Saturday, 18 June 2022

సంభాషణాసూత్రములు,sambhashanasutramulu

 

సంభాషణాసూత్రములు

 
రచన- శ్రీరామచంద్రజీ (లాలాజీ) ఫతేఘర్.  అనువాదం - శ్రీ పి.సుబ్బరాయుడు. కడప

మాట్లాడేతీరు ఉదృతంగానూ లేదా పేలవంగానూ కూడా వుండకూడదు. ఈవిధానాన్నే నేను అనుసరిస్తున్నాను. లోతుగా పరిశీలిస్తే అది సృష్ట్యాదినుండి సరిసమంగా ప్రవహిస్తున్న దివ్యశక్తిప్రవాహంవలె వుండాలి. దాన్నే నేను అనుకరిస్తున్నాను. దీనివల్ల వివరింపనలవికాని ప్రయోజనాలున్నాయి. నిజానికిది ఒక మహోన్నత వ్యక్తి తత్త్వము. వ్యక్తి సత్యతత్త్వముతో అనుసంధింపబడి మరొకరితో సంభాషిస్తున్నప్పుడు ఇద్దరిమధ్య ఒకప్రశాంతస్థితి యేర్పడుతుంది. ఆప్రశాంతతనుండి దానికైఅదే ఒక దివ్యమార్గమేర్పడుతూపోతుంది. తద్వారా అతడుమాట్లాడే ప్రతిమాట ప్రతిభావంతంగా యెదుటివారిహృదయాలలోనికి చొచ్చుకొనిపోతుంది. అంటే సత్యతత్త్వశక్తిప్రవాహంతో ఒకవిధమగు అనుబంధమేర్పరచుకుంటుంది. ఈఅనుబంధమేర్పడడంతో అదిశక్తివంతమై దాన్ని అనుసరించేవారి సంభాషణ సమయానుకూలమైనదిగాను, సక్రమమైనదిగానూ అయివుంటుంది. ఈవిషయం నాజీవితగాథలోనూ చేర్చబడుతుంది.

 

దీన్నిపొందటానికి  అనుసరించే ప్రక్రియలోభాగంగా మన మాటతీరును ప్రయత్నపూర్వకంగా హెచ్చుతగ్గులులేని సౌమ్యరీతిలోవుండేట్లు చూసుకోవాలి. దీన్నే పదునుపెట్టుకోవడం అంటారు. మాటలప్రవాహము ప్రశాంతంగా, సత్యతత్త్వంతో అనుసంధానమై సాగిపోయేక్రమంలో ఉదృతిని శాంతపరచుకుంటూ సౌమ్యతనుక్రమంగా సంతరించుకుంటూ పోవాలి. నాదృక్పదంలో పదునుపెట్టుకోవడమంటే, ఆగ్రహం, కక్షతో సాధించడంకాదు. అలాచేయడం విపరీతమైనజడత్వమే ఔతుంది. జడత్వాన్ని యేవిధంగాను చొరబడనీయరాదనే నేనీ సందర్భంలో చెప్పదలచాను. మాటతీరు యేమాత్రం భారంగావుండరాదనేదే నాఉద్దేశ్యం. మరింత వివరంగాచెప్పాలంటే అది నిశ్చలమారుతం. ఇది సాధించటం కష్టమే, కానీ దృఢనిశ్చయము దైర్యముగలిగి, దానికితోడు ప్రభువుయొక్క అనుగ్రహముంటే దేనినైనా సాధించవచ్చును.

 

విభిన్నసందర్భములలోని కార్యములన్నింటిలోను సమతనొందినమనస్సు మనిషియొక్క సక్రమనడవడిని వ్యక్తపరచును. మరింతవిషదంగా చెప్పాలంటే అది అతని సత్ప్రవర్తనయొక్క ప్రతిస్పందనే. అది లోతైన(అంతర్గతమగు)సానుకూల ప్రభావమును తన సహచరులపై చూపును. వారి సంభాషణ గంభీరము సుదీర్ఘమైనదైనను లేదా సున్నితమైన చిన్నమాటైనను సరే, అది మానసికోద్రేకమునకు, విపరీతమానసికోత్సాహమునకు దారితీయనిదై, కోపతాపములకు, అనుచితప్రవర్తనకు తావియ్యనిదై  సరియైనమార్గంలో ఒకపద్ధతిప్రకారం మనస్సునుండివెలువడే మర్యాదాపూర్వకమైన భావవ్యక్తీకరణయై వుంటుంది. అది సున్నితము, సౌమ్యమునై అవతరించిన దైవానుగ్రహమును తలపించవలెను.   

         

సమతాస్థితి

మూలము లేక సర్వాధారము(సృష్ట్యాది)తో అనుసంధించబడిన స్వచ్ఛహృదయము సహజముగనే సౌమ్యము, ఉదారత ప్రేమలను వెదజల్లుతుంది. అది వెనువెంటనే ఇతరులహృదయాలపై తనదైన ఒకముద్రని వేస్తుంది. క్రమంగా పురోగతికి దారులనేర్పరచి అందరి మనస్సులలోనూ  స్థానమేర్పరచుకొంటుంది. మాటలవల్లకలిగే శబ్దము తీవ్రమైన అరుపులుగాకాకుండా హెచ్చుతగ్గులులేని కంఠస్వరమైయుండేట్లు సరిదిద్దబడాలి. లేనియెడల అది కోపస్వభావముగలదై వుంటుంది. కోపము ఆధ్యాత్మికతకు విషతుల్యము. అసహ్యము, తొందరపాటు, ఓర్పులేనితనమును అధిగమించి, దుష్టమైన క్రోధమును తొలగించికున్నట్లైతే, సమతనొందిన మానసికస్థి నెలకొను అవకాశమేర్పడును. అట్లుకానియ్యని దుర్బలత మనిషి ఆత్మగౌరవము వ్యక్తిత్వమును హరించును. నిరాశ నిస్పృహలకు లోనుగావించును. ఇట్టి పరిస్థితి దైవీయధారనడ్డుకొనును. ఈస్థితిని యెంతగా అదుపుచేసుకుంటే అంత సులభంగా, ధారాళంగా భగవత్కృప  సంప్రాప్తమగును.

 

ఇదిఒక దయనీయమైన పరిస్థితి. అతిముఖ్యము, అత్యవసరము ఒకసూత్రమూనైన కంఠస్వరవినియోగము ప్రతియొక్కరికి అనుసరనీయము మరియు నిరంతరము మదిలోనుండవలసిన విషయము. అయినప్పటికి యిది నిర్లక్ష్యముచేయబడుటేగాక విస్మరింపబడినది. ఈమానవతప్పిదమునకు మహనీయులగు గురువర్యులను బాధ్యులనుచేయుట దురదృష్టకరము. మనస్సును అదుపులోనుంచుకొనుట నిస్సంశయముగా కష్టమైనపనే. ఎవరిస్వరం మర్యాదాప్రదము, సభ్యత సంస్కారయుతమై వుంటుందో, వారిహృదయం విశాలంగానూ, స్వచ్ఛంగానూ, ఉత్తమంగానూవుండి, వారు యితరులమనస్సులను గొప్పగా ప్రభావితంచేయగలరు. ఈవిషయంలో సందిగ్దతకేమాత్రం తావియ్యరాదు.

 

* మానవజీవితలక్ష్యసాధనకు, మర్యాదాప్రదమైన మాటతీరు, తొలుత కలిగియుండవలసియున్నది.

* సంస్కారయుతమైన మాటే, హృదయసామ్రాజ్యము నేలుతుంది.

* చర్చించునపుడుగానీ సంభాషించునపుడుగానీ సౌమ్యతగలమాట, మానవాళిని ప్రభావితంజేయడమేగాక అదే రాజాజ్ఞగా చెల్లుబాటౌతుంది.

 

ఆధ్యాత్మికతకు కోపము విషము. ప్లేగువ్యాధివంటి యీకోపము నధిగమించనియెడల మితస్వభావమలవడదు. దీనివలన మనకుమమే భారమై, తద్వారా అసహనముత్పన్నమై, సరళము సూక్ష్మమునైన దివ్యధారను మనలోనికి ప్రవేసింపనీయదు. స్వచ్ఛమైనఆలోచనలపై నిరంతరం ఒత్తిడి పెరుగుతూ  వుంటుంది.

ప్రకృతి రహస్యము

కోపమునుండి విడుదలపొందుటకు, వ్యక్తి తనకైతాను వినయవిధేయతలుగలవానిగా భావించుకోవలయును. ఏమైనప్పటికిని శరీరభాగములన్నింటిలో యిదేభావన (ఇట్టి వర్ణమే) ప్రవేశించుచున్నట్లు తనకైతాను అదేపనిగా ప్రయత్నించవలయును. ఆధ్యాత్మికతకు సహనము, ప్రశాంతమునైన మనస్సవసరము. హృదయము అత్యంతసున్నితమై ఓచిరుగాలిసోకినా చలించిపోవునట్లుండవలెను.

కొంత ఉన్నతస్థాయికెదిగినవ్యక్తికి, హృదయంలో అంతే వినయభావముత్పన్నమౌతుంది. ఇదే ప్రకృతిరహస్యము. వ్యక్తి తనుతన గురువర్యులతో అనుసంధింపబడినట్లయితే అత్యంతోన్నత స్థితులనందుకుంటాడు. అయినా అతడు అల్పుడననే భావిస్తాడు. ఇలావుండటంకూడా ఒకస్థితేకదా? దీని ప్రభావమును నేను సూచాయనగా తెలియజేసితిని.  కలిగియున్నదంతయు  ఆయనదేనన్న మనోభావన కలిగియుండాలి. అలావుంటే యిక చింతించాల్సిన అవసరమేముంది! ఇప్పుడు కలిగినదానితో సంతృప్తిపొందుతాడు. గతంలోవలె కలిగినసంపదకు తగినట్లు సంతోషింపడు. అంతేగాకుండా అదంతా సామాన్యమే (మామూలే) ననుకుంటాడు. దీన్ని మనం కొంతనిర్వేదంగానూ, తగ్గించబడినస్థితిగానూ భావించాలి. ఇవన్నీ అటుంచితే తగ్గించబడినట్లుండటమే పైకెగసినట్లుండటంకంటే శ్రేయస్కరం. ఇందులో భక్తిభావమిమిడి యున్నది, పరిపక్వతున్నది. ఇంతకుమించి నేనింకేమి చెప్పుదును! ఇదిఒక రహస్యం. దీన్నినేను షాజహానుపూర్లోవుండే, బాబూమదన్‍మోహన్‍లాల్‍కు చెప్పాను. నేను క్రితం వ్రాచిచ్చిన చీటీలో ధైర్యమంటే యేమిటో నిర్వచించాను. వ్యక్తితన ఊనికినికోల్పోయి అహంకారభావన, ప్రత్యక్షంగాకానీ, పరోక్షంగాకానీ యేరూపంలోనున్నప్పటికిని దాన్ని వదిలించుకునట్లయితే, అప్పుడతడేమిచేసినా సరియైనదే చేయదగినదే అయివుంటుంది. ఈస్థితిని భగవంతుడు ప్రసాదిస్తే, ఇంకేముంది, అదే అత్యుత్తమస్థితి. దీనికొఱకై ప్రతియొక్కరు ప్రయత్నించవలసియున్నది.

సున్నితత్వమును వృద్ధిపరచుకొను ఉపాయమే, స్వాభావికంగా వినయగుణము నుత్పాదించుకొను ప్రక్రియయైయున్నది. ఈగుణము, ఎవరిమనస్సునూ నొప్పించవలెనను ఊహనుకూడా రానివ్వక, ప్రేమభావముతో వ్యక్తిని నింపివైచును. అందువలన వారిమాటలు యేమాత్రము యితరుల హృదయములను గాయపరచునవిగా  వుండనేరవు.

(ఇది పూజ్యబాబూజీగారికి వారి గురువర్యులు లాలాజీవారు వ్రాసిన లేఖ)

{ADHYATMA GYAN - first issue-2022} 

****

 

నేను నాగురువర్యులకిచ్చిన మాటను నిలుపుకోవలసి యున్నది. అదేమంటే, మిమ్ములనందరినీ వాస్తవదివ్యస్వచ్ఛతాస్థితికిగొంపోవలయును. ఈస్థితి నిజమునకు మానవులకొఱకే కేటాయించబడినది. నేను యెవరినైననూ ఒకలిప్తకాలములో ఆస్థితికి చేర్చగల్గుదును. అయితే మీరు  నేనునిర్ధారించిన సాధనద్వారా మిమ్ములనుమీరు అర్హులుగా తీర్చిదిద్దుకోవలసి యున్నది.......బాబూజీ.                           

No comments:

Post a Comment

పూజ్యలాలాజీ మరియు మన ఆధ్యాత్మికప్రగతి

  పూజ్యలాలాజీ మరియు మన ఆధ్యాత్మికప్రగతి సోదరీసోదరులమైన మనమంతా యిక్కడ యీదినం (ఫిబ్రరవరి 14/ బుధవారం 2024) మన ఆదిగురువులైన పూజ్యలాలాజీవారి 1...