Tuesday, 15 February 2022

మనకర్తవ్యము

మనకర్తవ్యము

                                                                                                         మహాత్మరామచంద్రజీ. 
              రచన - మహాత్మరామచంద్రజీ.                                అనువాదం -  శ్రీ పి.సుబ్బరాయుడు.

మనము గుర్తించవలసిన ముఖ్యవిషయములు రెండున్నవి. మొదటిది మనముజన్మించిన యీప్రపంచము, రెండవది ఎందుండి మనముద్భవించితిమో అది. అనగా భగవంతుడు. మనం సమత్వస్థితిలో ఉండటానికి యీరెండింటి విషయంలో అప్రమత్తులమై వుండితీరాలి. మరోమాటలో చెప్పాలంటే భగవంతుని ఆజ్ఞగా తలచి, ఇహలోకసంబంధమైన కర్తవ్యములను నిర్వహించాలి. ఈవిషయంలో పరిపూర్ణతసాధించినట్లైతే, ఇక ప్రతిఫలాన్ని గురించి చింతింతాల్సిన పనిలేదు. ప్రతిఫలాపేక్ష లేనప్పుడు మనం భగవత్సంబంధమైన కార్యములనే నిర్వహిస్తాము. ఈకార్యములు నిష్కామకర్మ పరిధిలో వుంటాయి. తత్కారణమున సంస్కారములేర్పడుట నిలిచిపోతాయి. అప్పుడు మన ఉద్దేశ్యములన్నీ సక్రమంగానూ పవిత్రమంగానూ వుంటాయి. అందువల్ల మనమెవరికోసమైతే పాటుపడుతుంటామో వాళ్ళకవి   క్షేమకరంగావుంటాయి. పవిత్రోద్దేశ్యంతోచేయు కర్మలు క్షేమాన్నే కలుగజేస్తాయి. అందువల్ల మనం సక్రమపద్దతిలో మెలుగుతాము. కలిగినదానితో సంతృప్తిజెంది కర్తవ్యపరంగా  మనబిడ్డలభవిష్యత్తుకు బాటలువేస్తాము. ఇవి మనదైనందిన జీవితకార్యములే అయినా యిదే మన ఆధ్యాత్మికజీవనంకూడా ఔతుంది. ఈవిధంగా మనం పురోగమించడానికి ఆతృతగలిగిన  వారమైతే, యింతకుమించిన ఉన్నతస్థితులను గురించి ఆలోచిస్తాము. ఇంతకుమించి ముందున్నదానిపై ఆలోచనంటే యేమిటీ? అది మనం తిరిగి చేరుకోవలసిన స్వదేశం (కేంద్రం)  యొక్క చింతనే. మనస్వదేశం (కేంద్రం) చేరడానికై దారిని అన్వేషిస్తాము. ఆచింతనే మనగమ్యమైన స్వగృహానికి తిరిగి చేరాలనేఆతృతను పెంచుతుంది. స్వగృహాన్నీకన్న బిడ్డలను  వదలి చాలాకాలంక్రితం పరదేశానికివెళ్ళినవాని ఆతృతవలె మనస్థితి తయారవుతుంది. ఆస్థితిలో అన్నీవదలుకొని తిరిగివెళ్ళిపోవాలనే తొందర అధికంగా వుంటుంది. ఇదే వైరాగ్యస్థితి.  ఈస్థితిలో తిరిగివెళ్ళలేని పరిస్స్థితులుంటే, ఎక్కడున్నా యేపనిచేస్తున్నా, ధ్యాసంతా స్వగృహంపైనే వుంటుంది. ఇటువంటి ఆవేదనతోనే మనం అన్నిపనులు నెరవేరుస్తున్నప్పటికీ  ధ్యాసమాత్రం భగవంతునిపైనే వుంచుతాం. హృదయం స్వగృహం పైన చేతులు పనిపైన వుండి కార్యక్రమం సాగిపోతూవుంటుంది. ఇట్టిస్థితి కొనసాగాలంటే స్వగృహంచేరలేకపోయినా, అక్కడనుండి విషయాలు కనీసం ఉత్తరాలద్వారానైనా అందుతూవుండాలి.   

 ఈపని రామాయణ భగవద్గీతవంటి గ్రంథముల ఆధ్యయనంవల్ల జరుగుతుంది. అవి మన స్వగృహాన్ని గుర్తుచేస్తూ ఇంటిధ్యాసను ఎప్పటికప్పుడు సజీవంగా వుంచుతాయి. ధ్యాస అటువైపువుంచే పనిమాత్రమే యివి చేయగలవు. కానీ మనం ఆవైపునకు ఒకమార్గదర్శకుని (గురువు) సహాయముతీసుకొని పయనించవలసి యున్నది. ఎందుకంటే ఇంటిదారి మనం మరచిపోయాము. ధ్యాస నిత్యనూతనంగా ఉన్నప్పుడు మనకు మార్గదర్శకుని సహాయం అత్యవసరమౌతుంది.

 భగవద్విశ్వం

రామాయణ భగవద్గీతలు చదవడంద్వారా భగవత్చింతన ఉత్పన్నమౌతుంది. అంతటితో మన అవసరం తీరిపోదు. ఒక మార్గదర్శకుని సహాయంమనకు అత్యవసరమౌతుంది. మార్గదర్శి (గురువు) లభ్యమై ఆయన సరియైనదారిలో మనల్ని నడిపిస్తే యిక రామాయణ భగవద్గీతలతో పనిలేదు. అసందర్భం కాదనుకుంటే నేను శంకరాచార్యులవారి వివేకచూడామణిలోని ఒకశ్లోకార్థాన్ని చెప్పాలనుకుంటున్నాను.అదేమంటే, "గ్రథములు భగవత్సాక్షాత్కారానికి నిరుపయోగములు. సాక్షాత్కారంకలిగిన మీదట యిక గ్రంథముల అవసరం అసలేవుండదు”. మనం రాముని అన్వేషిస్తూవుంటే కృష్ణపరమాత్మ తారసపడ్డారనుకుందాం, అప్పుడాయన్ని మనం రామునిచిరునామా అడుగుతాం. చంద్రుడు క్షీణదసలోనున్న కృష్ణపక్షం జరుగు చున్నప్పుడు వృద్ధిపొందుచున్న చంద్రుడుగల శుక్లపక్షానికై ఆశపడతాం. రాముణ్ని వెతికేనిమిత్తం కృష్ణపరమాత్మకు మనసంస్థలో స్థానం కల్పించాం. ఇప్పుడు మనమొక అవగాహనకువచ్చి ఆయిరువురు మనకందనంత చాలాగొప్పస్థాయిలో వున్నట్లు నిర్ధారిస్తాము.

 ప్రాపంచిక కార్యకలాపములు ముగించుకొని వచ్చినతరువాతకూడా వాటిధ్యాస విడువక సతమత మౌతున్నాము. ఈదురవస్థను తొలగించుకొనుటెట్లని ప్రశ్నించుచునన్నారు.  దీనికి మహనీయులు సమాధనములిచ్చారు. నాతృప్తికోసం నాశక్తిమేరకు నేనిలా వివరిస్తున్నాను. మనం చిక్కుల్లోవున్నప్పుడు కాంతిహీనమైన స్థితిలో వున్నట్లుంటుంది. నిజానికి వెలుగు చీకట్లు రెండూ ఒకదానికి సంబంధించినవే. చీకటిలో వున్నప్పుడు కష్టాలంటున్నాము గానీ అవీ మనవే. అయినా  మనవికావనుకొంటున్నాము. ఒకవైద్యుడు విషాలనూ, అమృతాలనూ తనవైద్యశాలలోనే వుంచుకొని రెండింటినీ సమానజాగ్రత్తలతో భద్రపరుస్తాడు. అతడొకవైపుచూస్తే విషాలు, మరోవైపుచూస్తే అమృతాలు కనబడతాయి. అతని దృక్పదం మాత్రం రెండింటివిషయంలోనూ ఒకటిగానే వుంటుంది. భిన్నదృక్పదాలుండవు.

 ఇదొక చిత్రమైనవిషయం. భూమి తనయిరుసు ఆధారంగా తిరుగుతూ వుంటుంది. అలా తిరగనట్లైతే, ప్రపంచజనాభాలో సగం నశిస్తుంది. భూమి తిరగనికారణంగా సగభూభాగంలో పగలు, మిగిలిన సగభాగంలో రాత్రి అట్లేవుండిపోవలసి వస్తుంది. కనుకనే అదిఒక ప్రకృతినియంగా భూమి తిరుగుతూవుంటుంది. అందువల్ల ప్రపంచజీవరాసులు మనగలుగుతున్నాయి. మతపరిధిలో ఆలోచిస్తే భగవంతుడు చీకటివెలుగులు రెండూ అత్యవసరములు గనుకనే నియమించాడంటారు. అందువల్ల మనంగూడా అదేదృక్పథంతో రెండింటిని సమంగాచూడాలి. రెండింటిమధ్యగల తేడా మరియు వ్యత్యాసం మనమనస్సుతో చక్కగాగ్రహించి, అందులోని మంచిచెడ్డలు విశ్లేషించి గుర్తించాలి. నేను ముందేచెప్పినట్లు ఇది ప్రకృతిలో అత్యవసరమై యేర్పడ్డ నియమము. ఈవిషయం మనకర్థమైతే కలిగినమనోవేదనలు అంతకష్టమనిపించవు. వేదనలెంతగా మనకయిష్టమైతే అంతగా వాటికవతలివైపునకు మనస్సు మరలుతుంది. అవతలివైపంటే బహుశా దివ్యము మరియు కాంతికావచ్చును.

 బ్రహ్మగతి

అట్టి దివ్యమూ తేజోమయమైన వైపేది. అక్కడికెవరు చేరుస్తారు. వెలుగున్నదంటే అక్కడ చీకటుండదు. దీన్నే ఋషులు బ్రహ్మగతి అన్నారు. చీకటిచిక్కులు తొలగటానికి దీన్నివారు సూచించారు. దురవస్థకులోనైనవాడు వెలుగువైపునకు తిరగలేని అశక్తుడైవుంటాడు. అతన్ని యేదోవిధంగా వేరొకరు ఆవెలుగువైపునకు మరల్చాలి. నిజానికి అది అవేరొకరి బాధ్యతైవుంటుంది. ఈబాధ్యత మనం (గురువులు) స్వీకరించాలి. అప్పుడే దురవస్థకులోనైనవాడు బయటపడగలుగుతాడు. దీనివిషయమై భక్తిసంబంధమైన సూచనలేమైనా యివ్వాలనుకుంటే నేను అసలువిషయాన్ని ప్రక్కకుపెట్టినట్లౌతుందేమో మరి. అందువల్ల అది అసలు విషయానికి సాగదీతకావచ్చు. కానిమ్ము. ఒక ఉపాఖ్యానం మీముందుంచాలనుకొంటున్నాను.

 ఒకసారి నారదమహర్షి వైకుంఠంవెళుతూ దారిలో ఒక అవిటివాడైన (వికలాంగుడైన) ఋషినిచూశాడు. అఋషి నారదుడు హరివద్దకు వెళుతున్నాడని తెలిసి, నారదా! శ్రీమహావిష్ణువునకు నేనింకా జ్ఞాపకంవున్నానా? అడిగి తెలుసుకోమన్నాడు. విషయం నారదుడు స్రీహరికి తెలియజేశాడు. అదివిని శ్రీహరి ఆఋషి వ్యర్థుడు అన్నాడు. నారదుడు అసలువిషయమేమిటని విచారిస్తే ఆఋషి లోకంలోని కష్టాలన్నీ తనకే కేటాయించమని కోరుకుంటున్నాడని శ్రీహరి తెలియజేశాడు. (అన్నీకాదు తనవిమాత్రం కాదనక అనుభవిచడానికి సిద్ధపడాలని అర్థంచేసుకోవాలి) ఇటువంటి సందర్భాలు మనమతగ్రంథాలలో అనేకం కనబడతాయి. ఆనాటి ఋషులు కష్టాలకు చాలాప్రాధాన్యమిచ్చారు.

 వేదనలుతొలగి స్మరణకేస్మరణ కలిగివుండాలంటే ఒకేఒకమార్గమున్నది. దానిద్వారా మనస్థాయిని పెంచుకొనవచ్చును. దానిపేరే అభ్యాసము. మరోమాటలో చెప్పాలంటే ఈర్ష, ఆగ్రహం వంటి దుర్గుణాలనుండి తప్పించుకొని సమత్వస్థితిని సాధించటానికి ఆటంకంగావున్న అన్నిసమస్యలకు పరిష్కరం సాధనచేయడమే. అటువంటి సాధన సహజమార్గవిధనంలో నియమించబడియున్నది. అందుకోసం సరియైన మార్గదర్శకత్వం, అభ్యాసి కర్తవ్యంగా భావించవలసిన భక్తిప్రపత్తులు అతిముఖ్యమైనవి. అభ్యాసి పురోగతి సాధించాలంటే తొలగించుకొనవలసిన అడ్డంకులను తొలగించుకోవడం తన కర్తవ్యంగా భావించి, తన (ఆత్మ) లోతాను లీనమై, సరియైన పద్దతిలో భగవదిచ్ఛకులోబడి విధేయుడైయుండుటే యేకైకమార్గము.              

                                                                      (ఆధ్యాత్మ జ్ఞాన్ - జూలై-సెప్టంబర్ -2021)


No comments:

Post a Comment

పూజ్యలాలాజీ మరియు మన ఆధ్యాత్మికప్రగతి

  పూజ్యలాలాజీ మరియు మన ఆధ్యాత్మికప్రగతి సోదరీసోదరులమైన మనమంతా యిక్కడ యీదినం (ఫిబ్రరవరి 14/ బుధవారం 2024) మన ఆదిగురువులైన పూజ్యలాలాజీవారి 1...