అంతఃశుద్ధీకరణ
-- శ్రీరామచంద్రజీ
లాలాజీవారిసాటిలేని అనుగ్రహమువలన మనకొక శిక్షణావిధానము లభించినది.అది సాటిలేని ప్రతిభావంతమని నేను నొక్కివక్కాణించగలను.అది మహదాశ్చర్యకరము సరళమునైన విధానమై యుండుటకు గలహేతువేమిటో మీకు తెలియునా? అదే మనసంస్థలో అనుసరిస్తున్న అంతఃశుద్ధీకరణ విధానము.
వాస్తవమునకు మనపూర్వసంస్కారములే మనల నణగద్రొక్కి, మన నడవడిగామారి సరిదిద్దుకొనలేని స్థితిలో పడవైచినవి. మనంమన గతసంస్కారములకు బానిసలమైపోతిమి. మనంస్వతంత్రంగా ఆలోచిస్తున్నామని ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నామని అనుకుంటున్నాముగాని యిదంతా భ్రమ. మనం ప్రతివిషయంలోను మనగతంచేత నియంత్రబడుతున్నాము.ఈపరిస్థితులలోవున్న వ్యక్తిని మనమెలా మార్చగలము?
ఇది లాలాజీవారి గొప్పదనము. ఈఅంతఃశుద్ధివిధానముద్వారా గతంయొక్క ప్రభావమును పూర్తిగా నిర్మూలించేస్తాము. అయితే యీపని ఒక్కసారిగాకాక క్రమేణాజరుగుతుంది. ఇదెంతటి గొప్ప వరమో గమనించండి. మారితీరాలని ఒకవ్యక్తి బోధించటంవల్ల ప్రయోజనమేమున్నది? అయినా ప్రతియొక్కరూ మారాలనే అనుకుంటారు. కానీ వారికిది సాధ్యంకానిపని. ఎందుకంటే మనస్సు గతంతో నియంత్రించబడుతున్నది. గత సంస్కారాలతో కూడియున్న మనస్సును శుద్ధీకరించడం వలన మార్పుతీసుకొనిరావచ్చునన్న విషయం మీరు గమనించవచ్చును. ఈ విధంగా గతమ్యొక్క ప్రభావంనుండి విడుదలపొందుట అభ్యాసికి సాధ్యమగును.
వాస్తనమునకు యిదే మనకున్నబంధనము. మన గతసంస్కారములు (ముద్రలు) మన ప్రవృత్తులకు మూలమగును. వీటిని మార్పుచేసికొనుట మనకు కష్టమనిపించును. ముద్రలను పరిశుభ్రపరచినట్లైన ప్రవృత్తులను సులభముగా సవరించవచ్చును. అనేకుల విషయములో దానికైఅదే జరిగిపోవును. అటువంటప్పుడు ఆలోచన ఆచరణ తగురీతిగాను (సరిగ్గాను) సహజంగానూ రూపుదిద్దుకొనును. అనగా ప్రాణాహుతిప్రసారంతోనే అన్నీ సరిదిద్దబడవు. శుద్దీకరణ అతిముఖ్యము. లేకపోతే అభ్యాసి పురోగమించినా, గతసంస్కారములు వెనక్కు లాగుటవలన పతనమగు ప్రమాదము వుండనేవున్నది. పురోగతి నిరాటంకముగా వుండాలంటే, మన అంతర్గత నిర్మలీకరణ అత్యంతావశ్యకము. అందుచేతనే నేను ప్రశిక్షకులకు యీవిషయంగా మరింతశ్రద్ధవహించమని చెబుతూవుంటాను. ఇది అత్యంతముఖ్యాంశము. క్రిందిస్థాయిలో యీపనికై మరింతశ్రమపడవలసివస్తుంది. కనుకనే నిర్లక్ష్యముచేసే పరిస్థితులేర్పడుచున్నవి. అందువల్ల అభ్యాసులకు చేయుసేవ నిరర్థకమౌతున్నది.
మనం అభ్యాసులకు సేవచేయుటకున్నాము. అయినప్పటికీ నిర్మలీకరణ నిర్లక్ష్యముచేయుటవలన, నిజానికి వారికి సేవచేయని వారమౌతున్నాము.
సంపూర్ణసహకారము
ఇది మీమీదే ఆధారపడివుందని నేను మళ్ళీమళ్ళీ మనప్రశిక్షకులకు తెలియజేస్తూనే వున్నాను సంపూర్ణసహకారంవలన పనిసులువౌతుంది. నేను అభ్యసిని శుద్ధిచేస్తూపోతుంటే, అభ్యాసి మాత్రం జడత్వాన్నిపెంపొందించుకుంటూపోతుంటే, నేనుమాత్రమేమిచేయగలను? మీరు అభ్యసినికూడా సహకరించేట్లు చేయాలి. అతడు తనపురోగతికి సహాయకారిగా వుండేట్లు తనజీవితాన్ని సరిదిద్దుకోవాలి. కూడబెట్టుకున్న గతసంస్కారాలను తొలగించే కార్యాన్ని గురువు నిర్వహిస్తాడు.
కానీ అభ్యాసి అలసత్వంవహించక చురుగ్గావుండి, తనఆలోచనలతో ఆచరణలతో మరింతజడత్వాన్ని పెంపొందించుకొనకుండా వుండాలి. అందుకే మెలకువగావుండటం అవసరం. ప్రతిదినం చేసుకొనే నిర్మలీకరణవిధానాన్ని తప్పక అనుసరిస్తూపోతే, లాలాజీవారి కృపవల్ల ముద్రలేర్పడడం నిలచిపోయేస్థితికి చేరుకుంటారు. ఇక సంస్కారాలేర్పడవు. ఇదిఒక గొప్పస్థితి. కానీ వాస్తవానికిది ప్రయాణంలో ప్రారంభముమాత్రమే.
సంస్కారాలేర్పడటం నిలిచిపోగానే, గమ్యం నీకనుచూపుమేరలో వుంటుంది. గతంలో పేరుకపోయివున్న సంస్కారాల అవశేషాలేవైనా కొన్నిమిగిలిపోయివుండవచ్చును. వాటిసంగతి గురువుగారే చూసుకుంటారు. అది ఆయనబాధ్యత. నేను మరోవిషయం తెలియజేయవలసి యున్నది. మనం శరీరధారులమైయున్నంతకాలం కొంత జడత్వం వుండనే వుంటుంది. ఒకవేళ దేహి సంపూర్ణంగా శుద్ధిగావింపబడితే, ప్రాణం నిలువదు. అట్లని (నవ్వుతూ) జీవితం కొనసాగడం కోసం మనలో జడత్వాన్ని పెంపొందించుకొనరాదుసుమా! ఎప్పుడైతే సంస్కారాలుయేర్పడడం నిలచిపోతుందో, అప్పుడే గమ్యం, మన దరిదాపుల్లోకొచ్చిందని గుర్తించాలి. అస్థితిలో వ్యక్తి సాధారణజీవితం సాగిస్తూ, వివిధములైన పనులను చక్కగా నెరవేరుస్తూ వుంటాడు. కానీ అతనికి యేవిధమైన సంస్కారములూ అంటవు. ఈస్థితిలోనివానిని నేను జీవించియూ మరణించినవాడని అంటాను. ఈస్థినందుకోవటానికి అభ్యసి తప్పక సహకరించవలసి వుంటుంది. అదెలాగంటే, చెబుతా వినండి. నేనొక అందమైనగులాబీపువ్వును చూశాననుకోండి. ఆహా! యెంతబాగున్నది అనుకుంటాను. అందులో తప్పేమీలేదు. అలాకకుండా మళీమళ్ళీ దాన్నే చూడాలనుకుంటాను. అదితప్పు. గులాబీ అందంపై మక్కువపెంచుకొని తద్వార లోతైనముద్రలు మనసుపై పడనీయరాదు. అలాజరిగితే మాటిమాటికీ దానిదగ్గరకువెళ్ళి చూడాలనిపిస్తుంది. ఇది, యేర్పడినముద్రలు మరింత బలపడేట్లుచేస్తుంది. ఆతర్వాత దాన్ని పొందాలనే ఆకాంక్ష మొదలై ఒకాటాడిస్తుంది. మనంలొంగిపోయామంటే, యిక దానిపనియది మొదలుపెడుతుంది. గమనించిచూడండి. ఒకచిన్న ఆలోచనను అదుపుచేయకుండా సాగనిస్తే, అది కార్యరూపందాలుస్తుంది. పర్యవసానంగా అది నిరాటంకంగా మున్ముందుకు వెళ్ళి, వరుససంఘటనలకు కారణమై, వాటిలో మనం చిక్కుకొనిపోయేట్లుచేస్తుంది. అందుకేమనం జాగరూకతతో చైతన్యవంతులమై వుండాలి.
దరు సాధనమొదలెట్టగానే ప్రశాంతత కావాలంటారు. కానీ వారికి సాంతం నిరంతరాయంగా ప్రశాంతత నివ్వడమెలా సాధ్యమౌతుంది? నిర్మలీకరణకార్యం జరుగుతున్నపుడు, సంస్కారాలు హృదయంనుండి పెగలింపబడతాయి. అప్పుడు, అభ్యాసి కొంతమేర ఆంధోళనకుగురౌతాడు. కేవలం ప్రశాంతతే కావాలంటే, సంస్కారాలు పూర్తిగా పరిశుద్ధంగావింపబడవు. మోక్షంసిద్ధింపదు. మోక్షంసిద్ధించాలంటే, తపనను ఆహ్వానించటానికి సిద్ధంగా వుండాల్సిందేమరి.
(ఆధ్యాత్మజ్ఞాన్ 2022 అక్టోబర్-డిశంబర్ త్రైమాసపత్రికలో ఆంగ్లంలో వెలువడిన "cleaning" అనే వ్యాసమునకు తెలుగు అనువాదము. )