Showing posts with label మన నిర్మాణమునకు మనమే శిల్పులము. Show all posts
Showing posts with label మన నిర్మాణమునకు మనమే శిల్పులము. Show all posts

Saturday, 21 September 2024

మన నిర్మాణమునకు మనమే శిల్పులము

 

మన నిర్మాణమునకు మనమే శిల్పులము

    రచన:-R .రామశాస్త్రి, గుల్బర్గా.                            అనువాదం;- P. సుబ్బరాయుడు, హైదరాబాద్.

జనసమూహములు ఆధ్యాత్మికతను జీవితములో ఆకర్షణ లేనిదిగా, అ‍ఇష్టమైనదిగా, ఆసక్తిలేనిదిగా, పనికిరానిదిగా భావిస్తున్నారు. ఆధ్యాత్మికసాధనకు జీవితములోని అనేకసంఘటనలు ఆటంకము కలిగిస్తున్నవని, సామాన్యమనుష్యుని మానసికస్థితిని పరిశీలించినట్లైన విషదమౌతున్నది. ఈపరిస్థితి కేవలము సహజమార్గసాధనకే పరిమితమైలేదు. ఈఅడ్డంకులు సర్వసామాన్యముగా యేఆధ్యాత్మికసాధనకైనా ఒకేవిధంగా వుంటాయి.

సాధన అంటే యేమిటి? ఈప్రశ్న సహజంగా యెవరైనా యెదుర్కోవలసినదే. సాధన శాంతికొఱకా? సౌకర్యమునకా? సంతృప్తికా? జీవితములో సమస్యల నెదుర్కోవడానికా? లేక భగవత్సాక్షాత్కారానికా? మనస్సును అంతర్ముఖంగావించి ప్రాపంచికవస్తుసముదాయమునకకై ప్రాకులాడకుండా చేయుటకు చేయు తొలిప్రయత్నమిది. నిలకడలేని చపలచిత్తమునకు క్రమబద్ధముగాని మనస్సునకు, పుట్టుకతోనే జీవితమొక రణరంగమై పోతున్నది.

మానవమనస్సు సంస్కృతపదము "మన్" నుండి యేర్పడినది.అది పశువులమనస్సు కంటే భిన్నమైనది. మానవమనస్సు ఉన్నతము మరియు చైతన్యవంతమైనది. అదే మానవుని పెట్టుబడి, మనుష్యజాతి నిజమైన సంపద. ఇదే జీవితాన్ని క్రమబద్ధీకరించి పురోగమింపజేస్తుంది. సంతోషానికి, దుఖఃమునకు, ఆనందానికి, బాధకు, ఆరోగ్యానికి, అస్వస్థకు ఇదే బాధ్యతవహిస్తున్నది. మానసిక ఔన్నత్యమునకు సంబంధించి, ఆధ్యాత్మికమార్గములో యిదే పనిజేస్తుంది. అది అతీంద్రియ స్థితిలో ఆత్మకు అనుసంధింపబడుతుంది. 

రహస్య మహాశక్తి:- ప్రాపంచికవిషయాల ఆకర్షణకు లోబడిపోయి, మనం ఆంతరంగికఆత్మ విషయంలో అంధులమైపోయాము. క్షణభంగురము, నశ్వరమునైన ప్రాపంచికవిషయములకు ఆకర్షితులమై క్రమేణ మహత్తర మానసికశక్తి అటువైపునకు మరలినది. ఒక తమాషా (పిట్ట)కథలో చెప్పినట్లు మానవమనస్సు యేవిధంగా ప్రాపంచిక పైపైమెఱుగులకు లోనై బహిర్ముఖమైపోతుందో గమనించగలరు.

ఒకసారిబ్రహ్మ ఒకరహస్య శక్తిని సృష్టించాడు. ఆశక్తి మనిషి కోరినవన్నీ యివ్వగల మహిమగలది. అయితే మనిషి ఆశక్తిని దుర్వినియోగపరుస్తాడేమోనన్న భయం బ్రహ్మకు కలిగింది. బ్రహ్మ దేవతలను పిలిపించి యీరహస్యశక్తిని యెక్కడదాస్తే బాగుంటుందో చెప్పమన్నాడు. ఇదిఒక గంభీరమైన సమస్యయై చర్చించి చర్చించి ఒకొక్కరు ఒక్కోసలహా యిచ్చారు. ఒకరు ఆశక్తిని సముద్రపు లోతుల్లో నిక్షిప్తం చేయాలన్నారు. ఇంకొకరు పర్వతశిఖరాలలో దాయాలన్నారు. మరొకరు దట్టమైన దుర్గమారణ్యాలలో దాచిపెట్టాలన్నారు. అయితే యివేవి ఆమోదయోగ్యంగా లేవన్నాడు బ్రహ్మ. అప్పుడొక తెలివైనదేవత బాగాఆలోచించి యీరహస్యశక్తిని మానవమనస్సులో దాస్తే సరిపోతుంది. ఎందుకంటే మనిషి తనబాల్యంనుండి బాహ్యప్రపంచపు వస్తువుల మోజులోపడివుంటాడు గనుక యీరహస్యశక్తిని గుర్తించలేడు అన్నాడు.

 

కనుక మనిషి తనలోనేదాగియున్న ఆశక్తిని గురించి తెలుసుకోలేక దానికొఱకు బాహ్యప్రపంచంలో ఇంద్రియముల సహాయంతో వెతుకుతాడు. ఈఉపాయం అందరికినచ్చి మనిషి మనస్సులోనే దాచివుంచడం మంచిదన్న నిర్ణయానికొచ్చారు. ఈకథ మానవుని మనస్సుయొక్క వాలకమును చక్కగా విశ్లేషిస్తున్నది.

నిజమైన లక్ష్యము:- మన గతజన్మల సంస్కారములకు మనం  దాసులమన్న సంగతి మరచిపోయాము. మన గతజన్మల సంస్కారబలమునకు లొంగిపోయికూడా మనయిష్టానుసారం స్వతంత్రంగాఆలోచించి నడచుకోగలమన్న తప్పుడుభావనతో వున్నాము. మన అవసరాలు తీరినప్పటికిని మనం సంతృప్తిపడక, యింకా కోరికలు తీరలేదని వాటికొఱకై ప్రాకులాడుచునే యున్నాము. చక్కనిజీవితము గడపడానికి తగినంతవున్నా, యింకా యింకా కావాలంటూ ప్రయాసపడుతూనే వున్నాము. పూర్వకాలపు ఋషులు మానవుని మానసిక దుర్బలత్వమును గమనించి, బాహ్యప్రపంచపు ఆకర్షణలకు లోనుగాకుండా జాగ్రత్తలు చెప్పియున్నారు. ఆధ్యాత్మిక సాధనకు తగినట్లు మన గతసంస్కారముల ప్రభావమునకు లొంగక, స్థిరముగా పురోగమించవలసి యున్నది.  

పక్షి తనరెండు రెక్కలతో యెగురుతున్నట్లుగా మనం ప్రాపంచికమైన కుటుంబ బాధ్యతలను, ఆధ్యాత్మికమైన గురువర్యుల మార్గమును సమన్వయపరచుకొనవలెను. ఎందుకంటే మన గురువర్యులే మనకు జీవితమున నిజమైన లక్ష్యము. ఆధ్యాత్మికమంటే, మనలోని దైవాన్ని సహజమార్గముద్వారా సాక్షాత్కరింపజేసుకొనుటే. కనుక ఆధ్యాత్మికములో భక్తిగలిగి ఆత్మ, తపనతో పురోగమించుటకు సహకరించుటే మొదటిమెట్టు.

18 వ శ్డతాబ్దపు ఆధ్యాద్యాత్మికవేత్త  జేమ్స్‍రస్సెల్ మహాశయుడు ఒక సందర్భములో యీవిధంగా సెలవిచ్చారు. "నీవు జీవితములో లక్ష్యమును సాధించుటకు అశక్తుడవైతే అది నీదోషము కానేకాదు. కానీ జీవితానికి ఒకలక్ష్యమే లేదంటే, అది మాత్రము నిజంగా దోషమే. కనుక మనకు ఆధ్యాత్మిక మరియు పాపంచిక విషయములలో ఒక నిర్ధిష్టమైన ఆలోచన వుండాలి. ఆరెండిటిమధ్య చక్కని సమన్వయమేర్పరచుకోవాలి. అలాకాని పక్షములో మనజీవితము, మన‍ఉనికి నిష్ప్రయోజనమై పోతుంది. 

ఆధ్యాత్మికజ్ఞానము:- "జంతూనాం నరజన్మ దుర్లభం" అని ఆదిశంకరాచార్యులవారు సెలవిచ్చారు. జీవరాసు లన్నిటిలో మానవజన్మ అరుదైనది. అంతేగాక మనిషికి పశువుకు తేడా గమనిస్తే, తెలివి, వివేకము, భవిష్యత్తుకు సంబంధించి యేది మంచో యేది చెడ్డో లోతుగా ఆలోచించి తెలుసుకోగల విచక్షణాజ్ఞానము, ఆత్మకు సంబంధించిన ఆధ్యాత్మికజ్ఞానము మనిషికే వున్నాయి. భగవద్గీత 10 వ అధ్యాయం 32 వశ్లోకంలో "ఆద్యాత్మవిద్యా విద్యానాం" అన్నారు శ్రీకృష్ణపరమాత్మ. ఆధ్యాత్మికజ్ఞానమే స్వేచ్ఛకు రహదారి. అందుకే అది నిగూడమైనది.

మనపూర్వీకులుగూడా జీవితములో పురుషార్థములైన ఆర్థ (ఆర్థికవిలువలు) కామ (కాంక్షలు) ధర్మములు అశాశ్వతములు. అయితే మోక్షము (విడుదల) అనగా జనన మరణ చక్రమునుండి విడుదలపొందుట శాశ్వతమని నిర్ధారించి చెప్పిరి. ఒక ఉర్దూకవి యిలా అన్నారు. "ఖుద్‍మే ఖుదాహై. ఖుదా కబ్ జుదాహై? జో యేరాజ్ నసమ్‍ఝే, ఓ గధాహై" నీలోనే భగవంతుడున్నాడు. నిన్ను వదలి భగవంతుడున్నాడా?లేడుగదా! ఈసత్యం అర్థంకానివాడు గాడిదే. మన భారతఋషుల ఆలోచన ప్రకారం "తనకుతాను సహాయంచేసుకునేవానికే, భగవంతుడు సహాయపడతాడు" అన్న వాక్యం సరియైనది. ఉపనిషత్తులలోగూడా "గుర్‍నతి ఉపదిశతి జ్ఞానం ఇతి గురుః" అని వున్నది. అనగా యెవరు మార్గదర్శియై జ్ఞాన మిచ్చెదరో వారే నిజమైన గురువు. వారిని దైవముగా భావింతుము (ఆచార్యదేవోభవ) అని ఉపనిషత్ వాక్యము.

ప్రభువు ( గురువు) రక్షిస్తాడు:- సృష్ట్యాదినవున్న మనిషిస్థితికి తిరిగిచేరుకొనుటే మనజీవిత లక్ష్యమై వుండాలి. ఈలక్ష్యమైన మన స్వస్థలమునకు చేరుట, మనకసాధ్యమైనందువల్ల, మనఆత్మను ప్రాణాహుతిశక్తి నుపయోగించి మనస్వస్థలమునకు జేర్చగల సమర్థుడైన గురువు సహాయం ఆవశ్యకమై యున్నది. గురువుగా, దైవముగా మనకు మార్గదర్శకులైనవారు మనగురువర్యులు (మాస్టర్). సమర్థుడైన గురువు దొరుకుట కష్టతరమే. అయితే అన్వేషకుడు మార్గదర్శికై నిజాయితీతో ప్రార్థిస్తే, ప్రకృతే సహాయపడి గురువును మనగడపవద్దకే పంపుతుంది.

ఆధ్యాత్మికత అందరికీ అందదని, సామాన్యంగా అనుకుంటున్నట్లు గాకుండా, సాధనద్వారా సామాన్యులుకూడా భగవత్సాక్షాత్కారము నాశించి పొందవచ్చునని, ఉత్తరప్రదేశ్‍లోని ఫతేఘడ్ నివాసియైన మన ఆదిగురువులు శ్రీరామచంద్రజీ వారు వివరించి చెప్పారు. వారి యోగ్యశిష్యులు మరియు వారి ఉత్తరాధికారియైన ఉత్తరప్రదేశ్ షాజహాన్‍పూర్ వాస్తవ్యులైన శ్రీరామచంద్రజీ వారు కొన్నిమార్పులుచేసిన రాజయోగవిధానమును సహజమార్గమనుపేరున ప్రవేశపెట్టి, తమ గురువుపేరున శ్రీరామచంద్ర మిషన్‍ను స్థాపించినారు. 1982 సెప్టంబర్ ఒకటవ తేదీన ప్యారిస్ ప్రకటన ద్వారా సేవింపబడుటకంటే, సేవచేయుట ఉత్తమమన్న ఆదర్శముతో యీఆధ్యాత్మికసంస్థ మానవసమాజమునకు సేవలందించునని పూజ్యబాబూజీ ప్రకటించారు.

భగవంతుడు మరొక భగవంతుని సృష్టించలేడు. కానీ గురువుమాత్రము శిష్యుని, తనంతటి గురువుగా తయారుచేసి, అతనికి భగవత్సాక్షాత్కారము చేయించగలరు. అన్వేషకుని ఉన్నతజ్ఞానమును గుర్తించి గురువర్యులు అతనిని కంటికిరెప్పవలె కాపాడుకొనును. పశులక్షణములుగల మనిషిని మానవత్వపు మనిషిగాను, అటనుండి దైవీయమనిషిగాను మార్పుచేయుటనునదొక దివ్యమైన అద్భుతము. సర్వజనాళికి శ్రీబాబూజీ "ఆధ్యాత్మికత నాబాధ్యత సాధన మీబాధ్యత" అని ప్రకటించారు. కనుక కేవలం చదివి ఆనందించడంకాదు, సాధనచేసి అనుభవమునుపొంది ఆనందించండి  --- ఓమ్ తత్ సత్.  

 (ఆధ్యాత్మజ్ఞాన్~ జనవరి-మార్చి 2023 పత్రిక నుండి గ్రహించడమైనది)

 

 

 

 

 

 

 

పూజ్యలాలాజీ మరియు మన ఆధ్యాత్మికప్రగతి

  పూజ్యలాలాజీ మరియు మన ఆధ్యాత్మికప్రగతి సోదరీసోదరులమైన మనమంతా యిక్కడ యీదినం (ఫిబ్రరవరి 14/ బుధవారం 2024) మన ఆదిగురువులైన పూజ్యలాలాజీవారి 1...