Showing posts with label Scientific Basis Of Sahaj Marg. Show all posts
Showing posts with label Scientific Basis Of Sahaj Marg. Show all posts

Tuesday, 24 September 2024

శాస్త్రాధారిత సహజమార్గము

 

శాస్త్రాధారిత సహజమార్గము

రచన:- పూజ్యశ్రీ రాఘవేంద్ర రావ్, రాయచూర్.    అనువాదం:- పి. సుబ్బారాయుడు, హైదరాబాద్ .  

సైన్స్ (శాస్త్రము) అంటే యేమిటోకూడా తెలియకుండానే  నేటికాలపు మనుజులు సైన్స్ ప్రకారంఉండాలన్న తీరునప్రకారం వుండాలన్న తీరున వ్యవహరిస్తున్నారు. నిఘంటువులో చూపినప్రకారం శాస్త్రీయం (సైన్స్) అంటే బాగుగుగా గమనించి ప్రయోగముద్వారా ఖచ్చితముగా పరిశీలించినదై, ఒక క్రమపద్దతిలో సామాన్యసూత్రములకనుగుణంగా, వివరింపగలిగినదై వుండాలి. భౌతికశాస్త్ర పరిభాషలో చెప్పాలంటే యేవిధమైన సందిగ్దములేకుండా, అసంబద్దముగాని విధానమున వాస్తవములను నిగ్గుదేల్చి అనుభవపూర్వకముగ గుర్తించి సిద్ధాంతములుగా యేర్పరచి యేవిధమైన వంచనకు స్వప్రయోజనమునకు తావివ్వక నిజాలు, అనుభవముల ప్రాతిపదికగా కనుగొనబడిన సూత్రములే శుద్ధశాస్త్ర (ప్యూర్ సైన్స్) మనబడును.

సందిగ్దత, సస్వ ప్రయోజనాపేక్ష లేకుండుటన్నది విస్మరింపరాని ముఖ్యాంశములు. దురదృష్టవశాత్తు భౌతికవస్తుమయ శాస్త్రము, మనమెక్కడున్నామో తెలుసుకొనేలోపలే, ఆనేకములైన ఆకర్షక వస్తువులను శాస్త్రరీత్యా మన‍ఉపయోగార్థమన్నట్లు మనపై విపరీతముగా వచ్చిపడి, శాస్త్రార్థమునకే భంగము కలుగుతున్నది.

ఇదే పరిస్థితి మనదేశఆధ్యాత్మిక శాస్త్రమునకూ దాపురించినది. అది డాంబికుల మరియు క్షుద్రయాచకుల వాతబడి, కొద్ది కొద్దిగా దిగజారి, ఒకబూటకముగాను, నీచమాంత్రికవిద్యగాను మారిపోయినది. అంతేగాకుండా మరోవిధంగానూ ప్రక్కదారి పట్టింది. ఆధ్యాత్మికత మాసొంతమని చెప్పే పెద్ద పెద్ద విద్యావంతులు, నిరర్థకమైన తత్త్వజ్ఞానమును వారి పేరుప్రతిష్టలకోసం వ్యాప్తిజేస్తున్నారు. కనుక యేపద్దతిగాని సిద్దాంతముగాని సరియైన ఆలోచ, సాధన ప్రాతిపదికగా, శాస్త్రసమ్మతముగా నేర్పుతున్నారా లేదా? అవి నిష్పక్షపాతంగా స్వార్థప్రయోజనరహితంగా వున్నాయా లేదా? అన్నవిషయాన్ని జాగ్రత్తగా గమనింపవలసి యున్నది.

మరొక్కవిషయం. ఒక ఆలోచనావిధానము శాస్త్రసమ్మతమైనది అంటే , అది అద్భుతాలుచూపేదిగాను, చపలచిత్తుల యిచ్ఛగానూ వుండరాదు. ఆవిధానములో గమనించిన వాస్తవాలు లేదా అనుభవాలు పూర్వము నిర్ధారించిన వాస్తవాల ఆధారంగా అర్థవంతముగా వివరింపగలిగి వుండాలి. మార్మికవాదులు, తమకైతాము అపరోక్షాజ్ఞానులమని ప్రకటించుకొన్నబోధకులు యీవాస్తవాన్ని అంగీకరించకపోవచ్చును. రాధాకమల్‍ముఖర్జీవారు చెప్పినట్లు మర్మజ్ఞాని వాస్తవానికి విశాలదృక్పదంగలిగి శాస్త్రసమ్మతమైన ఆలోచన గలిగివుండాలి. అద్భుతప్రదర్శనల ప్రపంచమునుండి బయటపడి చపలచిత్తుడుగాకుండా వుండాలి. శాస్త్రసమ్మతమైన ఆలోచనగలవ్యక్తి, ఇంద్రియప్రవర్తనలను చక్కగా విశ్లేశించుకోగలిగి, వాటిని  అదుపుచేసుకోగలిగి, ఆచరణలో పెట్టుకున్నవాడై వుండవలెను, ఒక మార్మికయోగి కూడా పొందికగా సమ్మతమ గురీతిలో తన క్రొంగొత్త ఆవిష్కరణలను వివరించ గలిగి వుండాలి .

(ముఖర్జి 1889-1968 – ఒక నవీన భారత స్దామాజిక శాస్త్రవేత్త. ఆర్థిక సామాజిక ప్రొఫెసర్. లక్నొ (U . P) విశ్వవిద్యాలయ వైస్‍ఛాన్స్‍లర్)

యోగ సంబంధ ప్రాణాహుతి ప్రసారము:- ఈప్రధానశాస్త్ర భుమికగా, సహజమార్గంగా గుర్తింపబడిన సాధనను గురించి తెలుసుకొనే ప్రయత్నం చేద్దాం.

సహజమార్గంలో గైకొన్న భావనలు సరళమైనవి. అందులో మొదటిది మరియు అతిముఖ్యమైన‍అంశం, భగవంతుడున్నాడు, భగవంతుడొక్కడే (ఏకంసత్) అని విశ్వసించడము. ఈభావనను వృత్తిరీత్య నాస్తికుడైవాడు తప్ప మిగిలినవారు అంగీకరించడానికి సంశయిస్తారు (నాస్తికుడు అసలొప్పుకోడు) కాని ఒక భౌతికశాస్త్రావేత్త మాత్రము వెంటనే భగవంతుని లక్షణాలను

  C G S  లేదా F P C విధానంలో తెలియజేయమంటాడు. శాస్త్రజ్ఞుని, యీప్రశ్నకు జవాబు, మీరే కనుగొనండి అనాలి. అంటే అతడు నిజంగా భగవంతునిగురించిన జ్ఞానం పొందితేనే గాని అతనికి సాధ్యపడదు. ఇది అనుభవముద్వారా పొందవలసిన జ్ఞానం. పుస్తకపఠనం ద్వార లభ్యంకాదు. కేవలం తన్నుతాను భగవంతునితో సమమైన నిజతత్త్వానికి మార్పుచేసుకున్నప్పుడే సాధ్యమౌతుంది. ఇదే మనకు సహజమార్గంలో  లభిస్తున్నది. 

ఇక తర్వాతిభావన, వ్యక్తి భగవంతుని అనుభవజ్ఞానమును ఒక సమర్థమార్గదర్శకుని సహాయముననే సాధ్యమగుననుట. సహజంగా ఉన్నతజ్ఞానమేదైనా బోధకుని లేక మార్గదర్సకుని సహాయం లేకుండా సాధ్యపడదు. ఈభావనకూడా బహుసరళమైనది. అనుభవము పొందుటకు తగియున్నది.  

ఇకయీవిధానముయొక్క ప్రత్యేకతను గూర్చి తెలుసుకుందాం. అది యీవిధానపు శిక్షణాపద్దతి. ఆత్మసాక్షాత్కారమీ మార్గమున ప్రాణాహుతి యను యోగశక్తి ప్రసారముద్వారా ఒక జీవితకాలములోనే సిద్ధించును . అందుకు ప్రాణాహుతి యోగశక్తిప్రసారముపై సంపూర్ణాధికారముగల మహనీయుని మార్గదర్సకత్వమున యీకార్యము నిర్వర్తింపబడుచున్నది. యీ దద్దతి సరళము మరియు సహజమైనది. స్పందనలు మార్గదర్శకుని ప్రాణాహుతి ప్రసారముద్వారా సాధకుని కందుచున్నవి. కొంత సాధనన తర్వాత సాధకుడు ఆధ్యాత్మికస్థితులను ఒకదానితర్వాత ఒకటిగా అనుభవజ్ఞానమున  పొందును. వాటిని భావనలమూలమున అర్థముచేసుకొని విశ్లేషించుకో నారంభించును. తన మార్గదర్శకుని గురించి ఆయన కార్యనిర్వహణను గురించి ఆలోచించమొదలిడును. అదే క్రమేణ సహజంగా అతని నిరంతరస్మరణగా వృద్ధిచెందును.

ప్రత్యేక జాగరూకత:- ఈవిధానపు ప్రతిభ, వ్యక్తి ఆధ్యాత్మికపురోగతితోపాటు, ఆత్మశుద్ధీకరణలో నున్నది. హృదయశుద్ధితో ప్రారంభించి, చక్రములన్నీ పూర్తిగా పరిశుద్ధము గావించి ఉద్దీపనచేయబడును. ఇది అత్యంతముఖ్యమైన అంశము. దీని కొఱకు ప్రత్యేకశ్రద్ధతో మార్గదర్శి సంరక్షించుచుండును. ఇట్టి ప్రధానమైన అంశమును విస్మరించినట్లైన లేక ఖాతరుచేయకపోవుటవలన, సాధకుని చక్రములు మేల్కొనబడుటచే ఉత్పన్నమైన శక్తులను సాధకుడు దురుపయోగపెట్టు ప్రమాదము గలదు. కనుక అట్టి ప్రమాదనివారణకుగాను అంతఃశుద్ధీ కరణపై ప్రత్యేకశ్రద్ధ తీసుకోవడం జరుగుతున్నది.

సహజమార్గము నిజానికి మార్పుచేయబడిన రాజయోగము. ఇది సరళము మరుయు సహజమునైన విధానమే గాకుండా మానవుని సామాన్యప్రాపంచిక జీవనమునకు అనువైనది. ఇది ఆలోచన ఆధారంగా అమరియున్నది. దీని పనితీరు పూర్వఋషుల చేత శాస్త్రబద్ధంగా పరిశీలింపబడినది. పతంజలియోగదర్శనము దీనికొక ఉదాహరణము.

నేను యీవిధానములోని ముఖ్యాంశములను మాత్రమే చర్చించి పాఠకుల యెదుట సహజమార్గ శాస్త్రాధారాలనుంచితిని. ఇది మన జీవితచరమలక్ష్యమును చేర్చుటకు తగినట్లు సంస్కరింపబడి అత్యంత సున్నితము సూక్ష్మమునైన స్థాయికి తీసుకొని రాబడినది

----------------------------------------------------------------------.

CGS= సెంటీమీటర్ గ్రామ్ సెకండ్ (పొడవు, దవ్యరాశి, కాలం ప్రాతిపదికగా వివరించు శాస్త్రము)

FPS= ఫుట్ పౌండ్ సెకండ్ (పై విధంగానే యీ అడుగు, పౌండ్, సెకండ్ ప్రాతిపదికగా వివరించు శాస్త్రము)

(ఆధ్యాత్మజ్ఞాన్~ జనవరి-మార్చి 2023 పత్రిక నుండి గ్రహించడమైనది)

పూజ్యలాలాజీ మరియు మన ఆధ్యాత్మికప్రగతి

  పూజ్యలాలాజీ మరియు మన ఆధ్యాత్మికప్రగతి సోదరీసోదరులమైన మనమంతా యిక్కడ యీదినం (ఫిబ్రరవరి 14/ బుధవారం 2024) మన ఆదిగురువులైన పూజ్యలాలాజీవారి 1...