Wednesday, 15 September 2021

సహజమార్గ పరిచయము

సహజమార్గ పరిచయము

                                                                                                      -- పి.సుబ్బరాయుడు

Does an enlightened being have an effect on other people? Can we feel their  presence in-person? Do they also energetically increase peace, love, and  harmony in collective human consciousness? - Quora మహత్మా శ్రీరాంచంద్ర జీ మహరాజ్, షాజహాన్ పూర్

 

శ్రీరాంచంద్ర జీ మహరాజ్ సేవాటస్ట్ 3/1289-1;

కోఆపరేటివ్ కాలనీ, కడప-516001

 

హజమార్గ పరిచయము

 ఆవిర్భావము

భారతావని ఆధ్యాత్మికతకు పుట్టినిల్లు. ఇండెందరో మహనీయులుద్భవించి ఆధ్యాత్మికతను పునరుద్ధరింపజేయుచూ వచ్చిరి. కాలక్రమమున సూక్ష్మాతి సూక్ష్మమగు ఆధ్యాత్మిక స్థానమును స్థూలాతిస్థూలమగు జడత్వ మాక్రమించినది. అజ్ఞానాంధకారము కారుమేఘమువలె క్షమ్మివైచినది. ఆధ్యాత్మికత అంగడి వస్తువైనది. గురువులమని చెప్పుకొను కొందరు ఏవోకొన్ని మంత్రములు, జపములు, వ్రతములు పుస్తకములనుండి గ్రహించి వాటిని తమ శిష్యులకు బోధించుచు అదే ఆధ్యాత్మిక మని నమ్మించు వరకు వెళ్ళిరి. ఇట్టి పతనావస్థ నుండి జనులను సముద్ధరించుటకు ఒక మహాత్ముని అవసర మేర్పడినది. ప్రకృతిలో ఏర్పడిన ఈ లోటును పూరించుటకు 1873 వ సం|| ఫిబ్రవరి 02 వసంత పంచమినాడు ఉత్తరప్రదేశ్ లోని ఫరూకాబాద్ జిల్లా ఫతేఘర్ గ్రామమున శ్రీ రామచంద్రజీ (లాలాజీ) గారుద్భవించి, మరుగున పడిపోయిన నిజమైన ఆధ్యాత్మికతను పునరుద్ధరించిరి. మనము పూర్తిగా విస్మరించి, అసలు నమ్ముటకు కూడా సిద్ధముగాలేని స్థితిలో ఒక దివ్యశక్తిని (ప్రాణాహుతిని) మూలము నుండి గ్రహించి సాధకునిలోనికి ప్రవేశపెట్టి, తద్వారా అతనిలో భాగవత్తత్వపు మేల్కొల్పు కలిగించి కార్యోన్ముఖునిజేసి భగవత్ సాక్షాత్కారము సులభతరముజేసిరి. ఆయన శిష్యులగుశ్రీ రామచంద్ర జీ మహారాజ్, షాజహాన్ పూర్ (ఉ.ప్ర) వారు ఈ విధానమును
 "సహజమార్గ"మను పేర లోకమున బహుదా వ్యాప్తి గావించి, ఆధ్యాత్మిక శాస్త్రమున ఒక నూతనాధ్యాయమునకు తెరతీసిరి. వారే ఈ ఆధ్యాత్మిక తత్త్వవిధానమునకు పరమగురువులు. లోకోద్ధరణకై అవతరించిన ప్రత్యేకమూర్తి. ఇట్టి ప్రత్యేకావతార మూర్తులు ప్రపంచమున అరుదుగా (కొన్ని వేల సంవత్సరములకొకసారి) గాని ఉధ్భవించరనుట అక్షరసత్యము.


ఎవరికోసం

సామాన్యముగ ప్రజలు ఆధ్యాత్మికజీవనము బహుకష్టమని భావిస్తారు. అసలది సామాన్యులకు నిర్దేశింపబడినది కాదని అనేకమంది నమ్మిక. అందుకొరకే పుట్టిన ఏ కొద్ది మంది మాత్రమో సాంసారిక జీవనమును త్యజించి అడవులకేగి ఇనుపకచ్చడాలు కట్టి కఠోర సాధనజేసి సాధిస్తారని వారి ఊహ. సాంసారిక కుటుంబ జీవనమునకు, ఆధ్యాత్మికతకు పొంతన కుదరదని కొందరి వాదన. ఇది సరికాదు. భగవంతుడందరివాడు, వైషమ్యరహితుడు, సులభుడు. కనుక మనలను ఆదరించడన్న భావన తప్పు. సులభుడైన భగవంతుని పొందటానికి సులభమైన మార్గములే సరియైనవి. గుండుసూదిని తీయటానికి రెండు వేళ్ళుచాలు. అందుకోసం పెద్ద క్రేను నిరుపయోగం. కబీరు మహనీయుడన్నట్లు భగవంతుడు సన్యాసికి ముప్పది అడుగుల దూరంలోను, బ్రహ్మచారికి ఇరువది అడుగుల దూరంలోను వుంటూ సంసారికి మాత్రం వాని హృదయంలోనే వుంటాడు. ఆదర్శకుటుంబ జీవనం గడుపుతూ ఆధ్యాత్మికోన్నతిని సాధించిన కబీరు మహనీయుని స్వానుభవమిది. చరిత్ర పుటలలో ఇటువంటి మహనీయులనేక మందే వున్నారు. గోరాకుంబర్, తుకారాం, వీరబ్రహ్మం, రామచంద్రజీ వంటి వారి జీవనమే సాంసారిక జీవనం గడుపు మనవంటివారికి ఆదర్శం. . అసలు మనం కర్మజీవులం. కర్మలనుభవించడానికే పుట్టాం. వాటినుండి తప్పించుకొనజూడటం సరికాదు. తప్పించుకోవడం జరగనిపని. ఒకవేళ ఎవరైనా తప్పిస్తామంటే అది అబద్దమే. తప్పిస్తామంటే అది వాయిదా వేయడం కావచ్చు. వాయిదా పరిష్కారం కానేరదు. మనం ప్రాపంచిక మరియు ఆధ్యాత్మికమనే రెండు పక్షాలను చాచి జీవనయానం చేయాలి. ఏ ఒకరెక్క సరిగా చాచకపోయినా గమనం సాగదు. కనుక ఒకటి మరొకదానికి అడ్డు పడని రీతిలో సరిచేసుకొని ముందుకు సాగాల్సివుంది. అందుకు సాంసారిక జీవనం అడ్డుకాదు, కాబోదు. అసలు సాంసారిక జీవనమే సరియైనది. కనుక సహజమార్గం మనకోసమే.

ఎందుకోసం

మనపుట్టుక కాకతాళింగాను, అకారణంగానూ కలిగింది కాదు. మనపుట్టుకకు మనమే కారణం. మనచర్యలే సంస్కారములై ఆత్మచుట్టుపొరలైచుట్టుకొని, మనలను భగవంతునినుండి దూరమొనర్చి జననమరణ చక్రమున పడద్రోసి చచ్చుచు పుట్టుచుండుటకు కారణభూతములైనవి. సృష్టిసమయమున కలిగిన క్షోభలోని ఒకచిన్న ప్రకంపనమే మనస్సు. అది క్రమముదప్పి ప్రవర్తించిటచేతనే మనమింతటి పతనావస్థకు వచ్చితిమి. మనస్సును క్రమబద్ధమొనర్చి దానిగమనమును మర్చి మనము తిరిగి సృష్ట్యాదిస్ఠితికి చేరవలసియున్నది. అదే మానవ జీవనమునకు లక్ష్యము. ఈలక్ష్యమును గుర్తెరిగి కర్మానుగతఫలితమును సమ్మతితో అనుభవించుటద్వారా ఆత్మను చుట్టుకొనియున్న పొరలను తొలగించుకొని మరలా భగవదైక్యమును సాధించుటకు మనకొక విధానము, పద్దతి అవసరమైయున్నది. ఈఅవసరమును తీర్చుటకఱకే ప్రపంచమున అనేకమతములేర్పడినవి. అయితే అవన్నీ  కాలక్రమమున మారిన నేటి పరిస్థితులకనుగుణముగా సత్ఫలితము లీయజాలకున్నవి. కాలవ్యవధిదాటిన ఔషదములవలె అవి ఒక్కసారి వికటించి ప్రమాదకరముగా కూడా మారుచున్నవి. భగవంతునితో అనుబంధమేర్పరచవలసిన ఈమతములే మానవులలో అసూయాద్యేషములకు కారణభూతములై  కంచెయే చేనుమేయుచున్న అధమస్ఠితికి చేరుకున్నవి. ఈపరిస్ఠితులలో ఆత్మోద్ధరణకై ఒక నూతన అధ్యాత్మికదర్శనము అవసరమై యున్నది. అట్టి అవసరముల తీర్చునదే సహజమార్గము. ఇది ఆధ్యాత్మికరంగమున ఒక విప్లవాత్మకమైన మర్పు. నేటి పరిస్టితుల కనుగుణముగా మనల నీ జననమరణచక్రమును దాటించి, మన జీవితలక్ష్యమగు భగవదైక్యమును సులభరీతిన సాధించుటకొఱకేర్పడిన నూతనవిధానమే యీ సహజమార్గము.

విధానము - ప్రక్రియ

పతంజలి రాజయోగశాస్త్రములోని అష్టాంగయోగమే సహజమార్గముననూ గ్రహింపబడినది. కానీ యిందులో యీకాలానికి తగినరీతిలో మార్పులు చేయబడినవి. అష్టాంగయోగములోని మొదటి ఆరుఅంగములు ప్రక్కనబెట్టి ఏడవది అయిన ధ్యానముతో మొదలుపెట్బుదుము. అనగా యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ అను ఆరు అంగములను ప్రత్యక్షముగా సాధనకు గైకొనడములేదు. లేదంటే "ధారణ" నామమాత్రముగా గ్రహింతుము. అనగా విశ్వవ్యాప్తమైన భగవంతుడు ప్రకాశమై నాహృదయమున విరాజమానమై యున్నాడు, అను చింతన మాత్రము జేతుము. ఇంతటితో సర్వేశ్వరుని మనహృదయమున ధారణజేసితి (ధరించితి) మన్నమాట. ఈశ్వరీయ ప్రకాశము హృదయమున (గుండెకొట్బుకొనుచోట) నున్నదన్న సంకల్పమున నేరుగా ధ్యానమునకుపక్రమింతుము. ఈ ఈశ్వరీయ ప్రకాశమునకు మనకై మనము ఏవిధమైన రూపకల్పన చేయరాదు. ఎందుకంటే మనకల్పన దైవము కానేరదు. కనుక దైవమనునది ఏదైయున్నదో అదే నాహృదయమున నుండుగాక, ఉన్నదున్నట్లు నాకవగతమగుగాక అన్న సంకల్పము మాత్రము చాలును. నిజమునకు ఈశ్వరీయ ప్రకాశము వెలుగులేని వెలుగు. ఈ విధానమున యాంత్రికముగా కాకుండ మనస్సుతో పనిజరుగుచుండుట విశేషము. సాధనాక్రమమున గురుకృపవలన ప్రక్కనబెట్టిన ఆరుఅంగములు సాధకునకు వశమగును.

 ధ్యానము

హృదయాంతర్గత ఈశ్వరీయ ప్రకాశముపై ధ్యానమునకుపక్రమించి మనము ఒకటి తర్వాత మరొకటిగ ఆధ్యాత్మిక స్థితుల నధిగమింతుము. ధ్యానము సుఖాసనమున కూర్చొండి చేసుకొనవచ్చును. ఒక గంట సమయము శారీరక శ్రమ లేకుండా కూర్చొండగలిగిన ఆసనమే సుఖాసనము. ధ్యానమునకు కూర్చొండుటకు ముందు శారీరక, మానసిక పరిశుభ్రత పాటించుట అవసరం. సమయము సూర్యోదయమునకు ముందైనచో మంచిది. వీలైనంతవఱకు ధ్యానమునకు ఒకచోటు కేటాయించుకొని చాప లేక ఒకవస్త్ర ముపై కూర్చొనవచ్చును. దీక్ష గైకొని ధ్యానము ప్రారంభించిన తొలినాళ్ళలో ఆలోచనలు విపరీతముగా గలుగుచూ ధ్యానమునకు ఆటంకము కలిగించుచున్నట్లుండును. అది సహజము. ఆలోచనలను ఖాతరు చేయక అవి పిలువకయే వచ్చిన చుట్టములుగా భావించి ఏమాత్రము మానసికఒత్తిడి, బిగువు లేకుండాఆలోచనలనుండి తేరుకొన్న మరుక్షణమే మరల మరల ప్రశాంతముగా ధ్యానమునకుపక్రమిస్తూ ధ్యానము కొనసాగించవలెను. ఆలోచనలతో అంతరాయమేర్పడినదన్న భావనతో విసుగుచెందకుండా తిరిగి ధ్యానం జ్ఞాపకమునకు వచ్చుటే విశేషమన్న సద్భావనతో ధ్యానము చేసికొనుట మంచిది.ఆలోచనలను నీవు లెక్కచేయకున్న అవి నీరుపోయని మొక్కలవలె అంతరించి పోవును. రాను రాను ధ్యానము చేయుటయందు నీకు మంచి లాఘవమేర్పడి పురోగతి చెందెదవు.

సమాధి

పురోగమనదశలో సాధకుడు ధ్యానం నుండి సమాధి స్థితుల నందుకొనును. సమాధి మూడు దశలుగా వుండును. మొదటతాను దైవీయస్థితిలో నిమగ్నమైయుండి పరిసరములను సైతము గమనించడు. తన ధోరణిలో తానుండి ఎదుటి వ్యక్తులు పలుకరించినను గమనించు స్థితిలోనుండడు. తర్వాత రెండవ దశలో ఒకస్థాయి దాటి తనధోరణిలో తానుండి కూడా ఎదురుగావచ్చు వాహనములను గమనించినట్లుగనే ప్రక్కకు తప్పుకొనుచుండును. ఇదంతా తనకు తెలియకుండగనే అంతా సక్రమముగ సాగిపోవుచుండును. ఇక మూడవదశకు చేరుకొన్న సాధకుడు అంతయు ఎఱుకతో సలక్షణముగ లోకవ్యవహారములు సాగించుచుండును. కానీ అంతరంగమున మాత్రము అతడు భగవద్విషయమై లోతుగా మునిగియే యుండును. ఇట్టి వాని చేతలలో ఏపొరబాటు జరుగదు. కారణము అతని ఇచ్ఛ భగవదిచ్ఛతో ఐక్యమైయుండును.

 

సాధనకు సహకారాంశములు

1. నిరంతరస్మరణ

ఈ సహజమార్గ విధానమున సత్వర ఫలితములపొందుటకు నిరంతరస్మరణ ఎంతయో తోడ్పడును. ధ్యాన సమయమున నీవనుభూతి చెందిన స్థితిని అంతటితో వదలివేయక దినమున వీలైనంత సేపు దానిని కొనసాగించవలెను. తన హృదయకమలమున ఆసీనుడైయున్న దైవమే తన దైనందిన ప్రాపంచిక కార్యకలాపములన్నీ తనను కేవలము నిమిత్త మాత్రుని చేసి నిర్వహించుకుపోతున్నాడను భావమును వృద్ధి చేసుకుంటూ కాలము గడుప వలెను. మనము చేయు వ్యాపారము, ఉద్యోగము, కుటుంబజీవనము ఒకటేమిటి అన్నికార్యములందు కూడా తనుకాదు ఆ సర్వేశ్వరుడే కర్తయను భావమునకు మారిపోవలెను. అనగా సంపూర్ణ శరణాగతిని పొందయత్నించవలెను. ఇట్లు యెడతెరపిలేక దైవచింతనతో సుండుటే నిరంతరస్మరణ. దీనిని ప్రయత్నపూర్వకంగా కొంతకాలమాచరించినచో అది నీ సహజమైన అలవాటుగా మారిపోవును. ఆతరువాత నీ ఆధ్యాత్మిక ప్రయాణము నిశ్చల ప్రశాంత జలములో ఈదులాటవలె సులభతరమగును.

2. నిర్మలీకరణ

సాధారణముగా ఏశక్తియైనను అనుకూల ప్రతికూలములను రెండు వైపుల పనిచేయును. ఆధ్యాత్మిక శక్తి విషయముకూడా ఇందుకు భిన్నముకాదు. మనలో ఉత్పన్నమైన ఆధ్యాత్మిక శక్తి మనలోని సద్గుణ దుర్గుణములను రెండింటిని సమానముగా బలపరచును. అందువలన మనలోని మాలిన్యములు అను కలుపు మొక్కల పెరుగుదలకు మనశక్తి యే సారమై మనకు హానిచేయకుండా జాగ్రత్త పడవలసిన అవసరమున్నది. అందులకీ నిర్మలీకరణ విధానము అత్యవసర మైయున్నది. సాయంత్రము ఒక అరగంట కూర్చొని తనలోని మాలిన్యములు అవి* మల, విక్షేప, ఆవరణల రూపమున ఎట్లున్నను ఆవిరిరూపమున శరీరము వెనుకభాగమునుండి బయటకు వెళ్ళిపోయి, తను పరిశుభ్రపడుతున్నట్లు సంకల్పించవలెను. ధ్యానములోవలె విశ్రాంతిగా కూర్చోవడముకాక ఈ నిర్మలీకరణలో మన ఇచ్ఛాశక్తి నుపయోగించి ప్రయత్న పూర్వకముగా మలినములు బయటకు తోసివేయవలెను. ఇది మొదట కొంత ప్రయాసయుక్త ముగా అనిపించినను, తర్వాత ఈ ప్రయత్నములో పట్టుచిక్కి

---------------------------------------------------------------------

*మలము:  అద్దముపైచేరిన మురికి వంటిది. విక్షేపము: ప్రశాంత సరస్సున రేగిన అలలవంటివి. ఆవరణ: గర్భస్థ శిశువును కప్పుకొనియున్న మావివంటిది. 

 ---------------------------------------------------------------------

సులభతరమగును. ఇందువలన మన ఆధ్యాత్మికప్రయాణములోని అడ్డంకులు తొలగిపోయి, మనగమనము వేగవంతమగును. ఈనిర్మలీకరణ విషయంలో యెట్టిపరిస్ఠితులలోనూ మనము పోగొట్టుకోదలచిన మాలిన్యములపై మనస్సు పెట్టరాదు. అతిసౌమ్యముగా వాటిని తుడిచివేయవలెను. నాఆధ్యాత్మికమార్గమున అవరోధములేవున్నవో అవన్నీ నన్ను వీడిపోతున్నవన్న భావనమాత్రము చాలును. వదలివెళ్ళవలసిన వాటి పట్టికను తయారుచేసి, వాటిపై మనస్సునిలిపినట్లైన, అది వాటిపై ధ్యానముగామారి మాలిన్యములు వృద్ధిచెందు ప్రమాదమున్నది. కనుక తొలగించవలసిన చెత్తాచెదారమును యెట్లు ఉదాసీనభావముతో ఊడ్చివేయుదుమో ఆరీతిన చేయవలెను.

 3. ప్రార్థన

 మనమేపనియైననూ  ప్రార్థనతో ప్రారంభింతుము. ప్రార్థనలో "అర్థన" ఉన్నది. అర్థన మనగా యాచించుట. "ప్రా" చేర్చుట ద్వారా ఆ యాచనకు ఓవిశిష్టత చేకూరినది. ఇది మామూలుగా అందరిదగ్గర యాచించుటకాదు. కేవలము ఆప్రభువు, ఆసర్వేశ్వరుని గడపవద్ద మాత్రమే యాచించుట. అది దీని ప్రత్యేకత.

 

 ఓనాథా! నీవే మానవజీవనమునకు లక్ష్యము

మాకోరికలు మా ఆత్మోన్నతికి ప్రతిబంధకములై యున్నవి.  

నీవే మా ఏకైక స్వామివి, ఇష్టదైవము

నీసహాయములేనిదే నిన్ను పొందుట అసంభవము.

 

ఇదీ సహజమార్గ ప్రార్థన. నిజానికి యిందులో యేమీ యాచించినట్లు కానరాదు. కేవలం వున్నవాస్తాన్ని నివేదించుకోవడమే యిందులో వున్నది. నీవే మాజీవిత లక్ష్యమనడంతోనే, ఇక కోరుకోవలసినదేమీ లేదని స్ఫురించుచున్నది. లక్ష్యసాధనలో కోరికలు అడ్డుతగులుతున్న వనడం నిజం. అదే యిప్పటి మనస్ఠితి. ఈస్థితినుండి నీ సహాయములేకుండా నేను బయటపడలేను. అయితే నీవే మూస్వామివి మాకు ఏకైక దిక్కు అనడంతో భారమంతా నీదే అన్న అర్థమున్నది. కనుక భగవంతుడు నాకేది మేలో అది చేయకతప్పని పరిస్థితిని కల్పించినట్లైనది. ఇంకేమున్నది నాక్కావలసిందేమో కూడా నీవే నిర్ణయించి కృపతో ప్రసాదించమన్నట్లైనది. ఈ ప్రార్థనచేయునప్పుడు నీవు ఆశక్తుడవై దీనాతి దీనస్థితికి వచ్చి కనుల నీరొలుకుచుండగా హృదయము మార్దవమై ప్రభువు నెదుట బంటు రీతి కొలువున నుండి ఒకటిరెండుసార్లు అర్థముపై మనస్సుంచి ప్రార్థించవలెను. ఈ విధముగా చేసిన ప్రార్థన ఎన్నటికిని వ్యర్థ ముకాదు. దీనితో సాధకుని దోషములన్నియు మన్నింపబడి అతడనుగ్ర హింపబడును. ఇట్టి ప్రార్థనను ఎక్కడైనను ఏవేళ నైనను చేయవచ్చును. కానీ రాత్రి నిదురించుటకు ముందు మాత్రము తప్పక చేయవలెను. దైవసాన్నిధ్య భావనతో ఈ ప్రార్థనచేసి పరుండినయెడల ఇక ఆరాత్రంతయు నీవు యోగనిద్రలో గడిపినవాడవౌదువు

ప్రత్యేకాంశము - ప్రాణాహుతి

సాధకుడు తన స్వశక్తితో కొన్ని స్థితులను మాత్రమే అధిరోహించగలడు. ఆపై ఆతని ప్రయాణము దుష్కరమైపోవును. అట్టి సమయములలో అతనికి గురువుగారి నుండి ఒకతోపు అవసర మైయుండును. అట్టి బలమైన త్రోపే ఈ ప్రాణాహుతిశక్తి ప్రసారము. దీనివలన సాధకుడు తన వల్ల గాని మహోన్నతమైన ఆధ్యాత్మిక స్థితులను సైతము సులువుగా దాటుచూ  గమ్యము నతితక్కువ కాలములో చేరును. పూర్వకాలమునకు చెందిన చాలామంది మహరులు సైతము అందు కొనలేకపోయిన ఉన్నతోన్నత స్థితులను ఈ ప్రాణాహుతి ప్రసారమున సులభముగా దాటుటేగాక జీవితకాలములోని కొద్ది సమయములోనే మానవసాధ్యమగు మహోన్నత స్థితివరకు పురోగమించుట సాధ్యమగును. ప్రాణాహుతి గొప్ప యోగులు మాత్రమే సంపాదించుకొన్న దివ్యశక్తి. ఆ దివ్యశక్తి ధారను యోగి తన ఇచ్ఛాబలముతో మూలమునుండి గ్రఅహించి సాధకునిలోనికి ప్రవేశపెట్టి అతని మనస్సును క్రమబద్ద ముజేసి అతని మానసిక నీచప్రవృత్తులను బలహీనపరచి అతని గమనమును వేగవంతము చేయును. ఇట్టి ఈ యోగశక్తిని సమర్థుడైన గురువు తన సమీపమున నున్న వారికే గాక కొండలు, గుట్టలు, సముద్రములు దాటి అత్యంత దూర ప్రదేశములనున్న వారికి సైతము ప్రసారము చేయగలడు. గురు శిష్యుల మధ్య సత్సంబంధమేర్పడి ప్రేమాభిమానములు నెలకొన్న యెడల ఈ దివ్యశక్తి అత్యంత సమర్థవంతముగా ప్రసారమై త్వరితగతిన సత్ఫలితముల నిచ్చును. అభ్యాసి ఈ ప్రాణాహుతిని గ్రోలి పురోగమిస్తున్నాడనుటకు గుర్తుగా అతనిలోని పశులక్షణములు అంతరించి మానవత్వము మేల్కొనును. తదుపరి మానవత్వమును దాటి దైవీయగుణ సంపన్నుడగును. ఆదియును దాటి రమారమి దైవసాయుజ్య స్థితివరకు పురోగమించును. ఇవన్నియు ప్రాణాహుతి ప్రసార ఫలితముగా సంభవించి సాధకుని నడవడియుందు ప్రస్ఫుటముగ కనపడనారంభించును. ఇట్టి ఈ ప్రతిభావంతమైన ప్రాణాహుతి ప్రసార విద్య సహజమార్గ మునకే ప్రత్యేకముగా చెందియున్నది

.

గురువు ప్రాధాన్యత

కేవలము కొన్ని గ్రంధములను చదివి చిలుక పలుకులవలె వాటిని వల్లించి అదే బోధయనువారు గురువులు కాజాలరు. తాను ఆధ్యాత్మిక రంగమున ప్రవేశించి ఆధ్యాత్మిక స్థితుల నన్నింటిని దాటి భగవత్ సాక్షాత్కారమును అనుభవమున పొంది, తన సహచరులను తాను నడచిన బాటలో సాక్షాత్కారమువైపునకు నడిపించు శక్తి గలవాడు మాత్రమే సద్గురువు. సద్గురువు మూలము (భగవంతుని) నుండి శక్తిని గ్రహించి అభ్యాసి హృదయమున ఆ దివ్యశక్తిని ప్రవేశపెట్టి అనగా ప్రాణాహుతి ప్రసారము చేయగలిగి అభ్యాసి తాను స్వశక్తితో దాట నలవిగాని స్థితులను సైతము దాటించగలవాడై యుండును. ఆయన మితస్వభావుడై, సహనశీలియై, భక్తికి పరాకాష్టయై, అహంకారము ఛాయామాత్రమైననూ లేనివాడై యుండును. తాను గురువును, గొప్పవాడను అనుభావము ఒకసారి మదిలో మెదిలినంతనే ఎట్టివాడైనను ఇక ఆ జన్మకు గురుపదముననుండు అర్హత కోల్పోవును. తానొక సేవకుడనని తన సహాయమర్ధించినవారిని తన సహచరులని భావించు సహృదయుడే నిజమైన గురువు.

ఇట్టి గుణములనన్నింటిని పుణికిపుచ్చుకొని సహజమార్గ స్థాపకుడై తనగురువునందు తాను సంపూర్ణముగా లయమైనవాడై మహోన్నత ఆధ్యాత్మిక స్థితులనన్నింటిని అధిగమించి పరిపూర్ణుడై తానే భగవత్ స్వరూపుడై లోకోద్ధరణకై అవతరించిన  ప్రత్యేక మూర్తియై వెలుగు పరమ పూజ్య మహాత్మా శ్రీ రామచంద్రజీ మహారాజ్ గారు ఈ సహజమార్గ గాములకు గురువర్యులు. ఆయన మూర్తి పై ధ్యానించుట సాక్షాత్తు భగవంతునిపై ధ్యానించుటతో సమానమన్న అత్యంత సూక్ష్మస్థాయికి చెందిన గురువర్యులాయన. వారి సహచరులకు ఆయన సాక్షాత్తు భగవంతుడే. గురుసాక్షాత్ పరబ్రహ్మమన్న వాక్యము ఈయనయెడ సత్యమై భాసిల్లుచున్నది. కేవలమొక్క చూపుమాత్రమున బంధములన్నింటిని ఛేదించి మానవసాధ్యమగు మహోన్నత స్థితికి చేర్చగల సమర్థుడాయన. ఇట్టి ప్రత్యేకమూర్తి వేల సంవత్సరముల తర్వాతగాని ఉద్భవించరనుట అక్షరసత్యము. అనగా అప్పటివరకు ఆయన దివ్యశక్తి యే లోకోద్ధరణ గావించుచుండునని అర్థము. సామాన్యార్థమున గురువులనుకొను వారిని వీరితో పోల్చుట అసంగతము.

 శ్రీ రామచంద్రజీ మహరాజ్ 30.4.1899 లో ఉత్తరప్రదేశ్ లోని షాజహాన్‌పూర్ పట్టణమున ఒక సంపన్న కాయస్థ కుటుంబమున జన్మించిరి. అయినప్పటికిని వారు సరళము నియమ నిబద్ధము నైన జీవనము గడుపుచూ అతి సామాన్యమైన రికార్డుకీపరుగా న్యాయస్థానమున పనిచేసి పదవీ విరమణ చేసిరి. వారి నిరాడంబర జీవనము సాంసారిక జీవితము గడుపు జన సామాన్యమునకు మహదాదర్శమైనది. వారు సహజమార్గమును నెలకొల్పి, దేశవిదేశము లందు వ్యాప్తి బేసి ఆధ్యాత్మిక రంగమున ఒక నూతనాధ్యాయమును తెరచిరి. వారు 19.04.1983 లో భౌతిక శరీరమును వీడినప్పటికిని వీరి ప్రాణాహుతి శక్తి ధార నిరాటంకముగా కొనసాగుచునేయున్నది. శారీరక సంబంధ హద్దులు సైతమిప్పుడు లేకుండుటచే ఆ దివ్యశక్తి ధార నేడు అవరోధరహితమై పొంగి ప్రవహించుచున్నది.

దశనియమములు

సాధనచేయు ప్రతి అభ్యాసి తానెంతవరకు పురోగతి చెందితిని, యింకెంత మిగిలియున్నది. అను విషయము తెలుసుకొన కుతూహలపడుట సహజము. ఈ విషయమై ప్రావీణ్యముగల ప్రశిక్షకులు అభ్యాసులను కొంత అంతర్గత పరిశీలనజేసి చెప్పగల్గుదురు. కానీ వారి పరిశీలనాశక్తి ఏపాటిదో మనకు తెలియుట కష్టము. అంతేగాక వారు సాధకునికి నిజస్థితి తెలిపినట్లైన నిరుత్సాహపడుటో లేక గర్వించుటో జరిగి నష్టపోదురను భావముతో ఊరకుండుటయూ జరుగును. కనుక సాధకుడు తనకుతానే తన పరిస్థితిని గ్రహించుటకొక సులభమార్గము గలదు. అదే దశనియమాచరణ. గురుదేవులు మన సత్వర పురోభివృద్ధి కొఱకు ఈ దశనియమములనేర్పరచిరి.

1. పొద్దు పొడవకముందే నిద్రలెమ్ము. నిర్ణీత సమయమున, సూర్యోదయమునకు ముందయినచో మంచిది, ఒకే ఆసనమున కూర్చొని ప్రార్థన, పూజాదికములను కావింపుము. మానసిక శారీరక పారిశుద్ధ్యమును ప్రత్యేకముగా పాటింపుము.

2. ప్రేమ, భక్తి పూర్వకమైన హృదయముతో ఆధ్యాత్మికోన్నతి కొరకు ప్రార్థన జరిపి,

 ధ్యాన మారంభింపుము.

3. భగవంతునితో సంపూర్ణ ఐక్యము పొందుటయే నీ గమ్యముగా నిర్ణయించుకొనుము. దానిని సాధించునంతవరకు విశ్రమింపకుము.

4. ప్రకృతితో సారూప్యము పొందుటకు నిష్కపటముగాను, నిరాడంబరముగాను వుండుము.

5. సత్యసంధత కలిగి యుండుము. దుఃఖములను దివ్యమైన దీవెనలుగా

భావించి, అవి నీ మేలు కొరకే కలుగుచున్నవని కృతజ్ఞతా భావముతో నుండుము.

6. అందరిని సోదరులుగా భావించి, అట్లే వారినాదరింపుము.

7. ఇతరులు కీడు చేసినచో ప్రతీకారబుద్ధి పూనకుము. దానిని దివ్యబహూకృతిగా కృతజ్ఞతతో స్వీకరింపుము.

8. ఋజువర్తనతోడను, భక్తి భావముతోడను ఆర్జించిన దానితో తృప్తి చెంది, నిరంతర దివ్యభావములతో దానిని ఆరగింపుము.

9. ఇతరులలో భక్తి  ప్రేమ,  భావముల మొలకెత్తించునట్లుగా నీ జీవనమును

మలచుకొనుము.

10. పడుకొనబోవు సమయమున దైవసాన్నిధ్యభావనతో నీవొనర్చిన తప్పులగూర్చి పరితపుడవుకమ్ము. వాటిని మరిచేయనని వినమ్రభావముతో భగవంతుని క్షమాపణ కోరుము.

 

పై దశనియమములలో దాదాపు సహజమార్గపద్ధతి అంతయూ ఇమిడియున్నది. అభ్యాసి ఈ నియమములను తన నిజజీవితమున పాటించుటకు సదా యత్నించుచుండవలెను. ఈ ప్రయత్నములో అభ్యాసి సాధించిన విజయములు ఆధ్యాత్మికముగా అతడు సాధించిన పురోగతికి అనుగుణముగా నుండును. అంటే అతని ఆధ్యాత్మిక ప్రగతి అతని దశనియమా చరణయందు ప్రస్ఫుటమగునన్నమాట. అభ్యాసి అరచేతనున్న సూచి యిది. అభ్యాసి వద్ద నేగల ప్రగతి కొలమానమీ దళనియమములు.

                   అంతేగాక అభ్యాసి తన ఆధ్యాత్మిక ప్రగతిమార్గములో అనేక దశలు (వృత్తములు) అందలి స్థితులను (బిందువులను) ఒకదాని తర్వాత ఒకటిగా దాటుచూ పురోగమించవలసి యుండును. ఆ క్రమములో అతడు ప్రతి బిందువు వద్ద నాలుగురకముల అనుభూతులను పొందును. అవి

 1. భగవదీయమైన దివ్యశక్తి విశ్వవ్యాపితమై యున్నదను ఎఱుక మనస్సున జాగృతమై యుండును.

 2. అంతటా వ్యాప్తమైయున్న ఆదివ్యశక్తి యంతయూ, ఆమహాప్రభుని చింతనలోనే లీనమైయున్నట్లుండును.

 3. ఆదివ్యశక్తియొక్క అనుభూతి, చింతనముమొత్తము శాంతించి, ఏభావమూలేని శూన్యస్థితి ననుభవించును.

 4. అంతయూ అంతరించును. హృదయముపై యేప్రభావమునూ ఛాయామాత్రము కూడావుండదు. తన ఉనికికి సంబంధించిన ఎరుక లేశమాత్రమైనా వుండదు.

 ఈనాలుగు స్థితులూ వరుసగా  ప్రతిబిందువును చేరగనే మొదలై, బిందువునధిగమించు సమయమునకు పూర్తవుచుండును. ఉచ్ఛస్థితులకు వెళ్ళుకొలది యీ అనుభవములు సూక్ష్మతరములగుచూ పోవును. సూక్ష్మగ్రాహ్యతగల సాధకులు యీ స్థితులను అనుభూతి చెందెదరు. ఈఅనుభూతులన్నియు దారిమధ్యముననేగాని, గమ్యముచేరినవారికి యేఅనుభూతులూ ప్రకంపనలు లేని నిశ్చలస్థితి సంప్రాప్తమగును. అందుచేతనే సహజమార్గమున అనుభూతులకు ప్రాధాన్యము లేదు. బాహ్యముగా కాననగు నడవడికి (దశాదేశాచరణకు) సంబంధించిన మార్పులే గణనీయములు, కొలమానము.

 సహజమార్గ ప్రవేశార్హత - అవగాహన

 ఈమార్గమున భగవత్సాక్షాత్కారము పొందవలయునన్న దృఢసంకల్పమే పెద్ద అర్హత. కుల మత జాతి దేశవిదేశముల వివక్ష సహజమార్గమున లేదు. ఈమార్గమున ధ్యానమారంభించినట్లైన భగవత్‍కైంకర్యమునకై చేయవలసినదంతయూ చేయుచున్నట్లే లెక్క. ముందు పాటించుండిన పద్దతులిక పాటించవలసిన పనిలేదు. అనేకప్రక్రియలు ఒకేసారి చేపట్టుట అపజయమునకు దారితీయుననుట గుర్తుంచుకొనవలెను. ఏయితరపద్ధతికి సహజమార్గము అనుకూలమూకాదు ప్రతికూలమూకాదు. ఇచ్చట అభ్యాసి తనపనియందు మాత్రమే తాను లగ్నమై యుండును.   

ఇతరములగూర్చి యోచించు సమయమాతనికుండదు. ఒకవేళ ఏ యితర ఆలోచనలు చేసినా అది కేవలము కాలక్షేపమునకేగాని, వాటిపై శ్రద్ధాసక్తులుండి కాదు.

సామాన్యముగా సాధనచతుష్టయములో చెప్పబడిన వివేక పైరాగ్యములను సహజమార్గమున సాధనలుగాకాక అవి ధ్యానసాధన ఫలితముగా చెప్పబడినవి. అంటే ధ్యానము చేయుచూపోగా సాధకునిలో వివేకము పెంపొంది, ఏది సత్యమో ఏది బూటకమో ఏది చేయదగినదో, ఏది చేయదగనిదో నిర్ణయించు వివేచనాశక్తి దానికై అదే ఉత్పన్నమై అనవసర ప్రాపంచిక విషయములపై అనాసక్తి అనగా వైరాగ్యముకల్గును. ఇవన్నియూ అభ్యాసి కోరకనే లభ్యమగు ఫలితములు. కనుక అభ్యాసి జీవితములో మంచిచెడు నిర్ణయించుకొనుటకు పుస్తకములు గాలించుటో, ఇతరుల సలహాలపై ఆధారపడుటో జరుగదు. తనకైతనే సరైన నిర్ణయముగైకొను ప్రజ్ఞకలిగియుండును.

సహజమార్గ సాధకుడగుటకు సమ్మతించినవారు ప్రారంభమున ప్రశిక్షకుని వద్ద మూడుపూటలు ప్రత్యేకమైన ధ్యానమున కూర్చుండవలెను. అంతటితో దీక్షగైకొను కార్యక్రమము ముగియును. తదనంతరము అతడు ఈ విధానమున సభ్యుడై అభ్యాసిగా పిలువబడును. అతడు గురువుగారి నుండి ప్రాణాహుతి బడయుటకును, ఇతర అభ్యాసులతో కలసి సత్సంగమున పాల్గొని ధ్యానము చేయుటకును అర్హుడైయుండును.

ఓం తత్ సత్

పరమపూజ్యశ్రీరామచంద్ర జీవారి సూక్తులు

1. భగవంతుడొక మతమునకు, తెగకు కట్బుబడిలేడు. కొన్ని ఆచారములకు, పద్ధతులకు మాత్రమే పరిమితుడుకాడు. కేవలము కొన్ని గ్రంధముల పుటలందు వెతికి పట్టుకొనవలసిన వాడుకూడా కాడు. ఆయనను మనహృదయాంతరాళమునందే వెతికి కనుగొనవలెను.

2. మతం అంత మైననే కానీ ఆధ్యాత్మికత ప్రారంభముకాదు. ఆధ్యాత్మికత ముగిసిననేకానీ సత్యోదయమవ్వదు. సత్యతత్త్వమును అధిగమించిననేగానీ వాస్తవానందము పొడసూపదు. ఆఖరుకదికూడా దాటి ముందుకు వెళ్ళిన మన గమ్యము దరికేగుదుము.

3. నిజమైన భగవత్ ప్రేమలో మునిగినవాడు తాను ప్రేమిస్తున్న విషయమును, ప్రేమింపబడుతున్న విషయమూ రెండూ కూడా మరచి ఎఱుకదప్పిన స్థితిలో నుండును.

4. ఎవరైతే శాంతి, నెమ్మది, నిశ్చలస్వభావం సహజంగా కలిగి ఉంటారో వారినే భగవంతుడు ఎన్నుకొని శక్తి సామర్థ్యాలు ప్రసాదించి, తనపనికై వినియోగించుకుంటాడు. అట్టివారి ద్వారానే భగవత్ కార్యములు నిర్వహింపబడును.

5. మనలో ఏదోఒక రూపంలో దోషముంటేనేగానీ ఇతరులలో దోషాన్ని చూడలేము. కనుక ఇది మనల్ని మనం శుద్ధి చేసుకోవలసిన అవసరాన్ని సూచిస్తుంది.

6. వినయము విధేయతలు కలిగి ముక్తసరిగా ఇతరులలో ప్రేమ, భక్తి, గౌరవము కలుగునట్లు మాట్లాడవలెను. వాదప్రతివాదనలు పనికిరావు. అవి మన పవిత్ర కాలాన్ని హరిస్తాయి. సందర్భోచితమైన వాస్తవవిషయ వివరణలు తెలుసుకొన ప్రశ్నించవలెగానీ, విసిగించుయత్నము చేయరాదు.

7. మహిళలు ఆహారము వండునపుడు ఈ ఆహారము తనకు, భగవంతుడొసగిన (వరములైన) పిల్లలు, భర్త, అత్తా, మామలకు భగవత్ ప్రసాదము కావలెనను తలంపుతో వండవలెను. ఆ ఆహారము తిన్నవారందరియందును సుహృద్భావము పెంపొందును.

8. ధ్యానం చేయడం వలన హృదయంలో శూన్యస్థితి ఏర్పడుతుంది. ఆ శూన్యంలోనికి ప్రమేయం లేకుండానే దివ్యత్వం ప్రవేశిస్తుంది. అది నీ పురోగతికి కారణమౌతుంది.

9. చిన్నా పెద్దా తారతమ్యం వదిలెయ్యి. చిన్నవాడే గొప్పవాడై వుండవచ్చు. ఆధ్యాత్మిక మార్గంలో వయస్సుతో నిమిత్తంలేదు. కానీ సాంఘిక మర్యాదను మాత్రం గౌరవించి పాటించు.

10. భగవంతునకు వైషమ్యభావంలేదు. ఆయన్ను నీవెంతగా ప్రేమిస్తే అంతకంటే మిన్నగా నిన్నాయన ప్రేమిస్తాడు. నీ ప్రేమకనుగుణంగానే ఆయన సహాయమందుతుందేగానీ వ్యక్తిగత భేదము ఇసుమంతైనా లేదు.

11. తన స్వగృహమున తాను అతిధిగా మెలగడం అలవాటు చేసుకోవాలి. అందువలన నాది అన్న భావం నశించి అహంకారం తిరుగుముఖం పడుతుంది.

12. మనస్సునాయత్త పరచి సర్వసన్నదుడవై యుండుము ధృఢదీక్ష, పటిష్టమైన ఇచ్ఛాశక్తి తో ముందుకడుగేస్తే నీకు విజయం తథ్యం.

13. గడ్డి మోపంత చర్చకంటే గడ్డిపోచంత సాధన మేలు. నీకు ప్రపంచమంతా వ్యతిరేకమైనా, నీవారే నిన్ను కాదన్నా, ఆకాశమే విరిగి తలపైబడినా నీతీర్మానానికి నీవు కట్టుబడి ధృడ చిత్తంతో కార్యరంగమున అడుగిడుము. అంతే గానీ నీ మార్గం నీవు విడువవలదు. ధృఢదీక్ష గలవానికి పరమాత్ముని అండ వుంటుంది

 14. ప్రార్థన అంటే యాచించడం. ధ్యానమంటే (యాచించింది) పొందటం. స్వచ్ఛమైన ప్రార్థన భగవంతునితో నేరుగా సంబంధమేర్పరుస్తుంది.

 15. చెడువిషయాల చింతన వదిలిపెట్టడమేకాదు, నీవుచేసిన మంచివిషయాలనూ మరచిపో. అప్పుడే నిజమైన స్వేచ్ఛ లభిస్తుంది. 

  16. భగవంతుడు నీయందున్నాడు కానీ, నీవు భగవంతునియందుండుటలేదు. నీవు భగవంతుని సృష్టించకు. ఆయన వున్నరీతిననే ఆయనను ఆరాధింపుము.

 16. భగవంతుడు నీయందున్నాడు కానీ, నీవు భగవంతునియందుండుటలేదు. నీవు భగవంతుని సృష్టించకు. ఆయన వున్నరీతిననే ఆయనను ఆరాధింపుము.

 17. నీవు సాధనలో ఒక్కడుగైననూ ముందుకువేయుదువేని, నేను ఉత్సాహముతో నీవైపునకు నాలుగడుగులు వేయుదును. నిన్ను సమీపింతును.

 18. మనుష్యుడు చిరకాలము (పాపపుణ్య) సంస్కారములను అనుభవించుచు అలసిపోవును. అప్పుడతనికి విశ్రాంతినిచ్చుటకై ప్రకృతి అతనికి మరణము ప్రసాదించును.

 19. ఈశ్వరప్రాప్తికొఱకు నిర్ధిష్టమైన యీ "సహజమార్గము"  యెట్టిదనిన, యీ మార్గమునవెళ్ళి సాక్షాత్కారము పొందిన పిమ్మట, ఏమార్గమున తనకట్టి సిద్ధికలిగినదో దాని జాడయే యుండదు.

 20. ఈస్ఠూలశరీరము ద్వారానే ఈశ్వరసాక్షాత్కారము కలుగవలెను. అటుగాకున్న మరల మరల శరీరము గైకొని పుట్టుట, మరణించుట జరుగుచునేయుండును.  

 

సం దేశ ము

 నా సహచరుల యెడ నాహృదయము అత్యంతము ప్రేమ సంభరితమైనది. అయితే నేను. వారికి సమకూర్పు సేవ విషయమున నా కెన్నడును సంతృప్తి లేదు.

నా యనుచరులయందు ప్రతి యొక్క సాధకుని, సాధన యందు నా స్థాయికి గొని రావలయునని నేనెంతో ఆతురుఁడనై కాంక్షించుచుందును.. అందులకుఁ గారణము, వారికి అటి సహాయము స్వకీయమైన యోగశక్తి వలననే జరుగవలసియున్నది. ఈ లోకము నుండి నేను నిర్గమించిన పిమ్మట ఏమి జరుగునో కచ్చితముగఁ జెప్పజాలను.

పరమపూజ్యుడైన నా గురుదేవుఁడు మహోదార్యముతో నాకనుగ్రహించిన ఆధ్యాత్మిక సంపదలు లోకమున రాజాధి రాజుల కైనను లభించియుండలేదు. ఇట్టి సంపదకు సాటి యైనది . అదియే గాని లోకమున మరేదియును లేదు.

నే నీ లోకమునుండి నిష్క్రమించునపుడు ఈ లోకోత్తర సంపదను నా వెంట గొనిపోవ దలంచుటలేదు. తన నిర్యాణవేళ నాగురు దేవుడి సంపదను నాకనుగ్రహించినట్లే నేను ఈ దేహ పాతమునకు పూర్వమే యీ దివ్యశక్తిని మఱియొకనికి దత్తము గావింపవలసి యున్నది.

సాధకా! నీవు అంతర్ముఖుఁడవై అన్వేషించుము. సద్గురు దేవుఁడందే ప్రతిష్టితుఁడై యున్నట్లు కనుగొనగలవు. అయితే అట్లు జరుగుట యెప్పుడు ? అటనుండి (హృదయమునుండి) నీవు (నేను - అహం) వైదొలగినపుడు మాత్రమే

నాయందు నిక్షిప్తమైయున్న యీ అధ్యాత్మిక సంపద నంత టిని, మీరందఱును యదేచ్చగ దోచుకొండని మిమ్ము గోరు చున్నాను. అందులకు బదులుగ మీరు,” ఇది మాది”(అహం) అని మీకడ భద్రపఱచుకొనియున్న (Egoism) దంత యును. నాకు అప్పగింత బెట్టుడని మాత్రమే నేను కోరు దును.    -   - శ్రీరా మ చం ద్ర

లయా వస్థ

నేను ఎక్కువ చదువ లేదు. కానీ నేను ఈ విషయము మాత్రము మీకు చెప్పెదను. నేను మా గురువులో లీనమై ఉన్నాను. నా గురువు నాలో లీనమై ఉన్నారు. నాకు నాగురువుకు క్షనమైనను యెడబాటు
 లేదు. నాకు నా గురువు ఆలోచన నుండి ఒక్క క్షణమైన ఎడబాటు కలిగిన, నేను జీవింప జాలను. ఫలితము మరణమే. ఇది ఏ మాత్రము అతిశయోక్తి కాదు నేనీ రహస్యమును మీకు వెల్లడించితిని           -  -  శ్రీరాంచంద్ర

తన్నుతాను గొప్ప వివేక వంతుడను అనుకొనుట నిస్సందేహముగా ఒక అవివేకము. అట్లే తన్ను తాను ఏమి తెలియని అజ్ఞానిని, అత్యంత బలహీనుడను అనుకొనుట మరీ అవివేకము. ప్రతి ఒక్కరు ఎట్టి విభేదము లేకుండా పాటింపనగు భగవదాజ్ఞలను మనము అంకిత భావముతో యధావిధిగా ఆనుసరించ వలెను. తద్వారా ప్రభుని స్మరణలో నుండ యత్నించ వలెను. మనిషి నిర్వర్తింప వలసిన సామాన్య విధుల విశేషాంశము లన్నియు ఇందే ఇమిడి యున్నవి.

          -   -  శ్రీరాంచంద్ర

ధనసంపదలకంటే శరీరము సూక్ష్మమైనది. శరీరముకంటే జీవనము సూక్ష్మమైనది. జీవనముకంటే మనస్సు సూక్ష్మమైనది. మనస్సుకంటే బుద్ధి సూక్ష్మమైనది. బుద్ధికన్నా అహంభావము సూక్ష్మమైనది. ఒకటితర్వాత ఒకటిగా (క్రమంగా) సమర్పణచేయుచూ భక్తుడు ఆత్మసమర్పణమున చివరిమజిలీకి చేరుకొనును. అప్పుడతడు శూన్యస్థితియందుండును. ----లాలాజి 

   

 

Thursday, 9 September 2021

కైవల్యపథము

కైవల్యపథము

 

క:        శ్రీరామచంద్ర నీపై

            భారముమోపి నినుదలచి ప్రాణాహుతి వి

            స్తారప్రసారము వడసితి

            దారితెలిసితిన్ ప్రభూ! సదా వందనముల్.  - 1      

 

 క:       ఎరుగను బ్రస్తానత్రయ

            మెరుగను వ్యాకరణశాస్త్ర మెరుగను గవితా

            స్ఫురణమ్ము రామచంద్ర గు

            రురాట్కరుణ వ్రాసితి, నెనరున జదువదగున్.  - 2

 

 క:       లేదు వచోగాంభీర్యము

            లేదు నలంకారకౌశలియు. సత్యము ను

            ద్భోదింప సాహసించితి

            నాదట గనుటొప్పు సహృదయ రసజ్ఞజనుల్.   -  3  

 

 తే:గీ:  కలవు దోషములని మదిదలచి విడక

            సూనృతములిందు కలవంచు సుమతులగుచు

            చూపుసారింపు డిటువైపు సుంత యనుచు

            వేడుకొనుచుంటి మిమ్ముల వినయమతిని.  -  4

 

 క:       ఓ! సర్వేశ్వర నీవే

            మా సర్వస్వంబు నిజము. మహనీయగతిన్

            బాసటగా నీవుండక

            రా సాధ్యమె నిన్నుగలియ రయమున మాకున్.  -  5

 

 క:       మానవ జీవితలక్ష్యము

            వైనముగా దైవమనుచు వాకొనిరి మునుల్

            కానీ కోరికలతెరల్

            కానగరానీవు దారి గమ్యము చేరన్.  -  6

 

 క:       నడవడి సరిజేసుకొనక

            నడుగిడ సాధ్యంబుగాదు ఆధ్యాత్మపథిన్      

            నడుపగవశమే చిల్లుల

            పడవను జలమధ్యమందు పదిలముగాగన్.   -  7

 

 క:       తనశీలము నితరజనులు

            పనిగొని మెచ్చంగవలయు పలుమారనుచున్

            మనమున దలపక శీలము

            తన యుద్ధరణమునకనుచు దలపగ వలయున్.  8

 

  ఆ:వె: ఏమితలచు మరియు తానేమి మాటాడు

            జీవితమున నదెయె చేయవలయు

            పనికిరానిమాట పలికెడి నరుకంటె

            ఊరకున్నవాడె యుత్తముండు.  -  9

 

 క:       బలహీనుడనని యెన్నడు

            తలపోయగరాదు మదిని తగవెదుకంగన్

            బహీనుడు లేడు భువిని

            బలమై భగవంతుడుండ భయమది యేలా?  -  10

 

 క:       ఏ సేవయైన మనుజుం

            డాసించక ప్రతిఫలమ్ము నభ్యర్చనగా

            జేసికొని పోవుచుండిన

            వేసటలేకుండ మేలు పెంపొందు భువిన్.  -  11

 

 తే:గీ:  దైవమిచ్చిన సిరిసంపదలకు తాను

            ధర్మకర్తగ భావించి ధర్మబుద్ధి

            వృద్ధిజేసి వెచ్చించుచు శుద్ధమైన

            జీవనంబును గడిపిన శ్రేయమగును.  -  12

 

 క:       సేవాత్యాగము లనువుగ

            కావలె నాధ్యాత్మికటగారము గట్టన్

            భావమున ప్రేమదాని గు

            ణావర్తంబగుచు నెగడు నరయగ ధరణిన్.  -  13

 

 క:       సేవానిరతుడ నేనని

            భావించిన నహముపెరిగి పతనము జెందున్

            దైవము దీనునిరూపై 

            సేవల్‍గొనునంచు తలప శ్రేయము గలుగున్.  -  14

 

 తే:గీ:  కలిమిలేముల ధర్మము తొలగిపోక

            కష్టసుఖముల నొకరీతి గడుపుకొనుచు

            మితము పాటించి మనుజుడు మెలగుచుండ

            విడువకెన్నడు దైవంబు నెడదనుండు.  -  15

 

 ఆ:వె:  ఆలుబిడ్డ లడ్డ మాధ్యాత్మికతకంచు

            గృహమువిడచి కొండగుహలజేరి.

            చిత్తవృత్తినాపు సత్త తనకు లేక

            కాలమెల్ల వృధగ గడపనేల.  -  16

 

 ఆ:వె:  సతియు సుతులు జూడ సర్వేశ్వరుని కాన్క

            లనుచు ధర్మమునకు నణుగుణముగ

            నడచి హృదయమందు విడక నీశ్వరునిల్ప

            సఫలమగునుగాదె జన్మమిలను.  -  17        

 

 ఆ:వె:  పక్షియెగురు రెండుపక్షముల్ చాచుచు

            ఒక్కరెక్కె జాచ నొరిగిపోవు

            అరయ నాలుబిడ్డ లాధ్యాత్మికతయును

            రెండునున్న గలుగు నిండుదనము.  -  18

 

 ఆ:వె:  ఇంటిపెద్దననుచు నెంతొదర్పము జూపి

            చిక్కులందు బడుచు చెడగనేల.

            తనదు గృహమునందె తగునిది యనుచును

            అతిథిరీతి మెలగి హితము గనుము.  -  19

 

 తే:గీ:  మాంసమాహారముగ గొను మానవులిల

            ఆత్మతత్త్వార్థ మేమాత్ర మరయలేరు

            మాంసభక్షణ విడువంగ మంచిదనుచు

            పలికిరార్యులు పలుమారు పదిలముగను.  -  2౦

 

 తే:గీ:  మాటలవియేల రుచియందు మనసు దవిలి

            తినినదంతయు విషతుల్య మనిరి బుధులు

            గాన దివ్యజీవనమును గడుపుజనులు

            జిహ్వచాపల్యమందున జిక్కువడరు.  -  21

 

 తే:గీ:  నాల్క నదుపుజేసిన యట్టి నరునికిలను

            శుభములొనగూడు మిక్కిలి సులభరీతి

            మితము పాటించుటెంతయు హితముగూర్చు. 

            తిండియందును మరి మాటతీరు నందు.  -  22

 

 క:       పరహితమతి బోధించుచు

            పరమాత్ముని జేరు కొరకు పావనమూర్తుల్

            ధరపై మతముల నిలిపిరి

            సురుచిరమార్గమున నడచి సూనృతరీతిన్.  -  23

 

 ఆ:వె:  దైవముదరి జేర్చు దారియె మతమని

            తెలియలేని జనులు తెలివిదప్పి

            దురభిమానులగుచు ధర హింసరేపుచు

            పరుల బాధపెట్టి పతనమైరి.  -  24

 

 క:       మతదురభిమాన పరులై

            వితండవాదములకు దిగి విజ్ఞతవిడువన్

            మతవిద్వేషములు రగిలి

            మతమనునది మనుజులకిల మత్తుగమారెన్.  -  25

 

క:        గొప్పలు చెప్పుకొనుటకై

            చొప్పించిరి మతములందు శుష్కవ్రతముల్

            తప్పించుకొనగ వలయును

            కుప్పలుగా చేరియున్న కూడని విధులన్.  -  26

 

 తే:గీ:  పరమతంబులలోనున్న నెరసులేరి

            పలుకవలసిన పనిలేదు పంతమూని

            సాధనమ్మున గనుగొన్న సత్యములను

            పరహితంబుగ పలుమారు పలుకవలయు.  -  27

 

 క:       పీడింపగూడ దితరుల

            పీడింపగ మనల నొరులు పెనగొనరేనిన్

            పీడింపబడక వారల

            దాడిని బోకార్చవలయు, దండించవలెన్.  -  28

 

 క:       పరులన్ దండించునపుడు

            బరువొక్కింతయు హృదయముపై బడకుండన్

            సరిచేయదలచి మాత్రమె

            పరుషత్వము జూపవలయు పగలేకుండన్.  -  29

 

 తే:గీ:  నమ్మకములేదు నాపైన నాకె యనగ

            నమ్ము నెవ్విధి దైవమున్ నెమ్మనమున

            ఆత్మవిశ్వాసశూన్యుని నాదుకొనెడు

            దైవమేలేదు వేయేల తథ్యమిదియ.  -  30

 

 ఆ:వె:  మట్టిముద్ద యన్న మన్నన జూపరు

            అదియె మంచిప్రతిమ యైన పిదప

            వచ్చిపోవువారు మెచ్చుకొందు రపుడు

            ఇదియె లోకరీతి యిదియె నీతి.  -  31

 

 ఆ:వె:  పశువురీతినున్న పరమాత్మ జూడడు

            భక్తిభావమందు వరలుచుండి

            సజ్జనుడుగ మార సర్వేశ్వరునిదృష్టి

            వానివైపు మరలు వాస్తవముగ.  -  32

 

తే:గీ:   ఆత్మవిశ్వాసము కలుగనంత వరకు

            విడిచి సంశయంబుభయము కడకు జనవు

            తనకు తనపైన నమ్మికే దైన్యమణచి

            విజ్ఞతాస్ఫూర్తి నడిపించు విజయపథిని.  -  33

 

తే:గీ:   కొందరాధ్యాత్మికధ్యాస నుందు రరయ

            నుందురెందరో మతబంధమందు చిక్కి

            గుంపుకొరకున్న మతముల గుట్టెరింగి

            ఉన్నతాధ్యాత్మిక పథమున నుండవలయు.  -  34

 

 క:       ఎన్నో పద్ధ్తులేర్పడె

            అన్నియు కఠినములె పొమ్ము నాత్మేశు గనన్

            అన్నిట గలడను దైవము

            ఉన్నాడెదకుహరమందు ఉన్నాడనగన్.  -  35

 

ఆ:వె:   స్థూలకోశములను సులువుగా ఛేదించి

            ఆత్మదీప్తి జూపు నదియె విద్య

            ఇతరవిద్యలెల్ల నిహ శృంఖలంబులై

            కట్టినిన్ను పొరల చుట్టివైచు.  -  36

 

 తే:గీ:  పఠనమొనరించి యానంద పడుటగాదు

            విప్పికథజెప్ప ఊకొట్టి వినుటగాదు

            తడయకాత్మవిద్య కొఱకు తపనపడుచు

            పూని అభ్యాస మొనరించి పొందవలయు.  -  37

 

 క:       ధరపై చిక్కెను జీవుడు

            భరమౌ భవమను గొలుసున బంధీకృతుడై

            దురుసుతనంబును గర్వము

            వరుసన్ గొలుసున కదనపు వలయము లయ్యెన్.  - 38 

 

 ఆ:వె:  ఒకడె దేవుడనుచు నికరంబుగాపల్కి

            పెక్కు ఱాళ్ళగనుచు మ్రోక్కనేల

            ఎరుక నివ్వలేని తెరువు లెన్నైనను

            కాలయాపనకన కల్లయౌనె.  -  39

 

 తే:గీ:  చేయనుత్సహింతుముగాని చేయబోము

            చేయబోవుదు మొకసారె చేతలెన్నొ

            అందు ఆత్మవిశ్వాస మావంతలేదు

            కార్యసాధనకివి యడ్డు కావెచెపుమ?  -  40

 

 ఆ:వె:  ఏదొ చెప్పిరనుచు నేదొ చేసితిమని

            శ్రద్ధలేక చేయు సాధనముల

            పొద్దుపోవుగాని పొందలేమేమియు

            గట్టిపట్టులేక గణనలేదు.  - 41

 

 క:       కారాగారంబగు భువి

            చేరుదు రధికారులు మరి చిక్కినదోషుల్

            చేరిన అధికృతులుండెడి

            తీరున మనముండవలయు తెరువెరిగి భువిన్.  -  42

 

 ఆ:వె:  చెట్టునెక్కి కొమ్మ చేతులన్ తాబట్టి

            చెట్టు నన్ను విడక బట్టెననుచు

            వెర్రివానిరీతి విలపించుచుందురు

            మాయయనగ నిదియె మహినిజూడ.  - 43

 

ఆ:వె:   అడవికేగినంత విడువవు బంధముల్

            విడువదలచు కొలది ముడులు బడును

            సహజమార్గమందు సద్గురుకృపబొంది

            ఇంటనుండికూడ హితము గనుము.  -  44

 

ఆ:వె:   ఈశ్వరేచ్ఛగాక యితర మెయ్యది యగు

            ననెడి సత్యమెఱెగి యన్ని యెడల

            ధ్యాసనెపుడు విడక దైవంబుపైనిడి

            సహజమార్గమందు సాగిపొమ్ము.  -  45

 

ఆ:వె:   దైవచింతనమున తానుండి నడువంగ

            కీడదేల గలుగు కూడుమేలె

            తగినదేదొ నిలుచు తగనిది విడిపోవు

            నింతెగాని కలతలేల మనకు.  -  46

 

 క:       జీవితమందలి చిక్కులు

            దైవమె మేల్గోరి యిచ్చె తప్పదటంచున్

            భావించుచు నోపికతో

            గావించుము కార్యములను క్రమగతితోడన్.  -  47

 

 క:       సమయంబున్నపుడెల్లను

            సమగతి సర్వంబు నిండి సర్వాత్మకమై

            విమలంబగు పరతత్వము

            గమనించుచునున్న మేలు గలుగును మనకున్.  – 48

 

 ఆ:వె:  మలిన యోచనలకు నెలవు మనసటంచు

            నిందలిడుచు మిగుల కుందనేల

            దైవచింతనమును తగమేలుకొల్పంగ

            మరల సాధనంబు మనసెగాదె?  -   49  

 

 ఆ:వె:  హృదయమందు వెలుగు ఈశుని బోనాడి

            అహము జూపుకొనెద మహరహంబు

            పైనియహము దాచి లోనివెలుగు జూప

            సఫలమగుట నిజము జన్మమిలను.  -  50  

 

 తే:గీ:  వేదనాయుత హృదిచేయు రోదనమ్ము

            భక్తుని తలవాకిలికడ ప్రభుని నిలుపు

            సత్యమియ్యది యనుభవ సారమిదియె

            హృదయవేదనన్ మించినదేది లేదు.  -  51

 

 తే:గీ:  కష్టమన్నది బొత్తిగ కలుగకుండ

            బ్రతుకుటన్నది జరుగదు వసుధమీద

            వాస్తవమునకు కష్టముల్ స్వస్థపరచి

            మనిసి కారోగ్యమిడు చేదుమాత్ర లవియె.  -   52 

 

 తే:గీ:  విడువవలెనెవ్వి మరియేవి విడువదగదు

            అనెడి విచికిత్స జిక్కక యనవరతము

            మనసు గమ్యంబు పైనిల్పి మసలుకొనిన

            నిలుచు తగినవి. తగనివి నిన్ను విడుచు.  -  53

 

 తే:గీ:  దైవసన్నిధి జేర్చెడి దారిలోని

            కంపకసవుల నెల్లను కాల్చివైచి

            దారి సుగమమ్ముజేయు సాధనము భక్తి

            యనుచు ననుభవమ్మున పల్కి రార్యజనులు.  - 54

 

 క:       హృదయంబెప్పటికప్పుడు

            యిదితగు నిదితగదటంచు నేర్పడజెప్పున్

            హృదయమె కార్యస్థానము

            పదిలముగా మనసుజేయు పనులకు నెల్లన్.  -  55

 

 క:       హృదయం బేలికకావలె

            తదాజ్ఞ నడువవలె మేధ తగదనకుండన్

            కుదరదిదంచును మేధకు

            హృదయముపై పెత్తనంబు నిచ్చిన కీడౌ.  -  56

 

 ఆ:వె:  నీవు సృష్టిజేసి నిలుపకు దైవమున్

            నీవుజేయు సృష్టి నిజముగాదు

            ఉన్నదేదొ తెలిసి ఉన్నదున్నట్లుగా

            స్వీకరించి నంత చిక్కువదలు.  -  57

 

 క:       ఒక్కడుగు ముందున కిడిన

            నిక్కముగా నాల్గడుగులు నీవైపుకిడున్

            మక్కువజూపుచు దైవము

            అక్కట! పరమాత్మకెంత ఔదార్యంబో!.  - 58

 

 తే:గీ:  ఎవ్వడుత్కంఠ మదిగల్గి యెదురుచూచు

            వానికోసమె పరమాత్మ వచ్చినిలుచు

            ఏదొచేసితి మ్రొక్కితి నింతె యనుచు

            పట్టిపట్టని వానికి ఫలములేదు.  -  59

 

 క:       త్వరితంబుగ పరతత్వము

            నరయగ దృఢదీక్షబూని యాతురతమెయిన్

            సరియగు ప్రారంభమిడిన

            సరగున కార్యంబు సగము సాధించబడెన్.  -  60

 

 ఆ:వె:  ఇచ్చవచ్చినట్టు లిన్నేండ్లు మనసును

            తిరుగనిచ్చి మనమె చెరచినాము

            ధ్యానసాధనమున దాని నదుపుజేసి

            తిరిగి మొదటిదశకు ద్రిప్పవలయు.  -  61 

 

 ఆ:వె:  విషయబంధనముల విడిపించుకొనుటకై

            పడెడి శ్రమలు వృధయె విడువవవియు

            దైవమందు మనసు తగులుకొన్నప్పుడు

            విడచి బంధనములు వెడలు నవియె.  -  62

 

 తే:గీ:  సులభుడైయున్న దేవుని తెలిసికొనగ

            సులభపద్దతి చేపట్ట వలసియుండు

            రెండువేళ్ళకు జిక్కెడు గుండుసూది   

            గొప్పక్రేనున నెత్తంగ గుదురునెట్లు?  -  63

 

 తే:గీ:  ఒక్కగమ్యము మదినిల్పి చక్కగాను

            సాధనముచేయ తప్పక జయముగల్గు

            పలువిధంబుల పోరాడ భంగపడుచు

            సత్యతత్త్వంబు గానంగ జాలరెపుడు.  -   64

 

 తే:గీ:  హృదయమందున్న బహుసూక్ష్మ మృదులశక్తి

            దివ్యధారను తనవైపు త్రిప్పి దించి

            నింపుకొనుటను గమనించి నేర్పుమీర

            మనసు నటనుంచ బడబోడు మాయలోన.  - 65   

 

 తే:గీ:  హృదయకుహరము యోగుల సదన మరయ

            తత్త్వవేత్తలకెల్ల మేధయగు నిల్లు

            హృదయ మీశ్వరుపై ధ్యాస కుదురజేయు

            మేధ ఘనబోధనలచేత మెప్పువడయు.  -  66

 

 తే:గీ:  హృదయమందుండి వెల్వడి హితముదెల్పు

            భావవీచికల్ పరమాత్మ పలుకులగును

            దైవవాణిని వినుటకు దారి యిదియె

            విశ్వభాషలు చదువులు వృధయెపొమ్ము.  -  67

 

 తే:గీ:  ఏది సత్యమో నిత్యమో యెన్నటికిని

            మార్పులేనట్టి స్థితిలోన మనునదేదొ

            అదియె తెలుసుకొనవలయు నట్లుగాక

            విద్యలితరంబు లెన్నైన వృధయెసుమ్ము.  -  68

 

తే:గీ:   అట్టిదానిని తెలియంగ పట్టుబట్టి

            గ్రంథములయందు వెతికిన కానరాదు

            పండితుల తర్కములవల్ల బయటపడదు

            అది అతీంద్రియస్థితి నందినపుడె తెలియు.  -  69

 

 ఆ:వె:  ఆస్థితి తుదికాదు నెంతయో ముందున్న

            దనెడి సత్యమెఱిగి ఆగకుండ

            ననుభవమున బొంది యానందమును శాంతి

            అదియు నధిగమించి కదలవలయు.  -  70

 

 తే:గీ:  కదలి పయనించి గమ్యము కడకుజేర

            అనుభవములెల్ల నచ్చట ఆంతమొందు

            వెలుగుచీకటు లచ్చట తొలగియుండు.

            చెప్పగాలేని దశయన నొప్పియుండు.  -  71

 

 తే:గీ:  వ్యక్తి తనయున్కి నిచ్చట వదలిచనక

            సత్పదార్థమున గలసి సమసిపోక

            యరయ నామమాత్రపు భేదమట్లేయుండి

            దైవయోగమున పుడమి జీవి నడచు.  -  72

 

 తే:గీ:  అట్టి నామమాత్రపు భేదమంతరింప

            నిలువనేరదాత్మ యునికి తొలగుగాన

            లేశమైయుండు యీభేద మీశునాన

            సాగు ప్రళయాగ్ని సర్వమ్ము సమయు వరకు.  -  73

 

 తే:గీ:  వాస్తవంబిట్టిదైనను వదలకుండ

            కోరి సంపూర్ణ లయమందె గురినినిల్పి

            సాధనముజేసి గురుకృపన్ సవ్యరీతి

            బొంది తరియింపవలయును పుడమి నరుడు.  -  74         

 

 

 తే:గీ:  ప్రళయ మెట్లవసరమొ ప్రపంచమునకు

            అట్లె వైయక్తిక ప్రళయ మవసరంబు

            చిన్నదిది పెద్దదది యంతెతేడ

            యిది యెఱుగని జీవిబ్రతుకు వృధయెసుమ్ము.  75

 

 తే:గీ:  దీని కారాటపడుదురు దివిజవరులె

            మానవులకిది సాధ్యము మనసునిలుప

            పరమగురువుల కృపతోడ బహుసులభము

            విస్మరింపగ తగదిది వివరమరయ.  -  76

 

 తే:గీ:  మతము నాధ్యాత్మికతయును గతముగాగ

            సత్యమానందమును కూడ చనిన పిదప

            చేరువౌదుము గమ్యమౌ చివరిదశకు

            పలుకుకందని స్థితియది పరమపదము.  -  77

 

 క:       హృదయాంతరాళమందున

            వెదుకక సత్యంబుకొఱకు వెలుపల దిరుగన్

            చెదరును మనస్సు, సత్యం

            బుదయింపదు విద్యలెన్ని యున్నప్పటికిన్.  -  78

 

 క:       ఉన్నాడీశుండంతట

            ఉన్నాడన్నింటిలోన నున్నాడనగన్

            ఉన్నాను నేననంగను

            ఉన్నాడనువాడు లేడు ఉందువునీవే.  - 79     

 

 క:       నీవున్న ఈశుడుండడు

            నీవటలేకుండినంత నెలవీశునికౌ

            నీవుండక ఈశునిలిపి

            జీవించుటొకటె నిజమగు జీవన మరయన్.  -  80

 

 తే:గీ:  ఎంచ హృదయార్పణముకన్న మించినట్టి

            త్యాగ మెయ్యదియును లేదు తరచిచూడ

            అర్పితంబగు యెదలోన నవ్యయముగ

            సత్పదార్థమె నిండును సహజరీతి.  -   81

 

 తే:గీ:  దైవచింతనాపరులు మందమతులనుచు

            చులకనగ మాటలాడు మూర్ఖులను జూచి

            నవ్వుకొనవలెగాని పంతమునకుదిగి

            భగ్గుమని మండిపడుటది లగ్గుగాదు.  -  82

 

 ఆ:వె:  భక్తుడైనవాడు వాంచ్ఛించునొక్కటే

            అయ్యదతనిజేర నడుగదేది

            అన్నికోరికలను అదిఅంతమొందించు

            వస్తుదృష్టి నెపుడొ వదలునతడు.  -  83

 

 ఆ:వె:  ఏది తానెయౌచు నెచ్చట నుండెనో

            అచటి నుండి తొలగి  యన్యమయ్యె

            తిరిగి యాస్థలంబు మరలజేరుటకునై

            శ్రమలుపడెడ రదియె సాధనంబు.  -  84

 

 తే:గీ: సద్గుణంబులుసతతము సంస్మరింప

            తద్గుణాన్వితుజూపును తథ్యమిదియ  

            సాగ తద్గుణధాము సంస్మరణమట్లె

            గుణము గుణధాము నవ్వలి గుహ్యమెఱుగు.  85

 

 తే:గీ:  మంచిచెడ్డల తర్కాన మనసునిడక

            తనది యనుకొన్నదంతయు వినయమొప్ప

            భగవదర్పణజేసి భవ్యమతియైన

            నతడు శరణాగతింజెందె  ననగవచ్చు.  -  86

 

 ఆ:వె:  నరుడు మరణమంది నాకలోకముజేరు

            దేవగణము కోరి భువికిదిగును

            దిగెడు దేవతలను దిక్కుమీరని మ్రొక్క

            కాలము వృధతప్ప కలదెఫలము.  -  87

 

 ఆ:వె:  తా మరిష్యమాణుడై మునుపటికర్మ

            ఫలము కుడువక విడువంగనగునె?

            చావుకు సరివచ్చు సత్స్థితిగోరుచు

            జీవితమును పూర్తి చేయవలయు.  -  88

 

 ఆ:వె: ధ్యానసమయమందు తగని తలపులెన్నొ

            నిలువనీక కలత కలుగజేయ

            మదిని లక్ష్యమందు కుదురుగా జేరిచి

            సహజమార్గమందు జయముగనుము.  -  89

 

 తే:గీ:  దినదినంబును డెందంబు తేలికగుట

            ప్రేమభావము మొలకెత్తి వృద్ధియగుట

            ఆత్మ జాగ్రత్తగానున్న దనుట కివియె

            సంజ్ఞలుగనెంచి ముందుకు సాగవలయు.  – 90

 

 క:       శ్రీకైవల్యపదార్థులు

            నాకులు దిగి వచ్చుచుంద్రనాకులమతి భూ

            లోకంబునకున్ సుస్థితి

            సాకల్యంబుగ తపములు సాగించుటకై.  -  91

 

 ఆ:వె:  సత్యతత్త్వమందు సంపూర్ణముగమున్గ

            ఆత్మ మనసు దేహ మన్ని మరచి

            ఉప్పుబొమ్మ కడలి నునికిగోల్పడినట్లు

            మిగులడతడు శూన్యుడగును నిజము.  -  92

 

 తే:గీ:  శూన్యమునకు శూన్యంబగు సుస్థితి మన

            గమ్యము. అదియెసత్యము గాన విడక

            మదిని సర్వస్వమనినమ్మి హృదినిజేర్చి

            తనువు పంచతగనుదాక మనుటయొప్పు.  -  93

 

 క:       ప్రేమ మహోన్నతమైనది

            ప్రేమకు నేది సరిరాదు పృథ్వీస్ఠలిపై

            కాముకుల దేహబంధమె

            ప్రేమయని తలతురేని వృధయౌ బ్రతుకుల్.  -  94

 

 క:       ప్రేమ విధేయతనొసగున్

            బ్రేమ విధేయతకు లోగి వెలయు సమగతిన్

            ధీమంతులు గురుశిష్యులు

            ప్రేమాస్పదులై రహిన్ జరింతురు ధాత్రిన్.  -  95

 

 తే:గీ:  ప్రేమించిన దైవంబును

            ప్రేమించును దైవమునిను వేయింతలుగన్

            ప్రేమకు సరియగు భావము

            ప్రేమయెపో మాటలేల పెక్కులుబల్కన్.  -  96

 

 తే:గీ:  ఎంత ప్రియమైనదైనను చెంతలేక

            దూరమైనంత ప్రేమయు తొలగిపోవు

            కాని దివ్యప్రేమకు తుది లేనెలేదు

            మరణమైనను ఆటంకపరచలేదు.  -  97

 

 క:       పేయసి ప్రియుడగు మరియున్

            ప్రేయసియైపోవు ప్రియుడు ప్రేమమునుంగన్

            పాయని ప్రియభావంబున

            ధ్యేయంబగు దైవమగుచు ధీనిధిమారున్.  -  98

 

 క:       దేవుడు సర్వజ్ఞుండగు

            దేవుని నెఱిగితినన దేవునిరీతిన్

            కోవిదుడై సర్వమెఱిగి

            జీవింపగవలె నతండు చిత్కళతోడన్.  -  99

 

 తే:గీ;  మును మనోబుద్ధ్యహంకారములును మరియు

            చిత్తము క్రమబద్ధమొనర్చి సిద్ధపరచి

            ఆత్మ పరమాత్మతో జేర్చు నతడె గురుడు

            అతడు జూపిన మార్గమే మతము నిజము.  -  100

 

 తే:గీ:  గురుడు సాధకుని హృదయకుహరమందు

            సత్యతత్త్వము జొప్పించు సమయమెఱిగి

            అదియె బీజమై చింతనంబను జలమున

            పెరిగి వికసించి పరతత్వ మెఱుకపరచు.  -  101

 

తే:గీ:   సహజమగు దివ్యశక్తిని సాధకునకు

            అందజేయుచు నభివృద్ధినొందజేసి

            సంతసించెడు వాడెపో సద్గురుండు

            కురులు బెంచిన వారెల్ల గురులుకారు.  - 102

 

 

తే:గీ:   పతనమార్గము తప్పించి గతినిమార్చి

            సత్యపథగామిగాజేసి శక్తినొసగి

            జీవితాంతము విడువక శ్రేయమరసి

            తోడునీడగ నుండెడి వాడె గురుడు.  -103

 

 తే:గీ:  సహచరుండయి మసలుచు సత్యమెఱెగి

            మనల దైవసన్నిధి జేర్చు మహిమగలిగి

            పెరటికల్పకమగువాడు గురుదుగాని

            కుటిలుడును దంభశీలుడు గురుడుకాడు.  - 104

 

 తే:గీ:  దబ్బుకెప్పుడు ఇబ్బంది జబ్బు మరియు

            వదలకుండగ నిందించు వారలుండి

            వగవకీభువి జీవించు వారుగాక

            నితరుల మహాత్ములని బిల్వ నిలను తగదు.  -  105

 

 తే:గీ:  వారసత్వముతోడ రావచ్చునాస్తి

            అరయ నాధ్యత్మ సంపత్తి యటులరాదు

            భక్తిప్రేమలు గలిగిన వ్యక్తిగాక

            సతియు సుతులైన పొందంగ సాధ్యపడదు..  -  106

 

 తే:గీ:  ఎంత సర్వజ్ఞుడైనను సుంత యణగి

            మానవత్వపు పరిధులు దాటిపోక

            తదనుగుణమగు జీవన ధర్మమునకు

            విలువనిచ్చుచు భువిపైన మెలగు బుధుదు.  -  107

 

 ఆ:వె:  తాను బంధనముల తగులుకొనినవాడు

            నితరజనుల బంధ మెటులవిప్పు?

            రిత్తమాటలాడి చిత్తచాంచల్యంబు

            కలుగజేయునతడు కాడు గురుడు.  -  108

 

 ఆ:వె:  గురుడనెడియూహ చొరబడ మనసున

            తగడు గురువనంగ తజ్జనుండు

            అహమువీడి సమత సహనభావము గల్గి

            భక్తినుండు హితుడె పరమగురుడు.  -  109

 

 తే:గీ:  గురుని కొండాడుచుండుట గొప్పగాదు

            గురుడుచూపిన తెరువున గురుతుగాను

            నడచుచుండుటయే గొప్ప పుడమియందు

            గురుని ప్రకటింప నియ్యదే తెరువుసుమ్ము.  -  110

 

 క:       గురుదేవుల ప్రాపుగలిగి

            ధర సన్మార్గము విడువక తాత్త్వికసరణిన్

            పరమాత్మ చింతనామృత

            నిరతిన్ గనుడీ నితాంత నిశ్రేయసమున్.  -  111

v      

 

సహజమార్గ దశనియమములు

 

ఆ:వె:   సుర్యుడుదయించుటకు మున్నె శుద్ధులగుచు

            నయముననొకగంట సుఖాసనమున సహజ

            విధి హృదయముపై ధ్యానము వినయశీలు

            రగుచు చేయుచుండవలయు ననుదినంబు.  -  1

 

 క:       మదిలోన భక్తిప్రేమలు

            పదిలముగా నుంచుకొనుచు ప్రార్థనతోడన్

            హృదిపై ధ్యానము చేయుడు

            పదపడి ఆత్మోద్ధరణము బడయుట కొఱకై.  -  2

 

 క:       పరమాత్మతోడ నైక్యమె

            పరమావధి లక్ష్యమనుచు భావించిమదిన్

            త్వరితముగ బొందనెంచుము

            విరమణ విశ్రాంతి మరియు విసుగదిలేకన్.  -  3

 

 తే:గీ:  ప్రకృతియును నీవు నొకటియై బ్రతుకదలచి

            దర్పము కపటమును లేక ధాత్రియందు

            సహజ సామాన్య నరునిగ నహరహంబు

            సరళజీవన రీతిన సాగిపొమ్ము.  -  4

 

ఆ:వె:   సత్యవంతుడనగ నిత్యము చరియించి

            బాధ వేదన మన బాగుకొఱకె

            దేవుడిచ్చినట్టి దివ్యవరములని

            తలచుచు దెలుపుము కృతజ్ఞతలను.  -  5

 

 క:       ధరనున్న మనుజులెల్లరు

            నరయగ సోదరులె మనకు అదియట్లుండన్

            అరమరికలు లేక జనుల

            దరిజేర్చుక మనగవలయు తాత్త్వికబుద్ధిన్.  -  6

 

 తే:గీ:  కీడుజేసిన వారిపై కినుకవలదు

            మది ప్రతీకారవాంఛను మెదలనీక

            అదియె దివ్యబహూకృతి యని దలచి

            స్వీకరించి కృతజ్ఞతల్ జెప్పుమెపుడు.  -  7

 

 క:       ఋజువర్తనంబు భక్తియు

            నిజజీవితమున గనబడ నియమము తోడన్

            సుజనుడవై యార్జించుచు

            భుజియింపుము కలిగినంత పొందుచు తృప్తిన్.  -  8

 

 క:       ఇతరుల మనస్సులందున

            సతతము మొలకెత్త ప్రేమ సద్భక్తి దయన్

            అతిజాగరూకత గలిగి

            హితకరి వీరన మెలంగు మిమ్మహిమీదన్ .  -  9

 

 ఆ:వె:  పడుకొనుటకుముందు పరమాత్మసన్నిధి

            నున్నయట్లు తలచి, ఒదిగిపోయి

            చేసినాడ తప్పు చేయనింకేనాడు

            ననుచు క్షమను వేడికొనుము మదిని.  -  10

 

ఓం తత్ సత్

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

కైవల్యపథము

 

క:        శ్రీరామచంద్ర నీపై

            భారముమోపి నినుదలచి ప్రాణాహుతి వి

            స్తారప్రసారము వడసితి

            దారితెలిసితిన్ ప్రభూ! సదా వందనముల్.  - 1      

 

 క:       ఎరుగను బ్రస్తానత్రయ

            మెరుగను వ్యాకరణశాస్త్ర మెరుగను గవితా

            స్ఫురణమ్ము రామచంద్ర గు

            రురాట్కరుణ వ్రాసితి, నెనరున జదువదగున్.  - 2

 

 క:       లేదు వచోగాంభీర్యము

            లేదు నలంకారకౌశలియు. సత్యము ను

            ద్భోదింప సాహసించితి

            నాదట గనుటొప్పు సహృదయ రసజ్ఞజనుల్.   -  3  

 

 తే:గీ:  కలవు దోషములని మదిదలచి విడక

            సూనృతములిందు కలవంచు సుమతులగుచు

            చూపుసారింపు డిటువైపు సుంత యనుచు

            వేడుకొనుచుంటి మిమ్ముల వినయమతిని.  -  4

 

 క:       ఓ! సర్వేశ్వర నీవే

            మా సర్వస్వంబు నిజము. మహనీయగతిన్

            బాసటగా నీవుండక

            రా సాధ్యమె నిన్నుగలియ రయమున మాకున్.  -  5

 

 క:       మానవ జీవితలక్ష్యము

            వైనముగా దైవమనుచు వాకొనిరి మునుల్

            కానీ కోరికలతెరల్

            కానగరానీవు దారి గమ్యము చేరన్.  -  6

 

 క:       నడవడి సరిజేసుకొనక

            నడుగిడ సాధ్యంబుగాదు ఆధ్యాత్మపథిన్      

            నడుపగవశమే చిల్లుల

            పడవను జలమధ్యమందు పదిలముగాగన్.   -  7

 

 క:       తనశీలము నితరజనులు

            పనిగొని మెచ్చంగవలయు పలుమారనుచున్

            మనమున దలపక శీలము

            తన యుద్ధరణమునకనుచు దలపగ వలయున్.  8

 

  ఆ:వె: ఏమితలచు మరియు తానేమి మాటాడు

            జీవితమున నదెయె చేయవలయు

            పనికిరానిమాట పలికెడి నరుకంటె

            ఊరకున్నవాడె యుత్తముండు.  -  9

 

 క:       బలహీనుడనని యెన్నడు

            తలపోయగరాదు మదిని తగవెదుకంగన్

            బహీనుడు లేడు భువిని

            బలమై భగవంతుడుండ భయమది యేలా?  -  10

 

 క:       ఏ సేవయైన మనుజుం

            డాసించక ప్రతిఫలమ్ము నభ్యర్చనగా

            జేసికొని పోవుచుండిన

            వేసటలేకుండ మేలు పెంపొందు భువిన్.  -  11

 

 తే:గీ:  దైవమిచ్చిన సిరిసంపదలకు తాను

            ధర్మకర్తగ భావించి ధర్మబుద్ధి

            వృద్ధిజేసి వెచ్చించుచు శుద్ధమైన

            జీవనంబును గడిపిన శ్రేయమగును.  -  12

 

 క:       సేవాత్యాగము లనువుగ

            కావలె నాధ్యాత్మికటగారము గట్టన్

            భావమున ప్రేమదాని గు

            ణావర్తంబగుచు నెగడు నరయగ ధరణిన్.  -  13

 

 క:       సేవానిరతుడ నేనని

            భావించిన నహముపెరిగి పతనము జెందున్

            దైవము దీనునిరూపై 

            సేవల్‍గొనునంచు తలప శ్రేయము గలుగున్.  -  14

 

 తే:గీ:  కలిమిలేముల ధర్మము తొలగిపోక

            కష్టసుఖముల నొకరీతి గడుపుకొనుచు

            మితము పాటించి మనుజుడు మెలగుచుండ

            విడువకెన్నడు దైవంబు నెడదనుండు.  -  15

 

 ఆ:వె:  ఆలుబిడ్డ లడ్డ మాధ్యాత్మికతకంచు

            గృహమువిడచి కొండగుహలజేరి.

            చిత్తవృత్తినాపు సత్త తనకు లేక

            కాలమెల్ల వృధగ గడపనేల.  -  16

 

 ఆ:వె:  సతియు సుతులు జూడ సర్వేశ్వరుని కాన్క

            లనుచు ధర్మమునకు నణుగుణముగ

            నడచి హృదయమందు విడక నీశ్వరునిల్ప

            సఫలమగునుగాదె జన్మమిలను.  -  17        

 

 ఆ:వె:  పక్షియెగురు రెండుపక్షముల్ చాచుచు

            ఒక్కరెక్కె జాచ నొరిగిపోవు

            అరయ నాలుబిడ్డ లాధ్యాత్మికతయును

            రెండునున్న గలుగు నిండుదనము.  -  18

 

 ఆ:వె:  ఇంటిపెద్దననుచు నెంతొదర్పము జూపి

            చిక్కులందు బడుచు చెడగనేల.

            తనదు గృహమునందె తగునిది యనుచును

            అతిథిరీతి మెలగి హితము గనుము.  -  19

 

 తే:గీ:  మాంసమాహారముగ గొను మానవులిల

            ఆత్మతత్త్వార్థ మేమాత్ర మరయలేరు

            మాంసభక్షణ విడువంగ మంచిదనుచు

            పలికిరార్యులు పలుమారు పదిలముగను.  -  2౦

 

 తే:గీ:  మాటలవియేల రుచియందు మనసు దవిలి

            తినినదంతయు విషతుల్య మనిరి బుధులు

            గాన దివ్యజీవనమును గడుపుజనులు

            జిహ్వచాపల్యమందున జిక్కువడరు.  -  21

 

 తే:గీ:  నాల్క నదుపుజేసిన యట్టి నరునికిలను

            శుభములొనగూడు మిక్కిలి సులభరీతి

            మితము పాటించుటెంతయు హితముగూర్చు. 

            తిండియందును మరి మాటతీరు నందు.  -  22

 

 క:       పరహితమతి బోధించుచు

            పరమాత్ముని జేరు కొరకు పావనమూర్తుల్

            ధరపై మతముల నిలిపిరి

            సురుచిరమార్గమున నడచి సూనృతరీతిన్.  -  23

 

 ఆ:వె:  దైవముదరి జేర్చు దారియె మతమని

            తెలియలేని జనులు తెలివిదప్పి

            దురభిమానులగుచు ధర హింసరేపుచు

            పరుల బాధపెట్టి పతనమైరి.  -  24

 

 క:       మతదురభిమాన పరులై

            వితండవాదములకు దిగి విజ్ఞతవిడువన్

            మతవిద్వేషములు రగిలి

            మతమనునది మనుజులకిల మత్తుగమారెన్.  -  25

 

క:        గొప్పలు చెప్పుకొనుటకై

            చొప్పించిరి మతములందు శుష్కవ్రతముల్

            తప్పించుకొనగ వలయును

            కుప్పలుగా చేరియున్న కూడని విధులన్.  -  26

 

 తే:గీ:  పరమతంబులలోనున్న నెరసులేరి

            పలుకవలసిన పనిలేదు పంతమూని

            సాధనమ్మున గనుగొన్న సత్యములను

            పరహితంబుగ పలుమారు పలుకవలయు.  -  27

 

 క:       పీడింపగూడ దితరుల

            పీడింపగ మనల నొరులు పెనగొనరేనిన్

            పీడింపబడక వారల

            దాడిని బోకార్చవలయు, దండించవలెన్.  -  28

 

 క:       పరులన్ దండించునపుడు

            బరువొక్కింతయు హృదయముపై బడకుండన్

            సరిచేయదలచి మాత్రమె

            పరుషత్వము జూపవలయు పగలేకుండన్.  -  29

 

 తే:గీ:  నమ్మకములేదు నాపైన నాకె యనగ

            నమ్ము నెవ్విధి దైవమున్ నెమ్మనమున

            ఆత్మవిశ్వాసశూన్యుని నాదుకొనెడు

            దైవమేలేదు వేయేల తథ్యమిదియ.  -  30

 

 ఆ:వె:  మట్టిముద్ద యన్న మన్నన జూపరు

            అదియె మంచిప్రతిమ యైన పిదప

            వచ్చిపోవువారు మెచ్చుకొందు రపుడు

            ఇదియె లోకరీతి యిదియె నీతి.  -  31

 

 ఆ:వె:  పశువురీతినున్న పరమాత్మ జూడడు

            భక్తిభావమందు వరలుచుండి

            సజ్జనుడుగ మార సర్వేశ్వరునిదృష్టి

            వానివైపు మరలు వాస్తవముగ.  -  32

 

తే:గీ:   ఆత్మవిశ్వాసము కలుగనంత వరకు

            విడిచి సంశయంబుభయము కడకు జనవు

            తనకు తనపైన నమ్మికే దైన్యమణచి

            విజ్ఞతాస్ఫూర్తి నడిపించు విజయపథిని.  -  33

 

తే:గీ:   కొందరాధ్యాత్మికధ్యాస నుందు రరయ

            నుందురెందరో మతబంధమందు చిక్కి

            గుంపుకొరకున్న మతముల గుట్టెరింగి

            ఉన్నతాధ్యాత్మిక పథమున నుండవలయు.  -  34

 

 క:       ఎన్నో పద్ధ్తులేర్పడె

            అన్నియు కఠినములె పొమ్ము నాత్మేశు గనన్

            అన్నిట గలడను దైవము

            ఉన్నాడెదకుహరమందు ఉన్నాడనగన్.  -  35

 

ఆ:వె:   స్థూలకోశములను సులువుగా ఛేదించి

            ఆత్మదీప్తి జూపు నదియె విద్య

            ఇతరవిద్యలెల్ల నిహ శృంఖలంబులై

            కట్టినిన్ను పొరల చుట్టివైచు.  -  36

 

 తే:గీ:  పఠనమొనరించి యానంద పడుటగాదు

            విప్పికథజెప్ప ఊకొట్టి వినుటగాదు

            తడయకాత్మవిద్య కొఱకు తపనపడుచు

            పూని అభ్యాస మొనరించి పొందవలయు.  -  37

 

 క:       ధరపై చిక్కెను జీవుడు

            భరమౌ భవమను గొలుసున బంధీకృతుడై

            దురుసుతనంబును గర్వము

            వరుసన్ గొలుసున కదనపు వలయము లయ్యెన్.  - 38 

 

 ఆ:వె:  ఒకడె దేవుడనుచు నికరంబుగాపల్కి

            పెక్కు ఱాళ్ళగనుచు మ్రోక్కనేల

            ఎరుక నివ్వలేని తెరువు లెన్నైనను

            కాలయాపనకన కల్లయౌనె.  -  39

 

 తే:గీ:  చేయనుత్సహింతుముగాని చేయబోము

            చేయబోవుదు మొకసారె చేతలెన్నొ

            అందు ఆత్మవిశ్వాస మావంతలేదు

            కార్యసాధనకివి యడ్డు కావెచెపుమ?  -  40

 

 ఆ:వె:  ఏదొ చెప్పిరనుచు నేదొ చేసితిమని

            శ్రద్ధలేక చేయు సాధనముల

            పొద్దుపోవుగాని పొందలేమేమియు

            గట్టిపట్టులేక గణనలేదు.  - 41

 

 క:       కారాగారంబగు భువి

            చేరుదు రధికారులు మరి చిక్కినదోషుల్

            చేరిన అధికృతులుండెడి

            తీరున మనముండవలయు తెరువెరిగి భువిన్.  -  42

 

 ఆ:వె:  చెట్టునెక్కి కొమ్మ చేతులన్ తాబట్టి

            చెట్టు నన్ను విడక బట్టెననుచు

            వెర్రివానిరీతి విలపించుచుందురు

            మాయయనగ నిదియె మహినిజూడ.  - 43

 

ఆ:వె:   అడవికేగినంత విడువవు బంధముల్

            విడువదలచు కొలది ముడులు బడును

            సహజమార్గమందు సద్గురుకృపబొంది

            ఇంటనుండికూడ హితము గనుము.  -  44

 

ఆ:వె:   ఈశ్వరేచ్ఛగాక యితర మెయ్యది యగు

            ననెడి సత్యమెఱెగి యన్ని యెడల

            ధ్యాసనెపుడు విడక దైవంబుపైనిడి

            సహజమార్గమందు సాగిపొమ్ము.  -  45

 

ఆ:వె:   దైవచింతనమున తానుండి నడువంగ

            కీడదేల గలుగు కూడుమేలె

            తగినదేదొ నిలుచు తగనిది విడిపోవు

            నింతెగాని కలతలేల మనకు.  -  46

 

 క:       జీవితమందలి చిక్కులు

            దైవమె మేల్గోరి యిచ్చె తప్పదటంచున్

            భావించుచు నోపికతో

            గావించుము కార్యములను క్రమగతితోడన్.  -  47

 

 క:       సమయంబున్నపుడెల్లను

            సమగతి సర్వంబు నిండి సర్వాత్మకమై

            విమలంబగు పరతత్వము

            గమనించుచునున్న మేలు గలుగును మనకున్.  – 48

 

 ఆ:వె:  మలిన యోచనలకు నెలవు మనసటంచు

            నిందలిడుచు మిగుల కుందనేల

            దైవచింతనమును తగమేలుకొల్పంగ

            మరల సాధనంబు మనసెగాదె?  -   49  

 

 ఆ:వె:  హృదయమందు వెలుగు ఈశుని బోనాడి

            అహము జూపుకొనెద మహరహంబు

            పైనియహము దాచి లోనివెలుగు జూప

            సఫలమగుట నిజము జన్మమిలను.  -  50  

 

 తే:గీ:  వేదనాయుత హృదిచేయు రోదనమ్ము

            భక్తుని తలవాకిలికడ ప్రభుని నిలుపు

            సత్యమియ్యది యనుభవ సారమిదియె

            హృదయవేదనన్ మించినదేది లేదు.  -  51

 

 తే:గీ:  కష్టమన్నది బొత్తిగ కలుగకుండ

            బ్రతుకుటన్నది జరుగదు వసుధమీద

            వాస్తవమునకు కష్టముల్ స్వస్థపరచి

            మనిసి కారోగ్యమిడు చేదుమాత్ర లవియె.  -   52 

 

 తే:గీ:  విడువవలెనెవ్వి మరియేవి విడువదగదు

            అనెడి విచికిత్స జిక్కక యనవరతము

            మనసు గమ్యంబు పైనిల్పి మసలుకొనిన

            నిలుచు తగినవి. తగనివి నిన్ను విడుచు.  -  53

 

 తే:గీ:  దైవసన్నిధి జేర్చెడి దారిలోని

            కంపకసవుల నెల్లను కాల్చివైచి

            దారి సుగమమ్ముజేయు సాధనము భక్తి

            యనుచు ననుభవమ్మున పల్కి రార్యజనులు.  - 54

 

 క:       హృదయంబెప్పటికప్పుడు

            యిదితగు నిదితగదటంచు నేర్పడజెప్పున్

            హృదయమె కార్యస్థానము

            పదిలముగా మనసుజేయు పనులకు నెల్లన్.  -  55

 

 క:       హృదయం బేలికకావలె

            తదాజ్ఞ నడువవలె మేధ తగదనకుండన్

            కుదరదిదంచును మేధకు

            హృదయముపై పెత్తనంబు నిచ్చిన కీడౌ.  -  56

 

 ఆ:వె:  నీవు సృష్టిజేసి నిలుపకు దైవమున్

            నీవుజేయు సృష్టి నిజముగాదు

            ఉన్నదేదొ తెలిసి ఉన్నదున్నట్లుగా

            స్వీకరించి నంత చిక్కువదలు.  -  57

 

 క:       ఒక్కడుగు ముందున కిడిన

            నిక్కముగా నాల్గడుగులు నీవైపుకిడున్

            మక్కువజూపుచు దైవము

            అక్కట! పరమాత్మకెంత ఔదార్యంబో!.  - 58

 

 తే:గీ:  ఎవ్వడుత్కంఠ మదిగల్గి యెదురుచూచు

            వానికోసమె పరమాత్మ వచ్చినిలుచు

            ఏదొచేసితి మ్రొక్కితి నింతె యనుచు

            పట్టిపట్టని వానికి ఫలములేదు.  -  59

 

 క:       త్వరితంబుగ పరతత్వము

            నరయగ దృఢదీక్షబూని యాతురతమెయిన్

            సరియగు ప్రారంభమిడిన

            సరగున కార్యంబు సగము సాధించబడెన్.  -  60

 

 ఆ:వె:  ఇచ్చవచ్చినట్టు లిన్నేండ్లు మనసును

            తిరుగనిచ్చి మనమె చెరచినాము

            ధ్యానసాధనమున దాని నదుపుజేసి

            తిరిగి మొదటిదశకు ద్రిప్పవలయు.  -  61 

 

 ఆ:వె:  విషయబంధనముల విడిపించుకొనుటకై

            పడెడి శ్రమలు వృధయె విడువవవియు

            దైవమందు మనసు తగులుకొన్నప్పుడు

            విడచి బంధనములు వెడలు నవియె.  -  62

 

 తే:గీ:  సులభుడైయున్న దేవుని తెలిసికొనగ

            సులభపద్దతి చేపట్ట వలసియుండు

            రెండువేళ్ళకు జిక్కెడు గుండుసూది   

            గొప్పక్రేనున నెత్తంగ గుదురునెట్లు?  -  63

 

 తే:గీ:  ఒక్కగమ్యము మదినిల్పి చక్కగాను

            సాధనముచేయ తప్పక జయముగల్గు

            పలువిధంబుల పోరాడ భంగపడుచు

            సత్యతత్త్వంబు గానంగ జాలరెపుడు.  -   64

 

 తే:గీ:  హృదయమందున్న బహుసూక్ష్మ మృదులశక్తి

            దివ్యధారను తనవైపు త్రిప్పి దించి

            నింపుకొనుటను గమనించి నేర్పుమీర

            మనసు నటనుంచ బడబోడు మాయలోన.  - 65   

 

 తే:గీ:  హృదయకుహరము యోగుల సదన మరయ

            తత్త్వవేత్తలకెల్ల మేధయగు నిల్లు

            హృదయ మీశ్వరుపై ధ్యాస కుదురజేయు

            మేధ ఘనబోధనలచేత మెప్పువడయు.  -  66

 

 తే:గీ:  హృదయమందుండి వెల్వడి హితముదెల్పు

            భావవీచికల్ పరమాత్మ పలుకులగును

            దైవవాణిని వినుటకు దారి యిదియె

            విశ్వభాషలు చదువులు వృధయెపొమ్ము.  -  67

 

 తే:గీ:  ఏది సత్యమో నిత్యమో యెన్నటికిని

            మార్పులేనట్టి స్థితిలోన మనునదేదొ

            అదియె తెలుసుకొనవలయు నట్లుగాక

            విద్యలితరంబు లెన్నైన వృధయెసుమ్ము.  -  68

 

తే:గీ:   అట్టిదానిని తెలియంగ పట్టుబట్టి

            గ్రంథములయందు వెతికిన కానరాదు

            పండితుల తర్కములవల్ల బయటపడదు

            అది అతీంద్రియస్థితి నందినపుడె తెలియు.  -  69

 

 ఆ:వె:  ఆస్థితి తుదికాదు నెంతయో ముందున్న

            దనెడి సత్యమెఱిగి ఆగకుండ

            ననుభవమున బొంది యానందమును శాంతి

            అదియు నధిగమించి కదలవలయు.  -  70

 

 తే:గీ:  కదలి పయనించి గమ్యము కడకుజేర

            అనుభవములెల్ల నచ్చట ఆంతమొందు

            వెలుగుచీకటు లచ్చట తొలగియుండు.

            చెప్పగాలేని దశయన నొప్పియుండు.  -  71

 

 తే:గీ:  వ్యక్తి తనయున్కి నిచ్చట వదలిచనక

            సత్పదార్థమున గలసి సమసిపోక

            యరయ నామమాత్రపు భేదమట్లేయుండి

            దైవయోగమున పుడమి జీవి నడచు.  -  72

 

 తే:గీ:  అట్టి నామమాత్రపు భేదమంతరింప

            నిలువనేరదాత్మ యునికి తొలగుగాన

            లేశమైయుండు యీభేద మీశునాన

            సాగు ప్రళయాగ్ని సర్వమ్ము సమయు వరకు.  -  73

 

 తే:గీ:  వాస్తవంబిట్టిదైనను వదలకుండ

            కోరి సంపూర్ణ లయమందె గురినినిల్పి

            సాధనముజేసి గురుకృపన్ సవ్యరీతి

            బొంది తరియింపవలయును పుడమి నరుడు.  -  74         

 

 

 తే:గీ:  ప్రళయ మెట్లవసరమొ ప్రపంచమునకు

            అట్లె వైయక్తిక ప్రళయ మవసరంబు

            చిన్నదిది పెద్దదది యంతెతేడ

            యిది యెఱుగని జీవిబ్రతుకు వృధయెసుమ్ము.  75

 

 తే:గీ:  దీని కారాటపడుదురు దివిజవరులె

            మానవులకిది సాధ్యము మనసునిలుప

            పరమగురువుల కృపతోడ బహుసులభము

            విస్మరింపగ తగదిది వివరమరయ.  -  76

 

 తే:గీ:  మతము నాధ్యాత్మికతయును గతముగాగ

            సత్యమానందమును కూడ చనిన పిదప

            చేరువౌదుము గమ్యమౌ చివరిదశకు

            పలుకుకందని స్థితియది పరమపదము.  -  77

 

 క:       హృదయాంతరాళమందున

            వెదుకక సత్యంబుకొఱకు వెలుపల దిరుగన్

            చెదరును మనస్సు, సత్యం

            బుదయింపదు విద్యలెన్ని యున్నప్పటికిన్.  -  78

 

 క:       ఉన్నాడీశుండంతట

            ఉన్నాడన్నింటిలోన నున్నాడనగన్

            ఉన్నాను నేననంగను

            ఉన్నాడనువాడు లేడు ఉందువునీవే.  - 79     

 

 క:       నీవున్న ఈశుడుండడు

            నీవటలేకుండినంత నెలవీశునికౌ

            నీవుండక ఈశునిలిపి

            జీవించుటొకటె నిజమగు జీవన మరయన్.  -  80

 

 తే:గీ:  ఎంచ హృదయార్పణముకన్న మించినట్టి

            త్యాగ మెయ్యదియును లేదు తరచిచూడ

            అర్పితంబగు యెదలోన నవ్యయముగ

            సత్పదార్థమె నిండును సహజరీతి.  -   81

 

 తే:గీ:  దైవచింతనాపరులు మందమతులనుచు

            చులకనగ మాటలాడు మూర్ఖులను జూచి

            నవ్వుకొనవలెగాని పంతమునకుదిగి

            భగ్గుమని మండిపడుటది లగ్గుగాదు.  -  82

 

 ఆ:వె:  భక్తుడైనవాడు వాంచ్ఛించునొక్కటే

            అయ్యదతనిజేర నడుగదేది

            అన్నికోరికలను అదిఅంతమొందించు

            వస్తుదృష్టి నెపుడొ వదలునతడు.  -  83

 

 ఆ:వె:  ఏది తానెయౌచు నెచ్చట నుండెనో

            అచటి నుండి తొలగి  యన్యమయ్యె

            తిరిగి యాస్థలంబు మరలజేరుటకునై

            శ్రమలుపడెడ రదియె సాధనంబు.  -  84

 

 తే:గీ: సద్గుణంబులుసతతము సంస్మరింప

            తద్గుణాన్వితుజూపును తథ్యమిదియ  

            సాగ తద్గుణధాము సంస్మరణమట్లె

            గుణము గుణధాము నవ్వలి గుహ్యమెఱుగు.  85

 

 తే:గీ:  మంచిచెడ్డల తర్కాన మనసునిడక

            తనది యనుకొన్నదంతయు వినయమొప్ప

            భగవదర్పణజేసి భవ్యమతియైన

            నతడు శరణాగతింజెందె  ననగవచ్చు.  -  86

 

 ఆ:వె:  నరుడు మరణమంది నాకలోకముజేరు

            దేవగణము కోరి భువికిదిగును

            దిగెడు దేవతలను దిక్కుమీరని మ్రొక్క

            కాలము వృధతప్ప కలదెఫలము.  -  87

 

 ఆ:వె:  తా మరిష్యమాణుడై మునుపటికర్మ

            ఫలము కుడువక విడువంగనగునె?

            చావుకు సరివచ్చు సత్స్థితిగోరుచు

            జీవితమును పూర్తి చేయవలయు.  -  88

 

 ఆ:వె: ధ్యానసమయమందు తగని తలపులెన్నొ

            నిలువనీక కలత కలుగజేయ

            మదిని లక్ష్యమందు కుదురుగా జేరిచి

            సహజమార్గమందు జయముగనుము.  -  89

 

 తే:గీ:  దినదినంబును డెందంబు తేలికగుట

            ప్రేమభావము మొలకెత్తి వృద్ధియగుట

            ఆత్మ జాగ్రత్తగానున్న దనుట కివియె

            సంజ్ఞలుగనెంచి ముందుకు సాగవలయు.  – 90

 

 క:       శ్రీకైవల్యపదార్థులు

            నాకులు దిగి వచ్చుచుంద్రనాకులమతి భూ

            లోకంబునకున్ సుస్థితి

            సాకల్యంబుగ తపములు సాగించుటకై.  -  91

 

 ఆ:వె:  సత్యతత్త్వమందు సంపూర్ణముగమున్గ

            ఆత్మ మనసు దేహ మన్ని మరచి

            ఉప్పుబొమ్మ కడలి నునికిగోల్పడినట్లు

            మిగులడతడు శూన్యుడగును నిజము.  -  92

 

 తే:గీ:  శూన్యమునకు శూన్యంబగు సుస్థితి మన

            గమ్యము. అదియెసత్యము గాన విడక

            మదిని సర్వస్వమనినమ్మి హృదినిజేర్చి

            తనువు పంచతగనుదాక మనుటయొప్పు.  -  93

 

 క:       ప్రేమ మహోన్నతమైనది

            ప్రేమకు నేది సరిరాదు పృథ్వీస్ఠలిపై

            కాముకుల దేహబంధమె

            ప్రేమయని తలతురేని వృధయౌ బ్రతుకుల్.  -  94

 

 క:       ప్రేమ విధేయతనొసగున్

            బ్రేమ విధేయతకు లోగి వెలయు సమగతిన్

            ధీమంతులు గురుశిష్యులు

            ప్రేమాస్పదులై రహిన్ జరింతురు ధాత్రిన్.  -  95

 

 తే:గీ:  ప్రేమించిన దైవంబును

            ప్రేమించును దైవమునిను వేయింతలుగన్

            ప్రేమకు సరియగు భావము

            ప్రేమయెపో మాటలేల పెక్కులుబల్కన్.  -  96

 

 తే:గీ:  ఎంత ప్రియమైనదైనను చెంతలేక

            దూరమైనంత ప్రేమయు తొలగిపోవు

            కాని దివ్యప్రేమకు తుది లేనెలేదు

            మరణమైనను ఆటంకపరచలేదు.  -  97

 

 క:       పేయసి ప్రియుడగు మరియున్

            ప్రేయసియైపోవు ప్రియుడు ప్రేమమునుంగన్

            పాయని ప్రియభావంబున

            ధ్యేయంబగు దైవమగుచు ధీనిధిమారున్.  -  98

 

 క:       దేవుడు సర్వజ్ఞుండగు

            దేవుని నెఱిగితినన దేవునిరీతిన్

            కోవిదుడై సర్వమెఱిగి

            జీవింపగవలె నతండు చిత్కళతోడన్.  -  99

 

 తే:గీ;  మును మనోబుద్ధ్యహంకారములును మరియు

            చిత్తము క్రమబద్ధమొనర్చి సిద్ధపరచి

            ఆత్మ పరమాత్మతో జేర్చు నతడె గురుడు

            అతడు జూపిన మార్గమే మతము నిజము.  -  100

 

 తే:గీ:  గురుడు సాధకుని హృదయకుహరమందు

            సత్యతత్త్వము జొప్పించు సమయమెఱిగి

            అదియె బీజమై చింతనంబను జలమున

            పెరిగి వికసించి పరతత్వ మెఱుకపరచు.  -  101

 

తే:గీ:   సహజమగు దివ్యశక్తిని సాధకునకు

            అందజేయుచు నభివృద్ధినొందజేసి

            సంతసించెడు వాడెపో సద్గురుండు

            కురులు బెంచిన వారెల్ల గురులుకారు.  - 102

 

 

తే:గీ:   పతనమార్గము తప్పించి గతినిమార్చి

            సత్యపథగామిగాజేసి శక్తినొసగి

            జీవితాంతము విడువక శ్రేయమరసి

            తోడునీడగ నుండెడి వాడె గురుడు.  -103

 

 తే:గీ:  సహచరుండయి మసలుచు సత్యమెఱెగి

            మనల దైవసన్నిధి జేర్చు మహిమగలిగి

            పెరటికల్పకమగువాడు గురుదుగాని

            కుటిలుడును దంభశీలుడు గురుడుకాడు.  - 104

 

 తే:గీ:  దబ్బుకెప్పుడు ఇబ్బంది జబ్బు మరియు

            వదలకుండగ నిందించు వారలుండి

            వగవకీభువి జీవించు వారుగాక

            నితరుల మహాత్ములని బిల్వ నిలను తగదు.  -  105

 

 తే:గీ:  వారసత్వముతోడ రావచ్చునాస్తి

            అరయ నాధ్యత్మ సంపత్తి యటులరాదు

            భక్తిప్రేమలు గలిగిన వ్యక్తిగాక

            సతియు సుతులైన పొందంగ సాధ్యపడదు..  -  106

 

 తే:గీ:  ఎంత సర్వజ్ఞుడైనను సుంత యణగి

            మానవత్వపు పరిధులు దాటిపోక

            తదనుగుణమగు జీవన ధర్మమునకు

            విలువనిచ్చుచు భువిపైన మెలగు బుధుదు.  -  107

 

 ఆ:వె:  తాను బంధనముల తగులుకొనినవాడు

            నితరజనుల బంధ మెటులవిప్పు?

            రిత్తమాటలాడి చిత్తచాంచల్యంబు

            కలుగజేయునతడు కాడు గురుడు.  -  108

 

 ఆ:వె:  గురుడనెడియూహ చొరబడ మనసున

            తగడు గురువనంగ తజ్జనుండు

            అహమువీడి సమత సహనభావము గల్గి

            భక్తినుండు హితుడె పరమగురుడు.  -  109

 

 తే:గీ:  గురుని కొండాడుచుండుట గొప్పగాదు

            గురుడుచూపిన తెరువున గురుతుగాను

            నడచుచుండుటయే గొప్ప పుడమియందు

            గురుని ప్రకటింప నియ్యదే తెరువుసుమ్ము.  -  110

 

 క:       గురుదేవుల ప్రాపుగలిగి

            ధర సన్మార్గము విడువక తాత్త్వికసరణిన్

            పరమాత్మ చింతనామృత

            నిరతిన్ గనుడీ నితాంత నిశ్రేయసమున్.  -  111

v      

 

సహజమార్గ దశనియమములు

 

తే:గీ:   సుర్యుడుదయించుటకు మున్నె శుద్ధులగుచు

            నయముననొకగంట సుఖాసనమున సహజ

            విధి హృదయముపై ధ్యానము వినయశీలు

            రగుచు చేయుచుండవలయు ననుదినంబు.  -  1

 

 క:       మదిలోన భక్తిప్రేమలు

            పదిలముగా నుంచుకొనుచు ప్రార్థనతోడన్

            హృదిపై ధ్యానము చేయుడు

            పదపడి ఆత్మోద్ధరణము బడయుట కొఱకై.  -  2

 

 క:       పరమాత్మతోడ నైక్యమె

            పరమావధి లక్ష్యమనుచు భావించిమదిన్

            త్వరితముగ బొందనెంచుము

            విరమణ విశ్రాంతి మరియు విసుగదిలేకన్.  -  3

 

 తే:గీ:  ప్రకృతియును నీవు నొకటియై బ్రతుకదలచి

            దర్పము కపటమును లేక ధాత్రియందు

            సహజ సామాన్య నరునిగ నహరహంబు

            సరళజీవన రీతిన సాగిపొమ్ము.  -  4

 

ఆ:వె:   సత్యవంతుడనగ నిత్యము చరియించి

            బాధ వేదన మన బాగుకొఱకె

            దేవుడిచ్చినట్టి దివ్యవరములని

            తలచుచు దెలుపుము కృతజ్ఞతలను.  -  5

 

 క:       ధరనున్న మనుజులెల్లరు

            నరయగ సోదరులె మనకు అదియట్లుండన్

            అరమరికలు లేక జనుల

            దరిజేర్చుక మనగవలయు తాత్త్వికబుద్ధిన్.  -  6

 

 తే:గీ:  కీడుజేసిన వారిపై కినుకవలదు

            మది ప్రతీకారవాంఛను మెదలనీక

            అదియె దివ్యబహూకృతి యని దలచి

            స్వీకరించి కృతజ్ఞతల్ జెప్పుమెపుడు.  -  7

 

 క:       ఋజువర్తనంబు భక్తియు

            నిజజీవితమున గనబడ నియమము తోడన్

            సుజనుడవై యార్జించుచు

            భుజియింపుము కలిగినంత పొందుచు తృప్తిన్.  -  8

 

 క:       ఇతరుల మనస్సులందున

            సతతము మొలకెత్త ప్రేమ సద్భక్తి దయన్

            అతిజాగరూకత గలిగి

            హితకరి వీరన మెలంగు మిమ్మహిమీదన్ .  -  9

 

 ఆ:వె:  పడుకొనుటకుముందు పరమాత్మసన్నిధి

            నున్నయట్లు తలచి, ఒదిగిపోయి

            చేసినాడ తప్పు చేయనింకేనాడు

            ననుచు క్షమను వేడికొనుము మదిని.  -  10

 

ఓం తత్ సత్

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

పూజ్యలాలాజీ మరియు మన ఆధ్యాత్మికప్రగతి

  పూజ్యలాలాజీ మరియు మన ఆధ్యాత్మికప్రగతి సోదరీసోదరులమైన మనమంతా యిక్కడ యీదినం (ఫిబ్రరవరి 14/ బుధవారం 2024) మన ఆదిగురువులైన పూజ్యలాలాజీవారి 1...