Showing posts with label Sahaj Marg Prayer. Show all posts
Showing posts with label Sahaj Marg Prayer. Show all posts

Thursday, 19 September 2024

సహజమార్గంలో ప్రార్థన

 

సహజమార్గంలో ప్రార్థన

 రచన:- మురళీధరరావ్, ధార్వాడ్.                             తెలుగుసేత:- పి. సుబ్బరాయుడు. హైదరాబాద్.

 "అత్యంత ముఖ్యమైనది మరియు అపజయమెఱుగని విధానము ప్రార్థన". అని పూజ్యబాబూజీ మహరాజ్, వారి రచనలలో తెలియజేశారు. ప్రేమ భక్తిపూర్వకముగా మనల్ని మనం సమర్పించుకోదలచిన దైవముతో యీప్రార్థన మనలను అనుసంధానిస్తుంది. ప్రార్థనద్వారా మనము ఆయన యెదుట వినయులమై దీనముగా ఆయన యిచ్ఛకు మనల్నిమనం సంపూర్ణముగా సమర్పించుకొందుము. ఇదే సరైన ప్రార్థనా పద్దతి. ఆయన నిజమైన భక్తులమైనందుకు మనం ఆయన యిచ్ఛకుసంపూర్ణము (తిరుగులేని విధం) గా విధేయులమై యుండవలెను.

 ప్రపంచములోని మతములన్నిటిలో ప్రార్థన సామాన్యముగా వుండనే వుంటుంది. అయితే ఆప్రార్థనలు ఒక్కోమతంలో ఒక్కోవిధంగా వుంటాయి . సర్వసామాన్యంగా వారందరి ప్రార్థనలలో ఆరోగ్యంకోసం, ధనంకోసం, సంతోషంగావుండటంకోసం లేకపోతే అగచాట్లనుండి, బాధలనుండి బయటపడాలని యాచిస్తారు. అయితే  సహజమార్గ ప్రార్థన  అందుకు భిన్నంగా వున్నది. ఇందులో కావాలి యని కోరడ మసలే వుండదు. మానవులకు సర్వసామాన్యంగావుండే యిబ్బందులు నివేదించుకోవడం మాత్రమే వుంటుంది.

 ప్రార్థన-

 ఓనాథా! నీవే మానవ జీవనమునకు లక్ష్యము.

మాకోరికలు మా ఆత్మోన్నతికి ప్రతిబంధకములై యున్నవి.

నీవే మా యేకైక స్వామివి, ఇష్ట దైవము.

నీ సహాయము లేనిదే నిన్ను పొందుట అసంభవము.

 ఈవిధమైన సరళ ప్రార్థనలో లోతైన అర్థమున్నది. మొదటి వాక్యముద్వారా మనము ఆయనను హృదయపూర్వకముగా పిలుస్తున్నాము. తద్వార ఆయనను మనవైపునకు ఆకర్షిస్తున్నాము. ఆయనే మనజీవితమునకు లక్ష్యమని అంగీకరించి, మనల్నిమనం ఆయనకు సమర్పించుకుంటున్నాము. మా నిజమైన జీవితలక్ష్యమనడంలో ఒక విశేషమున్నది. మనకు అనేకములైన లక్ష్యములిన్నవి. అవి విద్యకుసంబంధించినవి, వృత్తికిసంబంధించినవి, ఇంకా వ్యక్తిగతమైన వెన్నో ఐహికసంబంధములై జీవనగమనములో మారుతున్న కాలానుగుణములైన కోరిక లెన్నోవున్నవి. కానీ మన ప్రార్థన  వాటిజోలికిపోక, జీవితలక్ష్యము ప్రభువే (గురువే) నని తేటతెల్లము జేయుచున్నది. ఆయనే అన్నింటికి మించినవారు. మనసర్వస్వము. అంతిమసత్యము, భూమా, లేక సర్వంసహా మొత్తమునకు ప్రభువు. మన లక్ష్యము జీవితములోని అన్నివిషయములలోనూ మరియు తదనంతరముగూడా  ఆయనవలె మారిపోవడమే.

సామాన్యంగా ప్రార్థనలన్నీ వ్యక్తిగతంగా వుంటాయి. కానీ సహజమార్గ ప్రార్థన మాత్రము విశ్వజనీనము. మానవ సమాజమున కంతటికీ సారిపోవునదియై యున్నది. కారణం ప్రభువే సృష్టికర్త. మనమీ మానవదేహమున నుండుటకు ఆయనే మూలకారణము. అందుకే మనము ఆయననే మానవజీవితమునకు నిజమైన లక్ష్యమని ప్రకటించుచున్నాము.

 దైవము మరియు మహాశక్తి :- ఏవిధంగా ఆకాశంనుండి రాలిన ప్రతినీటిచుక్క సముద్రముచేరుతుందో, అదేవిధంగా మానవదేహంతో జన్మించిన ప్రతి‍ఆత్మ తనమూలాన్ని చేరుకోవడంకోసం ఆతృతపడుతుంది. ఆమూలమే ప్రభువు (మాస్టర్) అన్న పదంతో గుర్తింపబడుతున్నది.

 రెండూ మూడు వాక్యములలో మనం మనకోరికలకు బానిసలమని అంగీకరించి, ఆయనవైపునకు పురోగమించలేని అశక్తులమని, వాస్తవాన్ని ఒప్పుకుంటున్నాము. అందుకే, తమరే మాదైవము మరియు శక్తిమంతులని తెలిపి, నీవుతప్ప మమ్ము రక్షించువారెవరున్నారు? నీవేకదా! మాకుదిక్కు. అని ఆయనను మనరక్షణకు పూనుకొనునట్లు చేయుచున్నాము. అందుకే  మనందరిని ఆయనతో, ఆయనయందే వుండునట్లు అనుగ్రహిస్తున్నారు.

 పూజ్యగురువర్యులు చెప్పినట్లు మనము మన గతకర్మలకు దాసులము. మనము మనమనుకున్నట్లు స్వేచ్ఛగా ఆలోచించి, తదనుగుణంగా ప్రవర్తిస్తున్నామనుకుంటున్నాముగానీ, వాస్తవమునకు అది నిజంకాదు. అదంతామన భ్రమ. మనం మన గతకర్మల కనుగుణంగానే నడుస్తున్నాము.

 ప్రార్థనద్వార మనం మన గురువర్యుల యెదుట శరణాగతులమౌతున్నాము. ఆయనే మన దైవంగా, అనంతశక్తిగా నమ్మినందువల్ల ఆయన తన దివ్యకరుణ, ప్రేమతో మనల నందరను అనంతతత్త్వపు తుదిస్థితికి చేరుస్తున్నారు. అందువలననే సహజమార్గ ప్రార్థన సరళము ప్రత్యేకమైయుండుటేగాదు, అర్థవంతమైనది కూడా. ప్రార్థనలో మనమేమియు కావలెనని కోరడమములేదు. కానీ ఆయనే నిజమైన జీవితలక్ష్యమని ఆత్మసమర్పణగావించి, కోరికలకు దాసులమని ఒప్పుకొని మన నిస్సహాయతను నిర్ద్వందముగా విన్నవించుకొని, శరణాగతులమై, మనమేప్రయోజనమునకై జన్మించితిమో ఆప్రయోజనమును పొందగోరుచున్నాము. గురువర్యుల యిచ్ఛాశక్తి సత్యము నిత్యమునై యున్నది. ఆయన దయాదాక్షిణ్యములకు పాత్రులమై ఆయన మనలను ఆయనకడకు అనగా మన వాస్తవ జన్మస్థలమగు ఆ దివ్యధామమునకు గొంపొమ్మని వేడుకొను చున్నాము. 

 (ఆధ్యాత్మజ్ఞాన్ జనవరి-మార్చి 2023 నుండి గ్రహించడమైనది)

 


 

పూజ్యలాలాజీ మరియు మన ఆధ్యాత్మికప్రగతి

  పూజ్యలాలాజీ మరియు మన ఆధ్యాత్మికప్రగతి సోదరీసోదరులమైన మనమంతా యిక్కడ యీదినం (ఫిబ్రరవరి 14/ బుధవారం 2024) మన ఆదిగురువులైన పూజ్యలాలాజీవారి 1...