శ్రీ రాంచంద్ర ఉవాచ
ఇందులోని అంశములు
1.
శ్రీ రాంచంద్ర ఉవాచ-1వ భాగము
2.
శ్రీ రాంచంద్ర ఉవాచ-2వ భాగము
3.
దివ్యజ్ఞాన ప్రసారము
4.
విమల ముత్యములు
శ్రీ రాంచంద్రజీ మహరాజ్
వారి రచనల నుండి గ్రహింపబడినది
తెలుగు సేత
పి.సుబ్బరాయుడు,
ప్రశిక్షకులు, కడప.
శ్రీ రాంచంద్రజీ మహరాజ్ సేవా ట్రస్ట్ (రి)
3/1289-1; కో-ఆపరేటివ్ కాలనీ
కడప-516001.
మనవి
శ్రీ
బాబూజీ మహరాజ్ గారు అనేకసందర్భములలో వివరించిన, మాట్లాడిన
విషయములు మరియు ఉత్తరముల రూపమున, వ్యాసముల రూపమున వ్రాసి
వెలువరించిన ఆధ్యాత్మికవివరణలను కొందరు అభ్యాసులు వారికి తోచిన పద్ధతిలో కూర్చి
మనకు అప్పుడప్పుడు చిన్నచిన్నపుస్తకముల రూపమున అందించిరి. చాలాకాలము గడిచినందున ఆ పుస్తకములిప్పుడు
అందరికి లభ్యమగుటలేదు. కనుక వాటిలో ఓ
నాలుగింటిని కలిపి ఒక పుస్తకముగా తీర్చిదిద్ది, తెలుగు
తెలిసిన అభ్యాసుల సౌకర్యార్థం తెనుగునకు అనువదించి అందిస్తున్నాము. అనువాద విషయమున యేదైనా సందిగ్ధత వుంటే
ఆంగ్లప్రతితో సరిచూచుకొన- వలసిందిగా మనవి.
అందుకొఱకు ఆంగ్లప్రతిని గూడా అందుబాటులోనికి తేవడం జరిగింది.
ఈ
కూర్పు మరియు భాషాంతరీకరణ విషయంలో నాకు చేదోడుగా వుండుటేగాక ముద్రణ మొత్తము తనే
జాగ్రత్తగా స్వహస్తములతో చేసి సహకరించిన అభ్యాసి సోదరుడు శ్రీ భవనాశి రమేష్‌బాబు
గారికి నా కృతజ్ఞతలు.
ఈ
కార్యనిర్వహణకు మమ్ము యెంతగానో ప్రోత్సహించి, సలహాలనిచ్చి
పుస్తకము రూపుదిద్దుకొనుటలో ప్రధానపాత్ర
వహించిన శ్రీ టి.వి.శ్రీనివాస రావు, ఛేర్‌మన్,
శ్రీ రాంచంద్రజీ మహరాజ్ సేవా ట్రస్ట్, కడప వారికి మా నమోవాకములు.
కడప పి.సుబ్బరాయుడు,
30-4-2014. ప్రశిక్షకులు, కడప.
విషయ సూచిక
1. శ్రీ రాంచంద్ర ఉవాచ-1వ భాగము
2. శ్రీ రాంచంద్ర ఉవాచ-2వ భాగము
3. దివ్యజ్ఞాన ప్రసారము
4. విమల ముత్యములు
శ్రీ రామచంద్ర ఉవాచ
శ్రీ
రామచంద్ర ఉవాచ
శ్రీ రామచంద్రజీ వారి
సంక్షిప్త జీవిత చరిత్ర.
మహాత్ములు
శ్రీ రామచంద్రజీ మహరాజ్ వారు 30 ఏప్రిల్, 1899 న గౌరవప్రదమైన
కాయస్థ కుటుంబమున ఉత్తరప్రదేశ్‌లోని షాజహాన్‌పూర్ నందు జన్మించిరి. వారి తండ్రి రాయ్‌బహద్దూర్ శ్రీ బద్రీప్రసాద్
గారు. వారు న్యాయవాదిగాను మొదటితరగతి గౌరవ
మేజిస్ట్రేట్‌గాను షాజహాన్‌పూర్ లో పనిచేసిరి.
ఆయన గొప్ప విద్యావంతుడు.
బాల్యము
నుండి కూడా శ్రీరామచంద్రజీ ప్రాపంచిక విషయములపైన మరియు తన ఆహారవిషయమున కూడా శ్రద్ధ
చూపెడి వారు కాదు. చదువుపై శ్రద్ధకూడా
అంతంత మాత్రముగనే యుండెను. చదువులో
వెనకబడియుండుటేగాక దానిని గూర్చి అంతగా పట్టించుకొనెడి వారుకూడా కాదు. కానీ ఆయన తన పదహారవయేట తత్త్వశాస్త్రము,
భాషాశాస్త్రము మరియు భూగోళశాస్త్రములపై మక్కువ పెంచుకొనెను. ఆయనకు క్రీడలంటే అందునా హాకీ, ఫుట్‌బాల్ మరియు గుర్రపుస్వారీ అంటే చాలా యిష్టము గానీ వాటిని కూడా ఆయన
యిరువది సంవత్సరములలోపే వదలివేసెను. ఈ
సమయమునందంతటను ఆయనకు భగవత్- సాక్షాత్కారము వైపు ఆలోచన గలిగియుండి సత్యతత్త్వమునెడ
ఆతృత వృద్ధి చేసుకొనుచుండెను.
అది ఒక
శుభదినము. ఆయన శ్రీరామచంద్రజీ, ఫతేఘడ్ (ఉ.ప్ర) వారి పాదపద్మముల చెంతచేరెను. ఆ మహనీయుడు భారతీయ సాధుపుంగవులలో పేరుగాంచిన
వాడు. అవతార పురుషుడని పిలువబడుచుండెడి
వాడు. వేల సంవత్సరముల క్రితం యోగులచేత
ప్రయోగింపబడి నేడు పూర్తిగా విస్మరించబడిన ప్రాణాహుతి ప్రసారమను పురాతన విధానమును
తిరిగి ఉపయోగములోనికి తెచ్చిన మహనీయుడాయన.అటువంటి వీరిమార్గదర్శకత్వమున రామచంద్రజీ, 3 జూన్, 1922
లో ఆధ్యాత్మిక శిక్షణాభ్యాసమును ప్రారంభించెను.
అప్పటికి ఏడు సంవత్సరముల ముందునుండి కొనసాగించుచున్న ప్రాణాయామమును
వదలివైచెను.
తను
మెట్రుకులేషన్ విద్య పూర్తియైన తర్వాత న్యాయస్థానమున ఉద్యోగిగాచేరి 30 సంవత్సరములు
పనిచేసి 1956లో ఉద్యోగ విరమణ గావించెను.
తన జీవిత కాలములో యెప్పుడుకూడా పైవుద్యోగములకు వెళ్ళవలెననిగాని, తన ఉన్నతాధికారుల ప్రాపకము సంపాదించవలెననిగాని ప్రాకులాడలేదు. తన్నుతాను సమాయత్తపరచుకొనుచు తన కొఱకు
వేచియున్న కొన్ని దైవీయ కార్యముల నిర్వర్తించుచుండెను.
ఆయన
ఆధ్యాత్మికానుభవములు సామాన్య మానవుని అవగాహనకందనివై యుండెను. ఆయన అనుభవములు సరళము, సంపూర్ణమునై
వేదద్రష్టల స్థాయికి చెంది బహుశః గొప్ప ఆధ్యాత్మికస్థితికి చెందినవై యుండెను. భగవంతుడు విశాలమైన పగటివెలుగు వలె అన్నింటియందు
నిండినిబిడీకృతుడైయున్నాడన్న భావన ఆయనకు 1924 వ సంవత్సరములో కలిగినది.
1931 వ
సంవత్సరం ఆగష్టు 14న వారి గురుదేవులు మహాసమాదిని చేరిరి. ఆగష్టు 15న వీరి గురువర్యులు తన శక్తినంతయు
వీరికి ధారపోసినట్లు భావన గల్గెను. అది
సంపూర్ణముగా వీరి గురువులు వీరిలో కలిసిపోయి వీరిలో లీనమైనస్థితి. 1932 అక్టోబరు 12న వీరి గురువువద్ద నుండి
మరిన్ని ప్రాణాహుతి ప్రసారములు పొంది, వాటిని పూర్తిగా భరింపరాని
స్థితికి చేరి దైవీయశక్తితో సంపూర్ణముగా ఆయన నిండిపోయెను. 1944లో వారి గురువుల దీవెనవల్ల తొల్లి మోసెస్
దర్శించిన వెలుగును తానూ దర్శించెను. వారి
గురువుగారి ఆధ్యాత్మిక ఆదర్శములను మున్ముందుకు కొనిపోవుటకుగాను 1945లో
శ్రీరామచంద్రమిషన్‌ను స్థాపించెను.
అప్పుడాయన,
జీవితములోని సమస్త సమస్యలను సమూలముగా సులువుగా నిరాడంబరమైన
విధానములో పరిష్కరించుకొను ఆతృతగలవారికి శిక్షణనొసగు కార్యక్రమమును
చేపట్టెను. ఈ కార్యమునాయన ప్రాణాహుతి
ప్రసార విధానము ద్వారా యెటువంటి ఆర్భాటము, పైపై ఆకర్షణ
ప్రదర్శనల జోలికిపోకుండా నిర్వర్తించెను.
సాక్షాత్కార విషయమున సన్యాసము, గృహస్థజీవనమున కంటే
యేమాత్రము మేలైనది కాదని నమ్మి, గృహమున తల్లిదండ్రులవల్ల,
బిడ్డలవల్ల, భార్య మరియు మిత్రులవల్ల కలుగు
యిబ్బందులే తపస్సుకు యెంతోమేలైన వాతావరణము నేర్పరచునని, అది
సన్యసించి అరణ్యములకు వెళ్ళుటకంటే మరింత మేలైనదని వారు భావించిరి. ఆధ్యాత్మికత యనునది ఒక ఫలము. అది అందరూ అందుకొనదగు, ఇంకా
చెప్పవలెనన్న అందరూ అందుకొనవలసిన ఫలము.
అది కేవలము విశేషమైన హక్కుగలదనికొనెడు యేకొద్ది మంది కొఱకు మాత్రమే
కాదు. భగవంతుడు సరళుడు, కనుక భగవంతుని సరళమైన మార్గములో చేరుటే సులభము.
శ్రీరామచంద్రజీ
వారిని గొప్ప ఆధ్యాత్మికనేతగా, నేటి మానవునిలో ఆధ్యాత్మిక
చైతన్యమును మార్పును తీసుకొని రాగల దివ్యబోధకునిగా లోకము అంగీకరించి మేలు
పొందుచున్నది.
శ్రీరామచంద్రజీ
వారు 1983 ఏప్రిల్ 4న పరమపదించిరి.
అయినప్పటికి వారి ఉనికి నిత్యమై, సత్యమై ప్రాణాహుతి
ప్రసారము వారి దివ్యాత్మ నుండి నిజమైన అభ్యాసుల హృదయములలోనికి ప్రసరించి వారి
ఆధ్యాత్మికోన్నతికి తోడ్పడి గమ్యము చేర్చుచున్నది. వారు ప్రారంభించిన ఈప్రక్రియ కొనసాగినది. కొనసాగుచున్నది. ఇంకనూ కొనసాగుచునే యుండును. ఇది నిజమైన వారి శిష్యుల ప్రత్యక్షానుభవము.
1. భగవంతుడు
1. భగవంతుడు సాకారుడూ కాదు, నిరాకారుడూ కాదు. రెండింటికి
అతీతుడు.
2. భగవంతుడు సరళుడు, అత్యంత సూక్ష్ముడు. ఇట్టి
సూక్ష్మాతి సూక్ష్ముడగు భగవంతుని సాక్షాత్కరింప జేసుకొనవలెనన్న అంతే సున్నితము
మరియు సూక్ష్మమైనట్టి విధానముల ననుసరించవలెను.
3. భగవంతుడు సర్వజ్ఞుడు. అట్టి సర్వజ్ఞునిలో లీనమైన వాడు కూడా
సర్వజ్ఞుడై (మానవ హద్దులకు లోబడి) యుండవలెను.
గురువర్యులచే ఆ హద్దులు తొలగింపబడినప్పటికిని మానవత్వపు వాసనలు కొనసాగుచునే
యుండును. అవి కడవరకు కొనసాగును. అట్లు కాక మానవత్వపు ఛాయలు కరిగిపోతే మనిషి
తక్షణమే శరీరాన్ని వదిలేస్తాడు. కనుక ఆ
స్థితిలో అతడు పైకి, క్రిందికి కూడా చూపు సారించి పరిస్థితుల కనుగుణంగా
వ్యవహరిస్తూ వుంటాడు.
4. భగవంతుడు సూక్ష్మాతి సూక్ష్ముడు. ఆయన్ను చేరుకొనవలెనన్న మనిషి అంతే
సూక్ష్మస్థితికి యెదగవలసి యుండును. మనిషి
యెప్పటికిని భగవంతుడు కాలేడు. ఎందుకంటే ఈ
విశ్వానికి యిద్దరు పాలకులుండుటకు వీలులేదు.
సహజమార్గంలో మనం దేన్నీ ఆశించడం లేదు.
కేవలం మనం భగవంతునితో సంబంధ- మేర్పరచుకొంటాము. ఇక వైరాగ్యము మరియు తదితరములన్నీ వాటికై అవే
మనకు సంప్రాప్తమౌతాయి.
5. భగవంతుడొక్కడంటే ఒక్కడే. ఆ ఒక్కడైన భగవంతుని సాక్షాత్కారం కోసం ఒక్క
విధానాన్నే చేపట్టాలి. త్రిమూర్థ్యార్థక
భావం మరిన్ని మరుజన్మలకు దారితీస్తుంది.
సందేహంలేదు. గడచిన కాలంలో మీరు
శ్రీరాముని, లక్ష్మణుని లేక హనుమంతుని స్మరణలో నుంటిరి. కారణం మీ దృక్పదంలో సరైన మార్గంలేదు. కనుక వారే మీకు సహాయపడి సరైన మార్గములోనికి
తెచ్చిరని తలంచి వారికి ధన్యవాదములు తెలుపుడు.
ఇప్పుడు మీ మార్గము సాక్షాత్కారమునకు నేరుగా కొంపోగలదు. వారు వారిపనిని ఇప్పటికే నిర్వర్తించిరి. ఇక సత్యమునెరిగి దాని ననుసరించుట మీ కర్తవ్యము.
6. నేనూ అవతారముల సిద్ధాంతమును
నమ్ముదును. అట్టి అవతార పురుషులలో
శ్రీరాములొకరు. ఆయన హయాములో ఆయన ఎంతో సహాయకారియై
యుండెననుట నిర్వివాదాంశము. కానీ
శ్రీకృష్ణపరమాత్మ అవతరించడంతో శ్రీరాముని ప్రభావమంతరించినది. ఇప్పుడు శ్రీకృష్ణుని అధికారమే చెల్లుబాటులో
నున్నది. ఎందుకంటే శ్రీకృష్ణుని తర్వాత
ఇంకో అవతారమింకనూ రాలేదు. కనుక యిప్పుడు
మనం శ్రీకృష్ణునితోనే అనుసంధింపబడి యున్నాము.
ఇది ప్రకృతి నైజ్అం. మీకర్థం
కావడానికే ఈ విషయములను వెలుగులోనికి తెచ్చితిని.
7. స్వతఃసిద్ధముగా తనకైతానే పనిచేయుటన్నది
భగవదీయ లక్షణము. ఈ వాస్తవమునకు సంబంధించిన
జ్ఞానమును సాధకుడెప్పుడు పూర్తిగా కోల్పోతాడో అప్పుడతడు సత్యస్థితిలో వుంటాడు.
8. సత్యతత్త్వంలో లీనమవ్వడమంటే వ్యక్తి తనలో
ఏవిధమైన భావన కలిగి యుండరాదు. అతడు తన
దేహము, మనస్సు మరియు ఆత్మ మొదలైన వాటికి సంబంధించిన
భావనలన్నీ కోల్పోయి వుంటాడు. అదీ అసలైన
భగవత్‌స్థితి.
9. దైవత్వము నాజూకైనది మరియు అతి
పలుచనైనది. అట్టిదానిని మాటలతో అందుకొనుట సులభమైన
విషయం కాదు.
10.భగవంతుని ప్రేమించటానికనేక
పద్ధతులున్నాయి. మనమనుసరించాటానికి అనేక
భావాలున్నాయి . ఉదాహరణకు పితృభావము, సఖ్యభావము
మొదలైనవి. నాదృక్పదంలో ప్రేమికుల బాంధవ్యమునకు
మించినదింకొకటి లేదు. మనల్ని మనం
ప్రేమికులంగా, దైవాన్ని ప్రేయసిగా తలచి అదే భావనతో కొనసాగితే,
తత్ఫలితంగా కాలక్రమంలో దైవం ప్రియుడుగాను మనం ప్రేయసులంగా
మారిపోతాము.
2. దేవతలు
11. యంత్రములోని వివిధ భాగములవలె, దేవతలు ప్రకృతిలో నియమింపబడి ప్రకృతి యిచ్ఛానుగుణంగా కర్తవ్యనిర్వహణ
మొనర్చు చున్నారు.
12. మనం మరణించి దేవతలమౌతున్నాము. కానీ దేవతలు మరణించి మానవరూపం ధరిస్తున్నారు. దీనర్థం దేవతలు కూడా జనన మరణ చక్రమున కావలికి
దాటుకొని వెళ్ళలేదు. దీన్నిబట్టి చూస్తే
మనం దేవతలను పూజించడంవల్ల ఆ దేవతలు మనల్ని మరుజన్మలనుండి తప్పింపలేరు. వాస్తవానికి దేవతలు మన సేవలో నియుక్తమైయున్నారు
కానీ మనమున్నది వారి సేవకోసం కాదు.
3. గురువు
13. అదృష్టవశాత్తు నీకొకరు లభ్యమై, అతని సన్నిహితత్వమున నీలో ఒక విధమైన శాంతి, ప్రశాంత
భావము నెలకొని, నీ మానసిక ఆందోళననాయన తన ప్రభావమున
శాంతింపజేసినట్లు గమనించితివేని ఆయనను నీవు ఇంద్రియ ప్రభావములకతీతునిగా యెదిగిన
మహనీయునిగా గుర్తెరిగి, నీజీవితములోని ఒత్తిడిని
అధిగమింపజేసి పరిష్కారమును తన ఆంతరంగిక శక్తులతో జూపి నీకు సహాయపడగల సమర్థుడని
తెలుసుకొనవలెను. అతనితో నిన్ను నీవు భక్తి
ప్రేమలతో అనుసంధించుకొన్నట్లయిన నీవును తదనుగుణముగా పరివర్తన జెందుదువు.
14. గురువు పరిపూర్ణుడైతే ఆయన తన శిష్యులలో
పరిమళము నాఘ్రాణించు యిచ్ఛ జనింపజేసి వారిని పూదోట వైపునకు మరల్చును. సరైన శిక్షణ యనగా అదీ. అదియే సర్వస్వమై భాసిల్లు మహోన్నతదివ్యశక్తిని
తన శిష్యులలో నుప్పొంగజేయు సామర్థ్యము లేనంతకాలము, యెవ్వడు కూడా ఆధ్యాత్మిక శిక్షణనిచ్చుటకు తగడు.
15. సమర్థుడైన మార్గదర్శకు నెన్నుకొనుట
నిస్సందేహముగా ఒక కష్టకార్యమే. ఈ విషయమై
ఒక చిన్న పొరబాటు ద్రొల్లినా పెద్ద ప్రమాదమే.
నా జీవితానుభవమున తెలుసుకొన్న ఒక సులభమార్గమును మీకు తెలియజేస్తాను. మీ రెప్పుడైన ఒక మహాత్ముని సన్నిధి జేరినపుడు, అతని సాన్నిహిత్యం మీలో ప్రశాంతతా భావము కలిగించి, కనీసము
తాత్కాలికముగానైనా మానసిక వృత్తులు స్తబ్దత నొందినట్లనుభూతి చెందితిరా లేదా యని
మీరే నిర్ణయింపుడు. అట్లు ప్రశాంతత
ననుభవించినట్లయిన ఆ మహాత్ముడు మీ జీవిత సమస్యాపరిష్కారమునకు నిజముగా సహాయపడగలడు.
16. విద్యావంతులైన మతప్రబోధకులు దేవతల నారాధించమని
ప్రోత్సహింతురని నీవు చెప్పితివి. నేను
యిప్పటికే ఈప్రశ్నకు జవాబు చెప్పితిని.
అనుభవజ్ఞులైన వారెవ్వరునూ ఈ విధంగా యితరులకు చెప్పరు. విద్యవంతులైనవారు కేవలం పుస్తకము చదివియుందురు; కానీ అనుభవజ్ఞుడు ఆ పుస్తకముల సారమును రుచిచూచియుండును. కనుక వీరిద్దరికి చాల తేడా వుంటుంది. దారిలో విజయవంతముగా స్వతహాగా నడచి అనుభవము
గడించిన వారే మనకు సురక్షితముగా మార్గదర్శకత్వము వహించగలరు. ఈ విద్యావంతులైన మత బోధకులు బాటప్రక్కనున్న
మార్గసూచికల వంటివారు. ఆ సూచికలు
యేప్రదేశమున కెట్లుపోవలెనో తెలియజేసే పని మాత్రమే జేయగలవు. ఆ బోధకులు అంత మాత్రమే మనకు ఉపయోగపడుదురు.
17. బాధాతప్తమైన భక్తుని హృదయరోదన
ప్రభువునాతని వాకిటివద్దకు తీసుకవస్తుంది.
తను అర్హుడగుటకు తన గమ్యమును, తన ప్రస్తుత
స్థితిని ప్రస్ఫుటముగా దృష్టిలో నుంచుకొనవలెను.
18. అనుభవపూర్వకమైన జీవితమే విలువైనది. చదివి వ్రాసి తెలుసుకొనుట యనునది
నిష్ప్రయోజనము. ప్రేమ, భక్తిశ్రద్ధలు మరియు ఆత్మవిశ్వాసము విజయము చేకూర్చును. బంధన రహితుడైన వాని సాంగత్యము మిక్కిలి
శ్రేయస్కరము. నీవొక స్తంభమునకు, నీశిష్యుడొక స్తంభమునకు కట్టివేయబడి యుండిన నీవెట్లు శిష్యుని
బంధవిముక్తుని చేయగలవు. నీవు నిజముగా
భగవంతుని కొఱకు తపన గలిగి వున్నవాడవై, ఈ శాస్త్రమునందు
నిష్ణాతుడైన వాని కొఱకే యెప్పుడూ వెదకుము.
తెలిసీ తెలియని నూతన బోధకులు ప్రమాదకారులు.
19. సులభమైన దానిని పొందుటకు సులభవిధానమునే
అనుసరింపుము. మూఢ విశ్వాసము నీకు మేలు
చేయదు. అనుభవమున తెలిసికొనవలసిన విషయమును
అనుభవజ్ఞుడై, దారి మొత్తము క్షుణ్ణముగా తెలిసి, అసలు మూలము నెరిగిన వాని మార్గదర్శకత్వముననే తెలిసికొనవీలగును.
4. ఆధ్యాత్మికత
20. వస్తుప్రపంచము మరియు ఆధ్యాత్మికప్రపంచమూ
రెండూ సమాన తేజస్వంతములై ప్రక్కప్రక్కనే నడవవలెను. విజయము సాధించవలెనన్న మనము రెండు రెక్కలతో
ఎగరవలెను. భగవంతుని కొఱకు అరణ్యముల మధ్య
వెతకవలెనని జనసామాన్యము చెప్పుట అసంబద్ధము.
భగవంతుని హృదయ మధ్యమున వెదకవలెనని నా సూచన. ధైర్యసాహసవంతుడగు వీరునివంటి వారు నాకు
అవసరమైయున్నారు. వారు విజయులై బహుమతితో
వస్తారా లేదా అన్న సంశయాంశమును ప్రక్కకుబెట్టిన గొప్ప ఆత్మస్థైర్యము వారికవసరమై
యున్నది. ఇది గలవారే ఈ శాస్త్రమునెఱుగుటలో
ఉత్తీర్ణులగుదురు. ఇది మానవజీవితములో
అత్యంత ముఖ్యాంశము.
21. ఆధ్యాత్మికమున నిజమైన అర్హులకే వారి
వాటావారికందుతుంది. కనుకనే నేను మరీమరీ
వ్రాసి అందరిని అందులకర్హులుకండని ఉత్సాహపరచుచుంటిని. అయితే అందులకు
రెండంశములవసరమై యున్నవి. అవి ప్రేమ మరియు
విధేయత. ఇవి రెండూ ఒకదానిపై ఒకటి
ఆధారపడియున్నవి.
22. మీకందరికీ శిక్షణద్వారా అనుగ్రహించు
జ్ఞానమిదే. అదేమంటే, ఎవరు సర్వమెఱుంగుదురో వారిని తెలుసుకొమ్మని నొక్కి వక్కాణించడమే.
23.
సేవా త్యాగములు: ఈ రెండింటి సహాయమున ప్రేమయను ఆధారశిలపై ఆధ్యాత్మిక దేవాలయ
నిర్మాణము జరుపనగును. ఏ విధమైన సేవయైనను
నిస్స్వార్థబుద్ధితో చేసిన ప్రయోజనమున్నది.
నేను యిక్కడ వాడిన ఈ సేవ అను పదము ఆరాధనా భావయుక్తమైయున్నది.
24.
మాంసాహారము ఆధ్యాత్మిక ప్రయోజనమునకు ఏమాత్రము మేలుచెయ్యదు.
5. ఆత్మసమర్పణము
25. అభ్యాసమునకు తమను తాము గట్టిగా నిబంధించుకొను
ఏకైక ప్రతిభావంతమైన మార్గమేదంటే, తమనుతాము"అపరిమితము"నకు
అనుబంధించుకొనుట లేక యితర మాటలలో చెప్పవలెనన్న ఆ అపరిమితముతో అనుసంధించబడి
పరిపూర్ణత సాధించిన వానితో అనుసంధించుకొనుటే.
అట్లు అనుసంధించుకొన్నట్లయితే దానర్థం ఆ మహాత్ముడు మిమ్ములను తన గుండెకు హత్తుకొన్నట్లు. దానివైపునకు నీవు లోతుగా చొచ్చుకొనిపోవు
ప్రయత్నము చేయుచున్నావనగా, నీవు మహోన్నతము వైపునకు వెళ్ళు
మార్గము ననుసరించుచున్నావని దానర్థం.
ఆత్మసమర్పణమను పదము యిచ్చు అర్థమిదే.
సంపూర్ణత్వము నందుకొనుటకు నిశ్చయమైన మార్గమిదే. నీవొక పని చేస్తూ వుండగా, నీవే ఆపని చేయుచున్నానను భావము కలిగియుంటే అది సరియైన పద్ధతికాదు. నీవు ఆత్మసమర్పణస్థాయికి దూరమై యున్నావు. ఎందుకంటే నీలో అహంభావము కూడా వున్నది. ఆత్మసమర్పణము అహంభావపు ఎఱుక నుండి స్వేచ్ఛబడసి
యున్నది. ఏవిధమైన ముందు వెనుకల ఆలోచనా
లేకుండా సమయానుకూలంగా ప్రతీది స్వతఃసిద్ధంగా తనంతటదే ఆ దశలో జరిగిపోతుంది.
26. ఈ కొస అనగా పరిపూర్ణస్థితి నందుకొనుటకుగల
సులభమైన మరియు తిరుగులేని మార్గము, నిన్ను నీవు
సార్థకముగా గొప్ప గురువర్యునకు సమర్పించుకొని నీకైనీవు జీవన్మరణుడవగుటే. ఇట్టి ఆత్మార్పణ భావమును బలవంతముగాను యాంత్రికముగాను
అలవరచుకొనిన అది యెప్పటికీ వాస్తవమైనదిగా నిరూపింపబడదు. దానికై అదే స్వతఃసిద్ధముగా అది మనస్సున
ఏమాత్రము శ్రమ, అలసట కలుగని రీతిలో నీలోనే ఉత్పన్నము
కావలెను. దీనికి సంబంధించిన యెఱుక నిజమున
కేమాత్రము కల్గియున్నా అది అసలైన ఆత్మార్పణ కానేరదు. వాస్తవార్థమున ఆత్మార్పణ గావించిన తర్వాత యిక
మిగిలియున్నదేమియు లేదని నా నమ్మిక. ఇక
నిరంతరము నీవు సత్యతత్త్వముతో సంబంధము గలిగియుందువు. దైవీయ దివ్యధార నీవైపునకు యెడతెరిపిలేకుండా
ప్రవహించుచునే యుండును.
హృదయ
సమర్పణము గావించుకొనుటకు సులువైన మార్గము కేవలము ఒక సద్సంకల్పమే. కావలసినదంతే.
అయితే ఆ యిచ్ఛ యెంత తేలికైనది యెంత సున్నితమైనదైతే దానిపనితనమంత
ప్రతిభావంతముగా వుంటుంది.
27.
వ్యక్తి తన హృదయమును విక్రయింపగలిగితే అంటే దివ్యగురువర్యునకు కానుకగా
యివ్వగలిగితే యిక చేయడానికేమీ మిగిలివుండదు.
ఇది అతన్ని సహజసిద్ధంగా అనంత సత్యతత్త్వములో లీనమయ్యే స్థితికి
తీసుకొస్తుంది.
జీవితములో
అత్యంత ప్రియమైన వస్తువును పొందుటకు ఒక చిన్ని హృదయమునుగాక సమర్పించుటకు
మరేమున్నది?
6. సాక్షాత్కారము
28. పరిణామరహితమైన నద్ధానిని సాక్షాత్కరింప
జేసికొనుట కుపయోగపడునదే నిజమైన విద్య. అది
పఠనము వల్లగానీ, విశ్వసించడం వల్లగాని లేక తర్కించడంవల్లగాని
సాక్షాత్కరింపబడదు, కానీ అది అతీంద్రియ జ్ఞానానుభవమున
మాత్రమే సాధ్యము. అది యెంత
సాధించినప్పటికి యింకాయింకా ముందుకు సాగి సాగరతీరము చేరవలసియే యున్నది. కొంతకాలమా సముద్రపుటలల చల్లదనము నాస్వాదించి తనకైతాను
సాధకుడు ఆ అనంతసాగరపు లోతులకు మునిగి అపారమైనశాంతి మరియు ఆనందమును పొంది
అనుభవపూర్వకముగా ఆస్వాదించును.
29.
ఎవరు ప్రకృతిలో నున్నదంతయు యెఱిగి లేక ప్రకృతి సృష్టినంతయు తెలిసియు
యెల్లవేళల తెలియని స్థితిలో నుండునో అతడే పరిపూర్ణుడైన మానవుడు. అతనికి విజ్ఞానపు శాఖలన్నియును మరియు సమస్త
శాస్త్రములు తెలిసియుండును. వీటికి
సంబంధించిన వాటిని అతని నెవరైనా అడిగితే అతడు నీవేమి తెలుసుకొన దలచితివని
సహజధోరణితో అడుగును. (అంటే అతనికి తెలియనిదేమీ
లేదని అర్థమగును)
30. వాస్తవమునకు సాక్షాత్కారస్థితి ఒక
మూగస్థితి. అది వివరింప సాధ్యముగాని స్థితి.
వెలుగును బాహ్యముగా గాని అంతరంగమునగాని భావించుట, లేక కనుగొనుట సాక్షాత్కారము కానేకాదు.
నిజానికి మనము ముందుకుసాగి కడకు చేరుకోబోతున్నది దానికడకు కాదు. మన గమ్యము వెలుగుకాదు, చీకటీకాదు.
31. వాస్తవమున బాధా దుఃఖముల నుండి బయటపడుటకే
మానవుడు ప్రయత్నము కొనసాగించుచున్నాడు.
కారాగారము ద్వారానే మోక్షమార్గమున్నదని ఒకసారి గాంధీజీ
వ్యాఖ్యానించిరట. ఈ ప్రపంచమే ఒక
కారాగారమని భావించినట్లయిన ఈ వాక్యము ఆధ్యాత్మిక విషయమున కూడా సరిగ్గా
సరిపోతుంది. దారుణ నిరాశానిస్పృహలో మనిషి
తన జీవితాన్ని అంతమొందించుకోవాలని తలుస్తాడు.
ఇటువంటి సందర్భములలో, మరణమునకు
సమానమైన జీవితమును ప్రసాదింపుమని భగవంతుని ప్రార్థించుటమేలని నేను భావింతును.
32. సాక్షాత్కార మార్గమున ఈ మూడు
ప్రతిబంధకములున్నవి.
(1) మనం
తలంచడమేగాని ప్రయత్నించి కార్యరంగమున దిగము.
(2)
అనేక విధానాలున్నాయి, వాటినన్నిటిని ఒకేసారి చేపడతాము
(3)
మనపై మనకు ఆత్మవిశ్వాసం లేదు.
33. మానవుని
అంతిమ గమ్యము భగవత్‌సాక్షాత్కారము. అతని
కార్యకలాపములన్నింటికి అతని అంతిమ గమ్యమగు భగవత్‌దర్శనమే మార్గదర్శకము
కావలెను. మతములన్నీ ఒకేస్థానము చేర్చు
వివిధ రహదారులే. అవన్నీ భగవత్‌ప్రసాదితములే. ఈ మతము లెవరికెఱుక పరచబడినవో వారికవి
తగియున్నవి. వారు వారి అనుభవముల
కనుగుణముగా జనులకు మార్గదర్శకత్వము వహించిరి.
కాలము గడచినకొద్దీ ఆ మహాత్ముల ప్రబోధములు నిరాదరణకు గురైనవి. వస్తుకాముకత, ఆచార వ్యవహారములుగా
మారి మా మతమే యితరమతముల కంటే గొప్పదని నిరూపించుటకుపయోగపడు విషయములైనవి. కనుక మనము ధాన్యము నుండి పొట్టును తీసివేయవలసి
యుండును.
34. ఈ స్థితి కొఱకు దేవతలు
తాపత్రయపడుదురు. ఇది మనుష్యుల కొఱకే
కేటాయింపబడినది. ఇది మనమూహించుకొనుచున్నంత
కష్టమైనదేమీ కాదు. నాకు మాత్రమిది
సామాన్యమైన వాటి వలెనే సులభమైనది.
7. నిరంతరస్మరణ
35. నిరంతరస్మరణ కొఱకు మనము దైవీయగుణమును
స్వీకరించి దానిపై మన మనస్సును నిలుపుదుము.
గుణము నుండి మనము ఆ గుణముగల పదార్తమునకు తదనంతరము దాని అంతమునకు చేరుదుము.
36. మనము మన గురువర్యులను, వారి బిడ్డలను కూడా సేవించవలెను.
వారి బిడ్డలను గురువు నుండి వచ్చిన వారిగా తలంచిన యెడల మనము బంధనమునకు లోనుగాక వారి యెడ
బంధనరహితులముగా నుందుము. వారి బిడ్డల
ద్వారా యేర్పడియున్న అనుబంధపు గొలుసు మనల్ని వాస్తవమున మన గురువుతో
అనుబంధించును. ఇది లోతుగా మనసులో నాటుకొనిపోయి
మనము సేవను కర్తవ్యముగ భావించి అడుగడుగునా ఆ మహాగురువర్యుని స్మరణలో
సాగిపోదుము. ఈ పద్ధతిలో నిరంతరస్మరణ ఒక
అలవాటుగా నెలకొనును.
37. విగ్రహారాధనలో ఒక గొప్ప లోపమున్నది. అది వారి జీవితాంతపు శ్రద్ధగా మారి దానిని
విడిచివుండుటకు వారిష్టపడరు. ఆ విధంగా
వారు ఒక ఘనపదార్తమును తమ హృదయములలో స్థాపించుకొందురు. అది వారి గురువర్యుల సంకల్పశక్తితో సులువుగా
విచ్ఛిన్నము చేయడానికి కూడా వీలుపడదు.
మనము స్థూలము నుండి సున్నితత్త్వమునకు రావలెను, దీని కనుగుణముగా విధానము కూడా మారవలెను.
విగ్రహారాధకులు అదే ప్రతిమలకు కట్టుబడిపోదురు.
38. సాధకుడు తనలో తేలికదనాన్ని గమనించడం
మొదలైంది అంటే అతడు అభివృద్ధి చెందుతున్నాడని అర్థం. ఎందుకంటే అతడు భగవంతుడున్న స్థితిలోనికి
ప్రవేశిస్తున్నాడు. తేలికదన మంటే మనిషి
ఆలోచనా భారమునుండి విముక్తి. ఈ భారాన్ని
తొలగించుకోవాలంటే మనం సామాన్యంగా మన కార్యకలాపాలకు సంబంధించినవన్నీ భగవంతుని
ప్రక్కనుండి దూరంగా వెళ్ళిపోతున్నాయని భావించడమే.
ఆ వెళ్ళేటివి కష్టాల రూపంలో ఉండివుండవచ్చు, ఆతృత రూపంలో వుండివుండొచ్చు లేక యింకేరూపంలోనైనా వుండివుండవచ్చును. భగవంతుని నుండే అవి మనకు సంప్రాప్తమైనవని
తలంచుట అత్యుత్తమ విధానము. ఇది కూడా ఒక
విధమైన నిరంతరస్మరణే. ఆధ్యాత్మికముగా
అభివృద్ధి సాధించుటకున్న ఏకైక సహాయక విధానమిది.
39. తీరిక
సమయములో నీ ఆలోచనను భగవంతుని విశ్వవ్యాపకత్వముపై యుంచి నీకు వీలున్నంత సమయము అదే
ధ్యాసతో గడుపుము. దీనివల్ల నీ సమయము
ఆనందముగా గడచుటేగాక, నిరంతరస్మరణ కూడా కొనసాగును.
8. ధ్యానము మరియు ప్రాణాహుతి
40. ప్రార్థన యాచించడము. ధ్యానము ఆ యాచించినది పొందడము.
41. ధ్యానము దైవమునకు భిన్నమైనదైతే అది
ఆకర్షకశక్తుల నుత్పాదిస్తుంది గానీ సూక్ష్మతను గాదు. సాధుమహాత్ములు "నిన్ను నీవు
తెలుసుకో" అంటారు. కానీ నేను "నిన్ను
నీవు మరచిపో" అనడానికే ప్రాధాన్యమిస్తాను.
42. గుండె కొట్టుకొనుస్థానము వద్ద, హృదయముపై ధ్యానము చేయమని నేను నిర్దేశింతును.
43. నేను హృదయమను పదము వాడితిని. అందులకు కారణం అది జీవకేంద్రము. నిర్దేశించిన చోటికి చేరుకోగల అలల కదలికనది
సృష్టించును. ఇది మనస్సు పనిచేయు
స్థానము. వివేక జ్ఞానమును నభివృద్ధి
పరచుకొనుటకిది సాధనము. భగవదీయ శక్తిని
అవతరింపజేయుటకీ స్థానములో సూక్ష్మశక్తి పనిచేయును. ఏదోవిధంగా మన ఆలోచన దీనితో అనుసంధిస్తే లేక
మనస్సునట్లు తీర్చిదిద్దితే అది దివ్యతను ప్రసరింపజేసి సత్యతత్త్వము వైపునకు మరలించును. ఆ విధంగా సమస్య పరిష్కారమగును.
44. కనీసము సత్యతత్త్వములోనికి
తొంగిచూచెదమన్న అభిలాష గలవారికి, కావలసిన సరియైన
మార్గము హృదయాంతర్గత మూలమును సృజించునదై యుండవలెననుట నా అభిప్రాయము. ఇందుకొఱకు ఉపయోగించు సాధారణ బాహ్యవిధానములు
నిజమునకు నిరర్థకములు. అవి వ్యక్తిని
గమ్యమువైపునకు గొంపోజాలవు.
45. ఆ అర్థములో ఏకాగ్రత భౌతిక మనస్సునకు
సంబంధించినదై ఎఱుకగల్గిన స్థాయిలోనే వుండును.
దాని చర్య తాత్కాలికమైనదై బాహ్యశక్తి బలవంతపు ప్రయోగమున
స్వాధీనమైనట్లుండును. అనుభవపూర్వకమైన
ప్రత్యక్ష ఉదాహరణలు ఈ విషయమై తగినన్ని నిరూపణలు జూపినవి. ఈ విధముగా వృద్ధిచెందిన స్థితిలో వారు
ఆంతరంగికముగా స్థూలము మరియు జడులుగా మారి సున్నితము మరియు సూక్ష్మమైన
దివ్యప్రసారము గ్రహించుటకు పూర్తిగా అయోగ్యులైయుందురు. బలవంతముగా అణచిపెట్టబడిన ఆలోచనలతో ఏర్పడిన
ఏకాగ్రత మనస్సుపై తన భారప్రభావమును కలిగించును.
46. మనం మనదైన చిన్న ప్రపంచమును మన
భౌతికవస్తు సముదాయముతో స్థూలమైన మరియు వెలుగుసైతం జొరబడవీలుకాని జడపదార్తములతో ఒక
పొరపై మరొకపొరగా పేర్చుకొని నిర్మించుకొంటిమి.
ఇక మనం చేయవలసింది ఆ జడమైన పొరలను ఒకటొకటిగా నన్నిటిని బ్రద్ధలుగొట్టివైచి
సృష్ట్యాదిన ఉన్నటువంటి పరిపూర్ణస్థితిని తిరిగిపొందవలెను. ఇదే మన ఆధ్యాత్మిక విధానమైన సహజమార్గము యొక్క
సంక్షిప్త వివరణము. మనము మనదైన ఈ
చిన్నిసృష్టిని కరిగించివేయవలెనని చెప్పుదుము లేక మనల్ని మనం చుట్టచుట్టుకొనిపోయి
వున్న స్థితిని విప్పివేసుకొనవలెను.
47. నిద్ర పదార్త సంబంధమైనది. సమాధి ఆత్మసంబంధమైనది.
48. అవాంఛనీయ ఆలోచనలుత్పన్నమైనప్పుడు, నేను వాటిని మా గురువుగారివని తలంచితిని.
అవి నిలిచిపోయినవి.
49. నీకేకాదు, ప్రతి ఒక్కరికిగూడా నా సలహా ఏమంటే - నీ కొఱకు వెదుకుతున్న వానిని అన్వేషించు. అంతేగాని నిన్ను నిర్లక్ష్యము చేయయత్నించు
వానిని కాదు.
50. అహంకార రాహిత్యమనగా సారవంతమైన శక్తిని
సాధించడమే. అది ఎలా సాధించాలి. కేవలం నిన్ను నీవు మహత్తర దివ్యశక్తితో
అనుసంధించుకొన్నప్పుడే అది సాధ్యం. అలా
చేయడంవల్ల మనం స్థాయి తర్వాత స్థాయిగా అధిగమిస్తూ ఆయన సన్నిధిని చేరుకొంటాము.
51. ఆధ్యాత్మిక రంగములో మీరు సూర్యులవలె
ఉదయించాలని నా కోరిక. అయితే అదెప్పుడు
సాధ్యం? ఎప్పుడు
భూమి నీడను సూర్యునిపై పడకుండా చూచుకొన్నప్పుడే అది సాధ్యం. అది నీ గమన మార్గాన్ని తదనుగుణంగా
ఏర్పరచుకొన్నప్పుడు సాధ్యపడుతుంది. అదెలా
సాధ్యమంటే అది నీ కదలిక చక్కగా నేరుగా వుండేట్లు చేసుకోవడం ద్వారా
సాధ్యపడుతుంది. మరి కదలిక ఎప్పుడు
చక్కనౌతుంది అంటే, ఎప్పుడు నీ గమ్యం నిరంతరంగా నీ దృక్పదంలో
వున్నప్పుడే సాధ్యమౌతుంది. ఆ గమ్యమెలా
దృక్పదంలో వుంటుంది అంటే, ఎప్పుడు నీవు సంపూర్ణంగా ఆయనవాడవౌతావో
అప్పుడు. అలా నీవాయన వాడవెలా ఔతావు అంటే,
ఎప్పుడు నిన్ను నీవు పూర్తిగా పోగొట్టుకుంటావో అప్పుడు. మరి నిన్ను నీవు ఎలా పోగొట్టుకుంటావు
(మరచిపోతావు) అంటే, ఎప్పుడు ఆయన ధ్యాస తప్ప ఇతర ధ్యాసే నీ
హృదయంలో లేనప్పుడు. అదెలా సాధ్యం అంటే,
అది అభ్యాసము ద్వారా సాధ్యం.
అభ్యాసమెలా చెయ్యాలి అంటే అభ్యాసం ప్రేమ శ్రద్ధాసక్తులతో చెయ్యాలి. ప్రేమ, శ్రద్ద ఎలా
పుడతాయి అంటే మళ్ళీ మళ్ళీ అదే చింతనలో నున్నప్పుడు పుడతాయి. అట్టి చింతనమెలా కలుగుతుందంటే, ఎప్పుడు నడుము బిగించి నీ విశ్రాంతిని, సంతోషాన్ని
త్యాగం చేసి అలసత్వానికి స్వస్తిచెబుతావో అప్పుడు.
52. మనం మన కుటుంబ జీవితంపై అనవసరమైన శ్రద్ధ
వహించక, పనులన్నీ కర్తవ్యమని నెరవేరుస్తూ ఏమాత్రం బంధనమునకు
గురికాకుండా సాగిపోవలెను. ఉదాహరణకు మనం
మలవిసర్జనశాల కెళతాం కానీ తర్వాత మనకా ధ్యాసే వుండదు. పని పూర్తయింది, ఇక దాని
ధ్యాసపోయిందంతే. సాంసారిక జీవనాన్ని ఒక
పద్ధతిలో మలచుకుంటే దాన్ని తిట్టవలసిన అవసరముండదు. ఒకవేళ నీవొక పని చేయడానికి బలవంతపెట్టబడ్డావనుకో
అది నీవు ఏమాత్రం స్వార్థచింత లేకుండా, చేయాలి కనుక చేశాం
అన్న భావనతో చేసేస్తే అట్టి పనిని నేను స్వార్థరహిత చర్యగాను, మనస్సుపై ఏవిధమైన ముద్రలు పడని చర్యగాను తలంచెదను. మనం అన్ని పనులు అనగా భార్యాపిల్లలకు
సంబంధించిన కార్యములు సహితం భగవంతుని ఆజ్ఞగా భావించి చేసుకుపోవలెను. ఈ విధంగా మనచర్యలన్నీ తుదకు పూజగా
మారిపోవును. ఇది ఆ సర్వశక్తిమంతునితో
ఆలోచన మాధ్యమమున సంబంధమేర్పరచుకొను అతి సులువైన మార్గము.
53.
గీతాసత్యమును కృష్ణపరమాత్మ అర్జునునకు, ఆ సమయమునకు అవసరమై
బోధించెను. మన మేలుకొఱకు భగవానుడు చేసిన
బోధకు మనమెంతో ఋణపడి యున్నాము. ఆ బోధయంతయు
కాలక్రమమున మనందరికి దారిచూపు వెలుగైనది.
అది కేవలం వారికి మాత్రమే సంబంధించిన సంభాషణ కాదు, దైవీయ
మార్గములో పయనించు నిజమైన సాధకునకు తెలియజేసిన ఆధ్యాత్మిక సర్వస్వము. అవన్నీ ఒక అభ్యాసి సాధనా సమయంలో దాటుకొనుచుపోవు
ఆధ్యాత్మిక స్థితులకు సంబంధించిన విషయములు.
అవి స్వానుభవమున సాక్షాత్కరింపజేసుకొను సక్రమ సాధనాస్థితులకు
సంబంధించినవి. ఏది ఏమైనప్పటికి ప్రపంచములో
నేటికీ ఆ స్థితులకు సంబంధించిన క్షణమాత్ర దర్శనము చేయించగల లేక అవే స్థితులను
కనీసం క్షణమైనా మీలో కలిగింపగల ఉత్తమస్థాయి మహాత్ములున్నారు.
54. ఏకాగ్రత ధ్యానమునకు
మొదటిమెట్టుకాదు. బలవంతపు నిర్బంధములను
వదిలించుకొని సహజముగా ధ్యానము చేయుటే సరియైన పద్ధతి. ధ్యానమనునది మళ్ళీమళ్ళీ భగవద్విషయమై
ఆలోచించడమే. తద్వారా ఎడతెగని ఆలోచనానుబంధమేర్పడును. ఇది భగవదాలోచనవైపునకు సజావుగా మరల్చుట కుద్దేశింపబడినది. ఇందుకొఱకు ఇతరులేర్పరచిన సాధన మిక్కుటముగా
యాంత్రికమై కేవలం బాహ్యవిషయములను మాత్రమే గణనలోనికి తీసుకొంటున్నది. ఈ కారణముననే జన బాహుళ్యము ఇంత బోధ
జరిగినప్పటికీ ఇంకా భ్రమ మరియు అజ్ఞానములోనే కొట్టుమిట్టాడు చున్నారు.
55. ప్రాణాహుతి ప్రసారశక్తి వెనుకవుండి
పనిచేయుట వల్ల మాత్రమే ధ్యానము విజయవంతముగా చేపట్టబడుతున్నది. ఇది ఒక గొప్ప మానసిక శాస్త్రము. ఇందు గురువర్యులు తన స్వంత మానసిక శక్తితో
అభ్యాసిలో నిద్రాణస్థితిలోనున్న అంతఃప్రబోధశక్తులను మేల్కొల్పి ఆధ్యాత్మికోన్నతివైపు
నడిపించును. సహజమార్గమునందు అభ్యాసి
గురువునకు తన్నుతాను సమర్పించుకొన్నట్లయిన విజయము సాధించుట యందు సంపూర్ణబాధ్యత
గురువే వహించును.
56. సర్వము గురువునకే సమర్పించి నీపనిని
ప్రారంభింపుము. నీలోనున్న నీ గురువే సమస్త
కార్యములు, అవి గృహమునకు సంబంధించినవి కానీ, వ్యాపారమునకు సంబంధించినవి గానీ, వినోదకార్యములుగానీ
అన్నీ ఆయనే నిర్వర్తిస్తున్నాడని విశ్వసింపుము.
కడకు ధ్యానము చేయుచున్నప్పుడు కూడా నీవుకాదు ఆయనే చేయుచున్నాడని తలంచుము.
57.
తొలిదినములలో ధ్యానమునకు కూర్చున్నప్పుడు ఆలోచనల చొరబాటు విపరీతముగనుండును. ఇది పైకి కలవరపెట్టుచున్నట్లుండును, కానీ వాస్తవమున కదేమీ కాదు.
ఎడతెరిపిలేని ఈ ఆలోచనా ప్రవాహము కేవలము ధ్యానసమయమునకే పరిమితమై లేదు. అది ప్రతిక్షణము వుండనే వున్నది. అయితే దాన్ని ధ్యానసమయంలోనే ఎక్కువగా
గమనిస్తాము. ఎందుకంటే ఆ సమయంలో మనం
ఆలోచనలు, భావనలన్నింటిని ఖాళీ చేయాలనుకుంటాము. శూన్యములోనికి గాలి యెలా చొచ్చుకొని
ప్రవేశిస్తుందో అదే విధంగా ఆలోచనా శూన్యంలోనికి ఆలోచనలు చొచ్చుకొని
ప్రవేశిస్తాయి. మన ఎఱుక కావల లోతుపొరలలో ఒక
పెద్ద ఆలోచనా భాండాగారమున్నది. దానినుండి
ఆలోచనలు బలముగా త్రోసుకొని వచ్చి పైనున్న ఎఱుకగల మానసమున ఏర్పడిన శూన్యములోనికి
చొచ్చుకొని వచ్చి చేరి అక్కడ వాని ప్రభావమును చూపును. మనస్సు క్రమబద్ధీకరించి వుండకపోవడము వలన ఆ
ఆలోచనలతో కలిసి మనస్సు ఒడిదుడుకులకు లోనగును.
నిజానికి ఎగిసిపడుతున్న ఆలోచనల వల్ల అభ్యాసి కలత చెందడము లేదు. కానీ తాను ఆ ఆలోచనలను ఎక్కువగా పట్టించుకొనడము
ద్వారా కలత చెందుతున్నాడు. సామాన్యంగా
దీన్నధిగమించుటకు ఉపయోగించు లోపభూయిష్టమైన విధానము, మనస్సును
బలవంతముగా బాహ్యహింసాత్మక చర్యలతో అణచివైచుట.
ఎదురు తిరిగిన గుఱ్ఱము నదుపుచేయునట్లు మనస్సునొక కొఱడాదెబ్బతో అదుపుచేయజూతుము. అందువల్ల కొంత సమయమది అణగి యుండునేగాని దోషము
మాత్రము లోలోపలట్లేయుండును. ఇది
జీవితాంతపు పోటీక్రీడగా మారిపోవును. కనుక
మనస్సును అదుపుచేయడం కాదు పరిష్కారము, దాన్ని సక్రమంగా
తీర్చిదిద్దడమవసరం. చెడు తలంపులు
శుద్ధీకరణ విధానం ద్వారా భాండాగారం ఖాళీ అవుతున్నది. ధ్యానకాలంలో వచ్చిన ఆలోచనలను లెక్కచేయక వాటిని
పట్టించుకొనకుండా పిలువకయే వచ్చిన చుట్టాలవలె వాటిని ఖాతరు చేయకుము. ఈ పద్ధతి వల్ల వాటి తీవ్రత నశించి మనలను
కలతపెట్టు అంశములు కాకుండా పోవును.
58. సాధనలో రెండు అంశములున్నవి. ఒకటి తనకైతాను చేయు అభ్యాసము, రెండవది గురువుగారి సహాయము మరియు ఆధారము.
తగిన స్థితులు మనలో ఉత్పన్నమగుటకు కేవలం స్వప్రయత్నము మాత్రము చాలదు.
దానికి తోడుగా దైవీయకృప, ఈ ప్రయోజనము పొందుటకు
అత్యంతావశ్యకము. అభ్యాసి వైపునకు
దివ్యకృపాధార గురువు మాధ్యమమున మాత్రమే ప్రసరించును. అది కూడా ప్రాణాహుతి ప్రసార విధానముననే
జరుగును. వాస్తవమునకు అభ్యాసి ఆధ్యాత్మిక
పురోగతి మరియు చిక్కుల తొలగింపు అతి తక్కువ సమయంలో ప్రాణాహుతి వల్ల జరుగును. అట్లుకాక కేవలం అభ్యాసి స్వశక్తి వల్లనే అయితే,
అది పూర్తి దశాబ్దముకైనను సాధ్యపడదు.
9. యోగము
59. రాజయోగము మనకు నిజమైన జీవితముయొక్క రాజు
వంటి విధానమును బోధిస్తున్నది. వ్యక్తి
వాస్తవ జీవితపు సుధను ఆస్వాదించాలని మనఃపూర్వకముగా ఆశిస్తే, అతని నిర్ణయమును ఏశక్తీ (మాయగాని మరేదైనగాని) నిలువరింపజ్ఆలదు. మనము మాయను దూరంగా ప్రక్కకు నెట్టితిమని
చెప్పుటకు వీలులేదు కానీ తనకైతాను ఆయనతో ఏకమై యుండుటకు ప్రయత్నించి సాధన చేసిన ఎడల
జీవిత సమస్య సులభముగా పరిష్కరింపబడును.
60. నీవు యోగమార్గము ననుసరించినట్లైతే నీకు
కష్టములు, ఉపద్రవములు సంభవిస్తాయని కొందరు చెప్పెదరు. ఇది కేవలం అజ్ఞానుల మరియు మానసిక బలహీనుల
దృక్పదము. ఇది అనుభవపూర్వకమైన ఆధారముల
దృష్ట్యా అంగీకరింప వీలులేనిది. అది
యట్లుండ నేను చెప్పునదేమనగా, నీవు నీ జీవితము మొత్తము
దీనికొఱకు త్యాగము చేసిననూ అది తక్కువే.
ఎందుకంటే బాధలు, వ్యధలతో గూడిన వందలాది మరుజన్మల
నుండి నీవు తప్పింపబడుదువు. కనుక
సరియైనదేదో దానినే నీ విచక్షణనుపయోగించి చేయుము, లేదా ప్రత్యక్షానుభవము
గడించిన వారి అనుభవములను విశ్వసించి అనుసరించుము.
61. ఆలోచించు
విధానము తత్త్వశాస్త్రము. కార్యనిర్వహణ
(చేయు) విధానము యోగము. ఏమీ చేయకుండడము
సాక్షాత్కార మార్గము.
62. తత్త్వవేత్తలు మనస్సను గుహలో
జన్మింతురు. యోగులు హృదయకుహరంలో జనింతురు.
63. మార్పులేని స్థితియే నిజమైన స్థితి. మనిషికి జీవన్మరణస్థితి ఎప్పుడు కలుగుతుందంటే, ఎప్పుడతడు ప్రాపంచిక విషయములకు మిక్కిలి దూరమై, అవన్నీ
అతనికి అవాస్తవములుగా, నిద్రనించి లేచిన వాడు భావించిన
కలలాగా గోచరించినపుడు. సంపూర్ణ శూన్యత్వమనగా భగవంతునిలో పూర్తిగా లీనమై తనను
గురించిన ఎఱుకగానీ కడకు భగవంతునికి సంబంధించిన ఎఱుకగానీ లేకుండును. ఒక యోగి ధ్యేయము ప్రకృతిపై
సంపూర్ణాధికారము. అయితే అట్టి సంపూర్ణమైన
పూర్తి అధికారము, అతడు తనకైతాను భగవంతునిలో లీనమైపోయినప్పుడే
సంప్రాప్తమగును.
64. నిజమైన భక్తి ఏవిధమైన భౌతిక మరియు వస్తువిషయములపై
వాంఛగలిగి యుండదు. అది నిజమైన ఒక తీవ్రమగు
ఆశను ప్రేరేపించును. ఆ ఆశ నెరవేరినట్లయిన
ఇక దానిస్థానములో మరో ఆశ మొలవదు, సరికదా అది ఇక
ఆశలన్నిటినీ అంతముచేయును. ఇది వాస్తవార్థమున
మన తొలి జన్మస్థానముయొక్క స్మృతి. అదే మన
ప్రయాణము యొక్క ఆఖరు మజిలీ.
దానితో
అనుబంధమేర్పరచుకొనుటను నిరంతరస్మరణమని వేరువిధముగా వివరించవచ్చును. అదే నిజమునకు భక్తియన సరియైన అర్థము.
నిజమైన
త్యాగము, ఉద్యోగము లేక కార్యాలయమును త్యజించడమో లేక అడవులకు
వెళ్ళిపోవడమోకాదు. కానీ నీ ఆత్మ
పరిజ్ఞానమును సక్రమముగా సద్వినియోగము చేసికొనుట.
నిజమైన సాధకునకు అవసరమైనదదే.
65. దాదాపు అందరు మహాత్ములు ఆలోచనాశక్తిని
సద్వినియోగ పరచుకొనిరి. అది మనిషిలో
మిక్కుటముగా నున్నదని గట్టిగా మనసుకు తోచుచున్నది. రాజయోగములో ఈ ఆలోచనాశక్తి ఉపయోగమే మూలసూత్రమై యున్నది.
66. రాజయోగమొకవిధానము లేక శాస్త్రము. ఆత్మసాక్షాత్కారము లేక భగవత్‌సాక్షాత్కారము
విషయమై దీనిని గొప్ప ఋషులు, సాధుమహాశయులు
వారి సహాయార్థము అనుసరించిరి. ఇది ఒక నూతన
మతము కాదు. మనలో ఆలోచనే రాజైయున్నది. అదే కడకు అభివృద్ధి చెంది మనలను మన గమ్యమునకు
నడుపుచున్నది.
67. రాజయోగము ధ్యానముతో మొదలౌతుంది. తద్వారా వ్యక్తిగత మనస్సు అటుయిటు తిరుగుట వదలివేయును. వ్యక్తి, వెలుగైయున్న
సత్యముపై ధ్యానించవచ్చును లేక మానవరూపముపైనైనను ధ్యానించ వచ్చును. ఆ మానవరూపము ఒక మహాత్ముడు లేక శక్తిసామర్థ్యములు
గల వ్యక్తియైయుండును. అయితే ఆ వ్యక్తి తన
మార్గదర్శిగా ఎన్నుకొనబడినవాడై యుండవలెను.
ఎప్పుడైతే అట్టి మహాత్ముని ధ్యానవస్తువుగా ఎన్నుకొందుమో అప్పుడు
ప్రకృతిశక్తి అతని నుండి ప్రవహింప నారంభించును.
కారణ మా మహనీయుడు అట్టి శక్తిచే అనుగ్రహింపబడియుండును.
68. భగవదన్వేషణకు గృహస్థజీవనము ఆటంకమైనదని
సహజమార్గము భావింపదు. ప్రాపంచిక మరియు
ఆధ్యాత్మిక జీవనములు రెండు వాస్తవమునకు సహజ జీవనమున రెండు దశలు. అవి రెండు కలసి ప్రక్కప్రక్కనే ఒకదానితో ఒకటి
సంబంధము గలిగి సాగవలెను. సహజమార్గము ఈ
సిద్ధాంతమును గుర్తించును. ఇది
యిచ్చిపుచ్చుకొను మరియు చేసి అనుభవించు విధానము.
అంతేగానీ చదివి ఆనందించు విధానము కాదు.
69. దివ్య
ప్రకాశకిరణములు వెలుగునందంతటను వేళ్ళూని
యున్నవి. ఒక క్షణమైనను అవి వేరుపడి
లేవు. అనేకములైన మొక్కలు, వృక్షములు పైకి వేరువేరుగా కనబడినప్పటికిని అవన్నీ భూమాతలోనికే తమ వేళ్ళను
దింపి జీవనాధార సారమును గ్రహించుచున్నవి.
అదే విధంగా మనం కూడా మన వేళ్ళను మన గురువర్యునిలో స్థాపించి ఆయనలో
ఐక్యమైపోదుము గాక!
70. గురువర్యులు తన అంతఃశక్తులను ప్రయోగించుట
ద్వారా అభ్యాసిలో నిక్షిప్తమైయున్న శక్తులను జ్ఆగృతము చేసి వాటిని చైతన్యపరచి వాటి
దివ్య ప్రవాహమును అభ్యాసి హృదయమునకు మళ్ళించును.
అప్పుడు అభ్యాసి దివ్యానందమును మరింతగా అనుభవమున పొందుతూ ఆధ్యాత్మికముగా
పురోగమించును.
10.
ఇతరములు
71. మనిషి:- ఎవరు మనిషి? మానవత్వపు ఎఱుక ఉత్తేజితుడైనవాడే మనిషి.
కానీ సరియైన అర్థములో, మనిషిని మనిషిగా
తీర్చిదిద్దినవాడే నిజమైన మనిషి.
అతడెట్లుండాలి? వాస్తవార్థమున అతడొక పరిపూర్ణమైన సమగ్రమైన
వ్యక్తియై వుండాలి.
72. శీలము:- ఆధ్యాత్మికతకు సౌశీల్యులైయుండుట
అత్యంతావశ్యకము. శీలమంటే మన బాహ్యజీవనము
యితరుల సానుభూతిని, ప్రేమను చూరగొనునట్లు మలచుకొనుటని కాదు అర్థము. ఇది ఒక విశాలార్థముగల పదము. ఇందులో మన చర్యలన్నీ యిమిడియున్నవి.
సౌశీల్యమనగా
మన జీవనము ప్రకృతిసిద్ధమై సర్వదా శాంతముగా వుంటూ సమతాస్థితిని కొనసాగించుట.
73. పురుషలక్షణము:- దృఢనిశ్చయము, అకుంఠిత ధైర్యము అనునవి అత్యంతావశ్యకములైన పురుష- లక్షణములు. అంతిమ విజయమునకు కావలసినవివే.
74. అహంకారము:- గర్వము, నిర్లక్ష్యభావమనునవి యిప్పటికే ఏర్పడియున్న అహంకారమను గొలుసునకు మరొక
వలయమును కూర్చును. దీనినుండి రక్షణ
పొందుటకు వ్యక్తి నిజాయితితోకూడిన ప్రార్థనద్వారా నేరుగా తనకైతాను భగవంతునితో
సంబంధమేర్పరచుకొనవలెను.
75.
ఆత్మసంరక్షణ:- మనము యితరులను ఎప్పుడుకూడా బాధింపరాదు. కానీ వ్యక్తిగతంగాను ఆస్తి విషయంలోను తప్పక
ఆత్మరక్షణ జేసుకొనవలెను. అది సరియైనదే.
76. ప్రేమ:- మనమందరిని ప్రేమింపవలసినదే. కాని ఎవరిపైన వ్యక్తిగతమైన బంధములకు
లోనైయుండరాదు.
77. బిడ్డలు:- మన బిడ్డలను మనము భగవంతుని
బిడ్డలుగా భావించి పోషించవలెను. వారి
సర్వతోముఖాభివృద్ధికై భగవంతునిచే నియమింపబడిన ధర్మకర్తలముగా మనల్నిమనం
భావించవలెను.
78. సేవ:- మనమందరిని సేవించుటకు సిద్ధముగా
నుండవలెను. మనము సేవించుకొనుటకవకాశ-
మిచ్చినందులకు వారికి మనము ధన్యవాదము లర్పింపవలెను.
79. కర్తవ్యము:- నేనెవ్వరిని వారివారి
ప్రాపంచిక సంపదను వదలివేసి సాంసారిక జీవనమునకు స్వస్తిపలుకమని ఉద్భోదించను. కానీ ప్రతి పనిని కర్తవ్యమని, అది మహాప్రభువు తనకప్పజెప్పిన పనియని తలచి నిర్వర్తింపమని
చెప్పుదును. వాస్తవమునకదే నిజమైన
జీవితము. ఆధ్యాత్మికమైన మరియు
ప్రాపంచికమైన సమస్యలేవైనప్పటికిని అన్నింటికి అదే పరిష్కారము.
80. ఇచ్ఛ:- మరుజన్మకు కారణమైన స్థితి, యిచ్చాశక్తి కల్పించినదే. అదే
మరుజన్మకు కావలసిన యిష్టత, లేక సంసిద్ధతగా మారిపోవుచున్నది.
81. కష్టములు:- కొన్ని సందర్భములలో
ప్రాపంచికమైన తీవ్రవ్యధ యొక్క తాకిడికి వస్తువ్యామోహుడైన ఆరాధకుడు భగవరాధకుడుగా
మారిపోతాడు. ఇటువంటిది జరగడానికి కారణము
మనిషి మానవత్వముతో ఎక్కువగా అనుబంధింపబడి యుండుటే. వ్యధ యొక్క తాకిడి మానవత్వపు రేఖపై ఒక
నిరాశాఘాతము నేర్పరచును. తద్వారా అచట
శూన్యతేర్పడుతుంది. అప్పుడు ప్రక్కనే
సమాంతరముగా ప్రవహించుచున్న దైవత్వము ఈ శూన్యములోనికి చొరబడుతుంది. ఈ శూన్యమెంత లోతైనదైతే అంత మిక్కుటము మరియు
శాశ్వతమైనదిగా దాని ప్రభావముంటుంది.
82. కామక్రోధములు:- కామక్రోధములు భగవంతుని
నుండి మనకు ప్రాప్తించినవి. కాని తర్వాతి
రెండూ అనగా లోభమోహములు మన స్వంత సృష్టే.
భగవంతుని నుండి ప్రాప్తమైన వాటిని మనం వదలలేము. కాదంటే వాటిని మార్పుచేసి క్రమబద్ధీకరించి
దివ్యజీవనమునకు అనువుగా, మార్చుకొనవచ్చును. నీకు నేను విశదీకరించియే యున్నాను. ఏదోవిధంగా కామము (కోరిక) ను నాశనం చేస్తే
తెలివి దానితోపాటే నశిస్తుంది. కారణం
తెలివికేంద్రమునకు సన్నిహితంగా తగులుకొని కామమున్నది. ఇక క్రోధమును నాశనం చేస్తే మనిషి అటు భగవంతుని
వైపు కానీ యిటు ప్రపంచము వైపు కానీ ఎటూ కదలలేడు.
వాస్తవానికి క్రోధమే చేతల నన్నిటినుత్తేజపరుస్తుంది. కనుక శరీరధారియైన ఆత్మకిది అత్యంతావశ్యకమైనది.
83. సత్యతత్త్వము:- ఈ సత్యతత్త్వ స్థితి అనగా
ఏమి? దీనికి సంబంధించి నేను చేసిన ప్రయోగ ఫలితములన్నిటిని
నీ ముందుంచుతున్నాను. సృష్ట్యాదిలో ఒక
కుదుపు, ఒక కదలిక
కలిగినది. ఈ కదలికే సృష్టికి ఆధారము. అది పవిత్ర విషయము. భగవంతుని వెనువెంటనున్నదే ఈ పవిత్రము. అదే మానవుని మనస్సుగా అవతరించినది. దానికిపైన ఆ సత్యతత్త్వమున్నది. దానినే నేను రాజయోగప్రభావమను పుస్తకమున కేంద్రమని
తెలిపితిని. ఇప్పుడు మీరాలోచించండి. ఎప్పుడైతే ఆ పవిత్రవస్తువైన మనస్సును
సత్యస్థితికి తీసుకొని వెళతామో, అప్పుడు దాని
మార్గదర్శకత్వమున జరిగేదంతా సత్యమే.
84. విమోచనమునకు మార్గము:- తేలికదనం అనుభూతి
చెందితిమనగా అదే సత్యస్థితి సహజముగ ప్రకటితమగుట ప్రారంభమైనదని నిరూపించుటకు
సాక్ష్యము. ప్రేమానుభూతి కూడా దానికొక
నిరూపణమే. నీ మాటను, నీ యోచనను అదుపులో నుంచుకొనుట అవసరము.
తద్వారా నీవు ఉన్నతోన్నతమైన లీనస్థితులు పొందు అర్హత గలవానివగుదువు. ఆనందము, ప్రశాంతత మరియు
శాంతి అనునవి ఇతరులకు సంతోషమూలములు, కానీ మనకు ప్రళయము మరియు
బాధాతప్త ప్రేమానుభూతియే విమోచన (మోక్ష) మార్గము.
85. గీత:- సంవత్సరముల తరబడి భగవద్గీత
విన్నప్పటికిని యిప్పటి వరకు ఎవరూ కూడా అర్జునునివలె మారలేదు. అందులకు కారణం, గీతను ఇతరుల కొఱకు చదివి వినిపించువారు ఎవరూ అంతర్గతముగా వుండవలసిన తీరున
లేరు. అందువలన వినువారిలో ఎట్టి ప్రభావము
కలుగలేదు. గీతను వల్లించువారు ఆ గీతలో
వివరించిన స్థితులను పొంది, ప్రత్యక్షానుభవ జ్ఞానము కలిగియుండవలెను. అంతేగాక వారికి బలమైన సంకల్పము మరియు
ఆధ్యాత్మిక శక్తి గలిగి, ఆ శక్తితో తగిన వాక్‌తరంగముల
నుత్పాదించి వాటిద్వారా ప్రాణాహుతి ప్రసారమును వినువారి హృదయములకు చేర్చగలిగిన
సామర్థ్యముండవలెను. అటువంటప్పుడు మాత్రమే
గీతాపఠనము వినువారికుపయోగపడును.
86. దివ్యానుభవము:- మా గురువర్యులు
చెప్పినట్లు, ఎల్లెడల బాహ్యము నందంతటను వ్యాపించి కనిపించు
దివ్యానుభూతి నిజమునకది అంతర్గతానుభూతి యొక్క ప్రతిబింబమే. ప్రాధమిక దశలో మనస్సుయొక్క బాహ్య వృత్తుల
ఫలితముగా బాహ్య దర్శనానుభవమే కలుగును.
కానీ తర్వాత బాహ్యవృత్తులు బలహీనపడి అదేస్థితి అంతర్గతముగ
ప్రతిబింబించినట్లయి అంతరంగమంతయు అలముకొనును.
అది తర్వాతి స్థాయి. ఈ స్థితిలో
వ్యక్తి తనలోతాను లీనమౌతున్నత్లు అనుభూతి చెందనారంభించును. ఈ స్థితి కొనసాగుతూ సున్నితత్వము మరింత
ఎక్కువగా పెంపొందుతూ పోతుంది. అయినా అనంత
సాగరతీరమింకనూ దూరముగనే యున్నది.
10. నా ఆశయము
84. నా సహచర జీవుల యెడ నా హృదయము అపార
ప్రేమతో నిండి పొంగి పొరలుచున్నది. నేను
వారికి చేసిన సేవతో నాకింకను తృప్తి కలుగుటలేదు.
వారంతా నేనున్న స్థాయి వరకు ఎదిగి రావాలని ఆతృతతో ఎదురుచూస్తున్నాను. ఎందుకంటే యిప్పటివరకు వారిని ఆస్థాయివరకు
తీసుకొని వచ్చుటకు వలయు శక్తి నా అధీనమైయున్నది.
కనుక నేను వారికి సహాయమందివ్వగలను.
ఒక్క మాటలో చెప్పాలంటే నేనీప్రపంచము వీడిపోయిన తర్వాత ఏమి జరుగనున్నదో
చెప్పజ్ఆలను. నా గురువర్యులు నా
కనుగ్రహించిన ఈ అపార సంపదను మునుపటి మహారాజాధిరాజులు కూడా కలిగి యుండలేదు. ఈ ప్రపంచములో దీనితో సరితూగగలదేదియూ లేదు. నేనీ ప్రపంచము వదలి వెళ్ళునప్పుడు ఈ సంపదను
వెంటగొనిపోదలచుట లేదు. నాకు మా
గురువర్యులు అప్పజెప్పినట్లే నేనును మరొకరికి బదిలీ చేయవలసి యున్నది.
85. నీ అంతరంగమునన్వేషించు, గురువర్యు- లక్కడున్నట్లు తెలుసుకొందువు.
కానీ ఎప్పుడు? ఎప్పుడు నీ వక్కడ లేవో అప్పుడు.
86. నా వద్దనున్నదంతయు మీరు దోచుకొని
వెళ్ళుడని కోరుకొనుచున్నాను. కానీ అందుకు
బదులుగా మీది అనుకుంటున్న మీ వద్దగల దానిని నాకిచ్చివేయుడు.
--o0o-
శ్రీ రామచంద్ర ఉవాచ
సంకలనము
శ్రీ మార్టిన్ ఫైడు, ప్యారిస్ (ఫ్రాన్స్)
(Ms.Mrtine Faideau, Paris, France)
శ్రీ రామచంద్ర ఉవాచ
నేను 1899వ
సంవత్సరం ఏప్రిల్ నెల 30వ తేదీన ఆదివారం ఉదయం 7-26 నిముషములకు భారత- దేశంలో
ఉత్తరప్రదేశ్‌లోని షాజహాన్‌పూర్‌లో జన్మించితిని.
మా తండ్రి రాయ్‌బహదూర్ శ్రీ బద్రీప్రసాద్‌గారు ఫస్ట్‌క్లాస్ హానొరరీ
స్పెషల్ మేజస్ట్రేట్‌గా పనిచేసినాడు.
"నిజాయితీగా వుండు, దొంగతనం చేయకు అని మా తల్లి
నా జీవితపు ప్రతి ఘట్టములోను జ్ఞాపకముండు- నట్లు ఒక గుణపాఠము నేర్పినది. ఆమె నాకిచ్చిన శిక్షణా ప్రభావము వల్ల అది నా
జీవితములో ఒక భాగమైపోయినది.
బిడ్డ
యెదుగుతూ, మాట్లాడడము ఆలోచించడము మొదలుపెట్టు సమయమున
తల్లిదండ్రుల యొక్క లేక యితరుల యొక్క సూచనలు అప్పుడప్పుడే ఒక రూపము గైకొంటున్న ఆ బిడ్డ
శీలముపై ప్రభావము చూపి అవి బిడ్డ జీవితములో ఒక భాగమైపోవును. ఆ సూచనల అర్థముగా బిడ్డ రూపాంతరము
జెందును. తల్లిదండ్రులు, బిడ్డల బాల్యము విషయమై తగిన సదాలోచన గలిగి యుండవలెను. వారు పిల్లలతో ఉత్తమ విషయములనే మాట్లాడునట్లు
జాగ్రత్త పడవలెను. బిడ్డ యింకా ఆలోచించి
అర్థము చేసుకొను దశకు యెదగక పోయినప్పటికిని తల్లిదండ్రులు మాట్లాడిన మాటల ముద్రలు
బిడ్డ హృదయముపై పడును. కనుక ప్రతి ఒక్కరు
మరీ చంటిబిడ్డల వద్దనైనా సరే బహుజాగ్రత్తగా మాట్లాడవలెను.
నా
తొమ్మిదవ యేట నుండి సత్యతత్త్వముపై ఒక విధమగు తృష్ణ నా కనుభూతమయ్యెను. నేను నీటిలో ముంచబడిన వ్యక్తివలె సందిగ్ధత
మరియు కలవరమునకు లోనైయుంటిని. ఆ సమయంలో
నేను భగవద్గీత చదువ నారంభించితిని. కానీ
అది నేను తపన పడుచున్న స్థితిని నా దృక్పదమునకు తేలేకపోయెను.
అది నా
అదృష్టము. నా విద్యార్థి దశలో మా
అధ్యాపకులందరూ నన్ను యెక్కువగా అభిమానించెడి- వారు. అవసరమైనప్పుడల్లా వారు నాకు చేయూతనిచ్చి
సహాయపడెడివారు.
నేనుతత్త్వశాస్త్రాభిలాషినవ్వడం వల్ల తాత్త్విక విషయములపై వ్యాసరచన
చేసేవాడిని. నా వ్యాసములలో
"మనఃచైతన్యము" ముఖ్య విషయమై యుండెడిది.
మా ఆంగ్లోపాధ్యాయుడు కూడా తాత్త్వికుడు.
"నేను బి.ఎ.లో చదువుకున్న తత్త్వ విషయములు యితడిప్పుడే
ఎలావ్రాయగలిగాడని", ఆయన నా వ్యాసములు చూచి
ఆశ్చర్యపడేవాడు. ఈ ఆలోచనా విధానమే యిప్పటి
నా ఆధ్యాత్మిక జీవితమున నూతనాన్వేషణా ప్రక్రియ చేపట్టుటకు సహాయపడినది.
పరిశోధనా కార్యము అంత కష్టమైనదేమీ కాదు. కానీ జనులు కష్టమనుకొనుచున్నారు. ఈ పనికి పూనుకొన్నవాడు తొలుత ఉన్నత శ్రేణికి
చెందిన యోగియైయుండి అతీంద్రియ స్థితుల అనుభవము, జ్ఞానము
కలిగియుండుట ప్రాధమికాంశము. యోచన సరియైనదై
యుండవలెను. చేసిన ఆలోచన రవ్వంతయైనా అది
సరియైనదైయుంటూ హృదయ సూచిక దాన్ని సరియని నిర్ధారించగల్గవలెను. జనులు, ఈ కార్యమున కుపయోగపడు
దివ్యవస్తు- సముదాయములను కనుగొనుటలో అశ్రద్ధ వహింతురు. మనస్సు యోచిస్తుంది, హృదయము
అది సరియైనదా కాదా అన్న విషయాన్ని నిర్ధారించి సూచనలిస్తుంది. హృదయ సూచనలు వివిధములై వుంటాయి. వాటిని అర్థము చేసుకోవడమే కాస్త కష్టము. దీనిని సంతృప్తికరంగా వివరించుటకు తగిన పదములు
నాకింతవరకు లభించలేదు. కానీ వ్యక్తి సాధన
చేస్తే దాని స్వభావాన్ని తెలుసుకోగలడు.
శరీరములోని ప్రతి జీవాణువుకూడా, దానిపై ఏకాగ్రత నుంచి
గమనిస్తే అదే స్వతహాగా పలుకుచున్నట్లు నా స్వానుభవమున గ్రహించితిని. యేకాగ్రత, విషయము
గ్రహించుటకు మాత్రముపయోగపడు సాధనము.
ఏకాగ్రతతో భగవంతుని పొందలేము. ఒక
వస్తువునకు సంబంధించి ఒకే బిందువుపై మనస్సు నిల్పుట యేకాగ్రతలో చేయుపని. అదే ధ్యానములోనైతే నీ అతీంద్రియమనస్సు
దేనికోసమో నిరీక్షిస్తూ వుంటుంది. నీ యోచన
దివ్యత కొఱకు గాన, నీవు దివ్యత్వము కొఱకు నిరీక్షింతువు.
కొంతమంది
తమ అంతరాత్మే తమ గురువంటారు.
దాన్నేవారనుసరిస్తారు. అంతరాత్మ
మనోబుద్ధిచిత్తాహంకారాల చేత యేర్పడింది.
ఇవన్నీ శుద్ధీకరింపబడి సమస్థితికి వస్తేనేగాని అంతరాత్మ సత్యము
వచింపదు. కనుక మనస్సు యొక్క
సామర్థ్యములన్నీ పవిత్రీకరింపబడుట అవసరము.
జనులు దీనిపై పరిశోధన చేయవచ్చును.
నేను మీ కొక మంచిమాట చెబుతున్నాను.
ఒక వేళ మీరు ఒకానొక పరిష్కారమునకై యోచిస్తున్నారనుకుందాం. దానికి సంబంధించి మీకు కొద్దిగా తెలిసుంటే,
ఆ తెలిసిందేదో ఆ సమయానికి సరిగ్గా తెలిసుంటే, ఆ
భావనను మీరు అతీంద్రియ మనస్సులో వుంచుకోండి.
మీ సమస్య పరిష్కారమై తీరుతుంది.
పరిష్కారనంతరం దాన్ని మీరు సరిచూసుకొనవచ్చును. సత్యతత్త్వము యొక్క
స్వస్వరూపము కనబడు బిందువుపై ధ్యానము చేయుము, నీ హృదయము
సంపూర్ణ సంతృప్తినొందును.
నేను నా
బాల్యము నందు కొన్ని జరగబోవు సంఘటనలను చెప్పితిని. అవి నిజమాయెను. వందలాది సంవత్సరముల తర్వాత సంభవింపబోవు
విషయములను ముందే మనిషి యెలా కనగొనగలడో నేను వివరిస్తాను. తల యెడమ భాగమున ఒక అతీంద్రియ
స్థానమున్నది. అదే ప్రశ్నలన్నిటికి సమాధాన
మిచ్చును. ఈ విషయమంతయు నేను సహజమార్గము
దృష్ట్యా రాజయోగ ప్రభావమను పుస్తకమున చర్చించియున్నాను. ఎవరైనా రాబోవు సంఘటనల గురించిన ఆలోచనను ఆ
స్థానము వైపునకు త్రిప్పిన యెడల అది తెలిసిపోవును. ఆలోచన, యిచ్ఛయొక్క
ఒత్తిడి యేమాత్రము లేకుండా ప్రకృతి సిద్ధముగా సాగవలెను. ఒత్తిడి కలుగజేస్తే, ప్రయత్నము
అసహజమై ఫలితము స్థూలస్థమగును. ఈ విధానమును
చాలా ప్రశాంతతతో అనుసరించవలెను. ఈ
విధానమునకు భక్తి కూడా అవసరము.
నేను నా
19వ యేట మధురలో వివాహ- మాడితిని. నాకు
కోపమెక్కువగల భార్య ప్రాప్తించినది. ఆమె
పేరు భగవతి. ఆమె 1949 ఉత్తరార్థమున
పరమపదించినది. ఆ కాలములో నేనూ
కోపిష్టిగానే వుంటిని. అయితే నేనామె
సహచర్యమున ఓర్పు నభ్యసించితిని. అదికూడా
నా ఆధ్యాత్మిక గమనమున తోడ్పడినది. మా
గురువర్యుల పాదముల చెంత చేరినప్పటి నుండి నా కోపము యొక్క తీవ్రత రానురాను తగ్గిపోవ
నారంభించెను.
ఒక మంచి
మార్గదర్శి మహాత్మా శ్రీ రామచంద్రజీ మహరాజ్, ఫతేఘఢ్ (ఉ.ప్ర)
లో వున్నారని నాకెట్లో తెలిసినది. సాధ్యమైనంత
తొందరగా ఆయనను దర్శించాలని తీవ్రమైన ఉత్సుకత నాలో కలిగినది. 1922 జూన్ 3 శుభోదయమున నేను గురు పాదసన్నిధి
చేరితిని. నిర్దేశించిన రీతిలో నేను
ధ్యానమున కూర్చొంటిని. అప్పుడు నేను
అత్యంత సంతృప్తికర స్థితి ననుభవించితిని.
తక్షణమే నాలో ఒక ఆలోచన ఉత్పన్నమై నేను గురువును కనుగొంటిని అని అనిపించెను. అప్పుడనిపించిన ఆ మాటలు నా నిశ్చయమై ఆయనను నా
గురువుగా అంగీకరింపక తప్పదన్నట్లయినది.
1925
జనవరి 12న షాజహాన్‌పూర్ న్యాయస్థానమున ఉద్యోగములో చేరి, పనిచేసి
రికార్డు కీపరు (దస్తావేజులు భద్రపరచు ఉద్యోగి)గా ఉద్యోగ విరమణ చేసితిని. నేనేయే అధికారుల క్రింద పనిచేసితినో వారందరూ నా
పనితీరునకు చాలా సంతోషమందిరి. నా నిజాయితి,
సమగ్రత, పనితనమును గమనించి నాకెంతో
విలువనిచ్చిరి. సాటి గుమాస్తాలతో నేను
మెలగిన తీరు అత్యంతోత్తమముగా నుండినది.
నా
జీవితములో నా స్వలాభమున కంటే ధర్మమునకే మిగుల ప్రాధాన్యత నిచ్చితిని. "నా యెడల యెవరైనా వారి కర్తవ్యము వారు
నిర్వహించక పోవచ్చుగాక, నేనుమాత్ర మతనియెడ చేయవలసిన
కర్తవ్యమును విడచిపెట్టను" అనునది నా సిద్ధాంతము. మరో విధంగా చెప్పాలంటే ఇతరులు వారి కర్తవ్యమును
వారు నిర్వహించుటలో వెనుకబడినా, నేనెందుకు వారి విషయమై నా
కర్తవ్యమున అలసత్వము జూపుదును. నీ కొఱకు నేను చేయవలసినది, నా
కర్తవ్యము. నీవు నా కొఱకు చేయనిపని, అది నీ కర్తవ్యము. ఎవరైనా ఒక్క అంగుళమంత నా మాటకు విలువిచ్చి
అనుసరిస్తే దానికి నేను ప్రతిస్పందించయత్నిస్తాను, ఇదియునూ
నా లక్షణమైయున్నది.
ప్రతి
జీవ మరియు నిర్జీవ పదార్తములోని అణువులలోను ఒక సర్వవ్యాపితమైన శక్తి వున్నదని 1924వ
సంవత్సరంలో నేననుభూతి చెందాను.
ఆశ్చర్యసాగరమున మునిగిపోయాను.
సువిశాల పగటి వెలుగువలె భగవంతుడన్నిటిలోను వ్యాపించి యున్నాడన్న భావన నాకు
కలిగినది.
ఆధ్యాత్మిక
మహోన్నత స్థితులతో పోలిస్తే ఈ విషయములన్నియు లవలేశములు మాత్రమే. వ్యక్తి తానధిగమించిన ఏ స్థితిలోనూ సంతృప్తి
పడరాదు. ఎందుకంటే "ముందుకు యింకా
ముందు" కన్నది అనుభవవాక్కు. విషయములు
గడచి వెళుతూనే వున్నవి. నేను ఆయన కృపవల్ల
ఒక మండలం తర్వాత మొరొకటిగా దాటుకుంటూ ముందుకెళ్ళాను.
వేసవి
సెలవులలో నేను నా సాధనా పద్ధతిలో నుండక, గురువుపై ధ్యాస వీడి
యిస్పెటాకుల జూదములో దిగితిని. మా
గురువర్యులు కలలో గనపడి " నీవు ఈ ఆకులాడటం మానేయాలి" అన్నారు. అది మొదలు ఈనాటి వరకు నేను ఆకులాడనే లేదు.
ధ్యాన
సమయమున నా అంతరంగమున భగవంతుడన్న భావనయే లేకుండ పోయెను. భగవంతుని స్థానమున మా గురువు, గురువొక్కరే స్థానమేర్పరచుకొని యుండిరి.
నాకుమాత్రం భగవంతుడు లేడు, ఉన్నది మా గురువే. ఇతరములేవీ లక్ష్యపెట్టక మాగురువు వ్యక్తపరచిన
స్థితిని చేరువరకు నేను ముందుకు సాగితిని.
మా గురువర్యులు శరీరత్యాగము చేయుటకు ముందు కలలో కనబడి ఈ మాటలతో
నాస్థితినిట్లు వ్యక్తబరచెను. "నేను
నీవై పోయాను, మరి నీవు నేనైపోయావు. ఇప్పుడిక యెవ్వరేగాని నేను నీకంటే అన్యమని
అనలేరు. అట్లే నీవు నాకంటే అన్యమనీ
అనలేరు."
నిజానికది
చాలా సంతోషకరమైన దినం. ఫతేఘడ్‌లో మా
గురువర్యులు ఆధ్యాత్మిక సంవత్సరోత్సవం (భండారా) జరుపుతున్నారు. యేటేటా మామూలుగా జరిపే ఉత్సవమది. ఉన్నట్టుండి మాగురువర్యుల కృపవలన బ్రహ్మములో
లీనమైన స్థితి అనగా మా గురువు పొందిన స్థితితో సమానమైన స్థితిని అనుభవమున
పొందాను. అదేస్థితి మళ్ళీ మూడుమార్లు
కలిగింది. ఇది నేను నిజంగా పొందవలసిన
స్థితియని సంతృప్తితో నిశ్చయించుకొన్నాను.
ఆ నాటి నుండి నన్ను నేను సరిదిద్దుకొని సత్యస్థితినిపొందు
పనినారంభించితిని. నేనాస్థితిలో ఉన్నానన్న,
కేవలం ఊహ కాక నిజంగానే యేదో నాలో జ్ఆగృతి మొదలైంది. నేను అదంతా నిశ్శబ్దంగా మా గురువుకు కూడా
చెప్పకుండా నాపని నేను చేసుకుంటూ పోయాను.
మా
గురువర్యులు మొదటిసారి నాకు ప్రాణాహుతి ప్రసారం చేసిన రోజు నుండే నాలో ఆయన స్మరణ
ఉత్పన్నమైనది. గురువు యొక్క నిరంతర
స్మరణతోపాటు మూడు విషయాలను కలుపుకొని సాధన కొనసాగించాను. అవి నన్ను నేను సర్దుబాటు చేసుకొని మాగురుదేవులు
సాధించుకొన్న లయావస్థ స్థితిని పొందుట మరియు నేనున్న మండలము యొక్క స్థితిని
గుర్తిస్తూ అక్కడేమి జరుగుతున్నదో గమనించి అనుభవమునకు తెచ్చుకొనుట చేయుచుంటిని.
శరీరములోని
అణువులు తయారవ్వడం, వ్యయమైపోవడం వరుసగా జరుగుతూ వుంటుందన్న
విషయాన్ని ఒక శాస్త్రజ్ఞుడుగా నీవు అంగీకరించి తీరాలి. అందువల్ల మనలో ప్రేమ యొక్క వెచ్చదనంతో లాలిస్తే
అవి కూడా తత్‌ప్రభావానికిలోనై మార్పుచెందుతాయి.
అలా ఒకానొక సమయానికి మన ఉనికి యావత్తూ మారిపోతుంది. అదీ వాస్తవార్థంలో మార్పు లేక
సంపూర్ణపరిణామం. పాత అణువుల స్థానంలో
వచ్చి చేరిన క్రొత్త అణువులు ప్రేమ ప్రభావమున ఉత్తేజితమై యుంటాయి గనుక తప్పక ఉత్తమ
స్థాయిలో వుంటాయి. అయినప్పటికీ
ఉనికిలోనున్నామన్న భావనను మనస్సు నుండి తుడిచేయాలి. ఈ యోచన అర్థం చేసుకోవడానికి లేక వివరించడానికి
కష్టమే అయినా, సాధించడానికి లేక పొందడానికి యేమంత కష్టం
కాదు. అందుకు తగిన కార్యరంగమవసరం. మంచి యెరువు మరియు సారవంతమైన రసాయనాలతో సిద్ధపరచిన
పొలములో అందమైన మొక్కలు చాలా బాగా పెరుగుతాయి. కనుక మనల్ని మనం శూన్యంగావించు- కొంటే, భూమి, మొక్క యెదుగుదలకు అనుకూలంగా తయారౌతుంది.
నేను
ముందుగా చెప్పినట్లు హృదయంలో గురువురూపంపై ధ్యానం చేయడం ప్రారంభించాను. మొదట్లో రూపం దృష్టిపథంలో వుండేది. కొంతకాలం గడిచే సరికి, కనబడు
రూపం చెదిరిపోయి, కేవలమొక ప్రతిబింబం, ఒక
ఆకారమాత్రంగా నిలిచి వుండేది. ఇలా వుండగా
నేను గురువర్యుల పూర్తిరూపం యెదురుగా వున్నట్లు తలంచి ధ్యానించేవాడిని. ప్రక్రియలో యిమిడియున్న తదుపరి స్థితులు కూడా
యిలానే వుండేవి. కొంత సాధన తర్వాత రూపము సూక్ష్మముగా
వృద్ధియౌతూ తదుపరి తుడిపేసినట్లవ్వడం మొదలై ఆఖరకు రూపం స్థానంలో కేవలమొక భావం
మాత్రం మిగిలింది. ఎప్పుడైతే అదికూడా
పోతుందో అప్పుడభ్యాసి, రూపం అక్కడున్నదన్న ఊహమాత్రం
గల్గియుండాలి. తర్వాతి దశలో ఆ ఊహకూడా
తుడిచిపెట్టుకపోతే, యిక రెండవదశ మొదలౌతుంది. అయితే యిదంతా సహజసిద్ధంగా దానికై అదే
యేర్పడాలి. అంతేగాని యిచ్ఛాశక్తి
నుపయోగించి బలవంతంగా స్థితిని ఉత్పన్నము చేయయత్నించరాదు. ఈ స్థితిలో అభ్యాసి తన్నుతాను గురువుగా
భావిస్తాడు. ఇక్కడ తిరిగి మళ్ళీ అదే
హెచ్చరిక చేస్తున్నాను. ఇదంతా కూడా
సహజసిద్ధంగా దానికైఅదే కలగాలి గాని బలమైన యిచ్ఛాప్రయోగం వల్ల కాదు. ఈ విధానంలో అభ్యాసి సక్రమంగా ముందుకు సాగితే
దేహభావం అనతికాలంలోనే నశించిపోతుంది. అతడు
దేహాన్ని తనదిగా గాని లేక తన గురునిదిగా గానీ భావించడం మానేస్తాడు. కానీ లీలామాత్రంగా తనదేహం తన గురువుదనే
అతడనుకోవాలి. ఆ భావన కూడా అంతరిస్తే,
యికతడు తనే గురువు (గురువేతాను) అనుకోవాలి. కడకు ఆ ఊహ అంతమైతే యిక ప్రక్రియ మూడవ దశకు
సహజసిద్ధంగా చేరుకుంటుంది. అక్కడ గురువులో
తన ఆత్మ యిమిడి వుంటుంది. ఈ పరిస్థితిలో
అన్ని దశలు సహజసిద్ధంగా పూర్తిగావింప- బడతాయి.
ఆ తర్వాత శరీరభావన గానీ, ఆత్మభావన గానీ వుండవు. అతడిక యెక్కడా లేడు (వుండడు). యింతటితో ప్రయత్నమంతా వాస్తవంగా
పూర్తయిపోయినట్లే. నేనెప్పుడీ ఆఖరు స్థాయి
ధ్యానం ఆత్మపై చేయుచుంటినో అప్పుడు మా గురువర్యులు కలలో గనబడి ఆత్మపై ధ్యానమే
చేయమని చెప్పి, అందుకవసరమైన విధానమును గూడా ఈ విధముగా
తెలిపెను.
"పడకపై
కదలకుండా చక్కగా పడుకొని ఆత్మపై కొద్దిసేపు ధ్యానము చేయుము."
నేను ఈ
పద్ధతిలో ఒక నెల పూర్తి చేసితిని. అధిక
సమయము దీనికే కేటాయించుట కొఱకై నేను ఒక నెల కార్యాలయమునకు సెలవు పెట్టితిని. కేవలం మా గురుదేవులొక్కరి కృపా విశేషముననే నాకీ
ప్రక్రియ సహజసిద్ధముగా తనంతటదే నా మనస్సునకు తట్టి ఒకస్థాయి దాటినంతనే మరోస్థాయికి
అదే దారి చూపుతూ వెళ్ళినది.
మా
గురువర్యులు యెవ్వరినీ తన రూపముపై ధ్యానము చేయమని చెప్పనప్పటికిని, కొందరు ఆయన స్మరణలో వుంటూ, మానేస్తూ వుండినను
నేనొక్కడిని మాత్రం ఆయన రూపంపై ధ్యానం చేయు ప్రక్రియ చేపట్టినందులకు
గర్విస్తున్నాను. ఈ ప్రక్రియను
సంపూర్ణముగా పూర్తిచేసిన తర్వాత నేను శూన్యమునకు శూన్యప్రభావమును వెలికితెచ్చు
యోచనచేసి ఆ పని మొదలు పెట్టినంతనే మా గురువర్యుల కృప నాపై కుండపోతగా వర్షించినది. తదనంతరం మా గురువర్యులు నాకు విశదీకరిస్తూ,
"నీవు తుది ప్రక్రియను ప్రారంభించితివి గనుక నీకు నేను పని
కేటాయింపక తప్పని పరిస్థితి కల్పించితివి, లేకుండిన నేను
మరింత సమయము తీసుకొని యుండవలసినది" అని పల్కెను. అట్లుగాకుండిన నేను యితరులకు శిక్షణనిచ్చు
పనిని చేపట్టలేక పోయియుందును. ఇది తర్వాత
వచ్చునది. నా అభ్యాస కాలమున నేనొక
విచిత్రానుభూతిని పొందితిని. ప్రపంచములోని
ప్రతీది అనగా ఇటుకలు, రాళ్ళు, ఆకులు,
పూలు కూడా దివ్యత్వపు శక్తినంతటా వెదజల్లుచుండెను. ఆప్యాయత, భక్తి యెంత
విశేషముగా నుండెననగా నేను ప్రేమతో ముళ్ళపొదను సైతం కౌగిలించుకొననెంచితిని. ఈ స్థితి దాదాపు ఒక వారముండెను. ఆ తర్వాత మరొక స్థానము తెరువబడెను. దానిని గురించి నా "అనంతమువైపు" అను
పుస్తకమున వివరముగా చర్చించితిని. ఇంకా
యెన్నో స్థితులు తర్వాత గల్గినవి. అవన్నీ
ఉత్తరముల ద్వారా మా గురువర్యులకు తెలియజేసితిని.
ఆయనగూడా కొన్ని ఉత్తరములకు జవాబులు వ్రాసెను.
1931 ఆగష్టు
15 ఉదయం నా బహిరంతరము- లంతటా గొప్ప శక్తి నిండియున్నట్లనుభూతి జెందితిని. అది నా గురుదేవులు ప్రసాదించినదని నా అంతర్వాణి
నిర్థారించి చెప్పినది. 1931 ఆగష్టు 14
రాత్రి మా గురువర్యులు మహాసమాధిన ప్రవేశించిరి (శరీరము విడిచిరి) కానీ నాకావిషయమప్పటికి తెలియలేదు. ఇది గొప్ప సామర్థ్యముగల మహనీయులు తమ శక్తిని
మరొకరికి బదలీచేయు సాధారణ ప్రక్రియ. ఇది
వాస్తవమునకు గురువు నాలో ఐక్యమైన సంఘటన.
సాయంత్రం
నేను కార్యాలయం నుండి తిరిగి రాగానే మా పినతండ్రి కూతురు, మా
గురువుగారు శరీరము వదిలిన దుర్వార్త తెలిపినది.
నేను నా స్థితులను గూర్చి మా గురువుకు వ్రాస్తూవుండేవాడిని. దినచర్య వ్రాసి ఉంచుకోవడంవల్ల గలిగే ప్రయోజన-
మేమంటే అభ్యాసి దాని విషయమై జ్ఆగరూకుడై వుంటాడు.
అతని అనుభవములు వృద్ధియౌతాయి.
ఎందుకంటే అతనిలో యేకాగ్రత వుంటుంది.
విషయము
బహిరంగ పరచుటకు యేకాగ్రత ఒక దివ్యసాధనము. జనులు
యేకాగ్రత లేకుంటే ధ్యానము వృథా అనుకుంటారు. యేకాగ్రతవల్ల భగవంతుడు లభ్యము
కానేకాడని నేను గట్టిగా నొక్కి వక్కాణిస్తున్నాను. ఎందుకంటే యేకాగ్రతలో నీవు ఒకే బిందువుపై దృష్టి
నిలిపి వుంటావు. అంతేగానీ దేనికోసం యెదురు
చూడవు. అదే ధ్యానంలోనైతే నీవు దేనికోసమో యెదురు
చూస్తుంటావు. అదే దైవం. నిరీక్షణ ఒక నిరంతర ప్రయత్నం కావడం వల్ల అది
సహజసిద్ధంగా ఆకర్షణనుత్పన్నం చేస్తుంది.
ఇది యెంతవరకు వృద్ధికాబడుతుందంటే నీవు దాని ప్రభావమున ఒక ఆత్మను నీవద్దకు
పిలువవచ్చును. ఆకర్షణ శిఖరస్థాయికి
చేరిందంటే అతి గొప్ప ఆత్మయైనా రానని తిరస్కరింపజ్ఆలదు.
మనిషి
శక్తి మనిషికి తెలియదు. కారణం భగవత్‌తత్త్వము
లోపించడమే. దీనికి వ్యతిరిక్తముగా యేదో
వుండి వుంటుంది. తుదకు మొత్తము దేహము
దైవీయమగునంత దాకా మనము దైవీయతను పెంపొందించుకొనవలసి యున్నది. సంక్షిప్తంగా చెప్పాలంటే యింద్రియములు మొత్తం
తమ అసలు (తొల్లింటి) దశకు మరలవలసి వుంది.
ఇంకోమాటలో చెప్పాలంటే పైస్థాయి కేంద్రములు అథమస్థాయి కేంద్రములను తమ
అధీనములోనికి తెచ్చుకొని వాటిలో పనిచేయడం ప్రారంభిస్తాయి. అంతేకాదు దివ్యకేంద్రములు పైస్థాయి కేంద్రమును
తమ అధీనంలోకి తీసుకుంటాయి. యిప్పుడు
లెక్కప్రకారం అధమ కేంద్రములు, పై కేంద్రముల అధీనంలోను అట్లే
పై కేంద్రములు దివ్యకేంద్రముల అధీనమునను వుండటముతో, అథమ
కేంద్రములు సైతం పైకేంద్రములతో కలసి దివ్యకేంద్రముల అధీనమైపోతాయి. అప్పుడు దివ్యత్వం సర్వాన్ని కలుపుకొని అన్ని
వివరములతో తెలిసి పనిచేయడం ప్రారంభిస్తుంది.
యేదోవిధంగా
సమర్థుడైన గురువు లభిస్తే యివన్నీ సులువుగా సాధింప వీలౌతుంది. ఎవరైతే ప్రాణాహుతి ప్రక్రియ ద్వారా అభ్యాసిలో
పూర్తి మార్పును తేగలరో వారే సమర్థగురువులు.
గురువు స్వతహాగా దైవత్వంలో లీనమై యుండవలెను. అతడే నిజమైన గురువు. అటువంటి గురువు లభ్యమైతే యేండ్లు వృథాగాకుండా
కలిసి వస్తాయి. జనులు అట్టి గురువు
లభించడం కష్టమనుకుంటారు. కానీ యోగ్యుడైన
శిష్యుడు దొరకడం కూడా అంతే కష్టమని నేను చెబుతున్నాను.
ఆధ్యాత్మిక
శిక్షణ కొరకు గురువు నాశ్రయించినపుడు, కొంతైనా ఆయన నాకుపయోగ
పడతాడని సామాన్యంగా విశ్వసిస్తాము.
విశ్వాసము ఎప్పుడైతే నీ అనుభవమున ప్రతిఫలిస్తుందో అప్పుడు శ్రద్ధ
పెరుగుతుంది. వినయము శిఖరాగ్రము నందుకొంటే
అది ఆత్మార్పణగా పరిణమిస్తుంది.
ఆత్మసాక్షాత్కారమే ధ్యేయముగా గల వ్యక్తుల మస్సులలో ఆత్మార్పణమెలా సాధ్యమన్న
ప్రశ్న సాధారణంగా వుంటుంది. ఆత్మార్పణమంటే
‘నేను’ లేకపోవడమే లేక మరోమాటలో చెప్పాలంటే ‘నేను’ అన్న భావనను తుడిచేయడమే. ఇందులకు సులభమైన మార్గము బాంధవ్యము మరియు భక్తి
సర్వదా గలిగి భగవంతునిపై ఆధారపడడమే. నీవు
ఆత్మార్పణకు ప్రయత్నిస్తే ‘నేను’ వుంటుంది.
అది వృధ్ధియై మరింత బలపడుతుంది.
ఇట్లయితే నీటిలోనికి దుమికే ప్రయత్నంలో నిప్పుల్లో దుమికేస్తారు.
ఆత్మార్పణమంటే
యేమోకాదు, తన్నుతాను సంపూర్ణముగా గురువు యిచ్ఛకు
సమర్పించుకొని, స్వార్థచింతన యేమాత్రము లేకుండు ఒక స్థితి
యది. శాశ్వతముగా ఈ స్థితిలో వుంటే అది శూన్యత్వస్థితి
ప్రారంభమునకు దారితీస్తుంది. మనమెప్పుడు
గొప్ప మహనీయునికి ఆత్మార్పణమై పోతామో అప్పుడు ఆయన నుండి మహోన్నత దివ్యశక్తిని
నిరంతరంగా మన మాకర్షించ మొదలెడుతాము. ఈ
స్థితిలో మనిషి తన గురువర్యుల ఇచ్ఛ యెలా వుంటే అలానే ఆలోచిస్తాడు. ఈ ప్రపంచంలో
తనదని యేదీ భావించడు. అయితే ప్రతీదీ
గురువర్యులు ప్రసాదించిన పవిత్ర నిధిగా భావిస్తాడు. చేసే ప్రతిపని తన గురువు ఆజ్ఞగా
భావిస్తాడు. అతడు సంపూర్ణముగా గురువు యిచ్ఛకు
దాసుడై వర్తిస్తాడు.
ఆత్మ
సమర్పణము అంత సులభముగా సాధించనగు విషయము కాదు.
అది సర్వేంద్రియములు, సర్వశక్తులు సంపూర్ణముగా
శూన్యము గావింపబడిన తర్వాత మొదలగును.
అందుకొఱకు మనము ప్రాధమిక భక్తిసూత్రములను పాటిస్తూ వెళ్ళుదుము. గురువును మహనీయునిగా తలచి ఆయనకు
విధేయులమగుదుము. భక్తి, విశ్వాసము మరియు గౌరవభావముతో వారిని ప్రేమిస్తూ యెట్లయిననూ ఆయన ధ్యాస
మనవైపు మరలు- నట్లును, మనమాయన కృపకు పాత్రులగునట్లును
యత్నింతుము.
నేను మా
గురుసన్నిధికి వెళ్ళుచున్న కాలములో జనులు దైవసాక్షాత్కారము కొఱకు ఆయన వద్దకు
వచ్చెడివారు. ఇప్పుడు నా దగ్గరకు వచ్చెడి
వారిలో చాలామంది శాంతిని మాత్రమే వాంఛిస్తున్నారు. కాలమింతటి మార్పును దెచ్చినది. ప్రతిచోట కలత వ్యాపించియున్నది. ప్రతి ఒక్కరూ శాంతి కొఱకు తపించుచున్నారు. వచ్చిన చిక్కేమిటంటే యెవ్వరికీ శాంతి అంటే
యేమిటో తెలియదు. ప్రతిరోజూ పూజచేసే వాడు
ఒకరోజు యేదో అనివార్య కారణంవల్ల ఉదయం పూజ వదలవలసి వచ్చిందనుకోండి, అతడు కలత చెందుతాడు. ఆలాకాక ఆ
పూజేదో చేసేస్తే అతనికి సంతృప్తినిస్తుంది. జనులు సంతృప్తినే శాంతిగా
భావిస్తున్నారు. కనుక వారు శాంతిగా కాదు,
తృప్తిగా వున్నారు.
వాస్తవమున అశాంతి, శాంతి నుండి లేక విశ్రాంతి నుండే
ఉద్భవిస్తుంది. అది దివ్యత్వము వైపుకు
తొలచుకుంటూ (రంధ్రము చేసుకొని) వెళుతుంది.
శాంతి అనునది మనమాశించు విషయము మరి అందులకు మనముపయోగించు సాధనము అశాంతి
(కలత). కలత నుండి మనకు లభించునది
శాంతి. కలత (తపన) దైవత్వమువైపునకు మనలను
పురోగమింపజేస్తుంది.
శాంతిస్థితి
అణగారి వుంటుంది. అదే సంతృప్తిస్థితి
చైతన్యవంతమై వుంటుంది. శాంతి తన అంతిమ
స్థితిలో శాంతిరహిత శాంతి యౌతుంది. మరి
సంతృప్తి తన అంతిమస్థితిలో స్థూలము మరియు భారము ఔతుంది. శాంతి భగవంతుని నిశ్చల (నిశ్శబ్ద) స్థితిని
స్పృజిస్తుంది. సంతృప్తి మాత్రం భగవంతుని
చైతన్యభాగమును తాకుతుంది. నిజమైన శాంతిని
చేరాలంటే చైతన్యముండవలసిందే. సంతృప్తి
మానవుడు చేసుకొన్నది, అదే శాంతి మాత్రము భగవత్
ప్రసాదితము. నా అభ్యాస కాలమంతయూ అందరూ అర్రులుచాచే
శాంతి ప్రశాంతతకు మారు బాధ, కలతలతోనే గడచిపోయినది.
భగవంతుడు
తన్ను దర్శించిన వానిని ప్రేమించును, కానీ వాని కల్లంత
దురమున నుండిపోవును. అంటే భక్తి పరిధిలో
తను యెప్పుడూ వుంటూ తన మానవత్వపు యెఱుక సంపూర్ణముగా గలిగి హృదయములో భగవత్‌స్మరణను
సజీవముగా ఉంచుకొనవలెనని గ్రహించవలెను.
జీవితములో
బాధలు కష్టములకు వాటికున్న స్థానము వాటికున్నది.
ఇందులో ప్రతి ఒక్కరికి వారి వాటా వారికున్నది. మహోన్నతులైన ఋషులకు సైతం ఇందులో వాటా యున్నది. ఈ బాధలే ప్రపంచములో లేకుండిన మనిషి అలోచన,
వ్యధలు వ్యతిరిక్త (ఆనంద) దిశలో వృద్ధియై మహోన్నతస్థాయి నందుకొని
యుండెడిదికాదు. అందువల్ల మనిషిక్లేశములు,
అతని సముద్ధరణకు మార్గమన్వేషించు యత్నమునకు ఊతమిచ్చినవి. మరో మాటలో చెప్పాలంటే అవి ఉత్తేజకములుగా
పనిచేసినవి. బొగ్గును వజ్రముగా
మార్చవచ్చునని మనకు తెలియును. అనగా
కూర్పుచేయుట యందు మార్పుచేయుటచే పదార్తములకు నూతనరూపమివ్వవచ్చును. సరియైన కూర్పు జరిగితే ఒక పదార్తము ఉపయోగకరంగాను,
మనోహరంగాను తయారవుతుంది.
అదే కూర్పు తప్పుగా జరిగితే బాధాకరంగాను మరియు వికారంగాను ఔతుంది. కష్టముల విషయము కూడా యింతే. మన మనస్సు అనవసరములపై గట్టిగా తగుల్కొనిపోవడము
వలన విచక్షణాజ్ఞానము విపరీతముగా మసకబారిపోయి మన జీవితములోని అనేక విలువైన
విషయములను గుర్తించుటలో పూర్తిగా అంధులమైపోతిమి.
వాస్తవానికి జీవితములో ప్రతిదీ తుదకు మన మేలుకే యేర్పడియున్నది. మనము వాటిని సరైన పద్ధతిలో ఉపయోగించుకొనుట
మాత్రము నేర్వవలసి యున్నది. తద్వారా
వాటిని మనకనుకూలముగా త్రిప్పుకొన వచ్చును.
కానీ దురదృష్టవశాత్తు తప్పుదారి పట్టిన మానసిక ప్రవృత్తుల మూలమున మనందరము
చెడుమార్గము నవలంభించి వెళుచున్నాము.
మనస్సు యొక్క అథమసూచనలకనుగుణంగా మనమన్నిటిని అపరిశుద్ధ రూపమున
జూచుచున్నాము. ప్రతిదీ మన దృష్టికి
సాంద్రముగాను, స్థూలముగాను
వృద్ధియగుచున్నట్లగుపించుచున్నది. హృదయము,
మెదడు ఈ ప్రభావముననే సంకుచితమై అదే దోషమునకు లోనైనవి. పొరలు ఒకదానిపై ఒకటి చుట్టుకొనిపోయి
సత్యతత్త్వము కనుమరుగై పోయినది.
యాదృచ్ఛికముగా కాలము కలిసివచ్చి, సత్యత్త్వపు శక్తి
హృదయములోనికి దూసుకవచ్చి, మనకు జ్ఆగృతి గల్గించినంతవరకు ఈ
తీరు మారదు. అట్టి సమయమాసన్నమైనపుడు
మాత్రమే మనిషి వాస్తవ విలువలు గుర్తెరిగి తన వక్రతజెందిన స్థితికి చింతించి
సరిదిద్దుకొను పనికి పూనుకొనును.
తీవ్రవాంఛ
మనిషికేమంత ముఖ్యవిషయం కాదు. మత
గ్రంథములన్నీ యిట్టి తీవ్ర మనోభావములను అనేక విధములుగా విశ్లేషించినవి కానీ దాని
నిజస్వరూపము వేరు. క్షోభ సమయమున కలిగిన
మొదటి కుదుపే ఈ తీవ్రవాంఛ. సృష్టి కవసరమగు
సమస్త శక్తులను యిది తన గర్భమున దాల్చియున్నది.
ఇది మహోన్నత బుద్ధి వికాసమునుండి బయల్వెడలినది. ఎందుకంటే అది భగవదిచ్ఛను చైతన్య పరచిన కారణము,
అందులో మన వాటా మనకూ దక్కినది.
కానీ దాని సౌందర్యము లుప్తమైనది.
కారణము వివిధ కోణముల నుండి "అహం" భావము దీనిపై
దృష్టిసారించినది. మహోన్నత బుద్ధివికాసము
యొక్క మరియు తీవ్రవాంఛ యొక్క కేంద్రమూ ఒక్కటే.
దీన్ని సమూలంగా యేవిధానం వల్లగాని, పద్ధతివల్ల గాని
నిర్మూలించలేము. ఎందుకంటే యిది మనిషి
కవసరమైన కార్యములకుత్తేజము నిస్తుంది.
ఆధ్యాత్మికతవైపు శక్తివంతమైన త్రోపు కలగజేయకుంటే మనిషి ఆధ్యాత్మిక జీవనమున
ప్రవేశింపలేడు.
సాయంత్రం
అకారణంగా నేను ఆగ్రహానికి గురయ్యాను. అలా
ఓ గంట గడచింది. కోపము మరియు తీవ్రవాంఛ
భగవంతుడు సృష్టించినవి. లోభము, దురాశ, మోహము, తగని వ్యామోహము
మనిషి సృష్టించినవి. భగవంతుని సృష్టిని
యెవ్వరూ నిర్మూలించలేరు. వాటిని మనము
కేవలము మార్పుచేసుకొనవచ్చును. నీ సృష్టిని
మాత్రము నశింపజేయుము.
స్ఠాయిరహిత
స్థితి అనగా శూన్యత్వమంతటి స్థితి నుండి తేలికపాటి ప్రాణాహుతి ప్రసారము అభ్యాసిపై
మహత్తర ప్రభావం చూపుతుందని నా అనుభవంద్వారా నేను నిర్ధారించుకొంటిని. బలమైన తీవ్ర శక్తివంతమగు ప్రాణాహుతి ప్రసారము
ఉత్తేజితము, ఉద్వేగముతోగూడి ప్రయోగిస్తే అది అంత
ప్రతిభావంతంగా వుండదు. సత్యతత్త్వము
శక్త్యాతీతము, ఉద్వేగాతీతము లేక ఉష్ణాతీతము. ఇది ఉష్ణము ఉనికి లోనికి రానప్పుడు వ్యాప్తిలో
నున్న స్థితికి సమానము. ఇది భావాతీతము,
జ్ఞానాతీతము. అదీ
సత్యతత్త్వము యొక్క నిజార్థము.
నేను
మరణిస్తున్నట్లు కలగంటిని. అప్పుడు నేను
సంపూర్ణ ప్రశాంతత ననుభవించితిని. ఆ రోజంతా
ఒక ఆహ్లాదకర స్థితిలో నుంటిని. మరణస్థితి
అన్ని చక్రములలోను మొదలౌతుంది. అది
అనుభవమునకు వచ్చిన దానికంటే దృఢంగా వుంటుంది. అంటే అభ్యాసి తన ప్రత్యేకఉనికిని కోల్పోయి
కేంద్రస్థితిలో లీనమై వుంటాడు.
అపారమైన
శాంతిని బహుఃశా ‘జ్ఞాన’ మన్న పదంతో వ్యక్తీకరిస్తారనుకుంటాను. శబ్ద ప్రవాహమును బట్టి గమనిస్తే యేదో మూలంలోని
అక్షరం నుండి బయల్వెడలివచ్చి జ్ఞానం అన్న అక్షరంవద్ద ఆగినట్లున్నది. మూలంలో (మొదట్లో) యేమున్నదో అదే ఆఖరున కూడా
వుండవలెనని, యిది తెలియజేయుచున్నది. అనంతము యొక్క జ్ఞానముతో నీవు అనుబంధించుకొని
యున్నట్లయిన అందలి వివిధస్థితుల కనుగుణంగా ప్రకటితమైన సత్యతత్త్వమును
బహిర్గతమొనరుస్తావు. కనుక జ్ఞానము,
వ్యక్తి యెటువంటివాడు, అతనిలో యేమున్నది,
అతడేమైయుండెను అను విషయములు తెలుసుకొనుటకు మాత్రమే ఉపయోగ పడునది
కాదు. దైవీయ స్థితి గలిగి సత్యతత్త్వమును
వివరింపగల్గినదే జ్ఞానము. సత్యతత్త్వ
ప్రభావమున ఉత్పన్నమైన కొన్ని కదలికలతో కూర్చబడిన ఒక నృత్యమే జ్ఞానము. దీనిలో వివిధ స్థాయిలున్నవి. వాటిని గూర్చి నేను ‘అనంతమువైపు’ అను
పుస్తకములో చర్చింతిని. సంక్షిప్తంగా
చెప్పాలంటే జ్ఞానమనగా తెలిసికొనుటకాదు, పొందడం. ఇది విషయ పరిజ్ఞానము మరియు చైతన్యము ఒక్కటైన
స్థితి. భగవంతుడు తన రాజ్యములో
ప్రదర్శించిన దానిని మనము దైవశక్తిచేత మన రాజ్యమున ప్రదర్శింప మొదలిడుదుము.
వాస్తవమున
దైవము తప్ప మరేమీ మిగిలి యుండని ప్రళయస్థితియే మహోన్నత స్థితియని చెప్పనగును. ఆయన పరిధిలో ఆయన సంపూర్ణుడు. మనము మన పరిధిలో సంపూర్ణులమగుదుము. ఆయన సంపూర్ణుడు. అయన మొత్తము మీద సంపూర్ణుడు. జ్ఞానము పైపైన ఈదులాడుతూ వుంటుంది. సత్యము అట్టడుగున మూలములో పనిచేస్తుంటుంది. కనుక సత్యము మాత్రమే జ్ఞానము. కనుక మనమెప్పుడు సత్యతత్త్వమును పొందుతామో
అప్పుడు మనకది తెలియవస్తుంది. సత్యము,
సత్యతత్త్వమైనప్పుడది జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. బహిరంతరములందున్న సత్యతత్త్వమే జ్ఞానము.
ఆకాశమనునది
స్థలము (భూమా) మరి అవకాశమనునది కాలము.
విశాల దృక్పథమున రెండూ వేరువేరు.
కాలము స్థలము (భూమా) యొక్క సృష్టి.
అది ఆకాశము యొక్క స్థూలస్థితిగా గైకొనవచ్చును. వాస్తవమునకు ఈ విశ్వము, కాలము
లేక అవకాశము యొక్క రూపాంతరమే. అట్లే భగవంతుడు
ఆకాశము లేక భూమా యొక్క రూపాంతరము. లోపలి
వలయము ఆవలి విశ్వసృష్టికి దారి తీసినది.
రెండింటి మధ్యస్థానము సృష్టికి పట్టిన వ్యవధి. బయటిపొర మిగిలిన మధ్యభాగములతోసహా మహాప్రళయ
సమయమున మొత్తం లీనమైపోతే యిక మిగిలేది కేవలం ‘ఆకాశము’ లేక ‘భూమా’యే. అంటే ఉనికి ఆకాశంగా మారిపోయింది. మరో విధంగా చెప్పాలంటే ఉనికే ఆకాశము.
జ్ఞానము
మొదడుతో మాత్రమే సాధింపదగినది. మరి
సాక్షాత్కారము ఆత్మయొక్క జ్ఆగృతి. కనుక
జ్ఞానపరిధికందనిది. నా భావనలో ఈ ప్రపంచము
ప్రకృతియొక్క క్రీడామైదానము. ఇక్కడ
ప్రతియొక్కరూ పరిపూర్ణతకొఱకు ప్రాకులాడుతున్నారు.
కానీ వారి నిజమైనఆత్మ ప్రాపంచిక వ్యవహారముల నిర్వహిస్తున్నదన్న విషయాన్ని
మరిచిపోతున్నారు. సంపూర్ణత అన్న విషయమై
సాధుపుంగవులు చర్చించవలసి యున్నది. అయితే
నా మనస్సునకది చాలా సులువైనదిగా తోచుచున్నది.
ఆస్థితిలో మనిషి దాదాపు పూర్ణ సమస్థితిలో వుంటాడు. అతని ఇహలోక మరియు ఉత్తమలోక వ్యవహారములు
ఒకదానికొకటి సమతలంగా సాగుతాయి. అతడు ఈ
లోకానికి, ఉత్తమలోకానికి యేతేడా గమనించడు. ఆధ్యాత్మికత వైపు సంపూర్ణంగా, ప్రాపంచికం వైపు అసంపూర్ణంగా వుంటే దాన్ని నేను వంకర సంపూర్ణత అంటాను.
మనిషి
సంపూర్ణ మానవుడుగా తయారగుటకు ప్రయత్నించవలెను.
భగవంతుడగుటకు కాదు.
మనమిక్కడకొచ్చినది భగవత్‌సృష్టిని పాడుచేయుటకు కాదు, దానిని
భగవదాజ్ఞలకు అనుకూలముగ నుంచుటకే వచ్చితిమి.
ప్రాణాహుతి యనునది భగవదీయ శక్తిని సద్వినియోగపరచి మనిషిలో మార్పు
తెచ్చుటకైయున్నది. మేధావులు చెప్పినట్లు
మనిషి సాంఘికపశువు. అంటే పశుత్వము మనిషిలో
వున్నది. అతడు ఉత్తమపశువుగాను, ఉత్తమపశుత్వం నుండి మానవునిగాను, మానవుని నుండి
మానవాతీతునిగాను మారుతాడు. ఇదీ
పరిణామమంటే. మానసిక ప్రవృత్తులు
మార్పుచేయబడి, అతడు ప్రతి పనిని క్రమ పద్ధతిలో చేయడం
ప్రారంభిస్తాడు. అతడు సామర్థ్యములను
సక్రమముగా ఉపయోగించుకొనుటను నేర్చుకొంటాడు.
మనస్సు క్రమశిక్షణతో వ్యవహరించి తుదకు భగవదాజ్ఞానుగుణంగా నడచుకుంటాడు. ప్రాణాహుతి అంతటి మహత్తర
ఫలితములనిస్తుంది. ఇట్టి అంతిమ ప్రయోజనం
కొఱకు ఉపయోగించు సాధనమిది. ప్రాణాహుతి
ప్రసారంద్వారా పురోగమన దశలన్నింటిలోకి దైవత్వము తొంగిచూచి, తుదకు
దైవత్వముతో నిండి నిబిడీకృతమౌతుంది.
నిరంతరస్మరణ
వాస్తవమునకు ధ్యాన సాధనయొక్క సహజపురోభివృద్ధి.
అభ్యాసి ధ్యానవస్తువునందు, నిరంతర స్మరణయందు
భక్తిగల్గి యుండుటద్వారా ప్రతిభను పొందుతాడు.
అప్పుడు అభ్యాసము శుష్కముగానుండక తేటదెల్లముగా నుండి సర్వమును
లీనమొనర్చుకొను పనిలో నిమగ్నమగును. ప్రేమ,
భక్తియను అగ్ని ఒక్కటే చిత్తు, చిదుగులను
కాల్చివైచి, చిట్టెము నుండి బంగారమును వెలికితీయును. ఏమైనప్పటికిని ప్రేమాగ్నికి మూడుదశలున్నవి.
మొదటి
దశలో అగ్ని అణగారియుండి గాఢమైనపొగ పైకెగజిమ్మును.
రెండవ
దశలో అప్పుడప్పుడు అందుండి అగ్ని మిణుగురులు బయల్వెడలును.
ఇక
ఆఖరుదశలో సర్వమును దహించి క్షణములో బూడిదగా మార్చు వెలుగులతో విరాజిల్లు జ్వాలలు
పైకెగయును.
మొదటి
రెండు స్థాయిలు బయటపెట్టబడినట్టి, గాలికి మండే
పదార్థాలతత్త్వంపై ఆధారపడియున్నది. కాలడానికి
అడ్డుపడే స్థూలత్వం (తడి) లోలోపల రగిలిన వేడిధాటికి తొలగింపబడినదై ఆఖరుచర్య
పూర్తిశక్తితో ప్రారంభింపబడుతుంది. కానీ
విద్యుత్‌అగ్ని కూడా వున్నది. అది మొదటి
రెండు దశలను తప్పించి వెలుగుతుంది. అది
ఒకేసారి మూడవదశలో కనబడుతుంది. దానికి పొగ,
ఆవిరి అడ్డురావు. నీవు
అటువంటి అగ్నిని గనుక అంతరంగంలో రగుల్గొల్ప- గలిగితే ఇక నీ పురోభివృద్ధి అమిత
వేగంగా సాగుతుంది.
కొన్ని
సంవత్సరాల సాధన తర్వాత నీ ధ్యానము లోలోతులలో వృద్ధియైనప్పుడు యోచన ఉన్నతోన్నత
స్థితులకు దారితీస్తుంది. ఆ ప్రయాణంలో
ఒకానొక బిందువు వద్దకు చేరినపుడు ‘నేనేశక్తిని’ అని అనిపిస్తుంది. ఇది ‘సురత్’, ఇది కాసింత
భగవదీయతతో సంబంధమేర్పరచుకోగానే కలిగేస్థితి.
ఇది తన స్వగుణాన్ని వీడి దైవీయగుణములు పొందుతుంది. అక్కడ వ్యక్తి ‘అహంబ్రహ్మస్మి’ యని
భావిస్తాడు. నేను ‘సురత్’ను ఈ విధంగా
వివరిస్తాను. ఎప్పుడు యోచన ఆత్మను తాకుతుందో
అప్పుడు మూడవ పదార్థం ఒక వెలుగుమిణుగురుగా ఉత్పన్నమౌతుంది. అదే ‘సురత్’ అని పిలువబడుతుంది. అది మహోన్నతానికి దారితీస్తుంది. ఇక ఆలోచనలు వెనకబడిపోతాయి. అవి ఈ దివ్యపరిధిలో యిక మనజ్ఆలవు.
కొంతకాలం
తర్వాత ‘సురత్’ యెప్పుడు అడుగులు ముందుకేస్తుందో అప్పుడది దైవీయ లక్షణములను
తీసుకొస్తుంది. ఇక ‘అహం’ యెంత సహజంగా
తుడిచివేయబడుతుందంటే, వ్యక్తి యింకొంత ముందుకు వెళ్ళితే
అక్కడ నుండి వేసే ప్రతిఅడుగు మరింత దైవత్వాన్ని అతని పరం చేస్తూపోతుంది. కనుక అతని యోచనలో దైవత్వముంటుంది. అప్పుడతడు గొప్పతనాన్ని అనుభవానికి తెచ్చుకొంటాడు. అతని మనస్సుకూడా అలానే యోచించడానికి శిక్షణ పొంది
వుంటుంది. అక్కడతడు అంతా ఆయన (బ్రహ్మం)
నుండే అను భావనను పెంపొందించుకొని వుంటాడు.
ఒక్కడుగు వెనక్కేస్తే భగవంతుని లక్షణములోని ఒక భాగం అతనికి
తెలియజేయబడుతుంది. అదే ‘అంతా బ్రహ్మమయం’
భావన. సత్యత్వపూరణము మరియు దానికతీతమై
యుండుటకు మధ్యస్థమైన స్థితి ప్రభావమిది.
సర్వము భగవంతుని నుండే వెలువడినదనే భావన వ్యక్తికి కలుగుతుంది.
ఈ
స్థితులన్నీ దాటుకున్న తర్వాత అభ్యాసి పైచెప్పిన భావనలకంటే తాను పైనున్నానని
భావిస్తాడు. ఆ విధంగా బ్రహ్మము యొక్క
మరియు తన యొక్క నిజగుణాలుదయిస్తాయి. ఇంకా
ముందుకు పోతే అంతా నిశ్శబ్దమైపోతుంది మరియు నిశ్శబ్దం కూడ నిశ్శబ్దమైపోతుంది.
ఓ హృదయ
వేదనా! నీవైన సత్యమును చెప్పుము. ఈ
చిక్కేమిటో నాకైతే అర్థం కావడంలేదు.
సత్యతత్త్వమునకు
పట్టిన త్రుప్పే ఆలోచన. మాటలకు మూలాధారము
ఆలోచనే. ఆలోచనలు స్వచ్ఛమైనవయితే, పదాలు స్వచ్ఛమైనవి, ప్రతిభావంతమైనవి అవుతాయి.
భక్తి:-
నేనేమి చేయుచున్నానో యెందుకు చేయుచున్నానో వాస్తవమెఱుంగని స్థితిలో మైమరచి దైవీయ
కెరటములో తన్నుతాను కోల్పోవుటే భక్తి.
మహోన్నతమైన భక్తియనగా తనను గురించిన, తన విధానమును
గురించిన యెఱుకలేని స్థితిలో నుండుటే.
రంగు,
రుచి, వాసనా లేకపోవడంలోనే అసలైన ఆధ్యాత్మికత
వున్నది. ఎందుకంటే భగవంతునిలో గూడా యివేవీ
లేవు. మన పద్ధతిలో వ్యక్తిని సత్యతత్త్వము
వరకు చేర్చు ప్రయత్నము జరుగుచున్నది. ఏ
రంగు వున్నా అందులో స్వచ్ఛత లేనట్లే. నీకీ
విషయాలన్నీ తెలుసు.
సాక్షాత్కారమొక
మూగస్థితి, అంటే వ్యక్తీకరణ కతీతమైనస్థితి. అది ఉప్పదనం తీసివేయబడిన ఒక ఉప్పుగల్లు.
శ్రద్ధ
దానికై అదే ఒక ఉనికి లేక ఆధారము. దాని
పైనుండే సాక్షత్కారము మొదలౌతుంది. శ్రద్ధ
ఒక విడదీయరాని బంధము. అది ఒకసారి
యేర్పడితే ఇక యెన్నటికీ విడిపోదు. శ్రద్ధ
వృద్ధిపరచుకొనని అభ్యాసి యెన్నటికీ పురోగమించజ్ఆలడు.
ఎంతకాలము
మనము మతపరిధికి లోబడి వుందుమో అంతవరకు మనకు మతపరమైన భగవంతుడే దృష్టిపదంలో
నుండును. మనము యిదో, అదో, యేదో ఒక దృక్పథమున నుండిపోదుము. మహోన్నత ఆధ్యాత్మికస్థితి నందుకొనవలెనన్న,
మనము మతపరిధులను దాటిపోకతప్పదు.
వాస్తవమునకు మతమెక్కడ అంతమగునో అక్కడే ఆధ్యాత్మికత మొదలగును. స్వేచ్ఛామార్గమున పయనింపజేయుటకు వ్యక్తిని
సంసిద్ధపరచు ప్రాధమికస్థాయి మాత్రమే మతము.
మతము యొక్క అంతమే ఆధ్యాత్మికతకు మొదలు.
ఆధ్యాత్మికత అంతమే సత్యతత్త్వారంభము.
సత్యతత్త్వపు అంతమే నిజమైన ఆనందము.
ఎప్పుడది కూడా పోతుందో అప్పుడే మనము గమ్యము చేరుదుము. అదే అత్యున్నతస్థాయి. అద్దానిని మాటలలో వివరింప నశక్యము.
భగవంతుడు ఒక మతమునకు తెగకు కట్టుబడి లేడు. ఆయన ఒక విధమైన రూపములందు, ఆచారములందు లేడు. అంతేగాక ఆయనను
మతగ్రంథముల పుటల నుండి కూడా వెతికి తీయలేము.
ఆయనను మన హృదయాంతరముననే కనుగొనవలెను.
నిజానికి భగవంతుడు అతి సరళుడు, నిరాడంబరుడు. ఆయన స్థూల విగ్రహములలో లేడు. ఆయనలో యేవిధమైన స్థూలత్వము లేదు. కనుక భగవంతుడు సరళుడు మరియు అత్యంతసూక్ష్ముడు. వాస్తవానికి ఆ అనంతతత్త్వము యొక్క సరళత మరియు
పవిత్రతే దానికొక అడ్డుతెరయైనది.
మనిషి
యొక్క నిజమైన ఘనతను నిర్ధారించుటకు అతడు ఆధ్యాత్మికరంగమున ప్రత్యక్షముగా పొందిన
స్థితులనే గణనలోనికి తీసుకొనవలెను. అతనిలో
మనము తపనతో ఆశిస్తున్న సత్యమును వెదికి కనుగొనవలెను. ఆ విధముగా మనము ఆయనతో సంతృప్తిజెందిన యెడల ఆయనకొఱకు
అంతరంగమున మనకొక ఆకర్షణ కలుగనారంభించును.
మన ఆలోచనలో ఆయన మనలను తీర్చిదిద్ది మనగమ్యము యొక్క రూపకల్పన చేయగల
సమర్థుడని భావింతుము. ఈ భావన క్రమంగా
వృద్ధియై శ్రద్ధగామారి మనమాయనను ప్రేమింపమొదలిడుదుము. ఆయన వ్యక్తిత్వమును గౌరవించి ఆయన దృక్పథములను
విధేయతతో స్వీకరింతుము. మరియు ఆయన
మార్గదర్శకత్వమున పురోగమింతుము. మనము
సాధనలో సాధించిన అనుభవములు మనలను మరింత సంతృప్తిపరచును. యింకా ఆయన అసాధారణ సామర్థ్యములను గుర్తించి
ఆయననొక మహనీయునిగా చూడనారంభింతుము.
ఇప్పుడు మనశ్రద్ధ మన ఆధ్యాత్మిక పురోగమనమునకెంతో సహాయపడును. ఇది మన సందేహములు, అనిశ్చితస్థితులనెడు
మేఘములను చెదరగొట్టి మార్గములోని కష్టములను అడ్డంకులను తొలగించివేయును.
శ్రద్ధ
వాస్తవమునకు ఆధ్యాత్మికనిర్మాణము మొత్తమునకు ఆధారపీఠము. సత్యము నందు శ్రద్ధ, సాక్షాత్కారముకొఱకు
నీవెన్నుకున్న సక్రమ విధానమునందు శ్రద్ధ, నిన్ను నీవు
సమర్పించు- కొనియున్న సమర్థగురువునందు శ్రద్ధ, యిదే నీ
ఆధ్యాత్మిక భవన నిర్మాణమునకు గైకొనవలసిన గట్టి ఆధార శిల. నీవు విజయము సాధింపవలెనన్న యివి నీకు
తప్పనిసరి. తద్వారా నీవు నిన్ను
ఆవరించియున్న దుష్టశక్తులను ఛేదించివేయగల అంతర్గతశక్తిని గలిగియుందువు. అవసరమైనప్పుడల్లా నీవు నవ్యభగవదీయ స్పందనలను
గ్రహించుటకిది సహాయపడును.
శ్రద్ధపై
కొందరికి చాలా పొరపాటు అభిప్రాయము గలదు.
వారు శ్రద్ధ ఒక్కటుండిన చాలును, జీవిత సమస్య
పరిష్కరింపబడునని నమ్ముదురు.
వారనుసరిస్తున్న విధానమెటువంటిదైనను, వారు విధేయత
చూపుచున్న మార్గదర్శి యెటువంటి వాడైనను పరవాలేదందురు. ఇంతకంటే తప్పుదారి పట్టించు నమ్మకమింకొకటి
లేదు. కలకత్తా దారికి వ్యతిరిక్తముగా
ప్రయాణించి యెవరైనా కలకత్తా చేరగలరా?
తన అహంభావమును వ్యక్తపరచువాని మార్గదర్శకత్వమునకు తన్నుతాను
సమర్పించుకొని యెవ్వడైనా నిస్స్వార్థ సాధుపుంగవుడు కాగలడా? ప్రాపంచిక వస్తువ్యామోహముతో
తనకైతాను గొప్పలుచెప్పుకొని విర్రవీగు దురహంకారి, వంచకుని
అనుసరించి యెవరైనా వ్యామోహము, దురభిప్రాయము, మరియు గర్వముననెడి బంధముల నుండి తన్నుతాను విడిపించుకొని స్వేచ్ఛను
పొందగలడా? మనము
వస్తువుల పైపై మెరుగులను చూచి వాటి వెంటబడరాదు.
లోలోపలికివెళ్ళి అట్టడుగున (మూలమున) నున్న సత్యతత్త్వమును కనుగొనవలెను. బాహ్య ప్రదర్శనములైన శాస్త్రజ్ఞానము, మాటల చాతుర్యము, శక్తి ప్రదర్శనముల ద్వారా
ఆకర్షితులమై అట్టివారి ననుసరించితిమేని గుడ్డినమ్మకము వృద్ధియై అది చాలామంది
విషయములో విధ్వంసకర ఫలితములు దెచ్చినవి.
ఆత్మ ప్రబోధము గల్గిన వ్యక్తి, ఆధ్యాత్మిక రంగమున గణింపేలేని
అట్టి తప్పుడు ప్రోద్బలములకు గుడ్డిగాలోనై మాయలో పడిపోడు. గుడ్డినమ్మకము సందేహాతీతముగా గొప్ప
ప్రయోజనకారి. కానీ యెప్పుడు? ఎప్పుడు నీవెన్నుకొన్న మార్గము అదృష్టవశాత్తు సక్రమమైనదైయుండి, నీవెన్నుకొన్న మార్గదర్శి కూడా మహోన్నత స్థాయికిజెందిన వాడై వ్యామోహగర్వముల
కతీతుడైన వాడయినప్పుడు మాత్రమే. అట్టి
గురువర్యులపై గల నీ అచంచల విశ్వాసము, నిన్ను నీవు
సత్యతత్త్వముతో సంబంధించుకొనునంతటి సుదూర ఆధ్యాత్మిక తుది పరిధి వరకు గొంపోవును.
శ్రద్ధ
నిజమునకు మర్త్యుని అమర్థ్యునితో కలుపు ఒక సజీవ సంబంధము. ఇది అవినాశితో సంబంధమేర్పరచుకొన్న గురువు
మాధ్యమముననే జరుగునని నిస్సందేహముగా చెప్పనగును.
ఈ సంబంధము ఒకసారి యేర్పడినదంటే అది యిక ప్రయాణములోని తుదిబిందువు చేరువరకు
యెట్టి పరిస్థితులలోను విడిపోదు. నిజమైన
శ్రద్ధ చెప్పనలవికాని సుగుణము. అది
మతపరిధి కతీతము. తిరుగులేని ధైర్యమే మనలను
విజయము దిశకు నడిపించును. సర్వవ్యాపితమైన
ఆ శక్తియే మనదారిని సుగమమొనర్చును.
వాస్తవమున కదియే మన జీవిత సమస్యను పరిష్కరించును.
అహము:
అహమను పదమును ప్రస్తుత మరియు పూర్వ రచయితలందరూ తప్పుగా ప్రయోగించిరనదగును. అహమే ప్రతి కార్యమునందును
శక్తినిచ్చుచున్నది. ఈ కార్యము నీవు
చేయగలవని అది నీకు తెలియజేయును. కానీ మనము
మనలను ఆత్మగా గాక శరీరముగా గుర్తించుచున్నాము.
ఇది నీవు నిర్మూలించలేని భగవదుత్పాదితము.
నీవు దీనిని మార్పు చేసుకొనవలెను.
ఒకరివద్ద
విపరీతముగా సంపదగూడి, గర్వితుడయ్యెననుకొనుము, అతడు పాపమేమియు చేసినట్లుగాదు.
ఎందుకంటే అది యితరులకెవ్వరికి హానిచేయలేదు. ఇందువల్ల గలిగే ఫలితమేమంటే ఆ
వ్యక్తి బుద్ధి మందగిస్తుంది.
పరిణామరహితమైన
దానిని సాక్షాత్కరింప- జేయునదే నిజమైనవిద్య.
ఆ సాక్షాత్కారము పఠనము వల్లగాని విశ్వసించడం వల్లగాని, లేక హేతువాదమున గాని సాధ్యపడదు.
అది అతీంద్రియ జ్ఞానముననే సాధ్యము.
మనిషి
ప్రకృతి యొక్క పనిముట్టు. అతడు విపరీతమైన
శక్తిగలిగియున్నాడు. ఆ శక్తి-
నుపయోగమునపెట్టు సాధనమూ అతడు కలిగియున్నాడు.
ఆ విచిత్ర సాధనమే మనస్సు. ఈ మనస్సు
మానవుడొక్కడే గలిగియున్నాడు. ఆరాధనకు
మూలవస్తువైన ఆ భగవంతునకు గూడా ఈ మనస్సు లేదు.
ఇది మాత్రమే వస్తువులను చైతన్యస్థితికి తేగలదు. సూక్ష్మరూపముననున్న అసలు విశ్వాకాశ
శక్తియిది. దీని నుండే మనిషి తన
చిన్నసృష్టిని ఉనికిలోనికి దెచ్చెను. ఈ
శక్తే ప్రతివస్తువు యొక్క మూలమున చైతన్యవంతమై యున్నది. ఇది యెవరిశక్తి? భగవంతునిదా?
లేక మనిషిదా? జవాబు స్పష్టము. ఇది ఖచ్చితముగా మనిషిదే. ఎందుకంటే భగవంతునకు మనస్సు లేదు. మనస్సే గనుక భగవంతునకుండి వుంటే ఆయనసైతం
సంస్కారముల ప్రభావమునకు లోనైయుండెడివాడు.
కనుక మూలమున పనిచేయుచున్నది ఖచ్చితముగా మానవ మనస్సే. ప్రకృతిలోనున్న సమస్తశక్తులు, బలము, సత్తువ అదే క్రమమున మనిషి కలిగియున్నాడు లేక
వాటి కలయికయైయున్నాడు.
మనిషియొక్క
నిర్మాణము సరిగ్గా విశ్వనిర్మాణము వలెనే యున్నది.
బయటకు కనిపించే ఈ భౌతిక విశ్వనిర్మాణము వెనుక అనేక యితర సున్నితమైన మరియు
మరింత సున్నితమైనవిట్టివే యున్నవి. అట్లే
ఈ మనిషి స్థూలభౌతికదేహం వెనుక సున్నితమైన మరియు మరింత సున్నితమైన
రూపములున్నవి. అన్నిటికంటే బాహ్యముగా
నున్నదీ స్థూల శరీరము. దాని వెనుక
సూక్ష్మశరీరము, కారణ శరీరమూ వున్నవి. ఈ మూడు బాహ్యరూపములు గాక అట్టివే లెక్కలేనన్ని
పెక్కితరములున్నవి. అవి మరింత సున్నితము,
సూక్ష్మములగుటవలన ఆలోచనాపరులు వాటిని శరీరములనక ఆత్మను
చుట్టుకొనియున్న పొరలనిరి. అవి
అసంఖ్యాకములగుట వలన ఒక్కొక్కదానికి పేరు పెట్టుట కష్టతరమైనది. అతి సున్నితమైన దాని నుండి అతి స్థూలమైన దాని
వరకు గల ఈ పొరలన్నిటితో కలిసి మనిషి ఈ విశ్వమునకు లేక మొత్తము భగవంతుని రూపాంతరమునకు
నకలుగ ఈ పదార్తరహిత ప్రపంచమున ఉనికిలో నున్నాడు.
మనిషి ఉనికియు, భగవంతుని రూపాంతరములూ వాస్తవమున
ఒక్కటే యనుదానికి ప్రతీకగా ఒక పూర్ణవృత్తములోని బాహ్య పరిధి, దానికత్యంతలోతున నున్న కేంద్రము లేక సున్నాగా సూచించడమైనది. అందువల్లనే భగవత్‌సాక్షాత్కారమనగా ఆత్మసాక్షాత్కారమని,
ఆత్మసాక్షాత్కారమనగా భగవత్‌సాక్షాత్కారమని తెలుపబడినది. ఉనికిలోనున్న ఈ మొత్తము విశ్వమంతా ఒకే ఒక
బిందువు నుండే బయల్వెడలినది.
మొత్తము
రోజంతా తీవ్రముగా మరణము నాశిస్తూ గడచినది.
ఆలోచనంతా జీవించుటకంటే మరణమే ప్రధానాంశముగా నుండినది. మనస్సుకు తట్టిన ప్రతి ఆలోచనా మరణము వైపునకే
తీవ్రముగ లాగబడుచుండినది. బయటి ఆలోచనలే
లేకుండా, ఒక స్థితిలో లోపలికి వెళ్ళడమే లయావస్థ. ఇంతకంటే గొప్పస్థితి మరొకటున్నది, దాన్నిమనం నిర్భీతిగా మరణము యొక్క మరణమని పిలువవచ్చును. తన జీవిత కాలము ముగిసిన తర్వాత ఈ స్థితినందుకొన్న
మనిషి యిక తిరిగి జన్మించడు. ఈ స్థితిలో
మనిషి మరణమన్న ఊహకూడా లేనటువంటి అత్యంత సూక్ష్మవిధానమున మరణముననుభూతి
చెందును. అంటే అది తన ఉనికి యొక్క అత్యంత
అంతరాంతరాళములకు వెళ్ళి, అది తన జీవితములో ఒక భాగమై పోతుంది.
ఎప్పుడూ
యేదో రూపంలో మతాభ్యుదయము సజీవమై ప్రవహిస్తున్న దేశమునకు మనము చెందియున్నాము. మనమేసత్యతత్త్వము నుండి వెలువడితిమో అదే
సత్యతత్త్వముతో ఐక్యమగు విధానమున పెంచి పెద్ద చేయబడితిమి. మనతోపాటే ఆ అనంతత్త్వము యొక్క సారమును గూడా
మనవెంట దెచ్చితిమి. భగవంతుడు మనిషి
యందున్నాడని జనులందరు మనము దివ్యత్వముతో అడుగిడి మానవత్వపు స్థాయిలో
సంబంధమేర్పరచునట్లయిన మన అంతిమ ప్రయోజనము నెరవేరగలదు. ముందుగా చెప్పినట్లు సృష్టి మూలమున
మానవత్వమునకు దివ్యత్వమునకు దగ్గరి సంబంధముండెను.
పరిణామక్రమములో చర్య, ప్రతిచర్యల కారణముగ యేర్పడిన
కుదుపుల వల్ల అవి స్థూలరూపము దాల్చినవి. మనిషిస్వరూపములోని
మూలకములన్నిటిని వెనక్కు మరలించి వాటి నిజస్థితియైన భక్తి, ప్రశాంతతకు
తిరిగి తీసుకొని వచ్చి, భగవంతునితో అనుసంధించవలెను. ఇది వారిలో సరియైన మిత స్వభావమును
ప్రవేశపెట్టుట ద్వారా సాధ్యమగును. అదే
మనము సహజమార్గములో చేయుచున్నాము. మనం
చేపట్టిన సాధారణ ధ్యానప్రక్రియ వాస్తవానికి అమితస్వభావమును తొలగించి తద్వారా మన
యిచ్ఛాశక్తితో సమతను స్థాపించుటయందే గురిపెట్టియున్నాము. ఆ విధంగా మనలోని మానవత్వము దైవత్వముగా
మార్పుచెందును. మనిషికి దైవత్వము
సిద్ధింపజేయుట అను పదమునకు నిజమైన అర్థమిదే.
ఇది జరిగితే తేడా తొలగిపోయి, దివ్యత్వము, మానవత్వము రెండూ దాదాపు ఒకటైపోతాయి.
శరీరధారియై యున్నంత కాలము మానవత్వము సమూలముగా నిర్మూలింపబడదు. సహజమార్గ విధానములో ధ్యానప్రభావమున మానవత్వపు
పరిధిలో పనిచేయుచున్న శక్తి తీవ్రతను తగించుకుంటూ వెళతాము. అందువల్ల దైవత్వమునకు స్థానమేర్పడి తేడాను
తగ్గించడం మొదలుపెడుతుంది. మరోమాటలో
చెప్పాలంటే మానవత్వము దైవత్వపు శక్తితో నింపబడి, కాలాంతరమున
దైవత్వమే సర్వవ్యాపితమౌతుంది. పూర్తిగా
పరిస్థితులు కుదుటబడిన తర్వాత మానవత్వము తన సృజనాత్మకశక్తితో సహా
అప్రధాన్యమైపోవునంతగా (నామమాత్రమౌనట్లుగా) తగ్గింపబడుతుంది. ఈ విధంగా భగవంతుడు అనంతుడు గనుక మనిషి గూడా అన
అత్యున్నత స్థితిలో అదేవిధంగా వున్నా తన మానవత్వ పరిధికిలోబడే వుంటాడు. ఎప్పుడైతే హద్దులు తొలగిపోతాయో అప్పుడు ఆత్మ
వ్యాకోచమునకు పరిమితులే వుండవు. అది
యెంతగా వ్యాపిస్తుందంటే మొత్తము విశ్వమంతా తనలోనే వున్నట్లనుభూతమౌతుంది. అప్పుడు మొత్తము విశ్వంలో యెక్కడ యేమి
సంభవించినా అతని హృదయంలో అది ప్రతిధ్వనిస్తుంది.
ప్రకృతిలోని ప్రతిదీ అతనికి తెలిసి, అతని అవగాహనలోనే
వుంటాయి.
అనాహతము
= మండలాంతర్గత సంగీతము, ఒక శబ్దము, నిత్యము
సత్యమై వ్యాపించియున్నది. భగవత్ కృపవలన
గ్రాహకశక్తి అంతరంగమున నుత్పన్నము చేసుకొన్న వారికితప్ప యితరులకది వినబడదు. ఇదే అనాహత జపము. మనము హృదయముపై ధ్యానము చేస్తాము. ఆ సమయంలో మనము లోలోతులకు వెళుతూ సహజసిద్ధమైన
స్పందనలస్థాయికి చేరి అక్కడ ‘ఓం’ శబ్దాన్ని వింటాము. ఇది ఉన్నత స్థానముల నందుకోవడం మొదలైందనడానికి
సూచన. తుదకు ఆ స్థాన లక్షణములు
వ్యక్తమవ్వడం జరుగుతుంది. ఎప్పుడు హృదయంలో
అజపానుభవం గలుగుతుందో అది అంతటా క్రమ్ముకొని, మన ఉనికి
మొత్తములో దాని అనుభూతి కలిగేంతవరకు చక్రములపై ఒత్తిడి తెస్తుంది. త్రికుటి లేక ఆజ్ఞాచక్రము శక్తిచేత పూర్తిగా
నింపబడి యుండగా మనమాప్రదేశము చేరగానే నిజానికి అనాహతం మొదలౌతుంది. ఏ కారణము చేతనైనా ఆజ్ఞాచక్రము వరకు అభ్యాసి
వచ్చినా అనాహతము మొదలు కాలేదంటే యిక అక్కడ మొదలయ్యేట్టు చేయడం గురువు బాధ్యత. ఇది ఆ పనికి పరిపక్వమైన సమయము. ఇంతకంటే ముందే ఈ పని మొదలుపెట్టి
యుండవచ్చును. కానీ గురువే వీటిని
నిర్ణయించ సమర్థుడు.
ధ్యానము
వల్ల మనము మనస్సున ఒక విధమగు తాత్కాలిక ఓదార్పునుత్పన్నము చేసికొందుము. భగవంతునితో సంబంధమేర్పరచుకొని యుందుము. గనుక ఆ
సమయమున మనలో ప్రశాంతత అలముకొని యుండును.
ధ్యానము యేదో ఒక నిర్ణీత సమయము చేసిన మాత్రమున సరిపోదు. అలాంటప్పుడు ఆ నిర్ణీతసమయమున మాత్రమే మనము
పవిత్రభావనతో నుందుము. ఆతర్వాత భగవంతుని
ధ్యాసే వుండదు. రోజులో చాలా భాగము సేవా
భక్తి మార్గమునకు దూరముగా నుందుము. సంవత్సరముల తరబడి సాధనచేసినప్పటికి ఆధ్యాత్మికముగా
అధమస్థితిలోనే వుండుటకు యిదియే కారణము.
మనము సమర్థుడైన గురువు మార్గదర్శకత్వమున క్రమపద్ధతిలో గొంపోబడినట్లయిన
ధ్యానములో మన మనుభూతి చెందునది వాస్తవమునకు సరళత మరియు ప్రశాంతతయే. అయినప్పటికీ తొలిస్థితులలో యిది అభ్యాసి
భావనకతీతమగుట వలన దాని నతడు అర్థము చేసికొనలేడు.
ధ్యానప్రభావము నతడు గ్రహింపలేకపోవుట వలన ధ్యానములో తానేమీ అనుభూతి
చెందుటలేదని తరచూ ఫిర్యాదు చేయును.
ఇట్లగుటకు ముఖ్యకారణము అతడు భగవంతునితో కేవలం కొన్ని నిముషముల సాధనలో
మాత్రమే సంబంధము గలిగియుండుటే. అందువల్ల
ధ్యానములో అతడు పొందిన సత్యతత్త్వము కొద్ది సమయము మాత్రమే అతనిలో నుండును. ఆట్లుగాక ధ్యానములో పొందిన అనుభూతిని దినములో
చాలా భాగము నిలుపుకొనయత్నించి అదేస్థితిలో తన చేతనైనంత మేరకు కొనసాగెడి వారును
ఉన్నారు. అట్టివారు భగవంతుని
నిరంతరస్మరణలో ఉన్నారు. వారి పురోభివృద్ధి
సులభము మరియు వేగవంతమునై యుండును.
ప్రేమలో
సమత కనబడుచున్నది. బంధుత్వపు బంధనములు
త్రెంచివేయబడినట్లున్నది. మా తండ్రి యెడ
యెంతటి గౌరవము గలదో అదే గౌరవము నా సేవకుల మీద కూడా కలదు. నా తనయుని మీదున్న ప్రేమ వలెనే యితరుల బిడ్డలపై
కూడా నాకంతే ప్రేమ కలదు. నావారిపైనున్న
గౌరవము వలెనే కుక్కపై కూడా నాకు గౌరవము కలదు.
ఆ కుక్క ఉనికి నా ఉనికి ఒకటిగానే నేను భావించుచున్నాను. నేను బంగారాన్ని మట్టిని ఒకటిగానే
చూస్తున్నాను. భక్తిపరుని, ధూర్తుని కూడ నేను ఒకే దృష్టితో చూస్తున్నాను.
మనపద్ధతి
ప్రకారము హృదయములో ఈశ్వరీయప్రకాశమున్నదని తలచి హృదయముపై ధ్యానము చేయమందుము. కానీ హృదయములో యేరూపములోనూ అనగా విద్యుద్దీపము
లేక మైనపొత్తి దీపము వంటి దీపపు వెలుగును చూడమని చెప్పము. అట్లుగాక మనమూహించిన వెలుగు కనబడిన, అది నిజమైన వెలుగు కానేరదు. అది
తను తనకు నచ్చిన రీతిన సృష్టించుకొన్న వెలుగు మాత్రమే. కనుక మూలమున భగవదీయ భావన గలిగి కేవలమొక సూచన
మాత్రముగా వెలుగును భావించి పురోగమించమని అభ్యాసికి సలహా యివ్వబడును. అప్పుడేమౌతుందంటే మనము సాధించవలసిన
సూక్ష్మతపైనే మనము ధ్యానము చేస్తాము. మన
పద్ధతి ప్రకారము హృదయముపై ధ్యానించడమంటే, హృదయంలో
ఈశ్వరీయప్రకాశమున్నదని యోచించుటే. ఈ
పద్ధతిలో ధ్యానము చేయునపుడు హృదయాంతర్గత ఈశ్వరీయప్రకాశము నిన్ను తన వైపు
ఆకర్షించుచున్నదని భావింపుము. ధ్యాన
సమయములో నీవనుకోని భావనలు నిన్ను వెంటాడినపుడు వాటిని లెక్కచేయకుము. వాటిని రానిమ్ము కానీ నీవు మాత్రము నీ పనిమీద
సాగిపొమ్ము. నీ అలోచనలను, భావనలను ఆహ్వానించని అతిథులుగా పట్టించుకొనకుము. అయినా అవి యింకా నిన్ను పీడుస్తూ వుంటే అవి
నీవి కావు గురువర్యుల వనుకొనుము. ఈ
విధమగు పద్ధతి చాలా ప్రతిభావంతమైనది;
ఆశించిన ఫలితముల నిచ్చుటలో యెప్పుడూ విఫలము కాదు. అతి సహజంగా సుఖాసనమున ఒక గంటసేపు
కూర్చొనుము. నీవు ధ్యానము మాత్రమే
చేయుము. సాధారణముగా ధ్యానసమయమున వచ్చు
ఆలోచనలతో పెనుగులాడకుము. ఏకాగ్రత అతి
సహజసిద్ధముగా ధ్యానము యొక్క ఫలితముగా ప్రాప్తించును. ధ్యానమునకు బదులు యేకాగ్రతను బలవంతముగా
సాధనచేయువారు సాధారణముగా అపజయము పాలగుదురు.
సాయంత్రము
మరలా అదే సుఖాసనమున కనీసమొక అరగంట కూర్చొనుము.
చిక్కులు, పూర్వపుయోచనల చిక్కుల వలలు మరియు
స్థూలత్వము లేక జడత్వ రూపమున నీ దేహతత్త్వమున నున్నదేదో అదంతా కరిగిపోతున్నట్లు
లేక ఆవిరై నీవెనుక భాగము నుండి పొగరూపమున బయటికి పోతున్నట్లు భావింపుము. ఇది నీ మనస్సులోని మాలిన్యములను నెట్టివైచి నీ
సమర్థగురువు విశేష ప్రతిభాశక్తిని గ్రహించు (పొందు) సామర్థ్యము నీకు కలుగజేయును.
ఇవన్నీ
యెవరు సృష్టించారు? ఎవరో
కాదు యివన్నీ మనమే మనలో సృష్టించుకొన్నాము.
మనమే మనలను చెడగొట్టుకున్నాము.
మనమే మనలను భగవత్‌సామ్రాజ్యమునకు దూరము చేసికొని చీకటి గుహలోనికి
నెట్టివేసుకున్నాము. మనమే మనలో ఈ
గందరగోళమును యేర్పాటు చేసుకున్నాము. ఈ
విధంగా మన తప్పుడు మరియు చెడు ఆలోచనలతో చిక్కుబడిపోయిన దారపువలను మనలో తయారు
చేసుకున్నాము. మనము యే స్థితినుండి పతనమై
ఈ దశకు వచ్చితిమో ఆ స్థితికిప్పుడు తిరిగి వెళ్ళదలచుకొన్నాము.
మానవునిలో
యిచ్ఛారూపమున నున్న అసలు యోచనాశక్తి నుపయోగించి వ్యక్తిగత ఆత్మను పరిశుభ్రపరచి
తద్వారా అది సూక్ష్మాతిసూక్ష్మ సారపు ఉనికిని చేరు నిటారైన మరియు జారుడు బాటలో
అధిరోహించి వెళ్ళుటకు సంసిద్ధము చేయు ఈక్రియయే ఈ అంతఃశుద్ధీకరణ విధానమని నేను
తగురీతిన మీకు చెప్పుచున్నాను.
ప్రతి
సాధుమహాశయుడు సత్యతత్త్వమును వివరించుటకు ‘వెలుగు’ అను పదమునే వాడుకొనెను. నేనును అదే పదము వాడక తప్పినది కాదు. యెందుకంటే ఆ పదమే దానిని వివరింపగల ఉత్తమ పదము. కానీ అది ఒక చిక్కును గలిగిస్తున్నది. ఎందుకంటే యెప్పుడు మనం వెలుగును గురించి
మాట్లాడుతామో అప్పుడు మనలో దాని నుండి విరజిమ్మే కాంతిని గురించిన ఆలోచన
ప్రాధాన్యత వహించి అది ఒక జిగి (మెఱుపు) గా స్వీకరిస్తాము. నిజమైన వెలుగు అదికాదు. మన విధానములో అభ్యాసి కొన్ని సమయాలలో వెలుగును
నిస్సందేహంగా చూస్తాడు. అయితే
మెఱుపుగల్గినవెలుగు ప్రారంభదశలో, పదార్తము శక్తితో
అనుసంధించబడినప్పుడు మాత్రమే కనబడుతుంది.
మరో మాటలో చెప్పాలంటే శక్తి పనిచేయడం ప్రారంభించిందనడానికది సంకేతము. నిజమైన వెలుగు అరుణోదయవర్ణము లేక వర్ణరహితత్వ పలుచని
ప్రతిబింబమై యుండును. నిజానికి వెలుగు
అన్న పదం అసలు వస్తువును సూచించు సరైన పదం కానప్పటికి (ఎందుకంటే వెలుగు అసలు
వస్తువుతో పోలిస్తే చాలా బరువైనది) కేవలం అర్థం చేసుకొనే నిమిత్తం ఆ పదాన్ని
వాడుకొంటున్నాము. అభ్యాసి తనకైతాను
తేలికదనం మరింత తేలికదనాన్ని అనుభూతి చెందితే దానర్థం అతడు
పురోగమిస్తున్నాడన్నమాట. కారణం అతడు
భగవంతుడంతరంగమున గలడన్న స్థితిలోనికి ప్రవేశిస్తున్నాడు. తేలికదనమనగా మనిషి తన ఆలోచనా భారమును
కోల్పోవుట. కనుక నిజమైన వెలుగు నిజమైన
పదార్తమును సూచిస్తుంది. లేక యింకా
స్పష్టంగా చెప్పాలంటే అది పదార్తరహిత పదార్తం.
చాలా
మంది పూజ ఆచారయుక్తంగా
చేస్తూపోతుంటారు. నిజమైన ఆతృత మరియు
అశాంతిమయబాధ అక్కడలేదు. అట్లుకాకుండా
వుండివుంటే వారికి తప్పక ఆధ్యాత్మికస్థితులు అనుభవమునకుతేబడి, ప్రతి దినము ఒక నూతన జీవము వారిలోనికి చొప్పించబడి వుండెడిది. అయినప్పటికి యేమీ చేయకుండా వుండడంకంటే యిదే
వెయ్యిరెట్లు మేలైనది.
సాధనకు
సంబంధించిన మరొక్కవిషయము, ప్రతిదినము ఈ సంక్షిప్త
ప్రార్థనచేయుటే.
ఓ
నాధా!
నీవే మానవ జీవనమునకు లక్ష్యము
మా కోరికలు ఆత్మోన్నతికి ప్రతిబంధకములై వున్నవి
నీవే మా యేకైక స్వామివి, యిష్టదైవము.
నీ సహాయము లేనిదే నిన్ను పొందుట అసంభవము.
ఒక
దీనాతి దీనమైన వ్యక్తి కన్నీటి పర్యంతమై తన బాధాతప్త హృదయముతో మహోన్నతమైన ప్రభుని
సన్నిధిలో ఆయన దయ, కృపల కొఱకు తపన చెందుతున్న రీతిలో ఈ
ప్రార్థన చేయవలెను. అప్పుడు మాత్రమే అతడు
అర్హతగల సాధకుడు కాగలడు.
భగవంతుని
ప్రేమించుటకనేక పద్ధతులున్నవి. అనేక
భావనలననుసరించి ప్రేమించిన వారూ ఉన్నారు.
ఉదాహరణకు పితృభావము, సఖ్యభావము మొదలైనవి. నా ఉద్దేశ్యములో ప్రేమికుడు, ప్రేయసి సంబంధమునకు మించిన భావన మరొకటి లేదు. అభ్యాసి తన్నుతాను ప్రేమికుడననుకొని, భగవంతుని ప్రేయసిగా భావించి అదే బంధుత్వముతో మున్ముందుకు సాగితే
పర్యవసానంగా భగవంతుడు ప్రేమికుడై తాను ప్రేయసిగా కొంతకాలమునకు మారిపోతారు. కానీ ఈ స్థితిలో వ్యక్తి తాను లక్ష్యప్రాప్తిని
పొందితినని భావిస్తే అది చాలా గొప్ప తప్పిదమౌతుంది. ఆ తర్వాత యింకేమి మిగిలియున్నదో
చెప్పలేము. అది కేవలం సాధనకు సంబంధించిన
విషయము.
ప్రార్థన
అత్యంత ముఖ్యమైన అపజయమెఱుగని సాధనము. దీని
మూలముననే మనము పవిత్ర భగవత్ సంబంధమేర్పరచుకొంటిమి. వ్యక్తి తనలో ఒక శూన్యస్థితి నేర్పరచుకొనుట
కొఱకే హృదయ పూర్వకమైన ప్రేమ, భక్తి భావనతో ప్రార్థన
చేయవలసియున్నది. దీని వలన భగవదీయ కృపా
ప్రవాహము వ్యక్తివైపునకు మరలును. ఇప్పటి ఈ
ప్రపంచము ఉత్పన్నమైనప్పుడు, కేంద్ర బిందువు అన్నిటియందును
లోతుగా నాటుకొని పోయినది. మనలో
నాటుకపోయియున్న ఆ కేంద్ర బిందువు మహోన్నతములోని భాగమే గనుక మన ధ్యాసను మూలము
వైపునకు మరల్చును.
ప్రార్థనలో
మనము అదే కేంద్రబిందువునకు చేరయత్నింతుము.
మనమట్టి స్థితినే మనలో ఉత్పన్నము చేసుకొన్నప్పుడు అది సాధ్యమగును. దీనికి సాధన అవసరము. ఇది మనము భగవదిచ్ఛకు మనల్నిమనం
సమర్పించుకొన్నప్పుడు సాధ్యపడుతుంది. ఆ
భగవదిచ్ఛ సంపూర్ణముగా సరళము మరియు ప్రశాంతము.
ఇది చూడటానికి చాలా కష్టమనిపిస్తుంది గాని దానినాశించే వాళ్ళకు మాత్రం ఇది
అనుకున్నంత కష్టమేమీకాదు. మనిషి తనలో
దానికోసం తీవ్ర తపననుత్పన్నం చేసుకుంటే అతడిక ప్రార్థనామయస్థితిలో వున్నట్లే. దీనికోసం ప్రతి ఒక్కరూ తాపత్రయపడవలసి
వుంది. మనిషి యెప్పుడైనా ఓ క్షణకాలం
ఆస్థితిలో ప్రవేశిస్తే చాలు అతని ప్రార్థన అంగీకరింపబడుతుంది. కానీ ఈ పని పరిపూర్ణమగుటకు నిరంతర సాధన
అవసరము. జనులు అటువంటి ప్రార్థన చేయుటకు
ప్రోత్సహింపబడవలెను. వ్యక్తి దీనిని
సాధించి యిందులో స్థిరత్వం పొందితే యిక అతడు చేయవలసింది స్మరణ తప్ప యింకేమీ మిగిలి
యుండదు. అది కూడా యిక యెఱుక స్థాయిలోనికి
రానేరాదు.
ఇది
అటువంటి స్థితే కానీ బహిరంతరములో వర్ణరహిత మరియు స్థితిరహితస్థితి
అలముకొన్నట్లుండుట మిక్కుటమైనది. నాలో ఒక
భావన ఉత్పన్నమైనది. అదేమంటే నా బాహ్య
ఉనికి మరియు అంతరముననున్న ఉనికి రెండూ సౌందర్యవంతములాయెను. నేనొక పవిత్ర సౌందర్యము ననుభవించితిని. శరీరములోని అణువులన్నీ సూక్ష్మములుగాను,
కాంతివంతముగానూ తోచెను.
అయినప్పటికినీ యేదో ఒకటి మాటిమాటికి తత్తరపాటును కలిగిస్తున్నది. అనగా ఒకదానికొకటి విరుద్ధములైన పవిత్రత మరియు
అపవిత్రతలు రెండూ అనుభూతములాయెను.
పవిత్రత
బ్రహ్మాండ మండలములోను, అపవిత్రత పిండప్రదేశములోను, అవిగూడా హృదయస్థానం వద్ద మరియు దాని సన్నిహిత ప్రదేశమున అనుభూతము-
లాయెను. అయితే యెప్పుడు అపవిత్రస్థితి
అలమియుండెనో అప్పుడు ఆకాశము నుండి అసంఖ్యాకములగు శక్తికణములు రాలుచున్నట్ల-
నిపించెను. నా తత్తరపాటుతనమునకు మరొక
కారణము, నెలపొడవునా నా పూర్వ పరాజయములు అందునా నా మనసులో
లేనివి కూడా నాదృక్పథమునకు వచ్చుచుండెను.
మరణము:-
నేను నా ‘రాజయోగప్రభావ’మను పుస్తకమున ‘జీవించియు మరణించినవాడు’ అను పదము
వాడితిని. ఈ స్థితి మనిషి లీనత్వమున
లీనమైనప్పుడు కలుగుతుంది (ఫానాయె ఫానా).
ఈ
స్థితులను నకారాత్మక (-) విధానమున బాగుగా వివరించనగును. నేనిపుడు ప్రాపంచికముగా నా దృక్పథమును
తెలుపుదును. పూర్వసంస్కారములు చాలా
చురుకుగా మారి, శ్రమ గల్గితే అప్పుడు ప్రకృతి మరణాన్ని
విశ్రాంతి కొఱకు విరామంగా తీసుకొస్తుంది, తద్వారా అతడు
మరుజన్మలో కర్మఫలాలనుభవించడానికి తాజాగా సంసిద్ధుడౌతాడు. ఇక యిప్పుడు ఆధ్యాత్మికపరమైన
జీవితానికొద్దాం. ఇక్కడ మరణమంటే
మరపుస్థితిలోనున్న మనస్సు. అది అందున్న
వాటినన్నిటిని తిరస్కరిస్తుంది. అది యెలా
సంభవం? నేను నా దృకపథాన్ని తెలియజేస్తాను. అందిన ప్రతిదానిని నెట్టివేసే మనోప్రవృత్తి
కలిగి వుంటారిక్కడ. అందుకే మనిషి
యెల్లవేళల ఆలోచనలు తీవ్రంగా తనలో జొరబడుతున్నట్లునుభూతి చెందుతాడు. ఆలోచనలు గాలిలో యెగిరే ధూళివంటివి. అవి శక్తిహీనములగుటవలన భవనమును
నిర్మింపజ్ఆలవు. వాటికి నీవు గనుక శక్తిని
ప్రసాదిస్తే అవి చెదలుపుట్ట వలె గట్టిపడతాయి.
ప్రతి
ఒక్కరికి జీవితమున్నది కానీ మనము జీవితంలో జీవం కొఱకు వెతకాలి, అది తుదకు దాని సారములోనే లీనమౌతుంది.
మనం
పెద్ద వాళ్ళమయ్యేటప్పటికి ఊయలలోని విశ్రాంతిని మరచిపోతాము. అదేవిధంగా మనం ఆధ్యాత్మికంగా గొప్ప
పురోభివృద్ధిని సాధిస్తే క్రొత్త విశ్రాంతిమయ స్థితిలో ప్రవేశిస్తాము. ఆ స్థితిని గూర్చి మనం ఊహించలేం. ఎందుకంటే మనస్సులో విశ్రాంతియన్న
భావముంటుంది. విశ్రాంతియన్న భావం మనస్సులో
మెదలగానే మనము మంచము, దిండు జ్ఞాపకమునకు వచ్చి పరిస్థితంతా
దాదాపు కృత్రిమమైపోతుంది. మనం సకారాత్మక
(+) నకారాత్మక (-) యోచనల రెండింటి నుండి స్వేచ్ఛను పొందిననేగాని ఈ కృత్రిమత నుండి
బయటపడలేము. నకారాత్మకతలో నీవు
పోగొట్టుకొనునదేమీ వుండదు. సకారాత్మకతలో
నీవు యేదో పొందుతావు. కనుక యెప్పుడు
పోగొట్టుకోవడం, సంపాదించుకోవడం వుంటాయో అప్పుడు నీవు మాయతో
లయబద్ధంగా కలసిపోయావు. నీవు గనుక శాంతిని
అశాంతిగాను, అశాంతిని శాంతిగాను పేర్కొంటే అప్పుడు నీవు
అశాంతిలో ‘నేను శాంతంగావున్నా’ నంటావు.
అయితే యిందుకోసం ప్రతివొక్కరూ తప్పనిసరిగా శాంతి, అశాంతి
రెండూ రుచి జూచి వుండాలి. ఇది నిజంగా
ఆలోచనయొక్క లోతుమీద ఆధారపడి వుంటుంది.
ప్రతి ఆలోచన యొక్క అంతిమ ఆధారము సత్యతత్త్వమే. అదే వ్యక్తి కోరిన ప్రతిదానికి
శక్తినిస్తుంది. దురదృష్టకరమైన విషయమేమంటే
మనము శక్తివద్దకే వెళతాము గానీ శక్తిమూలము దశకెళ్ళము. అందుచేతనే మనము సరియైన పనులకంటే తప్పుడుపనులే
యెక్కువ చేస్తాము. సాధుత్వంలో నిజమైన
శీలము రూపుదాలుస్తుంది. దాంతో సగం బాధ
తీరిపోతుంది. మనం బాధపడకపోవడమే నిజమైనబాధ.
భారతదేశపు
ఆధ్యాత్మిక చరిత్ర చెబుతున్న- దేమంటే భారతీయ మహాత్ములు ప్రపంచములోని బాధలన్నిటిని
తమకివ్వమని ప్రార్థించిరి; తద్వారా మానవజాతి, బాధ నుండి విముక్తి పొందాలని వారి ఆశయము.
జనులు సాధారణంగా బాధల నుండి విముక్తి పొందాలనే, ఆధ్యాత్మిక
పద్ధతులననుసరిస్తారు. ఆ భావన ప్రకారము
మహాత్ములున్నది ఆనందించడానికి కాదు కానీ వారు యితరులానంద పడటానికే వున్నారు. బాధ, శాంతి రెండూ మూలంలో
ఒకటైపోతాయి.
నా
విదేశ పర్యటనలో నేను గమనించిన చిత్రమేమంటే ప్రజలు శాంతికోసం తపన పడుతున్నారు. వారికి శాంతికి పూర్వమున్నదేదో తెలుసు. కానీ శాంతి తర్వతేమున్నదో తెలుసుకొనే ప్రయత్నం
వారు చేయరు. ఎవరైనా దీనికి వివరణ అడిగితే
నేను ‘శాంతిరహిత శాంతి’ యే నిజమైన శాంతి మరియు అది దైవత్వమునకు సన్నిహితమని
చెబుతాను. శాంతి తర్వాతిది సత్యతత్త్వము,
అది అత్యంత ప్రేమమయము మరియు ఆలింగనానందమయము.
మన
శయనము మొదట ఊయలలో మొదలై తుదకు సమాధి (గోరీ)లో అంతమగుచున్నది. అదీ మానవజీవితపు సంపూర్ణ చిత్రపటము.
1942వ
సంవత్సరంలో పూజ్య గురుదేవులు నా కలలో కనబడి యిలా చెప్పారు. సంపద కొఱకు ప్రాకులాడే మనుషులు
కొందరున్నారు. కానీ వారు నన్ను వారి
ఆధారంగా తీసుకోకుండా యేమీ చేయలేరు. ఆయన ఒక
ధ్యానపద్ధతిని కూడా వివరించి ఇది ఆత్మభావాన్ని సహితం నిర్మూలించి పనిచేస్తుందని
చెప్పారు. ఆ భావము కూడా మన మేలుకోసం వదలి
వెళ్లవలసియున్నది. ఆధ్యాత్మిక చరిత్రలోనే
మొదటిసారిగా శరీర మరియు ఆత్మ భావములు రెండు తుడిచిపెట్టుకపోవడం నా అనుభవమునకు
వచ్చింది. తదనంతరం యెఱుకలేనియెఱుక కూడా
వదలి వెళ్ళవలసి వుంది. ఈ భావమును నేను నా
‘రాజయోగ ప్రభావ’ మను పుస్తకమున వ్యక్తపరచితిని.
శాస్త్రజ్ఞులు నా దృక్పథముతో యేకీభవింపక పోవచ్చును, కారణం
ఇది పదార్తస్థాయి కతీతమైనది. శాస్త్రము
దీనిని వివరింపలేదు. నిజమైన మానసిక శాస్త్రము
మనస్సున కతీతమైనది. ఇక సత్యతత్త్వము మరింత
మరింత ఆవలనున్నది.
జనులు
దీనిని సామాన్యముగా అస్పష్టప్రకటన మనవచ్చును.
అందులో తాజ్ఆదనమున్నది గాని దర్పము లేదు.
వారు సంపద గల్గియుండగా సంపన్నులు; లేనిపక్షమున వారు
పేదవారు. ఇదే అసలైన అస్పష్టత. కారణం వారికీ రెండింటి మధ్యగల సంబంధము
తెలియదు. ఈ రెండూ ఒకే తల్లి నుండి
పుట్టుకొచ్చినవి. కనుక ఈ రెండింటికన్నా
తల్లి అత్యంత ముఖ్యము.
సాక్షాత్కారమును
మార్పులేని స్థితిగా నిర్వచించవచ్చును.
ఎంతకాలము దాని ఉనికి మన భావనలో వున్నదో అప్పటి వరకు అది
సంపూర్ణసాక్షాత్కారము కానేరదు. అందువలన
ఆనందానుభూతి సహితము ఒక లోపమే.
సూక్ష్ముడైయున్న
వానిని సాక్షాత్కరింప జేసుకొనుటకు మనము అంతే సున్నితము మరియు సూక్ష్మమైన విధానమును
చేపట్టవలెను. సరళమైన సమస్యాపరిష్కారమునకు
జఠిలమైన పద్ధతుల- నుపయోగించడం ద్వారా చిక్కులేర్పడుచున్నవి. మరో మాటలో చెప్పవలెనన్న వారు ఒక గుడ్డలు
కుట్టుకొను సూదిని పైకి తీయుటకు ఒక పెద్ద బరువులెత్తు యంత్రము (క్రేన్)
నుపయోగింతురు. కనుక భగవంతుని
సాక్షాత్కారము కొఱకు మనమే మన యిచ్ఛ, చర్యలు మరియు పరిసరములతో
సృష్టించుకొన్న బంధముల నుండి స్వేచ్చను పొందవలెను. మన ఆలోచనలన్నీ క్రమబద్ధీకరింపబడి మన వ్యక్తిగత
మనస్సుపైగల భారములన్నింటిని శుభ్రము చేసివేయవలెను.
మనము
దూదివలె తేలికగా వుండవలెను. అలావుంటే ఒక
సమర్థ గురువు యొక్క ఒకే ఒక త్రోపు సహాయమున దైవము వైపునకు మన ప్రయాణము
ప్రారంభింపబడుతుంది. అది కాలక్రమముమున
బీజముగా పనిచేయ నారంభిస్తుంది. సాధారణంగా
తమ గురువులే ఈ ప్రక్రియను నెలకొల్పుతారు.
అందువల్ల బీజము సులువుగా వృద్ధియై వడగాడ్పులకు యెండిపోకుండా
నిలబడగల్గుతుంది. సాధకుడు తన
నిరంతరస్మరణయను నీటితో పోషిస్తుంటాడు.
సాక్షాత్కార విషయమున యిదొక్కటే అవసరమైయున్నది.
మనము
వైరాగ్యము నలవరచుకొనకున్నచో మాయ నుండి యెన్నటికిని స్వేచ్ఛను పొందలేము. అంతమాత్రమున యింటితోనూ, కుటుంబ
సభ్యులతోనూ తెగత్రెంపులు జేసుకొని ప్రాపంచిక బంధములన్నింటిని వదలుకొని మతపరమైన
సన్యాస జీవనమును చేపట్టమని కాదు దానర్థము.
నిజానికి
సన్యాసమనగా ప్రాపంచిక వస్తుసముదాయముపై విరక్తి గలిగియుండుటేగాని వస్తువులు
కలిగియుండక పోవడం కాదు. నిజం చెప్పాలంటే,
తగని వ్యామోహము, అది సకారాత్మకము (+) గాని
నకారాత్మకముగాని (-) యేదైననూ ఆధ్యాత్మికతకు విషతుల్యమే. నిజనికి వైరాగ్యమనునది ఒక స్థితి లేక అంతర్గత
మానసికస్థాయి. అది ప్రాపంచిక వస్తువుల
నిలకడలేని మరియు మార్పుచెందుతున్న గుణమును మన దృష్టిపథమునకు తీసుకవచ్చి మనలో
వాటిపై విరక్తిని కలిగించును.
మార్పులేనట్టిది, నిత్యసత్యమూ యైనట్టి
సత్యతత్త్వముపైనే సర్వదా మనదృష్టి నిలిచియుండి ఆకర్షణ, వికర్షణ
భావముల నుండి మనకది స్వేచ్ఛను ప్రసాదించును.
ఇట్టి
మానసిక స్థితిని మనము పొందినట్లయిన కోరికల నుండి మనము విడుదల పొందుదుము. కలిగినదానితో మనం సంతృప్తి బొందుదుము. కోరికలు అంతమైనవనగా సంస్కారములేర్పడుట
నిలిచిపోయినవని అర్థము. మనము ప్రపంచమును పరిత్యజించి తపించుటకు అడవులకెళ్ళవలసిన
పనిలేదు. సమాన ప్రకాశవంతములై ప్రాపంచిక
మరియు ఆధ్యాత్మిక ప్రపంచములు ప్రక్కప్రక్కనే సాగనిమ్ము. మనము విజయులము కావలెనన్న
రెండు రెక్కలను చాచి యెగురవలెను.
భగవదాజ్ఞానుసారమే మన భార్యబిడ్డల బంధముతో సహా అన్ని కార్యములను
నిర్వర్తిస్తున్నట్లు భావించవలెను. ఈ
విధంగా మన ప్రతి చర్యా తుదకు పూజగా పరివర్తన చెందుతుంది. సర్వశక్తిమంతునితో మీ యోచనా
సంబంధమేర్పరచుకొనుటకు యిది చాలా సులభమైన పద్ధతి.
కనుక ప్రతి ఒక్కరికి నా సలహాయేమంటే -
నిన్ను
నిర్లక్ష్యము చేయయత్నించు వానికంటే నిన్ను పట్టించుకొను వానినే వెదకికొనుము.
నీలోనే
వెతుక్కో, ఆయన నీలోనే కనిపిస్తాడు. ప్రభువున్నాడు. ఎప్పుడు? ఎప్పుడు నీవక్కడ
లేవో అప్పుడు.
వాస్తవానికి
‘మనస్సు, మాయ’, ఈ రెండింటి మీదనే
ప్రకృతి యంత్రాంగపు పనిమొత్తము ఆధారపడి యున్నది.
అయితే తెలియని వేదాంతులు వాటికి చాలా స్థూలముగా తప్పుడర్థము చెప్పిరి. ఈ రెండే దైవము వద్దకు మనలను చేర్చుటలో
ముఖ్యభూమికను పోషించుచున్నవని వారికి తెలియదు.
వాస్తవమునకు మానవ ఉనికికి ఒక కొసన మనస్సు, మరొక కొసన
మాయ యున్నవి. సత్యతత్త్వ సముద్రతీరమునకు
సాగుతున్న మన ప్రయాణమునకు ఈ రెండిటి కలయికే ఒక వారధిగా మనకుపయోగపడుతున్నది.
బిందువు
సింధువుతో ఐక్యమైతే, బిందువు దానికై అదే సముద్రంగా
మార్పుజెందుతుంది.
నేను
ప్రశాంతముగ నున్నాను.
ప్రియుడూ
ప్రశాంతముగనే యున్నాడు.
రాత్రీ,
జ్ఆబిల్లి ప్రశాంతముగ నున్నవి.
అన్నీ ఆ
దైవీయ ద్రాక్షా చషకంలో కరిగిపోయినవి.
శ్రీ రామచంద్రజీ 19 ఏప్రిల్ 1983న మహాసమాధిస్థితి
నందినారు (దేహత్యాగము గావించినారు) కానీ వాస్తవము వచింపవలెనన్న గురువర్యులు
మరణించరు. ఆయన, సందేశ
బోధకులు వారి హృదయములలో జీవింపజేసుకొన్నంత కాలం ఆయన సజీవుడయ్యే వుంటాడు.
||ఓం శాంతి||
(ఆధ్యాత్మిక శాస్త్ర శత సంవత్సరం 30 ఏప్రిల్ 2000న,
సహజమార్గవిధాన యోగశాస్త్ర, సాధనా నిర్దేశకులు
పూజ్యశ్రీ రామచంద్రజీ (బాబూజీ) వారి శతవసంతోత్సవ సందర్భమున విడుదల చేసిన ప్రత్యేక
సంచిక నుండి గ్రహింపబడిన అంశములు)
పూజ్య సద్గురు
శ్రీరాంచంద్రజీ మహరాజ్
వారి
దివ్యజ్ఞానప్రసారము
శ్రీరాంచంద్రజీ మహరాజ్ వారి
దివ్యజ్ఞాన ప్రసారము
1.
తన అలవాట్లకు దాసుడైనవాడు కూడా విగ్రహారాధకుడే అవుతాడు. ఇది ఇలా జరగాలి
అనుకుంటాం. కానీ అది అలా జరగదు. అంటే మనఇష్టప్రకారం జరగాలి అనుకోవడం కూడా
విగ్రహారాధనే. ప్రాపంచిక వస్తువులపై
మమకారం కలిగి వుండటమంతా విగ్రహారాధనే.
దీన్నుండి విడుదల పొందాలంటే మన మనస్సుపై ప్రాపంచిక విషయ వాసనలు అంటుకొనరాదు.
(ఋతవాణి-2)
2.
సృష్ట్యాదిలో మానవత్వము, దివ్యత్వము
దగ్గరి సంబంధము కలిగియుండినవి.
పరిణామక్రమములో ఏర్పడిన చర్య, ప్రతిచర్యల కారణమున
అదిస్థూలమై పోయినది. తొలుత వుండిన ఆ బంధము తిరిగి ఏర్పడవలెనన్న మానవాకృతిలోవున్న
సమస్తమును తన నిజస్థితియైన సమత్వము మరియు ప్రశాంతతకు తిరిగిరావలెను. అందులకై సమతను లోనికి ప్రవేశ- పెట్టవలెను. అదే
సహజమార్గములో జరుగుతున్నది.
మన అనుదిన ధ్యానము ద్వారా చెదిరిన సమతాభావనను సరిదిద్దుకొను ప్రయత్నము
చేయుచున్నాము. తద్వారా మన ఇచ్ఛాశక్తి పనిచేసి సమతను సుస్థిరపరచుచున్నది. మనలోని
మానవత్వము దివ్యత్వముగా మార్పుచెందడం మొదలౌతుంది. నిజానికి దైవత్వము సిద్దించడమంటే
ఇదే. (సహజమార్గ దర్శనము)
3. ఏ
సత్యతత్త్వము నుండి మనం వెలువడ్డామో అందులోనే లీనమవ్వడానికి సహాయమందివ్వ-
బడుతున్నది. విడివడి- నప్పుడు ఆ అనంతత్త్వపుసత్తా మనవెంట తెచ్చుకున్నాం. దాన్ని మనం అంటిపెట్టుకుని వుండటం ద్వారా మన
యోచనలకు స్వేచ్ఛను గలిగించి తిరిగి ఆ అనంతత్త్వములో కలిసి పోవాలి. దీన్ని మనం నిర్లక్ష్యం చేస్తే మన ఆ లో చనా
కార్యక్రమములోనే యిరుక్కు పోతాం. అనంతమైన మూలసత్యపు పరిధి లోనికి ప్రవేశించలేక
దూరమైపోతాం. (సందేశమాలిక)
4.
మనం మన గమ్యానికి దగ్గరౌతున్నాము.
దానికి మూడు గుర్తులున్నాయి. అవి అ) దివ్యమైన నడవడి. ఆ) దివ్యజ్ఞానము ఇ)
దివ్యమైన ఆలోచన.(ఋతవాణ.2)
5.
మనం మన ప్రత్యేక వ్యక్తిత్వాన్ని ఏర్పరచుకొని స్థూలము మరియు చీకటిపొరలను
ఒకదానిపై ఒకటి చుట్టబెట్టుకుంటూ మనదైన ఒక స్వల్ప సృష్టిని ఏర్పరచుకున్నాం. ఇప్పుడు
మనం ఆపొరలనన్నింటిని ఒకదాని వెనుక ఒకటిగా విచ్ఛిన్నం చేసి సృష్ఠ్యాదిలో
వున్నటువంటి స్వచ్ఛమైనస్థితికి తిరిగి చేరుకో వలసివుంది. ఇదే సంక్షిప్తంగా మన
సహజమార్గ ఆధ్యాత్మిక విధానము. మనకై మనం
సృష్టించుకొన్న మన స్వల్ప సృష్టిని క్రమేణ కడిగి తుడిచేయాలి. లేక మనం వెనక్కి
మరలాలి.(సం.మా)
6. సహజమార్గ సాధన ద్వారా మన ఇంద్రియ ప్రవృత్తులన్నీ సహజమార్గ పద్దతిలో క్రమ బద్దము
చేయబడి, తొలుదొల్త మానవాకృతి ఏర్పడినప్పుడు వున్న
స్వచ్ఛస్థితికి తేబడతాయి. అంతేకాదు, వాటి ఇచ్ఛానుసారం
ప్రవర్తిస్తున్న అధమ మానసిక వృత్తులు అతీంద్రియ స్థితికి లోబడి వుండునట్లు
మలచబడతాయి. అందువల్ల వాటి వికృత చేష్టలు
నిలిచిపోతాయి. ఉచ్ఛకేంద్రములు
దివ్యకేంద్రముల అధీనములోనికి తేబడతాయి.
సమూలాగ్రం ఈవిధంగా దివ్యత్వం గావింపబడుతుంది(స.మా.ద.)
7. ఓర్పు, నమ్రతకు పాఠశాల
గృహమే. ఒకరకంగా యోచిస్తే కొన్నిసమయాల్లో
ఓర్పు కలిగియుండడమే ఒక తపస్సు. అది యితర తపములన్నిటికంటే కూడా గొప్పది. దుఃఖముతోనో,
ఆగ్రహముతోనో మెలగక గైరాత్‌స్థితిని (సిగ్గుతో తలవంచుకపోవడం) అలవరచు కోవాలి. ఇతరులు తిట్లు, చీవాట్లు
పెట్టినపుడు, తప్పు నాలోనే వున్నందుననే అలా జరిగిందని
భావించడమే పశ్చాత్తాపబుద్ది. అలావుంటూ ఓర్పువహించాలి. ఓర్పు సహనం
కావాలని, ప్రాపంచిక ఒడుదుడుకులనుండి విముక్తి పొందాలని, తపస్సుకు
అరణ్యవాసం సన్యాసం ఒంటరితనం అవసరమని ఇతరులంటారు.
కానీ మనకు మన కుటుంబ సభ్యుల, మిత్రుల మరియు ఇతరజనుల
తిట్లు, చీవాట్లు, నిందలు, బెదిరింపులను సంయమనంతో భరించడమే నిజమైన తపస్సు (స్వీయ చరిత్ర-1).
8.
నా అర్థంలో దేనిపై ఏర్పడ్డ ప్రతిబింబ ప్రతిరూపాలు ఇక్కడ ప్రతిఫలిస్తాయో అదే
బ్రహ్మాండము లేక గగన మండలము. ప్రతీదీ మొదట
అక్కడ సూక్ష్మరూపంలో వ్యక్తమై తర్వాత ఈవిశ్వంలో అది రూపుదాలుస్తుంది. (దశాదేశముల
వ్యాఖ్యానము)
9.
అతిత్వరితముగా గమ్యము చేరవలె ననెడు ఆతురత లేక నిరంతర ఆవేదనయే మనకు త్వరగా
విజయమును చేకూర్చు అత్యంత ముఖ్యాంశము.
అనంతశాంతి, ప్రశాంతతయైన ఆ సత్యతత్త్వమును పొందునంత వరకు రవ్వంత
సమయమైనను విశ్రమించుటకు వీలులేదు. ఒక
వస్తువును పొందవలెనను తీవ్రఆకాంక్ష దానిని పొందునంతదనుక ఆతురతగలిగించును. కోరిన వస్తువు లభించు- నంతవరకు శాంతించుట
జరుగదు (సత్యోదయము).
10. మనస్సులో ఆలోచనలు వరుసగా ఉత్పన్న
మౌతున్నా, హృదయబిందువులో లీనమైన స్థితిలో తన్నుతాను కోల్పోయి
వుండగలడు. అక్కడ ఆలోచనల చొరబాటుకు అయిష్టత ఏర్పడుతుంది. లీనమైపోవడము లేక తన్ను తాను కోల్పోవడమన్నది
అనేక రూపాల్లో వుంటుంది. ఇది ప్రతి
స్థాయిలోను కలుగు తుంది. కానీ ఒకసారి
కలిగినదానికి మరొకసారి కలిగిన దానికి తేడా వుండనే వుంటుంది మొదట ఎఱుక గోల్పోయిన (తన్ను తాను గోల్పోయిన)
స్థితిని హృదయస్థాన స్థిరత్వము అనబడును.
ఇక్కడ మనలోని కోరికలు పైకుబికి అలజడి కలిగించుట శాంతించి వుండును. సాంసారిక జీవనములోని అధమ స్థాయిలలో ఉబికి
వచ్చిన యోచనా వివాదముల అలజడికి సంబంధించిన స్థౌల్యము నుండి యిక్కడ స్వేచ్చను
పొందియుందుము. (స్వీ.చ.-1)
11. వాంఛలు అంతమగుట అనగా సంస్కారములేర్పడుట
నిలచిపోవుటే. ఇక మిగిలి
యున్నది పూర్వసంస్కారముల
ఫలములనుభవించుటే. అది జీవితము
కొనసాగుతున్న సమయంలో పూర్తి చేసుకుంటాము. (సత్యో)
12. నాగురుదేవులు ప్రాణాహుతి శక్తి
ప్రసారముగావించిన మొదటి రోజుననే నాలో గురుదేవుల స్మరణ ఉత్పన్నమైనది. దానిని నేను
మూడు విషయములతో కొనసాగిస్తున్నాను. అవి
(అ) గురువుగారి సతత స్మరణ. (ఆ) నా గురుదేవులు కలిగియుండిన లయావస్థ స్థితిని
పొందుటకు నన్ను నేను సరిచేసుకొనుచుండుట. (ఇ) ఏసమయంలో నేను ఏస్థితిలో వున్నానో
దానికి సంబంధించిన విషయాలను గుర్తించుట మరియు అనుభవము లోనికి తెచ్చుకొనుట.
(స్వీ.చ.-1)
13. ధ్యాన సమయంలో నీవు ఒకదానికోసం నిరీక్షిస్తావు. అదే భగవంతుడు.
నిరంతర ప్రయత్నము వలన నిరీక్షణ సహజంగా ఒక విధమైన ఆకర్షణను
కలిగిస్తుంది. అది ఒక ఆత్మను నీవు
పిలవగలిగిన స్థాయికి ఎదుగుతుంది. ఆ ఆకర్షణ
తన అత్యున్నత స్థాయికి చేరిందంటే గొప్ప గొప్ప ఆత్మలు సైతం రానని
తిరస్కరించలేవు. భగవత్తత్వము లోపించడము వలన
మానవుని శక్తి తెలియరాకున్నది. (స్వీ.చ.-1)
14. ధ్యాన సమయంలో నీవుకాదు నీగురువే తన
రూపంపై తానే ధ్యానం చేయుచున్నట్లు భావించినట్లయితే అది అద్భుత ఫలితాన్నిస్తుంది.
(సత్యో)
15. మనస్సు సాక్షాత్కారమువైపుకు
మరలిస్తే అది చాలా సులభము. అంటే దాని లోతైన ముద్ర హృదయంపై ఏర్పడాలి. ముద్ర ఎంత లోతైనదైతే విజయం అంత త్వరగాను
సులభంగాను లభిస్తుంది. అంత చేసిన తర్వాత
ఇకచేయవలసిందట్టే మిగిలి వుండదు. ఆ
భగవంతుని ముద్ర హృదయంపై పడటమంటే తను ఆశించినదంతా గ్రహించినట్లే. ఇట్టి స్థితిలో భగవదీయ ఆలోచన హృదయంలో కొనసాగుతూ
వుంటుంది. ఈ సమయమంతా హృదయం భగవంతుని
ఆకర్షణకులోనై వుంటుంది.
"నిరంతరస్మరణ" అంటే ఖచ్చితంగాయిదే (ఋతవాణి-2).
16. ఈవిశ్వము వునికిలోనికి రావడానికి
కారణభూతమైన ప్రకంపన సృష్ట్యాదిలో కలిగింది.
వాస్తవానికి స్మరణ ఆ తొలి ప్రకంపనతో దగ్గరిసంబంధం కలిగి వుంది. (ఋతవాణి-2)
17. ప్రతిదీ భగవంతుని నుండే వచ్చిందన్న విషయం
గుర్తుంచుకోవాలి. సాటి జీవులు కూడా ఆయన
సృష్టే. ఆయన సర్వాధినేత. మనలో కొందర్ని ఆయన మనకోసం ప్రత్యేకంగా
నియమించవచ్చు కానీ మనందరం ఆయన బిడ్డలం. (ఋ.వా.2)
18. మన ప్రతికార్యంలోను ఆదివ్యశక్తితో
అనుక్షణం విడదీయరాని మానసికసంబంధం కలిగియున్నామన్న భావనతో వుండాలి. మన చేతలు, పనులు
అన్నీ మనము మనశక్తి మేరకు సేవించవలసిన, ఆ మహాప్రభువు మనకు
కేటాయించిన దివ్య కర్తవ్యములుగా భావించి నెరవేర్చుకుంటూ పొతే ఇది సుసాధ్యమౌతుంది.
(సత్యో)
19. మన మనస్సును భగవంతుని వైపు మరల్చినంతనే
మన చేతలు పనులన్నింటిలో మనమా దివ్యశక్తితో సంబంధమున్నట్లు అనుభూతి చెందుతాము. అంతర్గతంగా ఈస్థితి శాశ్వతంగా నెలకొంటే చేసే
ప్రతి పని భగవత్ భక్తిలో భాగము లేక దైవ కైంకర్యముగా భాసిల్లుతుంది. అప్పుడు మనం
సర్వవేళలా ఆ భగవంతుని సతత స్మరణలో వుండిపోతాము (సత్యో).
20. రోజులో చాలాభాగం మాటిమాటికి భగవంతుని
జ్ఞాపకం చేసుకుంటూపోతే, భగవంతునిపై ప్రేమ దానంతటదే
ఉత్పన్న మౌతుంది. దీన్ని అక్కరతో
కొనసాగిస్తే వీలైనంత త్వరగా భగవంతునిలో లీనమైపోదామనే తీవ్రఆతృత హృదయంలో
రేకెత్తుతుంది. (సత్యో)
21. మనం
కర్తవ్యపరంగా మేల్కొల్పబడి మన హృదయాలలో భగవత్‌భావన శాశ్వతంగా నెలకొనగానే
ప్రపంచంలోని విషయము లన్నింటికంటే భగవత్ సాక్షాత్కారమే జీవితంలో అత్యంత ప్రాధాన్యత
గల విషయంగా గోచరిస్తుంది. సహజంగానే మనలోని
ఆ తీవ్రఆకాంక్ష వృద్దిచెంది మనం రోజువారి పనులతో, చింతలతో
ఎంత సతమత మౌతూవున్నా పలుమారు భగవంతుని స్మరణలోనికి కొంపోబడతాము. (సత్యో)
22. భగవంతునికి మనిషికి అనుసంధాన కర్త
గురువు. అతని ద్వారా మాత్రమే మనము
భగవంతుని చేరగలము. ఆయన మాత్రమే మన
మార్గములోని చిక్కుల నుండి గట్టెక్కించగల ఏకైక శక్తి. (స.మా.ద)
23. జ్యోతి
యిప్పటికే వెలిగింపబడియున్నది. భక్తి
నిండిన హృదయములు మాత్రమే ఆ వెలుగునాస్వాదించి మేలు పొందగలవు. ఈ సదవకాశము మళ్ళీ
భవిష్యత్తులో వస్తుందను కుంటున్నావా? అటువంటి దివ్య పురుషుడు
మళ్ళీమళ్ళీ అవతరిస్తాడను- కుంటున్నావా? ఇటువంటి కార్యములకై
మున్నవతరించిన మహనీయులతో ఈయనను పోల్చిచూడ గలమా? అవతారమూర్తులనెడి
వారిలో యింతటి వారుండిరా? ఖచ్చితంగా లేరు. ఇది ఆ సర్వేశ్వరుని నిర్ణయానుసార- మేర్పడిన ఒక
అరుదైన అవకాశము. ప్రకృతి కార్యమునకై అవతరించిన ఈ మహనీయుడు శక్తిలోను, ప్రకృతి కార్యనిర్వహణమందును మునుపటి అవతారములకన్న మిన్న. (ఋతవాణి-1)
24. భగవదీయ
మార్గములో పయనిస్తున్న వ్యక్తికి తన స్వంత ప్రళయమే ఏకైక పరిష్కారము. దానికై
పట్టుదలతో ప్రయత్నించ వలసివున్నది. అందుకు ప్రేమ భక్తిభావములే ముఖ్యాంశములు.
అందులో మునిగిన వాడు నిజజీవితములో ముఖ్యముగా పొందవలసినది మరియు పరమ గమ్యము అయిన
దివ్య శాశ్వత ఉనికిలోనే గట్టెక్కుతాడు. (ఋతవాణి.1)
25.
ఆధ్యాత్మికత తత్సంబంధిత దుస్తులలో లేదు. కానీ ఆదుస్తులు ధరించే వ్యక్తిలో వుంది
ఈసూత్రము విస్మరించబడింది. మానవ మేధస్సు గ్రహించ వీలుకానంత వేగంగా కాలము
మారిపోనున్నది. కలలో కూడా ఊహించలేనంతగా
మార్పు సంభవించి యిప్పుడున్నదంతా త్వరితగతిని మారిపోనున్నది. మార్పు, మార్పు మాత్రమే బలంగా నెట్టుకొనివచ్చుచున్నది. ఇది నీపై (రామచంద్ర)
మాత్రమే ఆధారపడనున్నది. (స్వీ.చ.2-వాల్యూము-2)
26. ఎవరైనా తమ
హృదయంలో నా యెడల ప్రేమ గలిగి యున్నట్లు నేను గమనిస్తే నేను మహదానందంతోను
ఉత్సాహంతోను నిండి పోతాను. ఈప్రపంచంలో ప్రేమించడానికి, ఇష్టపడటానికీ
ఎంతో వుంది. ఐనా నన్నే వారు
ఎందుకెంచుకున్నారు?
(అ) తన్ను తానే కోల్పోయిన వాడు కానీ (ఆ) కనీసం కోల్పో
దలచుకున్న వాడు కానీ (ఇ) సర్వస్వం వదలుకోదలచిన వాడు కానీ .... బహుఃశా నా వైపుకు మొగ్గు
చూపుతాడు. (ఋతవాణి-1)
27. మన ఈ బయటి ప్రపంచ జీవితానికి ఆవలనున్న
నూతన జీవితంలోనికిప్పుడు ప్రవేశించవలసి వుంది.
కనబడే ఈమనిషి వెనుక అసలు మనిషి వున్నాడని మనం చెప్పవచ్చు. ఇప్పుడు నీవు నిజమైన జీవితంలోకి ప్రవేశించాలంటే
నీవు అసలు మనిషిని లేక మనిషిలోపలి మనిషిని లేక మనిషికావలనున్న మనిషిని
వెతకాలి. అది హృదయ నేత్రంతోనే కనుగొన
వీలౌతుంది. శరీరంలోని అణువు, పరమాణువుల్లో ఆ
అనుభూతి కలుగుతుంది.
దేహధారియైయున్నప్పటికి అతడు దేహానికే- విధంగానూ సంబంధము కలిగి వుండడు. అతడు
శూన్యమునకు అతి చేరువలో వుంటాడు. అతని
ఆచ్ఛాదన ఈసమస్త విశ్వమయమైయుంటుంది. అందులో అతని పని అతనిదైవుంటుంది. అతన్ని
గుర్తించడం నిజమైన సమస్య. గురుదేవుని కృపవలన సమస్తమూ నాపై గ్రుమ్మరింప బడుతూవుంది.
అదంతా ప్రాణాహుతి ప్రసారంద్వారా అభ్యాసులకు అందచేస్తున్నాను. వారినుండి తిరిగి
యేమీ ఆశించకుండా కేవలం ఇది నాకర్తవ్యంగా భావిస్తున్నాను. అయినా అభ్యాసులకు తనంతట
అదే వారికి చెందినదై, అప్పుచెల్లించిన రీతిలో
వారికి అందచేయబడుతున్నది. (ఋతవాణి-1)
28. ఆయన
ఎవర్ని ఆకర్షిస్తాడో వారు మాత్రమే విజయం
సాధిస్తారన్నది అసలు విషయం. నీవు నేను కాళ్ళూ చేతులతో తాళం వేయడం వృధా.
సమయమాసన్నమైనప్పుడు అందరూ ఒకరి వెనుక ఒకరు సరియైన మార్గానికి వచ్చిచేరుతారు.
ఉద్వేగాలు, సంస్కారాలు మనిషి మనిషికి వేరువేరుగా వుంటాయి.
తదనుగుణంగానే ఎవరి సమయం వారికి వేరువేరుగా వస్తుంది. (స్వీ.చ.-1)
29. ప్రభుసదనము మనతో నేరుగా సంబంధము గలిగి
యుండి మనమున్న ఈప్రపంచాన్ని నియంత్రిస్తున్నది. కనుకనే ఏలోకములోను లేని రీతిన
ఈలోకములోనే అవతార పురుషులు ఉద్భవిస్తున్నారు.
ఈరీతిన మనం (మనలోకం) ఆ ప్రభు సదనంతో సంబంధమేర్పరచుకొని వున్నాం. కనుకనే ఆ
దివ్యసదనంలోని శక్తి మనలోనూ వుంది. ఆశక్తి మొదటి కదలిక ద్వారా వెలువడింది. అది
సర్వశక్తులు ఏకీకృతమైన మహాశక్తి. కనుకనే
అది మిగిలిన శక్తులన్నింటి కంటే గొప్పది మరియు కాంతి వంతమైనది. (రాజయోగ ప్రభావం)
30. సాంసారిక ఒడుదుడుకులను, ఇబ్బందులను గురించి చర్చిస్తూ మాగురుదేవులు, ఓర్పు
సహనమునకు మన గృహమే మనకు శిక్షణాలయము అనెడివారు.
సాంసారిక జీవనంలోని కష్టములను ఓర్పుతో సహించుకొని పోవడమే మనకొక గొప్ప
తపస్సు. ఇదే మిగిలిన తపస్సులకన్నా
శ్రేష్ఠమైనది. కనుక ఇట్టి పరిస్థితులలో
మనము కోపతాపము లకు తావీయక ఎదురు ప్రశ్నింపక తప్పు మనయందుండుట వలననే
యిట్లయినదని తలచి ప్రశాంతచిత్తముతో భరించుటే చేయవలసినది. మన స్నేహితుల, బంధువుల తిట్లు తిరస్కారములే మనకు గొప్ప తపస్సు. అదే విజయమునకు తిరుగులేని
మార్గము. (సత్యో)
31. నామటుకు
నాకు కష్టములకు దుఃఖములకు సంబంధించిన అనుభవములున్నవి. వాటిని గురించి నేను లోతుగా
ఆలోచించి ఒక నిర్ణయానికొచ్చాను. ఈ కష్టాలు జబ్బులు ప్రకృతి మనకొసగిన అదృశ్యవరములు.
అవి మన సంస్కారముల ప్రభావం నుండి బయట పడుటకు సహాయపడును. అవి నిశ్శేషమైపోతే ఆధ్యాత్మిక ప్రగతికిక
అడ్డేవుండదు. కాని మనస్సు మాత్రం అంతర్గతంగా గమ్యంవైపే వుండాలి. (ఋతవాణి)
32. నేను పేదరికాన్ని ఎన్నుకుంటాను. కాస్త
ఉప్పువేసిన రొట్టె తప్ప ఇంకేమి లేని స్థితి నాకు చాలా ప్రియమైనది. ఇప్పటివరకు
ఒక్కరు కూడా ఆస్థితిని పొందటానికి ముందుకు రాకపోవడం నిజంగా దయనీయమైన పరిస్థితి. (ఋతవాణి-1)
33. ధ్యాన సమయంలో అనేకమైనఆలోచనలు
మనస్సులోనికి చొరబడుతున్నాయని సామాన్యంగా ఫిర్యాదు చేస్తుంటారు. మనసు నిశ్చల స్థితికి రాలేదుగనుక తమసాధనలో తాము
విఫలమైనామని వాపోతారు. కానీ అది సరికాదు. మనం ఏకాగ్రతను కాదు, ధ్యాన సాధన చేస్తున్నాం. ఆ సమయంలో వచ్చిన ఇతర యోచనలను ఖాతరు చేయకుండా
ధ్యానం కొనసాగించాలి. విశ్రాంతిలేని మన ఎఱుకగల మనస్సు యొక్క కార్యకలాపమే
ఈఎడతెఱపిలేని యోచనా ప్రవాహము. మన ఎఱుకగల
మనస్సు ఎనలేని యోచనలతో అటూ ఇటూ సంచరిస్తున్నా మన అంతర్గత మనస్సులో
తీరికలేని ధ్యానస్థితిలో కొనసాగుతూనే వుంటాం. కనుక మనం ఏవిధంగానూ నష్టపోవడంలేదు.
కాలము గడచేకొద్దీ తగు సాధనయొక్క ఫలితంగా ఆ ఎఱుకగల మనస్సు సైతం సరిదిద్దబడి అంతర్గత
మనస్సుకు అనుగుణంగా మార్పుచెంది సానుకూలంగా పనిచేస్తుంది. (సత్యో)
34. ప్రభువును నిజంగా తన ప్రభువే అని
అంగీకరించి, నమ్మి, భక్తుడై అతని సేవలోనే
పూర్తిగా నిమగ్నమవ్వడముతోనే మానవుడు పరిపూర్ణుడౌతాడు. అలా చేయడం ద్వారా నీలో ఒక
శూన్యస్థితి ఏర్పడుతుంది. అప్పుడు ప్రభువు యొక్క దృష్టి నేరుగా నీపై పడుతుంది.
(ద.దే.వ్యా.)
35. ప్రభువు యొక్క సాన్నిహిత్యాన్ని
కొనసాగిస్తూ ఆయనయందే మనస్సును ఏదో విధంగా నిలిపి ఆయన వాడుగానే జీవనం సాగించాలి.
అప్పుడు మర్యాదకరమైన జీవన విధానము మరో మలుపు తిరుగుతుంది. మనము తెలియక చేసిన
తప్పులను నియమవిరుద్దములైన పనులను మన ప్రభువుగా అంగీకరించిన ఆయన ఎదుట బహిరంగముగా
ఒప్పుకొని నివేదించుకొనవలెను. ఈవిధంగా చేయడం వల్ల మన అశక్యతను నిరూపించుకొంటాము.
మన అశక్యతను హృదయపూర్వకంగా తెలియజేస్తూ తప్పులను నిర్మొహ- మాటంగా ఒప్పుకొనడం వలన
ప్రభువు మనతప్పులు క్షమించ దగినవేనని భావిస్తాడు. (ద.దే.వ్యా.)
36. హృదయస్థానంలో "దివ్య ప్రకాశము"
యున్నది అన్న భావనతో ధ్యానం చేస్తూపోతే మనం క్రమేణా పైకెదగడం మొదలౌతుంది. మరింత
స్పష్టంగా చెప్పాలంటే ఇది మొదటి దశ, గనుక అభ్యాసి
అక్కడ అంతర్గత ఎఱుకలో మరింత లోతుకు మునగడానికి విశాలత్వాన్ని గమనిస్తాడు. అంటే మనం
అనంతత్త్వపు బీజాన్ని నాటామన్నమాట. మరో మాటలో చెప్పాలంటే మన దృక్పథం నుండి
తప్పించుకొన్నదానిని తిరిగి దృష్టిపథం లోనికి తెచ్చామన్న మాట. ఇక రెండవ దశ మన దృక్పథంలోనికొస్తుంది.
మనిషి ప్రతి జీవపదార్థంలోనూ భగవంతుడున్నట్లు అనుభూతి చెందుతాడు. మూడవదిగా మనిషి
ప్రతీదీ మార్పుకుగురౌతున్నట్లు గమనిస్తాడు. ఇది కూడా మారి మనిషి ప్రతీది కూడా
భగవంతుని నుండి వచ్చిందే, అన్నీ ఆయన స్వరూపాలే అన్న
అనుభూతిని పొందుతాడు. ఇక నాల్గవది శూన్యస్థితిలో మొదలౌతుంది. అదే తుదకు మనమంతా
పొందవలసింది. (ఋతవాణి-2)
37.మనోవికారములు (కామ,క్రోధ,మోహాదులు) అంతమైతే తెలివి పూర్తిగా
నశిస్తుంది. కారణ మేమంటే మనోవికారములు స్పందనలను కలుగచేస్తాయి. ఆస్పందనలే
తెలివినుత్పాదిస్తాయి. కనుకనే వాటిని క్రమబద్దీకరించాలి. మరో రీతిగా చెప్పాలంటే
పాశవిక మనోవికారములను మానవీయ మనోభావాలుగా మార్పుచేయాలి. (ఋతవాణి-1)
38. ఆధ్యాత్మికత నిజానికి అత్యంత సూక్ష్మమైన
మానసిక స్థితి. దానితో పోల్చినపుడు
మిగిలినవన్నీ బరువుగాను, స్థూలంగాను అనిపిస్తాయి.
గులాబిపువ్వు యొక్క సువాసన హృదయముపై కలిగించు సున్నితమైన అనుభూతి సైతం దానితో
పోలిస్తే బరువైనదే. ఆ స్థితిని నేను
ప్రకృతితో అనువైన పొందిక గలిగిన సంపూర్ణ ప్రశాంత సమతాస్థితి అని వ్యక్తీకరించ-
దలతును. ఇట్టి మానసిక స్థితిలో మన ఇంద్రియ
సంబంధమైన ప్రజ్ఞాపాటవములు నిద్రాణావస్థలో వుండును. వాటి పని దానంతటదే జరుగుతూ
మనస్సుపై ఏ విధమైన ప్రభావము పడని రీతిలో నుండును. (సత్యో)
39. సృష్టికి పూర్వము కేవలము ఆకాశము (భూమా)
మాత్రమే ఆవరించియుండెను. కనుక భగవంతుడుండుటయన్నది తర్వాత పరిణామమే. అది
వ్యక్తమగుటకు కొంత సమయము పట్టెను. ఆకాశము అనంతము గాను శాశ్వతముగాను దృగ్గోచరమగు
చున్నది. కనుక భగవంతుడు కూడా శాశ్వతుడని నిర్ధారించనగును. కాలము భగవంతుని వెనువెంట
ఉనికిలోనికి వచ్చినది. కనుక భూమాయే భగవంతునికి తల్లిగా భాసిల్లినది. కాలము
(అవకాశము) దీనికి వ్యతిరేకస్థితి. ప్రతీదీ అనంతంలో అంతం కావలసిందే. ఎవరైనా
అంతర్గతంగా ఆ ఆకాశస్థితిని తమలో ఉత్పన్నంచేసుకుంటే అతడు అత్యంతోన్నత స్థాయిని
చేరినట్లే.అది సమస్త వ్యవహారములు
కుదుటబడిన స్థితిలో సమమైవుంటుంది. ప్రతి ఒక్కరు దీనినే ఆశించవలసి వుంది.
ఆకాశము లేక భూమాయే పరమోత్కృష్టస్థితి. (స.మా.ద)
40. సృష్టి మొదలు కావడానికి ముందు వున్నదంతా
అసలైన దివ్యత్వమే. అన్నీ వాటి సత్వరూపములో అందులో యిమిడివున్నాయి. మూలంలో కలిగిన
క్షోభతో ఒక్కొక్కొటి రూపు దాల్చే ప్రక్రియ మొదలయింది. క్షోభవల్ల అంతర్గత చైతన్యంలో
ఒక సంచలనం కలిగింది. (స.మా.ద)
41. ఆత్మార్పణమంటే తన ప్రాధాన్యతను పూర్తిగా
వదిలి సంపూర్ణంగా గురువుగారి యిచ్చకు అనుగుణంగా వర్తించడం తప్ప యితరంకాదు.
ఈస్థితిలో శాశ్వతత్వం సాధిస్తే అది శూన్యత్వంలోకి దారి తీయడం మొదలౌతుంది. ఈ
ఆత్మార్పణ స్థితిలో ఏమి ఆలోచించినా, ఏమి చేసినా అది
గురువుగారి యిచ్చకు అనుగుణంగానే వుంటుంది. ప్రపంచంలో ఏదీ తనది కాదని అంతా
గురువుగారి అజ్ఞానుసారమే లభిస్తున్నదని భావిస్తాడు. (సత్యో)
42. మానవ జీవితాన్ని సాంతం మార్పుజేసి, ఉన్నతోన్నత ఆధ్యాత్మికస్థితులకు చేర్చు శక్తియే సహజమార్గపు
మహాద్భుతము. ప్రాణాహుతిశక్తి ప్రసారమే యీ
అద్భుతము. ఈ శక్తి పరిశుద్ధము గావింపబడిన
మనోమార్గముల ద్వారా ప్రసారము గావింపబడును.
నిరంతరము, అత్యంత ప్రతిభావంతముగా యిచ్ఛాశక్తి ద్వారా
ప్రసారము గావింపబడి ఫలవంతమగుచున్నది.
(స.మా.ద)
43.మొదలు పెట్టిన తక్షణమే ప్రాణాహుతి
ప్రసారము వలన శాంతి, నెమ్మది ప్రసారింప బడుతుంది. ఆ అనుభవాన్ని మాటల్లో
వ్యక్తీకరించలేము. ధ్యానంలో కలిగే ఈ అనుభవం మనం తిరిగి వెళ్ళి చేరవలసిన మూలాన్ని
గుర్తుచేస్తుంది. ఈ అనుభవం మళ్ళీ మళ్ళీ కలగడం వల్ల మన అసలు స్వస్థలమైన మూలానికి
సంబంధించిన జ్ఞాపకాన్ని
దృఢపరుస్తుంది. ఈ జీవితానికి సంబంధించిన
బంధనాలను సడలిస్తుంది. ప్రాణాహుతి శక్తి మనల్ని ఆంతరంగిక ఎఱుక లోతుల్లోకి
తీసుకుపోతూ మూలానికి వెళుతున్న మన ప్రయాణం నిర్దిష్టం చేస్తుంది. (దివ్య
సందేశములు)
44. పదార్థ
కణాలను శక్తిగా మార్చవచ్చును. మరో మాటలో చెప్పాలంటే పదార్థము స్థూలరూపంలో వున్న
శక్తే. ఇది ఒక శాస్త్ర సూత్రము. దీన్ని నవీన శాస్త్రము సైతము అంగీకరించింది.
ప్రాణాహుతి పదార్థాన్ని శక్తిగాను, శక్తిని మూలసత్తాగాను
మారుస్తుంది. (ఋ.వా-2)
45. ఈ గుర్తింపు మహాప్రళయమాసన్నమై సర్వము తమ
వ్యక్తిత్వగుర్తింపు అంతా సమైక్యగుర్తింపులో లీనమయ్యే వరకు వుంటుంది. తిరిగి అదే
తర్వాతి సృష్టికి కారణభూత- మౌతున్నది.
కనుక ఈ వ్యక్తిత్వమే అంతమౌతున్నది కానీ గుర్తింపు (ఉనికి) మాత్రం
కాదు. ఉండుట లేకుండుట అన్నది కేవలం
నామమాత్రమే. ఆ మూలము, ఆకేంద్రంలో నిద్రాణమై వున్న
చైతన్యం వల్లనే యిదంతా సంభవమౌతున్నది. (ఋ.వా.1)
46. మరణస్థితి
అన్ని గ్రంథుల్లో మొదలౌతుంది. అది అనుభవానికి మించిన దృఢత్వంతో వుంటుంది. అంటే
అభ్యాసి ఆస్థితిలో పూర్తిగా కేంద్రస్థానంలో లీనమై పూర్తిగా తన ఉనికినే కోల్పోతాడు.
(స్వీ.చ-1)
47. మనందరం
సోదరులం. బుద్దిపరంగా, నీతిపరంగా మరియు జీవితపరమార్థమైన
ఆధ్యాత్మిక పరంగా మనం ఒకరికొకరం సంబంధం కలిగి వున్నాము. ఇది అది అన్న అడ్డంకులన్నీ
యిప్పుడు తొలగిపోయాయి. ఆయనపనిలోను, వాతావరణంలోను పవిత్రతే
మిగిలింది. అది అనంతత్వానికి దారి నేర్పరచి మూలంతో కలుపుతున్నది. (దివ్యసందే.)
48. ప్రకృతి సంతరించుకున్నదంతా అత్యంత
స్వచ్ఛంగా వుంటుంది. కారణం దాని ఉత్పత్తి స్థానం పవిత్రం. స్వచ్ఛము మరియు
ధర్మబద్ధమైన పద్దతిలో గడించిన సంపాదన కూడా ఈవిధంగానే స్వచ్ఛమై వుంటుంది.
(ద.దే.వ్యా)
49. భగవంతుని ఇచ్ఛానుసారమే జగమంతా
నడుస్తున్నది. ఆయనే అన్నిటికి కర్త. కానీ అదంతా మన ఇచ్ఛ మన శక్తికి జోడించి మన
కృషి ఫలితంగానే జరిగిందనుకోవడమే వచ్చిన చిక్కు. ఈకారణం చేతనే మనం విజయాలకు
ఉప్పొంగిపోవడం, అపజయాలకు కృంగిపోవడం జరుగుతున్నది. ఇదే మనల్ని
బంధనమునకు గురిచేస్తున్నది. (ఋ.వా-1)
50. లక్ష్యమును సాధించుటకు అత్యంత ఖచ్ఛితమైనట్టిదియు, సులభమైనదియునగు ఉపాయము, నీకు నీవే సమర్థ గురువునకు
సమర్పించుకొని జీవన్మృతుడవు అగుట. ఈ సమర్పణ (ఆత్మార్పణ) భావము యాంత్రికము, కృత్రిమము, బలవంతము అయివుండరాదు. శ్రమ, ఒత్తిడి లేకుండా సహజముగా
మనయందది కలుగవలసి యున్నది. నేను, నాది యను "అహం"
భావము (ఎఱుక) వున్నంతవరకు అది నిజమగు ఆత్మార్పణ కాజాలదు. వాస్తవ సంపూర్ణ
ఆత్మార్పణము జరిగిన మీదట ఇక చేయవలసిన-
దేమియు వుండదు. (స.మా.ద.)
-o0o-
పూజ్యశ్రీ రామచంద్రజీ
విమల ముత్యములు
సంకలనం
శ్రీ జి.విజయ రంగాచారి
పూజ్యశ్రీ రామచంద్రజీ
విమల ముత్యములు
1. మా గురువర్యుల ఉత్తరాధికారిగా, నాకందించిన వారి ఆశయముల ననుసరించి, నా కర్తవ్యముగా,
ఆయన పేరున, ఆయన జ్ఞాపకార్థం 31 మార్చి,
1945 లో శ్రీ రామచంద్రమిషన్‌ను స్థాపించితిని. ఫతేఘర్(ఉ.ప్ర) వాస్తవ్యులు మహాత్ములునైన
గురువర్యులు, నూతనముగా ప్రవేశపెట్టిన సహజమార్గ విధానముద్వారా
ఈ కాలపు అవసరమును గుర్తించి ప్రజాబాహుళ్యమునందు భగవదీయ చైతన్యమును జ్ఆగృతపరచు
నిమిత్తమై ఆయన ఏర్పరచిన సిద్ధాంతములను ప్రకటించుటే ఈ సంస్థ ధ్యేయమైయున్నది. (1967 లో శ్రీబాబూజీవారు షాజహాన్‌పూర్‌లో
చెప్పగా సంకలనకర్త వ్రాసుకొన్నది).
2. మన జీవిత లక్ష్యమును
సాక్షాత్కరింపజేసికొనుట మన ముఖ్య కర్తవ్యము.
అందుచేత వ్యక్తి మహోన్నతమైన దాని నాశించవలెను. శాంతి మరియు తదితరములు అప్రధాన్యములు. మహోన్నతమైన దాని నాశించు అభ్యాసి మాత్రమే
శ్రీరామచంద్రమిషన్ నిజమైన సభ్యుడుగా గుర్తింపబడతాడు. (సత్యోదయము 5వ ముద్రణ 1976 -
పుట 17)
3. గమ్యమునకు
నేరుగా చేర్చగల సరియైన మార్గమునెన్నుకొనుట మనకు విస్మరించరాని అత్యంత ముఖ్యమైన
విధి. అందువలన అంతిమ గమ్యమును గూర్చి మన
మనస్సున స్పష్టము మరియు ఖచ్ఛితమునైన అవగాహన ఉండుట అత్యంతావశ్యకము. చాలా పురాతనమైనదైనందున ఒక విధానము యోగ్యమని
అనుసరింపకుము. అది మారిన కాలముతోపాటి
మారిపోయిన ప్రపంచమునకు, సంఘమునకు అనువైనది
కాకపోవచ్చును. చాల మంది
అనుసరిస్తున్నారన్న కారణంచేత ఒక విధానము ననుసరింపకుము. జనబాహుళ్య మెప్పుడూ సక్రమంగానే వెళుతున్నారనుకొనలేము. వాళ్ళందరూ ఏ కొద్దిమంది వెంట గుడ్డిగా వెళుతుండ
వచ్చును. ఆ కొద్దిమంది
తప్పుత్రోవబట్టియుండు అవకాశము లేకపోలేదు.
ఈ కారణముల చేత విశ్వాసము, ఆత్మస్థైర్యముతో తమ
దృష్టిని అంతిమ సత్యముపై నిలిపి ఆత్మసాక్షాత్కారమునకు సహాయపడు మరియు దోహదముచేయు
విధానముల చేపట్టవలెను. అప్పుడు మనము
ముందుకు సాగి సృష్ట్యాదిన ఎట్టి పవిత్ర రూపమందుంటిమో అట్టి రూపముననే తుదిస్థాయిగా
నందుకొందుము. రాజయోగము, గొప్పఋషులు మరియు సాధువులు, ఆత్మసాక్షాత్కారము లేక
భగవత్‌సాక్షాత్కారము కొఱకు సాధన చేసిన పురాతన యోగశాస్త్రము. సూర్య వంశపు రాజైన దశరథ మహారాజుకు డెబ్బదిరెండు
తరముల క్రితము నివసించిన ఒక మహర్షి చేత ప్రవేశపెట్టబడినది. చాలాకాలము విషయముపై లోతుగా అధ్యయనము చేసి ఆ
మహర్షి తుదకు యిది మానవుని ఆలోచనాశక్తితో సమము మరియు అదే విధముగానున్న శక్తి యొక్క
ప్రతిఫలమని కనుగొనెను. మనలో రాజైయున్నది
ఆలోచన. అది కడకు వృద్ధియై మన గమ్యమునకు
నడిపించు చున్నది.
(1.సత్యోదయము మొదటి ముద్రణ 1976- పుటలు 68 నుండి 70
వరకు. 2. రాజయోగప్రభావము 2వ ముద్రణ 1960-
పుటలు 1,2)
4. సాక్షాత్కారము నరములు, కండలతో ఆడే పోటీ క్రీడకాదు. వ్యధ,
తపన, హింసతో కూడిన భౌతికవిన్యాసమూ కాదు. ఇది అంతర్గత ఉనికిని మార్పుచేసి నిజస్థితికి
దెచ్చుట. మార్పు/ పరిణామమును
రెండువిధములుగా తీసుకరావచ్చును. మొదటిది
దానిని వాంఛించడం ద్వారా పొందుట. రెండవది
బలవంతముగా లొంగదీయుట. కానీ రెండవ దానిలో
దీర్ఘకాల ప్రభావముండదు. కనుక ప్రతి
అభ్యాసి తనలో మార్పుకోసం తీవ్రంగా వాంఛించవలెను.
(1.ఋతవాణి 2వ ఎంపిక, మొదటి ముద్రణ ఏప్రిల్ 1978 పుట 24. 2.ఋతవాణి మొదటి ముద్రణ పుటలు 42,43 లోని విషయ సంక్షిప్తత)
5. భగవత్‌సాక్షాత్కారము, యిప్పటి వరకు చాల కష్టమైనదని, కఠినపరిశ్రమ, పట్టువిడవని ప్రయత్నములు అనేక జన్మలు చేసిననేగాని సాధ్యపడదని నమ్మిన
విషయము. వాస్తవానికటువంటిదేమీ కాదు,
భగవంతుడు సులభుడు, సులభమైన పద్ధతుల ద్వారా
సాధింప వీలగువాడు. జీవితము నందు కఠిన నియమ
నిబంధనలు, అలసటకు గురిచేయు పద్ధతులు సాక్షాత్కారమునకు
చేపట్టుమని నిబంధించు బోధకులు వాస్తవమునకు విషయమును సంక్లిష్టమొనర్చి జనులు,
మాశక్తిసామర్థ్యముల కిది సాధ్యము కాదను నమ్మకమునకు వచ్చునట్లు
చేసిరి. మీ ధ్యాస నటువైపు త్రిప్పినట్లయిన
సాక్షాత్కారము కష్టమేమీ కాదని నేను మీకు నిశ్చయముగా చెప్పుచున్నాను.
(సత్యోదయము - 5వ ముద్రణ 1976 - పుట 60)
6. ధైర్యస్థుడైన సైనికునివలె సాక్షాత్కార
మార్గమున మనము పూర్తి విశ్వాసము, ఆత్మస్థైర్యము
గలిగి కష్టములను లెక్కచేయక, అపజయమును ఆలోచనలోనికే రానీయక
ముందుకు సాగవలెను. నిరాశా నిస్పృహలు మన
యిచ్ఛను బలహీనపరచి మన దృఢనిశ్చయమును విచ్ఛేదమొనర్చును.
(పై గ్రంధములోనే - పుట 34)
7. మనము మన ధ్యాసను భగవంతుని వైపు మరల్చి
సాక్షాత్కారమే జీవితపు ప్రాథమికాంశముగా భావింతుమేని, సహజముగా మనం అదే మన మొదటి మరియు ప్రధానమైన అంశములుగా చూడనారంభింతుము. ప్రపంచములో మరేదీ దీనికి సాటిరాదనిపించును. (పై
గ్రంథములోనే - పుట 74)
8. సాక్షాత్కార విషయమున అతి ముఖ్యాంశము
విజయము సాధించుటలో మన శక్తిసామర్థ్యముల మీది ఆత్మవిశ్వాసము. ఒక్క క్షణమైనను మనము బలహీనులమని, పూర్వపు మహర్షులలో ఘనులైనవారు సహితం అందుకోజ్ఆలని మహోన్నత సంపూర్ణస్థితిని
అందుకొనుటకు అర్హత లేనివారమని లోప భూయిష్టులమని తలంచుట అవివేకము. (అదేగ్రంథములోని
- పుట 74)
9. శిలవలె స్థిరంగా వుండు. విజయం దానికదే నిశ్చయంగా లభిస్తుంది. అనిశ్చితవైఖరి హృదయపూర్వకముగాని ప్రయత్నములకు
దారితీసి సామాన్యముగా అసంపూర్ణవిజయమున గాని లేక అపజయమునగానీ తరచు ముగియును.(1.
ఋతవాణి మొదటి ఎంపిక, మొదటముద్రణ -1970 పుట - 125. 2. సత్యోదయము
5వ ముద్రణ 1976- పుట 32)
10. అభ్యాసి ఎప్పుడూ చిత్రముయొక్క మెఱుగైన
వైపుననే దృష్టి నిలుపవలెను. ఎప్పుడేగాని
తన్నుతాను నిరాశాభావమునకు గురిచేసుకొనరాదు.
అది మార్గమున గొప్ప ప్రతిబంధకము. (రాజయోగ ప్రభావము - 2వ ముద్రణ 1960 - పుట 58)
11. ఆందోళనలను, వైరుధ్యములను జీవితములో ధైర్యముగ యెదుర్కొని వాటి ప్రభావము నుండి
స్వేచ్ఛను పొందిన వాడే రణరంగమున నాయకుడు - వాస్తవాంశమేమంటే జీవితములోని ప్రతి
విషయము అంతిమముగా మన మేలుకే యేర్పడుచున్నది.
వాటిని మనకుపయోగకరముగా మార్చుకొను విధానమును మనము నేర్వవలెను.
(1. సత్యోదయము 5వ ముద్రణ - 1976 - పుట 28.
2. ఋతవాణి
మొదటి యెంపిక - మొదటి ముద్రణ - 1970 - పుట 33)
12. నీవు నీధ్యాసను భగవంతుని వైపు మరల్చి, యిచ్ఛ, విశ్వాసము, ఆత్మ
స్థైర్యముతో పురోగమిస్తే చింతించవలసిన పనిలేదు.
నీవు యెంతటి సాంసారిక జీవనములోని బాధలు వ్యధలతో చుట్టుముట్టబడి- నప్పటికిని
నీవు ఆధ్యాత్మిక రంగమున గౌరవస్థానము నధిరోహించి పూమాలలతో సత్కరింపబడుదువని నేను నీకు
నిశ్చయముగ చెప్పుచున్నాను. (సత్యోదయము 5వ ముద్రణ - 1976 - పుట 31)
13. ఈ మార్గములో బాహ్యపరిసరములు మార్చుకోవడం
వల్ల ఏమంత ప్రయోజనముండదు. అభ్యాసీయే
పరిసరములకు తగ్గట్టు తన్నుతాను సర్దుబాటు చేసుకొని భగవదిచ్ఛకు దాసుడగుటకు అనువగు
విధానము నవలంబించుటకు తగిన వాతావరణము నేర్పరచుకొనవలెను. భవవదిచ్ఛ శక్తివంతమై వ్యాపించియున్నది. పరీస్థితులు దాని ఫలితముగనే
యేర్పడుచున్నవి. వాటిని భగవంతుని వరములుగా
గుర్తించి గైకొనుటను మన మభ్యసించవలెను. (ఋతవాణి - 2వ యెంపిక - మొదటి ముద్రణ -
ఏప్రిల్ 1978 - పుట 220)
14. మొదటి అడుగులోనే బలమైన యిచ్ఛను
ప్రయోగించి దాన్ని అలాగే కొనసాగిస్తే అంతిమ విజయం సాధ్యపడక పోవటమన్నదే
జరుగదు. కష్టములు, నిరుత్సాహములు కేవలమొక చూపు మాత్రముననే కరిగిపోయి, విజయపథము
నిరాటంకమగును. మన ధృఢమైన యిచ్ఛ మనకు
తెలియని మూలం నుండి స్వతఃసిద్ధముగా శక్తిని గ్రహించి సమస్యను పరిష్కరించును. (
సత్యోదయము 5వ ముద్రణ - 1976 - పుటలు 31,32)
15. భక్తుడు
లేక అభ్యాసి గురువు వద్ద ఒక సైనికుడు కవాతులో కనబరచు చురుకుదనమున, ఒక ప్రామాణిక విధానమున తన్నుతాను సమర్పించుకొనవలెను. "సావధాన్" అను మాట విన్నంతనే అతడు
చక్కగా నిలబడి సావధానచిత్తుడై అధికారి వైపు చూపు సారించును. ఇది జ్ఆగురూకత, ఆరోగ్యకర
స్థితి మరియు నూతనోత్సాహముదేహమున కన్పింపజేయును. (దశాదేశముల వ్యాఖ్యానము - 1946/1959
పుట - 9)
16. ప్రాణాహుతిప్రక్రియ ద్వారా గాక మరే యితర
ప్రక్రియ ద్వారానైనను, ఆధ్యాత్మికమహోన్నతుల
పొందుటకు శిక్షణనిచ్చుట సాధ్యము కాదని నేను నిశ్చయముగా చెప్పుచున్నాను.
(సత్యోదయము 5వ ముద్రణ - 1976 - పుట 48)
17. ప్రాణాహుతి ప్రసారశక్తి ఒక మహోన్నతస్థాయి
యోగి సాధించిన ఆధ్యాత్మికస్థాయి. దానితో
యోగి తన యిచ్ఛాశక్తి నుపయోగించి యోగశక్తి లేక భగవదీయశక్తి ధారను వ్యక్తిలోనికి
ప్రవేశపెట్టి అతని ఆధ్యాత్మిక పురోగమనమునకు నిరుపయోగము మరియు వినాశకారకమైన
వాటినన్నిటిని తొలగించివేయును. (అదే గ్రంథములో పుట - 49)
18. ఇప్పుడు జీవితలక్ష్యమును గూర్చి
చర్చింతము. మోక్షమునకన్నా అధమమైనదేదియు
జీవితలక్ష్యముగా గైకొనరాదు. అయినా దానితర్వాత
యింకా సాధించవలసినదెంతో యున్నది. ఆ
మోక్షమునైనను జీవిత గమ్యముగా గలవారు కూడా చాలా తక్కువే, అదికూడా ఆధ్యాత్మిక యానమున అట్టడుగు మెట్టును సూచించును. ఈ స్థాయికి కూడా క్రిందే వుంటే జీవితసమస్య
పూర్తిగా అపరిష్కృతము. జీవిత- లక్ష్యమంటే
కడకు మనము చేరుకోవలసిన స్థానమే గాని వేరుకాదు.
దీన్ని మరోమాటలో చెప్పాలంటే యిది మన జన్మస్థానము యొక్క స్మృతి లేక యిప్పటి
మన స్థూలాస్థిత్వము యొక్క తొలిస్థితి.
ఇక్కడికే మనమెల్లరము తుదకు చేరవలెను.
ఈ గమ్యమునకు సంబంధించిన భావననే మనము మనస్సున సజీవముగా నుంచుకొందుము. అందుకొఱకు మన కర్తవ్యముగా భక్తిని
పాటింతుము. మానవసాధ్యమగు మహోన్నతస్థితి,
మహామాయ పరిధికి బహుదూరమున నున్నది.
అక్కడ నుండే అవతార పురుషులైన శ్రీరాముడు, శ్రీకృష్ణుడు
దిగివచ్చిరి. కనుక ఆపైన మరెంతో సాధించ
వలసినదున్నది. ఇది చాల మందికి
ఆశ్చర్యకరముగా నుండవచ్చును కాని యిదే సందేహాతీతమగు పరమసత్యము. ఎక్కడ యేవిధమైన శక్తి, చర్య
లేక ఉత్తేజముండదో, మనిషి సంపూర్ణశూన్యస్థితి, యేమీలేనిస్థితి లేక సున్నాస్థితిలో యెక్కడ ప్రవేశించునో అది మనము
చేరుకోవలసిన అంతిమస్థితి. సాక్షాత్కార
మార్గమున గొప్ప పురోభివృద్ధిని సాధించనెంచినట్లయిన మొదటినుండి అట్టి మానవసాధ్యమైన
మహోన్నత స్థితిపై గురి నిలుపవలెను. (సత్యోదయము 5వ ముద్రణ - 1976 పుటలు 15నుండి18
వరకు)
19. భగవంతుడు
అనంతమైన శక్తియని సర్వసాధారణముగా అందరూ ఒప్పుకొన్న సిద్ధాంతము. తాత్విక దృష్టి యింకనూ ముందుకు వెళ్ళి
నిర్గుణబ్రహ్మము లేక అనేకత్వము మరియు విభేదముల కతీతమైన అవ్యక్తపరిపూర్ణత్వపు
భావనలను చేర్చినది. ఇదే అంతిమకారణము మరియు
ఉనికికి ఆధారము. ఇది వ్యక్తమైన సమస్త
వస్తుజాలానికి చైతన్యాతీత కేంద్రము లేక సంపూర్ణాధారము. ఇది గుణాతీతము, చైతన్యాతీతము
లేక యెఱుకకతీతము. ఇదే పరబ్రహ్మమని కూడా
తెలుపబడినది. ఆ తర్వాత భగవంతుడు
మహోన్నతమైన ఉనికి యన్న భావన కలిగినది.
మనదృష్టిలో నున్న ఈ విశ్వము అనేక విభేదాలతోను, తేడాలతోనూ
గూడియుండి దీనికొక సృష్టికర్త, సంరక్షకుడు ఉండి ఉండవలెనను
నమ్మిక కలిగించుచున్నది. ఆయనను మనం
ఈశ్వరుడని, సగుణబ్రహ్మమని పిలుస్తున్నాము. నిజానికి భగవంతుడు సాకారుడు కాడు నిరాకారుడు
కాడు, రెండింటికి అతీతుడు. (అదే గ్రంథములోని 3,4 పుటల నుండి గ్రహింపబడినది)
20. మనము యే బిందువునుండి ప్రారంభించితిమో
అదే బిందువుతో మన గమ్యమునకు సన్నిహిత సంబంధమున్నది. (దశాదేశముల వ్యాఖ్యానము 1946/59
- పుట 2)
21. వీలైనంతగా భగవదీయ గుణములను వ్యక్తి తనలో
యిముడ్చుకొనుటకు పూనుకొనునట్లు చేయుటే ఆధ్యాత్మిక శిక్షణ యొక్క ముఖ్యోద్దేశ్యము.
(సత్యోదయము,5వ ముద్రణ 1976 - పుట
55)
22. భగవంతుడే
నిజమైన గురువు. ఆయన నుండే మనము వెలుగును
పొందుదుము. కానీ మామూలు తెలివితేటలుగల
మనిషికి నేరుగా భగవంతుని నుండి స్పందన పొందుట కష్టము, గనుక
భగవంతునితో సంబంధము స్థిరపరచుకొన్న మన సహచరులలో ఒకరి సహాయాన్ని ఆశిస్తాం. (అదే
గ్రంథము - పుట 51)
23. ఆధ్యాత్మికాన్వేషణలో గురువే మహత్తర
దివ్యశక్తి యన్న భావన గలిగియుండుట అత్యంతసహాయకారి. (అదే గ్రంథము - పుట 78)
24. నేను మహాత్ముని యిలా నిర్వచిస్తాను. ఆయన యేమాత్రము ప్రాధాన్యతలేని, లేక నిరాదృతుడై గొప్పదనము, గర్వము, అహంకారము లేనివాడై శాశ్వతముగా సంపూర్ణ ఆత్మశూన్యతాస్థితిలో జీవించువాడు.
(అదే గ్రంథము - పుట 44)
25. బోధకుని శక్తి సామర్థ్యములను పూర్తిగ
పరీక్షించి ఒక నిశ్చయమునకు వచ్చి అతడు అర్హుడని నిర్ణయించుకొన్న తర్వాత అతనిని
నమ్మి అతనికి సర్వస్వమప్పగించి అతన్నే అనుసరించాలి, అదే సరైన పద్ధతి. నీకేది అత్యంత
శుభకరమో అది గురువునకే తెలియును గనుక ఆధ్యాత్మికశిక్షణ విషయమై నీవాయనకు సూచనలివ్వదగదు.
(ఋతవాణి మొదటి ఎంపిక మొదటి ముద్రణ - 1970 - పుట 13)
26. గురువు, మనిషికి భగవంతునికి మధ్యగల అనుసంధానము.
మార్గములోని చిక్కులను నిర్మూలించు ఏకైక శక్తి ఆయనే. మనము పురోగమిస్తూ ఉన్నతోన్నత స్థితులలో
స్థిరపడుకొద్దీ గురువు యొక్క ఆవశ్యకత మరింతగా పెరుగుతూ పోతుంది.
(సత్యోదయము 5వ ముద్రణ 1976 - పుటలు 37,38)
27. దీక్ష గైకొనడమనునది భక్తుడు
మహోన్నతశక్తితో అనుసంధించబడుటను సూచించును. (అదే గ్రంథము - పుట 42)
28. శిష్యుడు గురువులో సంపూర్ణంగా లీనమైపోతే, గురువు, శిష్యుని ముందుకు గొంపోవుటకు అశాంతిమయ ఆతృత
కలిగి వుంటారు. ఇది ముఖ్యంగా శిష్యుడు
తనకైతాను ముందుకు పోలేని పరిస్థితులలో జరుగుతుంది. (ఋతవాణి 2వ ఎంపిక, మొదటి ముద్రణ ఏప్రిల్ 1978 - పుట 261)
29. జనులు మహోన్నతస్థితిని పొందుటకు తీవ్రమైన
శ్రద్ధను కనబరతురు గాక. ఇది
యేమైనప్పటికిని ఉచితముగానే యివ్వబడుచున్నది.
(ఋతవాణి మొదటి ఎంపిక - మొదటి ముద్రణ 1970 - పుట 30)
30. ఎవరు అభ్యాసి అంటే, ఎవడు ప్రాపంచిక ఆకర్షణలకు (పైపైమెఱుగులకు) లోనుగాక వాటి విషయమై
అంధుడైయుండి, ఒకే ఒక దానితో ఉత్తేజితుడై తానాశించిన
పూర్ణత్వమును పొందుటకు సహాయపడు కార్యసాధకమైనదేది కలదో దానినే నిరంతరము తలంచుచు
జీవించునో అతడే అభ్యాసి. ఆతనిలోని అంతర్గత
వెలుగే అతని మార్గమున గొప్ప సహాయకారిగా నుండును. (అదే గ్రంథము - పుటలు 17,18)
31. సహజంగా ఆత్మ, బంధన విముక్తిని వాంఛిస్తుంది.
ఎవరైనా చిక్కులనుండి విడివడి స్వేచ్ఛబడయటం యిష్టపడకపోతే, అట్టివాని జీవితానికి పరిష్కారమేలేదు.
(సత్యోదయము 5వ ముద్రణ 1976 - పుట 16)
32. నా జీవిత కాలంలోనే మీరందరూ అతీతమైన
మహోన్నతస్థితిని లేక కనీసం పూర్తి శూన్యస్థితి నందుకోవాలని ఆశిస్తున్నాను. అంతిమస్థితి లేక పరిపూర్ణఅజ్ఞానమే మార్పులేని
స్థితి. ఇది "అవును",
"కాదు" కు మధ్యస్థమైయున్నది.
(1. ఋతవాణి మొదటి యెంపిక మొదటి ముద్రణ 1970 - పుట 20
. 2. ఋతవాణి4, రెండవ
యెంపిక మొదటి ముద్రణ ఏప్రిల్ 1978 - పుట 247)
33. నిజంగా ప్రేమ వుంటే శరీరంలోని ప్రతి
అణువు ఏడు సంవత్సరముల లోపల మార్పుచెందుతుంది.
శిష్యుడు తనకు సంబంధించిన సర్వస్వము అప్పజెప్పి గురువు మేధో పరిధిలోనికి
ప్రవేశిస్తే, అతన్ని ఉత్తమలోకంలో ఉద్భవింపజేయడానికి కేవలం ఏడు
నెలలే పడుతుంది. (1. ఋతవాణి 2వ యెంపిక, మొదటి ముద్రణ ఏప్రిల్
1978 - పుట 249. 2. సత్యోదయము 5వ ముద్రణ 1978
- పుట 83)
34.
ఆధ్యాత్మికతకు ధ్యానము ఆధారపీఠము. నీ
లక్ష్యమును ముందుంచుకొని ధ్యానం చేస్తే నీవు నిశ్చయముగా గమ్యము చేరుదువు. ధ్యాన సమయంలో లెక్కలేనన్ని భావనలు మనసులోనికి
చొరబడుచున్నవని సామాన్యముగా జనులు ఫిర్యాదు చేయుచుందురు. వారి మనస్సు నిశ్చలస్థితికి వచ్చిననేగాని వారు
ప్రక్రియను సరిగ్గాననుసరించుటలేదని, విఫలమైతిమని
తలంతురు. కానీ అది సరికాదు. మనం
యేకాగ్రతకు ప్రయత్నించుటలేదు. మనం ధ్యానం
మాత్రమే చేయుచున్నాము. మనం ధ్యానసమయంలో
వచ్చు యితర భావనలను ఖాతరుచేయక ముందుకు సాగిపోవలెను. ఈ ఆలోచనల ప్రవాహము మన యెఱుకగల మనస్సుయొక్క
అవిశ్రాంత చర్యలవల్ల కలుగుచున్నది.
అయినప్పటికినీ మనము మాత్రము అతీంద్రియ మానసములో ధ్యానములోనే తీరికలేకుండా
కొనసాగుదుము. అదే సమయంలో మన బాహ్యయెఱుకగల మనస్సు
చుట్టూసంచరిస్తూ అసంఖ్యాకములైన ఆలోచనలను ఉత్పన్నంజేస్తూ వుంటుంది. అందువలన మనం యేవిధంగాను నష్టపోవడంలేదు. కాలక్రమంలో తగిన సాధన చేసిన తర్వాత మన యెఱుకగల
మానసము సైతం సక్రమముగా మలచబడి అతీంద్రియ మానసముతో కలిసి సామరస్య పూర్వకముగా పనిచేయ
నారంభించును. ఆ విధంగా సాధించిన ఫలితములు
లోతుగా నాటుకొని సుదీర్ఘకాలము నిలచును.
తుదకు ఆత్మ లక్షణమైన ప్రశాంతత ప్రాధాన్యత వహించును.
(సత్యోదయము - 5వ ముద్రణము 1976 - పుట 63)
35. మనము
ధ్యానములో పొందినస్థితిని అట్టే నిలుపుకొని రోజులో చాలాభాగము అదే స్థితిలో
కొనసాగుతూ, మనకు వీలైనంత వరకు అదేస్థితిలో మనగల్గినట్లయిన
మనం ఒక విధంగా భగవంతుని నిరంతరస్మరణలో ఉన్నట్లే.
తద్వారా మన పురోభివృద్ధి సులభంగాను వేగంగాను జరుగుతుంది. మనం మన ప్రయత్నానికి అనుకూలంగా వుంటూ, చిక్కులవలను ఛేదించే విధులను తప్పక అలవరచుకొనవలెను. ఉదాహరణకు పవిత్రమైన మాటలనే మనము వినవలెను. మన కనులు పవిత్రము మరియు ఉత్తమమైన వాటినే
చూడవలెను. హృదయము సద్గుణములవైపే మొగ్గు
చూపవలెను. (1. అదే గ్రంథము - పుట 78. 2. దశాదేశముల వ్యాఖ్యానము 1946/1959 - పుట 27)
36. మిత స్వభావము ప్రకృతి లక్షణము. మనము సంపూర్ణముగా మిత స్వభావమును పొందినట్లయిన
ప్రకృతితో అనుసంధానము ఒక విధంగా మనము కలిగియున్నట్లే. అదే సరళత యొక్క అసలు సారము. మిత స్వభావము నలవరచుకొనుటకు మనము బాహ్య
పద్ధతులందు కూడా ప్రత్యేక శ్రద్ధవహించ వలెను.
అంటే మర్యాదపూర్వకమైన వినయభాషణము, గౌరవప్రదమైన
వ్యవహారము, దయ ప్రేమతో సాటిమనుష్యులతో కలసిమెలసి జీవించడము. పెద్దలయెడ భక్తి, ప్రతీకారబుద్ధి
లేకుండుట మొదలైనవి. ఈ అలవాట్లన్నీ మనల్ని
మనం సరిచేసుకొనుట కెంతయో ఉపయోగపడును.
నిజానికి ఆధ్యాత్మికాన్వేషణలో తన్ను నియమించుకొన్న వ్యక్తికి మితస్వభావము
ఒకానొక ముఖ్యాంశము. మితమన్న ఈ పదము
విస్తృతార్థము కలది; ఇది మానవుని చర్యలన్నిటికి
సంబంధించియున్నది. అనగా మన యింద్రియముల
ప్రజ్ఞయందంతటను సమత్వము గలిగి, యెక్కువగాని తక్కువగాని
కాకుండా సహజంగా సమయానుకూలంగా నియమిత కార్యమునందు తన్నుతాను నియంత్రించుకొని
మనస్సుపై యెటువంటి ముద్రలు పడకుండా జీవనము సాగించుట. సాక్షాత్కారము, మితస్వభావము,
సమత్వము నెలకొనిననేగాని సాధ్యపడదు.
ఇది సృష్ట్యాదిన నున్న అసలు సత్యస్థితితో అనగా ప్రతీదీ సంపూర్ణ
సమత్వముతోనున్న స్థితితో సన్నిహిత సంబంధము గలిగియున్నది. సంపూర్ణ సమత్వస్థితిని పొందుట అసాధ్యము. ఎందుకంటే సంపూర్ణసమత్వం మరణాన్ని కలిగిస్తుంది. కనుక వ్యక్తి దాని సాన్నిహిత్యానికి
చేరవచ్చును. అక్కడతడు దాదాపు సమత్వతా
స్థితిలో నుండును.
(సత్యోదయము - 5వ ముద్రణ 1976 - పుట 34,35)
37. మనస్సు నుండి ప్రతీది దుష్టమే
వెలువడుతుందనరాదు. మంచికూడా
వెలువడుతుంది. ఆధ్యాత్మిక రంగములో మన
ధృఢసంకల్పమే చుక్కాని. అదే మనల్ని గమ్యము
వైపునకు నడుపుతుంది. కొన్ని ప్రదేశాలలో
లెక్కలేనన్ని సుడిగుండాలుంటాయి. కానీ మన
యిచ్ఛాబలము మరియు ఆత్మస్థైర్యము వాటినన్నీటిని అధిగమించి గమ్యము వైపునకు నేరుగా
గొంపోవుటలో సహాయపడును. మనమిప్పుడు మన
దృష్టిని ఆధ్యాత్మికతపై నిలిపితిమి గనుక మనము మహోన్నతమైన ధ్యేయమును, అనగా పరిపూర్ణముతో నేరుగా సంబంధముగల దానిని చేపట్టుదుము.
(1.అదే గ్రంథము - పుట 28. 2. దశాదేశాముల వ్యాఖ్యానము 1946/1959
- పుట 22)
38. సరళత
ప్రకృతియొక్క అస్సలు సారము.
నిశ్చలస్థితిలో సంపూర్ణమందుగలదానియొక్కప్రతిబింబమే యిది. ఇది వృద్ధికి తోడ్పడును. దీనిని అంతిమసత్యము యొక్క అసలు సత్తాయని
సరిగ్గా వర్ణించనగును. ఈ బిందువు నుండే
చైతన్యము మొదలౌతుంది. ఇదే మూలమగు
ఉత్పత్తిస్థానము. సర్వసామాన్యముగా
అనుసరించునదంతా మాయా పరిధిలోనికే వచ్చును.
ఇక్కడే యెక్కువమంది జనము నివసిస్తూ వారికి తగిన స్థాయిలో కార్యరంగమున ప్రవేశిస్తారు. వాస్తవానికి యిదే రూపముల కూర్పునకు
దారితీసినది. ఇది మనిషిలో కూడా
వృద్ధిచెందుతూ తుదకు గట్టి ముడులేర్పడుటకు కారణమైనది. ఈ ముడులిప్పుడు విప్పగల్గుటకు ప్రత్యేక
యిచ్ఛాశక్తిద్వారాగాక యితరత్రా సాధ్యముగాకున్నది. (దశాదేశముల వ్యాఖ్యానము 1946/1959
- పుట 22)
39. అంతిమ లక్ష్యముయొక్క అసలు సత్తాయైన
అంతర్గత నిశ్చలశక్తిని నీకైనీవే అల్లుకొని చిక్కుబడజేసుకొన్న వలను విచ్ఛిన్నముజేసి
తిరిగి స్వంతము జేసుకొనుమని మిమ్ములను వినయపూర్వకముగా నేను
అభ్యర్థిస్తున్నాను. అందరి
దృష్టిపథంలోనున్న ప్రకృతిసరళతను చేపట్టి నిన్నునీవు పనిలో నియమింపజేసుకొని, యింద్రియములన్నిటిని తనలో ఒకవిధంగా లయింపజేసుకొని లక్ష్యమును
సాధించవలెను. అందుకొఱకు
పూర్వసంస్కారములన్నీ తుడిచిపెట్టుకపోయిన తర్వాత మిగిలియున్నదేదో అచ్చము దానివలెనే
వ్యక్తి తయారు కావలెను. అప్పుడు మాత్రమే
తన్నుతాను భగవంతుని వైపునకు మళ్ళించుకొన్నట్లు వాస్తవమున చెప్పుకొనదగును. (అదే
గ్రంథము - పుట 28)
40. దివ్యపరివ్యాప్తముపైనో లేక మరట్టియింకొక
దానిపైనో ధ్యానము లేక చింతన చేయడం ప్రారంభించగానే ఆలోచనలు పుట్టుకొస్తున్నవని
జనులు నాతో తరచు మొరపెట్టుకొనుచుండుటకు కారణమేమో నాకు అర్థంకావడంలేదు. ధ్యానసమయములోగాని లేక మరో సమయంలోగాని
ఉత్పన్నమైన ఆలోచనలకు వ్యధజెందవద్దని నేను అభ్యాసులకు ప్రత్యేకముగా
సూచిస్తున్నాను. అవి యెగసిపడుతున్నది
ఆవిరైపోవుటకే. సంపూర్ణముగా ఆలోచనలు
లేకుండా పోవడము అసాధ్యము. (సత్యోదయము 5వ ముద్రణ 1976 - పుట 27)
41. ఆధ్యాత్మికపథమున తమ లక్ష్యమైన
అంతిమస్థితిని నిశ్చయించుకొనకపోతే, వారు తప్పక
గమ్యమునకు దూరమైపోతారు. ఎందుకంటే వారు
అంతిమస్థితి చేరకముందే పొరబడి, మధ్యలోనే కనబడిన ఇదోఅదో
ఏదోఒకస్థితిని అంతిమమని లేక అదే పరమసత్యమని భావించి శాశ్వతంగా అక్కడే
నిలిచిపోతారు. ఇది గమనింపబడిన విషయము.
(దశాదేశముల వ్యాఖ్యానము 1946/1959 - పుట 22)
42.
ఆధ్యాత్మిక నిర్మాణమునకంతకు శ్రద్ధ, వాస్తవమునకు
ఆధారపీఠము. సత్యతత్త్వముపై శ్రద్ధ,
సాక్షాత్కారమునకై నీవెన్నుకున్న విధానముపై శ్రద్ధ, నిన్నునీవు సమర్పించుకున్న గురువునందు శ్రద్ధ, యివే
పునాదిరాళ్ళు. నీవు నిజముగా విజయము సాధింప
నెంచినట్లయిన, నీ ఆధ్యాత్మిక భవనమును ఈ రాతి ఆధారపీఠముపైననే
నిర్మించవలెను. తద్వారా నీవు ఒక బలమైన
అంతర్‌శక్తిని పొందిన వాడవై నిన్ను చుట్టుముట్టియున్న దుష్టశక్తులన్నిటిని
ఆశక్తితో ఛేదించగల్గుదువు. దీనివలన
అవసరమైనప్పుడల్లా తాజా దివ్యస్పందనలను నీవు పొందగలుగుదువు. (దశాదేశముల వ్యాఖ్యానము
1946/1959 - పుటలు 71,72)
43. శ్రద్ధ నిజార్థములో మర్థ్యుని అవినాశితో
కలుపు జీవానుబంధము. ఒకసారి యేర్పడిన ఈ
అనుబంధము మనము అంతిమధ్యేయము చేరునంతవరకు యిక విచ్ఛిన్నము కానేకాదు. నిజమైన శ్రద్ధ చెప్పనలవిగాని సుగుణము. అది మత పరిధుల కతీతమైనది. మనలను విజయము వైపు నడిపించు లోపరహిత
విధానమిది. ఇది సర్వవ్యాపితమైన శక్తియై మన
మార్గమును సుగమమొనర్చుచున్నది.
వాస్తవానికి మన జీవిత సమస్యను పరిష్కరించునదిదొక్కటే. (అదేగ్రంథము - పుట 73)
44. సాక్షాత్కార మార్గమున సులభముగా విజయము
చేకూరుటకు సహాయపడు ప్రాధమికాంశములు, యిచ్ఛ, శ్రద్ధ మరియు ఆత్మస్థైర్యము.
సత్యతత్త్వమును పొందుటకు బలమైన యిచ్ఛ వుంటే మనము ఆత్మను గూర్చిన
ఆలోచనావిషయమున అంతర్గముగా మేల్కొల్పబడినామన్న మాట. కానీ ఆధ్యాత్మిక జీవనమున మరొక ముఖ్యాంశము
గురువునందు నమ్మిక. మహోన్నత ఆధ్యాత్మిక
స్థితుల పొందుటకు సమర్థుడైన గురువుసహాయము విస్మరించుటకు వీలులేనిది. ఈయన మాధ్యమమున మాత్రమే దైవీయస్పందనలు
మనకందును. మనమాశించి తపన- జెందుచున్న ఆ
సత్యతత్త్వమునకై ఆయననే ఆశ్రయించవలెను. ఆవిధంగా మనమాయనతో సంతృప్తిజెందిన యెడల
అంతరంగమున అయన వైపునకు మనము సహజముగా ఆకర్షింపబడుదుము. ఇక ఆయనే మన గమ్యమునకు ఒక రూపమిచ్చు వాడని
తలంతుము. ఈ భావన క్రమముగా శ్రద్ధయై
వృద్ధిజెంది, ఆయనను మనము ప్రేమింతుము. ఆయన దృక్పదములను విశ్వసించి విధేయతతో ఆయన
వ్యక్తిత్వమునకు తలయొగ్గి ఆయన మార్గదర్శకమున ముందుకు సాగుదుము. సాధనా మార్గములో మనము పొందిన అనుభవములు మనలను సంతృప్తి
పరచి ఆయన అసాధారణ శక్తి సామర్థ్యములు గలవానిగ మనము గుర్తెరింగి ఆయనను మానవాతీత-
మహనీయునిగా చూడనారంభింతుము. ఇప్పుడు మన
శ్రద్ధ మన ఆధ్యాత్మిక పురోగమనంలో యెంతగానో సహాయపడును. అది సందేహమేఘములను పారద్రోలును మరియు
అనిశ్చితిని పోగొట్టి, కష్టములను, అడ్డంకులను
మన మార్గము నుండి తొలగించివేయును. (అదేగ్రంథము - పుటలు 68,69)
45. కలతజెందిన మన మానసికవృత్తులను దారి
మరల్చవలెనన్న మనదృష్టిని సత్పదార్తముపై నిలుపవలెను. అదొక్కటే మనకున్న మార్గము. మనము మన కార్యక్రమములన్నీ తగ్గించుకొంటూ, మనలో ప్రవేశించిన అక్కరలేనివాటినన్నిటిని విదిలించి వేయవలెను. తనకైతనే నిర్మించుకొన్న వ్యక్తిగత చిక్కుల వలను
ఛేదించుకొని స్వచ్ఛమైన స్థితినందుకొనుటొక్కటే కడకు మనము చేయవలసిన పని. (అదే
గ్రంథము - పుట 28,29)
46. అవాంఛనీయ ఆలోచనలను, పిలువకనే వచ్చిన అతిథులుగా తలచి వాటి యెడల శ్రద్ధ చూపకుము. అంతటితో అవి వదలిపోవును. మనిషి ప్రప్రథమకర్తవ్యము అనంత సంపూర్ణమును
చేరుకొనుట. కానీ యెంతకాలము ధ్యేయము
మనస్సులో నిర్ధారణకాదో అంతవరకు మనప్రయాణమును కొనసాగించి విజయవంతముగా
పూర్తిచేయలేము. దైవీయ సహాయము తప్పక
లభిస్తుంది, అందుకు సందేహం లేదు కానీ ఈ విషయమై భక్తుని శ్రద్ద
మహోన్నత దైవమును సంతృప్తిపరచవలెను. మనము
మన జీవితములోని కార్యములన్నిటిని కేవలం మన కర్తవ్యములుగా తలచిచేస్తే, అవి భగవంతుడు మనల్ని పవిత్రులని నమ్మి కేటాయించిన భగవత్‌కార్యములగును. నీ ఆలోచన దిగజారుడు దశకు మరలిందంటే అది
అధమస్థాయికి దిగి స్థూలరూపము గైకొన్న నీ పతనావస్థకు గుర్తు. అట్టి సందర్భంలో తననుతాను శ్రద్ధాభక్తులతో ఒక
సహచర మహాత్మునికి అనుబంధించుకొనుట అత్యంతావశ్యకము. తద్వారా అతని అధమ మానసిక వృత్తులు ఆ మహాత్ముని
ప్రభావమున సరిదిద్దబడును. ఇది వ్యక్తిగత
వ్యాకుల యోచనల నుండి విముక్తి కలిగించును.
(1. అదేగ్రంథము - పుట 29. 2.దశాదేశములవ్యాఖ్యానము
1946/1959.పుటలు 22,23)
47. వైరాగ్యమనునది మనస్సుయొక్క
అంతర్గతస్థితి. ఆ దశలో అది మార్పులేనిది, శాశ్వతమైనది మరియు ఆకర్షణ వికర్షణల నుండి స్వేచ్ఛ పొందినదియైన
సత్యతత్త్వముపైనే నిరంతరం వ్యక్తిచూపు నిశ్చలంగా నిలిచి వుంటుంది. (సత్యోదయము 5వ
ముద్రణ,1976 - పుట 26)
48. వైరాగ్యమును పొందుటకు గృహమును వదలి
వెళ్ళుటొక్కటే మార్గమను దృక్పదము గలవారితో నేను యేకీభవించను. వ్యక్తికి మంచి చెడుల మధ్య తేడాను
గుర్తించగలిగిన వివేకముండవలెను. అట్టి
వివేకము లేకుండుటన్నది అధమమానవలక్షణము. (అదే గ్రంథము - పుట 24)
49.
జీవితములోని సర్వకార్యములను నీ కర్తవ్యముగా తలచి చేయగలిగినట్లయిన అవి భగవంతుడు
నిన్ను పవిత్రునిగా నమ్మి కేటాయించిన దైవకార్యములగును. (అదేగ్రంథము - పుట 26)
50.
సాక్షాత్కారము కొఱకు మనిషి తపన నుత్పన్నము జేసికొనవలెను. అందులకు మనకు కావలసినది బలమైన (ఉక్కు)
యిచ్ఛ. అది యెప్పుడు కలుగుతుంది? ఎప్పుడు లక్ష్యం మన దృష్టిపథంలోనే వుంటుందో అప్పుడే. నిశ్చయమైన గట్టి మనస్సు (సంకల్పం) తో
రంగంలోనికి దిగితే సగందూరం వచ్చేసినట్లే. (ఋతవాణి మొదటి యెంపిక - మొదటి ముద్రణ 1970
- పుట 125)
51. ఆంతరంగిక శాంతి మానసిక ప్రశాంతత, సరళత మరియు తేలికదనము ప్రకృతిసిద్ధముగా నీ సాధనా ఫలితమై సమకూరకున్న
నిశ్చయంగా నీవు తప్పుదారి పట్టితివనియు నీశిక్షణ లోపభూయిష్టమనియు తెలిసికొనుము.
(సత్యోదయము 5వ ముద్రణ 1976 - పుట 56)
52. తన్నుతాను కరిగించేసుకొన్నవాడు
జీవితపరమార్థమూ, నిజముగా వుండదగినదైన వాస్తవజీవితమును అనగా నిత్యము
సత్యమునైన ఉనికి నధిరోహించును. శూన్యత్వపు
పరాకాష్టే అంతిమస్థితి, దాన్నే "భూమా"
ఉనికికోల్పోయియున్న స్థితియని పిలుస్తారు.
(1. ఋతవాణి మొదటి యెంపిక - మొదటి ముద్రణ 1970 - పుట 28; 2. 1967లో సంకలనకర్త షాజహాన్‌పూర్‌లో ఉండగా గురువుగారు చెప్పగా విని
వ్రాసుకొన్న విషయము)
53. ఆకాశమనగా ప్రదేశము (చోటు) మరి అవకాశమనగా
కాలము. విశ్వము, రూపుదాల్చిన కాలము. భగవంతుడు
రూపుదాల్చిన ఆకాశము. భక్తి మన మార్గమును
సరళము చేసి మన హృదయములలోనికి దైవీయ ప్రకాశప్రవాహము ప్రవహించుటకు
మార్గమేర్పరచును.(ఋతవాణి మొదటి యెంపిక - మొదటి ముద్రణ 1970 - పుట 186)
54. అంతిమ
సత్యము యొక్క అనుభవము, మిగిలిన యితర అనుభవములన్నీ అంతరించిన
తర్వాతనే కలుగుతుంది. ఈ స్థితి అనగా
అంతిమసత్యస్థితి, అభ్యాసి తన్నుతానేగాక భగవంతుణ్ణిసైతం
మరచిపోయిన తరువాత సిద్ధిస్తుంది. కనుక
అట్టిదానితో సమత్వమును సాధించుము. అదే
విశేషపురోగమన స్థాయిలోని లీనస్థితి. (ఋతవాణి 2వ యెంపిక మొదటి ముద్రణ, ఏప్రిల్, 1978 - పుటలు 22,237)
55. మనచర్యలు, కార్యకలాపములన్నీ మహాత్ముడైన గురువర్యులు మనకు కేటాయించిన భగవదీయ విధులని
తలంచవలెను. మన గురువును మనము వీలైనంత
చక్కగా సేవించవలెను. ఇలా చేయడం వల్ల
నిరంతరం మనము దైవీయచింతన (యెఱుక) లోనే వుంటాము.
ఇందులో యిమిడియున్న వేదాంతము, పదార్థతత్త్వముతో
ప్రారంభించి మనము కడకు చేరవలసిన అంతిమస్థితితో ముగుస్తుంది. ఆనందానుభవ మొకస్థితి. అది వడియగట్టబడి క్రిందకు దిగి దాని ప్రభావమున
అధమస్థాయి పొరలు పవిత్రము, స్వచ్ఛము గావింపబడతాయి. ఈ స్థితిని సరిగ్గా దైవత్వమును చేరుటకు
ముందున్నస్థితిగా గ్రహించనగును.
(1. సత్యోదయము 5వ ముద్రణ 1976 - పుట 76; 2. దశాదేశముల వ్యాఖ్యానము 1946/1959 - పుట 36)
56. భగవంతుని యెఱుకలో ఉన్నంత మాత్రముననే
మనస్సుయొక్క దుర్గుణములు స్వస్థతజెంది మార్గములోని కష్టములు తొలగింపబడును. కనుక రోజులో వీలైనంత యెక్కువ భాగము, మన ప్రాపంచిక కార్యకలాపములు కొనసాగుస్తూ కూడా భగవంతుని యెఱుక గలిగి
యుండవలెను. మనము భావములో భగవంతునితో
సన్నిహిత సంబంధమును అన్ని మానసిక మరియు భౌతిక కార్యముల నిర్వహిస్తూ కూడా కొనసాగించవలెను. మనము ఆ మహత్తరశక్తితో అనునిత్యము యెడతెగని
ఆలోచనా బంధముతో అతుకబడి అన్ని పనులూ చేయుచున్నప్పుడు కూడా అనుబంధానుభూతిని
పొందవలెను. (సత్యోదయము 5వ ముద్రణ 1976 -
పుటలు 75,76)
57. మనము ఒక పనిచేయుచున్నప్పుడు, మనమాపని భగవంతుని సృష్టిలోని యేదోఒక జీవికి సేవచేయుచున్నాము గానీ మన
స్వార్థమునకు గాదన్న భావనతో వుండవలెను.
మనము మన సాధారణ పనులన్నిటితో బాహ్యముగా తీరికలేకుండా కనబడుచున్నప్పటికి
అంతరంగమున భగవత్‌సేవాపథంలో విడువక కొనసాగవలెను. (అదే గ్రంథము - పుట 76)
58. స్మరణలన్నీ ఒకే ఒక స్మరణలో
లీనముగావలెను. అదే అంతిమగమ్యస్మరణము. ఆ స్మరణము మన ఉనికిలోని ప్రతి అణువు నుండి
ప్రతిధ్వనించవలెను. దీన్నే అహాన్ని
సంపూర్ణంగా పెగలించి వేయడమని తెలియనగును.
వ్యక్తి ఈ స్థితినుత్పన్నము జేసుకొంటే అతన్ని రూపుదాల్చిన భక్తి లేక
ప్రార్థనగా గుర్తిస్తారు. అతని
యిచ్ఛనుసారమైన ప్రతి ఆలోచనా గురువర్యుల ఆలోచనతో సరిపోలునట్టిదై వుంటుంది. భగవదిచ్ఛకు వ్యతిరేకమైన దానివైపున కాతడెప్పుడూ
తిరుగడు. ఆతని మనస్సు యెల్లప్పుడూ గురువు
యొక్క ఆజ్ఞలకనుకూలముగనే మరల్చబడి యుండును. (1967లో సంకలనకర్త షాజహాన్‌పూర్‌లో
వుండగా గురువు నుడివిన పులుకులను వ్రాసియుంచుకొన్న వాటినుండి గ్రహింపబడినది)
59. నిరంతర స్మరణ అన్ని స్థితులను దాటించుటకు
సహాయపడును. వివిధములైన అన్నిస్థాయిలు, రకరకముల అతీంద్రియ స్థితులు ఈ విధానమున తెరువబడి మనకు సత్యతత్త్వముతో
అనుబంధ మేర్పరచబడును. నిరీక్షణ ఒక విధమగు
తీవ్రమైన స్మరణ, అది సర్వసామాన్యముగా గొప్ప ఆధ్యాత్మిక
లాభమును సమకూర్చును. (పైన తెలిపిన వాటి
నుండే గ్రహింపబడినది)
60. ప్రార్థన భక్తికి సంకేతము. ఇది మన సంబంధము ప్రవిత్ర దైవముతో యేర్పడినదని
తెలుపును. ప్రార్థనలో మనము కేంద్రబిందువు
వరకు చేరయత్నింతుము. సంపూర్ణముగా సరళము
మరియు ప్రశాంతమునైన దైవేచ్ఛకు మనల్ని మనం సమర్పించుకొనుట ద్వారా ఈ ప్రార్థనామయ
స్థితిని పొందనగును. కనుక అతి ముఖ్యము
మరియు అపజయమెరుగని విధానము ప్రార్థనయే. (దశాదేశముల వ్యాఖ్యానము 1946/1959 - పుట 13)
61. నీవు యేవిధమైన కష్టము లేక బంధనముగాని లేక
భరింపరాని భావోద్రేకముగాని పొందిన యెడల అప్పుడే ప్రార్థన ద్వారా గురువుకు
నివేదించుకొనుము. ఈ నివేదన యే సమయంలోనైనా, యే ప్రదేశంనుండైనా చేసుకొనవచ్చును.
వెంటనే చిక్కు తొలగించబడును. నాకు
నీవు చేసిన నివేదన లేక ప్రార్థన నా దృష్టికి వచ్చినదా? లేదా
అన్నవిషయం నీ కవసరంలేదు. నీపని యేదోవిధంగా
నెరవేరుతుందంతే. (ఋతవాణి మొదటి యింపిక - మొదటి ముద్రణ 1970 - పుట 164)
62. ప్రతి ఒక్కరు తమ అంతమును చేరుటకు
సంసిద్ధులై యుండవలెను. అంటే వ్యక్తి
మహోన్నత ఆధ్యాత్మిక స్థితిని వీలైనంత తొందరగా సాధించుకొనవలెను. అందువల్ల తన అంతము సమీపించినపుడు
పశ్చాత్తాపపడవలసిన అవసరమేర్పడదు. మిమ్ముల
నందరిని కేంద్రము సమీపము వరకు లాగుక రావాలని ఆ మండలంలో మీరు ఈదడం ప్రారంభించి ప్రకృతిపై
అధికారం పొంది దానితో పనిచేయగల సామర్థ్యము నొసగు బిందువును తెరవాలని నేను ప్రగాఢ
వాంఛతో నున్నాను. (అదే గ్రంథము - పుటలు 27,29)
63. నా దృష్టిలో సంపూర్ణత అంటే మానవత్వము దైవత్వము
ప్రక్కప్రక్కన సమానంగా సాగాలి. రెండు
రేఖలు చైతన్యవంతమై యుండి ప్రక్కప్రక్కన ఒకదానికొకటి సమాంతరంగా కొనసాగాలి. వాస్తవానికి మానవత్వము యింత చక్కగా
పనిచేయగలిగిందీ అంటే అది దైవత్వము వెనువెంట సంబంధమేర్పరచుకొని కొనసాగడం వల్ల తప్ప
యితరత్రాకాదు. ఈ కారణంగానే భగవంతుడు
మనిషిలో వున్నాడన్నారు. ఇదే అభిప్రాయము
అన్నిమతాలు కలిగి వున్నాయి. కనుక మన
అంతిమప్రయోజనము నెరవేరాలంటే మనం దైవత్వంతో సత్సంబంధమేర్పరచుకొని ఆ సంబంధాన్ని
మానవత్వపురేఖకు అనుసంధింపజేసుకోవాలి.
ఇంతకూ మనము చేయవలసిన పనేమంటే, యిప్పుడు వాటిని
మరలా మొదటి స్థానము (స్వస్థానము) నకు తీసుకొని రావలెను. (రెండూ ఒకే దివ్యదైవత్వం
నుండే వెలువడినవి గనుక) లేదా మరో మాటలో చెప్పాలంటే వాటిని భక్తి మరియు ప్రశాంత
స్థితికి తెచ్చి వాటి అనుబంధము భగవంతునితో స్థిరపడునట్లు చేయవలెను. ఈ పని సక్రమముగా నెరవేరుటకు వారిలో తగిన
మితస్వభావమును ప్రవేశపెట్టవలెను. అదే మనము
సహజమార్గమున చేయుచున్నాము. ఇది ప్రకృతి
రహస్యము. నేనిప్పుడు బహిర్గతమొనర్చి,
సంపూర్ణముగా మనిషి దైవత్వము పొందుటననేమో ప్రజలకు పూర్తిగా
అర్థమగునట్లు జేసితిని. ఈ కారణముననే
వ్యక్తి సాక్షాత్కార శిఖరము చేరినప్పటికిని మానవత్వము మాత్రము నిలిచియే యుండును. (1.
సహజమార్గ దర్శనము మొదటి ముద్రణ1969 - పుట 24,25; 2. ఋతవాణి 2వ యెంపిక మొదటి ముద్రణ ఏప్రిల్ 1978 - పుటలు 211,213,214, 228)
64. కేంద్రమునకు అత్యంత సమీపస్థానమే
మానవసాధ్యమగు మహోన్నతస్థితి. మనిషి శరీరముతో సహా కేంద్రమండలము ప్రవేశించవచ్చును. అలా వచ్చి చేరిన వారిలో ఒక బంధము అలాగే
వుంటుంది. అందువల్ల వారి సంబంధము దిగువ
మండలములతో కొనసాగుతూ వుంటుంది. అలా ఆ
బంధము వుంచకపోతే ఆత్మ నిత్యశాంతిలోనికి దుమికేస్తుంది. దానితో జీవం అంతమొందుతుంది. (1. రాజయోగ ప్రభావము 2వ ముద్రణ 1960 -
కేంద్రస్థానము; 2. ఋతవాణి 2వ యెంపిక మొదటి ముద్రణ, ఏప్రిల్ 1978 - పుట 218)
65. సామాన్యంగా జనులు ‘సత్’ నే అంతిమస్థాయిగా
భావించి దైవజ్ఞానము కొలుచు కొలబద్ద యిదియని తలంతురు. వాస్తవానికి అది ‘తం’, ‘తం’ పరిధి మాత్రమే ఒక నిజమైన యోగి సాధించవలసిన విలువైన స్థితి. ‘తం’ కావల మరేమి మిగిలిలేదు. (దశాదేశముల
వ్యాఖ్యానము 1946/1959-పుట 4)
66. జనులు తమ విధి నిర్వహణ విషయంలో జాగరూకులై
యుండవలెను. నేను నా కర్తవ్యమును
నిర్వహించెదను. వారు వారి కర్తవ్యమును
చూచుకొనవలెను. అయితే తమ సాధనను వారు ప్రేమ
భక్తి భావములతో జత చేయవలసి యుండును. నా
బాధ్యతగా నేను మీకు మహోన్నతమైనదైన ఆధ్యాత్మిక కానుకను వీలైనంత తక్కువ సమయంలో అందిచాలన్న
అత్యాశతో నున్నాను. మీరు కనీసం ఒక్కడుగు
ముందుకేస్తే నేను మీ వైపునకు నాలుగడుగులు వేయుటకు అధికోత్సాహముతోనున్నాను. (ఋతవాణి
మొదటి యెంపిక, మొదటి ముద్రణ 1970 - పుట 14,15,11)
67. మనముందున్న సమస్య ప్రస్తుత జన్మకు
పరిష్కారము కనుగొనుటేకాదు. విశాలదృక్పదముతో
గమనించిన, మన రాబోవు జన్మలన్నింటికి సమస్య వ్యాపించి
యున్నది. ఇది మన ఆత్మ ఉనికిలో వున్నంత
కాలమంతయు ఉండనే వున్నది. ఇది మహాప్రళయము
వరకు ఆత్మ యేరూపములో వున్నను, అంటే అది స్థూలముగా గాని
సూక్ష్మముగా గాని యేకాలములో వున్నను గాని, పరిష్కారముగావలసిన
సమస్య ఉండనే వుంటుంది. అట్టి సమస్యల
కన్నిటికి మనమిప్పుడే పరిష్కారము కనుగొనవలెను. (సత్యోదయము 5వ ముద్రణ 1976 - పుటలు 13,14)
68. మతమునకు అతి ప్రధాన ఆధార పీఠమైన
విశ్వప్రేమ పూర్తిగా నేడు కనుమరుగై పోయినది.
మనిషికిని భగవంతునితో అనుబంధించునదని చెప్పబడుతున్న మతము నేడు అందుకు
అడ్డంకియైపోయినది. భగవంతుడు ఒక మతమునకు, తెగకు కట్టుబడి లేడు. కొన్ని
రూపములకు మతాచారములకు పరిమితమై కూడా లేడు.
ఆయన మత గ్రంథముల పుటలలో వెతికి కనుగొనవలసిన వాడున్నూ కాడు. ఆయనను మనము మన హృదయాంతరాళముననే అన్వేషించవలసి
యున్నది. (అదే గ్రంథము పుట 3)
69. జీవ నిర్జీవములను కలుపు బంధము వాటి
మూలమే. ఒక విషము, దాని విరుగుడు పదార్తము రెండూ ఒకదానినొకటి ఆనుకొనే యున్నవి. మనము నిర్జీవస్థితిలో వున్నప్పుడు జీవమును
గూర్చి చింతించుట ప్రకృతి సహజము.
యెందుకంటే నిర్జీవము యొక్క మూలమున రెండుస్థితులు ఒకదానితో నొకటి
కలగల్పియున్నవి. ఇప్పుడు మనస్సున మెఱసిన
మొదటి యోచన జీవత్వం వైపు కొనసాగి అభివృద్ధికి మొదటి ఆడుగుగా సంతరించుకొన్నది. వాస్తవానికి విషయమేమంటే మన దృష్టి చాల పైనున్న
దానినిగానీ లేక చాల క్రింద నున్నదానినిగానీ దృష్టిపథంలో నిల్పుటకు
సమర్థముగాకున్నది. మనిషి
మధ్యస్థానమునందుండుట వల్ల మధ్యస్థానమైయున్న సమావస్థ అతని పరమైనది. మనలో వున్న ఆ మధ్యబిందువేది? అది హృదయమే. జీవ నిర్జీవముల
రెండింటిని అది అనుబంధించి స్పష్టముగా అనుభవమునకు దెచ్చుచున్నది. ఈ కారణముననే హృదయముపై ధ్యానము అత్యంత
ప్రయోజనకరమైయున్నది. ఎట్లయిననేమి మనమే
దానిని గూర్చి యోచించితిమో లేక పరిస్థితులే మనల నావైపునకు నెట్టివైచినవో గాని
మనమేమో జీవత్వపు యెఱుక వైపునకు మొగ్గితిమి.
కానీ యెంతకాలము యెఱుకతో మనము ఊగిసలాడుచుందుమో అంతకాలము ప్రాపంచిక భావనలు
కలిగియే యుందుము. దీనిని భూటకపు గురువులు
జ్ఞానమని చెప్పుచున్నారు. (అనంతంవైపు, 1963నాటి ముద్రణ -
పుటలు 3,4)
70. మహోన్నత ఆధ్యాత్మిక స్థితి సాధించవలెనన్న
మనము మరింత ఆవలికెళ్ళవలసియున్నది.
వాస్తవమునకు మతమెక్కడ అంతమగునో అక్కడ ఆధ్యాత్మికత మొదలౌతుంది. స్వేచ్ఛామార్గమున మనిషిని పయనింప- జేయుటకిచ్చు
శిక్షణలో మతము కేవలమొక ప్రాధమిక దశ మాత్రమే.
ఎప్పుడైతే అతడు మార్గమున అడుగిడెనో అప్పుడే అతడు మతపరిధికావలకి చేరెను.
(సత్యోదయము 5వ ముద్రణ 1976 - 5)
71. మతముయొక్క
అంత్యమే ఆధ్యాత్మికత ప్రారంభము.
ఆధ్యాత్మికతయొక్క అంత్యమే సత్యతత్త్వారంభము. సత్యతత్త్వముయొక్క అంత్యమే నిజమైన ఆనందము. ఎప్పుడదికూడా వెళ్ళిపోతుందో అప్పుడు మనం గమ్యము
చేరతాము. (అదే గ్రంథము - పుట 5)
72. సువిశాలమైన అనంత పరిధిలో మూడు
మండలములున్నవి. అవి హృదయమండలము, మనోమండలము మరియు
కేంద్రమండలము. ఈ విషయమును విశదీకరించుటకు
నేను ఇరవైమూడు ఏకకేంద్ర వృత్తముల చిత్రమును గీసితిని. అందులోని మొదటి అయిదు వృత్తములు ‘మాయ’
స్థితులను సూచించును. తర్వాతి పదనొకండు
వృత్తములు ‘అహంకార’ స్థితులను సూచించును.
మిగిలిన యేడు వృత్తములు కేంద్ర మండలములోని కాంతి వలయములుగా
సూచించితిని. ఇక మధ్యస్థానము
కేంద్రమే. నేను ఈ మండలములను పదమూడు అతి
ముఖ్యగ్రంథులు మరియు మరింత ఆవలి ప్రదేశములగుండా సాగు ఆధ్యాత్మిక ప్రయాణముగా కూడా
తెలిపితిని. (1.అదేగ్రంథము - పుట 18; 2. అనంతయాత్ర సారాంశము)
73. మానవుని పరిపూర్ణ పవిత్రత యెప్పుడూ భక్తి
పరిధికే లోబడి భక్తుడుగా వుండడములోనే యున్నది.
మూలమునుండి దిగివచ్చునవన్నియు ఒకే ఉత్పత్తిస్థానము నుండి వచ్చినవిగా
గ్రహించ వలెను. అదే ఒకే తల్లికి జన్మించిన
బిడ్డలందరూ ఒకే విధమైన బంధుత్వము గలిగియున్నట్లన్న మాట. ఈ విధంగానే అందరిని కలిపి ఒకే సోదరత్వమను త్రాట
కట్టివేయబడి ఒకరికొకరు ఒకే బంధుత్వమునకు లోనైయున్నారు. అందరూ ఒకే సత్యతత్త్వము, అదే కేంద్రబిందువునకు అనుబంధింపబడి యున్నారు. ఒక చలనము యొక్క ప్రభావమున ప్రతీది చైతన్య
పరుపబడినది. వాటి మధ్యన యెటువంటి యెడబాటు
యెప్పుడూ యేర్పడలేదు. నిజానికి మన ఆలోచనల,
చర్యల ప్రభావమే సోదరులను స్నేహితులను, పరాయివాళ్ళలాగా
యితరులుగా కనబడేట్టుచేసింది. ఈ విధంగా
వేరుపరుపబడిన భావన యిప్పుడు నిర్మూలింపబడి మరలా సోదరభావము
పునఃస్థాపింపబడవలసియున్నది.
విశ్వసౌభ్రాతృత్వము వృద్ధియైనదను భావన నెలకొనవలెనంటే మన వ్యక్తిగత
చిక్కుబడిన వలను విచ్ఛేదము గావించవలెను. ఈ
వ్యక్తిగత చిక్కువడిన వలే ఒకరి నుండి మరొకరిని విడగొట్టి ఒక తండ్రి బిడ్డలమన్న
భావనను చెడగొట్టినది. అది తిరిగి
నెలకొనవలెను. (దశాదేశముల వ్యాఖ్యానము 1946/1959
- పుటలు 32,33)
74. నిజాయితీ అనగా తన స్వంత వర్ణమున
తన్నుతాను ప్రదర్శించుకొనుటే. ఇది దానికై
అదే అప్రయత్నముగా వ్యక్తి నుండి బహిర్గతమగు స్థితి. అది యెట్లున్నదో అట్లున్నది. జోహైసోహై.
ఇదే వాస్తవార్థమున సత్యతత్త్వము.
నిజానికి ఇది ప్రళయసమయమున సర్వశక్తులు వెనక్కు తేబడి ఒక్క బిందువువద్ద
సమగ్ర పరచబడినస్థితి. అప్పుడు
సంపూర్ణసత్యతత్త్వము గాక మరేమి మిగిలియుండనిస్థితి యిది. (అదే గ్రంథము - పుట 29)
75.
సంపూర్ణత్వంలో వున్నటువంటి శక్తులన్నీ మనిషిలో వున్నవి. ఎందుకంటే అతని ఆలోచనాశక్తి ప్రధాన క్షోభ గలిగిన
సమయమున వెలువడిన అణువుల సముదాయమున యేర్పడినదే.
కానీ ఆ శక్తి వ్యతిరేక వాలకముగలిగి పనిచేయుట చేత అది తప్పుద్రోవపట్టి
వారికున్న సామర్థ్యము వ్యతిరిక్తదిశలో పనిచేయడం మొదలు పెట్టింది. కనుక చక్కగా వేగవంతముగా పురోగమింపనెంచు సాధకుడు
అసమంజసమైన ఆలోచనలలో కొట్టుకపోడు. అతడు తన
మార్గములో స్థిరముగా ముందుకు సాగి తన సాధనకు గట్టిగా కట్టుబడియుండును. అతడు తీవ్రమైన తపనతో వృద్ధిలోనికి తేబడి
యెల్లవేళల ఉత్తమపద్ధతులలో తన పురోభివృద్ధిని త్వరితమొనర్చుకొనును. తన తపనను తీవ్రము గావించుకొనుచు అదే సమయంలో తన
మార్గదర్శకునకు (గురువుకు) ఒక విద్యార్థి బోధకుని విషయములో మెలగునట్లు విధేయుడై
యుండును. వినయము మరియు మెత్తదనములోనే
గొప్పదనమున్నది. వ్యక్తి తన్నుగురించి
తాను వినయముగా తక్కువజేసుకున్నప్పుడే అందరిలో మిన్నయై ప్రాధాన్యత నొందును. వినయముతో పొందిన మేలు దౌర్జన్యముతో
పొందలేము. ఆధ్యాత్మిక మార్గమున గల
అతిగొప్ప ప్రతిబంధకము, భేదభావము దురభిప్రాయమే తెచ్చిపెట్టుచున్నవి. ఇవి దాదాపు ఒక విధమగు అహంకార రూపము
దాల్చుచున్నవని నేను నాజీవితకాలపు పరిశోధన ద్వారా కనుగొంటిని. కనుకనే వ్యక్తి వినయము, విధేయత
అను పవిత్రసద్గుణములను వదిలిపెట్టరాదు.
భగవంతుడేకులమునకు, యేతెగకు లేక సంఘమునకు సంబంధించిన
వాడు కాడు. కనుక మనిషికి మనిషికి మధ్య
తేడా లేదు. అందువలన గర్వము, దురహంకారము విడిచిపెట్టవలెను. తన
సద్గుణములను వృద్ధిచేసుకొనకపోతే తన కర్తవ్యమును ధర్మమును మరచి ఆధ్యాత్మికతను సహితం
వీడి దారి తప్పి చరించును. (1. అదే
గ్రంథము - పుట 25; 2. సత్యోదయము 5వ ముద్రణ 1976 - పుట 17,19,8)
76. మనము కడకొక స్థితికి చేరుదుము. సరిగ్గా అవగాహన చేసుకొని గమనిస్తే ఆ స్థితిలో, భక్తుడు కదిలిస్తే తప్ప భగవంతుడు కదలలేడు. ఎప్పుడైతే మనమీ అంతిమ స్థితిలోనికి
ప్రవేశించితిమో అప్పుడే మనము ఏకత్వస్థితిలో ఉన్నట్లు లెక్క. సున్నితము మరియు శుభ్రము గావింపబడిన అజ్ఞానమే మనలను
అంతిమ స్థితికి గొంపోవును.
(1. అనంతమువైపు 1963లో విడుదలైన ప్రతి - పుట 37 2.
సంకలనకర్త షజహాన్‌పుర్‌లో 1967 సంవత్సరం బాబూజీతో ఉన్నప్పుడు ఆయన చెప్పగా
వ్రాసియుంచుకొన్న విషయము నుండి)
77. జ్ఞానరహితత్త్వమొక్కటే సహాయకారి. జ్ఞానవంతుడు సముద్రములోనికి యెగిరి దూకడు. కారణం అతడు ఆతర్వాత ప్రాణాలతో మిగలడన్న విషయం
అతనికి బాగా తెలుసు. అక్కడ యెగిరి
దూకడమంటే ముందుకు సాగడమే. మనం ఈదుతూ
మున్ముందుకుపోతూ కట్టుబాట్లనన్నిటిని అధిగమిస్తాము. బయటపడి యేకత్వం సాధించడానికున్న మార్గము, ఆయనకు సర్వం సమర్పించుకొని ఆయన ఒడిలో ఒదిగి పోవటమే. ఆయన మిమ్ములను దరిజేర్చుకొని తన కౌగిలిలో
యిముడ్చుకొనుటకు సర్వకాల సర్వావస్థలలో సంసిద్ధుడుగా నున్నాడు. (అదే గ్రంథము - పుట 32)
78. నా జీవితము మొత్తములో మా గురువుగారి
గొప్ప ఆధ్యాత్మికనిధి మొత్తము నాదిగాదని నేనొక్కక్షణమైనా భావించలేదు. కుమారుడు తండ్రియొక్క ఆస్తియావత్తూ నాదేనని
భావించు రీతిన నేనూ తలంచితిని. నా
వద్దకూడా సంపద (ఆధ్యాత్మిక) మిక్కుటముగానే యున్నది. కానీ నాసన్నిహితులకు దానిని పంచిపెట్టుటలో
నేనెప్పుడూ పిసినారిగా వుండలేదు. (ఋతవాణి
మొదటి యెంపిక మొదటి ముద్రణ 1970 - పుటలు 174,175)
79. మూడు రకముల సమాధి లేక యేకాగ్రత
స్థితులున్నవి. అందులోని మొదటి స్థితిలో
వ్యక్తి తన్నుతాను కోల్పోయినట్లు లేక లీనమైపోయినట్లు భావిస్తాడు. అతని యింద్రియములు, భావనలు మరియు ఉద్రేకములన్నీ తాత్కాలికముగా నిలుపుదల చేసినట్లు, ఒకరకంగా అవి ఆ సమయానికి మరణించినట్లనిపిస్తాయి. చూడటానికి మనిషి స్మృతిదప్పి మరణించిన వానివలె
యేవిషయము యెఱుకలో లేనట్లుంటాడు. ఇక రెండవ
రకమైన స్థితిలో ఒక బిందువుపై లోతుగా యేకాగ్రచిత్తుడై వున్నప్పటికి, దానిలో వాస్తవమునకు మునిగిపోయినట్లుండడు.
ఈ స్థితిని యెఱుక గలిగి, యెఱుక లేని స్థితిలో
ఉన్నట్లని వివరింప వచ్చును. పైకి
చూడటానికతడు యే విషయమై కూడా యెఱుక గల్గిలేడు.
కానీ అంతర్గతముగా అతనిలో ఛాయామాత్రముగా యెఱుక యున్నది. ఈ యెఱుకలేని స్థితిలో అతడు తనకు తెలియకనే
అవసరకార్యములు చేస్తూ సమయానుకూలముగా ప్రవర్తించుచుండును. ఇది యెఱుకలేని స్థితియందు యెఱుకగల్గి యుండటమే. ఇక మూడవది సహజ సమాధి. ఇది చాలా సున్నితమైన ఏకాగ్రత. ఈ స్థితిలో మనిషి తన పనులతో తీరికలేకుండా,
మనస్సుగూడా వాటిలో పెట్టితీవ్రంగా పనిచేస్తుంటాడు. అయితే అతని హృదయాంతరాళములో మాత్రము
సత్యతత్త్వముపైనే లగ్నమై యుండును. అతని
యెఱుకగల మానసముతో బాహ్యకార్యకలాపములతో తీరికలేకుండా వుంటూ, అదే
సమయంలో అతని అతీంద్రియ మనస్సు దైవచింతనతో తీరికలేక గడుపుచుండును. అతడు సర్వకాల సర్వావస్థలలో సమాధి స్థితిలోనే
వుంటూ బయటికి మాత్రము ప్రాపంచిక విషయములో తీరికలేకుండా గడుపుచున్నట్లు
కనబడును. ఇది మహోన్నతమైన సమాధిస్థితి. ఈ స్థితిలోనికి శాశ్వతముగా ప్రవేశించిన వానికి
యిక చెయ్యవలసినది బహులేశమే.
(సత్యోదయము 5వ ముద్రణ 1976 - పుటలు 98,99)
80. అభ్యాసి సర్వసాధారణ అభ్యాస ప్రక్రియ
నవలంభించి యుండనప్పటికీ, అంతిమదశయైన పరిపూర్ణత్వం
వరకు, అన్ని ఆధ్యాత్మిక స్థితులను గురువర్యుల ప్రాణాహుతి
ప్రసారశక్తి ప్రయోగము ద్వారా నధిగమింపజేయవచ్చును.
ఇదంతయూ అభ్యాసి నిజార్థమున గురువునకు సహకరించనప్పుడే సుసాధ్యము. (ఋతవాణి మొదటి యెంపిక, మొదటి
ముద్రణ 1970 - పుట 114)
81. అరుదైన సందర్భములలో మాత్రమే భగవదీయజ్యోతి
ప్రపంచమునకంతకు ఒకేసారి వెలుగు నిచ్చుటకు వెలిగింపబడును. ఇది భగవంతుడట్లాజ్ఞాపించి నప్పుడు మాత్రమే
సంభవమగును. ఆ దివ్యజ్యోతి యిప్పటికే
భూమిపై అవతరించి వెలుగులను దశదిశలా వ్యాపింపజేయుచున్నది. కేవలం భక్తిపూరిత హృదయములే దానికి అవసరమై, అవే ప్రయోజనమును పొందగలవు.
ప్రకృతి తన హస్తములను చాచి మిమ్ము ఒడిలో చేర్చుకొనుటకు అమితోత్సాహము
చూపుతున్నది. భగవదానుగ్రహము అత్యంత
శక్తివంతముగా వెల్లువై ప్రవహించుచున్నది.
ఇట్టి సదవకాశము తిరిగి వేల సంవత్సరములకైనా లభించక పోవచ్చును. నేడు చేసిన అతిచిన్నత్యాగమైనా గొప్ప ఫలితముల
నివ్వగలదు. సర్వజనులు మేల్కొందురుగాక! కనీసము వారి చేతనైనమటుకు త్యాగము చేసి అనంత
సాగరతీరము చేరి అచ్చట దైవీయ చల్లని తాజా ప్రశాంత వాతావరణము నాస్వాదింతురు
గాక! ఇది మన అదృష్టము. ఎందుకంటే, ఒక
దివ్యావతారమూర్తి ఈ దుఃఖభాజనమైన ప్రపంచమున విరాజమానుడై యుండి తన
ముఖ్యబాధ్యతతోపాటుగా ఈ విశ్వమున మార్పుతెచ్చుటకు 1944 సంవత్సరము నుండి తన కార్యమున
నిమగ్నమై యుండుటేగాక మీకు ఆధ్యాత్మికశిక్షణ నిచ్చుటకు గూడా అంకితమై యున్నాడు. ఇప్పుడీ ప్రయోజనకర, వాగ్ధానపూరిత
సదవకాశమును లెక్కచేయక వృధాగావించుకొన్నవారు, ఆ మహాపురుషుడు ఈ
పదార్తయుత ప్రపంచమును వీడిపోయిన తర్వాత, వాటిల్లిన నష్టమును
తలచుకొని బాధాపడవలసి రావచ్చును.
(1. అదే గ్రంథము - పుట 23. 2. పైతెలిపిన సంవత్సరము రాజయోగ ప్రభావము నుండి
గ్రహించడమైనది)
-oO0-
అభ్యాసుల
కొఱకు సాధారణ సూచనలు
1. ఎవరైనను మహోన్నతమైన దానినే ఆశించవలెను.
శాంతి మరియు ఇతరములు తర్వాతి ప్రాధాన్యతలో నుండవలెను. మహోన్నతమైన దానిని ఆశించు
అభ్యాసి నిజమైన సహజమార్గ సభ్యునిగా గుర్తింపబడును.
2. అభ్యాసము పద్దతి ప్రకారము సక్రమముగా
చేసుకొనవలెను. ధ్యానమున శ్రద్దకలిగిందంటే సగంపని పూర్తియైనట్లే.
3. ధ్యానము పూర్తికాగానే తన అంతర్గత స్థితిపై
అట్టే మనసు పెట్టాలి. అది అతడు సూక్ష్మత (చురుకుదనం) పెంపొందించు కొనుటకు
సహాయపడుతుంది.
4. ధ్యాన సమయమున గాని ఇతర సమయములలో గానీ
ఉత్పన్నమగు ఆలోచనలకు చింతించరాదు. అవి నశించుటకే ఉత్పన్నమౌతున్నాయి. సంపూర్ణముగా
ఆలోచనలే లేకపోవుటన్నది అసాధ్యము.
5. నేను అభ్యాసులను శుద్ది చేస్తూ పోతుండటం
సామాన్యంగా గమనిస్తుంటారు. కానీ వారు మాత్రం తమ స్థితిని పాడు చేసుకుంటూనే
పోతున్నారు. ఇలాగైతే మరి ఎలా? వారు
పురోగమించగలరా? వారు నాతో సహకరిస్తే వీలైనంత ఎక్కువ ప్రయోజనం
పొందుతారు.
6. భగవత్ సాక్షాత్కారానికి తపనను పెంపొందించుకోవాలి.
7. అభ్యాసులు బుద్దినుపయోగిస్తూ గురువును
అనుసరించాలి.
8. కోపాన్ని పూర్తిగా నిర్మూలించడం
సాధ్యంకాదు. కారణం అది భగవంతునిచే ప్రసాదింపబడినది. దానిని సద్వినియోగ పరచుకోవాలి.
కానీ దురాశ మాత్రం మన స్వంత సృష్టి. దీనిని పూర్తిగా నిర్మూలించివేయాలి.
ఆధ్యాత్మికత కొఱకు సైతం దురాశ పనికిరాదు. కొంతమంది అభ్యాసులు ప్రశిక్షకుల వద్ద
మాటి మాటికి ధ్యానానికి కూర్చోవడానికి దురాశ కనబర్చడం గమనిస్తున్నాను.
9. మార్పును రెండువిధాలుగా తీసుకొని
రావచ్చును. మొదటది దాన్ని ఆశించడం ద్వారా, మరి
రెండవది బలవంతం ద్వారా. రెండవదానిలో తరగులేకుండా కొనసాగే ప్రభావం లేదు. కనుక ప్రతి
అభ్యాసి మార్పును తీవ్రంగా ఆశించాలి.
10. వ్యక్తి తన స్వేచ్ఛా ప్రవృత్తిని
అదుపుచేసుకోవాలి. దశనియమములు ఆ ప్రయోజనం కోసమే ఉన్నాయి.
11. అభ్యాసి తన అనుదిన సాధారణమైన చిన్న చిన్న
విషయాలలో సైతం అదుపులో ఉండాలి. లేకపోతే వారినుండి పెద్ద విషయాలపై అదుపు/అధికారం
ఎలా ఆశించగలము?
12. పవిత్ర
జీవనం ఎట్లయినను మనం ముఖ్యంగా కోరుకోవాలి. అన్ని విషయాలలో మనం మితం పాటించాలి.
పవిత్రత మరియు మితం మనిషి శీలాన్ని వ్యక్తపరుస్తాయి.
13. మంచి చెడుల మధ్యగల తేడాను మనిషి నిర్ధారించగలగాలి.
అట్టి విచక్షణ లేకపోవడమనేది అధమపురుష లక్షణము.
14. అభ్యాసి
తాను ప్రశిక్షకుడను కావలెనన్న యోచనతో ఉండరాదు. సంస్థకు సేవచేయవలెనను యోచన వుంటే
అలా చేయడానికి సంస్థలో ఇతరమార్గాలు చాలా వున్నాయి. వాటి ద్వారా సేవ చేయవచ్చును.
15. సంపూర్ణ సమస్థితిని సాధించడము అసాధ్యము.
ఎందుకంటే సంపూర్ణ సమత మరణాన్ని ప్రాప్తింపజేస్తుంది. కానీ మనిషి దాని అత్యంత
సమీపస్థితిని చేరవచ్చును. అక్కడ అతడు దాదాపు సమస్థితిలో వుండును.
16. ఒకదాన్ని ఇష్టపడడమంటే అది అహంకారమే. కనుక
మనిషి ఇష్టాయిష్టాల కతీతంగా ఎదగాలి.
***** *****
"ఆధ్యాత్మ విజ్ఞానం"
(అభ్యాసుల ప్రయోజనార్థము)
శ్రీరామచంద్రజీ మహరాజ్ ఉవాచ:-
సూర్యులై
ఉదయించి ఆధ్యాత్మికరంగమున మీరందరూ లీనమైపోవాలని నాప్రగాఢవాంఛ. అయితే అదెలా వీలౌతుంది?
ఎప్పుడు
భూమియొక్క ప్రతిబింబము సూర్యునిపై పడనీయవో అప్పుడు. అదెప్పుడు సాధ్యపడుతుంది?
ఎప్పుడు
నీవు నీ గమన మార్గమును తగురీతిన తీర్చిదిద్దుకొందువో అప్పుడు సాధ్యమౌతుంది.
ఆ
గమనమార్గమెలా యేర్పరచుకోవాలి?
నీవు నీ
గమనమును దృఢతరం చేసుకొన్నప్పుడే అది యేర్పడుతుంది. ఎప్పుడు నీవు నీ గమనాన్ని దృఢపరచుకుంటావు?
ఎప్పుడు
నీ గమ్యం నీ దృష్టిపథంలో వుంటుందో, అప్పుడు. ఎప్పుడు గమ్యం సదా దృష్టిపథంలో వుంటుంది?
ఎప్పుడు
నీవు పూర్తిగా ఆయన వాడివైపోతావో అప్పుడు.
ఎప్పుడు నీవు పూర్తిగా ఆయన వాడివైపోతావు?
ఎప్పుడు
నీవు అహం సంపూర్ణంగా కోల్పోతావో, అప్పుడు. ఎప్పుడు నీవు అహం సంపూర్ణంగా కోల్పోతావు?
ఎప్పుడు నీ హృదయంలో ఆయన ఆలోచన తప్ప వేరే ఆలోచన
వుండదో అప్పుడు.
అదెప్పుడు
సాధ్యం?
అది
సాధన ద్వారానే సాధ్యం.
ఎప్పుడు
సాధనకు వీలౌతుంది?
అది
కేవలం ప్రేమ మరియు శ్రద్ధ వలన కలుగుతుంది.
ప్రేమ,
శ్రద్ధ యెలా ఉత్పన్నమౌతాయి?
మరీ మరీ వాటిని గూర్చి యోచించినప్పుడు-
త్పన్నమౌతాయి. ఏ విధంగా మరీ మరీ యోచించడం
సాధ్యమౌతుంది.
దృఢమైన
నిశ్చయం ద్వారానే అది సాధ్యపడుతుంది.
ఎప్పుడు
దృఢమైన నిశ్చయం కలిగి యుండడం సాధ్యపడుతుంది?
ఎప్పుడు
నీవు నడుంబిగించి నీ విశ్రాంతిని, సంతోషాన్ని త్యాగం చేసి,
నీ సోమరితనానికి స్వస్తి చెబుతావో అప్పుడు.
-oO0-
అభ్యాసి ధ్యానముచేయు విధానము
ప్రార్థన
ఓ నాథా! నీవే మానవ జీవనమునకు లక్ష్యము
మా కోరికలు ఆత్మోన్నతికి ప్రతిబంధకములై యున్నవి
నీవే మా ఏకైక స్వామివి ఇష్టదైవమవు
నీ సహాయము లేనిదే నిన్ను పొందుట అసంభవము.
ఉదయము ధ్యానము
పూజకై
ప్రత్యేకించబడిన స్థలములో ఒకే భంగిమలో కూర్చొని, శారీరక,
మానసిక శుభ్రతలను కలిగి, నిత్యము నిర్ణీత
సమయమందు సూర్యోదయమునకు ముందే ఒక గంట కాలము ధ్యానము చేయుము.
హృదయములో
దివ్య తేజస్సు కలదను భావము కలిగి, మనస్సుపై ఒత్తిడి లేకుండా,
సహజముగా ధ్యానము చేయుము.
అక్కడ తేజస్సు కనబడనిచో లెక్క చేయకుము.
అది ఒక ఊహ మాత్రముగా ధ్యానము ప్రారంభింపుము.
ఏకాగ్రతకై
ప్రయత్నించక, సహజ పద్ధతిలో ఒకే వైఖరిలో కూర్చొని మనస్సును
హృదయమువైపు మరల్చుము. ఆ సమయమున వచ్చు
ఆలోచనలను ఆహ్వానింపకనే వచ్చిన అతిథులుగా భావించి వాటిని గమనించక దృష్టిని ఏకైక
లక్ష్యముపై మరల్చుము.
సాయంకాలం అంతః శుద్ధీకరణ క్రియ
నీలోని ప్రతి
అణువునుండి, నీ ఆధ్యాత్మిక ప్రగతికి ప్రతిబంధకములైన మాలిన్యములు,
జడత్వము, తామసము, సంస్కారములు
మొదలుగునవి ఆవిరి రూపములో నీ శరీరము వెనుక భాగము నుండి బయటికి పోవుచున్నవి అను
సంకల్పముతో సాయంకాలము అరగంట కూర్చొనుము.
మనము విడువతలచిన వాటినిగురించి తలచకుము, వాటిని
తుడిచివేయుము.
రాత్రి ప్రార్థన
రాత్రి
నిదురించుటకుముందు నమ్రత, భక్తి భావముతో ప్రార్థన చేయవలెను. ప్రార్థన ఒకటి రెండు సార్లు మనస్సులోనే
ఉచ్ఛరించి దానియందుగల భావముపై ధ్యానము చేయుచు దానియందే లీనమై నిదురించుము.
దశనియమములు
1. ప్రొద్దు పొడవకముందే నిద్రలెమ్ము. నిర్ణీత సమయమున, సూర్యోదయమునకు
ముందయినచో మంచిది, ఒకే ఆసనమున కూర్చొని ప్రార్థన, పూజాదికములను కావింపుము. మానసిక
శారీరక పారిశుద్ద్యమును ప్రత్యేకముగా పాటింపుము.
2. ప్రేమ, భక్తి
పూర్వకమైన హృదయముతో ఆధ్యాత్మికోన్నతి కొరకు ప్రార్థన జరిపి, పూజ నారంభింపుము.
3. భగవంతునితో సంపూర్ణఐక్యము పొందుటయే నీ గమ్యముగా
నిర్ణయించుకొనుము. దానిని సాధించునంతవరకు
విశ్రమింపకుము.
4. ప్రకృతితో సారూప్యము పొందుటకు నిష్కపటముగాను, నిరాడంబరముగాను
వుండుము.
5. సత్యసంధత కలిగి యుండుము.
దుఃఖములను దివ్యమైన దీవెనలుగా భావించి, అవి నీ
మేలు కొరకే కలుగుచున్నవని కృతజ్ఞతా భావముతో నుండుము.
6. అందరిని సోదరులుగా భావించి, అట్లే వారినాదరింపుము.
7. ఇతరులు కీడు చేసినచో ప్రతీకారబుద్ది పూనకుము. దానిని దివ్యబహూకృతిగా కృతజ్ఞతతో స్వీకరింపుము.
8. ఋజువర్తనతోడను, భక్తిభావముతోడను ఆర్జించిన దానితో తృప్తిచెంది,
నిరంతర దివ్యభావములతో దానిని ఆరగింపుము.
9. ఇతరులలో భక్తి, ప్రేమ భావముల మొలకెత్తించునట్లుగా నీ జీవనమును
మలచుకొనుము.
10. పడుకొనబోవు సమయమున దైవసాన్నిధ్యభావనతో నీవొనర్చిన తప్పులగూర్చి
పరితప్తుడవుకమ్ము. వాటిని మరిచేయనని
వినమ్రభావముతో భగవంతుని క్షమాపణ కోరుము.
-oOo-