Thursday, 7 March 2024

సహజమార్గమున నిజజీవితామృతము

 

సహజమార్గమున నిజజీవితామృతము

రచన-శ్రీ రవికుమార్, ప్రశిక్షకులు,రాయచూర్.

 మనపూజ్య గురువర్యులు శ్రీరామచంద్రజీ మహరాజ్‍వారు రచించిన సత్యోదయములోని మొదటి అధ్యాయాన్ని ముగిస్తూ వారు "నిజజీవితముయొక్క అమృతము, ఎప్పటికప్పుడు అవసరానికి తగిన స్థాయికి తననుతాను యెవడు చేర్చుకోగలడో అతనికి మాత్రమే లభ్యము" అని వ్రాశినారు. అందులో సూచించిన అమృతమంటే యేమిటి? అవసరానికి తగినట్లు తనకైతానుపొందవలసిన స్థాయి యేది? వీటిని గురించి తెలుసుకోవలసి యున్నది. పూజ్యబాబూజీ అంతిమసత్యస్థితి గనుక సందర్భానుసారముగా వారు వాడిన మాటలకు లోతైన అర్థం ఉంటుంది. ఈసందర్భంలో సుధ లేక అమృతము అంటే, అదివారి దివ్యప్రాణాహుతి.  అది అత్యంత తేలికైనది, సూక్ష్మమైనది. అంతకు ముందుటివాక్యములో వారు ఆ అమృతముయొక్క ప్రభావమును సూచిస్తూ యిలా వ్రాశారు. "సంపూర్ణముగా బంధవిముక్తి పొందవలెనన్న, మనము దైవలక్షణములకు సన్నిహితములగు సున్నితము, సూక్ష్మముగా పరిణతిచెందుటకు తపనపడుతూ పూర్తిగా దైవమువలె  మారవలసియున్నది."

 స్వేచ్ఛ నుండి స్వేచ్ఛ

బాబూజీవారి 80 వ, జన్మదినవేడుకల సందర్భంగా  గుజరాత్‍లోని అహమ్మదాబాద్లో 1979 ఏప్రెల్ 30 న, వారిచ్చిన సందేశములోని 3వ,పేరాలో  "సమ్మతితో ఆధ్యాత్మికజీవనము వైపునకు మరలుటే జీవిత ప్రారంభము. దాని అత్యుత్తమస్థితి, జీవితమందలిజీవితము. అది జీవితమందే దాగియున్నది మనమా జీవితమునకై ప్రయత్నించవలెను. అందులోనికి ప్రవేశించవలెను. మన అభ్యాస మంతయూ ఆ జీవనమునకు చేర్చునదై యుండవలెను, అని వారు ఉద్బోధించిరి. కనుక మనభౌతిక జీవితములో వారిజీవితం (ప్రాణం) ఉండుటే నిజమైన జీవితము. అదే అవసరమై పొందవలసిన స్థాయి లేక నిజమైన జీవితలక్ష్యము. అది సాక్షాత్తూ గురుదేవులే. ఒక అభ్యాసిగా మనకు గురుదేవులే నిజమైన లక్ష్యము. అయితే నిజమైన వారి సహజమార్గవిధాన సభ్యులుగా, వారి ఆశయమే మన ఆశయమై యున్నది.  వారు యేలక్ష్యము కొఱకు మానవునిగా అవతరించిరో ఆలక్ష్యమే మనజీవిత లక్ష్యము.

 జీవితమంటే యేమిటి?

బాబూజీవారి 79 వ, జన్మదినవేడుకల సందర్భంగా కర్ణాటకలోని బెంగుళూరులో 1978 ఏప్రెల్ 30న, వారిచ్చిన సందేశములోని 3వ, పేరాలో యిట్లు సెలవిచ్చిరి  "భగవంతుడీ ప్రపంచమును సృష్టించి అందులోని ప్రతిపుష్పమూ వికాసముచెందునట్లొనర్చెను. అయితే కాలముయొక్క కొరడాదెబ్బలు, భగవంతుని ఆశయమును విస్మరించునట్లు చేసెను. కనుక కొందరు జీవితాశయమును సుఖానుభవముగానూ మరికొందరు విసుగుజనించునదిగానూ తలంచిరి” అసలు జీవితమంటే యేమిటి అన్నది ప్రశ్న. జీవితకాలమంతయూ శాశ్వతముగా ఉన్నానన్న తలంపుతో, ప్రతిదశలోను ఉనికి పరిమళమును ఆస్వాదిస్తున్నదేదో అదే జీవితము.

 జీవరాశులేవైనపటికిని, అవి మానవులైనా, జంతువులైనా అన్నీ దైవస్వరూపాలే. సహజమార్గసాధన ద్వారా మనం బాబూజీవలె మారి, వారిలోని దైవగుణాలైన స్వచ్ఛత, ప్రేమను మనము వెలువరించవలసి యున్నది. మన జీవితలక్ష్యమైన మనగురువర్యులు మనదృష్టిపథంలో లేనట్లైన, మనం వారి ప్రేమను పొందలేము. అందుకొఱకు వేరెక్కడో అనవసరముగా వెతుకులాడు కొందుము. మనం సహజమార్గ విధానంద్వారా వారియెడల ప్రేమగలిగి యుండిన మనమూ అట్టిప్రేమను ప్రసరింపజేతుము. "అందరిని ప్రేమించువారిని (గురువును) ప్రేమించుము తద్వారా మనమందరిని ప్రేమింతుము"

 మనదృష్టిని వారి (గురువు) వైపునకు మరల్చి వారిపైనే నిల్పినట్లైన, సహజమార్గసారము లేక అమృతము, మనలను బంధనములన్నింటినుండి విడిపించును. ధ్యానము నిరంతరస్మరణ జీవనవిధానమై, మన ఉనికి యొక్క ఆశయము అదే అయితే, మనకు సత్యతత్వము లేక గురువర్యులే దృక్పదంలోవుంటే, మనము వ్యధలను సులువుగా భరింపగలుగుదుము. ప్రతీది మన కర్తవ్యముగా భావించి నిర్వర్తించినట్లైన, మనము బంధనము నుండి విడుదలబొందుదుము. మనం ప్రాపంచికవస్తువులను, వాటి సద్వినియోగం కొఱకు మాత్రమే సేకరించుకొని యుండుట వలన, నిజమైన వైరాగ్యమును పొందుదుము. మనకున్నటువంటి లేక సంప్రాప్తమైనదంతయు ఆమహాప్రభువు పవిత్రనిధియనీ, దాని నిర్వహణాబాధ్యత మనవిధియని తలంతుము .

 శాంతి మరియు ప్రశాంతత, సహజమార్గముద్వార సుసాధ్యము. అది వ్యకపరచుటకు వీలుకానప్పటికి, హృదయమున మాత్రమనుభూతి జెందుదుము. ఆయన ప్రాణాహుతిప్రసార స్పందలద్వారా ధ్యానమున ఆయన ఉనికిని అనుభూతిచెందుదుము. ఆయననుండి యేదోకాకుండ, ఆయననే ఆకాంక్షించినట్లయిన  ఆయన, ఆయనమాత్రమే రుచిలేనిరుచి స్థితితో మనలను ఆశీర్వదింతురు. ఆయనతో ఏకీకృతమవడంవల్ల, పక్షపాతరహితంగా, అందరము ఒకేవిధమైన భావనలు కలిగి వుందుము.

 బాబూజీ తన 79వ, జన్మదినంనాడిచ్చిన అదేసందేశంలో చెబుతూ, "మనం దుఃఖసమయంలో సహితం సంతోషంగా వుండాలి. అన్నిపరిస్థితులలోను ఆనందంగావున్నవాడే, నిజమైన సంతోషి. అది సత్పురుషునిలో ఒకభాగమైయుండును" అన్నారు. ఆయనతో, ఆయనలో మనంవుంటే, ఆనందం దానికైఅదే మనలో వికసిస్తుంది.

 ఉదయించే సమయం

ఒకవ్యక్తి జీవితలక్ష్యాన్ని సాధించాలంటే అతనికి పూజ్యబాబూజీ వంటి సంపూర్ణస్థాయి గురువు లభించాలి. ఆ గురువు చూపిన విధానాన్ని అనుసరించాలి. ఆమహనీయుడు కేంద్రము లేక భూమా నుండి అవతరించడానికి కారణమైన వారి ఆశయసాఫల్యత కోసం కృషిచేయాలి. బాబూజివారి 82వ, జన్మదినోత్సవం మలేషియాలోని  కౌలాలంపూర్‍లో 1981 ఏప్రెల్ 30న, జరుపుకున్న సందర్భంగా వారిచ్చిన సందేశంలో యిలా సెలవిచ్చారు. "మనసంస్థ ముఖ్యోద్దేశ్యము, వ్యాప్తిలోనున్న అనాధ్యాత్మిక స్థానంలో సహజమార్గముద్వారా  ఆధ్యాత్మికతను నెలకొల్పాలి. తద్వారా "నిద్రావస్థలోనున్న జనులారా! మేల్కొనండి. ఇది సూర్యోదయసమయం" అన్న గురువుల మేల్కొలుపుతో జాగృతపరచాలి. సంస్థసభ్యులు ప్రేమ, సహనం, సహకారంతో పనిచేస్తే, సంస్థ ఆశయం తప్పక నెరవేరుతుంది. అటువంటి, సూర్యునివలె ప్రకాశించు వ్యక్తులు సంస్థకొఱకు నాకుకావాలి. మన విధానము సరియైనదని తెలిస్తే, జనులు వారికైవారే ఆకర్షింపబడి సంస్థలో ప్రవేశిస్తారు”.

 బాబూజీ వంటిగురువు లభించాలని వ్యక్తులు ప్రార్థించాలి. సంస్థ ఆశయసాఫల్యతకై వారికృపనాశించాలి. అదే ప్రపంచ ఆధ్యాత్మికపునర్జీవనమునకు దోహదపడి, అణగారిన హృదయులను ఉత్తేజపరచి, మానవ జీవితలక్ష్యము వైపునకు మరల్చగలదు. తద్వారా విలువలతోగూడిన నాగరికత స్థాపింపబడును.

 బాబూజీగారితో అనుసంధింపబడి, అమృతమగు ప్రాణాహుతిని గ్రోలి, ఆధ్యాత్మికప్రగతిని బడసి, నిజమైన మనిషిగా మారినందులకు నిజంగా మనమెంతో అదృష్టవంతులము, ఆశీర్వదించబడినవారము.

 తేనెటీగలకు భూమి ఒకపూదోట. అందులోని పూలపైతిరుగాడి మకరందమును (అమృతము)గ్రహించి వాటితెట్టెలో దానిని తేనెగా రూపొందించుకుంటాయి. ఆవిధంగానే మన ప్రాపంచికజీవనాన్ని దివ్యజీవనంగా మార్చుకొనుటకు, బాబూజీగారి ప్రాణాహుతిని గ్రహిస్తున్నాము.

 భక్తి ప్రేమలతో మనల్నిమనం పూజ్యగురువర్యులకు సమర్పించుకున్నట్లైన, వారితో ఒక ప్రత్యేకబంధుత్వ మేర్పడి, మనమెవరమో, యేమిటో, యెందుకు మనిషిగా జన్మించితిమో తెలుసుకోగలిగితిమి. ప్రార్థన, ధ్యానము, శుద్ధీకరణ, నిరంతరస్మరణ అను యీనాలుగు సహజమార్గపువిధులను మనఃపూర్వకముగా అనునిత్యము పాటించినట్లైన, భగవంతుని సృష్టి, స్థితి, లయములలో మనకర్తవ్యమేమిటో మనకు అవగతమౌతుంది.

 అనంతమువైపు సాగు మనఆధ్యాత్మిక ప్రయాణములో, బంధవిముక్తికొఱకు ఆత్మను జాగృత పరచుటనునది ప్రారంభదశ. విజయమునకై చేయు పోరాటము ఆత్మోన్నతిలో ఒక‍అంశమే. అది మోక్షమునకు దారితీయును. అంతేగాక తదనంతర దశలను దాటించుచు, నిజగమ్యము లేక స్వదేశము వైపునకు తీసుకెళ్ళును. అంటే అది సృష్ట్యాదిన మనమీ రూపుదాల్చిన స్థానమునకన్నమాట. నిజానికీవిశ్వమున రూపుదాల్చిన ప్రతీది తమమూలమునకు తిరిగి చేరవలెనని ఆకాంక్షిస్తున్నది. అయితే ఆప్రక్రియ ప్రకృతినిబంధనల ప్రకారం దేశకాల పరిమితులకులోబడి జరుగుచున్నది.

 మనము మోక్షముతోసహా అనేకదశలను దాటుచూ సహజసాక్షాత్కార మార్గమున పురోగమిస్తున్నప్పుడు, మన గురువర్యులు దివ్యచైతన్యము లేక మూలతత్త్వమేయని తెలిసి , అనుభవమున గ్రహింతుము. సహజమార్గప్రార్థన తుదివాక్యములో చెప్పినట్లు ఆయనే (గురువే) మనలను గమ్యముచేర్చు యేకైకస్వామి, యిష్టదైవము.

 నిజమైనగమ్యము వైపునకు సాగుచూ, దివ్యత్వముజెందుటకై పదార్తము శక్తిగా మార్పును సంతరించుకొనుచుండుటను గమనించిన, అది (సహజమార్గము దృష్ట్యా) రాజయోగప్రభావ ప్రకటితమని తెలియుచున్నది

 (కడప బసంత్ (14-02-2024) లో శ్రీ రవికుమార్, ప్రశిక్షకులు,రాయచూర్ వారు ఆంగ్లములో యిచ్చిన ఉపన్యాస పాఠమునకిది తెలుగు అనువాదము- అనువాదం :- శ్రీ పి. సుబ్బరాయుడు, ప్రశిక్షకులు, కడప ) 


 

No comments:

Post a Comment

పూజ్యలాలాజీ మరియు మన ఆధ్యాత్మికప్రగతి

  పూజ్యలాలాజీ మరియు మన ఆధ్యాత్మికప్రగతి సోదరీసోదరులమైన మనమంతా యిక్కడ యీదినం (ఫిబ్రరవరి 14/ బుధవారం 2024) మన ఆదిగురువులైన పూజ్యలాలాజీవారి 1...