Sunday, 11 February 2024

పరిపూర్ణత


పరిపూర్ణత

(Perfection)

 మానవసమాజములోని వివిధసాంస్కృతిక సంఘములలో ఆత్మ  పరమాత్మను గూర్చి అనేకభావనలున్నవి. అందువల్ల సాక్షాత్కారముపరిపూర్ణతకు సంబంధించిఅర్థములు వేరువేరుగా నున్నవి. వారి ఉద్దేశ్యములను నేను విమర్శించుటగానీ తప్పుబట్టుటగానీ చేయనుగానీసహజమార్గ దర్శనమురీత్యా నా దృక్పదమును మాత్రము తెలియజేస్తున్నాను.

మానవుని మూలమును సృష్ట్యాదిన గమనించినట్లైన (నా పుస్తకములో వివరించినట్లు) ప్రతివ్యక్తి యొక్క ఉనికి (జీవుడు) దైవమునకు సమీపముగా నుండినది. తేడా కేవలము సాంద్రతతో పోల్చిననే గానవచ్చును. ఒకవిధంగా ఆలోచిస్తే ఆత్మ పరమాత్మ  ఒకేవిధంగా నున్న దనవచ్చును. కనుక దైవసాక్షాత్కారము ఆత్మసాక్షాత్కారము రెండూఒకే‍అర్థముగల రెండు పదములుగా గోచరించును. ఆత్మ (జీవుడు) సంపూర్ణముగా కేంద్రములో లయమైపోవుట సంభవము కానప్పటికినిఆత్మ తొలుత ఒక వ్యక్తిగత ఉనికిగా యేర్పడిన స్థాయివరకు తిరిగి వెళ్ళవచ్చును. ఇదే మానవసాధ్యమగు ఆఖరిస్థానము. దీనినే పరమగమ్యముగా గైకొనవలెను. సహజమార్గ తాత్త్వికవిధానమున దీనినే మనము పరిపూర్ణతకు అర్థముగా భావింతుము.

 నిజానికి పరిపూర్ణత యిదియని ఖచ్చితముగా నిర్ణయించజాలము. మానసమున దైవభక్తి గలిగియుండుటకుమన మాటతీరు నడత సంస్కరింపబడి యుండును. అది పురోగమనమున ఒక ఉత్తమదశయై యుండవచ్చునే గానీఅది పరిపూర్ణత గాదు. దైవముతో సంబంధ మేర్పరచుకొనియుండుటయుఒక ఉన్నతస్థాయి గావచ్చును. కానీ అదికూడా పరిపూర్ణత కానేరదు. శాశ్వతానందమున నోలలాడు చుండుట దైవానుగ్రహము గావచ్చును. కానీ అదికూడా పరిపూర్ణత కాదు. దైవము మాత్రమే పరిపూర్ణము. ఎంత పురోగమించినను నశ్వరమగు దేనిని పరిపూర్ణమనలేము. మనము అనంతవ్యాప్తమున పయనించుచున్నాము.  స్థూలాతి స్థూలమైన బాహ్యవృత్తము నుండి కేంద్రముఅదే అంతరముననున్న సున్న (పూజ్యము) వైపునకు ప్రయాణము సాగించుచు న్నాము. ఇది మానవ అవగాహనకందనిది. ఆ మార్గమున మానవసాధ్యమగు తుదిస్థితి యేదైయున్నదో దానినేపరిపూర్ణతగా గైకొనుచున్నాము. మానవ‍ అవగాహనలో దీనిని సంపూర్ణ అభావస్థితి లేక దైవముతో (సంపూర్ణముతో) కలసిపోయి ఒక్కటైయుండుట లేక అన్నింటి కతీతముగా యేదో ఉన్నదను ఆలోచన లేక ఊహ గలిగియుండుటే అది.                    

సామాన్యముగా (ప్రకృతి) కార్యము నిర్వహింపదలచినవారు మాత్రమే శక్తికొఱకు ప్రయత్నింతురు. పదార్తాంతర చైతన్యమే శక్తిని హెచ్చింపగలదు. కానీ సత్‍పదార్తమే అవసరమగు ఫలితములనొసగు వాతావరణమేర్పరచ గలదు. నాకది అవసరమైయున్నది. కార్యనిర్వాహకులు  ఆ శక్తిగానిశక్తిని పొందవలసి యున్నది. అద్దానిని ప్రపంచము కలలోకూడా కనజాలదు. అదే   పరమసత్యము. ఈ శక్తిలేనిశక్తిపరికరముతోనక్షత్రములను ఛేదించవచ్చును. ఒకనూతన సూర్యుని నుత్పాదించి ప్రపంచమున వెలుగులు నింపవచ్చును. అట్టి శక్తిలేనిశక్తి గల స్థాయిమాత్రమే పరిపూర్ణము. జిఙ్ఞాసువులగువారి కొఱకు మరొక్క విషయము చెప్పదలచితిని. ఒక పరిపూర్ణుడు పూర్తిగా తెలియనివాడైనాజ్ఞానవిహీనుడైనాఅతడు అంతర్గతముగా సర్వఙ్ఞుడై యుండును . నిష్ణాతులైన జ్ఞానులుసైతంవారిపరిధిలో పరిష్కరింజాలని సమస్యలనితడు పరిష్కరించ గలిగి యుండును.

 అన్నివిధముల శక్తులుచేష్టలుజ్ఞానముస్పందనలుఇచ్ఛఅహముయింకాచెప్పాలంటే ఎఱుక (స్పృహ) కలిగించు పొరలనుఅడ్డంకులను తొలగించుకున్నంతనే అటువంటిమానవసాధ్య పరిపూర్ణత సిద్ధించును. ఈస్థాయిలో అతడు ఎవరికోసం "నేను" "ఆయన" అనే పదములను వాడునో తెలియదు. చేతులు కదల్చకనే పనులు నిర్వహిస్తాడు. కాళ్ళు కదల్చకనే గమ్యము చేరుకుంటాడు. చూపుసారించకనే చూడగల్గుతాడు. తెలిసుకొనకనే అన్నీతెలిసి వుంటాడు. ఆవిధంగా అతని కార్యనిర్వహణ సాగుతుంది. ఇట్టి కేంద్రస్థాయి లేక సున్నా (పూజ్యము) లేక అభావస్థితి యని గానీ, మరేపేరునగానీ అతనిస్థితిని పిలువవచ్చును. అది మాత్రము చాలాచాలా అరుదైనది. అది సత్యమైనది. అది కృత్రిమప్రయత్నమున కలుగునది కాదు. సరియైన సన్మార్గమున (సత్య సహజమార్గమున) నే అది  సిద్ధించును.

                                   ------ బాబూజీ రచనలనుండి గ్రహించబడినది.

(డా:S.P శ్రీవాత్సవగారి Divine messages అను పుస్తకమునుండి గ్రహింపబడినది)             

 

ఆధ్యాత్మిక సేవ

 

ఆధ్యాత్మిక సేవ

తన హృదయదర్పణమును స్వచ్ఛముగా(పరిశుభ్రముగా) నుంచుకొన్నవాడు దైవీయ పరిధిలో ప్రస్ఫుటమగుచున్న విషయసూచనలు అందుకుంటూ వుంటాడు. అటువంటివాడే సాధకుని హృదయాన్ని శుద్ధిచేసి, అచట కాంతిని వెలిగింపగలడు. ఎవరైనా గురుస్థానమున ప్రవేశించి బోధచేయ యత్నించెనన్న, అతడు భగవంతుని స్థానమాక్రమింపజూచెనని అర్థము జేసుకొనవచ్చును. నిజమునకు భగవంతుడొక్కడే సర్వంసహా అందరికిని గురువు. స్పష్టముగా చెప్పవలెనన్న, ఒక దేశమునకు యిద్దరు రాజులుండుటకు వీలులేదు. అందువలన వ్యక్తి తన్ను తాను గురువుగా దలంచుకొని బోధకుపక్రమించిన యెడల, అతడు వాస్తవమున యెవరికీ మేలుచేయలేడు. అందువలన వ్యక్తి తననుతాను వినమ్రుడైన సోదరునిగా దలచి, అదే భావనతో తన కర్తవ్యమును నిర్వహింపవలెను. ఆవిధమగు సుహృద్భావసేవకు ఘనప్రయత్నపూర్వక ఉదృతచర్యలేమియు అవసరములేదు. నిజానికి ఆస్థాయికి చేరుకొన్నంతనే బోధనాసేవ యదేచ్ఛగా సూర్యునినుండి కాంతి, వేడిమి ప్రసారమగుచున్నట్లు, ప్రసరించును.

నన్ను ఆధ్యాత్మిక సేవకునిగా తలంచుట సరియైన ఆలోచన. నేను యిప్పటికే ఆధ్యత్మికసేవలందించుచున్నాను. మా పూజ్య గురుదేవులు  (లాలాజివారు) ప్రతిఒక్కరిని తనసోదరునిగా (లేక సోదరిగా) భావించెడివారు. ఆతీరుననే నేను, అదేమి అగౌరవముగా తలంచక భౌతికసేవలుకూడా అందించుచున్నాను. మాగురువర్యులు ఆయన జీవితకాలమంతటిలో యెవ్వరిని తనశిష్యులని తలంచనే లేదు. ఈవిషయములో పాతకాలపు విధానములు మారవలసియున్నది. ఆకాలమున గురువులు శిష్యులచేత పాదములొత్తించుకొనుట, పాదాభివందనము చేయించుకొనుట  వంటిసేవలు చేయించుకొనెడివారు. తద్వారా శిష్యులు దైవీయ మార్గమునందు తమధ్యాసను అభిరుచిని వృద్ధిజేసుకొనెడివారు. శిష్యులు గురువుగారి కాళ్ళూ, చేతులు ఒత్తుటద్వారా, పాదములు  తాకుటద్వారా గురువులోని శక్తి తమలోనికి ప్రవేశిస్తుందనీ, తద్వారా వారి ఆలోచనకూడా దివ్యత్వముతో అనుసంధింపబడి వుంటుందని విశ్వశించెడివారు. మరోవిధంగా చెప్పాలంటే, ఈవిధంగా చేయుటవలన సాధకునియొచన  గురువుగారితో సదా అనుసంధింపబడియుండి, భక్తిభావము వృద్ధిచెందుతుంది. ఇప్పుడు కాలంమారిపోయింది. అందుకు తగ్గట్టుగానే విధివిధానములుకూడా మారిపోయినవి. ఇప్పుడు గురువు అదేసేవ అభ్యాసికి చేసినప్పుడుకూడా అభ్యాసికదే ప్రయోజనముపొందు అవకాశమున్నది.  

పురోభివృద్ది చెందుతూపోతూ ఒకానొకదశలో సాధకుని నుండి యదేచ్ఛగా ఆధ్యాత్మికశక్తి ప్రసరించడం ప్రారంభమై అధికమౌతూపోయి, ఉదృతమై అతని పరిసరములూ చుట్టూగల ప్రదేశములతటనూ వ్యాపించును. అతనిశక్తి ప్రభావమువలన ప్రకృతిసిద్ధముగా ప్రతిది దివ్యత్వము చెందుతుంది. ఇటువంటిస్థితి, ప్రకృతి ఒకవ్యక్తిని ప్రత్యేకముగా ఎన్నుకొన్నప్పుడు మాత్రము జరుగుతుంది. అప్పుడతనిస్థాయి ఒక అవతారపురుషుని స్థాయికి చేరివుంటుంది. అతనిని, అవసరములకు తగినట్లగా ఉద్భవించిన అవతారమనవచ్చును. అనగా ఆమహాపురుషుడు ఆసమయమున నిర్వర్తించవలసిన కార్యములకనువుగా ఉద్భవమైయుండును.అటువంటి మహత్తర గుణములు, మనం ఎవరిలోనైనా గుర్తించినట్లైన, ఆతని(లేక ఆమె) ద్వారా ప్రకృతి పనిచేయుచున్నదని భావించవచ్చును.  

            అటువంటివ్యక్తి తప్ప వేరెవ్వరూ బోధచేయ నర్హులుకారు. నిజానికి అతడే సరియైన మార్గదర్శి. వేలసంవత్సరముల తర్వాతగానీ అటువంటి మహనీయుడు జన్మించడు. అయినప్పటికినీ ఎప్పుడైనా అంతటిమరోవ్యక్తిని దయతో ఆమహనీయుడు మాత్రము ఉద్భవింపజేయుటకు సమర్థుడు.అంతటి మహనీయుడు వుంటే, ఆయనను వెదకికనుగొని ఆశ్రయించవలసియున్నది. పవిత్రాత్మ లందరి విషయమున మహత్‌వ్యాప్తి తప్పక వుండి తీరుతుంది. అయితే సద్యోచన దివ్యపదార్తముతో సంయోగముచెందినప్పుడీ మహత్తరస్థితి ఉత్పన్నమౌతుంది. యోచనాసంయోగం అట్టి మహత్తర స్థాయికి కిందిస్థాయిదైతే వ్యాప్తికూడా తదనుగుణంగా క్రిందిస్థాయివరకే పరిమితమై వుంటుంది. ఒకవేళ అట్టి అవతార పురుషుడు అందుబాటులోవుండి సాధకుడు ఆమహాత్ముని మహద్వ్యాప్తిలో లీనమైనపుడు, అతని లయావస్థకనుగుణంగా అతడుకూడా మహద్వ్యాప్తిని సాధించగలడు. నన్నాకర్షిస్తున్నచోటికి నేను వెళ్ళక తప్పినదికాదు. నాచెంతజేరుటకందరికీ ఆహ్వానము గలదు. నీవునేను కలసి చేయదలచిన పనులనుచేస్తూ ఉండవచ్చును. కడకు దైవాభీష్టమే జరిగితీరుతుంది. "స్వయంగా నీ అభీష్టముమేరకు నీ ఇచ్చానుసారమే ఫలితము లభించునుగానీ తద్భిన్నముగా రవ్వంతయైనను జరుగదు. (బేరజా-ఎ-తు మయస్సర్ నేస్త దీదారే శుమా")

ఎవరైనా పూజ్యగురుదేవునితో నేరుగా సంబంధమేర్పరచుకొని సార్థకత సాధించ వీలౌతుందా అన్నది ప్రశ్న. నేను ఆయనదాసుడనని ముద్రవేయించుకొని మీకరములను ఆయన కరములకందించు చున్నాను. కనుక నాక్షేమముకొఱకు ఆయనను ప్రార్థించినపుడు అది తప్పక నాకు లాభిస్తుంది. నాకార్యములు,బాగోగులు అవి భౌతిక మైనవైనా మానసికమైనవైనా యేవైనను సరే అవన్నీ ఆయనపైనే ఆధారపడియున్నవి. సాధకుడుచేసే యేపనియైనా, అదిమేలు చేసేదైనా, హానిచేసేదైనా,అది ఆసాధకునికే చెందుతుంది. నామార్గదర్శకత్వము, నాబోధలో యేకొద్ది పొరపాటు ద్రొల్లినా, అందువల్ల సాధకునకుకలిగే మేలుకుకీడుకు నేనే బాధ్యుడనై యున్నాను. జరుగునదంతయూ వారిప్రయోజనమునకే యగుగాక! ఒకేదానిపైగల ధ్యాస మాత్రమే, మహత్తరఆధ్యాత్మిక పురోగతికి మూలము. నేను పొందినదంతయూ, సమర్థుడైన నాగురుదేవుని నుండి మాత్రమే పొందితిని. తప్పులుమాత్రము నాచేతల వలననే కలిగినవి. అయిననూ వాటి అనుభూతులుగూడా ఆయనతోనే అనుసంధింపబడి ఆయననే సూచించుచున్నవి. నాకుమాత్రము, అంతయూ ఆయనస్థాయి, ఆయనసామర్థ్యమువల్లనే సంప్రాప్తమైనవి గానీ, యితరత్రా లభించినవి కానేకావు. అందువలన నేనాయనను మాత్రమే దృష్టియందుంచుకొని, ఆయననే అంటిపెట్టుకొని యున్నాను. నాకళ్ళకు ఆయనమాత్రమే దృగ్గోచరమై, యితర మేమియూ కనబడకుండునట్లు కళ్ళుపొడుచుకొని అంధుడనైనాను.

"ఏగ్రుడ్డివాడు తనకుతానై చేసుకోలేనంతపని నేను చేసుకున్నాను. గృహమధ్యముననే నేను గృహయజమానిని కోల్పోతిని. అప్పుడే ప్రభువు అమితానందము వెలిబుచ్చెను”.

("హర్ కి మా కర్‌దేమ్  బా ఖుద్, హైచ్ నా-బీనా న కర్ద్ /

 దర్మియానే ఖానా గుమ్ , కర్దేమ్ సాహబ్-ఖానా రా/)

  "ఆరిపోయిన దీపాగ్నిలో దహించుకపోవడం అన్ని శలభములకు సాధ్యపడదు"

(“సోఖ్తన్ బర్ శమ్ఆ కుశ్తా కారే హర్ పర్వానా నేస్త్")

ఇది ఆధ్యాత్మిక మార్గదర్శకత్వమున, సాధనమున అత్యంత ప్రాధాన్యతగల అంశము.

                                        --ఒక అబ్యాసికి బాబూజీ వ్రాసిన లేఖ.

(Divine messages by Dr. S.P. Srivastava  అను పుస్తకమునుండి గ్రహింపబడినది.

 

 

పూజ్యలాలాజీ మరియు మన ఆధ్యాత్మికప్రగతి

  పూజ్యలాలాజీ మరియు మన ఆధ్యాత్మికప్రగతి సోదరీసోదరులమైన మనమంతా యిక్కడ యీదినం (ఫిబ్రరవరి 14/ బుధవారం 2024) మన ఆదిగురువులైన పూజ్యలాలాజీవారి 1...