పరిపూర్ణత
(Perfection)
మానవసమాజములోని వివిధసాంస్కృతిక సంఘములలో ఆత్మ పరమాత్మను గూర్చి అనేకభావనలున్నవి. అందువల్ల సాక్షాత్కారము, పరిపూర్ణతకు సంబంధించి, అర్థములు వేరువేరుగా నున్నవి. వారి ఉద్దేశ్యములను నేను విమర్శించుటగానీ తప్పుబట్టుటగానీ చేయనుగానీ, సహజమార్గ దర్శనమురీత్యా నా దృక్పదమును మాత్రము తెలియజేస్తున్నాను.
మానవుని మూలమును సృష్ట్యాదిన గమనించినట్లైన (నా పుస్తకములో వివరించినట్లు) ప్రతివ్యక్తి యొక్క ఉనికి (జీవుడు) దైవమునకు సమీపముగా నుండినది. తేడా కేవలము సాంద్రతతో పోల్చిననే గానవచ్చును. ఒకవిధంగా ఆలోచిస్తే ఆత్మ పరమాత్మ ఒకేవిధంగా నున్న దనవచ్చును. కనుక దైవసాక్షాత్కారము ఆత్మసాక్షాత్కారము రెండూ, ఒకేఅర్థముగల రెండు పదములుగా గోచరించును. ఆత్మ (జీవుడు) సంపూర్ణముగా కేంద్రములో లయమైపోవుట సంభవము కానప్పటికిని, ఆత్మ తొలుత ఒక వ్యక్తిగత ఉనికిగా యేర్పడిన స్థాయివరకు తిరిగి వెళ్ళవచ్చును. ఇదే మానవసాధ్యమగు ఆఖరిస్థానము. దీనినే పరమగమ్యముగా గైకొనవలెను. సహజమార్గ తాత్త్వికవిధానమున దీనినే మనము పరిపూర్ణతకు అర్థముగా భావింతుము.
నిజానికి పరిపూర్ణత యిదియని ఖచ్చితముగా నిర్ణయించజాలము. మానసమున దైవభక్తి గలిగియుండుటకు, మన మాటతీరు నడత సంస్కరింపబడి యుండును. అది పురోగమనమున ఒక ఉత్తమదశయై యుండవచ్చునే గానీ, అది పరిపూర్ణత గాదు. దైవముతో సంబంధ మేర్పరచుకొనియుండుటయు, ఒక ఉన్నతస్థాయి గావచ్చును. కానీ అదికూడా పరిపూర్ణత కానేరదు. శాశ్వతానందమున నోలలాడు చుండుట దైవానుగ్రహము గావచ్చును. కానీ అదికూడా పరిపూర్ణత కాదు. దైవము మాత్రమే పరిపూర్ణము. ఎంత పురోగమించినను నశ్వరమగు దేనిని పరిపూర్ణమనలేము. మనము అనంతవ్యాప్తమున పయనించుచున్నాము. స్థూలాతి స్థూలమైన బాహ్యవృత్తము నుండి కేంద్రము, అదే అంతరముననున్న సున్న (పూజ్యము) వైపునకు ప్రయాణము సాగించుచు న్నాము. ఇది మానవ అవగాహనకందనిది. ఆ మార్గమున మానవసాధ్యమగు తుదిస్థితి యేదైయున్నదో దానినే, పరిపూర్ణతగా గైకొనుచున్నాము. మానవ అవగాహనలో దీనిని సంపూర్ణ అభావస్థితి లేక దైవముతో (సంపూర్ణముతో) కలసిపోయి ఒక్కటైయుండుట లేక అన్నింటి కతీతముగా యేదో ఉన్నదను ఆలోచన లేక ఊహ గలిగియుండుటే అది.
సామాన్యముగా (ప్రకృతి) కార్యము నిర్వహింపదలచినవారు మాత్రమే శక్తికొఱకు ప్రయత్నింతురు. పదార్తాంతర చైతన్యమే శక్తిని హెచ్చింపగలదు. కానీ సత్‍పదార్తమే అవసరమగు ఫలితములనొసగు వాతావరణమేర్పరచ గలదు. నాకది అవసరమైయున్నది. కార్యనిర్వాహకులు ఆ శక్తిగానిశక్తిని పొందవలసి యున్నది. అద్దానిని ప్రపంచము కలలోకూడా కనజాలదు. అదే పరమసత్యము. ఈ శక్తిలేనిశక్తిపరికరముతో, నక్షత్రములను ఛేదించవచ్చును. ఒకనూతన సూర్యుని నుత్పాదించి ప్రపంచమున వెలుగులు నింపవచ్చును. అట్టి శక్తిలేనిశక్తి గల స్థాయిమాత్రమే పరిపూర్ణము. జిఙ్ఞాసువులగువారి కొఱకు మరొక్క విషయము చెప్పదలచితిని. ఒక పరిపూర్ణుడు పూర్తిగా తెలియనివాడైనా, జ్ఞానవిహీనుడైనా, అతడు అంతర్గతముగా సర్వఙ్ఞుడై యుండును . నిష్ణాతులైన జ్ఞానులుసైతం, వారిపరిధిలో పరిష్కరింజాలని సమస్యలనితడు పరిష్కరించ గలిగి యుండును.
అన్నివిధముల శక్తులు, చేష్టలు, జ్ఞానము, స్పందనలు, ఇచ్ఛ, అహము, యింకాచెప్పాలంటే ఎఱుక (స్పృహ) కలిగించు పొరలను, అడ్డంకులను తొలగించుకున్నంతనే అటువంటి, మానవసాధ్య పరిపూర్ణత సిద్ధించును. ఈస్థాయిలో అతడు ఎవరికోసం "నేను" "ఆయన" అనే పదములను వాడునో తెలియదు. చేతులు కదల్చకనే పనులు నిర్వహిస్తాడు. కాళ్ళు కదల్చకనే గమ్యము చేరుకుంటాడు. చూపుసారించకనే చూడగల్గుతాడు. తెలిసుకొనకనే అన్నీతెలిసి వుంటాడు. ఆవిధంగా అతని కార్యనిర్వహణ సాగుతుంది. ఇట్టి కేంద్రస్థాయి లేక సున్నా (పూజ్యము) లేక అభావస్థితి యని గానీ, మరేపేరునగానీ అతనిస్థితిని పిలువవచ్చును. అది మాత్రము చాలాచాలా అరుదైనది. అది సత్యమైనది. అది కృత్రిమప్రయత్నమున కలుగునది కాదు. సరియైన సన్మార్గమున (సత్య సహజమార్గమున) నే అది సిద్ధించును.
------ బాబూజీ రచనలనుండి గ్రహించబడినది.
(డా:S.P శ్రీవాత్సవగారి Divine messages అను పుస్తకమునుండి గ్రహింపబడినది)