పూజ్యలాలాజీ మరియు మన ఆధ్యాత్మికప్రగతి
సోదరీసోదరులమైన మనమంతా యిక్కడ యీదినం (ఫిబ్రరవరి14/బుధవారం
2024) మన ఆదిగురువులైన పూజ్యలాలాజీవారి 151వ జన్మదినోత్సవం జరుపుకొనుటకై సమావేశమైనాము. ఇది మనకొక పరమపవిత్రమైన
సందర్భము. ఆధ్యాత్మికశిక్షణారంగమున సామాన్య గృహస్తులైన సత్యాన్వేషకులకు సైతం
అందుబటులోనికితెచ్చిన ఆయన విధివిధానమొక విప్లవమని గ్రహించినవారందరికిగూడా యిది
మహత్తర పవిత్ర సందర్భము.
మన పూజ్యగురువర్యులు మరియు లాలాజీవారి ఉత్తరాధికారి, ప్రతినిధియైన
శ్రీబాబూజీమహరాజ్‌వారు లాలాజీవారిని గురించి వివరిస్తూ యిలా అన్నారు. “ఆయన
స్వతహాగా అనునిత్య ప్రశాంతచిత్తుడేగాక యితరుల మనోవేదనలకు సంతోషములకు అతిసులభముగా
స్పందించెడివారు. ఆయనస్వరం మృదుమధురమై యుండెడిది. తన మృదుభాషణములతో తన
ఆలోచనాసరళిని తెలియజేస్తూ శ్రోతల హృదయములను ఆకట్టుకొనెడివారు. చాలా అరుదుగా
యెపుడోగాని తప్ప సామాన్యముగ ఆయన కోపగించుకొని యెరుగడు. అనవసర ప్రసంగములాయన చేయడు.
మితభాషి, గానీ ఆయననడిగిన ప్రశ్నలకుమాత్రము చాలా విపులమైన
సమాధానములనిచ్చి, అడిగినవారికిక సంశయమేమాత్రము లేకుండునట్లు
వచించును. ఆయనెప్పుడూ బిగ్గరగా నవ్వడు, గానీ మందహసమే
ఆయనముఖముపై కనుపించెడిది. ఆచిరునవ్వు యితరులలో చైతన్యస్ఫూర్తిని వికసింపజేసి
సుమధురసౌమ్యతను వెదజల్లుచుండెడిది. పొగడ్తలయన అంగీకరింపడుగాని, తన అనుచరులకెన్ని దోషములున్నను వాటిని గణింపక వారిని ఆదరించును,
ప్రేమించును. అయితే తనుమాత్రము యెప్పుడూ గట్టి క్రమశిక్షణాపరుడైయుండును.
క్రమశిక్షణ, మూలముననున్న, సమున్నతముగాని
ప్రాపంచిక దోషభావోద్వేగములను సరిదిద్దును. సద్గుణానుగత సూత్రములచే హృదయమును
సమున్నతమొనర్చును. మనస్సును వికసింపజేసి అంతర్గతానందమును కలిగించును. కనుకనే
లాలాజీ యెప్పుడుకూడా ఖచ్చితమైన క్రమశిక్షణను ప్రేమతో ఉద్భోదించుటను విడనాడలేదు.
లాలాజీ విగ్రహసౌష్ఠవమునుగూర్చి వివరిస్తూ బాబూజీ యిలాఅన్నారు. ఆయన అత్యంత భగవత్ప్రేమికుడు. మనిషినిమించిన వైభవోపేతుడీ సృష్టిలోనే లేడని నమ్మినవాడు. ఆయన సంపూర్ణదయామయుడు. ధ్యానముద్వార తననుతాను సృష్టికర్తకు నచ్చినట్లు సమర్పించుకుంటూ ఆమహాప్రభువు సృష్టిలోని జీవులన్నిటికి మేలుచేయువాడు. గోదుమవర్ణ శరీరచ్ఛాయతో ఆకర్షణీయమైన లక్షణములుగలవాడు. ఆయన యెత్తైన విశాలనెన్నెదురు తలలోగల విశేష జ్ఞానబాండాగారమును సూచించుచుండెను. అది ఆయనకొరకే వెలిగింపబడిన జ్యోతిగాకాక సముద్రయాత్రికులకొఱకు నిలిపిన దీపస్తంభమువలె ప్రకాశించుచుండెను. ఆయన నేత్రములు అత్యంతోజ్వలములై రెండు కాంతివంతములైన నక్షత్రములవలె నుండి ప్రతియొక్కరిని, ప్రతిదానిని దర్శించుచున్నవా! అన్నట్లుండినవి. అవి అత్యంతలోతైన కొలనుల రీతిన నుండినవి. అవి నిశ్శబ్దప్రార్థనాలయములవలెనో లేక మధుర నిశ్శబ్ద మనోజ్ఞములైనవిగనో వికశించియుండినవి.
నూతన శకము:- లాలాజీ
ఉర్దు,
పర్షియన్, అరబిక్‌భాషలందు పండితుడు. సంస్కృత
హిందీ భాషలను క్షుణ్ణముగ నెఱిగినవాడు. వేదములలో తెలియని రహస్యములను సృజనాత్మకముగా
విప్పిజెప్పి, అందలి సత్యములను వెలువరించెను. ఆయనొక ప్రత్యేకప్రతిభామూర్తి.
ప్రకృతిప్రసాదిత ప్రతిభాశాలి. అంతిమమనస్తత్త్వజ్ఞుడు. ఎప్పుడో మరచిపోయి
మరుగునబడిపొయిన ప్రాణాహుతికళను మానవాళిశ్రేయస్సునకై మరల బయల్పరచి, సాధకుని సాదకబాధకములనుండి పూర్తిగా విడుదలగావించు నొకానొక నూతన ఆధ్యాత్మికశిక్షణావిధానమును
నిర్మించియిచ్చెను. ఆయన అహంకారమసలేలేని మూర్తీభవినంచిన మితస్వభావము, సహనశీలము, మరియు భక్తితత్త్వము. ఒక నూతన
యోగశిక్షనావిధాన శకారంభకుడైన మహనీయుడు. ప్రాణాహుతివిద్యకు ఆధ్యుడు. చూపుమాత్రమున
వ్యక్తిని చక్కదిద్దగల మహనీయుడాయన. వ్యక్తిని తనజీవితకాలమున , యికాచెప్పాలంటే, జీవితములోని కొద్దికాలములోనే,
సంసారికజీవనము గడుపుతున్ననుకూడ సంపూర్ణత్వమును బడయజేయగల
శక్తిమంతుడాయన. నేటి ఆధునికకాలమునకు తగినరీతిన ఆధ్యాత్మికసాధనా విధానమును సవరించి
సులభతరంజేసి అందించిన మహాత్ముడాయన.
లాలాజీవారు మనకొక
సులభతరంగావింపబడిన విధానమునొసంగిరి. అది మనగురువర్యుల (శ్రీబాబూజీ) కృప మరియు
ప్రాణాహుతిప్రసారము వలన మనము మానవ జీవితలక్ష్యమును పొందుటకు తగు ఆధ్యాత్మిక
మార్గమేర్పడినది. లాలజీవారు చెబుతూ, మనమెపుడు మన అంతర్‌స్థితిని,
బాహ్యనడవడిని బాగుపరచుకొన యత్నింతుమొ, అప్పుడదే ఆధ్యాత్మికస్థితిఉత్పన్నముచేయును.
ఇంకావివరిస్తూ మనంచేయు అభ్యాసము లేదా సాధన మన ఆంతరంగికస్థితిని (మనస్సును)
బాహ్యనడవడిని మెరుగుపరుస్తుందని వివరించెను. మన అంతర్ స్థితి దూర్తయోచనలతో
స్థూలత్వముచెందుటచే, ఈర్ష్యా, ద్వేషము,
స్వార్థము, కపటము, దురభిమానము,
భయము మొదలగువాటివలన ఆత్మస్థైర్యము కోల్పోయియున్నాము. ఈఅవలక్షణముల
స్థానమున శాంతి, ఆత్మవిశ్వాసము, నిజాయితీ మరియు దివ్యత్వమును
జీవితమున పెంపొందించుకొనవలసి యున్నది.
అంతర్‌స్థితి:- అదేవిధంగా
మనబాహ్యప్రవర్తన, కోపముతోను, మూర్ఖత్వముతోనూ,
స్వార్థముతోనూ నిండియున్నది. మనలో తగని అహంకారము, ధనము, పదవులకు మరియు పుస్తకజ్ఞానమునకు సంబంధించిన
ఆధిక్యతతో చెడిపోయియున్నది. కనుక మనము లాలాజీవారి స్వభావము, నడవడిని
గురించి తెలుసుకొనవలెను. వాటిని గమనించి అందరూ ఆయనను ఇష్టపడెడువారు. ఆసద్గుణములు
సృష్టికర్తకు సహితము ఆమోదయోగ్యములైయుండెడివి. మనమాయనతో అనుగుణ్యముగ నుండవలెనన్న
ఆయనసూచనలను, పద్ధతిని భక్తిప్రేమలతో అనుసరించుటే
యేకైకమార్గము. అంతర్‌స్థితి మనబాహ్య ప్రవర్తనలో ప్రతిబింబించును. మన ఒకానొక
కార్యము పూర్తిగాక చెడిపోయినయెడల యితరులపై అరచి నిందింతము. అది నిజమునకు మనకుగానీ
యితరులకుగానీ శ్రేయస్కరముగాదు. మన కార్యకలాపములను సమన్వయపరచుకొనుటకు మన అంతర్‌స్థితిని
మెరుగుపరచుకొనవలెను. అప్పుడే మన బాహ్యప్రవర్తన అంతర్‌స్థితి ప్రభావమున బాగుపడును.
ఈవిధముగ సంస్కారములేర్పడి ఒకరూపుదాల్చి అనుభవమునకు వచ్చుచుందును.
కనుక ప్రాణాహుతిప్రసారముద్వారా, అంతఃశుద్ధీకరణ
మరియు హృదయమున ఈశ్వరీయప్రకాశము కలదని ధ్యానించుటతో మన అంతర్‌స్థితి
మెరుగుపరచుకొనుట అత్యావశ్యకమైయున్నది. ఆప్రక్రియలు ప్రాపంచిక వస్తువ్యామోహముచే
పతనమైన మనస్సును క్రమబద్ధీకరించుటలో సహాయపడును. దీపపువత్తి నూనెనుపీల్చుకొని
యెట్లు వెలుగునో అట్లే మనస్సు విషయములను తన సూక్ష్మనాళములతో గ్రహించి
ఘనత్వముజెందియుండును. మనస్సుకూడా పదార్తప్రభావమును గ్రహించు అలవాటు గలిగియున్నది.
మనస్సు మంచిఆలోచనలతోవుంటే, అది భక్తిగలిగియుండును.
చెడుఆలోచనలు భారమును, జడత్వమును పెంచును. కనుక మనము హృదయములో
ఈశ్వరీయప్రకాశము కలదని తలంచి, ఉత్పన్నమగు ఆలోచనలను లెక్కచేయక,
ఈశ్వరీయప్రకాశమునే అప్రమత్తతతో గమనింతుము. ఈవిధమైన సూత్రము
ననుసరించుటవలన దైవత్వము అంతర్గతముగా నిలచి, మనస్సును
తేలికగను సూక్షముగను వుంచును. అదేవిధంగా శుద్ధీకరణ మనలోని చిక్కులనన్నిటిని
నిర్మూలించుతలో సహాయపడును, ఆచిక్కులలో మనలోని జడత్వము
అంధకారము కూడా కలసియున్నవి. వాటినన్నింటిని ఇచ్ఛాశక్తితో బయటకు త్రోసివేయుదుము.
అనుదిన సాధనద్వారా లాఘవము, సామర్థ్యము, శుద్ధీకరణప్రక్రియలో
పెంపొందించుకొని, మలినములను సులభముగా తొలగించుకొందుము. బాబూజీద్వారా పొందిన
ప్రాణాహుతివలన శుద్ధీకరణప్రక్రియ మరింత సమర్థవంతముగా జరుగును. మన పూర్వసంస్కారములు,
నకారాత్మకయోచనలు వదలించుకొని, మనస్థైర్యమును
పెంపొందించుకొందుము. ఈమార్పు మన బాహ్యనడవడిపై ప్రభావము చూపును. మనము యెవరితోనైనను,
దేనితోనైనను, యేపరిస్థితులలోనైనను, మన
ప్రతిక్రియను యెఱుకతో గమనింపగల్గుదుము. అందువలన అసహ్యకర పరిణామములను లోనికి
చొరనీయక జాగ్రత్తపడుదుము.
ఆధ్యత్మిక ప్రగతి:- బాబూజీ మనకు
దశాదేశములనిచ్చిరి. అవి మనజీవితమును తీర్చిదిద్దుకొనుటకును, నిష్కపటముగా
సరళముగ వుంటూ, ప్రకృతికనుగుణముగా జీవించుటకుపయోగపడును.
దశాదేశములు మనజీవితములో ఒకభాగమగువరకు వాటిని శ్రద్ధగా అనుసరించవలెను. “జీవితములో
జీవిత”మను స్థితి గురువర్యుల నిరంతరస్మరణ ద్వారా సిద్ధించును. సంస్కారములేర్పడుట
నిలచిపొవును. ఇది వాస్తవజీవితలక్ష్యము వైపునకు సాగు మనప్రయాణమును సూచించును.
బాబూజీ చెప్పినట్లు మన ఆధ్యాత్మికపురోగతి ప్రస్తుతస్థితినుండి పిండదేశమునకు,
అటునుండి బ్రహ్మాండమండలము, పరబ్రహ్మాండమండలము, కేంద్రస్థానము చేరి బ్రహ్మములో లీనమై, మనకు
సంబంధించిన యెఱుకయేలేని స్థాయికి జేరుకొందుము. ఇది మహోన్నతస్థాయి. ఈస్థాయినెరిగి
వివరించుటకు తగుశక్తిమంతుడు కావలెను. అయినప్పటికిని బాబూజీ మన ఆధ్యాత్మికప్రగతిని
తెలుసుకొనుటకకొక సులువగు మార్గమును సూచించిరి. అదియేమనగా, మనం
పశులక్షణములనుండి మనిషిగా, అటునుండి నిజమైనమనిషిగా పరివర్తన
జెందుదుము. నిజమైనమనిషి యెవరు? అంటే ఆనిజమైనమనిషి
మరొకమనిషిని నిజమైనమనిషిగ తీర్చిదిద్దగలడు. అంటే ఆయన సద్గురువన్నమాట.
మనలో పశుత్వము తొలగిపోతే మనిషిగా మారెదము. ఈమార్పును,
మననడవడిని చూచి తెలుసుకొనవచ్చును. అందుకే మనసాధన యంతయూ మన అంతర్‌స్థితిని, బాహ్యనడవడిని
ఆభివృద్ధి చేసుకొనుటకే యున్నది. మన నడవడిని శీలమును జనులు గమనించి మనము గౌరవనీయ
పెద్దమనుష్యులమో కాదో తీర్పుచెప్పుదురు.
గంభీరమైన ఉపదేశము:- ఒకసన్యాసి
షాజహాన్‌పూర్‌వచ్చి యిక్కడొక మహాత్ముడున్నాడట, ఆయనెవరని
విచారించాడు. అతనిని బాబూజీ వద్దకువెళ్ళమని దారిచూపారు. అతడు బాబూజీ
వద్దకువెళ్ళాడు. బాబూజీ అతనిని సాదరంగా ఆహ్వానించి కూర్చోమని ఆసనంచూపారు. అతడు
ఆసీనుడై, తనను పరిచయం చేసుకొంటూ, నేను శ్రీశ్రీశ్రీ
మహామండలేశ్వర పరమహంస...అంటూ సుదీర్ఘంగా బిరుదులన్నీ చెప్పుకొని తనపేరు
చెప్పుకొన్నాడు. తర్వాత బాబూజీని, మీగురించి చెప్పండి అన్నాడు. బాబూజీ నాపేరు
రామచందర్ అన్నాడు. సన్యాసి సందిగ్ధంగా
అదేమిటి కేవలం రామచందర్ అంటున్నారు, పేరుకుముందు శ్రీశ్రీలు మరింకా
బిరుదులు వుండాలిగదా! సరే సరే మీపరిచయం...అన్నాడు. బాబూజీ మళ్ళీ ప్రశాంతంగా
రామచందర్ అన్నాడు. సన్యాసి మరింత అసహనంగా అదిసరే, మీవిషయం..
పరిచయం ...అనగానే బాబూజీ బిగ్గరగా మై ఇన్సాన్ (నేను మనిషిని) అన్నాడు.
ఈఉపాఖ్యనంలో ఒకగంభీరమైన ఉపదేశమున్నది. కడకు బాబూజీవంటి
సాక్షాత్కారముపొందినవారే నేను ఇన్సాన్ (మనిషిని) అంటే, ఇక డాంబికమేయూలేని
సహజమానవత్వమంటె యేమిటోగదా! ఇటువంటి స్థితిని ప్రామాణికంగా గైకొని, మనపరిస్థితిని అంచనావేసుకొని చూస్తే, మనమెంతవరకు
అంతర్గతంగాను, బాహ్యనడవడిలోనూ పశుత్వాన్ని వదులుకొన్నామో?
ననిపిస్తుంది. దీనినిబట్టి మనం మనజీవితగమ్యానికి యెంత
దూరంలోవున్నామో, యెంతచేరువలోనున్నామో అర్థం చేసుకోవచ్చు.
లాలజీ మరియు వారి ఉత్తరాధికారి ప్రతినిధియైన బాబూజీవారి
మార్గదర్శకత్వంలో నిర్మితమైన, వాస్తవ
మానవజీవితగమ్యమును చేర్చు సహజమార్గ విధానము అందుబాటులోనున్నది. ధన్యవాదములు!
(ఇది శ్రీ పి.డి.గైక్వాడ్,పూన వారు కడపలో బసంత్‌పంచమిపర్వదినమున
చేసిన ఆంగ్లోపన్యాసమునకు అనువాదము. ఆధ్యాత్మజ్ఞాన్ ఏప్రిల్-జూన్ 2024 పత్రికలో ప్రచురితమైనది)