్టబడియే యుండును.  కనుక ఆత్మ చుట్టూ యింకా బంధనములున్నవి.  అవి కూడా కరిగిపోతేనేగాని సంపూర్ణ స్వేచ్ఛ లభించదు.  కనుక మోక్షమనే ఈ మాట విముక్తి, విడుదల అనే రెండర్థాలలోను వాడబడటం వలన కొంత సంధిగ్ధమేర్పడుచున్నది.  కనుక మోక్షమంటే విముక్తియన్న అన్వయం తీసుకొంటే అది సమస్యా పరిష్కారం కాదు.  విడుదల అన్న అన్వయమే మోక్షమునకు సరిగ్గా సరిపోతుంది.  అంటే మరుజన్మ ప్రక్రియ నుండి పూర్తి విడుదల (స్వేచ్ఛ).  మత గ్రంధములో విభజించి చూపిన రకరకాల మోక్షములన్నీ సందిగ్ధతను కల్పించి చదువరుల మనస్సులను కలతతో నింపి తుదకు భ్రమ కలిగించును.

 

 

ఆధ్యాత్మిక దృక్పదము

       

మనిషి ప్రస్తుత భౌతిక రూపము లెక్కలేనన్ని స్థూల పొరలు ఆత్మచుట్టూ ఒకదానిపై ఒకటి యేర్పడుతూ వస్తున్న పరిణామ ప్రక్రియ* ఫలితమే.

 

        అంతర్గతముగా కప్పివేయబడియున్న అసలు సారము కూడా లోలోపల చైతన్యవంతమై యున్నది.  అది తన మూలమునకు తిరిగి వెళ్ళవలెనన్న నిద్రాణ ఆతృతకు తోడ్పడుతున్నది.  ఇప్పుడు మన మూలానికి తిరిగి వెళ్ళాలంటె మొత్తం ప్రక్రియనంతా వెనక్కు  

-----------------------------------

        *తొలుత విశ్వాత్మలో ఒక అంశమైయుండిన ఈ ఆత్మ అందుండి విడగొట్టబడి ఒక ప్రత్యేక ఉనికిని యేర్పరచుకొన్నది.  వ్యక్తిగత యెఱుక లేక అహంభావము మనిషి నిర్మాణములోని మొదటి పొర.  ఈ ప్రాధమికస్థితి నుండి పతనమౌతూ స్థూలాతి స్థూలమైన పొరలను పేర్చుకొంటూ ఇప్పటి ఈ స్థితి వరకు వచ్చింది.  మన మనస్సంతా తిరిగి ఆ ప్రాధమిక దశకు మరలా చేరుటే.  అంటే దానర్థం మనం స్థూలం నుండి సూక్ష్మం వైపుకు తిరుగు ప్రయాణం చేస్తూ ఆఖరి మజిలీ చేరాలి.  ఇప్పుడు ఈ స్థూలత్వం నుండి బయటపడాలంటే మనవని చెప్పుకొంటూ వరుసగా పేర్చుకొంటూ వచ్చి ఇప్పటి ఈ నిర్మాణమునకు కారణమైన యివన్నీ వదిలించుకొని స్థూలత్వం నుండి యిప్పుడు వెనక్కు మరలాలి.  (గురువుగారి ఒక ఉత్తరం ఆధారంగా)
మళ్ళించాలి. అంటే ఈ వ్యక్తిగత
, సృష్టికి కారణభూతమైన పదార్థమంతా లయించిపోవాలి.  అనగా దానర్థం పొరలన్నిటిని ఆఖరు వరకు తొలగించివేయాలి.  ఆ విధంగా మన తుది ధ్యేయం మన మూలం చేరడమైయుండాలి.  అంటే ఉనికి యొక్క ప్రప్రధమ స్థితినందుకోవడమన్న మాట.  ఇందుకోసమున్న ఒకే ఒక ప్రక్రియ మనం చుట్టి వుంచుకొన్న పొరలన్నిటిని తొలగించుకోవడమే.  ఉనికిలోని ప్రతి వస్తువు యేవిధంగా మాహాప్రళయంలో వెనక్కి మళ్ళిపోతుందో అలాగే వ్యక్తిగత ప్రపంచ ప్రళయం మనం మూలం చేరడానికి అత్యావశ్యకం.  ఇదే మనం ధ్యానంలో చేస్తున్నాం.  మనల్ని మనం ఒక బిందువు వద్ద సమగ్రపరచుకొంటున్నాం  అదే సంపూర్ణం.  మనం నిర్మించుకొన్న వాటినన్నిటిని ఖాతరు చేయక వదిలేయాలి.  అప్పుడవి నీరుపోయని మొక్కలవలె వాడిపోతాయి.  ఈ విధంగా మనం మున్ముందుకు, శూన్యం వైపుకు సాగిపోవాలి.  అదే వాస్తవానికి మనమిప్పుడు చేయవలసిన ప్రయత్నము.

 

 

పరిపూర్ణత

 

        మనం కూడా ఈ పరిపూర్ణతను గురించి చాలానే వింటుంటాం.  అలాగే పరిపూర్ణతను సాధించినారన- బడుతున్న మహనీయులను గూర్చీ వింటుంటాం.  సర్వ సామాన్యంగా యెవరైతే మేము భగవత్‌సాక్షాత్కారం పొందామని పైకి వారికైవారే చెప్పుకుంటుంటారో వారే పరిపూర్ణులనుకుంటాం.  కానీ పరిపూర్ణత మరీ, ఆ సాక్షాత్కారము అనేటటువంటి మాటల అర్థం మనకు చాలా అస్పష్టంగా గోచరిస్తాయి.  సామాన్య మానవుని స్థాయిలో, యెవరైతే కొంత నేర్పు సంపాదించి కొన్ని అహేతుకమైన సమస్యలకు తెలివిగా జవాబులిచ్చి అసాధారణ మహాత్మ్యములు చూపించి నమ్మబలుకుతారో వారే పరిపూర్ణులు.  ఈ కారణం చేతనే సాధువులమని చెప్పుకొంటూ దేశాలు తిరిగే గుంపులలో ఒక్కడు కూడా మనకు పరిపూర్ణుడని చెప్పగలవాడు కానరాడు.  ఈ విధంగా తిరుగు ప్రతివాడు కొందరిని వెంట త్రిప్పుకొంటూ వారిచే తన పరిపూర్ణత్వమును జనులలో వ్యాపింప జేయించుకొంటారు.  పరిపూర్ణుడనే మాట ఒక్కొక్కరి భావనను బట్టి అనేకార్థములు వచ్చునట్లు వచింపబడినది.  ఆధ్యాత్మిక నేపద్యంతో అనంత దృక్పదము గలిగి సత్యతత్త్వమును గ్రహించిన వానికి ఈ పదము సులభముగా అర్థమై అసలీ పరిపూర్ణతకు వాస్తవమున అట్టే ప్రాధాన్యత లేదని తెలియుచున్నది.  యోగ్యుడై భగవంతుడన్న భయభక్తులు కల్గిన ఉత్తముడుండవచ్చును.  కానీ అదే పరిఫూర్ణత కానేరదు.  భగవంతుని యెడ భక్తి భావన ఆలోచనలో, మాటలలో మరియు చేతలలో కలిగియుండవచ్చును.  అది కొంత పురోభివృద్ధి సాధించిన స్థాయియే కానీ, అది పరిపూర్ణత కాదు.  భగవంతునితో సంబంధ- మేర్పరచుకొన్న వారుండవచ్చును.  అది ఒక మహోన్నత స్థితే కానీ, పరిపూర్ణత కాదు.  శాశ్వతానందమున మునిగి యుండవచ్చును.  అది భగవంతుని గొప్ప వరము.  అయినప్పటికినీ అదీ పరిపూర్ణత కాదు.  నిజానికి భగవంతుడొక్కడే పరిపూర్ణుడు.  ఎంత అభివృద్ధి సాధించినప్పటికి అనిత్యుడైన ఏజీవి నేను పరిపూర్ణుడని చెప్పుకొనడానికి వీలులేదు.  అంతర్గతముగా లోలోతులలోవున్న కేంద్రం వైపునకు అనగా అనంతమువైపునకు చక్కగా పయనిస్తున్నాము.  అది మానవ ఊహకందనిది.  మనమా దిశలో మానవ సాధ్యమైన సుదూర దశకని అనుకుంటున్నా మంతే.  వాస్తవంగా అది ఇదిగో పరిపూర్ణత అంటే ఈ స్థానమని గుర్తుపెట్టి చెప్పడం అసాధ్యం.  కనుక పరిపూర్ణత అన్న పదం వాస్తవార్థంలో ఇది యని సూచింపలేనిది.  కనుక దానికే అర్థము లేదు.

 

పరిష్కారము

 

        తన చర్యలన్నీ కేవలం తన స్వార్థ వస్తుసముపార్జనకే కేటాయించి వాటికొఱకే పాకులాడుతూ, ఇదే సరియైన పథమని నిర్ణయించుకొని నడచు పక్కా భౌతికవాద దృక్పదాన్ని వదిలేసి, మనిషి అంతిమ ఉనికిని గణనలోనికి గైకొని సమస్యా పరిష్కారమునకు యత్నించవలసి యున్నది.  మనమెక్కడ నుండి దిగి వచ్చితిమో ఆ మన మూలమునకు తిరిగి వెళ్ళవలసి యున్నదన్న నిర్ధారణకు యిప్పటికే వచ్చితిమి.  అందుకొఱకు మనం తొలి అడుగు వేయవలసివున్నది.  సత్యతత్త్వమునకు సరిసమానమైయున్న, సూక్ష్మాతి సూక్ష్మమైన అంతిమ స్థితిపై మన దృష్టి నిలుపవలసి యున్నది.  దానికున్న ఒకే ఒక పరిష్కారమార్గం, మన స్థూలత్వాన్ని వీలైనంత అంతిమ హద్దువరకు తొలగించుకొనుటే.  ఇది మనం మిక్కిలి సూక్ష్మ పద్దతి నవలంభించినపుడు మాత్రమే వీలౌతుంది.  సూక్ష్మాతి సూక్ష్మమైన దానిని పొందుటకు పదార్థతత్త్వలేశమైన లేని మిక్కిలి సూక్ష్మ పద్దతి నవలంభించుట తప్పనిసరి.  వస్తు దృష్టితో యేర్పరచుకొన్న ధ్యేయంగలిగి సాధారణ భౌతిక సాధనలు, యాంత్రిక విధానముల నిబంధించు మతప్రచారకులు, బోధకులు ఈ విషయమున ఉపయోగపడరు.  అంతేకాదు వారు మన పవిత్రోద్దేశ్యమునకు హానికారులు కూడా.  సూక్ష్మాతిసూక్ష్మమైన దానిని స్థూల విధానమున సాధించుట అసాధ్యము.  అలవికాని పని.  ఈ కారణముననే ఇప్పుడున్న  మతము మన ఆధ్యాత్మిక సాధనకు అట్టే సహాయకారి కాదు.

 

 

 

 

ఆధ్యాత్మికత

 

        మత సంబంధమైన స్థౌల్య బంధనముల నుండి స్వేచ్చ పొందిన ఆధ్యాత్మికత ఒక్కటే ఇక మనకు మిగిలిన యేకైక ఉపాయము. అది మూఢనమ్మకములు, దురభిమానములను చిక్కులనుండి విడివడియున్నది.  ఈ మార్గమొక్కటే మనలను మన మాశించు అంతిమ సూక్ష్మస్థితి వరకు గొంపోగలదు.  వాస్తవానికిదే మన స్వార్థపరత్వమును వెనక్కు చుట్టివేయ సమర్థమైనది.  అంటే ఆత్మను చుట్టుకొనియుండి బంధనమునకు కారణమైన పొరలనన్నిటిని నిర్మూలించ గల్గినది.  మన ఈ స్థూలస్థితి నుండి  అంతిమ సూక్ష్మస్థితి వరకు సాగు మన గమనమే ఆధ్యాత్మికపు సారాంశము.  కానీ దురుదృష్టవశాత్తు దీనిని అహేతుకంగా అనేక తప్పుడు విధానముల విశ్లేషణచేసి, దీని ప్రాధాన్యతనే కోల్పోవునట్లు చేసిరి.  మొత్తమునకు దీనిని మతమని అపార్థము చేసికొనిరి.  కాకపోతే మతము యొక్క సర్వ స్థూల పరిమాణములతో సహా కలిపి ఆధ్యాత్మికమని నిర్ణయింపజొచ్చిరి.  మతనమ్మకములపై ఆధారపడిన విధులు, స్థూలదృష్టితో చూడబడుతున్న సూత్రములు, యాంత్రికమైన పూజలు, శారీరక వ్యాయామములు, ఇంకాకొన్ని ఆచారములు ఇతర వ్యవహారములు మొదలైనవన్నీ ఆధ్యాత్మిక సంబంధములేనని యనుచున్నారు.  అంతేకాదు పదార్థస్థాయిలో ఉపయోగపెట్టు ఆలోచనాశక్తిని, వశీకరణమున వ్యాధుల నివారణ, చిత్రమైన దెయ్యాల, ఆత్మల చేష్టలు కూడా ఆధ్యాత్మికము క్రిందికే జమకడుతున్నారు.  ఈ విధముగా మతము వలెనే ఆధ్యాత్మికతగూడా గోప్య విషయమై జనాన్ని భ్రమలోనికి నెట్టివేసింది.  ఇది ముఖ్యముగా సాధన జోలికేపోని కేవల మాటల బోధకులు, వారికై వారు ఏఆధ్యాత్మికతకు సంబంధము లేకుండా, కొన్ని పుస్తకాలను చదివి వాటిననుసరించి గ్రహించుకొంటిమని పండితులమైతిమని తలంచి జనులను తేలికైన సాధనా వాయువుల నాస్వాదించకుండా చేస్తున్నారు. అంటే వారు మనుషులలో కేవలం కరుడుగట్టిన జడత్వాన్ని, సాంద్రతను అనగా ఆధ్యాత్మికతకు విషతుల్యమైన వాటిని లోనికి చొప్పిస్తున్నారు.  అందువలన రానురాను తేలికగా, సూక్ష్మంగా మారాల్సిన మనం స్థూలంగా, సాంద్రంగా తయారవుతున్నాము.  అంటే వుండవలసిన స్థాయికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నాము.  ఈ విధంగా మనం సూక్ష్మస్థితులవైపు పయనించడంలో అడ్డంకులేర్పడి వస్తువిషయ లోలతగల స్థూల గోళమునందే శాశ్వతంగా బంధింపబడి పోయాము.  కనుక మన స్థూల యోచనలను విధానములను విడిచిపెట్టి సూక్ష్మాతి సూక్ష్మస్థితిని పొందుటకు సూక్ష్మ మార్గముల నవలంభించవలసి యున్నది.

 

        

 

మొరటు విధానములు

 

        తొలుదొల్తనే అట్టి సూక్ష్మవిధానములు ఖచ్చితముగా అవలంభించడము బహుఃశా వీలుపడకపోవచ్చును.  సామాన్యంగా మూఢులనుబడే వారి విషయంలో ప్రారంభంలోనే యిట్టి సూక్ష్మవిధానములను చేపట్టు శక్తి వుండకపోవచ్చును.  అటువంటి వారిని కొంతకాలము స్థూలపద్దతి నవలంభించమనవచ్చును.  కానీ వారినికూడా కడు జాగ్రత్తగా వీలైనంత తక్కువగా అట్టిపద్దతికి అనుమతించనగును.  ఉదాహరణకు అట్టివిషయములో విగ్రహారాధనను తొలుదొల్త అనుమతించినప్పటికి అందులో కూడా దైవమున్నదన్న భావనను వారి మనసునకెక్కునట్లు తెలియజెప్పవలెను.  అంటే అతడు పూజిస్తున్న విగ్రహము దైవమునకు ప్రతీకగా గైకొనమనవలెను గాని, ఆ విగ్రహమే దైవమని చెప్పరాదు.  ఇది కూడ అతని జీవితాంతము చేయవలసిన ప్రక్రియ కారాదు.  అతడు సూక్ష్మవిధానముల నవగాహన చేసుకోగలిగి, వాటిపై మనస్సు నిల్పగలుగుతున్నాడంటే, ఇక అతడు ఆ విగ్రహమును తప్పక వదిలేసి సూక్ష్మవిధానమునకు మారవలెను.  సంక్షిప్తంగా చెప్పాలంటే అతడు తొలుత గ్రహించిన తాత్కాలిక స్థూల సంకుచిత వస్తు ప్రభావము నుండి బయటపడుటకు బహు జాగ్రత్తగా మెలగవలెను.

 

        ప్రస్తుతము మనమున్న ఈ కలియుగములో యివే మన ముక్తికి కారణమనుకొంటున్న ఈ జపము, కీర్తనలు, మొదలైన వాటి విషయములో కూడా మనం జాగ్రత్తగా వుండవలెను.  భగవంతుని నామ జపము లేక స్తుతి లేక మంత్రము కొంతవరకు ఉపయోగపడవచ్చు.  అవి కూడా ఎంతవరకంటే, వాటి అంతరార్థముపై మనస్సు నిలిపి ధ్యానము సరియైన పద్ధతిలో చేసినప్పుడు మాత్రమే కొంతవరకుపయోగపడతాయి.  కానీ యిలా చాల సందర్భాలలో జరగడం లేదు.  సర్వసామాన్యంగా ఈ విధానముల నవలంభించువారు కేవలం ఆ సంగీతంలోని ఆకర్షణ, ఆ రాగలయానందానుభవములోని ఆహ్లాదమునకే పరిమితమై దాని వెనుకగల సత్యతత్త్వమును గమనించరు.  వారు తమ అంతరాంతరములలో, జనించిన దైవీయ స్పందనల (అలలో) తో లంకె నేర్పరచుకొనరు.  కనుక ఈ ప్రక్రియ కేవలం బాహ్యమైన ఆంశముగనే మిగిలిపోయి, దాని వలన కలిగిన ఆ లవలేశ మంచి ప్రయోజనాన్ని కూడా మొత్తం పోగొట్టుకుంటున్నారు.  ఈ విధంగా ఈ మొత్తం ప్రక్రియ ఎంతో సహాయకారిగా వుండవలసిందిపోయి సూక్ష్మతవైపు మనం కొనసాగిస్తున్న ప్రయాణానికి హానికరంగా మారిపోతుంది.

 

 

 

జన్మస్థలం

 

        ఇంతకూ మనం చేరవలసిన గమ్యస్థానమేదంటే అది మన స్వంత జన్మస్థలమే.  అక్కడ నుండే మనమింత దూరమిక్కడకి వచ్చి చేరినాము. ఈ విషయంలో మా గురువర్యుల దృక్పదం ఈ క్రింద తెలియజేస్తాను.

 

        "మనమెక్కడున్నామో మనకే తెలియదు.  మనమెక్కడుంటిమి? అది కొద్దిగా తెలుసు.  ఇది మన జన్మస్థలానికి సంబంధించి ఒక ఆచూకి దొరికినట్లేకదాఅదీ మనం సాధించవలసిన లక్ష్యం. దాన్ని సాధించటానికి మొదట మన ఇచ్ఛాశక్తి నుపయోగిస్తాం.  తర్వాత ఆ ఇచ్చ తెలివిని మొత్తం దాటిపోతుంది.  ఒక వేళ ఈ స్థితి మనకు ప్రాప్తమైతే అప్పుడు నీవెక్కడున్నావో నీకు తెలుస్తుంది.  అంటే అప్పుడు నీవు మూలస్థానం అంటే నీవు వదలివచ్చిన తొలిస్థానం నీవు గుర్తించావన్నమాట.  ఈ జ్ఞానమే  మనిషి తన వివిధ చర్యలన్నిటి నుండి గ్రహిస్తాడు.  అంతేకాదు ఈ చైతన్యం మనిషి మేలుకై ఒకానొక సత్యతత్త్వకేంద్రములో లీనమౌతుంది.  ఇలా గనుక దేహధారులందరి యెడల సంభవిస్తే ఇక ప్రపంచమే ఉండదు.  అది నిజంగా మహాప్రళయం.  కేంద్రంలోనికి మరలి వెళ్ళిన ఈ చైతన్యమంతా తిరిగి కొంతకాలానికి మళ్ళీ బయటపడుతుంది.  ఇదే ప్రకృతి నియమము.  ఏదీ నాశనమొందదు కాని మార్పు మాత్రం చెందుతుంది.  పతనమున్నదంటే, ఉద్దరణా వుండి తీరాలి.  కారణం ఈ చైతన్యాన్ని క్రిందికి దించిన ఆ శక్తిమూలము ఎక్కడో వున్నది.  ప్రారంభానికి అంతం, అంతానికి ప్రారంభం వుండితీరాలి.  ఈ చైతన్యం తిరిగి పునఃప్రతిష్టితమైతే, తిరిగి రావలసిన వస్తుసంచయమంతా క్రిందికి దిగనారంభిస్తుంది.  ఏమిటీ ప్రక్రియ? ఈ సత్త్యం, ఈ పదార్తం, ఈ చైతన్యం అంతా వుండనేవుంది.  వివిధ శరీరాకృతులు రూపుదిద్దుకోవడం మొదలయింది.  అట్లే మానవుడూ ఉనికిలోనికి వచ్చాడు.  ఈ చైతన్యమును మనతోపాటి వున్నవన్నిటిని మరలా మనతోపాటే తీసుకవచ్చింది.  ఇదంతా బలమైన శక్తి దాని వెనుక వుండి నడపడం వల్ల రాని ఫలితాలనది యిచ్చింది.  ఆత్మ, పదార్థాల కలయికతో యేర్పడిన శరీర వివిధ భాగాలలోనికి ఈ శక్తి ప్రవేశించి తన ప్రభావాన్ని చూపింది.  ఇప్పుడు మనలో మనం కదలాడ నారంభించినాము.  ఆత్మ అధికారిగా తనపని తాను చేసుకపోసాగింది.  మనస్సు నిశ్శబ్దంగా పని చేయుచున్నది.  హృదయమన్నిటికి సూచనలిస్తున్నది.  ఆలోచనలు ఉత్పన్నమై వాటి పరిధిలో అవిపనిచేయుచున్నవి.  సూక్ష్మతకు అతి సమీపమున నున్న కేంద్రము అంతయూ తన అధీనమొనర్చుకొని నడుపుతున్న ముఖ్యశక్తియై తన పరిధిలో శక్తి నుత్పన్నము చేసినది.  అదే ప్రతి జీవి ఆత్మలోనూ కనబడుతున్న యదార్థస్థితి.  కాని మనం ఈ వస్తుప్రపంచ ఉత్పత్తి స్థానాన్ని కనుగొనాలి.  కార్య కారణములను మనము గుర్తించనవసరము లేదు.  మనము ఆత్మకు అతి సమీపమున నున్న చైతన్యముతో పనిచేయాలి.  పూర్వకాలపు మహర్షులు కనుగొన్న ఆస్థాయియొక్క స్థితులు బహుఃశా గ్రంధములలో భద్రముగా నిక్షిప్తము చేయబడియున్నవన్నియు క్రూరహస్తములచే దగ్ధము చేయబడి పోయినవి.  ఇప్పుడద్దానిని బయటకు తెప్పించవలసిన సమయమాసన్నమైనది.  వెన్నుబాములోనున్న నరముల కేంద్రములు ఎక్కడ నుండి తిరిగి శక్తిని గ్రహించి తమపని కుపయోగించు కొనుచున్నవో కనుగొనాలి.  సృష్టికార్యమునకు మూలకారణమైన భగవంతుని ప్రాధమిక యోచన, కేంద్రము చుట్టూ వున్నది.  అదే మానససరోవరము.  లేక యోచననుత్పాదించు ప్రకృతి యంత్రము.  అది మానవుని  మానస సరోవర పరిధిలో వున్నప్పటికి అది చైతన్య బాండాగారమే.  అదే మూలము.  యోచనల ఉత్పత్తి కేంద్రము.  ఏదో ఒక విధమున దాన్ని గడ్డకట్టించడములో కృతకృత్యులమైతే ఇక చైతన్యం పోయినట్లే.  అప్పుడు మనిషి సరిగ్గా బ్రతికి యుండియు చచ్చిన వానివలె మారిపోతాడు.

 

        కనుక మనం అతి సూక్ష్మస్థితికి మరలిపోవాలంటే తప్పక సూక్ష్మాతి సూక్ష్మ ఫలితములనివ్వగల సమర్థమైన పద్దతులను, మార్గములను చేపట్టవలెను.  తద్వారా మనల్ని మన స్థూల ఉనికినుండి విడుదలయ్యేట్లు చేసుకొనవలెను.  అదే అతిప్రాధాన్యమైన గురియై, శ్రద్ధతో సరియగు మార్గము నవలంభించుచు అభ్యాసి మెలుగుతాడు.  ఖచ్చితమైన మార్గము కేవలనమ్మకముల మరియు అనుభవరహిత నిర్ణయములపై ఆధారపడక నేరుగా ప్రత్యక్షానుభూతి మరియు వాస్తవానుభవములపై, సంపూర్ణ స్వేచ్ఛకు చేర్చునదై యుండవలెను.  సంక్షిప్తంగా చెప్పాలంటే స్వచ్ఛమైన, కల్మషములేని ఆధ్యాత్మికత యనగా, అది మనకు తప్పనిసరిగా విజయము జేకూర్చు సాధనయై యుండాలి.  ఇది మతంకాదు.  దానికంటే చాలా అతీతమైనది.  ఇది సరళమైనది, సహజ ప్రకృతి సిద్ధమైనది.  అంతేగాదు వాస్తవానికదే మనిషి సమస్యకున్న ఒకే ఒక పరిష్కారము.

 

*****             *****


III.యోగవిద్యయొక్క శాస్త్రీయత

 

1. యోగా

 

వివిధ దృక్పదములు

 

        అత్యున్నతమైన ఆధ్యాత్మికస్థితికి చేర్చు ఒకేఒక మార్గము యోగము.  ఇది చాలామందికి బాగా తెలిసినపదమై యున్నప్పటికి నిజానికి దీని సరియైన అర్థము తెలిసినవారు బహుశః బహుకొద్ది మంది మాత్రమే.  వాస్తవమున ఇదేమిటో అర్థముగాని తప్పుడు అవగాహనలు వ్యాపించి యున్నవి.  కొందరు దీనిని అద్భుత అసమాన్య సిద్ధులనబడు విద్యల సాధించు శాస్త్రమందురు.  మరికొందరు శారీరక, భౌతిక వ్యాయామ పద్దతులైన ఆసన, ప్రాణాయామమను వాటి నభ్యసించి శరీర ధారుడ్యము పొంది అసాధారణ కండబల ప్రయోగములు శక్తి సామర్థ్యములతో కసరత్తులు జేసి చూపు విద్యయందురు.  ఇంకా కొందరు ఇది మనుష్యుల నాకర్షించి వశపరచుకొని అద్భుతముల ప్రదర్శించు లేక జబ్బుల నయముజేయు ఇచ్ఛాశక్తిగ భావింతురు.  కానీ వాస్తవానికి దీని అసలైన ప్రయోజనము, మూల విధానము, లాఘవము సరిగ్గా చాల మందికి అర్థము కాలేదు.  నిజానికి యోగా అనునది మానసిక శాస్త్ర విధానము.  నేరుగా ప్రకృతి సిద్ధాంతములపై ఆధారపడి నిర్మింపబడినది.  ఇది మత పరమైన నీతిగానీ లేక ఆత్మశూన్యతగానీ కాదు.  దీనిలో బ్రతుకుపై అసహ్యముగాని సన్యాసియై బాధ్యతల నుండి తప్పించుకోవడము గానీ లేదు.  ఇది శరీరమును హింసించు లేక ఊపిరి బిగబట్టి బాధించు శారీరక మానసిక విద్యా ప్రదర్శన కాదు.  ఇది జీవితములోని అన్ని దశలలో వ్యాపించి వున్నటువంటిది.  నీతి, మత, సాంఘిక, రాజకీయ మొదలైన అన్ని జీవన రంగాలకూ వ్యాపించి యున్నది.  నిజానికిది వాస్తవ సహజసిద్ధమైన జీవనము.  ఇది ఖచ్చితమైన జీవన విధానాన్ని దైవీయ ధ్యాసతో అహంభావ రహితంగా తీర్చిదిద్దుతుంది. ఇది వాస్తవార్థంలో మానవునికున్న సమస్యకు పరిపూర్ణ సమస్యా పరిష్కారం చూపుతుంది.  అంతేగాకుండా యేవిధమైన తేడా లేక దురభిమానాని కతీతంగా మానవులకందరికి అందుబాటులో తెరవబడి వుంటుంది.

 

        కానీ ఈ విధానము చాలా సరళము మరియు సహజమైనప్పటికీ దురదృష్టవశాత్తు ఇది యెంతగా కానరాకుండా కప్పివేయబడినదనగా, దీనికి సంబంధించిన అసలు అవగాహనే లేకుండా పోయింది.  సాధనతో సంబంధములేని సిద్ధాంతవాదులు ఈ విషయమును హేతువాద తత్త్వదృష్టితో తప్పుగా అన్వయించి చెప్పడం వల్ల ఇది మరింత గందరగోళానికి దారితీసింది.  విద్యావేత్తలుగా పేరొందిన వారి పాక్షిక జ్ఞానంతో వ్రాసిన వ్యాఖ్యానముల వల్ల ఈ విషయము ఒక చిన్న విభాగముగా గైకొనబడినది.  ఆ కొద్ది విభాగాన్నే వారు మొత్తం సర్వస్వంగా కనబరిచారు.  ఇందువల్ల విషయం మరింతగా జఠిలమై అన్నిరకములైన అతీంద్రియ, మార్మిక, గోప్య, తాంత్రికములైన విషయలన్నీ అటు దిరిగి యిటు దిరిగి యోగా  గానే లెక్కింపబడుచున్నవి.  ఈ కారణముల చేతనే సామాన్య కసరత్తులైనటువంటి ముళ్లపై పవళించడము, కొంత కాలము భూమిలో బూడ్పించుకొని ఉండడము వంటివన్నీ గూడా యోగము చేత సాధింపబడినవిగా సామాన్యజనం గుర్తిస్తున్నారు.  చాల మంది జనం యిట్టి సామాన్య దృక్పదాన్నే నేడు యోగం విషయంలో కలిగియున్నారు.  కొంతమంది మంచి తెలివిగలవారూ ఉన్నారు.  వారు యోగాన్ని తరచూ ఘోరంగా నిరుత్సాహపరుస్తున్నారు.  కారణం, అనేక కష్టతరమైన వీలుకాని నిబంధనలు, తపము సన్యాస జీవనము వంటి నిబంధనలతో కూడికొనినదై, సామాన్య జీవనమునకు సరిపోనిదని వారి వాదన.  ఇట్టి తప్పుదారి పట్టించు వాదనల వలన, భగవత్ సాక్షాత్కారానికి, చాలా సమర్థవంతమైన దైనప్పటికిని, యోగాన్ని కేవలం కొన్ని చిత్రములైన శక్తులు, సిద్ధులు సాధించుట కొఱకు సాధన చేయవలసిన ఒక భౌతిక ప్రయాసగా మార్చివేసినారు.  కనుక ఆధ్యాత్మికత యొక్క ప్రాధాన్యతను గుర్తించి యిందులో అనవసరముగా చేర్చిన చిక్కుసమస్యలు, తప్పుడు అభిప్రాయములను, బయటకు నెట్టివైచి వాస్తవార్థమున యోగమననేమో చదువరులకు తెలియజేయవలసిన అవసరమెర్పడినది.

 

వివిధములైన యోగములు

 

        మనము అనేక విధములైన యోగములను గూర్చి వింటున్నాము.  అవి చాలా మటుకు ఒకదానితో ఒకటి కలవవు.  వేరుగావున్నట్లు కనపడడమే గాకుండా కొన్ని సందర్భాలలో అవి ఒకదానికొకటి విరుద్ధములైయుండి యేమాత్రము పొసగని రీతిలో వున్నవి.  అయినా ప్రతి ఒక్కటి దానికై అదే సంపూర్ణయోగమని ప్రకటించుకొనుచున్నవి.  అందుచేత వాస్తవమున యోగమంటే యేమిటి? దీని అసలు అర్థమేమిటి? అన్న విషయం చాల వరకు రహస్యంగానే వుండిపోయింది.  ఉదాహరణకు జనులు జపయోగా, తపయోగా, మంత్రయోగా, తంత్రయోగా అని మాట్లాడుతూ వుంటారు.  ఇవి ప్రతి ఒక్కటి వేరువేరు దృక్పదములు గలిగి విభిన్నమైన ధ్యేయములను అందుకొనుటకు చేస్తుంటారు.  అలా చేసే వారిలో చాలా మంది ధ్యేయం భగవత్‌సాక్షాత్కారం కాదు.  ఇంకా మనకు కర్మయోగ, భక్తియోగ, మరియు జ్ఞానయోగమనునవి కూడా వున్నాయి.  అవి వాటివాటి ప్రత్యేక లక్షణములతో మనిషిని బాహ్య ఆచారముల దిశకు గొంపోతాయి.  యింతే గాకుండా ధ్యానయోగ, లయయోగ, సమాధియోగ, కుండలినీయోగ మరెన్నో వున్నాయి.  సంక్షిప్తంగా చెప్పాలంటే మనిషి యేదైనాకాని, అది యెందుకైనా కాని, అది భౌతిక, ప్రాపంచిక, మార్మిక లేక రహస్య ప్రయోజనములలో దేనినాశించిచేసినా అదంతా యోగమనే అంటున్నారు.  ఇది నిజమైన అన్వేషకుని గందరగోళమునకు గురిచేయుచున్నది.  అతడసలు యోగమంటే యేమిటో? యిన్ని యోగములలో తన ధ్యేయప్రాప్తికి యేది సరియైనదో అర్థముగాక అయోమయంలో పడిపోతున్నాడు.  ఇలా యోగమునకు సరైన అన్వయము అర్థముకాక, గోప్యంగానే అణగారిపోయింది.  తమచే యెన్నుకోబడిన గురువు యేదైతే చెబుతాడో అదే సరైనదని నమ్మి దానినే విధేయతతో అనుసరిస్తారు.

 

        వాస్తవానికి యోగము చాల పురాతనమైనది.  సాధువులు, మునులు, పతంజలి యోగశాస్త్రము ప్రవేశపెట్టక ముందునుంచి కూడా యోగాన్ని అభ్యసించారు.  దీనికి సంబంధించిన విషయములు ఉపనిషత్తులలో కూడా వెతికి కనుగొనవచ్చును.  కానీ  ఆ కాలములో అది చక్కని కూర్పుతో, సరియైన సమన్వయ విధానమున బహిర్గతము కాలేదు.  అప్పటి పద్దతులు (ఉపాసనలు) వారి గురువుల వ్యక్తిగత అవగాహన, అనుభవములపై ఆధారపడి హృదయము నుండి హృదయమునకు లేక గురువునుండి శిష్యునకు ఉపదేశింపబడుచుండెడివి.  కానీ వ్యక్తిగతంగా కొందరి విషయంలో అది వారు అందుకొను స్థాయి, ఆశయముల ననుసరించి వారివారి అనుభవములో కూడా వ్యత్యాసముండెడివి.  అందువల్ల ఒకరు నేర్పిన లేక బోధించిన దానితో పోలిస్తే అది మరొకరి విషయమున వేరుగా వుండెడిది.  కాలము గడచిన కొద్ది యివి ఒక్కొక్కటి వేరువేరుగా వృద్ధిగావింపబడి యోగము అన్న నామముననే పిలువబడినవి.  ఇలా వేరువేరైన కారణముననే మనకు అనేకరకముల యోగములు పరిచయమైనవి.  వాస్తవానికి ఈ శాఖోపశాఖలైన యోగములన్నీ ప్రత్యేకముగా వేరువేరుగా కనబడుతున్నప్పటికి యివి ఒకే అంశమునకు సంబంధించినవే.  అనేకమంది అంధులు ఒకే యేనుగును రకరకములుగా విశ్లేషించినట్లుంటున్నది .  యేనుగు మొత్తంగా వీరిఅవగాహనలో లేదు.  ఒక్కొక్కడు తను స్పర్శించిన అవయవములనుబట్టి ఒక్కొక్కడు వేరువేరుగా యేనుగు తాడువలె, పామువలె, విసనకర్రలవలె లేక స్థంభమువలె ఉన్నదన్న భావనకు వచ్చిరి.  పరిస్థితి ఈ విధంగా వుండడంవల్ల యోగము కూడా వేరువేరు వ్యక్తుల పాక్షిక విషయ వివరణల వల్ల అనేక విధాలుగాను, వేరువేరు మార్గాలుగాను తెలుపబడుచున్నది.  ఇది ఒకానొక ప్రాధమిక తప్పిదము.  ఇదే విశేషమైన మార్మికతకు కారణభూతమైనది.

 

 

 

 

పతంజలి విధానము

 

        ఈ చిక్కులన్నిటిని విడదీయు సంకల్పముతో మహామునియైన పతంజలి తన కాలములో వ్యాపించియున్న వివిధవిధానముల నన్నిటిని సమన్వయపరచి సంఘటితమైన ఒక యోగవిధానమును ప్రవేశపెట్టుటకొక అద్భుతమైన ప్రయత్నము చేసెను.  ఆయన సమన్వయపరచిన విధానమును సాధారణ పదమైన యోగమనియే పిలువబడెను.  ఆ ‘యోగ’ అనుపదమునకు ముందుగానీ వెనుకగానీ యే అక్షరములు చేర్చబడలేదు.  ఇందులో అనేక పేర్లతో పిలువబడుతున్న పద్ధతుల విశేషాంశములన్నీ దాదాపు సమన్వయ పరచబడినవి.  కర్మ, భక్తి మరియు జ్ఞానములు యిందలి విశేషాంశములు.  జప, తప మొదలైనవి అభ్యాసి అవసరములను దృష్టిలోపెట్టుకొని నిర్దేశించిన సాధనా విధానములు లేక ప్రక్రియలు.  లయ, సమాధి మొదలైనవి సాధనా ఫలితములకు సంబంధించినవి.  కనుక ఇది ఒక పద్దతి ప్రకారం, అన్ని విధములా సంపూర్ణతను సంతరించుకొని సాధకుని అంతిమ ప్రయోజనాన్ని సాధించుట కనువైనదిగా ఆద్యంతము చక్కగా తీర్చిదిద్దబడిన యోగ విధానము.  నేను యోగాన్ని గూర్చి మాట్లాడేటప్పుడు యోగమంటే యిదేనని నా భావన.  అంతేగాని ఈ యోగసంబంధిత  యితర శాఖల గురించి కాదని గమనించవలెను.

 రెండు విభాగములు

 

        పతంజలి చేత వివరింపబడిన ఈ యోగమును రెండు విభాగములుగా చేయవచ్చును.  అవి హఠయోగము, రాజయోగము.  పతంజలి అట్టి విభజననేమీ చేయలేదు.  అసలిలా రెండు పేర్లను గూడా పేర్కొనలేదు.  హఠయోగము భౌతికపరమైన యోగము, శారీరక మరియు మానసిక చర్యలనదుపుచేయు ప్రక్రియలతో కూడియుండును.  కానీ రాజయోగము ఆత్మతో సంబంధమేర్పరచుకొన్న సూక్ష్మమైన అనుభవములు గల సత్యతత్త్వమునకు పూర్ణముగా సంబంధించినది.  పతంజలి విధానములో హఠయోగము ప్రధాన యోగవిధానమైన రాజయోగమునకు పీఠిక వంటిది.  హఠయోగములో నిబంధించిన కఠిన నియమములు, నేటిసామాన్య మానవ జీవితమును దృష్టిలో నుంచుకొని ప్రాపంచిక జీవితము, యోగ జీవితము అను రెండు జీవితములైనవి.  ఒకదానితో ఒకటి విభేదించుచుండును.  గనుక వీటిలో యిదో అదో యేదోఒకటి యెన్నుకొనవలెనను భావన గలిగినది.  ఇది నిస్సందేహముగా తప్పుదారి పట్టించు దృక్పదము.  మన ప్రాపంచిక జీవనము యోగజీవనముగా మార్పుజెందుటే అత్యంతావశ్యకముగా కావలసినది.  అంటే యిది రెండు రకముల జీవితములను సమన్వయ పరచుట.  కానీ దురదృష్టవశాత్తు ఇంతవరకు ఈ అతిముఖ్యమైన విషయమువైపు జనం దృష్టిసారించలేదు.  ఇందువలన సామాన్యమైన ప్రాపంచిక జీవనము గడుపు మామూలు మనిషికి యోగము అందుబాటులోనికి తెచ్చియుండవచ్చును.  హఠయోగమనునది భౌతికముగా శరీరమును మనస్సును క్రమబద్ధము చేయునది గావున యిది వాస్తవ యోగజీవనమునకు ప్రాధమిక శిక్షణగా, అది కూడా అవసరమని తలచినవారి విషయమున ఉపయోగించుకొన వచ్చును.  కానీ ఈ హఠయోగాన్ని రవ్వంత కూడా వదలకుండా తప్పనిసరిజేసి మనుషులపై బలవంతంగా అందరి విషయములందును, అన్ని సందర్భాలలోను రుద్దడమనునది మొండితనము మరియు దురభిప్రాయమనక తప్పినదికాదు.  హఠయోగము యొక్క ముఖ్య ప్రయోజనము మనస్సును, ఇంద్రియములను కఠినముగా అదుపుచేసి, ఊపిరిబిగబట్టి శరీరమును శ్రమపెట్టి తద్వారా వాటి సాధారణచర్యలను అరికట్టుట.  ఇది నిర్ద్వందముగా అసాధారణ ప్రక్రియ.  అంతేగాక మన ప్రధాన ప్రయోజనమునకు పెద్ద అపకారి.

 

యోగము మరియు సామాన్య జీవనము

 

        నిజజీవితంలో యోగము నభ్యసించుట, సామాన్య సాంసారిక జీవనము గడుపు వారికి అసాధ్యమని మరీమరీ వినుట వలన విసుగుజెంది గృహస్థునికిది వీలుగానిదని, ఉన్నతమైన దైవీయ స్థితులందుకొనుట సామాన్యుల కసాధ్యమని, వారు తమ సాంసారిక జీవితమును విడిచిపెట్టి, భార్యబిడ్డలు, బంధువులను వదిలివేసి సన్యసించి కాషాయ వస్త్రములు ధరించిననేగాని దైవీయ జీవనమునకు పనికిరారని తేల్చిరి.  ఇదే విషయమును పెద్దపేరు గడించిన, పెద్దస్వామిగా స్థిరపడిన వారుకూడా దాదాపు అన్నివేదికలనుండి బోధిస్తున్నారు.  ప్రాపాంచిక వస్తువులపై మితిమీరిన వ్యామోహం నిస్సందేహంగా ఆధ్యాత్మిక మార్గంలో ఒక అడ్డంకే.  అంటే దానర్థం ప్రాపంచిక జీవనాన్ని వదిలేసి బిడ్డలను, బంధువులను దిక్కులేని వాళ్ళనుచేసి పొమ్మనికాదు.  అందువల్ల ఆకర్షణలనుండి ఖచ్చితంగా స్వేచ్ఛను పొందుతామని చెప్పలేము.  నిజజీవితాలలో పరిశీలించి చూస్తే అట్టివారు స్వేచ్ఛను పొందిన దాఖలాలు లేవు.  తమకైతాము సర్వసంగ పరిత్యాగులమని (సాధువులమని) చెప్పుకొనే వారి జీవన విధానాన్ని సూచాయగా పరిశీలిస్తే వారు కాషాయ దుస్తులలో కనుబడుతున్నప్పటికి ప్రాపంచిక విషయాలతో పూర్తిగా దట్టించుకొనిపోయి సామాన్య గృహస్తుని వలె ఇంకా చెప్పాలంటే వానికంటే మరింత యెక్కువ ప్రాపంచికంగా చిక్కుకపోయి ఉన్నారన్న విషయం స్పష్టమౌతుంది.  ఇవికాక వారు దీనికి మించిన పెద్దపెద్ద చెడ్డపనులైన స్వయంప్రేమికత్వము, ధిక్కారము, గర్వము అను దుర్గుణములు కలిగియుందురు.  ఇవి ఆధ్యాత్మికతకు ప్రాణాంతక విషయములు. ఈ విషయానికికొస్తే సామాన్య గృహస్థుడు వారికంటే యెంతోమేలుగా నున్నాడు.  కనుక అంతర్గత మానసికస్థితిని  గమనిస్తే వారు సర్వసాధారణమైన గృహస్తుడు, అంటే తన బాధ్యతలు నిర్వహించడానికి అనేక విధముల అధిక శ్రమకు లోనయ్యే అతి సామాన్యునికంటే చాల భ్రష్టస్థితిలో వున్నారు.  సంక్షిప్తంగా చెప్పాలంటే మన సమస్య తగనిరీతిలో ఆకర్షణలకు (మాయామోహములకు) లోనయ్యామన్న భావనను జయించడమే.  అందుకొఱకు బాహ్యముగా పైపైన కల్పించుకొన్న భూటకపు నిర్వ్యామోహభావనలు పూర్తిగా నిరర్థకములు.  భావన నేరుగా మానసికవృత్తులకు సంబంధించినది.  అందుకొఱకు మనస్సును సరిగ్గా క్రమబద్దీకరించుకొనుటకు ప్రయత్నించవలెను.  తద్వారా అది తప్పుదారి నుండి బయటపడవలెను.  అది జరిగినట్లయితే అన్నీ వాటికై అవే చక్కదిద్దబడి మనిషి పూర్తిగా స్వేచ్ఛనుపొంది ఆకర్షణలకు తగని రీతిలో తగుల్కొనడు.  ఈ విషయంలో అతడు ప్రాపంచిక జీవితం గడుపుతూ అన్ని ప్రాపంచిక విషయములలో తగు సంబంధము కలిగియున్నా యెలాంటి దోషమూ లేదు.

 

బ్రహ్మచర్యము

 

        ఈ విషయములో తర్వాతి ముఖ్యాంశము విచక్షణారహిత కఠిన బ్రహ్మచర్యావలంబనం.  ఇది యోగ విధానంలో చాల ప్రాణప్రదమైన అత్యంత ప్రధానాంశంగా నొక్కి వక్కాణించబడింది.  కానీ బ్రహ్మచర్యమును వారు యేవిధంగా నిర్వచించారో ఇంకా విశదము కాలేదు.  దాదాపు యే విషయములలోను ఇందుకు ఇదమిద్దమైన నిబంధనలు విశదీకరింపబడలేదు.  సామాన్యార్థంలో యిది లైంగిక సంబంధమేమాత్రము లేకుండా, ఆడ, మగ వేరు చేయబడి ప్రత్యేక జీవనము గడుపుటనునది దాదాపు మతధర్మబోధకులందరి సిద్ధాంతము.  బ్రహ్మచర్యాన్ని గూర్చి ఇటు ఆధ్యాత్మికరంగమునగానీ, లేక మానవజీవితములోని అన్ని దశలలో దాని విలువను తక్కువచేసి చూడరాదు.  కానీ దీనిని పాటించు విషయమున నిబంధించిన నిర్భంధ కఠిన నియమములు మాత్రం అంత కఠినముగా వుండవలసినవి కావు.  అందరూ అంగీకరించిన విషయము మాత్రము లైంగిక సంబంధములు బ్రహ్మచర్యమున నుండరాదనుటే.  జీవితములోని దశలన్నిటిలో యిట్లే వుండవలెననుట నిర్ద్వందముగా తప్పు మరియు అసహజము.  అడ మగ ఇద్దరు ప్రకృతికి అవసరం.  నిష్కారణంగా వారు ఉనికిలోనికి రాలేదు.  కనుక మొత్తంగా ఆడ మగ కలియటానికే వీలులేదనుట బహిరంగముగా దైవనిర్ణయముల నతిక్రమించినట్లే అవుతుంది.  కాబట్టి ఇది మొత్తము మీద సాంఘిక మరియు నీతి సిద్ధాంతముల రీత్యా సమర్థింపలేనిది.

 

        వాస్తవార్థంలో బ్రహ్మచర్యమంటే చక్కని క్రమశిక్షణ మరియు ఆడ మగ యిద్దరి మధ్యన ఉండవలసిన క్రమబద్దమైన సమన్వయ బాంధవ్యము.  అది హేయము, విపరీతమునై కేవలం శరీరపు ఆకృతి మెఱుపుల ఆకర్షణ మరియు లైంగికానందానుభవమై యుండరాదు.  ఈ దుర్గుణముల నధిగమించి దాంపత్య బాంధవ్యము సాగితే అది భగవన్నియామక కర్తవ్య నిర్వహణ మొనరించు పవిత్ర బంధమైతుంది.  సామాన్యముగ జనులు ఇది అసాధ్యంగా భావిస్తారు.  అంతేగాకుండా దంపతులను ఒకటిగా వుంచి లైంగికానందమునకు దూరంచేయడమంటే రెండు ధృవములను ఒకచోటికి దెచ్చినంత అసాధ్యమైన పనిగా భావిస్తారు.  వాస్తవానికిది నిజంకాదు.  ఇది వాస్తవానికి మనస్సుకు సరియైన శిక్షణ మరియు తగు క్రమబద్దీకరణ చేయడంపై ఆధారపడియున్నది.  ఆ విధంగా చక్కని క్రమశిక్షణనిచ్చి సరిచేయగలిగితే జీవితములోని ప్రతిదశలోను చక్కని సర్దుబాటు జరిగిపోతుంది.

 

          బ్రహ్మచర్యము జీవితములోని పలుదశలలో అది ప్రత్యేకావసరముల రీత్యా వేరువేరుగా ఉండాల్సిన అవసరముంటుంది.  జీవితంలోని తొలిదశలో, అంటే పెరిగి పెద్దయ్యే దశలో మనస్సు జ్ఞానసముపార్జన వైపు త్రిప్పి వ్యక్తిగత క్రమశిక్షణకు లోబడి పూర్తిగా ఆడ మగ కలయిక ఆలోచనలోను, మాటలలోను, చర్యలలోను (త్రికరణశుద్ధిగా) కఠినముగా వర్జించవలెను.  అంటే సంపూర్ణముగా లైంగిక చింత మనస్సులోనికి యేమాత్రము రానీయరాదు.  కానీ తర్వాతి జీవితదశ ప్రాపంచికావసరముల సమకూర్చు ప్రయత్నములకు కేటాయించబడినది.  అప్పుడు బ్రహ్మచర్యము వేరుగా వుంటుంది.  అది భగవత్ కార్యనిర్వహణ కవసరమైన ప్రాపంచిక వస్తుసముదాయమును కూర్చుకొనుట కనువుగా సవరింపబడి వుంటుంది.  దాంపత్య లైంగిక బాంధవ్యము ఈ దశలో తొల్లి నిబంధనలలో మార్పులు అనివార్యములై సరిదిద్దబడి వుంటాయి.  కానీ అవి కొన్ని హద్దులనేమాత్రము అధిగమించకుండా శరీరప్రకృతి, సహజ అంతఃప్రేరణలకు సక్రమముగా స్పందిస్తూ మరియు యిద్దరి ప్రమేయముతో జరుగవలసిన కర్తవ్యముగా నిర్వర్తించాలి.  ఇటువంటి సందర్భములలో వివాహితుడై సామాన్య జీవనము గడుపు మనుజుడు సహితం తాను సరియైన అర్థములోనే బ్రహ్మచారిని అని చెప్పుకొనవచ్చును.  కనుక కేవలం లైంగిక జీవనం యోగి మార్గమున కడ్డంకి యనుట సరికాదు.  కాని దాని దురుపయోగము, అక్రమ జీవనం నిషిద్ధము మనము శీలమున కమిత ప్రాధాన్యమియ్యవలెను.  నిజానికి వైరాగ్యము మరియు బ్రహ్మచర్యమను నీ రెండూ భయము కలిగించు బోగీలు.  అజ్ఞానులైన యోగాబోధకులు యేర్పాటు చేసి సామాన్య జనాన్ని మార్గం నుండి భయపడి పారిపోయేటట్లు చేసి, మతపరిధిలో తమ గొప్పస్థానమైన దైవసమానతను నిలుపుకొనే యత్నం చేస్తున్నారు.

 

2. యోగముపై అపోహ

 

సాధన చతుష్టయము

 

        వేదాంత విధానమున నిబంధించిన నాలుగు యోగ సాధనలు వివేకము, వైరాగ్యము, షట్సంపత్తి మరియు ముముక్షుత్వము.  వీటికి గొప్ప ప్రాధాన్యత యివ్వబదినది.  అభ్యాసి తన జీవన మార్గములో వరుసగా వీటిని అనుసరించుట అవసరమనిరి.  వేదవేదాంతదృక్పదము ప్రకారము యోగసాధన వివేకముతో అనగా నిత్యానిత్యములను అర్థము చేసుకొనగల పరిజ్ఞానముతో మొదలుకావలెను.  భౌతిక రూపముననున్న వస్తువులు మార్పునకులోనై, తుదకు లయించిపోతాయి కాబట్టి యివి నిజముకావు.  సర్వసమన్వితమైన ఈ విశ్వమును అసత్యంగాను, భ్రమగాను తెలుసుకొనవలెను.  అన్నిటికి మూలమందున్న వాస్తవ వస్తువు, పరిణామ- రహితమైనదేదో అదే శాశ్వతబ్రహ్మము.  ఈ జ్ఞానము మన అన్వేషణకు అత్యంత ఆవశ్యకమైనది.  దీన్ని కాదని యెవరూ అనలేరు.  కానీ దీన్ని ప్రాధమిక విధానంగా లేక సాధనగా గైకొనడం మాత్రం శుద్ధ తప్పు.  అది బయటికి డాంబికంగా చూపించుకొనుటకు పనికివచ్చు భౌతికప్రదర్శనమే.  దాని ప్రభావము మనస్సుపై యేమాత్రముండదు.  వివేకము మనస్సుయొక్క లోలోని భావనలను సూచించును.  అది ప్రాపంచిక వస్తువులకు సంబంధించి, వాటి వాస్తవ విలువలను మన యెఱుకలోనికి దెచ్చును.  మనిషికి పదార్తవిషయ సంబంధము తీసివేయలేనిది.  పదార్తము స్థూల, భౌతికరూపములో కనబడుచున్నది.  ఇదంతయు లోతుగా మానవుని భౌతిక ఉనికికి సంబంధమేర్పరచుకొని యున్నది.  దీనిని శరీరమున్నంతవరకు యెవరూ తోసిపుచ్చలేరు.  మనిషి తన ఆత్మయొక్క భౌతిక రూపముపై తగని రీతిగా తగుల్కొనడం అంటే అమితమైన ప్రాధాన్యతనివ్వడం నిజానికి ప్రధానదోషం.  ఇదే అన్ని బంధనములకు కారణం.  అసలు దీనివల్లనే మన భౌతిక వస్తువ్యామోహం లోలోతులకు వెళ్ళి మనకు సంబంధించిన వస్తువుల పరిణామలక్షణాన్ని గుర్తించలేనంతగా యెఱుక కోల్పోయి వుంటాము.  భౌతికమైన మనిషి దృష్టిలో నేను అనేది ప్రాధాన్యత వహించి యుండి, అదే వాస్తవమై కనబడ నారంభించి, దానికి సంబంధించియున్నవన్నీ ఘనమైన విలువను ఆపాదించుకొంటాయి.  ఈ పదార్తనిర్మిత స్వరూపమునకు మూలమునగల మార్పులేనిస్థితి దాదాపు క నుమరుగై అనుభవమున భౌతిక మనోవ్యాపారములందు పూర్తిగా విస్మరింపబడి యుండును.  ఈ విధమైన నిలకడలేని భౌతిక పదార్థముల ఉనికిని అర్థము చేసుకొనుటను సూచించునదే వివేకమను పదము. ఈ వివేకమును తొలిదశలోనే మేల్కొల్ప జేయవలెను.  అందుకొఱకు మనము తగిన విధానమును వెతుకు కొనవలెను.  కనుక వివేకము యేవిధంగాను దానికై అదే సాధనకాదు.  కాని అది కొన్ని సాధనల ఫలితము మాత్రమే.

 

        ఎప్పుడైతే ఈ జ్ఞానము మేల్కొల్పబడి, వస్తువిషయముల సత్యలక్షణము మనస్సుకు విశదమౌతుందో, అప్పుడు మన ఉనికియొక్క సత్యతత్త్వపు యెఱుక కలుగుతుంది.  సహజంగా అప్పుడభ్యాసి తన చుట్టూవున్న వస్తువుల నిలకడలేని లక్షణములను మనస్సుకెక్కించు కొంటాడు.  అందువల్ల అతడు అటువంటి వస్తువుల అశాశ్వతత్వాన్ని గ్రహించి వాటివైపు మొగ్గుచూపడం, వాటికై ప్రాకులాడటం తగ్గిస్తాడు.  అప్పుడు ప్రతిదీ తన ఆకర్షణను కోల్పోతుంది.  అందువల్ల అతడు కొంతవరకైనా ఆకర్షణలనుండి స్వేచ్ఛను పొందుతాడు.  ఇదే వాస్తవానికి సరియైన అర్థంలో వైరాగ్యమను దానికి ప్రారంభము.  కనుక యిది నేరుగా వివేకము యొక్క ప్రతిఫలము.  అంతేకాదు యిది హృదయాంతర భావనాపరమైనది.  ఇది యేవిధంగాను యోగసాధనకాదు.

 

        వైరాగ్యమునకు సరియైన అన్వయము సన్యాసియై సాంసారికానుబంధములకు దూరముగ నుండుట లేక ప్రాపంచికములపై అసహ్యము గలిగియుండుట కాదు.  అన్నిటిని త్రోసివేసి వదిలించుకొనుట అనునది స్థూలమైన పొరబడిన భావన.  మార్గములో నిజమైన ప్రతిబంధకము వస్తువులను కలిగియుండడముకాదు కాని ఆ వస్తువుల తళుకు బెళుకులు మరియు ఆకర్షణలకులోనగుట.  వాటి విషయమై వారు జెప్పు సాకు అవి ఇంద్రియసుఖమునకు, శారీరక ఆనందమునకు మూలాధారములు.  భౌతికపరమైన ఆత్మపై శ్రద్ధ వలన గలిగిన ఈ విశేష విషయాకర్షణ (మాయమోహములు)లే వాస్తవమునకు మూలదోషములు.  అవే మన బంధములన్నిటికి కారణములు.  అవి తుదకు మనస్సును ప్రక్కదారి పట్టించి సత్యతత్త్వమునకు దూరమొనర్చునందురు.  వాస్తవార్థమున వైరాగ్యమనునది భౌతికముగ విడిబడియుండుటకాదు. కలిగియుండుటాకాదు.  ఈ విధమైనదేదియు కాదు.  కానీ అది స్వచ్ఛమైన సరళమైన అనాకర్షణ లేక సక్రమ కర్తవ్య నిర్వహణావసరమైన వస్తువులపై జీవితమున నిర్వ్యామోహవైఖరి.

 

        సహజమార్గము వివేక, వైరాగ్యములను సాధనములుగా పరిగణించదు.  కానీ కొన్ని సాధనలను వరుసగా చేయుటవల్ల కలిగిన ఫలితములుగా వాటిని పరిగణిస్తుంది.  అందుచేతనే ఈ పద్ధతి వేదాంతుల మూడవసాధనయైన షట్సంపత్తితో ప్రారంభిస్తుంది.  అది ఆరు విధములుగ మానసిక వృత్తులను క్రమబద్ధీకరించుటకు సంబంధించినది.  అందులో మొదటిది శమము.  అది మనస్సును సక్రమంగా క్రమబద్ధీకరిస్తుంది.  అది యోగవిధానమున ప్రప్రధమమైన తొలిఅడుగు.  రెండవది దమము. అది ఇంద్రియములను కట్టడిచేస్తుంది.  మూడవది ఉపరతి.  ఇది పశ్చాత్తాపమున వెనక్కి తీసుకొను విధానము.  నాల్గవది తితీక్ష. ఇది మనఃస్థైర్యము.  ఐదవ సాధన శ్రద్ధ.  ఇది నిజమైన విశ్వాసము.  ఆరవది సమాధానము.  ఇది తన్నుతాను సంభాళించుకొను స్థితి.  కానీ యిక్కడ అనుసరించు మార్గము కూడా పాత మామూలు పద్ధతి నుండి కాస్త బయటపడి, ఈ సాధనలోని విభాగములన్నీ వేరువేరుగా చూడరు.  ఇవన్నీ ఒక్కటే.  కేవలం బాహ్యంగా వేరనిపిస్తున్నాయంతే.

 

        అన్నిటికంటే ప్రప్రధమమైన మనస్సు క్రమబద్ధీకరణ జరిగితే దాని ప్రభావము మిగిలిన అన్ని మానసిక వృత్తులపైన పనిచేస్తుంది.  అందువలన ఇంద్రియముల అదుపు దుడుకుతనముమాని తనకైతాను వెనక్కి తగ్గడము వంటివన్నీ సహజంగా ఒకదాని వెంట మరొకటిగా సంప్రాప్తమౌతాయి.  వాస్తవానికి మనస్సు క్రమబద్దము కావడంతో అదే అన్నిటిని, అన్ని వృత్తులను సరిచేసుకపోతుంది.  కనుక షట్సంపత్తిని ప్రారంభముగా సహజమార్గములో తీసుకోవడంతోనే మనము మనస్సును క్రమబద్ధీకరించడమును మాత్రమే గణనలోనికి తీసుకొని మిగిలినవన్నీ దానివెంటే సహజంగావచ్చే ఫలితాలుగా తలంచి వదిలేస్తాము.  ఇందుకొఱకు సహజమార్గంలో హృదముపై ధ్యానము నొక్కదానినే చేపడతాము.

 అష్టాంగ యోగము

 

        పతంజలి మహర్షి సర్వసాధారణంగా ప్రవేశపెట్టిన తనకిష్టమైన విధానం అష్టాంగయోగం.  అంటే యెనిమిదంచల యోగవిధానం.  అవి యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి.  పురాతన దృక్పదంలో యివి అభ్యాసి కడకుచేరవలసిన మహోన్నతస్థితియైన ‘సమాధి’ కై యేర్పరచిన నిచ్చెనమెట్ల వంటివి.  ఈ దృక్పదంలో పతంజలి అష్టాంగయోగము విజయవంతమైన ఆధ్యాత్మిక యానములో విస్మరింపరానిది మరియు అత్యంతావశ్యకమైనది.

 

        కానీ వీటన్నిటిని మనం విశ్లేషించి చూస్తే మొదటి ఐదుఅంచెలు అనగా యమ - తనపై తనకు అదుపు.  నియమ - నియమింపబడ్డ నిబంధనలను పాటించుట.  ఆసన - కూర్చోనుపద్దతి.  ప్రాణాయామ - శ్వాసను నిబద్ధీకరించడము మరియు ప్రత్యాహార - ఇంద్రియ నిరోధము అనునవి పూర్తిగా యోగమున భౌతికపరమైనవి. అంతేగాక అవి కేవలం శరీరక్రమశిక్షణ నలవరచుకొనుట కేర్పరచుకొన్న బాహ్య శారీరక వ్యాయామ సంబంధమైనవి.  ఆఖరు మూడంచలు ధారణ, ధ్యాన, సమాధులతో కూడుకొని యున్నవి. ఇవి అంతరంగ సాధనలు లేక నిజమైన యోగము.  ధారణ మనునది ధ్యానసాధనకై ఒక ప్రత్యేక బిందువు లేక భావనపై మనస్సు నిల్పుటకు స్థానము నెన్నికజేసుకొను ప్రయత్న ప్రక్రియ.  కనుక యిది ధ్యానమునకు ప్రాధమికాంశము.  దీనిని ఏకాగ్రస్థితియని యర్థము చెప్పుట శుద్ధతప్పు.  తద్వారా జనులు ఏకాగ్రత, ధ్యానము యొక్క మొదటి లక్షణమను తప్పుడభిప్రాయమునకు రావచ్చును.  ఆమూలాగ్రము ఈ అంశమును సహజసిద్ధముగా పరిశీలించిన మరింతగా విశదమగును.  ధ్యానమున కుపక్రమించుటకు ముందు మన ధ్యాసను ధ్యానమునకై యెన్నుకొన్న బిందువు వైపు మరల్చవలసియుండును.  ధారణ అనేదానిలో ఇది ఇమిడి వుంటుంది.  ఆ తర్వాత దానిని గూర్చిన చింతన శ్రద్ధతో కొనసాగిస్తాము.  దీన్నే మనం ధ్యానంగా భావించవచ్చు.  యెప్పుడైతే మనం యోచనలో యెఱుక కలిగిగాని, యెఱుక లేకుండాగాని మునిగిపోతామో అదే ఏకాగ్రత లేక సమాధి.  కనుక జాగ్రదావస్థ, జాగ్రదావస్థయొక్క కొనసాగింపు మరియు లీనమవ్వడం అనేవి మూడూ, ధ్యాన ప్రక్రియలోని అంగములు.  కనుక ధారణ, ధ్యాన మరియు సమాధి అనువాటిని వేరువేరు యోగస్థితులుగా భావింపక వాస్తవానికి అవి ఒకే ధ్యానములో ఒకదాని తర్వాత ఒకటిగా వచ్చు స్థితులని గ్రహించవలెను.  ధ్యానము ధారణతో మొదలై సమాధి, యేకాగ్రతలో సమాప్తమగును.  కనుక యేకాగ్రత నేరుగా ధ్యానముయొక్క ప్రతిఫలము అంతేగాని యిది దాని తొలిలక్షణము గాదు. కనుక తొలి ప్రయత్నములోనే యేకాగ్రత కొఱకు ధ్యానసాధన చేయడము తప్పు.  అట్టియెడల మనిషి భౌతికశక్తి నుపయోగించి మనస్సును అణచివైచి శ్రమకు గురిచేయవలసి యుండును.  అది సత్యతత్త్వమునకు సంబంధములేని అంతరంగిక స్థౌల్యమునకు దారితీయును.

 

        సర్వసాధరణముగా అందరంగీకరించిన అష్టాంగయోగము నందు ముఖ్యముగా రెండు భాగములున్నవి.  అవి హఠయోగ విభాగము మరియు రాజయోగ విభాగము.  కానీ దురదృష్టవశాత్తు ప్రతి సాధారణ విషయమును సైతము అనవసర యాంత్రిక విధానముగా మార్చి అధిక ప్రాధాన్యతనిచ్చి అసలు విషయమును కనుమరుగొనర్చిరి.  కేవలం ఆసనములు, ప్రాణాయామము మాత్రం జీవితాంతం అనుసరింపజేసి తద్వార పొందిన భౌతిక ప్రయోజనములనే గొప్పగా చెప్పుకుంటూ అసలు సిసలైన యోగసత్త్యమునకు చాలా దూరమైపోయిరి.  విధానము యొక్క యాంత్రికతపైన మాత్రమే మనస్సుంచి దాని వాస్తవ ప్రాధాన్యతను గణించక విస్మరిస్తే అది యెందుకూ పనికిరాకపోగా తరచూ అది వాస్తవ యోగయానమునకు అత్యంత హానికరమైపోవును.  సాధకుడు తన అంతిమ గమ్యమునకు శ్రద్ధతో కట్టుబడి యుండవలెను.  అందుకు తగిన అందుబాటులోనున్న మంచి మార్గమునెన్నుకొన వలెను.  అందుకొఱకు అతడు సాధారణముగా అలవాటుపడిన యాంత్రిక విధానమును విడనాడినను పరవాలేదు.  కారణము మనము అంతిమమును చేరవలెను.  అంతేగానీ యేదో సాధారణ దినవారి ఆచారవ్యవహారములకు కట్టుబడిపోరాదు.  అంతేకాదు ఇవన్నీ గొప్ప మహనీయులు వేలాది సంవత్సరముల పూర్వం మనకోసం తెలియజేశారు.  యివే సర్వస్వం, ఇంతకుమించింది, ఇంకా తెలుసుకోవలసిందేమీ లేదు అనే భావనకు రావడం పెద్ద తప్పు.  అనుభవమున సాధించిన అభివృద్ధి అనేక మార్పులు, సవరణలు, ఔన్నత్యములను అన్నివిధములైన శాస్త్ర విజ్ఞాన శాఖలందును మన దృష్టికి వచ్చున్నవి.  కనుక మహాత్ములను క్రించపరచితిమను అపార్థము చేసుకొనక చెబుతున్నాను.  పతంజలి యోగ శాస్త్రమును యిప్పటి మానవజీవితము దృష్ట్యా మార్పులు, సవరింపులు చేసుకోవడము తప్పిదము కాబోదు.  ఈ విషయమై సుదీర్ఘమైన చర్చలోనికిపోక, నేను విషయమునకు మాత్రము కట్టుబడి అవసరమైన అంశమును మాత్రము సృజింతును.

 

        అష్టాంగయోగ విధాన నిర్మాణము శరీరముతో మొదలై భౌతికము నుండి ముందుకుసాగి మనస్సును తాకుతున్నది.  ఇది చివరనుండి మధ్యకు ఆకర్షించే పద్ధతిలో సాగుతుంది.  యిది సాధారణముగా సుదీర్ఘమైన, కష్టతరమైన ప్రక్రియ.  ఒక పూర్ణజీవితములో సైతము ఈ ప్రక్రియ పూర్తికాదు.  ఈ కారణము వల్లనే యోగము జీవితము తర్వాతి జీవితముగా సాగిపోవు నిరంతర యానమని భావించుచున్నారు.  కానీ ఈ జీవితము తర్వాతి జీవితమును గూర్చి యెవరికి తెలియునుసాధించ వలసిన అంతిమ లక్ష్యము ఈ విధంగా నిరవధికంగా వాయిదా పడుతునే వుంటుంది.  కనుక మనం ఈ విషయమై తీవ్రంగా ఆలోచించవలసిన అవసర మేర్పడింది.  అందుకే విధానమును సరిచేసి మన అంతిమ లక్ష్యమును ఒక జీవిత వ్యవధిలోనే పొందునట్లు మార్పుచేసుకొనవలెను.

 

        నిజమైన యోగము నేరుగా ఆత్మతో సంబంధముగల అంతర్గత ఉనికియొక్క సూక్ష్మమనశ్శక్తి.  మనస్సు కేంద్రశక్తి గనుక మనిషిలోని బహిరంతరములన్నిటిని నియంత్రించును.  కనుక శరీర మాధ్యమమున జరుగుచున్న మంచి చెడ్డలన్నీ ప్రప్రధమంగా మనస్సునుండే బయల్వెడలును.  కనుక శరీర కృత్యములన్నిటిని క్రమబద్ధీకరించాలంటే, తదనుగుణంగా మానసిక వృత్తులను సరిదిద్దవలసి వుంటుంది.  అంటే అది కేంద్రము నుండి బాహ్యమునకు ప్రవహించు (పుష్పము మధ్యనున్న పుప్పొడి నుండి పూరేకుల వరకు ప్రాకు) విధానము.  అంటే మనస్సు నుండి భౌతిక శరీరమునకు ప్రవహించు సహజసిద్ధమైన గొప్ప ప్రతిభావంతమైన ప్రక్రియ.  కనుక ఈ ప్రయోజనమునకై మొదట చేపట్టవలసినది మనస్సునుండే గానీ శరీరమునుండి కాదు.  అందువల్ల మనస్సు మొదట సరియగు రీతిలో క్రమబద్ధీకరింపబడితే శరీరమును అదేపనిగా లెక్కలోనికి తీసుకోవలసిన పనిలేదు.  అది సహజంగానే మనస్సును వెంబడించి తదనుగుణంగా మారిపోతుంది.  ఈ విషయం తెలిస్తే మనపై విధించబడిన అష్టాంగయోగ భౌతిక సాధనలు మనకట్టే సరిపడవని నిశ్చింతగా మనం తలంచ వచ్చును.  కనుక అవి అనవసరంగా మనశక్తిని, కాలాన్ని హరిస్తున్నాయని అర్థమైపోతుంది.

 

        ఈ వాస్తవాలన్నీ తెలిసినప్పటికినీ సహజమార్గము, యోగ విధానములో అష్టాంగయోగ  విశిష్టతను దురభిమాన దృక్పదముతో చూడదు.  అంతేగాకుండా దాన్ని అంగీకరించి, మరింత సహజంగా ప్రతిభావంతంగా కేంద్రంనుండి బాహ్యమునకు పనిచేయు విధానంగా గ్రహించి తొలి అడుగులోనే మనస్సును క్రమబద్దీకరించునట్లు మార్చుకొన్నది.  కనుక ప్రక్రియలో మధ్యనున్న ధ్యానం, అనగా రాజయోగమునకు ప్రాధాన్యతనిచ్చు స్థానం నుండి ప్రారంభించి, హఠయోగ వ్యాయామ విధులను విడిచి పెట్టింది.  ఆఖరు మూడువిధానములు కూడా ధ్యానంలోని వివిధ అంగములేగాన, వాటినన్నిటిని ఒక ధ్యానంగానే స్వీకరిస్తున్నది.  ఈ విధంగా అష్టాంగయోగంలోని ఎనిమిదంగములు కలిసి ఒక ధ్యానంగానే మిగిలిపోయి భౌతిక, మానసిక, హృదయ సంబంధితమైన వాటినన్నిటిని సమగ్ర పరచి సర్వవిధములా సమర్థవంతమై యున్నది.  కనుక సహజమార్గము ధ్యానమునకు మాత్రము పరిమితమై అనవసరమైన అన్ని పొడిగింపులు, ప్రోద్భలములను ప్రక్కనబెట్టి భగవత్సాక్షాత్కారమనెడి ఒకేఒక లక్ష్యసాధనకై ఆద్యంతము ఒకేఒక ధ్యానప్రక్రియ ననుసరిస్తున్నది.

 

        సంక్షిప్తంగా చెప్పాలంటే సహజమార్గము ఒక సరిచేయబడిన యోగ విధానమును ప్రవేశపెట్టినది.  ఇది ఒక సాధారణ ప్రాపంచిక జీవనమునకు తగినదై జీవితములోని అన్ని సందర్భములకు అన్ని స్థితులకు అనువైనదై యుండడమేగాక సిద్ధాంతవ్యాఖ్యాతలు, తమనుతామే గురువులమని ప్రచారము గావించుకొను బోధకులు, మనపై రుద్ధిన అర్థరహిత ప్రయోజనశూన్యమైన విధులనన్నిటిని తొలగించి వైచినది.  ప్రత్యక్షానుభవమువల్ల మాత్రమే సాధకుడు ఈ విధానము యొక్క ప్రభావమును పరిశీలనాత్మకముగా వాస్తవము గ్రహించి సంతృప్తిజెందగలడు.

 

నిజమైన ప్రయోజనం

 

        ఎందుకొఱకు యోగము నభ్యసించుచున్నామో తెలిసికొనుట యేమంత కష్టము కాదు.  ప్రతి హృదయాంతరాళమున సత్యతత్త్వ సాక్షాత్కారమునకై తపన కలదు.  దానికి సంబంధించి స్పష్టమైన యెఱుక వ్యక్తికి లేకపోవచ్చును.  ఈ సహజ తపనను చల్లార్చుకొనుటకుగాను అనేక విధములైన సాధనలను అనేక వర్గములవారు ప్రవేశపెట్టిరి.  ఎన్ని విధానములు అందుబాటులో వున్నప్పటికి సమస్య మాత్రము యింకా విప్పబడని రహస్యముగానే కొనసాగుతున్నది.  అందులకనేక కారణములుండవచ్చును.  ఎందుకోసమీ పద్దతిని అనుసరిస్తున్నామో స్పష్టంగా తెలియక పోవడమన్నది ఒకానొక కారణం కావచ్చు.  ఆ అంతిమ సత్యాన్ని సాక్షాత్కరింప జేసికొనుడం కోసం యిది అత్యంత ప్రతిభావంతమైన మార్గమని నొక్కి చెప్పుకొనుచున్న యోగ విధానమునకు ముఖ్యంగా యిది వర్తిస్తుంది.  వాస్తవానికి యిదొక్కటే యోగము యొక్క ఉపయోగము.  అ అంతిమ సత్యాన్ని అంటే ఆ సూక్ష్మాతిసూక్ష్మ ఉనికిని సాక్షాత్కరింప జేసికొనుటకు వీలైనంత వరకు వ్యక్తి స్థూలత్వాన్ని వదిలించుకొనవలసి యుండును.  అప్పుడే మనం ప్రకృతితో అనుసంధానము గలుగునంతటి సూక్ష్మాతిసూక్ష్మ రూపమును పొందుదుము.  కానీ నేడు సాధారణముగా యోగసాధకుల మార్గము శక్తి సముపార్జన కొఱకై యున్నది, గానీ సూక్ష్మత వృద్ధి చేసుకొను దిశలో సాగుటలేదు.  యిది ఖచ్చితంగా తప్పు.  సాధకుని దృష్టి శక్తివైపు త్రిప్పబడి వుంటే శక్తే సమకూరుతుంది గానీ సూక్ష్మత యోగసాధన వలన యెలా వృద్ధి చెందుతుందివృద్ధి చెందదు.  మనము ధ్యేయంగా నిర్ణయించుకొన్న శక్తి, సూక్ష్మతకంటే నిస్సంశయముగా బరువైనది మరియు స్థూలమైనది.  తత్కారణమున శక్తినాశించి చేయు యోగసాధన నిస్సంశయముగా దారితప్పినదై పోయినది.  అందువలన అది యోగము స్థాయిని దిగజార్చివైచినది.  కానీ యోగసాధనలో కొన్ని అసాధారణ శక్తులుత్పన్నము కావచ్చును గానీ వాటినే ధ్యేయముగా గైకొనుట మాత్రము తప్పు మరియు మన అసలు ప్రయోజనమునునకు హానికరము.  అట్లు జనించిన శక్తిని ఉపయోగించరాదను శాస్త్రీయమైన ఆంక్షలు ఈ దృక్పదమునే బలపరచు చున్నవి.  అయితే శక్తిని సామాన్యంగా వస్తుతత్త్వ విషయములకే వాడవలెనందురు.  కానీ అది సరిగ్గా ఆట్లు కానేరదు.  వాస్తవానికి శక్తి దాని స్వస్వరూప స్థితిలో చైతన్యరహితము.  అది పదార్త సంయోగముననే చైతన్యవంతమగును.  అది ప్రాపంచికమునకు గాని లేక ఆధ్యాత్మికమునకుగానీ, దేనికైనను శక్తి ఉపయోగ పడవలెనన్న అది దాని ఉత్పత్తి స్థానం నుండి పదార్త సమస్థాయికి దిగిరావలెను.  అందువలన యోగశక్తులు గడించుట తుది ధ్యేయమనుకొనుట తప్పు.  అంతేగాదు అది యోగ సిద్ధాంతమునకే విరుద్ధము.

 

3. శరీర నాడులకు సంబంధించిన యోగశాస్త్రము

 

నాడీవ్యవస్థ

 

        నాడీమండల నిర్మాణము యోగి జీవనమున ఒక ముఖ్య భూమికను పోషించుచున్నది.  ఇది అన్ని యింద్రియ స్పందనలు, భావనలను నియంత్రించును.  మనిషిలోని జీవశక్తిగానున్న మనస్సుయొక్క కార్యకలాపములకు అనుగుణముగా ఈ నాడుల చర్యలుండును.  ఈ నాడీమండల నాడులు రెండు రకములుగా విభజింపబడి యుండును - అవి స్వాధీన నాడులు, అస్వాధీన నాడులు.  స్వాధీన నాడులను భౌతికముగా ఇచ్ఛానుసారము లేక అలవాటు బలముతో నియంత్రించ వచ్చును.  కానీ యెఱుక కందని అస్వాధీన నాడుల చర్య మన అధీనమున కతీతము.  ఈ నాడి మండల విధానమే యోగసాధన మార్గమున ముఖ్య పాత్రను పోషించును.  దీని కొఱకే యోగులు సాధారణముగా భౌతిక ప్రక్రియలైన ఆసనము, ప్రాణాయామము మొదలగు  విధులను చేపట్టుదురు.

 

        ఈ నాడీమండలము పూర్తిగా సూక్ష్మదర్శినితో మాత్రమే చూడనగు కణజాలముతో కూడియుండును.  అవియు విశేష ప్రత్యేకతగల్గి యుండును.  మెదడులో కూడియున్న కణములు మరియు వెన్నుపూసలో కూడియున్న కణజాలము అనుసంధానమై సన్నని నారవంటి నాడులు శరీరములోని కణకణమును కలుపుతూ వ్యాపించి యున్నవి.  అవి శరీరమునుండి మెదడుకు, మెదడునుండి శరీరభాగములకు స్పందనలను చేరవేస్తూ వుంటాయి.  యోగమునకు సంబంధించిన శరీర స్పందనా నాడులలో పది ముఖ్యమైనవి.  అవే వాయునాడులు.  వాటిలో మూడు మరీ ముఖ్యమైనవి.  అవి యిడ, పింగళ మరియు సుషుమ్న.  యిడ వెన్నుభాగమునకు యెడమవైపున నుండి, కుడి ముక్కు రంధ్రము వరకు సాగియుండును.  పింగళ యిదే విధంగా కుడి నుండి యెడమ ముక్కు రంధ్రము వరకు సాగి యుండును.  నిరంతరాయంగా పని చేసుకుపోతున్న ఈ సమతత్త్వ నాడులపై అదుపు సాధించినట్లయిన శరీర పనిభారమును తగ్గించి శరీర క్షీణదశను నిలుపుదల చేసి జీవన ప్రమాణమును పొడిగింప జేయును.  సుషుమ్న వెన్ను మధ్య భాగములో కొనసాగుతూ వుంటుంది.  ఇది లోపల కుండ నుత్పన్నం చేస్తుంది.  వెన్నెముక ఆఖరుభాగము దాదాపు బొడ్డు వెనుక వైపు వరకు వుంటుంది.  ఈ ప్రాంతం నుండి పైకి ప్రాకుతూ తలలోని సహస్రదళ కమలం వరకు వ్యాపించి వుంటుంది.  గొంతు ప్రాంతంలో ఈ సుషుమ్న మరో రెండుశాఖలుగా విడిపోయి వుంటుంది.  అందులో ముందు భాగము మెదడు పైభాగమున వ్యాపించి వుంటుంది. రెండవది వెనుక భాగపుశాఖ, మెదడులోనికి చొరబారి యుండును.  ఇది యోగము నందు చాలా ముఖ్యమైనది.  దీనిపై నియంత్రణ సాధిస్తే అన్ని యింద్రియ వ్యాపారములపై అధికారం లభిస్తుంది.

 

చక్రములు లేక పద్మములు

 

        వెన్నుపూసలోని నాడీకణముతో సుషుమ్న నాడి కలుపబడి అక్కడనుండి శరీరమునకు వ్యాపించి యున్నది.  వెన్నుబామును వదలిన తర్వాత అది శాఖోపశాఖలౌతున్నది.  అవి ఒకదానితో ఒకటి కలసి అనేకమైన అల్లికలుగా యేర్పడుచున్నవి.  అవే చక్రములుగా పిలువబడుతూ శరీరములోని వివిధ భాగములందమరి యున్నవి.  అవి అత్యంతోన్నత జీవశక్తి సమన్వితమైన ముఖ్య కేంద్రములు.  ఇవి ఉత్పాదిత నిరోధకశక్తి ప్రకోపమును నిలుపుదల చేయుట లేక అదుపులో నుంచ గలిగి యుండును.  ఒక్కో చక్రము ప్రత్యేక అణునాడితో అనుసంధింపబడి యెఱుక తప్పియున్న దాని చర్యల నందులో నిక్షిప్తము జేసుకొని యుండును.  ఆధ్యాత్మిక పురోగమన దశలన్నియు చాలావరకు వీటి యధీనముననే యుండును.  కనుక యిది యోగి పట్టుదలతో గూడిన ప్రయత్నమున యెఱుక గల్గి నిద్రాణస్థితి యందున్న ఈ కేంద్ర విభాగములపై పట్టు సాధించ వలసి యుండును.  ఈ కారణముననే చక్రములను శుద్ధి చేయుట అత్యావశ్యకమై యున్నది.  తద్వారా వాటిపై పొరల రూపమున పేరుక పోయిన స్థూలత్వమునుండి విముక్తి కలిగించవలెను.  కనుక యిది లక్ష్యసాధనమున, ఒక ముఖ్యమైన కార్యమైయున్నది.  ఎప్పుడైతే చక్రములు క్షుణ్ణముగా శుద్ధిచేయబడతాయో అప్పుడవి తమ అసలు వెలుగును సంతరించుకొని వాటి లోపల దాగియున్న లక్షణములను బయటకు ప్రవహింపజేస్తాయి.  దీనిని చక్రములను మేల్కొలుపుట అంటారు.  ఈ చక్రములు ఎప్పుడైతే మేల్కొల్పబడతాయో అప్పుడు మనము అతీంద్రియ యెఱుకకు సంబంధించిన సూక్ష్మోన్నత స్థాయికి చేరు మార్గములు సరళము గావింపబడతాయి.  కానీ ఈ చక్రములను భౌతిక పరమైన శక్తినుపయోగించి అనగా ఆసన, ప్రాణాయామ వంటి వాటి వలన బలవంతముగ మేల్కొల్పుతే నిజమైన మార్పు యెట్టి పరిస్థితులలోనూరాదు.  సూక్ష్మతకు బదులు శక్తి మాత్రముత్పన్నమౌతుంది.

 

        ఈ క్రింద తెలిపినవి ముఖ్యమైన ఆరు చక్రములు.

1. మూలాధార చక్రము:- ఆధారభూతమైన నాడులకలయిక. ముడ్డికి ప్రక్కన యేర్పడియున్నది.

2. స్వాధిష్టాన చక్రము:- పొత్తికడుపు నాడుల కలయిక.  కటిప్రదేశమునగలదు.  పురుషాంగపు మూలస్థానమునకు సమస్థాయిలో యేర్పడి యున్నది.

3. మణిపూరక చక్రము:- బొడ్డు భాగపు నాడుల కలయిక.  బొడ్డుభాగమున యేర్పడియున్న చక్రము. 

4. అనాహత చక్రము:-  గుండె భాగపు నాడుల కలయిక.  హృదయభాగమున యేర్పడియున్న చక్రము.

5. విశుద్ధి చక్రము:- గొంతు భాగపు నాడుల కలయిక.  కంఠభాగమున యేర్పడియున్న చక్రము.

6. ఆజ్ఞాచక్రము:- భ్రూమధ్య భాగపు నాడుల కలయిక.  రెండు కనుబొమల మధ్య ముక్కు మూలమున యేర్పడియున్న చక్రము.

 

 

 

                                                     షట్చక్రములు

 

 

  

మార్పుచేయబడిన ప్రక్రియ

 

        పురాతన విధానపు సాధన ప్రకారము ఈ చక్రములను, అధఃప్రాంతముననున్న దాని నుండి ఊర్ధ్వప్రాంతముననున్న దాని వరకు వరుసగా గ్రహిస్తారు.  సహజమార్గము పురాతన విధనములో మార్పులు చేసి తొలుత హృదయమునుండి ప్రారంభించి మొదటి మూడింటిని ప్రాధమిక దశలో వదలి వేయబడతాయి.  ఈ మార్పుకు కారణం హృదయం మానవుని కేంద్ర భాగమైయుండి రక్తాన్ని శరీరమంతటికి పంపిణీ చేస్తుంది.  గనుక ఈ స్థానంపై ధ్యానంచేస్తే, ప్రవేశపెట్టబడిన పవిత్ర సూక్ష్మపరమాణువులు, భక్తి శ్రద్ధలు శరీరమున కంతటికిని అందుండి ప్రవహించు రక్త ప్రసారము ద్వారా అందించబడును.  అందుచేత మొత్తము భౌతిక నిర్మాణమంతటా స్వతఃసిద్ధముగా యెఱుకలేకుండగనే శుద్ధి కార్యక్రమము కొనసాగుచునే యుండును.  ఈ దృక్పదము చేతనే అనగా హృదయముపై ధ్యానమును మహోన్నతులగు యోగబోధకులు, పతంజలిఋషితో సహా చాలమంది ప్రోత్సహించిరి.  ఏకాగ్రత కొఱకు యితర స్థానములు కూడా కలవు గానీ అవి అంతగొప్పగా ఉపయోగపడవు.  సహజమార్గము హృదయముపై ధ్యానమును అత్యంత ప్రతిభావంతమైనదిగా చెప్పి ప్రోత్సహించుచున్నది.  ఈ హృదయస్థానము నుండి మన గమనము ఉన్నతములైన విశుద్ధి, ఆజ్ఞాచక్రముల వైపుకు పైపైకి సాగుతుంది.  అందువలన మొత్తం ఆరు చక్రములలో పైమూడింటిని మాత్రమే గమనంలో గ్రహించి మిగిలిన మూడింటిని ప్రక్కన బెడుతున్నాము.  ఆ విడచిపెట్టినవి కూడా కొంతవరకు సహజసిద్ధంగానే హృదయ శుద్ధీకరణ ప్రక్రియద్వారా శుద్ధీకరించ బడుతున్నవి.  హృదయంలో శుద్ధీకరింపబడిన రక్తప్రసారం శరీరమంతటా వ్యాపించడంతో ఈ శుద్ధీకరణ జరిగిపోతున్నది.  అంతేగాకుండా ఈ చక్రములను మేల్కొల్పి ప్రకాశవంతం చేయవలసిన అవసరం కూడా ఈ దశలో మనకులేదు.  ఎందుకంటే అందువలన ఉత్పన్నమైన పదార్తశక్తి దురుపయోగం గాకుండా కూడా మనం ముఖ్యంగా రక్షింపబడతాము.  పరిపక్వత చెందినపుడు అవికూడా వాటికవే మేల్కొల్పబడతాయి.  కాకపోతే వాటి సదుపయోగం అవసరమైనప్పుడు గురువుగారి శక్తి ప్రతిబింబించి మేల్కొల్పు జరిగిపోతుంది.  ఈ ప్రక్రియ ఉన్నతస్థితులలో ముఖ్యంగా ప్రకృతి కార్యనిర్వహణము అప్పజెప్పబడినప్పుడు జరుగుతుంది.  ఈవిధంగా మార్చబడిన యోగపద్దతి వలన ప్రక్రియలో సగం చక్రములు తొలగించబడి మన శ్రమ చాలావరకు తగ్గించబడింది.  ఈ విధంగా యోగ మార్గంలో గ్రహించ వలసిన ఆరు చక్రములను సగానికి తగ్గించడం వలన అభ్యాసికి చాల మట్టుకు కాలము, శ్రమ ఆదా చేయబడింది.

 

 

తంత్రము

 

        యోగ మార్గంలో మనిషి భౌతికస్థాయి నుండి ముందుకు కదిలి నియమింపబడిన విధానంలో వివిధ కేంద్రములను గ్రహిస్తూ వాటిని శుద్ధీకరించుకుంటూ మార్పుజేసుకుంటూ కొనసాగుతాడు.  ఎప్పుడైతే అవి మార్పుకు గురౌతాయో అప్పుడు వాటి సహజ లక్షణాలు విడుదల కాబడి ప్రకృతి సిద్ధమైన వాటి చర్య దాని పద్ధతిలో దానికైఅదే ప్రారంభింపబడుతుంది.  వాటి సహజసిద్ధమైన వృత్తి అంతిమ సత్యం వైపు మరల్చ బడుతుంది.  ఈ లక్షణములను సామాన్యంగా శక్తులని అర్థము చేసుకున్నప్పటికి వాటిని అలా తలంచడానికి వీలులేదు.  కారణం పదార్తస్థాయిలో వాటిని గమనించదగ్గ భౌతిక చర్యలేవీ లేవు.  అవి కనీసం సాధకుని మనస్సును ఆకర్షించడం లేదు.  సాధకుడు అవి ఉన్నాయన్న విషయాన్ని కూడా విస్మరించి వుంటాడు.  అవి మన యెఱుక గల్గిన స్థితికి అందుతాయి, కానీ వాటిగమనాన్ని  దారిమళ్ళించి తద్వారా వక్రగతి యేర్పడినప్పుడే అలా జరుగుతుంది.  ఈ వంపు తంత్రముల విషయంలో యేర్పడుతుంది.  యెప్పుడైతే వ్యక్తి వాటిని శక్తులుగా గుర్తించడం ప్రారంభించి వాటిని వృద్ధిపరచుకొని తదనుగుణ సాధనలననుసరించి, వాటిని భౌతిక ప్రయోజనములకు వాడుకొన యత్నిస్తాడో అప్పుడు వంపు యేర్పడుతుంది.  భావింపబడిన శక్తి హృదయపు లోతులలో వాటిని ప్రదర్శించాలనీ, ఉపయోగించాలని ఉత్సాహపరుస్తుంది.  అయితే శక్తి ప్రయోగానికి ఒక పదార్తం ఆధారంగా వుండితీరాలి.  కనుక అత్యంతోన్నత సూక్ష్మస్థాయి నుండి ఈ వక్ర, వంపురేఖ సాధకుని తొల్లింటి ప్రారంభపదార్త స్థాయికి దించేస్తుంది.  ఈ రహస్య, మహిమాన్విత తాంత్రిక విధానములకు ఈ విధంగా దారి యేర్పడుతుంది.  అందువలన తంత్రమనునది, కేవలం శుభ్రమైన, సరళమైన పదార్తస్థితి.  ఇది ఆధ్యాత్మిక స్థాయికి బహుదూరమున నున్నది.  ఇట్టి తంత్ర సాధకులు ప్రముఖంగా శక్తి ప్రదర్శనతో గొప్పలు చెప్పుకొనుటకు వస్తుసంపాదనకు యెక్కువగా ప్రాకులాడుదురు.  ఇది అనేక అసాధారణ విధానములకు దారితీసి స్వార్థపర లక్ష్యసాధనకు యోచనాశక్తిని వినియోగింపజేసి నష్టపరుస్తుంది.

 

సిద్ధులు

 

        యోగ విధానంలో చక్రములను శుద్ధిచేయుట అత్యంత ప్రధానాంశము.  యెప్పుడైతే ఈ కేంద్రములు శుద్ధిచేయబడి మార్పుజెందుతాయో అప్పుడు వాటి ప్రత్యేక లక్షణములు బయల్పడి వాటికి సంబంధించిన సహజచర్యలు స్వతఃసిద్ధంగా మొదలౌతాయి.  చక్రములో నిక్షిప్తమైయున్న ప్రకృతిసిద్ధ విశేషశక్తులను అనేక వక్రమార్గముల తప్పుగా విశ్లేషించి విశ్వాసహీన పరిస్థితిని కల్పించుచున్నారు.  ప్రతి చక్రము తన ప్రత్యేక లక్షణయుక్తమైన శక్తిని గలిగియుండి, ఆశక్తి చక్రమును మేల్కొలిపినప్పుడు ప్రభావము చూపుతున్నది.  భౌతిక విధానములతో ఆ చక్రములను బలవంతముగా ప్రేరేపించినయెడల చాలావరకు సిద్ధులు (అద్భుతములు ప్రదర్శించు విద్యలు) ఉత్పన్నమగుచున్నవి.  ఇవే సామాన్యముగ యోగఫలితములు పొందినవనుటకు సాక్ష్యముగా గుర్తింతురు.  ఉదాహరణకు, పక్షివలె గాలిలో యెగురుట, నేలమీద నడచినట్లే నీళ్ళపైనడచుట లేక రగులుతున్న అగ్ని మధ్యమున హానిలేకుండా నిలిచియుండుట వంటివి కొన్ని, చక్రముల మేల్కొలుపుట వలన కలిగిన శక్తులుగా చెప్పుచున్నారు.  కానీ యిట్టివన్నీ పైకి చూచుటకే అసంబద్ధములుగానున్నవి, ఉత్తుత్తి ఊహాజనితములై యున్నవి.  ఇవి తమాషాగా అద్భుతంగా చెప్పుకొనే పక్షుల, జంతువుల కథలవలె యేనాడు నిజజీవితంలో జరగనివి సాక్ష్యరహితము అనుభవరహితములైన కట్టుకథలు.  అయితే యిట్టివి కొంతమంది అసాధారణశక్తులపై మక్కువగల వారిని మభ్యపెట్టి తమనుతాము అసాధారణ మహాత్ములుగా కనపరచుకొనుటకు చేయు కుయుక్తి.  వారు స్థిరముగా చెప్పు ఈ విషయములోనూ ఒక వాస్తవమున్నది.  అది సరిగ్గా అర్థము కావడములేదు.  కాని వారు సామాన్య జనం ముందు వివరిస్తున్నది మాత్రం నిస్సందేహంగా స్థూలము, లోపభూయిష్టము మరియు గందరగోళము కలిగించేదిగా వున్నది.  ఒక విషయం చూద్దాం.  గాలిలో ఎగరడమంటే బహుఃశా వ్యక్తిలోని సాంద్రతను తగ్గించడం కావచ్చు.  అది సూక్ష్మత వైపునకు పురోగతి కావచ్చు.  అది వాస్తవానికి యోగి పట్టుదలతో చేసిన సాధనా ప్రభావమై వుండవచ్చు.  ఉన్నత దశలలో ఈ స్థితిని, కొన్నిసార్లు వివరిస్తూ అది గాలికన్నా తేలిక అన్నారు.  దీన్ని సాధించటానికి అదేవిధమైన తేలికదనం వ్యక్తిలోనూ కలగడం అవసరం.  దీన్ని గాలిలో శక్తి అని అన్వయించడం తప్పు మరియు తప్పుత్రోవ పట్టించడం కూడా ఔతుంది.

 

        కొంత అతీతమైనశక్తి ఈ జీవకేంద్రములను కాంతివంతం జేయడం వలన కలుగడం తథ్యం.  కానీ అది సాధకుడు అంతగ పట్టించుకొను విషయం కాదు.  కానీ అలాకాక అతడు లోలోన దానివైపే మొగ్గుచూపుతూ దాన్ని శక్తిగా మార్పుచేసుకోవడనికి తన ఇచ్ఛాశక్తిని ప్రయోగిస్తే అప్పుడు దాని విషయం వేరు.  అటువంటి సందర్భములో అతని మనస్సు కేవలం అద్భుతముల వైపు మరలి, అసలు ధ్యేయం మొత్తం కనుమరుగౌతుంది.  సిద్ధులనేవాళ్ళు వారి మహిమలు విశేషించి చెబుతూ ప్రదర్శనలిస్తారు.  ఈ విధంగా వారు ప్రాపంచిక అవస్థలు, కష్టాలతో సతమతమౌతున్న మామూలు జనాన్ని వారి వైపునకు త్రిప్పుకొనే ప్రయత్నం చేస్తారు.  వారు బహిరంగ పిలుపుద్వారా కొడుకు కావాలని కోరుకొనేవారిని, కష్టాల నుండి బయటపడాలనే వారిని, ఇదే మాదిరి స్వార్థకోరికలున్న వారిని ఆకర్షిస్తారు.  మరింత స్పష్టంగా చెప్పాలంటే వారు వారి వ్యాపారాన్ని ఈ విధంగా యేర్పాటు చేసుకొని ధనసంపాదన కోసం ఊళ్ళు తిరుగుతుంటారు.  దీన్ని వారు నిరంతర వ్యాపారంగా మార్చుకొని, అందుకోసం బాగానే వసూలు చేస్తారు.  ఇక్కడొక విషయం చెప్పడం అసందర్భంగా తలంచక మీకు మా గురువుగారి విషయంలో జరిగిన సంఘటన వివరిస్తాను.  ఒకసారి కనీసం ఇరవైకిపైగా అనేక చోట్ల వ్యాపారసంస్థలు గల ఒక ధనవంతుడు గురువుగారి ఘనతను గూర్చి తన స్నేహితునిద్వారా విని, మీ గురువుగారు నేను ఔరా! అనగలిగిన మహిమ నాకు చూపించగలిగితే నా యిరవై వ్యాపారసంస్థలన్నింటిని ఆయన పేరునకు బదలీచేసి ఆయనకే అప్పగించేస్తానన్నారు.  ఆ విషయం ఎలాగో  గురువుగారి చెవినబడింది.  దానికాయన మృదువుగా యిలా జవాబిచ్చారు.  "దయచేసి ఆ వ్యాపారిని ఒక బలిష్టమైన గాడిదను వెతుక్కోమనండి.  అదైతే ఆయన ధనభారాన్ని బహుఃశా మోయగలదు."  ఈ జవాబు విన్నంతనే అతడు తప్పును గ్రహించి తన తెలివితక్కువదనానికి పశ్చాత్తాప పడ్డాడు.  ఒక్కమాటలో చెప్పాలంటే, సామాన్య జనావళి మానసిక పరిస్థితి ఈ విధంగా వుండి, తద్వారా వారు మోసపూరిత అద్భుత ప్రదర్శకుల వాతన పడుతుంటారు.

 

        మనము అధునాతనమైన జ్ఞానము మరియు అభివృద్ధినొందిన పరిజ్ఞానము కలవారమైనప్పటికిని, అద్భుతము వాస్తవమైనదా లేక హాస్యాస్పదమైనదా అని తేల్చుటలో తరచు యిబ్బంది పడుచుందుము.  మనము చూచిన లేక నమ్మిన ప్రతి విషయాన్ని హేతుబద్దంగా వివరించడానికి వీలౌతుంది కానీ ఒక అద్భుతాన్ని మాత్రం ఆ విధంగా వివరించడం కొన్ని సందర్భాలలో చాలాకష్టం.  కొన్ని అద్భుతాలు మోసగించే తంత్రాలుగా బహుజాగ్రత్తగా చాకచక్యంగా పైకి నమ్మకం కలిగించేట్లు యేర్పాటు చేయబడి వుంటాయి.  ఒక్కోసారి ఈ చిత్రాతి చిత్రాలైన మహిమలు, శక్తి విన్యాసాలుగా చూపిస్తూ రహస్యాలను అర్థముకాని ముతక భాషలో మాట్లాడి వాటికి రకరకాల వ్యాఖ్యానాలు చేస్తుంటారు.  సాధారణంగా ఈ యోగవిన్యాసాలు మరియు భక్తిపారవశ్య గందరగోళాలు కూడా ఒకే విధమైనవిగా భావించవచ్చును.

 

        మరోవైపు గమనిస్తే కొన్నింటి విషయాలలో ఈ అద్భుతాల వాస్తవత్వాన్ని నమ్మక తప్పదనిపిస్తుంది.  అటువంటి మహిమలు దేహనాడులను కొన్ని ప్రత్యేక పద్ధతుల ద్వారా ఉత్తేజపరచడంద్వారా ప్రదర్శించి యుండవచ్చును.  అట్టిశక్తులు చైతన్యవంతం కావడానికి యోచనాశక్తిని, లేక ఇచ్ఛాశక్తిని బలంగా ప్రయోగించి బహిర్గతపరచి యుండవచ్చును.  సామాన్యార్థంలో మామూలు జ్ఞానపరిధిలో యేమైనప్పటికిని వాటిని వివరించుట కష్టము.  అసలుప్రశ్న ఈ మహిమలు చూసేవారికేనా? లేక చేసేవారికిగూడా మహిమలుగా అనిపిస్తాయా? అని.  చూసే వారికి కనబడే అద్భుతం చేవాడికది అద్భుతంకాకపోవచ్చు.  ఎందుకంటే అతడావిద్యను ఒక ప్రత్యేకకళగా ప్రేక్షకులకు తెలియని రీతిలో నేర్చియుండవచ్చును.  ఉదాహరణకు ఒక వ్యక్తి గోతిలో కూర్చొని పూర్తిగా యేవైపునుండి గాలిరాని రీతిలో పూడ్పించుకొని రాత్రంతా వుండి పొద్దున్నే బ్రతికి బయటకు రావచ్చును.  ఏమీతెలియని మామూలు మనిషికది ఒక అద్భుతము.  కానీ శ్వాసనదుపుచేయు విద్య నొక్కింత యెఱిగిన వానికిది నిరంతరభ్యాసముగా ప్రాణాయామము చేయుటచే లభించిన విద్యా ఫలితము.  కనుక చాల విషయాలలో సామాన్యుల స్థాయికి అద్భుతములైనవి, ఆ కళనభ్యసించి గ్రహించిన వానికది చిత్రము కాదు.  దాన్ని పరిశీలనాత్మకముగా ఒక విద్య నాధారముగా గైకొని దాని మర్మములను వివరింపగలవారు, అందరూ గాకపోయినా కొందరైనా వుండవచ్చును.

 

        ఈ రహస్యాన్ని ఈ విధంగా కూడా విడగొట్టవచ్చును.  ఈ ప్రదర్శనల పరమార్థాన్ని గమనిస్తే చాలామంది విషయంలో యిది వ్యక్తిగత లాభాన్నాశించి గానీ లేక వారి గొప్పతనాన్ని, ఔన్నత్యాన్ని చూపుకొనుటకుగానీ కాకపోతే బహుఃశా వారి గురుత్వపు సమూహములోనికి ఆకర్షించే ఒక మోసపురిత ప్రక్రియగా కాని ఉపయోగపడుతున్నది.  ఈ పరిస్థితులలో దాదాపు ప్రతి అద్భుతము ఒక గమ్మత్తేగాని సత్యము కాదు.

 

        కానీ మొత్తము విషయాన్నంతా యిలా తీసిపారేయడం కూడా న్యాయంకాదు.  కొన్నిసార్లు నిజమైన శక్తిమంతులైన సాధువులు లేక గొప్ప మతస్థాపకులు ఇట్టి సంచలనాత్మక అద్భుతములుచేయు సమర్థత కలిగియున్నారు.  ఇట్టివి సామాన్య దృష్టికి అద్భుతములుగా కనబడినప్పటికి అవి పైన చర్చించిన వాటి జాబితాలోనికి రావు.  ఇవి సామాన్యముగా నిజమై ఆవశ్యకత వచ్చినప్పుడు మాత్రమే కార్యరూపము ధరిస్తాయి.  ఇవి సూక్ష్మశక్తుల ప్రభావంతో చేశారనుకుంటున్న మహనీయుని ఆలోచన లేక ఉద్దేశ్యముతో ప్రమేయం లేకుండానే జరిగిపోతాయి.  వాటికైఅవే కనీసపు యోచనాబలం గానీ లేక ఇచ్ఛాశక్తిగానీ ప్రయోగించకుండానే యింకా చెప్పాలంటే ఆ మహనీయుని యెఱుకలోని జ్ఞానపు జోక్యం కూడా లేకుండానే అవి సంభవిస్తాయి.  అటువంటి అద్భుతాలను, అవి అద్భుతాలని మనమంటున్నాం.  అవి విశ్వశ్రేయస్సు కొఱకు ఒకానొక మహాత్ముని మాధ్యమంగా జరిగే మహనీయ కార్యకలాపాలు.

 

 

 

 

కుండలిని

 

        అటువంటి శక్తులన్నిటి కేంద్రాన్ని సామాన్యంగా కుండలినీశక్తి యని అర్థము చెబుతున్నాము.  ఇది మనిషిలోని సూక్ష్మజీవశక్తి. ఇది శరీరములో అడుగుభాగమున బొడ్డు ప్రాంతమున నున్నది.  ఇది కటిప్రాంత నాడుల అల్లికయొక్క కలయికగా శరీర శాస్త్రమున చెప్పబడియున్నది.  దీనిని చుట్టచుట్టుకొనియున్న సర్పముగా గ్రహిస్తున్నారు.  ఇది గొప్ప శక్తి గలిగినదిగాను, యోగ విధానమున అందునా హఠయోగమున మిక్కిలి ప్రాధాన్యత వహించినదిగాను, ఇదే అసలు యోగి యొక్క నిజమైన గమ్యముగాను భావింపబడుచున్నది.  ఈ కుండలిని యొక్క చర్య భౌతికస్థాయిలో యెటువంటిదో తెలియదు.  సామాన్య స్థితిలో ఇది నిద్రాణముగా పడుకొనియుండి యెఱుక గల్గిన మరియు యెఱుకలేని శరీర నాడులనేమాత్రం పట్టించుకొనక స్తబ్దతగా నున్నట్లు కనబడుతుంది.  అయితే ఇది మేల్కొంటే అన్ని ముఖ్య శరీర కేంద్రములను ప్రభావితం చేస్తుంది.  కుండలిని మేల్కొనడమనేది అభివృద్ధి చెందిన ఉన్నత దశలో పరిణితి నొందిన సమయంలో దానికై అదే (కుండలిని) మేల్కొంటొంది.  కాకపోతే పాత పద్దతి ప్రకారం ఆసన, ప్రాణాయామ మొదలైన భౌతిక వ్యాయామ విధానముల ద్వారా బలవంతముగా మేల్కొల్పవచ్చును.  నూతన దృక్పదం ప్రకారం కుండలిని మేల్కొన్నదంటే అది వెన్నుపూస వెంబడి ఒక కొస నుండి మరొక కొస వరకు విజృంభిస్తుంది.  అప్పుడు దాని తల భాగము శిరస్సునందలి సహస్రదళ కమలము నందును తోక భాగము మూలాధారస్థానము వరకును చాచబడి యుండును.  దాని ప్రభావము వెన్నుపూసద్వారా ప్రవహించి అక్కడనుండి నరములద్వారా చక్రములు చేరి అక్కడ దాని శక్తి ప్రతిఫలించును.  దీనిని సామాన్యంగా చక్రభేదం అని పిలుస్తారు.  అంటే చక్రములను తోలుచుకొంటూ వేళ్ళడమన్నమాట.  కుండలిని మేల్కొనడంతో చక్రములన్నీ సహజంగా మేల్కొన్నట్లే లెక్క.  కుండలిని మేల్కొన్నదంటే అసాధారణ ప్రకృతిగల గొప్పశక్తులన్నీ వశమైనట్లే విశ్వసిస్తారు.  వాటినే సిద్ధులంటారు.  వాస్తవానికి ఈ కుండలిని సాధించడమే ధ్యేయంగా చాలామంది యోగాభ్యాసకులు శ్రమిస్తారు.  కానీ నిజం చెప్పాలంటే వాస్తవధ్యేయ ప్రాప్తికి ఈ శక్తిని చాలా దూరంగా వుంచుతారు.

 

        ఈ రహస్య శక్తుల గూర్చి గురువుగారు కనుగొన్న మహత్తరమైన విషయములు గమనిస్తే అవి మరింత శాస్త్రీయంగా వివరణనిస్తున్నాయి.  ఆయన కుండలిని చుట్టచుట్టుకొనియున్న సర్పంగా గాక రెండు కొసలు అతగబడని ఉంగరంగా ఉందన్నారు.  ఆ రెండుకొసలు ఒకదానికొకటి కాస్తా దూరంగా జరపబడి వుండి, ఆ రెండుకొసలు ఒకదానికొకటి యెదురుగా వుండి శక్తి ప్రసార ద్రువాలుగా పనిచేస్తున్నాయి.  వాటిలో ఒకటి ధనద్రువము రెండవది ఋణద్రువము.  ఒక్కో ద్రువము నుండి ఒక్కోశక్తి రెండవదానిలో ప్రవహించి దానిలోఅదే ఒక వలయాన్ని పూర్తిచేస్తూ వున్నది.  ఈ కారణం చేతనే కుండలినీ శక్తి యొక్క చర్య తనకే పరిమితమై వుండిపోయినది.  అందువలన శరీరములోని యేయితర భాగమును అది ప్రభావితము చేయకుండా వున్నది. కానీ మేల్కొన్నప్పుడు దాని రెండుకొసలు యింకొంచము దూరం జరిగి కాస్తా పైకి మరలుతాయి.  అప్పుడు శక్తి, కొసలనుండి బయటికి ప్రవహించడం వలన కుండలిలోనే నిక్షిప్తంగాకుండా సుషుమ్ననాడి గుండా పైకి ఎగబ్రాకుతుంది.  అది అప్పుడు ఒక పెద్దవలయమై క్రిందినుండి పైనున్న సహస్రార కేంద్రం వరకు వ్యాపిస్తుంది.  ఈ సందర్భంలో కేవలం భౌతికమైన నాడులే చక్కగా అయి వెన్నుపూసలగుండా సాగడం గాకుండా, కుండలిని నుండి యెగబ్రాకిన శక్తి వలయం కూడా విశాలమౌతుంది.  అలా కుండలిని మేల్కొల్పడం వలన ఉత్పన్నమైన మహత్తరశక్తిని అనేక విధాలుగా తరచూ అపార్థము చేసుకొంటూ వుంటారు.  కొన్ని సందర్భాలలో అపరిపక్వ కుండలిని మేల్కొల్పును భౌతిక పద్ధతులలో బలవంతంగా తెప్పించి, ఉత్పన్నమైన శక్తిని వస్తులాభములకై వినియోగింతురు.  ఇట్టి సందర్భములలో కుండలినీ మేల్కొల్పును కేవలం వస్తుసముపార్జనా ధ్యేయంగా పెట్టుకొని తెచ్చినదైనందు వలన అది యోగమునకు హానికారకము.  వాస్తవానికి కుండలిని యింద్రియ కార్యకలాపములకు మూలస్థానము, ఈ కార్యకలాపములను కుండలినిని మేల్కొల్పడం ద్వారా నియంత్రించవచ్చును.  దీనితో దివ్యజ్ఞానముదయించి ప్రకృతి తెరచిన పుస్తకమువలెనగును.  కుండలినితో సముపార్జించిన మహత్తరశక్తి ప్రకృతి కార్య నిర్వహణకై ఉపయోగపడవలెను. దీనిని మహోన్నతస్థాయికి చెందిన యోగి ఆట్టికార్యములకు వినియోగించకుండా వుండలేడు.  ఇది యేవిధంగాను తుది ధ్యేయం కాదు, ఒక యోగి అనడానికి ఆధారభూతమైన అర్హతాకాదు.  అంతేగాకుండా ఆధ్యాత్మికోన్నతి కొఱకు సహాయపడు ముఖ్యాంశమూ గాదు.   యోగి ఒక సమున్నత దశకు పురోగమించగానే తప్పక కుండలిని మేల్కొంటుంది. అంటే సాధకుడు బలవంతంగా భౌతిక శక్తినుపయోగించి కుండలినిని ప్రేరేపిస్తేనేగాని  నిజమైన యోగి కాదనడం సరికాదు.  చాలా సందర్భాలలో బలవంతంగా కుండలినీ మేల్కొనజేయడం వలన స్థూలమైన దుష్పరిణామాలు కలిగాయి.  కనుక కుండలిని ప్రకృతిసిద్ధంగా మేల్కొనడం ఒక ఆస్తివంటిదైతే, తద్విరుద్ధంగా మేల్కొనబడిన కుండలిని పరమనీచమైన పిశాచము వంటిది.  కనుకనే దీని యెడల బహు జాగ్రత్త గైకొనవలసి యున్నది.  అపరిపక్వ దశలో దీనిని మేల్కొనజేయు యత్నం యేపరిస్థితులలోనూ చేయరాదు.

 

        ఈ విషయంలో మాగురువుగారి దృక్పదము ఈ విధముగా నున్నది.  ఇది ఆయనకు తెలియబరచబడిన రహస్య దివ్యశక్తి నాధారముజేసుకొని చక్కగా ఈ కుండలిని మర్మమును విశదీకరించిరి.

 

        "సహజసిద్దముగా మేల్కొన్న కుండలిని, నిద్రాణదశలోనున్న శక్తిని కార్యరూపమునకుదెచ్చి మహోన్నత అతీంద్రియ గ్రంధిముడులను విప్పే ప్రక్రియకు పూనుకుంటుంది.  అంటే దివ్యజ్ఞానోదయమన్నమాట.  వ్యక్తి సూక్ష్మత వైపుకు పురోగమించే కొద్దీ ఈ జ్ఞానము పెంపొందుతూ పోతుంది.  మనోమండలం దాటిన తర్వాత మనం వెలుగనబడు యేడు వలయాల పరిధిలోనికి (రాజయోగ ప్రభావము చూడుము) ప్రవేశింతుము.  ఆవిధంగా గడించిన దివ్యజ్ఞానము అతి సున్నిత సూక్ష్మస్థితిని పొందుతూ ముందుకుసాగి వ్యక్తి మూడవ వలయం చేరగానే ప్రకృతితో అనుసంధానం గలిగి దానికై అదే స్వతఃసిద్ధముగా పనిచేయడం మొదలౌతుంది.  యేడు వలయాలు దాటేసరికి ఈ పని ఆఖరుదశకు చేరుకుంటుంది.  ఈ ఆఖరుదశ అనునది మానవసాధ్యమగు మహోన్నత దశగా పరిగణించబడుతుంది.  ఈ కుండలినీ చర్యను గమనించిచూస్తే ఉన్నతోన్నత స్థితులలోకంటే అది తొలి దశలలో స్థూలంగా వుంటుంది.

 

        "మనసులో వుంచుకోవలసిన ముఖ్యాంశమేమనగా ఈ కుండలినిని మేల్కొల్పడం మనిషి విమోచనానికి అసలవసరంలేని పని, చేపట్టక తప్పదన్న పనికానేకాదు.  అలాభావించేవారు దాని విషయం గ్రహించాలంటే వారివారి హృదయాలను పరిశీలించి వాస్తవాన్ని నిగ్గుతేల్చుకోవచ్చు.  తమ మార్గంలో సహాయపడుతున్నది ఈ కుండలినియా? లేక వారి వాస్తవ ఉనికి ప్రాధాన్యతా? అన్నది అంతటితో తేలిపోతుంది.  వారు ఈ విషయంలో కుండలిని తమకేమాత్రం సహాయపడలేదని, దీనికై వినియోగించిన సమయము, శక్తి వృధా అయిపోయినవన్న నిర్ధారణకు తప్పక వస్తారు.  అంతేగాదు చాలా సందర్భాలలో యిది దురాచారముల వైపుకు, స్థూలాతి స్థూల ఉపద్రవముల వైపుకు దారి మరలించినదని తెలుసుకుంటారు.

 

        నేనిటీవల చేసిన పరిశోధనల ప్రకారం కుండలిని సూక్ష్మరూపంలో వుంటుంది.  సహస్రారలో వున్న అణువులను పోలిన అణువులే ఇందులో వుంటాయి.  ఇందులో వుండే కణాలు మెదడు కణాలను చాలావరకు పోలివుంటాయి కాని కుండలిని కణాలు కాస్త శంఖాకారంగా వుంటాయి.  ఇదొక్కటే తేడా.  పరిపక్వదశలో మేల్కొల్పబడినపుడు శంఖాకార కుండలినీ కణాలు దాదాపు గుండ్రంగా మారతాయి.  వాటి పైభాగాలు కొద్దిగా పైవైపుకు మరలి వుంటాయి.  ఈ మార్పు జరిగిన తర్వాతనే బలవంతమైన శక్తి భగవదీయ కార్యమునకు ప్రకృతిసిద్ధంగా సంసిద్ధమై కార్యోన్ముఖమౌతుంది.  హఠయోగమున చేసినట్లు కుండలిని బలవంతంగా మేల్కొల్పితే శంఖాకారముననున్న కణములు అలానే మార్పేమి లేకుండా వుంటాయి.  అటువంటప్పుడు వాటి ఉపయోగము ఆధ్యాత్మికపరంగా యేమీ వుండదు.  ఆ ఉత్పన్నశక్తి మొత్తం పదార్తస్థాయికి మర్లింపబడి చెప్పవీలుకాని అనేక ఉపద్రవములకు దారితీయును.  ఇదే స్థితి, అనగా ఈ శంఖాకారములు యితర కేంద్రములలో లేక చక్రములలో స్థావరమేర్పరుచుకుంటే నియంత్రించలేని చెడు జరిగిపోతుంది, తద్వారా అతిదారుణమైన రాక్షసత్వం ప్రబలిపోతుంది.  సరిగ్గా యిట్లే రావణునిలో జరిగింది.  జీవకేంద్రాలు లేక చక్రాలు కుండలినితో సహా అన్నీ గట్టి శంఖాకారములోనికి మారి, మార్పుచేయడానికి వీలేలేకుండా తయారయ్యాయి.  అట్టిస్థితిలో వినాశనము తప్ప వేరు గత్యంతరమే లేకపోయింది.  ఈ ఉదాహరణ ద్వారా మనకర్థమైనదేమంటే కుండలినిని మేల్కొల్పడం కాదు మనం చేయవలసినది, కానీ దాని సక్రమమైన మార్పే అవసరమైనది.  కనుక ఈ జీవకేంద్రాన్ని సరిగ్గా మార్పుచేయబడక మేల్కొల్పడం కంటే దానిని నిద్రావస్థలోనే వుండనివ్వడం శ్రేయస్కరం.  హఠయోగ విధానం ద్వారా యిట్టి శుభపరిణామము కష్ట సాధ్యము.  ఎందుకంటే అభ్యాసియొక్క దృష్టి శక్తిగడించుట యందున్నంతగా సూక్ష్మతవైపు వుండదు.  ఇటువంటి సందర్భములలో మార్పు ఒకవేళ తేవాలంటే అది మహోన్నతస్థాయికి చెందిన దివ్యశక్తులుగల గురుదేవుల సామర్థ్యముననే సాద్యపడును.  అట్టి మహనీయుడు దొరకవలె, మరియు అందుబాటులోనూ వుండవలెను.

 

        వెన్నుపూస ద్వారా కుండలినీశక్తి ప్రసార ప్రక్రియకు సంబంధించి యిప్పటివరకు కనుగొనబడిన మరొక ముఖ్యాంశమొకటున్నది.  మామూలుగా హఠయోగముద్వారా మేల్కొల్పబడిన కుండలినీ శక్తి నిటారుగా వెన్నుబాము ఒక కొస నుండి మరొక కొసకు పైకిపోతుంది.  జ్ఆగృతమైనశక్తి మామూలుగానైతే సహస్రారమూలముననున్న అత్యున్నత బిందువునుండి క్రియారూపము దాల్చవలసియుండును, కానీ ఆ బిందువు శుద్ధీకరించని అశుద్ధస్థితిలో నుండుటవలన ఆక్రియకు ఆటంకమేర్పడినది.  అందువలన అది సహస్రారంలోని సూక్ష్మస్థానములలో అనుసందించుకొనలేక పోతుంది.  అప్పుడది క్రింది స్థానములైన పదార్త స్థానములకు మళ్ళింపబడుతుంది.  రాజయోగంలో కుండలినీశక్తి, కేంద్రం వద్ద వెంట్రుకవాసి సన్నని వాలుతో ధనుస్సువంటి వంపుగల్గి పైకిలేస్తుంది.  ఇది శక్తిని చక్కని ప్రకృతి నిర్మిత పథమునకు నియంత్రించి సున్నిత సూక్ష్మస్థితులకు మళ్ళిస్తుంది.  ఈ విధానంలో మార్పు సహజసిద్ధంగా సంభవించి, తత్ప్రక్రియానుఫలితంగా అందులోని స్థూలాంశములను తొలగించివేస్తుంది.  ఈ పరిస్థితులలో తప్పుత్రోవపట్టడం లేక దురుపయోగ- మవ్వడమనే ప్రసక్తే వుండదు.

 

 

 

 

 

 

  

IV .  మనస్సు మరియు ధ్యానము

 

1. మనస్సు*

 

        మనిషిలో మనస్సనునది మూలశక్తి.  ఇది ఈ విశ్వసృష్టి ప్రక్రియను కార్యరూపంలోకిదెచ్చిన మొదటి క్షోభతో దీని పుట్టుక ప్రారంభమై సృష్టికార్యరూపం దాల్చడానికి సిద్ధంచేసింది.  సృష్ట్యాదిలో యిది   

 

------------------------------------

*మానవుని మనస్సుకు మూలకారణమైన దానికి సంబంధించిన సిద్ధాంత మీ పుస్తకమున సకారణముగా వివరించబడినది.  నిశ్చలమైన భగవంతునిలో మొట్టమొదటగా గల్గిన సంకల్ప (చైతన్య) బలమే యీ ప్రపంచావిర్భావ కారణమునకు ద్రోవతీసినది.  ఆ చైతన్యము అంతర్గత శక్తిని విజృంభింపజేసి సృష్టికార్యమును ప్రారంభించినది.  చైతన్యవంతమైన ఆ మూలశక్తియే ప్రతి మనుష్యునిలోని ముఖ్యచైతన్య శక్తిగా మార్పునొందినది.  మనుష్యునిలోని అది మనస్సని పిలువబడుచున్నది.  దానికి మూలమై ఆ నిశ్చలస్థితియే యున్నది.  ఈ విధముగా మానవుని మనస్సు ఆదిచైతన్యశక్తిలో భాగమై దానితో తుల్యరూపము గలదియై యున్నది.  అందుచే రెండింటి క్రియాస్వరూపములును చాలా దగ్గరి సంబంధ సామ్యములును గల్గియున్నవి. ( రాజయోగ ప్రభావము నుండి గ్రహించినది)

అతిసూక్ష్మరూపమున నుండెను.  ఆ అతిసున్నితమైన స్థాయినుండి అది రానురాను స్థూలాతి స్థూలమౌతూ మన యెఱుక గలిగిన మనస్సు స్థాయి వరకు దిగి వచ్చినది.  మేధావులు మానవ మనస్సును రెండుగా విభజించిరి.  అవి యెఱుకగలిగిన మరియు యెరుకలేని మనస్సులు.  ఎఱుక గలిగిన మనస్సు స్థాయిలో (భౌతిక మెదడుగా కూడా తెలుపబడినది)  నేరుగా మన ఊహకు అనుభవమునకు అందిన స్థాయిలోని దీని చర్యలను భౌతికముగాను మరియు యిచ్ఛాశక్తితోనూ అదుపు చేయగలుగుదుము.  మన యెఱుకలో లేని మనస్సు మనకందకుండా మన ఆధీనమున కతీతముగ నున్నది.  ఈ రెండు పెద్ద విభాగములే మన మనస్సు యొక్క వివిధ స్థాయిలను వివరింపజాలవు.  ఎందుకంటే అవి అసంఖ్యాకములు.  ఎఱుక కందని మనస్సు, యెఱుక కందిన మనస్సు పరిధికావల నున్న అనేక స్థాయిల యెఱుకలను తన అధీనములో నుంచుకొంటుంది.  ఒకదాని వెంట ఒకటిగా ఈ యెఱుకస్థాయి సున్నితంగా మరింత సున్నితంగా మారుతూ కడకు సృష్ట్యాదిన నున్న తన అసలు స్థితికి చేరుకుంటుంది.  తత్త్వశాస్త్రము అంతిమ ఆధ్యాత్మిక విషయ విశ్లేషణ కోసం ఈ యెఱుక స్థానాలన్నిటిని గణనలోనికి గైకొనవలసి యున్నది. ఎఱుక గల మనస్సు సామాన్యముగా స్థూల మనస్సని పిలువబడుతుంది.  దానికంటే ఉన్నతమైన దానిని సూక్ష్మమనస్సంటారు  ఇది తనకంటే తక్కువ లేక స్థూల మనస్సుయొక్క కార్యకలాపముల నన్నిటిని తన అధీనమున వుంచుకొంటుంది.  ఈ స్థాయిలో యింకా అసంఖ్యాకములైన వివిధ స్థాయిలు అనగా సాంద్రత లేక స్థూలత్వమునుబట్టి ఒకదానితో ఒకటి తేడాలేర్పరచుకొని వుంటాయి.  చాలా పైస్థాయిలో మనము కారణమనస్సు వరకు వస్తాము.  అది మహాకారణమనస్సు (సూక్ష్మమానసము) యొక్క చర్యలను నియంత్రించును.  కనుక యేదైననూ సరే (ప్రతిదీ) ఈ యెఱుకగల మనస్సులో ప్రవేశించింది అంటే అది నిజానికి మరొక సూక్ష్మమైన యెఱుకగల కేంద్రము నుండే బహిర్గతమై యుంటుందన్నది వాస్తవము.  ఆస్థాయిలో క్రింది స్థాయిలలో మనము చేసిన యోచనల చర్యల ముద్రలు నాటుకొనిపోయి వుంటాయి.

 

మానసిక నియంత్రణ

 

        మనిషికార్యకలాపములన్నింటికి మనస్సే కేంద్రము గనుక మనిషిలోని సర్వస్వమును అది నియంత్రించును.  అది అన్ని చర్యలను, యోచనలను, కోపతాపములను మరియు ఉద్వేగములన్నింటిని అధీనమున నుంచుకొనును.  ఇది నిరంతరం చైతన్యవంతమై వుంటుంది.  ఒకవేళ దాన్ని దాని యిచ్ఛానుసారము వదిలేస్తే అంటే సర్వసామాన్యంగా దాని పనిని అది దాని పద్దతిలో కొనసాగనిస్తే అది సామాన్యంగా శరీరపుటెఱుకతో కలిసి పనిచేస్తుంది.  అప్పుడది భౌతిక వాంఛలు, ప్రాపంచిక ఆరాటముల తృప్తిపరచుటకొఱకు పనిచేయ నారంభిస్తుంది.  కనుక దీని చర్యలన్నీ ప్రాపంచిక వస్తువిషయసముపార్జన వైపు మళ్ళించబడి వాటికే చిక్కుబడి పోతుంది.  ఈ విధంగా అదుపు తప్పిన మానవ మనస్సు ఒకేవైపునకు మరలింపబడి వాస్తవమునకు అనేక దురితములకు కారణమౌతుంది.  అది తుదకు సాధారణంగా మన పతనానికి దారితీస్తుంది.  ఈ కారణముననే మనస్సును మానవుని దుర్మార్గపు శత్రువుగా భావించి దారుణముగా నిందింతురు.  అందుచేత మనస్సును అణగద్రొక్కుటకు, పీడించుటకు తీవ్రమైన చర్యలు గైకొనవలెనని ప్రోత్సహింతురు.  కానీ మనకు ప్రత్యక్షముగా కనబడుతున్నదేమంటే అట్టిచర్యలు తాత్కాలికముగా మనస్సునదుపులో నుంచునే గాని మనస్సులోపలి పొరలలో నిక్షిప్తమైయున్న చెడు ప్రవృత్తుల నుండి శాశ్వతముగా విడుదల కలిగించలేవు.  చెడు, పీడించుచున్నప్పుడే అదుపు అవసరమౌతుంది.  కనుక మనం మనస్సును అదుపు చేయాలనడంతోనే అందులో యేదో చెడు కలదను యోచన మనలో వున్నట్లే లెక్క.  అంటే దానర్థం విషాన్ని అలానే వుండనిచ్చి దాని పైపై దుశ్చర్యలను అదుపుచేయ యత్నిస్తున్నామన్న మాట.  ఎట్టిపరిస్థితులలోనైనా అదుపు కాస్త సడలింటే చాలు, చేడు చీల్చుకొని బయటపడి తన స్వరూపం కార్యరూపందాల్చనారంభిస్తుంది.  అందువల్లనే మనస్సు నదుపు చేయడమనే మాటే తప్పన్నది తేటతెల్లము.  మనస్సులోని అనవసరపు విషయాలను తొలగించి దాన్ని శుద్ధి చేయడమన్నది సరియైన పని.  నిజానికిదే సరైన ప్రక్రియ.  మన ప్రయోజనమునకు సరిగ్గా సరిపోవుపని.

 

మనఃశుద్ధీకరణ

 

        సర్వ దురితములు నిస్సందేహముగా మనస్సునందే పుట్టుచున్నవి.  కానీ యిట్టి పరిస్థితి కేవలం ఆ మనస్సు పట్టాల పైనుండి క్రిందికి జారుటవల్లనే కలుగుచున్నది.  సరియైన పద్దతిలో దానిని సరిచేయ వచ్చును.  అనగా దాని ప్రవృత్తులను సరియైనమార్గమునకు మళ్ళించడము ద్వారా సాధించ వచ్చును.  దానిలో నిక్షిప్తము గావింపబడిన దుష్టతనములనే విషమును బయటకు నెట్టివేయడమే అత్యుత్తమమైన పని.  అది సరియగు అంతఃశుద్ధీకరణ మరియు పవిత్రీకరణ వలన సాధ్యమగును.  అలా చేయడం వలన దానిని దుష్టప్రవృత్తుల నుండి విడుదల గావింపవచ్చును.  శుద్ధీకరణమంటే కేవలం దాని దుష్టప్రవృత్తులు త్రోసివేయడమే కాదు, వస్తు దృష్టిరాజ్యమేలి దాని ప్రభావమున యేర్పడిన చిక్కులేకాదు, వ్యక్తి స్థూలత్వమును కూడా విదిలించి వేయుట.

 

        అందువలననే అంతఃశుద్ధీకరణ మన ప్రయత్నమున అత్యంత ముఖ్యమైన విషయము.  చిక్కులు విడదీయక, లేక వాటిని వీలైనంత తగ్గించుకొనక ఆధ్యాత్మిక మార్గమున ముందుకు సాగలేము.  కానీ దురదృష్టవశాత్తు ఆధ్యాత్మిక జీవితమున యింత అత్యంత ప్రాధాన్యతగల విషయము నేటి ఆధ్యాత్మిక సంస్థలన్నిటిలోను నిరాదరింపబడుతున్నది.  తత్ఫలితముగా వారు జీవితాంతము యాంత్రిక పూజావిధానములతో శ్రమపడుదురు గానీ కడకు స్థూలజడత్వములో ఆపాదమస్తకము మునిగిపోయి సత్యతత్త్వపు మార్గమున అడ్డుగోడలు నిర్మించుకొని శాశ్వతముగా దూరమై పోతున్నారు.  వాస్తవానికి శుద్ధీకరణ సహాయ సహకారము లేకుంటే, మనస్సును సరిగ్గా క్రమబద్ధీకరించకుండా  వుంటే ఆధ్యాత్మిక ప్రగతి కేవలం కలగానే మిగిలిపోతుంది.  నిజానికిది శ్రమతో కూడుకున్న పనే.  దీనికి సంపూర్ణ హృదయపూర్వక శ్రద్ధ మరియు పట్టుదలతో కూడిన పరిశ్రమ అభ్యాసికి అవసరమై యున్నవి.  యోగ్యుడైన మార్గదర్శకుని సహాయ సహకారములు కూడా ఈ విషయంలో అత్యంతావశ్యకము.

 

మనస్సు క్రమబద్ధీకరణ

 

        వాస్తవానికి మనస్సును క్రమబద్ధీకరించుటన్నది అతిముఖ్యమైన మానవ లక్షణము.  కనుకనే శుద్ధీకరణ మరియు పవిత్రీకరణ చేపట్టవలసి యున్నది.  శుభ్రపరచుట యన్నపదము కంటే మరికొంత విశాలార్థము దీనికున్నది.  మనస్సును క్రమబద్ధీకరించడమంటే కేవలం చెడు మరియు స్థూల విషయములను మనస్సునుండి బయటకు త్రోసివేయడమే గాక, మనస్సుకు సంబంధించి అనేక విషయములలో చక్కని సమన్వయము, సర్దుబాటు కలిగి యుండడం కూడా అవసరం.  అంటే ఉద్వేగావేశములలో హెచ్చు తగ్గులు లేక సరియైన సమత్వం గలిగి వుండటం.  అంటే దీనర్థం పూర్తిగా కోపతాపములు, ఉత్సాహ నిరుత్సాహములు మొదలైనవన్నీ తుడిచిపెట్టుకు పోవడంకాదు.  అవి మన దైనందిన కార్యకలాపములలో తప్పక అవసరమైయున్నవి.  వాటిని అవసరాన్నిబట్టి చూపక తప్పినది కాదు.  కాని హద్దులుమీరి, అదుపుదప్పి మాత్రము ప్రదర్శింపరాదు.  యెట్టిపరిస్థితులలోనూ వాటి భారపు ప్రభావమునకు లోనుగాక మనస్సు స్వేచ్ఛగా నుండవలెను.

 

2. ధ్యానము

 

        మనస్సుయొక్క సక్రమ క్రమబద్ధీకరణ మనయత్నమున అత్యవసరమైనందున, ప్రప్రధమము నుండి దీనిని తప్పనిసరిగా మనస్సునందుంచుకొనవలెను.  అందుకొఱకు చాలా ప్రతిభావంతమైన ప్రక్రియ ధ్యానము.  అది సరాసరి మనస్సు పనితీరుతోనే తన కార్యకలాపములను సాగిస్తుంది.  నిరంతరము పరిభ్రమిస్తూ వివిధ విషయములతో సతమతమౌతూ తీరికలేకుండావున్న మనస్సును క్రమేణా దాని స్వభావ వృత్తి నుండి బయటికి తీసుకు రావచ్చును.  శరీరపు టెఱుకతో దగ్గరి సంబంధమేర్పరచుకొని, తప్పుద్రోవపట్టి, యెప్పుడూ యింద్రియ వాంఛల గురించి యోచిస్తూ సతమతమౌతున్న మనస్సును ఉన్నతమైన పవిత్రమైన భావనల వైపునకు మరలించవలెను.  ఇదే మనం ధ్యానంలో చేయుచున్న పని.  ధ్యానంలో మనమొక ధ్యేయంపై కొద్దిసేపు మనస్సు లగ్నంచేయ యత్నిస్తాము.  అంటే ఆ సమయమైనా కనీసం మనస్సులోని చెడుతత్త్వాన్నుండి కొంతవరకైనా విడివడి వుంటాము.  సాధన పరిపక్వతజెంది మనస్సు దానికి అలవాటుపడిపోతే, ఒక విధమైన శాంతి, ప్రశాంతత లోలోపల వృద్ధికావడం మొదలౌతుంది.  ధ్యానసాధన వలన మనకు లభించే ప్రాధమిక ఫలితమిది.

 

ఏకాగ్రత

 

        సాధారణ దృక్పదంలో యేకాగ్రత ధ్యానము యొక్క తొలిదశగా భావిస్తారుకానీ యిది చాలా జడమైన తప్పుడు భావన.  ధ్యాన సాధన చేయటానికి ముందు, ముఖ్యంగా యేకాగ్రతకోసం తొలుత ప్రయత్నించాలని చాలా మంది ప్రేరేపింపబడుతున్నారు.  ఈ తప్పుడు భావన బహుఃశా "ధారణ" మన్న పదాన్ని అపార్థము చేసుకోవడం వలన కలిగి వుంటుంది.  ఈ ధారణ, అష్టాంగయోగ విధానములో ధ్యానమునకు ముందుగా చెప్పబడుతుంది.  కాని ధారణ అంటే కేవలం యెఱుక గలిగి వుండటం అంతేగాని అందరూ అనుకొంటున్నట్లు యేకాగ్రత కానేకాదు.  మన సాధారణ జీవితంతో ఈ విషయాన్ని పోల్చిచూద్దాం.  మనం మన ప్రాపంచిక సమస్యను గూర్చి ఆలోచించేటప్పుడు ధారణ, ధ్యాన, సమాధిలో చెప్పబడినట్లే మూడు స్థితులలో ఆలోచన సాగుతుంది.  అన్ని విషయాలలోను మొదట మన ధ్యాసను విషయంపై వుంచుతాము.  ఆ తర్వాత దాన్ని గురించి ఎడతెరిపిలేకుండా ఆలోచన కొనసాగిస్తాం.  కొన్ని సమయాలలో ఆలోచన తీవ్రమైతే మనం అందులోనే మునిగిపోయినట్లు భావిస్తాం.  దాన్నే మనం సరిగ్గా యేకాగ్రస్థితియని అనుకుంటాం.  కనుక యేకాగ్రతను ధ్యానము యొక్క ప్రాధమికదశ అని భావించడం తప్పు.  అలాకాకుండా మనం మొదట్లోనే యేకాగ్రత కోసం ప్రయత్నిస్తే, ఆలోచనలు నిలిచిపోయిన స్థితిని ఉత్పన్నం చేయడం కోసం మనస్సు యొక్క చర్యలన్నిటిని భౌతికశక్తి నుపయోగించి బలవంతంగా అణిచిపెట్టవలసి వస్తుంది.  ఇది నిస్సందేహంగా తప్పు పద్దతి మరియు మన ప్రయోజనమునకు సంబంధములేని పని.  మనస్సును నిర్వీర్యస్థితిలోనికి తెచ్చుటకు ప్రయోగించిన భౌతిక శక్తి బలప్రయోగము తాత్కాలికక నిస్తేజము (కోమా) గా పరిణమిస్తుంది.  దీన్ని ఆధ్యాత్మిక స్థితిగా పొరబడుతున్నారు.  ఇది క్లోరోఫారం లేక మత్తుమందిచ్చి తెలివి కోల్పోయిన స్థితికి దెచ్చుట వంటిది.

 

ధ్యానవస్తువు

 

        తర్వాత ఈ విషయమై గైకొనవలసిన ముఖ్యాంశము ఒక వస్తువును ధ్యానమునకై నిర్ణయించుకొనుటే.  కొంతమంది బోధకులు ధ్యానమును రెండువిధములుగా విభజించిరి.  అవి సగుణపదార్తముపై ధ్యానము మరియు నిర్గుణమాత్రపు యోచన.  సగుణ ధ్యానములో ఒక పదార్త నిర్మిత స్థూలవస్తువును ముందుంచుకొని దానిపై ధ్యానము చేయుదురు.  ఈ విధానమున అనేకమైన వస్తువులను ఈ పనికై సూచింతురు.  చాలా సందర్భములలో అది ఒక ప్రతిరూపము లేక యేదో ఒక దేవుని చిత్రపటమై వుంటుంది.  అదే ఉత్తమమని సాధారణంగా భావిస్తారు.  మరికొందరు జ్యోతి, కొండ, శిఖరము, నది లేక ఒక పువ్వునైనా సరే ధ్యానమున కాధారముగ గైకొందురు.  దీనికి, భగవత్ చింతనకు యేమాత్రము సంబంధమే లేదను విషయము అసలే అర్థము కావడంలేదు.  వారు తద్వారా యేకగ్రతను సాధనచేసి కొన్ని వశీకరణ శక్తులు పొంది, ప్రాపంచిక వస్తుప్రయోజన మూలము పొందాలని ఆశింతురు.  ప్రతిరూపములపై ధ్యానము యొక్క ప్రయోజనము కూడా యింతే.  అంతేగాకుండా భౌతికరూప స్థూల వస్తువును ధ్యానమున కాధారంగా తీసుకుంటే ఆ స్థూలవస్తు లక్షణాలైన జడత్వము, స్థూలత్వ లక్షణములే మనస్సుపై ప్రభావము విడువక చూపి మనలో స్థూలత్వం తగ్గడానికి బదులు ఇంకా పెంచుతూనే పోతుంది.  కానీ ఈ దృక్పదాన్ని సమర్థించేవారు ముందుకు వచ్చి మీరు ధ్యానించే ఆ విగ్రహము వెనుక మూలంలో వున్న సత్యతత్త్వాన్నే మేము ధ్యానించుచున్నామని వాళ్ళనువాళ్ళు సమర్థించుకొంటున్నారు.  కానీ అది కేవలం శుష్కవాదం.  వాస్తవానికి వెయ్యికొక్కరు గూడా ఆ విధంగా అనుసరించడం లేదు.  నిజానికి వారు ఆ స్థూలవిగ్రహాన్ని మాత్రమే ధ్యానిస్తూ దాని మూలముననున్న సత్యతత్త్వాన్ని విస్మరిస్తున్నారు.  అది సహజమే.  జడపదార్తాన్ని దృష్టిలో వుంచుకుంటే వెనుకనున్న సత్యతత్త్వం స్వతఃసిద్ధంగా కనుమరుగై పోతుంది.  వాళ్ళుమాత్రం యేకాగ్రతనే బలవంతంగా సాధన చేస్తూవుంటారు.  తద్వారా వారు అధికాధిక స్థౌల్యమును సమకూర్చుకుంటూ పోతుంటారు.  కనుక స్థౌల్య వస్తువులపై ధ్యానం వలన సూక్ష్మతవైపు సాగే మన గమనం ఆటంక పరచబడుతున్నదన్నది నిరూపితమైన సత్యము.  ఈ కారణాలవలన ఆ జడమైన ధ్యానము మన ధ్యేయ ప్రాప్తికేవిధంగాను ఉపయోగపడదు.  అందుచేత ఆధ్యాత్మికతకేవిధంగాను పనికిరాదు.

 

        ఈ దృక్పదం వలన ధ్యానము సూక్ష్మ లక్షణములుగల వస్తువుపై చేయుట ఉత్తమముగా భావింపబడుచున్నది.  ఇందుకొఱకు సామాన్యముగా ఒకానొక దివ్యగుణమును ధ్యానించుటకు గైకొందురు.  అదే మనం సహజమార్గంలో అనుసరిస్తున్నాము.  ఇందువలన మనం గుణం నుండి గుణధాముని వైపుకు సాగిపోతాము.  మన అంతిమ సూక్ష్మస్థితిపై గురినిల్పుతాము గనుక మనం తీసుకొనే వస్తువు కూడా అదే సూక్ష్మ లక్షణములు గలిగి యుండటం అవసరం.  ఏవిధమైన ఊహావస్తువును తీసుకొన్నా అట్టి ఊహాజనిత భౌతిక వస్తువే మన మనోఫలకంపై కనబడుతుంది.  కనుక అది తగదు.  ఎప్పుడు కూడా ఆలోచనలోని వస్తువును మనసులో రూపకల్పన చేస్తే అది తన స్థూల ప్రభావమును చూపి, తదనంతరం ప్రక్రియలోని ప్రతిభను హరించి తుది విజయముపై అపనమ్మకం కలిగిస్తుంది.  దీన్నే మరింత తీవ్రతతో సాధన చేస్తే మానసిక   మతిభ్రమణం సమతుల్యత సైతం దెబ్బతినే అవకాశమున్నది.  ఈ కారణము చేతనే ప్రతి ఒక్కరూ ధ్యానవస్తువు నెన్నుకొనుటలో బహు జాగ్రత్తగ నుండుట అత్యావశ్యకము.  ఇంతకు మునుపే ప్రయత్నించి సక్రమమైనదని తేలిన ప్రక్రియ ననుసరించుట ఉత్తమము.  ఎట్లయినను జడపదార్తముల ధ్యానమునకు సంబంధించిన దృక్పదముల నుండి బయటపడుటకు ప్రయత్నించ వలెను.

 

 

 

రూపముపై ధ్యానము

 

        ధ్యానమునకు ప్రత్యమ్నాయ మార్గమును శంకరులు తమ "వివేకచూడామణి" లో సూచించిరి.  అందులో ఆయన బ్రహ్మనిష్టాగరిష్టుడు లేక సంపూర్ణముగా అంతిమ సత్యతత్త్వమునందు నిజముగా లయమైన మహనీయుని రూపముపై ధ్యానించుట సరియైనదనిరి.  ధ్యానమునకు గైకొన్న ఆ రూపము అసలుదై, ఆ మహనీయుడు అతీంద్రియశక్తి సంపన్నుడన్న భావన నిండుగా గలిగియుండవలెను.  రూపమెప్పుడు కూడా ఒక కళాకారుని ఊహలో ఆతని ఇష్టాయిష్టముల కనుగుణముగా తీర్చిదిద్దినది కారాదు.  కనుక అట్టిరూపమును కనుగొనుట, దానిని సరిగ్గా అంచనావేసి నిర్ణయించుట బహుఃశా చాల కష్టమైన కార్యమే.  వాస్తవమునకు ఇది ఒక సాధకుని శక్తి సామర్థ్యములకందని విషయమే.  గైకొన్న రూపము నిజంగా అంతటి మహనీయునిదా కాదా అని ఖచ్చితమైన నిర్ణయమునకు వచ్చుట చాల కష్టము.  సర్వసామాన్యంగా జరిగేదేమంటే జనులు వారి మనోభావన కనుగుణముగా అతడు చతురతతో చూపిన సరళత, నిర్వ్యామోహము మరియు ప్రేమనుబట్టి అతన్ని అన్నిటికి అతీతునిగా లేక అనంతతత్త్వమయిన నిజముగా లయమైన వానిగా వారి అపరిపక్వజ్ఞానంతో పొరపడి నిర్ణయించి సంతృప్తి జెందుతారు.  చాలా మంది విషయంలో యిది కేవలం వారి అజ్ఞానం మరియు అపార్థము వల్లనేకాదు, మేము ఉన్నతాత్ములమని చెప్పుకొనువారు యేకాస్తా అవకాశాన్ని కూడా వదలకుండా తమ ఘనతను ప్రచారం చేసుకొంటూ మనుషులను నమ్మించడం వలన కూడా యిలా జరుగుతున్నది.  మనస్సునందుచుకోవలసిన ముఖ్యాంశమేమంటే, అల్పజ్ఞుని రూపంపై ధ్యానం చేయడం వలన ధ్యానం చేసేవాడు ఆ అల్పజ్ఞుని వలనే ధ్యేయమునకు దూరమై అతని స్థాయికే పరిమితమైపోతాడు - బంధనములకు లోనైన వాడు యితరుని బంధ విముక్తి చేయలేడు.  అట్టి బంధితునిపై వెయ్యి సంవత్సరాలు ధ్యానం చేసినా స్వేచ్చను పొందుట కల్ల.  అంతేగాదు ధ్యానానికి గైకొన్న రూపము ఒక దూర్తునిది లేక వంచకునిది అయితే దానివలన వచ్చే ఫలితము సరిగ్గా అటువంటిదే అయితీరుతుంది.  కనుక ధ్యానమునకై గైకొన్న రూపము తప్పక మహోన్నత శక్తివంతునిదై యుండుట అత్యంతావశ్యకము.  అట్టి మహనీయుడు ప్రకృతితో లీనమైనవాడై, శాశ్వతముగా అంతిమ మరియు కారణమున కందని స్థాయి అంటే, సంపూర్ణత్వములో స్థిరపడినవాడై వుండవలెను.  అట్లుకాని యెడల సాధనే చేయకుండుట శ్రేయస్కరము.  సహజమార్గము ఈ రూపముపై ధ్యానమును సిద్ధాంతరీత్యా అంగీకరించినప్పటికినీ సర్వసాధారణముగా అటువంటి మహాత్ముడు అందుబాటులోను మరియు అనుకూలుడుగాను లేని పక్షములో ఈ రూపముపై ధ్యానమును అనుమతించదు.

 సరియైన విధానము

 

        కనుక ధ్యానము సరళముగాను మరియు అతి సహజముగాను నుండు విధానమున చేయుటయే ఉత్తమము.  ఇందులో బలవంతపు అదుపు లేక మానసిక ఘర్షణ అసలే పనికిరాదు.  వాస్తవంశమేమంటే, ధ్యానమనగా భగవదీయమైన విషయముపై మళ్ళీమళ్ళీ యోచన చేస్తూ యోచన ఎడతెగకుండా కొనసాగిస్తూ వుండడమే.  యేకాగ్రత, అణచిపెట్టుట, ఘర్షణ అనువాటితో ధ్యానమునకు యేసంబంధము లేదు.  ఇందులో అతి సహజమైన రీతిలో మనస్సును హుందాగా భగవత్ చింతనలో వుంచడమే మనం చేయవలసినది.  మన ప్రయోజనార్థం ధ్యానం అతి సూక్ష్మమైన యెఱుకతో సహజంగా వుండేటట్లు కొనసాగించాలి.  సహజమార్గంలో ధ్యానము హృదయముపై చేయమని నిర్దేశిస్తారు.  ఆ హృదయంలో ఈశ్వరీయ ప్రకాశమున్నదన్న యోచనను ఆధారంగా గ్రహిస్తారు.  మాటవరుసకు దీనిని హృదయంపై ధ్యానమనో లేక ఈశ్వరీయ ప్రకాశంపై ధ్యానమనో అంటున్నా వాస్తవానికది హృదయంపై ధ్యానమూకాదు, ఈశ్వరీయ ప్రకాశంపై కూడా కాదు.  ఈ రెండూకూడా మన ధ్యేయంకాదు.  మన మనస్సునుంచడానికొక ఆధారంగా మాత్రమే హృదయాన్ని తీసుకొంటున్నాం.  ఈశ్వరీయ ప్రకాశం కేవలమొక ఊహమాత్రమే.  యేమాత్రం మనం హృదయస్థానాన్ని గుర్తించడానికి గానీ ఈశ్వరీయప్రకాశాన్ని దర్శించడానికి గాని శ్రమపడడం లేదు.  ఈ విధంగా ధ్యానాన్నభ్యసించడం చాల సూక్ష్మలక్షణ సమన్వితం మరియు సంపూర్ణంగా స్థూలప్రభావ రహితము.

 

ప్రాణాహుతి

 

        మానవ జీవితము అన్ని విధముల, అనగా భౌతికంగా, సాంఘికంగా, నైతికంగా మరియు ఆధ్యాత్మికంగా పతనావస్థకు చేరిన ఈ కాలములో మనిషికి సుగుణవంతము, నిజాయితీయుతమును సామాన్య సలక్షణమునైన స్థాయిని కలిగి వుండడం అసాధ్యమైపోయింది.  దీనికి సామాన్య కారణం మన మనస్సు స్థూలాతిస్థూల వస్తువిషయములపై మరలిచినందువల్లనే .  కనుక యిప్పుడు చేయవలసిందల్లా మనస్సు సరియైనదారికి మళ్ళించడమే.  ఇదొక్కటే సమస్త సాధనములు, విధానములు చేపట్టవలసిన ఒకే ఒక పని.  దురదృష్టవశాత్తు ఈ పనికై నియమింపబడిన అన్నిసాధనలు యాంత్రికమై వానిపని పూర్తిగా భౌతికమై పోయినది.  ఈ కారణము వలననే అనేకమంది మతవ్యాపకుల ఉపన్యాసములు, బోధనలు వింటున్నప్పటికి స్వేచ్ఛను పొందుదురను ఆశేలేకుండా పోయింది.  సమతదప్పిన మానసిక వృత్తులను క్రమబద్ధీకరించు ఒకే ఒక సాధనము క్రమమైన ధ్యానము.  కానీ ఈ ధ్యానము విజయవంతముగా అనుసరింపబడాలంటే, దీని వెనుకొక యోగశక్తియైన ప్రాణాహుతి అండవుండాలి.  ఇది ఒక గొప్ప మానసిక శాస్త్రము.  దీని ద్వారా గురువు తన మానసిక శక్తినుపయోగించి అభ్యాసిలో విరాజమానమై అణగారిన, స్తబ్దతలో వుండిపోయిన శక్తిని చైతన్యవంతము చేసి ఆధ్యాత్మిక పురోగమనదిశలో పని చేయించును.  ఇది అభ్యాసిని కార్యోన్ముఖుని గావించుటలో బహుదా ఉపయోగపడి అతనిలోని చిక్కులు, అడ్డంకులను తొలగించివేయును.  ఈ శాస్త్రప్రక్రియ రాజయోగమునకు ముఖ్యమైన ఆధారమై పురాతన కాలము నుండి కొనసాగుతున్నది.  ఈ శక్తినుపయోగించి గొప్ప మహర్షులెందరో జనులనున్నత స్థితులకు గొనివచ్చిరి.  ఇందుకు మన గతచరిత్రలో లెక్కలేనన్ని సంఘటనలున్నవి.  కానీ నేటి మన పతనము వలన ఈ పవిత్రశాస్త్రము హీనదశకు చేరి పూర్తిగా తెరమరుగై పోయినది.  అసలు యిటువంటి విద్యొకటి వుండినదని బహుఃశా యేకొద్దిమందో తప్ప నమ్మువారు కూడా లేరు.  జనులు ఎక్కడిమాటలో వినుట (కర్ణపిశాచ క్రియ) వశీకరణ వంటి హీనకళల గురించి తెలుసుకొని వారి వస్తుదృష్టితో అర్థము చేసుకొన్నంతలో ఇదంతా వశీకరణ విద్య పొమ్మని, అసలు అదీ యిదీ యేదానిపైన సరియైన జ్ఞానము లేకనే తమ అసంబద్ధ నిర్ణయం చెబుతుంటారు.  ఈ రెండింటి తేడాను వివరించాలంటే నేను సంక్షిప్తంగా ఒకమాట చెబుతాను.  వశీకరణ విద్య ముఖ్యంగా మనిషిలోని పదార్తశక్తితో ప్రదర్శింప బడుతుంది.  అయితే యోగప్రక్రియ సున్నిత ప్రాణశక్తితో పనిగైకొని సరాసరి ఆత్మతో సంబంధం గలిగి వుంటుంది.  పదార్తముతో దీనికేమాత్రము సంబంధముండదు.  అభ్యాసి మనస్సుపై చూపే ప్రభావం కూడా ఈ రెండింటి విషయంలో వేరువేరుగా వుంటుంది.  వశీకరణ విద్యలో వ్యక్తియొక్క యిచ్ఛాశక్తి మరియు తెలివి విచ్ఛిన్నము గావింపబడి వశీకరణ విద్యను ప్రయోగించిన వానిచేతులలో అతడు కీలుబొమ్మగా మారిపోతాడు.  అలాకాక యోగవిద్య వలన అభ్యాసి యిచ్ఛాశక్తి మరియు తెలివి అద్భుతముగా శక్తివంతమౌతాయి.  అతని ఆత్మశక్తి మేల్కొల్పబడి శాంతి మరియు తేలికదనాన్ని అతడు ఆద్యంతమనుభూతి చెందుతాడు.  సహజమార్గమున ప్రాణాహుతి ద్వారా ఒక దివ్య ప్రేరణను చొప్పించడం జరుగుతుంది.  ఇది ఈ ప్రక్రియలోని ఒకానొక గొప్ప ప్రత్యేకత.  ఇది మనిషిని మహోన్నత ఆధ్యాత్మిక స్థితికి బహుతక్కువ సమయంలో అద్భుతంగా సులభంగా అతి సరళంగా గొంపోతుంది.  ఈ ప్రక్రియద్వారా అనుభవరీత్యా సాధించిన ఫలితములే ఈ ప్రక్రియ ప్రతిభకు ప్రత్యక్ష నిదర్శనము.  ఈ విషయమై ప్రతి ఒక్కరిని వచ్చి ప్రయత్నించి ఫలితములను స్వానుభవముద్వారా గ్రహించండని ఆహ్వానిస్తున్నాము.

 

 

గురువు కర్తవ్యము

 

        ఆధ్యాత్మిక జీవితమున గురువర్యుల కర్తవ్యము బహు ప్రాముఖ్యత వహించు అంశము.  అది సహజమార్గమున మరింత ప్రత్యేకమైనది.  అభ్యాసి తనను తాను యిచ్ఛాపూర్వకంగా నమ్మకము మరియు ఆత్మ విశ్వాసంతో సంపూర్ణంగా గురువుగారికి సమర్పించుకుంటే, అతని విజయము పూర్తిగా గురువుగారి బాధ్యతే అవుతుంది.  కనుక ఈ విషయమున సమర్థుడగు గురుని యెన్నిక అత్యంత ప్రాధాన్యతను గలిగియున్నది.  దీని కొఱకు కడకు తనేమాశిస్తున్నాడో తనకు బాగా అర్థమైవుండాలి.  జనులు సామాన్యముగా తమ అంతిమగమ్యమైన సత్యతత్త్వమును, తమ మానసికస్థితి మరియు యిష్టమున కనుగుణముగా వేరువేరు దృక్పదములు గలిగి యుందురు.  వారు ఆతృతగా ఆశించునదేదో దానికనుగుణముగా వారి స్థాయి గురువును వారు కనుగొందురు.  కానీ ఆధ్యాత్మికత కొఱకు మార్గము నెన్నుకొని వారిధ్యేయమైన భగవదైక్యము నాశించువారు వారి మార్గదర్శకుడు కూడా గొప్ప సమర్థుడై తన మానసిక శక్తులనుపయోగించి యితరుల నుద్ధరించగల శక్తిమంతుడై యుండునట్లు చూచుకొనవలెను.  వాస్తవమునకు ఉన్నతోన్నత స్థితులను పొందవలెనన్న, గురువు యోగశక్తియైన ప్రాణాహుతి ద్వారా పైపైకి గొంపోగల, నిజమైన శక్తిమంతుడై యుండి ఆయన సహాయసహకారము లందించిననే తప్ప యితరత్రా సాధ్యపడదు.  అభ్యాసియొక్క అంతర్గత శక్తుల పనితీరును సరియైన మార్గమును చక్కగా క్రమబద్ధీకరించి మర్గదర్శకము వహించగల గురుని సామర్థ్యముపైనే ఇదంతా పూర్తిగా ఆధారపడి యున్నది.  ఒక్క మాటలో చెప్పాలంటే అభ్యాసికి దైవీయ స్పందనలు గురువు ద్వారానే అందుతాయి.  ఆయనే అభ్యాసిలో నిక్షిప్తమై నిద్రాణస్థితి యందున్న పవిత్ర శక్తులను మేల్కొల్పి కార్యోన్ముఖుని గావించి ఆ శక్తులను క్రమబద్ధీకరించి ఉన్నతోన్నత శిఖరములకు చేర్చును.  ఆయనే అభ్యాసి మనస్సునుండి చిక్కులను అడ్డంకులను తొలగించి ఆయన శక్తిచేతనే ముందుకు నడిపిస్తాడు.  నిజంగా మనం మహోన్నత ధ్యేయాన్ని పొందదలచుకుంటే అంతటి మహనీయుణ్ణే ఆశ్రయించి తీరాలి.

 

3. శరణాగతి

 

        సహజమార్గ సాధనలో అత్యంత ప్రాణప్రదమైన అంశము శరణాగతి.  వాస్తవమునకిది ఉపాసనయొక్క సమగ్ర రూపము.  అభ్యాసి సాధనగా చేపట్టు ప్రతి పని వెనుక దీని ప్రాముఖ్యమావశ్యకమై యున్నది.  అన్ని సాధనల యొక్క ముఖ్యోద్దేశ్యము సాక్షాత్కారమనియే నిర్వచింపబడి యున్నది.  అనగా దానియర్థము భగవంతునిలో లీనమగుట.  ఇది శూన్యతా భావమును సూచిస్తున్నది.  మరోమాటలో చెప్పాలంటే వ్యక్తిగతమైన ఆత్మభావము పూర్తిగా తొలగిపోవుటే వాస్తవార్థమున సాక్షాత్కారము.

 

        అయితే ఈ శూన్యమను పదము దేనిని సూచిస్తున్నదిదీన్ని వివరించాలంటే మానవుని పరిణామక్రమమునంతా పరిశీలించాల్సి వుంది.  మానవుని ప్రప్రధమ ఉనికి ఒక ప్రత్యేక గుర్తింపుగల రూపమున నుండినది.  అది అత్యంత సున్నిత సూక్ష్మస్థితిలో స్వచ్ఛముగాను సరళముగానూ వుండెను.  ఆ సూక్ష్మాతి సూక్ష్మస్థితి నుండి మనిషి క్రిందికి దిగజారుతూ స్థూలరూప ఉనికి వరకు వచ్చిచేరెను.  అలా వచ్చు ప్రయాణమున ఒక పొరపై మరొకపొర చుట్టూ పేరుకుపోతూ వెలుతురు ప్రసరింపలేనంత సాంద్రదశకు మారిపోయెను.  ఈ స్థౌల్యము రానురాను పెరిగి తుదకు నేటి మనిషి వున్న సాంద్ర ఘనపదార్త రూపమునకు మారిపోయినాడు.  హృదయములో దివ్యమైన యెఱుక మేల్కొనడంతో ఈ గమనము వెనకకు మరలినది.  పతనావస్థ ఆగిపోయి మూలమువైపునకు పైపైకి ఎదగ నారంభించినది.  మనము భౌతికముగా వృద్ధియౌతూ వ్యాపకము గలిగించుకొంటూ క్రిందికి వచ్చినాము.  ఇప్పుడు మనం పైపైకి వెళుతూ తేలికౌతూ పదార్తపరంగా సంకోచించడం మొదలైంది.  మొదటి దిగజారుడు స్థితిలో భయంకరమైన అహం సమకూరి యెక్కువౌతూ భౌతిక యెఱుకలో పూర్తిగా మిళితమై యుండినది.  ఇప్పటి ఈ యెగబ్రాకుడు గమనంలో అహంయొక్క యెఱుక తగ్గి దివ్యమైన యెఱుక ద్వారా మూలబిందువు, వైపుకు మున్ముందుకు సాగిపోవుదుము.  ఒక్క మాటలో చెప్పాలంటే అదీ మానవ ఉనికియొక్క సంపూర్ణ కథ.

 

        ఈ విధంగా మనమెలా ముందుకు కొనసాగుతాముమహోన్నతుడైన గురుదేవుని ఘనతను మనఃస్ఫూర్తిగా గుర్తించగానే అనంతం వైపుసాగే మన ప్రయాణం మొదలౌతుంది.  ప్రేమ, భక్తి ద్వారా మనం ఆయనతో సంబంధ మేర్పరచుకొంటాము. భక్తి అంటే అది వాస్తవార్థములో భక్తి, అంతేగాని తెచ్చిపెట్టుకొన్న పొగడ్తకాదు.  ఇది విశ్వాసాన్ని పెంపొందిస్తుంది.  దాంతో బంధం మరింత బలపడుతుంది.  సహజసిద్ధంగా విధేయత, సంపూర్ణ ఆజ్ఞానుబద్ధత క్రమంగా మనకలవడతాయి.  ఇవే ఆత్మార్పణమునకు తొలి మెట్లుగా భావింపనగును.

 

        ఆత్మార్పణమువైపు మన ప్రయాణం సాగుతుండగా మనం ఒకటి తర్వాత ఒకటిగా అనేక స్థానాలు గడచి వెళ్ళవలసి వుంటుంది.  తొలుత మనం వినయ విధేయతలతో మహాత్ముడైన గురువర్యుని యిచ్ఛానుసారం మన దినసరి కార్యక్రమాలన్నీ నెరవేరుస్తాము.  ఒక రకంగా మనం నిర్ణయాధికారం సర్వం ఆయనకే వదిలేస్తాము.  ఆయనపైనే భారంవేసి మీ యిష్టమని వదిలేయడమంటే, పరిస్థితుల ప్రభావంచేత మనపై తప్పనిసరియై బలవంతంగా మోపబడి ఫలితం మన అధీనంలో లేనివి మాత్రమని కాదు అర్థం.  అది కేవలం నిరాశ నిస్పృహలకు గురైనప్పుడు ఓదార్పు దృష్టితో గైకొన్నదికాదు.  వాస్తవార్థంలో గురువుగారి దయాదాక్షిణ్యాలకు వదిలివేయడమనేది ఆద్యంతం మనిషి జీవితంలోని ప్రతి చర్యకు వర్తిస్తుంది.  ఈ విధంగా గురువుపై భారంవేయడం అంకితభావంతో కొనసాగుతుంది.  మన సర్వయోచనలు, చర్యలు ఆయనకే అంకితం చేసేసి మన కార్యకలాపాలను దైవకర్తవ్యపరంగా చేసుకుపోవాలి.  ప్రారంభకుల కొఱకు మన గురుదేవులు యేర్పరచిన అతిసులువైన ప్రాధమిక పద్ధతిని ఈ విధంగా తెలియజేశారు.

 

        "ఒక మనిషి సర్వస్వం తన గురువర్యున కంకితంజేసి పని ప్రారంభిస్తాడు.  అతడంతా తన గురువు కొఱకే చేస్తున్నానన్న భావంతో పని మొదలు పెడతాడు.  అంతేకాదు, తనలోని గురువుగారే తన పని చేసుకపోతున్నాడని భావిస్తాడు.  తనలోని ఈ భావనకు ప్రాణంపోస్తాడు.  అది సజీవమైపోతుంది.  అతడు తన దైనందిన కార్యకలాపములను మొదలుపెడతాడు.  ఉదయం కాలకృత్యాలు తీర్చుకొంటాడు.  ఆతర్వాత అల్పాహారం తీసుకొంటాడు.  తను తన కార్యాలయాని కెళతాడు.  రోజూ చేసే ఈ సాధారణ కార్యాలన్నీ కూడా తనలో వున్న తన గురువే చేస్తున్నాడని చేసుకుపోతాడు.  అది కార్యాలయపనిగానీ లేక దైనందిన యేకార్యంగానీ అన్నీ తనలోని గురువే చేస్తున్నాడని భావిస్తాడు.  సాయంత్రం కార్యాలయం నుండి ఇంటికి తిరిగివస్తాడు.  దారిలో ఒక ఆకర్షణియమైన నృత్యప్రదర్శనను చూస్తాడు.  ఆ ఆకర్షణకులోనై ఆ దృశ్యము నుండి కనులు ప్రక్కకు మరల్చలేడు.  అప్పుడతడేమి చేయాలిఈ నృత్య ప్రదర్శన నేనుగాదు, నాలోని గురువే చూస్తున్నాడని అనుకోవాలి.  గురువుగారి శక్తి తక్షణం తనలోనికి ప్రవహించ మొదలిడి ఆ ఆకర్షణ నుండి విడుదల పొందుతాడు.  ఆ రోజుపని పూర్తిచేసుకొని యింటికి చేరుకుంటాడు.  చాలా గంటల తర్వాత తన బిడ్డలు చుట్టూచేరి ఆనందంతో ఆడుకుంటారు.  తనుకూడా వారి ఆనందానికి సంతోషించి వారితో కలసి పరవశుడైపోతాడు.  ఇది సర్వసాధారణం.  ఆ విధంగా కాసేపు గురువుగారి పవిత్ర చింతనకు దూరమై పోతాడు.  కానీ తనలోని గురువే పిల్లలతో ఆనందిస్తున్నాడన్న యోచన నేర్పరచుకొన్నవాని విషయం అలాకాదు.  మిత్రులు కొందరు వస్తారు యేదో పిచ్చాపాటీ మొదలుపెడతారు.  నీవూ జోక్యంచేసుకొని ఆ మాటల్లో మునిగిపోతావు.  అప్పుడుకూడా నీలోని గురువే వాళ్ళతో సంభాషిస్తున్నాడని జ్ఞాపకం చేసికో.  ఈ విధంగా నిన్ను నీవు నీ దైనందిన కార్యకలాపాలన్నిటిని సరిచేసుకొనవచ్చును.  నడిచేటప్పుడు కూడ నా గురువే నడుస్తున్నాడనుకో.  నడకకు నడక, గురుచింతన రెండూ సాగిపోతాయి.  అంటే నీవు ద్విగుణీకృత శక్తితో పనిచేయగలుగుతున్నావు.  ధ్యానం చేస్తున్నప్పుడు కూడా గురువే తన రూపుపై ధ్యానం చేసుకుంటున్నాడనుకో.  ఇది అత్యంత ప్రాధాన్యమైనది మరియు విజయసాధనకు కీలకాంశము.

 

        ఈ విధానమును చిత్తశుద్ధితో అనుసరిస్తే ఇక సంస్కారము లేర్పడుటను సమర్థవంతంగా నిలుపుదల చేస్తుంది.  దీన్ని మనం మన శక్తి కొలది ప్రయత్నించి అలవరచుకోవాలి.  అయితే యెంతకాలం మన ప్రయత్నశక్తి ప్రభావముంటుందో అంతవరకు అది నామమాత్రం మరియు భౌతికపరమైనదిగానే వుంటుంది.  అయితే ప్రారంభదశలో ఆవిధంగానే చేయక తప్పదు.  అయినప్పటికీ ఇందులో యిచ్ఛాశక్తి మరియు విశ్వాసం వుంటుంది.  ఇది నిరంతరం కొనసాగితే అలవాటుగా మారిపోయి ఆ తర్వాత అది అతిసహజసిద్ధంగా దానికై అదే మామూలు విషయమైపోతుంది.  ఆత్మార్పణ, అంకితభావం లేక సర్వం గురువు పరంచేసి విడుదల పొందడం వంటివన్నీ ఆధారంగా వెనుకవుండి, ముఖ్యంగా దివ్యమైన యెఱుక ఒక్కటే నిరంతరంగా చైతన్యవంతమై యుంటుంది.  వ్యక్తిగత మానసము దైవమానసములో యిమిడి వ్యక్తమై, మన ఉనికిలో సర్వత్రా దైవీయ భావన నిండి నిబిడీకృతమై పోతుంది.  ఈ విధంగా మనం ఆత్మార్పణ భావంతో పురోగమించి మనవనుకొన్నవన్నీ కొద్ది కొద్దిగా వదిలించుకుంటాము.  మా గురువుగారి మాటల్లో చెప్పాలంటే, మనల్ని మనం శూన్యం గావించుకొని దివ్యశక్తి మనలోనికి ధారాళంగా ప్రవహింపనీయాలి.  పైప్రక్రియ ద్వారా దీన్ని మనం నిర్వర్తిస్తున్నాము.  ఈ ప్రక్రియలో, పనిలో పనిగా మనలో ఘనంగా దట్టించుకపోయివున్న అహం కరగ నారంభిస్తూ దైవత్వానికి స్థానం కలిగిస్తూ బయటికి వెళ్ళిపోతుంది.  ఈ విధంగా పరిణామ ప్రక్రియ కొనసాగుతూ కొంతకాలమునకు దేహం మొత్తం దివ్యత్వంతో నిండిపోతుంది."

 

        మనకు సంబంధించినవన్నిటిని వాటితో యేమాత్రం సంబంధం లేకుండా మొత్తం గురువుగారి పరం చేయడమన్న భావం శరణాగతిలో నున్నది.  కానీ నేను శరణాగతి నొందినాను అనుభావం తన యెఱుకలో వుంటే, అది వాస్తవార్థంలో శరణాగతి కానేకాదు.  ఇంకా చెప్పాలంటే నేరుగా ప్రయత్నపూర్వకంగా శరణాగతినొందుట, నిజమైన ఫలితముల నివ్వదు.  కనుక మనం ఆ భావం మనలో కలిగేట్లు చేయగల సాధనలు మార్గముల ననుసరించవలసి యున్నది.  నిరంతర స్మరణతో జతచేయబడిన ధ్యానమే యిందుకు అత్యుత్తమమైన మరియు ఖచ్చితమైన మార్గము.  ధ్యాన ప్రక్రియలోనే మనం సృష్టించిన వస్తుసముదాయాన్నంతా కరిగించేయగల విధానమిమిడి వుంది.  కానీ యిది దైవీయమైన యోచన మరియు ప్రయోజనంతో నేరుగా సంబంధమున్నప్పుడే సాధ్యమౌతుంది.  ధ్యానంలో ఒకే బిందువు, అదే దైవంపై మనల్ని మనం సమగ్రపరచుకొని మిగిలిన సర్వస్వాన్ని విస్మరిస్తాం.  కాలక్రమేణా మనమిద్దానితో యెప్పుడు దగ్గరి సంబంధ మేర్పరచుకొంటామో అప్పుడు  మన మనస్సు నుండి అవి తుడిచివేయబడి మనమనుకొంటున్న వాటి నుండి విడుదల పొందుతాము.  ఈ విషయంలో మా గురువుగారి దృక్పదాన్ని ఇక్కడ చేర్చడం గొప్ప ప్రయోజనకారిగా తలుస్తాను.

 

        "శరణాగతి భావనకు సంబంధించిన యెఱుక దానితోపాటే అహంభావపు వృద్ధి యెఱుక గూడా వుంటుంది.  అ భావన లేకపోవడమే శరణాగతి వ్యాప్తి.  మరి ఈ ప్రయోజనానికి గైకొనవలసిన చర్యలేమిటి? అన్నదే యిప్పుడు ప్రశ్న".  మన అభ్యాసము మరియు గురువుగారి కృప వలన మనం శరణాగతిని యెంత వీలైతే అంతగా అలవడజేసుకోవడమే ఉత్తమోత్తమ మార్గం.  దైవకృప అభ్యాసివైపుకు మళ్ళేంత వరకు గురువుగారి శక్తి సహాయపడుతుంది.  ఆ పనైపోగానే ఆయన పని పూర్తిగా అయిపోయిందనలేము గాని, పని మాత్రం చాలావరకు తగ్గింపబడుతుంది.  జనులు భగవత్‌కృప కొఱకు తపన పడతారు.  నిజమే అది ప్రతిక్షణం అవసరమే, కానీ అది ప్రాధమిక దశలో గురువు మాధ్యముననే వారికి లభ్యమౌతుందన్న విషయం వారు గ్రహించడం లేదు.  దైవకృపను ఆహ్వానించడమెలా అన్న విషయం తెలియజేయబడలేదు.  అది కేవలం ఎవరు పొందియున్నారో అంతకంటే ఎవరు దానిలో మునిగి యున్నారో వారు మాత్రమే నిజంగా తెలియజేయగలరు.  ఆవిధంగా అది యెంతో సులభంగా పొందవచ్చును.  కానీ అందుకొఱకు గురువర్యులు కూడా గొప్ప సామర్థ్యము గలవారై యుండుట అత్యంతావశ్యకము.  భగవత్‌కృప లభించుటెట్లన్న సమస్య ఈ విధముగా పరిష్కరింపబడినది.  ఇక అది మనకెట్లుపయోగపడునన్నది రెండవ ప్రశ్న.  ఈ భగవత్‌కృప అభ్యాసి మొత్తము ఉనికిని మార్పుచేసివేయును.  తద్వారా అతడు మరింతగా అందులో మునిగిపోతాడు లేక లీనమౌతాడు.  తత్ఫలితంగా ఆఖరు కతనిలో దైవకృప తప్ప మరేమీ మిగలదు.  అదే దివ్యజ్ఞుడగుట అనుటకు వాస్తవార్థము.

 

        సహజమార్గంలో మొట్టమొదటి దినం నుండి దీనితోనే ప్రారంభిస్తాము.  మనము ఇప్పటివరకు శరణాగతి అను భావనను గణనలోనికే గైకొనలేదు. అయినా ఎక్కడ మన ఉనికి మొత్తం కరిగిపోయిందో లేక తీసివేయబడిందో ఆ స్థితివరకు చేరుకొన్నాము.  వాస్తవమున యిది శరణాగతియా? కాదా? అన్న విషయం నీకై నీవే నిర్ణయించు కోవాలి.  బ్రహ్మానందమునందు లీనమవ్వడమే అన్ని చర్యలయొక్క అంతము.  అందులో శరణాగతి మొదటి ఆడుగు.

 

 

4. ధ్యానమున జరుగు కొన్ని సామాన్య పొరబాట్లు

 

        సహజమార్గ విధానమున సాధారణంగా అనుసరించే ప్రక్రియ హృదయమున దైవీయ ప్రకాశమున్నదన్న భావనతో హృదయముపై ధ్యానము చేయుట.  ఇది సులువైన ప్రక్రియే, కానీ ఒక్కోసారి వ్యక్తిగతమైన ఆలోచనలలోని కలతల మూలంగా చిక్కులు కలిగి అభ్యాసి కందవలసిన పూర్తి ప్రయోజనము అందుటలేదు.  అట్టి వారి ప్రత్యేక సదుపాయమునకై ప్రక్రియలో అపార్థమునకు గురియైన కొన్ని సాంకేతిక విషయములకు వివరణలిచ్చు ప్రయత్నము జరిగినది.

 

        మనము తొలుదొలుత స్పష్టముగా గుర్తించుకోవలసిన విషయము మనము ధ్యానసాధనము చేయుచున్నాము గాని, యేకాగ్రతనభ్యసించడం లేదు. ఏకాగ్రత అనగానే మన మనస్సును ఒకే ఒక ఆలోచనపై గట్టిగా సడలనీక నిలపడమని భావిస్తాము.  ఇది సామాన్యంగా మన ఇచ్ఛాశక్తిని బలవంతంగా ప్రయోగించి మనస్సును అణగద్రొక్కడమో లేక రకరకములైన భావనలను బయటికి బలవంతంగా నెట్టడమో చేస్తాము.  మన అనుభవం మనకు తెలియజేసిందేమంటే మనమెంత బలంగా ఈ పని చేయడానికి ప్రయత్నిస్తామో అంతకంటే బలంగా హృదయంలో ప్రతిఘటన పెరిగి ఆలోచనల తీవ్రత మరింతగా పెరిగిపోతుంది.  తద్మూలంగా అభ్యాసి మానసిక ఘర్షణలో పెనుగులాడి తుదకు ధ్యానము చేయనేచేయలేడు.  మనము ధ్యానంతో ప్రారంభించి, దానిలో లీనమై సమాధి తొలిదశకు లేక యేకాగ్రతకు చేరుకుంటాము.  ఈ విధమైన యేకాగ్రతను ముందు నిర్వచించిన యేకాగ్రతతో పోల్చి పొరబడరాదు.  దానికి ఇచ్ఛాశక్తి ప్రయోగమవసరమై యున్నది.  ఈ విధమైన యేకాగ్రత కొఱకు అభ్యాసి తనలో తాను ఘర్షణ పడవలసిన అవసరం లేదు.  వ్యక్తి దైవయోచన లేక భావంలో లీనమై ధ్యానం చేయడం వలన సమకూరే ప్రయోజనమే యిది.  కనుక నిజమైన యేకాగ్రత క్రమంగా ధ్యానానంతరం కుదురుతుంది.  అందుచేత తొలుదొల్తనే యేకాగ్రత కోసం ప్రయత్నించడం తప్పుడు పద్ధతి.  అసలు యేకాగ్రత అన్నభావనే లేకుండా అభ్యాసి సరళంగా, సహజంగా ధ్యానాన్నభ్యసించాలి.  ధ్యానమంటే ఒకే ఆలోచన మళ్ళీమళ్ళీ చేయడమని గ్రహించాలి.  ప్రారంభస్థాయిలో యిది అంతరాయాలతోను, అడ్డంకులతోను నడుస్తుంది.  కొంతకాలం తర్వాత యిది అతీంద్రియ మానసంలో, యెఱుకలేని ఆలోచనా స్థితితో కలిసి నిరంతరాయంగా కొనసాగుతుంది.  అదే సరియైన ధ్యానము.  ఈ దృక్పదంతోనే మనం ధ్యానాన్ని చేపట్టి యేకాగ్రత కోసం యేమాత్రం శ్రమించక భౌతిక, మానసిక బడలికకు లోనుగాకుండా ముందుకు కొనసాగాలి.

 

        ఇక అభ్యాసి పొరబడి కలతనొంది తరచూ ఫిర్యాదు చేసే తర్వాతి అంశమేమంటే, తాను కాంతిని దర్శించలేక పోతున్నాననుట మరియు హృదయ స్థానమును సరిగ్గా గుర్తించలేక పోతున్నాననుట.  ఇది కేవలం అర్థం చేసుకోవడంలోని పొరబాటు మాత్రమే.  అసలు కాంతిని దర్శించడం కాదు ముఖ్యంగా మనకు కావలసింది.  అది కేవలమొక సూచనా మాత్రమైన భావన మాత్రమే.  కాంతిని దర్శించాలని తాపత్రయ పడుతున్నారంటే దాన్నొక వస్తుపరిధిలోనికి తేవడమే.  అంటే అది వారు మానసికంగా యేదో ఊహించుచున్నదాని ఫలితమే. కనుక దృష్టికి వచ్చిన వస్తువు యేదైనా వుంటే అది కేవలం కృత్రిమమైనదే కాని వాస్తవం కాదు.  ఇంకా చెప్పాలంటే కాంతి మన ధ్యేయం కాదు.  మన ఆలోచన నిలుపుకోవడానికదొక ఆధారంగా మాత్రమే గ్రహిస్తున్నాము.  తద్వారా నిజమైన కాంతి గల్గిన లేక వైభవోపేతుడైనవాని వైపునకు సాగిపోతాము.  ఈ విధంగా మనం గుణం నుండి గుణధాముని వైపునకు, కనబడే దాని నుండి దాని మూలము (అసలు) నకు మనం పయనిస్తున్నామన్న మాట.  కనుక మనం కాంతిని అసలు దర్శించినా దర్శించకపోయినా యేమీ మించిపోయింది లేదు.  సరైన పద్దతేమంటే సాధకుడు తన ధ్యాసను సున్నితంగా హృదయంవైపునకు మరల్చి అక్కడ ఈశ్వరీయ ప్రాకాశమున్నదనుకొనుటే.  హృదయ స్థానమును గుర్తించుట లేక కాంతిని దర్శించుటకు చేయు ప్రయత్నములన్నీ వదలి వేయవలెను.

 

        ధ్యానసమయంలో మెలుకువతోనున్నామా అన్న విషయమొక సమస్యయై మనలను కొన్ని సమయాలలో కలవర పెడుతూ వుంటుంది.  సామాన్యంగా ధ్యానం ధ్యేయంపై యెఱుక గల్గిన స్థాయిలో ప్రారంభించి కొద్దిసేపటికి తెలిసే మరపులో పడిపోతాము.  అప్పుడు సాధకుడు తను ఆ సమయంలో ప్రక్కదారిన పడిపోయి ధ్యానం తప్పిపోయిందనే నిర్ణయానికొస్తాడు.  కానీ అది సరికాదు.  భౌతిక మనస్సుతో మన యోచన సంబంధమేర్పరచుకొని యున్నంత కాలం మాత్రమే యెఱుక గలిగి వుంటాము.  ఎప్పుడది యెఱుక యొక్క సున్నితమైన లోతుపొరలలోనికి ప్రవేశిస్తుందో అప్పుడు బాహ్య యెఱుక కోల్పోతుంది కానీ ప్రశాంత ధ్యానం యెఱుకలేని అతీంద్రియ మానసంలో కొనసాగుతూ వుంటుంది.  అట్టి సమయాలలో చేయవలసిందేమంటే, మనస్సు మార్పులో పడిపోయిందన్న జ్ఞాపకం రాగానే, ముందుటి యెఱుకలేని స్థితిని గూర్చి యేమాత్రం చింతించక తిరిగి మనస్సును ధ్యేయంవైపు మరల్చి మళ్ళీ ధ్యానం మొదలుపెట్టి కొనసాగించాలి.

 

        మరొక పొరబాటు యోచన, బహుఃశా చాలా తీవ్రమైనదని భావింపబడుతున్న యోచనేమంటే, విపరీతమైన అసందర్భ యోచనలు ధ్యానసమయంలో మనస్సులోనికి చొచ్చుకొని రావడం.  ఇది అభ్యాసికి అమితమైన ఆందోళనకారి.  నిజానికి సక్రమంగా అర్థంచేసుకుంటే యిదేమంతగా చితించాల్సిన విషయమేకాదు.  నిరంతరాయంగా సాగే ఆలోచనల ప్రవాహం కేవలం ధ్యానసమయానికి మాత్రమే పరిమితమై లేదు.  అది అన్ని సమయాల్లోను నిరంతరం సాగుతూనే వుంది.  కానీ ధ్యానసమయాల్లో అది మరింత తీవ్రరూపం దాలుస్తుంది.  ఎందుకంటే ఆ సమయంలో మనం మన ఆలోచనలను, భావాలను ఖాళీచేయాలని చూస్తాము.  మరోమాటలో చెప్పాలంటే మనం మన యెఱుకగల మనస్సును ఆలోచనా శూన్యం గావించాలని ప్రయత్నిస్తాం.  శూన్యంలోనికి గాలి యెలా బలంగా చొచ్చుకొని వస్తుందో అలాగే ఆలోచనాశూన్యంలోనికి ఆలోచనలు కూడా బలంగా చొచ్చుకొని వచ్చేస్తాయి.  ఎఱుక యొక్క అంతర్గత పొరలలో ఓ పెద్ద ఆలోచనల భాండాగారం నిక్షిప్తం చేయబడి వుంది. ధ్యాన ప్రభావం వలన యెఱుకగల మనస్సులో ఎప్పుడు ఖాళీ యేర్పడుతుందో అప్పుడు నిక్షిప్తమైయున్న ఆలోచనలు యెగసివచ్చి యేర్పడిన ఖాళీలోనికి దూసుకురావడానికి ప్రయత్నించే సమయంలో స్థూలమైన బాహ్యమనస్సు ఆ ఆలోచనా ప్రవాహపు ప్రభావానికి కొంతవరకు లోనవుతుంది.  మనస్సు క్రమబద్ధీకరీంచి వుండక పోవడం వలన ఆ ఆలోచనా ప్రవాహంతోపాటే ఆటుపోట్లకు గురై అన్నిరకాల యిబ్బందులకు ఒడుదుడుకులకు గురౌతుంది.  వాస్తవానికి ఎగిసిపడుతున్న ఆలోచనలు అభ్యాసిని కలతపెట్టడం లేదు.  కానీ అభ్యాసి వాటితో మితిమీరి సంబంధమేర్పరచుకొని తనే నేరుగా వాటితో ఘర్షణ పడుతున్నాడు.  ఈ విధమైన ప్రతిచర్య కారణంగానే ఆలోచనల శక్తి మరింత పెరిగి కలత ఉధృతమగుచున్నది.

 

        ఇట్టి పరిస్థితుల నెదుర్కొనుటకు సామాన్యముగా యివ్వబడు సలహా బలవంతముగా మనస్సును అణచివేయుటకు తీవ్రప్రతిఘటనలను, శరీరమును కఠినముగా హింసించు ప్రక్రియలను అనుసరించమందురు.  మనస్సును సామాన్యముగ పొగరుబోతు గుఱ్ఱముతో పోల్చుదురు.  దానిని అదుపుచేయుటకు ఒక చురుకైన చెర్నాకోలదెబ్బ అవసరమని తలంతురు.  కానీ ఆ చురుకైన దెబ్బ మానసిక చెడువృత్తులను కొంతకాలము అణచివుంచి అవి కార్యరూపము దాల్చకుండా ఆపుచేయగలదేమోగానిమరోమాటలో చెప్పాలంటే మనస్సులోని దోషము ఉన్నదున్నట్లు అట్లే అక్కడే వుండనిచ్చి దాని పైస్వరూపమును మాత్రము అదుపు చేసినట్లయినది.  ఇలా యెంతవరకు సఫలీకృతమైతిమో అనుమానాస్పదమే.  ఇదంతా కేవలం మనస్సు భౌతికంగా శక్తిహీన స్థితిలో నుండి తనలో నిక్షిప్తమైయున్న దూర్త విషయమును బహిర్గతము చేయలేకుండా వున్నంత కాలమే.  యేదోవిధముగా బలవంతంగా అదుపులో వుంచబడిన శక్తి విడిపించుకొని బయటపడిందంటే అది ఎప్పటికైన తన ప్రతాపం తాను చూపి తీరుతుంది.  అంటే యిది జీవితాంతం జరిపే పోటీ ఆటగానే మిగిలి, ఆటుపోట్లు, అపజయాలతోనే కొనసాగుతూ వుంటుంది.  అంతేగాకుండా మనస్సును భౌతికంగా, శారీరక కఠిన పరిశ్రమ ద్వారా అణచిపెట్టడం వలన అది అంతర్గత స్థూలత్వమునకు దారితీసి మనస్సు అభివృద్ధి దిశగా పయనించలేక సూక్ష్మస్థానముల నధిరోహించజాలదు.  వాస్తవానికి మనస్సు నణచియుంచడం వలన మనకు ప్రయోజనము నెరవేరదు.  కానీ దానిని సరిచేసి సక్రమముగా దానిచర్యలను క్రమబద్ధీకరించుటే అనువైన పని.  ఇది చెర్నాకోల చురుకు దెబ్బలతో సరిచేయబడదు.  కానీ, అంతర్గత శుద్ధీకరణము ద్వారా లోనిచెడును బయటకు నెట్టివేయడం వలననే సాధ్యపడుతుంది.  మనిషిలోని ప్రకృతిని మార్పుజేసి నిజమైన మనిషిగా తీర్చుదిద్దు ప్రతిభావంతమైన మార్గమిదొక్కటే.

 

        దురదృష్టవశాత్తు బోధకులలో కొందరు ఆధ్యాత్మిక శిక్షణనిచ్చెదమని చెబుతూ వారు స్థూలయిచ్ఛాశక్తి నుపయోగించి ఆలోచనలను అణచివైచి చేష్టలుడిగిన (కోమా) స్థితిని సాధకులలో కలిగించుచున్నారు.  దీని వాస్తవ సత్తాను అర్థము చేసుకొనలేని అభ్యాసి ఎంతగానో అబ్బురపడి గొప్పస్థితిగా భావిస్తాడు.  కారణం అది అతనికి యింద్రియ సుఖమును కలుగజేస్తుంది.  దాన్నతడు ఆనందమని పొరబడతాడు.  నిజమైన ఆనందాన్ని యింద్రియముల కార్యకలాపములతో కూడినదేదియు యివ్వజాలదు.  ఇది కేవలం యింద్రియముల ఒక క్రీడ మాత్రమే.  కనుక ఆధ్యాత్మిక పరిధికి బహుదూరమైనది.  భావాలను అణచివుంచడమే సాధారణంగా శాంతియని అపార్థము చేసుకుంటారు.  ఇది పైవాటి వలెనే మరొక పొరబాటు.  ఇది క్లోరోఫారం ప్రయోగం వలన యేర్పడిన స్మృతిలేని స్థితికంటే యెక్కువ కాదు.  కనుక ఆధ్యాత్మికతకు యేవిధంగానూ, లేశమైనా సంబంధము లేదు.  మరోరకంగా చూస్తే ఆలోచనలను ఆపుచేయడం హానికరం కూడా.  అలా ఆలోచనలను బయటపడకుండా లోపలే మనస్సులో పాతిపెడితే వాటి భోగము లేక అనుభవమనేది నిలిచిపోతుంది.  ఈ భోగ ప్రక్రియ పూర్తికాని యెడల మోక్షము (స్వేచ్ఛ) సిద్ధింపదు.  ఈ విధంగా ఆలోచనల నణచివైచుటచే మోక్షద్వారమును శాశ్వతంగా మూసివేస్తుంది.

 

        సాధ్యమైనంత వరకు, ఆధ్యాత్మిక ప్రయోజనం కొఱకు మనం ఆలోచనల నుండి స్వేచ్ఛపొందాలి.  కానీ అది అణచివేత ప్రక్రియ ద్వారా యేర్పడరాదు.  కానీ మనస్సులోని విషమును బయటకు త్రోసివేయడం ద్వారా సాధ్యపడాలి.  ఈ విధానమున ఆలోచనల ఉత్పత్తి నిలిచిపోతుంది.  పాతిపెట్టబడిన ఆలోచనలు బయటపడడం వలన వాటి భోగమునకు అవకాశమేర్పడి ఆలోచనా బాండాగారము ఖాళీ అవుతుంది.  ఈ ప్రక్రియ వలన కొలది కాలానికి అభ్యాసి వాటినుండి విముక్తిపొంది ప్రశాంత స్థితిని పొందుతాడు.  అతని మానస సరస్సులోని అలలు బాగా తగ్గిపోయి స్వచ్ఛమైన ప్రశాంతత అంతటా అలముకొంటుంది.

 

        కనుక సరియైన విధానమేమంటే, ధ్యాన సమయంలో ఉత్పన్నమైన మానసిక ఆలోచనలను లక్ష్యపెట్టక, వాటిని ఆహ్వానించకయే వచ్చిన అతిథులను యెట్లు పట్టించుకొనమో అట్లు వాటిని గమనించక ఊరకుండవలెను.  అలాచేస్తే వాటి తీవ్రత నశించిపోయి, అవి కలతకు కారణం కాకుండా వుంటాయి.

 

*****             *****


V.  సహజమార్గము

 

శ్రీ రామచంద్ర మిషన్

 

        ఈ ఆధ్యాత్మిక సంస్థ గొప్ప గురువర్యులైన సమర్థగురు మహాత్మా శ్రీ రాంచంద్రజీ మహరాజ్, ఫతేఘడ్ (ఉ.ప్ర) వారి పేరున స్థాపింపబడినది.  వారి జీవితము ఆధ్యాత్మిక మేల్కొల్పునకు ఒక నూతన యుగారంభము.  ఆయన ఈ కాలానుగుణముగా జనుల సామర్థ్యమునకు తగినట్లు సరిదిద్దబడి, మెఱుగు పరచబడిన యోగవిధానమున జనులకు ఆధ్యాత్మిక శిక్షణ నిచ్చెను.  చాలా కాలం క్రితమే మరుగున పడిపోయి విస్మరింపబడిన ప్రాణాహుతి లేక యోగశక్తి ప్రసార ప్రక్రియను మరల వెలుగులోనికి తీసుకొనివచ్చి, ఈ ఆధ్యాత్మిక సంస్థ యొక్క ప్రాధమికాంశముగా ప్రవేశపెట్టి అనుసరింపజేసెను. ఈ సంస్థను ఆయన అనునాయుడు మరియు ఉత్తారాధికారి అయిన బ్రహ్మశ్రీ మహాత్మా శ్రీ రాంచంద్రజీ, షాజహాన్‌పూర్ (ఉ.ప్ర) వారు 1945లో స్థాపించిరి.  వారు వ్యాప్తిగావించిన ఈ విధానము సహజమార్గము లేక ప్రకృతి సిద్ధపథముగా గుర్తింపబడినది.  ఇది ఆయన స్వానుభవమున పరీక్షించి నిగ్గుతేల్చిన ప్రత్యేక యోగ విధానము నాధారము చేసుకొని నిర్మింపబడినది.  ఈ విధానము యితర విధానముల కల్తీలతోగాని, మూఢనమ్మకములపైగాని ఆధారపడక, స్వచ్ఛమైన ఆధ్యాత్మిక సిద్ధాంతములపై సాగుచున్నది.  ఇది అత్యంత సరళమైనది.  అయినప్పటికిని చాలా ప్రతిభావంతమైనది.  ఇది నేటి సామాన్య జీవన విధానమునకు అతి సులభముగా సర్దుబాటు చేయబడినది.  ఇది భగవత్‌సాక్షాత్కారము తప్పక కలిగించు దగ్గరి దారిని సూచించి, బాధాతప్త మానవజాతికొక వరమై భాసిల్లుచున్నది.

 

యోగమునకు సంబంధించిన అపోహలు

 

        పతంజలిమహర్షి చేత ప్రతిపాదించబడిన యోగ విధానమొక్కటే ఆధ్యాత్మికతకు అతి సన్నిహిత సంబంధము గల మార్గమని భావింపబడుచున్నది.  కానీ అది స్థూల పదార్త ప్రభావము నుండి సంపూర్ణముగా స్వేచ్ఛ వడసి యున్నదని హేతుబద్ధ పరిధిలో అంగీకరింప జాలము.  పతంజలీ యోగ ప్రాధమికాంశములు మొత్తము మీద భౌతికములు.  అవి ఆ పరిధి వరకే ఉపయోగపడును.  నిజమైన ప్రక్రియ ధారణతో మొదలై ఆతర్వాతివయిన మూడు నిజమునకు ఆధ్యాత్మిక లక్షణములు గలవి.  మొదటిదైన ధారణ, మిగిలిన రెండింటికి సన్నాహక ఆధారంగా పనిచేస్తుంది.  ఈ విధంగా సమగ్రపరచి అందజేసిన యోగి నిర్ద్వందంగా మానవలోకానికి విశేష సేవలందించినాడు.  అందులకాయన పూర్తిగా అభినందనీయుడు.  కానీ ఆయన కాలములో యేది అత్యున్నతమైనదో అది మారినకాలంతో నేటి ప్రపంచానికి సరిగ్గా సరిపోనిదిగా సర్దుబాటు చేసుకోలేనిదిగా మారిపోయింది.  పాతవిధానం ప్రకారం కఠినపరిశ్రమ, తపనతో గూడిన పద్ధతులు అవసరమైనవిగా భావింపబడేవి, నేటి సామాన్య జీవనవిధానమునకవి అనుసరించ వీలుగాకున్నవి.  కనుక ఈ విధానము యెప్పుడూ సామాన్య జనులలో ప్రసిద్ధికెక్కలేదు.  అంతేగాకుండా అనేక పైపై ఆచారవ్యవహారములు, అసలు పద్ధతిపై అనుభవరహితులైన బోధకులు కేవల సిద్ధాంతవాదులు రుద్ధివైచినారు.  అయినా కొందరు మేము యోగాభ్యాసం చేస్తున్నామని చెప్పుకొంటున్నారు గాని వారు భౌతిక ప్రయోజనాన్నాశించి కండలు, నరముల బలము పెంచుకోవడము లేక కొన్ని అసాధారణ శక్తులు సమకూర్చుకోవడం కొఱకు మాత్రమే చేస్తున్నారు.  వారు యెక్కువగా భౌతిక వ్యాయామములైన ఆసన మరియు ప్రాణాయామములతో సరిపుచ్చుకొని సూక్ష్మతవైపు ఒక అంగుళం కూడా కదలడం లేదు.  వారికి శరీరం స్వాధీనం తప్పడం (కోమా) ఒక పెద్ద విజయంగా భావిసున్నారు.  దాన్ని సాధించడానికి మనస్సును, యింద్రియములను హింసకు గురిచేస్తున్నారు.  ఆస్థితి (కోమా) ని వారు సమాధిగా అపార్థము చేసుకొంటున్నారు.

 

        భగవంతునికి అతి సన్నిహితమైన సూక్ష్మాతి సూక్ష్మ ఉనికికి చేరడమే యోగముయొక్క అంతిమ లక్ష్యము.  అట్టి లక్ష్యసాధనకు చేపట్టిన విధానము కూడా అంతే సూక్ష్మము మరియు సహజమునై, మన అంతరంగములో వీలైనంత అధిక సూక్ష్మస్థితి నెలకొనేటట్లు చేయాలి.  స్థూలపద్ధతులు స్థూలమైన ప్రభావమునే చూపుతాయి. అవి సుదూర కాలగమనంలో మనకు హానిచేస్తాయి.  ఈ పరిణామముల దృష్ట్యా పతంజలి మహర్షిచే సిద్ధాంతీకరించబడిన విధానాన్ని సరిచేసి స్థూలప్రభావాన్ని తొలగించి సూక్ష్మఫలితములను వీలైనంత తొందరగా పొందేటట్లు చేసుకోవలసివున్నది.

 

వినూత్నదర్శనము

 

        వాస్తవానికి సంపూర్ణ ప్రక్షాళన గావింపబడిన పతంజలి యోగవిధానము మనకు సహజమార్గములో లభ్యమౌతున్నది.  పతంజలి యోగ విధానము నుండి భౌతిక, అసాధారణ, మార్మిక ప్రక్రియల తొలగించి ఆద్యంతము స్వచ్ఛమైన ఆధ్యాత్మిక విధానములో నడిచి యేమాత్రము కలుషితము కాకుండా నిర్మించబడినది.  అందుచేత యిది యోచనా ప్రపంచానికే ఒక వినూత్నదర్శనమై ఒక విలువైన తనవంతు సహాయాన్నందించింది.  ఇది అన్ని తాత్త్విక విధానాలతో ఒద్దిక కలిగియున్నప్పటికి తనదైన ప్రత్యేక ఉనికిని చాటుకొనుచున్నది.  వేదాంత విధానము ప్రవేశపెట్టబడినది మొదలు యింతవరకు చెప్పుకోదగ్గ నిర్దుష్టమైన అభివృద్ధి ఈ శాఖలో చోటుచేసుకొనలేదు.  అయితే ఉన్న పాతవాటినే అనేక వక్రమార్గములలో అటూయిటూ త్రిప్పిత్రిప్పి చాలా పెద్దపెద్ద మార్పులైతే తీసుకురావడం జరిగింది.  వీటిని చాలా మంది వ్యాఖ్యాతలు వారివారి మేధస్సు చేతను, హేతువాదం చేతను శోధించ యత్నించి, యేమాత్రం అనుభవంతో కూడిన లోచూపులేక, వివిధ వర్ణములద్దిన ఒకే చిత్రాన్ని మన ముందుంచి సందేహములు మరియు వైరుధ్యములు పుట్టుకరావడానికి మాత్రం దోహదపడ్డారు.  ఒక పదార్త సంబంధమైన సమస్యను సాధారణ హేతువాదముతో అర్థము చేసుకొనవచ్చును.  అసాధారణ మేధసంపత్తి, ప్రతిభతో ఒక సలక్షణమైన సిద్ధాంతమును నిర్మింపవచ్చును.  కానీ భగవంతుడు లేక ఆత్మవంటి సూక్ష్మవిషయములపై యిది సాధ్యముకాదు.  అయితే ఇదే భారతీయ తాత్విక విధానమునకు మూలమై యున్నది.  ఈ విధమైన దృక్పదము దృఢముగాగల భారతీయ తత్త్వవేత్త హేతువాదనతోనూ, ఊహామాత్రము, సంశయాత్మకమునైన వాటిపైకంటే తన పరిశీలనలో తేలిన మరియు స్వానుభవమున గ్రహించిన వాటిపైనే యెక్కువ ఆధారపడును.  ఈ సందర్భమున మాగురువుగారి మాట నొకదానిని అనువదించి చెప్పడం సబబనుకుంటాను.  నేటి తత్త్వవేత్తల ఉద్దేశ్యం ప్రకారం తాత్త్వికత సందేహంతోనే ప్రారంభమౌతుంది.  ఇది శుద్ధతప్పు.  ఇలా అనుకోవడమంటే, ముందే ఒక విషయ పరిజ్ఞానము నూహించుకొని ప్రయత్నించుట వంటిది.  ఇది ఒక తప్పుడు భావనను ముందుగా గ్రహించి తప్పుద్రోవ పట్టి వృధాప్రయాస గలిగించునదిగా వుండవచ్చును.  తాత్త్వికతకు నిజమైన మూలాధారము వారన్నట్లు ఆశ్చర్యమేకాని సంశయము కారాదు.  ఆశ్చర్యమంటే అందులో తెలియనితనము మరియు తెలుసుకోవాలనే ఆతృత యిమిడియున్నవి.  అది మాత్రమే విషయ వాస్తవికతను, తప్పుడు యోచనకు తావియ్యకుండా నీకందుబాటులోనికి తేగలదు.

 

        తత్త్వశాస్త్రము హేతువాదము మరియు నిర్ణయములపై ఆధారపడదు.  భారతీయ తత్త్వవేత్తలు తాము స్వయముగా పరిశీలించి దానికి సంబంధించిన అనుభవమును అతీంద్రియములైన సూక్ష్మస్థాయిలలో పొంది విశ్లేషించి గానీ వాటిజోలికి పోరు.  వాటిని మార్పు చేయుటకు అవసరమేర్పడి కాలమాసన్నమైనప్పుడు మాత్రమే ఆ భగవదిచ్ఛ మానవజాతి సముద్ధరణకు అట్టి మహాత్ములను భూమి మీదకు అవతరింప జేయును.  అదృష్టవశాత్తు అట్టి సమయమిప్పుడాసన్నమైనది.  సహజ మార్గము ప్రపంచమునకు ఒక నూతన అనుభవపూర్వక తాత్త్విక విద్యను సరళము మరియు సులభము గావించి నేటి సమకాలీన పరిస్థితులకు మరియు జనుల సామర్థ్యమునకు అనువైనదై భగవత్‌సాక్షాత్కారమే ధ్యేయముగా నిర్మింపబడియున్నది.

 

శాస్త్రీయమైన విధానము సహజమార్గము

 

        శాస్త్రీయము మరియు హేతువాద సమ్మతమునైన ఈనాటి కాలమున సామాన్యుని సమ్మతింపజేయ వలయునన్న, అది శాస్త్రీయాధారయుక్తము. మరియు శాస్త్రీయ భాషలోనే వుండి తీరవలెను. లేకున్నచో విశ్వసింపరు.  సర్వసాధారణముగా "శాస్త్రీయము" అనెడి మాట భౌతిక పరిశీలనకు సాధ్యపడి పరిశోధనశాలలో నిగ్గుతేల్చబడిన విషయమును మాత్రమే సూచించును.  ఇది పదార్థవిజ్ఞాన పరంగా నిజమే కావచ్చును.   ఇది పదార్థపు స్థూలత్వము మాత్రమే లెక్కలోనికి తీసుకొనును.  కానీ ఆత్మ లేక అహం వంటి సూక్ష్మ సమస్యలకు సంబంధించి నవీన శాస్త్రము యేవిధమైన నమ్మిక గల్గించు వివరణ లేక పరీక్షచేసి చూపి నిరూపించలేదు.      వాస్తవానికి       పదార్థశాస్త్రము,

ఆధ్యాత్మికశాస్త్రమూ రెండూ ఒకదానికొకటి సంబంధము లేనివి.  ఆధ్యాత్మికశాస్త్రము అంతర్గత యెఱుక మరియు సూక్ష్మమైన అనుభవములపై ఆధారపడును.  అందువలన సహజమార్గము రాజయోగము యొక్క అసలైన సారముపై ఆధారపడియున్నందున నిస్సంశయ శాస్త్రీయ విధానము.

        మానవ చర్యలన్నింటికి కేంద్రమైన ముఖ్యశక్తే మనస్సు.  అది నిరంతర చైతన్యవంతమై యెప్పుడూ మన బాహ్యాంతర సమస్యలు చిక్కులను అనవసరంగా అల్లికచేయడంలో నిరంతరం పనిచేస్తుంటుంది.  మానవ జీవితము అనేకాంశములకు చెందిన కార్యకలాపములు గలిగియున్నది.  వాటిని వస్తుసంబంధితములు మరియు ఆధ్యాత్మికములు అను రెండు పెద్ద విభాగములుగా గమనించనగును.  సాధారణంగా యెక్కువ మంది జనులు వస్తుదృష్టియే గలిగియుండి, ప్రాపంచిక దిశకే మరలి దైవీయ దిశకు అస్సలే తిరగరు.  అయినప్పటికి భారతదేశములో కొద్దిమంది మాత్రము పూర్తిగా దైవమునకే అంకితమై ప్రాపంచిక విషయములను మొత్తంగా విస్మరించిరి. కానీ వాస్తవానికి మానవ జీవితము ఒక సంపూర్ణ సమన్వయమై అనేకాంశముల నంతర్గత మొనర్చుకొని జీవితములో వాటివాటి ప్రాధాన్యత వాటికిచ్చి, వాటిని కర్తవ్యముగా నెరవేర్చవలసి యున్నది.  ఇటువంటి పరిస్థితులున్నందువలన ప్రాపంచిక విషయముల కొఱకు దైవీయమైన వాటిని, దైవీయమైన వాటికొఱకు ప్రాపంచికములను నిర్లక్ష్యము చేయుట యేవిధంగాను సమర్థనీయము కాదు.  ఈ రెండూ కూడా సమానమైన దోషభూయిష్టములే.  తప్పుద్రోవ పట్టించు నట్టివే.  సహజమార్గము ఈ రెండింటిని సరియగు పాళ్ళలో లెక్కలోనికి తీసుకొని ఒకదానితో ఒకటి సత్సంబంధ మేర్పరచుకొని ప్రశాంతజీవనమును గడుపుటను ప్రోత్సహించును.  అంటే ప్రాపంచిక మరియు దైవీయ జీవనముల రెండింటిని సమన్వయ పరచును.  ఇది కృత్రిమ విధానములైన వ్యతిరిక్తత, తపింపజేయుట మరియు హింసాత్మక చర్యలను చేపట్టదు.  సిద్ధులను, శక్తులను సాధించు యత్నములను నిరసించును.  వాస్తవార్థంలో సహజమార్గము మానవుని ప్రాపంచిక కర్తవ్యములను తన దైవీయ విధిగా తలంచమని బోధించును.  రెండింటిని సమన్వయ పరచును.  మరో విధంగా చెప్పాలంటే ప్రాపంచిక జీవనమును దైవీయ జీవనముగా అతి సులభ మార్గమున మార్పుజేయును.  అందుకొఱకు సహజమార్గము సరళము మరియు ప్రకృతి సిద్ధమైన ప్రక్రియల ననుసరించి అతి సులభముగా నేటి సాధారణ జీవనమున సర్దుబాటు ధోరణి నవలంభించును.

 

        ఈ విధానములో నియమించిన నిబంధనలంటూ యేమీలేవు.  ఒక సమర్థుడైన గురువు యొక్క సహాయ మార్గదర్శకత్వమున ధ్యానమొక్కటే యిందులో చేయవలసినది.  ఇందులో ఆచార వ్యవహారములేవియు లేవు.  కొన్ని తగినవి, కొన్ని తగనివి మాత్రము చెప్పబడుచున్నవి.  ఇది "యిమ్ము, గైకొనుము"  లేక "చేయుము, అనుభవింపుము"  అన్న ప్రాతిపదికపై నడచునేగానీ "చదువుము, ఆనందింపుము" లేక "వినుము, నమ్ముము" అన్న మాటలతో సరిపుచ్చుకొనదు.  ఇందులో నమ్మడము, నమ్మకపోవడమన్న దేమియూలేదు.  ప్రతిదీ నిర్వివాదంగా, సులభంగా చేయదలచుకొన్న ప్రతీవ్యక్తికి అనుభవములోనికి వచ్చునదైయున్నది.  ఈ విధానములో అనుసరించు ప్రక్రియ సహజమై ప్రతిభావంతమై యున్నది.  మనుషులలో అత్యంత పతనావస్థకు చెందిన వాడైనా తన మాలిన్యపు పొరలను ఒక్క క్షణంలో ప్రక్కకు నెట్టి, అద్భుతమైన వేగముతో స్వేచ్ఛ వైపుకు పురోగమించగల చక్కటి అవకాశ మీవిధానమున నున్నది.

 

లక్ష్యము

 

        మానవుల కందరికి ఈ విధానము ఆధ్యాత్మిక పునరుజ్జీవనమును ప్రసాదించు లక్ష్యముతో పనిచేయుచున్నది.  ఇందులో మతము, జాతి లేక దేశ భేదమును పాటింపక నేటి కాలమాన పరిస్థితులు మరియు ప్రకృతి అవసరముల కనుగుణముగ సర్వజనాళికి అందుబాటులో నున్నది.  ప్రపంచములోని సమస్త సమస్యలకు పరిష్కారము ఆధ్యాత్మిక మేల్కొల్పు వలన లభించుచున్నది.  అది సాధించుటకు సరియైన ఆధ్యాత్మిక శిక్షణ అవసరము.  స్థూల పదార్థతత్త్వమునకు దగ్గరగా అతుక్కొని వుండుట ఒక గొప్పదోషము.  ఇది అంతమైతే మన సమస్యలన్నీ ఒక్క క్షణంలో పరిష్కరింప బడతాయి.  నిరంతర దైవధ్యాసతో ఆధ్యాత్మిక జీవన విధానమును చేపట్టినట్లయిన ఇది సుసాధ్యము.  ఆధ్యాత్మికత అనునది ప్రస్తుతము మనమున్న స్థూలాతి స్థూలమైన ఉనికి నుండి సుదూరముననున్న అత్యంతోన్నత స్థాయిలలోని సూక్ష్మతవైపుకు పయనించుట.  ఆ మార్పులేని అంతిమస్థితిని చేరి అందులోనే శాశ్వతముగా స్థిరనివాస మేర్పరచుకొనుటే సహజమార్గ అంతిమ లక్ష్యము.

 

సహజమార్గపు పనితీరు

 

        ప్రాణాహుతి ద్వారా ప్రవేశపెట్టబడిన దైవీయ స్పందనలు అభ్యాసి మనస్సుపై ప్రభావము చూపి, దానినొకవిధమైన మహోన్నత యెఱుక స్థితిలోనికి గొనివచ్చుటకు సహాయపడును.  దానిఫలితముగా అతడు అంతర్గత మేల్కొల్పును గమనించును.  మనోవృత్తులు దివ్యత్వము వైపునకు యెక్కువగా మరలి ముందుటిస్థితికన్నా మరింత నెమ్మది మరియు ప్రశాంతత ననుభవించును.  ఇది ఈ విధానమున వేయగలుగు ఆధ్యాత్మికపురోగతినందలి మొదటి అడుగు.  ఇప్పుడు ప్రాణాహుతీ ప్రసారస్పందనలు సున్నితమైన ఉనికికి సంబంధించిన యెఱుకగల అంతర్గత పొరలపై చర్యనారంభించును.  సామాన్యముగా తొలిదశలో యెఱుకగల మానసమును యిది అసలే సృజింపదు.  యేదైనా ఒక ప్రత్యేకమైన సందర్భములో అది కూడా అత్యవసరమైనప్పుడు మాత్రము యెఱుకగల మానసమును సృజించడం జరుగవచ్చును.  ఈ స్పందనల ప్రభావము కారణశరీరముపై నాటుకొని అక్కడ దైవీయ ముద్రల నేర్పరుస్తుంది.  ఈ ముద్రలు చిన్న బీజముల రూపమున లోలోతులలో విత్తబడియుండి  కాలమాసన్నమైనపుడు భోగానుభవమునకై వృద్ధినొందును.  ఈ భోగప్రక్రియ స్వతఃసిద్ధముగా ప్రారంభము కాగానే దాని పర్యవసానంగా స్పందనల ప్రభావం వ్యాపింప నారంభిస్తుంది.  కొంతకాలము తర్వాత అది వ్యాపిస్తూ కారణమనస్సును చేరి తర్వాత యెఱుకగల స్థూల మానసమునకు దిగి తదనుగుణముగా రూపుదాలుస్తుంది.  ఈ దశలోనే అభ్యాసి సామాన్యంగా కొంత సూక్ష్మ మార్పును తన అంతర్గత మనోవృత్తులలో గమనించడం ప్రారంభిస్తాడు.  ఈ కారణం వలననే అభ్యాసి తొలినాళ్ళలో కొంత సమయం వరకు ఆ స్పందనల ప్రభావాన్ని తరచూ గమనించలేక పోతాడు.  కానీ ఈ విధంగా ఉత్పన్నమైన స్పందనల ప్రభావం లోతుగాను శాశ్వతంగాను వుంటుంది.  కారణం ఈ ప్రక్రియ కేంద్రం నుండి పరిధులకు ప్రవహించే విధానంలో వుంటుంది.  మనస్సును తీర్చిదిద్దు ప్రక్రియ చాల సహజంగా, యేవిధమైన భౌతికపరిశ్రమ, మానసికఒత్తిడి లేకుండా సాగిపోతుంది.  సాధనను కొంతకాలం కొనసాగిస్తే యెఱుకగల్గిన భౌతిక మనస్సు సైతం మహోన్నత సూక్ష్మయెఱుకతో లీనమై వాస్తవ విషయం అనుభవానికొస్తుంది.  ఇది అతనిలో యేది సత్యమో, యేది అసత్యమో తెలుసుకోగల వివేకమును స్వతఃసిద్ధంగా ఉత్పన్నంగావిస్తుంది.  అందువలన మనము మార్పునకు లోనయ్యే ప్రాపంచిక వస్తువులపై ఆకర్షణ కోల్పోతాము.  మూలంలోనున్న సత్యతత్త్వంతో సంబంధం బలపడుతుంది.  అంటే యిది వైరాగ్యము యొక్క తొలిదశ.  యిది అంతర్గతంగా ఉత్పన్నమయ్యే స్థితేగానీ బలవంతపు పద్దతుల వలన వచ్చెడిది కాదు.  సహజమార్గమున వైరాగ్యము భౌతిక వస్తువుల విడనాడుట వలన కలుగునదిగా భావింపబడదు.  దీని అర్థము వస్తువులు కలిగి యుండకుండుట, యేపని లేకుండా, యేబాధ్యత తనయెడల గానీ, సంఘము యెడల గానీ లేక ప్రపంచము యెడల గానీ లేకుండుట కానేకాదు.  ఇది ప్రాపంచిక వస్తువిషయములపై అంతర్గత వ్యామోహరహిత భావన, తగని వ్యామోహము నుండి బయటపడితిమన్న భావన కలుగగానే బాహ్యప్రపంచముతోటి మన కార్యకలాపములన్నీ కర్తవ్యములుగా రూపు దిద్దుకుంటాయి.  ఆకర్షణ వికర్షణలకు లోనుగాక కర్తవ్యము కర్తవ్యము కొఱకే అనునది, అత్యున్నతమైన భక్తి.  ఈ స్థితి స్వతఃసిద్ధముగా లోలోపలే, ధ్యానము సక్రమ పద్దతిలో సమర్థగురు మార్గదర్శకత్వంలో సాగినపుడు యేర్పడుతుంది.  ఇది సాధారణముగా లభించు స్థితి కానప్పటికిని, ఈ విధానమున మాత్రము ప్రాధమిక స్థితిలోనే లభ్యముతుంది.  కోరికలు లేకపోవుటే దీని ప్రత్యక్ష ఫలితము.  అందువలన సంస్కారము లేర్పడుట తగ్గనారంభించి తుదకవి పూర్తిగా నిలచిపోవును.  ఈ విధంగా క్రొత్తసంస్కారము లేర్పడుట నిలిచిపోతే, ఇక మిగిలినది పాతవాటిని అనుభవించుటే మిగిలియుండును.  ఇలా క్రమంగా సహజసిద్ధంగా మొత్తము సంస్కారములు దగ్దమొనర్చబడును.  వీటిలో కొంత వరకు మాత్రం తన స్వంత పరిశ్రమ వలననైతే గురువుగారి శక్తివలన చాలావరకు కాల్చివేయబడును.  ఇలా సంస్కారముల నిధి ఖాళీకాగానే వ్యక్తి అనంతమైన జనన, మరణ చక్రము నుండి విడుదల పొందుతాడు.  అయితే అదే మన ప్రయత్నమునకు తుదికాదు.  ఆధ్యాత్మిక ప్రయాణము యింకనూ మున్ముందుకు సాగుతూ ఉన్నతోన్నత సూక్ష్మ స్థాయిలను అధిగమిస్తూ పోతుంది.

 

పురాతనకాల యోగ విధానముతో పోలిక

 

1. పురాతనకాల యోగవిధానము ప్రకారము భగవంతుడంటే యేవిధమైన గొప్పగుణాలు, ఘనతలు లేని సంపూర్ణ ఉనికి.  మతములలో చెప్పిన తగ్గుస్థాయి యోచనలకు పరిమితముకాదు.  సహజమార్గము దీనినంగీకరిస్తూనే ఇంకా ముందుకు వెళ్ళి మరింత సూక్ష్మమైన భావనతో కేంద్రము లేక శూన్యకేంద్ర ఉనికి, సంపూర్ణ ఆధారము అంటే శక్తీ, చర్య లుప్తస్థితి లేక యెఱుకరహిత స్థితి వరకు వెళుతుంది.  ఇది సూక్ష్మాతి సూక్ష్మము, స్వచ్ఛమునైన ఉనికి.  మన సంస్థలో పిలువబడు ‘భూమా’ అనే ఉనికిరాహిత్య స్థితి.  ఇదే సహజమార్గము యొక్క అంతిమ లక్ష్యము.

 

        ఈ విధానము అంతిమమైన సంపూర్ణ సూక్ష్మస్థితిలో లయమగుట లేక ఆ అనంత పూర్ణత్వముతో ఒకటైపోవుటను గమ్యముగా భావిస్తున్నది.  ఇది మనలోని స్థూలత్వాన్ని సాధ్యమైనంత తుది దశకు గొంపోయినప్పుడే లభ్యమౌతుంది.  అప్పుడు బంధనముల నుండి సంపూర్ణ స్వేచ్ఛను పొందగల్గెదము.

 

        ఈ అనంత అకారణస్థితిని సక్రమమైన విధానంలో సహజాతిసహజంగా ధ్యాన మార్గము ననుసరించి నప్పుడే ప్రాప్తిస్తుంది.  ఈ ప్రయోజనము కొఱకు సమర్థుడైయుండి ఆ తుదిస్థితిలో శాశ్వతంగా లీనమైన యోగ్య మార్గదర్శకుని సహాయ సహకారములు యెల్లవేళల అత్యంతావశ్యకములు మరియు విస్మరింప వీలులేనివి.

 

2. సరళము మరియు సూక్ష్మమునైన సాక్షాత్కారమును పొందుటకు చిక్కులతో కూడిన మరియు జఠిలమైన పాత దృక్పదమును అంగీకరింపదు.  సరళమైన విధానములే సూక్ష్మఫలితముల నివ్వగలవు.  మా గురువర్యుల మాటల్లో చెప్పాలంటే ఒక సూదిని ఎత్తవలసి వస్తే దానికి బరువులెత్తు పెద్ద యంత్రము (క్రేన్) వలన సాధ్యపడదు.  సరళ మార్గములంటే అవి బలవంతముగా వ్యక్తిపై రుద్దబడినవి మరియు అసాధారణ ప్రక్రియలై మనస్సును మరియు ఇంద్రియములను చితుకగొట్టి హించునవి కారాదు.  అవి ప్రకృతితో అనుసంధానము గలిగి సులభముగా, సాధారణ జీవనమున యిమిడి పోవునవియై యుండవలెను.

 

3.  బలవంతముగా సాంసారిక బంధముల వదిలించుకో జూచుటను వాస్తవ వైరాగ్యముగా సహజమార్గము సమ్మతింపదు.  బలవంతపు వికర్షణ వ్యక్తిలో కృత్రిమ భౌతిక వాతావరణమేర్పరచి ఒంటరి వానిని జేయును.  అంతేగాని అంతరంగిక మానసిక వృత్తులతో అసలు సంబంధముండదు.  వాస్తవార్థంలో వైరాగ్యమనునది అంతర్గత స్థితి.  ఈ స్థితిలో యింద్రియ వాంఛల నుండి వ్యక్తి విడివడి వున్నట్లు అనుభూతి చెందును.  తద్వారా అతని జీవితములో అతడు కలిగియున్న వస్తుజాలము అతనిపై ఆకర్షణను కోల్పోవును.  అవి నిస్సారములగును.  కనుకనే సహజమార్గము దైవసాక్షాత్కారమునకు అడ్డంకి కాదు.  ప్రాపంచిక, ఆధ్యాత్మిక జీవనములు రెండూ సహజ సామాన్య జీవనములో వాస్తవమునకు రెండు విభాగములు.  అవి రెండూ ఒకదానితో ఒకటి సత్సంబంధము కలిగి ప్రక్కప్రక్కన సజావుగా సాగవలెను.

 

4.  యోగము నందు ఆధ్యాత్మిక విశేష శక్తికేంద్రములైన చక్రములు చాలా ముఖ్యపాత్రను పోషిస్తాయి.  అవి వ్యక్తి సున్నితమైన స్థితులను అధిగమించి వెళుతుండగా జాగృతమౌతాయి.  పాత పద్దతిలో సర్వసాధారణముగా అన్నిటికంటే క్రిందనున్న మూలాధార చక్రము నుండి ప్రారంభించి వరుసగా పైచక్రములకు సాధకుడు పురోగమిస్తాడు.  కానీ క్రింది చక్రములైన మూలాధార, స్వాధిష్టాన మరియు మణిపూరకాలు పదార్థ శక్తితో కూడికొని యున్నందున సర్వసామాన్యముగా అవి సిద్ధులు లేక శక్తులనబడు అసాధారణ అద్భుత శక్తులను విడుదల చేయుటలో సఫలీకృతమౌతాయి.  చాలామంది విషయములో ఈ శక్తులు ప్రాపంచిక ప్రయోజనములకు దుర్వినియోగము చేయబడి యోగ భ్రష్టత గలిగించినవి.  ఇది సాధకునిచూపు శక్తులు గడించుటయందే గలిగి సూక్ష్మతను పొందుటను నిర్లక్ష్యము చేసిన వారి విషయమున ముఖ్యముగా జరుగును.  సహజమార్గము శక్తుల గడించుటను ధ్యేయముగా గైకొనకపోవుట వలన పాత మార్గము నుండి వేరుపడి ‘అనాహత చక్రము’ (హృదయస్థానము) నుండి ప్రారంభించి క్రింది స్థానములను ప్రాధమికముగా గైకొనక వదిలివేయును.  ఇలా చేయుటకు కారణం శక్తులను దురుపయోగము చేయకుండా రక్షించడ మొకటైతే మరొక కారణం హృదయం శరీరానికి ప్రాణప్రదమైన కేంద్ర బిందువుగా వుండి రక్తాన్ని శరీరమంతటికి పంపిణి చేస్తుంది.  ఈ స్థానంపై ధ్యానము కొనసాగిస్తే దైవీయ యోచనా స్పర్శచే స్వచ్ఛత మరియు భక్తియుత సున్నిత పరమాణువులు రక్తప్రసార సమయంలో దేహమంతా చేరిపోతాయి.  ఈ విధంగా మొత్తం శరీర శుద్ధీకరణ స్వతఃసిద్ధంగా నిరంతరంగా సాగిపోతుంది.  అంతేగాకుండా తొలుదొల్త హృదయము శుద్ధిచేయబడటంతో మేల్కొన్నశక్తుల దుర్వినియోగం చాలామటుకు తగ్గిపోతుంది.  ఈ బిందువునుండి మన ప్రయాణం తర్వాతి చక్రములయిన విశుద్ధి మరియు ఆజ్ఞాచక్రముల వైపునకు మళ్ళించబడుతుంది.  అందువలన మన ప్రయాణము పైమూడు చక్రములకే పరిమితమై ఉంటుంది.  క్రింది మూడు చక్రములు ప్రత్యేకముగా చేపట్టబడక పోయినప్పటికి అవసరమునకు తగినట్లు స్వతఃసిద్ధముగా అవికూడా శుద్ధీకరింపబడిన రక్తము హృదయము నుండి అందుట వలన శుద్ధిగావింపబడతాయి.  అవి పరిపక్వదశకు చేరినప్పుడు గానీ లేక పరమగురువర్యులు ప్రసారము చేసిన ప్రాణాహుతి వలనగాని జాగృతమై నిజంగా వాటి అవసరమేర్పడినపుడు ఉపయోగపడతాయి.  ఇటువంటి పరిస్థితి మహోన్నత స్థాయికి చెందిన యోగి ప్రకృతి కార్యనిర్వహణకు పూనుకొన్నప్పుడు యేర్పడుతుంది.  అప్పుడాయన ఈ శక్తులను వాడుకొనకుండా వుండడు.

 

5.  మరొక సర్దుబాటు, రూపుదాల్చిన సాధన చతుష్టయమునకు సంబంధించిన వేదాంత దృక్పదము.  అది వివేకము, వైరాగ్యము, షట్సంపత్తి మరియు ముముక్షుత్వము.  వివేకము సత్యాసత్య విచక్షణను సూచిస్తుంది.  వైరాగ్యము మార్పునకు గురయ్యే అసత్యమును గుర్తింపజేసి విరక్తి గలిగిస్తుంది.  ఈ రెండూ సాధనలుగా యివ్వబడినవి కానీ అవి వాస్తవమునకు రెండు ఆధ్యాత్మికస్థితులు.  ఇవి మనస్సు నందే సరియైన సాధనల ప్రభావమున ఉత్పన్నమౌతాయి.  వైరాగ్యము, వేకముయొక్క సాక్షాత్ఫలితము.  సహజమార్గము వివేక, వైరాగ్యములను రెండు యోగసాధనలుగా ఒప్పుకోదు.  కనుక వాటిని తప్పించి వేదాంతుల మూడవ సాధనమైన షట్సంపత్తితో ప్రారంభిస్తుంది.  ఇది ఆరు సంపాదనలు.  ఇక్కడ కూడా ఇన్ని శాఖలుగా సహజమార్గము గుర్తించదు.  మనస్సును క్రమబద్ధీకరించటమనే మూలంపైనే నేరుగా గురిపెడుతుంది.  కనుక సహజమార్గ మభ్యసించు వారికి ఆరు సంపత్తుల స్థానంలో ఒకేఒకటి అది మనస్సు క్రమబద్ధీకరించుట మాత్రమే కర్తవ్యము.  అదొక్కటే అతని అన్ని అవసరాలు తీరుస్తుంది.

 

6.  పాత యోగవిధానము సాధారణముగా అష్టాంగయోగములోని రెండు విభాగములు అంటే హఠయోగము మరియు రాజయోగము రెండింటిని అనుసరించమంటుంది. పాతదృక్పదం ప్రకారం విజయవంతమైన యోగసాధనలో హఠయోగాన్ని ప్రాధమిక దశలో అనుసరించడం తప్పనిసరియని, వదలడానికి వీలులేదని భావింపబడేది.  తదనుగుణంగా హఠయోగంలో చెప్పబడిన భౌతికవ్యాయామ విధులు యోగమున అతిముఖ్యమైనవిగా భావింపబడేవి.  సహజమార్గ అభ్యాసికి వాస్తవ ప్రయోజనకారులైనవి తప్ప యితరములన్నీ అనవసరములు.  ఆధ్యాత్మిక పురోగతి, అంతర్గతముగా పనిచేయగలుగు దైవీయ స్పందనలు, ప్రాణాహుతి ప్రసారం ద్వారా పొంది, సాధించ గల్గును.  కనుక అష్టాంగయోగములోని ఎనిమిది అంగములను యథాతధంగా గ్రహించడం లేదు.  కేంద్రస్థానమైన ధ్యానంతో ప్రారంభించి అనవసరమైన ప్రాధమికాంశములను వదలివేయడం జరిగింది.  ఈ విధానము మొత్తమునకు ధ్యానాన్నసురిస్తూ వుండడం వలన ఆద్యంతం అన్ని అంగములను అదే సరిచూసుకుంటుంది.

 

7.  ఆఖరుది మరియు అన్నింటికంటే ముఖ్యమైనది సహజమార్గమున గల అద్భుత ప్రక్రియ ప్రాణాహుతి.  పతనావస్థలోనున్న నేటి ఆధ్యాత్మిక విధానముతో జనులు స్థూలప్రాపంచిక విషయముల భారమును భరించలేక గాయపడి   రక్తస్రావముతో మూలుగుచున్నారు. అట్టివారికిది ఒక గొప్ప వరము.  ఈ ప్రాణాహుతి క్రొత్తది కాకపోయినప్పటికి ఈ మధ్యకాలములో మరుగున పడిపోయి అసలు యిట్టి విధానమొకటున్నదని యేకొద్ది మందికి మాత్రమో తప్ప చాలామంది నమ్మని పరిస్థితి వచ్చినది.  అయితే నమ్ముట లేక నమ్మకపోవుట అనేది ప్రశ్నకాదు.  కనీసము ఉన్నదేమో చూతమను వారు కుడా లేరు.  అయితే దీని ప్రత్యక్షానుభవము అందరికి అన్నివేళల యెట్టి ఆంక్షలు లేక ప్రయత్నించుటకు తెరచి యుంచబడినది.  ఇచ్ఛవచ్చినపుడు యెవరైనను దీనిని ప్రయత్నించి స్వానుభవము పొందవచ్చును.

 

        వివిధములైన యిట్టి అనేక కారణముల రీత్యా సహజమార్గము ప్రపంచయోచనా విధానమునకు తనవంతు కర్తవ్యముగా ఒక విలువైన నూతన దర్శనమును ప్రవేశపెట్టి సాక్షాత్కారమునకు ఒక తిన్నని మార్గమును చూపినది.  ఇది చాలా సులువైన అతిసహజమైన విధానమున కొనసాగుటేగాక సామాన్య మానవుడు తన జీవనవిధానమున సులువుగా పాటించగలిగినదై యుండి అత్యంత ప్రతిభ గలిగియుండి అతి తక్కువ సమయంలో త్వరితగతిని ఫలితములొసగు విధానమైయున్నది.

 

అ - సహజమార్గ బోధనలు

 

1. ఒకేఒక పరిపూర్ణతత్త్వమైన భగవంతుని యందు సడలని విశ్వాసము గలిగి ఆయనలోనే జీవింపుము.

 

        భగవంతుడు ‘ఉనికి’ యొక్క అంతిమ స్థితి, నిజమైన మూలస్థానము.  అందుండియే సమస్తము పుట్టుకొచ్చినది.  విశ్వాసమనునది  జీవితమున అత్యంత ప్రాణప్రదమైన అంశము.  భగవంతునిపై విశ్వాసమను మాట మూలము లేక మనము జీవితాంతం మన ధ్యాసలో వుంచుకొనవలసిన అంశము.  మనము తుదకు చేరుకోవలసిన అంతిమగమ్యం.  ఇది అన్నిటికి తుదియైన దానిపై యెఱుక గలిగియుండుటను సూచిస్తున్నది.  సహజమార్గములో దీనిని కేంద్రము లేక శూన్యస్థాయి ఉనికిగా పేర్కొనబడినది.  అంతిమ పూర్ణదృక్పదమిది.  భగవంతుడంటే అనేక ప్రకృతిశక్తులు గల అధిదేవతలు వారి అనుయాయ దేవుళ్ళుగానో లేక సృష్టికర్తలనదగు త్రిమూర్తులుగానో లేక ఇంకా గొప్ప సగుణ మరియు నిర్గుణ పరమేశ్వరుడుగానో ఒక అల్పస్థాయి భావన చేయడం వలన ఆ భావనాస్థాయి వరకు మాత్రమే మన పురోభివృద్ధి యుండును.  అది నిస్సంశయంగా అంతిమ స్థాయికి చాలాచాలా తక్కువస్థాయి.  కనుక అంతిమ స్థాయిని చేరుటకు వెనుకబడి పోయితిమన్నది వాస్తవము.  అందువలన అంతిమ పూర్ణస్థితియైన కేంద్రము లేక శూన్యస్థానమును గమ్యంగా నెన్నుకొనినట్లయిన యిటువంటి తగ్గుస్థాయి భావనల దాటి పైకెదిగి సమస్తమునకు మూలమైనదేదో దానిపై దృష్టి నిలుపుదుము.

 

        భగవంతునిలో జీవించడమంటే వాస్తవస్థితియైన అంతిమ ఉనికితో సన్నిహితముగా కలసిపోవుట.  ఈ స్థితి, మన ప్రస్తుత స్థితితో కేవలము స్థూలత్వము విషయమై విభేధించుచున్నది.  కనుక మన స్థూలత్వము కరిగిపోవలసి యున్నది.  అదీ యిప్పుడు మన ప్రయోజనమునకు అవసరమై యున్నది.

 

2.  ప్రాపంచికము ఆధ్యాత్మికము అను జీవితపు రెండు విభాగములు ఒకదానితో మరొకటి సత్సంబధితమై ప్రక్కప్రక్కన సజావుగా సాగవలెను.  వాటిలో దేనిని కూడా రవ్వంతైనా నిర్లక్ష్యము చేయరాదు.

 

        దైవీయ ప్రయోజనమునకై ప్రాపంచిక బాధ్యతలను నిర్లక్ష్యము చేసి తనపై ఆధారపడిన వారిని అనాధలను చేయుట, దైవీయ మార్గము ననుసరించు వాడు చేయకూడని పని.  అది క్షమింపరానిది.  వాస్తవమునకు ప్రాపంచిక మరియు ఆధ్యాత్మిక జీవనములకు మధ్య అఘాతము సృష్టించుట పూర్తిగా ఆధారరహితము మరియు ప్రకృతి విరుద్ధము.  జీవితము మొత్తము సమగ్రముగా ఒకదానితో ఒకటి అనుసంధానపరుపబడి రెండింటిని సమన్వయ పరచబడియున్నది.  ఈ రెండింటిని వేరుపరచుట అమర్థనీయము కాదు.  దైవీయ ప్రయోజనమునకు ఆటంకమైనది ప్రాపంచిక జీవనము కాదు.  కానీ మనతప్పుడు విధానపు జీవనము బంధనముల నేర్పరచి దైవమార్గమునకు అవరోధము కల్గించుచున్నది.  మన భౌతికమైన అహంకు అతిగా తగుల్కొనిపోయి యింద్రియ సౌఖ్యములకు శారీరకానందములకు లోంగిపోవుటే నిజమైన దోషము.  తద్నివారణార్థం ప్రాపంచిక జీవనమును విసర్జించి మన వాస్తవ కర్తవ్యములను దారుణ నిరాదరణకు గురుచేయుట యేవిధంగానూ పరిష్కారము కాదు.  ప్రాపంచిక జీవనమును వదలి వేసిన తర్వాత కూడా చాల మంది సన్యాసులమని చెప్పుకునేవారు ప్రాపంచిక వ్యవహారములలో ఆపాదమస్తకం నిండుగా మునిగియున్న ఉదాహరణలనేకం మన అనుభవమున చూచియున్నాము.

 

        అందువలన సహజమార్గము అటువంటి బాధ్యతారాహితమైన పిరికి చర్యలతో ప్రాపంచిక కర్తవ్యములను తప్పించుకొనజూచి, తనపై ఆధారపడిన వారిని దైన్యస్థితికి గురిచేయుటను సమర్థించదు.  ఇది జీవనమునకు వలసిన అన్ని అవసరములతో మనము పుట్టి జీవించుట కేర్పడిన ఈ భూమిపై సలక్షణముగా జీవించుటకు, కడకు మనము పొందవలసిన దైవీయతనందుకొనుటకు సహజ సాంసారిక జీవనమునే ప్రోత్సహించును.  అంటే అది జీవితములోని రెండు విభాగములైన ప్రాపంచిక మరియు దైవీయ జీవనముల సమన్వయము.

 

3.  ప్రతీది కర్తవ్యపరముగా భావింపుము.  దానిని విశ్వాసపూర్వకముగా, యేవిధమైన ఆకర్షణ, వికర్షణ భావములు లేకుండా చేపట్టుము.

        మానవజీవనము సులభముగా దైవీయ జీవనముగా మార్పుచెందవలెనన్న ఆలోచనలు, చర్యలన్నీ కూడా దైవ సంకల్పానుసారమే సాగుచున్నవని తలంచవలెను.  ధనసంపాదన, తనపై ఆధారపడినవారి పోషణ, పిల్లల యెడల గైకొనవలసిన జాగ్రత్తలు, బంధువుల, మిత్రుల మరియు సంఘము యెడల నిర్వర్తింపవలసిన విధులు యివన్నీ కూడా భగవంతునిచే మన కొఱకు నియమింపబడిన ముఖ్య కర్తవ్యములోని భాగములుగా గమనించుకొనవలెను.  అయితే వాటిని మన స్వంతమైనవిగా, భగవంతునితో సంబంధములేనివిగా తలంచుట వలన దోషభూయిష్టములగు చున్నవి.  మనము మన స్వలాభాపేక్షతో లేక మన వాంఛాపరితృప్తి కొఱకు పరిణామ ఫలితాన్ని మన బాధ్యతగా స్వీకరిస్తున్నాము.  ఇదే నిజమైన బంధనము.  ఇదే మనల్ని దైవము నుండి వేరుపరచ యత్నిస్తున్నది.  మనకున్నదంతా భగవంతునిదే.  దానిని మన కుటుంబమునకుగాని, స్నేహితులకుగాని, బంధువులకుగాని లేక సంఘమునకుగాని, అది భగవంతుడు మనకప్పజెప్పబడిన పవిత్ర కార్యముగా భావించి, సద్వినియోగ పరచవలెను.  ఈ విధంగా ప్రవర్తిస్తే నాదన్న భావము అన్నివిషయములలో వదలిపెట్టును.  అలా మనల్ని ఆకర్షణ (మాయా మోహముల) నుండి విడుదల గావించును.

 

4.  సేవ, త్యాగ బుద్ధితో సర్వప్రాణులను ప్రేమింపుము.

 

        ప్రేమ జీవితమున అతి ముఖ్యాంశము.  ఇది గొప్ప ఫలితములను తప్పక మనకందించ నెంచును.  ఈ కారణముననే భగవంతుని యెడ భక్తిని ఆరాధనా విధానములన్నింటి యందును మిక్కుటముగా నిబంధించిరి.  ఎవరైతే భగవంతుని వాస్తవముగా ఆరాధింతురో వారందరిలో సహజంగానే భగవంతునికి సంబంధించిన విషయములన్నిటిపైనా యిదే భావము గలుగును.  కనుక మనకు భగవంతుడు, ప్రేమించే, ఆరాధించే వస్తువైనపుడు, ఇతర ప్రాణులయెడ కూడా అదే భావము గలిగియుందుము.  మనము ఈ విధంగా పరిపూర్ణత చెందితే అదే విశ్వప్రేమ భావాన్ని మనలో కలిగేట్లు చేస్తుంది, దాని సహజ ఫలితంగా సేవా త్యాగాలు వెన్నంటి వస్తాయి.  ఈ విధానాన్నిప్పుడు తిరగత్రిప్పండి.  తన తోటివారికి స్వార్థరహిత సేవ చేయుటలో తన్నుతాను సమర్పించుకుంటే, అందులో తన స్వార్థప్రయోజనాన్ని త్యాగం చేసేస్తే, భగవత్‌ప్రేమ అతని హృదయాంతరాళాలలో లోతుగా నాటుకొని పోతుంది.

 

5.  అందరిని నీవారినిగా భావించి వారికి అందవలసిన వాటిని వారికి సజావుగా యిచ్చివేయుము

 

        ఇది అతి ముఖ్యమైన జీవిత సిద్ధాంతములలో ఒకటి.  దీన్ని శ్రద్ధతో పాటిస్తే ప్రపంచములోని దాదాపు అన్ని సమస్యలు పరిష్కారమై పోతాయి.  నేడు ప్రపంచము దుఃఖము, బాధతో చిత్రహింసలకు గురై మూలుగుచున్నది.  అభద్రతా భావము, రణములు, వినాశనము మరియు మోసము చాలా సామాన్య విషయములైపోయినవి.  శాంతి, తృప్తి మరియు విశ్రాంతి లేనేలేదు.  ప్రతిఒక్కరు స్వార్థ ప్రయోజనములకు సంబంధించిన చింతనలో మునిగిపోయి యున్నారు.  అందువలన యితరులకు జరిగే హాని, నష్టమును గురించి యేమాత్రం చింతించడంలేదు.  సక్రమముగా నిజాయితితోను గూడి సదుద్దేశ్యము, దయ గలిగిన వ్యవహారములు తొలగిపోయి యితరులకు న్యాయంగా చెందవలసిన వాటిని తప్పుడుత్రోవలో ఆక్రమించుట అధికమైనది.  ఇదే విశ్వశాంతిని తెచ్చుటకు సరిదిద్దుకొనవలసిన అంశము.  ఈ లోపనివారణమే అన్నిచోట్ల అవసరమై యున్న అంశము.  అశాంతికి కారణభూతములైన వాటినన్నిటిని ఈవిధమైన ధర్మసిద్ధాంతములను యేదో విధంగా జీవితంలో ప్రవేశపెడితే సాధ్యమైనంతవరకు అలజడిని తగ్గించవచ్చును.  కానీ గాంధీ సిద్ధాంతమైన అహింస లేక, నిర్వీర్యపడి దేనికైనా లొంగిపోవడము వంటివి ఈ ప్రయోజనమునకు సరిపోవు.  యివి మన సమస్యా పరిష్కారమునకు అనువుగాలేవు.  చెడు అనునది, అది మనపైగాని, యితరులపైగాని యెటువైపున్నను శక్తివంతముగా ఎదుర్కొనవలసిందే.  న్యాయంగా అందవలసినవి అన్నివిషయములలో సమంగానే వుండాలి.  అణగద్రొక్కబడిన వానికి అది వాని యెడల జరిగిన ద్రోహమునకు పరిహారంగాను వాని హక్కులై వానికందవలసినవి, అందకుండా అడ్డుపడుట నుండి విమోచన కావచ్చును.  కాని అణచివేతకు పాల్పడినవానికి అది ఎదురుదెబ్బ, అణచివేత మరియు దండన అవుతుంది.  అవసరమైన చోట బలవంతపు శక్తి ప్రయోగాన్ని నిరోధించటం తప్పుకాదు.  కానీ యిదంతా స్నేహభావంతో జరగాలిగాని శత్రుత్వము, పగతోకాదు.  మనకు ప్రియమైన మనవారు, అనుకొన్న వారిపై చూపు అభిమానము కోపమువలె అన్యభావరహితమై వుండవలెను.

 

6.  పెద్దలను గౌరవముగాను, పిల్లను ఆప్యాయతతోను ఆదరించుము.  మర్యాదాప్రదమైన సాధారణ వ్యవహారశైలిని పాటింపువ.

 

        ఇది ఒకానొక సామాన్య నియమము.  అందరు సాధువులు, బోధకులు దీనిని పాటింపుమనిరి.  ఇవి సాధారణశీలమునకు సంబంధించినవి.  అనుదిన వ్యవహారములలో వీటిని అందరూ తప్పక పాటింపవలెను.  వ్యక్తిత్వ వికాస నిర్మాణమున వీటికి గొప్ప విలువ కలదు.  ఇది మార్పువైపునకు వేయు ముఖ్యమైన ముందడుగు.  ఇది హృదయమార్ధవాన్ని పెంపొందిస్తుంది.  స్వభావములో సమతను తెస్తుంది.  మొత్తము మీద మనిషితీరులో హుందాతనాన్ని నింపుతుంది.  ఇది అత్యంత ప్రాధాన్యతగల సుగుణము, ఇది మనిషిలో నిజమైన వ్యక్తిత్వాన్ని పెంపొందించటానికి సహాయపడుతుంది.  ఇది మారురూపముననున్న భక్తి.  ఆధ్యాత్మికాన్వేషణలో నిరాదరించటానికి వీలులేనిది.

 

7. ప్రతికూలతను సంయమనముతో ఎదుర్కొనుము.  కోపము, ప్రతీకార భావనలను హృదయము నుండి తీసివేయుము.

 

        జీవితములో యేర్పడు ప్రతికూల పరిస్థితులే మిక్కిలి బాధాకరములైనవి.  దీనితోపాటే అన్నివిధముల కష్టములు దుఃఖములు ప్రాప్తించును.  ఇది జీవితములో తప్పనిసరి.  సంస్కార ప్రభావమున యేర్పడుచున్నవిగాన మనము వీటి ఫలితాలను అనుభవించకుండా తప్పించుకొను ప్రశ్నేలేదు.  ఈ అర్థంతో గమనిస్తే వాటిని కానరాని దీవెనలుగా భావించనగును.  అందువలననే వాటిని అదృష్టసన్నివేశములుగా భావించి భగవదిచ్ఛకు మనల్నిమనం సమర్పించుకొనవలెను.  ఏదియేమైనా కొంతమంది మనకు ప్రత్యక్షముగా కీడు జరగటానికి కారణంగా కనబడతారు.  అందుచేత వాళ్ళు మన కోపానికి గురౌతారు.  కానీ ఈ భావన ఉన్నసమస్యను మరింత యెక్కువ చేస్తుంది.  ఈ సూత్రాన్ని అనుసరిస్తే దుఃఖముల ప్రభావము తగ్గింపబడడమే గాకుండా మొత్తానికి చల్లబడి అందులో ఒకవిధమైన ఆనందాన్ని పొందుతాడు.  ఈ కారణముచేతనే సాధుపుంగవులు తరచూ ప్రపంచంలోని దుఃఖములనన్నింటిని తమకే కేటాయించమని భగవంతుణ్ణి ప్రార్థిస్తారు.

 

8.  జీవితములోని ప్రతి కార్యనిర్వహణమునందును ఓర్పు సంయమనము పాటింపుము.

 

        ఓర్పు మరియు సంయమనము అనునవి ప్రశాంత జీవనమునకు అతి ముఖ్యాంశములు.  బాహ్యాంతర్గత అలజడులన్నిటికి ప్రధమ కారణము మన సమతదప్పిన మానసిక ప్రవృత్తులే.  సమతను తిరిగి స్థాపించుకొనుటే సంయమనము.  ఓర్పు యేమైనప్పటికిని సంయమనమును వృద్ధిచేయు సాధనము.  సంయమనము సాధించితే సమతదప్పిన మానసికవృత్తులు సర్దుబాటు చేసుకొని శాంతి పునఃస్థాపితమౌతుంది.  ఇది మన ప్రాపంచిక సమస్యలన్నిటిని పరిష్కరించగల సాధనముగా కూడా పనిచేస్తుంది.

 

9.  మహోన్నతమైన దానిపైననే దృష్టి నిలుపుము.  దానిని సాధించుటకు నిజాయితీతోను శ్రద్ధతో కూడిన ప్రయత్నము చేయుము.

 

        ఇది చాలా ప్రాణప్రదమైన ఆంశము.  మనిషి ప్రాపంచిక, మత మరియు ఆధ్యాత్మిక పరమైన అన్ని జీవనస్థాయిలకును యిది సమానముగా వర్తించును.  ధ్యేయమును నిర్ణయించుకొనుట అన్ని విషయములందును అతి ముఖ్యము.  అప్పుడు మాత్రమే విజయము తథ్యము.  ఆధ్యాత్మికముగా మన అంతిమఆశయము సూక్ష్మాతిసూక్ష్మము యొక్క తుదిస్థితి. కనుక మన దృష్టిని అంతిమస్థితిపై నిల్పుట అత్యావశ్యకము.  గొప్పవిజయము కేవలము ధ్యేయము మహోన్నతమైనప్పుడే సాధ్యము.  ధ్యేయసాక్షాత్కారము కొఱకు తపన అధికంగా వుంటేనే మనం ప్రయత్నాన్ని తీవ్రతరం చేయగలుగుతాము.

 

ఆ - క్రమశిక్షణాయుతమైన శీలనిర్మాణమునకు

సాధారణ నియమములు.

 

1.  పరిసరములచేత సాధ్యమైనంతవరకు ప్రభావితము గాకుండా సరళమైన జీవితమును గడుపుము.

 

2.  హుందాగా, మర్యాదగా, చిరునగవుతో నుండుము.

 

3.  సంకుచిత బాంధవ్యబంధనముల నుండి స్వేచ్ఛననుభవిస్తూ యిరుగుపొరుగు వారితోను బంధుజనముతోను ఆప్యాయతతో మెలగుము.

 

4.  భార్యాభర్తలు బండికి రెండు చక్రముల వలె వ్యవహరించవలెను.  అట్లు వ్యవహరిస్తూ యింటి బాధ్యతలైన బిడ్డలయెడ, కుటుంబముయెడ మరియు బంధువులయెడ తగిన రీతిలో ప్రవర్తిస్తూ కార్యములను సక్రమముగా నెరవేర్చవలెను.

 

5.  స్నేహము కొఱకు అర్రులుచాచవద్దు

 

6.  ఆహారపదార్తములందు రుచి, అరుచి యనక సమత పాటించుము.  అయితే అది పవిత్రమా, అపవిత్రమా అన్నది మాత్రము గుర్తించి ఆరగింపుము.

 

7.  మీ పైఅధికారుల యెడ విధేయతతో మెలగుము.  స్థాయికి సంబంధించిన నియమ నిబంధనల ప్రకారము నడచుకొనుము.

 

8.  నిన్నడగని నీ అభిప్రాయములను ఇతరులపై రుద్దుటకు పట్టుబట్టకుము.

 

9.  ఔషధములను నిర్ణయించి వాడుమని చెప్పకుము (వైద్యులకు నిషిద్ధము కాదు).  అయితే గత్యంతరములేని అత్యవసర పరిస్థితులలో జోక్యము చేసుకొనకపోతే రోగి పరిస్థితి చేదాటి పోతున్నదని నీవు నమ్మకంగా భావిస్తే మాత్రము వైద్యము చేయవచ్చును.

 

10. నీ రహస్యములను యెవ్వరికి చెప్పకుము.  ఇతరులు తన నుండి యేదో దాస్తున్నారన్న భావనను కలిగి యుండకుము.

 

11. వ్యక్తిగత సేవలు యెవరినుండి కూడా ఆశించకుము.  గత్యంతరములేని పరిస్థితులలో అదికుడా అవసరమైనపుడు తిరిగి నీవాసేవ వారికి చేయుటకు సిద్ధమైయుంటేనే అనుమతించుము.

 

12. అనవసరపు పిచ్ఛాపాటి మాటలు మానుకొనుము.  నవలలు మొదలైనవి చదువుట వదలివేయుము.

 

*****             *****


VI.   ఎట్లుండవలెనో అట్లు

 

రక్షకుడు

 

        "పుట్టుకలేని వాడనైననూ శాశ్వతుడనై మరియు సమస్త జీవరాసులకు ప్రభువునైనప్పటికి, నన్ను నేను నా యోగమాయ ద్వారా సృజించుకుంటూ, నా ప్రకృతిని అందులో ఉంచుకొంటున్నాను."

 

        మానవ రూపంలో విరాజమానమైన మహనీయ అవతార పురుషుడు శ్రీకృష్ణపరమాత్మ ఉవాచ యిది.  దీని వలన స్పష్టమైన వాస్తవమేమంటే, దైవాత్మ మానవరూపమున అవతారమూర్తిగా లేక రక్షకుడుగా కొన్ని సమయాలలో భూమికి దిగివస్తాడు. హైందవ పవిత్ర గ్రంధములందు ప్రవచించినట్లు యిది ప్రకృతి సిద్ధమైన మామూలు విషయము.  ఇది పచ్చినిజము.  దైవీయ శక్తి ప్రకృతి యొక్క అవసరాన్ని బట్టి భూమిపై అద్దాని ఉనికి తప్పనిసరైనప్పుడు మాత్రమే అవతరిస్తుంది.  అవతారపురుషుడు లేక రక్షకుడు ఉద్భవించడమన్నది ఒక సాధారణ సంఘటన కాదు.  అది ప్రకృతి ప్రత్యేక యేర్పాటు ప్రకారము సంభవమగును.  భగవదేచ్చ ఆయనను ప్రకృతి కార్యము నెరవేర్చుటకు భూమి కవతరింపజేయును. ఇదే అభిప్రాయమును మరికొన్ని మతములు సైతము కలిగి యున్నవి.  బైబిలులో కుడా రక్షకుడైన రెండవక్రీస్తు మరల భూమిపై అవతరించునని నిర్ధారణగా లిఖింపబడియున్నది.  మహమ్మదీయులు కుడా ‘ఇమామ్ మెహది’ అను ఒక మహనీయుడు హిజీరా శకము పదునాల్గవ శతాబ్దాంతమున ఉద్భవమగునని చాటుచున్నారు.  ఇవికాక మరెన్నో ప్రవక్తల వచనములు, కాలజ్ఞానములు, యిటువంటివే పురాతన మరియు నూతన సాధుపుంగవులచే చెప్పబడినవి.  రాబోవు అవతారమును, రక్షకుని గురించి అనేక దృక్పదములు ఒకదానితో నొకటి రమారమి సరిపోలుచున్నవి.  ఈనాటి గొప్ప సాధుమహాశయులు ఆ దృక్పదముల నంగీకరించి ఆతృతతో అట్టి అవతారమూర్తి మానవరూపమున దర్శనమిచ్చునని యెదురు చూచుచున్నారు.

 

అవతారపురుషునిరాకలోని ఆంతర్యము.

 

        మొత్తము మీద భూమిపైకి రాబోవు మానవరూప అవతారమూర్తి కర్తవ్యము ప్రపంచమున మితిమీరిపోయిన దుష్టశక్తులను నాశనము చేయుటకు అన్నివైపుల నుండి ప్రళయస్థితిని సృష్టించుటయై యున్నది.  యిప్పుడున్న ప్రపంచ నాగరికత మొత్తము పదార్థతత్త్వముపై ఆధారపడియున్నది.  ఇది మానవ మనస్సున అత్యంత ప్రధానస్థాన మాక్రమించుకొని చాలామంది భగవంతుడున్నాడనుట కేవలము నమ్మశక్యముగానిదిగా భావిస్తున్నారు.  సాంఘిక, నైతిక, మత, ఆధ్యాత్మిక పతనము వాటి కొసకు చేరుకొన్నవి.  మతము చాలామంది విషయములో ఒక వృత్తిగా మారిపోయినది.  నాస్తికత్వము మత వ్యాజమున యెల్లెడల వ్యాపించి పోయినది.  వంచన, స్వార్థము, డంబము జీవితపు దశలన్నిటిలోనూ మిక్కుటమైపోయినది.  పాపము, పతన వాతావరణము, అంతటా క్రమ్మివైచుచున్నది.  సాధారణ ప్రకృతి చైతన్య కార్యకలాపములన్నీ సమ్మెకు దిగినట్లున్నది.  ఇట్టి దారుణస్థితి యెల్లెడలా వ్యాపించి యున్నది.  అది మానవుని చేదాటి పోయినది.  ఇక ప్రకృతి బలమైన హస్తము వంచనైనా వంచాలి లేకపోతే విరిచేయాలి.  గురువుగారి ఈ క్రింది వాక్యములు యిదే దృక్పదమును సమర్థించు చున్నవి. 

       

        "విద్యుత్తు మరియు అణుశక్తిపై ఆధారపడి నిర్మితమైన నేటి ప్రపంచము యిట్టే చాలా కాలముండబోదు.  ఇది త్వరలో కూలిపోనున్నది.  మొత్తము వాతావరణము పూర్తి పదార్థతత్త్వపు విషప్రభావమునకు లోనైయున్నది.  ఈ పరిస్థితి నుండి విడిపించుట మానవశక్తి సామర్థ్యములకు వీలుగాకున్నది."

 

        ఇట్టి పరిస్థితులే అవతారపురుషుని రాకను తప్పనిసరి చేస్తాయి.  ఆయన భూమిపై అవతరించుటకు గల కారణము గీతలోని ఈ వాక్యములు స్పష్టము చేయుచున్నవి. 

        "ఓ అర్జునా ధర్మము క్షీణించి, అధర్మము వృద్ధి చెందునప్పుడు నేను మానవరూపమున అవతరింతును" అన్నది శ్రీకృష్ణపరమాత్మ ఉవాచ.

 

        అనగా మనిషియొక్క అధర్మవర్తనము (దైవవిరుద్ధచేష్టలు) వలన యేర్పడిన విషప్రభావము నుండి ప్రపంచమును రక్షించుటకును, స్వచ్ఛత, భక్తి మరియు భగవదీయతత్త్వముపై ఆధారపడిన నూతన ప్రపంచమును నిర్మించుటకును ఆయన అవతరించును.

 

అవతరణ సమయము

 

        ఆయన అవతరించు సమయము కూడా పైతెలిపిన వాక్యములలోనే సూచించబడినది.  అనగా అధర్మవర్తనమైన జీవనము వాతావరణమున దుర్మార్గమును, పాపమును పెంచి పోషించి, అంతటా ఎప్పుడు వ్యాపింపజేయబడునో అప్పుడవతరించును.  ఇప్పుడు అటువంటి పరిస్థితులు ప్రపంచమున వున్నవా? లేవా? అన్న విషయమును విచారించి నిర్ధారించుట మనపైనున్నది.  సమయమాసన్నమైనది అంటే ఇక మనం అవతారము భూమిపైకి రాబోతున్నదని సహజంగా నిర్ధారించవలసినదే.  అలాకాదంటే ఈ పతనావస్థ యింకా దిగజారి దాని అంతిమ దశకు చేరువరకు వేచి యుండవలసిందే.  ప్రపంచములోని చాలామంది మహాత్ములు యిది సరైన సమయము, ఇక జాగులేదు (సున్నాసమయము) మన మెదరుచూస్తున్న ఆ దివ్యావతారము బాధాతప్త మానవజాతిని విపత్తునుండి వినాశనము నుండి రక్షించుట కుద్భవించునని అంగీకరించు చున్నారు.  ప్రపంచములోని అనేక మంది దివ్యపురుషులు వ్యక్తముచేసిన విషయముల దృష్ట్యా అవతార పురుషుని రాక అందరి మనస్సులలో అత్యంత ప్రాధాన్యతను సంతరించుకొని యున్నదన్న విషయము తెలిసి నేను సంతోషించు చున్నాను.  అయితే కొందరున్నారు, వారు అవతారపురుషుని రాకను నమ్ముచున్నారు కానీ ఆయన యిప్పటికి దిగివచ్చియున్నారంటే వారు అంగీకరించుటకు యిష్టపడుట లేదు.  ఇది బహుఃశా ఆవచ్చిన వానిని గుర్తించు సామర్థ్యము వారియందు లేకుండవచ్చును లేదా ఆమహాపురుషుడు ఈ ప్రపంచములో ఉన్నాడన్న భావనను వారి మనస్సంగీకరించలేక పోతుండవచ్చును.  కానీ కొందరున్నారు.  వారు అట్టి మహాత్ముడుద్భవించి మన మధ్యనే యున్నాడనీ, ఆయన దైవీయ కార్యమున పూర్తిగా నిమగ్నుడై నిశ్శబ్దంగా, మన అవగాహన కందకుండా తన పని తాను చేసుకపోతున్నాడని భావిస్తున్నారు.  ఈ విషయమై మా గురువుగారొక్కరే బహుఃశా ధైర్యంగా, నిశ్చయంగా తెలియజేశారు.  "రాజయోగ ప్రభావమ" ను తన పుస్తకమున ఆయనిలా చెప్పారు.

        "ఇప్పుడు ప్రకృతిలో మార్పు అవసరమై యున్నది.  సంపూర్ణముగా సరిదిద్దవలసిన సమయమాసన్నమైనది.  ఆ పని కొఱకు ఒక ప్రత్యేక అవతారమూర్తి యిప్పటికే ఉద్భవించి రెండున్నర సంవత్సరముల క్రితమే తన పనిలో నిమగ్నమై యున్నారని ( రాజయోగ ప్రభావము ముద్రించిన నాటికి) నేను మీకు విశ్వాసపూర్వకముగా చెప్పుచున్నాను."

 

        ఈ దృక్పదము ప్రాపంచిక వస్తువుషయాదు- లందుండు వారికి రుచించక పోవచ్చును గాని యిది ఒక సందేహాతీతమైన సత్యము.  ఇప్పుడది తెలియనిది, యింకా కనుగొనబడనిది కావచ్చును కానీ సమయమాసన్న మగుచున్నది. ఆయన మాధ్యమమున సంఘటనలు బయల్పడి, ఆయన ఉనికి ప్రపంచమునకు వ్యక్తమగు సమయము దగ్గరలోనే వున్నది.  కనుక నేను ఉన్న ఆధారములన్నిటినిబట్టి మరియు నా స్వానుభవము ద్వారా భగవదాత్మ మనుష్య రూపమున (అవతారము లేక రక్షకుడు) ఈ నాడు ప్రపంచములో ఉన్నదని మరియు తన నిర్ణయము ప్రకారము తనపనియైన మార్పును దెచ్చుటకు కృషిసల్పుచున్నాడని సంపూర్ణ విశ్వాసముతో తెలియ పరుస్తున్నాను.

 

 

 

సూచనలు

 

        అవతారపురుషుడుద్భవించెనని, ఢంకా వాయించి ప్రపంచమున యెవరూ చాటించరు.  లేదా ఆకాశమున అద్భుత ప్రక్రియలేవి కనిపింపవు లేదా పదార్థతత్త్వజ్ఞులైన సామాన్య ప్రజల ఉత్సుకతను తృప్తిపరచు చిత్రాతిచిత్రములేవి ప్రదర్శింపబడవు.  కానీ జనసామాన్యమున కాయన తెలియనప్పటికి దైవజ్ఞులైన వారికి ఆయన ఉనికి తెలియకుండాపోదు.  వారికి ప్రకృతిలోని చిన్నసంజ్ఞ చాలు, వాస్తవాన్ని గ్రహించేస్తారు.  సర్వసాధారణ సూచనగా శ్రీరామకృష్ణపరమహంస అవతార పురుషుని రాకను గురించి యిలా చెప్పారు.

 

        "ఒక పెద్ద సముద్రపుటల యెగసి పడిందంటే చిన్నచిన్న కా లు వలు వాటికి తెలియకుండానే నిండి పొంగి పొరలుతాయి.  అట్లే ఒక అవతార పురుషుడుద్భవమైనంతనే, ఆధ్యాత్మికపుటలలు  ప్రపంచముపై విరుచుకపడి వాతావరణమంతటా దివ్యత్వము నిండియున్నట్లు ప్రజలనుభూతి చెందుతారు."

 

        అటువంటి పరిస్థితి ప్రపంచములో యిప్పుడున్నదా లేదా? యని మన స్పష్టమైన బుద్ధి వికాసముతో గమనించి నిర్ణయింతుము.  ఇది వాస్తవమైతే ఆ మహాత్ముడు నేడు మన మధ్యనున్నాడన్న విషయము నిర్ద్వందంగా ప్రకటింపబడాలి.

 

        న్యుయార్క్ సభలో డెబ్బది సంవత్సరముల (1963 నాటికి) క్రితం స్వామీ వివేకానంద ప్రకృతిని తన అతీంద్రియ శక్తితో గమనించి యిలా ప్రవచించారు.

 

        "నేడు ఆధ్యాత్మిక రంగమున మరొక సర్దుబాటు, వ్యవస్థ అవసరమైయున్నది.  వస్తువ్యామోహం, దాని వైభవం, శక్తి, తారాస్థాయి కెప్పుడు చేరినదో, ఎప్పుడు మనిషి తన దైవతత్త్వమును మరచి వస్తువ్యామోహంతో అదే సర్వస్వమనుకొనుట మిక్కుటమైనదో, అప్పుడు తన్నుతాను బహుఃశా ఒక ధనము ముద్రించు యంత్రముగా మార్చుకొని మనిషి పతనమౌతున్నాడు.  ఈ దశలో ఒక సర్దుబాటవసరమై యున్నది.  వస్తు సముపార్జనమను మేఘములను తరిమివేయుటకు శక్తి వచ్చుచున్నది.  ఒక స్వరము వినిపించినది.  శక్తి చైతన్యవంతము చేయబడినది.  అది మానవుల కందుబాటులోనికొచ్చుటకు చాలా కాలము పట్టదు.  అది మనుష్యుని వాస్తవ సత్యస్థితిని మరల జ్ఞాపకమునకు దెచ్చును.  మరొకసారి ఆ శక్తి ఉద్భవించు ప్రదేశము "ఆసియా" యే అయివున్నది."

 

 

 

అతని ఉనికికి పరీక్ష

 

        అతడిప్పుడున్నాడని కనుగొనుటకు పరీక్షగా మాగురువుగారొక సూచన చేసిరి.  నేనొక మాట చెబుతాను, యెవరైననూ సరే యిప్పుడున్న ఆ దివ్య మహాపురుషుని నుండి ఆధ్యాత్మిక స్పందనలు పొందుతున్నానన్న యోచనతో కొంతసేపు ధ్యానము చేసి అనుభవమున గ్రహించి, అవునా? కాదా? యని నిర్ణయించవచ్చును.  అలా చేస్తే అతనికి ఆ మహాత్ముడున్నాడన్న నిదర్శనం కావలసినంత దొరుకుతుంది.  అతన్ని కనుగొనడానికి మరొక తిరుగులేని పద్ధతి, అందుకొఱకు కొంతకాలం విశ్వాసంతో ధ్యానం విడువకుండా కొనసాగించడమే.  ఇవి సులువైన పద్ధతులు.  వీటివలన వ్యక్తి ఆయన ఉనికిని ఈ ప్రపంచంలో గ్రహించడమేగాక ఆయన యెక్కడ యెలా వున్నాడన్న వాస్తవాలు కూడా తెలుసుకోగలుగుతాడు.  ఇంకా కావాలంటే ఆయనతో స్వయంగా కలసి సత్సంబంధ మేర్పరచుకోవచ్చును.  ఇది శ్రద్ధా భక్తులు గలిగి కోరిన వారికి లభ్యమౌతుంది.  సమర్థులైన సాధుపుంగవులు తెలుసుకోవడానికి ప్రకృతిలోని సూచనలు యెల్లప్పుడూ వారికి తెరువబడేవుంటాయి.  అంతేగాదు వారు వారి యోగదృష్టితో దర్శించి ఆయనతో నేరుగా సంబంధమేర్పరచుకొనే వుంటారు.

 

        ప్రపంచ సోదరులందరికి నా వినయపూర్వక ప్రార్థన.  నా మాటలను మీరు చులకనగా తీసుకొనకండి.  భ్రమలను వదలి, పైన సూచించిన విధానమును శ్రద్దతో ప్రయత్నించండి.  ఈనాడు మనకు అదృష్టవశాత్తు లభించిన భగవత్‌కృపను సద్వినియోగం చేసుకొనండి.  నా శక్తి కొలది గమనించి మీకు నేను నిశ్చయముగా చెబుతున్నాను, ఇప్పుడున్న సమయము చాలా అరుదైనది.  మన స్వల్ప ప్రయత్నమున అత్యున్నత స్థాయిని అతి తక్కువ కాలమున ఆ గొప్ప అవతార మూర్తి కృపవలన పొందవచ్చును.  నా మాటలను మీరు గ్రుడ్డిగా నమ్మనవసరము లేదు.  కానీ కనీసము మీరు ప్రయత్నించి విషయాన్ని గ్రహించండి.  మీకైమీరే ప్రత్యక్షముగా అనుభవపూర్వకముగా వాస్తవమును నిగ్గుతేల్చుకొనండి.  మీ పరీక్షకు నిలబడినట్లయితేనే, సంతృప్తి నొందితేనే విశ్వసించండి.

 

ఒక హెచ్చరిక

 

        మరొక విషయమున్నది.  అది అతి ముఖ్యమైనది కూడా.  ఈ విషయములో మనిషి బహుజాగ్రత్తగా వుండాలి.  ఆ దివ్యావతారమూర్తి యింతవరకు తెలియదు గనుక ఆయన్నింకా కనుగొనలేదు కనుక, నేర్పరులైన వ్యక్తులు మేమే అవతారపురుషులమని, రక్షకులమని తప్పుడు ప్రచారముతో నమ్మించ యత్నించవచ్చును.  వారు విస్తృతముగా తిరుగుతూ అనేక అసాధారణ మహిమలు, అద్భుతములు ప్రదర్శిస్తూ, జనులను రక్షించుటకు దిగివచ్చిన దైవాంశ సంభూతులుగా వారికై వారే గొప్పలు చెప్పుకుంటూ ధీమాగా వ్యవహరిస్తారు.  కనుక యెవరికి వారు తమతమ జాగ్రత్తలో వుండి అట్టివారి చేత మోసగింపబడకుండా వుండటం కూడా చాల అవసరము.  క్రీస్తు ప్రభువు కూడా అట్టివారిని గురించిన జాగ్రత్తలు ఈ క్రింది బైబిలు వాక్యములో చెప్పియున్నారు. (మత్తయి-24)

 

23. అప్పుడు యెవరైనా నీతో అడిగో క్రీస్తు యిక్కడున్నాడు లేదు అడిగో అక్కడున్నాడు అంటారు.  వారిని నమ్మవద్దు.

 

24. అప్పుడు మోసపు క్రీస్తులు, టక్కరి ప్రవక్తలు పుట్టుకొస్తారు.  వారు గొప్ప అద్భుత గుర్తులు చూపిస్తారు.  వారు సాధ్యమైనంత వరకు తప్పుదారి పట్టించి, అసలు క్రీస్తు నెన్నుకొనుటలో మోసపోవునట్లు చేస్తారు.

 

25.  నేను ముందే చెప్పియున్నాను - చూడుము.

 

26.  కనుక వారు ఆదిగో చూడుము ఆయన యెడారిలో ఉన్నాడందురు.  వారి మాట నమ్మిపోవలదు.  కనుగొనండి ఆయన రహస్య గుహలో నున్నాడందురు - నమ్మకండి.

 

27.  వెలుగు తూర్పు నుండి బయల్వెడలి పడమటి వరకు వ్యాపిస్తుంది.  అలాగే మానవ కుమారుడు వస్తాడు.

 

        క్రీస్తు ప్రభువు చెప్పిన ఆఖరు వాక్యములు జనులకు తిరుగులేని విశ్వాసము కలిగిస్తూ మానవ కుమారుడు (అవతారము, రక్షకుడు లేక తిరిగీ వచ్చిన క్రీస్తు) తూర్పున ఉనికిలోనికి వస్తాడు.  ఆయన నుండి సత్యకాంతి పడమటికి పయనిస్తుంది.  అది ప్రతి దానిని తెరిచివైచి దృశ్యమానం గావించి, సమస్త రహస్యాలను తేటతెల్లం చేసేస్తుంది, అని బోధించెను.

 

ఆయన భౌతిక రూపము

 

        అటువంటి గొప్పమహనీయుని బాహ్య- స్వరూపము, భౌతికశరీరమును బట్టి నిర్ణయించి కనుగొనుటనునది బహుఃశా అతి కష్టమైన పనులలో ఒకటి.  సామాన్యంగా ప్రతి ఒక్కరికి వారి ఊహలో ఆ అవతారపురుషునికి సంబంధించి ఒక్కో రూపముంటుంది.  అది పూర్వ రచయితల, తాత్త్వికుల అలంకారికమైన వర్ణనలై వుంటాయి.  కనుక వ్యక్తి ఆ వర్ణనలకు సరిపోవు రూపమును దర్శించిననేగాని ఆయన అవతారపురుషుడని నమ్ము పరిస్థితిలో వుండడు.  సర్వసాధారణముగా ఆయన ఆకట్టుకొనే రూపంలో పైమెఱుగులతో, వైభవముతో, అసాధారణ శక్తులను అడుగడుగునా ప్రదర్శిస్తూ, చూచినంతనే జనులు విధేయులైపోవు నట్లుండవలెనని మన మాశింతుము.  ఆయన మామూలుగా ఈ భూమండలము నంతటిని పాలించునని నమ్ముదుము.  కనుక ఆయన ఒక గొప్ప రాజుగా నుండవలెనని సహజంగా ఎవరైనా ఆశిస్తారు.  లేకపోతే కనీసము ఒక మత పెద్దగానైనా పైకి కనబడాలి.  కానీ మనమనుకున్నట్లు లేదా నమ్మినట్లు ఆయన వుండడం అక్షరసత్యం కాకపోవచ్చు.  వాస్తవానికి ఆయన ఉనికిలోని మహత్మ్యము బాహ్యస్వరూపములో చూడదగినది కాదు.  దానిని మనమే నిర్ధారించి సాక్షాత్కరింపచేసుకొనవలెను.  ఆయన బయటికి సాధారణంగాను నిగర్విగాను గనబడుతూ వుండవచ్చు.  ఆయన నిరాడాంబరతే ఆయన్ను గుర్తించడానికి ఒక తెరగా మారివుండవచ్చును.  ఆయన యేదేశానికి, జాతికి లేక మతానికి సంబంధిచక పోవచ్చును.  కానీ బాహ్య దృష్టికి వాటిలో యేదో ఒకదానికి సంబంధించిన వాడై యుండును.  ఆయన విశ్వమానవుడు. ఓలిప్తకాల మాలోచించండి, ఒక సామాన్యమానవుడు బాటకు ఓ ప్రక్క దీనంగా వెళుతున్నాడు.  ఆయన ప్రక్కనే వెళుతున్నవాని దృష్టిని యేమాత్రం ఆకర్షించేదేమీ ఆయన వద్ద లేదు.  అటువంటప్పుడు ఆయనను అవతారపురుషుడని , రక్షకుడని అంగీకరించడానికి యెవరైనా సిద్ధపడతారాఎవరూ వుండరని నేననుకుంటాను.  అయితే ఒక వజ్రాల వ్యాపారి దృష్టి చెత్తగుంటలో పడియున్న వజ్రాన్ని సైతం గుర్తిస్తుంది.  అట్లే ఒక దివ్యదృష్టిగల సాధుమహాశయుడు మాత్రం ఆయన (అవతారపురుషుడు) బాహ్యంగా యెంత సరళంగా, యెంత నిరాడంబరంగా వున్నా ఆయన మాహాత్ముడని నిశ్చయించుకుంటాడు.  ఆయన పూర్తి బాహ్యజీవనము అతి సామాన్యమానవుని వలెనే వుంటూ అన్ని ప్రాపంచిక ఒడుదుడుకులను యెదుర్కొంటూ, సామాన్య మానవ రూపధారి గాన నిజమైన మానవుని పాత్రను తప్పక పోషించుచుండును.  అందువలన ఆయన బాహ్య రూపమును చూచి నిర్ధారింతు మనుకొన్న వారి బహుతెలివితేటలు లేక వారి విచిత్ర చర్యలేవీ ఖచ్చితంగా వారిని అపజయం పాలుజేస్తాయి.  కనుక రక్షకుని లేక అవతారపురుషుని గుర్తించుటకు మనం మనలను సంతృప్తి పరచు సూచనలను నమ్మకములను నిర్ద్వందముగా ప్రక్కనపెట్టి శ్రద్దతో ఆయనను కనుగొను సరియైన మార్గము నెన్నుకొనవలెను.  అలాకాని పక్షమున దివ్యజ్ఞాన సంపన్నులు, ప్రకృతిరహస్యముల నెరిగినవారు లేక మహోన్నతాత్మలతో అనుబంధం కలిగినవారునైన దివ్య సాధుమహాశయుల అనుభవములపైన వారి నిర్ణయములపైన నమ్మకముంచవలెను.

 

 

ఆయన నిజతత్త్వము

 

        అవతారపురుషుడు లేక రక్షకుడు భగవద్గుణములన్నీ కలిగియుండును.  అయన సర్వాంతర్యామి.  సర్వజ్ఞుడు మరియు సర్వశక్తిమంతుడు.  భౌతికంగా ఒక చోటేవున్నా ఆయన సూర్యునిలో, చంద్రునిలో మరియు నక్షత్రములలోను పారలౌకిక రూపమున అన్నిచోట్లా ఒకేసారి కనబడగలడు.  ఆయన దయ, కరుణ, న్యాయము మరియు జాలి గలవాడు.  అందరికి వారివారి భాగాన్ని యెట్టిఆంక్షలు లేకుండా కేటాయిస్తాడు.  ఆయన ధర్మాత్ములకు వరములను మిక్కుటంగా అనుగ్రహిస్తాడు.  కానీ దూర్తులను, దైవీయవ్యతిరిక్తులను శిక్షిస్తాడు మరియు నశింపజేస్తాడు కూడా.  ఆయన శక్తి అపారము.  ఆయన ప్రకృతి శక్తులను ఆజ్ఞాపించగలడు.  ఆయన పూర్తిచేయనెంచిన కార్యనిర్వహణమునకై ఆ ప్రకృతిశక్తులను చైతన్య పరచి పనిలోనికి దించును.  ఆయన కార్యకలాపములన్నీ దైవీయమైనవి.  అవి కొన్ని సమయములలో అనితరసాధ్యములు, అద్భుతములుగా గోచరించును.  అయితే అట్టి చర్యలు కేవలం యదార్థమైన ప్రకృతి నియమముల నెరవేర్చు నిమిత్తమే ఆయన వినియోగించును.  భగవత్ సంబంధిత విషయములందంతటనూ ఆయన యిచ్ఛ నిరాటంకంగా సాగును.  ఆయన ఒక్క క్షణంలో యే ప్రదేశాన్ని గాని, దేశాన్నిగాని లేక మొత్తం ప్రపంచాన్ని గాని తన మహత్తర ఆధ్యాత్మిక శక్తినుపయోగించి మార్చివేయ గలడు.  ఇది ఆయన సమస్త మానవాళిని పారవశ్య స్థితికి గొనివచ్చుటకు సంకల్పించి చేయవచ్చును.  ఆయన మహోన్నత ఆధ్యాత్మికస్థితిని అనుగ్రహించినంత మాత్రముననే కేవలమొక చూపుతో ప్రసాదింపగలడు. ఆయన తన యిచ్ఛాశక్తితో స్పర్శమాత్రమున సమస్త పూర్వ సంస్కారముల (చర్యల ఫలితముల) ప్రభావమును తొలగించ గలిగి లేదా నశింపజేసి, వ్యక్తిని సర్వబంధనముల నుండి విడిపించగలడు.  మీరు అదృష్టవశాత్తు అట్టి మహనీయ ప్రకృతి శక్తులు గల మహాత్ముని కనుగొనడం జరిగితే, ఆయనను సామాన్య మానవునిగా తలంచవద్దు.  ఈ ప్రపంచాన్ని ఉద్దరించటానికి దిగివచ్చిన అవతారమూర్తిగా గుర్తించండి.  మనమందరము ఆయనను సరియైన సమయానికే గుర్తించెదము గాక!  తదాస్తు.

 

ఆయన కార్యము

 

        అవతార పురుషుడు లేక రక్షకుడు ఈ భూమి మీదకు ఒక ప్రత్యేక ప్రయోజనం కొఱకు, ఒక నిర్దిష్ట కార్యక్రమంతో భగవద్గీతలోని ఈ వాక్యములో చెప్పినట్లు వస్తాడు.

        "నేను శిష్టులను కాపాడటం కొఱకు, దుష్టులను పరిమార్చుట కొఱకు మరియు ధర్మసంరక్షణార్థం, నిర్దిష్టమైన కార్యక్రమముతో యుగ యుగంలో జన్మిస్తుంటాను."

 

        కనుక ఆయన పనిలోని ప్రధానాంశం అధర్మాన్ని భూమిపైనుండి తుడిచిపెట్టడం.  అవతారం భూమిపై కనబడగానే మనుషులంతా ఒక్కసారిగా పవిత్రులుగా, ధర్మాత్ములుగా మారిపోతారనుకోవడం మరియు సమస్త జీవరాశులు రక్షింపబడతాయనుకోవడం తప్పు.  పదం యొక్క అర్థం ప్రకారం రక్షకుడని సక్రమంగానే ఆయన పిలువబడుతున్నా, నిక్కచ్చిగా ఆయన కేవలం ఒక రక్షకుడే కాదు, సంహారకుడు, వినాశాకారి కూడా.  ఆయన ధర్మాత్ములకు రక్షకుడే కావచ్చు కాని దుష్టులకు దైవవిరోధులకు ఆయన విధ్వంసకుడు కూడా.  ఆయన భూమి స్వరూపాన్నే మార్చడానికి వస్తాడు.  కనుక ఆయనకు ఈ ప్రపంచము గులాబీపూల పానుపు కాదు, ఆయన కష్టపడవలసి వుంటుంది.  పోరాడవలసి వుంటుంది.  పునర్నిర్మాణమునకై శ్రమించి, అన్ని ప్రక్రియలను చైతన్య పరచి దుష్టులను మరియు దూర్తులను ఈ ప్రపంచము నుండి నిర్మూలించ వలసి వుంటుంది.  అన్ని వైపుల నుండి ధిక్కారాన్ని యెదుర్కొనవలసి వుంటుంది.  ప్రపంచంలో అధిక సంఖ్యాకులైన దైవ విరోధుల నుండి కారుకూతలు వినాల్సి వుంటుంది.  ఎదురుతిరిగిన వానితో పోరాడవలసి వుంటుంది.  ఆయన ననుసరించేవారు, మద్దతునిచ్చేవారు వుంటారు కాని వారు అల్పసంఖ్యాకులు.  ఇటువంటివెన్నో ప్రతికూల పరిస్థితులున్నా ఆయన తన కార్యక్రమాన్ని ప్రతిభావంతంగా విజయవంతంగా కొనసాగిస్తూ నిర్మాణ, నిర్మూలనా విధులను నిర్వర్తించాలి.  వంగితే వంచడము (దారికి వస్తే సరిదిద్దడము) లేకపోతే విరిచివేయడమే ఆయనకున్న రెండే రెండు మార్గములు.  ఆయన తీరులో వదిలిపెట్టడమన్న ప్రసక్తే లేదు.  సకాలంలో లొంగి రాకపోతే, దూర్తావర్తనులు వారి పూర్వ సంస్కారముల ఫలితముగా వినాశనము పొందక తప్పదు.

 

ఆఖరు దశ

 

        ఆయన కార్యక్రమము యిప్పటికే ప్రారంభింపబడింది.  వాటి సూచనలు స్పష్టముగా, ప్రత్యేకమైనవిగా కనబడుచున్నవి.  అయితే అవి తనస్వార్థంలోతాను మునిగిపోయివున్న వానికి కనబడవు.  ఒక తీవ్ర విపరీతకాలము విపత్తులతోను, కనీవినీ యెరుగని ఆపదలతోను కూడి ఈ ప్రపంచమును ముంచెత్తనున్నది.  ఇదే విధమైన ప్రకృతిసంక్షోభము ఇటువంటి సందర్భములన్నిటిలోను జరుగుతునే యుండును.  రామరావణ యుద్ధము, మహాభారత యుద్ధము, నోవా వరదలు అటువంటి సంఘటనలలో కొన్ని మాత్రమే.  నేడు తలపెట్టిన కార్యక్రమము కూడా ప్రకృతి అదేతీరున నడిపి మార్పుతేనున్నది.  ఆపని కొఱకు అవతారపురుషుడై లేక రక్షకుడై వచ్చినవాడు చురుకుగా పనిలో నిమగ్నమైయున్నాడు.  ప్రపంచము తన తుదిదశకు వేగముగా చేరుకొంటున్న సూచనలు స్పష్టముగా గోచరిస్తున్నవి.  అనుక్షణం నూతన వ్యాజ్యములు పుట్టుకొస్తున్నవి.  వస్తు సముదాయము కూడుకొనుచు మరింత హెచ్చించుకు పోతున్నది.  మానసిక వృత్తులు రానురాను మరింత పతనావస్తకు చేరుకొంటున్నవి.  జరుగుతున్న సంఘటనలన్నీ ప్రత్యక్షంగానో పరోక్షంగానో వినాశన తుది దశకే దారి తీస్తున్నవి. వినాశనము తీవ్రముగాను తప్పనిసరియునైయున్నది.  భూమిపైగల అవాంఛ- నీయములన్ని సమూలంగా నాశనం కావడం అనేకచోట్ల అనేక కారణములతో సంభవింపనున్నది.  అవి తుఫాన్ల వెల్లువలు కావచ్చు, కఱవు వలన, రోగముల వలన కావచ్చు, యుద్దములు లేక సామూహిక సంహారమువలన కావచ్చు లేక అగ్నిపర్వత విస్ఫోటనముల వంటి దైవీయ ఉపద్రవముల వంటి వాటి వలననైననూ కావచ్చును.

 

         రక్షకుని రాకతో ఊహించని విపత్తు  భూమిపై ముంచుకొస్తుందని బైబిలు కూడా తెలుపుచున్నది.  క్రీస్తుప్రభువు కూడా యిట్టి విషాదకర సంఘటనల గురించి హెచ్చరించి, ధర్మమార్గగాములకు తన సహాయ సహకారములుండునని మాటయిచ్చెను.  మా గురువర్యులు కూడా వారి ‘సత్యోదయము’ అను గ్రంధములో బహు సంక్షిప్తముగా ప్రవచించియున్నారు.

        "తుది దశకు కాలము పరిపక్వమై యున్నది.  ప్రపంచము అతివేగవంతముగా వినాశము వైపు దూసుకుపోతున్నది.  ఈ శతాబ్దము చివరికి అట్టిచర్య పూర్తిస్థాయికి రావచ్చును."

 

        "ప్రపంచములో అవాంఛనీయ వస్తుసముదాయ- మంతయు వినాశమగుట మొదలైనదనుటకు వలసిన సూచనలు గోచరిస్తున్నవి."

 

        "ప్రపంచమంతటను విపరీతమైన రక్తపాతములు సంభవించును.  వివిధ కారణముల వలన జననష్టము విపరీతముగా జరిగి ప్రపంచ జనాభా చాలా వరకు తగ్గిపోవును."

 

        ఈ దృక్పదములన్నీ ప్రపంచము వినాశము యొక్క చివరి అంచునకు చేరినట్లు రూఢీయగుచున్నది.  ఇక వృధాచేయుటకు సమయము మిగిలిలేదు.  ఇక వ్యక్తి తన క్షేమమునకై యేమి చేయవలెనో, అదేదో యిప్పుడే ఈ క్షణమే చేయవలెను.  లేకపోతే సమయము మించిపోగలదు.  ఇదీ నేటి ప్రపంచపు (నేడు మనమున్న ఈ ప్రపంచం) దుస్థితి, పాతవిధానము మారిపోక తప్పదు.  మా గురువర్యులు, ఈ విషయాన్ని ఈ విధంగా వివరిస్తున్నారు.

 

        "రాబోవు నూతన ప్రపంచ నిర్మాణము ఎముకలపై మరియు బూడిదపై నిలువనున్నది.  ఆధ్యాత్మికతనాధారము చేసుకొని భారతదేశమున ఒక విధమైన నాగరికత ఉద్భవించును.  అది అనతికాలములోనే ప్రపంచ నాగరికత యగును.  యేదేశము, యేజాతిగాని ఆధ్యాత్మికత నాధారముగా చేసుకొనక మనజాలదు.  తన ఉనికిని సంరక్షించుకొనవలెనంటే యేదేశమైనా, యిప్పుడో అప్పుడో ఈ విధానము నవలంభింపక తప్పినది కాదు."

 

        ఇది కేవలం కాలజ్ఞానపు అంచనా అని మాత్రం భావించుట తప్పు.  ఇది దివ్యమహాత్ముని భవిష్యత్ గోప్యసత్యము యొక్క బహిరంగ ప్రకటన.  నమ్ముడూ, నమ్మకపొండు, ప్రపంచము మాత్రము అమితమైన వేగముతో ఆ దిశగా దూసుకుపోతున్నదన్న విషయానికి సంబంధించిన సూచనలు మాత్రము స్పష్టముగా కనిపించుచున్నవి.  ఇది జరుగుటకు సమయము పట్టవచ్చును కానీ, అది మరీ చాలాదూరములో మాత్రము లేదు.  మార్పునకు సంబంధించిన ఆయన కార్యక్రమములోని చాలా సంఘటనలు ఈ శతాబ్దపు అంతానికి అమలులోనికి రావచ్చును.  కనుక మనము సకాలములో మేల్కొని, లొంగివచ్చి తద్వారా రానున్న ప్రపంచపు యేర్పాటులో మనమొక సురక్షిత స్థానమును, ధర్మయుక్తమగు నిబంధనల ఆధారముగా సిద్ధపరచుకొందుము గాక!  ఇక నేను ప్రార్థనతో ముగింతును.

 

        నిజమైన కృపగల భగవంతుడు మాకు వెలుగును మరియు ఆ గొప్ప అవతారమూర్తి, లోకరక్షకుడు అయిన ఆ మహాత్ముని గుర్తించగల జ్ఞానము వైపునకు గొంపోవు మార్గదర్శకత్వమును ప్రసాదించి, మమ్ములను ఆయన యిచ్ఛకు భక్తితో ఆత్మార్పణము గావించుకొనునట్లు ఉత్తేజ పరచుగాక!

 

తదాస్తు.



పూజ్యలాలాజీ మరియు మన ఆధ్యాత్మికప్రగతి

  పూజ్యలాలాజీ మరియు మన ఆధ్యాత్మికప్రగతి సోదరీసోదరులమైన మనమంతా యిక్కడ యీదినం (ఫిబ్రరవరి 14/ బుధవారం 2024) మన ఆదిగురువులైన పూజ్యలాలాజీవారి 1...