Showing posts with label అనుభవపూర్వక ఆచరణ – పుస్తకజ్ఞానము. Show all posts
Showing posts with label అనుభవపూర్వక ఆచరణ – పుస్తకజ్ఞానము. Show all posts

Saturday, 2 July 2022

అనుభవపూర్వక ఆచరణ – పుస్తకజ్ఞానము,Knoledge and Practice

 

అనుభవపూర్వక ఆచరణ – పుస్తకజ్ఞానము

మహాత్మ శ్రీరామచంద్రజీ మహరాజ్
 
     జ్ఞానము అహంకారాన్ని సూచించేమాట. కానీ దీన్ని దైర్యాన్ని కూడగట్టుకునేందుకు ఉపయోగపెట్టుకోవాలి. ఆచరణయోగ్యంకాని జ్ఞానం నిరర్థకం.
 
బిసాయారిఎ ఇల్మ్ ఫాయదా నేస్త్
హర్ ఖాసకీ ఏమల్ న యారీ
చున్ వార్ న కాబా బారుయే దుష్మన్
బేకార్ హజార్ తే డాలీ.
 
ఏసందర్భంలోనైనా ఆచరణాత్మకంకాని జ్ఞానం నిరుపయోగం. శత్రువు తారసపడినప్పుడు లేవని వెయ్యిఖడ్గాలు చుట్టూవున్నా నిష్ప్రయోజనమే.
 
నావిషయానికొస్తే సోదరా! నేను ఆచరణాత్మకమైన విధానమునవలంబించినదాదిగా జ్ఞానాన్ని పట్టించుకోవడం మానేసినాను. ఎందుకంటే పుస్తకాలపుటలలోని విషయం (జ్ఞానం) బట్టీపట్టడానికి నాకు తీరుబడి దొరకలేదు. నాపాదాలలో ఒకపాదం బలహీనపడితే, రెండవపాదంశక్తిని బలహీనపడినపాదానికి కొంతబదలాయించి రెండుపాదాలనూ ఉపయోగించి నడకసాగిస్తాను. కేవలం పుస్తకపఠనం ద్వారా జ్ఞానసముపార్జన చేయొచ్చునని, ఆ ప్రయత్నమే చేసుకపోయేవారి పరిస్థితి ఎలావుంటుందంటే, బాగున్న ఒక్కపాదాన్ని మాత్రమే నమ్మి, బహీనమైనపాదాన్ని అస్సలు ఉపయోగించకుండా తనకున్నది ఒక్క పాదమే నన్నరీతిలోవ్యవహరిస్తారు. అందువల్ల తమకైతాను అవిటితనాన్ని ఆపాదించుకుంటారు. అట్టివానిని అందరూ కుంటివాడని ఎగతాళిచేసేవరకు వెళుతుంది. ఒకవేళ వ్యక్తి (అభ్యాసి) సాధనపై ధ్యాసేపెట్టకపోతే కార్యభారం మొత్తం, నాపై మోపబడి నాశక్తితోనే అన్నిపనులు నేనే నడుపవలసివస్తుంది. ఒకవ్యక్తి (అభ్యాసి) తను తనభావనద్వారా ఎవరితోనైతే అనుసంధానమై వుంటాడో, అతనితోపాటే ఆ వ్యక్తి పురోగమన ముంటుంది. అటువంటప్పుడు ఆయిద్దరిమధ్య ప్రేమ వృద్ధిపొందడంకూడా జరుగుతుంది. దీని వాస్తవరూపం భక్తులనుండి తెలుసుకొని, అందలి సారాన్ని గ్రోలవలసి వుంటుంది. గ్రహించవలసిన ప్రశస్తమైన విషయం పసిబిడ్డనుండైనాసరే! గ్రహించితీరవలసిందే. ఉపయోగకరమైన విధానాలు చాలానేఉన్నాయి. వాటిని జనులు మూడు నాలుగుదినములు మాత్రమే ప్రయత్నించి వదిలేస్తున్నారు. వారు ఏదోఒక విధానాన్ని గట్టిగానమ్మి ఫలితాలను గమనించవలసియున్నది. ఒకహంతకుడు తన నేరంకప్పిపుచ్చుకోవడానికి తనప్రయత్నంతాను చేస్తాడు. అంతేగానీ ఇతరులసలహాల నడుగుతూపోడు. అలాచేస్తే అతడు తప్పించుకునే మార్గాలన్నీ బహిర్గతమై తప్పించుకునే వీలేలేకుండాపోతుంది. కనుక నేరం బయటపడకుండావుండే యేర్పాట్లు మంచోచెడో తనే యితరుల ప్రమేయంలేకుండా యేర్పాటు చేసుకుంటాడు.(ఈ ఉదాహరణ విషయ తీవ్రతను తెలుపడానికి మాత్రమే యివ్వబడింది)   
 
తెలిసినవారమనుకొనుచున్న వారి బోధ
జనులు వాస్తవవిషయంపై లోతుగా ఆలోచించవలసిన అవసరమున్నది. జవాబు వారి దరిదాపుల్లోనే వున్నదని వారు గ్రహిస్తారు. అయినా కొందరు ఆవిషయాన్ని ఒప్పుకోవడానికి ఇష్టపడరు. వారిమనస్సు గాయపడుతుంది. ఆ గాయాలకు లేపనంరాయడానికెవరూ రారు. ఇల్మ్ (జ్ఞానం) భగవంతున్ని భక్తునికి పరిచయం చేయాలి. వ్యక్తిని భగవంతునికి దూరంచేసే తెలివివలన ప్రయోజనమేమున్నది? సోదరా! నేనుదాన్ని వక్రీకరించినతెలివి (ఏమల్) అంటాను. వాస్తవానికీపదమే తప్పు. చదువులేనివాళ్ళు, తిమ్మినిబమ్మిచేసే మోసగాళ్ళువాడే పదమిది. ఇటువంటివారు నిజానికి అజ్ఞానులు. వారు అజ్ఞానాన్ని జ్ఞానంగా భావిస్తున్నారు. అందువల్లనే నేనిట్టివారు చేసేపనులన్నింటినీ తప్పుడుపనులంటున్నాను. వీటినివారు యితరులను వంచించడానికి లేక ఆత్మవంచనచేసుకోవడానికి లేక తమనుతాము గొప్పవారుగాచెప్పుకోవడానికి శ్లోకాలు వల్లిస్తుంటారు. నిజానికాశ్లోకాల్లో చెప్పినవాటిని చెప్పేవారుకూడా ఆచరించరు. వారు “ఏలిమ్-ఎబే-అమల్”, కాబిల్ బె - క్వబూల్. (1) గన్దమ్ నుమ జౌ ఫ్రోష్ (2)- వారంతా వక్రమైన జ్ఞానాన్నెఱుగుదురే గానీ నిజమైనజ్ఞానాన్నెఱుగరు. మనిషిని ప్రభావితంచేసి భగవత్సాక్షాత్కారం వైపు మరల్చలేని జ్ఞానమెందుకు? ఉదయాన్నే కోళ్ళుకూస్తాయి. అలాగే నక్కలూకూస్తాయి.
 
నాకు మతసంబంధమైన జ్ఞానమంతగాలేదు. అనుకుంటే ఆ జ్ఞానం పుస్తకాలుచదివి ఒకసంవత్సరంలో గడించవచ్చు. ఆ సమయాన్ని మీ ఆధ్యాత్మికపురోగతికి వినియోగించవచ్చునుగదా! అనినేను ఆలోచిస్తున్నాను. మీ ఆత్మోన్నతి నా కర్తవ్యమేగాక, అది భగవంతునకిష్టమైన పనిగూడా. సోదరా! ఇలా పుస్తకజ్ఞానం లేకపోవడం వలన నన్నునేను తగ్గించుకున్నట్లై, నేనజ్ఞానినని తెలివిగలవారనుకొనుట కాస్కారమేర్పడినది. అనవసరంగా నాకైనేనూ తెలియనివాడననుకొను పరిస్థితేర్పడుచున్నది. వారనుకునే జ్ఞానసముపార్జనవలన ఇతరులు కీర్తించడటమే గాకుండా ఆనందపడతారు కూడా. మరోవిధంగా చెప్పాలంటే, నా తెలివితక్కువకారణంగానే మాగురుదేవులు (లాలాజీ) నాకు తమజ్ఞానాన్ని ప్రసారం చేసినారు. ఆయనపేరున నేనూ దాన్నిఎవరికైనా ప్రసారంచేయగలుగుతున్నాను.                          
 
ఘనమైన వాదన
 
దీనికి సరియైన పారిభాషికపదం లేకపోవచ్చు. నేనీవిధంగా చెప్పియుండకూడదనేదికూడా ఒకపెద్దవాదన. అయితే కొన్నికారణాలవల్ల చెప్పకతప్పడంలేదు. లేకుంటే వేదాధ్యయనం చేయడానికి జనులు నావద్దకొచ్చివుండేవారు. అటువంటప్పుడు నాగురుదేవులకసాధ్యమైనదేదిలేదని తెలిసుండేది.
 
"కీడోనె హజారహా కితాబె ఖాలీన్
 పాయీ న ఫజీలత్ కి సనద్"
 
(చెదపురుగులు వేలపుస్తకాలను తినేశాయి. అయినా గౌరవప్రదమైనవిద్యలలో పట్టాపొందలేకపోయాయి)
 
నిలిచిపోయిన ప్రయాణీకులకు దారిచూపు కాగడాగా పనిచేస్తుందని చాలాదినాలుగా నేను నా వ్రాతలతో విషదపరుస్తూనే వున్నాను. కానీ వాటిఫలితం మాత్రం భగవంతునిచేతిలో వుంది. నేను బ్రహ్మజ్ఞానంపొందాలనే ప్రయత్నం యేనాడుచేయలేదు కానీ జీవితమంతా నాగురుదేవుల ఎఱుకలో వుండటానికే ప్రయత్నించాను. అందుకే సంశయాత్ములకు పెద్దచదువులు చదివినవారికి నచ్చలేదు. కానీ సోదరా! నేనెప్పుడూ, ఒక్కక్షణమైనా సత్యమునుండి విడివడియుండలేదు. అట్లే నారచనలుకూడా ఆవిధంగానేవుంటాయి. కొందరు ప్రళయదినాన్ని తలచుకొని చింతిస్తూవుంటారు. కానీనేను నావద్దనున్నదంతా సంపూర్ణంగా గ్రహించువారికోసం (లేరేయని) చింతిస్తున్నాను. ఈవిషయమంపై శ్రమించుటకు సిద్ధపడినవ్యక్తి తారసపడినట్లైతే నేను నాగురుదేవుల ఋణం కొంతకుకొంతైనా తీర్చుకున్నవాడినౌతాను. నాతర్వాత నాలాంటివాడినొకడిని తయారుచేయగలసత్తా నాకున్నదా? ఎవరైనా ఒకరు ముందుకొచ్చినా, నేనాశించినట్లాతడు తయారుకాగలడా? ఆట్లుచేయగలసత్తా మాగురుదేవుల కొక్కరికే గలదు. ఆయనతోపాటే నేనూ అట్టివ్యక్తి సంప్రాప్తంకావాలని కోరుకుంటూ అతనియెడ చనువుతో వ్యవహరిస్తూ నాహృదయం అతనికొఱకు సంపూర్ణంగా తెరచి వుంచాలనుకుంటున్నాను. భగవంతుడీ కార్యమున నాకు సహకరించి నన్నానందపరచగలడని ఆశిస్తున్నాను.

 

ఆధ్యాత్మిక శాస్త్రము

  గుర్తుంచుకోదగ్గ ఒక ముఖ్యవిషయమేమనగా, ప్రపంచంలో పురోగతిసాధించినవన్నీగూడా నిశితపరిశీలనమువల్లనే సాధ్యపడినవి. అదే పద్దతిలో ఆధ్యత్మికరంగంలోకూడా అభివృద్ధి సాధ్యపడుతుంది. అభ్యాసి తన పరిశీలనాశక్తిని వృద్ధిపరచుకొనేకొద్దీ ప్రకృతికిసంబంధించిన జ్ఞానం వృద్ధిచెందుతూపోతుంది. తద్వారా అవసరమైనవ్యక్తికి శిక్షణనిస్తూ సంతోషిస్తాడు. ఇందుకు తగిన విధానమేమున్నది? అది విద్యావంతులకు తెలుసు. కానీ నెప్పుడైనా ఒకవ్యక్తిని, మీరు పరిశీలనాశక్తిని పెంపొందించుకొని అందువల్లకలిగిన అనుభవమెట్లున్నదని అడిగితే, అతడు నేను ప్రయత్నించితిని గానీ నాకేవిధమైన అనుభవమూ కలగలేదనును. వారికాశించిన అనుభవము కలుగకుండుటకు వారు చేసిన ప్రయత్నమెటువంటిదో నాకర్థముగాకున్నది. మనము మనయింటికి సంబంధించిన విషయముల గురించి ఆలోచించినపుడు, అదిమరీ యెంతచిన్న విషయమైనాసరే, మన ఆలోచనకంది సమాధానం దొరుకుతుంది. ఎందుకంటే  హృదయపూర్వకంగా ఆవిషయాన్ని పట్టించుకొని పనిగట్టుకొని ఆలోచిస్తాము. ఒక పరిష్కారముదొరికి మనసు కుదుటపడేవరకు విడువము. కారణం, ఆవిషయమై హృదయం పరిష్కారంకొఱకు (హృదయశల్యమై) తీవ్రమైన ఆవేదనకు గురౌతుంది. అభ్యాసి తన అంతర్గతస్థితిని దృష్టిలోనుంచుకొని గమనిస్తూపోతే, విద్యావేత్తలకుసైతం అందని విషయాలుకూడా అవగాహనలోనికి రాకుండ వుండవు. తన ప్రతి అంతర్గతస్థితిలోనూ, హృదయపూర్వకంగా ఏకాగ్రతతో గమనిస్తూ, సాధనకూడా కొనసాగిస్తూపోతే, అతని అవగాహనకందని విషయమంటూ వుండకపోవడమేగాక, సత్యతత్త్వాన్నీ తెలుసుకోగలుగుతాడు. అయినా సోదరా! ఇవన్నీ తీవ్రమైన ఆకాంక్షకు అనుగుణంగానే లభిస్తాయి.

 
"ఫాసల్ యె  కుచా--జానాకా న ముఝసే న పూఛో 
 జైసే ముశ్తాక్ హో నజ్దీక్ భీహై దూర్ భీహై"
 
ప్రేయసివుండే వీధి ఎంతదూరమో నన్నడగమెందుకూ, అదియెంతదూరమో? ఎంతదగ్గరో నీ ప్రేమయొక్క తీవ్రత (లోతు) ను బట్టివుంటుంది మరి.
 
1.     నేను సృష్టించిన వాక్యమిది. అదేమంటే, ఒక ప్రత్యక్షసాధనానుభశూన్యుడైన విద్యావేత్తను, తెలివైనవానిని భగవంతుడంగీకరింపడు.
 
2. అనుభవరహితమైన బోధన, గోదుమగింజలను చూపించి బార్లీ (ధాన్యం) వ్యాపారంచేయడం వంటిది,    అది నిరర్థకము.
 
 *
 
     
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
   
 
 
 

 


పూజ్యలాలాజీ మరియు మన ఆధ్యాత్మికప్రగతి

  పూజ్యలాలాజీ మరియు మన ఆధ్యాత్మికప్రగతి సోదరీసోదరులమైన మనమంతా యిక్కడ యీదినం (ఫిబ్రరవరి 14/ బుధవారం 2024) మన ఆదిగురువులైన పూజ్యలాలాజీవారి 1...